పోతన తెలుగు భాగవతము/దశమ స్కంధము (ప్రథమాశ్వాసము)/వ్రేతలు కలగుట

తెభా-10.1-1212-వ.
అని నియమించె నంత నక్రూరుండు మథురకు హరిం గొనిపోయెడి నని యెఱింగి వ్రేతలు గలంగి.
టీక:- అని = అని; నియమించెన్ = చెప్పగా; అంతన్ = అంతట; అక్రూరుండు = అక్రూరుడు; మథుర = మథురానగరమున; కున్ = కు; హరిన్ = కృష్ణుని; కొనిపోయెడిని = తీసుకొనివెళ్ళును; అని = అని; ఎఱింగి = తెలిసి; వ్రేతలు = గోపికలు; కలంగి = కలతచెంది.
భావము:- అని కృష్ణుడు ఆనతి ఇచ్చాడు. అక్రూరుడు రామకృష్ణులను వెంటపెట్టుకుని మధురానగరికి వెళతాడనే వార్త తెలియగానే గోపవనితలు కలత చెందారు.

తెభా-10.1-1213-మ.
రినవ్వుల్ హరిమాటలున్ హరిమనోజ్ఞాలాపముల్ లీలలున్
రివేడ్కల్ హరిమన్ననల్ హరికరాబ్జాలంబనాహ్వానముల్
రిణీలోచన లందఱున్ మఱి యుపాయం బెట్లొకో యంచు లో
నెరియన్ ముచ్చటలాడి రంత గములై యేకాంత గేహంబులన్.

టీక:- హరి = కృష్ణుని; నవ్వుల్ = దరహాసములు; హరి = కృష్ణుని; మాటలున్ = మాటలు; హరి = కృష్ణుని; మనోజ్ఞ = ఇంపైన; ఆలాపముల్ = పాటలు; లీలలున్ = విలాసములు; హరి = కృష్ణుని; వేడ్కల్ = వినోదములు; హరి = కృష్ణుని; మన్ననల్ = గౌరవ మర్యాదలు; హరి = కృష్ణుని; కర = చేతులు అనెడి; అబ్జ = పద్మములను; ఆలంబ = ఆనుకొనుటలు; ఆహ్వానముల్ = పిలుచుటలు; హరిణీలోచనలు = సుందరీమణులు {హరిణీలోచన - లేడివంటి కన్నులు కలామె, అందగత్తె}; అందఱున్ = ఎల్లరు; మఱియున్ = ఇంకొక; ఉపాయంబు = ఉపాయము; ఎట్లొకో = ఏముంది; అంచున్ = అని; లోన్ = మనసులలో; ఎరియన్ = తపించగా; ముచ్చటలు = మాట్లాడుకొనుట; ఆడిరి = చేసిరి; అంతన్ = అటుపిమ్మట; గములు = గుంపు గూడినవారు; ఐ = అయ్యి; ఏకాంత = రహస్యపు; గేహంబులన్ = స్థానము లందు.
భావము:- శ్రీకృష్ణుడి మాటలూ, చిరునవ్వులూ, మనసులు హరించే సరస సల్లాపాలు, విలాసాలూ, వినోదాలూ, ఆదరాభిమానాలూ, ఆయన తన చేతితో పట్టుకుని పిలుచుటలూ ఇవన్నీ ఇకపై అనుభవించే ఉపాయాలు ఏమిటా అని ఆ లేడికన్నుల గొల్లభామినులు ఖిన్నలై కుములుతూ ఏకాంతగృహాలలో కలుసుకుని చర్చించుకున్నారు.

తెభా-10.1-1214-వ.
మఱియుం దమలో నిట్లనిరి.
టీక:- మఱియున్ = ఇంకను; తమలో = వారిలోవారు; ఇట్లు = ఈ విధముగ; అనిరి = పలికిరి.
భావము:- ఇంకా వారు తమలోతాము ఇలా అనుకున్నారు.

తెభా-10.1-1215-ఉ.
"మేటి గృహస్థు బ్రహ్మ యని మిక్కిలి నమ్మితి మమ్మ! చూడ నే
పాటియు లేదు మాకుఁ బరిపాలకుఁడైన సరోజనేత్రు ని
చ్చో వసింపనీక నొకచోటికిఁ బో విధియించి పిన్నబి
డ్డాలు చేసె నీ దుడుకు క్కట! భారతికైనఁ జెప్పరే."

టీక:- మేటి = గొప్ప; గృహస్థు = గృహస్థుడు; బ్రహ్మ = బ్రహ్మదేవుడు; అని = అని; మిక్కిలి = చాలా; నమ్మితిమి = విశ్వసించినాము; అమ్మ = తల్లి; చూడన్ = తరచి చూసినచో; ఏపాటియున్ = కొంచెముకూడ న్యాయము; లేదు = లేనేలేదు; మా = మా; కున్ = కు; పరిపాలకుడు = ఏలిక; ఐనన్ = అయినట్టి; సరోజనేత్రుని = కృష్ణుని; ఇచ్చోటన్ = ఇక్కడనే; వసింపనీక = ఉండనీయకుండ; ఒక = మరింకొక; చోటి = తావున; కిన్ = కి; పోన్ = వెళ్ళవలెనని; విధియించి = రాసిపెట్టి; పిన్నబిడ్డాటలు = చిన్నపిల్లలచేష్టలు; చేసెన్ = చేసెను; ఈ = ఈ యొక్క; దుడుకులు = దుడుకు పనుల గురించి; అక్కట = అయ్యో; భారతి = సరస్వతీదేవి; కిన్ = కి; ఐనన్ = అయినను; చెప్పరే = చెప్పండి.
భావము:- “బ్రహ్మదేవుడు నిష్ఠగల సంసారి అని చాలా గట్టిగా నమ్మాము గదమ్మా! తీరా చూస్తే, ఆయనలో ఏమాత్రం ధర్మం లేదు, మన కృష్ణుడు, మన ప్రభువు, పుండరీకాక్షుడిని ఇక్కడ ఉండనీయకుండ వేరొకచోటికి పోయేలా చేసి చిన్నపిల్లల ఆట్లాడుతున్నాడు చూడు. అయ్యో! ఆయన ఇల్లాలు సరస్వతీ దేవితో ఐనా ఈ దుండగపు చేష్టలను చెప్పండే.”

తెభా-10.1-1216-వ.
అని విధిం దూఱుచు మదనతాపాయత్త చిత్తలై.
టీక:- అని = అని; విధిన్ = బ్రహ్మదేవుని; దూఱుచున్ = నిందించుచు; మదన = మన్మథ; తాప = తాపమునకు; ఆయత్త = లోబడిన; చిత్తలు = మనసులు కలవారు; ఐ = అయ్యి.
భావము:- ఈవిధంగా బ్రహ్మదేవుడిని నిందిస్తూ గోపికలు మన్మథతాపానికి అధీనమైన చిత్తాలు కలవారై. . .

తెభా-10.1-1217-ఉ.
"మ్మని చీరినంతనె పురంబున కేగెడుఁ గాని నన్ను నీ
కొమ్మలు నమ్మినారు మరుకోలల కగ్గము చేసి పోవఁగా
ముమ్మరమైన తాపమున మ్రొగ్గుదురో యనఁ డంబుజాక్షుఁ డా
మ్మలు గోపవృద్ధులు ప్రయాణము వల్దనరైరి చెల్లరే!

టీక:- రమ్ము = రావలసినది; అని = అని; చీరిన = పిలిచిన; అంతనే = వెంటనే; పురంబున్ = పట్టణమున; కిన్ = కు; ఏగెడున్ = బయలుదేరుచుండెను; కాని = అంతే తప్పించి; నన్నున్ = నన్ను; ఈ = ఈ యొక్క; కొమ్మలు = స్త్రీలు; నమ్మినారు = నమ్ముకొని ఉన్నారు; మరు = మన్మథుని; కోలల = బాణముల; కున్ = కు; అగ్గము = ఆధీనము; చేసి = చేసి; పోవగా = వెళ్ళిపోయినచో; ముమ్మరము = అధికము; ఐన = అయినట్టి; తాపమునన్ = సంతాపముచేత; మ్రొగ్గుదురో = కృశించిపోతారేమో, వాలిపోతారేమో; అనడు = తలచడు; అంబుజాక్షుడు = కృష్ణుడు; ఆ = ఆ యొక్క; అమ్మలు = తల్లులు; గోప = యాదవులలో; వృద్ధులు = పెద్దలు; ప్రయాణమున్ = ప్రయాణమును; వల్దు = వద్దు; అనరు = అని చెప్పనివారు; ఐరి = అయ్యారు; చెల్లరే = అయ్యో.
భావము:- ఆ గోపకాంతలు ఇంకా ఇలా అనుకున్నారు “రమ్మని పిలగానే మధురకు పయనమౌతున్నాడు కానీ మన కమలాక్షుడు మన కన్నయ్య “నన్ను ఈ భామలు నమ్ముకుని ఉన్నారే, అటువంటి మనల్ని మదనబాణాల పాలు చేస్తే, ఎంతో తాపంతో కుమిలిపోతారు కదా” అని అనుకోలేదు. పోనీ మన అమ్మలక్కలు మన గొల్ల పెద్దలు మధురకు వెళ్ళవద్దని మాధవునితో మాటవరసకైనా అనటం లేదు కదా.

తెభా-10.1-1218-శా.
క్రూరుం డని పేరుపెట్టుకొని నేఁ స్మన్మనోవల్లభుం
క్రిన్ మాకడఁ బాపికొంచు నరుగం ర్చించి యేతెంచినాఁ
క్రూరుం డఁట క్రూరుఁ డీతఁడు నిజం క్రూరుఁ డౌనేని ని
ర్వక్రత్వంబునఁ గృష్ణుఁ బెట్టి తన త్రోవంబో విచారింపఁడే?

టీక:- అక్రూరుండు = అక్రూరుడు; అని = అనెడి; పేరు = నామము; పెట్టుకొని = పెట్టుకొని; నేడు = ఇవాళ; అస్మత్ = మా యొక్క; మనస్ = మనస్సునకు; వల్లభుండు = ప్రియుడు; చక్రిన్ = కృష్ణుని; మా = మా; కడన్ = దగ్గరనుండి; పాపికొనుచున్ = దూరము చేయుచు; కొంచున్ = తీసుకొని; అరుగన్ = వెళ్ళవలె నని; చర్చించి = తలచి; యేతెంచినాడు = వచ్చాడు; అక్రూరుడు = అక్రూరుడు; అటన్ = అట; క్రూరుడు = క్రూర స్వభావము గలవాడు; ఈతడు = ఇతను; నిజంబు = నిజంగా; అక్రూరుడు = క్రూరత్వము లేనివాడు; ఔను = అయిన; ఏని = ఎడల; నిర్వక్రత్వంబునన్ = వంకర బుద్ధి లేకుండ; కృష్ణుని = కృష్ణుని; పెట్టి = ఇక్కడనే ఉంచి; తన = తన; త్రోవన్ = దారిని; పోన్ = తను వెళ్ళవలెనని; విచారింపడే = భావించడా, భావించును.
భావము:- అక్రూరు డని పేరు పెట్టుకుని మా హృదయేశ్వరు డైన కృష్ణుణ్ణి ఇవాళ మా నుండి దూరంగా తీసుకువెళ్ళడానికి వచ్చాడు. ఇతగాడు అక్రూరుడు కాదు నిజానికి క్రూరుడే. అక్రూరుడైతే కుటిల ఆలోచనలు మానేసి, మన కృష్ణుణ్ణి దిగవిడచి తన దారిని తాను వెళ్తానని అనుకునే వాడు కదా.

తెభా-10.1-1219-ఉ.
ఫుల్లసరోజలోచనలు పూర్ణసుధాంశుముఖుల్ పురాంగనల్
మెల్లనె యెల్లి పట్టణము మేడలనుండి సువర్ణ లాజముల్
ల్లఁగ వారిఁ జూచి హరి సంగతి చేయఁదలంచుఁ గాక వ్రే
ల్లె వసించు ముద్దియలపైఁబడ నేల తలంచు నక్కటా!

టీక:- పుల్ల = వికసించిన; సరోజ = పద్మములవంటి; లోచనలు = కన్ను లున్నవారు; పూర్ణ = నిండు; సుధాంశు = చంద్రుని వంటి; ముఖుల్ = మోములు కలవారు; పురా = పట్టణపు; అంగనల్ = స్త్రీలు; మెల్లనె = మెల్లగా; యెల్లి = రేపు; పట్టణము = పట్టణములోని; మేడల = భవనములపై అంతస్థుల; నుండి = నుండి; సువర్ణ = బంగారపు; లాజముల్ = పేలాలు; చల్లగా = వేయగా; వారిన్ = వారిని; చూచి = చూసి; హరి = కృష్ణుడు; సంగతిచేయన్ = కలియవలెనని; తలంచున్ = భావించును; కాక = కాక; వ్రేపల్లెన్ = గొల్లపల్లెను; వసించున్ = ఉండెడి; ముద్దియల = ముగ్ధల; పైబడన్ = కలియుటకు; ఏల = ఎందుకు; తలంచున్ = భావించును; అక్కటా = అయ్యో.
భావము:- వికసించిన పద్మముల వంటి కన్నులూ, పున్నమి చంద్రుని వంటి మోమూ కల మథురాపురం లోని అందగత్తెలు రేపు మేడలెక్కి బంగారపు లాజలు మెల్లగా తనపై చల్లుతారు. చల్లగా వారిని చూసాకా కృష్ణుడు వారిన కలవాలని అనుకుంటాడు అంతే కాని, అయ్యో! వ్రేపల్లెలోని గోపికల పొందు ఎందుకు కోరుకుంటాడు.

తెభా-10.1-1220-క.
పుసతుల విలోకనములు
సాలాపములు నర్మసంభోగములున్
రిగి హరి మనల నొల్లఁడు;
వరు లో! యమ్మ! నూతప్రియులు గదే.

టీక:- పుర = పట్టణ; సతులన్ = స్త్రీల యొక్క; విలోకనములు = చూపులు; సరస = సరసమైన; ఆలాపములున్ = మాటలు; నర్మ = పరిహాసపు; సంభోగములున్ = కలియుటలను; మరిగి = అలవాటుపడి; హరి = కృష్ణుడు; మనలన్ = మనలను; ఒల్లడు = అంగీకరించడు; నరవరులు = రాజులు {నరవరుడు - మానవులకు ప్రభువు, రాజు}; ఓ = ఓ; అమ్మ = తల్లి; నూతన = కొత్తవాటి ఎడల; ప్రియులు = ఇష్టము కలవారు; కదే = కదా.
భావము:- నగరంలోని నీటుకత్తెల చూపులూ, సరస సంభాషణలూ, తెరచాటు కలయికలూ మరిగి, ఓ యమ్మా! మన మాధవుడు మనని చూడడే. భూపతులు క్రొత్తవాటినే కోరుతుంటారు కదే.

తెభా-10.1-1221-క.
పుట్టెన్నఁడు హరి నెఱుఁగని
ట్టణసుందరుల కితనిఁ తిఁ జేసి కడున్
ట్టపు విరహాగ్నులకును
ట్టిఁడి దైవంబు ఘోషకాంతల వెదకెన్.

టీక:- పుట్టి = జన్మ ఎత్తిన తరువాత; ఎన్నడున్ = ఎప్పుడుకూడ; హరిన్ = కృష్ణుడిని; ఎఱుగని = తెలియనట్టి; పట్టణ = నగరపు; సుందరుల = అందగత్తెల; కున్ = కు; ఇతనిన్ = ఇతనిని; పతిన్ = పెనిమిటిగా; చేసి = చేసి; కడున్ = మిక్కిలి; దట్టపు = అధికమైన; విరహ = ఎడబాటు అనెడి; అగ్నుల = తాపముల కప్ప జెప్పుట; కును = కు; కట్టిడి = కఠినుడైన; దైవంబు = భగవంతుడు; ఘోష = గొల్ల; కాంతలన్ = భామలను; వెదకెన్ = వెతికిమరీ నియమించెను.
భావము:- క్రూరపు దైవం పుట్టింది మొదలు కృష్ణుణ్ణి ఎప్పుడూ చూసి ఎరుగని ఆ పట్టణ పడచులకేమో అతగాణ్ణి పతిగా చేసాడు. మిక్కుటమైన వియోగాగ్నికి ఆహుతి గావించడం కోసమేమో గొల్లపల్లె గోపికలను వెదకి పట్టు కొన్నాడు.”

తెభా-10.1-1222-మ.
"రినేలా కొనిపోయె"దంచు మన మా క్రూరుఁ బ్రార్థింతమా?
రిఁ "బోనీకుఁడు నిల్పరే"యనుచు నేఁ ర్చింతమా వేల్పులన్?
రిపాదంబుల కడ్డముల్ పడుదమా; హా దైవమా"యంచు నా
రుణుల్ కొప్పులుఁ జీరలున్ మఱచి కంర్పజ్వర భ్రాంతలై.

టీక:- హరిన్ = కృష్ణుని; ఏలా = ఎందుకు; కొనిపోయెదు = తీసుకుపోయెదవు; అంచున్ = అనుచు; మనము = మనము; ఆ = ఆ యొక్క; అక్రూరున్ = అక్రూరుడిని; ప్రార్థింతమా = వేడుకొనెదమా; హరిన్ = కృష్ణుని; పోనీకుడు = వెళ్ళిపోనీయకండి; నిల్పరే = ఆగునట్లు చేయరే; అనుచున్ = అని; నేడు = ఇవాళ; అర్చింతమా = పూజించెదమా; వేల్పులన్ = దేవతలను; హరిన్ = కృష్ణుని; పాదంబుల్ = కాళ్ళ; కున్ = కు; అడ్డముల్ = అడ్డముగా; పడుదమా = పడిపోదామా; హా = ఓ; దైవమా = భగవంతుడా; అంచున్ = అని; ఆ = ఆ యొక్క; తరుణుల్ = స్త్రీలు; కొప్పులు = జుట్టుముళ్ళు; చీరలున్ = వస్త్రములు; మఱచి = మరిచిపోయి; కందర్ప = మన్మథ; జ్వర = తాపపు; భ్రాంతలు = పరవశులు; ఐ = అయ్యి.
భావము:- ఇలా అనుకుంటూ ఆ గొల్లభామలు మదనతాపంతో కంది భ్రమచెందారు. తమ కొప్పులు, కోకలు జారిపోడం కూడా చూసుకోవడం లేదు. “మా కృష్ణుణ్ణి ఎందుకు తీసుకుపోతావని అక్రూరుణ్ణి ప్రార్ధిద్దామా లేకపోతే ఆ నందనందనుడిని పోనీయకుండా ఇక్కడే ఉంచమని దేవతలను పూజిద్దామా” లేదా “ఓ దేముడా!” అంటూ ఆ హరి కాళ్ళకే అడ్డం పడదామా అనుకోసాగారు.

తెభా-10.1-1223-మ.
విదల్ సిగ్గులు మాని కన్గవల నీ రొండొండ వర్షించుచున్
విశత్వంబులతోఁ గపోలతట సంవిన్యస్త హస్తాబ్జలై
నోద్ధూతలతాభలై "మముఁ గృపం బాలింపు గోవింద! మా
! దామోదర!"యంచు నేడ్చిరి సుజాతంబైన గీతంబులన్.

టీక:- ఉవిదల్ = స్త్రీలు; సిగ్గులు = సిగ్గుపడుటలు; మాని = వదలి; కన్ = కన్నుల; కవలున్ = జంటలనుండి (2); నీరు = కన్నీరు; ఒండొండన్ = వరుసగా; వర్షించుచున్ = కురియించుచు; వివశత్వంబుల్ = పరవశముల; తోన్ = తోటి; కపోలతటన్ = చెక్కిళ్ళమీద; సం = చక్కగా; విన్యస్త = ఉంచబడిన; హస్త = చేతులు అనెడి; అబ్జలు = పద్మములు కలవారు; ఐ = అయ్యి; పవన = గాలికి; ఉద్ధూత = చలించు; లతా = లతల; ఆభలు = వంటివారు; ఐ = అయ్యి; మమున్ = మమ్ములను; కృపన్ = దయతో; పాలింపు = ఏలుకొనుము; గోవింద = కృష్ణా {గోవిందుడు - గోవులకు ఒడయుడు, కృష్ణుడు}; మాధవా = కృష్ణా {మాధవుడు - యదువు కొడుకు మధు వంశస్థుడు, కృష్ణుడు}; దామోదరా = కృష్ణా {దామోదరుడు - తులసిమాల ఉదరమున కలవాడు, విష్ణువు}; అంచున్ = అని; ఏడ్చిరి = విలపించిరి; సుజాతంబు = చక్కటి జాతులకు చెందినవి; ఐన = అయినట్టి; గీతంబులన్ = కీర్తనలచేత.
భావము:- వనితలు సిగ్గులు విడిచి రెండు కళ్ళమ్మట బొటబొటా కన్నీరు కారుస్తూ మైమరచి తమ చిక్కని చెక్కిళ్ళమీద కరకమలాలు చేర్చి గాలికి కంపించే తీగల వలె “ఓ గోవిందా! మాధవా! దామోదరా! మమ్ము దయతో కాపాడు” అంటూ స్వరబద్ధంగా తాళబద్దంగా రాగాలు తీస్తూ పాటలు పాడుతూ ఏడ్చారు.