పోతన తెలుగు భాగవతము/చతుర్ధ స్కంధము/వేనుని చరిత్ర


తెభా-4-391-మ.
క్షితినాథోత్తముఁ డాత్మనందనుని దుశ్శీలంబు వీక్షించి దుః
ఖితుఁడై యొంటిగఁ దత్పురిన్ వెడలి యేగెన్ వేగ మెందేనిఁ ద
ద్గతి వీక్షించి మునీశ్వరుల్గుపితులై దంభోళిసంకాశ వా
క్యతిం జావ శపింప వాఁ డపుడు వీఁకం గూలె, నమ్మేదినిన్

టీక:- క్షితిన్ = భూమికి; నాథన్ = ప్రభువులలో; ఉత్తముడు = ఉత్తమమైన వాడు; ఆత్మ = తన; నందనునిన్ = పుత్రుని; దుశ్శీలంబు = చెడు నడవడిక; వీక్షించి = చూసి; దుఃఖితుడు = దుఃఖము కలవాడు; ఐ = అయ్యి; ఒంటిగన్ = ఒంటరిగ; తత్ = ఆ; పురిన్ = నగరమును; వెడలియేగెన్ = వెళ్ళిపోయెను; వేగమ = శ్రీఘ్రముగ; ఎందేని = ఎక్కడకో; తత్ = అతని; గతిన్ = నడవడికను; వీక్షించి = చూసి; ముని = మునులలో; ఈశ్వరులు = శ్రేష్ఠులు; కుపితులు = కోపము కలవారు; ఐ = అయ్యి; దంభోళి = పిడుగు; సంకాశ = వంటి; వాక్య = మాటల; తతిన్ = సమూహముతో; చావన్ = మరణించమని; శపింపన్ = శపించగా; వాడు = వాడు; అపుడు = అప్పుడు; వీకన్ = దైన్యముగ; కూలెన్ = కూలిపోయెను; మేదినిన్ = నేలపైన.
భావము:- అంగరాజేంద్రుడు తన కొడుకైన వేనుని చెడు స్వభావాన్ని చూచి దుఃఖించి నగరం విడిచి ఒంటరిగా ఎక్కడికో వెళ్ళిపోయాడు. ఆ సంగతి విని మునీశ్వరులు వేనునిపై కోపించి వజ్రకఠోరాలైన వాక్కులతో అతడు మరణించాలని శపించారు. వేనుడు వెంటనే నేలకూలాడు.

తెభా-4-392-సీ.
కైకొని యపుడు లోకం బరాజకమైనఁ-
బ్రజలు దస్కరపీడఁ ల్లటిల్లఁ
నుఁగొని దుఃఖించి మునులు గతాసుఁడై-
డిన వేనుని వలలి భుజంబు
ర్థి మథింప నారాయణాంశంబున-
నాదిరాజన నొప్పుట్టి పృథుఁడు
నియించె ననవుడు విని విదురుఁడు మునిఁ-
నుఁగొని పలికె నో నఘచరిత!

తెభా-4-392.1-తే.
సాధువు సుశీలనిధియును జ్జనుండు
లఘు బ్రహ్మణ్యుఁడును నైన ట్టి యంగ
రణివిభునకు దుష్టసంతాన మెట్లు
లిగె? నయ్యంగపతి యేమి కారణమున

టీక:- కైకొని = పూని; అపుడు = అప్పుడు; లోకంబున్ = లోకము; అరాజకంబు = రాజులేనిపరిస్థితి; ఐనన్ = అవ్వగా; ప్రజలు = జనులు; తస్కర = దొంగల; పీడన్ = బాధ వలన; పల్లటిల్ల = కళవళబడగా; కనుగొని = చూసి; దుఃఖించి = శోకించి; మునులు = మునులు; గత = పోయిన; ఆసుడు = ప్రాణములు కలవాడు; ఐ = అయ్యి; పడిన = పడిపోయిన; వేనునిన్ = వేనుని; వలపలి = కుడి; భుజంబున్ = భుజమును; అర్థిన్ = కోరి; మధింపన్ = మధించగ, చిలకగ; నారాయణ = విష్ణుని; అంశంబునన్ = అంశతో; ఆది = మొదటి; రాజు = రాజు; అనన్ = అనగ; ఒప్పు = ఒప్పెడి; అట్టి = అటువంటి; పృథుడు = పృథువు; జనియించెన్ = పుట్టెను; అనవుడు = చెప్పగా; విని = విని; విదురుడు = విదురుడు; మునిన్ = మునిని; కనుగొని = చూసి; పలికెన్ = పలికెను; ఓ = ఓ; అనఘ = పుణ్య; చరిత = వర్తనుడ.
సాధువు = సాధుస్వభావి; సు = మంచి; శీల = నడవడిక కలిగియుండుటలో; నిధియును = నిధివంటివాడు; సత్ = మంచి; జనుండు = వాడు; అలఘు = గొప్ప; బ్రహ్మణ్యుండునున్ = వేదధర్మమును అనుష్టించువాడు; ఐన = అయిన; అట్టి = అటువంటి; అంగ = అంగుడు అనెడి; ధరణివిభున్ = రాజు {ధరణివిభుడు - ధరణి (భూమి)కి విభుడు, రాజు}; కున్ = కి; దుష్ట = చెడ్డ; సంతానము = సంతానము; ఎట్లు = ఏవిధముగ; కలిగెన్ = పుట్టెను; అంగ = అంగుడు అనెడి; పతి = రాజు; ఏమి = ఏమి; కారణమున = కారణముచేత.
భావము:- అప్పుడు దేశం రాజులేనిది కాగా ప్రజలు దొంగల బాధతో తల్లడిల్లారు. అది చూచి మునులు విచారించి మరణించిన వేనుని కుడిభుజాన్ని మథించారు. వేనుడి కుడిభుజం నుండి నారాయణాంశతో మొదటి చక్రవర్తి అనదగిన పృథువు జన్మించాడు” అని చెప్పిన మైత్రేయ మహర్షిని చూచి విదురుడు ఇలా ప్రశ్నించాడు. “మహాత్మా! సజ్జనుడు, సుశీలుడు, బ్రహ్మణ్యుడు అయిన అంగరాజుకు చెడ్డ సంతానం ఎందుకు కలిగింది? ఆ రాజు ఏ కారణం చేత….

తెభా-4-393-వ.
విమనస్కుం డగుచుఁ బురంబు విడిచె? ధర్మకోవిదులైన మునులు దండవ్రతధరుండును, రాజును నగు వేనుని యందు నే పాపంబు నిరూపించి బ్రహ్మదండం బొనర్చి రదియునుం గాక లోకంబున రాజులు లోకపాల తేజోధరులు, ప్రజాపాలనాసక్తులుఁ గావునఁ గల్మషంబు గలిగినం బ్రజలచేత నవజ్ఞానర్హులై యుందురు; గావున నా వేనుని చరిత్రంబు శ్రద్ధాగరిష్ఠుండు భక్తుండు నైన నాకుం బరాపరవిదగ్రేసరుండ వయిన నీ వెఱింగింప నర్హుండ"వనిన మైత్రేయుం డతని కిట్లనియె.
టీక:- విమనస్కుండు = విరిగిన మనసు కలవాడు; అగుచున్ = అవుతూ; పురంబున్ = నగరమును; విడిచెన్ = విడిచిపెట్టెను; ధర్మ = ధర్మశాస్త్రము; కోవిదులు = బాగుగా తెలిసినవారు; ఐన = అయిన; మునులు = మునులు; దండ = (తప్పు చేసిన వానిని) దండించుటయే; వ్రత = వ్రతముగ; ధరుండును = తాల్చినవాడు; రాజును = రాజు; అగు = అయిన; వేనునిన్ = వేనుని; అందున్ = ఎడల; ఏ = ఏమి; పాపంబున్ = పాపమును; నిరూపించి = ఆరోపించి; బ్రహ్మదండంబున్ = మరణశిక్ష {బ్రహ్మదండనము - బ్రహ్మ (అతి పెద్దదైన) దండనము (శిక్ష), మరణశిక్ష}; ఒనర్చిరి = వేసిరి; అదియునున్ = అంతే; కాక = కాకుండగ; లోకంబునన్ = లోకములో; రాజులు = రాజులు; లోకపాలకుల = (సమస్త) లోకపాలకుల యొక్క; తేజస్ = తేజస్సును; ధరులు = తాల్చినవారు; ప్రజా = ప్రజలను; పాలనా = పాలిచుట యందు; ఆసక్తులు = ఆసక్తికలవారు; కావునన్ = కనుక; కల్మషంబులు = తప్పుచేయుట; కలిగినన్ = జరిగినను; ప్రజల = జనుల; చేతన్ = చేత; అవజ్ఞ = తెగడబడుటకు; అనర్హులు = తగనివారు; ఐ = అయ్యి; ఉందురు = ఉంటారు; కావునన్ = అందుచేత; ఆ = ఆ; వేనునిన్ = వేనుని; చరిత్రంబున్ = చరిత్రను; శ్రద్ధా = శ్రద్ధ కలిగి యుండుటలో; గరిష్ఠుండు = మిక్కిలి గొప్పవాడు; భక్తుండున్ = భక్తుడు; ఐన = అయిన; నాకున్ = నాకు; పరా = పరలోకపు విషయములు; అపర = ఇహలోకపు విషయములు; విద = తెలిసినవారిలో, జ్ఞానులలో; అగ్రేసరుండవు = మొదటి వాడవు; అయిన = అయినట్టి; నీవున్ = నీవు; ఎఱిగింపన్ = తెలుపుటకు; అర్హుండవు = తగినవాడవు; అనినన్ = అనగా; మైత్రేయుండు = మైత్రేయుడు; అతనిన్ = అతని; కిన్ = కి; ఇట్లు = ఈ విధముగ; అనియె = పలికెను.H2560
భావము:- వ్యాకుల హృదయంతో పట్టణాన్ని వదలి అంగరాజు వెళ్ళాడు? ధర్మజ్ఞులయిన మునులు చండశాసనుడు, రాజు అయిన వేనుని ఏ పాపాన్ని గమనించి బ్రహ్మదండం ప్రయోగించారు? అంతేకాక రాజులు దిక్పాలుర తేజస్సుతో జన్మిస్తారు కదా! ప్రజలను రక్షించే రాజులు ఏదైనా తప్పు చేసినా వారిని అవమానించడం ప్రజలకు తగదు కదా! కాబట్టి ఆ వేనుని కథను శ్రద్ధావంతుడను, భక్తుడను అయిన నాకు వివరించి చెప్పు. నీవు ఇహపరాలు తెలిసిన వారిలో మేటివి కదా! వివరించి చెప్పే సామర్థ్యం ఉన్నవాడవు” అని అడిగిన విదురునితో మైత్రేయుడు ఇలా అన్నాడు.

తెభా-4-394-సీ.
"నఘాత్మ! రాజర్షి యైనట్టి యయ్యంగ-
మేదినీ విభుఁ డశ్వమేధమఖము
గావింప ఋత్విఙ్నికాయంబు చేత నా-
హూ మయ్యును సురవ్రా మంత
నాత్మ హవిర్భాగ మంద రాకుండిన-
ప్పుడు ఋత్విక్కు ద్భుతంబు
నందుచు యజమానుఁడైన యయ్యంగ మ-
హీవరుఁ జూచి రాజేంద్ర! యిట్లు

తెభా-4-394.1-తే.
త్రిదశు లిదె పిల్వబడియును దివిరి యాత్మ
భాగములఁ బొంద రా రైరి వ్యచరిత!
యేమి హేతువొ యిది మాకు నెఱుఁగఁబడదు;
నఁగ హోమంబు దుష్టంబు గాదు మఱియు.

టీక:- అనఘాత్మ = పుణ్యాత్ముడ; రాజర్షి = రాజులలో ఋషియైనవాడు; ఐనట్టి = అయినట్టి; ఆ = ఆ; అంగ = అంగుడు అనెడి; మేదినీ = భూమికి; విభుడు = ప్రభువు; అశ్వమేధమఖమున్ = అశ్వమేధ యాగమును; కావింపన్ = చేయగా; ఋత్విక్ = యజ్ఞము చేయిస్తున్న ఋత్విక్కుల; నికాయంబున్ = సమూహము; చేతన్ = చేత; ఆహుతము = పిలవబడినవారు; అయ్యును = అయినప్పటికిని; సుర = దేవతల; వ్రాతమున్ = సమూహము; అంతన్ = అప్పుడ; ఆత్మ = తమ; హవిర్భాగమున్ = హవిస్సు నందలి భాగమును {హవిస్సు - యజ్ఞము నందు వేల్చబడిన ఇగిర్చిన యన్నము నెయ్యి}; అందన్ = అందుకొనుటకు; రాకుండినన్ = రాకపోయిన; అప్పుడు = అప్పుడు; ఋత్విక్కులు = యజ్ఞము చేయిస్తున్న ఋత్విక్కులు; అద్భుతంబు = ఆశ్చర్య; అందుచున్ = పడుతూ; యజమానుడు = యజమానుడు; ఐన = అయిన; ఆ = ఆ; అంగ = అంగుడనెడు; మహీవరున్ = రాజును {మహీవరుడు - మహీ (భూమి)కి వరుడు, రాజు}; చూచి = చూసి; రాజ = రాజులలో; ఇంద్ర = శ్రేష్ఠుడ; ఇట్లు = ఈవిధముగ.
త్రిదశులు = దేవతలు {త్రిదశుడు - వ్యు. త్రిస్యః దశాః అస్య,, బ.వ్రీ., త్రిదశపరిమాణ వయస్కుడు, బాల్య కౌమార యౌవన వార్ధకములనెడి నాల్గు వయోదశలలో మూఁడవ దశలోనే ఉండువాడు., వేల్పు, దేవత}; ఇదె = ఇదిగో; పిల్వబడియునున్ = పిలవబడి నప్పటికిని; తివిరి = పూని; ఆత్మ = తమ; భాగములన్ = భాగములను; పొందన్ = పొందుటకు; రారు = రాకుండిరిరానివారు; ఐరి = అయిరి; భవ్య = దివ్యమైన; చరిత = వర్తన కలవాడ; ఏమి = ఏమి; హేతువో = కారణమో; ఇది = ఇది; మాకున్ = మాకు; ఎఱుగబడదు = తెలియుటలేదు; కనగన్ = చూడగా; హోమంబున్ = హోమము; దుష్టంబున్ = దోషపూరితము; కాదు = కాదు; మఱియు = ఇంకా.
భావము:- “పుణ్యాత్మా! రాజర్షి అయిన అంగరాజు అశ్వమేధ యజ్ఞం చేస్తున్నాడు. ఋత్విజులు ఆహ్వానించినా దేవతలు హవిర్భాగాలను అందుకోవటానికి రాలేదు. అప్పుడు ఋత్విక్కులు ఆశ్వర్యపడుతూ యజమానుడైన అంగరాజును చూచి “మహారాజా! ఆహ్వానించినప్పటికీ హవిర్భాగాలను అందుకొనడానికి దేవతలు రాలేదు. కారణం మాకు తెలియడం లేదు. హోమ విధానంలో ఏ దోషమూ లేదు.

తెభా-4-395-వ.
శ్రద్ధాయుక్తులై ధృతవ్రతులైన యీ బ్రహ్మవాదులచేత సంప్రయుక్తంబు లైన యీ ఛందస్సులు వీర్యవంతంబులయి యున్న యవి; ఇందు దేవతాపరాధం బణుమాత్రం బయిన నెఱుంగము; ఇట్టిచోటం గర్మసాక్షు లయిన దేవతలు స్వకీయ భాగంబు లంగీకరింపకుండుటకుఁ గతం బెయ్యదియో"యనిన న య్యంగుండు దుఃఖితస్వాంతుండై తన్నిమిత్తంబు సదస్యుల నడుగం దలంచి వారల యనుమతిం బడసి మౌనంబు మాని యిట్లనియె.
టీక:- శ్రద్ధా = శ్రద్ధతో; యుక్తులు = కూడినవారు; ఐ = అయ్యి; ధ్రుత = దీక్ష; వ్రతులు = నియమించుకొన్నవారు; ఐన = అయిన; ఈ = ఈ; బ్రహ్మవాదులు = వేదధర్మమును అనుష్ఠించువారి; చేతన్ = చేత; సంప్రయుక్తంబులు = చక్కగా ప్రయోగించబడినవి; ఐన = అయిన; ఈ = ఈ; ఛందస్సులు = మంత్రములు; వీర్యవంతంబులు = శక్తిపూరితంబులు; అయి = అయ్యి; ఉన్నయవి = ఉన్నవి; ఇందున్ = ఇందులో; దేవతా = దేవతల యెడ; అపరాధంబు = అపరాధము; అణుమాత్రంబు = కొంచము {అణుమాత్రంబు - అణువు అంత యైనను, కొంచమైనను}; అయినన్ = అయినను; ఎఱుంగము = తెలియము; ఇట్టి = ఇటువంటి; చోటన్ = చోట; కర్మసాక్షులు = కర్మములకు సాక్షీభూతులు; అయిన = అయిన; దేవతలు = దేవతలు; స్వకీయ = స్వంత; భాగంబులన్ = భాగములను; అంగీకరింపకుండుట = అంగీకరించపోవుట; కున్ = కు; కతంబున్ = కారణము; ఎయ్యదియో = ఏమిటో; అనినన్ = అనగా; ఆ = ఆ; అంగుండు = అంగుడు; దుఃఖిత = దుఃఖముతో కూడిన; స్వాంతుడు = మనసు కలవాడు; ఐ = అయ్యి; తత్ = దానికి; నిమిత్తంబు = కారణము; సదస్యులన్ = యజ్ఞవిధి పరీక్షాధికారులు; అడుగన్ = అడగవలెనని; తలచి = అనుకొని; వారల = వారి; అనుమతిన్ = అనుమతిని; పడసి = పొంది; మౌనంబున్ = మౌనమును; మాని = విడిచి; ఇట్లు = ఈ విధముగ; అనియెన్ = పలికెను.
భావము:- బ్రహ్మవేత్తలు శ్రద్ధతో, దృఢ నియమాలతో, సారవంతాలైన మంత్రాలను పఠించారు. దేవతలకు అణువంతకూడా అపరాధం జరుగలేదు. అయినా కర్మసాక్షులయిన దేవతలు తమ తమ భాగాలను గ్రహింపకుండా ఉండటానికి కారణం ఏమిటో?” అని అన్నారు. అప్పుడు అంగుడు మనస్సులో దుఃఖిస్తూ కారణం సదస్యులను అడిగి తెలుసుకొన గోరి వారి ఆజ్ఞను పొంది, మౌనాన్ని విడిచి ఇలా అన్నాడు.

తెభా-4-396-ఆ.
"నఘచరితులార! యాహూతు లయ్యు సు
ర్వగణము లాత్మ భాగములను
స్వీకరింప? రేను జేసిన యపరాధ
మెట్టి” దనిన వార లిట్టు లనిరి.

టీక:- అనఘ = పుణ్య; చరితులార = నడవడిక కలవారా; ఆహుతులు = పిలువబడినవారు; అయ్యున్ = అయినప్పటికిని; సుపర్వ = దేవతల; గణములు = సమూహములు; ఆత్మ = తమ; భాగములను = భాగములను; స్వీకరింపరు = తీసుకొనరు; ఏను = నేను; చేసిన = చేసినట్టి; అపరాధమున్ = తప్పు; ఎట్టిది = ఎటువంటిది; అనినన్ = అనగా; వారలు = వారు; ఇట్టులు = ఈ విధముగ; అనిరి = పలికిరి.
భావము:- “పుణ్యచరిత్రులారా! పిలిచినప్పటికీ దేవతలు వచ్చి తమ హవిర్భాగాలను స్వీకరింపలేదు. నేను చేసిన అపరాధం ఏమిటి?” అని ప్రశ్నించగా సదస్యులు ఇలా అన్నారు.

తెభా-4-397-క.
“ననాథా! యిది యిప్పుడు
వొసిన దుష్కృతము గాదు పూర్వభవమునం
రఁగిన దురితం బిది యా
మున నెఱిగింతు మింత న్యచరిత్రా;

టీక:- నరనాథ = రాజా {నరనాథుడు - నరులకు ప్రభువు, రాజు}; ఇది = ఇది; ఇప్పుడు = ఇప్పుడు; పొరసిన = పొందిన; దుష్కృతము = అపరాధము {దుష్కృతము - దుష్ (పాపపు) కృతము (పని), అపరాథము}; కాదు = కాదు; పూర్వ = పూర్వ; భవమునన్ = జన్మమున; పరగినన్ = జరిగిన; దురితంబున్ = పాపము; ఇది = ఇది; ఆదరమునన్ = మన్ననతో; ఎఱిగింతుము = తెలిపెదము; ఇంతన్ = ఇదంతా; ధన్య = సార్థకమైన; చరిత్రా = నడవడికకలవాడా.
భావము:- “రాజా! ఇది ఈ జన్మలో ఇప్పుడు చేసిన పాపం కాదు. ఇది పూర్వజన్మలో చేసిన పాపం. దానిని తెలియజేస్తాము. విను.

తెభా-4-398-క.
నీ వింతవాఁడ వయ్యును
భూర! సంతానలాభమును బొందమి నా
దేతలు యాగభాగము
లీ వేళ భుజింప రైరి యిందుకు నీవున్.

టీక:- నీవున్ = నీవు; ఇంతవాడవు = ఇంతటి మహనీయుడవు; అయ్యున్ = అయినప్పటికిని; భూవర = రాజా {భూవరుడు - భూమికి వరుడు (పతి), రాజు}; సంతాన = సంతానము అనెడి; లాభమును = లాభమును; పొందమిన్ = పొందకపోవుటచేత; ఆ = ఆ; దేవతలు = దేవతలు; యాగ = యాగ మందలి; భాగముల్ = భాగములను; ఈ = ఈ; వేళ = సమయమున; భుజింపరు = భుజింపనివారు; ఐరి = అయిరి; ఇందుకు = అందుచేత; నీవున్ = నీవు.
భావము:- రాజా! నీవు గొప్పవాడవే అయినా నీకు సంతానం లేనందున దేవతలు హవిర్భాగాలను భుజింపలేదు. కాబట్టి నీవు….

తెభా-4-399-తే.
పుత్రకామేష్టిఁ గావించి పుత్రుఁ బడయు
ట్లొనర్చిన దేవత లాత్మభాగ
ర్థి నంగీకరింతు; ర య్యజ్ఞ పురుషు
రి భజించిన సకల కార్యములుఁ గలుగు.”

టీక:- పుత్రకామేష్టిన్ = పుత్రకామేష్టిని {పుత్ర కా మేష్టి - పుత్రుడు కామ (కావలెనని కోరి చేసెడి) ఇష్టి (యజ్ఞము)}; కావించి = చేసి; పుత్రున్ = పుత్రుని; పడయుము = పొందుము; అట్లు = ఆవిధముగ; ఒనర్చినన్ = చేసినచో; దేవతలు = దేవతలు; ఆత్మ = తమ; భాగమున్ = భాగములను; అర్థిన్ = కోరి; అంగీకరింతురు = ఒప్పుకొనెదరు; ఆ = ఆ; యజ్ఞపురుషున్ = విష్ణుమూర్తిని {యజ్ఞ పురుషుడు - యజ్ఞమే తానైన పురుషుడు, విష్ణువు}; హరిన్ = విష్ణుమూర్తిని; భజించినన్ = ఆరాధించిన; సకల = సమస్తమైన; కార్యములున్ = పనులును; కలుగున్ = సిద్ధించును.
భావము:- పుత్రకామేష్టి యాగాన్ని చేసి పుత్రుని పొందాలి. అలా చేస్తే దేవతలు తమ భాగాలను సంతోషంగా గ్రహిస్తారు. యజ్ఞపురుషుడైన విష్ణువును ఆరాధిస్తే సకల కార్యాలు నెరవేరుతాయి.”

తెభా-4-400-వ.
అనిన నాతండు సంతానార్థంబు శిపివిష్టదేవతాకం బయిన పురోడాశంబుచే హోమంబుగావించినం దదీయ హోమకుండంబు నందు హేమమాల్యాంబరాభరణుం డయిన పురుషుండు హిరణ్మయ పాత్రంబున సిద్ధపాయసంబు గొనుచు నుదయించిన నప్పుడు విప్రానుమతంబున నా రాజు దత్పాయసంబు నంజలిచే గ్రహించి సంతోష యుక్తుండగుచు భార్య కొసంగె; అంత.
టీక:- అనినన్ = అనగా; అతండు = అతడు; సంతాన = సంతానము; అర్థంబున్ = కోసము; శిపివిష్ట = విష్ణుమూర్తి {శిపివిష్టుడు - వ్యు. శిపి విశ క్త, కృ.ప్ర., వెలుగై వ్యాపించు వాడు, విష్ణువు}; దేవతాకంబు = దేవతగాకలది; అయిన = అయిన; పురోడాంశంబున్ = యజ్ఞార్థమైన పిండము; చేన్ = చేత; హోమంబున్ = హోమము; కావించినన్ = చేయగా; తదీయ = ఆ యొక్క; హోమకుండంబున్ = హోమకుండము; అందున్ = లో; హేమ = బంగారము; మాల్య = మాలలు; అంబర = వస్త్రములు; ఆభరణుండు = ఆభరణములు కలవాడు; అయిన = అయిన; పురుషుండు = పురుషుడు; హిరణ్ = బంగారము; మయ = మయమైన; పాత్రంబునన్ = పాత్రలో; సిద్ధ = సిద్ధముగ ఉన్న; పాయసంబున్ = పాయసము; కొనుచున్ = పట్టుకొని; ఉదయించినన్ = వచ్చిన; అప్పుడు = అప్పుడు; విప్ర = బ్రాహ్మణ; అనుమతంబున = అనుమతితో; రాజు = రాజు; తత్ = ఆ; పాయసంబున్ = పాయసమును; అంజలి = దోసిలి; చేన్ = చేత; గ్రహించి = తీసుకొని; సంతోష = సంతోషముతో; యుక్తుండు = కూడినవాడు; అగుచున్ = అవుతూ; భార్య = భార్య; కిన్ = కి; ఒసంగెన్ = ఇచ్చెను; అంత = అంతట.
భావము:- అని సదస్యులు చెప్పగా విని అంగరాజు సంతానం కోసం శిపివిష్ట దేవతాకం అయిన పురోడాశంతో హోమం చేయగా ఆ హోమకుండం నుండి బంగారు హారాలు, పట్టువస్త్రాలు ధరించిన ఒక పురుషుడు పాయసంతో నిండిన బంగారు పాత్రను పట్టుకొని వచ్చాడు. అప్పుడు బ్రాహ్మణుల అనుమతితో రాజు ఆ పాయసపాత్రను దోసిలితో అందుకొని సంతోషిస్తూ తన భార్యకు ఇచ్చాడు. అప్పుడు…

తెభా-4-401-చ.
లదళాక్షి పాయసము గౌతుక మొప్ప భుజించి భర్తృ సం
మునఁ జేసి తత్క్షణమ ర్భముఁ దాల్చి కుమారుఁ గాంచె న
క్కొరుఁడు నంత మాతృజనకుం డగు మృత్యువుఁ బోలి తా నధ
ర్మమునఁ జరించుచుండె గుణమండన! వేనుఁ డనంగ నిచ్చలున్

టీక:- కమలదళాక్షి = స్త్రీ {కమల దళాక్షి - కమల (పద్మముల) దళ (రేకుల) వంటి అక్షి (కన్నులు కలామె), స్త్రీ}; పాయసమున్ = పాయసమును; కౌతుకము = సంతోషము; ఒప్పన్ = చక్కగా; భుజించి = భుజించి; భర్తృ = భర్తతో; సంగమమునన్ = సంయోగము; చేసి = వలన; తత్క్షణమ = వెంటనే; గర్భము = గర్భము; తాల్చి = ధరించి; కుమారున్ = కుమారునికి; కాంచెన్ = జన్మ యిచ్చెను; ఆ = ఆ; కొమరుడున్ = కుమారుడు; అంతన్ = అంతట; మాతృ = తల్లి యొక్క; జనకుడు = తండ్రి; అగు = అయిన; మృత్యువున్ = మృత్యువును; పోలి = పోలి; తాన్ = తను; అధర్మమునన్ = అధర్మమార్గమున; చరించుచున్ = వర్తిస్తూ; ఉండెన్ = ఉండెను; గుణ = సుగుణములచే; మండన = అలంకరింపబడినవాడ; వేనుడు = వేనుడు; అనంగ = అనగా; నిచ్చలున్ = నిత్యము.
భావము:- తామర రేకుల వంటి కన్నులు కల అంగరాజు భార్య సునీథ ఆ పాయసాన్ని ఆనందంతో ఆరగించి, పతి సంయోగం వల్ల వెంటనే గర్భం ధరించి కుమారుణ్ణి కన్నది. వేనుడు అనే ఆ కుమారుడు తన తల్లి తండ్రియైన మృత్యుదేవతను పోలి అధర్మమార్గాన సంచరింపసాగాడు.

తెభా-4-402-చ.
యఁగ బాల్యమందుఁ దన యీడు కుమారులఁ గ్రీడఁ బోలె నె
మ్మమున భీతి లేక కృపమాలి పశుప్రకరంబు నొంచు పో
ల్కిని నరికట్టి చంపుచును గిల్బిషలుబ్దక వృత్తిమై శరా
శరముల్ ధరించి మృగజాతి నసాధుగతిన్ వధించుచున్.

టీక:- ఎనయగ = అతిశయించి; బాల్యము = చిన్నతనము; అందున్ = లో; తన = తనతో; ఈడు = సమాన వయసు కలిగిన; కుమారులన్ = పిల్లలను; క్రీడన్ = ఆటలో; పోలెన్ = వలె; నెఱి = నిండు; మనమునన్ = మనసులో; భీతి = భయము; లేక = లేకుండగ; కృప = దయ; మాలి = లేకుండగ; పశు = పశువుల; ప్రకరంబున్ = సమూహమును; ఒంచు = వంచు, లొంగదీసుకొను; పోల్కిని = విధముగ, ప్రకారముగ; అరికట్టి = చుట్టుముట్టి, అడ్డగించి; చంపుచును = సంహరించును; కిల్బిష = పాపి యగు; లుబ్దక = వేటగాని; వృత్తిమై = విధముగ; శరాసన = విల్లు; శరముల్ = అంబులు; ధరించి = ధరించి; మృగ = జంతు; జాతిన్ = సమూహములను; అసాధు = క్రూరమైన; గతిన్ = విధముగ; వధించుచున్ = చంపుతూ.
భావము:- వేనుడు బాల్యంలో ఆటలాడుతూ తన ఈడు పిల్లలను ఈడ్చుకొని వచ్చి భయం, జాలి లేకుండా పశువులను చంపినట్లు చంపేవాడు. క్రూర కిరాతుని వలె ధనుర్బాణాలు ధరించి సాధుమృగాలను వధించేవాడు.

తెభా-4-403-వ.
ఇట్లు మాతామహ దోషంబునం బాపవర్తనుండై చరియించు కొడుకుం జూచి యంగుండు వివిధ శాసనంబుల దండించియు నతని దుశ్చేష్టితంబులు మానుపం జాలక దుఃఖితాత్ముండై మనంబున.
టీక:- ఇట్లు = ఈ విధముగ; మాతామహ = తల్లి యొక్క తండ్రి వలని; దోషంబునన్ = దోషమువలన; పాప = పాపపు మార్గమున; వర్తనుండు = తిరుగువాడు; ఐ = అయ్యి; చరియించు = నడిచెడి; కొడుకున్ = పుత్రుని; చూచి = చూసి; అంగుండు = అంగుడు; వివిధ = అనేక రకములుగ; శాసనంబులన్ = శిక్షలతో; దండించియున్ = దండించి నప్పటికిని; అతని = అతని యొక్క; దుష్ట = చెడ్డ; చేష్టితంబులు = పనులు; మానుపన్ = మానునట్లు; చాలకన్ = చేయలేక; దుఃఖిత = దుఃఖపడుతున్న; ఆత్ముండు = మనసు కలవాడు; ఐ = అయ్యి; మనంబునన్ = మనసులో.
భావము:- ఈ విధంగా తాత యొక్క దోషం వల్ల పాపమార్గంలో సంచరిస్తున్న కొడుకును అంగరాజు పెక్కు విధాలుగా దండించి, అతని చెడునడతను మాన్పలేక దుఃఖిస్తూ తన మనస్సులో…

తెభా-4-404-క.
యము నిట్టి కుపుత్రునిఁ
ని పరితాపంబుఁ బొందుకంటెను ధరలో
పత్యుం డగు టొప్పును
జాక్షు భజించునట్టి వాఁ డగువాఁడున్.

టీక:- అనయమున్ = ఎల్లప్పుడు; ఇట్టి = ఇటువంటి; కు = చెడ్డ; పుత్రునిన్ = కొడుకును; కని = పొంది; పరితాపంబున్ = మిక్కిలి బాధను; పొందు = పడుట; కంటెను = కంటె; ధర = భూమి; లోనన్ = అందు; అనపత్యుండు = పిల్లలు లేనివాడు; అగుటన్ = అవుట; ఒప్పును = సరియగును; వనజాక్షున్ = విష్ణుని; భజించున్ = ఆరాధించెడి; అట్టి = అటువంటి; వాడు = వాడు; అగు = అయిన; వాడు = వాడు.
భావము:- “ఇటువంటి చెడ్డ కొడుకును కని దుఃఖించడం కంటే సంతానం లేకుండా ఉండడమే ఎంతో మేలు. అప్పుడు భక్తితో భగవంతుని భజించడానికైనా వీలు కలుగుతుంది”

తెభా-4-405-వ.
అని వెండియు నిట్లనియె.
టీక:- అని = అని; వెండియున్ = ఇంకను; ఇట్లు = ఈ విధముగ; అనియె = పలికెను.
భావము:- అని ఇంకా ఇలా అన్నాడు…

తెభా-4-406-సీ.
నులకు దుష్పుత్రకునిచేత నపకీర్తి-
యు ధర్మమును సర్వవిరోధ
మును మనోవ్యథయును యంబు బ్రాపించు-
ట్టి కుపుత్రుమోహంబు విడువఁ
జాలక బహుమాన సంగతిఁ గను నెవ్వఁ-
తని గేహంబు దుఃఖాలయంబు
గు నని మఱియు నిట్లను మనుజుండు శో-
స్థాన మగు పుత్రుతనఁ జేసి

తెభా-4-406.1-తే.
నుపమక్లేశ భాజనం యిన గృహము
విడుచుఁ గావున నిట్టి వివేకహీనుఁ
గు కుపుత్రు సుపుత్రుఁగా నాత్మఁ దలఁతు
నుచు నా రాజు బహుదుఃఖితాత్ముఁ డగుచు.

టీక:- జనులకు = మానవులకు; దుష్ = చెడ్డ; పుత్రకుని = కుమారుని; చేతన్ = వలన; అపకీర్తియును = చెడ్డపేరు; అధర్మమునున్ = అధర్మము; సర్వ = సమస్తమైన; జన = జనులతోను; విరోధమును = శత్రుత్వము; మనోవ్యధయును = మానసికబాధ; అనయమున్ = అవశ్యము; ప్రాపించున్ = కలుగును; అట్టి = అటువంటి; కు = చెడ్డ; పుత్ర = కొడుకుపై; మోహంబున్ = మోహము; విడువన్ = వదల; చాలకన్ = లేకుండగ; బహు = మిక్కిలి; మాన = అభిమానముతో; సంగతిన్ = కూడి; కనున్ = చూచెడివాడు; ఎవ్వడు = ఎవడో; అతని = అతని యొక్క; గేహంబు = గృహము; దుఃఖా = దుఃఖములకు; ఆలయంబున్ = నిలయము; అగును = అవుతుంది; అని = అని; మఱియున్ = ఇంకను; ఇట్లు = ఈవిధముగ; అనున్ = పలికెను; మనుజుండు = మానవుడు; శోక = శోకమునకు; స్థానము = జన్మస్థానము; అగు = అయిన; పుత్రు = కొడుకు; కతన = కారణము; చేసి = వలన.
అనుపమ = చెప్పరాని, సాటిలేని; క్లేశ = బాధల; భాజనంబున్ = స్థానము; అయిన = అయినట్టి; గృహమున్ = ఇల్లు; విడుచున్ = వదలివేయును; కావునన్ = అందుచేత; ఇట్టి = ఇటువంటి; వివేక = మంచిచెడుతెలియుట; హీనుడు = లేనివాడు; అగు = అయిన; కు = చెడ్డ; పుత్రున్ = కొడుకును; సు = మంచి; పుత్రున్ = కుమారుని; కాన్ = అగునట్లు; ఆత్మన్ = మనసున; తలతు = అనుకొనెదను; అనుచున్ = అంటూ; ఆ = ఆ; రాజు = (అంగ) రాజు; బహు = మిక్కిలి; దుఃఖిత = దుఃఖపడుతున్న; ఆత్ముడు = మనసుకలవాడు; అగుచున్ = అవుతూ.
భావము:- “చెడ్డ కొడుకువల్ల జనులకు అపకీర్తి, అధర్మం, అందరితో విరోధం, మనోవ్యథ కలుగుతాయి. అటువంటి పుత్రునిపై వ్యామోహం విడువలేని వాని ఇల్లు దుఃఖానికి నెల వవుతుంది” అని మళ్ళీ ఇలా అనుకున్నాడు. “శోకాన్ని కలిగించే పుత్రుని వల్ల అనేక కష్టాలు సంభవిస్తాయి. అప్పుడు కన్నతండ్రి గృహన్ని కూడా విడిచిపెట్టి వెళ్ళిపోతాడు. అందుచేత జ్ఞానహీనుడైన చెడ్డ కొడుకునే మంచి కొడుకుగా భావిస్తున్నాను” అని ఆ రాజు మిక్కిలి దుఃఖిస్తూ…

తెభా-4-407-క.
గు సుమహైశ్వర్యోదయ
గు గృహమును బ్రజల, నిద్ర నందిన భార్యన్
దివిడిచి యెక్కడేనియు
తీశుఁడు చనె నిశీథ మయము నందున్.

టీక:- తగు = చక్కటి; సు = మంచి; మహా = గొప్ప; ఐశ్వర్య = సంపదలు; ఉదయము = కలిగెడిది; అగు = అయిన; గృహమునున్ = ఇంటిని; ప్రజలన్ = జనులను; నిద్రన్ = నిద్ర; అందిన = పోయిన; భార్యన్ = భార్యను; దిగవిడిచి = వదలివేసి; ఎక్కడేనియు = ఎక్కడికో; జగతీశుడు = రాజు {జగతీశుడు - జగతి (భూమి)కిన్ ఈశుడు (ప్రభువు), రాజు}; చనె = వెళ్ళిపోయెను; నిశీథ = అర్ధరాత్రి; సమయమున్ = వేళ; అందున్ = లో.
భావము:- గొప్ప ఐశ్వర్యంతో కూడిన గృహాన్ని, ప్రజలను, నిద్రలో ఉన్న భార్యను విడిచిపట్టి అంగరాజు అర్ధరాత్రి ఒంటరిగా ఎక్కడికో వెళ్ళిపోయాడు.

తెభా-4-408-వ.
అంతఁ దద్వృత్తాంతం బంతయు సుహృద్బాంధవ పురోహితామాత్య ప్రభృతు లయిన ప్రజ లెఱిఁగి దుఃఖించుచున్న సమయంబున భూమి యందెల్ల యెడలఁ దదన్వేషణం బాచరించి గూఢుం డయిన పరమపురుషునిం గానలేని కుయోగి చందంబున నా రాజుం బొడగానలేక విఫలోద్యోగులయి మగిడి పురంబునకు వచ్చిరి; తదనంతరంబ.
టీక:- అంతన్ = అంతట; తత్ = ఆ; వృత్తాంతంబు = విషయము; అంతయున్ = అంతా; సుహృత్ = స్నేహితులు; బాంధవ = బంధువులు; పురోహిత = పురోహితులు; అమాత్య = అమాత్యులు; ప్రభృతులు = మొదలగువారు; అయిన = అయిన; ప్రజలు = ప్రజలు; ఎఱిగి = తెలిసి; దుఃఖించుచున్న = దుఃఖిస్తున్న; సమయంబునన్ = సమయములో; భూమి = భూమి; అందున్ = అందు; ఎల్లన్ = అన్ని; ఎడలన్ = పక్కలను; తత్ = అతని కొరకు; అన్వేషణంబు = వెదకుట; ఆచరించి = చేసి; గూఢుండు = దాగి యుండెడివాడు; అయిన = అయిన; పరమపురుషునిన్ = నారాయణుని {పరమపురుషుడు - పరమము (అతీతమున) యైన పురుషుడు, విష్ణువు}; కానలేని = దర్శించలేని; కు = చెడ్డవాడైన; యోగి = యోగి; చందంబునన్ = వలె; రాజున్ = రాజును; పొడ = జాడ; కాన = చూడ; లేక = లేక; విఫల = నిష్పలమైన; ఉద్యోగులు = ప్రయత్నము చేసినవారు; అయి = అయ్యి; మగిడి = వెనుదిరిగి; పురంబున్ = నగరమున; కున్ = కు; వచ్చిరి = వచ్చిరి; తదనంతంరంబ = తరువాత.
భావము:- అంగుడు రాజ్యాన్ని విడిచి వెళ్ళిన సంగతి మిత్రులు, బంధువులు, పురోహితులు, మంత్రులు మొదలైనవారు తెలుసుకొని దుఃఖిస్తూ నేల నలుమూలలూ వెదికారు. నిగూఢుడు అయిన భగవంతుని చూడలేని కుయోగుల వలె ఆ రాజును కనుగొనలేక తమ ప్రయత్నాలు వ్యర్థం కాగా నగరానికి తిరిగివచ్చారు. ఆ తరువాత…

తెభా-4-409-సీ.
మధిక బ్రహ్మనిష్ఠాతిగరిష్ఠులౌ-
భృగ్వాది మౌనీంద్ర బృంద మపుడు
లోకావనై కావలోకనోత్సుకు లైన-
నులు స్వరక్షక నవిభుండు
లేమిఁ బశుప్రాయులై మెలంగుటఁ గని-
యంత వేనుని మాత గు సునీథ
నుమతి నఖిల ప్రజావళి కప్రియుం-
డైన న వ్వేనుఁ బట్టాబిషిక్తుఁ

తెభా-4-409.1-తే.
జేసి; రంతట మహితోగ్రశానుఁ డగు
వేనుఁ బట్టంబు గట్టుట విని సమస్త
స్కరులు సర్పభీతిచేఁ లఁగు మూషి
ముల కైవడి నడఁగిరి హనములను.

టీక:- సమ = మిక్కిలి; అధిక = అధికమైన; బ్రహ్మనిష్ఠా = వేదధర్మవర్తనయెడల నిష్ఠకలవారు; అతి = మిక్కిలి; గరిష్ఠులు = గొప్పవారు; ఔ = అయిన; భృగువు = భృగువు; ఆది = మొదలగు; మౌని = మునులలో; ఇంద్ర = శ్రేష్ఠుల; బృందము = సమూహము; అపుడున్ = అప్పుడు; లోక = లోకములను; అవన = రక్షించుటే; ఏక = ముఖ్యమైనదిగ; అవలోకన = చూచెడి; ఉత్సుకులు = ఉత్సాహముకలవారు; ఐన = అయిన; జనులు = వారు; స్వ = తమ; రక్షక = రక్షించెడి; జన = వాడైన; విభుండు = ప్రభువు; లేమిన్ = లేకపోవుటచే; పశు = పశువులతో; ప్రాయులు = సమానమైనవారు; ఐ = అయ్యి; మెలంగుటన్ = తిరుగుటను; కని = చూసి; అంత = అంతట; వేనుని = వేనుడి యొక్క; మాతన్ = తల్లి; అగు = అయిన; సునీథ = సునీథ; అనుమతిన్ = అనుమతితో; అఖిల = సమస్తమైన; ప్రజా = ప్రజల; ఆవళి = సమూహమున; కిన్ = కిని; అప్రియుండు = అయిష్టుడు; ఐన = అయిన; ఆ = ఆ; వేనున్ = వేనుని; పట్టాభిషిక్తున్ = పట్టాభిషేకుని {పట్టాభిషేకము - రాజ్యాధికారము స్వీకరించు సమయమున చేసెడి పట్టము కట్టుట అభిషేకము మొదలైన కర్మములు, రాజ్యాధికారదత్తము}; చేసిరి = చేసిరి; అంతట = అంతట;
మహిత = గొప్ప; ఉగ్ర = భయంకరముగ; శాసనుండు = శిక్షించెడివాడు; అగు = అయిన; వేనున్ = వేనునికి; పట్టంబు = రాజ్యపాలనకు పట్టము; కట్టుట = కట్టుట; విని = విని; సమస్త = సమస్తమైన; తస్కరులు = దొంగలు; సర్ప = పాము యందలి; భీతి = భయము; చేన్ = చేత; తలగు = తొలగిపోవు; మూషికముల = ఎలుకల; కైవడిన్ = విధముగ; అడగిరి = అణగియుండిరి; గహనములను = అడవులలో.
భావము:- బ్రహ్మనిష్ఠాగరిష్ఠులైన భృగువు మొదలైన మునీంద్రులు లోకక్షేమం కోరినవారై రక్షకుడైన రాజు లేకపోవడంతో పశువులవలె ప్రవర్తిస్తున్న ప్రజలను చూసి, మహారాణి అయిన సునీథ అనుమతి పొంది ప్రజల కెవ్వరికీ ఇష్టుడు కానట్టి వేనుడికి పట్టం కట్టారు. చండశాసనుడైన వేనుడు రాజయ్యాడని విని పాములకు భయపడి తొలగిపోయే ఎలుకలవలె దొంగలు అడవులలో దాగుకున్నారు.

తెభా-4-410-వ.
అంత నతండు.
టీక:- అంతన్ = అంతట; అతండు = అతడు.
భావము:- అప్పు డతడు…

తెభా-4-411-చ.
రువడి నష్ట లోకపరిపాలక ముఖ్య విభూతి యుక్తుఁడై
రఁగి నృపాసనంబున విభాసితుఁ డౌట స్వభావసిద్ధమై
లు మహావలేపమున వారక సంతత మాననీయ స
త్పురుషుల నెల్ల నెందుఁ బరిభూతులఁ జేయుచు నుండె నిచ్చలున్.

టీక:- పరువడి = ఆపైన; నష్ట = ఓడింపబడిన; లోకపరిపాలక = లోకపాలకులు; ముఖ్య = మొదలగువారి; విభూతిన్ = వైభవము; యుక్తుడు = కలిగినవాడు; ఐ = అయ్యి; పరగి = ప్రసిద్ధుడై; నృపా = నరులను పాలించెడి; ఆసనమునన్ = పదమున; విభాసితుడు = విలసిల్లుచున్నవాడు; ఔటన్ = అగుటచేత; స్వభావసిద్ధము = స్వభావమును అనుసరించినది; ఐ = అయ్యి; వఱలు = అతిశయించెడి; మహా = గొప్ప; అవలేపనమునన్ = గర్వముతో; వారక = బెదురులేక; సంతత = ఎల్లప్పుడు; మాననీయ = మన్నింపదగిన; సత్ = మంచి; పురుషులన్ = పురుషులను; ఎల్లన్ = అందరిని; ఎందున్ = అన్నిచోట్ల; పరిభూతులన్ = అవమానములు; చేయుచున్ = చేస్తూ; ఉండె = ఉండెను.
భావము:- అష్టదిక్పాలకుల సంపదను ధిక్కరించే ఐశ్వర్యాన్ని పొంది సింహాసన మెక్కిన వేనరాజు స్వభావ సిద్ధమైన గర్వాతిశయంతో పూజ్యులైన సజ్జనులను అనుదినం అవమానింపసాగాడు.

తెభా-4-412-చ.
ఱియు నతండు భూగగనమార్గములం దొకవేళ నొక్కఁడే
దము నెక్కి క్రుమ్మరు నిరంకుశవృత్తిఁ జరించు మత్త సిం
ధువిభు పోల్కి సత్పురుషదూషిత వర్తన నొప్పుచున్ నిరం
సుజనాపరాధకృతి త్పర మానసుఁడై క్రమంబునన్.

టీక:- మఱియున్ = ఇంకను; అతండు = అతడు; భూ = నేలపైన; గగన = ఆకాశములో; మార్గములన్ = దారుల; అందు = లో; ఒకవేళ = ఒక్కోసారి; ఒక్కడే = ఒక్కడే; అరదము = రథమును; ఎక్కి = ఎక్కి; క్రుమ్మరు = తిరుగును; నిరంకుశ = హద్దులలేని {నిరంకుశ - అంకుశములేని (ఏనుగు వలె), హద్దులులేని}; వృత్తిన్ = నడవడికతో; చరించున్ = తిరుగును; మత్త = మదించిన; సింధుర = ఏనుగుల; విభు = రాజు; పోల్కి = వలె; సత్ = మంచి; పురుష = వారిచే; దూషిత = నిందింపబడెడి; వర్తన = ప్రవర్తన; ఒప్పుచున్ = కలుగునట్లు; నిరంతర = ఎడతెగని; సు = మంచి; జనా = వారి యెడల; అపరాధ = అపరాధము; కృతి = చేయుట యందు; తత్పర = లగ్నమైన; మానసుండు = బుద్ధి కలవాడు; ఐ = అయ్యి; క్రమంబునన్ = ఆవిధముగ.
భావము:- అతడు ఒక్కొక్కసారి రథమెక్కి భూమిమీద, ఆకాశంమీద తిరిగేవాడు. మదించిన ఏనుగు వలె నిరంకుశంగా సంచరించేవాడు. పెద్దలు తన ప్రవర్తనను దూషిస్తుండగా ఎల్లప్పుడు సజ్జనులకు అపకారం చేసేవాడు.

తెభా-4-413-క.
దివ్యులు వెఱఁగందఁగఁ బృ
థ్వీవ్యోమముల గల భేరి వ్రేయించె “న య
ష్టవ్య మదాతవ్యమహో
వ్యం విప్రా” యనుచు నుదాత్తధ్వనులన్.

టీక:- దివ్యులు = దేవతలు; వెఱగంద = భయపడునట్లు; పృథ్వీ = భూమి; వ్యోమములు = ఆకాశములు; అగల = పగిలిపోవునట్లు; భేరి = దండోరా; వ్రేయించెన్ = వేయించెను; అ = వద్దు; ఇష్టవ్యము = యజ్ఞములు చేయుట; అ = వద్దు; దాతవ్యము = దానములు చేయుట; అ = వద్దు; హోతవ్యం = హోమములు చేయుట; విప్రః = బ్రాహ్మణులారా; అనుచున్ = అంటూ; ఉదాత్త = పెద్దపెద్ద; ధ్వనులన్ = ధ్వనులతో.
భావము:- దేవతలు భయపడే విధంగా భూమి, ఆకాశం బ్రద్దలయ్యేటట్లు భేరీలను వాయింపజేసి ``భ్రాహ్మణులారా! యజ్ఞాలు చేయవద్దు. దానాలను ఇవ్వవద్దు. అగ్నిలో వ్రేల్చవద్దు’’ అని చాటింపు చేయించాడు.

తెభా-4-414-క.
ని యిట్టులు భేరీరవ
మునఁ జేసి సమస్త ధర్మములు వారింపన్
మును లవినీతుం డగు వే
నుని దుశ్చరితంబు జనమనోభయ మగుటన్.

టీక:- అని = అని; ఇట్టులు = ఈ విధముగ; భేరీరవము = శాసనము దండోరా వేయుట; చేసి = వలన; సమస్త = సమస్తమైన; ధర్మములు = వేదధర్మములు; వారింపన్ = నిరోధించగా; మునులు = మునులు; అవినీతుండు = అణకువ లేనివాడు; అగు = అయిన; వేనుని = వేనుని యొక్క; దుశ్చరితంబు = చెడునడవడిక; జన = ప్రజల; మనస్ = మనసులలో; భయము = భయము; అగుటన్ = కలుగుటను.
భావము:- అని ఇలా చాటింపు చేయించి సమస్త ధర్మాలను అడ్డగిస్తున్న వేనుని చెడు నడవడి ప్రజలకు భయం కలిగించగా…

తెభా-4-415-తే.
ని కృపాయత్తు లగుచు నిట్లనిరి యిట్టి
రాచోర భయంబు లీ భూనులను
లసి యిరువంకలను బాధ ఱుపఁ జొచ్చె
దారువందుల వహ్ని చంమునఁ బెలుచ.

టీక:- కని = చూసి; కృప = దయ; ఆయత్తులు = కలిగినవారు; అగుచున్ = అవుతూ; ఇట్లు = ఈ విధముగ; అనిరి = పలికిరి; ఇట్టి = ఇటువంటి; రాజ = రాజువలన; చోర = దొంగలవలన; భయంబున్ = భయములు; ఈ = ఈ; భూజనులను = ప్రజలను; బలసి = అతిశయించి; ఇరు = రెండు (2); వంకలను = పక్కలను; బాధ = బాధ; పఱుపన్ = పెట్టుట; చొచ్చెన్ = మొదలెట్టెను; దారువు = కట్టె; అందులన్ = లో; వహ్ని = నిప్పు; చందంబునన్ = వలె; పెలుచన్ = పీడిస్తూ.
భావము:- చూచి మునులు దయామయులై తమలో ఇలా అనుకున్నారు. “రెండు ప్రక్కల అగ్ని అంటుకున్న కట్టె వలె; రాజభయం, చోరభయం రెండు వైపుల ప్రజలు పీడించబడుతున్నారు.

తెభా-4-416-చ.
య నరాజకంబగు మహాభయముం దొలఁగింపఁగోరి యి
ట్లెఱుఁగక యీ యనర్హుని మహీపతిఁ జేసిన యట్టి దోషముం
రువడిఁ జెందె దుగ్ధరస పానమునం బరివృద్ధినొందు న
య్యుగము భీతి పోషకుని నొందిన రీతి ననర్థహేతువై.

టీక:- అరయన్ = చూడగ; అరాజకంబు = రాజు లేకపోవుట వలన; అగు = కలుగు; మహా = గొప్ప; భయమున్ = భయమును; తొలగింపన్ = పోగొట్టుటను; కోరి = కోసము; ఇట్లు = ఈ విధముగ; ఎఱుగక = తెలియక; ఈ = ఈ; అనర్హుని = యోగ్యత లేని వానిని; మహీపతిన్ = రాజుగా {మహీపతి - మహి (భూమి)కి పతి, రాజు}; చేసిన = చేసిన; అట్టి = అటువంటి; దోషమున్ = దోషము; పరువడి = వెంటనే; చెందెన్ = తగిలినది; దుగ్ధరస = పాలను; పానమునన్ = తాగుటచే; పరివృద్ధి = బాగా పెరుగుట; ఒందు = పొందెడి; ఆ = ఆ; ఉరగము = పామువలని; భీతి = భయము; పోషకునిన్ = పోషించినవానిని; ఒందిన = పొందిన; రీతి = విధముగ; అనర్థ = ఆపదలకు; హేతువు = కారణము; ఐ = అయ్యి.
భావము:- రాజు లేకపోవటం వలన కలిగిన భయాన్ని తొలగించడం కోసం అనర్హుడైన వేనుణ్ణి ఆలోచించకుండా రాజును చేసిన దోషం దేశానికి అనర్థ కారణ మయింది. పాముకు పాలు పోసి పెంచితే ఆ పాము పాలు పోసిన వానిని కరచి చంపకుండా ఊరకుంటుందా?

తెభా-4-417-వ.
అదియునుం గాక.
టీక:- అదియునున్ = అంతే; కాక = కాకుండ.
భావము:- అంతే కాక…

తెభా-4-418-క.
మునుకొని సునీథ గర్భం
బు జనియించియు స్వభావమున దుర్జనుఁడై
యెయఁ బ్రజాపాలనమున
కును బాల్పడి ప్రజల మన్నిగొనఁ జొచ్చెఁగదే.

టీక:- మునుకొని = పూని; సునీథ = సునీథ యొక్క; గర్భంబునన్ = కడుపున; జనియించియు = పుట్టినప్పటికిని; స్వభావమున = స్వభావముచేత; దుర్జనుడు = దుష్టుడు; ఐ = అయ్యి; ఎనయన్ = తెగబడి; ప్రజా = ప్రజలను; పాలనమునన్ = పాలించుట; కును = కు; పాల్పడి = పూనుకొని; ప్రజలన్ = ప్రజలను; మన్నిగొనన్ = బలితీసుకొనుట; చొచ్చెన్ = చేస్తుండెను; కదే = కదా.
భావము:- సునీథ కడుపున పుట్టినప్పటికీ వీడు స్వభావం చేత దుష్టుడై ప్రజలను పాలిస్తూ వారిని హింసిస్తున్నాడు.

తెభా-4-419-వ.
అదిగాన నీ వేనుండు పూర్వంబున జ్ఞాన సంపన్నులచేత రాజుగాఁ జేయంబడియెఁ; గావున నిట్టివాని మన మందఱమును గూడి ప్రార్థింతము; లోకరక్షణార్థం బగుటఁ దద్దోషంబు మనల స్పృశింపదు; సమీచీనోక్తులం జేసి వీని ననునయింప వాని గ్రహింపకుండెనేని మున్న లోకధిక్కారాగ్నిసందగ్ధుం డగు వీని మన తేజోమహాగ్నిచేత భస్మీ భూతుంజేయుద"మని యాలోచించి గూఢమన్యు లగుచు వేనునిం గదియం జని యతని కిట్లనిరి.
టీక:- అదిగానన్ = అందుచేత; వేనుండు = వేనుడు; పూర్వంబునన్ = ఇంతకు ముందు; జ్ఞాన = జ్ఞానము అనెడి; సంపన్నుల = సంపద కలవారి; చేతన్ = చేత; రాజు = రాజు; కాన్ = అగునట్లు; చేయంబడియె = చేయబడెను; కావునన్ = అందుచేత; ఇట్టి = ఇటువంటి; వానిన్ = వానిని; మనము = మనము; అందఱమున్ = అందరము; కూడి = కలిసి; ప్రార్థింతము = ప్రార్థించెదము; లోక = లోకమును; రక్షణ = కాపాడుట; అర్థంబున్ = కోసము; అగుటన్ = అయి ఉండుటచే; తత్ = దాని; దోషంబున్ = పాపము; మనలన్ = మనల్ని; స్పృశింపదు = అంటదు; సమీచీన = తగిన; ఉక్తులన్ = మాటలు; చేసి = వలన; వీనిన్ = ఇతనిని; అనునయింప = నచ్చచెప్పగ; వానిన్ = వాటిని; గ్రహింపకుండెనేని = గ్రహించకపోతే; మున్న = ముందే; లోక = లోకమును; ధిక్కార = ధిక్కరించుట యనెడి; అగ్నిన్ = నిప్పులో; సందగ్ధుడు = బాగా కాలిపోయినవాడు; అగు = అయిన; వీనిన్ = వీని; మన = మన యొక్క; తేజస్ = తేజస్సు అనెడి; మహా = గొప్ప; అగ్నిన్ = అగ్ని; చేతన్ = చే; భస్మీభూతున్ = భస్మమైపోయినవానిగ; చేయుదము = చేద్దాము; అని = అని; ఆలోచించి = అనుకొని; గూఢ = మరుగుపరచిన; మన్యులు = క్రోధము కలవారు; అగుచున్ = అవుతూ; వేనునిన్ = వేనుడిని; కదియన్ = దగ్గరకు; చని = చేరి; అతని = అతని; కిన్ = కి; ఇట్లు = ఈ విధముగ; అనిరి = పలికిరి.
భావము:- అంతేకాక ఈ వేనుణ్ణి పూర్వం జ్ఞానవంతులమైన మనమే రాజును చేశాము. కాబట్టి ఇతణ్ణి మన మందరమూ కలిసి వేడుకుందాము. లోకరక్షణకోసం కనుక మనలను దోషం అంటదు. మంచి మాటలతో వీనిని బతిమాలుకుందాము. మన మాటలను పెడచెవిని పెట్టినట్లయితే ఇప్పటికే లోక ధిక్కారం అనే అగ్నిలో కాలిపోయిన వీనిని మన తేజోగ్నిజ్వాలల చేత బూడిద చేద్దాం” అని ఆలోచించి కోపాన్ని దిగమ్రింగుకొని మునులు వేనుని సమీపించి ఇలా అన్నారు.

తెభా-4-420-క.
"నపాలక! నీ కాయువు
సిరియును బలమును యశంబుఁ జేకఱు వృద్ధిం
బొయుదుగా" కనుచు మనో
ముగ నాశీర్వదించి తివినయమునన్

టీక:- నరపాలక = రాజ {నరపాలక - నరులను పాలించువాడ, రాజు}; నీకున్ = నీకు; ఆయువున్ = ఆయుష్షు; సిరియును = సంపద; బలమును = శక్తి; యశంబున్ = కీర్తి; చేకుఱున్ = సమకూరును; వృద్ధిన్ = అభివృద్ధిని; పొరయుదుగాక = పొందెదవుగాక; అనుచున్ = అంటూ; మనోహరముగన్ = మనసు దోచెడి పలుకులతో; ఆశీర్వదించి = ఆశీర్వదించి; అతి = మిక్కిలి; వినయమునన్ = వినయముతో.
భావము:- “రాజా! నీకు ఆయుస్సు, ఐశ్వర్యం, బలం, కీర్తి చేకూరు గాక! నీకు జయమగుగాక!” అని మనస్సుకు ఆనందం కలిగేవిధంగా ఆశీర్వదించి మిక్కిలి వినయంతో…

తెభా-4-421-వ.
ఇట్లనిరి “నరేంద్రా! యే మొక్కటి విన్నవించెద; మవధరింపుము; పురుషులకు వాఙ్మనఃకాయ వృత్తుల వలన నాచరించు ధర్మంబు సమస్త లోకంబులను విశోకంబులం జేయు; నసంగు లయిన వారికి మోక్షంబు నిచ్చును; అట్టి ధర్మంబు ప్రజలకు క్షేమకారణంబు గావున నీ యందుఁ జెడకుండుం గాక"యని పలికి మఱియు "ధర్మంబు నాశంబు నొందిన నైశ్వర్యంబుచే రాజు విడువంబడు” నని చెప్పి వెండియు నిట్లనిరి “దుష్టచిత్తులగు నమాత్యులవలనను దస్కరులవలనను బ్రజలు నాశంబు నొందకుండ రక్షించుచు యథాన్యాయంబుగ వారలచేఁ గరంబు గొనుచు నుండు మహీపతి యిహపరసౌఖ్యంబుల నందు; నదియునుం గాక యెవ్వని రాష్ట్రంబున నే పురంబున యజ్ఞేశ్వరుం డయిన పురుషోత్తముండు నిజవర్ణాశ్రమోచితం బయిన ధర్మంబు గల వారిచేత యజియింపంబడు, నట్టి నిజశాసనవర్తి యగు రాజు వలన సర్వభూతభావనుండును, మహాభాగుండును, భగవంతుండు నగు సర్వేశ్వరుండు సంతుష్టుం డగు; నట్టి సకల జగదీశ్వరుం డైన సర్వేశ్వరుండు సంతోషించిన రాష్ట్రాధిపతికి సర్వసౌఖ్యంబులుఁ బ్రాపించు; లోకపాలకు లగువారు సర్వేశ్వరునికొఱకు బలిప్రదానంబులు చేయుదురు; సమస్తలోకదేవతాయజ్ఞాది సంగ్రహుండును, వేదమయుండును, ద్రవ్యమయుండును, దపోమయుండు నగు నారాయణుని విచిత్రంబులైన యజ్ఞంబులచేత యజనంబుచేసిన నీకు నభయం బగు; మోక్షంబునుం గలుగుం; గావున నీ రాజ్యంబున మఖంబులు చేయు మని యాజ్ఞాపింపుము; నీ దేశంబునఁ జేయంబడిన యజ్ఞంబులచేత హరికళాయుక్తంబు లగు దేవగణంబులు స్విష్టంబులై, తుష్టంబు లగుచు భవదీయవాంఛితార్థంబుల నిత్తురు; గావున దేవతాతిరస్కారంబు నీకు యుక్తంబు గాదు; వేదచోదితంబు లగు ధర్మంబులం దాసక్తుండవు గ"మ్మనిన వేనుం డిట్లనియె.
టీక:- ఇట్లు = ఈ విధముగ; అనిరి = పలికిరి; నరేంద్రా = రాజా {నరేంద్రుడు - నరులకు ఇంద్రుడు (ప్రభువు), రాజు}; యేము = మేము; ఒక్కటి = ఒకటి; విన్నవించెదము = మనవిచేసెదము; అవధరింపము = వినుము; పురుషుల్ = పురుషులు; కున్ = కు; వాక్ = మాటలు; మనస్ = మనస్సు; కాయన్ = శారీరక; వృత్తుల = కర్మల (వాఙ్మనఃకాయ వృత్తుల వలన -మనోవాక్కాయ శుద్ధితో); వలనన్ = అందు; ఆచరించు = ఆచరించెడి; ధర్మంబు = ధర్మము; సమస్త = సమస్తమైన; లోకంబులను = లోకములను; విశోకంబులన్ = దుఃఖములు లేనివిగ; చేయున్ = చేయును; అసంగులు = నిష్కాములు; అయిన = అయిన; వారు = వారు; కిన్ = కి; మోక్షంబున్ = మోక్షమును; ఇచ్చును = ఇచ్చును; అట్టి = అటువంటి; ధర్మంబు = ధర్మము; ప్రజల్ = ప్రజల; కున్ = కి; క్షేమ = క్షేమములు కలుగుటకు; కారణంబున్ = కారణము; కావునన్ = కనుక; నీ = నీ; అందున్ = ఎడల; చెడకుండుగాక = తప్పకుండుగాక; అని = అని; పలికి = చెప్పి; మఱియున్ = ఇంకా; ధర్మంబు = ధర్మము; నాశంబున్ = నాశనము; ఒందిన = పొందినచో; ఐశ్వర్యంబు = సంపదలు; చే = వలన; రాజు = రాజు; విడువంబడును = దూరము చేయబడును; అని = అని; చెప్పి = చెప్పి; వెండియున్ = ఇంకను; ఇట్లు = ఈ విధముగ; అనిరి = పలికిరి; దుష్ట = చెడ్డ; చిత్తులు = మనస్సు కలవారు; అగు = అయిన; అమాత్యుల = మంత్రులు; వలనను = మూలముగను; తస్కరులు = దొంగలు; వలనను = మూలముగను; ప్రజలు = జనులు; నాశంబున్ = నష్టమును; ఒందకుండ = చెందకుండగ; రక్షించుచున్ = కాపాడుతూ; యథాన్యాయంబుగ = న్యాయానుసారముగ; వారల = వారి; చేన్ = నుండి; కరంబు = పన్నులు; కొనుచున్ = తీసుకొంటు; ఉండు = ఉండును; మహీపతిన్ = రాజు; ఇహ = ఈలోకము; పర = పైలోకముల; సౌఖ్యంబులన్ = సౌఖ్యములను; అందును = పొందును; అదియునున్ = అంతే; కాక = కాకుండగ; ఎవ్వని = ఎవని; రాష్ట్రంబునన్ = దేశమున; ఏ = ఏ; పురంబునన్ = నగరములో; యజ్ఞేశ్వరుండు = యజ్ఞములకు ప్రభువు; అయిన = అయిన; పురుషోత్తముండు = విష్ణువు; నిజ = తమ; వర్ణ = వర్ణము {వర్ణములు - 1బ్రాహ్మణ 2క్షత్రియ 3వైశ్య 4శూద్ర అనెడి చాతుర్వర్ణములు}; ఆశ్రమ = ఆశ్రమములలో {ఆశ్రమములు - 1బ్రహ్మచర్యము 2గార్హస్థ్యము 3వానప్రస్థము 4సన్యాసము అనెడి చతురాశ్రమములు}; ఉచితంబున్ = తగినవి; అయిన = అయిన; ధర్మంబు = ధర్మము {ధర్మము - వేదధర్మము}; కల = కలిగిన; వారి = వారి; చేతన్ = చేత; యజియింపంబడున్ = యజ్ఞములు చేయబడునో; అట్టి = అటువంటి; నిజ = సత్యమైన; శాసనవర్తి = శాసనములను నడిపించువాడు; అగు = అయిన; రాజు = రాజు; వలన = వలన; సర్వభూతభావనుండును = హరియును {సర్వ భూత భావనుడు - సమస్తమైన భూతముల (జీవుల)ను భావనుడు (భావించి సృష్టించువాడు), విష్ణువు}; మహాభాగుండును = హరియును {మహా భాగుడు - గొప్ప భాగుడు (వైభవములు కలవాడు), విష్ణువు}; భగవంతుండును = హరియును {భగవంతుడు - సృష్టికి జన్మస్థానము (భగము) వంటివాడు, విష్ణువు}; అగు = అయిన; సర్వేశ్వరుండు = హరి {సర్వేశ్వరుడు - సర్వులకు ఈశ్వరుడు, విష్ణువు}; సంతుష్టుండు = తృప్తి చెందినవాడు; అగును = అగును; అట్టి = అటువంటి; సకలజగదీశ్వరుండు = విష్ణుమూర్తి {సకల జగదీశ్వరుడు - సమస్తమైన జగత్తులకు ఈశ్వరుడు, విష్ణువు}; ఐన = అయిన; సర్వేశ్వరుండు = విష్ణుమూర్తి; సంతోషించిన = సంతోషిస్తే; రాష్ట్రాధిపతి = రాజు {రాష్ట్రాధిపతి - రాష్ట్రము (దేశము, దేహము)నకు అధిపతి}; కిన్ = కి; సర్వ = సమస్తమైన; సౌఖ్యంబులున్ = సౌఖ్యములు; ప్రాపించున్ = లభించును; లోక = లోకములను; పాలకులు = పాలించెడివారు; అగు = అయిన; వారు = వారు; సర్వేశ్వరుని = విష్ణుమూర్తి; కొఱకున్ = కోసము; బలి = బలులు; ప్రదానంబులు = ఇచ్చుటలు; చేయుదురు = చేసెదరు; సమస్త = సమస్తమైన; లోక = లోకములను; దేవతా = దేవతలను; యజ్ఞ = యజ్ఞములను; సంగ్రహుండును = గ్రహించువాడు; వేద = వేదములందు; మయుండును = నిండి ఉండువాడు; ద్రవ్య = పదార్థము లందు; మయుండును = నిండి ఉంవాడు; తపస్ = తపస్సునందు; మయుండును = నిండి ఉండువాడు; అగు = అయిన; నారాయణుని = హరి యొక్క; విచిత్రంబులు = ఆశ్చర్యకరములైన; ఐన = అయిన; యజ్ఞంబులన్ = యాగములచే; యజనంబు = ఆరాధనము; చేసిన = చేసినచో; నీకు = నీకు; అభయంబున్ = భయము లేకుండుట; అగున్ = జరుగును; మోక్షంబున్ = ముక్తి కూడ; కలుగున్ = కలుగును; కావునన్ = అందుచేత; నీ = నీ యొక్క; రాజ్యంబునన్ = రాజ్యములో; మఖంబులు = యజ్ఞములను; చేయుమని = చేయమని; ఆజ్ఞాపింపుము = ఆజ్ఞను యిమ్ము; నీ = నీ యొక్క; దేశంబునన్ = దేశములో; చేయంబడిన = చేయబడిన; యజ్ఞంబులన్ = యజ్ఞముల; చేతన్ = చేత; హరి = విష్ణుమూర్తి; కళా = అంశలుతో; యుక్తంబులు = కూడినవి; అగు = అయిన; దేవ = దేవతల; గణంబులున్ = సమూహములు; స = చక్కగా; ఇష్టంబులు = ప్రీతిచెందినవి; ఐ = అయ్యి; తుష్టంబులు = సంతృప్తిచెందినవి; అగుచున్ = అవుతూ; భవదీయ = నీ యొక్క; వాంఛిత = కోరిన; అర్థంబులన్ = సంపదలను; ఇత్తురు = ఇచ్చెదరు; కావునన్ = అందుచేత; దేవతా = దేవతలను; తిరస్కారంబున్ = తిరస్కరించుట; నీకున్ = నీకు; యుక్తంబున్ = ఉచితమైనది; కాదు = కాదు; వేద = వేదములచే; చోదితంబులు = నడపబడునవి; అగు = అయిన; ధర్మంబుల = ధర్మముల; అందున్ = ఎడ; ఆసక్తుండవు = ఆసక్తి కలవాడవు; కమ్ము = అగుము; అనిన = అనగా; వేనుండు = వేనుడు; ఇట్లు = ఈ విధముగ; అనియె = పలికెను.
భావము:- ఇలా అన్నారు “రాజా! మేమొకటి విన్నవిస్తాము. శ్రద్ధగా విను. పురుషులు త్రికరణ శుద్ధిగా ఆచరించే ధర్మం అన్ని లోకాల దుఃఖాలను తొలగిస్తుంది. నిష్కాములైన వారికి మోక్షాన్ని ఇస్తుంది. అటువంటి ధర్మం ప్రజలకు మేలు కలిగిస్తుంది. కాబట్టి అది నీ వల్ల చెడకుండా ఉండాలి. ధర్మం నశిస్తే సంపదలు రాజును విడిచిపెడతాయి. దుష్టులైన మంత్రులనుండి, దొంగలనుండి ప్రజలను రక్షిస్తూ న్యాయమైన పన్ను తీసికొనే రాజు ఈ లోకంలోను, పరలోకంలోను సుఖాలు పొందుతాడు. ఏ రాజు దేశంలో యజ్ఞేశ్వరుడైన విష్ణువు తమ తమ వర్ణాశ్రమాలకు తగిన ధర్మాలను నిర్వర్తించే ప్రజలచేత పూజింపబడతాడో ఆ రాజును చూసి సర్వేశ్వరుడు, సర్వాంతర్యామి, మహామహిమాన్వితుడు అయిన భగవంతుడు సంతోషిస్తాడు. సర్వేశ్వరుడైన భగవంతుడు సంతోషిస్తే రాజుకు సర్వసౌఖ్యాలు కలుగుతాయి. లోకపాలకులు సర్వేశ్వరునికి పూజలు సమర్పిస్తారు. కాబట్టి నీవు యజ్ఙాలలో సమస్త లోకాధినాథుడు, దేవాదిదేవుడు, యజ్ఞస్వరూపుడు, వేదమయుడు, సర్వవ్యాపి, తపోమయుడు అయిన నారాయణుని ఆరాధిస్తే శుభంతో పాటు నీకు మోక్షం సిద్ధిస్తుంది. కాబట్టి నీ రాజ్యంలో యజ్ఞాలు జరిపించు. యజ్ఞాలవలన హరి అంశ కలిగిన దేవతలు ప్రహృష్టులై సంతుష్టులై నీ కోర్కెలు నెరవేరుస్తారు. దేవతలను తిరస్కరించడం మంచిది కాదు. వేదచోదితాలైన ధర్మాలయందు ఆసక్తి చూపించు’’ అని మునులు చెప్పగా వేనుడు ఇలా అన్నాడు.

తెభా-4-422-క.
"మునులార! మీర లిప్పుడు
ను నీ గతిఁ బడుచుఁదనమునం బలికితి; రై
ను నది యధర్మ; మందుల
నెయఁగ ధర్మమనఁ గలదె? యెచ్చటనైనన్.

టీక:- మునులారా = మునులూ; మీరలు = మీరు; ఇప్పుడు = ఇప్పుడు; ననున్ = నన్ను; ఈ = ఈ; గతిన్ = విధముగ; పడుచుదనము = గడుసుదనము, అతితెలివితో; పలికితిరి = చెప్పారు; ఐనను = అయినప్పటికిని; అది = అది; అధర్మము = ధర్మవిరుద్ధము; అందులన్ = వానిలో; ఎనయంగన్ = ఎంచగా; ధర్మము = ధర్మము; అనన్ = అన్నది; కలదె = ఉన్నదా ఏమి, లేదు; ఎచ్చటైనను = ఎక్కడైనను.
భావము:- “మునులారా! మూర్ఖత్వంతో మీరు ఈ విధంగా నాకు ఏమేమో బోధ చేశారు. మీరు చెప్పిందంతా కేవలం అధర్మం. అసలు దానిలో ధర్మమంటూ ఏదైనా ఎక్కడైనా ఉందా?

తెభా-4-423-వ.
అదియునుం గాక.
టీక:- అదియునున్ = అంతే; కాక = కాకుండ.
భావము:- అంతే కాక…

తెభా-4-424-చ.
యఁగ జారకామిని నిజేశుని మ్రుచ్చిలి జారపూరుషుం
పతిఁ గాఁ దలంచు గతిఁ ద్దయు మూఢమనస్కులై తన
ర్చి నరపాలరూపము ధరించిన యీశ్వరు నన్నెఱుంగ క
న్యుని భజియింప మీ రిహపరోన్నత సౌఖ్యము లంద రెన్నఁడున్.”

టీక:- ఎనయగన్ = తరచి చూసిన; జార = వ్యభిచారియైన; కామిని = స్త్రీ; నిజ = స్వంత; ఈశుని = భర్తని; మ్రుచ్చిలి = మోసము చేసి; జారపురుషున్ = విటుని; తన = తన యొక్క; పతి = ఏలిక; కాన్ = అగునట్లు; తలంచు = అనుకొనెడి; గతిన్ = విధముగ; తద్దయున్ = మిక్కిలి; మూఢ = అవివేకపు, మూర్ఖపు; మనస్కులు = మనస్సులు కలవారు; ఐ = అయ్యి; తనర్చిన = అతిశయించిన; నరపాల = రాజు యొక్క {నరపాలుడు - నరులను పాలించువాడు, రాజు}; రూపము = స్వరూపమును; ధరించిన = తాల్చిన; ఈశ్వరున్ = భగవంతుని; నన్నున్ = నన్ను; ఎఱుంగక = తెలిసికొనలేక; అన్యుని = ఇతరమైన వానిని; భజియింపన్ = ఆరాధించినచో; మీరు = మీరు; ఇహ = ఈలోకపు; పర = పరలోకపు; ఉన్నత = గొప్ప; సౌఖ్యములన్ = సౌఖ్యములను; అందరు = పొందరు; ఎన్నడున్ = ఎప్పుడు.
భావము:- జారిణియైన స్త్రీ తన భర్తను మోసగించి జారపురుషుని తన భర్తగా భావిస్తుంది. అలాగే మీరు మూర్ఖత్వంతో రాజరూపం ధరించిన భగవంతుడనైన నన్ను తెలుసుకొనకుండా ఇతరుణ్ణి సేవిస్తున్నారు. ఇటువంటి మీకు ఇహపర సుఖాలు లభించనే లభింపవు’’

తెభా-4-425-వ.
అని మఱియు నిట్లనియె “యజ్ఞ పురుషుం డన నెవ్వం? డెవ్వని యందు మీకు భక్తి స్నేహంబు లుదయించె? భర్తృస్నేహ విదూర లైన కుయోషి ద్గణంబులు జారు నందుఁ జేయు భక్తి చందంబునఁ బలికెద; రదియునుం గాక.
టీక:- అని = అని; మఱియున్ = ఇంకను; ఇట్లు = ఈ విధముగ; అనియె = పలికెను; యజ్ఞపరుషుండు = యజ్ఞపరుషుడు; అనన్ = అంటే; ఎవ్వండు = ఎవడు; ఎవ్వనిన్ = ఎవని; అందు = ఎడల; మీకున్ = మీకు; భక్తి = భక్తి; స్నేహంబులు = ప్రేమలు; ఉదయించెన్ = కలిగినవి; భర్తృ = భర్త యొక్క; స్నేహ = ప్రేమ నుండి; విదూరలు = బాగా దూరమైనవారు; ఐన = అయిన; కు = చెడ్డ; యోషిత్ = స్త్రీ; గణంబులున్ = సమూహములు; జారున్ = విటుని; అందున్ = ఎడల; చేయు = చేసెడి; భక్తి = భక్తి; చందంబునన్ = వలె; పలికెదరు = మాట్లాడెదరు; అదియునున్ = అంతే; కాక = కాకుండగ.
భావము:- అని ఇంకా ఇలా అన్నాడు “యజ్ఞపురుషుడంటే ఎవరు? ఎవనిపై మీకు భక్తి, రక్తి కలిగాయి? మగని మీద మమత లేని దుష్టస్త్రీలు రంకుమగనిపై వలపు ఒలకబోసినట్లు మీరు మాట్లాడుతున్నారు. అంతేకాక…

తెభా-4-426-క.
రి హర హిరణ్యగర్భ
స్వధీశ్వర వహ్ని శమన లధిపతి మరు
న్నవాహన శశి భూ రవి
సుముఖ్యులు నృపశరీర సూచకు లగుటన్.

టీక:- హరి = విష్ణుమూర్తి {హరి – ప్రళయకాలమున సర్వము తన గర్భమున హరించుకొనువాడు, విష్ణువు}; హర = శివుడు {హర - లయమునకు అధిపతి, శివుడు}; హిరణ్యగర్భ = బ్రహ్మదేవుడు {హిరణ్యగర్భుడు - బంగారుగర్భమున పుట్టినవాడు, బ్రహ్మదేవుడు}; స్వరధీశ్వర = ఇంద్రుడు {స్వరధీశ్వరుడు - స్వరమునకు అధిపతి, ఇంద్రుడు}; వహ్ని = అగ్నిదేవుడు {వహ్ని - హవిస్సులను వహించువాడు, అగ్నిదేవుడు}; శమన = యముడు {శమనుడు – సర్వేంద్రియముల వర్తనను శమింప జేయువాడు, యముడు}; జలధిపతి = వరుణుడు {జలధిపతి - జలధి (సముద్రము)నకు అధిపతి, వరుణుడు}; మరుత్ = వాయుదేవుడు {మరుతి - మారుతము (వాయువునకు) అధిపతి, వాయుదేవుడు}; నరవాహన = నిరృతి, కుబేరుడు {నరవాహనుడు - నరుని వాహనముగ కలవాడు, నిరృతి, కుబేరుడు}; శశి = చంద్రుడు {శశి - శశ (కుందేలు) గుర్తుగలవాడు, చంద్రుడు}; భూ = భూదేవి {భూమి – భరించునది}; రవి = సూర్యుడు {రవి - కిరణములు కలవాడు, సూర్యుడు}; సుర = దేవతా {సుర – సురాపానము చేయువారు, దేవతలు}; ముఖ్యులు = ప్రముఖులు; నృప = రాజు యొక్క; శరీర = శరీరమునందు; సూచకులు = తెలియబడువారు; అగుటన్ = అగుటను.
భావము:- విష్ణువు, శివుడు, బ్రహ్మ, ఇంద్రుడు, అగ్ని, యముడు, వరుణుడు, వాయువు, కుబేరుడు, చంద్రుడు, భూమి, సూర్యుడు మొదలైన దేవతలంతా రాజు శరీరంలో నివసిస్తారు. కాబట్టి…

తెభా-4-427-క.
రికించి నను భజింపుఁడు
ణీశుఁడు సర్వదేవతామయుఁ డగు; మ
త్స ముడుగుఁడు; నాకంటెను
బురుషుఁడు మఱియెవ్వఁ డగ్రపూజార్హుఁ డిలన్?

టీక:- పరికించి = విచారించుకొని; ననున్ = నన్ను; భజింపుడు = ఆరాధించండి; ధరణీశుడు = రాజు {ధరణీశుడు - ధరణి (భూమి)కి ఈశుడు, రాజు}; సర్వ = సమస్తమైన; దేవతా = దేవతలతో; మయుడు = నిండినవాడు; అగు = అయిన; మత్సర = మాత్సర్యము; ఉడుగుడు = మానుడు; నాకు = నాకు; కంటెన్ = కంటెను; పురుషుడు = సమర్థుడు; మఱి = ఇంక; ఎవ్వడు = ఎవడు; అగ్ర = ముఖ్యమైన; పూజా = ఆరాధనకి; అర్హుడు = అర్హతకలవాడు; ఇలన్ = భూమిపైన.
భావము:- బాగా ఆలోచించి నన్ను సేవించండి. రాజును సర్వ దేవతాస్వరూపునిగా భావించండి. అసూయ విడిచిపెట్టండి. అగ్రపూజకు తగినవాడు లోకంలో నాకంటే మరెవ్వరున్నారు?

తెభా-4-428-వ.
అదిగాన మీరు నాయందు బలివిధానంబులు చేయుం;"డని పాప కర్ముండు, నసత్ప్రవర్తకుండు, నష్టమంగళుండు, విపరీతజ్ఞానుండు నగు వేనుండు పండితమాని యగుచుం బలికి మునుల వచనంబులు నిరాకరించి యూరకున్న; నమ్మునులు భగ్నమనోరథులై తమలో నిట్లని “రీ దారుణకర్ముం డయిన పాతకుండు హతుం డగుం గాక; వీఁడు జీవించెనేని వీనిచేత నీ జగంబులు భస్మంబులు గాఁగల; విది నిశ్చితంబు; దుర్వృత్తుం డగు వీడు మహారాజ సింహాసనంబున కర్హుండు గాఁడు; వీఁడు మున్ను నే సర్వేశ్వరు ననుగ్రహంబున నిట్టి విభూతి యుక్తుం డయ్యె నట్టి యజ్ఞపతి యైన శ్రీవిష్ణుని నిందించుచున్నవాఁడు; గావున నిర్లజ్జుండైన హరినిందకుని హననంబు చేయ వలయు” నని మును లుద్యోగించి యాత్మప్రకాశితంబైన క్రోధంబునం జేసి హుంకారమాత్రంబున నా యీశ్వరనిందాహతుం డగు వేనునిం బొలియించి; రంత.
టీక:- అదిగాన = అందుచేత; మీరు = మీరు; నా = నా; అందున్ = ఎడల; బలి = బలులు; విధానంబులు = విధానములు; చేయుండు = చేయండి; అని = అని; పాప = పాపపు; కర్ముండున్ = పనులు చేయువాడు; అసత్ = చెడ్డ; ప్రవర్తకుండున్ = నడవడిక కలవాడు; నష్ట = నాశనమైన; మంగళుండున్ = శుభములు కలవాడు; విపరీత = వ్యతిరిక్త; జ్ఞానుండున్ = జ్ఞానము కలవాడు; అగు = అయిన; వేనుండు = వేనుడు; పండితమాని = తెలిసినవాడిని యని యనుకొనెడివాడు; అగుచున్ = అవుతూ; పలికి = పలికి; మునుల = మునుల యొక్క; వచనంబులు = మాటలు; నిరాకరించి = తిరస్కరించి; ఊరకున్నన్ = ఊరకుండగా; ఆ = ఆ; మునులు = మునులు; భగ్న = విఫలమైన; మనోరథులు = కోరిక కలవారు; ఐ = అయ్యి; తమలోన్ = తమలో తాము; ఇట్లు = ఈ విధముగ; అనిరి = పలికిరి; ఈ = ఈ; దారుణ = క్రూరమైన; కర్ముండున్ = పనులు చేయువాడు; అయిన = అయిన; పాతకుండు = పాపి; హతుండు = మరణించినవాడు; అగుంగాక = అయిపోవుగాక; వీడు = ఇతడు; జీవించెనేని = బతికి ఉంటే; వీని = ఇతని; చేతన్ = చేత; ఈ = ఈ; జగంబులు = లోకములు; భస్మంబులు = కాలిబూడిదైపోయినవి; కాగలవు = అయిపోగలవు; ఇది = ఇది; నిశ్చితంబు = తప్పక జరుగును; దుర్ = చెడ్డ; వృత్తుండు = నడవడిక కలవాడు; అగు = అయిన; వీడు = ఇతను; మహారాజ = మహారాజు యొక్క; సింహాసనంబున = పదవి; కున్ = కి; అర్హుండు = తగినవాడు; కాడు = కాడు; వీడు = ఇతడు; మున్నున్ = ఇంతకు ముందు; ఏ = ఏ; పరమేశ్వరున్ = భగవంతుని; అనుగ్రహంబునన్ = అనుగ్రహమువలన; ఇట్టి = ఇటువంటి; విభూతిన్ = వైభవమును; యుక్తుండు = కూడినవాడు; అయ్యెన్ = అయ్యెనో; అట్టి = అటువంటి; యజ్ఞపతి = యజ్ఞములకు అధిపతి; ఐన = అయిన; శ్రీవిష్ణుని = విష్ణుమూర్తిని; నిందించుచున్ = నిందిస్తూ; ఉన్నవాడు = ఉన్నాడు; కావునన్ = అందుచేత; నిర్లజ్జుండు = సిగ్గులేనివాడు; ఐన = అయిన; హరి = విష్ణుమూర్తిని; నిందకుని = నిందించువానిని; హననంబున్ = చంపుట; చేయవలయును = చేయవలెను; అని = అని; మునులు = మునులు; ఉద్యోగించి = సంకల్పించి; ఆత్మ = తమ; ప్రకాశితంబున్ = వెలుగుతున్నది; ఐన = అయిన; క్రోధంబునన్ = రోషము; చేసి = వలన; హుంకార = హుం అనెడి శబ్దము; మాత్రంబునన్ = మాత్రముచేతనే; ఆ = ఆ; ఈశ్వర = హరి; నిందా = నిందించుటచే; హతుండు = దెబ్బతిన్నవాడు; అగు = అయిన; వేనునిన్ = వేనుని; పొలియించిరి = సంహరించిరి; అంత = అంతట.
భావము:- కాబట్టి మీ బలులు నాకే సమర్పించండి” అని పాపాత్ముడు, దుర్మార్గుడు, అమంగళుడు, అజ్ఞాని అయిన వేనుడు విపరీతబుద్ధితో మునుల మాటలను నిరాకరించి పలికాడు. అప్పుడు మునులు తమ ప్రయత్నాలు వ్యర్థం కాగా పరస్పరం ఇలా అనుకున్నారు “భయంకర కృత్యాలకు పాల్పడుతున్న ఈ పాపాత్ముడు నశించిపోవాలి. వీడు బ్రతికి ఉన్నట్లయితే వీని వల్ల ఈ లోకాలన్నీ నశిస్తాయి. దురాచారుడైన వీడు గద్దె నెక్కటానికి అర్హుడు కాడు. ఏ సర్వేశ్వరుని అనుగ్రహం వల్ల వీడు ఇటువంటి ఐశ్వర్యాన్ని పొందాడో ఆ యజ్ఞపతి అయిన విష్ణువును నిందిస్తున్నాడు. కాబట్టి సిగ్గు మాని శ్రీహరిని నిందించే వీనిని హతమార్చాలి” అని మునులు తమలో పెల్లుబికిన కోపంతో హుంకరించారు. ఆ మహర్షుల హుంకారానికి భగవన్నిందకుడైన వేనుడు మరణించాడు. అప్పుడు…

తెభా-4-429-క.
సి సునీథయు శోకా
తు యై తన సుతుఁడు దనువుఁ దొఱఁగినఁ దదనం
మునను యోగశక్తిం
రువడి నిజ తనయు తనువుఁ రిపాలించెన్.

టీక:- అరసి = తెలుసుకొని; సునీథయు = సునీథ; శోక = దుఃఖముచే; ఆతుర = చీకాకుపరచబడినది; ఐ = అయ్యి; తన = తన యొక్క; సుతుడున్ = సుతుని; తనువున్ = దేహమును; తొఱగినన్ = విడిచిపోయిన; తదనంతరమునను = తరువాత; యోగశక్తిన్ = యోగశక్తితో; పరువడి = శ్రీఘ్రమే; నిజ = తన యొక్క; తనయున్ = పుత్రుని; తనువున్ = శరీరమును; పరిపాలించెన్ = కాపాడెను.
భావము:- సునీథ తన కొడుకు మరణానికి దుఃఖించింది. యోగశక్తిచేత వేనుని శరీరాన్ని చెడిపోకుండా కాపాడింది.

తెభా-4-430-వ.
అంత నొక్కనాఁడు.
టీక:- అంతన్ = అంతట; ఒక్క = ఒక; నాడు = దినమున.
భావము:- ఇలా ఉండగా ఒకనాడు…

తెభా-4-431-సీ.
మునివరేణ్యులు భక్తి ర సరస్వతీ-
లిలంబులను గృతస్నాను లగుచు
మునుకొని తత్తీరమున నగ్నిహోత్రముల్-
విలసిల్ల నియతిఁ గావించి యచటఁ
విలి సత్పురుషకథా వినోదంబులు-
లుపుచు నుండంగ కలలోక
యదంబు లగు మహోత్పాతముల్ దోఁచిన-
సలి “లోకంబు లమంగళములు

తెభా-4-431.1-తే.
వొరయ కుండెడుఁ గా కని బుద్ధిలోనఁ
లఁచుచుండఁగఁ బెలుచ నుగ్ర మగుచు
ర్వ దిశలను బాంసువర్షంబు గురిసెఁ;
స్కరులు సర్వజనుల విత్తములు గొనిరి.

టీక:- ముని = మునులలో; వరేణ్యులు = ఉత్తములు; భక్తిన్ = భక్తి; తనర = అతిశయించగ; సరస్వతీ = సరస్వతీనదీ; సలిలంబులను = నీటిలో; కృత = చేసిన; స్నానులు = స్నానము కలవారు; అగుచున్ = అవతూ; మునుకొని = పూని; తత్ = దాని; తీరమునన్ = గట్టుపైన; అగ్నిహోత్రముల్ = అగ్నిహోత్రములు; విలసిల్ల = ఒప్పి యుండగ; నియతిన్ = నియమును; కావించి = చేసికొని; అచటన్ = అక్కడ; తవిలి = పూని; సత్ = మంచి; పురుష = పురుషుల; కథా = కథలను సంకీర్తన చేసెడి; వినోదంబులు = ఉల్లాసములు; సలుపుచుండగ = చేస్తుండగా; సకల = సమస్తమైన; లోక = లోకములకు; భయదంబులు = భయముగొల్పునవి; అగు = అయిన; మహా = గొప్ప; ఉత్పాతముల్ = దుశ్శకునములు; తోచినన్ = తోచగా; మసలి = కలతపడి; లోకంబులు = లోకములు; అమంగళములు = అశుభములు.
పొరయకుండెడుగాక = కలుగకుండుగాక; అని = అని; బుద్ధి = మనసు; లోనన్ = లో; తలచుచుండగన్ = అనుకొంటుండగ; పెలుచన్ = మిక్కిలి; ఉదగ్రము = చెలరేగినవి; అగుచున్ = అవుతూ; సర్వ = సకల; దిశలనున్ = దిక్కులందు; పాంసు = ధూళి; వర్షంబులు = వర్షములువలె; కురిసెన్ = కురిసెను; తస్కరులు = దొంగలు; సర్వజనుల = అందరి; విత్తములున్ = ధనములను; కొనిరి = తీసుకుపోయిరి.
భావము:- మునీంద్రులు భక్తితో సరస్వతీ నదీ జలాలలో స్నానం చేసి, ఆ నదీతీరాన యథావిధిగా అగ్నికార్యాలు నిర్వర్తించుకొని ఎంతో ఆసక్తితో సత్పురుషుల కథలు చెప్పుకుంటూ వినోదిస్తున్నారు. అప్పుడు సకల లోకాలకు భయం కలిగించే గొప్ప అపశకునాలు గోచరించాయి. ఆ మహోత్పాతాలను చూచి మునీంద్రులు “లోకాలకు అశుభాలు కలుగకుండు గాక!” అని అనుకున్నారు. ఇలా అనుకుంటూ ఉండగానే ప్రచండంగా దుమారం చెలరేగింది. అన్ని దిక్కులలో ధూళి వర్షం కురిసింది. దొంగలు విజృంభించి ప్రజల సంపదలను దోచుకున్నారు.

తెభా-4-432-వ.
ఇట్టి లోకోపద్రవం బెఱింగి జననాథుం డుపరతుం డగుటం జేసి జనపదంబు లరాజకంబులై యన్యోన్యహింసల నొందుచుం దస్కరబాధితంబు లగుచు నుండుట యెఱింగియుఁ దన్నివారణంబునకు సమర్థు లయ్యును జోరాది బాధలం గనుంగొనుచు మునులు వారింపక యుండిరి; మఱియు సమదర్శనుండు శాంతుండు మననశీలుండు నగు బ్రాహ్మణుండు దీనుల నుపేక్షించిన నతని తపంబు భిన్నభాండగతం బయిన క్షీరంబు చందంబున క్షయించుం; గావున నంగ వసుధాధీశ వంశోద్భవులు హరిపదాశ్రయు లగుటం జేసియు నమోఘ సత్త్వనిష్ఠులగుటం జేసియు వీరల వంశంబు విచ్ఛిత్తి నొందింప ననర్హంబు; గాన స్థాపనీయం బగు నని నిశ్చయించి మృతుండైన వేనుని కళేబరంబు డగ్గఱ వచ్చి తదూరు మథనంబు గావింప; నందు.
టీక:- ఇట్టి = ఇటువంటి; లోక = లోకములకు; ఉపద్రవంబున్ = కలిగిన ఆపదలు; ఎఱింగి = తెలిసి; జననాథుండు = రాజు {జననాథుడు - జనులకు (ప్రజలకు) నాథుడు (ప్రభువు), రాజు}; ఉపరతుండు = మరణించినవాడు; అగుటన్ = అగుట; చేసి = వలన; జనపదంబులు = ఊర్లు; అరాజకంబులు = రాజు లేనివి; ఐ = అయ్యి; అన్యోన్య = వాటిలోయవి; హింసలన్ = హింసలను; ఒందుచున్ = పొందుతూ; తస్కరులు = దొంగల; బాధితంబులు = బాధలను పొందిన వారు; అగుచున్ = అవుతూ; ఉండగా = ఉండగా; ఎఱింగియున్ = తెలిసి; తత్ = వానిని; నివారణంబున్ = నివారించుట; కున్ = కు; సమర్థులు = సమర్థత కలవారు; అయ్యునున్ = అయినప్పటికిని; చోర = దొంగతనము; ఆది = మొదలైన; బాధలన్ = బాధలను; కనుంగొనుచు = చూస్తూ; మునులు = మునులు; వారింపక = వారించకుండ; ఉండిరి = ఉండిపోయారు; మఱియున్ = ఇంకను; సమదర్శనుండు = సమత్వదృష్టి కలవాడు; శాంతుండు = శాంతస్వభావము కలవాడు; మననశీలుడున్ = వేదశాస్త్రములను మననము చేసికొనెడి వాడు; అగు = అయిన; బ్రాహ్మణుండు = బ్రాహ్మణుడు; దీనులన్ = దీనుల యెడ; ఉపేక్షించినన్ = ఉదాశీనత చూపినచో; అతని = అతని; తపంబున్ = తపస్సు; భిన్న = విరిగిన; భాండ = కుండలో; గతంబున్ = ఉన్నవి; అయిన = అయిన; క్షీరంబు = పాలు; చందంబునన్ = వలె; క్షయించున్ = నష్టపోవును; కావునన్ = అందుచేతను; అంగ = అంగ; వసుధాధీశ = రాజు యొక్క {వసుధాధీశుడు - వసుధ (భూమి)కి అధీశుడు (పతి), రాజు}; వంశోద్భవులు = సంతానము {వంశోద్భవులు - వంశమున ఉద్భవులు (పుట్టినవారు), సంతానము}; హరి = నారాయణుని; పద = పాదములను; ఆశ్రయులు = ఆశ్రయించినవారు; అగుటన్ = అవుట; చేసియున్ = వలనను; అమోఘ = వ్యర్థము కాని, అమోఘమైన; సత్త్వ = శక్తి; నిష్ఠులు = శ్రద్ధ గలవారు; అగుటన్ = అగుట; చేసియున్ = వలనను; వీరల = వీరి; వంశంబు = వంశము; విచ్ఛిత్తి = నాశనము; ఒందింపన్ = పొందించుట; అనర్హంబు = తగినది కాదు; కాన = కనుక; స్థాపనీయంబు = స్థాపించ తగినది; అగున్ = అగును; అని = అని; నిశ్చయించి = నిశ్ఛయించి; మృతుండు = మరణించిన వాడు; ఐన = అయిన; వేనునిన్ = వేనుని; కళేబరంబున్ = శవము; డగ్గఱన్ = దగ్గరకి; వచ్చి = వచ్చి; తత్ = వాని; ఊరున్ = తొడను; మథనంబున్ = మధించుట; కావింపన్ = చేయగా; అందు = దానిలో.
భావము:- ఈ విధంగా లోకానికి ఉపద్రవం కలగడం మునులు గ్రహించారు. రాజు లేకపోవటం మూలాన దేశమంతా అరాజకమై ఒకరి నొకరు హింసించుకోవడం, దోచుకొనడం ఎక్కువయ్యాయని వారు తెలుసుకున్నారు. ఆపడానికి సమర్థులైనప్పటికీ వారించకుండా ఊరుకున్నారు. ‘సమదర్శనుడు, శాంతస్వభావుడు, లోకజ్ఞుడు అయిన బ్రాహ్మణుడు దీనులను ఉపేక్షిస్తే అతని తపస్సు పగిలిన కుండలోని పాలవలె నశిస్తుంది. కాబట్టి ఈ ఆపదను తప్పక నివారించాలి. అంగవంశంలో పుట్టిన రాజులు హరి భక్తులు, మహావీరులు కావటం వల్ల వీరి వంశం ఇంతటితో తుదముట్టకూడదు. ఈ వంశాన్ని నిలబెట్టాలి’ అని మళ్ళీ నిశ్చయించుకున్నారు. వేనుని శవాన్ని సమీపించి మునీంద్రులు అతని తొడను మథించారు. ఆ తొడనుండి…

తెభా-4-433-సీ.
న కాక కృష్ణ సంకాశ వర్ణుండును-
హ్రస్వావయవుఁడు మహాహనుండు
హ్రస్వబాహుండును హ్రస్వపాదుండును-
నిమ్న నాసాగ్రుండు నెఱయ రక్త
యనుండుఁ దామ్రవర్ణశ్మశ్రుకేశుండు-
తి దీన వదనుండు నైన యట్టి
యొక్క నిషాదకుం డుదయించి యేమి చే-
యుదు నని పలుకుచునున్నఁ జూచి

తెభా-4-433.1-తే.
రమునులు నిషీద యనుచుఁ లుకుటయును
దాన వాఁడు నిషాదాభిదానుఁ డయ్యె;
తని వంశ్యులు గిరికాననాళి వేను
ల్మషముఁ దెల్పుచుండిరి డఁక మఱియు.

టీక:- ఘన = మిక్కిలి; కాక = కాకి; కృష్ణ = నలుపుకి; సంకాశ = సమానమైన; వర్ణుండును = రంగుకలవాడు; హ్రస్వ = పొట్టి; అవయవుడు = అవయవములుకలవాడు; మహా = పెద్ద; హనుండు = చెక్కిళ్ళుకలవాడు; హ్రస్వ = కురచ; బాహుండును = చేతులుకలవాడు; హ్రస్వ = కురచ; పాదుండును = కాళ్ళుకలవాడు; నిమ్న = తప్పటి, ఎత్తులేని; నాసాగ్రుండును = ముక్కుకలవాడు; నెఱయన్ = నిండా; రక్త = ఎఱ్ఱని; నయనుండున్ = కన్నులుకలవాడు; తామ్ర = రాగి; వర్ణ = రంగుకల; శ్మశ్రు = మీసములు; కేశుండు = శిరోజములు కలవాడు; అతి = మిక్కిలి; దీన = దీనమైన; వదనుండును = ముఖము కలవాడు; ఐన = అయిన; అట్టి = అటువంటి; ఒక్క = ఒక; నిషాదకుండు = అడవిమనిషి; ఉదయించి = పుట్టి; ఏమి = ఏమిటి; చేయుదున్ = చేసెదను; అని = అని; పలుకుచునున్నన్ = అడుగుతున్న; చూచి = చూసి.
వర = శ్రేష్ఠమైన; మునులు = మునులు; నిషీద = కూర్చో; అనుచున్ = అంటూ; పలుకుటయును = అనిరి; దానన్ = దానివలన; వాడు = అతడు; నిషాద = నిషాదుడు అనెడి; అభిదానుడు = పేరుకలవాడు; అయ్యెన్ = అయ్యెను; అతని = అతని యొక్క; వంశ్యులు = వంశమువారు; గిరి = కొండలు; కానన = అడవి; ఆళిన్ = సమూహములందు; వేనున్ = వేనుని; కల్మషమున్ = పాపమును; తెల్పుచున్ = తెలియజేయుతూ; ఉండిరి = ఉన్నారు; కడకన్ = చివరకి; మఱియున్ = ఇంకను.
భావము:- ఒక బోయవాడు పుట్టాడు. వాడు కాకివలె నల్లగా ఉన్నాడు. పొట్టిగా ఉన్నాడు. పెద్ద పెద్ద చెక్కిళ్ళు, కురుచ చేతులు, కురుచ కాళ్ళు, చిట్టిముక్కు, ఎఱ్ఱని కళ్ళు, రాగి మీసాలు, రాగి గడ్డం, రాగి తల వెండ్రుకలు గల ఆ మరుగుజ్జువాడు దీనమైన ముఖంతో “నేను చేయవలసిన పని ఏమిటి?” అని ప్రశ్నించాడు. అప్పుడు మునులు “నిషీద (కూర్చుండు)” అన్నారు. అందుచేత వాని పేరు నిషాదుడు అయింది. అతని కులంలో పుట్టినవాళ్ళంతా నిషాదులై పర్వతాలలో అడవులలో సంచరిస్తూ వేనుని దుష్కీర్తిని వెల్లడిస్తున్నారు.