పోతన తెలుగు భాగవతము/తృతీయ స్కంధము/విదుర మైత్రేయ సంవాదంబు


తెభా-3-181-వ.
ఇట్లు గనుంగొని యమ్మునీంద్రుని పాదంబులకుం బ్రణమిల్లి ముకుళిత హస్తుండై యిట్లనియె "మునీంద్రా! లోకంబున సకల జనంబులు మనంబుల ఘనంబులగు సౌఖ్యంబు లందందలంచి తత్ఫలప్రాప్తి హేతువులైన కర్మంబు లాచరించి దైవోపహతులై తత్కర్మంబులచేత నిష్ఫలారంభు లగుదురు; కర్మంబులు బంధకంబులును దుఃఖ హేతువులునుం గాని సౌఖ్యదాయకంబులై పాపనివృత్తిఁ జేయనోపవు; అదియట్లుండె; భూరి దుఃఖానుసారంబైన సంసారచక్రంబు నందుఁ బరిభ్రమించుచుం గామ విమోహితులై పూర్వకర్మానుగతంబులైన శరీరంబులుఁ దాల్చుచుం జచ్చుచు మరలం బుట్టుచు నెంతకాలంబునకుం బాపనివృత్తిఁ గానక మాతృయౌవనవనకుఠారులై జనియించి వర్తించు మూఢాత్ములం బశుప్రాయుల రక్షించుకొఱకుఁ గాదె నారాయణపరాయణులైన మీవంటి పుణ్యాత్ములు లోకంబునం జరియించుట; అదియునుంగాక.
టీక:- ఇట్లు = ఈ విధముగ; కనుంగొని = చూసి; ఆ = ఆ; మునీంద్రుని = మునీంద్రుని; పాదంబుల = కాళ్ళ; కున్ = కు; ప్రణమిల్లి = నమస్కరించి; ముకుళిత = జోడించిన; హస్తుండు = చేతులు కలవాడు; ఐ = అయి; ఇట్లు = ఈ విధముగ; అనియెన్ = పలికెను; ముని = మునులలో; ఇంద్రా = ఇంద్రుడా; లోకంబునన్ = ప్రపంచములో; సకల = సమస్తమైన; జనంబులున్ = జనులు; మనంబులన్ = మనసులలో; ఘనంబులు = గొప్పవి; అగు = అయిన; సౌఖ్యంబులన్ = సుఖములు; అందన్ = పొంద; తలంచి = కోరి; తత్ = ఆ; ఫల = ఫలితములు; ప్రాప్తి = పొందిన; హేతువులు = కారణములు; ఐన = అయినట్టి; కర్మంబులు = కర్మలు; ఆచరించి = చేసి; దైవోపహతులు = నష్టజాతకులు {దైవోపహతులు - దైవముచే దెబ్బతిన్నవారు, నష్టజాతకులు}; ఐ = అయి; తత్ = ఆ; కర్మంబులన్ = కర్మముల; చేతన్ = చేత; నిష్ఫల = ఫలితములేని; ఆరంభులు = ప్రయత్నములు కలవారు; అగుదురు = అవుతారు; కర్మంబులు = కర్మములు; బంధకములును = బంధించునవియును; దుఃఖ = దుఃఖమునకు; హేతువులునున్ = కారణములును; కాని = కాని; సౌఖ్యదాయకంబులు = సౌఖ్యమును ఇచ్చునవి; ఐ = అయి; పాప = పాపములను; నివృత్తిన్ = పోగొట్టుకొనుటను; చేయన్ = చేయుటకు; ఓపవు = సమర్థంబులు కావు; అది = అది; అట్లు = ఆ విధముగ; ఉండె = ఉండెను; భూరి = అతిమిక్కిలి; దుఃఖ = దుఃఖమును; అనుసారంబు = అనుసరించునది; ఐన = అయిన; సంసార = సంసారము అను; చక్రంబున్ = చక్రము; అందున్ = లో; పరిభ్రమించుచు = తిరుగుతూ; కామ = కోరికలచే; విమోహితులు = మోహింపబడినవారు; ఐ = అయి; పూర్వ = పూర్వముచేసిన; కర్మ = కర్మముల; అనుగతంబులు = అనుసరించునవి; ఐన = అయినట్టి; శరీరంబులు = దేహములను; తాల్చుచున్ = ధరిస్తూ, జన్మిస్తు; చచ్చుచున్ = మరణిస్తూ; మరలన్ = మళ్ళా; పుట్టుచున్ = పుడుతూ; ఎంత = ఎంత; కాలంబున = కాలమున; కున్ = కు; పాప = పాపములను; నివృత్తిన్ = పోగొట్టుకొనుటను; కానక = చూడలేక; మాతృ = తల్లి; యౌవన = యౌవనమునకు; కుఠారులు = గొడ్డలిపెట్టులాంటి వారు; ఐ = అయి; జనియించి = పుట్టి; వర్తించు = తిరుగు; మూఢ = అవివేకపు; ఆత్ములన్ = బుద్ధి కలవారిని; పశు = పశువులతో; ప్రాయులన్ = సమానులను; రక్షించు = కాపాడుట; కొఱకున్ = కోసము; కాదె = కాదా; నారాయణ = నారాయణునందు; పరాయణులు = నిష్ఠ కలవారు; ఐన = అయినట్టి; మీ = మీ; వంటి = లాంటి; పుణ్యాత్ములు = పుణ్యులు; లోకంబునన్ = లోకములను; చరియించుట = తిరుగుచుండుట; అదియునున్ = అంతే; కాక = కాకుండ.
భావము:- విదురుడు మైత్రేయుని పాదాలకు నమస్కారం చేసి, చేతులు జోడించి ఇలా అన్నాడు. “మునీంద్రా! లోకు లంతా తమతమ మనస్సులలో ఎల్లప్పుడూ సుఖాన్నే కోరుకుంటారు. దానిని పొందడానికై ఎన్నో కర్మలు చేస్తారు. దైవం అనుకూలించక పోవడంతో తమ ప్రయత్నాలన్నీ వ్యర్థమైపోయి వాటి ఫలాన్ని అందుకోలేక పోతున్నారు. ఈ కర్మలన్నీ ప్రతిబంధకాలు, అంతేగాక దుఃఖాలకు కారణమైన సంసారం అనే చక్రంలో తగులుకొని గిరగిర తిరుగుతూ ఉంటారు. కోరికల వ్యామోహంలో చిక్కి పూర్వం తాము చేసిన కర్మఫలాలకు తగినట్టి శరీరాలను పొందుతూ ఉంటారు. ఇలా చస్తూ, పుడుతూ ఎంతో కాలానికి గాని పాపాన్ని పోగొట్టుకునే మార్గం తెలుసుకోలేరు. తల్లి యౌవనానికి గొడ్డలిపెట్టు లాంటివారై పుట్టిన ఇట్టి పశుప్రాయులైన బుద్ధిహీనులను ఉద్ధరించడానికి గదా తమ వంటి పుణ్యాత్ములు శ్రీమన్నారాయణ సేవాపరాయణులై లోకంలో తిరిగుతూ ఉంటారు.

తెభా-3-182-మ.
వివేకానుగతస్వకార్యజలవేలాకీర్ణమై మిత్రబం
ధుధూపుత్రజలగ్రహోగ్రయుతమై దుర్దాంతసంసార దు
ర్భపాథోధిఁ దరించువారె? హరిసంబంధక్రియాలోల భా
తానుగ్రహనావ లేని యధముల్ కారుణ్యసంధాయకా!

టీక:- అవివేక = అవివేకమును; అనుగత = వెంటాడు; స్వ = తమ; కార్య = పూర్వకర్మములు అను; జలవేలాకీర్ణము = సముద్రము {జలవేలాకీర్ణము - జలముతో తీరంవరకు ఎడములేక నిండియున్నది, సముద్రము}; ఐ = అయి; మిత్ర = మిత్రులు; బంధు = బంధువులు; వధూ = భార్యలు; పుత్ర = పుత్రులు అను; జలగ్రహ = జలగలతో, జలపిశాచములతో; ఉదగ్రము = భయంకరమైనది; ఐ = అయి; దుర్దాంత = అణచలేని; సంసార = సంసారము అను; దుర్భవ = భరించలేని; పాథోధిన్ = సముద్రమున; తరించువారె = దాటువారా ఏమి, దాటువారు కాదు; హరి = విష్ణువునకు; సంబంధ = సంబంధించిన; క్రియా = కర్మలలో; ఆలోల = వర్తించునదియైన; భాగవత = భగవంతుని; అనుగ్రహ = అనుగ్రహము అను; నావ = పడవ; లేని = లోనట్టి; అధముల్ = హీనులు; కారుణ్య = దయతో; సంధాయకా = కూడినవాడా.
భావము:- ఓ కరుణామయా! భగవత్కార్య నిర్వాహకులై సదా భగవంతుని యందే ఆసక్తులైన దైవభక్తుల అనుగ్రహం అనే నావ లేకుండా ఈ సంసార సముద్రాన్ని దాటటానికి ప్రయత్నించడం పరమ మూర్ఖత్వం. భయంకరమైన ఈ సంసార సాగరానికి అవివేకమే జలం. స్వార్థ పరతత్వమే గట్టు (చెలియలి కట్ట). మిత్రులూ, బంధువులూ, భార్యాపుత్రులే జలచరాలు. ఇది దురంతమైనది.

తెభా-3-183-క.
మునినాథచంద్ర! ననుఁ గై
కొని కాచు తలంపు బుద్ధిఁ గూడిన యేనిన్
వినుము; మదీప్సిత మది నా
నువునఁ గావింపవయ్య! జ్జనతిలకా! "

టీక:- ముని = మునులలో; నాథ = నాయకులలో; చంద్రా = శ్రేష్ఠుడా; ననున్ = నన్ను; కైకొని = గ్రహించి; కాచు = కాపాడే; తలంపు = భావము; బుద్ధిన్ = మనసున; కూడిన = కలిగినది; ఏనిన్ = అయినట్లైతే; వినుము = విను; మత్ = నా యొక్క; ఈప్సితమున్ = కోరికను; అదిన్ = దానిని; నా = నా యందలి; చనవునన్ = అనురాగముతో; కావింపుము = చేయుము; అయ్య = తండ్రి; సత్ = మంచి; జన = జనులలో; తిలకా = శ్రేష్ఠుడా.
భావము:- సౌజన్యసాంద్రుడవైన ఓ మునిచంద్రా! నన్ను మన్నించి రక్షించే ఉద్దేశం నీకు ఉన్నట్లయితే, నా విన్నపం ఆలకించు. నా మనస్సులోని కోరిక తీర్చు.”

తెభా-3-184-వ.
అని వెండియు విదురుండు మైత్రేయుం జూచి "మునీంద్రా! త్రిగుణాత్మక మాయానియంత యగు భగవంతుండు స్వతంత్రుం డయ్యు నవతరించి యేయే యవతారంబుల నేయే కర్మంబు లాచరించె? అదియు నిష్క్రియుం డగు నీశుండు మొదలం బ్రపంచంబు నేవిధంబునం గల్పించె? ఏ పగిదిం బాలించె? మఱియు నీ విశ్వంబు నాత్మీయ హృదయాకాశగతముం జేసి నివృత్తవృత్తి యగుచు యోగమాయ యం దెట్లు వసియించె? బ్రహ్మాదిరూపంబులం బొంది బహుప్రకారంబుల నెట్లు క్రీడించె? భూసుర గోసురాదులఁ బరిరక్షించుటకై మత్స్యాద్యవతారంబులు ధరియించి యేయే ప్రయోజనంబులం దీర్చె? పయోరుహగర్భాండకటాహాంతర్గతంబులై లోకపాలసహితంబులైన లోకంబులను, లోకాలోకపర్వతంబులను, బహిర్భాగంబులను నేయే తత్త్వభేదంబుల మున్నేత్తఱంగున బుట్టించె? అందుఁ బ్రతీతంబగు జీవకోటి యెవ్వనిం గొల్చి బ్రతుకు? జనులకుఁ గర్మనామరూపభేదంబు లెట్లు నిర్దేశించె? నింతయు సవిస్తారంబుగా వివరింపుము; ఉత్తమశ్లోకమౌళిమండనుండును యోగీశ్వరేశ్వరుండును నైన పుండరీకాక్షుని చరిత్రశ్రవణంబునం గాని జన్మమరణాది సకలదుఃఖకరంబులును దుష్కర్మప్రాప్తంబులును నగు భవబంధంబులు దెగవు;"అని వెండియు నిట్లనియె.
టీక:- అని = అని; వెండియున్ = తరువాత; విదురుండు = విదురుడు; మైత్రేయున్ = మైత్రేయుని; చూచి = చూసి; ముని = మునులలో; ఇంద్రా = శ్రేష్ఠుడా; త్రిగుణ = త్రిగుణములతో {త్రిగుణములు - సత్త్వాది, సత్త్వరజస్తమో గుణములు}; ఆత్మక = కూడిన; మాయా = మాయను; నియంత = నియమించువాడు; అగు = అయిన; భగవంతుండు = భగవంతుండు {భగవంతుడు - మహిమ కలవాడు, ప్రభుత్వము కలవాడు, విష్ణువు}; స్వతంత్రుడు = సర్వస్వతంత్రుడు; అయ్యున్ = అయినప్పటికిని; అవతరించి = అవతారములను ధరించి; ఏఏ = ఏ ఏ; అవతారంబులన్ = అవతారములలో; ఏఏ = ఏ ఏ; కర్మంబులు = కర్మములు; ఆచరించె = ఆచరించెను; అదియున్ = అదియును; నిష్క్రియుండు = కర్మములు లేనివాడు; అగు = అయిన; ఈశుండు = భగవంతుడు {ఈశుడు - ప్రభుత్వము కలవాడు, విష్ణువు}; మొదలన్ = ప్రారంభములో; ప్రపంచంబు = ప్రపంచమును; ఏ = ఏ; విధంబునన్ = విధముగ; కల్పించెన్ = సృష్టించెను; ఏ = ఏ; పగిదిన్ = విధముగ; పాలించెన్ = పాలించెను; మఱియున్ = ఇంకను; ఈ = ఈ; విశ్వంబున్ = విశ్వమును; ఆత్మీయ = తన యొక్క; హృదయ = హృదయములోని; ఆకాశ = ఆకాశమున; గతమున్ = ఇమిడినదానిని; చేసి = చేసి; నివృత్త = పోగొట్టుకొనిన; వృత్తిన్ = ప్రవర్తన కలవాడు; అగుచున్ = అవుతూ; యోగ = యోగము యొక్క; మాయన్ = మాయ; అందున్ = లో; ఎట్లు = ఏ విధముగ; వసియించెన్ = ఉండెను; బ్రహ్మ = బ్రహ్మదేవుడు; ఆది = మొదలగు; రూపంబులన్ = రూపములను; పొంది = పొంది; బహు = అనేకమైన; ప్రకారంబులన్ = విధములుగ; ఎట్లు = ఏ విధముగ; క్రీడించెన్ = క్రీడించెను; భూసుర = బ్రాహ్మణులు {భూసురులు - భూమికి దేవతలు, బ్రాహ్మణులు}; గో = ఆవులను; సుర = దేవతలు {సురలు - సురాపానము చేయువారు, దేవతలు}; ఆదులన్ = మొదలగువారిని; పరి = చక్కగా; రక్షించుట = కాపాడుట; కై = కోసము; మత్స్య = మత్స్యావతారము; ఆది = మొదలగు; అవతారంబులున్ = అవతారంబులను; ధరియించి = అవతరించి; ఏఏ = ఏ ఏ; ప్రయోజనంబులన్ = ప్రయోజనములను; తీర్చెన్ = సాధించెను; పయోరుహగర్భాండ = బ్రహ్మాండముల {పయోరుహగర్భాండము - పయస్ (నీటి)లో ఇరుహ (పుట్టునది) (పద్మము)న గర్భ (పుట్టినవాని) (బ్రహ్మ) అండము, బ్రహ్మాండము}; కటాహ = కప్పు; అంతర్గతంబులు = లోపల ఉండు; ఐ = అయి; లోక = లోకములను; పాల = పాలించువారితో; సహితంబులు = కూడినవి; ఐన = అయిన; లోకంబులను = లోకములను; లోక = కనిపించునవి; అలోక = కనిపించక ఉండునవి; పర్వతంబులును = మొత్తము అన్నీ; బహిర్ = బయట; అంతర = లోపలి; భాగంబులను = పక్కలను; ఏయే = ఏ ఏ; తత్త్వ = తత్త్వములలోని; భేదంబులన్ = తేడాలను; మున్ను = పూర్వము; ఏ = ఏ; తెఱంగునన్ = విధముగ; పుట్టించెన్ = పుట్టించెను; అందున్ = అందులో; ప్రతీతంబు = ప్రసిద్ధికెక్కినవి; అగు = అయిన; జీవ = ప్రాణి; కోటి = సమస్తమును; ఎవ్వనిన్ = ఎవని; కొల్చి = పూజించి; బ్రతుకు = జీవించును; జనులకున్ = జనులకు; కర్మ = కర్మములు; నామ = పేర్లు; రూప = రూపముల; భేదంబులు = భేదములను; ఎట్లు = ఏవిధముగ; నిర్దేశించెన్ = నియోగించెను, ఏర్పాటు చేసెను; ఇంతయున్ = ఇది అంతయు; సవిస్తారంబుగన్ = వివరముగా; వివరింపుము = తెలుపుము; ఉత్తమ = ఉత్తమమైన; శ్లోక = కీర్తింపబడువారి; మౌళి = శిరస్సులుచే; మండనుండును = అలంకరిపబడిన పాదములు కలవాడును; యోగి = యోగులలో; ఈశ్వర = శ్రేష్ఠులకు; ఈశ్వరుండును = ప్రభువు; ఐన = అయిన; పుండరీకాక్షుని = విష్ణుని {పుండరీకాక్షుడు - పుండరీకము (పద్మము)ల వంటి కన్నులు కలవాడు, విష్ణువు}; చరిత్ర = కథలు; శ్రవణంబునన్ = వినుటవలన; కాని = కాని; జన్మ = పుట్టుట; మరణ = చావు; ఆది = మొదలైన; సకల = సమస్తమైన; దుఃఖ = దుఃఖమును; కరంబులును = కలిగించునవియును; దుష్కర్మ = చెడు కర్మముల వలన; ప్రాప్తంబులును = పొందబడినవియును; అగు = అయిన; భవ = సంసార; బంధంబులు = బంధనములు; తెగవు = తెగవు; అని = అని; వెండియున్ = మరల; ఇట్లు = ఈవిధముగ; అనియెన్ = పలికెను;
భావము:- అని మళ్లీ విదురుడు మైత్రేయుణ్ణి చూచి అన్నాడు “ఋషీశ్వరా! సత్త్వము, రజస్సు, తమస్సు అనే మూడు గుణాలతో కూడిన మాకు నియామకుడైన భగవంతుడు సర్వస్వతంత్రుడు. అటువంటివాడు ఎందుకు అవతారా లెత్తాడు? ఏ యే సత్కార్యాలు సాధించాడు? మళ్లీ ఈ విశ్వాన్ని తన హృదయాకాశంలో ఎలా విలీనం చేసుకున్నాడు? ఏ వ్యాపారాలూ లేనివాడు ఏ విధంగా యోగమాయలో ఉన్నాడు? తను సృష్టించిన బ్రహ్మాండంలో ఎట్లా సంచరించాడు? బ్రహ్మ, విష్ణు, మహేశ్వరాది రూపాలు పొంది, ఎట్లా అనేక విధాలుగా విహరించాడు? బ్రహ్మణులనూ, గోవులనూ, దేవతలనూ రక్షించడానికై మత్స్యావతారం మొదలైన అవతారా లెత్తి ఏ యో ప్రయోజనాలు నెరవేర్చాడు? బ్రహ్మాండభాండం లోపల ఉన్న దిక్పాలకులతో కూడిన లోకాలనూ, లోకాలోక పర్వతం బయటి భాగాలను ఏయే తత్త్వ భేదాలతో ఏ విధంగా పుట్టించాడు? ఆ సృష్టిలో నివసించే జీవకోటి ఎవ్వని సేవించి జీవిస్తూ ఉంటుంది? జీవులకు కర్మ, నామ, రూప భేదాలు ఎట్లా నిర్ణయింపబడినాయి? ఇదంతా నాకు చక్కగా వివరంగా చెప్పు. పుణ్యమూర్తులకు శిరోభూషణమై యోగేశ్వరులకు అధీశ్వరుడైన శ్రీమన్నారాయణుని పవిత్ర చరిత్ర వింటేనే కాని జననమరణాది సకల దుఃఖాలకూ, సమస్త దుష్కార్యాలకూ అనుబంధాలైన ఈ సంసార బంధాలు తెగవు” అని మళ్లీ ఇట్లా అన్నాడు.

తెభా-3-185-త.
"తమున్ సరసీరుహోదరత్కథామృతపూరమున్
శ్రుతిపుటాంజలిచేత నిమ్ముల జుఱ్ఱియుం దనివోదు భా
కథామిష మూని విష్ణుఁ బరాశరప్రియసూతి స
న్మతి నుతించిన చోట సన్మునినాథ! నామది నుబ్బుదున్.

టీక:- సతతమున్ = ఎల్లప్పుడును; సరసీరుహోదర = కృష్ణుని {సరసీరుహోదరుడు - పద్మము (సరసున పుట్టునది) ఉదరమున కలవాడు, విష్ణువు}; సత్ = మంచి; కథా = కథలు అను; అమృత = అమృతముతో; పూరమున్ = నిండిన; శ్రుతిపుట = చెవిడొప్పలు అను; అంజలి = దోసిళ్ళు; చేతన్ = చేత; ఇమ్ములన్ = విస్తారముగ; జుఱ్ఱియున్ = గ్రోలియు; తనివోదు = తృప్తితీరదు; భారత = భారతము అను; కథా = కథ అను; మిషము = వంకతో; ఊని = పూని; విష్ణున్ = విష్ణువును; పరాశరప్రియసూతి = వేదవ్యాసుడు {పరాశరప్రియసూతి - పరాశరుని ప్రియమైన సంతానము, వ్యాసుడు}; సత్ = మంచి; మతిన్ = బుద్ధితో; నుతించిన = స్తోత్రముచేసిన; చోట = చోట; సత్ = మంచి; ముని = మునులలో; నాథ = శ్రేష్ఠుడా; నా = నా యొక్క; మదిన్ = మనసున; ఉబ్బుదున్ = సంతోషించెదను.
భావము:- “ఓ మునీంద్రా! శ్రీమన్నారాయణుని సత్కథలనే అమృతాన్ని చెవులనే దోసిళ్ళతో ఎంతగా జుఱ్ఱుకొన్నా తనివి తీరదు. భరతవంశీయుల చరిత్ర ఐన భారతంలో కూడా సందర్భానుసారంగా వ్యాసులవారు ఎక్కడైతే శ్రీమహావిష్ణువును నుతించారో అక్కడ నామనస్సు ఎంతో ఉబ్బి తబ్బిబ్బైపోతుంది.

తెభా-3-186-క.
ర కథావర్ణనముల
తి హేయత నొందె జిత్త నఘాత్మ! రమా
తి చరితామృతరతి సం
సృతివేదన లెల్లఁ బాయఁజేయు మునీంద్రా!

టీక:- ఇతర = ఇతరమైన; కథా = కథలను; వర్ణనములన్ = వర్ణించునప్పుడు; అతి = మిక్కిలి; హేయతన్ = అసహ్యమును; ఒందెన్ = పొందెను; జిత్తము = మనస్సు; అనఘాత్మ = పుణ్యాత్మా {అనఘాత్ముడు - అనఘములు (పాపములు కానివి)తో నిండి ఉన్నవాడు}; రమాపతి = కృష్ణుని {రమాపతి - రమ (లక్ష్మీదేవి) భర్త, విష్ణువు}; చరిత = వర్తనములు అను; అమృత = అమృతముపై; రతి = ప్రీతి ద్వారా; సంసృతి = సంసార; వేదన = బాధలు; ఎల్లన్ = అన్నిటిని; పాయన్ = పొవునట్లు; చేయున్ = చేయును; ముని = మునులలో; ఇంద్రా = శ్రేష్ఠుడా.
భావము:- ఓ పుణ్యాత్ముడా! ఇతర కథలు విని విని నా మనస్సుకు చాల వెగటు కలిగింది, ఓ మునినాథా! రమానాథుడైన శ్రీమన్నారాయుణుని కథాసుధాపూరాన్ని తనివితీరా సేవించడం వల్లనే సంసార బాధలు దూరంగా తొలగిపోతాయి.

తెభా-3-187-తే.
భూరివిజ్ఞాననిధు లగు నాదాది
నిర్మలాత్ముల కయిన వర్ణింపరాని
రికథామృతపానంబు నందు విసివి
యొల్ల ననువాఁడె పో వెఱ్ఱిగొల్లఁ డనఁగ.

టీక:- భూరి = అత్యధికమైన; విజ్ఞాన = విజ్ఞానమునకు; నిధులు = నిధివంటివారు; అగు = అయిన; నారద = నారదుడు; ఆది = మొదలగు; నిర్మల = విమలమైన; ఆత్ముల = ఆత్మ కలవారి; కిన్ = కి; అయినన్ = అయినప్పటికిని; వర్ణింపన్ = వర్ణించుటకు; రాని = సామర్థ్యము సరిపోని; హరి = హరి యొక్క; కథా = కథలు అను; అమృత = అమృతమును; పానంబున్ = తాగుట; అందున్ = అందు; విసివి = విసుగువచ్చి; ఒల్లన్ = ఇంకొద్దు; అనువాడె = అనేవాడే; పో = నిశ్చయముగ; వెఱ్ఱిగొల్లడు = తెలివితక్కువవాడు; అనగ = అంటే (వాడే).
భావము:- ఓ పుణ్య పురుషా! విశేషమైన విజ్ఞానానికి నిధి వంటి వారు నారదాది మహానీయులు. అటువంటి నిర్మల హృదయులకు కూడా వర్ణింప శక్యము కానివి విష్ణుకథలు. అటువంటి హరికథాసుధారసాన్ని త్రాగి విసుగుచెంది ఇక వద్దు అనేవాడే పనికిమాలిన మొద్దు.

తెభా-3-188-వ.
అదియునుంగాక.
టీక:- అదియునున్ = అంతే; కాక = కాకుండగ.
భావము:- అంతేకాకుండా.

తెభా-3-189-సీ.
రవిందనాభుని పరావతారమై-
నన మందిన పరారసుతుండు
తురవర్ణాశ్రమాచారధర్మంబులు-
వణింప లోకవిడంబనంబు
గు గ్రామ్యకథలు పెక్కర్థిఁ గల్పించుచు-
రికథావర్ణనమందులోన
నించుకించుకగాని యేర్పడఁ జెప్పమి-
నంచిత విజ్ఞాన మాత్మ నిలువ

తెభా-3-189.1-తే.
కున్నఁ జింతించి మఱి నారదోపదిష్టుఁ
గుచు హరివర్ణనామృత మాత్మఁ గ్రోలి
విమలసుజ్ఞాననిధి యన వినుతికెక్కి
న్యుఁ డయ్యెను లోకైకమాన్యుఁ డగుచు.

టీక:- అరవిందనాభుని = విష్ణుని {అరవిందనాభుడు - పద్మము బొడ్డున కలవాడు, విష్ణువు}; అపర = స్వంత, పరులది కాని; అవతారము = అవతారము; ఐ = అయ్యి; జననము = పుట్టుక; అందిన = పొందిన; పరాశరసుతుండు = వ్యాసుడు {పరాశరసుతుడు - పరాశరుని పుత్రుడు, వేదవ్యాసుడు}; చతుర = నాలుగు; వర్ణ = వర్ణముల {చతుర్వర్ణములు - బ్రాహ్మణ క్షత్రియ వైశ్య శూద్ర వర్ణములు}; ఆచార = ఆచారముల {చతురాశ్రమములు - బ్రహ్మచర్య గృహస్థ వానప్రస్త సన్యాస ఆశ్రమములు}; ధర్మంబులున్ = ధర్మములను; ఠవణింపన్ = ప్రవర్తింపజేయుటకు; లోక = లోకమున; విడంబనములు = అనుసరించునవి; అగు = అయిన; గ్రామ్య = పామర; కథలు = కథలు; పెక్కు = మిక్కిలి; అర్థిన్ = కుతూహలమును; కల్పించుచు = ఏర్పరచుచు; హరి = విష్ణుని; కథా = కథల; వర్ణనము = వర్ణించుటలు; అందులోనన్ = అందులో; ఇంచుక = కొంచెమే; కాని = తప్ప; ఏర్పడన్ = ఏర్పడునట్లు; చెప్పమి = చెప్పకపోవుటచేత; అంచిత = పూజనీయమైన; విజ్ఞానము = విజ్ఞానము; ఆత్మన్ = మనసులో; నిలువక = నిలబడక; ఉన్న = ఉండగా;షవీ చింతించి = బాధపడి; మఱి = మరల; నారద = నారదునిచే; ఉపదిష్టుడు = ఉపదేశింపబడినవాడ; అగుచున్ = అవుతూ; హరి = హరిని; వర్ణన = వర్ణించుట అను; అమృతము = అమృతము; ఆత్మన్ = మనసున; గ్రోలి = ఆస్వాదించి; విమల = నిర్మలమైన; సు = మంచి; జ్ఞాన = జ్ఞానమునకు; నిధి = నిధి; అనన్ = అని; వినుతి = ప్రఖ్యాతి; కిన్ = కి; ఎక్కి = చెంది; ధన్యుడు = ధన్యమైనవాడు; అయ్యెను = అయ్యెను; లోక = లోకమున; ఏక = ముఖ్యమైన; మాన్యుడు = గౌరవిందగినవాడు; అగుచున్ = అవుతూ.
భావము:- అంతేకాకుండా శ్రీమన్నారాయణుని అవతారమైన వ్యాసుడు నాలుగు వర్ణాల, నాలుగు ఆశ్రమాల ఆచార ధర్మాలను, లోకానికి చాటి చెప్పదలచినవాడై పురాణాలలో పామర కథలు ఎన్నెన్నో కల్పించవలసి వచ్చింది. అందువల్ల ఆ గ్రంథాలలో హరికథలను అక్కడక్కడా కొంచెం కొంచెంగా మాత్రమే అభివర్ణించాడు. భగవద్విజ్ఞానాన్ని ఆత్మగతం చేసుకోలేనందుకు ఎంతో చింతించాడు. చివరకు నారదమహర్షి ఉపదేశంతో నారాయణ కథాసుధాపూరాన్ని తనివితీరా త్రాగి ధన్యుడై, సుధీజనులచే స్తుతింపబడిన వాడై, సకలలోక సమ్మాన్యుడైనాడు.

తెభా-3-190-వ.
కావున.
టీక:- కావున = అందుచేత.
భావము:- కనుక

తెభా-3-191-క.
సిరుహోదరు మంగళ
రితామృత మాత్మఁ గ్రోలు నుఁ డితర కథా
ళముఁ గ్రోలునె హరిసం
స్మణము జీవులకు నఖిల సౌఖ్యద మనఘా!

టీక:- సరసీరుహోదరు = విష్ణుని {సరసీరుహోదరుడు - పద్మము (సరసున పుట్టినది) బొడ్డున కలవాడు, విష్ణువు}; మంగళ = శుభకరమైన; చరితము = కథలు అను; అమృతమున్ = అమృతము; ఆత్మన్ = మనస్ఫూర్తిగా; క్రోలు = ఆస్వాదించు; జనుడు = మానవుడు; ఇతర = ఇతరుల; కథా = కథలు అను; గరళమున్ = విషమును; క్రోలునే = ఆస్వాదించునా ఏమి; హరి = హరిని; సంస్మరణము = ధ్యానించుట; జీవులకున్ = ప్రాణులకు; అఖిల = మిక్కిలి; సౌఖ్యదము = సుఖమును ఇచ్చునది; అనఘా = పుణ్యుడా.
భావము:- కాబట్టి ఓ పుణ్యాత్ముడా! విశ్వకల్యాణకరమైన విష్ణుదేవుని చరితామృతాన్ని స్వేచ్ఛగా సేవించే మానవునికి మరో కథలు విషంతో సమానం. శ్రీమన్నారాయణ ధ్యానం సకల జీవులకూ సమస్త సౌఖ్యనిధానం.

తెభా-3-192-క.
శ్రీనితాధిప నామక
థావిముఖుల కిహముఁ బరము వ్వై పిదపం
బోవుదురు నరకమునకున్
వావిరి నే వారిఁ జూచి గతు మునీంద్రా!

టీక:- శ్రీవనితాధిప = విష్ణుని {శ్రీవనితాధిపుడు - లక్ష్మీ ( శ్రీవనిత) పతి (అధిపుడు), విష్ణువు}; నామ = నామముల; కథా = కథల యందు; విముఖుల = అయిష్టుల; కున్ = కి; ఇహమున్ = ఇహము; పరము = పరము; దవ్వు = దూరము; ఐ = అయి; పిదపన్ = తరువాత; పోవుదురు = పోతారు; నరకమున = నరకమున; కున్ = కు; వావిరి = అధికముగ; నేన్ = నేను; వారిన్ = వారిని; చూచి = చూసి; వగతున్ = బాధపడుదును; ముని = మునులలో; ఇంద్రా = శ్రేష్ఠుడా.
భావము:- ఓ మునీంద్రుడా! శ్రీమన్నారాయణుని నామస్మరణానికీ, కథాశ్రవణానికి విముఖులైన వారు ఈ లోకానికీ, పరలోకానికీ-రెంటికి కాకుండా చెడతారు. నరకంలో పడతారు. అట్లాంటి వాళ్ళను చూచి నేను ఎంతగానో బాధపడతాను.

తెభా-3-193-క.
రుఁడే నొక నిమిషం
బై వృథావాదగతిని రిపదకమల
ధ్యానానందుఁడు గాడే
నా రునకు నాయు వల్ప గు మునినాథా!

టీక:- ఏ = ఏ; నరుడు = మానవుడు; ఏని = అయినను; ఒక = ఒక్క; నిమిషంబు = నిమిషము; ఐనన్ = అయినను; వృథా = పనికిరాని; వాద = వాదనల; గతిన్ = ప్రవేశించి, పడి; హరి = విష్ణుని; పద = పాదములు అను; కమల = పద్మముల; ధ్యాన = ధ్యానము చేయుట యందు; ఆనందుడు = ఆనందము పొందువాడు; కాడే = కాడో; ఆ = ఆ; నరునన్ = మానవున; కున్ = కు; ఆయువు = (అంత) ఆయువు; అల్పము = తక్కువ; అగును = అవుతుంది; ముని = మునులలో; నాథా = శ్రేష్ఠుడా.
భావము:- ఓ మునిశ్రేష్ఠా! పనికిమాలిన వాదాలలో పడి కనీసం ఒక్క నిముషమైన హరిపాదపద్మాలను స్మరించి ఆనందించకుండా ఉండేవాడు ఎవడైనా సరే వాడి ఆయుస్సు అల్పమైపోతుంది.

తెభా-3-194-చ.
మృదుగతిఁ బువ్వుదేనియ రమించుచుఁ బానముసేయఁ బాఱు ష
ట్పమునుఁ బోలి యార్తజనబాంధవు విశ్వభవస్థితివ్యయా
స్పమహితావతారుఁ డగు పంకరుహోదరు నిత్యమంగళ
ప్రగుణకీర్తనామృతముఁ బాయకఁ గ్రోలెదఁ జెప్పవే దయన్."

టీక:- మృదు = సున్నితమైన; గతిన్ = విధముగ; పువ్వు = పువ్వుల యొక్క; తేనియన్ = తేనెని; రమించుచున్ = క్రీడించుతూ; పానము = తాగుట; సేయన్ = చేయుచు; పాఱు = తిరుగు; షట్పదమునున్ = తుమ్మెదను; పోలి = వలె; ఆర్తజనబాంధవు = కృష్ణుని {ఆర్తజనబాంధవు -ఆర్తి (బాధలనుండి విముక్తికై ప్రాధేయపడుట) కల జనులకు బంధువు, విష్ణువు}; విశ్వభవస్థితివ్యయాస్పదమహితావతారుఁడు = కృష్ణుని {విశ్వభవస్థితివ్యయాస్పదమహితావతారుఁడు - విశ్వము యొక్క పుట్టుక మనుగడ అంతములు అను కార్యములు చేయు గొప్ప అవతారములు కలవాడు, విష్ణువు}; అగు = అయిన; పంకరుహోదరు = కృష్ణుని {పంకరుహోదరుడు - పద్మము ఉదరమున కలవాడు, విష్ణువు}; నిత్య = నిత్యమైన; మంగళ = శుభములను; ప్రద = ఇచ్చు; గుణ = గుణములను; కీర్తన = కీర్తించుట అను; అమృతమున్ = అమృతము; పాయక = విడువక; క్రోలెదన్ = తాగెదను; చెప్పవే = చెప్పుము; దయన్ = దయతో.
భావము:- ఆపన్నులకు ఆప్తబాంధవుడూ, విశ్వానికి సంబంధించిన సృష్టికి స్థితి లయాలకు కారణభూతుడూ, అవతారపురుషుడూ, అయిన శ్రీమన్నారాయణుని కల్యాణగుణ సంకీర్తనం అనే అమృతాన్ని, మృదుమధురంగా పువ్వులలోని తేనెను గ్రోలే తుమ్మెదవలె నేను తనివి తీరా త్రాగుతాను. దయచేసి చెప్పుస్వామి.”

తెభా-3-195-క.
ని విదురుఁడు మైత్రేయుం
ను మునినాయకుని నడిగె ని వేదవ్యా
సునితనయుం డభిమన్యుని
యునకుం జెప్పి మఱియుఁ గ నిట్లనియెన్.

టీక:- అని = అని; విదురుండు = విదురుడు; మైత్రేయుండు = మైత్రేయుడు; అను = అను; ముని = మునులకు; నాయకుని = నాయకుడిని; అడిగెన్ = అడిగెను; అని = అని; వేదవ్యాసుని = వేదవ్యాసుని {వేదవ్యాసుని తనయుడు - శుకయోగి}; తనయుండు = పుత్రుడు; అభిమన్యుని = అభిమన్యుని {అభిమన్యుని తనయుడు - పరీక్షిత్తు}; తనయున = పుత్రున; కున్ = కు; చెప్పి = చెప్పి; మఱియున్ = ఇంకను; తగన్ = తగ్గట్లు; ఇట్లు = ఈవిధముగ; అనియెన్ = పలికెను.
భావము:- ఈ విధంగా విదురుడు మునిశ్రేష్ఠుడైన మైత్రేయుణ్ణి అడిగాడు” అని శుకుడు పరీక్షిత్తునకు చెప్పి మళ్ళీ ఇలా అన్నాడు.

తెభా-3-196-వ.
ఇట్లు విదురుండు మైత్రేయు నడిగిన నతం డతనిం గని యతి మృదు మధురవచనరచనుండై యిట్లనియె "అనఘా! కృష్ణకథాశ్రవణ తత్పరుండవై నీవు నన్నడిగితివి గావున భద్రంబయ్యె; నీవు భగవద్భక్తుండవు గావున హరికథాసక్తుండ వగుట విచిత్రంబుగాదు; అదియునుంగాక మాండవ్యుశాపంబున సాత్యవతేయువలన భాతృక్షేత్రంబున శూద్రయోనింబుట్టినట్టి ప్రజాసంయమనుండవగు యముండవు పరమ జ్ఞానసంపన్నుండవు నారాయణునకుం బ్రియతముండవు గావునఁ గృష్ణుండు నిర్యాణకాలంబునం దన సన్నిధికిం జనిన నన్ను డాయంజీరి విజ్ఞానం బెల్ల నుపదేశించి నీకు నెఱింగింపు మని యానతిచ్చుటంజేసి యవశ్యంబును నీకు నెఱింగింతు దత్తావధానుండవై వినుము.
టీక:- ఇట్లు = ఈవిధముగ; విదురుండు = విదురుడు; మైత్రేయున్ = మైత్రేయుని; అడిగినన్ = అడుగగా; అతండు = అతడు; అతనిన్ = అతనిని; కని = చూసి; అతి = మిక్కిలి; మృదు = మృదువైన; మధుర = మధురమైన; వచన = మాటలతో; రచనుండు = పలుకువాడు; ఐ = అయి; ఇట్లు = ఈవిధముగ; అనియెన్ = అనియెను; అనఘా = పుణ్యాత్ముడా; కృష్ణ = కృష్ణుని; కథా = కథల; శ్రవణ = వినుటయందు; తత్పరుండవు = లగ్నమైనవాడవు; ఐ = అయి; నీవు = నీవు; నన్ను = నన్ను; అడిగితివి = అడిగావు; కావునన్ = కనుక; భద్రంబు = మంచిది; అయ్యెన్ = అయ్యింది; నీవు = నీవు; భగవత్ = భగవంతుని యొక్క; భక్తుండవు = భక్తుడవు; కావునన్ = కనుక; హరి = కృష్ణుని {హరి - సంచిత పాపకర్మబంధములను హరించువాడు, విష్ణువు}; కథా = కథల యందు; ఆసక్తుండవు = కుతూహలము కలవాడు; అగుటన్ = అవుట; విచిత్రంబు = విచిత్రము; కాదు = కాదు; అదియునున్ = అంతే; కాక = కాకుండగ; మాండవ్యున్ = మాండవ్యుని {మాండవ్యుడు - ఒక ఋషి ఇతను తపము చేసికొనుచుండగా రాజు దొంగయని వానింబట్టి కొరతవేయించెను ఆ ముని వెళ్ళి యమునితో నిష్కారణముగా నన్నిట్లు శిక్షించితివి కనుక శూద్రుడవై భూమిమీద పుట్టుము అని శపించెను ఆ యముడే విదురుడుగా పుట్టెను}; శాపంబునన్ = శాపమువలన; సాత్యవతేయు = వ్యాసుని {సాత్యవతేయుడు - సత్యవతి పుత్రుడు, వేదవ్యాసుడు}; వలన = వలన; భాత్రు = సోదరుని; క్షేత్రంబునన్ = భార్య యందు; శూద్ర = శూద్రస్త్రీ యొక్క; యోనిన్ = గర్భమున; పుట్టిన = జన్మించిన; అట్టి = అటువంటి; ప్రజా = ప్రజలను; సంయమనుండవు = సంయమనం కలవాడవు; అగు = అయిన; యముండవు = యముడవు; పరమ = అత్యుత్తమ; జ్ఞాన = జ్ఞానము; సంపన్నుడవు = సమృద్ధిగా కలవాడవు; నారాయణున = కృష్ణుని {నారాయణుడు - నీటి (నారములు)యందు వసించువాడు, విష్ణువు}; కున్ = కి; ప్రియతముండవు = మిక్కిలి ప్రియమైన వాడవు {ప్రియుడు - ప్రియతరుడు - ప్రియతముడు}; కావునన్ = కనుకనే; కృష్ణుండు = కృష్ణుడు; నిర్యాణ = నిర్యాణ; కాలంబునన్ = సమయమున; తన = తన; సన్నిధి = దగ్గర; కిన్ = కి; చనిన = వెళ్ళిన; నన్నున్ = నన్ను; డాయన్ = దగ్గరకు; చీరి = పిలిచి; విజ్ఞానమున్ = విజ్ఞానమును; ఎల్లన్ = అంతయు; ఉపదేశించి = చెప్పి; నీకున్ = నీకు; ఎఱింగింపుము = తెలుపుము; అని = అని; ఆనతిచ్చుటన్ = ఆజ్ఞాపించుట; చేసి = వలన; అవశ్యంబునున్ = రూఢిగా; నీకున్ = నీకు; ఎఱింగింతున్ = తెలిపెదను; దత్త = ధరించిన; అవధానుండవు = శ్రద్ధకలవాడవు; ఐ = అయి; వినుము = విను.
భావము:- “ఇలా విదురుడు మైత్రేయుణ్ణి అడిగాడు. అప్పుడు ఆ మహర్షి విదురుణ్ణి చూచి మిక్కిలి మృదుమధుర వాక్యాలతో ఇలా అన్నాడు. “ఓ పుణ్యాత్ముడా వీనులవిందుగా విష్ణుకథలు వినాలన్న ఆసక్తితో నన్ను అడిగావు. మంచిది. నీవు భగవంతుని యందు భక్తి గలవాడవు. కాబట్టి హరి కథలపై నీకు ఆసక్తి ఉండడంలో ఆశ్చర్యం లేదు. అంతేకాక నీవు సాక్షాత్తూ సమవర్తియై ప్రజలను శాసించే యముడవు. మాండవ్యమహాముని శాపంవల్ల వ్యాసభగవానునకు శూద్ర స్త్రీ కడుపున జన్మించావు. శ్రీమన్నారాయణుని ప్రేమకు పాత్రుడైనవాడివి. అందుకనే కృష్ణుడు తన అవసాన సమయంలో సమీపానికి వెళ్ళిన నన్ను చేరపిలిచి విజ్ఞానాన్నంతా బోధించాడు. దానిని నీకు చెప్పవలసిందిగా నన్ను ఆదేశించాడు. ఆయన ఆనతి ప్రకారం అదంతా నీకు తప్పకుండా చెబుతాను. ఏకాగ్రమైన మనస్సుతో ఆకర్ణించు.