పోతన తెలుగు భాగవతము/ఏకాదశ స్కంధము/యాదవులహతంబు
యాదవుల హతంబు
←భూభారంబు వాపుట | తెలుగు భాగవతము (పోతన తెలుగు భాగవతము/ఏకాదశ స్కంధము) రచయిత: పోతన |
కృష్ణ సందర్శనంబు→ |
తెభా-11-8-వ.
అని వితర్కించి జగదీశ్వరుం “డత్యున్నత వేణుకాననంబు వాయువశంబున నొరసికొన ననలం బుద్భవంబయి దహించు చందంబున యదుబలంబుల కన్యోన్య వైరానుబంధంబులు గల్పించి హతం బొనర్చెద” నని విప్రశాపంబు మూలకారణంబుగాఁ దలంచి యదుబలంబుల నడంచె" నని పలికిన మునివరునకు రాజేంద్రుం డిట్లనియె.
టీక:- అని = అని; వితర్కించి = ఆలోచించుకొని; జగదీశ్వరుండు = వాసుదేవుడు; అత్యున్నత = బాగాఎత్తైన; వేణుకా = వెదురు చెట్ల; కాననంబున్ = అడవిని; వాయు = గాలి; వశంబునన్ = వలన; ఒరసికొనన్ = రాసుకోవడంచేత; అనలంబు = నిప్పు; ఉద్భవంబు = పుట్టినది; అయి = అయ్యి; దహించు = కాల్చివేయు; చందంబునన్ = విధముగ; యదు = యాదవ; బలంబుల = సైన్యాల; కున్ = కు; అన్యోన్య = పరస్పర; వైరానుబంధంబున్ = విరోధభావాలు; కల్పించి = కల్పించి; హతంబు = సంహారము; ఒనర్చెదను = చేసెదను; అని = అని; విప్ర = బ్రాహ్మణుల; శాపంబున్ = శాపమును; మూలకారణంబుగా = కారణభూతమువలె; తలంచి = తయారుచేసి; యదు = యాదవ; బలంబున్ = సైన్యాలను; అడంచెన్ = అణచివేసెను; అని = అని; పలికిన = చెప్పినట్టి; ముని = మునులలో; వరున్ = ఉత్తమున; కున్ = కు; రాజేంద్రుండు = మహారాజు; ఇట్లు = ఈ విధముగ; అనియె = పలికెను.
భావము:- ఇలా తర్కించుకొని లోకనాయకుడైన వాసుదేవుడు చాలా ఎత్తైన వెదురు పొదల అడవిలో పుట్టిన గాలికి వెదురులు ఒరుసుకుని నిప్పు పుడుతుంది. ఆ అగ్నిలో తనకు తానే కాలిపోతుంది. అదే విధంగా యదుబలాలకు పరస్పర విరోధాలు కల్పించి నాశనం చేయాలని నిశ్చయించాడు. దానికి మూలకారణం బ్రాహ్మణశాపం కావాలని తలచాడు. ఆ ప్రకారమే యాదవనాశనం కలిగించాడు.” అని పలికిన శుకమహర్షితో పరీక్షిత్తు ఇలా అన్నాడు.
తెభా-11-9-క.
"హరిపాదకమల సేవా
పరులగు యాదవుల కెట్లు బ్రాహ్మణశాప
స్ఫురణంబు సంభవించెనొ
యరయఁగ సంయమివరేణ్య! యానతి యీవే! "
టీక:- హరి = కృష్ణుని; పాద = పాదములనెడి; కమల = పద్మముల; సేవాపరులు = కొలుచువారు; అగు = ఐన; యాదవులు = యాదవులు; కిన్ = కి; ఎట్లు = ఎలా; బ్రాహ్మణ = విప్రుల; శాప = శాపము; స్పురణంబున్ = తగులుట, ఉదయించుట; సంభవించెనో = కలిగినదొ; అరయగన్ = వివరముగ; సంయమి = మునులలో {సంయమి - సంయమనము కలవాడు, ఋషి}; వరేణ్య = మిక్కిలి ఉత్తముడా; ఆనతి యీవే = తెలుపుము.
భావము:- “మహానుభావ! మహాయోగీశ్వర! శ్రీకృష్ణుడి పాదపద్మాలను ఎప్పుడూ సేవిస్తూ ఉండే యాదవులకు బ్రాహ్మణశాపం ఎలా కలిగిందో తెలపండి.”
తెభా-11-10-క.
అనిన జనపాలునకు ని
ట్లని సంయమికులవరేణ్యుఁ డతి మోదముతో
విను మని చెప్పఁగఁ దొడఁగెను
ఘనతర గంభీర వాక్ప్రకాశస్ఫురణన్.
టీక:- అనిన = అని అడుగగా; జనపాలున్ = రాజు పరీక్షిత్తున; కున్ = కు; ఇట్లు = ఈ విధముగ; అని = అని; సంయమి = ఋషులు; కుల = అందరిలో; వరేణ్యుడు = ఉత్తముడు; అతి = మిక్కిలి; మోదము = సంతోషము; తోన్ = తోటి; వినుము = వినవలసినది; అని = అని చెప్పి; చెప్పన్ = చెప్పుట; తొడగెన్ = మొదలిడెను; ఘనతర = మిక్కిలిగొప్పదైన; గంభీర = గంభీరమైన; వాక్ = పలుకుల; ప్రకాశ = ప్రకటన; స్పురణన్ = కలుగునట్లు.
భావము:- ఇలా అడిగిన మహారాజుకు సంయమి శ్రేష్ఠుడైన శుకమహర్షి ఘనతరములు గంభీరములు అయిన వాక్కులతో ఈ విధంగా చెప్పసాగాడు.