పోతన తెలుగు భాగవతము/దశమ స్కంధము (ద్వితీయాశ్వాసము)/సత్యభామ యుద్ధంబు

సత్యభామ యుద్ధంబు

తెలుగు భాగవతము (పోతన తెలుగు భాగవతము/దశమ స్కంధము (ద్వితీయాశ్వాసము)/సత్యభామ యుద్ధంబు)
రచయిత: పోతన


తెభా-10.2-170-శా.
వేణిం జొల్లెము వెట్టి సంఘటిత నీవీబంధయై భూషణ
శ్రేణిం దాల్చి ముఖేందుమండల మరీచీజాలముల్‌ పర్వఁగాఁ
బాణిం బయ్యెదఁ జక్కగాఁ దుఱిమి శుంద్వీరసంరంభయై
యేణీలోచన లేచి నిల్చెఁ దన ప్రాణేశాగ్ర భాగంబునన్.

టీక:- వేణిన్ = జడను; చొల్లెము = ముడిగా చుట్టి; పెట్టి = పెట్టి; సంఘటిత = చక్కగా బిగియకట్టిన; నీవీబంధ = పోకముడి కలామె; ఐ = అయ్యి; భూషణ = ఆభరణముల; శ్రేణిన్ = సమూహమును; తాల్చి = ధరించి; ముఖ = మోము అనెడి; ఇందు = చంద్ర; మండల = బింబము యొక్క; మరీచీ = కాంతికిరణముల; జాలముల్ = సమూహములు; పర్వగాన్ = పరచుకొనునట్లు; పాణిన్ = చేతితో; పయ్యెద = కొంగు; చక్కగా = చక్కగా; తుఱిమి = దోపుకొని; శుంభత్ = ప్రకాశించుచున్న; వీర = వీరరసముతోటి; సంరంభ = ఆటోపము కలది; ఐ = అయ్యి; ఏణీలోచన = సుందరి {ఏణీలోచన - ఏణి (లేడివంటి) లోచన (కన్నులు కలామె), అందగత్తె}; లేచి = పైకి లేచి; నిల్చెన్ = నిలబడెను; తన = ఆమె యొక్క; ప్రాణేశు = భర్త; అగ్ర = ఎదుటి; భాగంబునన్ = ప్రదేశము నందు.
భావము:- ఆ లేడికన్నుల సుందరి సత్యభామ, వడివడిగా వాలుజడ ముడివేసుకుంది; చీరముడి బిగించింది; భూషణాలను సరిచేసుకుంది; పైట సవరించుకుంది; ముఖచంద్రుడు కాంతులీనుతుండగా తన కాంతుడు శ్రీకృష్ణుడి ముందు నిబ్బరంగా నిలబడింది.
అందాల రాశి శ్రీకృష్ణ భగవానుని ఇష్ట సఖి సత్య రణ సన్నాహానికి, వేసిన సాహితీ అలంకారాలు ఆ “ణ”కార ప్రాస; వేణిం, శ్రేణిం, పాణిం, ఏణీలోచన పదాల సొగసు; పద్యం నడకలోని సౌందర్యం బహు చక్కగా అమర్చిన పోతన్నకు జోహార్లు.

తెభా-10.2-171-క.
న్యంబున దనుజుల దౌ
ర్జన్యము లుడుపంగఁ గోరి నుదెంచిన సౌ
న్యవతిఁ జూచి యదురా
న్యశ్రేష్ఠుండు సరసల్లాపములన్.

టీక:- జన్యము = యుద్ధము నందు; దనుజుల = రాక్షసుల; దౌర్జన్యములున్ = చెడ్డ తనములు; ఉడుపన్ = పోగెట్టవలెనని; కోరి = కోరి; చనుదెంచిన = వచ్చినట్టి; సౌజన్యవతిన్ = మంచితనము కలామెను; చూచి = చూసి; యదు = యదువంశపు; రాజన్య = రాజులలో; శ్రేష్ఠుండు = ఉత్తముడు; సరస = సరసములైన; సత్ = మంచి; ఆలాపములన్ = మాటలతో.
భావము:- రణరంగంలో రాక్షసుల దౌర్జన్యాలను అణచడానికి సిద్ధమై వచ్చిన సత్యభామను చూసి యాదవ ప్రభువులలో శ్రేష్ఠుడైన శ్రీకృష్ణుడు సరసమైన మాటలతో ఇలా అన్నాడు.

తెభా-10.2-172-క.
"లేమా! దనుజుల గెలువఁగ
లేమా? నీ వేల కడఁగి లేచితి? విటు రా
లే మాను మాన వేనిన్
లే మా విల్లందికొనుము లీలం గేలన్. "

టీక:- లేమా = చిన్నదానా {లేమ - లేతవయస్కురాలు, స్త్రీ}; దనుజులన్ = రాక్షసులను; గెలువగ = జయింప; లేమా = సమర్థులము కామా; నీవు = నీవు; ఏల = ఎందుకు; కడగి = యత్నించి; లేచితివి = నిలబడితివి; ఇటు = ఈ వైపునకు; రా = రమ్ము; లే = లెమ్ము; మాను = వదలివేయుము; మానవు = మానని; ఏనిన్ = పక్షమున; లే = లెమ్ము; మా = మా యొక్క; విల్లున్ = ధనుస్సు; అందికొనుము = పుచ్చుకొనుము; లీలన్ = విలాసముగా; కేలన్ = చేతితో.
భావము:- “భామా! మేము రాక్షసులను గెలువలేమా? నీ వెందుకు యుద్ధానికి సిద్ధపడ్డావు? ఇలా రా! యుద్ధ ప్రయత్నం మానుకో. మాననంటావా, అయితే విలాసంగా నీ చేత్తో ఈ విల్లందుకో!”
నరకాసుర వధ ఘట్టంలో శ్రీ కృష్ణుడు సత్యభామతో పలికిన పలుకులివి. పద్యం నడక, “లేమా” అనే అక్షర ద్వయంతో వేసిన యమకాలంకారం అమోఘం. చమత్కార భాషణతో చేసిన యిద్దరి వ్యక్తిత్వాల పోషణ ఎంతో బావుంది. సత్యభామ రణకౌశల ప్రదర్శనకు ముందరి దొకటి వెనుకటి దొకటి వేసిన జంట పద్యాలా అన్నట్లు ఉంటుంది “10.2-187-క. కొమ్మా…” పద్యం. ఒకే హల్లు మరల మరల వేస్తే వృత్యనుప్రాస, రెండు అంతకన్న ఎక్కువ హల్లులు అర్థబేధంతో అవ్యవధానంగా వేస్తే ఛేక. శబ్ద బేధం లేకుండా అర్థ బేధంతో మరల మరల వేస్తే యమకం. అవ్యవధానంగా రెండు అంత కన్నా ఎక్కువ హల్లులు అర్థబేధం శబ్దబేధం లేకుండా తాత్పర్య బేధంతో వేస్తే లాట.

తెభా-10.2-173-వ.
అని పలికి.
టీక:- అని = అని; పలికి = చెప్పి.
భావము:- ఈ విధంగా పలికి….

తెభా-10.2-174-క.
రిణాక్షికి హరి యిచ్చెను
సునికరోల్లాసనమును శూరకఠోరా
సుసైన్యత్రాసనమును
గర్వనిరాసనమును బాణాసనమున్.

టీక:- హరిణాక్షి = అందగత్తె {హరిణాక్షి - హరిణి (లేడి వంటి) కన్నులు కల స్త్రీ}; కిన్ = కి; హరి = కృష్ణుడు; ఇచ్చెను = ఇచ్చెను; సుర = దేవతా; నికర = సమూహము యొక్క; ఉల్లాసనమును = ఉల్లాసము కలిగించెడిది; శూర = వీరులైన; కఠోర = కఠినులైన; అసుర = రాక్షస; సైన్య = సేనలకు; త్రాసనమును = భయము కలుగజేయునది; పర = శత్రువుల; గర్వ = అహంకారమును; నిరాసనమును = పోగొట్టునది; బాణాసనమున్ = ధనుస్సు.
భావము:- శ్రీకృష్ణుడు దేవతలకు సంతోషాన్ని, ఎంతటి ఘోర వీర రాక్షసులకు అయినా సంతాపాన్నీ కలిగించేదీ, శత్రువుల గర్వాన్ని అణచివేసేదీ ఐన ధనుస్సును లేడికన్నుల చిన్నది సత్యభామ చేతికి అందించాడు.

తెభా-10.2-175-శా.
విల్లంది బలంబు నొంది తదగణ్యానంత తేజోవిశే
షావిర్భూత మహాప్రతాపమున వీరాలోక దుర్లోకయై
తా వేగన్ సగుణంబుఁ జేసె ధనువుం న్వంగి దైత్యాంగనా
గ్రీవాసంఘము నిర్గుణంబుగ రణక్రీడా మహోత్కంఠతోన్.

టీక:- ఆ = ఆ; విల్లున్ = ధనుస్సును; అంది = అందుకొని; బలంబున్ = బలము; ఒంది = పొంది; తత్ = దాని వలన; అగణ్యా = ఎంచరాని; అనంత = అంతులేని; తేజః = తేజస్సు యొక్క; విశేష = అతిశయముచే; ఆవిర్భూత = పుట్టిన; మహా = గొప్ప; ప్రతాపమునన్ = పరాక్రమముతో; వీర = వీరులు; ఆలోక = చూచుటకు; దుర్లోక్యము = చూడశక్యముగానిది; ఐ = అయ్యి; తాన్ = ఆమె; వేగన్ = వడిగా; సగుణంబున్ = అల్లెతాడు కలదిగా; చేసెన్ = చేసెను; ధనువున్ = విల్లును; తన్వంగి = సుందరి {తన్వంగి - తనువు (సన్నని) అంగి (దేహము కలది), స్త్రీ}; దైత్య = రాక్షస; అంగనా = స్తీల యొక్క; గ్రీవా = మెడల; సంఘమున్ = సమూహము; నిర్గుణంబు = తాడులేనివి; కన్ = అగునట్లు; రణ = పోరు అను; క్రీడా = ఆట అందలి; మహా = మిక్కిలి; ఉత్కంఠ = తహతహ; తోన్ = తోటి.
భావము:- సత్యభామాదేవి కృష్ణభగవాను డిచ్చిన ఆ ధనుస్సు అందుకుంది. దానితో ఎక్కడలేని శక్తి వచ్చింది. గొప్ప తేజోవిశేషంతో మహాప్రతాపంతో వీరలోకానికి తేరిచూడరాని రీతిలో విలసిల్లింది. యుద్ధోత్సాహంతో ఆ నారీమణి రాక్షసస్త్రీల కంఠాలలోని మంగళసూత్రాలు తెగేలాగ నారి బిగించి, ధనుష్టంకారం చేసింది.

తెభా-10.2-176-క.
నారి మొరయించె రిపు సే
నా రింఖణ హేతువైన నాదము నిగుడన్
నారీమణి బలసంప
న్నారీభాదికము మూర్ఛనంద నరేంద్రా!

టీక:- నారి = వింటితాడును; మొరయించె = మోగించెను; రిపు = శత్రువుల; సేనా = సైన్యము యొక్క; రింఖణ = తొట్రుపాటునకు; హేతువు = కారణము; ఐన = అయిన; నాదము = ధ్వని; నిగుడన్ = వ్యాపించగా; నారీ = స్త్రీలలో; మణి = శ్రేష్ఠురాలు; బల = బలము; సంపన్న = అధికముగా కలిగిన; అరి = శత్రువులు; ఇభ = ఏనుగులు; ఆదికము = మున్నగునవి; మూర్ఛన్ = మూర్ఛను; అందన్ = చెందునట్లుగా; నరేంద్రా = రాజా.
భావము:- ఆ నారీమణి, వైరిసేనలకు అధైర్యం కలిగేలాగ శత్రువుల ఏనుగులు మొదలైనవి మూర్చ పొందేలాగా నారి సారించింది.

తెభా-10.2-177-సీ.
సౌవర్ణ కంకణ ణఝణ నినదంబు-
శింజినీరవముతోఁ జెలిమి సేయఁ
దాటంక మణిగణ గధగ దీప్తులు-
గండమండలరుచిఁ ప్పికొనఁగ
వళతరాపాంగ ళధళ రోచులు-
బాణజాలప్రభాటలి నడఁప
రపాత ఘుమఘుమబ్దంబు పరిపంథి-
సైనిక కలకల స్వనము నుడుప

తెభా-10.2-177.1-తే.
వీర శృంగార భయ రౌద్ర విస్మయములు
లసి భామిని యయ్యెనో కాక యనఁగ
నిషువుఁ దొడుగుట దివుచుట యేయుటెల్ల
నెఱుఁగరా కుండ నని సేసె నిందువదన.

టీక:- సౌవర్ణ = బంగారు; కంకణ = చేతి కడియములు; ఝణఝణ = ఝణఝణ అను; నినదంబు = శబ్దము; శింజినీ = అల్లెతాటి; రవము = చప్పుళ్ళ; తోన్ = తేటి; చెలిమి = స్నేహము; చేయన్ = చేయగా; తాటంక = చెవి దుద్దుల యొక్క; మణి = రత్నముల; గణ = సమూహము యొక్క; ధగధగ = ధగధగమనెడి; దీప్తులు = కాంతులు; గండమండల = చెక్కిటి ప్రదేశమునందలి; రుచిన్ = మెరుపును; కప్పికొనగ = కప్పివేయగా; ధవళతర = మిక్కిలి తెల్లనైన {ధవళము - ధవళతరము - ధవళతమము}; అపాంగ = కడకంటి; ధళధళ = తళతళమనెడి; రోచులున్ = కాంతులు; బాణ = అమ్ముల; జాల = సమూహముల యొక్క; ప్రభా = కాంతుల; పటలిన్ = సమూహమును; అడపన్ = అణచగా; శర = బాణములు; పాత = పడెడి; ఘమఘమ = ఘమఘమ అనెడి (ఉరుముల ధ్వని , శరపాతము నకు, వర్షధార లనే అర్థము కూడా స్ఫురిస్తుంది); శబ్దంబున్ = ధ్వని; పరిపంథి = శత్రుపక్షపు; సైనిక = సేనల యొక్క; కలకల = కలకల అనెడి; స్వనమున్ = ధ్వని; ఉడుపన్ = అణచగా; వీర = వీరము; శృంగార = శృంగారము; భయ = భయానకము; రౌద్ర = రౌద్రము; విస్మయములున్ = అద్భుత రసములు; కలిసి = కలిసిపోయి; భామిని = స్త్రీ రూపముగా; అయ్యెనో = అయినదో; కాక = ఏమో; అనగన్ = అన్నట్లుగా; ఇషువున్ = బాణమును; తొడుగుట = సంధించుట; తివుచుట = లాగుట; ఏయుట = ప్రయోగించుట; ఎల్లన్ = అంతయు; ఎఱుగరాకుండన్ = తెలియరాకుండగా; అనిన్ = యుద్ధమునందు; చేసెన్ = చేసెను; ఇందువదన = అందగత్తె {ఇందువదన - చంద్రుని వంటి మోము కలామె, స్త్రీ}.
భావము:- బంగారుకంకణాల ఝణఝణ ధ్వనులు, వింటినారీధ్వనితో కలసిపోగా; చెవికమ్మలకు పొదగిన మణుల ధగధగ కాంతులు, చెక్కిళ్ళ కాంతులపై వ్యాపింపగా; అందమైన క్రీగంటి చూపుల ధగధగ కాంతులు, బాణాల కాంతులను కప్పివేయగా; శరములు ప్రయోగించుట వలన కలిగిన ఘుమఘుమ శబ్దం, శత్రుసైన్యాల కలకల ధ్వనులను అణచివేయగా; వీరము, శృంగారము, భయము, రౌద్రము, విస్మయము అనే భావాలన్నీ కలసి ఈ భామగా రూపొందాయా అన్నట్లుగా సత్యభామ బాణం తొడగడం, లాగడం, ప్రయోగించడం గూడ గుర్తించరానంత వేగంగా బాణాలు వేస్తూ యుద్ధం చేయసాగింది.

తెభా-10.2-178-మ.
రుఁ జూచున్ వరుఁ జూచు నొంప నలరింపన్, రోషరాగోదయా
వితభ్రూకుటి మందహాసములతో వీరంబు శృంగారమున్
గం; గన్నులఁ గెంపు సొంపుఁ బరఁగం జండాస్త్రసందోహమున్
సాలోక సమూహమున్ నెఱపుచుం, జంద్రాస్య హేలాగతిన్.

టీక:- పరున్ = శత్రువును; చూచున్ = యత్నించును; వరున్ = పెనిమిటిని; చూచున్ = యత్నించును; ఒంపన్ = నొప్పింపవలెనని; అలరింపన్ = సంతోషపెట్టవలెనని; రోష = కోపము యొక్క; రాగ = అనురాగము యొక్క; ఉదయ = పుట్టుకలచేత; అవిరత = అవిశ్రాంతమైన; భృకుటి = బొమముడితోను; మందహాసముల = చిరునవ్వుల; తోన్ = తోటి; వీరంబున్ = వీర రసము; శృంగారమున్ = శృంగార రసము; జరగన్ = వర్తించగా; కన్నులన్ = కళ్ళు యందు; కెంపు = ఎఱ్ఱదనము; సొంపు = మనోజ్ఞత; పరగన్ = వ్యాపించగా; చండ = తీక్షణమైన, చురుకైన; అస్త్ర = అస్త్రముల {అస్త్రము - మంత్రములచేత యంత్రములచేత ప్రయోగింప బడెడి ఆయుధములు, శస్త్రములు - సామాన్యమైన ఆయుధములు (కత్తి, గద, బాణము మొ.)}; సందోహమున్ = సమూహము; సరస = రసవంతములైన; ఆలోక = చూపుల; సమూహమున్ = సమూహము; నెఱపుచున్ = ప్రసరించుచు; చంద్రాస్య = ఇందువదన {చంద్రాస్య - చంద్రుని వంటి మోము కలామె, స్త్రీ}; హేలా = విలాసమయమైన; గతిన్ = విధముగా.
భావము:- చంద్రముఖి సత్యభామ ఒక ప్రక్క కోపంతో కనుబొమలు ముడివేసి వీరత్వం మూర్తీభవించినట్లు కను లెఱ్ఱచేసి, వాడి బాణాలను ప్రయోగిస్తూ శత్రువు నరకాసురుడిని నొప్పిస్తోంది; మరొక ప్రక్క అనురాగంతో మందహాసం చేస్తూ శృంగారం ఆకారం దాల్చినట్లు సొంపైన కన్నులతో సరసపు చూపులు ప్రసరిస్తూ ప్రియుడైన శ్రీకృష్ణుడిని మెప్పిస్తోంది.

తెభా-10.2-179-మ.
లినీలాలక చూడ నొప్పెసఁగెఁ బ్రత్యాలీఢ పాదంబుతో
లికస్వేద వికీర్ణకాలకలతో నాకర్ణికానీత స
ల్లలితజ్యానఖపుంఖ దీధితులతో క్ష్యావలోకంబుతో
యాకార ధనుర్విముక్త విశిఖవ్రాతాహతారాతియై.

టీక:- అలి = తుమ్మెద; నీల = నల్లని; అలక = ముంగురులు కలామె; చూడన్ = చూచుటకు; ఒప్పున్ = చక్కదనముతో; ఎసగెన్ = అతిశయించెను; ప్రత్యాలీఢపాదంబు = విలుకాని నిలుకడ {ప్రత్యాలీఢపాదము - విలుకాడు ఎడమ కాలు ముందరికి చాచి నిలుచు స్థితి}; తోన్ = తోటి; అలిక = నొసలి యందలి; స్వేద = చెమటతో; వికీర్ణక = చెదరి అంటుకొన్న; అలకల = ముంగురుల; తోన్ = తోటి; ఆకర్ణికా = చెవులవరకు; ఆనీత = లాగబడిన; సత్ = దృఢమైన; లలిత = మనోజ్ఞమైన; జ్యా = వింటినారి యందలి; నఖ = గోరు యొక్క; పుంఖ = బాణపు పింజ యొక్క; దీధితుల = కాంతుల; తోన్ = తోటి; లక్ష్య = గురిచూచెడి; అవలోకంబు = చూపుల; తోన్ = తోటి; వలయ = గుండ్రమైన; ఆకార = రూపుగా కనబడెడి; ధనుః = వింటినుండి; విముక్త = విడువబడిన; విశిఖ = బాణముల; వ్రాత = సమూహముచేత; ఆహత = కొట్టబడిన; ఆరాతి = శత్రువులు కలది; ఐ = అయ్యి.
భావము:- తుమ్మెద నీలం ముంగురులతో అలరారుతున్న ఆ సత్యభామ, ఎడమపాదం ముందుకు పెట్టి కుడికాలు వంచి చెమటకు తడిసి ముఖాన వ్యాపించిన ముంగురులతో చెవిదాకా లాగిన అల్లెత్రాటిని పట్టుకున్న చేతివేళ్ళ గోళ్ళ కాంతులతో వైరిసమూహం వైపు గురిచూస్తూ గుండ్రని ధనుస్సు నుండి వదలుతున్న శరపరంపరలతో శత్రువులను సంహరిస్తూ శోభిల్లింది.

తెభా-10.2-180-సీ.
బొమ్మ పెండిండ్లకుఁ బో నొల్ల నను బాల-
ణరంగమున కెట్లు రాఁ దలంచె?
గవారిఁ గనినఁ దా ఱుఁగుఁ జేరెడు నింతి-
గవారి గెల్వనే గిదిఁ జూచెఁ?
సిఁడియుయ్యెల లెక్క య మందు భీరువు-
గపతి స్కంధమే డిఁది నెక్కె?
ఖుల కోలాహల స్వనము లోర్వని కన్య-
టహభాంకృతుల కెబ్భంగి నోర్చె?

తెభా-10.2-180.1-ఆ.
నీలకంఠములకు నృత్యంబుఁ గఱపుచుఁ
లసి తలఁగిపోవు లరుఁబోఁడి
యే విధమున నుండె నెలమి నాలీఢాది
మానములను రిపులమాన మడఁప?

టీక:- బొమ్మ = పిల్లల బొమ్మలాటలోని; పెండిండ్లు = పెళ్ళిళ్ళు; కున్ = కు; పోన్ = వెళ్ళుటకు; ఒల్లను = ఓపికలేదు; అను = అనెడి; బాల = చిన్నది; రణ = యుద్ధ; రంగమున్ = క్షేత్రమున; కున్ = కు; ఎట్లు = ఏ విధముగ; రాన్ = రావాలని; తలంచె = అనుకొనెను; మగవారిని = మగవాళ్ళను; కనినన్ = చూసినచో; తాన్ = తాను; మఱుగు = చాటుననకు; చేరెడు = చేరునట్టి; ఇంతి = చిన్నది; పగవారి = శత్రువుల; గెల్వన్ = జయింపవలెనని; ఏ = ఏ; పగిదిని = విధముగా; చూచెన్ = అనుకొనెను; పసిడి = బంగారు; ఉయ్యెలలు = ఉయ్యాలలను; ఎక్కన్ = ఎక్కుటకు; భయమున్ = భీతిని; అందు = చెందెడి; భీరువు = భయస్తురాలు; ఖగపతి = గరుత్మంతుని; స్కంధమున్ = మూపుమీదకి; ఏ = ఏ; కడిదిన్ = విధముగా; ఎక్కెన్ = ఎక్కెను; సఖుల = చెలికత్తెల; కోలాహల = కలకలల; స్వనమున్ = ధ్వనులను; ఓర్వని = తట్టుకోలేని; కన్య = చిన్నది; పటహ = యుద్ధవాద్యముల; భాంకృతులన్ = భాం అనెడి మోతల; కున్ = కి; ఏ = ఏ; భంగిన్ = విధముగా; ఓర్చె = తట్టుకొనెను; నీలకంఠములు = నెమళ్ళ {నీలకంఠము - నీలముగా నున్న మెడ కలది, నెమలి}; కున్ = కు; నృత్యంబున్ = నాట్యములను; కఱపుచున్ = నేర్పుతు; అలసి = బడలిక చెంది; తలగిపోవు = తొలగునట్టి; అలరుబోడి = చిన్నది {అలరుబోడి - పుష్పము వలె సుకుమారమైన దేహము కలామె, స్త్రీ}; ఏ = ఏ; విధమునన్ = విధముగా; ఉండెన్ = నిలబడగలిగెను; ఎలమిన్ = వికాసముతో; ఆలీఢ = ఆలీఢము {ఆలీఢము - కుడికాలు ముందరికి చాచి యుద్ధము చేయుటకైన నిలుకడ}; ఆది = మున్నగు; మానములను = పదవిన్యాసములందు {ఆలీఢాదులు - పంచమానములు, 1ఆలీఢము 2ప్రత్యాలీఢము 3సమపదము 4విశాఖము 5మండలము అనెడి ఐదు విలుకాని పద విన్యాసములు}; రిపుల = శత్రువుల; మానమున్ = గర్వమును, గౌరవమును; అడపన్ = అణచివేయుటకు.
భావము:- బొమ్మల పెండ్లిండ్లకే వెళ్ళని ముద్దరాలు, యుద్ధరంగాని కెలా రావాలని భావించిందో? మగవారిని చూడగానే చాటుకు వెళ్ళే లతాంగి, పగవారిని గెలవాలని ఎలా అనుకుందో? బంగారు ఉయ్యాలలు ఎక్కడానికి భయపడే పడతి, గరుత్మంతుడి వీపుపై ఎలా ఎక్కిందో? చెలికత్తెల కోలాహలమే ఆలకింపలేని ముగ్ధ, భేరీలు తప్పెట్ల భీకర ధ్వనులను ఎలా ఓర్చుకుంటున్నదో? నెమిళ్ళకు నాట్యం నేర్పించి అలసిపోయే అబల, ఎడమపాదం ముందు కుంచి కుడిపాదం వంచి సంగరరంగంలో శత్రువుల అభిమానాన్ని అంతం చేయడానికి ఎలా సిద్ధమైందో? అంతా వింతే.
అసలే అసమాన సౌందర్య నారీ రత్నం, మథురానగరి అంతఃపుర వాసిని, శ్రీకృష్ణునంతటి వాని పట్టపు మహిషి. హంసతూలికా తల్పములు, బంగరు తూగుటుయ్యలలు, నానావిధ భూషణ, లేపనాదుల సౌఖ్యాలకు అలవాలమైన జీవన శైలి. అట్టి కాంతామణి కఠోర భీకర రాక్షసమూకలతో యుద్ధానికి వచ్చిందట. అది కేళీ వేదికలపై నుండి చెలులతో చేసే లీలారణరంగం కాదు. ఎత్తున ఎగురుతూ ఉండే పక్షీంద్రుని మూపున ఉండి అస్త్ర శస్త్రాల పరంపరలతో ఏమరుపా టన్నది లేని అరివీర భయంకర యుద్ధం. దానికి తగ్గని సందర్భశుద్ధి, వ్యక్తిత్వ పరిపుష్టి ప్రకటనలు చూపుతూ; లలిత లావణ్యాలు వదలకుండా, కర్కశ రణకౌశలం చూపుతూ; శృంగార రసం, వీరరసం కలిసి ఉప్పొంగి పారాయి; మన పోతనామాత్యుల వారి గంటంనుండి జాలువారాయి; మన మానస వాకిళ్ళను అలరారిస్తూ, ఇదేకాదు ముందరి అయిదు, తరువాతి మూడు పద్యాల పోకిళ్ళు.

తెభా-10.2-181-సీ.
వీణెఁ జక్కఁగఁ బట్ట వెర వెఱుంగని కొమ్మ-
బాణాసనం బెట్లు ట్ట నేర్చె?
మ్రాఁకునఁ దీగెఁ గూర్పంగ నేరని లేమ-
గుణము నే క్రియ ధనుఃకోటిఁ గూర్చె?
రవి ముత్యము గ్రువ్వఁ జాలని యబల యే-
నిపుణత సంధించె నిశితశరముఁ?
జిలుకకుఁ బద్యంబు సెప్ప నేరని తన్వి-
స్త్రమంత్రము లెన్నఁ భ్యసించెఁ?

తెభా-10.2-181.1-ఆ.
లుకు మనినఁ బెక్కు లుకని ముగుద యే
తి నొనర్చె సింహర్జనములు?
నఁగ మెఱసెఁ ద్రిజగభిరామ గుణధామ
చారుసత్యభామ త్యభామ.

టీక:- వీణెన్ = వీణను {వీణ - తంత్రీవాద్య విశేషము (సరస్వతి వీణ కచ్ఛపి; నారదుని వీణ మహతి; తుంబురుని వీణ కళావతి; తంజావూరు వీణ, బొబ్బిలి వీణ ప్రసిద్ధిచెందిన వీణలు)}; చక్కన్ = సరిగా; పట్టన్ = పట్టుకొనుటకు; వెరవు = సుళువు, నేర్పు, చాతుర్యము; ఎఱుంగని = తెలియని; కొమ్మ = చిన్నది; బాణాసనంబు = ధనుస్సులను; ఎట్లు = ఏ విధముగ; పట్టన్ = పట్టుకొనుట; నేర్చెన్ = చేయగలిగెను; మ్రాకునన్ = చెట్టున; కున్ = కు; తీగెన్ = తీవెను; కూర్పంగన్ = చుట్టబెట్టుటకు; నేరని = శక్తురాలుకాని; లేమ = చిన్నది {లేమ - లేత దేహము కలామె, స్త్రీ}; గుణమున్ = అల్లెతాటిని; ఏ = ఏ; క్రియన్ = విధముగా; ధనుః = వింటి; కోటిన్ = కొనకు; కూర్చెన్ = కట్టెను; సరవిన్ = దండలో వరుసగా; ముత్యమున్ = ముత్యములను; గ్రువ్వజాలని = గుచ్చలేని; అబల = చిన్నది {అబల - బలంలేనియామె, స్త్రీ}; ఏ = ఏ; నిపుణతన్ = నేర్పులచేత; సంధించెన్ = కూర్చెను; నిశిత = వాడియైన; శరమున్ = బాణము; చిలుక = చిలుకలు; కున్ = కు; పద్యంబున్ = పద్యములను; చెప్పనేరని = చెప్పలేని; తన్వి = చిన్నది {తన్వి - సన్నని దేహముకలామె, స్త్రీ}; అస్త్ర = అస్త్రముల; మంత్రములన్ = మంత్రాలని; ఎన్నడు = ఎప్పుడు; అభ్యసించెన్ = నేర్చుకొనెను; పలుకుము = మాట్లాడు; అనినన్ = అని చెప్పినచో; పెక్కు = ఎక్కువగా; పలుకని = మాట్లాడని; ముగుద = ముగ్ధ {ముగ్ధ (ప్ర) - ముగుద (వి)}; ఏ = ఏ; గతిన్ = విధముగా; ఒనర్చెన్ = చేసెను; సింహగర్జనములున్ = సింహనాదములు; అనగన్ = అనునట్లుగా; మెఱసెన్ = తేజరిల్లెను; త్రిజగత్ = ముల్లోకములందు; అభిరామ = ఒప్పిదమైన; గుణ = గుణములకు; ధామ = ఉనికిపట్టు; చారు = చక్కటి; సత్య = సత్యము ఐన; భామ = కాంతిచేత లక్ష్మీదేవి; సత్యభామ = సత్యభామ.
భావము:- వీణనే చక్కగా పట్టుకోలేని పడతి, విల్లు ఎక్కుపెట్టడం ఎలా నేర్చిందో? తీగను ఆలంబనగా ఉండే చెట్టు మీదకు ఎక్కించ లేని తన్వి, పెద్దవింటికి నారిని ఎలా సంధించిందో? ముత్యాల గవ్వలాటలు ఆడదామంటే వాటిని వెయ్యలేననే భామ, వాడి బాణాలను ఎలా ప్రయోగించిందో? చిలుకకు పలుకులు నేర్పలేని చిన్నది, అస్త్రాలు వాటి మంత్రాలు ఎప్పుడు నేర్చిందో? మాట్లాడు మాట్లాడు అన్నా ఎక్కువ మాట్లాడని మగువ, యుద్ధంలో సింహగర్జనలు ఎలా చేసిందో? అని ఆశ్చర్యపోయేలా ఆ యుద్ధభూమిలో ముల్లోకాలకు పొగడదగ్గ సుగుణాల రాశి, చక్కదనాల చక్కని చుక్క, సత్యభామ భాసిల్లింది.

తెభా-10.2-182-శా.
జ్యాల్లీధ్వని గర్జనంబుగ; సురల్‌ సారంగయూథంబుగా;
నా విల్లింద్రశరాసనంబుగ; సరోజాక్షుండు మేఘంబుగాఁ;
దా విద్యుల్లతభంగి నింతి సురజిద్దావాగ్ని మగ్నంబుగాఁ
బ్రావృట్కాలము సేసె బాణచయ మంశ్శీకరశ్రేణిగాన్.

టీక:- జ్యావల్లీ = అల్లెతాడు యొక్క; ధ్వని = మోత; గర్జనంబు = ఉరుములుగా; సురల్ = దేవతలు; సారంగ = సారంగపక్షుల, వానకోయిల; యూథంబు = సమూహము; కాన్ = కాగా; ఆ = ఆ; విల్లు = విల్లు (శార్ఙ్గము); ఇంద్రశరాసనమబు = ఇంద్రధనుస్సు; కన్ = కాగా; సరోజాక్షుండు = పద్మాక్షుడు, కృష్ణుడు; మేఘంబు = మేఘము; కాన్ = కాగా; తాన్ = ఆమె; విద్యుల్లత = మెరుపు; భంగిన్ = వలె కాగా; ఇంతి = స్త్రీ; సురజిత్ = రాక్షసులు అను; దావాగ్ని = కార్చిచ్చు; మగ్నంబు = ములిగిపోయినది; కాన్ = అగునట్లు; ప్రావృట్కాలము = వర్షాకాలము; చేసెన్ = కనబర్చెను; బాణ = బాణముల; చయమున్ = సమూహము; అంభః = నీటి; శీకర = తుంపరల; శ్రేణి = ధార; కాన్ = కాగా.
భావము:- అల్లెతాడు మోతలే ఉరుములుకాగా; దేవతలు వానకోయిల గుంపులుకాగా; ఆ విల్లే ఇంద్రధనుస్సు కాగా; పద్మాక్షుడు, కృష్ణుడే మేఘముకాగా; తానే మెఱుపుతీగె కాగా; దేవతలనే జయించిన ఆ భీకర రాక్షసదేహం అనే కార్చిచ్చును చల్లార్చే అనేక బాణములు అనే నీటి తుంపరలు ధారలు కాగా; నీరుగార్చే వర్షాకాలమా అనిపించేలా ఆ భామ సత్యాదేవి శరపరంరపరను ప్రయోగించింది.

తెభా-10.2-183-సీ.
రాకేందుబింబమై విబింబమై యొప్పు-
నీరజాతేక్షణ నెమ్మొగంబు;
కందర్పకేతువై న ధూమకేతువై-
లరుఁ బూఁబోఁడి చేలాంచలంబు;
భావజు పరిధియై ప్రళయార్కు పరిధియై-
మెఱయు నాకృష్టమై మెలఁత చాప;
మృత ప్రవాహమై నల సందోహమై-
నరారు నింతిసంర్శనంబు;

తెభా-10.2-183.1-తే.
ర్షదాయియై మహారోషదాయియై
రఁగు ముద్దరాలి బాణవృష్ణి;
రికి నరికిఁ జూడ నందంద శృంగార
వీరరసము లోలి విస్తరిల్ల.

టీక:- రాకేందు = పున్నమి చంద్రుని; బింబము = బింబము; ఐ = అయ్యి; రవి = సూర్య; బింబము = బింబము; ఐ = అయ్యి; ఒప్పు = చక్కగా ఉన్నది; నీరజాతేక్షణ = సత్యభామ {నీరజాతేక్షణ - నీరజాతము (కమలము) వంటి ఈక్షణ (కన్నులు కలామె), స్త్రీ, సత్యభామ}; నెమ్మొగంబు = అందమైన ముఖము {నెమ్మొగము - నెఱి (అందమైన) మొగము (ముఖము)}; కందర్ప = మన్మథుని; కేతువు = జండా; ఐ = అయ్యి; ఘన = గొప్ప; ధూమకేతువు = తోకచుక్క(అరిష్టసూచకం); ఐ = అయ్యి; అలరున్ = ఒప్పును; పూబోడి = సుకుమారి {పూబోడి - పూవు వంటి సుకుమారి}; చేల = చీర యొక్క; అంచలము = కొంగు, పైట; భావజు = మన్మథుని; పరిధి = పరివేషము {పరిధి - సూర్యుని చుట్టు చంద్రుని చుట్టును ఏర్పడు కాంతి వలయము, పరివేషము}; ఐ = అయ్యి; ప్రళయ = ప్రళయకాలపు; అర్కు = సూర్యుని; పరిధి = పరివేషము; ఐ = అయ్యి; మెఱయున్ = ప్రకాశించును; ఆకృష్టము = లాగబడినది; ఐ = అయ్యి; మెలత = వనిత, సత్యభామ; చాపము = విల్లు; అమృత = అమృతపు; ప్రవాహము = వెల్లువ; ఐ = అయ్యి; అనల = అగ్నుల; సందోహమున్ = సమూహము; ఐ = అయ్యి; తనరారున్ = ఒప్పును; ఇంతి = యువతి; సందర్శనంబు = కనబడుట, చూచుటకు; హర్ష = సంతోషమును; దాయి = ఇచ్చునది; ఐ = అయ్యి; మహా = మిక్కిలి; రోష = కోపమును; దాయి = చూపునది; ఐ = అయ్యి; పరగున్ = ప్రసిద్ధమగును; ముద్దరాలి = అందగత్తె యొక్క; బాణ = బాణముల; వృష్టి = వాన; హరి = కృష్ణుని; కిన్ = కి; అరి = శత్రువున; కిన్ = కు; చూడన్ = చూడగా; అందందన్ = అక్కడికక్కడే; శృంగార = శృంగార రసము; వీరరసములు = వీర రసములు; ఓలిన్ = క్రమముగా; విస్తరిల్లన్ = వ్యాపించగా.
భావము:- ఏక కాలంలో ఆ సుందరాంగి ఒక ప్రక్క పతిపై అనురాగం, ఒక ప్రక్క శత్రువుపై పరాక్రమం కురిపిస్తోంది; అప్పుడు, ఆమె నిండు ముఖ పద్మమును నల్లనయ్యకు చంద్ర బింబము లాగా, నరకాసురునికి సూర్యమండలం లాగా కనబరుస్తోంది; అందమైన ఆ అతివ పైట కొంగు కన్నయ్యకు కందర్పుని జెండాలాగా, ఆ ధూర్తుడికి ధూమకేతువు లాగా కనబడుతొంది; ఆమె చేతి విల్లు మానసచోరుడికి మన్మథ భావాలు ఆవరిస్తున్నట్లుగా, ఆ దానవుడి పాలిటికి ప్రళయకాలపు సూర్యుని చుట్టి ఉన్న పరివేషంలాగా బహు ఆకర్షణీయంగా మెరుస్తోంది; ఆ సుందరి సౌందర్యం గోపయ్యకు అమృత ధారలను, అసురుడికి అగ్నిశిఖలను చూపెట్టుతూ మెరిసిపోతోంది; ఆ భామ బాణవర్షాలు హరికి హర్షమును, అరికి మహా రోషమును కలిగిస్తున్నాయి; అలా అక్కడికక్కడే శృంగార, వీర రసాలు ఒలికిస్తూ వీరనారి సత్యభామ విజృంభించింది.

తెభా-10.2-184-వ.
ఇవ్విధంబున.
టీక:- ఈ = ఈ; విధంబునన్ = విధముగా.
భావము:- ఆ విధంగా సత్యభామ చేస్తున్న యుద్ధంలో...

తెభా-10.2-185-క.
శంపాలతాభ బెడిదపు
టంఱచే ఘోరదానవానీకంబుల్‌
పెంఱి సన్నాహంబుల
సొంఱి భూసుతుని వెనుకఁ జొచ్చెన్ విచ్చెన్.

టీక:- శంపాలత = మెరుపుతీగ; ఆభ = వంటి; బెడిదపు = భయంకరమైన; అంపఱ = బాణ సమూహము; చేన్ = చేత; ఘోర = భయంకరమైన; దానవ = రాక్షసుల; అనీకంబుల్ = సేనలు; పెంపు = ఘనత; అఱి = నశించి; సన్నాహంబుల = యుద్ధప్రయత్నముల; సొంపు = చక్కదనము; అఱి = నశించి; భూసుతుని = నరకాసురుని {భూసుతుడు - భూదేవి కొడుకు, నరకుడు}; వెనుక = వెనుకకు; చొచ్చెన్ = దూరెను; విచ్చెన్ = చెదరిపోయెను.
భావము:- మెఱుపు తీగల వంటి ఆమె బాణా పరంపరలతో అంత భయకర రాక్షస సైన్యమూ ఓడిపోయి, గర్వం అణగి, వెన్నుచూపి, చెదిరి, నరకాసురుని మరుగు జొచ్చింది.