పోతన తెలుగు భాగవతము/చతుర్ధ స్కంధము/పృథుని బరమపద ప్రాప్తి
తెభా-4-598-క.
వినువీథినుండి మెల్లన
చనుదెంచిరి బాలసూర్య సంకాశ తనుల్
జనవినుత! సిద్ధ వర్యులు
సనకాదులు శేముషీ విచక్షణు లంతన్.
టీక:- వినువీథి = ఆకాశమార్గము; నుండి = నుండి; మెల్లన = మెల్లగా; చనుదెంచిరి = వచ్చిరి; బాల = ఉదయ; సూర్య = భానుని; సంకాశ = సమానమైన ప్రకాశముకల; తనుల్ = దేహములు కలవారు; జన = లోకులచే; వినుత = స్తుతింపబడినవాడ; సిద్ధ = సిద్ధులలో; వర్యులు = శ్రేష్ఠులు; సనక = సనకుడు {సనకాది - 1సనక 2సనందన 3సనత్కుమార 4సనత్సుజాతులు}; ఆదులున్ = మొదలగువారు; శేముషీ = ప్రజ్ఞ (మనీష) అనబడెడి; విచక్షణులు = విచక్షణా జ్ఞానము కలవారు; అంతన్ = అంతట.
భావము:- బాలసూర్యుని వలె ప్రకాశించే దేహంతో పరిణత బుద్ధులైన సనకసనందనాది మహాసిద్ధులు ఆకాశం నుండి దిగి మెల్లగా అక్కడికి వచ్చారు.
తెభా-4-599-వ.
ఇట్లు చనుదెంచి.
టీక:- ఇట్లు = ఈ విధముగ; చనుదెంచి = వచ్చి.
భావము:- ఈ విధంగా వచ్చి…
తెభా-4-600-క.
అనఘాత్ము లతిధి రూపం
బున రా గృహమేధి ప్రాణములు నుద్గతిచేఁ
దనరినఁ బ్రత్యుద్గతి వం
దనముల మరలం బ్రతిష్ఠితములగు ననుచున్.
టీక:- అనఘాత్ములు = పుణ్యాత్ములు; అతిథి = అతిథి; రూపంబునన్ = రూపములో; రాన్ = రాగా; గృహమేధి = గృహస్థుని; ప్రాణములున్ = ప్రాణములు; ఉద్గతి = పైకి లేచుట; చేన్ = చేత; తనరినన్ = అతిశయించినను; ప్రత్యుద్గతి = ఎదురు వెళ్లుట; వందనములన్ = నమస్కరించుటలుచే; మరలన్ = మళ్ళీ; ప్రతిష్ఠితంబులు = చక్కగా నిలబడినవి; అగున్ = అగును; అనుచున్ = అంటూ.
భావము:- పూజ్యులు అతిథులుగా వచ్చినప్పుడు వారిని చూడగానే గృహస్థు ప్రాణాలు లేచి వస్తాయి. వారికి ఎదురేగి నమస్కరించినప్పుడు తిరిగి యథాస్థానంలోనికి వస్తాయి అనే…
తెభా-4-601-క.
వినఁబడు వచనన్యాయం
బున నుద్గతములగు ప్రాణములఁ గ్రమ్మఱఁ బొం
దను గోరువాడునుం బలె
ననుచర ఋత్విక్సదస్యుఁడై పృథుఁ డంతన్.
టీక:- వినబడు = వినబడెడి; వచన = వాక్యముల; న్యాయంబున = న్యాయము ప్రకారము; ఉద్గతములు = పైకి లేచినవి; అగు = అయిన; ప్రాణములన్ = ప్రాణములను; క్రమ్మఱన్ = మరల; పొందను = పొందుటను; కోరువాడునున్ = కోరెడివాడు; వలె = వలె; అనుచర = అనుసరిస్తున్న; = = ఋత్విక్ = ఋత్విక్కులు; సదస్యుడు = సభ్యులు కలవాడు; ఐ = అయ్యి; పృథుడున్ = పృథుచక్రవర్తి; అంతన్ = అంతట.
భావము:- శాస్త్రకారుల మాట చొప్పున పైకి లేచిన ప్రాణాలను మళ్ళీ పొందగోరిన వానివలె పృథుచక్రవర్తి ఋత్విక్కులతోను, సదస్యులతోను కూడి లేచి ఎదురు వెళ్ళాడు.
తెభా-4-602-తే.
ఇంద్రియేశుఁడు గంధాదికేష్ట గుణముఁ
గూర్చి యుద్గమనక్రియఁ గోరి చేయు
పగిదిఁ బృథుచక్రవర్తి సంభ్రమముతోడ
మహితభక్తిని బ్రత్యుద్గమంబు చేసె.
టీక:- ఇంద్రియేశుడు = జీవుడు {ఇంద్రి యేశుడు - ఇంద్రియములకు ప్రభువు, జీవుడు}; గంధ = సువాసన; ఆదిక = మొదలగు; ఇష్ట = ఇష్టమైన; గుణమున్ = గుణములను; కూర్చి = గురించి; ఉద్గమన = లేచుట అనెడి; క్రియన్ = పనిని; కోరి = కోరి; చేయు = చేసెడి; పగిదిన్ = విధముగ; పృథుచక్రవర్తిన్ = పృథుచక్రవర్తి; సంభ్రమము = సంతోషముతో కూడిన తడబాటు; తోడన్ = తోటి; మహిత = గొప్ప; భక్తిని = భక్తితో; ప్రత్యుద్గమము = లేచి ఎదురేగుట; చేసె = చేసెను.
భావము:- ఇంద్రియాధిపతి అయిన జీవుడు గంధం మొదలైన అభీష్ట గుణాలకోసం ఉద్గమించినట్లు పృథుచక్రవర్తి అత్యంత భక్తితో ససంభ్రమంగా సనకాదులకు ప్రత్యుద్గమనం చేసాడు.
తెభా-4-603-క.
ఘనగౌరవమున నమ్ముని
జనచిత్త వశీకృతుండు సభ్యుఁడుఁ బ్రియుఁడున్
వినయానతకంధరుఁడై
జనవరుఁ డా పరమయోగిచంద్రుల నెలమిన్.
టీక:- ఘన = గొప్ప; గౌరవమునన్ = గౌరవముతో; ఆ = ఆ; ముని = మునులైన; జన = వారి; చిత్త = చిత్తములకు; వశీకృతుండున్ = వశమైనవాడు; సభ్యుడున్ = మర్యాద కలవాడు; ప్రియుడున్ = కూర్మి కలవాడు; వినయ = వినయముచే; ఆనత = మిక్కిలి వంచిన; కంధరుడు = మెడ కలవాడు; ఐ = అయ్యి; జనవరుడు = రాజు {జనవరుడు - జన (ప్రజల)కు వరుడు (పతి), రాజు}; ఆ = ఆ; పరమ = అత్యుత్తమ; యోగి = యోగులలో; చంద్రులన్ = చంద్రుని వంటి వారిని; ఎలమిన్ = సంతోషముతో.
భావము:- మునీంద్రుల మనస్సులను లోగొన్నవాడు, సభ్యత ఎరిగినవాడు అయిన మహారాజు వినయ వినమ్రుడై ఆ పరమయోగీంద్రులకు నమస్కరించి తోడ్కొని వచ్చాడు.
తెభా-4-604-సీ.
పూని యర్హాసనాసీనులఁ గావించి-
కర మర్థిఁ విధివత్ప్రకారమునను
బూజించి తత్పదాంభోరుహక్షాళన-
సలిలంబు లాత్మమస్తమునఁ దాల్చి
హాటక కలిత సింహాసనాసీనులై-
విహితాగ్నులను బోలి వెలుఁగుచున్న
శర్వాగ్ర జన్ముల సనకాదులను జూచి-
యతుల శ్రద్ధాసంయమాన్వితుండుఁ
తెభా-4-604.1-తే.
బరమ సంప్రీత మతియునై పలికె రాజు
గోరి "యో మంగళాయనులార! పూర్వ
భవమునం దెద్ది మంగళప్రద సుకర్మ
మేను జేసితి? మిముఁ జూడ నిపుడు గలిగె."
టీక:- పూని = పూనుకొని; అర్హ = తగిన; ఆసనా = ఆసనములందు; ఆసీనులన్ = కూర్చొనినవారిని; కావించి = చేసి; కరము = అదికముగ; అర్థిన్ = కోరి; విధివత్ప్రకారము = పద్ధతిప్రకారము; పూజించి = పూజించి; తత్ = వారి; పాద = పాదములు అనెడి; అంభోరుహ = పద్మములు; క్షాళన = కడిగిన; సలిలంబున్ = నీటిని; ఆత్మ = స్వంత; మస్తకంబునన్ = తలపైన; తాల్చి = ధరించి; హాటక = బంగారముతో; కలిత = చేయబడిన; సింహాసన = సింహాసనములందు; ఆసీనులన్ = కూర్చున్నవారు; ఐ = అయ్యి; విహిత = అనుకూలమైన; అగ్నులన్ = అగ్నుల; పోలి = వలె; వెలుగుచున్న = ప్రకాశించుతున్న; శర్వ = శివుని కంటె {శర్వాగ్రజన్ములు - సృష్టాదిని బ్రహ్మదేవుడు సనకాదుల సృష్టించెను. తరువాత అతని కనుబొమముడినుండి రుద్రరూపమున శివుడు జన్మించెను. అందుచేత శివును యగ్రజన్ములు సనకాదులు.}; అగ్రజన్ములన్ = ముందుపుట్టినవారిని; సనక = సనకుడు {సనకాదులు - 1సనకుడు 2సనందనుడు 3సనత్కుమారుడు 4సనత్సుజాతుడు}; ఆదులన్ = మొదలగువారిని; చూచి = చూసి; అతుల = మిక్కిలి; శ్రద్ధా = శ్రద్ధతో; సంయమ = నిగ్రహములతో; సమాన్వితుండు = కూడినవాడు; పరమ = మిక్కిలి; సంప్రీత = ప్రేమకలిగిన; మతియున్ = భావముకలవాడు; ఐ = అయ్యి.
పలికెన్ = పలికెను; రాజు = రాజు; కోరి = కోరి; ఓ = ఓ; మంగళ = శుభ; ఆయనులారా = ప్రదులారా; పూర్వ = ఇంతకుముందటి; భవమునన్ = జన్మములందు; ఎద్ది = ఏదో; మంగళ = శుభమును; ప్రద = కలిగించునదియైన; సు = మంచి; కర్మమున్ = కర్మమును; ఏను = నేను; చేసితిన్ = చేసితిని; మిమున్ = మిమ్ములను; చూడన్ = చూచుట; ఇపుడున్ = ఇప్పుడు; కలిగె = కలిగినది;
భావము:- వారిని తగిన ఆసనాలపై కూర్చుండబెట్టి యథావిధిగా పూజించాడు. వారి పాదపద్మాలను కడిగిన జలాలను తన తలపై చల్లుకున్నాడు. బంగారు గద్దెలమీద ఆసీనులై అగ్నులవలె ప్రకాశిస్తున్న బ్రహ్మ మానస పుత్రులను చూచి పృథుచక్రవర్తి పరమ సంతోషంతో, శ్రద్ధాసక్తులతో ఇలా అన్నాడు. “మంగళమూర్తులైన మహాత్ములారా! పూర్వజన్మలో నేను చేసిన పుణ్యవిశేషం వల్ల మిమ్ములను ఇప్పుడు దర్శింప గలిగాను.”
తెభా-4-605-వ.
అని వెండియు.
టీక:- అని = అని; వెండియు = ఇంకను.
భావము:- అని చెప్పి ఇంకా…
తెభా-4-606-క.
"భువి నెవ్వని యెడ విప్రులు
భవుఁడును విష్ణుఁడుఁ దదీయ భక్తులును బ్రస
న్నవదను లగుదురు వానికి
భువి దివిని నసాధ్యకర్మములు లే వరయన్."
టీక:- భువిన్ = భూమిపై; ఎవ్వని = ఎవని; ఎడన్ = అందు; విప్రులున్ = బ్రాహ్మణులు; భవుడునున్ = శివుడు; విష్ణుడున్ = నారాయణుడును; తదీయ = అతని; భక్తులును = భక్తులును; ప్రసన్న = ప్రసన్నమైన; వదనులు = ముఖము కలవారు; అగుదురు = అయ్యెదరో; వాని = వాని; కిన్ = కి; భువిన్ = ప్రపంచములోను; దివిన్ = స్వర్గములోను; అసాధ్య = సాధ్యముకాని; కర్మములు = కర్మములు; లేవు = లేవు; అరయన్ = తరచిచూసిన.
భావము:- “లోకంలో బ్రాహ్మణులు, శివుడు, విష్ణువు, విష్ణుభక్తులు ఎవరిని అనుగ్రహిస్తారో వారికి భూలోకంలో కానీ, స్వర్గలోకంలో కానీ సాధింపరాని కార్యాలు ఉండవు.”
తెభా-4-607-వ.
అని మఱియు “ననఘాత్ములార! లోకంబుల నీక్షించుచుం బర్యటనంబు చేయు మిమ్ము సర్వదర్శనుం డయిన యాత్మం గనుంగొనఁజాలని సర్వదృశ్యంబు చందంబున నీ లోకంబు గనుంగొనజాలకుం; డట్టి మహాత్ముల రయిన మీ దర్శనంబునం జేసి యేను ధన్యుండ నైతి; నదియునుం గాక.
టీక:- అని = అని; మఱియున్ = ఇంకను; అనఘాత్ములులారా = పుణ్యాత్ములులారా; లోకంబులన్ = లోకములను; ఈక్షించుచున్ = వీక్షించుతూ; పర్యటనంబున్ = తిరుగుట; చేయు = చేసెడి; మిమ్మున్ = మిమ్ములను; సర్వ = సమస్తమును; దర్శనుండు = చూడగలిగెడివాడు; అయిన = అయినను; ఆత్మన్ = ఆత్మను; కనుగొనజాలని = పొడగనలేని; సర్వ = సర్వసామాన్యమైన; దృశ్యంబు = దృశ్యము; చందంబునన్ = వలె; ఈ = ఈ; లోకంబున్ = లోకమున; కనుంగొనజాలకుండు = పొడగనలేకుండును; అట్టి = అటువంటి; మహాత్ములరు = గొప్పవారు; అయిన = అయిన; మీ = మీ యొక్క; దర్శనంబునన్ = దర్శనము; చేసి = వలన; ఏను = నేను; ధన్యుండన్ = ధన్యుడను; ఐతి = అయితి; అదియునున్ = అంతే; కాక = కాకుండ.
భావము:- అని చెప్పి మళ్ళీ “పుణ్యాత్ములారా! సర్వదర్శనుడైన ఆత్మను సర్వదృశ్యం చూడలేనట్లు లోకాలన్నింటినీ చూస్తూ సంచరించే మిమ్ము లోకులు చూడలేరు. అటువంటి మహానుభావులైన మీ దర్శనం వల్ల నేను కృతార్థుణ్ణి అయినాను. అంతేకాక…
తెభా-4-608-చ.
అరయ ధరిత్రి నెవ్వని గృహంబు మహార్హజనోపభోగ్య వి
స్ఫురిత తృణాంబు భృత్య గృహభూముల సారెఁ దనర్చు నట్టి మం
దిరపతి పేద యైన జగతిం గడు ధన్యుఁ డటండ్రు గాన సు
స్థిరమతి మీరు వచ్చుట నశేషశుభంబుల నేను బొందెదన్.
టీక:- అరయన్ = తరచిచూసిన; ధరిత్రిన్ = భూమిమీద; ఎవ్వని = ఎవని యొక్క; గృహంబున్ = నివాసమున; మహా = గొప్ప; అర్హ = అర్హతలు గల; జన = వారిచే; ఉపభోగ్య = ఉపయోగింపబడుతున్న; విస్ఫురిత = ప్రకాశిస్తున్న; తృణ = గడ్డి; అంబు = నీరు; భృత్య = సేవకులు; గృహభూములన్ = ఇంటి పెరడు లందు; సారెన్ = మరల మరల; తనర్చు = అతిశయించెడి; మందిరపతి = గృహస్థుడు {మందిర పతి - మందిరము (నివాసము)నకధిపతి, గృహస్తుడు}; పేద = పేదవాడు; ఐనన్ = అయినను; జగతిన్ = లోకమున; కడు = మిక్కిలి; ధన్యుడు = ధన్యుడు; అట = అని; అండ్రు = అంటారు; సుస్థిరమతి = మిక్కిలి నిశ్చయముగ; మీరు = మీరు; వచ్చుటన్ = వచ్చుటచే; అశేష = అనంతమైన; శుభంబులన్ = శుభములను; నేనున్ = నేను; పొందెదన్ = పొందెదను.
భావము:- ఎవని గృహంలోని తృణకణాలు, జలం, స్థలం, భృత్యవర్గం పూజ్యులైనవారి సేవకు ఉపయోగ పడతాయో ఆ గృహస్థు పేదవాడు అయినప్పటికీ పరమ ధన్యుడైన భాగ్యవంతుడే. మీ రాక వల్ల నాకు సర్వ శుభాలు సంప్రాప్తిస్తాయి.
తెభా-4-609-వ.
అదియునుం గాక.
టీక:- అదియునున్ = అంతే; కాక = కాకుండ.
భావము:- అంతేకాక…
తెభా-4-610-చ.
వరమతులార! యెవ్వని నివాసముఁ దీర్థపదాంతరంగులై
పరఁగినయట్టి భాగవత పాదజలంబులు సోఁక వేనిఁ ద
త్పురుషుఁడు భూరి సంపదలఁ బొంపిరిబోయిననైన వాని మం
దిర మురగప్రకీర్ణ జగతీజముఁ బోలు నటండ్రు కోవిదుల్."
టీక:- వర = శ్రేష్ఠమైన; మతులారా = మనసులు కలవారా; ఎవ్వని = ఎవని యొక్క; నివాసమున్ = గృహమున; తీర్థపద = విష్ణుని {తీర్థ పదుడు, తీర్థపాదుడు - పుణ్యతీర్థము (గంగ) పాదమున కలవాడు, విష్ణువు}; అంతరంగులు = అంతరంగికులు; ఐ = అయ్యి; పరగిన = ప్రసిద్ధిచెందిన; అట్టి = అటువంటి; భాగవత = భాగవత జనుల; పాద = పాదములనుకడిగిన; జలంబులున్ = నీరు; సోకవేని = తగలకపోయినచో; తత్ = ఆ; పురుషుడు = మానవుడు; భూరి = అత్యధికమైన {భూరి - అతి పెద్ధసంఖ్య 1 తరవాత 34 సున్నాలు కలది అదే లక్ష అయితే 5 సున్నాలు మాత్రమే}; సంపదలన్ = సంపదలతో; పొంపిరిపోయినైనన్ = వర్థిల్లుతుండినను; వాని = అతని; మందిరము = నివాసము; ఉరగ = పాములచే; ప్రకీర్ణ = చుట్టుకోబడిన; జగతీజమున్ = చెట్టుని {జగతీజము - జగతి (నేల) యందు జము (పుట్టినది), చెట్టు}; పోలున్ = సరిపోలును; అటన్ = అని; అండ్రు = అంటారు; కోవిదులు = పండితులు.
భావము:- మహాత్ములారా! పరమ పవిత్రులైన భగవద్భక్తుల పాదజలం సోకనివాని గృహం ఎంతటి సిరిసంపదలతో తులతూగుతున్నా అది పాములు చుట్టుకున్న చెట్టువలె భయం కలిగిస్తుందని పండితులు చెప్తారు.”
తెభా-4-611-వ.
అని పలికి వెండియు నిట్లనియె.
టీక:- అని = అని; పలికి = పలికి; వెండియున్ = మరల; ఇట్లు = ఈ విధముగ; అనియె = పలికెను.
భావము:- అని చెప్పి ఇంకా ఇలా అన్నాడు.
తెభా-4-612-సీ.
“పరమ పావనులార! బాల్యంబునందుండి-
మానిత శ్రద్ధా సమన్వితులును
గుణనిధుల్ ధైర్యయుక్తులు ముముక్షువులునై-
యధిక వ్రతంబుల నాచరింతు
రట్టి పుణ్యులు భవదాగమనంబు స్వా-
గతమయ్య! సత్కృపాకలితులార!
యనివారితవ్యసనార్ణవం బయినట్టి-
భూరి దుర్లంఘ్య సంసారమందు
తెభా-4-612.1-తే.
మతివిహీన స్వకీయ కర్మములఁ జేసి
యడరి మగ్నులమై యింద్రియార్థములనె
తివిరి పురుషార్థములుఁగాగఁ దెలియు మాకుఁ
గుశల మున్నదె లోకైక కుశలులార!
టీక:- పరమ = మిక్కిలి; పావనులారా = పవిత్రమైనవారా; బాల్యంబున్ = చిన్నతనము; అందుండి = నుండి; మానిత = మన్నింపదగిన; శ్రద్ధా = శ్రద్ధతో; సమన్వితులును = కూడినవారు; గుణ = సగుణములకి; నిధుల్ = నిధులవంటివారు; ధైర్య = ధైర్యము; యుక్తులు = కలవారు; ముముక్షువులున్ = మోక్షార్థులు; ఐ = అయ్యి; అధిక = పెక్కు; వ్రతంబులన్ = వ్రతములను; ఆచరింతురు = ఆచరిస్తుండెదరు; అట్టి = అటువంటి; పుణ్యులు = పుణ్యాత్ములు; భవత్ = మీ యొక్క; ఆగమనంబున్ = రాకకు; స్వాగతము = స్వాగతము; అయ్య = తండ్రి; సత్ = మంచి; కృపా = దయ; కలితులారా = కలవారా; అనివారిత = వారింపరాని; వ్యసన = ఆపదల; ఆర్ణవంబు = సముద్రము; అయిన = అయిన; అట్టి = అటువంటి; భూరి = అత్యంత; దుర్లంఘ్య = దాటరాని; సంసారము = సంసారము; అందున్ = లో.
మతి = బుద్ధి; విహీన = లేని; స్వకీయ = మాచే చేయబడిన; కర్మములన్ = కర్మములు, పనులు; చేసి = వలన; అడరి = అతిశయించి; మగ్నులము = మునిగినవారము; ఐ = అయ్యి; ఇంద్రియార్థములనె = విషయములనె, కోరికలనె; తివిరి = పూని; పురుషార్థములు = కర్తవ్యములు; కాగన్ = అయినట్లు; తెలియు = భావించెడి; మాకున్ = మాకు; కుశలము = క్షేమము; ఉన్నదె = ఉన్నదా ఏమి; లోక = లోకములకు; ఏక = ముఖ్యమైన; కుశలులార = క్షేమకరులారా.
భావము:- “పరమపవిత్ర చరిత్రులారా! మీరు బాల్యంనుండి మోక్షాన్ని కాంక్షించి శ్రద్ధతో పట్టుదలతో గొప్ప వ్రతాలు చేస్తున్న పుణ్యాత్ములు. మీ రాక మాకు శుభప్రదం. మీకు స్వాగతం. కృపానిధులారా! మీరు లోక క్షేమంకరులు. స్వకర్మల వల్ల దుఃఖమయమై దాటరాని సంసార సాగరంలో మునిగిపోయి ఇంద్రియార్థాలనే పురుషార్థాలుగా భావించే మాకు ఈ లోకంలో కుశల మెక్కడిది?
తెభా-4-613-వ.
మీర లాత్మారాము లగుటం జేసి మీయందు గుశలాకుశల రూపంబు లయిన మతివృత్తులు సంభవింపవు గావునం; గుశలప్రశ్నం బుపపన్నంబు గాదు; కాన నేనుగృతవిశ్వాసుండనై సంతప్తు లయిన వారలకు సుహృత్తు లైన మిమ్ము నాకు నీ సంసారంబునందు నేమిట వేగంబె క్షేమంబు గలుగును యని యడిగెద; నాత్మవంతులకు నాత్మయు నాత్మభావనుండు నయిన యీశ్వరుండు భక్తానుగ్రహంబు కొఱకు నీ లోకంబున మీవంటి సిద్ధరూపంబున వర్తించుచుండు” నని పలికిన యతని గంభీరార్థ గౌరవంబులును, శుభకరంబులును, న్యాయసహితంబులును, మితాక్షరంబులును, శ్రోత్రప్రియంబులును నయిన వచనంబులు విని సంప్రీత చేతస్కుండును, మందస్మితుండును నై సనత్కుమారుం డిట్లనియె.
టీక:- మీరలు = మీరు; ఆత్మారాములు = ఆత్మానందస్వరూపులు; అగుటన్ = అగుట; చేసి = వలన; మీ = మీ; అందున్ = ఎడల; కుశల = క్షేమము యుండు; అకుశల = క్షేమము లేకుండెడి; రూపంబుల్ = రూపములు; అయిన = కలిగిన; మతి = మానసిక; వృత్తులు = భావనలు; సంభవింపవు = కలుగవు; కావునన్ = అందుచేత; కుశలప్రశ్నంబు = కుశలమును విచారిండుట; ఉపపన్నంబు = ఉచితము; కాదు = కాదు; కాన = కనుక; నేనున్ = నేను; కృత = పొందిన; విశ్వాసుండను = నమ్మకము కలవాడను; ఐ = అయ్యి; సంతప్తులు = మనస్తాపము చెందినవారు; అయిన = అయిన; వారల = వారి; కున్ = కి; సుహృత్తులు = మనసునకు దగ్గరైనవారు; ఐన = అయిన; మిమ్ము = మిమ్ములను; నాకున్ = నాకు; ఈ = ఈ; సంసారంబున్ = సంసారము; అందున్ = నుండి; ఏమిటన్ = దేనితో; వేగంబె = తొందరగా; క్షేమంబున్ = రక్షణ; కలుగును = కలుగును; అని = అని; అడిగెదన్ = అడుగుతున్నాను; ఆత్మవంతుల్ = అత్మజ్ఞానులు; కున్ = కు; ఆత్మయున్ = ఆత్మ; ఆత్మభావనుండు = ఆత్మ అనెడి భావము అయినవాడు; అయిన = అయిన; ఈశ్వరుండు = ఈశ్వరుడు; భక్తా = భక్తులను; అనుగ్రహంబున్ = అనుగ్రహించుట; కొఱకున్ = కోసము; ఈ = ఈ; లోకంబునన్ = లోకము నందు; మీ = మీ; వంటి = వంటి; సిద్ధ = సిద్ధుల; రూపంబునన్ = రూపములో; వర్తించుచుండును = తిరుగుచుండును; అని = అని; పలికిన = పలుకగా; అతని = అతని యొక్క; గంభీర = లోతైన; అర్థ = అర్థములు కలవి; గౌరవంబులును = గౌరవములు కలిగినవి; శుభ = శౌభాగ్యములు; కరంబులు = కలిగించునవి; న్యాయసహితంబులును = న్యాయబద్ధంబులును; మితా = పరిమిత మైన; అక్షరంబులును = అక్షరములు కలవి; శ్రోత్ర = వినుటకు; ప్రియంబులును = ఇంపైనవి; అయిన = అయినట్టి; వచనంబులు = మాటలు; విని = విని; సంప్రీత = మిక్కిలిప్రీతి చెందిన; చేతస్కుండును = మనసు కలవాడు; మందస్మితుండును = చిరునవ్వు కలవాడు; ఐ = అయ్యి; సనత్కుమారుండు = సనత్కుమారుడు; ఇట్లు = ఈ విధముగ; అనియె = పలికెను.
భావము:- మీరు ఆత్మారాములు కనుక మీకు కుశలం, అకుశలం అనేవి సంభవింపవు. కాబట్టి మిమ్మల్ని కుశలప్రశ్న లడగడం సముచితం కాదు. మీరు దుఃఖంలో ఉన్నవారికి మిత్రులు. మిమ్ము విశ్వాస పూర్వకంగా అడుగుతున్నాను. సంసారంలో మునిగి ఉన్న నాకు వేగంగా క్షేమం కలిగే ఉపాయం చెప్పండి. పరమాత్మ, విశ్వాత్మ అయిన భగవంతుడు భక్తులను రక్షించటం కోసం మీ వంటి సిద్ధస్వరూపాలతో ఈ భూమిపై సంచరిస్తూ ఉంటాడు.” అని పృథుచక్రవర్తి అన్నాడు. తక్కువ అక్షరాలతో ఎక్కువ అర్థం కలిగి వీనుల విందు చేస్తూ శుభకరాలు, న్యాయసమ్మతాలు అయిన ఆ మాటలు విని సంతోషించి చిరునవ్వు నవ్వుతూ సనత్కుమారుడు ఇలా అన్నాడు.
తెభా-4-614-మ.
"ధరణీశోత్తమ! సర్వభూతహిత చేతస్కుండవై ధర్మ సు
స్థిర భాగ్యోదయశాలివై యెసఁగు నీచే సాధులోకోత్తరో
త్తరసంప్రశ్నము చేయఁగాఁబడె మహాత్మా! సాధులోకైక స
చ్చరితంబుం దలపోయ నిట్టిద కదా; చర్చింప లోకత్రయిన్.
టీక:- ధరణీశ = రాజులలో; ఉత్తమ = ఉత్తముడా; సర్వ = అఖిలమైన; భూత = జీవులకు; హిత = ప్రీతి కలిగించెడి; చేతస్కుండవు = మనసు కలవాడవు; ఐ = అయ్యి; ధర్మ = ధర్మపాలన యందు; స్థిర = నిశ్చలమైన; భాగ్య = సంపదలు; ఉదయశాలివి = కలిగెడి వాడివి; ఐ = అయ్యి; ఎసగు = మించుతుండెడి; నీ = నీ; చేన్ = చేత; సాధు = మంచి; లోక = లోకులలో; ఉత్తరోత్తర = ఒకదాని పై మరొకటిగ చేసిన; సంప్రశ్నము = చక్కటి విచారించుట; చేయగాబడె = చేయబడినది; మహాత్మా = మహాత్మా; సాధు = మంచి; లోక = లోకులలో; ఏకైక = ముఖ్యుల; సత్ = మంచి; చరితంబున్ = వర్తనలు; తలపోయన్ = విచారించిన; ఇట్టిద = ఇటువంచిదే; కదా = కదా; చర్చింపన్ = చర్చించి చూసిన; లోకత్రయన్ = ముల్లోకములలోను.
భావము:- “రాజోత్తమా! నీవు సర్వ ప్రాణుల హితాన్ని కోరే మనస్సు కలవాడవు. ధర్మమార్గంలో సుస్థిరమైన మహాభాగ్యం కలవాడవు. సాధుజన సమ్మతంగా ప్రశ్నించావు. నీకు తెలిసినప్పటికీ తెలియనట్లు అడిగావు. పుణ్యపురుషా! లోకంలో సత్పురుషుల స్వభావం ఇలాగే ఉంటుంది కదా!
తెభా-4-615-తే.
ధరణి సజ్జనసంగంబుదలఁపనుభయ
సమ్మతంబగువారలు సలుపునట్టి
సరససంభాషణప్రశ్నసరణి నిఖిల
జనములకు సుఖకరమగు జనవరేణ్య!"
టీక:- ధరణిన్ = లోకమున; సత్ = మంచి; జన = వారితో; సంగంబున్ = సంగమము; తలపన్ = ఆలోచించినచో; ఉభయ = ఇద్దరకును; సమ్మతంబున్ = అంగీకారము; అగు = అగును; వారలు = వారు; సలుపున్ = జరిపెడి; అట్టి = అటువంటి; సరస = రసవంతమైన; సంభాషణ = సంభాషణములు; ప్రశ్న = విచారించెడి; సరణి = విధానము; నిఖిల = సమస్తమైన; జనముల్ = లోకుల; కున్ = కు; సుఖ = సుఖమును; కరము = కలిగించెడివి; అగున్ = అగును; జనవరేణ్య = రాజా {జన వరేణ్యుడు - జనులచే వరేణ్యుడు (పూజింపదగినవాడు), రాజు}.
భావము:- జనవరేణ్యా! సాధుసంగమం ఉభయ సమ్మతమై సకలార్థ సాధనం అవుతుంది. ఎందుకంటే సజ్జనుల సరస సంభాషణాలు, సంప్రశ్నలు సమస్త జనులకు మేలు కలిగిస్తాయి.
తెభా-4-616-వ.
అని యభినందించి మోక్షసాధనోపదేశ కాముండైన పృథుచక్రవర్తికి వెండియు నిట్లనియె.
టీక:- అని = అని; అభినందించి = అభినందించి; మోక్ష = మోక్షమును; సాధన = సాధించెడి విధానమును; ఉపదేశ = ఉపదేశమును; కాముండు = కోరెడివాడు; ఐన = అయిన; పృథుచక్రవర్తిన్ = పృథుచక్రవర్తి; కిన్ = కి; వెండియున్ = మరల; ఇట్లు = ఈ విధముగ; అనియె = పలికెను.
భావము:- అని అభినందించి మోక్షసాధనమైన ఉపదేశాన్ని కోరిన పృథుచక్రవర్తితో సనత్కుమారుడు మళ్ళీ ఇలా అన్నాడు.
తెభా-4-617-సీ.
"ధరణీశ! మధునిషూదనుఁ డైనయట్టి నా-
రాయణు లలిత పాదారవింద
వరగుణ ధ్యాన ధీపరిణతత్త్వంబున-
సకలాత్మ మల విమోచనము లైన
రతియును నిత్య వైరాగ్యంబు మొదలుగా-
లోకోత్తరుఁడవైన నీకుఁగలవు;
సమ్యగ్విచార శాస్త్రములందు జనులకు-
సేమంబునకును నిశ్చితములయిన
తెభా-4-617.1-తే.
యాత్మ వ్యతిరిక్త వస్తువులందు వీత
రాగతఁ దలంప నిర్గుణ బ్రహ్మ మయిన
యాత్మయందుల రతియును ననఁగ నివియ
హేతువులు బుద్ధిఁ జింతింప నిద్ధచరిత!
టీక:- ధరణీశ = రాజా {ధరణీశుడు - ధరణి (భూమి)కి ఈశుడు, రాజు}; మధునిషూదనుడు = హరి {మధునిషూదనుడు - మధు అనెడి రాక్షసుడిని నిషూదనుడు (సంహరించినవాడు), విష్ణువు}; ఐనయట్టి = అయినట్టి; నారాయణున్ = హరిని; లలిత = అందమైన; పాద = పాదములు అనెడి; అరవింద = పద్మముల; వర = శ్రేష్ఠమైన; గుణ = గుణములను; ధ్యాన = ధ్యానించెడి; ధీ = బుద్ధి; పరిణత = పరిణితిపొందిన; తత్త్వంబునన్ = స్వభావముతో; సకల = సమస్తమైన; ఆత్మ = ఆత్మ యొక్క; మల = దోషములకు; విమోచనములు = విడిపించునవి; ఐన = అయినట్టి; రతియును = మిక్కిలి ఆసక్తి; నిత్య = శాశ్వతమైన; వైరాగ్యంబున్ = వైరాగ్యము; మొదలు = మొదలగునవి; కాన్ = ఉండుటలు; లోక = లోకమంతటికిని; ఉత్తరుడవు = మిక్కిలి గొప్పవాడవు; ఐన = అయిన; నీకున్ = నీకు; కలవు = ఉన్నవి; సమ్యక్ = చక్కటి; విచార = తత్త్వ విచారపు; శాస్త్రముల్ = శాస్త్రముల; అందు = అందు; జనులు = ప్రజల; కున్ = కి; సేమంబున్ = క్షేమమున; కును = కు; నిశ్చితములు = నిశ్చయమైనట్టివి; అయిన = అయిన.
ఆత్మ = తత్త్వ విచారమునకు; వ్యతిరిక్త = వ్యతిరేకమైన; వస్తువులు = విషయములు; అందున్ = ఎడల; వీతరాగతన్ = వైరాగ్యమున; తలపన్ = తరచిచూసిన; నిర్గుణబ్రహ్మము = గుణాతీతమైనతత్త్వముకలది; అయిన = అయిన; ఆత్మ = ఆత్మ; అందులన్ = ఎడల; రతియునున్ = మిక్కిలి ఆసక్తి; అనగన్ = అనెడి; ఇవియ = ఇవే; హేతువులు = కారణభూతములు; బుద్ధిన్ = ఆలోచించి; చింతింపన్ = విచారించినచో; ఇద్దచరిత = ప్రసిద్ధమైన నడవడికకలవాడ.
భావము:- “రాజేంద్రా! మధుసూదనుడైన నారాయణుని పరమ సుందర పాదారవింద సంస్మరణంలో పరిణతి చెందినవాడవు. మనస్సులోని మాలిన్యాన్ని కడిగివేసి చిత్తశుద్ధిని కలిగించే భగవద్రతి, వైరాగ్యం నీకు ముందే ఉన్నాయి. నీ చరిత్ర లోకోత్తరమైనది. ఆత్మ కంటే వేరైన దేహాదులపై విరక్తి, నిర్గుణ బ్రహ్మమైన ఆత్మయందు అనురక్తి జనులకు క్షేమాన్ని కలిగిస్తాయని శాస్త్రాలు చక్కగా చర్చించి నిర్ణయించాయి.
తెభా-4-618-వ.
కావున శ్రద్ధయు, భగవద్ధర్మచర్యయుఁ, దద్విశేష జిజ్ఞాసయు, నాధ్యాత్మిక యోగ నిష్ఠయు, యోగీశ్వరోపాస్తియుఁ, బుణ్యోపాశ్రయుండును బుణ్యశ్రవణుండును నైన నారాయణ కథాలాపంబులు, నర్థేంద్రియారాము లైన వారలతోడి సంగతి యందు విరక్తియు, వారల కభిమతంబు లైన యర్థ కామంబు లందు ననాకాంక్షయు, సర్వేశ్వరుని గుణ కీర్తనామృతపానంబు దక్క నితర పదార్థంబులందు వైరాగ్యంబు నొంది యాత్మారామత గలిగి విజన స్థలంబు లందు రుచిగలుగుటయును, నహింసయు, శమాదిప్రధానవృత్తియు, నాత్మహితానుసంధానంబును, భగవత్కథానుస్మరణంబును, నకామ్యంబు లయిన యమనియమంబులును, నితరభక్తిమార్గాగర్హణంబును, యోగక్షేమార్థ క్రియారాహిత్యంబును, శీతోష్ణాది ద్వంద్వ సహిష్ణుతయు, భాగవత కర్ణాలంకార భూతం బగు భగవద్గుణాభిధానంబులు నను వీనిచేత విజృంభమాణంబైన భక్తియోగంబునం జేసి యనాత్మ యందు నసంగంబును, గార్యకారణ రూపంబగు నిర్గుణ బ్రహ్మంబు నందు రతియును నెప్పుడు గలుగు నప్పుడ సదాచార్యానుగ్రహవంతుం డయిన పురుషుండు బ్రహ్మనిష్ఠులతోడఁ జెలిమి చేయుచు నీషణత్రయంబు వర్జించి ప్రకృతిం జేరక జ్ఞాన వైరాగ్య వేగంబునం జేసి.
టీక:- కావునన్ = అందుచేత; శ్రద్ధయున్ = శ్రద్ద; భగవత్ = భగవంతుని యెడ; ధర్మ = నిష్ఠగల; చర్యయున్ = వర్తనలు; తత్ = దాని యందు; విశేష = గొప్ప; జిజ్ఞాసయున్ = మిక్కిలి ఆసక్తి; ఆధ్యాత్మికయోగ = ఆధ్యాత్మిక తత్త్వానుష్ఠా నము నందు; నిష్ఠయున్ = లగ్నమై యుండుట; యోగి = యోగులలో; ఈశ్వర = శ్రేష్ఠులను; ఉపాస్తియున్ = ఉపాసించుట; పుణ్య = పుణ్యకర్మములకు; ఉపాశ్రయుండును = ఆధార మైనవాడు; పుణ్య = పుణ్యమును కలిగించెడి; శ్రవణుండును = కథా శ్రవణము కలవాడు; ఐన = అయిన; నారాయణ = విష్ణుని; కథా = కథలను; ఆలాపంబులన్ = సంభాషణములు; అర్థ = సంపదలను; ఇంద్రియా = ఇంద్రియ విషయము లందు; ఆరాములు = ఆసక్తి కలవారు; ఐన = అయిన; వారల = వారి; తోడి = తోటి; సంగతిన్ = సహవాసములు; అందు = ఎడల; విరక్తియున్ = అయిష్టమును; వారలు = వారి; కున్ = కి; అభిమతంబులు = ఇష్టమైనవి; ఐన = అయిన; అర్థ = సంపదలు; కామంబులు = కోరికలు; అందున్ = ఎడల; అనాకాంక్షయున్ = కోరిక లేకపోవుట; సర్వేశ్వరుని = నారాయణుని; గుణ = గుణముల; కీర్తన = స్తోత్రము లనెడి; అమృత = అమృతమును; పానంబున్ = తాగుట; తక్క = తప్పించి; ఇతర = ఇతరమైన; పదార్థంబులు = వస్తువుల; అందున్ = ఎడల; వైరాగ్యంబున్ = నిరాసక్తి; పొంది = పొంది; ఆత్మారామతన్ = ఆత్మానందము కలిగి యుండుట; కలిగి = కలిగి; విజన = నిర్జన; స్థలంబుల్ = ప్రదేశముల; అందున్ = ఎడల; రుచి = ప్రీతి; కలుగుటయునున్ = ఉండుటలు; అహింసయున్ = అహింస; శమ = శమము; ఆది = మొదలగునవి; ప్రధాన = ముఖ్యమైన; వృత్తియున్ = నడవడిక; ఆత్మ = ఆత్మజ్ఞానమునకు; హితవు = మేలైనవానిని; అనుసంధానము = కలుపుకొనుట; భగవత్ = భగవంతుని; కథా = కథలను; అనుస్మరణంబును = ధ్యానించుట; అకామ్యంబులు = కోరికలు కానివి; అయిన = అయిన; యమ = యమము {యమము - నిషిద్ధములను ఆచరించకుండుట}; నియమంబులునున్ = నియమములును {నియమము- నియమించుకొని తప్పక ఆచరించుట}; ఇతర = ఇతరమలైన; భక్తి = భక్తి; మార్గా = విధాలములను; అగర్హణంబునున్ = నిందించకుడుట; యోగ = వస్తు లాభములు; క్షేమ = క్షేమమును; అర్థన్ = సంపదలకొరకైన; క్రియా = ప్రయత్నములు; రాహిత్యంబునున్ = లేకపోవుట; శీత = చలి; ఉష్ణ = వేడి; ఆది = మొదలగునవైన; ద్వంద్వ = ద్వంద్వములను; సహిష్ణుతయున్ = సహించ గలుగట; భాగవత = భాగవతుల యొక్క; కర్ణ = చెవులకు; అలంకారభూతంబున్ = అలంకారము; అగు = అయిన; భగవత్ = భగవంతుని; గుణ = గుణముల; అభిధానంబులున్ = అభివర్ణనములు, చెప్పుట; అను = అనెడి; వీని = వీటి; చేతన్ = వలన; విజృంభమాణంబున్ = విజృంభించినట్టిది; ఐన = అయిన; భక్తియోగంబునన్ = భక్తియోగము; చేసి = వలన; అనాత్మ = ఆత్మజ్ఞానము కానివాని; అందున్ = అందు; అసంగంబునున్ = సహవాసము లేకపోవుట; కార్య = కార్యము; కారణ = కారణముల; రూపంబున్ = సంబంధించినది; అగు = కలుగునో; నిర్గుణబ్రహ్మంబున్ = నిర్గుణబ్రహ్మ; అందున్ = ఎడల; రతియునున్ = ఆసక్తి; ఎప్పుడు = ఎప్పుడైతే; కలుగున్ = కలుగుతుందో; అప్పుడు = అప్పుడు; సత్ = మంచి; ఆచార్య = గురువు యొక్క; అనుగ్రహవంతుండు = అనుగ్రహము కలవాడు; అయిన = అయినట్టి; పురుషుండున్ = మానవుడు; బ్రహ్మనిష్ఠుల = బ్రహ్మజ్ఞాన మందు నిష్ఠ కలవారి; తోడన్ = తోటి; చెలిమి = సహవాసము; చేయుచున్ = చేస్తూ; ఈషణత్రయంబున్ = ఈషణత్రయమును {ఈషణత్రయము - 1దారేషణ 2ధనేషణ 3 పుత్రేషణలు అనెడి ఆత్రములు}; వర్జించి = వదలివేసి; ప్రకృతిన్ = సంసారబంధములను; చేరక = చెందక; జ్ఞాన = జ్ఞానము; వైరాగ్య = వైరాగ్యముల సాధనల; వేగంబునన్ = గట్టిదనము; చేసి = వలన.
భావము:- కనుక శ్రద్ధ, భాగవత ధర్మాలను ఆచరించడం, ఆయా ధర్మ విశేషాలందు జిజ్ఞాస, ఆధ్యాత్మిక యోగనిష్ఠ, యోగీశ్వరులను ఉపాసించడం, నిరంతరం శ్రీహరి పుణ్యకథలను ఆలకించడం, అర్థలుబ్ధులూ ఇంద్రియలోలురూ అయినవారికి దూరంగా ఉండడం, వారికి అభిమతాలైన అర్థకామాల మీద ఆసక్తి లేకుండడం, హరిగుణామృత రసాస్వాదనం తప్ప ఇతర వస్తువులందు విరక్తి, ఆత్మారామస్థితి, ఏకాంత వాసమందు అభిరుచి, అహింస, ఇంద్రియనిగ్రహం, ఆత్మ హితానుసంధానం, సంతత భగవత్కథా చింతనం, యమనియమాలు, ఇతర భక్తి మార్గాలను నిందింపకుండా ఉండడం, తన యోగక్షేమాలకోసం ఎటువంటి కార్యాలను చేయకుండడం, శీతోష్ణాది ద్వంద్వాలను సహించడం, హరిభక్తుల చెవులకు అలంకారాలైన భగవంతుని సుగుణాలను అభివర్ణించడం మొదలైన వాటివల్ల భక్తియోగం పెంపొందుతుంది. అటువంటి భక్తియోగం వల్ల దేహాదుల మీద విరక్తి, నిర్గుణ పరబ్రహ్మం మీద అనురక్తి కలుగుతాయి. అవి కలిగినవాడు వెనువెంటనే ఉత్తములైన ఆచార్యుల అనుగ్రహానికి పాత్రుడౌతాడు. అటువంటి పురుషుడు బ్రహ్మ నిష్ఠులైన మహాత్ములతో స్నేహం చేసి దారేషణ, ధనేషణ, పుత్రేషణ అనే ఈషణత్రయాన్ని పరిత్యజిస్తారు. సంసార బంధాలనుండి విడివడి జ్ఞానవైరాగ్యాల వల్ల….
తెభా-4-619-సీ.
అనఘ! సాక్షాత్కార మగు భక్తి యోగాగ్నిఁ-
గడఁగి జీవాధారకమును బంధ
భూతాత్మకంబునై పొలుచు హృద్గ్రంథిని-
బూని స్వకారణభూత మయిన
యరణి దహించు హుతాశను కైవడి-
నిర్దహించిన నిట్లు నెఱసి దగ్ధ
చిత్తుఁడై ముక్తనిశ్శేషాత్మ గుణుఁడు స-
ద్ధర్ముఁడు నైన యతండు మిగుల
తెభా-4-619.1-తే.
నర్థి బాహ్యంబు లయిన ఘటాదికములు
నాంతరము లైన సౌఖ్యదుఃఖాదికములు
నను విభేదము లాత్మ భేదనము లగుట
నయ్యుపాధి వినాశంబు నందగలఁడు.
టీక:- అనఘ = పుణ్యుడ; సాక్షాత్కారము = సాక్షాత్కారము {సాక్షాత్కారము - స (కలియుట) అక్ష (చూపునందు) కారము (అగుట), కంటపడుట}; అగు = అయిన; భక్తియోగ = భక్తియోగము యొక్క; అగ్నిన్ = అగ్ని యందు; కడగి = పూని; జీవ = జీవుడు; ఆధారకమునున్ = ఆధారముగకలది; బంధభూతాత్మకంబున్ = ముడిపడుట; ఆత్మకంబున్ = తానైనది; ఐ = అయ్యి; పొలుచు = కనబడెడి; హృత్ = హృదయము అనెడి {హృద్గ్రంథి - హృదయమునందలి యజ్ఞానము యనెడి ముడి}; గ్రంథినిన్ = ముడిని; పూని = ధరించి; స్వ = తనకి; కారణభూతము = కారణమైనది; అయిన = అయిన; అరణిన్ = అరణిన్ {అరణి - అగ్నిని చేయు కఱ్ఱతోచేసిన సాధనము}; దహించున్ = కాల్చివేయును; హుతాశనుని = అగ్నిదేవుని {హుతాశనుడు - హుతములను అశనుడు (భుజించువాడు), అగ్నిదేవుడు}; కైవడి = వలె; నిర్దహించినన్ = మిక్కిలి కాల్చేయగా; ఇట్లు = ఈ విధముగ; నెఱసి = పూర్తిగా; దగ్ద = కాలిపోయిన; చిత్తుడు = చిత్తవృత్తులుకలవాడు; ఐ = అయ్యి; ముక్త = విడువబడిన; నిశ్శేష = సమస్తమైన; ఆత్మ = ఆత్మ యొక్క; గుణుడు = గుణములుకలవాడు; సత్ = సత్యమే; ధర్ముడు = ధర్మముగాకలవాడు; ఐన = అయిన; అతండు = అతడు; మిగులన్ = మిక్కిలిగా; అర్థిన్ = కోరి.
బాహ్యంబులున్ = (దేహమునకు) వెలుపలివి; అయిన = అయిన; ఘట = కుండ; ఆదికములున్ = మొదలగునవి; ఆంతరములు = లోనివి; ఐన = అయిన; సౌఖ్యదుఃఖ = సుఖదుఃఖ; ఆదికంబులున్ = మొదలగునవి; అను = అనెడి; విభేదముల్ = విభేదములు; ఆత్మ = భావనలలోని; భేదనములు = విభేదములు; అగుటన్ = అగుటవలన; ఆ = ఆ; ఉపాధివినాశంబున్ = శరీరస్పురణ నశించుటను; అందగలడు = చెందగలడు;
భావము:- పుణ్యాత్మా! సాక్షాత్కరించిన భక్తియోగమనే అగ్నితో పంచభూతాత్మకమైన అహంకారాన్ని తన పుట్టుకకు కారణమైన అరణిని అగ్ని దహించినట్లు దహిస్తాడు. ఈ విధంగా హృదయగ్రంధిని దహించడం వల్ల ఉపాధి గుణాలైన కర్తృత్వ భోక్తృత్వాలనుండి విముక్తుడై బాహ్యాలైన ఘటాదికాలకు, అంతరాలైన సుఖదుఃఖాదులకు అతీతు డౌతాడు.
తెభా-4-620-వ.
అది యెట్లనిన.
టీక:- అది = అది; ఎట్లు = ఏ విధముగ; అనినన్ = అన్నచో.
భావము:- అది ఎలా అంటే…
తెభా-4-621-చ.
పురుషుఁడు నిద్రపోఁ గలలఁ బొందిన యాత్మసుఖైక హేతువై
పరఁగిన రాజభృత్యజన భావగుణంబులు సంప్రబోధమం
దరయఁగ మిథ్య యైనగతి నాంతర బాహ్యగుణప్రభేదముల్
పరువడిఁ గానకుండు జనపాలనశీలన! నిత్యఖేలనా!
టీక:- పురుషుడు = మానవుడు; నిద్రపోన్ = నిద్రించగా; కలలన్ = కలలో; పొందిన = పొందినట్టి; ఆత్మ = తన; సుఖ = సుఖములకు; ఏక = ముఖ్య; హేతువు = కారణము; ఐ = అయ్యి; పరగిన = విలసిల్లిన; రాజ = రాజు; భృత్యుజన = భటులు; భావ = అనెడి భావముల; గుణంబులు = లక్షణములు; సంప్రబోధము = మెలుకవ; అందున్ = కలిగి నప్పుడు; అరయగా = విచారించిన; మిథ్య = అసత్యము; ఐన = అయిన; గతిన్ = విధముగ; అంతర = లోని; బాహ్య = వెలుపలి; గుణ = అనెడి గుణముల; ప్ర = ప్రముఖ; భేదముల్ = భేదములు; పరువడిన్ = శ్రీఘ్రమే; కానకుండున్ = కనబడకుండును; జనపాలన = ప్రజాపరిపాలన; శీలా = స్వభావముగా కలవాడ; నిత్య = శాశ్వతమైన; ఖేలనా = లీల యైనవాడ.
భావము:- ప్రజాపాలనలో నేర్పరివైన ఓ రాజా! మానవుడు నిద్రలో కలగంటాడు. ఆ కలలో తాను రాజై రాజ్యాలను ఏలినట్లు, సిరిసంపదలతో తులదూగినట్లు ఏవేవో ఆనందాలను అనుభవిస్తాడు. కల కరిగిపోయి మేలుకోగానే అన్నీ అసత్యాలు అని తెలుసుకుంటాడు. అదేవిధంగా లింగదేహం నశించి, ఉపాధి రహితుడైన పురుషునికి బాహ్యవిషయాలైన శబ్ద స్పర్శాదులు, అంతర్విషయాలైన శోక మోహాదులు ఏవీ అనుభూతాలు కావు.
తెభా-4-622-వ.
మఱియును ద్రష్టయైన యాత్మయు దృశ్యంబయిన యింద్రియార్థంబు నను వీనికి నహంకారంబు సంబంధహేతు వగుటం జేసి యది యంతఃకరణంబునం గలుగుచుండు జాగ్రత్స్వప్నంబుల యందీ భేదంబు గనుంగొనుచుండు; నిట్టి యంతఃకరణంబు లేనిది యగు సుషుప్తి కాలంబునం బురుషుండు జలదర్పణాది నిమిత్తాభావం బగునప్పుడు బింబప్రతిబింబ భేదంబు గనుంగొనని చందంబున దృశ్యభేదంబు గనుంగొనకుండుం; గావున నంతఃకరణ విలయంబు నొందిన బాహ్యాంతర భేదంబు గనకుండుట నిశ్చయం” బని వెండియు నిట్లనియె.
టీక:- మఱియును = ఇంకను; ద్రష్ట = చూచెడివాడు; ఐన = అయిన; ఆత్మయున్ = తాను; దృశ్యంబున్ = కనబడునది; అయిన = అయిన; ఇంద్రియార్థంబున్ = విషయములు; అను = అనెడి; వీనికి = వీటికి; అహంకారంబున్ = అహంకారము; సంబంధ = సంబంధమును కల్పించెడి; హేతువు = కారణము; అగుటన్ = అగుట; చేసి = వలన; అది = అది; అంతఃకరణంబున్ = అంతఃకరణము, మనసు; అందున్ = లోపల; కలుగుచుండున్ = కలిగెడి; జాగ్రత్ = మెళకువ; స్వప్నంబుల = కలల; అందు = అందలి; ఈ = ఈ; భేదంబున్ = భేదమును; కనుగొనుచుండున్ = తెలిసికొనును; ఇట్టి = ఇటువంటి; అంతఃకరణంబున్ = అంతఃకరణము; లేనిది = లేనిది; అగు = అయిన; సుషుప్తి = సుషుప్తి; కాలంబునన్ = సమయములో; పురుషుండున్ = మానవుడు; జల = నీరు; దర్పణ = అద్దము; ఆది = మొదలైన; నిమిత్త = కారణములు మాత్రమే యైనవి; అభావంబున్ = లేనివి; అగున్ = అయిన; అప్పుడు = అప్పుడు; బింబ = బింబము; ప్రతిబింబ = ప్రతిబింబముల; భేదంబున్ = భేదమును; కనుంగొనని = చూడలేని; చందంబునన్ = విధముగ; దృశ్య = దృశ్యముల; భేదంబున్ = భేదమును; కనుగొనకుండున్ = చూడలేకుండును; కావునన్ = అందుచేత; అంతఃకరణ = అంతఃకరణము యొక్క; విలయంబున్ = పూర్తిగా లీనమైపోవుట; ఒందినన్ = పొందినచో; బాహ్య = వెలుపల; అంతర = లోపల అనెడి; భేదంబున్ = భేదములను; కనకుండుట = కనబడకపోవుట; నిశ్చయంబు = తప్పక కలుగునది; అని = అని; వెండియున్ = మరల; ఇట్లు = ఈ విధముగ; అనియె = పలికెను.
భావము:- ఇంకా ఉపాధి అయిన అంతఃకరణం ఉన్నపుడు ద్రష్ట అయిన ఆత్మకు, దృశ్యమైన ఇంద్రియార్థానికి అహంకారం సంబంధ హేతు వవుతుంది. అందువల్ల ఉపాధితో కూడిన జీవుడు మేలుకొన్నప్పుడూ, కల గన్నప్పుడూ సుఖదుఃఖాలను అనుభవిస్తాడు. అంతఃకరణం లేని గాఢనిద్రలో పురుషుడు జల దర్పణాది నిమిత్తాలు లేనప్పుడు ప్రతిబింబ భేదాన్ని చూడలేనట్లే దృశ్యభేదాలను దర్శింపలేడు. అందువల్ల అంతఃకరణం నశించినప్పుడు బాహ్యాభ్యంతర భేదాలు గోచరింపవు” అని చెప్పి ఇంకా ఇలా అన్నాడు.
తెభా-4-623-సీ.
"భువి విష యాకృష్ట భూతంబు లయిన యిం-
ద్రియముల చేతను దివిరి మనము
దగ విషయాసక్తిఁ దగిలి యాంతరమైన-
మహిత విచార సామర్థ్య మెల్ల
శరకుశాదిస్తంబజాలంబు హ్రదతోయ-
ములు గ్రోలుగతిఁ గ్రమంబున హరించు
నీ రీతి నంతర్విచార సామర్థ్యంబు-
నపహృతం బయినఁ బూర్వాపరాను
తెభా-4-623.1-తే.
మేయ సంధానురూప సంస్మృతి నశించు
నది నశించిన విజ్ఞాన మంతఁ దొలఁగు;
నట్టి విజ్ఞాన నాశంబు నార్యజనులు
స్వాత్మకది సకలాపహ్నవం బటండ్రు.
టీక:- భువిన్ = లోకమున; విషయ = విషయములచే; ఆకృష్టభూతంబులు = ఆకర్షింపబడినవి; అయిన = అయినట్టి; ఇంద్రియముల్ = ఇంద్రియముల; చేతనున్ = వలన; తివిరి = పూని; మనము = మనస్సు; తగన్ = అవశ్యము; విషయ = విషయములందు; ఆసక్తిన్ = ఆసక్తికి; తగిలి = తగుల్కొని; ఆంతరము = అంతరంగములోనిది; ఐన = అయిన; మహిత = గొప్ప; విచార = చర్చించుకొనెడి; సామర్థ్యము = సమర్థత; ఎల్లన్ = సమస్తము; శర = రెల్లుగడ్డి; కుశ = దర్భలు; ఆది = మొదలగు; స్తంబ = కాడల; జాలంబున్ = సమూహములు; హ్రద = సరసునందలి; తోయములున్ = నీటిని; క్రోలు = తాగెడి; గతిన్ = విధముగ; క్రమంబునన్ = క్రమముగా; హరించున్ = పీల్చివేయును; ఈ = ఈ; రీతిన్ = విధముగ; అంతర్విచార = అంతరంగములోచర్చించుకొనెడి; సామర్థ్యంబున్ = సమర్థత; అపహృతంబున్ = హరించబడినది; అయినన్ = అయినచో; పూర్వ = ముందు; పర = తరువాతది; అనుమేయ = అనుకొనెడివాని; సంధాన్ = అనుసంధానమునకు; అనురూప = సమానమైన; సంస్మృతి = స్మరణము;
నశించున్ = నశించిపోవును; అది = అది; నశించినన్ = నశించిపోయినచో; విజ్ఞానము = అవిద్య; అంతన్ = అంతా; తొలగున్ = హరించిపోవును; అట్టి = అటువంటి; విజ్ఞాననాశంబున్ = విజ్ఞాననాశనమును; ఆర్యజనులు = శ్రేష్ఠమైనవారు; స్వాత్మ = అంతరాత్మ; కిన్ = కి; అది = అది; సకల = మొత్తం; అపహ్నవము = మరుగుపరచునది; అండ్రు = అంటారు.
భావము:- “విషయ చింతాపరాయణులైన వ్యక్తుల మనస్సు ఇంద్రియాల ప్రభావం వల్ల విషయాలలోనే ఆసక్త మవుతుంది. ఒడ్డున పుట్టిన రెల్లు, దర్భ మొదలైన దుబ్బులు తమ వ్రేళ్ళతో మడుగులోని నీటిని హరించి వేసినట్లు అటువంటి మనస్సు బుద్ధియొక్క విచారశక్తిని క్రమంగా హరిస్తుంది. అంతర్విచార సామర్థ్యం అపహరింపబడినట్లయితే పూర్వపరాలను సంధానం చేసే స్మృతి చెడుతుంది. స్మృతి నశిస్తే విజ్ఞానం నశిస్తుంది. అటువంటి విజ్ఞాన నాశనాన్నే పెద్దలు ఆత్మనాశనం అని అంటారు.
తెభా-4-624-వ.
అదియునుం గాక "యాత్మనస్తుకామాయ సర్వం ప్రియం భవతి"యను వేదవచనంబునం జేసి విషయంబులకుం బ్రియతమత్వంబై యాత్మోపాధికంబు నొందిఁ యాత్మాపహ్నవంబునం బాటిల్లు స్వార్థనాశం బెద్ధి గలుగు దాని కంటె లోకంబున నధికంబైన స్వార్థనాశంబు లేదు; అది యెట్లనిన సర్వార్థ నాశంబునకు స్థైర్యంబు నొందించునట్టి యర్థకామాభిధ్యానంబునం దద్ధేతుకంబైన స్వార్థనాశంబునం బరోక్షాపరోక్షరూపజ్ఞానంబు నశించుం గావున నాత్మాపహ్నవంబున కంటె నధికతరంబైన సర్వార్థనాశంబు లే"దని వెండియు నిట్లనియె.
టీక:- అదియునున్ = అంతే; కాక = కాకుండగ; ఆత్మనః = మనసునందు; తు = ఐన; కామాయ = కోరినట్టివి; సర్వం = సమస్తము; ప్రియం = ఇష్టమైనవి; భవతి = అగుచున్నవి; అను = అనెడి; వేద = వేదము లందు చెప్పిన; వచనంబునన్ = మాటల; చేసి = వలన; విషయంబుల్ = ఇంద్రియార్థములు; కున్ = కి; ప్రియతమత్వంబు = అత్యంత ప్రియమైన వగుట యనెడి లక్షణము {ప్రియము - ప్రియతరము - ప్రియతమము}; ఐ = జరిగి; ఆత్మ = ఆత్మకి; ఉపాధికంబున్ = కారణ మగుటను; ఒంది = పొంది; ఆత్మ = ఆత్మ; అపహ్నవంబున్ = మరుగుపడుట యందు; పాటిల్లు = జరిగెడి; స్వార్థనాశంబున్ = స్వార్థనాశనము; ఎద్ది = ఏదైతే; కలుగున్ = కలుగునో; దాని = దానికి; కంటెన్ = కంటె; లోకంబునన్ = లోకమునకు; అధికంబున్ = గొప్పది; ఐన = అయిన; స్వార్థనాశంబున్ = స్వార్థనాశనము; లేదు = లేదు; అది = అది; ఎట్లు = ఏవిధముగ; అనినన్ = అన్నచో; సర్వార్థనాశంబున్ = సర్వార్థనాశనమున; కున్ = కు; స్థైర్యంబున్ = ధైర్యమును; ఒందించున్ = పొందించే; అట్టి = అటువంటి; అర్థ = సంపదలు; కామా = కోరికలు; అభిధ్యానంబునన్ = మిక్కిలి ధ్యానమున; తత్తత్ = ఆయా; హేతుకంబున్ = కారణమగుట; ఐన = అయిన; స్వార్థనాశంబునన్ = స్వార్థనాశములో; పరోక్ష = మరుగున యున్నది; అపరోక్ష = ఎదురుగ ఉన్నది; రూప = అనెడి రూపమున కలిగెడి; జ్ఞానంబు = తెలివి; నశించున్ = నశించును; కావునన్ = అందుచేత; ఆత్మ = ఆత్మ; అపహ్నవంబున్ = మరుగుపడిన దగుట; కంటెన్ = కంటె; అధికతరంబున్ = మిక్కిలి అధికమైన {అధికము - అధికతరము - అధికతమము}; ఐన = అయిన; సర్వార్థనాశంబున్ = సర్వార్థనాశనము; లేదు = లేదు; అని = అని; వెండియున్ = మరల; ఇట్లు = ఈ విధముగ; అనియెన్ = పలికెను.
భావము:- అంతేకాక “ఆత్మానస్తుకామాయ సర్వం ప్రియం భవతి” ఆత్మను ప్రేమించిన వానికి జగత్తులోని సమస్తమూ ప్రియమే అవుతుందన్నది వేద వాక్యం. విషయ వాంఛలపై ప్రీతి ఆత్మజ్ఞానాన్ని మరుగుపరుస్తుంది. ఆత్మజ్ఞానం అపహ్నవ మైనందువల్ల కలిగే స్వార్థనాశాన్ని మించిన స్వార్థనాశం మరొక్కటి లేదు. సర్వార్థ నాశనాన్ని భరించటానికి కావలసిన స్థైర్యం అర్థకామాలను ధ్యానించడం వల్ల కలుగుతుంది. ఇందువల్ల పురుషుడు పరోక్షమైన అపరోక్షమైన అనుభూతులనుండి భ్రష్టుడై నశిస్తాడు. కావున ఆత్మజ్ఞానం మరుగుపడడం కంటె మించిన సర్వార్థనాశం వేరొకటి లేదు” అని మళ్ళీ ఇలా అన్నాడు.
తెభా-4-625-సీ.
"అనఘ! యీ సంసార మతిశయంబునఁ దరి-
యింపంగ మది నిశ్చయించువాఁడు
గైకొని ధర్మార్థకామమోక్షములకు-
నతి విఘాతుక మెద్ది యట్టి దాని
వలన సంగము చేయవలవ; దా ధర్మాదు-
లందుఁ ద్రివర్గంబు నంతకోగ్ర
భయయుతం బగుటను బరమమోక్షంబె ము-
ఖ్యార్థమై విలసిల్లు నండ్రు బుధులు;
తెభా-4-625.1-తే.
భువి గుణవ్యతికరమునఁ బుట్టినట్టి
యబ్జజాతాదులకు నస్మదాదులకును
గాల విధ్వంసితాఖిల క్రమముగల్గుఁ
గలుగ దెన్నఁడు సేమంబుగాన వినుము.
టీక:- అనఘ = పుణ్యుడా; ఈ = ఈ; సంసారమున్ = సంసారమును; అతిశయంబునన్ = అతిశయించి; తరియింపన్ = దాటవలెనని; మదిన్ = మనసున; నిశ్చయించు = నిశ్చయించుకొన్న; వాడు = వాడు; కైకొని = పూని; ధర్మ = ధర్మము; అర్థ = ధనము; కామ = కామము; మోక్షముల్ = మోక్షముల; కున్ = కు; అతి = మిక్కిలి; విఘాతము = అడ్డుతగులునది; ఎద్ది = ఏదైతే; అట్టి = అటువంటి; దాని = దాని; వలన = అందు; సంగము = సహవాసము; చేయన్ = చేయుట; వలవదు = వద్దు; ఆ = ఆ; ధర్మ = ధర్మము {ధర్మాదులు - 1ధర్మ 2అర్థ 3కామ 4మోక్షములు}; ఆదులు = మొదలగువాని; అందున్ = అందలి; త్రివర్గంబున్ = మూటికి {త్రివర్గము - 1ధర్మ 2అర్థ 3కామములు}; అంతక = యముని వలన; ఉగ్ర = మిక్కిలి; భయ = భయముతో; యుతంబున్ = కూడినవి; అగుటన్ = అగుటవలన; పరమమోక్షంబె = అత్యున్నతమోక్షమే; ముఖ్య = ముఖ్యముగా; అర్థము = కోరదగినది; ఐ = అయ్యి; విలసిల్లున్ = ప్రకాశించును; అండ్రు = అంటారు; బుధులు = జ్ఞానులు.
భువిన్ = జగత్తులో; గుణ = గుణముల; వ్యతికరమునన్ = ఘర్షణ వలన; పుట్టిన = జనించిన; అట్టి = అటువంటి; అబ్జజాత = బ్రహ్మదేవుడు; ఆదుల్ = మొదలగువారి; కునున్ = కి; అస్మదాదుల్ = మావంటివారి; కునున్ = కి; కాల = కాలముచేత; విధ్వంసితాఖిల = సర్వనాశన, మరణ; క్రమమున్ = విధానము; కల్గున్ = కలగును; కలుగదు = కలుగదు; ఎన్నడుసేమంబున్ = శాశ్వతక్షేమము; కానన్ = కావున; వినుము = వినుము.
భావము:- “పుణ్యమూర్తివైన పృథుచక్రవర్తీ! సంసార సముద్రాన్ని జాగ్రత్తగా దాటగోరేవాడు ధర్మార్థకామమోక్షాలను నిర్మూలనం చేసే ఎటువంటి దుస్సంగమాన్నీ చేయకూడదు. ధర్మార్థకామమోక్షాలలో ధర్మార్థకామాలు మూడు అనిత్యాలైనందువల్ల యమభయంతో కూడి ఉంటాయి. మోక్ష మొక్కటే పరమ పురుషార్థ మని పండితులు చెపుతారు. గుణ సంబంధం వల్ల సంభవించిన బ్రహ్మాదులకు, మాబోటి వారికి కరాళకాల ప్రభావం చేత ఎప్పటికైనా వినాశమే కాని క్షేమం అనేది ఎప్పుడూ కలుగదు. కనుక ఇది విను…
తెభా-4-626-వ.
మోక్షంబె పరమపురుషార్థం” బని చెప్పి వెండియు నిట్లనియె “నరేంద్రా! దేహేంద్రియ ప్రాణ బుద్ధ్యహంకార పరివృతంబు లయిన యీ స్థావర జంగమంబుల హృదయంబులందు వ్యాపకుండుఁ బ్రత్యక్షభూతుండుఁ బ్రత్యగ్రూపుండు భగవంతుండు నయిన యీశ్వరుం డంతర్యామి రూపంబునం బ్రకాశించుచుండు; అది నారాయణుని సద్రూపంబుగాఁ దెలియు” మని వెండియు నిట్లనియె.
టీక:- మోక్షంబె = మోక్షము మాత్రమే; పరమ = అత్యుత్తమ; పురుషార్థంబు = ప్రయోజనము {పురుషార్థము - పురుషులు సాధించదగిన ప్రయోజనము, కర్తవ్యము}; అని = అని; చెప్పి = చెప్పి; వెండియున్ = మరల; ఇట్లు = ఈ విధముగ; అనియెన్ = పలికెను; నరేంద్రా = రాజా {నరేంద్రుడు -నరులలో ఇంద్రుడు, రాజు}; దేహ = శరీరము; ఇంద్రియ = ఇంద్రియములు {ఇంద్రియములు - పంచజ్ఞానేంద్రియములు పంచకర్మేంద్రియములు}; ప్రాణ = ప్రాణము; బుధ్ధి = బుద్ధి; అహంకార = అహంకారము; పరివృతంబున్ = పొరలుగ కలిగినవి; అయిన = అయిన; ఈ = ఈ; స్థావర = కదల లేనివి; జంగమంబులన్ = కదల గలవి వాటి; హృదయంబుల్ = హృదయములు; అందున్ = లో; వ్యాపకుండు = వ్యాపించి యున్నవాడు; ప్రత్యక్షభూతుండు = కనిపించెడివన్నీ తానైనవాడు; ప్రత్యగ్రూపుండు = తన ఎదుట తన రూపము కలవాడు; భగవంతుండు = భగవంతుడు; అయిన = అయిన; ఈశ్వరుండు = ప్రభుత్వము కలవాడు; అంతర్యామి = లోపల ఉండువాని; రూపంబునన్ = రూపములో; ప్రకాశించుచుండు = ప్రకాశించుతుండును; అది = అది; నారాయణుని = విష్ణుమూర్తి యొక్క; సత్ = సత్యమైన; రూపంబున్ = స్వరూపము; కాన్ = అగునట్లు; తెలియుము = తెలిసికొనుము; అని = అని; వెండియున్ = ఇంకను; ఇట్లు = ఈ విధముగ; అనియెన్ = పలికెను.
భావము:- మోక్షమే పరమ పురుషార్థం” అని చెప్పి మళ్ళీ ఇలా అన్నాడు. “రాజా! దేహం, ఇంద్రియాలు, ప్రాణం, బుద్ధి, అహంకారం అనే వానిచేత ఆవృతాలైన స్థావర జంగమాల హృదయాలలో సర్వవ్యాపి, సాక్షిభూతుడు, ప్రత్యగ్రూపుడు అయిన భగవంతుడు అంతర్యామియై ప్రకాశిస్తూ ఉంటాడు. అటువంటి నారాయణుని స్వరూపాన్ని చక్కగా తెలుసుకో” అని ఇంకా ఇలా అన్నాడు.
తెభా-4-627-ఉ.
"భూవర! యే మహాపురుష భూషణు నందుల నీ సమస్త వి
శ్వావళి లీనమై సదసదాత్మక భావము నొంది భూరి మా
యావిభవంబులం దగి సమగ్రవివేక నిరోధి స్రగ్ఘ నా
శీవిషబుద్ధి దోఁచుచు విశేషగతిన్ వెలుఁ గొందు నెన్నఁడున్.
టీక:- భూవర = రాజా {భూవర - భూమికి భర్త, రాజు}; ఏ = ఏ యొక్క; మహా = గొప్ప; పురుష = పురుషులకే; భూషణున్ = భూషణము వంటివాని; అందులన్ = అందులో; ఈ = ఈ; సమస్త = సమస్తమైన; విశ్వ = భువనముల; ఆవళి = సమూహములు; లీనము = కలిసిపోయినది; ఐ = అయ్యి; సత్ = సత్యమైనది; అసత్ = కల్పితమైనది; ఆత్మక = మయమైన; భావము = భావమును; పొంది = పొంది; భూరి = బహువిస్తారమైన; మాయా = మాయ యొక్క; విభవంబులన్ = వైభవము లందు; తగి = చక్కగా; సమగ్ర = సంపూర్ణమైన; వివేక = వివేకమును; నిరోధి = నిరోధించెడి; స్రక్ = పూలమాలను; ఘన = పెద్ద; ఆశీవిష = సర్పము అనెడి; బుద్ధిన్ = భావము; తోచుచున్ = కలిగెడి; విశేష = ప్రత్యేకమైన; గతిన్ = విధముగ; వెలుగొందున్ = ప్రకాశించును; ఎన్నడున్ = ఎల్లప్పుడు.
భావము:- “రాజా! ఈ సమస్త విశ్వం ఏ పరమేశ్వరునియందు లీనాలీనభావంతో, మాయాప్రభావంతో, వివేకాన్ని నిరోధించే భ్రాంతితో, పూలహారాన్ని పెద్ద సర్పం అనిపించే విశేషంగా ఎల్లప్పుడూ ప్రకాశిస్తూ ఉంటుందో…
తెభా-4-628-చ.
సుమహిత నిత్య ముక్త పరిశుద్ధ విబుద్ధ సుతత్త్వుఁడై యురు
క్రముఁ డభిభూత సత్ప్రకృతి కర్మకళంకుఁడు నైన యట్టి యు
త్తమచరితుం గృపాకరు నుదాత్తగుణోన్నతు నీశ్వరేశుఁ జి
త్తమునఁ దలంపుమయ్య! జనతాపరిరక్షణ! దుష్టశిక్షణా!
టీక:- సు = మిక్కిలి; మహిత = గొప్పదైనది; నిత్య = ఎల్లప్పుడు; ముక్త = బంధములు లేనిది; పరిశుద్ధ = స్వచ్ఛమైనది; విబుద్ధ = విశిష్టమైన తెలివి కలది; సు = సత్యమైన; తత్త్వుడు = స్వభావము కలవాడు; ఐ = అయ్యి; ఉరుక్రముడు = విష్ణుమూర్తి {ఉరుక్రముడు - ఉరు (గొప్ప, తీక్షణమైన) క్రమము (విధానము) కలవాడు, విష్ణువు}; అభిభూత = తిరస్కరింపబడిన; సత్ = సత్యము; ప్రకృతి = స్వభావము; కర్మ = కర్మము లనెడి; కళంకుడు = కళంకము కలవాడు; ఐన = అయిన; అట్టి = అటువంటి; ఉత్తమ = ఉత్తమమైన; చరితున్ = ప్రవర్తన కలవానిని; కృపాకరున్ = దయాకరుని; ఉదాత్త = గొప్ప; గుణ = గుణముల; ఉన్నతున్ = ఉన్నతి కలవానిని; ఈశ్వరేశున్ = పరమేశ్వరుని; చిత్తమునన్ = మనసులో; తలంపుము = భావింపుము; అయ్య = తండ్రి; జనతాపరిరక్షణ = ప్రజలను పరిపాలించువాడా; దుష్టశిక్షణా = దుష్టులను శిక్షించువాడా.
భావము:- అటువంటి నిత్యముక్తుడు, సత్యస్వరూపుడు, విశుద్ధసత్త్వుడు, ఉరుక్రముడు, ప్రాకృతకర్మ కళంక భంజనుడు, కృపారంజనుడు, ఉత్తమ చరితుడు, ఉదాత్త గుణోన్నతుడు అయిన పరమేశ్వరుణ్ణి దుష్టజన శిక్షణుడవు, శిష్టజన రక్షణుడవు అయిన రాజా! నీవు నీ మనస్సులో స్మరించు.
తెభా-4-629-సీ.
వసుమతీనాథ! యెవ్వని పాదపద్మ ప-
లాశ విలాస సల్లలిత భక్తి
సంస్మరణంబుచే సజ్జన ప్రకరంబు-
ఘనకర్మ సంచయ గ్రథితమగు న
హంకార మను హృదయగ్రంథిఁ జెఱతురు-
వివరింప నిట్లు నిర్విషయమతులు
మహి నిరుద్ధేంద్రియ మార్గులు నై నట్టి-
యతులకుఁ జేరంగ నలవి గాని
తెభా-4-629.1-తే.
యట్టి పరమేశుఁ గేశవు నాదిపురుషు
వాసుదేవుని భువనపావన చరిత్రు
నర్థి శరణంబుగాఁ దత్పదాంబుజములు
భక్తి సేవింపు గుణసాంద్ర! పార్థివేంద్ర!
టీక:- వసుమతీనాధ = రాజా {వసుమతీనాథుడు - వసుమతి (భూమి)కి నాథుడు (పతి), రాజు}; ఎవ్వని = ఎవని యొక్క; పాద = పాదములు అనెడి; పద్మ = పద్మముల; పలాశ = రేకులందు; విలాస = విలాసమునందు; సత్ = సత్యమైన; లలిత = చక్కటి; భక్తిన్ = భక్తి; సంస్మరణంబున్ = స్తోత్రముల; చేన్ = చేత; సత్ = మంచి; జన = వారి; ప్రకరంబున్ = సమూహము; ఘన = గట్టి; కర్మ = కర్మములు; సంచయ = కూడబెట్టినవానిచే; గ్రథితము = ముడిపెట్టబడినది; అగు = అయిన; అహంకారము = అహంకారము; అను = అనెడి; హృదయగ్రంథిన్ = హృదయగ్రంథిని; చెఱతురు = చెరిపివేసెదరు; వివరింపన్ = విచారించినచో; ఇట్లు = ఈ విధముగ; నిర్విషయ = ఇంద్రియార్థములనుచెందని; మతులు = మనసుకలవారు; మహిన్ = లోకమున; నిరుద్ధ = నియమింపబడిన; ఇంద్రియ = ఇంద్రియముల; మార్గులు = వర్తనలుకలవారు; ఐనట్టి = అయినట్టి; యతుల్ = యతుల; కున్ = కైనను; చేరంగన్ = అందుకొనుటకు; అలవి = సాధ్యము; కాని = కాని.
అట్టి = అటువంటి; పరమేశున్ = విష్ణుమూర్తిని; కేశవున్ = విష్ణుమూర్తిని; ఆదిపురుషున్ = విష్ణుమూర్తిని; వాసుదేవునిన్ = విష్ణుమూర్తిని; భువనపావనచరిత్రు = విష్ణుమూర్తిని {భువనపావనచరిత్రుడు - భువన (జగత్తును) పావన (పవిత్రముచేయు) చరిత్ర కలవాడు, విష్ణువు}; అర్థిన్ = కోరి; శరణంబున్ = శరణము; కాన్ = అగుటకు; తత్ = అతని; పద = పాదములు అనెడి; అంబుజములున్ = పద్మములను; భక్తిన్ = భక్తితో; సేవింపుము = పూజింపుము; గుణసాంద్ర = గుణములు చిక్కగాకలవాడ; పార్థివేంద్ర = రాజా {పార్థివేంద్రుడు - పార్థివుల (పృథివీసంబంధ దేహము కలవారి)లో ఇంద్రునివంటివాడా, రాజు}.
భావము:- మహారాజా! ఆ మహానుభావుని పాదపద్మాలను భక్తితో సంస్మరించి సజ్జనులైనవారు కర్మవాసనామయమైన అహంకారమనే హృదయ గ్రంధిని నిర్మూలిస్తారు. ఇటువంటి కార్యం ఇంద్రియాలను నిగ్రహించిన వారూ, విషయాసక్తులు కానివారూ అయిన యతులకు కూడా సాధ్యం కాదు. సుగుణసాంద్రుడవైన నరేంద్రా! భక్తిమాత్రసాధ్యుడు, భువన పావన చరిత్రుడు, ఆది పురుషుడు, దేవాదిదేవుడు అయిన వాసుదేవుని శరణు జొచ్చి ఆ పరమేశ్వరుని చరణ పద్మాలను భక్తితో సేవించు.
తెభా-4-630-మ.
అరిషడ్వర్గమహోర్మి నక్రనికరవ్యాకీర్ణ సంసారసా
గర మబ్జోదరకీర్తనాతరణి సాంగత్యంబునం బాసి తా
మరుదారంగ నఘాపహప్రకట యోగాదిక్రియాయుక్తి చేఁ
దరియింపన్ మదిఁ గోరువారలకు దుర్దాంతంబగుం గావునన్.
టీక:- అరిషడ్వర్గ = శత్రువులు ఆరుగురి గుంపు {అరిషడ్వర్గములు - 1కామ 2క్రోధ 3లోభ 4మోహ 5మద 6మాత్సర్యములు}; మహా = పెద్దపెద్ద; ఊర్మి = అలలు; నక్ర = మొసళ్ళ; నికర = సమూహములతో; వ్యాకీర్ణ = కల్లోలమైన; సంసార = సంసార మనెడి; సాగరమున్ = సముద్రమును; అబ్జోదర = విష్ణుమూర్తి; కీర్తనా = స్తోత్రములు అనెడి; తరణి = ఓడ; సాంగత్యమునన్ = సహవాసమువలన; పాసి = తొలగించుకొని; తాము = వారు; అరుదారగన్ = చక్కగా; అఘ = పాపములను; అపహన్ = పోగొట్టెడి; ప్రకట = ప్రసిద్ధమైన; యోగ = యోగవిద్యా; ఆది = మొదలగువానిని; క్రియా = ఆచరించెడి; యుక్తిన్ = యుక్తి; చేన్ = చేత; తరియింపన్ = దాటుటను; మదిన్ = మనసులలో; కోరు = కోరెడి; వారల = వారి; కున్ = కి; దుర్దాంతంబున్ = లొంగదీయరానిది; అగున్ = అయినది; కావునన్ = కనుక.
భావము:- అరిషడ్వర్గం అనే మహోగ్రతరంగాలతోను, పెద్ద పెద్ద మొసళ్ళతోను నిండిన సంసార సముద్రాన్ని పరమేశ్వర సంకీర్తనం అనే నావ లేకుండా దాటటం సాధ్యం కాదు. అత్యంత కష్టసాధ్యాలైన హఠయోగాదుల వల్ల ఈ మహాసాగరాన్ని తరించటం అసంభవం. కావున…
తెభా-4-631-మ.
ధరణీశోత్తమ! నీవు కేవల సముద్యద్భక్తి ధీయుక్తి మై
వరగోవింద పదారవింద యుగభాస్వన్నావ సంధించి దు
స్తర భూరివ్యసనాకరోల్ల సితదుర్దాంతోగ్ర గంభీర సం
సరణాంభోధిఁ దరింపవయ్య! పరమోత్సాహంబు దీపింపగన్.”
టీక:- ధరణీశ = రాజులలో; ఉత్తమ = ఉత్తముడ; నీవు = నీవు; కేవల = కేవలము; సమ = చక్కటి; ఉద్యత్ = ప్రయత్నము కలిగిన; భక్తిన్ = భక్తి; ధీయుక్తిమై = యోగముతో {ధీయుక్తిమై బుద్ధితో కూడిన నేర్పు కలిగి, యోగముతో}; వర = శ్రేష్ఠమైన; గోవింద = హరి; పాద = పాదములు అనెడి; అరవింద = పద్మముల; యుగ = జంట అనెడి; భాస్వత్ = ప్రకాశిస్తున్న; నావ = నావని; సంధించి = ప్రయోగించి; దుస్తర = దాటరాని; భూరి = అతిపెద్ద; వ్యసన = బాధలకు; ఆకర = నివాసమై; ఉల్లసిత = ఉప్పొంగుతున్న; దుర్దాంత = దురంతమైన; ఉగ్ర = భయంకరమైన; గంభీర = లోతైన; సంసరణ = సంసార మనెడి; అంభోధిన్ = సాగరమును; తరింపు = దాటుము; అయ్య = తండ్రి; పరమ = అత్యధికమైన; ఉత్సాహంబున్ = ఉత్సాహము; దీపింపగన్ = అతిశయించగా.
భావము:- రాజోత్తమా! నీవు కేవలం అచంచలమైన భక్తియుక్తితో గోవింద పదారవింద వందనం అనే అందమైన నావను ఆశ్రయించు. దాని సాయంతో దుస్తరమూ, దురంతమూ, దుఃఖమయమూ, కఠోరమూ, గంభీరమూ అయిన ఈ సంసార సాగరాన్ని పరమ సంతోషంతో తరించు.”
తెభా-4-632-క.
అని యీ గతిఁ బంకరుహా
సనసుతుఁడును బ్రహ్మబోధశాలియు నగు నా
ఘన యోగివల్లభునిచే
తను దెలియఁగఁ బడిన బ్రహ్మతత్త్వుం డగుచున్.
టీక:- అని = అని; ఈ = ఈ; గతిన్ = విధముగ; పంకేరుహాసన = బ్రహ్మదేవుని; సుతుడునున్ = పుత్రుడును; బ్రహ్మబోధశాలియున్ = బ్రహ్మజ్ఞాని; అగున్ = అయిన; ఆ = ఆ; ఘన = గొప్ప; యోగి = యోగులలో; వల్లభుని = ప్రభువు (సనత్కుమారుడు); చేతనున్ = చేత; తెలియగబడిన = తెలుపబడిన; బ్రహ్మతత్త్వుండు = బ్రహ్మజ్ఞానము కలవాడు; అగుచున్ = అవుతూ.
భావము:- అని ఈ విధంగా బ్రహ్మపుత్రుడూ, బ్రహ్మవిదుడూ, పరమ యోగీంద్రుడూ అయిన సనత్కుమారుని చేత బ్రహ్మతత్త్వాన్ని చక్కగా తెలిసికొన్నవాడై…
తెభా-4-633-క.
జనపతి మునిఁ బొగడి ముదం
బున నిట్లనుఁ బూర్వజన్మమున నే దీనా
వనుఁడైన యీశ్వరుని చే
తను నిక్క మనుగ్రహింపఁ దగితి మునీంద్రా!
టీక:- జనపతి = రాజు; మునిన్ = మునిని; పొగడి = స్తుతించి; ముదంబునన్ = సంతోషముతో; ఇట్లు = ఈ విధముగ; అనున్ = అనెను; పూర్వ = కిందటి; జన్మమునన్ = జన్మలో; నేన్ = నేను; దీనా = దీనులను; అవనుడు = కాపాడెడివాడు; ఐన = అయిన; ఈశ్వరుని = భగవంతుని; చేతనున్ = చేత; నిక్కమున్ = నిజముగ; అనుగ్రహింపన్ = అనుగ్రహించుటకు; తగితిన్ = తగ్గవాడనైతిని; మునిన్ = మునులలో; ఇంద్ర = ఇంద్రుని వంటివాడ.
భావము:- పృథుచక్రవర్తి సనత్కుమారుని కొనియాడుతూ సంతోషంతో ఇలా అన్నాడు “మునీంద్రా! పూర్వజన్మలో దీనరక్షకుడైన భగవంతుని అనుగ్రహం నామీద బాగా ప్రసరించి ఉంటుంది.
తెభా-4-634-క.
వినుఁ డట్టి యనుగ్రహ సా
ధనమునకై మీర లిపుడు దగ నిచ్చటికిం
జనుదెంచితిరి దయాళురు
ననఘులు భాగవతవరులు నగు నుత్తములున్.
టీక:- వినుడు = వినండి; అట్టి = అటువంటి; అనుగ్రహ = అనుగ్రహమును; సాధనమున్ = పొందింపజేయుట; కై = కోసము; మీరలు = మీరు; ఇపుడున్ = ఇప్పుడు; తగన్ = తప్పక; ఇచట = ఇక్కడ; కిన్ = కు; చనుదెంచితిరి = వచ్చితిరి; దయాళురున్ = దయాస్వభావులు; అనఘులున్ = పుణ్యులున్; భాగవత = భాగవతులలో; వరులున్ = శ్రేష్ఠులు; అగు = అయిన; ఉత్తములున్ = ఉత్తములు.
భావము:- విను. ఆ అనుగ్రహాన్ని సార్థకం చేయటంకోసం మీరు ఇక్కడికి విచ్చేశారు. మీరు దయామయులు, పాపరహితులు, మునిసత్తములు, పరమ భాగవతోత్తములు.
తెభా-4-635-సీ.
నిరతంబు నా యందు నిష్పాదితములగు-
దేహసమేత మదీయరాజ్య
సర్వసంపదలును సద్ద్విజ దత్తముల్-
గావునఁ బ్రాణకాంతా విభూతి
మందిర సుత రాజ్య మహి బల కోశ ప-
రిచ్ఛదంబుల నెల్ల ధృతిఁ దలంప
రాజుకు భృత్యుండు రాజకీయములగు-
తాంబూలముఖ పదార్థములఁ జేసి
తెభా-4-635.1-తే.
రమణ సంతర్పణోపచారములు నడపు
గతిని వారల కవి నివేదితము లయ్యెఁ;
గాన మీ కుపచార మేగతి నొనర్తు?
నతులగుణసాంద్ర! యోగికులాబ్ధిచంద్ర!
టీక:- నిరతంబున్ = ఎల్లప్పుడు; నా = నా; అందున్ = ఎడల; నిష్పాదితంబులు = కల్పింపబడినవి; అగు = అయిన; దేహ = శరీరముతో; సమేత = సహా; మదీయ = నా యొక్క; సర్వ = అఖిలమైన; సంపదలునున్ = సంపదలు; సత్ = సత్యమైన; ద్విజ = బ్రాహ్మణులకు; దత్తములు = దానముచేయబడినవి; కావునన్ = అందుచేత; ప్రాణ = ప్రాణములు; కాంతా = భార్య; విభూతి = వైభవము; మందిర = గృహములు; సుత = పుత్రులు; రాజ్య = రాజ్యము; మహి = భూములు; బల = సైన్యము; కోశ = ధనాగారము; పరిచ్ఛదంబులన్ = పరివారము; ఎల్లన్ = సమస్తము; ధృతిన్ = స్థైర్యముతో; తలంపన్ = ఆలోచించిన; రాజున్ = రాజు; కున్ = కి; భృత్యుండు = సేవకుడు; రాజకీయములు = రాచమర్యాదలు; అగు = అయిన; తాంబూల = తాంబూలము {తాంబూలము - తమలపాకు వక్క సున్నము సుగంధద్రవ్యములతో చేయబడునది}; ముఖ = మొదలైన; పదార్థములన్ = పదార్థముల; చేసి = వలన.
రమణన్ = మనోహరముగ; సంతర్పణ = తృప్తిపరచెడి; ఉపచారములున్ = సేవలను; నడపు = సాగించు; గతినిన్ = విధముగ; వారల్ = వారి; కిన్ = కి; అవి = అవి; నివేదితములు = సమర్పింపబడినవి; అయ్యెన్ = అయినవి; కాన = కావున; మీకున్ = మీకు; ఉపచారమున్ = సేవలు; ఏగతిన్ = విధముగ; ఒనర్తున్ = చేయుదును; అతులగుణసాంద్ర = మహాసుగుణశాలి {అతులగుణసాంద్రుడు - అతుల (మిక్కిలి) గుణ (సుగుణముల) సాంద్రుడు (చిక్కదనము కలవాడు), మహాసుగుణశాలి}; యోగికులాబ్ధిచంద్ర = మహాయోగి {యోగికులాబ్ధిచంద్ర - యోగి (యోగుల) కుల (జనులు అనెడి) అబ్ధి (సముద్రమునకు) చంద్రుడు (చంద్రుని వంటి వాడు), మహాయోగి}.
భావము:- అటువంటి మీరు బ్రహ్మజ్ఞానాన్ని ప్రబోధించారు. ఇందుకు మీకు దక్షిణగా నేను ఏమి ఈయగలను? నా దేహం, రాజ్యం, సర్వసంపదలు ఉత్తమ బ్రాహ్మణులు నాకు అనుగ్రహించినవే. అటువంటి నా ప్రాణాలను, సిరిసంపదలను, గృహాలను, సుతులను, రాజ్యాలను, భూములను, సైన్యాలను, ధనాగారాలను, సమస్త పదార్థాలను సేవకుడు రాజుకు తాంబూలాదులు సమర్పించి సేవించిన విధంగా నేను బ్రాహ్మణోత్తములకే అర్పించి వేశాను. కాబట్టి సద్గుణసాంద్రుడవు, సంయమి చంద్రుడవు అయిన మీకు నేను ఇప్పుడు ఏమి సమర్పించుకోగలను?
తెభా-4-636-వ.
అది యెట్లు బ్రాహ్మణాధీనం బంటిరేని సేనాధిపత్య రాజ్యదండ నేతృత్వ సర్వలోకాధిపత్యంబులు వేదశాస్త్రవేది యైన బ్రాహ్మణునక కాని యితరులకు యోగ్యంబులు గావు; కావున బ్రాహ్మణులకు భోజనవసన దానంబులు స్వకీయంబులై యుండు; క్షత్రియాదులకు బ్రాహ్మణానుగ్రహంబున నన్నమాత్రంబు దక్కం దక్కిన వస్తుస్వాతంత్ర్యంబు లేదు; కావున మీకు గురుదక్షిణ యేమి సమర్పించువాఁడ? నదియునుం గాక స్వాతంత్ర్యంబు గలిగిన నిట్టి యధ్యాత్మ విచారులు వేదాంత వేదులు నై భగవద్భక్తి నుపదేశించెడు మీ వంటి పుణ్యాత్ములకుం బరిహాసాస్పదుండు దక్కఁ దక్కిన వాఁడెవ్వం డంజలి మాత్రంబు దక్కఁ దక్కిన ప్రత్యుపకారంబు చేయం దలంచు? నది గావున దయాళువు లైన మీరలు స్వకృతోపచారంబులం జేసి సంతుష్టాంతరంగు లగుదురుగా"కని పలుకుచున్న యాదిరాజయిన పృథుచక్రవర్తి చేతఁ బూజితులై యాత్మ యోగనిష్ఠులైన సనకాదు లతని స్వభావంబు బ్రశంసించుచు సమస్తజనంబులుఁ జూచుచుండ నాకాశ గమనంబునం జని; రయ్యవసరంబున.
టీక:- అది = అది; ఎట్లున్ = ఏ విధముగ; బ్రాహ్మణ = బ్రాహ్మణులకు; అధీనంబున్ = ఆధీనము అయినదినది; అంటిరేని = అనుచున్నచో; సేనా = సైన్యమునకు; ఆదిపత్య = నాయకత్వము; రాజ్య = రాజ్యమును; దండ = ఏలుట; నేతృత్వ = నాయకత్వము; సర్వ = సకల; లోక = లోకములకు; అధిపత్యంబులు = నాయకత్వములు; వేదశాస్త్ర = వేదశాస్త్రములను; వేది = తెలిసినవాడు; ఐన = అయిన; బ్రాహ్మణునక = బ్రాహ్మణులకే; కాని = కాని; ఇతరుల్ = ఇతరుల; కున్ = కి; యోగ్యంబులు = తగినవి; కావు = కావు; కావునన్ = అందుచేత; బ్రాహ్మణుల్ = బ్రాహ్మణుల; కున్ = కి; భోజన = భోజనము; వసన = నివాసము; దానంబులు = దానములు; స్వకీయంబులున్ = స్వంతమైనవి; ఐ = అయ్యి; ఉండున్ = ఉండును; క్షత్రియ = రాజులు; ఆదుల్ = మొదలగువారి; కున్ = కి; బ్రాహ్మణ = బ్రాహ్మణుల యొక్క; అనుగ్రహంబునన్ = దయవలన; అన్న = అన్నము; మాత్రంబున్ = మాత్రము; తక్కన్ = తప్పించి; తక్కిన = మిగతా; వస్తు = వస్తువులపై; స్వాతంత్ర్యంబున్ = స్వతంత్రత; లేదు = లేదు; కావునన్ = అందుచేత; మీకున్ = మీకు; గురుదక్షిణ = గురుదక్షిణగా; ఏమి = ఏది; సమర్పించువాడన్ = ఇవ్వగలను; అదియున్ = అంతే; కాక = కాకుండగ; స్వాతంత్ర్యంబున్ = స్వాతంత్ర్యము; కలిగిన = ఉన్న; ఇట్టి = ఇటువంటి; అధ్యాత్మ = ఆత్మవిద్యను; విచారులు = విచారించెడివారు; వేదాంత = వేదాంతమును; వేదులున్ = తెలిసినవారు; ఐ = అయ్యి; భగవత్ = భగవంతుని ఎడలి; భక్తిన్ = భక్తిని; ఉపదేశించెడు = ఉపదేశము చేసెడి; మీ = మీ; వంటి = వంటి; పుణ్యాత్ముల్ = పుణ్యాత్ముల; కున్ = కి; పరిహాస = నవ్వుల; ఆస్పదుండు = పాలగువాడు; తక్కన్ = తప్పించి; తక్కిన = ఇతరమైన; వాడు = వాడు; ఎవ్వండు = ఏ ఒక్కడు; అంజలి = అంజలి ఘటించుట; మాత్రంబున్ = మాత్రము; తక్కన్ = తప్పించి; తక్కిన = ఇతరమైన; ప్రతి = బదులుతీర్చెడి; ఉపకారంబున్ = ఉపకారము; చేయన్ = చేయవలెనని; తలంచును = అనుకొనును; అదిగావునన్ = అందుచేత; దయాళువులు = కృపాకరులు; ఐన = అయిన; మీరలు = మీరు; స్వ = తమకి తాము; కృత = చేసుకొనెడి; ఉపచారంబులన్ = సేవలు; చేసి = వలన; సంతుష్ట = సంతృప్తిచెందిన; అంతరంగులు = మనసులు కలవారు; అగుదురుగాక = అవుదురుగాక; అని = అని; పలుకుచున్న = పలుకుతున్నట్టి; ఆదిరాజు = మొట్టమొదటి రాజు; అయిన = అయినట్టి; పృథుచక్రవర్తి = పృథుచక్రవర్తి; చేతన్ = వలన; పూజితులు = పూజింపబడినవారు; ఐ = అయ్యి; ఆత్మయోగ = ఆత్మ పరమాత్మ సంయోగ విద్యలో; నిష్ఠులు = నిష్ఠష్ కలవారు; ఐన = అయిన; సనక = సనకుడు {సనకాది - 1సనక 2సనందన 3సనత్కుమార 4సనత్సుజాతులు}; ఆదులు = మొదలగువారు; అతని = అతని; స్వభావంబున్ = స్వభావమును; ప్రశంసించుచున్ = స్తుతించుతూ; సమస్త = సమస్తమైన; జనంబులున్ = ప్రజలును; చూచుచున్ = చూస్తుండగా; ఉండన్ = ఉండగా; ఆకాశ = గగన; గమనంబునన్ = మార్గమున; చనిరి = వెళ్లిరి; ఆ = ఆ; అవసరంబునన్ = సమయములో.
భావము:- బ్రాహ్మణులకు అర్పించడం ఎలా అంటే సేనాపతిత్వం, రాజ్యాధికారం, దండనాయకత్వం, సర్వలోకాధిపత్యం ఇవన్నీ వేదశాస్త్రవేత్త లయిన బ్రాహ్మణులకే తప్ప ఇతరులకు గ్రాహ్యాలు కావు. అన్న వస్త్ర దానాలు బ్రాహ్మణుల స్వకీయాలు. బ్రాహ్మణుడు తన అన్నమే తాను భుజిస్తాడు. తన వస్త్రమే తాను ధరిస్తాడు. తన సొమ్మే తాను దానం చేస్తాడు. క్షత్రియాదులు బ్రాహ్మణుల అనుగ్రహం చేతనే అన్నపానీయాలను అనుభవిస్తున్నారు. అంతేకాని తక్కిన వస్తువుల మీద వారికి స్వాతంత్ర్యం లేదు. అందుచే అస్వతంత్రుడనైన నేను మీకు గురుదక్షిణగా ఏమి సమర్పించుకోగలను? మీరు వేదాంతవేత్తలు, ఆధ్యాత్మవిదులు, సర్వ స్వతంత్రులు. నాకు భగవద్భక్తిని ఉపదేశించారు. మీవంటి పుణ్యాత్ములకు భక్తితో చేతులు మోడ్చి నమస్కరించటం తప్ప మరేమీ చేయలేను. మీకు ఏదయినా ప్రత్యుపకారానికి పూనుకొనడం నవ్వుల పాలు కావడమే కాబట్టి దయామయులైన మీరు మీ ఉపకారానికి బదులు నా నమస్కారం అందుకొని ఆనందం పొందుదురు గాక!” అని పృథుచక్రవర్తి విన్నవించి వారిని సన్నుతించాడు. దివ్యజ్ఞాన మహనీయులైన సనకాది మునీంద్రులు ఆయన పూజలందుకొని ఆయన స్వభావాన్ని ప్రశంసిస్తూ ప్రజలందరూ చూస్తుండగా ఆకాశగమనంతో వెళ్ళిపోయారు.
తెభా-4-637-ఆ.
విను మహాత్మ! ముఖ్యుఁ డన నొప్పు వైన్యుఁడే
కాగ్రచిత్తుఁ డగుచు నాత్మనిష్ఠుఁ
డైనయట్టి తను నవాప్త కామునిఁ గాఁగ
బుద్ధిలోనఁ దలఁచె భూవరుండు.
టీక:- విను = వినుము; మహాత్మ = గొప్పవాడ; ముఖ్యుడు = ప్రముఖుడు; అనన్ = అనుటకు; ఒప్పు = తగినవా డగు; వైన్యుడు = పృథువు {వైన్యుడు - వేనుని పుత్రుడు, పృథువు}; ఏకాగ్ర = ఏకాగ్రమయిన; చిత్తుడు = మనసు కలవాడు; అగుచున్ = అవుతూ; ఆత్మ = ఆత్మవిద్య యందు; నిష్ఠుడు = నిష్ఠ కలవాడు; ఐన = అయిన; అట్టి = అటువంటి; తనున్ = తనను; అవాప్త = తీరిన; కామునిన్ = కోరికలు కలవాని; కాగన్ = అగునట్లు; బుద్ధి = మనసు; లోనన్ = లో; తలచెన్ = అనుకొనెను; భూవరుండు = రాజు.
భావము:- “విదురా! విను. మహాత్ములలో ముఖ్యు డనదగ్గ పృథుచక్రవర్తి ఆధ్యాత్మ శిక్షచేత ఏకాగ్రత పొందాడు. ఆ ఏకాగ్రత వలన ఆత్మనిష్ఠు డయ్యాడు. తనను అవాప్తకామునిగా భావించుకున్నాడు.
తెభా-4-638-వ.
అంత.
టీక:- అంత = అంతట.
భావము:- అప్పుడు…
తెభా-4-639-సీ.
కర్మంబులను యథాకాల దేశోచిత-
బలవిత్తములు గాఁగ బరఁగు ధర్మ
ములను బ్రహ్మార్పణ బుద్ధినిఁ జేసి క-
ర్మాసక్తుఁ డగుచు సమాహితుండు
ప్రకృతికంటెను దన్నుఁ బరమైన యాత్మను-
గర్మసంచయ సాక్షిఁగాఁగ బుద్ధి
నర్థిఁ దలంచుచు నాచరించుచు నట్ల-
మెఱసి సామ్రాజ్యలక్ష్మీ సమేత
తెభా-4-639.1-తే.
మందిరోద్యాన వనభూములందు రాజ్య
గరిమ వర్తింపఁగా నహంకార రహితుఁ
డగుచుఁ దన చిత్తమున నింద్రియార్థములను
దగులకయ యుండె సన్మహోదారుఁ డగుచు.
టీక:- కర్మంబులనున్ = వేదకర్మములను; యథా = తగిన; కాల = కాలము; దేశ = ప్రదేశములకు; ఉచిత = ఉచితమైన; బల = బ్రాహ్మణ సేవకాది బలము; విత్తములున్ = ధనములు; కాగన్ = ఉండగ; పరగు = ప్రసిద్దమగు; ధర్మములనున్ = ధర్మములను; బ్రహ్మా = పరబ్రహ్మమునకు; అర్పణ = అర్పించెడి; బుద్ధినిన్ = భావము; చేసి = చేసికొని; కర్మ = వేదకర్మములుయందు; ఆసక్తుండు = ఆసక్తికలవాడు; అగుచున్ = అవుతూ; సమాహితుండున్ = సిద్దమైనవాడు; ప్రకృతి = ప్రకృతి; కంటెనున్ = కంటె; తన్నున్ = తనను; పరమైన = ఇతరమైనవాడు; ఆత్మనున్ = మనసున; కర్మ = కర్మల; సంచయ = సమూహమునకు; సాక్షి = సాక్షిమాత్రము; కాగన్ = అయినట్లు; బుద్ధిన్ = విచారించుతూ; అర్తిన్ = కోరి; తలంచుచున్ = భావించుతూ; ఆచరించుచున్ = ఆచరించుతూ; అట్ల = ఆ విధముగ; మెఱసి = విలసిల్లుతూ; సామ్రాజ్య = సామ్రాజ్యము అనెడి; లక్ష్మీ = సంపదలతో; సమేత = కూడిన.
మందిర = భవనములు; ఉద్యానవన = తోటలు; భూములు = పొలములు; అందున్ = అందు; రాజ్య = రాజ్యము యొక్క; గరిమన్ = గొప్పదనము; వర్తింపగా = వర్తిస్తుండగా; అహంకార = అహంకారము; రహితుండు = లేనివాడు; అగుచున్ = అవుతూ; తన = తన యొక్క; చిత్తమునన్ = మనసున; ఇంద్రియార్థములనున్ = వియములను; తగులకయ = సక్తుడుకాకుండగ; ఉండెన్ = ఉండెను; సత్ = సత్యమైన; మహా = గొప్ప; ఉదారుడు = ఉదారబుద్ధికలవాడు; అగుచున్ = అవుతూ.
భావము:- దేశ కాల బల విత్తాలకు తగినట్లు బ్రహ్మార్పణ బుద్ధితో సత్కర్మలను, ధర్మాలను ఆచరించాడు. ఫలాన్ని బ్రహ్మార్పణం చేసి కర్మలందు అనాసక్తు డయ్యాడు. ప్రకృతి కంటె పరమైన తనను కర్మసాక్షిగా భావించి కర్మలను ఆచరించాడు. సామ్రాజ్య లక్ష్మీ సమేతుడై సుందర మందిరోద్యాన భూములలో తిరుగుతూ ఉన్నప్పటికీ అహంకార రహితుడై తన చిత్తం ఇంద్రియార్థాలలో చిక్కుకొనకుండా సూర్యునిలాగా ప్రవర్తించాడు.
తెభా-4-640-వ.
ఇట్లధ్యాత్మయోగనిష్ఠుండై కర్మంబుల నాచరించుచు నర్చి యను భార్య యందు విజితాశ్వుండు, ధూమ్రకేశుండు, హర్యశ్వుండు, ద్రవిణుండు, వృకుండు నను నాత్మసము లైన పుత్రుల నేవురం గనియె; అంత.
టీక:- ఇట్లు = ఈ విధముగ; అధ్యాత్మ = తత్త్వ; యోగ = యోగము నందు; నిష్ఠుండు = నియమించుకొన్నవాడు; ఐ = అయ్యి; కర్మంబులన్ = కర్మవిధులను; ఆచరించుచున్ = ఆచరించుతూ; అర్చి = అర్చి; అను = అనెడి; భార్య = భార్య; అందున్ = అందు; విజితాశ్వుండు = విజితాశ్వుడు {విజితాశ్వుడు - విజిత (జయించిన) అశ్వుడు (అశ్వము కలవాడు)}; ధూమ్రకేశుండు = ధూమ్రకేశుడు {ధూమ్ర కేశుడు - ధూమ్ర (పొగవంటి) కేశుడు (శిరోజములు కలవాడు)}; హర్యశ్వుండు = హర్యశ్వుడు {హర్యశ్వుడు - హరి (పచ్చని) రంగు కల గుఱ్ఱము కలవాడు}; ద్రవిణుండు = ద్రవిణుడు {ద్రవిణుడు - బంగారము}; వృకుండు = వృకుడు {వృకము - తోడేలు}; అను = అనెడి; ఆత్మ = తనకు; సములు = సమానమైనవారు; ఐన = అయిన; పుత్రులన్ = కొడుకులను; ఏవురన్ = ఐదుగురను (5); కనియెన్ = పుట్టించెను; అంత = అంత.
భావము:- ఈ విధంగా పృథుచక్రవర్తి అధ్యాత్మయోగ పరాయణుడై ఆయా కర్మలను ఆచరిస్తూ భార్యయైన అర్చి మహాదేవి వల్ల తనతో సమానులైన విజితాశ్వుడు, ధూమ్రకేశుడు, హర్యశ్వుడు, ద్రవిణుడు, వృకుడు అనే ఐదుగురు పుత్రులను పొందాడు.
తెభా-4-641-క.
జనవినుత! భూమివలనను
ధనముల మర్యాదఁ గొనుచు దాన నిమిత్తం
బునఁ గ్రమ్మఱఁ దా నిచ్చుచు
దిననాయకుఁ బోలి వసుమతీపతి యొప్పెన్.
టీక:- జన = ప్రజలచే; వినుత = స్తుతింపబడువాడ; భూమి = నేల; వలనను = నుండి; ధనములన్ = సంపదలను; మర్యాదన్ = గౌరవమును; కొనుచున్ = తీసుకొనుచు; దాన = దానము; నిమిత్తంబునన్ = పేరుతో; క్రమ్మఱన్ = మరల; తాన్ = తను; ఇచ్చుచున్ = ఇస్తూ; దిననాయకున్ = సూర్యుని {దిన నాయకుడు - దిన (పగలు)కి నాయకుడు, సూర్యుడు}; పోలి = వలె; వసుమతీపతి = రాజు {వసుమతీపతి - వసుమతి (భూమి)కి పతి, రాజు}; ఒప్పెన్ = చక్కగా యుండెను.
భావము:- జనస్తుతుడవైన విదురా! సూర్యుడు భూమినుండి నీటిని గ్రహించి అవసర మైనపుడు వర్షించు విధంగా పృథుచక్రవర్తి ప్రజలనుండి పన్నులను గ్రహిస్తూ, అవసరమైనప్పుడు తిరిగి ప్రజలకే దానరూపంలో పంచి ఇచ్చేవాడు.
తెభా-4-642-వ.
అతండు మఱియు నగ్ని చందంబునం దేజోదుర్ధర్షుండును, మహేంద్రుని పగిది దుర్జయుండును, ధరణి కరణి సతతక్షమా యుక్తుండును, స్వర్గంబునుం బోలె నభీష్టదుండును, బర్జన్యుని భాతిఁ గామిత ప్రవర్షణుండును, సముద్రు రీతి గాంభీర్య యుక్తుండును, మేరువు పోలికి సత్త్వవంతుండును, ధర్మరాజు కైవడి ననుశాసకుండును, మహేంద్రుని విధంబున నైశ్వర్యవంతుండును, గుబేరుని మాడ్కి ధనవంతుండును, వరుణుని సరణి గుప్తార్థుండును, సర్వాత్మకుండగు వాయువు చెలువున బలౌజస్తేజో యుక్తుండును, రుద్రుని పగిది నసహ్యతేజుండును, గందర్పుని యనువున సౌందర్యవంతుండును, మృగరాజు నోజ నధిక శౌర్యోపేతుండును, మనువు ననువున వాత్సల్య యుక్తుండును, నజుని చందంబునం బ్రభుత్వ సమేతుండును, బృహస్పతి గరిమ బ్రహ్మవాదియు, సర్వేశ్వరుని జాడ జితేంద్రియుండునునై విష్వక్సేను నానువర్తను లైన గో గురు విప్ర జనంబులందు భక్తి గలిగి లజ్జావినయశీలంబు లందును, బరోపకారంబు నందును నిరుపముండై యివ్విధంబున సర్వలోక పాలక పృథగ్విధ గుణంబుల నన్నింటినిం దా నొక్కరుండ ధరియించి.
టీక:- అతండు = అతడు; మఱియున్ = ఇంకను; అగ్ని = అగ్ని; చందంబునన్ = వలె; తేజః = తేజస్సుతో; దుర్దర్షుండును = చూడ రానివాడు; మహేంద్రుని = ఇంద్రుని; పగిదిన్ = వలె; దుర్జయుండును = జయింప రానివాడు; ధరణి = భూదేవి; కరణి = వలె; సతత = ఎల్లప్పుడు; క్షమాయుక్తుండును = ఓర్పు కలవాడు; స్వర్గంబునున్ = స్వర్గమును; పొలెన్ = వలె; అభీష్టదుండును = కోరికలను తీర్చువాడు; పర్జన్యుని = వానదేవుని; భాతిన్ = వలె; కామిత = కోరికలను; ప్రవర్షణుండును = చక్కగా వర్షించువాడును; సముద్రున్ = సముద్రుని; రీతిన్ = వలె; గాంభీర్యయుక్తుండును = గాంభీర్యము కలవాడు; మేరువు = మేరుపర్వతము; పొలికిన్ = వలె; సత్త్వవంతుడును = సత్త్వగుణము కలవాడు; ధర్మరాజు = ధర్మరాజు; కైవడిన్ = వలె; అనుశాసకుండును = పరిపాలించెడివాడు; మహేంద్రుని = మహేంద్రుని; విధంబునన్ = వలె; ఐశ్వర్యవంతుండును = ఐశ్వర్యము కలవాడు; కుబేరుని = కుబేరుని; మాడ్కిన్ = వలె; ధనవంతుండును = ధనము కలవాడు; వరుణుని = వరుణుని; సరణిన్ = వలె; గుప్తార్థుండును = దాచిన సొమ్ము కలవాడు; సర్వాత్మకుండు = అన్నిటిలోను యుండెడివాడు; అగు = అయిన; వాయువు = వాయుదేవుని; చెలువున = వలె; బల = బలము, శక్తి; తేజోయుక్తుండు = తేజస్సు కలవాడు; రుద్రుని = శివుని; పగిదిన్ = వలె; అసహ్య = సహింపరాని; తేజుండును = తేజస్సు కలవాడు; కందర్పుని = మన్మథుని; అనువునన్ = వలె; సౌందర్యవంతుండును = అందము కలవాడును; మృగరాజు = సింహము {మృగరాజు – మృగము లందు రాజు వంటిది, సింహము}; ఓజన్ = వలె; అధిక = అధికమైన; శౌర్యోపేతుండును = శౌర్యము కలవాడు; మనువున్ = మనువు; అనువునన్ = వలె; వాత్సల్యయుక్తుండును = కూర్మి కలవాడును; అజుని = బ్రహ్మదేవుని; చందంబునన్ = వలె; ప్రభుత్వసమేతండును = ప్రభుత్వము కలవాడు; బృహస్పతి = బృహస్పతి; గరిమన్ = వలె; బ్రహ్మవాదియున్ = వేదము చదువువాడు; సర్వేశ్వరుని = విష్ణుని; జాడన్ = వలె; జితేంద్రియుడును = ఇంద్రియములను జయించినవాడు; విష్వక్సేనున్ = విష్వక్సేనుని {విష్వక్సేనుడు - విష్ణుమూర్తి యొక్క సేనానాయకుడు}; అనువర్తులున్ = అనుసరించువారు; ఐన = అయిన; గో = గోవులు; గురు = పెద్దలు; విప్ర = విప్రులైన; జనంబుల్ = వారి; అందున్ = ఎడల; భక్తిన్ = భక్తి; కలిగి = ఉండి; లజ్జ = సిగ్గు; వినయ = వినయము; శీలంబుల్ = సత్ప్రవర్తనల; అందును = లోను; పరోపకారంబున్ = ఇతరులకు ఉపకారము చేయట; అందును = లోను; నిరుపముండున్ = సాటిలేనివాడు; ఐ = అయ్యి; ఇవ్విధంబునన్ = ఈ విధమున; సర్వ = సకల; లోక = లోకములను; పాలక = పరిపాలించుట; పృథక్ =ప్రత్యేకమైన; విధ = విధములైన; గుణంబులన్ = గుణములను; అన్నింటిని = అన్నిటిని; తాన్ = తన; ఒక్కరుండ = ఒకడే; ధరియించి = ధరించి.
భావము:- ఆ పృథుచక్రవర్తి అగ్నివలె చెనకరాని తేజస్సు కలవాడు. ఇంద్రునివలె జయింపరానివాడు. భూమివలె ఓర్పు కలవాడు. స్వర్గం వలె ప్రజల కోరికలను తీర్చేవాడు. మేఘునివలె వాంఛితాలను వర్షిస్తాడు. సముద్రం వలె గంభీరుడు. మేరుపర్వతం వలె ధీరుడు. యముని వలె శాసించేవాడు. కుబేరుని వలె ధనవంతుడు. వరుణుని వలె గుప్తార్థుడు. సర్వాంతర్యామి అయిన వాయువువలె బలం, ఓజస్సు, తేజస్సు కలవాడు. రుద్రుని వలె సహింపరాని ప్రతాపం కలవాడు. మన్మథుని వలె సుందరుడు. సింహం వలె శౌర్యవంతుడు. మనువు వలె వాత్సల్యం కలవాడు. బ్రహ్మ వలె ప్రాభవం కలవాడు. బృహస్పతి వలె బ్రహ్మవాది. శ్రీహరి వలె జితేంద్రియుడు. విష్ణుభక్తులందు, గోవులందు, గురువులందు, బ్రాహ్మణులయందు భక్తి గలవాడు. లజ్జాశీలుడు. వినయ వినమ్రుడు. మంచి నడవడి గలవాడు. పరోపకార పరాయణుడు. ఈ విధంగా సకల లోకపాలకుల సుగుణాల నన్నింటినీ పృథిచక్రవర్తి తానొక్కడే వశం చేసుకొన్నవాడై…
తెభా-4-643-క.
అనఘాత్మక! లోకత్రయ
మున సజ్జన కర్ణరంధ్రముల వినఁబడు నా
వినుత యశోమహనీయుఁడు
జనవినుతుం డైన రామచంద్రుని మాడ్కిన్.
టీక:- అనఘాత్మక = పుణ్యాత్మ; లోకత్రయమునన్ = ముల్లోకములలోను; సత్ = మంచి; జన = వారి; కర్ణరంధ్రములన్ = చెవుల రంధ్రముల ద్వారా; వినబడు = వినబడెడి; ఆ = ఆ; వినుత = స్తుతింపబడిన; యశః = కీర్తిగల; మహనీయుడు = గొప్పవాడు; జన = ప్రజలచే; వినుతుండున్ = స్తుతింపబడినవాడు; ఐన = అయిన; రామచంద్రుని = శ్రీరాముని; మాడ్కిన్ = వలె.
భావము:- పుణ్యాత్మా! ముజ్జగాలలోని సజ్జనులకు వీనులవిందు చేసే విశాల యశోవిరాజితుడైన ఆ రాజచంద్రుడు జనులు తన విజయగాథలను గానం చేస్తుండగా ప్రకాశించాడు.
తెభా-4-644-చ.
సరస వచోర్థ సత్పురుష సంఘ సమంచిత గీయమాన సు
స్థిర వరకీర్తి పూరము సుధీజన కర్ణము లందు నించి తా
నిరుపమ సౌమ్య భాషణ మనీషల చేతఁ బ్రజానురక్తుఁడై
ధరణిని రాజనామమునఁ దాఁ దగు రెండవ చంద్రుఁడో యనన్.
టీక:- సరస = రసవంతమైన; వచస్ = మాటల; అర్థ = అర్థముకలిగి; సత్పురుష = మంచివారి; సంఘ = సమూహముతో; సమంచిత = ఒప్పుతున్న; గీయమాన = పాడబడుతున్; సుస్థిర = మంచిగా నిలబడిన; వర = ఉత్తమమైన; కీర్తి = కీర్తి; పూరమున్ = ప్రవాహము; సుధీజన = విద్వాంసుల; కర్ణముల్ = చెవుల; అందున్ = లో; నించి = నింపి; తాన్ = తను; నిరుపమ = సాటిలేని; సౌమ్య = మెత్తని; భాషణ = మాట్లాడెడి; మనీషల్ = నేర్పుల; చేతన్ = వలన; ప్రజా = లోకులకు; అనురక్తుడు = ప్రీతి కలవాడు; ఐ = అయ్యి; ధరణిన్ = భూమిని; రాజ = రాజు (పాలకుడు, చంద్రుడు) అనెడి; నామమున్ = పేరు ప్రకారము; తాన్ = తాను; తగు = తగును; రెండవ = రెండవ (2); చంద్రుడో = చంద్రుడేమో; అనన్ = అనగా.
భావము:- ఆ రాజేంద్రుడు రసవంతాలై రమణీయార్థాలైన వాక్కులు కలిగిన సత్పురుషులు చక్కగా గానం చేసే తన కీర్తి లహరులు విద్వాంసుల వీనులకు విందులు చేయగా తన మృదుమధుర వాక్కుల చేతను, బుద్ధి వైభవం చేతను ప్రజలకు అనురాగ పాత్రుడై రెండవ చంద్రుడేమో అన్నట్లు రాజ (చంద్రుడు, పాలకుడు) శబ్దాన్ని సార్థకం చేసుకున్నాడు.
తెభా-4-645-వ.
మఱియు నమ్మహాత్ముండు విజ్ఞానియు, వర్ధితాశేషస్వానుసర్గుండును, బ్రజాపాలకుండును, స్థావర జంగమ వృత్తి దాయకుండును, సత్పురుష ధర్మవర్తనుండును, నిష్పాదితేశ్వరాదేశికుండును నైన పృథుం డొక్కనాఁడు దన వార్ధకంబు నీక్షించి నిజాత్మజ నాత్మజుల యందు నిలిపి ప్రజలు చింతాతుర చిత్తులగుచుండ నిజభార్యాసమేతుండై యప్రతిహత నియమంబున వైఖానస సమ్మతంబైన యుగ్రతపంబు నందుఁ బూర్వంబున దిగ్విజయ ప్రవృత్తుండగు చందంబునం బ్రవృత్తుండై తపోవనంబునకుం జని; యందు.
టీక:- మఱియున్ = ఇంకను; ఆ = ఆ; మహాత్ముండు = గొప్పవాడు; విజ్ఞానియు = మిక్కిలి జ్ఞానము కలవాడు; వర్ధిత = వృద్ధిచెందిన; అశేష = సమస్తమును; స్వ = తనే; అనుసర్గుండును = చేసినవాడును; ప్రజా = ప్రజలను; పాలకుండును = పరిపాలించెడివాడు; స్థావర = నిలకడగ నొకచోట చేసెడి; జంగమ = తిరుగుట అవసరమైనట్టి; వృత్తిన్ = జీవనోపాధులను; దాయకుండు = ఇచ్చువాడు; సత్పురుష = మంచివారి; ధర్మ = ధర్మమును; వర్తనుండు = ప్రవర్తించువాడు; నిష్పాదిత = విశిష్టముగ నిర్వహింపబడిన; ఈశ్వర = భగవంతుని; ఆదేశికుండునున్ = ఆజ్ఞలు కలవాడు; ఐన = అయిన; పృథుండు = పృథుచక్రవర్తి; ఒక్క = ఒక; నాడు = దినమున; తన = తన యొక్క; వార్ధక్యంబున్ = ముసలితనమును; ఈక్షించి = చూసి; నిజ = తన; ఆత్మజన్ = ఆలోచనను; ఆత్మజుల్ = పుత్రుల; అందున్ = అందు; నిలిపి = తెలిపి; ప్రజలు = లోకులు; చింత = దుఃఖముచే; ఆతుర = ఆతృతపడుతున్; చిత్తులు = మనసులు కలవారు; అగుచుండన్ = అగుతుండగా; నిజ = తన; భార్యా = భార్యతో; సమేతుండు = కూడినవాడు; ఐ = అయ్యి; అప్రతిహత = ఎదురులేని; నియమంబునన్ = నియమములతో; వైఖానస = వైఖానసులకు {వైఖానసులు - అడవిలో దుంపలు తిను నిష్ఠ కలవారు}; సమ్మతంబున్ = అంగీకారయొగ్యమైనది; ఐన = అయిన; ఉగ్ర = భయంకరమైన; తపంబున్ = తపస్సు చేయుట; అందున్ = అందు; పూర్వంబునన్ = ఇంతకు ముందు; దిగ్విజయ = దిగ్విజయము చేసెడి; ప్రవృత్తుండు = నడవడిక కలవాడు; అగు = అయిన; చందంబునన్ = విధమగు; ప్రవృత్తుండు = నడవడిక కలవాడు; ఐ = అయ్యి; తపోవనంబున్ = తపస్సుకైన అడవి; కున్ = కి; చని = వెళ్ళి; అందున్ = అక్కడ.
భావము:- ఇంకా మహానుభావుడు, విజ్ఞానవంతుడు అయిన పృథుచక్రవర్తి పట్టణాలను, పల్లెలను వృద్ధి పొందించాడు. చక్కగా ప్రజలను రక్షించాడు. అందరికీ వృత్తులను ఏర్పాటు చేసాడు. ధర్మాన్ని సంస్థాపించాడు. ఈ విధంగా ఈశ్వరాదేశమైన తన కర్తవ్యాన్ని నిర్వర్తించాడు. ఒకనాడు ఆ మహారాజు తనకు వార్ధక్యం వచ్చినదని గ్రహించి తన ప్రియపుత్రి వంటిదైన ధరిత్రిని కొడుకులకు అప్పగించాడు. ప్రజలు విచారంతో వీక్షిస్తూ ఉండగా భార్యాసహితుడై పూర్వం దిగ్విజయం చేయడానికి ఉత్సాహంతో ముందడుగు వేసినట్లే నిశ్చల నియమంతో వానప్రస్థులకు ఉచితమైన ఉగ్రతపస్సు ఆచరించటానికి ఉత్సాహంతో ముందంజ వేసి తపోవనానికి వెళ్ళాడు. అక్కడ…
తెభా-4-646-మత్త.
కందమూల ఫలాశియై బహుకాల ముగ్ర తపః పరి
స్పందుఁడై యటమీఁదటం దృణపర్ణ భక్షణ చేసి యా
చంద మేది జలాశి యై నృపసత్తముం డది మాని తా
మంద గంధవహాశి యయ్యెఁ గ్రమంబునన్ దృఢచిత్తుఁడై.
టీక:- కందమూల = కందదుంపలు; ఫల = పండ్లు; ఆశి = ఆహారముగ కలవాడు; ఐ = అయ్యి; బహు = చిర; కాలమున్ = కాలము; ఉగ్ర = భయంకరమైన; తపః = తపస్సును; పరిస్పందుడు = నిర్మించుకొన్నవాడు; ఐ = అయ్యి; అటమీదటన్ = ఆపైన; తృణ = గడ్డిపరకలు; పర్ణ = ఆకులు; భక్షణ = తినుట; చేసి = చేసి; ఆ = ఆ; చందమున్ = విధమును; ఏది = వదిలివేసి; జల = నీటిని; ఆశి = తినువాడు; ఐ = అయ్యి; నృప = రాజులలో; సత్తముండు = శక్తి కలవాడు; అది = దానిని; మాని = మానివేసి; తాన్ = అతను; మంద = మెల్లని; గంధవహ = గాలిని {గంధవాహుడు - వాసనలను మోసుకుపోయెడివాడు, వాయువు}; ఆశి = భుజించువాడు; అయ్యెన్ = అయ్యెను; క్రమంబునన్ = క్రమముగా; దృఢ = గట్టి; చిత్తుండు = నిర్ణయము కలవాడు; ఐ = అయ్యి.
భావము:- ఆ మహారాజు కందమూలాలను, పండ్లను ఆరగిస్తూ బహుకాలం ప్రచండమైన తపస్సు చేసాడు. ఆపైన తృణపర్ణాలను భక్షించాడు. ఆ తర్వాత నీళ్ళు మాత్రమే స్వీకరించాడు. ఆమీద కేవలం వాయు భక్షణం చేయసాగాడు. ఈ విధంగా మహోగ్రమైన తపస్సు చేసి మనస్సును గట్టి చేసుకున్నాడు.
తెభా-4-647-వ.
ఇట్లు వర్తించుచు.
టీక:- ఇట్లు = ఈ విధముగా; వర్తించుచు = ప్రవర్తించుతూ.
భావము:- ఈ విధంగా ఉంటూ…
తెభా-4-648-సీ.
మెండుగా మిటమిట మండు వేసవి యందుఁ-
దప్త పంచాగ్ని మధ్యమున నిలిచి
మానక జడిగొన్న వానకాలంబునఁ-
బైఁ గోక వేయక బయట నిలిచి
జనులు హూహూయను చలివేళఁ గుత్తుక-
బంటి తోయముల లోపల వసించి
శిశిరంబు చాల నల్దిశలఁ బర్వినవేళ-
వెలయ భూశయనుఁడై విశ్రమించి
తెభా-4-648.1-తే.
మహిత నియతిఁ దితిక్షా సమన్వితుండు
నియత పరిభాషణుఁడు జితానిలుఁడు దాంతుఁ
డిద్ధమతి యీశ్వరార్పిత బుద్ధి యనఘుఁ
డూర్ధ్వరేతస్కుఁడునునై క్రమోచితముగ.
టీక:- మెండుగ = మిక్కిలి; మిటమిట = మిటమిటమని; మండు = మండెడి; వేసవి = వేసంకాలము; అందున్ = లో; తప్త = మండుతున్న; పంచాగ్ని = పంచాగ్నుల {పంచాగ్నులు - 1దక్షిణాగ్ని కామాగ్ని వెన్నెముక దిగువ భాగమునకు (దక్షిణము)నకు చెందినది 2గార్హపత్యము ఆకలి ఉదరస్థానమైనది 3ఆహవనీయము జ్ఞానాగ్ని తలలోనుండును 4సథ్యము ప్రాణాగ్ని వక్షముననుండును 5అవసథ్యము ఆత్మాగ్ని ప్రకృతి నుండి తనను వేరుగ గుర్తింపజేయునది}; మధ్యమునన్ = మధ్యన; నిలిచి = నిలబడి; మానకన్ = వదలక; జడిగొన్న = జడివాన పడుతున్న; వానకాలంబునన్ = వానాకాలామునందు; పైగోక = పైపంచ; వేయక = ధరించకుండ; బయటన్ = బయలుప్రదేశమున; నిలిచి = నిలబడి; జనులు = లోకులు; హూహూయను = హూహూ అనుచువణకెడి; చలివేళన్ = చలికాలములో; కుత్తుకబంటి = గొంతులోతు; తోయముల = నీటి; లోపల = లోపల; వసించి = ఉండి; శిశిరంబున్ = ఆకురాలుకాలము; చాల = మిక్కిలి; నల్దిశలన్ = నాలుగుదిక్కుల; పర్విన = వ్యాపించిన; వేళ = సమయములో; వెలయన్ = ప్రసిద్దముగ; భూశయనుండు = నేలపైపండుకొనినవాడు; ఐ = అయ్యి; విశ్రమించి = నిద్రించి.
మహిత = గొప్ప; నియతిన్ = నియమములతో; తితిక్షా = ఓర్పు; సమన్వితుండు = కలవాడు; నియత = నియమింపబడిన; పరిభాషణుండున్ = సంభాషణుండు; జిత = జయించిన; అనిలుడున్ = (ప్రాణ) వాయువులు కలవాడు; దాంతుడున్ = ఇంద్రియనిగ్రహముకలవాడు; ఇద్ద = ప్రశస్తమైన; మతి = మనసుకలవాడు; ఈశ్వర = భగవంతునికి; అర్పిత = అర్పించబడిన; బుద్ధి = బుద్ధికలవాడు; అనఘుడు = పుణ్యుడు; ఊర్థ్వరేతస్కుడు = బ్రహ్మచర్యమునున్నవాడు {ఊర్థ్వరేతస్కుడు - పైకిప్రసరించినరేతస్సుకలవాడు, బ్రహ్మచర్యమునున్నవాడు}; ఐ = అయ్యి; క్రమ = క్రమముగా; ఉచితముగ = తగినట్లు.
భావము:- పృథుచక్రవర్తి ప్రచండమైన మండు వేసవిలో పంచాగ్నుల మధ్యలో నిలబడి తపస్సు చేసాడు. జోరున వర్షించే వానకారులో మీద బట్ట లేకుండా బయట నిలిచి తడుస్తూ తపస్సు చేసాడు. వడవడ వణికించే చలిలో కుత్తుకబంటి నీటిలో నివసించి తపించాడు. శిశిర ఋతువులో ముదిరిన చలిలో కటిక నేలమీద పరుండి ధ్యాననిమగ్ను డైనాడు. గొప్ప నియమంతో, ఓర్పుతో జితేంద్రియుడై మౌనవ్రతం అవలంభించి ఊర్ధ్వరేతస్కుడై వాయువును నిరోధించి ఈశ్వరార్పిత బుద్ధితో…
తెభా-4-649-వ.
అతి ఘోరం బయిన తపం బాచరించె; నివ్విధంబునం గ్రమానుసిద్ధం బయిన తపంబున విధ్వస్తాశేష కర్మమలాశయుండును బ్రాణాయామంబులచే జితారిషడ్వర్గుండును ఛిన్నబంధనుండును నై బురుషశ్రేష్ఠుం డైన పృథుచక్రవర్తి భగవంతుం డైన సనత్కుమారుం డెఱింగించిన యోగమార్గంబున సర్వేశ్వర భజనంబు గావించె; నిట్లు భగవద్ధర్మపరుండును సాధువర్తనుండును శ్రద్ధాసమన్వితుండును నైన పృథునకు నారాయణు నందు భక్తి, యనన్యవిషయంబై ప్రవృద్ధం బయ్యె; నవ్విధంబున.
టీక:- అతి = మిక్కిలి; ఘోరంబున్ = ఘోరము; అయిన = అయినట్టి; తపంబున్ = తపస్సును; ఆచరించెన్ = చేసెను; ఇవ్విధంబునన్ = ఈ విధముగా; క్రమ = క్రమబద్దముగ; అను = అనుసరింపబడుటచేత; సిద్ధంబున్ = సిద్ధించినది; అయిన = అయిన; తపంబునన్ = తపస్సులో; విధస్త = నాశనమైనట్టి; అశేష = సమస్తమైన; కర్మ = కర్మముల; మల = దోషములు; ఆశయుండును = కలవాడు; ప్రాణాయామంబుల = ప్రాణాయామములు; చేన్ = చేత; జిత = జయించిన; అరిషడ్వర్గుండును = అరిషడ్వర్గములు కలవాడు {అరిషడ్వర్గములు - 1కామ 2క్రోధ 3లోభ 4మోహ 5మద 6మాత్సర్యములు అనెడి శత్రువులు ఆరు గుంపులు}; ఛిన్న = తెగగొట్టబడిన; బంధనుండును = సంసారబంధాలు కలవాడు; ఐ = అయ్యి; పురుష = పురుషులలో; శ్రేష్ఠుండు = ఉత్తముడు; ఐన = అయిన; పృథుచక్రవర్తి = పృథుచక్రవర్తి; భగవంతుండు = మహామహిమాన్వితుండు; ఐన = అయిన; సనత్కుమారుండు = సనత్కుమారుండు; ఎఱింగించిన = తెలిపిన; యోగమార్గంబునన్ = యొగవిద్యాపద్ధతిలో; సర్వేశ్వర = నారాయణుని; భజనంబున్ = పూజించుట; కావించెన్ = చేసెను; ఇట్లు = ఈ విధముగా; భగవత్ = నారాయణుని; ధర్మ = భక్తి; పరుండునున్ = నిష్ఠకలవాడు; సాధు = మంచి, సాధువులవంటి; వర్తనుండును = నడవడికకలవాడు; శ్రద్ధా = శ్రద్ధతో; సమన్వితుండును = కూడినవాడు; ఐన = అయిన; పృథున్ = పృథుచక్రవర్తి; కున్ = కి; నారాయణున్ = నారాయణుని; అందున్ = ఎడల; భక్తిన్ = భక్తి; అనన్య = ఇతరములేని; విషయంబున్ = విషయము; ఐ = అయ్యి; ప్రవృద్ధంబున్ = వృద్ధిచెందినది; అయ్యెన్ = అయ్యెను; ఇవ్విధంబునన్ = ఈ విధముగా.
భావము:- అత్యంత ఘోరమైన తపస్సు ఆచరించాడు. ఈ విధంగా క్రమంగా ప్రాప్తించిన తపోమహిమ వల్ల సమస్త కర్మమాలిన్యాన్ని తొలగించుకొని చిత్తశుద్ధి పొందాడు. ప్రాణాయామం చేత అరిషడ్వర్గాన్ని జయించాడు. బంధ విముక్తుడైనాడు. పరమ యోగివరేణ్యుడైన సనత్కుమారుడు ఉపదేశించిన యోగమార్గాన్ని సంభావించి భగవంతుని సేవించాడు. ఈ విధంగా భగవద్భక్తిపరుడు, సాధువర్తనుడు, శ్రద్ధాసమన్వితుడు అయిన పృథుచక్రవర్తికి నానాటికి భగవంతునిపై అనన్యమైన భక్తి పరిఢవిల్లింది. ఆ విధంగా…
తెభా-4-650-క.
నరలోకోత్తర భగవ
త్పరిచర్యారాధనమునఁ బరిశుద్ధాంతః
కరణుండగు నా పృథునకు
సరసిరుహోదరు కథానుసంస్మరణమునన్.
టీక:- నరలోక = మానవులు అందరిలోకి; ఉత్తర = గొప్పవాడా; భగవత్ = నారాయణుని; పరిచర్యా = సేవిండెడి; ఆరాధననన్ = పూజించుట వలన; పరిశుద్ధ = పరిశుద్ధమైన; అంతఃకరణుండు = ఆత్మ కలవాడు; అగు = అయిన; ఆ = ఆ; పృథున్ = పృథుచక్రవర్తి; కున్ = కి; సరసిహోదరున్ = నారాయణుని; కథా = కథలను; అనుసంస్మరణమునన్ = ధ్యానించుటచేత.
భావము:- విదురా! భగవత్పరిచర్య చేత, ఆరాధనం చేత పృథుచక్రవర్తి అంతఃకరణం పరిశుద్ధమయింది. నిరంతర హరికథా సంస్మరణం చేత…
తెభా-4-651-క.
పరిపూర్ణంబగు భక్తిని
గర మనిశము సంశయాత్మకంబై చాలన్
వఱలిన హృదయగ్రంథిని
నిరసించు విరక్తి యుత మనీష జనించెన్.
టీక:- పరిపూర్ణంబు = పరిపూర్ణము; అగు = ఐన; భక్తిని = భక్తిని; కరము = మిక్కిలి; అనిశమున్ = ఎల్లప్పుడు; సంశయ = అనుమానాస్పద; ఆత్మకంబు = దృక్పథము కలవారు; ఐ = అయ్యి; చాలన్ = మిక్కిలి; వఱలిన = ప్రవర్తిల్లిన; హృదయ = హృదయము నందలి; గ్రంథిని = ముడిని; నిరసించు = తిరస్కరించెడి, విడిచెడి; విరక్తి = వైరాగ్యముతో; యుత = కూడిన; మనీష = ప్రజ్ఞ, నేర్పు; జనించెన్ = పుట్టినది.
భావము:- పరిపూర్ణమైన భక్తి ప్రభవించింది. ఆ భక్తి ప్రభావం వల్ల సంశయాలకు ఆశ్రయమైన హృదయగ్రంథి విచ్ఛిన్నమై విరక్తితో కూడిన విజ్ఞానం ఉదయించింది.
తెభా-4-652-వ.
దానం జేసి యతండు సంఛిన్న దేహాత్మజ్ఞానుండు నధిగతాత్మ స్వరూ పుండునునై గదాగ్రజుం డయిన శ్రీకృష్ణుని కథాసక్తి నొంది సమస్త యోగ సిద్ధులందు నిస్పృహుం డగుటను హృదయగ్రంథి విచ్ఛేదకం బయిన జ్ఞానయోగంబును విడిచి యాత్మయందు నాత్మయోగంబుఁ గావించి బ్రహ్మభూతుండయి నిజకళేబరంబు విడువ నిశ్చయించి.
టీక:- దానన్ = దాని; చేసి = వలన; అతండు = అతడు; సంఛిన్న = పూర్తిగా తెగగొట్టబడిన; దేహాత్మ = దేహమే ఆత్మ అనెడి; జ్ఞానుండున్ = జ్ఞానము కలవాడు; అధిగత = తెలిసికొనబడిన; ఆత్మ = ఆత్మ (తన) యొక్క; స్వరూపుండున్ = స్వరూపము కలవాడు; ఐ = అయ్యి; గదా = బలరాముడు అను {గదా - గదను ధరించినవాడు, బలరాముడు}; అగ్రజుండు = అన్న కలవాడు; అయిన = అయిన; శ్రీకృష్ణుని = శ్రీకృష్ణుని; కథా = కథల యందు; ఆసక్తిన్ = అనురక్తిని; ఒంది = పొంది; సమస్త = సమస్తమైన; యోగ = యోగమువలన కలిగెడి; సిద్ధులు = సిద్ధించెడివాని; అందున్ = ఎడల; నిస్పృహుండు = నిరాసక్తుడు; అగుటనున్ = అగుటచేత; హృదయ = హృదయము నందలి; గ్రంథి = ముడి; విచ్ఛేదకంబున్ = పూర్తిగా తెగగొట్టబడినది; అయినన్ = అయిన; జ్ఞానయోగంబును = జ్ఞానయోగమును; విడిచి = విడిచిపెట్టి; ఆత్మ = ఆత్మను; ఆత్మ = ఆత్మ యందు; యోగంబున్ = కలిసినదిగా; కావించి = చేసి; బ్రహ్మభూతుండు = తానే బ్రహ్మ ఐనవాడు; అయి = అయ్యి; నిజ = తన; కళేబరంబున్ = కళేబరమును {కళేబరము - ప్రాణము మినహా శరీరము}; విడువన్ = విడుచుటకు; నిశ్చయించి = నిశ్చయించుకొని.
భావము:- అటువంటి జ్ఞానోదయం వల్ల ఆయనకు దేహాత్మబుద్ధి నశించింది. ఆత్మ స్వరూపం అవగతం అయింది. శ్రీహరి కథలలో ఆసక్తి కలిగిన వారికి యోగసిద్ధులందు ఆసక్తి ఉండదు. హృదయగ్రంథి విచ్ఛేదకమైన జ్ఞానయోగం ప్రాప్తించిన తరువాత ఆత్మయందు ఆత్మానుసంధానం చేసి కేవలం బ్రహ్మభూతుడై నిజశరీరాన్ని విఢిచిపెట్టటానికి నిశ్చయించుకొని…
తెభా-4-653-సీ.
కోరి మడమలచే గుదపీడనము చేసి-
పూని యుక్తాసనాసీనుఁ డగుచుఁ
దనరు మూలాధారమున నుండి వాయువు-
నొయ్యన నెగయించి యొనర నాభి
కలితంబు గావించి క్రమమున హృద్వత్స-
కంఠ శిరః కోష్ఠకములఁ జేర్చి
కైకొని మూర్ధభాగమునకు నెగయించి-
ప్రాణముల్ విడిచి యా పవనుఁ బవను
తెభా-4-653.1-తే.
నందు నాకాశ మాకాశమందుఁ దేజ
మందుఁ దేజంబు నుదకంబునందు నుదక
మర్థిఁ గాయంబు మేదిని యందుఁ గలిపెఁ
బూని వాని యధోచితస్థానములుగ.
టీక:- కోరి = పూని; మడమల = కాలిమడమల; చేన్ = చేత; గుద = గుదస్థానమును; పీడనము = ఒత్తుట; చేసి = చేసి; పూని = సిద్ధించిన; యుక్త = ఉచిత; ఆసన = యోగాసనమున; ఆసీనుడు = కూరచున్నవాడు; అగుచున్ = అగుచు; తనరున్ = అతిశయించెడి; మూలాధార = మూలాధారచక్రము; నుండి = నుండి; వాయువున్ = వాయువును; ఒయ్యనన్ = శ్రీఘ్రమే; ఎగయించి = పైకి నెట్టి; ఒనరన్ = చక్కగా; నాభిన్ = నాభిని; కలితంబున్ = కలిసినదిగా; కావించి = చేసి; క్రమమున = క్రమముగా; హృత్ = హృదయము (గుండెకాయ); వక్ష = వక్షస్థలము; కంఠ = కంఠము; శిరః = శిరస్సు; కోష్టకములన్ = కపాలములకు; చేర్చి = చేర్చి; కైకొని = పూని; మూర్థ = మాడు; భాగమున్ = భాగమున; కున్ = కు; ఎగయించి = ఎక్కించి; ప్రాణముల్ = ప్రాణములను; విడిచి = విడిచి; ఆ = ఆ; పవనున్ = ప్రాణవాయువును; పవనున్ = వాయువు; అందున్ = అందు; ఆకాశమున్ = ఆకాశమును; ఆకాశము = ఆకాశము; అందున్ = అందు; తేజము = తేజము; అందున్ = అందు; తేజంబున్ = తేజమును; ఉదకంబున్ = నీటి; అందున్ = అందు; ఉదకమున్ = నీటిని; అర్థిన్ = కోరి; కాయంబున్ = శరీరమును.
= = మేదిని = భూమి; అందున్ = అందు; కలిపెన్ = కలిపెను; పూని = ధరించి; వానిన్ = వాటిని; యథా = ఆయా; ఉచిత = తగిన; స్థానములుగా = తావులుగా.
భావము:- చీలమండల చేత గుదస్థానాన్ని పీడించి ముక్తాసనంలో ఆసీను డయ్యాడు. మూలాధారం నుండి వాయువును మెల్లగా పైకి లేపి నాభిస్థానంలోని మణిపూరక చక్రంలో నిలిపాడు. అక్కడి నుండి క్రమంగా హృదయస్థానంలోని అనాహత చక్రంలోనికి, అక్కడి నుండి కంఠానికి దిగువన ఉన్న విశుద్ధ చక్రంలోనికి, అక్కడి నుండి భ్రూమధ్యంలో ఉన్న ఆజ్ఞాచక్రంలోనికి ప్రవేశపెట్టాడు. అనంతరం క్రమంగా మూర్ధభాగంలోని బ్రహ్మరంధ్రం లోనికి చేర్చాడు. ఆ తర్వాత పంచభూతాలను విభజించి ప్రాణవాయువును బాహ్యవాయువు నందు ఏకం చేసాడు.
తెభా-4-654-వ.
మఱియు భూమి నుదకంబునందును, నుదకంబును దేజమందుఁ, దేజంబును వాయువున, వాయువు నాకాశంబునందు,నాకాశంబును మనంబున, మనంబు నింద్రియంబుల, నింద్రియంబుల తన్మాత్రలఁ, దన్మాత్రల భూతాదియైన యహంకారంబు నందు, నహంకారంబు మహత్తత్త్వంబు నందును గూర్చి, యట్టి సర్వకార్యహేతుభూతం బైన మహత్తత్వంబును జీవోపాధిభూతంబయిన ప్రకృతి యందుఁ గలిపి జీవభూతుం డయిన పృథుండు జ్ఞాన వైరాగ్యంబులచేత బ్రహ్మనిష్ఠుండై మాయోపాధిం బాసి ముక్తుండయ్యె;"నని చెప్పి వెండియు నిట్లనియె.
టీక:- మఱియున్ = ఇంకను; భూమిన్ = భూమిని; ఉదకంబున్ = నీటి; అందున్ = లోను; ఉదకంబునున్ = నీటిని; తేజము = తేజము; అందున్ = లోను; తేజంబున్ = తేజమును; వాయువునన్ = గాలిలోను; వాయువున్ = గాలిని; ఆకాశంబున్ = ఆకాశము; అందున్ = లోను; ఆకాశంబునున్ = ఆకాశమును; మనంబునన్ = మనసు నందు; మనంబున్ = మనసును; ఇంద్రియంబులన్ = ఇంద్రియము లందు; ఇంద్రియంబులన్ = ఇంద్రియములను; తన్మాత్రలన్ = తన్మాత్రలలోను; తన్మాత్రలన్ = తన్మాత్రలను; భూత = భూతములలో {భూతములు - 1అహంకారము 2మహత్తు మరియు పంచభూతములు(5)}; ఆది = మొదటిది; ఐన = అయిన; అహంకారంబున్ = అహంకారము; అందున్ = అందును; అహంకారంబున్ = అహంకారమును; మహత్తత్త్వంబున్ = మహత్తత్త్వము; అందున్ = లోను; కూర్చి = కలిపి; అట్టి = అటువంటి; సర్వ = సకల; కార్య = కార్యములకు; హేతుభూతంబున్ = కారణమైనది; ఐన = అయిన; మహత్తత్త్వంబున్ = మహత్తత్త్వమును; జీవ = జీవమునకు; ఉపాధిభూతంబున్ = ఆధారమైనది; అయిన = అయిన; ప్రకృతి = ప్రకృతి; అందున్ = లో; కలిపి = కలిపి; జీవభూతుండున్ = జీవుడు ఐపోయినవాడు; అయిన = అయిన; పృథుండు = పృథువు; జ్ఞాన = జ్ఞానము; వైరాగ్యంబుల్ = వైరాగ్యముల; చేతన్ = వలన; బ్రహ్మ = పరబ్రహ్మము యందు; నిష్ఠుండు = స్థితుండు; ఐ = అయ్యి; మాయోపాధిన్ = మాయకు నాధారములను (బంధనములను); పాసి = విడిచిపెట్టి; ముక్తుండు = ముక్తిని పొందినవాడు; అయ్యెన్ = అయ్యెను; అని = అని; చెప్పి = చెప్పి; వెండియున్ = మరల; ఇట్లు = ఈ విధముగ; అనియె = పలికెను.
భావము:- అదే విధంగా ఆకాశాన్ని ఆకాశమందు, తేజస్సును తేజస్సునందు, జలాన్ని జలమందు, పార్థివ శరీరాన్ని పృథివియందు కలిపివేశాడు. పంచభూతాల ఉత్పత్తి క్రమానుసారం భూమిని జలంలోను, జలాన్ని తేజస్సులోను, తేజస్సును వాయువులోను, వాయువును ఆకాశంలోను, ఆకాశాన్ని మనస్సులోను, మనస్సును ఇంద్రియాలలోను, ఇంద్రియాలను తన్మాత్రలలోను, తన్మాత్రలను అహంకారంలోను, అహంకారాన్ని మహత్తత్త్వంలోను ఏకం చేసాడు. ఆ మహత్తత్త్వాన్ని ప్రకృతిలో కలిపివేశాడు. ఈ ప్రకారం పృథుచక్రవర్తి జ్ఞాన వైరాగ్యాల ప్రభావంతో మాయోపాధిని విడిచిపెట్టి బ్రహ్మనిష్ఠుడై ముక్తుడైనాడు” అని చెప్పి ఇంకా ఇలా అన్నాడు.
తెభా-4-655-సీ.
అంత నా పృథుని భార్యామణి యగు నర్చి-
పుడమిపై వడి నడుగిడినఁ గందు
సుకుమారపాదాబ్జ సుందరీరత్నంబు-
నతుల పతివ్రత యగుటఁజేసి
యాత్మేశకృత సువ్రతాచరణంబును-
సుమహిత భక్తి శుశ్రూషణమును
నార్షేయ మగు దేహయాత్రయు నను వీని-
చేత మిక్కిలిఁ గృశీ భూత దేహ
తెభా-4-655.1-తే.
యయ్యుఁ బ్రియనాథ కృత కరుణావలోక
కరతలస్పర్శనాది సత్కారములను
నబల సుఖవృత్తిఁ జెంది య య్యడవులందుఁ
గృశత మదిఁ దోఁపకుండఁ జరించు నపుడు.
టీక:- అంతన్ = అంతట; ఆ = ఆ; పృథునిన్ = పృథువు యొక్క; భార్యామణి = రత్నమువంటి భార్య; అగు = అయిన; అర్చి = అర్చి; పుడమి = భూమి; పైన్ = మీద; వడిన్ = వేగముగ; అడుగిడినన్ = అడుగులేస్తే; కందు = కందిపోయే; సుకుమార = సుకుమారమైన; పాద = పాదములు అనెడి; అబ్జన్ = పద్మములు కలామెను; సుందరీ = సుందరిలయందు; రత్నంబున్ = రత్నమువంటిది; అతుల = సాటిలేని; పతివ్రత = పతివ్రత; అగుటన్ = అగుట; చేసి = వలన; ఆత్మ = తన; ఈశ = భర్త; కృత = చేయబడిన; సు = చక్కటి; వ్రత = దీక్షల; ఆచరణంబునున్ = ఆచరించుట; సు = మంచి; మహిత = గొప్ప; భక్తిన్ = భక్తి; శుశ్రూషణమును = పరిచర్యలు; ఆర్షేయము = ఋషులమార్గము; అగు = వంటి; దేహయాత్రయున్ = జీవనశైలి; అను = అనెడి; వీని = వీటి; చేతన్ = వలన; మిక్కిలిన్ = మిక్కిలిగా; కృశీభూత = చిక్కపోయిన; దేహ = శరీరముకలది.
అయ్యున్ = అయినప్పటికిని; ప్రియ = కూర్మికల; నాథ = భర్తచే; కృత = చేయబడిన; కరుణ = దయతో; అవలోక = చూచుట; కరతల = అరచేత; స్పర్శ = తాకుట; ఆది = మొదలగు; సత్కారములను = గౌరవములవలన; అబల = స్త్రీ {అబల - బలము లేనిది, స్త్రీ}; సుఖ = సుఖముగనున్న; వృత్తిన్ = భావమును; చెంది = చెంది; ఆ = ఆ; అడవుల్ = అడవుల; అందున్ = లో; కృశతన్ = చిక్కిపోవుటను; మదిన్ = మనసులో; తోపకుండన్ = తలచుకొనకుండగ; చరించున్ = తిరుగును; అపుడున్ = అప్పుడు.
భావము:- పృథుచక్రవర్తి భార్య అయిన అర్చిమహాదేవి పుడమిపై అడుగు ఉంచితే కందిపోయే పాదారవిందాలు, సౌందర్య సౌకుమార్యాలు కల ముద్దరాలు. సాటిలేని మహాపతివ్రత. భర్త యొక్క వ్రత నియమాలతో, పతి శుశ్రూషతో, తపోమయ జీవనంతో ఆమె కోమల శరీరం కృశించిపోయింది. అయినప్పటికీ ప్రాణనాథుని ప్రసన్న వీక్షణాలు, అనురాగమయ కరస్పర్శలు మొదలైన ఆదరాభిమానాల వల్ల ఆనందపడుతూ ఆ అడవిలో కష్టాలన్నీ మరచిపోయి కాలం గడిపింది. అప్పుడు…
తెభా-4-656-క.
తన మనమున నే దుఃఖము
ననయంబు నెఱుంగనట్టి యర్చి నిజాధీ
శుని ప్రాణరహిత దేహము
గనుఁగొని విలపించి విగతకౌతుక యగుచున్.
టీక:- తన = తన యొక్క; మనమునన్ = మనసులో; ఏ = ఏ; దుఃఖమున్ = దుఃఖమును; అనయంబున్ = ఎప్పుడును; ఎఱుంగన్ = తెలియని; అట్టి = అటువంటి; అర్చి = అర్చి; నిజ = తన; అధీశునిన్ = భర్త యొక్క; ప్రాణ = ప్రాణములు; రహిత = లేని; దేహమున్ = కళేబరమును; కనుగొని = పొడగని; విలపించి = పెద్దగా ఏడ్చి; విగత = విడిచిన; కౌతుక = సంతోషము, కోరిక కలది; అగుచున్ = అవుతూ.
భావము:- ఏనాడూ ఆమె దుఃఖం అన్నమాట ఎరుగదు. ఈనాడు ప్రాణంలేని భర్త శరీరాన్ని చూచి గోడుగోడున విలపించింది. ఆమె తన సంతోషం అంతరించగా…
తెభా-4-657-సీ.
మానిత మందర సానుప్రదేశంబు-
నందుఁ జితారోప మర్థిఁ జేసి
లలిత మహానదీ సలిల సుస్నాతయై-
కలిత మహోదార కర్ముఁ డయిన
నాథున కుదకదానక్రియల్ గావించి-
యతిభక్తి సురలకు నతు లొనర్చి
వహ్నికి ముమ్మాటు వలగొని పతిపాద-
కమల యుగంబుఁ జిత్తమున నిలిపి
తెభా-4-657.1-తే.
వీరవరుఁడైన పృథు పృథివీతలేశు
నందు ననుగమనము చేయునట్టి సాధ్వి
నర్చిఁ గనుఁగొని దేవాంగనాళి యప్పు
డాత్మనాథులఁ గూడి నెయ్యంబుతోడ.
టీక:- మానిత = మన్నింపదగిన; మందర = మందరపర్వత; సాను = కొండచరియ; ప్రదేశంబున్ = ప్రదేశము; అందున్ = లో; చితిన్ = చితిని; ఆరోపమున్ = నిర్మించి; అర్థిన్ = కోరి; చేసి = చేసి; లలిత = చక్కటి; మహా = పెద్ద; నదీ = నదియొక్క; సలిలన్ = నీటిలో; సు = చక్కగా; స్నాత = స్నానముచేసినది; ఐ = అయ్యి; కలిత = చేసిన; మహా = గొప్ప; ఉదార = విస్త్రుతమైన; కర్ముడు = వేదకర్మలు చేసినవాడు; అయిన = అయిన; నాథున్ = భర్త; కున్ = కి; ఉదకదాన = తర్పణ; క్రియల్ = క్రియలు; కావించి = ఆచరించి; అతి = మిక్కిలి; భక్తిన్ = భక్తితో; సురల్ = దేవతల; కున్ = కి; నతులు = స్తోత్రములు; ఒనర్చి = చేసి; వహ్ని = అగ్ని; కిన్ = కి; ముమ్మాటు = మూడు (3) మార్లు; వలగొని = ప్రదక్షిణచేసి; పతి = భర్తయొక్క; పాద = పాదములు అనెడి; కమల = పద్మముల; యుగమున్ = జంటను; చిత్తమునన్ = మనసులో; నిలిపి = నిలిపికొని.
వీర = వీరులలో; వరుడున్ = ఉత్తముడు; ఐన = అయిన; పృథు = పృథువు అనెడి; పృథివీతలేశు = రాజు {పృథివీతలేశుడు - పృథివీతలము (భూమి)కి ఈశుడు, రాజు}; అందున్ = తోటి; అనుగమనంబున్ = సహగమనము; చేయున్ = చేసెడి; అట్టి = అటువంటి; సాధ్వి = స్త్రీ {సాధ్వి - సాధుస్వభావము కలామె, స్త్రీ}; అర్చిన్ = అర్చిని; కనుగొని = చూసి; దేవ = దేవతా; అంగన = స్త్రీల; ఆళి = సమూహము; అప్పుడు = అప్పుడు; ఆత్మ = తమ; నాథులన్ = భర్తలను; కూడి = కలిసుండి; నెయ్యంబున్ = కూర్మి; తోడన్ = తోటి.
భావము:- ఆ మహాసాధ్వి మందరపర్వతం చరియలలో చితిని సిద్ధపరిచింది. నదీజలాలలో స్నానం చేసి వచ్చింది. పతికి ఉదక తర్పణం కావించింది. మిక్కిలి భక్తితో దేవతలకు నమస్కరించింది. చితికి అగ్ని ముట్టించింది. మండుతున్న అగ్నికి మూడుసార్లు ప్రదక్షిణం చేసింది. మహావీరుడైన పతిదేవుని పాదపద్మాలను మనస్సులో ధ్యానిస్తూ సహగమనం చేసింది. పతితో చితిమీద సహగమనం చేస్తున్న ఆ పరమ సాధ్విని వేలకొలది దేవతాకాంతలు తమ భర్తలతో కూడి తిలకించి పులకించారు.
తెభా-4-658-క.
పరమోత్కంఠను నమ్మం
దరగిరి సానుప్రదేశతలమున వరుసం
గురియించిరి నవ సురభిత
వర మందారప్రసూన వర్షము లంతన్.
టీక:- పరమ = అత్యధికమైన; ఉత్కంఠను = ఉత్సుకతతో; ఆ = ఆ; మందరగిరి = మందరపర్వతము యొక్క; సాను = కొండచరియల; ప్రదేశ = ప్రాంత; తలంబునన్ = స్థలములు అందు; వరుసన్ = వరుసగా; కురియించిరి = కురిపించిరి; నవ = సరికొత్త; సురభిత = సువాసనలుకలిగిన; వర = మంచి; మందార = మందార; ప్రసూన = పువ్వుల; వర్షములు = వర్షములు; అంతన్ = అంతట.
భావము:- అతిశయించిన కుతూహలంతో మందరపర్వత సానుప్రదేశాల నిండా క్రొత్త నెత్తావులు వెదజల్లే మందార పుష్ప వర్షాన్ని ఎడతెగకుండా కురిపించారు.
తెభా-4-659-క.
తరమిడి యచ్చర లాడిరి
మొరయించిరి శంఖతూర్యములు దివిజులు పా
డిరి కిన్నరజనులు పర
స్పర నుతు లొనరించి రా సుపర్వాంగనలున్.
టీక:- తరమిడి = వెంటవెంటనే; అచ్చరలు = అప్సరసలు; ఆడిరి = నాట్యము లాడిరి; మొరయించిరి = మోయించిరి; శంఖ = శంఖములు; తూర్యములున్ = మంగళవాద్యములను; దివిజులు = దేవతలు; పాడిరి = గీతములు పాడిరి; కిన్నరజనులు = కిన్నరులు; పరస్పర = ఒకరి నొకరు; నుతులు = స్తోత్రములు; ఒనర్చిరి = చేసుకొనిరి; ఆ = ఆ; సుపర్వ = దేవతా; అంగనలున్ = స్త్రీలు {అంగన - అంగములు (అవయవములు) చక్కగ ఉన్న ఆమె}.
భావము:- అప్సరసలు నాట్యం చేశారు. దేవతలు శంఖాలు పూరించి మంగళ వాద్యాలు మ్రోగించారు. కిన్నరులు గానం చేశారు. సురసుందరీ మణులు స్తుతించారు.
తెభా-4-660-వ.
మఱియు నిట్లనిరి.
టీక:- మఱియున్ = ఇంకను; ఇట్లు = ఈ విధముగ; అనిరి = పలికిరి.
భావము:- ఇంకా ఇలా అన్నారు.
తెభా-4-661-సీ.
చర్చింప నిట్టి యాశ్చర్య మెందేనియుఁ-
గనుఁగొంటిరే యర్చి యను లతాంగి
ధన్యాత్మురాల్ గదా తన విభుతోఁ గూడి-
యిందిరా రమణి యజ్ఞేశుఁ గూడి
వెనుచను కైవడి ననుగమనము చేసె-
ని య్యమ నిజహృదయేశుఁ డయిన
ఘను వైన్యు నూర్ధ్వలోకమ్మును బొందును-
నేఁ డింతపట్టును నిశ్చితంబు
తెభా-4-661.1-తే.
పరమ యోగీంద్రులకు దుర్విభావ్యమైన
దృఢ సుకర్మమువలన నతిక్రమించి
వైన్య భూమీశు వెనుచని వరుస నూర్ధ్వ
గామినియు నయ్యె నీ యింతి ఘనత నొంది.
టీక:- చర్చింపన్ = చర్చించిచూసినచో; ఇట్టి = ఇటువంటి; ఆశ్చర్యము = విచిత్రము; ఎందేనియున్ = ఎక్కడయినను; కనుగొంటిరే = చూసేరా; అర్చి = అర్చి; అను = అనెడి; లతాంగి = స్తీ {లతాంగి - లతవలె సన్నని అంగి (దేహము కలామె)}; ధన్యాత్మురాలు = సార్థకమైనామె; కదా = కదా; తన = తన యొక్క; విభున్ = భర్త; తోన్ = తోటి; కూడి = కలిసి; ఇందిరారమణి = లక్ష్మీదేవి; యజ్ఞేశున్ = విష్ణుమూర్తిని; కూడి = కలసి; వెను = వెనకనే; చను = వెళ్ళెడి; కైవడి = విధముగ; అనుగమనము = సహగమనము; చేసెన్ = చేసెను; ఈ = ఈ; అమ = అమ్మ; నిజ = తన యొక్క; హృదయ = హృదయమునకు; ఈశుడు = ప్రభువు; అయిన = అయిన; ఘనున్ = గొప్పవానిని; వైన్యున్ = పృథువును; ఊర్థ్వలోకమ్మునున్ = పైలోకములను; పొందును = పొందును; నేడు = నేడు; ఇంత = ఇది; పట్టును = మట్టుకు, మాత్రము; నిశ్చితంబు = తప్పదు.
పరమ = అత్యుత్తమ; యోగి = యోగులలో; ఇంద్రుల్ = ఇంద్రినివంటివారి; కిన్ = కి; దుర్విభావ్యము = భావింపరాని; ఐన = అయిన; దృఢ = గట్టి; సుకర్మము = పుణ్యకార్యము; వలనన్ = వలన; అతిక్రమించి = అతిశయించి; వైన్య = పథు; భూమీశున్ = చక్రవర్తిని; వెను = వెంట; చని = వెళ్లి; వరుసన్ = క్రమముగా; ఊర్థ్వగామినియున్ = పైలోకములుపోవునామె; అయ్యెన్ = అయ్యెను; ఈ = ఈ; ఇంతి = స్త్రీ; ఘనతన్ = గొప్పదనమును; ఒంది = పొంది.
భావము:- ఇంతటి వింత మనం ఎక్కడా చూడలేదు. ఈ అర్చి పుణ్యాత్మురాలు. లక్ష్మీదేవి విష్ణుదేవుని అనుసరించినట్లు తన పతిని ఈ మహాసాధ్వి అధిగమించింది. తన భర్తతో పాటు పుణ్యలోకాలకు ఈమె తప్పకుండా వెళ్ళుతుంది. ఇది ముమ్మాటికి నిజం. పరమ యోగీంద్రులకు కూడా సాధ్యం కాని పవిత్ర ప్రవర్తనం వల్ల ఈ వధూమణి పృథు చక్రవర్తిని అనుసరించి అనన్య సామాన్యంగా ఊర్ధ్వలోకాలకు వెళ్ళిపోతున్నది.
తెభా-4-662-వ.
కాన పతివ్రతలకు నసాధ్యం బెందునుం గలదే?"యని మఱియును.
టీక:- కాన = కనుక; పతివ్రతల్ = పతివ్రతల {పతివ్రత - పతినే దైవముగా వ్రతముగా నిష్ఠకలయామె}; అసాధ్యంబున్ = అసాధ్యమైనది; ఎందునున్ = ఎక్కడను; కలదే = కలదా ఏమి (లేదు); అని = అని; మఱియున్ = ఇంకను.
భావము:- అవును, పతివ్రతలకు సాధ్యం కానిది ఎక్కడైనా ఉన్నదా” అని పలికి ఇంకా…
తెభా-4-663-క.
‘పరికింపఁగనే మనుజుఁడు
హరి పదమును బొందఁ జేయునట్టి వివేక
స్ఫురణం దనర్చు వానికిఁ
బరువడి నిలఁ బొందరాని పదముం గలదే?
టీక:- పరికింపన్ = విచారించిన; ఏ = ఏ; మనుజుడు = మానవుడు {మనుజుడు - మనువు యొక్క వంశము వారు}; హరి = విష్ణుమూర్తి; పదమునున్ = పాదములను; పొందజేయున్ = పోందజేసెడిది; అట్టి = అయినట్టి; వివేక = జ్ఞానమును; స్ఫురణన్ = తోచటచే; తనర్చు = అతిశయించు; వానికిన్ = వానికి; పరువడిన్ = క్రమముగ; పొందరాని = పొందరాని; పదమున్ = స్థానము; కలదే = కలదా ఏమి (లేదు).
భావము:- “శ్రీహరి స్థానాన్ని అందించే ఉత్తమ జ్ఞానాన్ని సంపాదించిన పుణ్యాత్ములకు పొందరాని స్థానం అంటూ లేదు
తెభా-4-664-తే.
అట్టి యపవర్గ సాధనమైన మనుజ
భావ మొందియు విషయ సంబద్ధుఁ డగుచు
వసుధ నెవ్వఁడు వర్తించు వాఁడు ధరణి
ననయము నిజాత్మవంచకుఁ డనఁగ బరఁగు.
టీక:- అట్టి = అటువంటి; అపవర్గ = మోక్షమును పొందుటకు; సాధనమున్ = పరికరము వంటిది; ఐన = అయిన; మనుజ = మానవ; భావము = జన్మము; ఒందియున్ = పొందినప్పటికిని; విషయ = ఇంద్రియార్థములకు; సంబద్ధుడు = మిక్కిలి బంధింపబడినవాడు; అగుచున్ = అవుతూ; వసుధన్ = లోకమున; ఎవ్వడు = ఎవడైతే; వర్తించున్ = ప్రవర్తించునో; వాడు = వాడు; ధరణిన్ = లోకమున; అనయమున్ = అవశ్యము; నిజ = తను; ఆత్మన్ = తననే; వంచకుడు = వంచించుకొనెడివాడు; అనన్ = అనగా; పరగున్ = ప్రసిద్ద మగును.
భావము:- అటువంటి మోక్షానికి సాధనమైన మనుష్య జన్మ ఎత్తి కూడా విషయ బంధాలలో తగుల్కొని ప్రవర్తించేవాడు తనను తాను మోసగించుకొని ఆత్మవంచకు డౌతున్నాడు”
తెభా-4-665-క.
అని వారలు దన్నర్థిని
వినుతింపఁగ నర్చి యాత్మవిభు వెనువెంటం
జని యచ్యుతలోకంబున
ననుపమ విభవమును బొందె" నని విదురునకున్.
టీక:- అని = అని; వారలు = వారు; తన్నున్ = తనను; అర్థిన్ = కోరి; వినుతింపన్ = స్తుతించగా; అర్చి = అర్చి; ఆత్మ = తన; విభున్ = భర్త; వెనువెంటన్ = వెనువెంట; చని = వెళ్ళి; అచ్యుతలోకంబున్ = వైకుంఠమున {అచ్యుత లోకము - అచ్యుతుని (వైకుంఠుని) లోకము, వైకుంఠము}; అనుపమ = సాటిలేని; విభవమునున్ = వైభవములను; పొందెన్ = పొందెను; అని = అని; విదురున్ = విదురుని; కున్ = కి.
భావము:- అని ఈ విధంగా దేవతలు తనను కొనియాడుతుండగా అర్చి మహాదేవి తన పతియైన పృథుచక్రవర్తి పొందిన విశేష వైభవోపేతమైన విష్ణులోకాన్ని పొందింది” అని విదురునకు….
తెభా-4-666-క.
మునివరుఁడగు మైత్రేయుఁడు
వినయంబున నెఱుఁగఁ జెప్పి వెండియుఁ దగ ని
ట్లను "నమ్మహానుభావుం
డనఘుఁడు భగవద్వరుండు నగుఁ బృథుఁ డనఘా!
టీక:- ముని = మునులలో; వరుడున్ = ఉత్తముడు; అగు = అయిన; మైత్రేయుడు = మైత్రేయుడు; వినయంబునన్ = వినయముతో; ఎఱుగన్ = తెలియ; చెప్పి = చెప్పి; వెండియున్ = ఇంకను; తగన్ = అవశ్యము; ఇట్లు = ఈ విధముగ; అనున్ = అనెను; ఆ = ఆ; మహానుభావుండు = గొప్పవాడు; అనఘుడు = పుణ్యుడు; భగవత్ = భగవంతునికి; వరుండున్ = ఇష్ఠుడు; అగు = అయిన; పృథుడు = పృథుచక్రవర్తి; అనఘా = పుణ్యుడా.
భావము:- మైత్రేయ మహర్షి వివరించి చెప్పి మళ్ళీ ఇలా అన్నాడు “పృథుచక్రవర్తి మహానుభావుడు, పాపరహితుడు, పరమ భాగవతుడు.
తెభా-4-667-క.
ఏ నీ కిప్పుడు చెప్పితి
మానుగ నీ పుణ్యకథను మహితశ్రద్ధా
ధీనుండై విస్ఫుర దవ
ధానుండై యెవ్వఁడేనిఁ దనరిన భక్తిన్.
టీక:- ఏన్ = నేను; నీ = నీ; కున్ = కు; ఇప్పుడు = ఇప్పుడు; చెప్పితి = చెప్పితిని; మానుగన్ = మనోజ్ఞముగ; ఈ = ఈ; పుణ్య = పుణ్యవంతమైన; కథను = కథను; మహిత = గొప్ప; శ్రద్ధా = శ్రధ్ద; ఆధీనుండు = కలిగినవాడు; ఐ = అయ్యి; విస్ఫురత్ = వికసించిన; అవధానుండు = ధారణ కలవాడు; ఐ = అయ్యి; ఎవ్వడు = ఎవడైనా సరే; తనరినన్ = అతిశయించిన; భక్తిన్ = భక్తితో.
భావము:- ఆ పృథుచక్రవర్తి చరిత్రను నీకు చెప్పాను. ఈ పుణ్యకథను గొప్ప శ్రద్ధతో…
తెభా-4-668-క.
వినినఁ బఠించిన వ్రాసిన
వినిపించిన వాఁడు పృథుఁడు విమల గతిం బొం
దిన క్రియ హరిపద మొందెడు
ననయము నిర్ధూతపాపుఁ డగచు మహాత్మా!
టీక:- వినినన్ = విన్నచో; పఠించినన్ = చదివినచో; వ్రాసిన = రాసినచో; వినిపించిన = వినిపించినచో; వాడు = వాడు; పృథుడు = పృథుచక్రవర్తి; విమల = స్వచ్ఛమైన; గతిన్ = మార్గమున; పొందిన = పొందినట్టి; క్రియన్ = విధముగ; హరిపదమున్ = వైకుంఠమును {హరి పదము - విష్ణుమూర్తి స్థానము, వైకుంఠము}; ఒందెడున్ = పొందును; అనయమున్ = అవశ్యమున్; నిర్ధూత = తొలగించిన; పాపుడు = పాపములు కలవాడు; అగుచున్ = అవుతూ; మహాత్మా = మహాత్మా.
భావము:- విన్నవాడు, చదివేవాడు, వ్రాసేవాడు, వినిపించేవాడు పాపాలు తొలగి పృథుచక్రవర్తివలె పరమపదాన్ని అందుకుంటాడు.
తెభా-4-669-సీ.
బ్రాహ్మణుఁ డంచిత భక్తిఁ బఠించిన-
బ్రహ్మవర్చసము సంప్రాప్త మగును;
క్షత్రియుం డర్థిమైఁ జదివిన విన్నను-
జగతీ విభుత్వంబు సంభవించు;
వైశ్యుండు విని ధనవంతుఁడై యొప్పును-
శూద్రుండు వినిన సుశ్లోకుఁ డగును;
మఱియును భక్తి ముమ్మాఱు పఠించిన;-
విత్తవిహీనుండు విత్తపతియు
తెభా-4-669.1-తే.
నప్రసిద్ధుఁడు ప్రఖ్యాత యశుఁడుఁ బ్రజలు
లేని యధముఁడు వితత సంతానయుతుఁడు
మూర్ఖచిత్తుండు విజ్ఞాన బోధమతియు
నగుచు నుతి కెక్కుదురు మహితాత్మ! మఱియు.
టీక:- "బ్రాహ్మణుడు = బ్రహ్మణుడు; అంచిత = చక్కటి; భక్తిన్ = భక్తితో; పఠించినన్ = చదివినచో; బ్రహ్మ = వేదజ్ఞాని కుండెడి వంటి; వర్చసమున్ = తేజస్సు; సంప్రాప్తము = చక్కగా లభించినది; అగునున్ = అగును; క్షత్రియుండు = రాజు; అర్థిమై = పూని; చదివినన్ = చదివినను; విన్నను = వినినను; జగతీ = లోకమునకు; విభుత్వంబున్ = ప్రభుత్వము; సంభవించున్ = కలుగును; వైశ్యుండున్ = వైశ్యుడు; విని = వినుటవలన; ధనవంతుడు = ధనము కలవాడు; ఐ = అయ్యి; ఒప్పును = ఒప్పి యుండును; శూద్రుండున్ = శూద్రుడు; వినినన్ = విన్నచో; సు = గొప్పగా; శ్లోకుండు = స్తుతింపబడువాడు; అగునున్ = అగును; మఱియున్ = ఇంకను; భక్తిన్ = భక్తితో; మూడు = మూడు (3); మాఱున్ = సార్లు; పఠించినన్ = చదివినన్; విత్త = ధనము; విహీనుండు = బొత్తిగ లేనివాడు; విత్తపతియున్ = ధనవంతుడును; అప్రసిద్ధుడు = పేరులేనివాడు, ఖ్యాతిలేనివాడు.
ప్రఖ్యాత = ప్రసిద్ది పొందిన; యశుడు = కీర్తి కలవాడు; ప్రజలు = సంతానము; లేని = లేనట్టి; అధముడు = అధముడు; వితత = విస్తారమైన; సంతాన = సంతానము; యుతుడు = కలవాడు; మూర్ఖ = తెలివితక్కువ; చిత్తుండు = మనస్సు కలవాడు; విజ్ఞాన = మంచి జ్ఞానము; బోదమతియున్ = తెలిసినవాడు; అగుచున్ = అవుతూ; నుతి = కీర్తి; కిన్ = తో; ఎక్కుదురు = అతిశయించురు; మహితాత్మ = గొప్పస్వభావము కలవాడ; మఱియున్ = ఇంకను."
భావము:- మహానుభావా! ఈ పుణ్యకథను భక్తితో పఠించిన బ్రాహ్మణుడు బ్రహ్మ వర్చస్సును, క్షత్రియుడు అఖండ రాజ్యాన్ని, వైశ్యుడు అపార ధనాన్ని, శూద్రుడు అత్యంత కీర్తిని పొందుతారు. ఈ పుణ్యచరిత్రను భక్తితో ముమ్మారు చదివితే దరిద్రుడు ధనవంతు డౌతాడు. అప్రసిద్ధుడు సుప్రసిద్ధు డవుతాడు. సంతానహీనుడు సంతానవంతు డౌతాడు. అజ్ఞాని విజ్ఞానవంతుడై విశేష ఖ్యాతిని ఆర్జిస్తాడు. ఇంకా…
తెభా-4-670-వ.
ఈ లోకంబునం బురుషులకు స్వస్త్యయనంబును నమంగళ నివారణంబును ధనప్రదంబును యశస్కరంబును నాయుష్కరంబును స్వర్గదాయకంబును గలిమలాపహంబును నైన యీ పుణ్యచరిత్రంబు చతుర్విధపురుషార్థ కాములైన వారికిఁ జతుర్విధపురుషార్థకారణం బగుం గావున వినందగు; సంగ్రామాభిముఖుం డైన రాజీచరిత్రంబు ననుసంధించి విరోధి నెదిర్చిన నవ్విరోధి పృథునకుం బోలెఁ గప్పంబు లిచ్చు; ముక్తాన్యసంగుండును భగవద్భక్తుండును నైన వాఁడు పుణ్యంబును వైన్యమహాత్మ్య సూచకంబును నైన యీ చరిత్రంబు వినుచుం బఠియించుచుం గృతమతియై దినదినంబును నాదరంబునం బ్రకటంబు చేయువాఁడు భవసింధుపోతపాదుండైన సర్వేశ్వరుని యందు నచలం బయిన భక్తిగలిగి పృథుచక్రవర్తి బొందిన విష్ణుపదంబుం బొందు"నని యిప్పుణ్యచరిత్రంబు మైత్రేయుండు విదురున కెఱింగించి వెండియు నిట్లనియె.
టీక:- ఈ = ఈ; లోకంబునన్ = లోకమునందు; పురుషుల్ = పురుషుల; కున్ = కు; స్వస్తి = శుభము; ఆయనంబునున్ = కలుగుట; అమంగళ = అశుభములు; నివారణంబునున్ = తొలగుట; ధన = ధనము; ప్రదంబునున్ = కలిగించెడిది; యశః = కీర్తి; కరంబునున్ = కలిగించెడిది; ఆయుష్ = ఆయుష్షును, జీవితకాలమును; కరంబునున్ = కలిగించెడిది; స్వర్గ = స్వర్గమును; దాయకంబునున్ = ప్రాప్తింపజేయునది; కలి = కలివలన కలిగెడి; మలా = దోషములు; అపహంబున్ = పోగొట్టునది; ఈ = ఈ; పుణ్య = పుణ్యవంతమైన; చరిత్రంబున్ = చరిత్రని; చతుర్విధపురుషార్థ = చతుర్విధపురుషార్థములు {చతుర్విధ పురుషార్థములు - ధర్మార్థ కామ మోక్షములు అనెడి నాలుగు (4)}; కాములు = కోరెడివారు; ఐన = అయిన; వారికిన్ = వారికి; చతుర్విధపురుషార్థ = చతుర్విధ పురుషార్థములుకి; కారణంబున్ = కలిగించెడిది; అగున్ = అగును; కావునన్ = అందుచేత; వినన్ = వినుటకు; తగున్ = తగును; సంగ్రామ = యుద్ధమునకు; అబిముఖుండు = సిద్దపడినవాడు; ఐన = అయిన; రాజు = రాజు; ఈ = ఈ; చరితంబున్ = కథను; అనుసంధించి = ఎక్కుపెట్టి; విరోధిన్ = శత్రువును; ఎదిర్చినన్ = ఎదిరించినచో; ఆ = ఆ; విరోధిన్ = శత్రువు; పృథున్ = పృథుచక్రవర్తి; కున్ = కి; పోలెన్ = వలె; కప్పంబులున్ = కప్పములు, పన్నులు; ఇచ్చును = ఇచ్చును; ముక్త = వదిలేసిన; అన్య = ఇతర; సంగుండును = సాంగత్యములుకలవాడు; భగవత్ = భగవంతునికి; భక్తుండునున్ = భక్తుడు; ఐన = అయిన; వాడు = వాడు; పుణ్యంబును = పుణ్యమును; వైన్య = పృథుచక్రవర్తి; మహాత్మ్య = గొప్పదనము; సూచకంబున్ = సూచించునది; ఐన = అయిన; ఈ = ఆ; చరిత్రంబున్ = కథను; వినుచున్ = వినుచూ; పఠియించుచున్ = చదువుతూ; కృత = నిశ్చయించుకొన్న; మతి = బుద్ధి కలవాడు; ఐ = అయ్యి; దినదినంబునున్ = ప్రతిదినము; ఆదరంబునన్ = అనురక్తితో; ప్రకటంబున్ = ప్రసిద్దముగ; చేయు = చేసెడి; వాడు = వాడు; భవ = సంసారము అనెడి; సింధు = సముద్రమును తరింపజేసెడి; పోత = ఓడ వంటి; పాదుండు = పాదములు కలవాడు; ఐన = అయిన; సర్వేశ్వరునిన్ = విష్ణుమూర్తిని {సర్వేశ్వరుడు - సమస్తమైనవారికి ఈశ్వరుడు, విష్ణువు}; అందున్ = ఎడల; అచలంబున్ = చలనము లేనిది; అయిన = అయిన; భక్తిన్ = భక్తి; కలిగి = పొంది; పృథుచక్రవర్తి = పృథుచక్రవర్తి; పొందిన = పొందినట్టి; విష్ణుపదంబున్ = వైకుంఠమును; పొందున్ = పొందును; అని = అని; ఈ = ఈ; పుణ్య = పుణ్యవంతమైన; చరిత్రంబున్ = కథను; మైత్రేయుండు = మైత్రేయుడు; విదురున్ = విదురున; కున్ = కు; ఎఱింగించి = తెలిపి; వెండియున్ = ఇంకను; ఇట్లు = ఈ విధముగ; అనియె = పలికెను.
భావము:- ఈ పుణ్యచరిత్ర శుభాలను కలిగిస్తుంది. అశుభాలను తొలగిస్తుంది. ధనాన్ని ఇస్తుంది. కీర్తిని చేకూరుస్తుంది. ఆయుస్సును పెంచుతుంది. స్వర్గాన్ని అందిస్తుంది. కలిదోషాన్ని హరిస్తుంది. చతుర్విధ పురుషార్థాలను కోరేవారికి ధర్మార్థ కామ మోక్షాలను సిద్ధింపజేస్తుంది. అందువల్ల ఈ చరిత్ర వినదగినది. యుద్ధమునకు పోయేముందు రాజు ఈ చరిత్రను విని శత్రువులను ఎదుర్కొంటే పృథుచక్రవర్తికి శత్రువులు చెల్లించినట్లు శత్రువులు ఆ రాజుకు కప్పాలు సమర్పిస్తారు. ఇతర సంగం మాని భగవంతునిపై మనస్సు నిలిపినవాడై ఈ పుణ్యచరిత్రను విని, చదివి, ప్రతిదినం పలువురికి చెప్పే ధన్యాత్మునికి సంసార సముద్రాన్ని దాటించే నావ వంటి శ్రీహరి పాదాల మీద నిశ్చలమైన భక్తి కలుగుతుంది. అతడు పృథుచక్రవర్తి పొందిన విష్ణుపదాన్ని పొందుతాడు” ఈ విధంగా ఆ పుణ్యచరిత్రను మైత్రేయ మహర్షి విదురునికి చెప్పి మళ్ళీ ఇలా అన్నాడు.
తెభా-4-671-క.
"పృథునకు నర్చికిఁ బుట్టిన
పృథు కీర్తిధనుండు ఘనుఁడు పృథుతుల్యుండై
పృథు శౌర్య ధైర్య ధుర్యుఁడు
పృథివిన్విజితాశ్వుఁ డొప్పె పృథివీపతియై.
టీక:- పృథున్ = పృథుచక్రవర్తి; కున్ = కి; అర్చి = అర్చి; కిన్ = కిని; పుట్టిన = జన్మించిన; పృథు = దట్టమైన; కీర్తి = యశస్సు అనెడి; ధనుండు = ధనము కలవాడు; ఘనుడు = గొప్పవాడు; పృథు = పృథుచక్రవర్తి; తుల్యుండు = సమానమైనవాడు; ఐ = అయ్యి; పృథు = విశాలమైన; శౌర్య = శౌర్యము; ధైర్యుడు = ధైర్యము కలవాడు; ధుర్యుడు = బాధ్యత వహించువాడు; పృథివిన్ = భూమిపైన; విజితాశ్వుడు = విజితాశ్వుడు; ఒప్పెన్ = చక్కగా నుండెను; పృథివీపతి = రాజు; ఐ = అయ్యి.
భావము:- పృథుచక్రవర్తికి, అర్చి మహాదేవికి పుట్టిన కుమారుడు విజితాశ్వుడు. ఇంద్రుణ్ణి జయించి అశ్వాన్ని తీసుకొని రావడం వల అతని కాపేరు సార్థక మయింది. విజితాశ్వుడు వీరాధివీరుడై, విశాల యశోవిరాజితుడై, శౌర్య ధైర్యాది గుణసంపన్నుడై, తండ్రికి తగిన తనయుడై పృథుచక్రవర్తి అనంతరం భూమిని పాలించాడు.
తెభా-4-672-క.
విను మంతర్ధాన గతిం
దనరు సునాసీరు వలనఁ దగ విజితాశ్వుం
డును మఱి యంతర్ధానుం
డనుపేరఁ బ్రసిద్ధుఁ డయ్యె నతి చతురుండై.
టీక:- వినుముa = వినుము; అంతర్ధాన = మాయ మయ్యెడి; గతిన్ = విధముగ; తనరు = అతిశయించెడి; సునాసీరున్ = ఇంద్రుని; వలనన్ = వలన; తగ = చక్కగా; విజితాశ్వండును = విజితాశ్వుడు; మఱి = ఇంకా; అంతర్ధానుండున్ = అంతర్ధానుడు; అను = అనెడి; పేరన్ = పేర్లతో; ప్రసిద్ధుడు = ప్రసిద్ధుడు; అయ్యెన్ = అయ్యెను; అతి = మిక్కిలి; చతురుండు = నేర్పరి; ఐ = అయ్యి;
భావము:- ఇంద్రుడు అంతర్ధానం చెంది అశ్వాన్ని అపహరించిన సందర్భంలో తానుకూడా అంతర్ధాన విద్యతో ఇంద్రుణ్ణి జయించినందువల్ల విజితాశ్వుడు అంతర్ధానుడు అన్న బిరుదనామంతో ప్రసిద్ధుడైనాడు.
తెభా-4-673-సీ.
స్థిరమతి రాజ్యాభిషిక్తుఁడై యమ్మేటి; -
సమమతి నయ్యనుజన్ములైన
హర్యశ్వునకు సమాదరమునఁ దూర్పు, ద-
క్షిణదిశఁ దగ ధూమ్రకేశునకును,
బరఁగంగ వృకునకుఁ బశ్చిమభాగంబు ,-
ద్రవిణున కర్థి నుత్తరపుదిశను,
గొమ రొప్ప నలువురకును బంచి యిచ్చె స్వ-
కాంత యైనట్టి శిఖండినికిని
తెభా-4-673.1-తే.
మనుజ యోనిని జనియింపుఁ డనుచు మున్ను
పలికినట్టి వసిష్ఠు శాపమునఁ జేసి
పూని త్రేతాగ్ను లతనికిఁ బుత్రు లగుచు
జనన మొందిరి సజ్జనస్తవ్యచరిత!
టీక:- స్థిర = నిశ్చలమైన; మతిన్ = మనసుకలవాడు; రాజ్య = రాజ్యమున; అభిషిక్తుడు = పట్టముకట్టబడినవాడు; ఐ = అయ్యి; ఆ = ఆ; మేటి = గొప్పవాడు; సమ = సమత్వ; మతిన్ = భావముతో; ఆ = ఆ; అనుజన్ములు = సోదరులు; ఐన = అయిన; హర్యశ్వున్ = హర్యశ్వుని; కున్ = కి; సమ = చక్కటి; ఆదరమునన్ = కూర్మితో; తూర్పున్ = తూర్పుదిక్కును; దక్షిణ = దక్షిణ; దిశన్ = దిక్కును; తగన్ = అవశ్యము; ధూమ్రకేశున్ = ధూమ్రకేశుని; కునున్ = కి; పరగంగన్ = ప్రసిధ్దమగునట్లు; వృకున్ = వృకుని; కున్ = కి; పశ్చిమ = పడమర; భాగంబున్ = భాగమును; ద్రవిణున్ = ద్రవిణుని; కిన్ = కి; అర్థిన్ = కోరి; ఉత్తరపు = ఉత్తర; దిశనున్ = దిక్కును; కొమరొప్పన్ = చక్కదను ఒప్పునట్లు; నలువురు = నలుగురు (4); పంచి = పంచి; ఇచ్చెన్ = పెట్టెను; స్వ = తన; కాంత = భార్య; ఐనట్టి = అయినటువంటి; శిఖండిని = శిఖండిని; కిని = కిని.
మనుజ = మానవ; యోనిని = గర్భమున; జనియింపుడు = పుట్టుడు; అనుచున్ = అనుచూ; మున్ను = ఇంతకుపూర్వము; పలికిన = శపించిన; అట్టి = అటువంటి; వసిష్ఠున్ = వసిష్ఠుని; శాపమునన్ = శాపము; చేసి = వలన; పూని = నిశ్చయించుకొని; త్రేతాగ్నులు = త్రేతాగ్నులు {త్రేతాగ్నులు - 1గార్హపత్యము 2దక్షిణాగ్ని 3ఆహవనీయము అనెడి మూడు (3) అగ్నులు}; అతని = అతని; కిన్ = కి; పుత్రులు = కుమారులు; అగుచున్ = అవుతూ; జననమున్ = జన్మమును; ఒందిరి = పొందిరి; సత్ = మంచి; జన = వారిచే; స్తవ్య = స్తుతింపబడిన; చరిత = నడవడిక కలవాడ.
భావము:- పుణ్యాత్మా! విజితాశ్వుడు మహారాజైన తర్వాత తన నలుగురు తమ్ముళ్ళలో హర్యశ్వునకు దక్షిణ దిక్కును, వృకునకు పడమటి దిక్కును, ద్రవిణునకు ఉత్తర దిక్కును సమంగా పంచి ఇచ్చాడు. విజితాశ్వుని భార్య పేరు శిఖండిని. పూర్వం వసిష్ఠుడు మానవులై పుట్టమని శాపం వల్ల గార్హపత్యం, ఆహవనీయం, దక్షిణాగ్ని అనే త్రేతాగ్నులు విజితాశ్వునికి, శిఖండినికి పుత్రులై జన్మించారు.
తెభా-4-674-వ.
వారలు పావకుండుఁ బవమానుండు శుచియు నను నామంబుల మనుష్య యోనిం బుట్టియు నాత్మప్రభావంబునం గ్రమ్మఱ నగ్నులయి చనిరి; తదనంతరంబ.
టీక:- వారలు = వారు; పావకుండన్ = పావకుడు; పవమానుండు = పవమానుడు; శుచియున్ = శుచి; అను = అనెడి; నామంబులన్ = పేర్లతో; మనుష్య = మానవ; యోనిన్ = గర్భమున; పుట్టియున్ = జనించినను; ఆత్మ = తమ; ప్రభావంబునన్ = ప్రభావము వలన; క్రమ్మఱన్ = మరల; అగ్నులు = అగ్నులు; ఐ = అయ్యి; చనిరి = వెళ్ళిపోయిరి; తదనంతరంబ = తరువాత.
భావము:- వాళ్ళు పావకుడు, పవమానుడు, శుచి అనే పేర్లతో మనుష్యులై పుట్టి కూడా తమ ప్రభావం చేత మళ్ళీ అగ్నులుగా రూపొంది యథాస్థానాలకు వెళ్ళిపోయారు. ఆ తరువాత…
తెభా-4-675-క.
అతఁడు నభస్వతి యనియెడి
ద్వితీయ పత్ని వలనను హవిర్ధానుఁడు నా
సుతుఁగని విజితాశ్వుండా
నతవిమతుఁడు రాజ్యవర్తనము దలపోయన్.
టీక:- అతడు = అతడు; నభస్వతి = నభస్వతి {నభస్వతి - నభస్ (ఆకాశము) వంటి రూపము కలది}; అనియెడి = అనెడి; ద్వితీయ = రెండవ (2); పత్ని = భార్య; వలననున్ = వలన; హవిర్ధానుడు = హవిర్ధానుడు {హవిర్ధానుడు - హవిస్సును ధరించినవాడు}; నా = అనెడి; సుతున్ = పుత్రుని; కని = పుట్టించి; విజితాశ్వుండు = విజితాశ్వుడు {విజితాశ్వుడు - విజిత (విశిష్ఠముగ జయించిన) అశ్వుడు (అశ్వము కలవాడు)}; ఆనత = లొంగిన; విమతుడు = శత్రువులు కలవాడు; రాజ్య = రాజ్యమును; వర్తనమున్ = నడపుటలో; తలపోయన్ = ఆలోచించుటచేత.
భావము:- విజితాశ్వుడు నభస్వతి అనే రెండవ భార్యవల్ల హవిర్ధానుడు అనే పుత్రుణ్ణి కన్నాడు. శత్రురాజులను లోబరచుకున్నాడు. కొంతకాలం చక్కగా రాజ్యపాలనం చేసాడు.
తెభా-4-676-క.
విమలాత్మ! కరాదానము
దమశుల్కాదికము గరము దారుణ మని ధై
ర్యమునన్ దీర్ఘమఖవ్యా
జమునం దద్వర్తనంబు సమమతి విడిచెన్.
టీక:- విమలాత్మ = స్వచ్ఛమైన మనసు కలవాడు; కరాదానము = పన్నులు వసూలు చేయుట; దమశుల్క = అపరాధశుల్కము, జరిమానా; ఆదికము = మొదలగునవి; కరము = మిక్కిలి; దారుణము = కఠినము; అని = అని; ధైర్యమునన్ = ధైర్యముగా; దీర్ఘమఖ = చిరకాలయాగము; వ్యాజమునన్ = వంకతో; తత్ = ఆ; వర్తనంబున్ = పద్దతిని; సమ = సమత్వపు; మతిన్ = భావముతో; విడిచెన్ = వదలివేసెను.
భావము:- పుణ్యాత్మా! పన్నులు, కప్పాలు పుచ్చుకొనడం దారుణమైన పని అని భావించి విజితాశ్వుడు దీర్ఘసత్రం అనే మహాయజ్ఞాన్ని ప్రారంభించి దాని కారణంగా పన్నులు మొదలైన వానిని గ్రహించడం విడిచిపెట్టాడు.
తెభా-4-677-వ.
ఇట్లు విడిచి.
టీక:- ఇట్లు = ఈ విధముగ; విడిచి = వదలివేసి.
భావము:- ఈ విధంగా విడిచి…
తెభా-4-678-క.
అతఁ డాత్మదర్శనుం డయి
చతురతఁ బరమాత్ము హంసు సర్వేశ్వరుఁ ద
త్క్రతువున యజించి కుశలా
ద్భుత యోగసమాధి ముక్తిఁ బొందె మహాత్మా!
టీక:- అతడు = అతడు; ఆత్మ = ఆత్మను; దర్శనుండు = దర్శించిన వాడు; ఐ = అయ్యి; చతురతన్ = నేర్పరితనముతో; పరమాత్మున్ = పరమాత్మను; హంసు = పరమహంసను; సర్వేశ్వరున్ = భగవంతుని; తత్ = ఆ; క్రతువునన్ = యాగములో; యజించి = యజ్ఞము చేసి; కుశల = నేర్పరితనము కలిగిన; అద్భుత = అద్భుతమైన; యోగసమాధిన్ = యోగసిద్ధి ద్వారా; ముక్తిన్ = మోక్షమును; పొందెన్ = పొందెను; మహాత్మ = గొప్పవాడ.
భావము:- మహాత్మా! విజితాశ్వుడు ఆ యజ్ఞంలో సర్వేశ్వరుడు, హంసస్వరూపుడు అయిన భగవంతుణ్ణి ఆరాధించి అత్యద్భుతమైన యోగసమాధి ద్వారా ముక్తిని పొందాడు.