పోతన తెలుగు భాగవతము/దశమ స్కంధము (ద్వితీయాశ్వాసము)/నరకాసుర వధ కేగుట

నరకాసురవధకేగుట

తెలుగు భాగవతము (పోతన తెలుగు భాగవతము/దశమ స్కంధము (ద్వితీయాశ్వాసము)/నరకాసుర వధ కేగుట)
రచయిత: పోతన



తెభా-10.2-150-వ.
అనిన నరేంద్రునకు మునీంద్రుం డిట్లనియె "నరకాసురునిచేత నదితి కర్ణకుండలంబులును, వరుణచ్ఛత్త్రంబును, మణిపర్వత మనియెడు నమరాద్రి స్థానంబును గోలుపడుటయు; నింద్రుండు వచ్చి హరికి విన్నవించిన హరి నరకాసుర వధార్థంబు గరుడవాహనారూఢుండై చను సమయంబున హరికి సత్యభామ యిట్లనియె.
టీక:- అనినన్ = అని అడుగగా; నరేంద్రున్ = రాజున; కున్ = కు; ముని = మునులలో; ఇంద్రుండు = ఉత్తముడు; ఇట్లు = ఈ విధముగా; అనియె = చెప్పెను; నరక = నరకుడు అను; అసురుని = రాక్షసుని; చేతన్ = చేత; అదితి = అదితి యొక్క {అదితి - దేవతల తల్లి}; కర్ణకుండలంబులును = చెవికుండలములు; వరుణ = వరుణుని; ఛత్రంబును = గొడుగు; మణిపర్వతము = మణిపర్వతము {మణిపర్వతము - ఇంద్రుడు కొలువుదీరు మేరుపర్వత ప్రదేశము}; అనియెడు = అనెడి; అమరాద్రి = మేరుపర్వత; స్థానంబును = ప్రదేశమును; కోలుపడుటయున్ = అపహరింపబడగా; ఇంద్రుండు = ఇంద్రుడు; వచ్చి = వచ్చి; హరి = కృష్ణుని; కిన్ = కి; విన్నవించినన్ = చెప్పుకోగా; హరి = కృష్ణుడు; నరక = నరకుడు అను; అసుర = రాక్షసుని; వధ = చంపుట; అర్థంబు = కోసము; గరుడవాహన = గరుడవాహనమును; ఆరూఢుండు = ఎక్కినవాడు; ఐ = అయ్యి; చను = వెళ్ళెడి; సమయంబునన్ = సమయము నందు; హరి = కృష్ణుని; కిన్ = కి; సత్యభామ = సత్యభామ; ఇట్లు = ఈ విధముగా; అనియె = పలికెను.
భావము:- ఈ విధంగా ప్రశ్నించిన పరీక్షిత్తుతో శుకమహర్షి ఇలా చెప్పసాగాడు. “నరకాసురుడు అదితి యొక్క కర్ణకుండలాలనూ, వరుణదేవుడి ఛత్రాన్ని, దేవతల మణి పర్వతాన్ని అపహరించాడు. దేవేంద్రుడు వచ్చి, శ్రీకృష్ణుడికి నరకుని అత్యాచారాలు విన్నవించాడు. శ్రీహరి నరకాసురుని సంహరించడానికి గరుడవాహనం ఎక్కి వెళ్ళబోతున్న సమయంలో సత్యభామ ఇలా అన్నది.

తెభా-10.2-151-శా.
"దేవా! నీవు నిశాటసంఘముల నుద్దీపించి చెండాడ నీ
ప్రావీణ్యంబులు సూడఁ గోరుదుఁ గదా! ప్రాణేశ! మన్నించి న
న్నీ వెంటం గొనిపొమ్ము నేఁడు కరుణన్; నేఁ జూచి యేతెంచి నీ
దేవీ సంహతికెల్లఁ జెప్పుదు భవద్దీప్తప్రతాపోన్నతుల్‌, "

టీక:- దేవా = స్వామీ; నీవు = నీవు; నిశాట = రాక్షసుల {నిశాటుడు - రాత్రి చరించువాడు, రాక్షసుడు}; సంఘములను = సమూహములను; ఉద్దీపించి = మిక్కిలి తేజరిల్లి; చెండాడన్ = నరికేస్తుండగా; నీ = నీ యొక్క; ప్రావీణ్యంబులున్ = సమర్థతలు; చూడన్ = చూడవలెనని; కోరుదున్ = అపేక్షింతును; కదా = కదా; ప్రాణేశా = పెనిమిటి {ప్రాణేశుడు - ప్రాణమునకు నాయకుడు, భర్త}; మన్నించి = మన్నించి; నన్ను = నన్ను; నీ = నీ; వెంటన్ = కూడా; కొని = తీసుకొని; పొమ్ము = వెళ్ళుము; నేడు = ఇవాళ; కరుణన్ = దయతో; నేన్ = నేను; చూచి = చూసి; ఏతెంచి = వచ్చి; నీ = నీ యొక్క; దేవీ = భార్యల; సంహతి = సమూహమువారి; కిన్ = కి; ఎల్లన్ = అందరికి; చెప్పుదున్ = వివరించెదను; భవత్ = నీ యొక్క; దీప్త = తేజరిల్లెడి; ప్రతాప = శౌర్యము యొక్క; ఉన్నతుల్ = గొప్పదనములను.
భావము:- “ప్రభూ! ప్రాణనాథ! నీవు విజృంభించి రాక్షసుల సమూహాలను చెండాడుతుంటే, నీ యుద్ధనైణ్యం చూడాలని కోరికగా ఉంది నామాట మన్నించి దయతో నన్ను నీ వెంట తీసుకువెళ్ళు. నేను అక్కడ రణరంగంలో నీ ప్రతాపాన్ని కనులారా చూసివచ్చి, ఇక్కడ రాణులు అందరికీ వివరంగా చెప్తాను.”

తెభా-10.2-152-వ.
అనినఁ బ్రాణవల్లభకు వల్లభుం డిట్లనియె.
టీక:- అనినన్ = అని అడుగగా; ప్రాణవల్లభ = ప్రియభార్య; కున్ = కు; వల్లభుండు = ప్రియుడు; ఇట్లు = ఈ విధముగా; అనియె = పలికెను.
భావము:- ఈవిధంగా తన ప్రాణసఖి సత్యభామ అడుగగా, శ్రీకృష్ణుడు ఇలా అన్నాడు.

తెభా-10.2-153-సీ.
"మద పుష్పంధయ ఝంకారములు గావు-
భీషణకుంభీంద్ర బృంహితములు
వాయునిర్గత పద్మనరేణువులు గావు-
తురగ రింఖాముఖోద్ధూతరజము
లాకీర్ణజలతరం గాసారములు గావు-
త్రుధనుర్ముక్త సాయకములు
లహంస సారస కాసారములు గావు-
నుజేంద్రసైన్య కదంబకములు

తెభా-10.2-153.1-తే.
మల కహ్లార కుసుమ సంములు గావు;
టుల రిపు శూల ఖడ్గాది సాధనములు
న్య! నీ వేడ? రణరంగ మన మేడ?
త్తు వేగమ; నిలువుము; లదు వలదు. "

టీక:- సమద = మిక్కిల మదించిన; పుష్పంధయ = తుమ్మెదల యొక్క {పుష్పంధయము - పూలలోని మధువుం గ్రోలునది, తుమ్మెద}; ఝంకారములు = ఝం అను శబ్దములు; కావు = కావు; భీషణ = భయంకరమైన; కుంభి = ఏనుగు; ఇంద్ర = శ్రేష్ఠముల; బృంహితములు = అరుపులు; వాయు = గాలికి; నిర్గత = వెలువడిన; పద్మ = తామర; వన = తోటల; రేణువులు = పుప్పొడిరేణువులు; కావు = కావు; తురగ = గుఱ్ఱపు; రింఖా = గిట్టల; ముఖ = మొనలనుండు; ఉద్ధూత = వెలువడు; రజములు = దుమ్ము; ఆకీర్ణ = వెదజల్లబడిన; జల = నీటి; తరంగ = అలల వలని; ఆసారములు = తుంపరుల వానలు; కావు = కావు; శత్రు = శత్రువుల; ధనుః = విల్లుల నుండి; ముక్త = విడువబడిన; సాయకములు = బాణములు; కలహంస = కలహంసలు {కలహంస - ధూమ్రవర్ణములైన ముక్కు కాళ్ళు రెక్కలు కలిగి మంచి స్వరముతో కలకలారావము చేయు హంసలు}; సారస = బెగ్గురుపక్షులు కల; కాసారములు = సరస్సులు {కాసారము - కః (నీరు)చేత శ్రేష్ఠమైనది, చెరువు}; కావు = కావు; దనుజ = రాక్షస; ఇంద్ర = ప్రభుల; సైన్య = సేనల; కదంబకములు = సమూహములు; కమల = ఎఱ్ఱ తామర; కహ్లార = సౌగంధిక {కహ్లారము - కొంచెము ఎరుపు తెలుపు కలిగి మిక్కిలి పరిమళము కలిగిన కలువపువ్వు, సౌగంధికము}; కుసుమ = పూల; సంఘములు = సమూహములు; కావు = కావు; చటుల = తీక్షణములైన; రిపు = శత్రువుల; శూల = శూలములు; ఖడ్గ = కత్తి; ఆది = మున్నగు; సాధనములు = ఆయుధములు; కన్య = పడుచు; నీవు = నీవు; ఏడ = ఎక్కడ; రణరంగ = యుద్ధభూమిలో; గమనము = తిరుగుట; ఏడ = ఎక్కడ; వత్తున్ = తిరిగివస్తాను; వేగమ = శీఘ్రముగా; నిలువుము = ఆగుము; వలదువలదు = వద్దేవద్దు.
భావము:- “అబలవైన నీ వెక్కడ? రణరంగ మెక్కడ? అక్కడ వినిపించేవి మదించిన తుమ్మెదల ఝంకారాలు కావు, భయంకరమైన ఏనుగుల ఘీంకారాలు; అక్కడ కనిపించేవి తామరపూల నుండి గాలికి రేగి వచ్చిన పరాగరేణువులు కావు, గుఱ్ఱపుడెక్కల చివరల నుండి లేచిన ధూళిదుమారాలు; అవి నీటికెరటాల తుంపరలు కావు, శత్రువుల ధనుస్సుల నుండి వెడలిన శరపరంపరలు; రాజహంసలతో నిండిన సరోవరాలు కావు, రాక్షససైన్య సమూహాలు; కమలాలు కలువలు కనిపించవు, అక్కడ కనపడేవి భయంకరమైన శత్రుల శూలాలు ఖడ్గాలు ఆయుధాలు; ఇటువంటి యుద్ధరంగానికి నీ వెందుకు రావడం. నేను త్వరగా తిరిగి వచ్చేస్తాలే. నీవు రావద్దు వద్దు; వద్దు; రావద్దు.”

తెభా-10.2-154-వ.
అనినఁ బ్రియునకుం బ్రియంబు జనియింప డగ్గఱి.
టీక:- అనినన్ = అనగా; ప్రియున్ = భర్త; కున్ = కు; ప్రియంబు = ప్రేమ; జనియింపన్ = పుట్టునట్లుగా; డగ్గఱి = దగ్గరకు వచ్చి.
భావము:- అని అంటున్న ప్రాణప్రియుడి దగ్గరకి వచ్చి ప్రియురాలు ప్రియం కలిగేలా ఇలా అన్నది.

తెభా-10.2-155-ఉ.
"దావులైన నేమి? మఱి దైత్యసమూహములైన నేమి? నీ
మానితబాహు దుర్గముల మాటున నుండగఁ నేమి శంక? నీ
తో రుదెంతు"నంచుఁ గరతోయజముల్‌ ముకుళించి మ్రొక్కె న
మ్మానిని దన్ను భర్త బహుమాన పురస్సరదృష్టిఁ జూడఁగన్.

టీక:- దానవులు = రాక్షసులు {దానవులు - దనువు యొక్క కొడుకులు, రాక్షసులు}; ఐనన్ = అయితే; ఏమి = ఏమయింది; మఱి = మరి; దైత్య = రాక్షస {దైత్యులు - దితి యొక్క కొడుకులు, రాక్షసులు}; సమూహములు = సమూహములు; ఐనన్ = అయితే; ఏమి = ఏమయింది; నీ = నీ యొక్క; మానిత = గొప్ప; బాహు = భుజములు అను; దుర్గముల = కోటల; మాటున = మరుగు నందు; ఉండగన్ = ఉండగా; ఏమి = ఏమి; శంక = అనుమానము; నీ = నీ; తోన్ = తోటి; అరుదెంతున్ = వచ్చెదను; అంచున్ = అని; కర = చేతులు అనెడి; తోయజముల్ = పద్మములను; ముకుళించి = జోడించి; మ్రొక్కెన్ = నమస్కరించెను; ఆ = ఆ; మానిని = ఇంతి; తన్ను = తనను; భర్త = పెనిమిటి; బహుమాన = మన్నించుట; పురస్సర = మెచ్చుకోలు; దృష్టిన్ = చూపులతో; చూడగన్ = చూచుచుండగా.
భావము:- “నాథా! నీ బాహువులు అనే దుర్గాల అండ నాకు ఉండగా, వారు రాక్షస సమూహాలైతే మాత్రం నాకేం భయం. నేను నీతో వస్తాను.” అని అభిమానవతి అయిన సత్యభామ పద్మాల వంటి తన చేతులు జోడించి మరీ బ్రతిమాలింది. శ్రీకృష్ణుడు సంతోషించి, సత్యభామ వంక మెచ్చుకోలుగా చూసాడు.

తెభా-10.2-156-వ.
ఇట్లు తనకు మ్రొక్కిన సత్యభామను గరకమలంబులఁగ్రుచ్చి యెత్తి తోడ్కొని గరుడారూఢుండై హరి గగన మార్గంబునం జని, గిరి శస్త్ర సలిల దహన పవన దుర్గమంబై మురాసురపాశ పరివృతం బయిన ప్రాగ్జ్యోతిషపురంబు డగ్గఱి.
టీక:- ఇట్లు = ఈ విధముగ; తన = అతని; కున్ = కి; మ్రొక్కిన = నమస్కరించిన; సత్యభామనున్ = సత్యభామను; కర = చేతులు అనెడి; కమలంబులన్ = పద్మములతో; గుచ్చి = పొదిగిపట్టి; ఎత్తి = పైకిలేపి; తోడు = కూడా; కొని = తీసుకొని; గరుడ = గరుడవాహనముపై; ఆరూఢుండు = ఎక్కినవాడు; ఐ = అయ్యి; హరి = కృష్ణుడు; గగన = ఆకాశ; మార్గంబునన్ = మార్గమువెంట; చని = వెళ్ళి; గిరి = కొండల మయమును; శస్త్ర = ఆయుధముల మయము; సలిల = నీటి మయము; దహన = అగ్ని మయము; పవన = గాలి మయము; దుర్గమంబు = కోటలు కలది; ఐ = అయ్యి; ముర = ముర అను {మురాసురుడు - ము (ఆనందము) ర (నశింపజేయు) అసురుడు (అజ్ఞానాహంకారుడు)}; అసుర = రాక్షసునిచే కల్పింపబడిన; పాశ = బంధనములచేత {అష్టపాశములు - 1పశుపాశము 2భవపాశము 3బంధపాశము 4మోహపాశము 5ఆశాపాశము 6కర్మపాశము 7దుఃఖపాశము 8కేశపాశము, పాఠ్యంతరము, 1దయ 2శంక 3భయము 4లజ్జ 5జుగుప్స 6కులము 7శీలము 8జాతి}; పరివృతంబు = చుట్టబడినది; అయిన = ఐన; ప్రాగ్జోతిష = ప్రాగ్జోతిషము అను {ప్రాగ్జోతిషపురము - నరకాసురుని పట్టణము}; పురంబు = పట్టణము; డగ్గఱి = సమీపించి.
భావము:- ఈలాగున తనను బ్రతిమాలిన సత్యభామను తన కలువల వంటి చేతులతో గరుత్ముంతునిపై ఎక్కించుకుని, ఆమెతోపాటు ఆకాశమార్గాన మురాసురుని పట్టణం ప్రాగ్జ్యోతిషాన్ని చేరాడు. ఆ పట్టణం పర్వతదుర్గాలతో, శస్త్రదుర్గాలతో, వాయుదుర్గాలతో, జలదుర్గాలతో, అగ్నిదుర్గాలతో ఇలాంటి అనేక కోటలతో జయింపరానిదై ఉంది. అది అనేకమైన మురాసురుని మాయా పాశాలుచే పరిరక్షింపబడి దుర్భేధ్యమై ఉంది.

తెభా-10.2-157-మ.
చేఁ బర్వతదుర్గముల్‌ శకలముల్‌ గావించి సత్తేజిత
ప్రరశ్రేణుల శస్త్రదుర్గచయమున్ భంజించి చక్రాహతిం
జెరన్ వాయుజలాగ్ని దుర్గముల నిశ్శేషంబులం జేసి భీ
ప్రదుఁడై వాలునఁ ద్రుంచెఁ గృష్ణుఁడు మురప్రచ్ఛన్నపాశంబులన్.

టీక:- గద = గదాయుధముచేత {విష్ణుమూర్తి గద - కౌమోదకి, వ్యుత్పత్తి. కుం భూమిం మోదయతి హర్షయతీతి కుమోదకో విష్ణుః తస్యేయం కౌమోదకీ, తా. భూమిని సంతోషింపజేయు విష్ణు సంబంధమయినది}; పర్వత = పర్వతమయమైన; దుర్గముల్ = దుర్గములను {దుర్గము - దాటరానిది, కోట}; శకలముల్ = ముక్కలు; కావించి = చేసి; సత్ = బాగా; తేజిత = పదును పెట్టబడిన; ప్రదర = బాణముల; శ్రేణులన్ = సమూహములచేత; శస్త్ర = బాణాదిమయమైన; దుర్గ = దుర్గముల; చయమున్ = సమూహమును; భంజించి = విరగకొట్టి; చక్రా = చక్రాయుధముతో; హతిన్ = కొట్టుటచేత; చెదరన్ = చెదిరిపొవునట్లు; వాయు = గాలిమయము; జల = నీటిమయము; అగ్ని = అగ్నిమయము; దుర్గములన్ = దుర్గములను; నిశ్శేషంబులన్ = మిగలకుండా; చేసి = చేసి; భీప్రదుడు = భయము కలిగించువాడు; ఐ = అయ్యి; వాలునన్ = కత్తితో; త్రుంచెన్ = తెగగొట్టెను; ముర = మురాసురునిచేత; ప్రచ్ఛన్న = కప్పబడిన, కట్టిన; పాశంబులన్ = బంధనములను.
భావము:- శ్రీకృష్ణుడు తన గదాదండంతో పర్వతదుర్గాలను ముక్కలు ముక్కలు చేసాడు; బాణసమూహంతో శస్త్రదుర్గాల సమూహాన్ని ఛేదించి వేశాడు; వాయు జల అగ్ని కోటలను చక్రంతో కొట్టి నాశనం చేసాడు; అరిభయంకరు డైన అరవిందాక్షుడు, మురాసురుని పాశాలను ఖడ్గంతో ఖండించాడు.

తెభా-10.2-158-వ.
మఱియును.
టీక:- మఱియును = ఇంకను.
భావము:- అంతేకాక.

తెభా-10.2-159-శా.
ప్రాకారంబు గదా ప్రహారముల నుత్పాటించి యంత్రంబులున్
నాకారాతుల మానసంబులును భిన్నత్వంబు సెందంగ న
స్తో కాకారుఁడు శౌరి యొత్తె విలయోద్ధూతాభ్ర నిర్ఘాత రే
ఖాకాఠిన్యముఁ బాంచజన్యము విముక్తప్రాణి చైతన్యమున్.

టీక:- ప్రాకారంబున్ = కోటగోడలను; గదా = గదాయుధముచేత; ప్రహారములను = మోదుటలచేత; ఉత్పాటించి = పెల్లగిలగొట్టి; యంత్రంబులున్ = కీలుతోవాడు ఆయుధాలను; నాకారాతుల = రాక్షసుల {నాకారాతులు - నాకా (స్వర్గవాసులైన దేవతలకు) ఆరాతులు (శత్రువులు), రాక్షసులు}; మానసంబులును = హృదయములను; భిన్నత్వంబున్ = భేదించుట; చెందంగన్ = చెందునట్లుగా; అస్తోక = గొప్ప ఆకారము కల {అస్తోకము - స్తోకము (అల్పము) కానిది}; ఆకారుడు = రూపము కలవాడు; శౌరి = కృష్ణుడు {శౌరి - శూరుని మనుమడు, కృష్ణుడు}; ఒత్తెన్ = పూరించెను, ఊదెను; విలయ = ప్రళయకాలమునందు; ఉద్ధూత = ప్రేరేపబడిన, మీదికి కదలించ బడిన; అభ్ర = మేఘములవలని; నిర్ఘాత = పిడుగుల యొక్క; రేఖా = రీతిగల; కాఠిన్యమున్ = కఠినత్వము కలది; పాంచజన్యమున్ = పాంచజన్యము అను శంఖమును; విముక్త = విడువబడిన; ప్రాణి = జీవుల యొక్క; చైతన్యమున్ = చైతన్యములు కలది.
భావము:- గదలతో కొట్టి ప్రాకారాలను, యంత్రాలను పడగొట్టాడు, రాక్షసుల హృదయాలు భేదిల్లేలా మహానుభావు డైన వాసుదేవుడు ముల్లోకాలను మూర్చిల్లజేసేదీ ప్రళయకాల మేఘనిర్ఘోషం వంటి కఠోరధ్వని కలదీ అయిన పాంచజన్య మనే తన శంఖాన్ని పూరించాడు.

తెభా-10.2-160-వ.
అంత లయకాల కాలాభ్రగర్జనంబు పగిది నొప్పు నమ్మహా ధ్వని విని పంచశిరుం డైన మురాసురుండు నిదుర సాలించి యావులించి నీల్గి లేచి జలంబులు వెడలివచ్చి హరిం గని ప్రళయకాల కీలికైవడి మండుచు దుర్నిరీక్ష్యుండై కరాళించుచుం దన పంచముఖంబులం పంచభూతమయం బయిన లోకంబుల మ్రింగ నప్పళించు చందంబునం గదిసి యాభీల కీలాజటాలంబగు శూలంబున గరుడుని వైచి భూనభోంతరంబులు నిండ నార్చుచు.
టీక:- అంతన్ = అంతట; లయకాల = ప్రళయకాలము నందలి; కాల = నల్లని; అభ్ర = మేఘముల యొక్క; గర్జనంబు = ఉరుముల; పగిదిన్ = వలె; ఒప్పు = ఒప్పెడి; ఆ = ఆ యొక్క; మహా = గొప్ప; ధ్వనిన్ = శబ్దమును; విని = విని; పంచశిరుండు = ఐదుతలలు కలవాడు; ఐన = అయిన; ముర = ముర అను; అసురుండు = రాక్షసుడు; నిదుర = నిద్రను; చాలించి = మేల్కొని; ఆవులించి = ఆవులించి; నీల్గి = ఒళ్ళువిరచికొని; లేచి = లేచి; జలంబులు = నీళ్ళనుండి; వెడలి = బయటకు; వచ్చి = వచ్చి; హరిన్ = కృష్ణుని; కని = చూసి; ప్రళయ = ప్రళయము; కాల = కాలమునందలి; కీలి = అగ్ని; కైవడిన్ = వలె; మండుచున్ = మండిపడుతు; దుర్నిరీక్ష్యుండు = చూడశక్యము కానివాడు; ఐ = అయ్యి; కరాళించుచున్ = బొబ్బరించుచు, గర్జించుచు; తన = తన యొక్క; పంచ = ఐదు; ముఖంబులన్ = నోళ్ళతోను; పంచభూత = పంచభూతములతో {పంచభూతములు - పృథివ్యాపస్తేజో వాయురాకాశములు అను ఐదు భూతములు}; మయంబు = నిండినవి; అయిన = అగు; లోకంబులన్ = లోకములను; మ్రింగన్ = మ్రింగివేయుటకు; అప్పళించు = ప్రయత్నించు; చందంబునన్ = విధముగా; కదిసి = సమీపించి; ఆభీల = భయంకరమైన; కీలా = మంటల; జటాలంబున్ = జటలు గలది; అగు = ఐన; శూలంబునన్ = శూలముచేత; గరుడుని = గరుత్మంతుని; వైచి = కొట్టి; భూ = భూమికి; నభః = ఆకాశము; అంతరంబులన్ = మధ్యప్రదేశము లందు; నిండన్ = నిండిపోవునట్లు; ఆర్చుచున్ = బొబ్బలు పెడుతు.
భావము:- ప్రళయకాలం నాటి కాలమేఘ గర్జన వంటి ఆ పాంచజన్య ధ్వనిని విని, అయిదు తలలు గల ఆ మురాసురుడు నిద్రమేల్కొన్నాడు. ఆవులించి లేచి, నీటిలో నుండి బయటకు వచ్చాడు. శ్రీకృష్ణుడిని చూసాడు. ప్రళయకాలం నాటి అగ్నిజ్వాలలాగ మండుతూ చూడశక్యం కానివాడై పెడబొబ్బలు పెడుతూ, పంచభూతాలతో కూడిన అన్ని లోకాలను తన ఐదు నోళ్ళతో మ్రింగబోతున్నాడా అన్నట్లు నోళ్ళు తెరుచుకుని, శ్రీకృష్ణుడిని సమీపించాడు. మురాసురుడు భయంకరమైన అగ్నిజ్వాలల వంటి జడలతో కూడిన తన శూలాన్ని గరుత్మంతుడిపై ప్రయోగించి భూమ్యాకాశాలు దద్దరిల్లేలా గర్జించాడు.

తెభా-10.2-161-క.
దుదురఁ బరువిడి బిరుసున
రి హరి! నిలు నిలువు మనుచు సురయుఁ గదిసెన్
ముముర! దివిజుల హృదయము
మెమెర యిదె యడఁగు ననుచు మెఱసెన్ హరియున్.

టీక:- దురదుర = బిరబిర, గబగబ {దురదుర - వేగవంతమైన గమనము యొక్క ధ్వన్యనుకరణము}; పరువిడి = పరుగెత్తి; బిరుసున = పరుషత్వముతో; హరి = కృష్ణా; హరి = కృష్ణా; నిలు = అగు; నిలువుము = ఆగుము; అనుచున్ = అంటు; అసురయున్ = రాక్షసుడు; కదిసెన్ = సమీపించెను; మురముర = బుడబుడమని {మురముర - అణగుట యందలి ధ్వన్యనుకరణ}; దివిజుల = దేవతల; హృదయము = మనసులలోని; మెరమెర = ఇబ్బంది {మెరమెర - కంట్లో నలుసు లాంటి ధ్వన్యనుకరణము}; ఇదె = ఇదిగో ఇప్పుడె; అడగున్ = అణగిపోవును; అనుచున్ = అని; మెఱసెన్ = తేజరిల్లెను; హరియున్ = కృష్ణుడు.
భావము:- ముందుకు పరిగెత్తుకు వస్తూ గర్వంతో “కృష్ణా! ఆగు; అక్కడే ఆగు; కృష్ణా!” అంటూ ఆ రాక్షసుడు కృష్ణుని సమీపించాడు. అంతట, శ్రీహరి “దేవతల మనోవ్యధ ఈనాటితో తీరుతుంది” అని భావిస్తూ తేజరిల్లాడు.
అవే అక్షరాలు కాని, పదాలు కాని మరల మరల వస్తుంటే అనుప్రాసం అంటారు. రెండేసి వ్యంజనము (అక్షరములు) ఎడతెగకుండా మరల మరల వస్తే ఛేకానుప్రాసము అంటారు. ఛేకులు అనగా విద్వాంసులు పలుకు కమ్మదనము ఎఱిగినవారు. అట్టివారి మెప్పు గన్న అనుప్రాసము కనుక ఇది ఛేకానుప్రాసము అనే అలంకారం అయినది. ఈ దురదుర, నిలునిలు, మురముర, మెరమెర అనుప్రాసాల అందాలు ఆస్వాదించండి

తెభా-10.2-162-వ.
అప్పుడు.
టీక:- అప్పుడు = ఆ సమయము నందు.
భావము:- అలా మురాసురుడు శూలాన్ని వేసి గర్జిస్తూ ముందుకు ఉరుకుతుండగా....

తెభా-10.2-163-క.
రుడునిపైఁ బడ వచ్చిన
ముశూలము నడుమ నొడిసి ముత్తునియలుగాఁ
ముల విఱిచి ముకుందుఁడు
ము ముఖముల నిశితవిశిఖములు వడిఁ జొనిపెన్.

టీక:- గరుడుని = గరుత్మంతుని; పైన్ = మీద; పడన్ = పడుటకు; వచ్చిన = వచ్చినట్టి; ముర = మురాసురుని; శూలమున్ = శూలమును; నడుమన్ = మార్గమధ్యన; ఒడిసి = ఒడుపుగా పట్టుకొని; మూడు = మూడు (3); తునియలు = ముక్కలు; కాన్ = అగునట్లు; కరములన్ = చేతులతో; విఱిచి = విరగ్గొట్టి; ముకుందుండు = కృష్ణుడు; ముర = మురాసురుని; ముఖములన్ = ముఖము లందు; నిశిత = వాడియైన; విశిఖములున్ = బాణములను; వడిన్ = వేగముగా; జొనిపెన్ = చొప్పించెను, గుచ్చెను.
భావము:- గరుత్ముంతుడిపై మురాసురుడు ప్రయోగించిన ఆ శూలాన్ని శ్రీకృష్ణుడు మధ్యలోనే ఒడిసిపట్టుకుని, మూడు ముక్కలుగా విరిచేసాడు. ముకుందుడైన కృష్ణుడు ఆ రాక్షసుడి ముఖాలమీద బలంగా నాటేలా వాడి బాణాలను ప్రయోగించాడు.

తెభా-10.2-164-మ.
వ్రేసెన్ మురదానవుండు హరిపైఁ; గంసారియుం దద్గదన్
చేఁ ద్రుంచి సహస్రభాగములుగాఁ ల్పించె; నాలోన వాఁ
డెదురై హస్తము లెత్తికొంచు వడి రా నీక్షించి లీలాసమ
గ్రశన్ వాని శిరంబులైదును వడిన్ ఖండించెఁ జక్రాహతిన్.

టీక:- గద = గదను; వ్రేసెన్ = విసిరెను; ముర = ముర; దానవుండు = అసురుడు; హరి = కృష్ణుని; పైన్ = మీద; కంసారియున్ = కృష్ణుడు {కంసారి - కంసునిశత్రువు, కృష్ణ}; తత్ = ఆ; గదన్ = గదను; గద = గదాయుధముచేత; త్రుంచి = విరగగొట్టి; సహస్ర = వెయ్యి, అనేకమైన; భాగములుగా = ముక్కలుగా; కల్పించెన్ = చేసెను; ఆలోన = అంతలోనే; వాడు = అతడు; ఎదురు = మీదకి వచ్చువాడు; ఐ = అయ్యి; హస్తములు = చేతులు; ఎత్తికొంచున్ = పైకెత్తుకొని; వడిన్ = వేగముగా; రాన్ = వస్తుండగా; ఈక్షించి = చూసి; లీలా = వినోదపూరితమైన; సమగ్ర = సంపూర్ణమైన; దశన్ = విధముగా; వాని = అతని; శిరంబులు = తలలు; ఐదును = ఐదింటిని; వడిన్ = వేగముగా; ఖండించెన్ = తెగనరికెను; చక్రా = చక్రాయుధముతో; హతిన్ = కొట్టుటచేత.
భావము:- ఆ ముర రాక్షసుడు హరి మీద తన గదను ప్రయోగించాడు, కంసుని సంహరించిన ఆ కృష్ణుడు ఆ గదను తన గదతో వెయ్యి ముక్కలయ్యెలా విరగొట్టాడు. ఇంతలో, ఆ దానవుడు చేతులు పైకెత్తుకుని శరవేగంతో తన మీదకు వస్తుండడం చూసి శ్రీకృష్ణుడు చక్రం ప్రయోగించి అతడి అయిదు తలలనూ అవలీలగా ఖండించేసాడు.

తెభా-10.2-165-వ.
ఇట్లు శిరంబులు చక్రిచక్రధారాచ్ఛిన్నంబు లయిన వజ్రివజ్రధారా దళితశిఖరంబై కూలెడి శిఖరిచందంబున మురాసురుండు జలంబులందుఁ గూలిన, వాని సూనులు జనకవధజనిత శోకాతురులై జనార్దను మర్దింతు మని రణకుర్దనంబునం దామ్రుండు, నంతరిక్షుండు, శ్రవణుండు, విభావసుండు, వసుండు, నభస్వంతుండు, నరుణుండు నననేడ్వురు యోధులు సక్రోధులై కాలాంతకచోదితం బైన ప్రళయపవన సప్తకంబు భంగి నరకాసుర ప్రేరితులై రయంబునఁ బీఠుండనియెడు దండనాథుం బురస్కరించుకొని, పఱతెంచి హరిం దాఁకి శర శక్తి గదా ఖడ్గ కరవాల శూలాది సాధనంబులు ప్రయోగించిన.
టీక:- ఇట్లు = ఈ విధముగ; శిరంబులు = తలలు; చక్రి = కృష్ణుని {చక్రి - చక్రాయుధము ధరించు వాడు, కృష్ణుడు}; చక్రా = చక్రాయుధము యొక్క; ధారా = పదునులతో; ఛిన్నంబులు = నరకబడినవి; అయిన = కాగా; వజ్రి = ఇంద్రుని; వజ్ర = వజ్రాయుధము యొక్క; ధారా = అంచులచే; దళిత = నరకబడిన; శిఖరంబు = శిఖరములు కలది; ఐ = అయ్యి; కూలెడి = పడిపోయెడి; శిఖరి = పర్వతము; చందంబునన్ = వలె; ముర = ముర అను; అసురుండు = రాక్షసుడు; జలంబుల్ = నీటి; అందున్ = లో; కూలినన్ = పడిపోగా; వాని = అతని; సూనులు = కొడుకులు; జనక = తండ్రిని; వధ = చంపుట వలన; జనిత = కలిగిన; శోక = దుఃఖముచేత; ఆతురులు = పీడింపబడినవారు; ఐ = అయ్యి; జనార్దనున్ = కృష్ణుని; మర్దింతుము = చంపుదుము; అని = అని; రణ = యుద్ధ మనెడు; కుర్దనంబునన్ = క్రీడలో; తామ్రుండు = తామ్రుడు; అంతరిక్షుండు = అంతరిక్షుడు; శ్రవణుండు = శ్రవణుడు; విభావసుండు = విభావసుడు; వసుండు = వసుడు; నభస్వంతుండు = నభస్వంతుడు; అరుణుండు = అరుణుడు; అనన్ = అనెడి; ఏడ్వురు = ఏడుగురు (7); యోధులు = వీరులు; సక్రోధులు = కోపము కలవారు; ఐ = అయ్యి; కాలాంతక = ప్రళయకాల యమునిచే; చోదితంబు = ప్రేరేపింపబడినవి; ఐన = అగు; ప్రళయ = ప్రళయకాల; పవనసప్తకంబున్ = సప్తవాయువులు (7) {సప్తవాయువులు - 1ప్రవహము 2వివహము 3ఆవహము 4ప్రతివహము 5ఉద్వహము 6సంవహము 7పరివహము, మరియొక విధమున, 1గగనము 2స్పర్శనము 3వాయువు 4అనిలము 5ప్రాణము 6ప్రాణేశ్వరము 7జీవము}; భంగిన్ = వలె; నరక = నరకుడు అను; అసుర = రాక్షసునిచే; ప్రేరితులు = ప్రేరేపింపబడినవారు; ఐ = అయ్యి; రయంబునన్ = శీఘ్రముగా; పీఠుండు = పీఠుడు; అనియెడు = అనెడి; దండనాథున్ = సేనానాయకుని; పురస్కరించుకొని = ముందుంచుకొని; పఱతెంచి = పరుగెత్తివచ్చి; హరిన్ = కృష్ణుని; తాకి = ఎదిరించి; శర = బాణములు; శక్తి = శక్తి ఆయుధము {శక్తి - పలుచేతులు వంటి ప్రక్క యలుగులును నిడుపాటి మొనయును కలిగిన ఆయుధ విశేషము}; గదా = గదాయుధము {గద - చేత పట్టుకొన వీలైన పొడవైన కడ్డీ దాని చివర పెద్ద బరువైన గుండ్రటి తల కలిగిన ఆయుధవిశేషము, గుదియ}; ఖడ్గ = కత్తి; కరవాల = పొడవైన కత్తి, చేకత్తి; శూల = శూలము {శూలము - బాగా పొడవైన సన్నని కడ్డీ చివరన కొన బాగా సూదిగా ఉండెడి దళసరిగా నున్న ఆకు రూపు ఆయుధవిశేషము}; ఆది = మున్నగు; సాధనంబులు = ఆయుధములు; ప్రయోగించినన్ = ప్రయోగించగా.
భావము:- దేవేంద్రుడి వజ్రాయుధం దెబ్బకు శిఖరాలు తెగి కూలిన పర్వతం మాదిరి, శ్రీకృష్ణుడి చక్రం దెబ్బకు శిరస్సులు తెగిన మురాసురుడు నీటిలో కూలిపోయాడు. తండ్రి మరణానికి దుఃఖించిన మురాసురుని ఏడుగురు కుమారులు శోకోద్రిక్తులై జనార్దనుడు అయిన శ్రీకృష్ణుడిని సంహరిస్తామని యుద్ధానికి బయలుదేరారు. కాలాంతకునిచే పంపబడిన ప్రళయకాలం నాటి పవనసప్తకం (ప్రవహము, ఆవహము, ఉద్వహము, సంవహము, వివహము, ప్రతివహము, పరావహము అను ఈ ఏడూ సప్తవాయువులు అనబడును) లాగా నరకాసురుడి చేత ప్రేరేపింపబడిన ఆ తామ్రుడు, అంతరిక్షుడు, శ్రవణుడు, విభావసుడు, వసుడు, నభస్వంతుడు, అరుణుడు అనే ఏడుగురు యోధులు; పీఠుడు అనే సేనానాయకుడి నాయకత్వంలో యుద్ధానికి వచ్చి బాణాలు, శక్తి, గద, రకరకాల కత్తులు, శూలం మొదలైన ఆయుధాలను కృష్ణుడి మీద ప్రయోగించారు.

తెభా-10.2-166-ఉ.
నుజేంద్రయోధ వివిధాయుధసంఘము నెల్ల నుగ్రతన్
మేదినిఁ గూలనేయుచు సమిద్ధనిరర్గళ మార్గణాళిఁ గ్ర
వ్యాకులాంతకుండసుర స్త భుజానన కంఠ జాను జం
ఘాదులఁ ద్రుంచివైచెఁ దిలలంతలు ఖండములై యిలం బడన్.

టీక:- ఆ = ఆ; దనుజ = రాక్షస; ఇంద్ర = రాజు యొక్క; యోధ = వీరుల; వివిధ = నానా విధములైన; ఆయుధ = ఆయుధముల; సంఘమున్ = సమూహమును; ఎల్లనున్ = అన్నిటిని; ఉగ్రతన్ = తీవ్రతతో; మేదినిన్ = నేలపై; కూలనేయుచున్ = పడగొట్టుచు; సమ = మిక్కిలి; ఇద్ధ = ప్రకాశవంతమైన; నిరర్గళ = అడ్డులేని; మార్గణ = బాణముల; ఆళిన్ = సమూహముచేత {క్రవ్యాదుడు - మాంస భక్షకుడు, రాక్షసుడు}; క్రవ్యాదకులాంతకుండు = కృష్ణుడు {క్రవ్యాదకులాంతకుడు - క్రవ్యాద (రాక్షస) కులమునకు అంతకుడు (యముడు), విష్ణువు}; అసుర = రాక్షసుల {అసురులు - సుర (దేవత)లు కాని వారు, రాక్షసులు}; హస్త = చేతులు; భుజ = భుజములు; ఆనన = ముఖములు; కంఠ = మెడలు; జాను = మోకాళ్ళు; జంఘా = పిక్కలు; ఆదులన్ = మున్నగువాటిని; త్రుంచివైచెన్ = నరికివేసెను; తిలలు = నువ్వుగింజలు; అంతలు = అంతేసి; ఖండములు = ముక్కలు; ఐ = అయ్యి; ఇలన్ = నేలపై; పడన్ = పడునట్లుగా.
భావము:- ఆ రాక్షస యోధులు ప్రయోగించే ఆయుధాలు అన్నింటినీ పరాక్రమంతో నేలపాలు చేస్తూ, నిరాటంకంగా బాణాలను ప్రయోగించి, శ్రీకృష్ణుడు ఆ రాక్షసుల చేతులు, కాళ్ళు, కంఠాలు మొన్నగు అవయవాలు అన్నింటినీ నువ్వు గింజలంత ముక్కలు ముక్కలై క్రింద పడేలా ఖండించాడు.

తెభా-10.2-167-వ.
మఱియు హరి శరజాలచక్రనిహతులయి తనవారలు మడియుటకు వెఱంగుపడి రోషించి గరుడగమనుని దూషించి తన్ను భూషించుకొని సరకు సేయక నరకుండు వరకుండలప్రముఖాభరణభూషితుండయి దానసలిలధారాసిక్త గండంబులును, మహోద్దండశుండాదండంబులు నైన వేదండంబులు తండంబులై నడువ వెడలి భండనంబునకుం జని.
టీక:- మఱియున్ = ఇంకను; హరి = కృష్ణుని; శర = బాణముల; జాల = సమూహముచేత; చక్ర = చక్రముచేత; నిహతులు = నరకబడినవారు; ఐ = అయ్యి; తన = అతని; వారలు = పక్షము వారు; మడియుట = చచ్చుట; కున్ = కు; వెఱంగుపడి = ఆశ్చర్యపోయి; రోషించి = కోపించి; గరుడగమనుని = కృష్ణుని {గరుడ గమనుడు - గరుడ వాహనం పై గమనుడు తిరుగుచున్నవాడు, కృష్ణుడు}; దూషించి = తిట్టి; తన్ను = తనను; భూషించుకొని = పొగడుకొని; సరకుచేయక = లక్ష్యపెట్టక; నరకుండు = నరకుడు; వర = శ్రేష్ఠములైన; కుండల = చెవికుండలములు; ప్రముఖ = మొదలైన; ఆభరణ = సొమ్ములు చేత; భూషితుండు = అలంకరింపబడినవాడు; అయి = అయ్యి; దాన = మద; సలిల = నీటిచే; సిక్త = తడసిన; గండంబులును = చెక్కిళ్ళు కలవి; మహా = మిక్కిలి; ఉద్దండ = పొడవైనవి ఐన; శుండా = తొండములు అను; దండంబులున్ = కఱ్ఱలవంటివి కలిగినవి; ఐన = అయిన; వేదండంబులు = ఏనుగులు; తండంబులు = గుంపులు గుంపులు; ఐ = అయ్యి; నడువన్ = రాగా; వెడలి = బయలుదేరి; భండనంబున్ = యుద్ధభూమి; కున్ = కి; చని = వెళ్ళి.
భావము:- యుద్ధంలో తన పక్షం వారంతా శ్రీకృష్ణుడి చక్రానికి బాణాలకు బలి అయిపోవడంతో నరకాసురుడు ఆశ్చర్యపోయి; రోషంతో శ్రీహరిని దూషించాడు; తనను తాను పొగడుకున్నాడు; కృష్ణుడి పరాక్రమాన్ని తిరస్కరించాడు; కుండలాలు మొదలైన అనేక ఆభరణాలు ధరించి, దానజలంతో తడిసిన గండస్థలాలు గొప్ప తొండాలూ గల ఏనుగుల గుంపులతో యుద్ధరంగానికి బయలుదేరాడు.

తెభా-10.2-168-మ.
వంతుండు ధరాసుతుండు గనె శుంద్రాజ బింబోపరి
స్థ శంపాన్వితమేఘమో యన ఖగేంద్రస్కంధపీఠంబుపై
నారత్నముఁ గూడి సంగరకథాలాపంబులం జేయు ను
జ్జ్వనీలాంగుఁ గనన్నిషంగుఁ గుహనాచంగున్ రణాభంగునిన్.

టీక:- బలవంతుండు = బలము కలవాడు; ధరాసుతుండు = నరకాసురుడు {ధరాసుతుడు - ధరా (భూదేవి యొక్క) సుతుడు (కొడుకు), నరకుడు}; కనెన్ = చూసెను; శుంభత్ = ప్రకాశించుచున్న; రాజబింబ = చంద్రబింబమునకు; ఉపరి = మీది; స్థల = ప్రదేశము నందుండు; శంపా = మెరుపుతో; అన్విత = కూడుకొన్న; మేఘమో = మేఘమేమో; అనన్ = అన్నట్లుగా; ఖగేంద్ర = గరుత్మంతుని {ఖగేంద్రుడు - ఖగ (పక్షులకు) ఇంద్రుడు (రాజు), గరుత్మంతుడు}; స్కంధ = మూపు, భుజముల; పీఠంబు = ఆసనము; పైన్ = మీద; లలనారత్నము = ఉత్తమస్త్రీ సత్యభామతో; కూడి = కూడుకొన్న; సంగర = యుద్ధము యొక్క; కథా = వృత్తాంతములను; కలాపంబులన్ = చెప్పుకొనుట; చేయు = చేయుచున్న; ఉజ్జ్వల = మిక్కిలి ప్రకాశించుచున్న; నీల = నీలపు; అంగున్ = దేహము కలవానిని; కనత్ = ప్రకాశించుచున్న; నిషంగున్ = అమ్ములపొది కలవానిని; కుహనా = కపటపు; చంగున్ = నేర్పు కలవానిని; రణా = యుద్ధము నందు; అభంగునిన్ = భంగము నొందనివానిని.
భావము:- మహాబలశాలి నరకాసురుడు, నీలవర్ణంతో శోభిస్తున్న రణకోవిదుడైన శ్రీకృష్ణుడిని చూసాడు. అప్పుడు, శ్రీకృష్ణుడు గరుత్మంతుడి మూపుమీద భార్య సత్యభామతో ఆసీనుడై ఉండి, చంద్రబింబం మీద మెఱపుతీగతో కూడిన మేఘంలా ప్రకాశిస్తున్నాడు. వీపున తూపులపొది తాల్చిన ఆ గోపాలకృష్ణుడు ఆమెతో సంగ్రామ విశేషాలు సంభాషిస్తున్నాడు.

తెభా-10.2-169-వ.
కని కలహంబునకు నరకాసురుండు గమకింపం దమకింపక విలోకించి సంభ్రమంబున.
టీక:- కని = చూసి; కలహంబున్ = యుద్ధమున; కున్ = కు; నరక = నరకుడు అను; అసురుండు = రాక్షసుడు; గమకింపన్ = ప్రయత్నించగా; తమకింపక = చలింపక; విలోకించి = చూసి; సంభ్రమంబునన్ = వేగిరపాటుతో.
భావము:- ఈవిధంగా ఉన్న శ్రీకృష్ణుడిని చూసి నరకాసురుడు యుద్ధానికి సిద్ధం కావడం సత్యభామ చూసింది. ఆమె ఏమాత్రం ఆలస్యం చెయ్యకుండా, తొందర తొందరగా.....