పోతన తెలుగు భాగవతము/ఏకాదశ స్కంధము/అంతరిక్షుసంభాషణ

అంతరిక్షు సంభాషణ

తెలుగు భాగవతము (పోతన తెలుగు భాగవతము/ఏకాదశ స్కంధము)
రచయిత: పోతన


తెభా-11-50-వ.
అనిన విని యంతరిక్షుం డను ఋషిశ్రేష్ఠుం డిట్లనియె.
టీక:- అనిన = అనగా; విని = విని; అంతరిక్షుండు = అంతరిక్షుడు; అను = అనెడి; ఋషి = మునులలో; శ్రేష్ఠుండు = ఉత్తముడు; ఇట్లు = ఈ విధముగ; అనియె = పలికెను.
భావము:- ఇలా పలికిన విదేహునితో అంతరిక్షుడు అనే మహర్షి ఇలా అన్నాడు.

తెభా-11-51-క.
మబ్రహ్మ మనంగాఁ,
తత్త్వ మనంగఁ, బరమద మనఁగను, నీ
శ్వరుఁ డనఁ, గృష్ణుఁ డన, జగ
ద్భరితుఁడు, నారాయణుండు దా వెలుఁగొందున్‌.

టీక:- పరమబ్రహ్మము = పరబ్రహ్మము; అనంగా = అని; పరమతత్వము = పరమతత్వము; అనంగ = అని; పరమపదము = పరమపదము; అనగనున్ = అని; ఈశ్వరుడు = పరమేశ్వరుడు; అనన్ = అని; కృష్ణుడు = కృష్ణుడు; అనన్ = అని; జగద్భరితుడు = లోకాలను భరించువాడు; నారాయణుండు = విష్ణుమూర్తి; తాన్ = అతను; వెలుగొందున్ = ప్రకాశించును.
భావము:- “పరబ్రహ్మ అన్నా; పరతత్వము అన్నా; పరమపదము అన్నా; ఈశ్వరుడు అన్నా; శ్రీకృష్ణుడు అన్నా; శ్రీమన్నారాయణుడే. ఆయనే జగద్భరితుడై ప్రకాశిస్తూ ఉంటాడు.

తెభా-11-52-వ.
అవ్యక్తనిర్గుణపరబ్రహ్మంబునందుఁ దనకు విపర్యయంబుగా జననం బయిన జ్ఞానంబె విష్ణుమాయ యనంబడుఁ; బరమేశ్వరుఁ డట్టి మాయచేత జగంబు నిర్మించి నిశ్చింతుండై యుండు; నింద్రియార్థ భ్రమణంబు సేసెడు దుర్మతులకు సుషుప్త్యాద్యవస్థలు వరుసన కలుగుటంజేసి పరమేశ్వరునిం బొందరామి యను నాలుగవ యవస్థయుఁ గలుగు; స్వప్నంబునందు గ్రాహ్యగ్రాహక గ్రహణంబు లను త్రివిధభేదంబు గలిగియుండు; నీచందంబున నవిద్యాంధకార సంవృతంబై మూఁడు విధంబులఁ బర్యవసించు మనోరథంబు స్వప్నావస్థయం దణంగిన క్రియఁ ద్రివిధం బగు మాయయు నాత్మ యందు లీనంబగుఁ; బరమేశ్వరుండు మొదలం బృథివ్యాది మహా భూతమయం బయిన సృష్టిని గలుగఁజేసి యందుఁ బంచభూతాత్మకం బయిన యాత్మ కేకాదశేంద్రియంబులచేత భేదంబు పుట్టించుచు, గుణంబులచేత గుణంబు లంగీకరించుచు నాత్మ యందుఁ బ్రద్యోతితగుణంబులవలన గుణానుభవంబుఁ జేయుచునున్న వాఁడై, సృష్టి నాత్మీయంబుగాఁ భావించు; దేహి కర్మమూలంబున నైమిత్తిక కర్మంబుల నాచరించుచుఁ దత్ఫలం బంగీకరించి దుఃఖైక వశుండై వర్తించుఁ; బెక్కు దుఃఖంబులం బడిన యా దేహి కర్మఫలప్రాప్తుం డగుచు భూత సంప్లవపర్యంతంబు పరవశుండై జన్మమరణంబులం బొరలుచుండు; నంత్యకాలం బాసన్నంబయిన ద్రవ్యగుణ స్వరూపం బగు జగంబు ననాదినిధనంబగు కాలంబు ప్రకృతింబొందించు; నటమీఁద శతవర్షంబులు వర్షంబు లేమిచేత నత్యుగ్రలోక లోచనుతేజంబున సకలలోకంబులు దహింపఁబడు; నంత నధో లోకంబుననుండి సంకర్షణముఖజనితానలం బూర్ధ్వశిఖాజాలంబుల వాయుసహాయంబై దిక్కులయం దెల్లఁ బ్రవర్తించు; నటమీఁద సంవర్తక వలాహక గణంబులు నూఱు హాయనంబులు సలిలధారా పాతంబుగా వర్షంబు గురియు; నందు విరాడ్రూపంబు లీనంబగు; నంత నీశ్వరుం డింధనాగ్నిచందంబున నవ్యక్తంబుఁ బ్రవేశించు; తదనంతరంబ ధరణీమండలంబు వాయుహృతగంధం బై కబంధ రూపంబుఁ దాల్చు; నా జలంబు హృతరసంబై తేజోరూపంబు నొందు నా తేజంబు తమోనిరస్తం బై వాయువం దడంగు; నా గంధవహుండు స్పర్శవిరహితుం డయి యాకాశంబు నందు సంక్రమించు; నా విష్ణుపదంబును విగత శబ్దగుణంబు గలది యై యాత్మ యందడంగు; నింద్రియంబులును మనంబును బుద్ధియు వికారంబులతోడ నహంకారంబుఁ బ్రవేశించు; నా యహంకారంబును స్వగుణయుక్తంబై పరమాత్మునిం జేరు; నిట్లు త్రివర్ణాత్మకయై సర్గ స్థితి లయకారిణి యగు మాయ యిట్టిది” యని తత్స్వరూప మాహాత్మ్యంబులు వివరించిన నరపాలుం డిట్లనియె.
టీక:- అవ్యక్త = అవ్యక్తమైన; నిర్గుణ = నిర్గుణ; పరబ్రహ్మంబున్ = పరబ్రహ్మము; అందు = నుండి; విపర్యయముగా = వ్యత్యాసముగా, వేరుగా; జననంబు = పుట్టినది; అయిన = ఐన; జ్ఞానంబె = జ్ఞానమే; విష్ణుమాయ = విష్ణుమాయ; అనంబడు = అంటారు; పరమేశ్వరుడు = భగవంతుడు; అట్టి = అటువంటి; మాయ = మాయ; చేతన్ = చేత; జగంబున్ = లోకములను; నిర్మించి = పుట్టించి; నిశ్చింతుండు = ఏ చింతా లేనివాడు; ఐ = అయ్యి; ఉండున్ = ఉండును; ఇంద్రియ = ఇంద్రియాల; అర్థ = కొరకు; భ్రమణంబు = తిరుగుట; చేసెడి = చేసే; దురాత్ముల = చెడుబుద్ధిగలవారి; కున్ = కి; సుషుప్తి = సుషుప్తి; ఆది = మున్నగు; అవస్థలు = అవస్థాత్రయము {అవస్థాత్రయము - 1నిద్ర 2స్వప్నం 3మెలకువ అనెడి మూడు అవస్థలు}; వరుసన = వరసగా; కలుగుటన్ = కలుగుట; చేసి = వలన; పరమేశ్వరుని = భగవంతుని; పొందరామి = పొందలేకపోవుట; అను = అనెడి; నాలుగవ = నాలుగవ (4); అవస్థయున్ = అవస్థ; కలుగు = కలుగుతుంది; స్వప్నంబున్ = కల; అందు = లో; గ్రాహ్య = గ్రహింపదగినది; గ్రాహక = గ్రహించునది; గ్రహణంబులు = గ్రహించుటలు; అను = అనెడి; త్రి = మూడు (3); విధ = రకాల; భేదంబున్ = వేరిమిలు; కలిగి = సంభవించి; ఉండున్ = ఉంటాయి; ఈ = ఈ; చందంబునన్ = విధముగనే; అవిద్య = అవిద్య అను; అంధకార = చీకటిని; సంవృతంబు = చుట్టుకోబడినది; ఐ = అయ్యి; మూడు = మూడు (3); విధంబులన్ = విధములుగా; పర్యవసించు = పరిణామించు; మనోరథంబు = కోరిక; స్వప్నా = స్వప్నము అను; అవస్థ = అవస్థ; అందున్ = లో; అణంగిన = అణగిన; క్రియన్ = వలె; త్రి = మూడు (3); విధంబు = విధములు; అగు = ఐన; మాయయున్ = మాయ; ఆత్మ = ఆత్మ; అందు = లో; లీనంబు = విలీనమైనది; అగున్ = ఔను; పరమేశ్వరుండు = భగవంతుడు; మొదలన్ = ప్రారంభంలో; పృథివ్యాది = పంచభూతములను {పృథివ్యాది - పంచభూతములు, 1పృథివి 2అప్పు 3తేజస్సు 4వాయువు 5ఆకాశము}; మహాభూత = మహాభూతములతో; మయంబు = నిండినది; అయిన = అగు; సృష్టినిన్ = సృష్టిని; కలుగజేసి = సృష్టించి; అందున్ = దానిలో; పంచభూతాత్మకంబు = పంచభూతాలతోనిండినది; అయిన = అగు; ఆత్మ = ఆత్మ; కిన్ = కి; ఏకాదశేంద్రియంబుల = పదకొండు ఇంద్రియాల {ఏకాదశేంద్రియములు - పంచ జ్ఞానేంద్రియములు (5) పంచకర్మేంద్రియములు (5) మనస్సు (1) అను పదకొండు}; చేతన్ = చేత; భేదంబున్ = వేరిమిని; పుట్టించుచున్ = కల్పిస్తూ; గుణంబుల = గుణముల; చేతన్ = చేత; గుణంబులు = గుణములను; అంగీకరించుచు = అంగీకరిస్తూ; ఆత్మ = ఆత్మ; అందున్ = అందు; ప్రద్యోతిత = వ్యక్తమైన; గుణంబుల = గుణాల; వలన = వల్ల; గుణా = గుణాలను; అనుభవంబున్ = అనుభవించుట; చేయుచున్ = చేస్తు; ఉన్నవాడు = ఉన్నవాడు; ఐ = అయ్యి; సృష్టిన్ = సృష్టిని; ఆత్మీయంబు = తనది; కాన్ = ఐనట్లు; భావించు = అనుకొనును; దేహి = శరీరధారి; కర్మ = పూర్వకృతకర్మల; మూలంబునన్ = కారణముచేత; నైమిత్తిక = నైమిత్తిక; కర్మంబులన్ = కర్మలను; ఆచరించుచు = చేస్తు; తత్ = వాని; ఫలంబున్ = ఫలితములను; అంగీకరించి = అంగీకరిస్తూ; దుఃఖ = దుఃఖానికే; ఏక = ముఖ్యముగా; వశుండు = లొంగినవాడు; ఐ = అయ్యి; వర్తించున్ = మెలగుచుండును; పెక్కు = అనేకమైన; దుఃఖంబులన్ = దుఃఖములందు; పడిన = మునిగిన; ఆ = ఆ యొక్క; దేహి = శరీరధారి; కర్మ = చేసిన కర్మల; ఫల = ఫలితములను; ప్రాప్తుండు = పొందినవాడు; అగుచున్ = ఔతు; భూతసంప్లవ = ప్రళయము; పర్యంతంబు = వరకు; పరవశుండు = స్వేచ్చకోల్పోయినవాడు; ఐ = అయ్యి; జన్మ = మళ్ళా మళ్ళా పుట్టుట; మరణంబులన్ = మళ్ళా మళ్ళా చచ్చుటలో; పొరలుచున్ = దొర్లుతు; ఉండున్ = ఉండును; అంత్యకాలంబు = యుగాంతప్రళయము; ఆసన్నంబు = దగ్గరపడిన; అయిన = అప్పుడు; ద్రవ్య = వస్తువులు; గుణ = గుణముల; స్వరూపంబు = రూపముకలిగినది; అగు = ఐన; జగంబున్ = లోకము; ఆదినిధనంబు = ఆద్యంతాలులేనిది; అగు = ఐన; కాలంబు = కాలము; ప్రకృతిన్ = ప్రకృతిని; పొందించున్ = పొందిస్తుంది; అటమీద = ఆపైన; శత = నూరు (100); వర్షంబులు = సంవత్సరములు; వర్షంబు = వర్షాలు; లేమిన్ = లేకపోవుట; చేతన్ = వలన; అతి = మిక్కిలి; ఉగ్ర = తీక్షణమైన; లోకలోచను = సూర్యుని; తేజంబున్ = ఎండచేత; సకల = సర్వ; లోకంబులు = లోకాలు; దహింపబడును = తగలబడిపోవును; అంతన్ = అప్పుడు; అధోలోకంబున = కిందిలోకముల; నుండి = నుండి; సంకర్షణ = ఆదిశేషుని; ముఖ = ముఖమునుండి; జనిత = పుట్టిన; అనలంబు = అగ్ని; ఊర్ధ్వ = ఆవిర్భవించిన; శిఖా = అగ్ని; జ్వాలలు = మంటలు; వాయు = గాలుల; సహాయంబు = సహాయముగాకలవి; ఐ = అయ్యి; దిక్కులన్ = సర్వదిక్కుల; అందున్ = అందు; ప్రవర్తించున్ = వ్యాపించును; అటమీద = ఆపైన; సంవర్తక = సంవర్తక {సంవర్తకము - సవర్త (దీని యందు జగత్తు లయమగును) మేఘము, ప్రళయకాల మేఘ విశేషము}; వలాహక = మేఘముల {వలాహకము - ప్రళయకాల మేఘ విశేషము}; గణంబులు = సముదాయములు; నూఱు = వంద (100); హాయనంబులు = సంవత్సరములు; సలిల = నీటి; ధారాపాతంబుగా = ధారగాపడుతు; వర్షంబు = వానలు; కురియన్ = కురుస్తాయి; అందు = దానిలో; విరాడ్రూపంబు = జగత్తు {విరాడ్రూపంబు - భగవంతుని స్వరూపమైనది, జగత్తు}; లీనంబు = విలీనమైనది; అగున్ = అయిపోవును; అంతన్ = అప్పుడు; ఈశ్వరుండు = భగవంతుండు; ఇంధన = కట్టెలలోని; అగ్ని = నిప్పు, అగ్నిదేవుని; చందంబునన్ = వలె; అవ్యక్తంబున్ = అవ్యక్తమునందు; ప్రవేశించున్ = ప్రవేశిస్తాడు; తదనంతరంబ = తరువాత; ధరణీమండలంబు = భూమండలము; వాయుహృత = కోల్పోయిన; గంధంబు = గంధగుణముకలది; ఐ = అయ్యి; కబంధ = జల; రూపంబున్ = స్వరూపాన్ని; తాల్చున్ = ధరించును; ఆ = ఆ యొక్క; జలంబు = నీరు; హృత = కోల్పోయిన; రసంబు = రసగుణముకలది; ఐ = అయ్యి; తేజస్ = తేజస్సు యొక్క; రూపంబున్ = స్వరూపమును; ఒందున్ = పొందును; ఆ = ఆ యొక్క; తేజంబు = తేజస్సు; తమో = అంధకార; నిరస్తంబు = పోగొట్టబడినది; ఐ = అయ్యి; వాయువు = వాయువు; అందున్ = లో; అడంగున్ = అణగిపోవును; ఆ = ఆ యొక్క; గంధవహుండు = వాయువు; స్పర్శ = స్పర్శగుణ; విరహితుండు = లేనివాడు; అయి = ఐ; ఆకాశంబున్ = ఆకాశము; అందున్ = లో; సంక్రమించున్ = కలియును; ఆ = ఆ యొక్క; విష్ణుపదంబు = ఆకాశము; విగత = కోల్పోయిన; శబ్ద = శబ్ద; గుణంబు = గుణముకలది; ఐ = అయ్యి; ఆత్మ = ఆత్మ; అందున్ = లో; అడంగున్ = అణగిపోవును; ఇంద్రియంబులును = సర్వేంద్రియాలు; మనంబును = మనసుతోకూడి; బుద్ధియు = బుద్ధి; వికారంబుల = వికారముల; తోడన్ = తోటి; అహంకారంబున్ = అహంకారములో; ప్రవేశించున్ = చేరును, లీనమగును; ఆ = ఆ యొక్క; అహంకారంబునున్ = అహంకారము; స్వ = తన; గుణ = గుణములతో; యుక్తంబు = కూడినది; ఐ = అయ్యి; పరమాత్మునిన్ = పరమాత్మను; చేరున్ = ప్రవేశించును; ఇట్లు = ఈ విధముగ; త్రివర్ణాత్మకంబు = మూడు (3) వర్ణాలుగలది; ఐ = అయ్యి; సర్గ = సష్టి; స్థితి = స్థితి; లయ = లయములను; కారిణి = కారణమైనది; అగు = ఐన; మాయ = మాయ; ఇట్టిది = ఇలాంటిది; అని = అని; తత్ = దాని; స్వరూప = రూపము; మహాత్మ్యంబులు = గొప్పదనము; వివరించినన్ = వివరముగా తెలుపగా; నరపాలుండు = రాజు {నరపాలుడు - మానవులను పాలించువాడు, రాజు}; ఇట్లు = ఈ విధముగ; అనియె = పలికెను.
భావము:- అవ్యక్తమైన నిర్గుణ పరబ్రహ్మంనుండి తనకు ఇతరంగా కలిగే జ్ఞానాన్ని విష్ణుమాయ అంటారు. ఆ మాయ చేతనే ప్రపంచాన్ని నిర్మించి భగవంతుడు ఏ చింతా లేకుండా ఉంటాడు. ఇంద్రియాల వెంట తిరిగే చెడుబుద్ధి గలవారికి నిద్ర, స్వప్నం, మెలకువ అని మూడు అవస్థలతోపాటు పరమేశ్వరుని పొందలేకపోవటం అనే నాలుగో అవస్థ కూడ కలుగుతుంది. కలలో గ్రహింపదగినదీ గ్రహించేవాడూ గ్రహించటం అనే మూడు భేదాలుంటాయి. ఈ విధంగా అవిద్య అనే చీకటిచే చుట్టుకోబడి మూడువిధాలయ్యే కోరిక స్వప్నంలో అణిగిన విధంగా మూడువిధాలైన మాయ కూడా ఆత్మలో విలీనమవుతుంది.
పరమేశ్వరుడు మొదట పృథివి అప్పు తేజస్సు వాయువు ఆకాశం అనే పంచభూతాలతో నిండిన సృష్టిని కలిగించాడు. అందులో పంచభూతాత్మకమైన ఆత్మకు పదకొండు ఇంద్రియములతో భేదం పుట్టిస్తూ గుణాలచేత గుణాలను అంగీకరిస్తూ ఆత్మ యందు వ్యక్తమైన గుణాలవల్ల గుణాలను అనుభవిస్తూ ఉంటాడు. సృష్టిని తనదిగా భావిస్తాడు. శరీరధారి పూర్వకర్మ మూలంగా నైమిత్తికాలైన కర్మలు చేస్తూ వాటి ఫలితాన్ని అంగీకరించి దుఃఖానికే వశుడై వర్తిస్తుంటాడు. అనేక దుఃఖాలలో మునిగిన ఆ దేహి కర్మఫలాన్ని పొందుతూ ప్రపంచానికి జలప్రళయం వచ్చే దాకా స్వేచ్ఛను కోల్పోయి, చావుపుట్టుకలలో పడి పొరలుతుంటాడు. కల్పాంత సమయంలో ద్రవ్యగుణాల స్వరూపమైన జగత్తును ఆద్యంతాలు లేని కాలం ప్రకృతిని పొందిస్తుంది.ఆ పైన నూరేండ్లు వానలులేక భయంకరమైన ఎండల వల్ల అన్నిలోకాలు తగలబడుతాయి. అటుపిమ్మట, అధోలోకంనుండి ఆదిశేషుని ముఖం నుంచి ఆవిర్భవించిన అగ్నిజ్వాలలు వాయు సహాయంతో లేచి దిక్కులంతటా వ్యాపిస్తాయి. ఆ తరువాత సంవర్తకాలనే మేఘాలు నూరేండ్లు ధారాపాతంగా వర్షం కురుస్తాయి. వానిలో విరాడ్రూపం విలీనమవుతుంది. అప్పుడు ఈశ్వరుడు కట్టెలలో అగ్నివలె అవ్యక్తాన్ని ప్రవేశిస్తాడు. అనంతరం భూమండలం తన గంధ గుణాన్ని గోల్పోయి జలరూపాన్ని ధరిస్తుంది. ఆ జలం రసాన్ని గోల్పోయి తేజో రూపాన్ని పొందుతుంది. ఆ తేజస్సు అంధకార నిరస్తమై రూపం పోయి వాయువులో అణుగుతుంది. ఆ వాయువు స్పర్శను పోగొట్టుకుని ఆకాశ మందు సంక్రమిస్తుంది. ఆకాశం శబ్దగుణాన్నిపోగొట్టుకుని ఆత్మ యందు అణగిపోతుంది. ఇంద్రియాలు మనస్సు బుద్ధి వికారాలతో అహంకారాన్ని ప్రవేశిస్తాయి. ఆ అహంకారం తన గుణములతో కలసి పరమాత్మను చేరుతుంది. ఈ విధంగా మూడువర్ణాలు కలిగిన సృష్టి స్థితి లయాలకు కారణమైన మాయ ఇటువంటిది” అని దాని స్వరూపమూ మాహత్య్మమూ వివరించగా విని విదేహరాజు ఇలా అన్నాడు

తెభా-11-53-ఉ.
"జ్ఞావిహీనులైన నరసంఘముఁ గానఁగరాని మాయఁ దా
లో నడంచి యెట్లు హరిలోకముఁ జెందుదు? రంతయుం దగన్‌
భూనుత! సత్యవాక్యగుణభూషణ! యిక్కథ వేడ్కతోడుతం
బూనికఁ జెప్పు"మన్నను బ్రబుద్ధుఁడు నిట్లను గారవంబునన్‌.

టీక:- జ్ఞాన = ఆత్మజ్ఞానము; విహీనులు = లేనివారు; ఐన = అయిన; నర = మానవులు; సంఘము = అందరు; కానగరాని = కనలేని; మాయన్ = మాయను; తాన్ = తాను; లోనన్ = లోపల; అడంచి = అణచివేసి; ఎట్లు = ఏ విధముగ; హరిలోకమున్ = వైకుంఠమును; చెందుదురు = పొందగలుగుతారు; అంతయు = అంతా; తగన్ = తగిన విధముగా; భూనుత = మహానుభావుడ {భూనుత -భూలోకమునంతా స్తుతింపబడువాడు, గొప్పవాడు}; సత్యవాక్య = సత్యమేపలికెడి; గుణ = సుగుణముచే; భూషణ = అలంకరింపబడినవాడా; ఈ = ఈ యొక్క; కథన్ = వృత్తాంతమును; వేడ్క = కుతూహలము; తోడుతన్ = కూడినదిగా; పూనికన్ = ఉద్యమస్ఫూర్తితో; చెప్పుము = తెలియజెప్పుము; అన్నన్ = అనగా; ప్రబుద్ధుడు = ప్రబుద్ధుడు; ఇట్లు = ఈ విధముగ; అనున్ = పలికెను; గారవంబునన్ = ఆదరముతో.
భావము:- “మీరు లోకోత్తములు. సత్యవాక్య పరిపాలకులు. కనరాని మాయను లోపల అణచివేసి అజ్ఞానులు ఏ విధంగా వైకుంఠాన్ని చేరగలుగుతారు? ఈ విషయాన్ని దయతో చెప్పండి.” ఇలా అన్న విదేహునితో ప్రబుద్ధుడు అనే మహముని ఆదర పూర్వకంగా ఇలా అన్నాడు.