పోతన తెలుగు భాగవతము/తృతీయ స్కంధము/సృష్టిభేదనంబు


తెభా-3-366-క.
ని మైత్రేయుఁడు విదురుం
నుఁగొని వెండియును బలికెఁ "గాలాహ్వయుఁ డై
రిన హరి మహిమల నే
వినిపించితి; సృష్టిమహిమ విను మెఱిఁగింతున్.

టీక:- అని = అని; మైత్రేయుడు = మైత్రేయుడు; విదురున్ = విదురుని; కనుగొని = చూసి; వెండియున్ = మరల; పలికెన్ = పలికెను; కాల = కాలము; కాలాహ్వయుడు = కాలాహ్వయుడు {కాలాహ్వయుడు - కాలము అని పేర్కొనబడు వాడు, విష్ణువు}; ఐ = అయి; తనరిన = విలసిల్లిన; హరి = విష్ణుని {హరి - దుఃఖములను హరించు వాడు, విష్ణువు}; మహిమలన్ = మహిమలను; నేన్ = నేను; వినిపించితిన్ = వినిపించాను; సృష్టి = సృష్టి యొక్క; మహిమన్ = మహిమను; వినుము = వినుము; ఎఱింగింతున్ = తెలిపెదను.
భావము:- ఇలా చెప్పిన మైత్రేయుడు, విదురుణ్ణి చూసి మళ్ళీ ఇలా అన్నాడు “కాలస్వరూపుడు అయిన, శ్రీమహావిష్ణువు మహిమలను నీకు వినిపించాను. ఇంక సృష్టి విశేషాలను చెప్తా విను.

తెభా-3-367-వ.
పరమేష్టి యీ సృష్ట్యాదిని అహమ్మను దేహాభిమానబుద్ధి గల మోహంబును, నంగనాసంగమ, స్రక్చందనాది గ్రామ్యభోగేచ్ఛలు గల మహామోహంబును, దత్ప్రతిఘాతం బైన క్రోధంబు నందు గలుగు నంధతామిస్రంబును, దన్నాశంబు నందు అహమేవమృతోస్మి యను తామిశ్రంబును, జిత్తవిభ్రమంబును నను నవిద్యా పంచక మిశ్రంబుగా సర్వభూతావలిం బుట్టించి యాత్మీయ చిత్తంబునఁ బాపసృష్టిఁ గల్పించుటకుఁ బశ్చాత్తాపంబు నొంది భగవద్ధ్యానామృత పూతమానసుం డై యూర్థ్వరేతస్కులును, బరమపవిత్రులును నైన సనక సనందన సన త్కుమార సనత్సుజాతు లను మునుల సత్త్వగరిష్ఠుల ధీరజనోత్తముల నార్యుల హరిప్రసన్నులంగా దివ్యదృష్టిం గల్పించి, వారలం జూచి మీమీ యంశంబులం బ్రజలం బుట్టించి ప్రపంచంబు వృద్ధిఁ బొందింపుం డనిన వారలు తద్వచనంబు లపహసించుచుఁ బద్మజుంగని మోక్షధర్ములును నారాయణపారాయణులునునై ప్రపంచ నిర్మాణంబునకుఁ బ్రతికూల వాక్యంబులు పలికిన నుదయించిన క్రోధంబు బుద్ధిచే నిగ్రహింపబడినను నరవిందసంభవుని భ్రూమధ్యంబువలనం గ్రోధస్వరూపంబున నీలలోహితుండు నిఖిల సురాగ్రజుండై యుదయించుచు నాక్రందనం బొనరించె నంత.
టీక:- పరమేష్టి = బ్రహ్మదేవుడు {పరమేష్టి - అత్యుత్తమమైన ఇష్టి (యజ్ఞము) ఐనవాడు, బ్రహ్మదేవుడు}; ఈ = ఈ; సృష్టి = సృష్టియొక్క; ఆదినిన్ = మొదటిలో; అహం = నేను; అను = అనే; దేహ = దేహమే; అభిమాన = తాను అను; బుద్ధిన్ = భావమున; కల = కలిగిన; మోహంబునున్ = మోహమును; అంగనా = స్తీలను; సంగమ = కూడుట; స్రక్ = పూలదండలు; చందన = చందనము, మంచిగంధము; ఆది = మొదలగు; గ్రామ్య = నాటు రకమైన; భోగ = భోగములందు; ఇచ్చలు = అనుభవించు కోరికలు; కల = కల; మహా = గొప్ప; మోహంబునున్ = మోహమును; తత్ = వాని; ప్రతిఘాతంబు = అడ్డము కలుగుట వలనది; ఐన = అయిన; క్రోధంబున్ = క్రోధమును; అందున్ = అందువలన; కలుగు = కలిగే; అంధతామిస్రంబున్ = గుడ్డి చీకటియును, చిమ్మచీకటియును; తత్ = దాని; నాశంబున్ = పోగొట్టుకొనుట; అందున్ = అందువలన; అహం+ఏవం = నేనే; మృతః = మరణించినవాడిని; ఆస్మిని = అయితిని; అను = అనే; తామిస్రంబునున్ = తామిస్రమును, చీకటియును; చిత్తవిభ్రమమునున్ = మనోవికారమును; అను = అనే; అవిద్యాపంచకమిశ్రంబు = అవిద్యాపంచకమిశ్రమములు {అవిద్యాపంచకమిశ్రమములు - అవిద్య అనబడు ఐదింటి గుంపు, అవి 1) మోహం, 2) మహామోహం, 3) అంధతామిస్రం, 4) తామిస్రం, 5) చిత్త విభ్రమం}; కాన్ = అగునట్లు; సర్వ = సమస్తమైన; భూత = జీవ; ఆవలిన్ = రాశిని; పుట్టించి = సృష్టించి; ఆత్మీయ = తన; చిత్తంబునన్ = మనసులో; పాప = పాపముల; సృష్టిన్ = సృష్టిని; కల్పించుటకున్ = సృష్టించుటకు; పశ్చాత్తాపంబున్ = పశ్చాత్తాపమును {పశ్చాత్తాపము - పశ్చాత్ ((చేసిన) తరువాతి) తాపము (బాధ)}; ఒంది = పొంది; భగవత్ = భగవంతుని; ధ్యాన = ధ్యానము అను; అమృత = అమృతము; పూత = నిండిన; మానసుండు = మనసు కలవాడు; ఐ = అయి; ఊర్థ్వరేతస్కులును = ఊర్థ్వరేతస్కులును {ఊర్థ్వరేతస్కులు - ఊర్థ్వ గతిని పట్టిన శుక్రమార్గము కలవారు}; పరమ = అత్యంత; పవిత్రులును = పవిత్రమైన వారును; ఐన = అయిన; సనక = సనకుడు; సనందన = సనందనుడు; సనత్కుమార = సనత్కుమారుడు; సనత్సుజాతులు = సనత్సుజాతుడు; అను = అను; మునులన్ = మునులను; సత్త్వగరిష్ఠులన్ = సత్త్వగుణము ఎక్కువ ఉన్నవారిని; ధీర = విద్వాంసులైన; జన = జనులలో; ఉత్తములన్ = ఉత్తములను; ఆర్యులన్ = ఉత్తమమైన వర్తన కలవారిని; హరి = విష్ణుని; ప్రసన్నులన్ = అనుగ్రహము పొందినవారిని; కాన్ = అగునట్లు; దివ్యదృష్టిన్ = దివ్యదృష్టితో చూసి; కల్పించి = సృష్టించి; వారలన్ = వారిని; చూచి = చూసి; మీమీ = మీరు మీమీ; అంశంబులన్ = అంశలతో; ప్రజలన్ = ప్రజలను; పుట్టించి = పుట్టించి; ప్రపంచంబున్ = ప్రపంచమును; వృద్ధిన్ = పెరుగుటను; పొందింపుండు = కలిగించండి; అనినన్ = అనగా; వారలు = వారు; తత్ = అతని; వచనంబులన్ = మాటలను; అపహసించుచున్ = ఎగతాళి చేస్తూ; పద్మజున్ = బ్రహ్మదేవుని; కని = చూసి; మోక్ష = మోక్షమునకు వలసిన; ధర్ములును = ధర్మమార్గ వర్తులు; నారాయణ = నారాయణుని; పారాయణులును = సేవించువారును; ఐ = అయి; ప్రపంచ = ప్రపంచము యక్క; నిర్మాణంబునన్ = వృద్ధి చేయుట; కున్ = కు; ప్రతికూల = వ్యతిరేకత కల; వాక్యములున్ = మాటలను; పలికినన్ = పలుకగా; ఉదయించిన = కలిగిన; క్రోధంబున్ = క్రోధమును; బుద్ధి = బుద్ధి; చేన్ = చేత; నిగ్రహింపబడిననున్ = ఆపుకొనినను; అరవిందసంభవుని = బ్రహ్మదేవుని {అరవిందసంభవుడు - అరవింద (పద్మము) న సంభవించిన వాడు (పుట్టినవాడు), బ్రహ్మదేవుడు}; భ్రూమధ్యంబున్ = భృకుటి, కనుబొమల మధ్య భాగము; వలనన్ = వలన; క్రోధ = క్రోధము యొక్క; స్వరూపంబునన్ = స్వరూపముతో; నీలలోహితుడు = శివుడు {నీలలోహితుడు - నీలము ఎరుపు రంగులు కలసి ఉన్నవాడు, రుద్రుడు, పరమ శివుడు}; నిఖిల = సమస్తమైన; సురా = దేవతలకును; అగ్రజుండు = ముందు పుట్టినవాడు, పెద్దవాడు; ఐ = అయి; ఉదయించుచున్ = పుడుతూ; ఆక్రందనమున్ = రోదనము; ఒనరించెను = చేసెను; అంతన్ = అంతట;
భావము:- బ్రహ్మదేవుడు సృష్టి ఆరంభంలో అహంకార పూరితమైన దేహాభిమానం గల “మోహం” పుట్టింది; దేహాభిమానం వల్ల స్త్రీ సంభోగం, చందనం, పూలదండలు, మొదలైన గ్రామ్య భోగాలపై ఆసక్తి గల “మహామోహం” పుట్టింది; ఈ కోరికలకు విఘ్నం వలన కలుగు క్రోధంలో కనులు మూసుకుపోయే స్థితి (మహా అజ్ఞానం /గుడ్డి చీకటి) ఏర్పడింది. అదే “అంధతామిస్రం”; శరీరమోహం వలన శరీరనాశన భయం మృత్యుభీతి నేను చచ్చిపోతాను అనే భయం ఏర్పడింది. ఇది “తామిస్రం” అజ్ఞానం / చీకటి; పై అన్నిటితో మనస్సుకు సంచలనం ఏర్పడింది. ఇది “చిత్త విభ్రమం”; 1) మోహం, 2) మహామోహం, 3) అంధతామిస్రం, 4) తామిస్రం, 5) చిత్త విభ్రమం అనే ఈ అయిదింటికి అవిద్యాపంచకం, అని పేరు; అవిద్యాపంచకంతో కూడిన భూతకోటిని పుట్టించుట తాను చేసిన “పాపకార్యం” అని బ్రహ్మదేవుడు గుర్తించాడు. మనసులో పశ్చాత్తాపం చెందాడు. బ్రహ్మదేవుడు భగవంతుణ్ణి భగవంతుని ధ్యానం అనే అమృతం వలన ఆయన మనసు పావనం అయింది. అలా పవిత్రుడైన చతుర్ముఖుడు తన దివ్యదృష్టితో అస్ఖలిత బ్రహ్మచారులు, పరమ పావనులు, సత్వగుణ సంపన్నులు, ధీరవరేణ్యులు, మాన్యులు అయిన సనకుడు, సనందనుడు, సనత్కుమారుడు, సనత్సుజాతుడు అను నలుగురు మునులను సృష్టించాడు. భగవదనురక్తులైన వారితో “మీమీ అంశలతో ప్రజల్ని సృష్టించి ప్రపంచాన్ని వృద్ధి చేయండి” అన్నాడు. బ్రహ్మదేవుని మాటలు విన్న సనకాదులకు నవ్వు వచ్చింది. మోక్షాసక్తులు, శ్రీమహావిష్ణువు పరమ భక్తులు అయిన వారు పద్మసంభవుని అపహాస్యం చేస్తూ ప్రపంచ నిర్మాణానికి ప్రతికూలంగా మాట్లాడారు. వారు తన ఆజ్ఞను తిరస్కరించినందుకు చతుర్ముఖునికి కోపం వచ్చింది. బుద్ధిబలంతో ఆ ఆగ్రహాన్ని ఎంత నిగ్రహించుకున్నా ఆయన కనుబొమల నడుమ నుండి నీలం, ఎరుపు రంగుతో “నీలలోహితుడు” పుట్టాడు. అతడు పుడుతూనే పెద్దగా రోదనం చేసాడు.

తెభా-3-368-మ.
నం బందిన నీలలోహితుఁడు గంజాతాసనుం జూచి యి
ట్లను నో దేవ! మదాఖ్య లెట్టివి మదీ యావాసముల్ వీఁక నా
యంబున్నెఱిఁగింపవే యనుడు నయ్యంభోజగర్భుండు లా
ముం దోఁపఁ గుమార! నీ జననవేళన్ రోదనం బిచ్చుటన్.

టీక:- జననంబున్ = పుట్టుక; అందినన్ = పొందగా; నీలలోహితుడు = శివుడు {నీలలోహితుడు - నీలము ఎరుపు రంగులు కలసి ఉన్నవాడు, శివుడు, రుద్రుడు}; కంజాసనున్ = బ్రహ్మదేవుని {కంజాసనుడు - కంజము (పద్మము) ఆసనముగా కలవాడు, బ్రహ్మదేవుడు}; ఇట్లు = ఈవిధముగా; అనున్ = అనెను; ఓ = ఓ; దేవా = బ్రహ్మదేవుడా; మత్ = నా యొక్క; ఆఖ్యాతలు = బోధనలు; ఎట్టివి = ఎలాంటివి; మదీయ = నా యొక్క; ఆవాసముల్ = నివాసములు; వీకన్ = ఔదార్యముతో; నాకున్ = నాకు; అనయంబున్ = తప్పక; ఎఱిగింపవే = తెలుపుము; అనుడున్ = అనగా; ఆ = ఆ; అంభోజగర్భుండు = బ్రహ్మదేవుడు {అంభోజగర్భుడు - అంభోజము (పద్మము) న గర్భుడు (పుట్టినవాడు), బ్రహ్మదేవుడు}; లాలనమున్ = బుజ్జగింపు; తోపన్ = ధోరణితో; కుమార = పుత్రుడా; నీ = నీ యొక్క; జననము = పుట్టిన; వేళన్ = సమయములో; రోదనంబున్ = ఏడ్చుటను; ఇచ్చుటన్ = చేయుటచేత.
భావము:- ఆవిధంగా జన్మించిన నీలలోహితుడు బ్రహ్మదేవుని “ఓ దేవా! నేను ఎవరిని? నా పేరు ఏమిటి? నా నివాస స్థలం ఏమిటి?” అంటూ ప్రశ్నించాడు. అప్పుడు పద్మం లో పుట్టిన ఆ చతుర్ముఖుడు అతనిని లాలిస్తూ ఇలా అన్నాడు “పుత్రా! నువ్వు పుట్టగానే గట్టిగా ఏడ్చావు కదా!

తెభా-3-369-తే.
రుద్రనామంబు నీకు నిరూఢమయ్యెఁ
జంద్ర సూర్యానలానిల లిల గగన
పృథివి ప్రాణ తపోహృదింద్రియము లనఁగఁ
లుగు నేకాదశస్థానము వసింపు."

టీక:- రుద్ర = రుద్రుడు అను; నామంబున్ = పేరు; నీకున్ = నీకు; నిరూఢము = స్థిరపడినది; అయ్యెన్ = అయ్యెను; చంద్ర = చంద్రుడు; సూర్య = సూర్యుడు; అనల = అగ్ని; అనిల = వాయువు; సలిల = జలము; గగన = ఆకాశము; పృథివి = భూమి; ప్రాణ = ప్రాణములు; తపస్ = తపస్సు; హృది = హృదయము; ఇంద్రియములు = ఇంద్రియములు; అనగన్ = అని; కలుగు = ఉండు; ఏకాదశ = పదకొండు (11); స్థానములన్ = ప్రదేశములందు; వసింపుము = నివసింపుము {రుద్రుని ఏకాదశ స్థానములు - 1 చంద్రుడు 2 సూర్యుడు 3 అగ్ని 4 వాయువు 5 జలము 6 ఆకాశము 7 భూమి 8 ప్రాణములు 9 తపస్సు 10 హృదయము 11 ఇంద్రియములు}.
భావము:- అలా పుట్టగానే రోదన చేయటం వలన నీకు “రుద్రుడు” అనే పేరు స్థిరపడింది. 1) చంద్రుడు, 2) సూర్యుడు, 3) అగ్ని, 4) వాయువు, 5) జలం, 6) ఆకాశం, 7) భూమి, 8) ప్రాణం, 9) తపస్సు, 10) హృదయం మరియు 11) ఇంద్రియాలు అనే పదకొండు నీకు నివాస స్థానాలు.” అని బ్రహ్మదేవుడు చెప్పాడు. వాటిని ఏకాదశ రుద్ర నివాస స్థానాలు అంటారు.

తెభా-3-370-వ.
అని వెండియు "మన్యు మను మహాకాల మహ చ్చివ ఋతధ్వ జోరురేతో భవ కాల వామదేవ ధృతవ్రతు లను నేకాదశ నామంబులు గలిగి ధీ వృ త్త్యశ నోమా నియు త్సర్పి రి లాంబి కేరావతీ సుధా దీక్షా నామ పత్నీ సమేతుండవై పూర్వయుక్తంబు లయిన నామంబులం దత్తన్నివాసంబుల వసియించి ప్రజలం గల్పింపు"మని నిర్దేశించిన భగవంతుం డగు నీలలోహితుండు విశ్వగురుం డైన పితామహునిచే నియుక్తుండై సత్త్వాకృతి స్వభావంబుల నాత్మసము లైన ప్రజలం గల్పించె.
టీక:- అని = అని; వెండియున్ = మరల; మన్యు = మన్యువు; మను = మనువు; మహాకాల = మహాకాలుడు; మహచ్ఛివ = మహచ్ఛివుడు; ఋతధ్వజ = ఋతధ్వజుడు; ఉరురేతస్ = ఉరురేతసుడు; భవ = భవుడు; కాల = కాలుడు; వామదేవ = వామదేవుడు; ధృతవ్రతులు = ధృతవ్రతుడు; అను = అనే; ఏకాదశ = పదకొండు (11); నామంబులున్ = పేర్లను {నీలోహితుని ఏకాదశ నామములు - 1 మన్యువు 2 మనువు 3 మహాకాలుడు 4 మహశ్చివుడు 5 ఋతధ్వజుడు 6 ఉరురేతసుడు 7 భవుడు 8 కాలుడు 9 వామదేవుడు 10 ధృతవ్రతుడు 11 నీలలోహితుడు}; కలిగి = ఉండి; ధీ = బుద్ధి శక్తి; వృత్తి = వర్తన; అశన = ఆకలి; ఉమా = కాలవిరామమైన కాలజ్ఞానము; నియుత్ = నియమము; సర్పి = ప్రసారశక్తి; ఇల = ద్రవ్యశక్తి; అంబిక = మాతృ శక్తి; ఇరావతి = విద్యుచ్ఛక్తి; సుధ = చిత్తస్థైర్యశక్తి; దీక్ష = శ్రద్ధ; నామ = పేర్లు కల; పత్నీ = భార్యల {నీలలోహితుని ఏకాదశ మూర్తు లకు భార్యలు - 1 ధీ 2 వృత్తి 3 అశన 4 ఉమ 5 నియుతి 6 సర్పి 7 ఇల 8 అంబిక 9 ఇరావతి 10 సుధ 11 దీక్ష}; సమేతుండవు = కూడినవాడవు; ఐ = అయి; పూర్వ = ముందు, ఇదివరకు; యుక్తంబులు = చెప్పబడినవి; అయిన = అయిన; నామంబులన్ = పేర్లతో; తత్తత్ = ఆయా; నివాసంబులన్ = తావులలో; వసించి = నివసించి; ప్రజలన్ = ప్రజలను; కల్పింపుము = సృష్టింపుము; అని = అని; నిర్దేశించిన = ఆజ్ఞాపించగా; భగవంతుడు = పూజ్యుడు; అగు = అయిన; నీలలోహితుండు = రుద్రుడు; విశ్వగురుండు = బ్రహ్మదేవుడు {విశ్వగురుడు - విశ్వమునకు గురువు అయినవాడు, బ్రహ్మదేవుడు}; ఐన = అయిన; పితామహుని = తండ్రి, బ్రహ్మదేవుని {పితామహుడు - తండ్రులలో గొప్పవాడు, బ్రహ్మదేవుడు}; చేన్ = చేత; నియుక్తుండు = నియమింపబడినవాడు; ఐ = అయి; సత్త్వన్ = సత్తువ; ఆకృతిన్ = స్వరూపము; స్వభావంబులన్ = స్వభావములలో; ఆత్మ = తనకు; సములు = సమానమైనవారు; ఐన = అయిన; ప్రజలన్ = ప్రజలను; కల్పించెన్ = సృష్టించెను.
భావము:- అలా చెప్పిన బ్రహ్మదేవుడు రుద్రునితో ఇంకా ఇలా అన్నాడు “అంతేకాదు కుమారా! మన్యువు, మనువు, మహాకాలుడు, మహత్తు, శివుడు, ఋతధ్వజుడు, ఉరురేతసుడు, భవుడు, కాలుడు, వామదేవుడు, ధృతవ్రతుడు అనే ఏకాదశనామాలు కలిగి ఉండు. ధీ, వృత్తి, అశన, ఉమ, నియుతి, సర్పి, ఇల, అంబిక, ఇరావతి, సుధ, దీక్ష అనే పేర్లు కలిగిన ఏకాదశ పత్నులుతో కూడి, ఇంతకు ముందు నిర్దేశించిన ఏకాదశ నామాలతో, ఏకాదశ భార్యలతో ఆయా ఏకాదశ స్థానాలు (చంద్రుడు, సూర్యుడు, అగ్ని, వాయువు, జలం, ఆకాశం, భూమి, ప్రాణం, తపస్సు, హృదయం, ఇంద్రియాలు) యందు ఉంటూ ప్రజల్ని సృష్టించు” అని విశ్వానికి గురువు అయిన బ్రహ్మదేవుడు ఆజ్ఞాపించాడు. ఆ ప్రకారంగా తనతో సమానమైన సత్తువ (బలం), ఆకారం, స్వభావం కలిగిన ప్రజలను సృష్టించాడు.

తెభా-3-371-ఉ.
రుద్రునిచేత నీగతి నిరూఢమతిన్ సృజియింపఁ బడ్డ యా
రుద్రగణంబు లోలి నవరుద్ధత విశ్వము మ్రింగె నమ్మహో
ద్రవశాంతి కై యజుఁడు ర్గులఁ జూచి "కుమారులార! మీ
రౌద్ర విలోక నానల భరంబునఁ గ్రాఁగె సమస్త లోకముల్.

టీక:- రుద్రుని = అగ్నిదేవుని; చేతన్ = చేత; ఈ = ఈ; గతిన్ = విధముగ; నిరూఢ = నిశ్చయించుకొనిన; మతిన్ = మనసుతో; సృజియింపబడ్డ = సృష్టింపబడిన; ఆ = ఆ; రుద్రగణంబులు = రుద్రగణములు {రుద్రగణములు - రౌద్రస్వభావము కల సమూహములు}; ఓలిన్ = క్రమముగా; అవరుద్ధతన్ = అడ్డము కలుగుట వలన; విశ్వమున్ = విశ్వమును; మ్రింగెన్ = మింగెను; ఆ = ఆ; మహా = గొప్ప; ఉపద్రవ = ఆపద; శాంతి = శాంతింపజేయుట; కై = కొరకు; అజుడు = బ్రహ్మదేవుడు {అజుడు - జన్మములేని వాడు, బ్రహ్మదేవుడు}; భర్గులను = వేగునట్లు చేయుచున్న వారిని; చూచి = చూసి; కుమారులార = పిల్లలూ; మీ = మీ యొక్క; రౌద్ర = రౌద్రమైన {రౌద్రము - భయంకరమైన కోపము వంటి నవరసములలోని ఒక రసము}; విలోకన్ = తీక్షణమైన చూపుల నుండి పుట్టిన; అనల = మంటల; భరంబునన్ = బాధతో; క్రాగెన్ = కాగిపోయినవి; సమస్త = సమస్తమైన; లోకముల్ = లోకములును.
భావము:- రుద్రుడు ఈ విధంగా రుద్రుడు సృష్టించిన రుద్రగణాలు ఈ విశ్వాన్నంతా అనాయాసంగా, అమాంతం మ్రింగేశాయి. ఆ మహా ప్రమాదాన్ని శాంతింపచేయటానికై బ్రహ్మదేవుడు వారిని చేరపిలిచి “కుమారులారా! చూసారా! మీ చూపుల అగ్నిజ్వాలలలో సమస్తలోకాలూ మండిపోయాయి.

తెభా-3-372-క.
మీ సృష్టి సాలు నింకన్
ధీత్తములార! వినుడు ధృతి మీరు తపో
వ్యాసంగచిత్తు లై చనుఁ
డా న్మంగళము లగు దృఢంబుగ మీకున్.

టీక:- మీ = మీ యొక్క; సృష్టి = సృష్టి; చాలున్ = చాలును; ఇంకన్ = ఇంక; ధీ = బుద్ధి; సత్తములార = సత్తువ కలవారులారా; వినుడు = వినండి; ధృతిన్ = దీక్షవహించి; మీరు = మీరు; తపస్ = తపస్సు నందు; వ్యాసంగ = మిక్కిలి సంగము కల; చిత్తులు = చిత్తము కలవారు; ఐ = అయి; చనుడా = ప్రవర్తింపుడు; సత్ = మంచి; మంగళములు = శుభములు; అగున్ = కలుగును; దృఢంబుగన్ = తప్పకను; మీకున్ = మీకు.
భావము:- నాయనలారా! మీరు బుద్ధిమంతులు, ధైర్యవంతులు, నా మాట వినండి. ఇంక చాలు; మీరు సృష్టించటం చాలించండి. చక్కగా అరణ్యాలకు వెళ్ళి ఏకాగ్రచిత్తులై, తపస్సు చేసుకోండి. మీకు తప్పక శుభం కలుగుతుంది.

తెభా-3-373-మ.
వంతుం బురుషోత్తమున్ హరిఁ గృపాపాథోధి లక్ష్మీశ్వరున్
సుగుణభ్రాజితు నచ్యుతుం బరుఁ బరంజ్యోతిం బ్రభున్ సర్వభూ
ణావాసు నధోక్షజున్ శ్రితజనత్రాణైకపారీణు నా
దాత్ముం గనుచుందు రార్యులు తపశ్శక్తిన్ స్ఫుటజ్ఞానులై."

టీక:- భగవంతున్ = విష్ణుమూర్తిని {భగవంతుడు - పూజనీయుడు, విష్ణువు}; పురుషోత్తమున్ = విష్ణుమూర్తిని {పురుషోత్తముడు - పురుషు (కర్త, చేయువాడు) లలో ఉత్తముడు, విష్ణువు}; హరిన్ = విష్ణుమూర్తిని {హరి - దుఃఖములను హరించు వాడు, విష్ణువు}; కృపాపాథోధిన్ = విష్ణుమూర్తిని {కృపాపాథోధి - దయకు పాధోథి (సముద్రము) వంటి వాడు, విష్ణువు}; లక్ష్మీశ్వరున్ = విష్ణుమూర్తిని {లక్ష్మీశ్వరుడు - లక్ష్మీపతి, విష్ణువు}; సుగుణభ్రాజితున్ = విష్ణుమూర్తిని {సుగుణభ్రాజితుడు - సద్గుణములతో విలసిల్లు వాడు}; అచ్యుతున్ = విష్ణుమూర్తిని {అచ్యుతుడు - పతనము లేనివాడు, విష్ణువు}; పరున్ = విష్ణుమూర్తిని {పరుడు - సమస్తమునకు పరమై (పైన) ఉండు వాడు, విష్ణువు}; పరంజ్యోతిన్ = విష్ణుమూర్తిని {పరంజ్యోతి - అత్యుత్తమ ప్రకాశకము, విష్ణువు}; ప్రభున్ = విష్ణుమూర్తిని {ప్రభువు - ఏలిక, సమర్థుడు, విష్ణువు}; సర్వభూతగణావాసున్ = విష్ణుమూర్తిని {సర్వభూతగణావాసుడు - సమస్తమైన జీవరాశి యందును ఆత్మరూపమున ఉండువాడు, విష్ణువు}; అధోక్షజున్ = విష్ణుమూర్తిని {అధోక్షజుడు - ఇంద్రియములపై అధికారము కలవాడు, సమస్తమును తనకు దిగువుననే ఉండుటచే క్రిందికి మాత్రమే చూచువాడు, విష్ణువు}; శ్రితజనత్రాణైకపారీణున్ = విష్ణుమూర్తిని {శ్రితజనత్రాణైకపారీణుడు – ఆశ్రయించిన జనుల త్రాణము (రక్షించుట) అను మిక్కిలి నేర్పు కలవాడు, విష్ణువు}; ఆ = ఆ; జగదాత్మున్ = విష్ణుమూర్తిని {జగదాత్ముడు - జగత్తు (విశ్వము) తన స్వరూపము ఐనవాడు, విష్ణువు}; కనుచున్ = చూస్తూ; ఉందురు = ఉంటారు; ఆర్యులు = సత్ప్రవర్తన కలవారు; తపస్ = తపస్సువలన కలిగిన; శక్తిన్ = శక్తితో; స్ఫుట = స్పష్టమైన; జ్ఞానులు = జ్ఞానము కలవారు; ఐ = అయి.
భావము:- శ్రీమన్నారాయణుడు భగవంతుడు, పురుషోత్తముడు కరుణాసముద్రుడు, లక్ష్మీవల్లభుడు, సద్గుణసంపన్నుడు, అచ్యుతుడు, పరమాత్ముడు, పరంజ్యోతి, సర్వేశ్వరుడు, సర్వాంతర్యామి, అధోక్షజుడు, జగన్నాధుడు, ఆర్త జన రక్షా పరాయణుడు; అయనను సుజ్ఞానులు తమ తపశ్శక్తివల్ల దర్శించగలుగుతారు. మీరు కూడా తపస్సు చేసి ఆయనను దర్శించండి” అన్నాడు బ్రహ్మదేవుడు.

తెభా-3-374-వ.
అనిన విని.
టీక:- అనినన్ = అనగా; విని = విని.
భావము:- రుద్రులు ఇలా చెప్పిన బ్రహ్మదేవుని మాట విన్నారు.

తెభా-3-375-ఉ.
కైకొని యిట్లు పంకరుహర్భనియంత్రితు లైన రుద్రు లు
ద్రేముఁ దక్కి కానలకు ధీమతు లై తపమాచరింప న
స్తో చరిత్రు లేఁగిరి చతుర్ముఖుఁ డంతఁ బ్రపంచకల్పనా
లోనుఁ డై సృజించె జనలోక శరణ్యుల ధీవరేణ్యులన్.

టీక:- కైకొని = స్వీకరించి; ఇట్లు = ఈవిధముగా; పంకరుహగర్భ = బ్రహ్మదేవునిచే {పంకరుహగర్భుడు - పంక రుహము (నీట పుట్టునది, పద్మము) నందు గర్భుడు (పుట్టిన వాడు), బ్రహ్మదేవుడు}; నియంత్రితులు = నియమింపబడినవారు; ఐన = అయిన; రుద్రులు = రుద్రులు; ఉద్రేకమున్ = ఉద్రేకమును; తక్కి = తగ్గినవారై; కానలన్ = అడవుల; కున్ = కు; ధీమంతులు = ధారణశక్తి కలవారు; ఐ = అయి; తపమున్ = తపస్సును; ఆచరింపన్ = చేయుటకు; అస్తోక = గొప్ప; చరిత్రులు = ప్రవర్తన కలవారు; ఏగిరి = వెళ్ళిరి; చతుర్ముఖుడు = బ్రహ్మదేవుడు {చతుర్ముఖుడు - నాలుగు తలలు కలవాడు, బ్రహ్మదేవుడు}; అంతన్ = అంతట; ప్రపంచ = ప్రపంచమును; కల్పనా = సృష్టింపవలెనను; ఆలోకనుండు = దృష్టి కలవాడు; ఐ = అయి; సృజించెన్ = సృష్టించెను; జన = జన్మించిన; లోక = లోకములును; శరణ్యులన్ = రక్షించువారిని; ధీ = బుద్ధిమంతులలో; వరేణ్యులన్ = శ్రేష్ఠులను.
భావము:- ఆ సచ్చరిత్రులైన రుద్రులు చతుర్ముఖుని ఆజ్ఞానుసారం తమ రౌద్రావేశాన్ని అణుచుకున్నారు. ఉద్రేకాన్ని తగ్గించుకున్నారు. అరణ్యాలకు వెళ్ళి తపోనిమగ్నులైయ్యారు. అనంతరం బ్రహ్మ ప్రపంచాన్ని సృష్టించాలనే దృష్టి కలవాడై ఈసారి మానవ లోకానికి శరణ్యులూ మతిమంతులలో, అగ్రగణ్యులూ అయిన వారిని సృజించాడు.

తెభా-3-376-తే.
వినుము, భగవద్బలాన్విత వినుత గుణులు
భువన సంతానహేతు విస్ఫురణ కరులు
ద్మసంభవ తుల్య ప్రభావ యుతులు
దురు గొడుకులు పుట్టిరి వ్యయశులు.

టీక:- వినుము = వినుము; భగవత్ = భగవంతుని; బల = శక్తితో; ఆన్విత = కూడి; వినుత = స్తుతింపబడు; గుణులు = గుణములు కలవారు; భువన = ప్రపంచమును, సృష్టిని; సంతాన = విస్తరించుటకు; హేతు = కారణములను; విస్ఫురణ = ప్రకాశము; కరులు = చేయువారు; పద్మసంభవ = బ్రహ్మదేవునితో {పద్మసంభవుడు - పద్మమున పుట్టినవాడు, బ్రహ్మదేవుడు}; తుల్య = సమానముగా; ప్రభావ = ప్రభావము; యుతులు = కలవారు; పదురు = పదిమంది (10) {బ్రహ్మదేవుని పదుగురు కొడుకులు - 1 అంగుష్టమున, దక్షుడు 2 ఊరువుల, నారదుడు 3 నాభిన, పులహుడు 4 కర్ణముల, పులస్త్యుడు 5 త్వక్కున, భృగువు 6 హస్తమున, క్రతువు 7 నాస్యంబున, అంగిరసుడు 8 ప్రాణమున, వసిష్టుడు 9 మనమున, మరీచుడు 10 కన్నుల అత్రి -- పుట్టిరి}; కొడుకులన్ = పుత్రులు; పుట్టిరి = పుట్టిరి; భవ్య = శుభకరమైన; యశులు = కీర్తికలవారు.
భావము:- భగవంతుని అనుగ్రహ బలంతో కూడిన సద్గుణాలు కలవారు, జీవుల అభివృద్ధికి కారణభూతులు, బ్రహ్మతో సమానమైన ప్రభావం కలవారు, విశాలమైన యశస్సు కలవారు, అయిన పదిమంది కొడుకులు బ్రహ్మదేవుడుకు జనించారు.

తెభా-3-377-సీ.
రవింద సంభవు నంగుష్ఠమున దక్షుఁ-
డూరువువలనను నాదుండు,
నాభిఁ బులహుఁడు, గర్ణములఁ బులస్త్యుండు-
త్వక్కున భృగువు, హస్తమునఁ గ్రతువు,
నాస్యంబువలన నయ్యంగిరసుఁడు, ప్రాణ-
మున వసిష్టుఁడు, మనమున మరీచి,
న్నుల నత్రియుఁ గాఁ బుత్రదశకంబు-
లిగిరి వెండియు లినగర్భు

తెభా-3-377.1-తే.
క్షిణస్తనమువలన ర్మ మొదవె
వెన్నువలనను నుదయించె విశ్వభయద
మైన మృత్యు, వధర్మంబు నంద కలిగె,
నాత్మఁ గాముండు జననము నందె మఱియు.

టీక:- అరవిందసంభవుని = బ్రహ్మదేవుని {అరవిందసంభవుడు - అరవింద (పద్మము) న సంభవించిన వాడు (పుట్టినవాడు), బ్రహ్మదేవుడు}; అంగుష్టమునన్ = బొటకనవేలి యందు; దక్షుడు = దక్షుడు; ఊరువులు = తొడలు; వలనన్ = వలన; నారదుండు = నారదుడు; నాభిన్ = బొడ్డున; పులహుడు = పులహుడు; కర్ణములన్ = చెవులందు; పులస్త్యుండు = పులస్త్యుడు; త్వక్కున = చర్మమున; భృగువు = భృగువు; హస్తమున = చేతియందు; క్రతువు = క్రతువు; ఆస్యంబు = ముఖము; వలనన్ = వలన; ఆ = ఆ; అంగీరసుడు = అంగీరసుడు; ప్రాణమునన్ = ప్రాణమునందు; వసిష్టుడు = వసిష్టుడు; మనమునన్ = మనస్సునందు; మరీచి = మరీచి; కన్నులన్ = కన్నులలో; అత్రియున్ = అత్రి; కాన్ = అగునట్లు; పుత్ర = పుత్రులు; దశకంబున్ = పదిమంది (10); కలిగిరి = పుట్టిరి; వెండియున్ = ఇంకనూ; నలినగర్భు = బ్రహ్మదేవుని {నలినగర్భుడు - నలినము (పద్మము)న గర్భుడు (పుట్టినవాడు), బ్రహ్మదేవుడు}; దక్షిణ = కుడి; స్తనము = రొమ్ము; వలనన్ = వలన; ధర్మము = ధర్మము; ఒదవెన్ = పుట్టెను; వెన్ను = వెన్నెముక; వలనన్ = వలన; ఉదయించెన్ = పుట్టెను; విశ్వ = విశ్వమునకు; భయదము = భయమును కలిగించునది; ఐన = అయిన; మృత్యువు = మరణము; అధర్మంబున్ = అధర్మము; అందన్ = దానిలో; కలిగె = పుట్టెను; ఆత్మన్ = ఆత్మనుండి; కాముండు = మన్మథుడు {కాముడు - కామమును ప్రేరేపించు వాడు, మన్మథుడు}; జననము = పుట్టుక; ఒందెన్ = పొందెను; మఱియున్ = ఇంకనూ.
భావము:- బ్రహ్మ బొటనవ్రేలు నుండి “దక్షుడు”, తొడనుండి “నారదుడు”, నాభి నుండి “పులహుడు”, చెవులనుండి “పులస్త్యుడు”, చర్మంనుండి “భృగువు”, చేతి నుండి “క్రతువు”, ముఖంనుండి “అంగిరసుడు”, ప్రాణంనుండి వశిష్టుడు, మనస్సునుండి మరీచి, కన్నులనుండి “అత్రి” ఆవిర్భవించారు. ఈవిధంగా పదిమంది కుమారులు పుట్టారు. ఇంకా బ్రహ్మ దేవుని కుడి వైపు స్తనంనుండి “ధర్మం” జనించింది. వెన్నునుండి లోకభయంకరమైన “మృత్యువూ”, జనించాయి. ఆత్మనుండి “మన్మథుడు” పుట్టాడు.

తెభా-3-378-సీ.
భ్రూయుగళంబునఁగ్రోధంబు నధరంబు-
నందు లోభంబు నాస్యమున వాణి
యును మేఢ్ర మందుఁ బయోధు లపానంబు-
నందు నఘాశ్రయుఁ డైన నిరృతి
లాలితచ్ఛాయవన దేవహూతివి-
భుండు గర్దముఁడును బుట్టి రంత
బ్జజుఁ డాత్మదేమున జనించిన-
భారతిఁ జూచి విభ్రాంతిఁ బొరసి

తెభా-3-378.1-తే.
పంచశరబాణనిర్భిన్నభావుఁ డగుచుఁ
గూఁతు రని పాపమునకు సంకోచపడక
వయఁ గోరిన జనకునిఁ ని మరీచి
మొదలుగాఁ గల యమ్మునిముఖ్యు లెఱిఁగి.

టీక:- భ్రూయుగళంబునన్ = కనుబొమలజంట వలన; క్రోధంబున్ = క్రోధమును; అధరంబునన్ = పెదవి; అందున్ = అందు; లోభంబున్ = లోభము, పిసినారితనము; ఆస్యమున = నోటినుండి; వాణియును = సరస్వతియును; మేఢ్రంబు = పురుషావయవము; అందున్ = లో; పయోధులు = సముద్రములు; అపానంబునన్ = గుదము; అందున్ = అందు; అఘ = పాపములకు; ఆశ్రయుడు = ఆశ్రయమైన వాడు; ఐన = అయినట్టి; నిరృతి = నిరృతియును {నిరృతి - అష్టదిక్పాలకులలో ఒకడు, నైరృతి మూల (దక్షిణపశ్చిమ)ను ఏలెడి దిక్పాలకుడు}; లాలితఛాయ = క్రీనీడ; వలనన్ = వలన; దేవహూతి = దేవహూతి యొక్క; విభుండు = భర్త; కర్దముడున్ = కర్దముడును; పుట్టిరి = జన్మించిరి; అంతన్ = అంతట; అబ్జజుడు = బ్రహ్మదేవుడు {అబ్జజుడు - అబ్జము (పద్మము) న పుట్టినవాడు, బ్రహ్మదేవుడు}; ఆత్మ = తన; దేహమునన్ = శరీరమువ; జనించిన = పుట్టిన; భారతిన్ = సరస్వతిని; చూచి = చూసి; విభ్రాంతి = విమోహము; పొరసి = పొంది; పంచశర = మన్మథుని {పంచశరుడు - అయిదు (పుష్ప) బాణములు కలవాడు, మన్మథుడు}; బాణ = బాణములకు; నిర్భిన్న = చెదరిన; భావుండు = మనసు కలవాడు; అగుచున్ = అవుతూ; కూతురు = పుత్రిక; అని = అని; పాపమున = పాపమున; కున్ = కు; సంకోచపడక = సంకోచించక; కవయన్ = కలవవలెనని; కోరినన్ = అనుకొనుచున్న; జనకుని = తండ్రిని; కని = చూసి; మరీచి = మరీచి; మొదలుగాగల = మొదలగు; ఆ = ఆ; ముని = మునులలో; ముఖ్యులు = శ్రేష్ఠులు; ఎఱిగి = తెలిసికొని.
భావము:- బ్రహ్మదేవుని కనుబొమ్మలనుండి “క్రోధం” , పెదవులనుండి, “లోభం” పుట్టింది; ముఖమునుండి “సరస్వతి”; పురుషాంగం నుండి “సముద్రాలు”; మలద్వారం నుండి పాపాశ్రయుడైన “నిరృతి”, నీడనుండి దేవహుతి భర్త యగు “కర్దముడు” జన్మించారు. అంత బ్రహ్మదేవుడు తన దేహం నుండి పుట్టిన సరస్వతిని చూసి ఆమె సౌందర్యానికి మోహపరవశుడు అయ్యాడు. మన్మథుని పుష్పబాణాలు ఆయన హృదయాన్ని భేదించాయి. కన్నకూతురు అనే సంకోచం లేకుండా పాపానికి వెనుకాడక వ్యామోహంతో ఆమె వెంటపడ్డాడు. తమ తండ్రి దుశ్చర్యను మరీచి మొదలుగాగల మునివర్యులకు తెలిసింది.

తెభా-3-379-వ.
ఇట్లనిరి.
టీక:- ఇట్లు = ఈవిధముగా; అనిరి = అనిరి.
భావము:- బ్రహ్మదేవుని దుశ్చర్యను మరీచి మొదలుగాగల మునివర్యులు తెలుసుకొని ఇలా అన్నారు.

తెభా-3-380-ఉ.
"చాలుఁ బురే సరోజభవ! త్పథవృత్తిఁ దొఱంగి కూఁతు ని
ట్లారి వై రమింప హృదయంబునఁ గోరుట ధర్మరీతియే
బేరి వైతి నీ తగవుఁ బెద్దతనంబును నేలపాలుగా
శీము వోవఁదట్టి యిటుసేసిన వారలు మున్ను గల్గిరే?

టీక:- చాలున్ = చాలును; పురే = ఔరా; సరోజభవ = బ్రహ్మదేవుడా {సరోజభవ - సరోజము (పద్మము)న పుట్టినవాడ}; సత్ = మంచి; పథ = మార్గమున; వృత్తిన్ = ప్రవర్తించుట నుండి; తొఱగి = తొలగి; కూతున్ = కూతురుని; ఇట్లు = ఈ విధముగా; ఆలరివి = దుశ్శీలుడవు; ఆ = అయి; రమింపన్ = కలవాలని; హృదయంబునన్ = మనసున; కోరుటన్ = ఆశించుట; ధర్మ = ధర్మమైన; రీతియే = పద్ధతా; బేలరివి = మోసకాడవు, వంచకుడవు; ఐతి = అయినావు; నీ = నీ యొక్క; తగవున్ = న్యాయము; పెద్దతనంబున్ = పెద్దతనమును; నేలపాలు = పనికిరాకపోవునట్లు {నేలపాలు - మట్టిలోకి పాలు (చెందునట్లు, కలియునట్లు)}; కాన్ = అయ్యేలా; శీలమున్ = శీలమును; పోవదట్టి = పోగొట్టుకొని; ఇటు = ఈ విధముగా; చేసిన = చేయు; వారలు = వారు; మున్ను = ఇంతకు ముందు; కల్గిరే = ఉన్నారా.
భావము:- “ఓ పద్మంలో పుట్టిన బ్రహ్మదేవుడా! చాలు చాలయ్యా. సన్మార్గాన్ని కాలదన్ని కన్నకూతురుపై కన్నేసి కలవాలని చూస్తున్నావు. ఇదెక్కడి ధర్మమయ్యా! ఎంతటి మోసగాడిని అయ్యావు. ఇంతటి పాపానికి ఒడిగట్టి, నీ న్యాయం, పెద్దరికం మట్టిపాలుచేసావు. నీ శీలం అంతా పోయింది. ఇలా చేసిన ఘనులు ఇంతకుముందు ఎప్పుడైనా ఉన్నారా.

తెభా-3-381-ఉ.
నీవు మహానుభావుఁడ వనింద్యచరిత్రుఁడ విట్టిచోట రా
జీభవుండు దా విధినిషేధము లాత్మ నెఱుంగఁ డయ్యె నీ
భాభవప్రసూన శర బాధితుఁ డై తన కూఁతుఁ బొందెఁబో
వావిదలంపలే కనుచు వారక లోకులు ప్రువ్వఁ దిట్టరే.

టీక:- నీవు = నీవు (చూస్తే); మహానుభావుడవు = గొప్పవాడవు; అనింద్య = నిందలులేని; చరిత్రుడవు = ప్రవర్తన కలవాడవు; ఇట్టి = ఇలాంటి; చోటన్ = తావులలో; రాజీవభవుండు = బ్రహ్మదేవుడు {రాజీవభవుడు - రాజీవము (ఎఱ్ఱకలువ) యందు భవ (పుట్టిన) వాడు, బ్రహ్మదేవుడు}; తాన్ = తను; విధి = చేయవలసినవి; నిషేధములున్ = చేయతగనివియును; ఆత్మన్ = తను; ఎఱుంగడు = తెలిసికొనలేనివాడు; అయ్యెన్ = అయ్యెను; ఈ = ఈ విధముగా; భావభవ = మదనుని {భావభవుడు - మన్మథభావములను భవుడు (కలిగించువాడు) మన్మథుడు}; ప్రసూన = పూల; శర = బాణములచే; బాధితుడు = బాధింబడినవాడు; ఐ = అయి; తన = తన యొక్క; కూతున్ = కూతురుని; పొందెబో = పొందెను సుమా; వావిన్ = బంధుత్వమును; తలంపన్ = తలచుకొన; లేక = లేక; అనుచున్ = అంటూ; వారక = తప్పక, అవశ్యము; లోకులు = ప్రజలు; ప్రువ్వదిట్టరే = ఆక్షేపించరా, ఎత్తిపొడవరా.
భావము:- నీవు మహానుభావుడవు. నిర్మల చరిత్ర కలవాడవు. కదా లోకులు వింటే ఏమనుకుంటారు? విధాత విధినిషేధాలు తెలియకుండా ప్రవర్తించాడనుకోరా? బ్రహ్మదేవుడు వావి వరుసలు వదలిపెట్టి మన్మథబాణాలకు లొంగిపోయి, కన్నబిడ్డనే కామించాడని చెడతిట్టరా?

తెభా-3-382-క.
పాము దలఁపక నిమిషము
లోలఁ జెడు సౌఖ్యమునకు లోనైతివె యిం
తే పో ధారుణిఁ గామా
న్ధోపి న పశ్యతి యనంగఁ దొల్లియు వినమే."

టీక:- పాపమున్ = పాపమును; తలపకన్ = ఆలోచింపక; నిమిషము = నిమేషపు సమయము; లోపలన్ = లోపలనే; చెడు = నశించిపోయే; సౌఖ్యమున్ = సౌఖ్యమున; కున్ = కు; లోను = లొంగి; ఐతివి = పోతివి; ఇంతే = ఇంతే; పో = సుమా; ధారుణిన్ = భూమిపైన; కామ = కామము వలన; అన్థః = గుడ్డివాడు; అపి = అయినవాడు; నపశ్యతి = చూడలేడు; అనంగన్ = అనగా; తొల్లియున్ = పూర్వం నుంచీ; వినమే = వినమా ఏమి.
భావము:- పాపకృత్యం అని అనుకోకుండా క్షణికమైన సౌఖ్యానికి ఈ నీచానికి పాల్పడ్డావు. కామాంధుడికి కళ్ళు కన్పించవు. అని లోకోక్తి ఉండనే ఉన్నది కదా.”

తెభా-3-383-మ.
ని యిబ్భంగి మునీంద్రు లాడిన కఠోరాలాపముల్ వీనుల
న్విని లజ్జావనతాననుం డగుచు నా నీరేజగర్భుండు స
య్య దేహంబు విసర్జనీయముగఁ జేయన్ దిక్కు లేతెంచి త
త్తనువుం గైకొనఁ బుట్టె దిక్కలితమై 'తామిస్ర నీహారముల్'.

టీక:- అని = అని; ఇబ్బంగి = ఈవిధముగా; ముని = మునులలో; ఇంద్రులు = శ్రేష్ఠులు; ఆడిన = పలికిన; కఠోర = కఠినములైన; ఆలాపములు = మాటలు; వీనులన్ = చెవులారా; విని = విని; లజ్జ = సిగ్గుతో; అవనత = దించుకొనిన; ఆననుండు = ముఖము కలవాడు; అగుచున్ = అవుతూ; నీరేజగర్భుండు = బ్రహ్మదేవుడు {నీరేజగర్భుడు - నీరేజము (పద్మము) నందు పుట్టిన వాడు, బ్రహ్మదేవుడు}; సయ్యన = శ్రీఘ్రమే, వెంటనే; దేహంబున్ = శరీరమును; విసర్జనీయముగన్ = విడిచిపెట్టినదిగా; చేయన్ = చేయగా; దిక్కులు = దిక్కులు; ఏతెంచి = వచ్చి; తత్ = ఆ; తనువున్ = శరీరమును; కైకొనన్ = స్వీకరింపగా; పుట్టెన్ = పుట్టెను; దిక్కు = దిక్కులు; కలితము = నిండినవి; ఐ = అయ్యి; తామిస్ర = చీకటి అను; నీహారముల్ = మంచుతెరలు.
భావము:- అని ఇలా మునీంద్రులు మందలించి పలికిన ములుగుల వంటి పలుకులు విని బ్రహ్మదేవుడు సిగ్గుతో తలవంచుకున్నాడు. వెంటనే తన శరీరాన్ని విడిచిపెట్టాడు. దిక్కులు వచ్చి ఆ శరీరాన్ని ఆక్రమించాయి. వెంటనే ఆ దిక్కులలో నుంచి చీకటి, మంచూ ఉద్భవించాయి.

తెభా-3-384-వ.
అంత.
టీక:- అంతన్ = అంతట.
భావము:- అంతట

తెభా-3-385-చ.
డుగక పంకజాతభవుఁ డొండొక దేహముఁ దాల్చి ధైర్యమున్
విడువక సృష్టి పూర్వసమవేతముగన్ సృజియించు నేర్పు దాఁ
బొమమి కాత్మలోనఁ దలపోయుచు నుండఁ జతుర్ముఖంబులన్
వెలె ననూన రూపముల వేదము లంచిత ధర్మ యుక్తితోన్.

టీక:- ఉడుగక = వదలక, అవశ్యము; పంకజాతభవుడు = బ్రహ్మదేవుడు {పంకజాతభవుడు - పంకజాతము (పద్మము) న పుట్టినవాడు, బ్రహ్మదేవుడు}; ఒండొక = ఇంకొక; దేహమున్ = శరీరమును; తాల్చి = ధరించి; ధైర్యమున్ = ధైర్యమును; విడువక = విడువక; సృష్టిన్ = సృష్టిని; పూర్వ = పూర్వము ఉన్న; సమవేతముగన్ = సమతూకముతో; సృజియించు = సృష్టించు; నేర్పున్ = నైపుణ్యమును; తాన్ = తనకు; పొడమమి = తట్టకపోవుటకు; ఆత్మ = తన; లోనన్ = లో; తలపోయుచున్ = స్మరిస్తూ; ఉండగన్ = ఉండగా; చతుః = నాలుగు (4); ముఖంబులన్ = ముఖములలోనుండి; వెడలెన్ = వెలువడెను; అనూన = సాటిలేని; రూపములన్ = రూపములతో; వేదముల్ = వేదములు; అంచిత = పూజనీయ మగు; ధర్మ = ధర్మముతో; యుక్తిన్ = కూడుకొనుట; తోన్ = తో.
భావము:- అటుమీద బ్రహ్మదేవుడు ధైర్యం వదలక, మరొక దేహాన్ని ధరించాడు. సృష్టికి పూర్వం సంప్రాప్తమైన సృజన శక్తి తనకు అప్పుడు లేకపోవడంతో అంతరంగంలో ఎంతగానో చింతిస్తూ ఉండిపోయాడు. అంతలో అతని ముఖంనుండి పరమధర్మ ప్రబోధాలైన వేదాలు పరిపూర్ణ స్వరూపాలతో ఆవిర్భవించాయి.

తెభా-3-386-తే.
ఱియు మఖములు మహితకర్మములుఁ దంత్ర
ములును నడవళ్లు నాశ్రమములుఁ దదీయ
ముఖచతుష్కము నందున పొడమె"ననిన
విని మునీంద్రునిఁ జూచి యవ్విదురుఁ డనియె.

టీక:- మఱియున్ = ఇంకనూ; మఖములు = యజ్ఞములు; మహిత = గొప్ప; కర్మములున్ = కర్మములు; తంత్రములున్ = తంతులు; నడవళ్ళున్ = ప్రవర్తనలు; ఆశ్రయములున్ = బ్రహ్మచర్యాది ఆశ్రమములును; తదీయ = అతని; ముఖ = ముఖములు; చతుష్కమున్ = నాలుగింటి (4); అందున్ = అందును; పొడమెన్ = పుట్టినవి; అనిన్ = అనగా; విని = విని; ముని = మునులలో; ఇంద్రునిన్ = శ్రేష్ఠుని; చూచి = చూసి; ఆ = ఆ; విదురుడు = విదురుడు; అనియెన్ = పలికెను.
భావము:- అంతేకాదు, యజ్ఞాలు, పుణ్య కృత్యాలు, తంత్రాలు సదాచారాలు, బ్రహ్మచర్యం మున్నగు చతురాశ్రమాలు, ఆయన నాలుగు మోములనుండి జన్మించాయి.” అని చెప్పగా విని విదురుడు మైత్రేయుణ్ణి చూసి ఇలా అన్నాడు.