పోతన తెలుగు భాగవతము/ఏకాదశ స్కంధము/ప్రబుద్ధునిసంభాషణ

ప్రబుద్ధుని సంభాషణ

తెలుగు భాగవతము (పోతన తెలుగు భాగవతము/ఏకాదశ స్కంధము)
రచయిత: పోతన


తెభా-11-54-వ.
“సూర్యోదయాస్తమయంబులం బ్రతిదినంబు నాయువు క్షీణంబు నొంద, దేహ కళత్ర మిత్ర భ్రాతృమమత్వ పాశబద్ధులై విడివడు నుపాయంబు గానక, సంసారాంధకారమగ్నులయి గతాగతకాలంబుల నెఱుంగక, దివాంధంబులగు జంతుజాలంబుల భంగి జన్మ జరా రోగ విపత్తి మరణంబు లందియు, శరీరంబ మేలనుచుఁ బ్రమోద మోహమదిరాపానమత్తులై, విషయాసక్తతం జిక్కి, తమ్ముఁ దారెఱుంగక యుండి, విరక్తిమార్గంబు దెలియక వర్తించు మూఢు లగు జనంబుల పొంతలఁ బోవక; కేవల నారాయణ భక్తి భావంబు గల సద్గురుం బ్రతిదినంబును భజియించి; సాత్త్వికంబును, భూతదయయును, హరికథామృతపానంబును, బ్రహ్మచర్యవ్రతంబును, విషయంబుల మనంబు సేరకుండుటయు, సాధు సంగంబును, సజ్జన మైత్రియు, వినయసంపత్తియు, శుచిత్వంబును, తపంబును, క్షమము, మౌనవ్రతంబును, వేదశాస్త్రాధ్యయన తదర్థానుష్ఠానంబులును, నహింసయు, సుఖదుఃఖాది ద్వంద్వసహిష్ణుతయు, నీశ్వరుని సర్వగతునింగా భావించుటయు, ముముక్షుత్వంబును, జనసంగ వర్జనంబును, వల్కలాది ధారణంబును, యదృచ్ఛాలాభ సంతుష్టియు, వేదాంతశాస్త్రార్థ జిజ్ఞాసయును, దేవతాంతరనిందా వర్జనంబును, గరణత్రయ శిక్షణంబును, సత్యవాక్యతయు, శమదమాదిగుణ విశిష్టత్వంబును, గృహారామ క్షేత్ర కళత్ర పుత్త్ర విత్తాదుల హరికర్పణంబు సేయుటయు, నితర దర్శన వర్జనంబు సేయుటయును భాగవతోత్తమధర్మంబు” లని చెప్పి యిట్లనియె.
టీక:- సూర్య = సూర్యుని యొక్క; ఉదయ = ఉదయించుట; అస్తమయంబులన్ = అస్తమయములతో; ప్రతి = ప్రతి ఒక్క; దినము = రోజు; ఆయువు = జీవితకాలము; క్షీణంబు = నశించుట; ఒందున్ = పొందును; దేహ = శరీరంపైన; కళత్ర = భార్యపైన; మిత్ర = హితులపైన; భాతృ = సోదరులపైన; మమత్వ = నాది,నావారనే మమకార; పాశ = తాళ్ళతో; బద్దులు = కట్టబడినవారు; ఐ = అయ్యి; విడివడున్ = విముక్తిచెందెడి; ఉపాయంబున్ = ఉపాయమును; కానక = కనుగొనలేక; సంసార = సంసారము అనెడి; అంధకార = చీకటిలో; మగ్నులు = లీనమైనవారు; అయి = ఐ; గతా = భూత; ఆగత = భవిష్యత్తు; కాలంబులు = కాలములను; ఎఱుంగక = తెలియలేక; దివాంధంబులు = పగటిపూట అంధులు (గుడ్లగూబలు); అగు = ఐన; జంతు = జంతువుల; జాలంబుల = సమూహముల; భంగిన్ = లాగ; జన్మ = పుట్టుక; జరా = ముసలితనము; రోగ = జబ్బులు; విపత్తి = ఆపదలు; మరణంబులన్ = చావులను; అందియు = పొందుతున్నను; శరీరంబ = దేహమే; మేలు = మంచిది; అనుచున్ = అనుకొనుచు; ప్రమోద = సంతోషమనెడిదానిపై; మోహ = మోహము అను; మదిరా = మద్యము; పాన = తాగుటతో; మత్తులు = సత్యముకానలేనివారు; ఐ = అయ్యి; విషయ = ఇంద్రియార్థములపై; ఆసక్తతన్ = ఆసక్తిలో; చిక్కి = చిక్కుకొని; తమ్మున్ = వారిని; తారె = వారే; ఎఱుంగక = తెలిసికొనలేకుండా; ఉండి = ఉండి; విరక్తిమార్గంబు = సన్యసించుట; తెలియక = తెలియక; వర్తించున్ = తిరిగెడి; మూఢులు = మూర్ఖులు; అగు = ఐన; జనంబులన్ = వారి; పొంతలన్ = దగ్గరకు; పోవక = పోకుండ; కేవల = కేవలము; నారాయణ = విష్ణు; భక్తి = భక్తి కల; భావంబు = బుద్ధి; కల = కలిగినట్టి; సత్ = మంచి, సత్యమైన; గురున్ = గురువును; ప్రతిదినంబును = నిత్యము; భజియించి = కొలిచి; సాత్వికంబును = సాత్విక గుణములు; భూత = ప్రాణుల ఎడ; దయయును = దయ; హరి = విష్ణుమూర్తి; కథా = వృత్తాంతములనెడి; అమృత = అమృతమును; పానంబును = తాగుట; బ్రహ్మచర్యంబును = బ్రహ్మచర్యము; విషయంబుల = ఇంద్రియార్థములపై; మనంబున్ = మనస్సునందు; చేరకుండుటయు = చేరనీయ కుండా ఉండుట; సాధు = సాధుజనులతో; సంగంబును = సాంగత్యము; సత్ = మంచి; జన = వారితో; మైత్రియున్ = స్నేహము; వినయ = వినయము; సంపత్తియు = సమృద్ధిగానుండుట; శుచిత్వంబును = శుభ్రముగా ఉండుట; తపంబును = తపస్సు; క్షమము = ఓర్పుకలిగి యుండుట; మౌన = మౌనము; వ్రతంబును = నిష్ఠగా కలిగి ఉండుట; వేద = వేదములను; శాస్త్ర = శాస్త్రములను; అధ్యయన = చదువుట; తత్ = వాటి; అర్థ = అర్థములను; అనుష్ఠానంబును = మథించుట; అహింసయు = అహింస; సుఖ = సుఖముగాని; దుఃఖ = దుఃఖముగాని; ఆది = మున్నగు; ద్వంద్వ = ద్వంద్వభావములను; సహిష్ణుతయున్ = సహించుట; ఈశ్వరుని = భగవంతుని; సర్వ = అంతటా; గతునిన్ = ఉన్నవానిగా; భావించుటయున్ = భావించుట; ముముక్షత్వంబును = మోక్షముపొందగోరుట; జన = ప్రజలతో; సంగ = సాంగత్యమును; వర్జనంబును = విడిచిపెట్టుట; వల్కల = నారబట్టలు; ఆది = మున్నగునవి; ధారణంబును = ధరించుట; యదృచ్చాలాభ = దానంతటది; లాభ = లభించినదానితో; సంతుష్టియున్ = తృప్తిచెందుట; వేదాంతశాస్త్ర = వేదాంతశాస్త్రముల; అర్థ = తత్వమునందు; జిజ్ఞాసయును = ఆసక్తి, కుతూహలము; దేవతా = దేవతలను; ఇతర = వేరేవారిని; నిందా = నిందించుటను; వర్జనంబును = వదలిపెట్టుట; కరణత్రయ = త్రికరణ {త్రికరణములు - 1మనస్సు 2వాక్కు 3కర్మలు}; శిక్షణంబును = శుద్ధి, నియమించుట; సత్యవాక్యతయు = సత్యమేపలుకుట; శమ = శాంతి {శమము - కామక్రోధాదులు లేక ఉండుట, శాంతి}; దమ = బహిరింద్రియ నిగ్రహము {దమము - క్లేశములను ఓర్చుట, బహిరింద్రియ నిగ్రహము}; ఆది = మున్నగు; గుణ = గుణములను; విశిష్టత్వంబును = శ్రేష్ఠముగానుండుట; గృహ = ఇండ్లు; ఆరామ = తోటలు; క్షేత్ర = పొలాలు; కళత్ర = భార్య; పుత్ర = సంతానం; విత్త = ధనము; ఆదులన్ = మున్నగువానిని; హరి = విష్ణుని; కిన్ = కి; అర్పణంబు = సమర్పించుట; చేయుటయున్ = చేయుట; ఇతర = ఇతరులను; దర్శన = చూచుట; వర్జనంబున్ = విడిచిపెట్టుట; చేయుటయున్ = చేయుట; భాగవత = భాగవతులలో; ఉత్తమ = ఉత్తముని; ధర్మంబులు = ధర్మములు; అని = అని; చెప్పి = చెప్పి; ఇట్లు = ఈ విధముగ; అనియె = పలికెను.
భావము:- “ప్రతిదినము మానవుల ఆయువు, సూర్యుడు ఉదయించడం అస్తమించటంతో, క్షీణిస్తుంటుంది. దేహంపైనా, భార్యపైనా, స్నేహితులపైనా, సోదరులపైనా నాది, నావారు అనే మమకారంతో కట్టుబడిపోతారు. ఆ బంధం నుంచి విడివడే ఉపాయం కనపడక సంసార మనే చీకటిలో మునిగి భూత భవిష్యత్తులు తెలియక గుడ్లగూబల లాగా మానవులు పుట్టుక ముసలితనం రోగాలు ఆపదలు చావు పొందుతు కూడ శరీరమే మేలనుకుంటూ ఉంటారు. మోహాన్ని కలిగించే మద్యపానంతో మత్తులై ఇంద్రియవిషయ ఆసక్తులై తమ్ము తాము తెలుసుకోలేక విరక్తిమార్గం తెలియక నడయాడుతుంటారు అటువంటి మూఢులైన మానవుల సమీపానికి పోవలదు. కేవలం నారాయణుని పైన భక్తిభావం గల సద్గురువును నిత్యము భజించి ఉత్తమమైన భాగవతధర్మాలను అనుష్టించాలి. ఆ ధర్మాలు ఏవంటే:
1. మూఢుల పొంతల పోకపోవుట; 2, సద్గురు ప్రతిదిన భజనము; 3. సత్త్వగుణము కలిగి ఉండటం; 4. భూతదయ; 5. హరికథామృత పానం; 6. బ్రహ్మచర్య వ్రతం; 7. ఇంద్రియ సుఖాలందు మనస్సును చేరనీయ కుండటం; 8. సాధుసంగమం; 9. సజ్జనులతో స్నేహం; 10 వినయ సంపద; 11. శుచిగా ఉండటం; 12. తపస్సు; 13 క్షమ; 14. మౌనవ్రతం; 15. వేదశాస్త్రాలను చదవటం వాటి అర్ధాన్ని అనుష్ఠించటం; 16. అహింస; 17. సుఖాన్నిగాని దుఃఖాన్నిగానీ సహించటం; 18. ఈశ్వరుడు అంతటా ఉన్నట్లు భావించటం; 19. మోక్షం పొందాలనే కోరిక; 20. కుజనుల సంగతి వదలటం; 21. వల్కలాలు మొదలైనవి కట్టడం; 22. దానంతట అది లభించిన దానితో సంతుష్టి చెందటం; 23. వేదాంతశాస్త్రాల అర్ధాలను తెలుసుకోవా లనే కుతూహలం; 24. ఇతర దేవతలను నిందించకుండా ఉండటం; 25. త్రికరణసుద్ధి; 26. సత్యమే పలకటం; 27. శమం దమం మొదలైన గుణవిశేషాలు; 28. ఇల్లు తోటలు పొలాలు భార్య సంతానం ధనం మొదలైనవాటిని పరమేశ్వరార్పణం గాభావించటం; 29. భక్తులు కాని వారిని ఆశ్రయించకుండా ఉండటం.” అని చెప్పి పిమ్మట...

తెభా-11-55-క.
"హరిదాసుల మిత్రత్వము
మురిపుకథ లెన్నికొనుచు మోదముతోడన్‌
రితాశ్రుపులకితుండై
పురుషుఁడు హరిమాయ గెల్చు భూపవరేణ్యా!"

టీక:- హరి = విష్ణు; దాసుల = భక్తులతో; మిత్రత్వమున్ = స్నేహముచేస్తు; మురరిపు = విష్ణు {మురరిపుడు - మురాసురుని శత్రువు, కృష్ణుడు}; కథలు = గాథలను; ఎన్నికొనుచు = తలచుకొనుచు; మోదము = సంతోషము; తోడన్ = తోటి; భరిత = నిండిన; అశ్రు = ఆనందభాష్పాలు; పులకితుండు = ఒళ్ళుపులకరించిన వాడు; ఐ = అయ్యి; పురుషుడు = మానవుడు; హరి = విష్ణు; మాయన్ = మాయను; గెల్చున్ = గెలుస్తాడు; భూపవరేణ్యా = మహారాజా {భూపవరేణ్యుడు - భూపు (రాజులలో) శ్రేష్ఠుడు, మహారాజు}.
భావము:- మహారాజ! హరిభక్తులతో స్నేహంచేస్తూ హరిలీలలను తలచుకుంటూ కన్నులలో ఆనందబాష్పాలు నిండగా ఒళ్ళు పులకరిస్తుండగా మానవుడు హరిమాయను గెలుస్తాడు.”

తెభా-11-56-వ.
అనిన రాజేంద్రుండు వారల కిట్లనియె; “భాగవతులారా! సకలలోకనాయకుం డగు నారాయణుం డనంబరఁగిన పరమాత్ముని ప్రభావంబు వినవలతు; నానతిం” డనినఁ బిప్పలాయనుం డిట్లనియె.
టీక:- అనిన = అని చెప్పగా; రాజేంద్రుండు = మహారాజు; వారల = వారి; కిన్ = కి; ఇట్లు = ఈ విధముగ; అనియె = పలికెను; భాగవతులార = ఓ భాగవతులు; సకల = సమస్తమైన; లోక = లోకములకు; నాయకుండు = ప్రభువు; అగు = ఐన; నారాయణుండు = నారాయణుడు {నారాయణుడు - శ్లో. ఆపోనారా ఇతి ప్రోక్తాః ఆపోవైనరసూనవః ఆయనంతస్యతాః ప్రోక్తాః తేన నారాయణ స్మృతః : ఆయనంతస్యతాః ప్రోక్తాః తేన నారాయణ స్మృతః :: - విష్ణుపురాణ ప్రమాణము, నారాయణుడు - నారం విజ్ఞానం తదయనమాశ్రయో యస్యసః నారాయణః, రిష్యతే క్షీయత యితరః రిజ్క్షయే ధాతుః సనభవతీతి నరః అవినాశ్యాత్మాః (వ్యుత్పత్తి)}; అననన్ = అనెడిపేరుతో; పరగిన = ప్రసిద్ధమైన; పరమాత్మునిన్ = భగవంతుని {పరమాత్ముడు - సర్వాతీతమైన సర్వముతానైన ఆత్మ యైనవాడు}; ప్రభావంబున్ = ప్రభావమును; వినన్ = వినవలెనని; వలతున్ = గాఢముగాకోరుతున్నాను; ఆనతిండు = చెప్పండి; అనినన్ = అని అడుగగా; పిప్పలాయనుండు = పిప్పలాయనుడు; ఇట్లు = ఈ విధముగ; అనియె = పలికెను.
భావము:- అనగా ఆ విదేహచక్రవర్తి వాళ్ళతోఇలాఅన్నాడు. “భాగవతులారా! సమస్త లోకాలకూ ప్రభువై నారాయణుడనే నామంతో అలరారే పరమాత్ముని ప్రభావాన్ని వినాలనుకుంటున్నాను ఆనతీయండి.” అంటే పిప్పలాయను డనే మునీంద్రుడు ఇలా అన్నాడు.