పోతన తెలుగు భాగవతము/తృతీయ స్కంధము/మైత్రేయునిం గనుగొనుట
తెభా-3-165-క.
అనవుడు నుద్ధవుఁ డవ్విదు
రున కిట్లను "ననఘ! మునివరుఁడు సాక్షాద్వి
ష్ణునిభుండగు మైత్రేయుఁడు
దన మనమున మనుజగతి వదలఁ దలఁచి తగన్.
టీక:- అనవుడు = అనగా; ఉద్ధవుడు = ఉద్ధవుడు; ఆ = ఆ; విదురున = విదురున; కున్ = కు; ఇట్లు = ఈవిధముగ; అనున్ = అనెను; అనఘా = పుణ్యాత్ముడా; ముని = మునులలో; వరుడు = శ్రేష్ఠుడు; సాక్షాత్ = సాక్షాత్తు; విష్ణు = విష్ణువునకు; నిభుండు = సమానుడు; అగు = అయిన; మైత్రేయుడు = మైత్రేయుడు; తన = తన; మనమునన్ = మనసులో; మనుజ = మానవ; గతిన్ = స్థితిన్, జన్మమును; వదలన్ = వదలాలని; తలచి = తలచి; తగన్ = శీఘ్రముగ.
భావము:- ఆ మాటలు విని ఉద్ధవుడు విదరునితో ఇలా అన్నాడు. “వినవయ్యా! విదురా! సంయమివరేణ్యుడూ, సాక్షాత్తూ విష్ణువుతో సమానుడూ అయిన మైత్రేయుడు తన మనుష్యదేహాన్ని వదిలిపెట్టడానికి మనస్సులో నిశ్చయించుకున్నాడు.
తెభా-3-166-క.
హరి మురభేది పరాపరుఁ
గరుణాకరుఁ దలఁచు నట్టి ఘనుఁ డమ్మునికుం
జరు కడకేఁగిన నాతడు
గరమర్థిం దెలుపు సాత్వికజ్ఞానంబున్."
టీక:- హరిన్ = కృష్ణుని {హరిన్ - పాపములను హరించు వాడు, విష్ణువు}; మురభేధిన్ = కృష్ణుని {మురభేది - మురాసురుని భేదించిన వాడు, విష్ణువు}; పరాపరున్ = కృష్ణుని {పరాపరుడు - స్థూల (పరము) సూక్ష్మము (అపరము)లు తానైనవాడు, విష్ణువు}; కరుణాకరున్ = కృష్ణుని {రుణాకరుడు - దయకు ఆకరుడు (నివాసము)యైనవాడు, విష్ణువు}; తలచున్ = ధ్యానించున; అట్టి = అట్టి; ఘనుడు = గొప్పవారు; ఆ = ఆ; ముని = మునులలో; కుంజరు = శ్రేష్ఠుని; కడ = దగ్గర; కున్ = కు; ఏగిన = వెళ్ళిన; ఆతడు = అతడు; కరము = మిక్కిలి; అర్థిన్ = కుతూహలముతో; తెలుపు = తెలియజేయును; సాత్విక = సాత్వికమైన; జ్ఞానంబునన్ = జ్ఞానమును.
భావము:- ఆ మహానుభావుడు మైత్రేయుడు ఆ మురహరుని, ఆ పరాత్పరుని, ఆ కరుణాకరుని స్మరిస్తూ ఉన్నాడు. ఇప్పుడు నీవు ఆయన సన్నిధికి వెళ్తే తప్పకుండా ఆ మహాముని నీకు అత్యంత ప్రీతితో ఆధ్యాత్మిక తత్త్వజ్ఞానాన్ని అనుగ్రహిస్తాడు.”
తెభా-3-167-వ.
అని యుద్ధవుండు విదురుం గూడి చనిచని.
టీక:- అని = అని; ఉద్ధవుండు = ఉద్ధవుడు; విదురున్ = విదురునితో; కూడి = కలిసి; చనిచని = వెళ్ళి.
భావము:- ఈ విధంగా చెప్పి ఉద్ధవుడు విదురుడు ఇద్దరూ కలిసి వెళ్ళసాగారు.
తెభా-3-168-ఉ.
ముందటఁ గాంచె నంత బుధముఖ్యుఁడు హల్లకఫుల్లపద్మ ని
ష్యంద మరందపాన విలసన్మద భృంగ జలత్తరంగ మా
కంద లవంగ లుంగ లతికాచయ సంగ సురాంగనాశ్రితా
నందితపుణ్యసంగ యమునన్ భవభంగ శుభాంగ నర్మిలిన్.
టీక:- ముందటన్ = ఎదురుగా; కాంచెన్ = చూసెను; అంత = అంతట; బుధ = జ్ఞానులలో; ముఖ్యుడు = శ్రేష్ఠుడు; హల్లక = చెంగలువ; పుల్లపద్మ = వికసించిన పద్మములనుండి; నిష్యంద = స్రవించుచున్న; మరంద = తేనె; పాన = తాగి; విలసత్ = శోభిల్లుతూ; మద = పరవశించిన; భృంగ = తుమ్మెదలు; చలత్ = కదులుతున్న; తరంగ = అలలు; మాకంద = మామిడి; లవంగ = లవంగ; లుంగ = మాదీఫల; లతికా = లతల; చయ = గుంపుని; సంగ = కలిసి ఉన్న; సుర = దేవతా; అంగనా = స్త్రీలచే; ఆశ్రిత = ఆశ్రయింపబడిన; ఆనందిత = ఆనందము గలిగింపబడిన; పుణ్య = పుణ్యము; సంగ = అంటినది; యమునన్ = యమునానదిని; భవ = సంసారబంధములను; భంగ = తెంపునది; శుభ = శోభనకరమైన; అంగన్ = దేహము కలదానిని; నర్మిలిన్ = ఆపేక్షగా.
భావము:- అలా వెళుతున్న విదుర ఉద్ధవులకు ఎదురుగుండా యమునానది కన్పించింది. ఆ నదిలో కలువపూలు, తామరవూలూ వికసించి ఉన్నాయి. ఆ పూలలో చిందే మకరంద బిందువులను కమ్మగా కడుపునిండా త్రాగిన తుమ్మెదలు మైమరచి విహరిస్తున్నాయి. నదిలో తరంగాలు కదలాడుతున్నాయి. ఆ నది ఒడ్డున మామిడిచెట్లూ, లవంగ లతలూ, మాదీఫల వృక్షాలూ చిక్కగా క్రిక్కిరిసి ఉన్నాయి. ఆ పొదరిండ్లలో సురసుందరులు చరిస్తున్నారు. సంసార బంధాలను పోకార్చి పుణ్యాన్ని చేకూర్చే సుగుణాల దొంతి అయిన ఆ యమునా స్రవంతి కన్నుల విందుగా కానవచ్చింది.
తెభా-3-169-క.
కని డాయనేఁగి మోదం
బునఁ దత్సరిదమల పులిన భూములఁ దగ నా
దినశేషము నివసించెను
వనజోదరపాదపద్మవశమానసుఁడై
టీక:- కని = చూసి; డాయన్ = డగ్గరకు; ఏగి = వెళ్ళి; మోదంబునన్ = సంతోషముతో; తత్ = ఆ; సరిత్ = నది యొక్క; అమల = నిర్మలమైన; పులినభూములన్ = ఇసకతిన్నెలందు; తగన్ = అలా; ఆ = ఆ; దినశేషము = రాత్రి {దినశేషము - ఆనాటికి మిగిలిన సమయము, రాత్రి}; నివసించెను = ఉండెను; వనజోదర = కృష్ణుని {వనజోదరుడు - వనము (నీటి)లో జ (పుట్టిన) (పద్మము) ఉదరమున కలవాడు, విష్ణువు}; పాద = పాదములు అను; పద్మ = పద్మములకు; వశ = వశమైన; మానసుండు = మనసు కలవాడు; ఐ = అయి.
భావము:- అలా దర్శనమిచ్చిన యమునా నదిని విదురుడు ఉద్ధవుడు సమీపించారు. విదురుడు ఆ నదిలోని అందమైన తెల్లని ఇసుక తిన్నెల మీద ఆనందంగా ఆసీనుడైనాడు. పద్మోదరుడైన ఆ శ్రీకృష్ణుని పాదపద్మాల స్మరణ యందు లగ్మమైన మనస్సు కలవాడై ఆ దినమంతా గడిపాడు.
తెభా-3-170-క.
మఱునాఁడు రేపకడ భా
సురపుణ్యుఁడు ఘనుడు మధునిషూదనచరణ
స్మరణక్రీడాకలితుఁడు
దరియించెం గలుషగహనదహనన్ యమునన్.
టీక:- మఱునాడు = తరువాతి రోజు; రేపకడ = ప్రాభాత కాలమున; భాసుర = ప్రకాశించుచున్; పుణ్యుడు = పుణ్యము కలవాడు; ఘనుడు = గొప్పవాడు; మధునిషూదనుడు = కృష్ణుని {మధునిషూదనుడు - మధు అను రాక్షసుని నిషూద (సంహరించి)నవాడు, విష్ణువు}; చరణ = పాదములను; స్మరణ = ధ్యానించుట అను; క్రీడా = క్రీడతో; కలితుడు = కలసి ఉన్నవాడు; తరియించెన్ = దాటెను; కలుష = పాపములు అను; గహన = అడవులను; దహనన్ = దహించుదానిని; యమునన్ = యమునానదిని.
భావము:- మర్నాడు ఉదయాన్నే విదురునితో కలిసి మధుసూదనుని పదచింతన సంతోష తరంగాలలో ఓలలాడే అంతరంగం గల పుణ్యమూర్తి ఉద్ధవుడు పాపాలను రూపుమాపే యమునాతరంగిణిని దాటాడు.
తెభా-3-171-వ.
ఇట్లుద్ధవుండు యమునానది నుత్తరించి బదరికాశ్రమంబునకుం జనియె"అనిన విని రాజేంద్రుండు యోగీంద్రున కిట్లనియె.
టీక:- ఇట్లు = ఈవిధముగ; ఉద్ధవుండు = ఉద్ధవుడు; యమునా = యమున అను; నదిని = నదిని; ఉత్తరించి = దాటి; బదరిక = బదరిక అను {బదరి - రేగుచెట్టు}; ఆశ్రమమున = అశ్రమమున; కున్ = కు; చనియెన్ = వెళ్ళెను; అనిన = అనగా; విని = విని; రాజ = రాజులలో; ఇంద్రుడు = శ్రేష్ఠుడు; యోగి = యోగులలో; ఇంద్రున్ = శ్రేష్ఠుని; కిన్ = కి; ఇట్లు = ఈ విధముగ; అనియెన్ = పలికెను.
భావము:- ఉద్ధవుడు యమునానది దాటి బదరికాశ్రమానికి వెళ్ళాడు” అని చెప్పగా విని రాజశ్రేష్ఠుడైన పరీక్షితుడు యోగిశ్రేష్ఠుడైన శ్రీశుకునితో ఇలా అన్నాడు.
తెభా-3-172-క.
"శౌరియు నతిరథవరులు మ
హారథ సమరథులు యదుబలాధిపు లెల్లం
బోరిఁ మృతిఁబొంద నుద్ధవుఁ
డేరీతిన్ బ్రతికె నాకు నెఱిగింపు తగన్."
టీక:- శౌరియున్ = కృష్ణుడును; అతిరథ = అతిరథులలో; వరులు = శ్రేష్ఠులు; మహారథులు = మహారథులు; సమరథులు = సమరథులు; యదు = యాదవ; బల = బలములో; అధిపులు = గొప్పవారు; ఎల్లన్ = అందరూ; పోరిన్ = పోరులో; మృతిన్ = మరణమును; పొందన్ = పొందగా; ఉద్ధవుడు = ఉద్ధవుడు; ఏ = ఏ; రీతిన్ = విధముగ; బ్రతికెన్ = బతికెను; నాకున్ = నాకును; ఎఱిగింపు = తెలియజేయుము; తగన్ = శీఘ్రముగ.
భావము:- శ్రీకృష్ణుడు అవతారం చాలించగా, అతిరథ మహారథ సమరథులు అయిన యాదవ వీరు లందరూ తమలో తాము పోరాడుకొని ప్రాణాలు గోల్పోగా, అందరూ చనిపోగా, ఉద్ధవుడు మాత్రం ఎలా బ్రతుక గలిగాడు ఈ విషయం నాకు వివరించండి.”
తెభా-3-173-సీ.
నావుడు రాజేంద్రునకు శుకయోగీంద్రుఁ-
డిట్లను "మున్ను లోకేశుచేత
సంప్రార్థితుండైన జలరుహనాభుండు-
వసుమతిపై యదువంశమందు
నుదయించి తనుఁదాన మదిలోనఁ జింతించి-
తెలివొంది యాత్మీయకులవినాశ
మొనరించి తానుఁ బంచోపనిషణ్మయ-
మగు దివ్యదేహంబునందుఁ జెందఁ</p>
తెభా-3-173.1-తే.
దలఁచి విజ్ఞానతత్త్వంబు ధరణిమీఁదఁ
దాల్చి జనకోటి కెఱిఁగింపఁ దగిన ధీరుఁ
డుద్ధవుఁడు దక్క నితరులేనోప రితఁడు
నిర్జితేంద్రియుఁ డాత్మసన్నిభుఁ డటంచు
టీక:- నావుడు = అనగా; రాజ = రాజులలో; ఇంద్రున = శ్రేష్ఠున; కున్ = కు; శుక = శుకుడు అను; యోగి = యోగులలో; ఇంద్రుడు = శ్రేష్ఠుడు; ఇట్లు = ఈవిధముగ; అను = అనెను; మున్ను = పూర్వము; లోకేశు = బ్రహ్మదేవుడు {లోకేశుడు - లోకములకు ప్రభువు, బ్రహ్మదేవుడు}; చేత = చే; సంప్రార్థితుండు = చక్కగా ప్రార్థింపబడినవాడు; ఐన = కాగా; జలరుహనాభుండు = కృష్ణుడు {జలరుహనాభుడు - నీటిలో పుట్టినది (పద్మము) బొడ్డున కలవాడు, విష్ణువు}; వసుమతి = భూమి; పైన్ = మీద; యదు = యాదవ; వంశమునన్ = వంశము; అందున్ = లో; ఉదయించి = పుట్టి; తనున్ = తనను; తాన = తనే; మదిన్ = మనసు; లోనన్ = లో; చింతించి = భావించుకొని; తెలివి = తెలుసు; ఒంది = కొని; ఆత్మీయ = తన యొక్క; కుల = వంశము; వినాశము = నశించుట; ఒనరించి = చేసి; తానున్ = తనను; పంచ = ఐదు; ఉపనిషత్ = ఉపనిషత్తులచే; మయము = నిండి ఉన్నది; అగు = అయిన; దివ్య = భౌతికము కాని దివ్యమైన; దేహంబున్ = శరీరమును; చెందన్ = చేర; తలచి = భావించి;
విజ్ఞాన = పరా; తత్త్వమున = తత్త్వజ్ఞానముతో; ధరణి = భూమి; మీద = మీద; తాల్చి = ధరించి; జన = జనుల; కోటి = సమూహముల; కిన్ = కి; ఎఱిగింపన్ = తెలియజేయుటకు; తగిన = తగినట్టి; ధీరుడు = ధీరుడు, విద్వాంసుడు; ఉద్ధవుడు = ఉద్ధవుడు; తక్క = తప్ప; ఇతరులు = ఇంకొకరు; లేనోపరు = సమర్థులుకారు; ఇతండు = ఇతడు; నిర్జిత = జయించిన; ఇంద్రియ = ఇంద్రియములు కలవాడు; ఆత్మ = తనకు; సన్నిభుడు = సమానమై ఉండువాడు; అటంచున్ = అంటూ.
భావము:- ఇలా అడిగిన పరీక్షిత్తుతో శుకుడు ఇలా అన్నాడు. పూర్వం బ్రహ్మదేవుడు ప్రార్థించగా పుండరీకాక్షుడు భూలోకంలో యదువంశంలో అవతరించాడు. తనంత తానే మనస్సులో చేసుకున్న సంకల్పానుసారం తన కులాన్నంతా అంతం చేసాడు. ఐదు ఉపనిషత్తులతో కూడిన పరబ్రహ్మ స్వరూపమైన దివ్యదేహాన్ని పొందదలచి, తన తర్వాత విజ్ఞాన తత్త్వాన్ని అందుకొని లోకంలో జిజ్ఞాసువులైన ప్రజలకు తెలియజేయగల ప్రజ్ఞాశాలి, జితేంద్రియుడు, తనంతటి వాడు ఒక్క ఉద్ధవుడు తప్ప ఇంకొకడు లేడని భావించాడు.
తెభా-3-174-క.
క్షితిపై నిలిపిన కతమున
నతనికి మృతి దొరకదయ్యె నవనీశ! రమా
పతి యభిమానము గలిగిన
యతిపుణ్యుఁడు చనియె బదరికాశ్రమమునకున్.
టీక:- క్షితి = భూమి; పైన్ = మీద; నిలిపిన = నియమించిన; కతమున = కారణమున; అతనికిన్ = అతనికి; మృతి = మరణము; దొరకదు = చెందకపోవుట; అయ్యెన్ = జరిగినది; అవనీశ = రాజా {అవనీశుడు - అవని (భూమి)కి ప్రభువు, రాజు}; రమాపతి = కృష్ణుని {రమాపతి - రమ (లక్ష్మీదేవి) భర్త, విష్ణువు}; అభిమానము = అభిమానము; కలిగిన = కలిగినట్టి; అతి = మిక్కిలి; పుణ్యుడు = పుణ్యాత్ముడు; చనియెన్ = వెళ్ళెను; బదరిక = బదరిక అను {బదరికాశ్రమము - రేగు చెట్లవనమున కల ఆశ్రమము}; ఆశ్రమమున = ఆశ్రమమున; కున్ = కు.
భావము:- పరీక్షిన్మహారాజా! అందుకే భూలోకంలో అతణ్ణి స్థిరంగా నిలబెట్టాడు. ఈ కారణాల వల్ల అతనికి మృతి లేకుండా పోయింది. శ్రీకృష్ణుని మీద ఆదరాభిమానాలు గల ఆ పరమ పుణ్యుడు ఉద్ధవుడు బదరికాశ్రమానికి వెళ్ళాడు.
తెభా-3-175-వ.
అంత.
టీక:- అంత = అంతట.
భావము:- అప్పుడు.
తెభా-3-176-క.
ఉద్ధవుఁ డరిగిన పిదప స
మిద్ధపరిజ్ఞాను సుజనహితు మైత్రేయున్
వృద్ధజనసేవ్యుఁ దాపస
వృద్ధశ్రవుఁ జూఁడగోరి విదురుఁడు గడఁకన్.
టీక:- ఉద్ధవుడు = ఉద్ధవుడు; అరిగిన = వెళ్ళిన; పిదప = తరువాత; సమిద్ధ = చక్కటి పరిశుద్ధమైన; పరిజ్ఞాను = విజ్ఞానము కలవాని; సుజన = మంచివారికి; హితు = ఇష్టుడు; మైత్రేయున్ = మైత్రేయుని; వృద్ధ = పెద్ద; జన = వారిచే; సేవ్యున్ = సేవింపబడువానిని; తాపస = తపోధనులలో; వృద్ధశ్రవున్ = శ్రేష్ఠుని {వృద్ధశ్రవుడు - వృద్ధ (పండితుల)చే శ్రవుడు (కీర్తింపబడు) వాడు, ఇంద్రుడు}; చూడన్ = చూడవలెనని; కోరి = కోరికతో; విదురుడు = విదురుడు; కడకన్ = పూనికతో.
భావము:- ఇలా ఉద్ధవుడు వెళ్ళిపోయిన తర్వాత, విదురుడు దేదిప్యమానమైన జ్ఞానం కలవాడూ, సజ్జనులకు మిత్రుడైనవాడూ, మహానీయులకు సైతం సేవనీయుడూ, తాపసేంద్రుడూ అయిన మైత్రేయ మహామునీంద్రుణ్ణి సందర్శించటానికి ప్రయాణం అయ్యాడు.
తెభా-3-177-వ.
యమునానది దాఁటి కతిపయప్రయాణంబులం బుణ్యనదులును హరిక్షేత్రంబులును దర్శించుచు నతి త్వరిత గమనంబున.
టీక:- యమునా = యమున అను; నదిన్ = నదిని; దాటి = దాటి; కతిపయ = కొన్ని; ప్రయాణంబులన్ = అంచెలప్రయాణాలతో; పుణ్య = పుణ్యవంతమైన; నదులును = నదులను; హరి = విష్ణువు ఉన్న; క్షేత్రంబులును = ప్రదేశములను; దర్శించుచున్ = చూచుచు; అతి = మిక్కిలి; త్వరిత = వేగవంతమైన; గమనంబునన్ = గమనముతో.
భావము:- యమునానదిని దాటిన అనంతరం కొన్ని రోజులు ప్రయాణం సాగించి పుణ్యనదులనూ, విష్ణు క్షేత్రాలను దర్శించుకుంటూ బిరబిరా ముందుకు వెళ్ళసాగాడు.
తెభా-3-178-క.
చనిచని ముందటఁ గనుగొనె
ఘనపాపతమఃపతంగఁ గరుణాపాంగం
గనదుత్తంగతరంగన్
జనవరనుతబహుళపుణ్యసంగన్ గంగన్.
టీక:- చనిచని = వెళ్ళి; ముందటన్ = ఎదురుగ; కనుగొనె = చూసెను; ఘన = పెద్దపెద్ద; పాప = పాపములు అను; తమః = చీకటిని; పతంగన్ = పోగొట్టునదియును; కరుణా = దయతో కూడిన; అపాంగన్ = కటాక్షము కలది; కనత్ = చలిస్తున్న; ఉత్తుంగ = ఎత్తైన; తరంగన్ = అలలు కలదానిని; జన = జనులలో; వర = శ్రేష్ఠులచే; నుత = స్తోత్రము చేయబడు; బహుళ = అనేకమైన; పుణ్య = పుణ్యములు; సంగన్ = కూడి ఉన్నదానిని; గంగన్ = గంగను.
భావము:- అలా వెళ్ళి వెళ్ళి విదురుడు ఉత్తుంగ తరంగాలతో పొంగి ప్రవహించే గంగానదిని కన్నుల విందుగా కనుగొన్నాడు. ఆ గంగానది పాపాలనే చీకట్లను సూర్యునివలె పారదోలునది. కరుణారసం ప్రసరించే కడగంటి చూపులు కలది. పెద్దలైనవారు ప్రశంసించే అగణ్య పుణ్యాలకు ఆలవాలమైనది.
తెభా-3-179-క.
అందు నరవింద సౌరభ
నందిత పవమాన ధూత నటదూర్మి పరి
స్పందిత కందళశీకర
సందోహ లసత్ప్రవాహ జలమజ్జనుఁడై.
టీక:- అందున్ = అందులో; అరవింద = పద్మముల; సౌరభన్ = పరిమళముచేత; అందిత = అలదబడిన; పవమాన = గాలికి; ధూత = ఎగసి; నటత్ = నాట్యము చేయుచున్న; ఉర్మిన్ = అలలుకు; పరిస్పందిత = ప్రతిస్పందిస్తూ; కందళీ = తుళ్ళుతున్న; శీకర = తుంపరల యొక్క; సందోహ = సమూహముల; లసత్ = ప్రకాశము కలిగి; ప్రవాహ = ప్రవహిస్తున్న; జలన్ = నీటిలో; మజ్జనుడు = స్నానముచేసినవాడు; ఐ = అయి.
భావము:- ఆ గంగానదిలో పద్మాల సువాసనలతో నిండిన గాలులు వీస్తున్నాయి. ఆ పద్మ సుగంధాలు వహించిన వాయువుల వల్ల కదలి నదీ తరంగాలు నాట్యం చేస్తున్నాయి. అలా ఎగిరిపడుతున్న కెరటాలు నీటి తుంపరలను విరజిమ్ముతున్నాయి. అటువంటి పరమ పవిత్ర గంగా ప్రవాహంలో విదురుడు స్నానం చేసాడు.
తెభా-3-180-సీ.
ఘనసార రుచి వాలుకా సముదంచిత-
సైకతవేదికాస్థలము నందు
యమనియమాది యోగాంగ క్రియానిష్ఠఁ-
బూని పద్మాసనాసీనుఁ డగుచు
హరిపాదసరసీరుహన్యస్త చిత్తుఁడై-
బాహ్యేంద్రియవ్యాప్తిఁ బాఱఁదోలి
సకలవిద్వజ్జన స్తవనీయ సముచితా-
చార వ్రతోపవాసములఁ గ్రుస్సి
తెభా-3-180.1-తే.
యున్న పుణ్యాత్ము విగతవయోవికారు
వినుతసంచారు భువనపావనవిహారు
యోగిజనగేయు సత్తతిభాగధేయు
నాశ్రితవిధేయు మైత్రేయు నచటఁ గాంచె.
టీక:- ఘనసార = కర్పూరపు పలుకులు; రుచిన్ = ప్రభ, కాంతి; వాలుకా = ఇసుకరేణువులచే; సముదంచిత =చక్కగా ఒప్పుతున్న; సైకత = ఇసుక; వేదికా = తిన్నెలపైని; స్థలమున్ = ప్రదేశము; అందున్ = లో; యమ = యమము; నియమ = నియమము; ఆది = మొదలైన; యోగ = యోగము యొక్క {అష్టాంగయోగ మార్గములు - 1 యమము 2 నియమము 3 ఆసనము 4 ప్రాణాయామము 5 ప్రత్యాహారము 6 ధారణ 7 ధ్యానము 8 సమాధి అని ఎనిమిది (8)}; అంగ = అంగ; క్రియా = క్రియల; నిష్ఠన్ = నిష్ఠను; పూని = వహించి; పద్మాసనా = పద్మాసనముతో {పద్మాసనము - పద్మము వంటి ఆకారము కల (విశిష్టమైన) ఆసనము}; ఆసీనుడు = కూర్చున్నవాడు {ఆసనము - యోగక్రియాచరణాదులకై ప్రత్యేక ఆకారములలో అవయవములను ఉంచుకొనుస్థితి}; అగుచున్ = అవుతూ; హరి = కృష్ణుని; పాద = పాదములు అను; సరసీరుహ = పద్మముల యందు {సరసీరుహము - నీట పుట్టినది, పద్మము}; న్యస్త = లగ్నముచేసిన; చిత్తుడు = మనసుకలవాడు; ఐ = అయ్యి; బాహ్య = వెలుపలి {బాహ్యేంద్రియములు - వెలుపలి కన్ను మొదలగు పంచేంద్రియములు}; ఇంద్రియ = ఇంద్రియముల; వ్యాప్తిన్ = ప్రవర్తనను; పాఱఁదోలి = పోగొట్టి; సకల = సమస్త; విద్వజ్జన = విద్వాంసులచే; స్తవనీయ = స్తుతింబడుటకు; సముచిత = తగినట్టి; ఆచార = ఆచారములు; వ్రత = వ్రతములతోను; ఉపవాసములన్ = ఉపవాసములతోను; క్రుస్సి = చిక్కి;
ఉన్న = ఉన్నట్టి; పుణ్యాత్ము = పుణ్యాత్ముని; విగత = విడిచిన; వయస్ = వయస్సు యొక్క; వికారు = వికారములుకలవానిని; వినుత = కీర్తింపబడుతూ; సంచారు = సంచరిస్తున్నవానిని; భువన = లోకములను; పావన = పవిత్రముచేయుటకై; విహారు = విహరించువానిని; యోగి = యోగులు ఐన; జన = జనులచే; గేయు = కీర్తింపబడువానిని; సత్ = ఉత్తముల; తతి = సమూహములకు; భాగధేయు = భాగ్యమైనవానిని; ఆశ్రిత = ఆశ్రయించిన వారికి; విధేయుడు = అనుకూలమైనవానిని; మైత్రేయున్ = మైత్రేయుని; అచటన్ = అక్కడ; కాంచెన్ = చూసెను.
భావము:- స్నానానంతరం విదురుడు ఎదురుగుండా యోగిజన స్తవనీయుడూ, సాధుజన భాగధేయుడూ, శ్రితజన విధేయుడూ అయిన మైత్రేయుణ్ణి చూచాడు. ఆ మహనీయుడు కప్పురము కుప్పపోసినట్లున్న, ఒనానొక ఇసుక తిప్పమీద పద్మాసనాసీనుడై ఉన్నాడు. ఆయన యమ నియమాదులతో కూడిన అష్టాంగ యోగాన్ని నిష్ఠాగరిష్ఠుడై ఆచరిస్తున్నవాడు. శ్రీకృష్ణుని చరణ సరోజాలపై చిత్తం లగ్నం చేసి ఉన్నవాడు. ఇంద్రియాలను వశం చేసుకొనిన వాడు. సమస్త విద్వాంసులకు సంస్తవనీయమైన సదాచారాలతో, వ్రతాలతో, ఉపవాసాలతో, ఆ మహాముని శరీరం సన్నబడిన దేహం కలవాడు. ఆయనలో వార్ధక్యలక్షణాలు ఏమీ కన్పించటం లేదు. ఆటువంటి పుణ్యజీవనుడూ, భువనపావనుడూ అయిన మైత్రేయుడు విదురుని ముందు సాక్షాత్కరించాడు.