పోతన తెలుగు భాగవతము/తృతీయ స్కంధము/యుద్దవ దర్శనంబు
తెభా-3-36-వ.
అని యిట్లు దుర్యోధనుం డాడిన దురాలాపంబులు దనకు మనస్తాపంబు సేయం గార్యంబు విచారించి ధైర్యం బవలంబించి యొండు వలుకనొల్లక శరశరాసనంబులు విడిచి క్రోధంబు నడంచి విదురుండు వనంబునకుం జని, యందు.
టీక:- అని = అని; ఇట్లు = ఈవిధముగ; దుర్యోధనుండు = దుర్యోధనుడు; ఆడిన = పలికిన; దురాలాపంబులు = దుడుకుమాటలు; తన = తన; కున్ = కు; మనస్ = మనసునకు; తాపంబున్ = బాధ; చేయన్ = కలుగజేయగా; కార్యంబున్ = చేయవలసిన పని; విచారించి = ఆలోచించుకొని; ధైర్యంబున్ = ధైర్యమును; అవలంభించి = వహించి; యొండు = బదులు; పలుకన్ = పలుకుటకు; ఒల్లక = ఒప్పుకొనక; శర = బాణము; శరాసనంబులు = విల్లులను; విడిచి = వదిలేసి; క్రోధంబున్ = కోపమును; అడంచి = అణచుకొని; విదురుండు = విదురుడు; వనంబున్ = అడవి; కున్ = కి; జని = వెళ్ళి; అందున్ = దానిలో.
భావము:- ఇలా పలికిన దుర్యోధనుడి దుడుకు మాటలకు విదురుని మనస్సు కుతకుత ఉడికిపోయింది. అయినా విదురుడు కర్తవ్యం గుర్తుకు తెచ్చుకొని, గుండె నిబ్బరించుకొని, ఇంకేం మాట్లాడకుండా, ధనుర్బాణాలు విడిచిపెట్టి, ఆగ్రహాన్ని అణచిపెట్టి అరణ్యానికి వెళ్ళిపోయాడు.
తెభా-3-37-సీ.
విష్ణుస్వయంవ్యక్త విమలభూములనుఁ బ-
విత్రంబులగు హరిక్షేత్రములను
నెలకొని దేవతానిర్మిత హరిదివ్య-
భూముల గంగాది పుణ్యనదుల
సిద్ధపురాణప్రసిద్ధ పుణ్యాశ్రమ-
స్థలముల నుపవనస్థలము లందు
గంధమాధన ముఖక్ష్మాభృత్తటంబుల-
మంజులగిరి కుంజ పుంజములను
తెభా-3-37.1-తే.
వికచకైరవ పద్మ హల్లక మరంద
పాన పరవశ మధుకర గాన బుద్ధ
రాజహంస విలాస విరాజమాన
మగుచుఁ జెలువొందు పంకేరుహాకరముల.
టీక:- విష్ణు = విష్ణుమూర్తి; స్వయం = స్వయముగ; వ్యక్త = వెలసిన; విమల = నిర్మలమైన; భూములను = ప్రదేశములను; పవిత్రములు = పవిత్రములు; అగు = అయినట్టి; హరి = విష్ణువుగల; క్షేత్రములను = ప్రదేశములను; నెలకొని = ప్రసిద్ధమైన; దేవతా = దేవతలచే; నిర్మిత = నిర్మింపబడిన; హరి = విష్ణువుగల; దివ్య = దివ్యమైన; భూములన్ = ప్రదేశములను; గంగా = గంగానది; ఆది = మొదలైన; పుణ్య = పుణ్యవంతమైన; నదులన్ = నదులను; సిద్ధ = సిద్ధులచేత నిర్మింపబడిన; పురాణ = పురాతనకాలమునుండి; ప్రసిద్ధ = ప్రసిద్ధికెక్కిన; పుణ్యా = పుణ్యవంతమైన; ఆశ్రమ = ఆశ్రమ; స్థలములను = ప్రదేశములను; ఉపవనముల్ = తోటలను {ఉపవనములు - దేవాలయాదులకు భవనములకు సంబంధించిన వనములు లేదా తోటలు}; అందున్ = అందునను; గంధమాధన = గంధమాదనము; ముఖ = మొదలైన; క్ష్మాభృత్ = కొండల; తటంబుల = చరియలలో; మంజుల = మనోహరమైన; గిరి = కొండలు; కుంజ = పొదరిల్లుల; పుంజములును = గుంపులును; వికచ = వికసించిన; కైరవ = కలువల; పద్మ = పద్మముల; హల్లక = ఎఱ్ఱకలువల; మరంద = తేనె; పాన = తాగుటవలన; పరవశ = పరవశించిన; మధుకర =తుమ్మెదల; గాన = గానమునకు; బుద్ధ = మేల్కాంచిన; రాజహంస = రాజహంసల; విలాస = విలాసములచే; విరాజమానము = చక్కగా ప్రకాశిస్తున్నవి; అగుచున్ = అవుతూ; చెలువ = అందాలను; ఒందు = పొందుచున్న; పంకేరుహాకరముల = కోనేళ్ళు {పంకేరుహాకరము - పంక (బురదలో) ఇరుహ (పుట్టిన) పద్మములకు ఆకరములు (నివాసములు), కోనేళ్ళు}.
భావము:- అలా వెళ్ళిన విదురుడు విష్ణుదేవుడు స్వయంగా వెలసిన పావనప్రదేశాలనూ, పరమపవిత్రాలైన వైష్ణన క్షేత్రాలనూ, దేవతలు నిర్మించిన దివ్యస్థలాలనూ, గంగ మొదలైన పుణ్యనదులనూ, పురాణాలలో ప్రసిద్ధాలైన సిద్ధాశ్రమాలనూ, తపోవనాలనూ దర్శించాడు. గంధమాదనం మొదలైన కొండచరియలనూ, అక్కడి చక్కని చిక్కని పొదరిండ్లవనూ, వికసించిన రకరకాల కలువలలో, కమలాలలో మకరందం త్రాగి మైమరచిన తుమ్మెదల కమ్మని గానానికి మేలుకొన్న రాజహంసల విలాస విహారాలతో విరాజిల్లుతున్న సరస్సులను చూశాడు.
తెభా-3-38-క.
మఱియును ఋష్యాశ్రమ వన
సరి దుపవన నద పుళింద జనపద గిరి గ
హ్వర గోష్ట యజ్ఞశాలా
పుర దేవాయతన పుణ్యభూముల యందున్.
టీక:- మఱియును = ఇంకనూ; ఋషి = మునుల; ఆశ్రమ = ఆశ్రమములకు చెందిన; వన = తోటలు; సరిత్ = పిల్లకాలువలు; ఉపవన = పెరటి తోటలు; నద = నదులు {నద - పడమటకు ప్రవహించు నదులు}; పుళింద = పుళిందుల {పుళిందులు - పుళింద దేశపు, ఒక అడవిజాతి మానవులు, గిరిజనులు}; జనపద = నివాసములు; గిరి = కొండ; గహ్వర = గుహలు; గోష్ట = పశుశాలలు; యజ్ఞశాలా = యజ్ఞశాలలు; పుర = పట్టణములు; దేవాయతన = గుళ్ళు; పుణ్య = పవిత్ర; భూములు = క్షేత్రములు; అందున్ = వద్ద.
భావము:- మునుల ఆశ్రమాలలో, వనాలలో, నదీనదాలలో, ఉపవనాలలో, బోయపల్లెలలో, కొండగుహలలో, గోశాలల్లో, యాగశాలల్లో, పట్టాణాలలో, దేవాలయాలలో, తీర్థస్థలాలలో తిరిగాడు.
తెభా-3-39-క.
కూరలుఁ గాయలు నీళ్ళా
హారముగాఁ గొనుచు నియమ మలవడఁగ నసం
స్కారశరీరుం డగుచు ను
దారత నవధూతవేషధరుఁడై వరుసన్.
టీక:- కూరలు = కూరలు {కూర - వంటకు పనికొచ్చే శాకాహారములు}; కాయలు = కాయలు {కాయ - చెట్టునకు కాయు కాయ}; నీళ్ళు = నీళ్ళు; ఆహారము = భోజనము; కాన్ = గా, వలె; కొనుచున్ = తీసుకొనుచు; నియమములు = నియమాలు; అలవడగన్ = అలవాటుపడగ; అసంస్కార = సంస్కరింపబడని {సంస్కారములు - దంతధావనము, స్నానము, సౌచము, అగ్ని, క్షురకర్మాదులు}; శరీరుండు = శరీరము కలవాడు; అగుచున్ = అవుతూ; ఉదారతన్ = గొప్పగా; అవధూత = దిగంబర {అవధూత - దిగంబర సన్యాసి}; వేష = వేషమును; ధరుడు = ధరించినవాడు; ఐ = అయి; వరుసన్ = వరుసగా.
భావము:- ఆ యా స్థలాలలో ఆకులు, కాయలు, నీళ్లు మాత్రమే ఆహారంగా తీసుకొంటూ నియమ సహితుడై, శరీరసంస్కార రహితుడై, ఔదార్యమహితుడైన విదురుడు పరివ్రాజక వేషం ధరించినవాడు అయి సంచారం చేసాడు.
తెభా-3-40-క.
హర్షము గదురఁగ భారత
వర్షమునం గలుగు పుణ్యవరతీర్థము లు
త్కర్షం జూచుచు విగతా
మర్షుండై సంచరించె మనుజవరేణ్యా!
టీక:- హర్షము = సంతోషము; కదురఁగ = కలుగునట్లు; భారతవర్షమునన్ = భారతదేశములో; కలుగు = ఉన్నట్టి; పుణ్య = పవిత్రమైన; వర = శ్రేష్ఠమైన; తీర్థములున్ = తీర్థక్షేత్రములను; ఉత్కర్షన్ = తెలిసికొను వేడుకతో; చూచుచున్ = చూస్తూ; విగత = విడిచిన; ఆమర్షుండు = కోపము, కినుక కలవాడు; ఐ = అయి; సంచరించెన్ = తిరిగెను; మనుజవరేణ్య = రాజా {మనుజవరేణ్యుడు - మానవులలో గౌరవనీయుడు, రాజు}.
భావము:- మానవోత్తమా! పరీక్షిత్తూ! ఈ విధంగా భారత దేశంలో గల ఉత్తమ పుణ్యతీర్థా లన్నింటినీ సంతోషాతిశయంతో సందర్శిస్తూ, రాగద్వేషాలు విడిచిన విదురుడు తీర్థ యాత్రలు చేస్తూ క్రమంగా ప్రభాసతీర్థం చేరాడు.
తెభా-3-41-వ.
ఇట్లు సంచరించుచుఁ బ్రభాసతీర్థముకు వచ్చునప్పుడు.
టీక:- ఇట్లు = ఈవిధముగ; సంచరించుచు = తిరుగుతూ; ప్రభాస = ప్రభాసము అను; తీర్థమున్ = పుణ్యతీర్థము; కున్ = కు; వచ్చును = వచ్చెను; అప్పుడు = అప్పుడు.
భావము:- ఇలా తిరుగుతు ప్రభాస తీర్థమునకు వచ్చేటప్పుడు . .
తెభా-3-42-చ.
అరుగుచు దైత్యభేదన దయాపరిలబ్ధ సమస్త మేదినీ
భరణధురందరుం డగుచుఁ బాండుసుతాగ్రజుఁ డొప్పుచుండ భూ
వర! విదురుండుఁ దన్నికటవర్య తమాల రసాల మాధవీ
కురవక మాలతీ వకుళ కుంజ లసత్తట మందు నున్నెడన్.
టీక:- అరుగుచున్ = వస్తూ; దైత్యభేదన = కృష్ణుని {దైత్యభేదనుడు - రాక్షసులను సంహరించిన వాడు, కృష్ణుడు}; దయా = దయచేత; పరి = చక్కగా; లబ్ధ = లభించిన; సమస్త = సమస్తమైన; మేదినీ = భూమిని; భరణ = భరించుట యందు; ధురంధరుండు = మిక్కిలి నేర్పరి; అగుచున్ = అవుతూ; పాండుసుతా = పాండవులలో {పాండుసుతులు - పాండురాజు యొక్క పుత్రులు, పాండవులు}; అగ్రజుడు = పెద్దవాడు {అగ్రజుడు – ముందు పుట్టినవాడు, పెద్దవాడు}; ఒప్పుచుండన్ = చక్కగా ఉండగా; భూవర = రాజా {భూవరుడు - భూమికి వరుడు, రాజు}; విదురుండు = విదురుడు; తత్ = ఆ; నికట = దగ్గరి; వర్య = శ్రేష్ఠమైన; తమాల = కానుగచెట్లు; రసాల = మామిడిచెట్లు; మాధవీ = మాధవీ పూలతీగలు; కురవక = ఎఱ్ఱగోరింటచెట్లు; మాలతీ = మాలతీపూలతీగలు; వకుళ = పొగడచెట్లు; కుంజ = పొదరిళ్ళతో; లసత్ = ప్రకాశిస్తున్న; తటము = ఏటివొడ్డు, ప్రదేశము; అందున్ = అందు; ఉన్న = ఉన్నట్టి; ఎడన్ = సమయమున;
భావము:- "రాజా! అలా వస్తున్న విదురుడు ఆ పరిసర ప్రాంతంలోని మద్దిచెట్లూ, మామిడిచెట్లు గురివెంద, ఎఱ్ఱగోరింట, మాలతి, పొగడ మొదలైన తరులతాదులతో కూడి ఉన్న నదీ తీరంలో విదురుడు ఆగి ఉన్నాడు. ఆ సమయంలో రాక్షససంహారుడు శ్రీకృష్ణభగవానుని అనుగ్రహం వల్ల లభించిన సామాజ్ర్యాన్ని ధర్మరాజు పరిపాలిస్తున్నాడు, సమస్త మహిమండలభారాన్ని చక్కగా వహిస్తున్నాడు.
తెభా-3-43-చ.
నరవర! వేణుజానలవినష్ట మహాటవిమాడ్కిఁ బాండు భూ
వర ధృతరాష్ట్ర సూను లనివార్య నిరూఢ విరోధ మెత్తి యొం
డొరుల జయింపఁ గోరి కదనోర్విఁ గురుక్షితిపాలముఖ్యు లం
దఱు మృతు లౌటయున్ విని ఘనంబుగ శోకనిమగ్నచిత్తుఁడై.
టీక:- నరవర = రాజా {నరవరుడు - నరులకు వరుడు, రాజు}; వేణు = వెదుళ్ళ కు; జ = పుట్టిన; అనల = నిప్పు వలన; వినష్ట = బాగా నశించిన; మహా = గొప్ప; అటవి = అడవి; మాడ్కిన్ = వలె; పాండుభూవర = పాండురాజు; ధృతరాష్ట్ర = ధృతరాష్ట్రుల; సూనులు = కొడుకులు; అనివార్య = వారింపలేని; నిరూఢ = పాతుకుపోయిన; విరోధమున్ = వైరమును; ఎత్తి = వహించి; ఒండొరులన్ = ఒకరి నొకరు; జయింపన్ = జయించుటను; కోరి = కోరుకొని; కదన = రణ; ఉర్విన్ = రంగమున; కురు = కురువంశపు; క్షితిపాల = రాజులలో {క్షితిపాలుడు - భూమిని పాలించువాడు, రాజు}; ముఖ్యులున్ = ముఖ్యమైనవారు; అందఱున్ = అందరూ; మృతులు = మరణించినవారు; ఔటన్ = అవుటను; విని = విని; ఘనంబుగన్ = ఎక్కువగా; శోక = దుఃఖమున; నిమగ్న = మునిగిన; చిత్తుడు = చిత్తము కలవాడు; ఐ = అయి.
భావము:- రాజా! పరీక్షిత్తూ! అప్పుడు ఆ విదురునికి కురుక్షేత్రసంగ్రామం సంగతి తెలిసింది. కౌరవులూ, పాండవులూ వారింపరాని వైరాలతో మహా ఘోరమైన యుద్ధం చేసారనీ, పరస్పర విజయోత్కంఠతో జరిగిన ఆ కురుక్షేత్ర మహాసంగ్రామంలో, వెదురుపొదలలో పుట్టే దావాగ్నిలో దగ్ధమయ్యే అడవిలాగా దుర్యోధనాది కురుకుమార సమూహమంతా నశించారనీ విని విదురుడు పట్టరాని శోకంలో మునిగాడు.
తెభా-3-44-ఉ.
ఆ యెడఁ గాలు దన్నక రయంబున నేఁగి సరస్వతీనదీ
తోయములందుఁ గ్రుంకి మునితుల్యుఁడు వే చనియెం దనూనపా
త్తోయరుహాప్త భార్గవ పృథుత్రిత సోమ సుదాస శక్తి భృ
ద్వాయు యమాభిధానయుత వాహినులం దనురక్తిఁ గ్రుంకుచున్.
టీక:- ఆ = ఆ; ఎడన్ = సమయములో; కాలు = కాలు; తన్నకన్ = నిలువక; రయంబునన్ = శ్రీఘ్రముగా; ఏగి = వెళ్ళి; సరస్వతీ = సరస్వతి అను; నదీ = నది యొక్క; తోయములు = నీటి; అందున్ = లో; క్రుంకి = స్నానముచేసి; ముని = మునులతో; తుల్యుడు = సమానమైనవాడు; వేచనియెం = వెళ్ళివెళ్ళి; తనూనపాత్ = అగ్నిహోత్ర; తోయరుహాప్త = సూర్య {తోయరుహాప్త - తోయ (నీట) రుహ (పుట్టిన, మొలచిన) (పద్మము)లకు ఆప్తుడు, సూర్యుడు}; భార్గవ = భార్గవ {భార్గవుడు - భర్గుని కొడుకు, పరశురాముడు}; పృథు = పృథు {పృథు - పృథుచక్రవర్తి}; త్రిత = త్రిత; సోమ = సోమ {సోముడు - చంద్రుడు}; సుదాస = సుదాస; శక్తిభృత్ = కుమారస్వామి; వాయు = వాయు; యమ = యమ; అభిదాన = పేర్లు; యుత = కల; వాహినులు = నదులు; అందున్ = లో; అనురక్తిన్ = ఇష్టముగ; క్రుంకుచున్ = స్నానముచేయుచు.
భావము:- విదురుడికి ఇక అక్కడ ఉండడానికి కాలు నిలబడలేదు. మునిసమానుడైన ఆ విదురుడు వెంటనే యాత్రలకు మరల బయలుదేరాడు. సరస్వతీ నదిలో స్నానంచేసాడు. అనంతరం అగ్ని, సూర్య, శుక్ర, పృథు, త్రిత, సోమ, సుదాస, కుమార, వాయు, యమ ఇత్యాది దేవతానామాలతో ప్రసిద్ధమైన నదులలో ఆసక్తితో స్నానాలు చేసాడు.
తెభా-3-45-ఉ.
వెండియుఁ బుణ్యభూములఁ బవిత్రసరిత్తులఁ జూచుచున్ రమా
మండనుఁ డుండు దివ్యరుచిమన్మణిచారుకవాట గేహళీ
మండిత సౌధగోపుర విమానము లున్నత భక్తిఁ జూచుచున్
నిండిన వేడ్కఁ గృష్ణు పద నీరజ చింతనుఁ డై క్రమంబునన్.
టీక:- వెండియున్ = మరియు; పుణ్య = పవిత్ర; భూములన్ = ప్రదేశములను; పవిత్ర = పవిత్ర; సరిత్తులన్ = నదులను; చూచుచున్ = చూస్తూ; రమామండనుడు = కృష్ణుడు {రమామండనుడు - రమ (లక్ష్మీదేవి)చే మండనుండు (అలంకారముగా గలవాడు), విష్ణువు}; ఉండు = ఉండే; దివ్య = దివ్యమైన; రుచిమత్ = కాంతులుగల; మణి = మణులతో కూడిన; చారు = అందమైన; కవాట = తలుపులు; గేహళీ = ద్వారబంధములతో; మండిత = అలంకరింపబడిన; సౌధ = సౌధములు {సౌధము - సున్నము కొట్టిన ఇండ్లు}; గోపుర = ఎత్తైన గోపురములు; విమానములు = విమానములను {విమానము - చక్రవర్తి సౌధము, ఆకాశయాన సాధనము}; ఉన్నత = గొప్ప; భక్తిన్ = భక్తితో; చూచుచున్ = చూస్తూ; నిండిన = నిండు; వేడ్కన్ = కోర్కెతో; కృష్ణు = కృష్ణునియొక్క; పద = పాద; నీరజ = పద్మములను; చింతనుండు = ధ్యానించుచున్నవాడు; ఐ = అయి; క్రమంబునన్ = వరుసగా.
భావము:- ఇంకా విదురుడు పుణ్యస్థలాలనూ, పవిత్రనదీ తీర్థాలనూ సేవిస్తూ వెళ్ళి అలా లక్ష్మీ పతియైన శ్రీకృష్ణుని దివ్య మందిరాలు, మహోజ్వలమైన మణులు పొదిగిన తలుపులతో, గడపలతో విరాజిల్లుతున్న సౌధాలూ, విమానాలూ, గోపురాలూ, ఆలయాలూ మిక్కిలి భక్తితో చూస్తూ నగరంలోకి వెళ్ళాడు. శ్రీకృష్ణుని పాదపద్మాలను స్మరిస్తూ ఎంతో సంతోషంతో ముందుకు సాగాడు.
తెభా-3-46-చ.
చని చని తొంటి మత్స్యకురుజాంగలభూము లతిక్రమించి చ
య్యన యమునానదిం గదిసి యచ్చట భాగవతున్ సరోజలో
చన దృఢభక్తు సద్గుణవిశారదు శాంతుని దేవమంత్రి శి
ష్యుని మహితప్రసిద్ధుఁ బరిశోషితదోషుఁ బ్రబుద్ధు నుద్ధవున్.
టీక:- చనిచని = వెళ్ళివెళ్ళి; తొంటి = మునుపటి; మత్స్య = మత్స్య; కురు = కురుదేశపు; జాంగల = మెరక; భూములన్ = ప్రదేశములన్; అతిక్రమించి = దాటి; చయ్యన = వేగముగ; యమునా = యమున అను; నదిన్ = నదిని; కదిసి = సమీపించి; అచ్చటన్ = అక్కడ; భాగవతున్ = భాగవత ధర్మానుయాయిని; సరోజలోచన = కృష్ణుని {సరోజలోచనుడు - సరస్ నందు పుట్టిన (పద్మము)ల వంటి కన్నులున్నవాడు, కృష్ణుడు}; దృఢ = గాఢమైన; భక్తున్ = భక్తుని; సద్గుణ = మంచిగుణములలో; విశారదు = బహునేర్పరిని; శాంతుని = ప్రశాంతముగ నుండువానిని; దేవమంత్రి = బృహస్పతి {దేవమంత్రి - దేవతలకు మంత్రి, బృహస్పతి}; శిష్యుని = శిష్యుని; మహిత = మిక్కిలి; ప్రసిద్ధున్ = పేరుపొందినవానిని; పరిశోషిత = శుష్కింపబడిన; దోషున్ = దోషములు కల వానిని; ప్రబుద్ధున్ = మేల్కాంచిన బుద్ధి కలవానిని; ఉద్ధవున్ = ఉద్ధవుని.
భావము:- అలాగ వెళ్ళివెళ్ళి మత్స్య, కురు, జాంగల భూములను అతిక్రమించి అనంతరం యమునా నదిని సమీపించాడు. ఆ నదీతీరంలో పరమభాగవతుడు, శ్రీకృష్ణుని మీద అఖండమైన భక్తిగలవాడు. ఉత్తమగుణ సంపన్నుడు, శాంతుడు, రాజనీతిలో బృహస్పతి శిష్యుడు, మిక్కిలి యశస్సు కలవాడూ, దోషశూన్యుడు, మహాజ్ఞాని అయిన ఉద్ధవుణ్ణి దర్శించాడు.
తెభా-3-47-క.
కని యనురాగ వికాసము
దన మనమునఁ దొంగిలింపఁ దగ గాఢాలిం
గన మాచరించి నెయ్యం
బునఁ గుశలప్రశ్న సేసి ముదమునఁ బలికెన్.
టీక:- కని = చూసి; అనురాగ = ప్రేమ; వికాసము = వికాసము; తన = తన యొక్క; మనమునన్ = మనసు నందు; తొంగిలింపన్ = ఆక్రమించగా; తగ = తగ; గాఢ = గట్టిగా; ఆలింగనము = కౌగలించుట; ఆచరించి = చేసి; నెయ్యంబునన్ = స్నేహమున; కుశలప్రశ్న = కుశలప్రశ్నలు; చేసి = వేసి; ముదమునన్ = సంతోషముతో; పలికెన్ = అనెను.
భావము:- ఉద్ధవుణ్ణి చూడగానే విదురుని హృదయంలో అనురాగం పొంగిపొరలింది. రెండుచేతులు చాపి గట్టిగా కౌగిలించుకున్నాడు. స్నేహం పాటిస్తూ కుశలప్రశ్నలు కురిపించిన అనంతరం సంతోషంతో విదురుడు ఉద్ధవునితో ఇలా అన్నాడు.
తెభా-3-48-క.
"హరిభక్తులు పుణ్యాత్ములు
దురితవిదూరులు విరోధిదుర్దమబలులుం
గురుకులతిలకులు కుంతీ
వరసూనులు గుశలులే యవారిత భక్తిన్.
3-48/1-వ. ఇట్లనియె. - తంజనగరము - తేవప్పెరుమాల్లయ్య వారి ప్రతి
టీక:- హరి = కృష్ణుని {హరి - దుఃఖములను హరించువాడు, కృష్ణుడు}; భక్తులు = భక్తులు; పుణ్యాత్ములున్ = పుణ్యాత్ములును; దురిత = పాపములకు; విదూరులున్ = దూరముగా నుండువారును; విరోధి = విరోధులకు; దుర్దమ = ఓడించుటకు వీలుకాని; బలులున్ = బలము కలవారును; కురు = కురు; కుల = వంశమునకు; తిలకులు = అలంకార మైనవారును; కుంతీ = కుంతీదేవి యొక్క; వర = శ్రేష్ఠమైన; సూనులున్ = పుత్రులు; కుశలులే = క్షేమమేనా; అవారిత = వారింపరాని; భక్తిన్ = భక్తితో.
భావము:- “ఓ ఉద్ధవా! కృష్ణభక్తులూ, పవిత్రచరిత్రులూ, విరోధులకు నిరోధింపరాని వీరాధివీరులూ, కురుకులానికి అలంకార మయిన వారూ అయిన కుంతీదేవి కుమారులు కుశలంగా వున్నారా.
తెభా-3-49-చ.
హరి దన నాభిపంకరుహమందు జనించిన యట్టి భారతీ
శ్వరుఁ డతిభక్తి వేడ యదువంశమునన్ బలకృష్ణమూర్తులై
పరఁగ జనించి భూభరముఁ బాపిన భవ్యులు రేవతీందిరా
వరులట శూరసేనుని నివాసమునన్ సుఖ మున్నవారలే?
టీక:- హరిన్ = విష్ణుని; తన = తన యొక్క; నాభి = బొడ్డున; పంకరుహము = పద్మము {పంకరుహము - బురదలో పుట్టునది, పద్మము}; అందున్ = లో; జనియించినయట్టి = పుట్టినట్టి; భారతీశ్వరుడు = బ్రహ్మదేవుడు {భారతీశ్వరుడు - సరస్వతీదేవిభర్త, బ్రహ్మదేవుడు}; అతి = మిక్కిలి; భక్తిన్ = భక్తితో; వేడన్ = కోరగా; యదు = యదు; వంశమునన్ = వంశములో; బల = బలరాముడు; కృష్ణ = కృష్ణుడు; మూర్తులు = రూపులు ధరించినవాడు; ఐ = అయి; పరగన్ = ప్రసిద్ధికెక్కి; జనించి = పుట్టి; భూ = భూదేవి యొక్క; భరమున్ = భారమును; పాపిన = పోగొట్టిన; భవ్యులు = శుభరూపులు; రేవతీ = రేవతీ దేవి యొక్క; ఇందిర = రుక్మిణి దేవి యొక్క {ఇందిర - లక్ష్మీదేవి, ఆమె అవతారం రుక్మిణి}; వరులు = భర్తలు; అట = అక్కడ; శూరసేనుని = శూరసేనుని {శూరసేనుడు - కృష్ణుని తాత}; నివాసమున్ = పట్టణమున; సుఖమునన్ = సౌఖ్యముగ; ఉన్నవారలే = ఉన్నారా.
భావము:- తన నాభికమలం నుండి పుట్టిన బ్రహ్మదేవుడు పరమభక్తితో ప్రార్థింపగా శ్రీహరి బలరాముడుగా, కృష్ణుడుగా యదువంశంలో ఉదయించాడు. అట్లా పుట్టి భూభారాన్ని పోగొట్టిన మహోదయులు, రేవతీరుక్మిణీ హృదయప్రియులు రామకృష్ణులు తమ తాత గారి ఇంటిలో సుఖంగా ఉన్నారా.
తెభా-3-50-చ.
కురుకులు లాదరింపఁగ సఖుండును నాప్తుఁడునై తనర్చి సో
దర తరుణీజనంబులనుఁ దత్పతులం గడు గారవంబునం
గరుణ దలిర్ప నాత్మజులకంటెఁ బ్రియోన్నతిఁ బ్రోచువాడు సు
స్థిరమతి నున్నవాఁడె వసుదేవుఁడు వృష్ణికులప్రదీపకా!
టీక:- కురు = కురు; కులులు = వంశస్తులు; ఆదరింపగన్ = ఆదరిస్తుండగా; సఖుడునున్ = మిత్రుడు; ఆప్తుడున్ = ఆపదలలో ఆదుకొనువాడు; ఐ = అయి; తనర్చి = అతిశయించి; సోదర = తోటి; తరుణీ = స్త్రీ; జనంబులన్ = జనములను; తత్ = వారి; పతులన్ = భర్తలను; కడు = మిక్కిలి; గారవంబున్ = ప్రేమ; కరుణన్ = దయ; తలిర్పన్ = వికసించగా; ఆత్మజుల = తన పుట్టిన వారి; కంటెన్ = కంటెను; ప్రియ = ప్రేమ యొక్క; ఉన్నతిన్ = ఉన్నతితో; ప్రోచు = కాపాడే; వాడు = వాడు; సుస్థిర = చక్కటి స్థిరమైన; మతిన్ = మనసుతో; ఉన్నవాడె = ఉన్నడా; వసుదేవుడు = వసుదేవుడు; వృష్ణికులప్రదీపకా = ఉద్ధవా {వృష్ణికులప్రదీపకుడు - వృష్ణి కులమును ప్రకాశింపజేయువాడు, ఉద్ధవుడు}.
భావము:- వృష్ణివంశాన్ని ప్రకాశవంతం చేయువాడ! ఉద్దవా! కురువంశీయులైన కౌరవులూ, పాండవులూ తనను ఎంతో గౌరవంగా చూస్తుండగా, నెయ్యమై, ఆప్తుడై తన చెల్లెళ్ళనూ, వారి భర్తలనూ ఎంతో ఆదరంగా ఆప్యాయంగా కన్నబిడ్డలకంటె మిన్నగా లాలించి పాలించే వసుదేవుడు ఆరోగ్యంగా ఉన్నాడా?
తెభా-3-51-శా.
కందర్పాంశమునం దనూజుఁ బడయం గామించి భూదేవతా
బృందంబున్ భజియించి తత్కరుణ దీపింపం బ్రభావంబు పెం
పొందన్ రుక్మిణి గన్ననందనుఁడు ప్రద్యుమ్నుండు భాస్వచ్ఛమూ
సందోహంబులు దన్నుఁ గొల్వ మహితోత్సాహంబునన్ మించునే.
టీక:- కందర్ప = మన్మథుని; అంశమునన్ = అంశము; అందు = తో; తనుజున్ = పుత్రుని; పడయన్ = పొందుటను; కామించి = కోరి; భూదేవతా = బ్రాహ్మణుల; బృందమున్ = సమూహమును; భజియించి = ఆరాధించి; తత్ = వారి; కరుణ = దయ; దీపింపన్ = ప్రకాశింపగ; ప్రభావంబు = ప్రభావము; పెంపొందన్ = వృద్ధికాగా; రుక్మిణి = రుక్మిణీదేవి; కన్న = కన్నటువంటి; నందనుడు = కొడుకు; ప్రద్యుమ్నుండు = ప్రద్యుమ్నుడు; భాస్వత్ = ప్రకాశిస్తున్న; చమూ = సేనల; సందోహంబులు = సమూహములు; తన్నున్ = తనను; కొల్వ = కొలుచుచుండగా; మహిత = గొప్ప; ఉత్సాహంబునన్ = ఉత్సాహముతో; మించునే = అతిశయించుచున్నాడా.
భావము:- మన్మథుని అంశగల కుమారుణ్ణి పొందదలచి రుక్మిణీదేవి బ్రాహ్మణుల్ని పూజించింది, వారి అనుగ్రహం వల్ల అత్యంత మహిమోపేత అయిన రుక్మిణీమాత కన్న సంతానం ప్రద్యుమ్నుడు సమస్త సేనాసమూహం తనను సంసేవిస్తూ ఉండగా ఉత్సాహంతో ఉన్నాడుగదా!
తెభా-3-52-క.
సరసిజలోచన కరుణా
పరిలబ్ధ సమస్త ధరణిపాలన మహిమం
బరమప్రీతి సుఖించునె
చిరవిభవోదారుఁ డుగ్రసేనుఁడు జగతిన్.
టీక:- సరసిజలోచన = కృష్ణుని {సరసిజలోచనుడు - పద్మముల వంటి కన్నులున్నవాడు, కృష్ణుడు}; కరణా = దయవలన; పరి = చక్కగా; లబ్ధ = లభించిన; సమస్త = సమస్తమైన; ధరణీ = భూమిని; పాలన = పాలించు; మహిమన్ = ప్రభావమున; పరమ = మిక్కిలి; ప్రీతిన్ = ఇష్టముగా; సుఖించునే = సుఖిస్తున్నాడా; చిర = చాలాకాలము; విభవ = వైభవముతో; ఉదారుడు = ఉదార స్వభావుడు; ఉగ్రసేనుడు = ఉగ్రసేనుడు {ఉగ్రసేనుడు - కృష్ణుని తాత, కంసుని తండ్రి}; జగతిన్ = భూమిపైన.
భావము:- పద్మాలలాంటి కన్నులున్న కృష్ణుని కరుణాకటాక్షం వల్ల లభించిన రాజ్యాన్ని అంతటినీ పాలిస్తున్న ఉగ్రసేనుడు సంప్రీతుడై, శాశ్వత వైభవం పొంది సుఖంగా జీవిస్తూ ఉన్నాడా?
తెభా-3-53-చ.
లలిత పతివ్రతామణి విలాసవతీతిలకంబు పార్వతీ
లలన గుమారుఁ గన్నటు సులక్షణ జాంబవతీ లలామ ని
ర్మల గతిఁ గన్న పట్టి సుకుమారతనుండు విరోధిభంజనో
త్కలిక సుఖించునే గుణకదంబుఁడు సాంబుఁడు వృష్ణిపుంగవా!
టీక:- లలిత = లాలిత్యముగల; పతివ్రతా = పతివ్రతలలో; మణి = మణివంటిదియును; విలాసవతీ = శృంగారవతులలో, స్త్రీలలో; తిలకంబున్ = శ్రేష్ఠమైనదిను; పార్వతీ = పార్వతీ; లలన = దేవి; కుమారున్ = కుమారస్వామిని; కన్న = కనిన; అటు = విధముగ; సులక్షణ = మంచిలక్షణములు గలామె; జాంబవతీ = జాంబవతీ; లలామ = దేవి; నిర్మల = నిర్మలమైన; గతిన్ = విధముగ; కన్న = కనిన; పట్టి = కుమారుడు; సుకుమార = సుకుమారమైన; తనుండు = శరీరము కలవాడు; విరోధి = శత్రువులను; భంజన = భంగపరచు; ఉత్కలికన్ = ఉత్సాహ తరంగముతో; సుఖించునే = సౌఖ్యముగ ఉన్నాడా; గుణ = సుగుణముల; కదంబుడు = కలయికైనవాడు; సాంబుడు = సాంబుడు; వృష్ణిపుంగవా = ఉద్దవా {వృష్ణిపుంగవుడు - వృష్ణి వఁశమున శ్రేష్ఠుడు, ఉద్దవుడు}.
భావము:- వృష్ణివంశపు ఉత్తముడా! ఉద్దవా! పతివ్రతా శిరోమణీ, ఉత్తమ రమణీమణీ, సద్గుణవతీ అయిన జాంబవతి, పార్వతీదేవి కుమారస్వామిని కన్నట్లు సాంబుని కన్నది. సుకుమారమైన దేహంగల అందగాడూ, విరోధులను చీల్చి చెండాడే వీరాధివీరుడు, సుగుణాలవాలుడు. ఆ సాంబుడు క్షేమమేనా?
తెభా-3-54-క.
హరిపదసేవకుఁ డరి భీ
కరుఁ డర్జును వలన మిగులఁ గార్ముక విద్యల్
దిరముగఁ గఱచిన సాత్యకి
వరసుఖ విభవముల నున్నవాఁడె ధరిత్రిన్?
టీక:- హరి = కృష్ణుని {హరి - సంచిత పాపములను హరించు వాడు, కృష్ణుడు}; పద = పాదములను; సేవకుడు = సేవించువాడు; అరి = శత్రువులకు; భీకరుడు = భయము కలిగించువాడు; అర్జును = అర్జునుని; వలన = వలన; మిగుల = మిక్కిలి; కార్ముక = విలు; విద్యల్ = విద్యలు; తిరముగ = స్థిరముగా; కఱచిన = నేర్చిన; సాత్యకి = సాత్యకి; వర = శ్రేష్ఠమైన; సుఖ = సౌఖ్యముల; విభవములన్ = వైభవములతో; ఉన్నవాడె = ఉన్నాడ; ధరిత్రిన్ = భూమిమీద.
భావము:- కృష్ణ చరణ కింకరుడూ, శత్రువుల పాలిటి భయంకరుడూ, అర్జునుని దగ్గర చక్కటి విలువిద్య నేర్చుకొన్నవాడూ అయిన సాత్యకి అత్యంత సుఖవైభవాలతో అలరారుతున్నాడా?
తెభా-3-55-మ.
జలజాతాంకుశ చక్ర చాప కులిశచ్ఛత్రాది రేఖాంకితో
జ్జ్వల గోవింద పదాబ్జ లక్షిత విరాజన్మార్గ ధూళిచ్ఛటా
కలితాంగుండు విధూతకల్మషుఁడు నిష్కామైక ధర్ముండు స
త్కులజాతుండన నొప్పు నట్టి ఘనుఁ డక్రూరుండు భద్రాత్ముఁడే?
టీక:- జలజాత = పద్మము; అంకుశ = అంకుశము; చక్ర = చక్రము; చాప = విల్లు; కులిశ = వజ్రము; ఛత్ర = గొడుగు; ఆది = మొదలైన; రేఖా = రేఖల; అంకిత = గుర్తులు; తోన్ = తో; ఉజ్జ్వల = ప్రకాశవంతమైన; గోవింద = కృష్ణుని {గోవిందుడు - గోవులకు నాయకుడు, కృష్ణుడు}; పద = పాదములను; అబ్జ = పద్మముల; లక్షిత = గురుతు వేయబడి; విరాజిత్ = విరాజిల్లుచున్న; మార్గ = త్రోవలందలి; ధూళి = దుమ్ము; చ్ఛటా = రేణువులచే; కలిత = కూడిన; అంగుడు = దేహముకలవాడు; విధూత = పోగోట్టబడిన; కల్మషుడు = పాపములు కలవాడు; నిష్కామ = కోరికలు లేకపోవుట అనుట; ఏక = మాత్రమే; ధర్ముండు = ధర్మముగా కలవాడు; సత్ = మంచి; కుల = వంశమున; జాతుండు = పుట్టినవాడు; అనన్ = అనగా; ఒప్పునట్టి = ఒప్పుచున్న; ఘనుడు = గొప్పవాడు; అక్రూరుండు = అక్రూరుడు; భద్ర = శుభమైన; ఆత్ముడే = మనసు కలవాడు.
భావము:- గోవులకు ఒడయుడు అయిన శ్రీకృష్ణుని పాదాలు పద్మం, అంకుశం, చక్రం, ధనుస్సు, వజ్రం, ఛత్రం మొదలైన శుభరేఖలతో ఒప్పి ఉంటాయి. అటువంటి శ్రీపాదముద్రలు ప్రకాశించే త్రోవలలోని దుమ్ముతో ధూసరితం అయిన నిండుదేహంతో, పాపరహితుడు అయిన అక్రూరుడు ఆనందంగా ఉన్నాడా? నిష్కాముడూ, ధర్మపరుడూ, సద్వంశ సంజాతుడూ అయిన ఆ మహానుభావునికి క్షేమమే కదా.
తెభా-3-56-క.
శ్రుతులునుఁ గ్రతుజాతము స
మ్మతిఁ దాల్చినయట్టి వేదమాతగతిన్ శ్రీ
పతిఁ దనగర్భంబున ర
క్షితుఁ జేసిన గరిత దేవకీసతి సుఖమే.
టీక:- శ్రుతులున్ = వేదములును; క్రతు = యజ్ఞముల; జాతమున్ = సమూహములును; సమ్మతిన్ = అంగీకారముతో; తాల్చిన = ధరించిన; అట్టి = అటువంటి; వేదమాత = గాయత్రి {వేదమాత - వేదములకు తల్లి వంటిది, గాయత్రి}; గతిన్ = వలె; శ్రీపతిన్ = కృష్ణుని {శ్రీపతి - లక్ష్మీదేవి భర్త, విష్ణుసహస్రనామాలలో 603వ నామం}; తన = తన; గర్భంబునన్ = గర్భమున; రక్షితున్ = కాపాడబడినవానిగ; చేసిన = చేసినట్టి; గరిత = పతివ్రత; దేవకీసతి = దేవకీదేవి; సుఖమే = సౌఖ్యముగ ఉన్నదా.
భావము:- వేదాలనూ యజ్ఞాలనూ సాదరంగా తనలో దాచుకొన్న వేదమాతలా శ్రీమన్నారాయణుణ్ణి తన గర్భంలో ఆప్యాయంగా ధరించి కాపాడిన దొడ్డ ఇల్లాలు దేవకీదేవి సుఖంగా ఉందా?
తెభా-3-57-వ.
మఱియు, మహాత్మా! మహితోపాసకులగువారల కోర్కులు నిండింపజాలిన పరమేశ్వరుండు శబ్దశాస్త్రంబునకుం గారణంబని తన్ను నఖిల దేవతాజనంబు లగ్గింపంగలమేటి యగుటంజేసి మనోమయుండును సకలజీవచతుర్విధాంతఃకరణంబు లైన చిత్తాహంకార బుద్ధి మనంబులకుం గ్రమంబున వాసుదేవ సంకర్షణ ప్రద్యుమ్నానిరుద్ధు లధిదేవతంబు లగుదు; రట్టి చతుర్విధతత్త్వంబులకుఁ దుర్యంబైన తత్త్వంబును నైన యనిరుద్ధకుమారుండు సంతోషచిత్తుండగునే"యని.
టీక:- మఱియున్ = ఇంకనూ; మహాత్మా = గొప్పవాడా; మహిత = మిక్కిలిగా; ఉపాసకులు = సేవించువారు; అగు = అయిన; వారల = వారి యొక్క; కోర్కులు = కోరికలను; నిండింప = తీర్చ; జాలిన = గలిగిన; పరమ = అత్యున్నత; ఈశ్వరుడు = దేవుడు; శబ్దశాస్త్రంబున్ = వ్యాకరణమున; కున్ = కు; కారణంబు = కారణము; అని = అని; తన్ను = తనను; అఖిల = సమస్తమైన; దేవతా = దేవతల; జనంబులు = సమూహములు; అగ్గింపన్ = స్తుతింపగా; కల = అర్హత కలిగిన; మేటి = శక్తిమంతుడు; అగుటన్ = అవుట; చేసి = వలన; మనస్ = మనసును; మయుండును = నిండి ఉండువాడును; సకల = సమస్తమైన; జీవ = జీవులకు; చతురః = నాలుగు; విధ = విధములైన; అంతఃకరణంబులు = లోపలి ఇంద్రియములు {చతుర్విధాంతకరణములు అధిదేవతలు - 1 చిత్తము-వాసుదేవుడు 2 అహంకారము-సంకర్షణుడు 3 బుద్ధి-ప్రద్యుమ్నుడు 4 మనసు-అనిరుద్ధుడు}; ఐన = అయినట్టి; చిత్త = చిత్తమునకు; అహంకార = అహంకారమునకు; బుద్ధి = బుద్ధికి; మనంబులు = మనసుల; కున్ = కు; క్రమంబునన్ = వరుసగా; వాసుదేవ = వాసుదేవుడు; సంకర్షణ = సంకర్షణుడు; ప్రద్యుమ్న = ప్రద్యుమ్నుడు; అనిరుద్ధులు = అనిరుద్ధులు; అధిదేవతంబులు = అధిదేవతలు {అధిదేవతలు - అధికారము కలవారు}; అగుదురు = అవుతారు; అట్టి = అటువంటి; చతుః = నాలుగు; విధ = విధములైన; తత్త్వంబులు = తత్త్వముల; కున్ = కు; తుర్యంబున్ = నాలుగవది {తుర్యంబు - తురీయంబు, నాలుగవది}; ఐన = అయినట్టి; తత్త్వంబును = అంశమును; ఐన = అయిన; అనిరుద్ధ = అనిరుద్ధుడు అను; కుమారుడు = పిల్లవాడు; సంతోష = సంతోషముతో కూడిన; చిత్తుండు = మనసు కలవాడు; అగునే = అవునా; అని = పలికి.
భావము:- మహాత్మా! ఉద్దవా! అనిరుద్ధుడు నిత్యం తన్ను భక్తితో సేవించేవారి కోరికలన్నీ నెరవేర్చగల భగవానుడు. శబ్దశాస్త్రానికి కారణమని సమస్త దేవతలచేత కొనియాడబడ దగిన వాడు. మనోమయుడైనవాడు. అఖిల ప్రాణులకూ అంతఃకరణాలైన చిత్తం, అహంకారం, బుద్ధి, మనస్సు అనే నాలుగింటికీ క్రమంగా వాసుదేవుడు, సంకర్షణుడు, ప్రద్యుమ్నుడు, అనిరుద్ధుడు అధిష్ఠాన దైవాలు. ఇలా మనస్సుకు అధిపతియైన ఆ అనిరుద్ధుడు ఆనందంగా ఉన్నాడా?” అని అడగి మరల.
తెభా-3-58-మ.
"ఇతరారాధన మాని కృష్ణుఁ గమలాధీశుం బయోజాసనా
ర్చితు భక్తిన్ నిజనాథుఁగా సతతమున్ సేవించు పుణ్యుల్ జగ
న్నుతు లధ్యాత్మ విదుల్మహాభుజులు మాన్యుల్ ధర్మమార్గుల్సము
న్నతి సత్యాత్మజ చారుదేష్ణ గదు లానందాత్ములే యుద్ధవా!
టీక:- ఇతర = ఇతరమైన; ఆరాధనము = సేవించుటలు; మాని = మానేసి; కృష్ణున్ = కృష్ణుని; కమలాధీశున్ = కృష్ణుని {కమలాధీశుడు - లక్ష్మీపతి, విష్ణువు}; పయోజాసనార్చితున్ = కృష్ణుని {పయోజాసనార్చితుడు - బ్రహ్మచేపూజింపబడువాడు, విష్ణువు}; భక్తిన్ = భక్తితో; నిజ = తన; నాథుగాన్ = ప్రభువుగా; సతతమున్ = ఎల్లప్పుడు; సేవించు = సేవిస్తుండే; పుణ్యుల్ = పుణ్యాత్ములు; జగత్ = లోకముచే; నుతులు = స్తుతింపబడువారు; అధ్యాత్మ = ఆత్మజ్ఞానము; విదులు = తెలిసినవారు; మహా = గొప్ప; భుజులు = భుజబలము కలవారు; మాన్యుల్ = గౌరవింపదగ్గవారు; ధర్మ = ధర్మమును; మార్గులు = అనుసరించువారు; సమున్నతిన్ = మిక్కిలి గొప్పదనముతో; సత్య = సత్యభామ యొక్క; ఆత్మజులు = పుత్రులు; చారుదేష్ణ = చారుదేష్ణుడు; గదులు = గదుడును; ఆనంద = సంతోషముతో; ఆత్ములే = కూడి ఉన్నారా; ఉద్ధవా = ఉద్ధవుడా.
భావము:- ఓ ఉద్ధవా! ఇతర దేవతా పూజలన్నీ విడిచిపెట్టి, బ్రహ్మదేవునికికూడ పూజనీయుడూ, లక్ష్మీపతీ అయిన శ్రీకృష్ణుణ్ణి తమకు రక్షకుడుగా భావించి భక్తితో నిత్యం సేవించే ధన్యులూ, పుణ్యాత్ములు, లోకంచే గౌరవింపబడువారూ, ఆధ్యాత్మిక విద్యావేత్తలూ, శక్తిసంపన్నులూ, మన్నింపదగినవారూ, ధర్మమార్గంలో నడిచేవారూ అయిన సత్యభామానందనులు, చారుధేష్ణ, గదులు సంతోషంగా ఉన్నారా.
తెభా-3-59-తే.
క్రోధమాత్సర్యధనుఁడు సుయోధనుండు
వొలుచు నెవ్వనిసభఁ జూచి కలుష మొదవి
మనములోన నసూయానిమగ్నుఁ డయ్యె
నట్టి ధర్మజుఁ డున్నాడె? యనఘచరిత!
టీక:- క్రోధ = క్రోధము; మాత్సర్య = మాత్సర్యము; ధనుండు = ధనముగా కలవాడు; సుయోధనుడు = దుర్యోధనుడు; పొలుచున్ = వెలుగు, శోభిల్లు; ఎవ్వని = ఎవని; సభన్ = సభాభవనమును (మయసభ); చూచి = చూసి; కలుషము = క్రోధము; ఒదవి = పొంది; మనసు = మనసు; లోనన్ = లోపల; అసూయా = అసూయలో; నిమగ్నుడు = మునిగినవాడు; అయ్యెన్ = ఆయెనో; అట్టి = అటువంటి; ధర్మజుడు = ధర్మరాజు {ధర్మజుడు - యమధర్మరాజు పుత్రుడు, ధర్మరాజు}; ఉన్నాడే = బాగున్నాడా; అనఘ = పాపములేని; చరిత = ప్రవర్తన కలవాడ.
భావము:- ఓ పుణ్యాత్ముడా! ఉద్దవా! దేదీప్యమానమైన ఏ మయసభను చూసి, మితిమీరిన క్రోధం మాత్సర్యం గల ఆ దుర్యోధనుడు కల్మషం పుట్టి,, మనసులో అసూయతో నిండిపోయాడో, ఆ ధర్మరాజు సుఖంగా ఉన్నాడా?
తెభా-3-60-తే.
ఘనగదాభ్యాస చిత్ర సంగతుల మెఱసి
కురుకుమారుల భూరి సంగరము లోన
హతులఁ గావించి వెలసినయట్టి జెట్టి
వాయుతనయుండు గుశలియై వఱలునయ్య?
టీక:- ఘన = గొప్ప; గదా = గదా ప్రయోగ; అభ్యాస = శిక్షణతో; చిత్ర = విచిత్రమైన; సంగతులన్ = యుక్తులతో; మెఱసి = ప్రకాశించి; కురుకుమారులన్ = కౌరవులను; భూరి = అత్యంత గొప్ప; సంగరము = యుద్ధము; లోనన్ = లో; హతులన్ = సంహరింపబడినవారిగా; కావించి = చేసి; వెలసిన = ప్రకాశించిన; అట్టి = అటువంటి; జెట్టి = వీరుడు; వాయుతనయుండు = భీముడు {వాయుతనయుడు - వాయుదేవుని కుమారుడు, భీముడు}; కుశలి = కుశలముగా ఉన్నవాడు; ఐ = అయి; వఱలున్ = ప్రసిద్ధిచెందునా; అయ్యా = తండ్రీ.
భావము:- గొప్పగా అబ్యాసం చేసిన గదాయుద్ధ విచిత్ర విన్యాసాల కౌశలంతో అతిశయించి, కౌరవులను రణరంగంలో మట్టుపెట్టిన జగజెట్టి వాయుదేవుని పుత్రుడు భీముడు క్షేమంగా ఉన్నాడా?
తెభా-3-61-చ.
హరికరుణాతరంగిత కటాక్ష నిరీక్షణ లబ్ధ శౌర్య వి
స్ఫురణఁ దనర్చి తన్ను నని బోయగతిన్ గిరిశుం డెదర్చినం
పరవశ మొప్పఁగా గెలిచి పాశుపతాస్త్రముఁ గొన్న శత్రు భీ
కరుఁడు ధనంజయుండు సుభగస్థితి మోదము నొందుచుండునే?
టీక:- హరి = కృష్ణుని; కరుణా = దయతో; తరంగిత = తొణుకుతున్న; కటాక్ష = కడగంటి; నిరీక్షణ = చూపులచే; లబ్ధ = లభించిన; శౌర్య = శౌర్యము యొక్క; విస్ఫురణన్ = వికాసము వలన; తనర్చి = అతిశయించి; తన్ను = తనను; అనిన్ = యుద్ధములో; బోయ = బోయవాని; గతిన్ = వలె; గిరిశుండు = శివుడు {గిరిశుడు -గిరీశుడు - పార్వతీదేవి భర్త, శివుడు}; ఎదిర్చినన్ = ఎదిరించగా; పరవశము = పరవశము; ఒప్పగాన్ = పొందేలా; గెలిచి = గెలిచి; పాశుపతాస్త్రమున్ = పాశుపతాస్త్రమును; కొన్న = తీసుకొన్న; శత్రు = శత్రువులకు; భీకరుడు = భయంకరుడు; ధనంజయుండు = అర్జునుడు {ధనంజయుడు - ధనమును (అశ్వమేధ యజ్ఞమునకు వలసిన ధనమును) జయించినవాడు, అర్జునుడు}; సుభగస్థితి = సౌభాగ్యముతో; మోదము = సంతోషము; ఒందుచున్ = పొందుతూ; ఉండునే = ఉన్నాడా.
భావము:- కరుణాతరంగాలు పొంగిపొరలే కమలాక్షుని కటాక్షవీక్షణాలవల్ల లభించిన పరాక్రమాతిశయం కలవాడూ, మాయా కిరాతరూపంతో వచ్చిన మహేశ్వరుడు అంతవాడితో యుద్ధానికి సిద్ధమై తొడగొట్టి నిలిచి గెలిచి మెప్పించి పాశుపతాస్త్రం ఇప్పించుకొన్న మొనగాడూ, అరివీరభయంకరుడూ అయిన అర్జునుడు సుఖంగా సంతోషంగా ఉన్నాడా?
తెభా-3-62-మ.
తెఱఁగొప్పన్ జననీవియోగమునఁ గుంతీస్తన్యపానంబు సో
దర సంరక్షయుఁ గల్గి దేవవిభు వక్త్రస్థామృతంబున్ ఖగే
శ్వరుఁ డర్థిం గయికొన్న మాడ్కిఁ గురువంశశ్రేణి నిర్జించి త
ద్ధరణీరాజ్యముఁ గొన్న మాద్రికొడుకుల్ ధన్యాత్ములే? యుద్ధవా!
టీక:- తెఱగు = మంచి పద్దతి ప్రకారము; ఒప్పన్ = ఒప్పునట్లు; జననీ = తల్లి; వియోగమున్ = ఎడబాటువలన; కుంతీ = కుంతీదేవి; స్తన్య = పాలు; పానంబు = త్రాగుటయు; సోదర = సోదరుల; సంరక్షయున్ = రక్షణయు; కల్గి = కలిగి; దేవవిభు = దేవేంద్రుని {దేవవిభు - దేవతలకు ప్రభువు, దేవేంద్రుడు}; వక్త్రస్థ = నోటి ముందున్న; అమృతంబున్ = అమృతమును; ఖగేశ్వరుడు = గరుత్మంతుడు {ఖగేశ్వరుడు - పక్షులకు ప్రభువు, గరుత్మంతుడు}; అర్థిన్ = కోరి; కయికొన్న = తీసుకొన్న; మాడ్కిన్ = విధముగ; కురు = కౌరవ; వంశ = వంశపు; శ్రేణిన్ = సేనలను; నిర్జించి = ఓడించి; తత్ = ఆ; ధరణీ = భూమిపై; రాజ్యమున్ = ప్రభుత్వమును; కొన్న = తీసుకొన్న; మాద్రి = మాద్రి యొక్క; కొడుకుల్ = కొడుకులు; ధన్య = ధన్యమైన; ఆత్ములే = మనసు కలవారేనా; ఉద్దవా = ఉద్దవుడా.
భావము:- ఓ ఉద్ధవా! తమ కన్నతల్లి కాలంచేయగా, చక్కగా కుంతీదేవి చనుబాలు త్రాగిన వారూ, అన్నలచే రక్షింపబడినవారూ, ఇంద్రుడి అధీనంలో ఉన్న అమృతాన్ని సంపాదించిన గరుత్మంతునిలా, కౌరవుల నందరినీ నిర్జించి వారి రాజ్యాన్ని ఆర్జించినవారూ అయిన మాద్రి కొడుకులు నకులసహదేవులు కుశలంగా ఉన్నారా?
తెభా-3-63-తే.
పాండుభూమీశ్వరుండు సంప్రాప్తమరణుఁ
డైన శిశువులఁ బ్రోచుటకై నిజేశుఁ
గూడి చనకున్న యట్టి యా కుంతిభోజ
తనయ జీవించునే నేఁడు? మనుచరిత్ర!"
టీక:- పాండుభూమీశ్వరుండు = పాండురాజు {భూమీశ్వరుడు - భూమి కి ఈశ్వరుడు , రాజు}; సంప్రాప్త = ప్రాప్తించిన; మరణుడు = మరణము కలవాడు; ఐన = కాగా; శిశువులన్ = పిల్లలను; ప్రోచుట = పెంచుట; కై = కోసం; నిజ = తన; ఈశున్ = భర్త; కూడి = తోపాటు, అనుసరించి; చనక = వెళ్ళకుండగ; ఉన్న = ఉన్న; అట్టి = అటువంటి; ఆ = ఆ; కుంతీభోజతనయ = కుంతీదేవి {కుంతీభోజతనయ - కుంతల దేశ రాజైన భోజుని కూతురు, కుంతీదేవి}; జీవించునే = బతికే ఉందా; నేడు = ఈరోజు; మను = మనువు వంటి; చరిత్ర = చరిత్ర కలవాడ.
భావము:- ఉదాత్తమైన వర్తన గలవాడా! ఉద్ధవా! అనాడు పాండురాజు మరణింపగా భర్తతో పాటు తాను కూడా సహగమనం చేయకుండా బిడ్డల మంచి చెడ్డలు చూడటంకోసం ఉండిపోయింది కుంతీదేవి. ఇప్పుడు ఆమె క్షేమంగా జీవించి ఉన్నది కదా.”
తెభా-3-64-వ.
అని వెండియు.
టీక:- అని = అని; వెండియు = మరియు.
భావము:- అని మరల.
తెభా-3-65-మ.
"అనుజాతుండగు పాండుభూవిభుఁడు నిర్యాణంబునుంబొందనా
తనిపుత్రుల్ తనుఁ జేరవచ్చినను మాధ్యస్థ్యంబుఁబోఁదట్టి యె
గ్గొనరించెన్ ధృతరాష్ట్రభూమివిభుఁ డట్లూహింపఁగా నెగ్గుసే
సినవాఁడే యగుగాక మేలుగలదే చింతింపఁగా నుద్ధవా!
టీక:- అనుజాతుండు = సోదరుడు; అగు = అయిన; పాండుభూవిభుండు = పాండురాజు {భూవిభుడు - భూమికి ప్రభువు, రాజు}; నిర్యాణంబున్ = మరణమును; పొందన్ = పొందగా; ఆతని = అతని; పుత్రుల్ = కొడుకులు; తనున్ = తనను; చేరన్ = దగ్గరకు చేరి; వచ్చిననను = వచ్చినప్పటికిని; మాధ్యస్థ్యంబున్ = మంచి మర్యాద {మాధ్యస్థ్యము - మధ్యవర్తిత్వ న్యాయమును, మంచి మర్యాద}; పోఁదట్టి = వదిలేసి; యెగ్గు = కీడు; ఒనరించెన్ = చేసెను; ధృతరాష్ట్ర = ధృతరాష్ట్తుడు అను; భూవిభుడు = రాజు {భూవిభుడు - భూమికి ప్రభువు, రాజు}; అట్లు = ఆవిధముగ; ఊహింపగాన్ = అనుకొంటుండగా; ఎగ్గు = కీడు; చేసినవాడే = చేసినవాడే; అగున్ = అయితే అయ్యుండ; కాక = వచ్చును; మేలు = బాగానే; కలదే = ఉన్నాడా; చింతింపగాన్ = ఆలోచిస్తే; ఉద్ధవా = ఉద్ధవుడా.
భావము:- అలా పలికిన విదురుడు మరల ఇలా అన్నాడు “ఇంకా ఉద్ధవా! తమ్ముడు పాండురాజు మరణించడంతో, అతని కొడుకులు తన దగ్గరకు వచ్చినపుడు న్యాయం చేసేవానిలా వెన్నుదట్టి ఆశ్రయ మిచ్చి ఆపై కీడే చేసాడు ధృతరాష్ట్రుడు. వాస్తవానికి ఆ మహారాజు చెడ్డవాడేకానీ ఆయన సుఖంగా ఉన్నాడా?
తెభా-3-66-క.
అనుజుఁడు వీఁడనకయ తన
తనయులు నను వెడలనడువఁ దానూరకయుం
డిన ధృతరాష్ట్రుఁడు నరకం
బునఁబడు నాదైన దుఃఖమున ననఘాత్మా!
టీక:- అనుజుడు = సోదరుడు; వీడు = ఇతడు; అనకయ = అని చూడక; తన = తన యొక్క; తనయులు = కొడుకులు; ననున్ = నన్ను; వెడల = బయటకు; నడువన్ = గెంటుతుండగా; తాన్ = తను; ఊరకయుండిన = ఊరకుండిపోయినట్టి; ధృతరాష్ట్రుఁడు = ధృతరాష్ట్రుడు; నరకంబునన్ = నరకములో; పడున్ = పడును; నాది = నాకు; ఐన = అయినట్టి; దుఃఖమునన్ = దుఃఖము వలన; అనఘాత్మా = పుణ్యాత్ముడా.
భావము:- ఉద్దవా! పాపరహితుడవైన మహానుభావా! తన తుంటరి కొడుకులు నన్ను బయటికి గెంటేసినప్పుడు, తమ్ముడు అని కూడా చూడకుండా నోరుమూసుకొని ఊరకున్న ధృతరాష్ట్రుడు నాకు కలిగించిన దుఃఖానికి తప్పక నరకయాతన అనుభవిస్తాడు.
తెభా-3-67-వ.
అదియునుంగాక పరమశాంతుండవైన నీ మనంబున దుఃఖంబు కర్తవ్యంబుగాదంటేని.
టీక:- అదియునున్ = అంతే; కాక = కాకుండగ; పరమ = మిక్కిలి; శాంతుండవు = శాంత స్వభావివి; ఐన = అయినట్టి; నీ = నీ యొక్క; మనంబునన్ = మనసులో; దుఃఖంబున్ = దుఃఖము; కర్తవ్యంబున్ = పద్దతి; కాదు = కాదు; అంటేని = అన్నట్లైతే.
భావము:- నీవేమో పరమశాంతుడవు. నీవు ఇలా దుఃఖపడటం సమంజసం కా దని అంటావేమో.
తెభా-3-68-క.
నరలోకవిడంబనమున
హరి పరమపరుండు మానవాకృతితో ని
ద్ధరఁబుట్టి యాత్మమాయా
స్ఫురణన్ మోహింపఁజేయు భూజనకోటిన్.
టీక:- నర = మానవ; లోక = లోకమును; విడంబనమునన్ = అనుకరించుట వలన; హరి = కృష్ణుడు; పరమపరుడు = పరాత్పరుడు {పరమపరుడు - పరమైనవానికిని పరమైన (ఉన్నతమైన) వాడు, పరాత్పరుడు}; మానవ = మానవుని; ఆకృతిన్ = రూపమున; ఈ = ఈ; ధరన్ = భూమిపైన; పుట్టి = పుట్టి; ఆత్మ = తన; మాయా = మాయ యొక్క; స్ఫురణన్ = నేర్పరితనముతో; మోహింపన్ = మోహములో పడునట్లు; చేయున్ = చేయున్; భూ = భూవాసులైన; జన = జనులు; కోటిన్ = అందరను.
భావము:- పరాత్పరుడైన హరి లీలామానవుడై ఈ లోకంలో పుట్టి తన మాయాప్రభావంతో మానవుల నందరినీ వ్యామోహంలో ముంచుతున్నాడు.
తెభా-3-69-ఉ.
కావున నమ్మహాత్ముని వికారవిదూరుని సర్వమోహమా
యావిలమానసుండ నగునప్పుడు సంసృతిదుఃఖినౌదు న
ద్ధేవుని సత్కృపామహిమఁ దేలినవేళ సుఖింతు నేనకా
దా విధిశంకరప్రభృతు లవ్విభుమాయఁ దరింపనేర్తురే.
టీక:- కావునన్ = అందుచేత; ఆ = ఆ; మహాత్మునిన్ = మహాత్ముని; వికార = సర్వవికారములకు; విదూరునిన్ = బాగా దూరముగ నుండు వాని; సర్వ = అందరను; మోహ = మోహింపజేయు; మాయా = మాయచే; అవిల = కలత నొందిన; మానసుండన్ = మనసు కలవాడను; అగున్ = అయిన; అప్పుడు = సమయము లందు; సంసృతి = సంసారమువలన; దుఃఖిన్ = దుఃఖము కలవాడను; ఔదున్ = అగుదును; ఆ = ఆ; దేవుని = దేవుడి; సత్ = మంచి; కృపా = దయ యొక్క; మహిమన్ = ప్రభావములో; తేలిన = తేలుతుండే; వేళన్ = సమయము లందు; సుఖింతున్ = సుఖిస్తుంటాను; నేన = నేనే; కాదు = కాదు; ఆ = ఆ; విధి = బ్రహ్మదేవుడు; శంకర = శివుడు; ప్రభృతులున్ = మొదలైన గొప్పవారైన; ఆ = ఆ; విభు = ప్రభువు యొక్క; మాయన్ = మాయను; తరింపన్ = దాట; నేర్తురే = గలరా, లేరు;
భావము:- కాబట్టి, ఎలాంటి వికారాలూ లేనివాడూ, మహాత్ముడూ అయిన ఆ శ్రీమన్నారాయణుని మాయావ్యామోహాలకు నా మనస్సు లోనైనపుడు సంసార సంబంధమైన ఈ దుఃఖాలు అనుభవిస్తాను. అలాకాక ఆ దేవదేవుని అపారకృపారసం ప్రసరించిననాడు సుఖంగా ఉంటాను. నేనే కాదు, ఆ బ్రహ్మరుద్రాదులు కూడా ఆ పరాత్పరుని మాయాజాలం నుంచి తప్పించుకొని బయటపడలేరు.
తెభా-3-70-వ.
అయిన నమ్మహాత్ముని కరుణాతరంగితాపాంగ పరిలబ్ధ విజ్ఞాన దీపాంకుర నిరస్త సమస్తదోషాంధకారుండ నగుటంజేసి మదీయ చిత్తంబు హరిపరాయత్తంబయిన కారణంబుననుఁ, దత్త్వంబు సతతంబు నిరీక్షించుచు నుండుదు; మఱియును.
టీక:- అయినన్ = అయినప్పటికిని; ఆ = ఆ; మహాత్ముని = మహాత్ముని; కరణా = దయా; తరంగిత = తరంగములతో కూడుకున్న; అపాంగ = కటాక్షములు; పరి = బాగుగ; లబ్ధ = పొందిన; విజ్ఞాన = విశిష్ట జ్ఞానము అను; దీప = దీపపు; అంకుర = మొలకచే; నిరస్త = తొలగింపబడిన; సమస్త = సమస్తమైన; దోష = దోషములను; అంధకారుండన్ = అంధకారము కలవాడను; అగుటన్ = అగుట; చేసి = వలన; మదీయ = నా యొక్క; చిత్తంబు = మనసు; హరి = విష్ణువుని; పరా = అందే; ఆయత్తంబు = లగ్నమైనది; అయిన = అయినట్టి; కారణంబునను = కారణమువలన; తత్త్వంబున్ = యదార్థతత్త్వమును; సతతంబున్ = ఎల్లప్పుడూ; నిరీక్షించుచున్ = చూస్తూ; ఉండుదున్ = ఉంటాను; మఱియున్ = ఇంకనూ.
భావము:- ఏమైతేనేం, ఆ మహానుభావుడు శ్రీకృష్ణుని కడగంటి చూపుల కరుణారసం ద్వారా లభించిన జ్ఞానదీపకళికలవల్ల నా దోషాలనే చీకట్లన్నీ తొలగిపోయాయి. నా చిత్తం భగవంతుని పాదాలను హత్తుకున్నది. అందువల్ల ఆ పరతత్త్వం కోసమే నిరంతరం నిరీక్షిస్తూ ఉన్నాను.
తెభా-3-71-సీ.
అట్టి సరోజాక్షుఁ డాత్మీయపదభక్తు-
లడవుల నిడుమలఁ గుడుచుచుండ
దౌత్యంబుసేయఁ గొందఱు విరోధులు హరి-
బద్ధునిఁజేయ సన్నద్ధులైన
బలహీనుమాడ్కి మార్పడలేఁడ యసమర్థుఁ-
డని తలంచెదవేని నచ్యుతుండు
పరుల జయింప నోపక కాదు విద్యాభి-
జాత్యధనంబుల జగతిఁ బెక్కు
తెభా-3-71.1-తే.
బాధలనలంచు దుష్టభూపతులనెల్ల
సైన్యయుక్తంబుగా నని సంహరించు
కొఱకు సభలోన నప్పుడా కురుకుమారు
లాడు దుర్భాషణములకు నలుగఁడయ్యె.
టీక:- అట్టి = అట్టి; సరోజాక్షుడు = కృష్ణుడు {సరోజాక్షుడు - సరోజ (పద్మము) లవంటి కన్నులున్న వాడు, కృష్ణుడు}; ఆత్మీయ = తన; పద = పాదములందు; భక్తులు = భక్తికలవారు; అడవులన్ = అడవులలో; ఇడుమలన్ = బాధలను; కుడుచుచున్ = పడుతూ; ఉండన్ = ఉండగా; దౌత్యంబున్ = దౌత్యము; చేయన్ = చేయుచుండగా; కొందఱు = కొంచరు; విరోధులు = శత్రువులు; హరిన్ = కృష్ణుని; బద్ధునిన్ = బంధింపబడినవాని; చేయన్ = చేయుటకు; సన్నధులు = సిద్ధమమైనవారు; ఐనన్ = కాగా; బలహీను = బలములేనివాని; మాడ్కిన్ = వలె; మార్పడలేడ = ఎదురుతిరుగలేడు; అసమర్థుడు = చేతకానివాడు; అని = అని; తలచెదవు = అనుకొనెదవు; ఏని = అయితే; అచ్యుతుండు = కృష్ణుడు {అచ్యుతుడు - చ్యుతము (నాశము) లేనివాడు, విష్ణువు}; పరుల = ఇతరుల, శత్రువుల; జయింపన్ = గెలుచుట; ఓపకన్ = రాక; కాదు = కాదు; విద్య = విద్య; అభిజాత్య = వంశము; ధనంబులన్ = సంపదలవలన; జగతిన్ = లోకమును; పెక్కు = మిక్కిలి; బాధలన్ = బాధలతో; అలంచు = వేపుకుతిను; దుష్ట = చెడ్డ; భూపతులన్ = రాజులన్ {భూపతి - భూమికి భర్త, రాజు}; ఎల్లన్ = అందరను; సైన్య = సైన్యముతో; యుక్తంబుగాన్ = సహా; అనిన్ = యుద్ధములో; సంహరించు = అంతముచేయుట; కొఱకున్ = కోసమై; సభ = (కురు)సభ; లోన్ = లో; అప్పుడు = అప్పుడు; ఆ = ఆ; కురు = కురువు యొక్క; కుమారులు = వంశము వారు; ఆడు = పలుకు; దుర్భాషణములు = దుర్భాషలు; కున్ = కి; అలుగడు = కోపించు తెచ్చుకోనివాడు; అయ్యెన్ = అయ్యెను.
భావము:- ఆ పద్మాక్షుడు తన యొక్క భక్తులు అడవుల్లో అష్టకష్టాలు పడడం చూడలేక వారికోసం రాయబారం నడిపాడు. శత్రువులు కొందరు అతణ్ణి పట్టి కట్టివేయాలని గట్టి ప్రయత్నాలు చేశారు. అప్పుడు అచ్యుతుడు అశక్తునిలాగా వారిని ఆపడానికి ప్రయత్నించలేదు. అంతమాత్రం చేత అది ఆయన అసమర్థత అనుకోడానికి లేదు. ఆయన వారిని జయించలేక కాదు. విద్య, వంశం, ధనం అనే వీనివల్ల అహంకరించి లోకుల్ని పలుబాధలకు లోనుచేస్తున్న దుష్ట రాజుల్ని ససైన్యంగా సంగ్రామభూమిలో సంహరించాలనే సదుద్దేశంతోనే ఆనాటి సభలో కౌరవుల సూటిపోటి మాటలకు నొచ్చుకోలేదు. ఆగ్రహం తెచ్చుకోలేదు.
తెభా-3-72-మ.
జననంబందుటలేని యీశ్వరుఁడు దా జన్మించుటెల్లన్ విరో
ధినిరాసార్థము వీతకర్ముఁడగు నద్దేవుండు గర్మప్రవ
ర్తనుఁ డౌటెల్లఁ జరాచరప్రకటభూతశ్రేణులం గర్మవ
ర్తనులం జేయఁదలంచి కాక కలవే దైత్యారికింగర్మముల్.
టీక:- జననంబందుట = పుట్టుటన్నది; లేని = లేనట్టి; ఈశ్వరుడు = కృష్ణుడు {ఈశ్వరుడు - ఒడయుడు, విష్ణుడు}; తాన్ = తాను; జన్మించుట = పుట్టుట; ఎల్లన్ = అంతా; విరోధి = లోకవిరుద్ధుల, విరోధించుట (మచ్చరించుట) చేయువాడు; నిరాస = ఖండించుట; అర్థము = కోసము; వీతకర్ముడు = కర్మలు వీడినవాడు; అగు = అయిన; ఆ = ఆ; దేవుండు = దేవుడు; కర్మ = కర్మలను; ప్రవర్తనుడు = చేయువాడు; ఔటన్ = అగుట; ఎల్లన్ = అంతా; చర = కదలునవి; అచర = కదలలేనివిగా; ప్రకట = వెలువడు; భూత = జీవ; శ్రేణులన్ = రాశులను; కర్మ = కర్మలను; వర్తనులను = అనుసరించువారను; చేయన్ = చేయవలెనని; తలంచి = అనుకొని; కాక = అలా కాని పక్షమున; కలవే = ఉన్నాయా ఏమి; దైత్యారి = కృష్ణుని {దైత్యారి - దితి పుత్రులు (రాక్షసులు)కు శత్రువు, విష్ణువు}; కిన్ = కి; కర్మముల్ = కర్మలు.
భావము:- పుట్టుక అన్నదే లేని ఆ భగవంతుడు పుడుతున్నాడంటే కేవలం మచ్చరించువారిని ఖండించుటకే; కర్మలు లేని దేవుడు కర్మలు చేస్తున్నాడంటే చరాచర జీవకోటిని కర్మబద్ధుల్ని చేయటడానికే; అంతేకాని, రాక్షసాంతకుడైన విష్ణుమూర్తికి కర్మలంటూ ఉంటాయా? ఉండవు.
తెభా-3-73-క.
హరి నరులకెల్లఁ బూజ్యుఁడు
హరి లీలామనుజుఁడును గుణాతీతుఁడునై
పరఁగిన భవకర్మంబులఁ
బొఁరయండఁట హరికిఁ గర్మములు లీలలగున్.
టీక:- హరి = కృష్ణుడు {హరి - పాపములను హరించువాడు, విష్ణువు}; నరులు = మానవులు; కున్ = కు; ఎల్లన్ = అందరికిని; పూజ్యుడు = పూజింప తగ్గవాడు; హరి = కృష్ణుడు; లీలా = లీలకు మాత్రమే; మనుజుడును = మానవుడును; గుణ = గుణములకు; అతీతుడును = అతీతమైనవాడును; ఐ = అయి; పరగినన్ = ప్రవర్తిల్లుటచే; భవ = సంసార; కర్మంబులన్ = కర్మములను; పొరయడు = అంటడు; అట = అక్కడ; హరి = కృష్ణుని; కిన్ = కి; కర్మములు = కర్మములు; లీలలు = లీలలు; అగుచున్ = అవుతూ.
భావము:- హరి మానవులందరికీ పూజనీయుడు. ఆయన లీలామానుషవిగ్రహుడు. గుణాలకు అతీతమైన వాడు. జన్మ సంబంధమైన బంధాలు ఆయనకు లేవు. అవి కేవలం ఆ వాసుదేవునికి లీలావిలాసాలు మాత్రమే.
తెభా-3-74-క.
మదిఁ దనశాసనమిడి నిజ
పదములు సేవించు లోకపాలాదుల పెం
పొదవింప యదుకులంబున
నుదయించెను భువిని బలసహోదరుఁడగుచున్.
టీక:- మదిన్ = మనసునందు; తన = తన యొక్క; శాసనము = శాసనము; ఇడి = ఉంచుకొని; నిజ = తన; పదములున్ = పాదములను; సేవించు = సేవిస్తుండే; లోక = లోకములను; పాల = పాలించువారు; ఆదులన్ = మొదలైనవారిని; పెంపొదవింపన్ = విస్తరింపజేయుటకు; యదు = యాదవ; కులమునన్ = కులములో; ఉదయించెన్ = అవతరించెను; భువిని = భూమిమీద; బల = బలరాముని; సహోదరుడు = సోదరుడు; అగుచున్ = అవుతూ.
భావము:- తన ఆజ్ఞలు తలదాల్చి, తన పాదాల్ని సేవించే లోకపాలకులకు హెచ్చరిల్లుట కలిగించేందుకు భూలోకంలో యాదవ వంశంలో బలరామునికి తమ్ముడై శ్రీమహావిష్ణువు అవతరించాడు.
తెభా-3-75-తే.
చలనమందక భూరి సంసరణతరణ
మైనసత్కీర్తి దిక్కుల నతిశయిల్లి
వఱల సమమతియై యున్నవాఁడె కృష్ణుఁ"
డనుచు నుద్దవుని విదురుఁ డడుగుటయును.
టీక:- చలనము = మార్పులకు {చలనమందక - నిశ్చల శ్థితి}; అందక = లోనుకాక; భూరి = బహు విస్తారమైన; సంసరణ = సంసారమున; తరణము = తరింపజేయగలది; ఐన = అయిన; సత్ = మంచి; కీర్తిన్ = కీర్తితో; దిక్కులన్ = నలుదిక్కులను; అతిశయిల్లి = వ్యాపించి; వఱలన్ = ప్రసిద్ధికెక్కుతుండగా; సమ = సమ; మతి = బుద్ధి కలవాడు; ఐ = అయి; ఉన్నవాడె = ఉన్నాడా; కృష్ణుడు = కృష్ణుడు; అనుచున్ = అంటూ; ఉద్ధవుని = ఉద్ధవుని; విదురుడు = విదురుడు; అడుగుటయును = అడుగడము.
భావము:- సంసారసాగరాన్ని తరింపచేస్తూ చెక్కుచెదరని యశోవైభవాన్ని దిక్కులంతటా నిండింపజేసి ప్రకాశించే ఆ నందనందనుడు ప్రశాంతచిత్తుడై క్షేమంగా ఉన్నాడా?” ఇలా ఉత్కంఠతో విదురుడు ఉద్ధవుణ్ణి అడిగాడు.
తెభా-3-76-వ.
అట్టియెడ నయ్యుద్ధవుండు.
టీక:- అట్టి = ఆ; ఎడన్ = సమయమున; ఆ = ఆ; ఉద్ధవుడు = ఉద్దవుడు.
భావము:- అలా విదురుడు అడిగినప్పుడు ఉద్ధవుడు.