పోతన తెలుగు భాగవతము/తృతీయ స్కంధము/కర్దమునికి హరి ప్రత్యక్షం బగుట
తెభా-3-746-క.
"విను; మనఘ! కృతయుగంబున
మునినాథుం డయిన కర్దముఁడు ప్రజల సృజిం
పను వనజసంభవునిచే
త నియుక్తుం డగుచు మది ముదము సంధిల్లన్.
టీక:- వినుము = వినుము; అనఘ = పుణ్యుడా; కృతయుగంబునన్ = కృతయుగమున; ముని = మునులలో; నాథుడు = ప్రభువు; అయిన = అయిన; కర్దముడు = కర్దముడు; ప్రజలన్ = సంతానమును; సృజింపను = సృష్టించు కొరకు; వనజసంభవుని = బ్రహ్మదేవుని {వనజసంభవుడు - వనజము (పద్మము)న సంభవుడు (పుట్టినవాడు), బ్రహ్మదేవుడు}; చేతన్ = చేత; నియుక్తుండు = నియమింపబడిన వాడు; అగుచున్ = అవుతూ; మదిన్ = మనసున; ముదము = సంతోషములు; సంధిల్లన్ = కలుగునట్లుగా.
భావము:- ఓ పుణ్యాత్ముడవైన విదురా! విను. కృతయుగంలో బ్రహ్మదేవుని చేత ప్రజలను సృష్టించడానికి కర్దమ మునీశ్వరుడు నియమింపబడ్డాడు. అందుకు కర్దముడు సంతోషించి…
తెభా-3-747-తే.
ధీరగుణుఁడు సరస్వతీతీర మందుఁ
దవిలి పదివేల దివ్యవత్సరము లోలిఁ
దపముసేయుచు నొకనాఁడు జపసమాధి
నుండి యేకాగ్రచిత్తుఁడై నిండు వేడ్క.
టీక:- ధీర = ధైర్యము కల; గుణుడు = గుణములు కలవాడ; సరస్వతీ = సరస్వతి అను నదీ; తీరము = తీరము; అందున్ = అందు; తవిలి = పూనుకొని; పదివేల = పదివేల (10000); దివ్యవత్సరములు = దివ్యసంవత్సరములు; ఓలిన్ = వరుసగా; తపమున్ = తపస్సు; చేయుచున్ = చేస్తూ; ఒక = ఒక; నాడు = దినమున; జప = జపమునను; సమాధిన్ = సమాధి స్థితి యందును; ఉండి = ఉండి; ఏకాగ్ర = ఏకాగ్రమైన; చిత్తుడు = మనసు కలవాడు; ఐ = అయ్యి; నిండు = పూర్తి; వేడ్కన్ = సంతోషముతో.
భావము:- ధీరుడైన ఆ ముని సరస్వతీ నదీతీరంలో పదివేల దేవతా సంవత్సరాలు విడువకుండా తపస్సు చేస్తూ ఒకనాడు ధ్యానతత్పరుడై, ఏకాగ్రచిత్తంతో అత్యంత సంతోషంతో…
తెభా-3-748-క.
వరదుఁ బ్రసన్ను మనోరథ
వరదానసుశీలు నమరవంద్యు రమేశున్
దురితవిదూరు సుదర్శన
కరుఁ బూజించిన నతండు కరుణాకరుఁడై.
టీక:- వరదున్ = నారాయణుని {వరదుడు - వరములు ఇచ్చువాడు, విష్ణువు}; ప్రసన్నున్ = నారాయణుని {ప్రసన్నుడు - అనుకూలమైనవాడు, విష్ణువు}; మనోరథవరదానసుశీలున్ = నారాయణుని {మనోరథ వర దాన సుశీలుడు - మనరథ (మనసులోకలిగిన)(కోరిన) వరములను దాన (ఇచ్చు) సుశీలుడు (మంచిగుణము) కలవాడు, విష్ణువు}; అమరవంద్యున్ = నారాయణుని {అమర వంద్యుడు - అమర (దేవతల)చే వంద్యుడు (పూజింపబడు)వాడు, విష్ణువు}; రమేశున్ = నారాయణుని {రమేశు - రమ (లక్ష్మీదేవి)కి ఈశుడు (భర్త), విష్ణువు}; దురితవిదూరున్ = నారాయణుని {దురిత విదూరుడు - దురితములు (పాపములు)ను విదూరుడు(పొగొట్టువాడు), విష్ణువు}; సుదర్శనకరున్ = నారాయణుని {సుదర్శన కరుడు - సుదర్శన చక్రము చేతకలవాడు, విష్ణువు}; పూజించినన్ = సేవించగా; అతండున్ = అతడును; కరుణాకరుడు = నారాయణుడు {కరుణా కరుడు - కరుణ (దయ)కు కరుడు (నిలయము) ఐనవాడు, విష్ణువు}; ఐ = అయ్యి.
భావము:- వరాల నిచ్చేవాడూ, దయతో కోరిన కోరికలను తీర్చే స్వభావం కలవాడూ, దేవతల చేత నమస్కరింపబడేవాడూ, లక్ష్మీపతీ, పాపాలను తొలగించేవాడూ, సుదర్శన చక్రాన్ని ధరించేవాడూ అయిన విష్ణువును ఆరాధించగా ఆ దేవుడు కరుణించి…
తెభా-3-749-వ.
అంతరిక్షంబునం బ్రత్యక్షం బైన.
టీక:- అంతరిక్షంబునన్ = ఆకాశమున; ప్రత్యక్షంబున్ = ప్రత్యక్షము; ఐనన్ = అవ్వగా.
భావము:- ఆకాశంలో ప్రత్యక్షం కాగా…
తెభా-3-750-సీ.
తరణి సుధాకర కిరణ సమంచిత-
సరసీరుహోత్పల స్రగ్విలాసు
కంకణ నూపురగ్రైవేయ ముద్రికా-
హారకుండల కిరీటాభిరాము
కమనీయ సాగరకన్యకా కౌస్తుభ-
మణి భూషణోద్భాసమాన వక్షు
సలలిత దరహాస చంద్రికా ధవళిత-
చారు దర్పణ విరాజత్కపోలు
తెభా-3-750.1-తే.
శంఖ చక్ర గదాపద్మ చారు హస్తు
నలికులాలక రుచిభాస్వదలికఫలకు
పీతకౌశేయవాసుఁ గృపాతరంగి
తస్మితేక్షణుఁ బంకజోదరుని హరిని.
టీక:- తరణి = సూర్యుని; సుధాకర = చంద్రుని; కిరణ = కిరణములతో; సమంచిత = ఒప్పారుతున్న; సరసిరుహ = పద్మముల; ఉత్ఫల = కలవపువ్వుల; స్రక్ = దండలతో; విలాసున్ = సొగసైనవానిని; కంకణ = కంకణములు; నూపుర = భజకీర్తులు; గ్రైవేయ = ఆభరణములు; ముద్రికా = ఉంగరములు; హార = ముత్యాల హారములు; కుండల = చెవి కుండలములు; కిరీట = కిరీటము లతో; అభిరామున్ = ఒప్పుతున్నవానిని; కమనీయ = మనోహరమైన; సాగరకన్యకా = లక్ష్మీదేవిచేతను {సాగరకన్యక -సాగరము (సముద్రము) యొక్క కన్యక (పుత్రిక), లక్ష్మీదేవి}; కౌస్తుభ = కౌస్తుభము అనెడి; మణి = మణిచేతను; భూషణ = అలంకరింపబడిన; ఉదత్ = మిక్కిలి; భాసమాన = ప్రకాశవంతమైన; వక్షు = వక్షస్థలముకలవానిని; సలలిత = మనోహరమైన; దరహాస = చిరునవ్వుల; చంద్రికా = వెన్నెలలతో; ధవళిత = తెల్లగా అయిన; చారు = అందమైన; దర్పణ = అద్దాలవలె; విరాజత్ = విరాజిల్లుతున్న; కపోలు = చెక్కిళ్ళుకలవానిని;
శంఖ = శంఖము; చక్ర = చక్రము; గదా = గద; పద్మ = పద్మములతో; చారు = అందమైన; హస్తు = చేతులుకలవానిని; అలి = తుమ్మెదల; కుల = గుంపు వంటి; అలక = ముంగురుల; రుచి = కాంతితో; భాస్వత్ = మెరయుచున్న; అలిక = నుదటి; ఫలకున్ = భాగముకలవానిని; పీత = పచ్చని; కౌశేయ = పట్టుబట్ట; వాసున్ = ధరించినవానిని; కృపా = దయతో; తరంగిత = తొణికిసలాడుతున్న; స్మిత = చిరునవ్వు; ఈక్షణున్ = చూపులుకలవానిని; హరిని = విష్ణుమూర్తిని.
భావము:- సూర్య చంద్ర కిరణాలు సోకి వికసించిన తామరపూలతోను, కలువపూలతోను కట్టిన అందమైన పూలమాలను ధరించినవాడూ, కంకణాలను, నూపురాలను, కంఠాభరణాలను, ఉంగరాలను, రత్నహారాలను, మకర కుండలాలను, కిరీటాన్ని ధరించి ప్రకాశించేవాడూ, అందమైన లక్ష్మీదేవితో కౌస్తుభమణితో అలంకరింపబడి మెరిసే వక్షస్థలం కలవాడూ, సొగసైన చిరునవ్వు వెన్నెలతో ప్రకాశించే చెక్కుటద్దాలతో విరాజిల్లుతున్నవాడూ, శంఖం, చక్రం, గద, పద్మం చేతుల్లో ధరించినవాడూ, తుమ్మెదల వంటి నల్లని ముంగురులతో అందంగా ప్రకాశించే ఫాలభాగం కలవాడూ, పచ్చని పట్టువస్త్రం ధరించినవాడూ, మందహాసంతో దయ పొంగిపొరలే చూపులు కలవాడూ, పద్మనాభుడూ అయిన హరిని…
తెభా-3-751-వ.
మఱియు; శబ్దబ్రహ్మశరీరవంతుండును, సదాత్మకుండును, జ్ఞానైక వేద్యుండును, వైనతేయాంస విన్యస్త చరణారవిందుండును నయిన గోవిందుని గనుంగొని సంజాత హర్ష లహరీ పరవశుండును లబ్ధ మనోరథుండును నగుచు సాష్టాంగదండప్రణామంబు లాచరించి; తదనంతరంబ.
టీక:- మఱియున్ = ఇంకనూ; శబ్ద = శబ్దరూప; బ్రహ్మ = బ్రహ్మ; శరీర = స్వరూపము; వంతుడును = కలవాడును; సత్ = సత్తు (సత్యమే); ఆత్మకుండును = తానైనవాడును; జ్ఞాన = జ్ఞానము ద్వారా; ఏక = మాత్రమే; వేద్యుండును = తెలియబడువాడును; వైనతేయ = గరుత్మంతుని {వైనతేయుడు - వినుతాదేవి యొక్క పుత్రుడు, గరుత్మంతుడు}; అంస = మూపున; విన్యస్త = ఉంచబడిన; చరణ = పాదములు అనెడి; అరవిందుండునున్ = పద్మములు కలవాడును; అయిన = అయినట్టి; గోవిందుని = విష్ణుమూర్తిని {గోవిందుడు - గో (జీవముల)కు ప్రభువు, విష్ణువు}; కనుంగొని = దర్శించి; సంజాత = కలిగిన; హర్ష = ఆనందపు; లహరీ = అలలచేత; పరవశుండును = పరవశించినవాడును; లబ్ధ = లభించిన; మనోరథుండు = కోరికలు కలవాడును {మనోరథము - మనసున రథ (తిరుగునది), కోరిక}; అగుచున్ = అవుతూ; సాష్టాంగదండప్రణామంబుల్ = సాష్టాంగనమస్కారములు {సాష్టాంగదండప్రణామము - కలిగిన అష్ట (ఎనిమిది, 8) అంగ (అవయవములు) దండ (కఱ్ఱవలె) నేలపై పెట్టి చేయు ప్రణామము (నమస్కారము)}; ఆచరించి = చేసి; తదనంతరంబ = తరువాత.
భావము:- ఇంకా శబ్దబ్రహ్మమే శరీరంగానూ, అస్తిత్వమే ఆత్మగానూ కలిగి జ్ఞానం చేత మాత్రమే తెలుసుకోదగినవాడై గరుత్మంతుని మూపుమీద పాదపద్మాలు మోపి ఉన్న ఆ గోవిందును చూచి కర్దముడు ఆనంద తరంగాలతో పరవశుడై కోరిక తీరినవాడై సాష్టాంగ ప్రణామాలు చేసి…
తెభా-3-752-క.
ముకుళిత కరకమలుండయి
యకుటిల సద్భక్తి పరవశాత్మకుఁ డగుచున్
వికచాంభోరుహలోచను
నకు నిట్లనియెం దదాననముఁ గనుఁ గొనుచున్.
టీక:- ముకుళిత = మోడ్చిన; కర = చేతులు అను; కమలుండు = కమలములు కలవాడు; అయి = అయ్యి; అకుటిల = స్వచ్ఛమైన; సత్ = మంచి; భక్తి = భక్తితో; పరవశ = పరవశమైన; ఆత్మకుడు = మనసు కలవాడు; అగుచున్ = అవుతూ; వికచాంభోరుహలోచనున్ = విష్ణుమూర్తి {విక చాంభోరుహ లోచనుడు - వికచ (వికసించిన) అంభోరుహము (పద్మము) లవంటి లోచనుడు (కన్నులుకలవాడు), విష్ణువు}; కున్ = కి; ఇట్లు = ఈ విధముగ; అనియెన్ = పలికెను; తత్ = అతని; ఆననమున్ = మోమును; కనుగొనుచున్ = చూస్తూ;
భావము:- చేతులు జోడించి నిర్మలమైన భక్తిభావంతో మైమరచి వికసించిన పద్మాలవంటి కన్నులు కలిగిన విష్ణుముఖాన్ని చూస్తూ ఇలా అన్నాడు.
తెభా-3-753-సీ.
"అబ్జాక్ష! సకల భూతాంతరాత్ముఁడ వనఁ-
దనరుచుండెడి నీదు దర్శనంబుఁ
దలకొని సుకృతసత్ఫలభరితంబు లై-
నట్టి యనేక జన్మానుసరణ
ప్రకటయోగక్రియాభ్యాసనిరూఢు లై-
నట్టి యోగీశ్వరు లాత్మఁ గోరి
యెంతురు యోగీశ్వరేశ్వర యే భవ-
త్పాదారవింద సందర్శనంబు
తెభా-3-753.1-తే.
గంటి భవవార్థిఁ గడవంగఁ గంటి మంటిఁ
గడఁగి నా లోచనంబుల కలిమి నేఁడు
తవిలి సఫలత నొందె; మాధవ! ముకుంద!
చిరదయాకర! నిత్యలక్ష్మీవిహార!
టీక:- అబ్జాక్ష = నారాయణ {అబ్జాక్షుడు - అబ్జము (పద్మము) ల వంటి కన్నులు ఉన్నవాడు, విష్ణువు}; సకలభూతాతంరాత్ముడవు = నారాయణుడవు {సకలభూతాతంరాత్ముడు - సమస్తమైన భూతము (ప్రాణు) లందును ఆత్మరూపమున ఉండువాడు, విష్ణువు}; అనన్ = అనగా; తనరుచున్ = అతిశయించి; ఉండెడి = ఉండునట్టి; నీదు = నీ యొక్క; దర్శనంబున్ = దర్శనము; తలకొని = శిరసావహించి; సుకృత = పుణ్యకార్యముల; సత్ = మంచి; ఫల = ఫలితములతో; భరితంబులున్ = నిండినవి; ఐనట్టి = అయినట్టి; అనేక = ఎన్నో; జన్మ = జన్మలనుండి; అనుసరణ = అనసరించుచున్న; ప్రకట = ప్రసిద్ధమైన; యోగక్రియా = యోగక్రియలను; అభ్యాస = అభ్యసించుటలో; నిరూఢులు = మిక్కిలి నేర్పరులు; ఐనట్టి = అయినట్టి; యోగ = యోగులలో; ఈశ్వరులు = శ్రేష్ఠులు; ఆత్మన్ = మనసులో; కోరి = కోరి; ఎంతురు = కీర్తింతురు; యోగీశ్వరేశ్వర = నారాయణా {యోగీశ్వరేశ్వరుడు - యోగీశ్వరులకు ఈశ్వరుడు, విష్ణువు}; ఏన్ = నేను; భవత్ = నీ యొక్క; పాద = పాదములు అనెడి; అరవింద = పద్మముల; సందర్శనమున్ = చక్కటి దర్శనమును; కంటిన్ = చూసితిని;
భవ = సంసారము అను; వార్థిన్ = సముద్రమును; గడవంగన్ = దాటగ; కంటిన్ = చూసితిని; మంటిన్ = బ్రతికితిని; కడగి = చివరకు; నా = నా యొక్క; లోచనంబుల = కన్నులు అను; కలిమి = సంపద; నేడు = ఈనాడు; తవిలి = పూని; సఫలతన్ = సాఫల్యమును; ఒందెన్ = పొందెను; మాధవ = గోవిందా {మాధవుడు - మానసములకు ధవుడు (ప్రభువు), విష్ణువు}; ముకుంద = గోవిందా {ముకుందుడు - విష్ణువు}; చిరదయాకర = గోవిందా {చిరదయాకర - చిర మిక్కిలి దయ (కృప)ను కర (ఇచ్చువాడ), విష్ణువు}; నిత్యలక్ష్మీవిహార = గోవిందా {నిత్యలక్ష్మీవిహార - నిత్య (శాశ్వతమైన) లక్ష్మీదేవి (సంపదలు) తో విహార (వర్తించువాడ), విష్ణువు}.
భావము:- ఓ పుండరీకాక్షా! అఖిల ప్రాణులకు అంతరాత్మవై ఉండే నీ దర్శనం కోరి పురాకృత పుణ్యంతో నిండి అనేక జన్మలుగా నిరంతర యోగాభ్యాస నిపుణులైన యోగీశ్వరులు కీర్తిస్తుంటారు. అట్టి యోగీశ్వరులకు ఈశ్వరుడవైన నీ పాదపద్మాలను దర్శించాను. సంసార సముద్రాన్ని దాటగలిగాను. ధన్యుడనైనాను. మాధవా! ముకుందా! దయారూపా! లక్ష్మీరమణా! నాకు కన్నులున్నందుకు ఫలం ఇప్పుడు లభించింది.
తెభా-3-754-వ.
అదియునుం గాక; దేవా! భవదీయ మాయావిమోహితులై హత మేధస్కులై సంసారపారావారోత్తారకంబులైన భవదీయ పాదారవిందంబులు దుచ్ఛవృత్తి కాము లయి సేవించి నిరయగతులైన వారికిం దత్కాయ యోగ్యంబు లగు మనోరథంబుల నిత్తు; వట్టి సకాము లైన వారిఁ నిందించు నేనును గృహమేధ ధేనువు నశేషమూలయుం, ద్రివర్గ కారణయుం, సమానశీలయు నయిన భార్యం బరిణయంబుగా నపేక్షించి కల్పతరుమూల సదృశంబు లైన భవదీయ పాదారవిందంబులు సేవించితి; నయిన నొక్క విశేషంబు గలదు; విన్నవించెద నవధరింపుము; బ్రహ్మాత్మకుండ వయిన నీదు వచస్తంతు నిబద్ధు లై లోకులు కామహతు లైరఁట; ఏనును వారల ననుసరించినవాఁడ నై కాలాత్మకుండ వైన నీకు నభిమతం బగునట్లుగాఁ గర్మమయం బైన భవదాజ్ఞాచక్రంబు ననుసరించుటకుఁ గాని మదీయ కామంబు కొఱకుఁ గాదు; భవదీయ మాయావినిర్మితంబును; గాలాత్మక భూరి వేగసమాయుక్తంబును; నధిమానస సమేత త్రయోదశ మాసారంబును; షష్ట్యుత్తరశతత్ర యాహోరాత్ర మయ పర్వంబును; ఋతుషట్క సమాకలిత నేమియుం; జాతుర్మాస్యత్రయ విరాజిత నాభియు; నపరిమిత క్షణలవాది పరికల్పిత పత్రశోభితంబునుం; గాలాత్మక భూరివేగ సమాయుక్తంబును నైన కాలచక్రంబు సకల జీవనికరాయుర్గ్రసన తత్పరం బగుం; గాని కామాభిభూత జనానుగత పశుప్రాయు లగు లోకుల విడిచి భవ పరితాప నివారణ కారణం బయిన భవదీయ చరణాతపత్ర చ్ఛాయాసమాశ్రయులై తావకీన గుణకథన సుధాస్వాదన రుచిర లహరీ నిరసిత సకల దేహధర్ము లైన భగవద్భక్త జనాయుర్హరణ సమర్థంబు గాకుండు"నని వెండియు.
టీక:- అదియునున్ = అంతే; కాక = కాకుండగ; దేవా = గోవిందా; భవదీయ = నీ యొక్క; మాయా = మాయ చేత; విమోహితులు = మిక్కిలి మోహమునపడినవారు; ఐ = అయ్యి; హత = దెబ్బతిన్నట్టి; మేధస్కులు = తెలివి కలవారు; ఐ = అయ్యి; సంసార = భవము అను; పారావార = సముద్రమును; ఉత్తారకంబులు = దాటించునవి; ఐన = అయినట్టి; భవదీయ = నీ యొక్క; పాద = పాదములు అనెడి; అరవిందంబులన్ = పద్మములను; తుచ్ఛ = నీచమైన; వృత్తి = విధమైన; కాములు = కోరికలు కోరువారు; అయి = అయ్యి; సేవించి = పూజించి; నిరయ = నరకమునకు; గతులు = పోవువారు; ఐన = అయినట్టి; వారి = వారి; కిన్ = కిని; తత్ = ఆయా; కాయ = దేహములకు; యోగ్యంబులున్ = తగినవి; అగు = అయినట్టి; మనోరథంబులున్ = కోరికలను; ఇత్తువు = తీర్చెదవు; అట్టి = అటువంటి; సకాములు = కోరికలు కలవారు; ఐన = అయినట్టి; వారిన్ = వారిని; నిందించు = నిందించే; నేనునున్ = నేను కూడ; గృహ = గృహములు; మేధ = యజ్ఞములు; ధేనువున్ = గోవులు; అశేష = మొదలగు సమస్తమునకు; మూలయున్ = మూలమైనదియును; త్రివర్గ = ధర్మము అర్థము కామము అను మూటి వర్గమునకు; కారణయున్ = కారణము అయినదియును; సమాన = సరియగు; శీలయున్ = ప్రవర్తన కలదియును; అయిన = అయినట్టి; భార్యన్ = భార్యను; పరిణయంబున్ = పెండ్లి; కాన్ = చేసుకొనుటను; అపేక్షించి = కోరి; కల్పతరు = కల్పవృక్షము యొక్క; మూల = మొదలునకు; సదృశంబులున్ = సమానములు; ఐన = అయినట్టి; భవదీయ = నీ యొక్క; పాద = పాదములు అనెడి; అరవిందంబులున్ = పద్మములను; సేవించితిన్ = కొలచితిని; అయినన్ = అయినప్పటికిని; ఒక్క = ఒక; విశేషంబున్ = విషయము; కలదు = కలదు; విన్నవించెదన్ = చెప్పకొనెదను; అవధరింపుము = వినుము; బ్రహ్మ = బ్రహ్మదేవుని; ఆత్మకుండవు = స్వరూపమున ఉన్నవాడవు; అయిన = అయినట్టి; నీదు = నీ యొక్క; వచస్ = మాటల; తంతు = సమూహమునకు; నిబద్ధులు = బాగా కట్టబడినవారు; ఐ = అయ్యి; లోకులు = జనులు; కామ = కామములచే; హతులు = దెబ్బతిన్నవారు; ఐరి = అయినారు; అట = అట; ఏనునున్ = నేనుకూడ; వారలన్ = వారిని; అనుసరించిన = అనుసరించిన; వాడను = వాడిని; ఐ = అయ్యి; కాల = కాలము యొక్క; ఆత్మకుండవు = స్వరూపమైన వాడవు; ఐన = అయిన; నీకున్ = నీకు; అభిమతంబున్ = ఇష్టము; అగునట్లుగా = ప్రకారముగా; కర్మ = కర్మములతో; మయంబున్ = నిండినది; ఐన = అయినట్టి; భవత్ = నీ యొక్క; ఆజ్ఞా = అజ్ఞా; చక్రంబున్ = వలయమును; అనుసరించుట = ప్రకారము నడచుట; కున్ = కొరకు; కాని = కాని; మదీయ = నా యొక్క; కామంబు = కోరికలు; కొఱకున్ = కోసము; కాదు = కాదు; భవదీయ = నీ యొక్క; మాయా = మాయచేత; వినిర్మితంబును = చక్కగా నిర్మింపబడినదియును; కాల = కాలము యొక్క; ఆత్మక = స్వరూపము అయిన; భూరి = అతి మిక్కిలి; వేగ = వేగముతో; సమాయుక్తంబునున్ = కూడినదియును; అధి = అధిక; మాస = మాసముతో; సమేత = కలిసి; త్రయోదశ = పదమూడు (13); మాసారంబునున్ = మాసములుకలదియును; షష్ట్యుత్తరశతత్రయా = మూడువందలఅరవై (360); అహో = పగళ్ళు; రాత్ర = రాత్రులు; మయ = నిండిన; పర్వంబునున్ = విభాగములు కలదియును; ఋతు = ఋతువుల; షట్క = ఆరింటి (6); సమాకలిత = కూడినదియైన; నేమియున్ = వలయమును; చాతుర్మాస్య = చాతుర్మాస్యముల {చాతుర్మాస్యము - చతుః (నాలుగు, 4) చొప్పున మాస్యము (నెలలుకలది)}; త్రయంబునున్ = మూటితో; విరాజిత = విరాజిల్లు; నాభియున్ = కేంద్రకము కలదియును; అపరిమిత = పరిమితి లేనట్టి; క్షణ = క్షణములు; లవ = లవము; ఆది = మొదలగువానితో; పరికల్పిత = విభజింపబడిన; పత్ర = విభాగములుతో; శోభితంబునున్ = శోభించుచున్నదియును; కాల = కాలము యొక్క; ఆత్మక = స్వభావమైన; భూరి = అతిమిక్కిలి; వేగ = వేగముతో; సమాయుక్తంబునున్ = కూడినదియును; ఐన = అయినట్టి; కాల = కాలము అనెడి; చక్రంబున్ = చక్రము; సకల = సమస్తమైన; జీవ = ప్రాణుల; నికర = సమూహముల; ఆయుర్ = ఆయువును; గ్రసన = సంగ్రహిచుటయందు; తత్పరంబున్ = లగ్నమైనది; అగున్ = అగును; కాని = కాని; కామా = కామములచేత; అభిభూత = అపహతులైన, దెబ్బతిన్నట్టి; జన = జనులను; అనుగత = అనుసరించువారైన; పశు = పశువుల {పశువు - పాశములచే కట్టబడునది}; ప్రాయులు = వంటివారు; అగు = అయినట్టి; లోకులన్ = లోకులను; విడిచి = వదలిపెట్టి; భవ = సంసారము యొక్క; పరితాప = అధికమైన బాధలను; నివారణ = నివారింపబడుటకు; కారణంబున్ = కారణము; అయిన = అయినట్టి; భవదీయ = నీ యొక్క; చరణ = పాదములు అను; అతపత్ర = గొడుగు యొక్క; ఛాయ = నీడన; సమా = చక్కగా; ఆశ్రయులు = ఆశ్రయించినవారు; ఐ = అయ్యి; తావకీన = నీ యొక్క; గుణ = గుణములు; కథన = కథలు అను; సుధా = అమృతమును; ఆస్వాదన = ఆసక్తిగా తీసుకొను; రుచిర = మనోహరములైన; లహరీ = తరంగములచే; నిరసిత = తిరస్కరింపబడిన; సకల = సమస్తమైన; దేహ = శరీర; ధర్ములు = ధర్మములు కలవారు; ఐన = అయినట్టి; భగవత్ = భగవంతుని {భగవంతుడు - పూజ్యుడు, మహాత్యముకలవాడు, వీర్యవంతుడు, ఐశ్వర్యవంతుడు, విష్ణువు}; భక్త = భక్తులు అయిన; జన = జనుల; ఆయుస్ = ఆయుష్షును; హరణ = హరించుటకు; సమర్థంబు = సామర్థ్యము కలది; కాకుండున్ = కాకుండును; అని = అని; వెండియు = మరల.
భావము:- అంతేకాక దేవా! నీ మాయవల్ల సమ్మోహితులై మతిమాలినవారై సంసార సముద్రాన్ని దాటించే నీ చరణకమలాలను తుచ్ఛమైన కోరికలతో ఆరాధించి, నరకపు దారి పట్టే కాముకుల కోరికలను కూడ నీవు తీర్చుతూ ఉంటావు. అటువంటి కాముకులను నిందించే నేనుకూడ గృహయజ్ఞ నిర్వహణలో గోవువలె ఉపకరించేదీ, అన్నింటికీ మూలమైనదీ, ధర్మార్థకామములకు నెలవైనదీ, అనుగుణమైన నడవడి గలదీ అయిన భార్యను పెండ్లాడాలని కోరి కల్పవృక్షమూలాల వంటి నీ పాదపద్మాలను సేవించాను. అయినా ఒక విశేషం ఉంది. విన్నవిస్తాను విను. పరబ్రహ్మ స్వరూపుడవైన నీ వాక్కులు అనే త్రాళ్ళతో బంధింపబడిన ప్రజలు కామోపహతులైనారట. నేను కూడా వారిని అనుసరించడం కాలాత్మకుడవైన నీకు ఇష్టమైన విధంగా కర్మమయమైన నీ ఆజ్ఞాచక్రాన్ని అనుసరించడానికే కాని కామం కోసం కాదు. నీ మాయచేత నిర్మించ బడినదీ, కాలాత్మకమైన మహావేగం కలదీ, అక్షర పరబ్రహ్మాన్ని అనుసరించి తిరిగేదీ, అధిక మాసంతో కలిసి పదమూడు నెలలు అనే ఆకులు గలదీ, మూడువందల అరవై అహోరాత్రాలు అనే కణుపులు గలదీ, ఆరు ఋతువు అనే చుట్టు పట్టా కలదీ, మూడు చాతుర్మాస్యాలు అనే నడిమిబొడ్డు కలది. అపరిమితాలైన క్షణాలు అనే ఆకులతో విరాజిల్లేదీ, అయిన కాలచక్రం సమస్త జీవుల ఆయుస్సును మ్రింగివేయటానికి ఆసక్తి కలదై కామోపహతులైన వారిని అనుసరించే పశుప్రాయులైన లోకులను విడిచి, సంసార తాపాన్ని శాంతింపచేసే నీ పాదాలనే గొడుగుల నీడలను ఆశ్రయించిన వారినీ, నీ గుణవర్ణనమనే అమృతరసాన్ని అస్వాదిస్తూ దేహధర్మాలను లెక్కచేయని నీ భక్తులైనవారి ఆయుస్సును హరించడానికి సమర్థం కాదు” అని పలికి…
తెభా-3-755-మ.
"అనఘా! యొక్కఁడ వయ్యు నాత్మకృత మాయాజాత సత్త్వాది శ
క్తినికాయస్థితి నీ జగజ్జనన వృద్ధిక్షోభ హేతుప్రభా
వని రూఢిం దగు దూర్ణనాభిగతి విశ్వస్తుత్య! సర్వేశ! నీ
ఘనలీలా మహిమార్ణవంబుఁ గడవంగా వచ్చునే? యేరికిన్.
టీక:- అనఘా = భగవంతుడా {అనఘుడు - పాపరహితుడు, విష్ణువు}; ఒక్కడవు = ఒక్కడవే; అయ్యున్ = అయినప్పటికిని; ఆత్మ = తనచేత; కృత = చేయబడిన; మాయా = మాయ వలన; జాత = పుట్టిన; సత్త్వ = సత్తువ; ఆది = మొదలగు; శక్తి = శక్తుల; నికాయ = సమూహముల; స్థితిన్ = స్థితిలో; ఈ = ఈ; జగత్ = విశ్వము యొక్క; జనన = సృష్టి; వృద్ధి = స్థితి; క్షోభ = లయముల; హేతు = కారణము; ప్రభావ = ప్రభావములు; నిరూఢిన్ = అవశ్యము; తగున్ = తగి ఉండును; ఊర్ణనాభి = సాలిగూడు; గతిన్ = వలె; విశ్వస్తుత్య = భగవంతుడా {విశ్వస్తుత్యుడు - విశ్వ (లోకముల) చేత స్తుత్యుడు (స్తుతింపబడువాడ), విష్ణువు}; సర్వేశ = భగవంతుడా {సర్వేశుడు - సర్వులకును ఈశుడు (ప్రభువు), విష్ణువు}; నీ = నీ; ఘన = గొప్ప; లీలా = లీలల యొక్క; మహిమా = మహిమ అను; ఆర్ణవంబున్ = సముద్రమును; కడవంగాన్ = దాటుటకు; వచ్చునే = సాధ్యమా ఏమి; ఏరికిన్ = ఎవరికైనా సరే.
భావము:- పుణ్యాత్మా! విశ్వవంద్యా! సర్వేశ్వరా! నీవు ఒక్కడివే అయినా నీ మాయవల్ల పుట్టిన సత్త్వం మొదలైన శక్తులు సాలీడు సాలెగూడును సృష్టించి మళ్ళీ తనలో లీనం చేసుకున్నట్టు ఈ లోకాలు పుట్టడానికి, వృద్ధిపొందడానికి, నాశం కావడానికి కారణభూత మౌతున్నాయి. అటువంటి నీ అపార లీలావిలాసమైన మహాసముద్రాన్ని దాటడం ఎవరికైనా సాధ్యం అవుతుందా?
తెభా-3-756-వ.
దేవ! శబ్దాది విషయ సుఖకరం బగు రూపంబు విస్తరింపఁ జేయు టెల్ల నస్మదనుగ్రహార్థంబు గాని నీ కొఱకుం గా దాత్మీయమాయా పరివర్తిత లోకతంత్రంబు గలిగి మదీయ మనోరథ సుధాప్రవర్షి వైన నీకు నమస్కరించెద."
టీక:- దేవ = భగవంతుడా; శబ్ద = శబ్దము {శబ్దాది విషయ పంచకము - 1శబ్దము 2స్పర్శము 3రూపము 4రుచి 5 వాసన}; ఆది = మొదలగు; విషయ = విషయములచే {విషయములు - ఇంద్రియార్థములు (గోచరించునవి)}; సుఖ = సుఖమును; కరంబున్ = కలిగించునది; అగు = అయిన; రూపంబున్ = రూపములను; విస్తరింపన్ = విస్తరించునట్లు; చేయుట = చేయుట; ఎల్లన్ = సమస్తమును; అస్మత్ = మా యొక్క; అనుగ్రహ = అనుగ్రహించుట; అర్థంబున్ = కోసమే; కాని = కాని; నీ = నీ; కొఱకున్ = కోసము; కాదు = కాదు; ఆత్మీయ = తన యొక్క; మాయా = మాయచేత; పరివర్తిత = తిప్పబడుతున్న; లోక = లోకములను; తంత్రంబు = నడపునది; కలిగి = కలిగి ఉండి; మదీయ = నా యొక్క; మనోరథ = కోరికలను; సుధా = అమృతమును; ప్రవర్షివి = చక్కగ వర్షించువాడవు; ఐన = అయినట్టి; నీకున్ = నీకు; నమస్కరించెదన్ = మొక్కెదను.
భావము:- దేవా! శబ్ద, స్పర్శ, రూప, రస, గంధాలనే విషయాలచే సుఖం కలిగించే స్వరూపాన్ని వృద్ధిచేయడం మమ్మల్ని అనుగ్రహించడానికే గాని నీకోసం కాదు. నీ మాయవల్ల ఈ లోకవ్యాపారాలన్నీ ప్రవర్తింప చేస్తూ మా మనోరథ సిద్ధి అనే అమృతాన్ని నిండుగా వర్షించే నీకు నమస్కరిస్తున్నాను.”
తెభా-3-757-మ.
అని యిబ్భంగి నుతించినన్ విని సరోజాక్షుండు మోదంబునన్
వినతానందన కంధరోపరిచరద్విభ్రాజమానాంగుఁడున్
యనురాగస్మితచంద్రికాకలితశోభాలోకుఁడై యమ్మునీం
ద్రునిఁగారుణ్యమెలర్పఁజూచి పలికెన్ రోచిష్ణుఁడై వ్రేల్మిడిన్
టీక:- అని = అని; ఇబ్భంగిన్ = విధముగ; నుతించినన్ = స్తోత్రము చేయగా; విని = విని; సరోజాక్షుడు = హరి {సరోజాక్షుడు - సరోజము (పద్మము) వంటి కన్నులు ఉన్నవాడు, విష్ణువు}; మోదంబునన్ = సంతోషముతో; వినత = వినతాదేవి యొక్క; నందన = పుత్రుని; కంధర = మెడపైన; ఉపరి = పైన; చరత్ = తిరుగుతున్న; విభ్రాజమాన = ప్రకాశిస్తున్న; అంగుడు = దేహముకలవాడు; ఐ = అయ్యి; అనురాగ = ప్రేమతో కూడిన; స్మిత = చిరునవ్వు అను; చంద్రికా = వెన్నెల; కలిత = కలిగిన; శోభా = సొగసైన; అలోకుడు = చూపుకలవాడు; ఐ = అయ్యి; ఆ = ఆ; ముని = మునులలో; ఇంద్రునిన్ = శ్రేష్ఠుని; కారుణ్యము = దయ; ఎలర్పన్ = వికసించగా; చూచి = చూసి; పలికెన్ = పలికెను; రోచిష్ణుడు = ప్రకాశించువాడు; ఐ = అయ్యి; వ్రేల్మిడిన్ = చిటికెలో.
భావము:- అని ఈవిధంగా కర్దముడు స్తోత్రం చేయగా విష్ణువు విని గరుత్మంతుని మూపుపై ఒయ్యారంగా కూర్చొని అనురాగంతో కూడిన చిరునవ్వు వెన్నెలలు వెల్లివిరిసే చల్లని చూపులతో ఆ మునీంద్రుణ్ణి చూస్తూ ఇలా అన్నాడు.
తెభా-3-758-క.
"మునివర! యే కోరిక నీ
మనమునఁ గామించి నను సమంచిత భక్తిన్
నెనరునఁ బూజించితి నీ
కనయము నా కోర్కి సఫల మయ్యెడుఁ జుమ్మీ."
టీక:- ముని = మునులలో; వర = శ్రేష్ఠుడా; ఏ = ఏ; కోరికన్ = కోరికను; నీ = నీ; మనమునన్ = మనసులో; కామించి = కోరి; ననున్ = నన్ను; సమంచిత = చక్కటి; భక్తిన్ = భక్తితో; నెనరునన్ = ప్రేమతో; పూజించితి = పూజించితివో; నీకున్ = నీకు; అనయమున్ = అవశ్యము; ఆ = ఆ; కోర్కి = కోరిక; సఫలమున్ = సాఫల్యము; అయ్యెడున్ = అగును; చుమ్మీ = సుమీ.
భావము:- మునీంద్రా! నీవు ఏమి కావాలని కోరి నన్ను భక్తితో ఆరాధించావో ఆ కోరిక నీకు తప్పక నెరవేరుతుంది సుమా!”
తెభా-3-759-వ.
అని యానతిచ్చి;ప్రజాపతిపుత్రుండును సమ్రాట్టును నైన స్వాయంభువమనువు బ్రహ్మావర్తదేశంబు నందు సప్తార్ణవమేఖలా మండిత మహీమండలంబుఁ బరిపాలించుచున్నవాఁ; డమ్మహాత్ముం డపరదివసంబున నిందులకు శతరూప యను భార్యాసమేతుండై భర్తృ కామ యగు కూఁతుం దోడ్కొని భవదీయ సన్నిధికిం జనుదెంచి; నీకు ననురూప వయశ్శీల సంకల్ప గుణాకర యైన తన పుత్రిం బరిణయంబు గావించు; భవదీయ మనోరథంబు సిద్ధించు; ననుం జిత్తంబున సంస్మరించు చుండు; నమ్మనుకన్య నిను వరించి భవద్వీర్యంబు వలన నతి సౌందర్యవతు లయిన కన్యలం దొమ్మండ్రం గను; నా కన్యకానవకంబు నందు మునీంద్రులు పుత్రోద్పాదనంబులు సేయంగలరు; నీవు మదీయ శాసనంబును ధరియించి మదర్పితాశేషకర్ముండ వగుచు; నైకాంతిక స్వాంతంబున భూతాభయదానదయాచరిత జ్ఞానివై నా యందు జగంబులు గలవనియు; నీ యందు నేఁ గల ననియు; నెఱింగి సేవింపుము. చరమకాలంబున ననుం బొందగలవు. భవదీయ వీర్యంబువలన నేను నీ భార్యాగర్భంబుఁ బ్రవేశించి మత్కళాంశంబునఁ బుత్రుండనై సంభవించి నీకుం దత్త్వసంహిత నుపన్యసింతు;"నని జనార్దనుండు గర్దమున కెఱింగించి; యతండు గనుగొనుచుండ నంతర్హితుండై.
టీక:- అని = అని; ఆనతిచ్చి = తెలిపి; ప్రజాపతి = బ్రహ్మదేవుని; పుత్రుండునున్ = కొడుకును; సమ్రాట్టునున్ = చక్రవర్తియును; ఐన = అయినట్టి; స్వాయంభువ = స్వాయంభువుడు అను; మనువు = మనువు; బ్రహ్మావర్త = బ్రహ్మావర్తము అను; దేశంబున్ = దేశము; అందున్ = అందు; సప్త = ఏడు (7); ఆర్ణవ = సముద్రములు అను; మేఖలా = వడ్డాణముతో; మండిత = అలంకరింపబడిన; మహీ = భూ; మండలంబున్ = మండలమును; పరిపాలించుచున్ = ఏలుతూ; ఉన్నవాడు = ఉన్నాడు; ఆ = ఆ; మహాత్ముడు = గొప్పవాడు; అపర = మరుసటి; దివసంబున్ = దినమున; ఇందుల = దీని; కున్ = కొరకు; శతరూప = శతరూప; అను = అను; భార్యా = భార్యతో; సమేతుండు = కూడినవాడు; ఐ = అయ్యి; భర్తృ = భర్తను; కామ = కోరుచున్నది; అగు = అయిన; కూతున్ = కూతురిని; తోడ్కొని = కూడా తీసుకొని; భవదీయ = నీయొక్క; సన్నిధి = సమీపమున; కిన్ = కు; చనుదెంచి = వచ్చి; నీకున్ = నీకు; అనురూప = తగినట్టి; వయస్ = వయసు; శీల = స్వభావము; సంకల్ప = సంకల్పములు; గుణ = ఉత్తమ గుణములును; ఆకర = కలిగినది; ఐన = అయినట్టి; తన = తన యొక్క; పుత్రిన్ = పుత్రికను; పరిణయంబున్ = వివాహము; కావించున్ = చేయును; భవదీయ = నీ యొక్క; మనోరథంబున్ = కోరికయును; సిద్ధించున్ = తీరును; ననున్ = నన్ను; చిత్తంబునన్ = మనసులో; సంస్మరించుచున్ = ధ్యానిస్తూ; ఉండున్ = ఉండును; ఆ = ఆ; మను = మనువు యొక్క; కన్య = కూతురు; నినున్ = నిన్ను; వరించి = పెండ్లాడి; భవత్ = నీ యొక్క; వీర్యంబున్ = వీర్యము; వలనన్ = వలన; అతి = మిక్కిలి; సౌందర్యవంతులు = అందమైనవారు; అయిన = అయినట్టి; కన్యలన్ = బాలికలను; తొమ్మండ్రన్ = తొమ్మిదిమందిని (9); కనున్ = కంటుంది; ఆ = ఆ; కన్యకా = కన్యలు; నవకంబున్ = తొమ్మిదిమంది (9); అందున్ = అందు; ముని = మునులలో; ఇంద్రులు = శ్రేష్ఠులు; పుత్ర = పుత్రులను; ఉత్పాదనంబున్ = పుట్టించుట; చేయగలరు = చేయగలరు; నీవు = నీవు; మదీయ = నా యొక్క; శాసనంబునున్ = ఆజ్ఞను; ధరించి = స్వీకరించి; మత్ = నా యందు; అర్పిత = అర్పణచేసిన; అశేష = సమస్తమైన; కర్ముండవు = కర్మలు కలవాడవు; అగుచున్ = అవుతూ; ఏకాంతిక = ఏకాంతస్థితిని ఫొందిన; స్వాంతంబునన్ = మనసు కలిగి; భూత = ప్రాణికోటికి; అభయ = శరణ్యము; దాన = ప్రసాదించు; దయా = దయకల; చరిత = వర్తన కల; జ్ఞానివి = జ్ఞానము కలవాడవు; ఐ = అయ్యి; నా = నా; అందున్ = అందు; జగంబులున్ = లోకములు; కలవు = ఉన్నవి; అనియున్ = అనియును; నీ = నీ; అందున్ = అందు; నేన్ = నేను; కలను = ఉన్నాను; అనియున్ = అనియును; ఎఱింగి = తెలిసి; సేవింపుము = కొలువుము; చరమ = చిట్టచివరి; కాలంబునన్ = సమయము వచ్చినప్పుడు; ననున్ = నన్ను; పొంద = పొంద; కలవు = కలవు; భవదీయ = నీ యొక్క; వీర్యంబు = వీర్యము; వలనన్ = వలన; నేను = నేను; నీ = నీ యొక్క; భార్యా = సతి; గర్భంబున్ = గర్భమును; ప్రవేశించి = చేరి; మత్ = నా యొక్క; కళా = కళలోని; అంశంబునన్ = భాగముతో; పుత్రుండన్ = కొడుకును; ఐ = అయ్యి; సంభవించి = అవతరించి; నీకున్ = నీకు; తత్త్వసంహితను = తత్త్వసంహితను {తత్త్వసంహిత - ఒక వేదాంత విషయము, తత్త్వమును (స్వస్వరూపమును) గురించిన విషయములను సంహిత (చక్కగ కూర్పబడినది)}; ఉపన్యసింతును = ఉపదేశింతును; అని = అని; జనార్దనుండు = విష్ణుమూర్తి {జనార్దనుడు - జనులచే వేడుకొనబడువాడు, విష్ణువు}; కర్దమున్ = కర్దమున; కున్ = కు; ఎఱింగించి = తెలిపి; అతండున్ = అతడు; కనుగొనుచున్ = చూస్తూ; ఉండగన్ = ఉండగా; అంతర్హితుండు = మాయమైనవాడు; ఐ = అయ్యి;
భావము:- అని పలికి ఇంకా “బ్రహ్మదేవుని కుమారుడూ చక్రవర్తీ అయిన స్వాయంభువ మనువు బ్రహ్మావర్త దేశంలో సప్తసముద్రాల నడుమ ఉన్న భూమండలాన్నంతా పరిపాలిస్తున్నాడు. ఆ మహాత్ముడు రేపు తన భార్య శతరూపతో కూడి, పెండ్లి కావలసిన కూతురును వెంటబెట్టుకొని వచ్చి వయస్సులో, స్వభావంలో, సంకల్పంలో, ఉత్తమగుణాలలో నీకు తగినట్టి ఆ పుత్రికను నీకిచ్చి వివాహం చేస్తాడు. నీ కోరిక తీరుతుంది. నన్ను మనస్సులో స్మరిస్తూ ఉంటే ఆ మనుపుత్రిక నిన్ను పెండ్లాడి, నీ వల్ల మిక్కిలి సౌందర్యవతులైన తొమ్మిదిమంది కుమార్తెలను కంటుంది. ఆ తొమ్మిదిమంది కన్యలకు మునులవల్ల ఉత్తములైన కుమారులు జన్మిస్తారు. నీవు నా ఆజ్ఞానుసారం నీవు చేసే సమస్త కార్యాలనూ నాకు అర్పిస్తూ ఏకాగ్రమైన మనస్సుతో ప్రాణికోటికి అవసరమైనప్పుడు అభయ మిస్తూ, దానాలు చేస్తూ, కరుణామూర్తివై, సుజ్ఞానివై, నాలో లోకాలన్నీ ఉన్నాయనీ, నీలో నేనున్నాననీ తెలుసుకొని నన్ను సేవించు. అంత్యకాలంలో నన్ను చేరగలవు. నీ తేజస్సువల్ల నేను నీ భార్య గర్భంలో ప్రవేశించి నా కళాంశతో నీ కుమారుడనై జన్మించి నీకు తత్త్వవిద్యను బోధిస్తాను.” అని ఈ విధంగా విష్ణువు కర్దమునికి తెలిపి అతడు చూస్తూ ఉండగా అంతర్ధానమై…
తెభా-3-760-చ.
అతుల సరస్వతీసరిదుదంచిత బాలరసాలసాల శో
భిత తట తుంగరంగ మగు బిందుసరంబు వినిర్గమించి యం
చిత గరుడాధిరోహణముసేసి తదీయ గరుత్ప్రభూత ఋ
క్ప్రతతివిలక్షణక్రమవిరాజితనాదము వించు మోదియై.
టీక:- అతుల = సాటిలేని; సరస్వతీ = సరస్వతీ; సరిత్ = నదియందు; ఉదంచిత = ఒప్పుచున్న; బాలరసాల = లేతమామిడి; సాల = చెట్లతో; శోభిత = సొగసైన; తట = తీరమున; తుంగ = ఎత్తైన; రంగము = స్థలము; అగు = అయిన; బిందుసరంబున్ = బిందుసరస్సును; వినిర్గమించి = వెలువడి; అంచిత = చక్కటి; గరుడ = గరుత్మంతుని; అధిరోహణంబున్ = ఎక్కుట; చేసి = చేసి; తదీయ = వాని; గరుత్ = రెక్కలనుండి; ప్రభూత = వెలువడుతున్న; ఋక్ = ఋక్కులు {ఋక్కులు - ఋగ్వేదము నందలి స్తోత్ర మంత్రములు}; ప్రతతి = మిక్కిలిగ వ్యాపించి; విలక్షణ = ప్రత్యేక; క్రమ = విధమై; విరాజిత = విరాజిల్లుతున్న; నాదమున్ = చక్కటి ధ్వనిని; వించున్ = వింటూ; మోది = సంతోషి; ఐ = అయ్యి.
భావము:- సాటిలేని సరస్వతీ నదీజలాలతో పెంపొందిన గున్నమామిడి గుబురులతో కనువిందు చేస్తున్న బిందు సరోవరాన్ని దాటి, గరుత్మంతునిపై ఎక్కి, అతని రెక్కల కదలికల చప్పుళ్ళలో సలక్షణమైన సామగానాన్ని వింటూ ఆనందిస్తూ…
తెభా-3-761-చ.
అరిగె వికుంఠధామమున కంత సకామనుఁ డైన కర్దముం
డరయ విమోహియై మనము నందును ముందట వచ్చు కోరికల్
పిరిగొనుచుండఁ దత్క్షణమ బిందుసరంబున కేగి యిందిరా
వరుఁ దలపోయుచుండె జనవంద్యుఁడు భక్తినితాంతచిత్తుఁ డై.
టీక:- అరిగెన్ = వెళ్ళిపోయెను; వికుంఠ = వైకుంఠ; ధామమున్ = పురమున; కున్ = కు; అంతన్ = అంతట; సకామనుండు = కోరికలు కలవాడు; ఐన = అయిన; కర్దముండు = కర్దముడు; అరయన్ = తెలిసి; విమోహి = మిక్కిలిగ మోహముకలవాడు; ఐ = అయ్యి; మనమున్ = మనసు; అందును = లోని; ముందట = ఇక ముందు; వచ్చు = వచ్చుచున్న; కోరికల్ = కోరికలు; పిరిగొనుచున్ = పెనవేసుకొనుచు; ఉండన్ = ఉండగ; తత్క్షణమ = వెంటనే; బిందు = బిందు అను; సరంబున్ = సరసున; కున్ = కు; ఏగి = వెళ్ళి; ఇందిరావరున్ = విష్ణుమూర్తిని {ఇందిరా వరుడు - ఇందిర (లక్ష్మీదేవి) యొక్క వరుడు (భర్త), హరి}; తలపోయుచున్ = స్మరించుచు; ఉండెన్ = ఉండెను; జన = జనులచే; వంద్యుడు = నమస్కరింపబడువాడు; భక్తిన్ = భక్తితో; నితాంత = ఉత్తమ స్థితి పొందిన; చిత్తుడు = చిత్తము కలవాడు; ఐ = అయ్యి.
భావము:- హరి వైకుంఠానికి వెళ్ళాడు. అనంతరం కోరికలు కొనలుసాగగా, జనులచేత నమస్కరింపబడే కర్దముడు, పారవశ్యంతో వెంటనే బిందుసరోవరానికి వెళ్ళి, భక్తితో విష్ణువును స్మరిస్తూ ఉన్నాడు.