పోతన తెలుగు భాగవతము/దశమ స్కంధము (ప్రథమాశ్వాసము)/అక్రూర నందాదుల సంభాషణ
తెభా-10.1-1206-క.
"చెలియలు మొఱయిడ నల్లుర
ఖలుఁడై పొరిగొనిన యట్టి కంసుఁడు బ్రదుకం
గలదే మనకి దశార్హుల
కిలపై? మీ క్షేమ మింక నేమని యడుగన్?"
టీక:- చెలియలు = చెల్లెలు; మొఱయిడన్ = ఏడ్చుచుండగా; అల్లుర = మేనళ్ళును; ఖలుడు = చెడ్డవాడు; ఐ = అయ్యి; పొరిగొనిన = చంపిన; అట్టి = అటువంటి; కంసుడు = కంసుడు; బ్రదుకన్ = జీవించి యుండగా; కలదె = ఉన్నదా; మన = మన; కిన్ = కి; దశార్హుల = దశార్హుని వంశస్థుల; కిన్ = కు; ఇల = భూమి; పై = మీద; మీ = మీ యొక్క; క్షేమమున్ = కుశలము గురించి; ఇంకన్ = ఇంకను; ఏమి = ఏమి; అని = అని; అడుగన్ = అడుగగలను.
భావము:- “ఓ అక్రూరా! చెల్లెలు మొరపెడుతున్నా వినకుండా అల్లుళ్ళను చంపిన ఆ నీచుడు కంసుడు బ్రతికి ఉండగా దశార్హ వంశం వారైన మనకు కుశలం ఈ భూమ్మీద లేదు కదా. ఇంక మీ క్షేమసమాచారాలు ఏమని అడిగేది."
తెభా-10.1-1207-వ.
అని పలికె నంత నక్రూరుం డొక పర్యంకంబున సుఖోపవిష్టుండై యుండ హరి యిట్లనియె.
టీక:- అని = అని; పలికెన్ = అనెను; అంతన్ = అంతట; అక్రూరుండు = అక్రూరుడు; ఒక = ఒకానొక; పర్యంకంబున = మంచముమీద; సుఖ = సుఖముగా; ఉపవిష్టుండు = కూర్చున్నవాడు; ఐ = అయ్యి; ఉండన్ = ఉండగా; హరి = కృష్ణుడు; ఇట్లు = ఇలా; అనియె = పలికెను.
భావము:- అలా నందమహారాజు పలకరించాక, మంచం మీద సుఖంగా కూర్చుని ఉన్న అక్రూరుడితో కృష్ణుడు ఇలా అన్నాడు.
తెభా-10.1-1208-మ.
“శుభమే నీకుఁ? బ్రమోదమే సఖులకుం? జుట్టాలకున్ క్షేమమే?
యభయంబే ప్రజకెల్ల? గోత్రజుల కత్యానందమే? మామ ము
క్త భయుండే? వసుదేవ దేవకులు తత్కారాగృహం బందు మ
త్ప్రభవ వ్యాజ నిబద్ధులై బ్రతికిరే ప్రాణానిలోపేతులై?
టీక:- శుభమే = మంచిగనే ఉన్నదికదా; నీ = నీ; కున్ = కు; ప్రమోదమే = సంతోషమేకదా; సఖుల్ = స్నేహితుల; కున్ = కు; చుట్టాలు = బంధువుల; కున్ = కు; క్షేమమే = కుశలమే కదా; అభయంబే = భయములు లేవుకదా; ప్రజల్ = ప్రజల; కిన్ = కు; ఎల్ల = అందరికి; గోత్రజుల్ = దాయాదుల; కున్ = కు; అతి = మిక్కిలి; ఆనందమే = సంతోషమే కదా; మామ = మా మేనమామ; ముక్త = విడువబడిన; భయుండే = భయము కలవాడే కదా; వసుదేవ = వసుదేవుడు {వసుదేవుడు - ధనాదికముచే ప్రకాశించువాడు}; దేవకులు = దేవకీదేవి; తత్ = ఆ యొక్క; కారాగృహంబున్ = చెరశాల; అందున్ = లో; మత్ = నా యొక్క; ప్రభవ = పుట్టుక అనెడి; వ్యాజ = నెపమున, వంకవలన; నిబద్ధులు = బంధింపబడినవారు; ఐ = అయ్యి; బ్రతికిరే = జీవించి ఉన్నారా; ప్రాణానిల = ప్రాణ వాయువులతో; ఉపేతులు = కూడినవారు; ఐ = అయ్యి.
భావము:- “అక్రూరా! నీకు కుశలమేనా? మీ స్నేహితులు అందరూ సంతోషంగా ఉన్నారు కదా! చుట్టాలకు క్షేమమా? ప్రజలంతా భయాలు లేకుండా ఉన్నారా? కులబంధువులు అందరూ ఆనందంగా ఉన్నారా? మా మామ కంసుడు నిర్భయంగా ఉన్నాడా? నన్ను కన్నారన్న సాకుతో కారాగారంలో బంధింపబడిన దేవకీ వసుదేవులు ప్రాణాలతో బ్రతికే ఉన్నారా? వివరంగా చెప్పు.
తెభా-10.1-1209-మ.
నెఱి నేడిక్కడ నీవు రాఁగ వగతో నీతోడ నేమైన నా
కెఱుఁగం జెప్పుమటంచుఁ జెప్పరు గదా యేమందు? రా వార్త యే
తెఱఁగున్ లేదని డస్సిరో వగచిరో దీనత్వముం జెందిరో
వెఱతో నా తలిదండ్రు లెట్లుపడిరో? విన్పింపు మక్రూరకా!
టీక:- నెఱిన్ = క్రమముగా; నేడు = ఇవాళ; నీవున్ = నీవు; రాగన్ = వచ్చుచుండగా; వగ = విచారము; తోన్ = తోటి; నీ = నీ; తోడన్ = తోటి; ఏమి = ఏ సమాచారమైన; ఐనన్ = అయిన; నా = నా; కున్ = కు; ఎఱుగంగన్ = తెలియునట్లు; చెప్పుము = చెప్పుము; అటంచున్ = అని; చెప్పరు = చెప్పినవారు కాదు; కదా = కదా; ఏమి = ఏమని; అందురు = అంటారు; ఆ = ఆ యొక్క; వార్త = విషయము; ఏ = ఎట్టి; తెఱగున్ = విధముగ; లేదు = లేదు; అని = అని; డస్సిరో = కృశించిరో; వగచిరో = దుఃఖించిరో; దీనత్వమున్ = దైన్యమును, బెదిరిపోవుట; చెందిరో = పొందిరో; వెఱ = భయముచేత; నా = నా యొక్క; తల్లిదండ్రులు = అమ్మనాన్నలు; ఎట్లు = ఏ విధముగా; పడిరో = బాధపడిరో; విన్పింపుము = తెలియజేయుము; అక్రూరకా = అక్రూరుడా.
భావము:- మరి అక్రూరా! నీవు ఇక్కడకి వస్తున్నావని తెలిసి నాకు చెప్పమని నా తల్లితండ్రులు నీతో ఏమైనా చెప్పారా. వారేమన్నారు. నా కబురులు తమకేమీ తెలియక, వారు శుష్కించి పోయారేమో. దుఃఖపడుతున్నారు కాబోలు. దైన్యాన్ని చెందారేమో. భయంతో వారెలాంటి పాట్లు పడ్డారో నాకు చెప్పు.
తెభా-10.1-1210-వ.
మఱియు నీవేమి కారణంబున వచ్చి” తని హరి యడిగిన నతండు కంసునికి నారదుండు వచ్చి చెప్పిన వైరానుబంధ ప్రకారంబును గంసుండు దేవకీ వసుదేవుల వధియింపం గమకించి మానిన తెఱంగును ధనుర్యాగంబు పేరుచెప్పి పుత్తెంచిన ప్రకారంబు నెఱింగించిన రామకృష్ణులు నగి; యంత తమ్ముఁ బరివేష్టించిన నందాది గోపకులం జూచి కృష్ణుం డిట్లనియె.
టీక:- మఱియున్ = ఇంకను; నీవున్ = నీవు; ఏమి = ఏ; కారణంబునన్ = నిమిత్తమై; వచ్చితి = వచ్చినావు; అని = అని; హరి = కృష్ణుడు; అడిగినన్ = అడుగగా; అతండు = అతను; కంసుని = కంసుడి; కిన్ = కి; నారదుండు = నారదుడు; వచ్చి = వచ్చి; చెప్పిన = వివరించిన; వైర = శత్రుత్వమునకు; అనుబంధ = సంబంధించిన; ప్రకారంబును = విధమైన మాటలు; కంసుండు = కంసుడు; దేవకీ = దేవకీదేవి; వసుదేవులన్ = వసుదేవులను; వధియింపన్ = చంపుటకు; గమకించి = సిద్ధపడి; మానిన = మానివేసిన; తెఱంగును = విధము; ధనుర్యాగంబున్ = ధనుర్యాగము; పేరు = వంక; చెప్పి = పెట్టి; పుత్తెంచిన = పంపించిన; ప్రకారంబును = వృత్తాంతము; ఎఱింగించినన్ = తెలుపగా; రామ = బలరాముడు; కృష్ణులు = కృష్ణుడులు; నగిరి = నవ్వారు; అంత = పిమ్మట; తమ్మున్ = వారిని; పరివేష్టించిన = చుట్టును ఉన్న; నంద = నందుడు; ఆది = మున్నగు; గోపకులన్ = గొల్లవారిని; చూచి = ఉద్దేశించి; కృష్ణుండు = కృష్ణుడు; ఇట్లు = ఈ విధముగ; అనియె = పలికెను.
భావము:- మరి ఇంకా నీవు దేనికోసం ఇక్కడికి వచ్చావో చెప్పు.” అని కృష్ణుడు అడిగాడు. అప్పుడు అక్రూరుడు నారదుడు వచ్చి చెప్పిన కంసుడికి పూర్వ జన్మ నుండి వచ్చిన శత్రుత్వపు భావమూ, అతడు దేవకీవసుదేవులను చంపబోయి మానిన విషయమూ, ధనుర్యాగము అనే మిషతో తనను పంపిన ప్రకారము వినిపించాడు. అవన్నీ విని రామకృష్ణులు పక్కున నవ్వారు. ఆ మీదట చుట్టూ ఉన్న నందుడు మొదలైన గొల్లపెద్దలతో శ్రీకృష్ణుడు ఇలా అన్నాడు.
తెభా-10.1-1211-శా.
"భూనాథుండు మఖంబుఁ జూఁడఁ బిలువం బుత్తెంచినాఁ డవ్విభుం
గానం బోవలెఁ బాలు నెయ్యి పెరుగుల్గట్నంబులుం గానుకల్
మీ నేర్పొప్పఁగఁ గూడఁబెట్టుఁడు తగన్ మీమీ నివాసంబులన్
యానంబుల్ గొనిరండు పొండు మథురా యాత్రాభిముఖ్యంబుగన్.
టీక:- భూనాథుండు = రాజు; మఖంబున్ = యాగమును; చూడన్ = చూచుటకు; పిలువన్ = పిలుచుకురావడానికి; పుత్తెంచినాడు = పంపించెను; ఆ = ఆ యొక్క; విభున్ = రాజును; కానన్ = దర్శించుటకు; పోవలెన్ = వెళ్ళవలెను; పాలు = పాలు, క్షీరము; నెయ్యి = నెయ్యి, ఘ్రుతము; పెరుగుల్ = పెరుగులు, దధి; కట్నంబులు = బహుమానములు; కానుకల్ = ఉపహారములు, అప్పనములు; మీ = మీ యొక్క; నేర్పు = సామర్థ్యములు; ఒప్పగన్ = తెలియునట్లు; కూడబెట్టుడు = చేర్చండి; తగన్ = తగినట్లుగా; మీమీ = మీ అందరి యొక్క; నివాసంబులన్ = ఇండ్లవద్ద; యానంబుల్ = వాహనములను; కొనిరండు = తీసుకురండు; పొండు = వెళ్ళండి; మథురా = మథురానగరమునకు; యాత్రా = తరలివెళ్ళుట; అభిముఖ్యంబుగన్ = కొరకు.
భావము:- “రాజు కంసుడు ధనుర్యాగం దర్శించడానికి రమ్మని పిలుపు పంపించాడు. ఆ ప్రభువును చూడ్డానికి వెళ్ళాలి. మీమీ ఇళ్ళలోగల పాలు, పెరుగు, నెయ్యి, కట్నాలు, కానుకలు మీ నేర్పుకొద్దీ సమకూర్చండి. బండ్లు సిద్దం చేసుకుని రండి. మనం మధురానగరానికి వెళ్ళాలి.”