పోతన తెలుగు భాగవతము/అష్ఠమ స్కంధము/దుర్భర దానవ ప్రతాపము
దుర్భరదానవప్రతాపము
←స్వర్గవర్ణనము | తెలుగు భాగవతము ( దుర్భర_దానవ_ప్రతాపము) రచయిత: పోతన |
బృహస్పతిమంత్రాంగము→ |
తెభా-8-449-వ.
అప్పుడు
టీక:- అప్పుడు = ఆ సమయమునందు.
భావము:- అలా బలి సైన్యం సురేంద్రపురిని చేరి, అప్పుడు.
తెభా-8-450-క.
దుర్భర దానవ శంఖా
విర్భూతధ్వనులు నిండి విబుధేంద్రవధూ
గర్భములు పగిలి లోపలి
యర్భకతతు లావు రనుచు నాక్రోశించెన్.
టీక:- దుర్భర = భరింపశక్యముకాని; దానవ = రాక్షసుని; శంఖా = శంఖమునుండి; ఆవిర్భూత = వెలువడిన; ధ్వనులు = శబ్దములు; నిండి = పూరింపబడి; విబుధ = దేవతలైన; ఇంద్ర = శ్రేష్ఠుల; వధూ = స్త్రీల; గర్భములు = గర్భములు; పగిలి = బ్రద్ధలై; లోపలి = లోపల ఉన్న; అర్భక = శిశువుల; తతులు = సమూహములు; ఆవురు = ఆ; అనుచున్ = అనుచు; ఆక్రోశించెన్ = దుఃఖించెను.
భావము:- అమరావతి పట్టణాన్ని రాక్షసులు ముట్టడించి విజయశంఖాలు పూరించారు. వారి శంఖారావాలకు దేవతా స్త్రీల గర్భాలు బ్రద్దలైపోయాయి. ఆ గర్భాలలోని శిశువులు ఆక్రోశించారు.
తెభా-8-451-వ.
అంత
టీక:- అంత = అంతట.
భావము:- దానవులు అమరావతి పట్టణ ఆక్రమించిన ఆ సమయంలో. . .
తెభా-8-452-సీ.
బలి వచ్చి విడియుట బలభేది వీక్షించి-
గట్టిగాఁ గోటకుఁ గాపు పెట్టి
దేవవీరులుఁ దాను దేవతామంత్రిని-
రప్పించి సురవైరి రాకఁ జెప్పి
"ప్రళయానలుని భంగి భాసిల్లుచున్నాఁడు-
ఘోరరాక్షసులను గూడినాఁడు
మన కోడి చని నేఁడు మరల వీఁ డేతెంచె-
నే తపంబున వీని కింత వచ్చె?
తెభా-8-452.1-ఆ.
నీ దురాత్ముకునకు నెవ్వఁడు దోడయ్యె?
నింక వీని గెల్వ నేది త్రోవ?
యేమి చేయువార? మెక్కడి మగఁటిమి?
నెదురు మోహరింప నెవ్వఁ డోపు?
టీక:- బలి = బలి; వచ్చి = వచ్చి; విడియుటన్ = ఉన్నవిషయము; బలభేది = ఇంద్రుడు; వీక్షించి = చూసి; గట్టిగా = బలమైనవిధముగ; కోట = కోట; కున్ = కు; కాపు = కాపలా; పెట్టి = ఏర్పాటుచేసి; దేవ = దేవతా; వీరులున్ = సేనానాయకులును; తాను = అతను; దేవతామంత్రిని = బృహస్పతిని; రప్పించి = పిలిపించి; సురవైరి = రాక్షసుడు; రాకన్ = వచ్చుటను; చెప్పి = తెలియజేసి; ప్రళయ = ప్రళయకాలపు; అనలుని = అగ్ని; భంగిన్ = వలె; భాసిల్లుచున్నాడు = మండిపడుతున్నాడు; ఘోర = భీకరమైన; రాక్షసులను = రాక్షసులను; కూడినాడు = కూడి ఉన్నాడు; మన = మన; కున్ = కు; ఓడి = ఓడిపోయినవాడై; చని = వెళ్ళి; నేడు = ఇవాళ; మరలన్ = మళ్ళీ; వీడు = ఇతడు; ఏతెంచెన్ = వచ్చెను; ఏ = ఎట్టి; తపంబునన్ = తపస్సువలన; వీని = ఇతని; కిన్ = కి; ఇంత = ఇంతధైర్యము; వచ్చెన్ = వచ్చినదో; ఈ = ఈ.
దురాత్మున్ = దుష్టుని; కున్ = కి; ఎవ్వడు = ఎవరు; తోడు = సహాయముచేయువాడు; అయ్యెన్ = అయినాడో; ఇంక = ఇక; వీనిన్ = ఇతనిని; గెల్వన్ = జయించుటకు; ఏది = ఏమిటి; త్రోవ = దారి; ఏమి = ఏమిటి; చేయువారము = చేయగలము; ఎక్కడి = ఎక్కడిదింత; మగటిమి = పరాక్రమము; ఎదురన్ = ఎదురుగా; మోహరింపన్ = సేనలను నిలుపుటను; ఎవ్వడు = ఎవరు; ఓపు = చేయగలరు.
భావము:- బలిచక్రవర్తి వచ్చి పట్టణాన్ని ముట్టడించడం దేవేంద్రుడు తెలుసుకున్నాడు. కోటకు బలమైన కాపలా ఏర్పాటు చేసాడు. దేవతావీరులతో కలిసి దేవమంత్రి అయిన బృహస్పతిని పిలిపించాడు. బలిచక్రవర్తి దండెత్తి వచ్చిన సంగతి ఇలా చెప్పసాగాడు “వాడు ప్రళయాగ్ని వలె మండిపడుతున్నాడు. క్రూరులైన రాక్షసులతో కూడి ఉన్నాడు. మనతో ఓడిపోయి ఈనాడు తిరిగి మనపైకి వచ్చాడు. ఏ తపస్సువలస వాని కింత శక్తి వచ్చిందో? ఈ దురాత్ముడు ఎవరి సహాయాన్ని పొందినాడో? వీనిని గెలిచే మార్గమేది? ఏం చేయాలి? పరాక్రమంతో వీడిని రణరంగంలో ఎదిరించి నిలువగల వీరుడు ఎవడు. . .
తెభా-8-453-క.
మ్రింగెడు నాకాశంబునుఁ
బొంగెడు నమరాద్రి కంటెఁ బొడవై వీఁడున్
మ్రింగెడుఁ గాలాంతకు క్రియ
భంగించును మరలఁ బడ్డ బంకజగర్భున్ .
టీక:- మ్రింగెడున్ = కబళించును; ఆకాశంబున్ = ఆకాశమును; పొంగెడున్ = విఱ్ఱవీగుతుండెను; అమరాద్రి = మేరుపర్వతము; కంటె = కంటెను; పొడవు = ఎత్తైనవాడు; ఐ = అయ్యి; వీడున్ = ఇతడు; మ్రింగెడున్ = మింగివేయుచున్నాడు; కాలాంతకు = కాలాంతకుని; క్రియన్ = వలె; భంగించును = భంగపరచును; మరలబడ్డన్ = తిరగబడినచో; పంకజగర్భున్ = బ్రహ్మదేవునైనను.
భావము:- ఈ బలిచక్రవర్తి ఆకాశాన్ని కూడా కబళించే టంతలా ఉన్నాడు. మేరు పర్వతంకంటే ఎత్తు పెరిగి విఱ్ఱవీగుతున్నాడు. కాలయమునివలె వచ్చి మన మీద పడ్డాడు. తిరుగబడితే బ్రహ్మను కూడా భంగపరుస్తాడు” అని ఇంద్రుడు వాపోతూ ఇంకా ఇలా అన్నాడు.
తెభా-8-454-క.
ఈరాదు రాజ్య మెల్లనుఁ
బోరాదు రణంబు చేయఁ బోయితి మేనిన్
రారాదు దనుజుచేతను
జారా దిట మీఁద నేమిజాడ మహాత్మా!"
టీక:- ఈరాదు = ఇచ్చివేయరాదు; రాజ్యమును = రాజ్యాధికారమును; ఎల్లనున్ = అంతటిని; పోరాదు = వెళ్ళుటకువీలుకాదు; రణంబు = యుద్ధము; చేయన్ = చేయుటకు; పోయితిమేనిన్ = వెళితే; రారాదు = తిరిగిరాలేము; దనుజు = రాక్షసుని; చేతను = వలన; జా = జయముము; రాదు = రాబోదు; ఇట = ఇంక; మీదన = ఈపైన; ఏమి = ఏమిటి; జాడ = తప్పించుకొనెడిదారి; మహాత్మా = గొప్పవాడ.
భావము:- “మహాత్మా! బృహస్పతి! రాజ్యాన్ని వీడికి వదలి పెట్టడానికి వీలులేదు. యుద్ధానికి వెళ్ళడానికి వీలులేదు. వెడితే తిరిగి వస్తామనే నమ్మకం లేదు. ఈ రాక్షసుడి చేతిలో ప్రాణాలు కోల్పోలేము. వీడి బారినుండి తప్పించుకొని బ్రతికే దారి తెలుపు.”