పోతన తెలుగు భాగవతము/అష్ఠమ స్కంధము/ఉత్తమమనువు చరిత్ర

3ఉత్తమమనువు చరిత్ర

తెలుగు భాగవతము (మూస:పోతన తెలుగు భాగవతము/అష్ఠమ స్కంధము/)
రచయిత: పోతన


తెభా-8-16-సీ.
నువు మూఁడవవాఁడు నుజేంద్ర! యుత్తముం-
నఁ బ్రియవ్రతునకు నాత్మజుండు
పాలించె నిల యెల్లఁ వన సృంజయ యజ్ఞ-
హోత్రాదు లాతని పుత్రు లధిక
గుణులు; వసిష్ఠుని కొడుకులు ప్రమథాదు-
లైరి సప్తర్షులు; మరవిభుఁడు
త్యజిత్తనువాఁడు; త్యభద్రాద్యులు-
సురలు; ధర్మునికిని సూనృతకును

తెభా-8-16.1-ఆ.
బుట్టి సత్యనియతిఁ బురుషోత్తముఁడు సత్య
సేనుఁ డనఁగ దుష్టశీలయుతుల
నుజ యక్షపతుల దండించె సత్యజి
న్మిత్రుఁ డగుచు జగము మే లనంగ.

టీక:- మనువు = మనువు; మూడవ = మూడవ (3); వాడు = వాడు; మనుజేంద్ర = రాజా {మనుజేంద్రుడు - మనుజులకు ప్రభువు, రాజు}; ఉత్తముండు = ఉత్తముడు; అనన్ = అనగా; ప్రియవ్రతున్ = ప్రియవ్రతుని; కున్ = కి; ఆత్మజుండు = పుత్రుడు {ఆత్మజుడు - ఆత్మ (తనకు) జుడు (పుట్టినివాడు), పుత్రుడు}; పాలించెన్ = పరిపాలించెను; ఇలన్ = భూమిని; ఎల్లన్ = అంతటను; పవన = పవనుడు; సృంజయ = సృంజయుడు; యజ్ఞహోత్ర = యజ్ఞహోత్రుడు; ఆదులు = మున్నగువారు; ఆతని = అతని యొక్క; పుత్రులు = కుమారులు; అధిక = మిక్కిలి; గుణులు = గుణవంతులు; వసిష్ఠుని = వసిష్ఠుని యొక్క; కొడుకులు = పుత్రులు; ప్రమథ = ప్రమథుడు; ఆదులు = మొదలగువారు; ఐరి = అయ్యిరి; సప్తర్షులున్ = సప్తర్షులు; అమరవిభుడు = ఇంద్రుడు {అమరవిభుడు - అమరు (దేవత)లకు విభుడు, ఇంద్రుడు}; సత్యజిత్ = సత్యజిత్తు; అను = అనెడి; వాడు = వాడు; సత్య = సత్యులు; భద్ర = భద్రులు; ఆద్యులు = మున్నగు వారు; సురలు = దేవతలు; ధర్మున్ = ధర్మున; కిన్ = కు; సూనృత = సూనృత; కునున్ = కు; పుట్టి = జన్మించి.
సత్యనియతిన్ = సత్యనిష్ఠతో; పురుషోత్తముడు = నారాయణుడు; సత్యసేనుడు = సత్యసేనుడు; అనగ = అనిపేరుగలవాడు; దుష్ట = దుర్మార్గపు; శీల = వర్తన; యుతులు = కలిగినవారు; దనుజ = రాక్షసుల; యక్ష = యక్షుల; పతులన్ = ప్రభువులను; దండించెన్ = శిక్షించెను; సత్యజిత్ = సత్యజిత్తునకు; మిత్రుడు = స్నేహితుడు; అగుచున్ = అవుతూ; జగము = లోకము; మేలు = శుభము; అనంగ = అనుచుండగ.
భావము:- ఓ పరీక్షిన్మహారాజా! మూడవ మనువు “ఉత్తముడు”. ఇతడు ప్రియవ్రతుని కొడుకు. ఇతను భూలోకం అంతటినీ మూడవ మనువుగా పాలించాడు. అతని పుత్రులు పవనుడు, సృంజయుడు, యజ్ఞహోత్రుడు మొదలైన వారు, మిక్కిలి గుణవంతులు. ఆ మన్వంతరంలో సప్తర్షులు వశిష్టుని కొడుకులైన ప్రమథుడు మొదలైనవారు. సత్యజిత్తు అను వాడు దేవతల ప్రభువైన దేవేంద్రుడు. దేవతలు సత్యులూ, భద్రులు మొదలైనవారు, విష్ణు సత్యసేనుడు అను పేరుతో ధర్మజుడు సూనృతులకు కుమారుడిగా అవతారం ఎత్తాడు. అతను సత్యజిత్తుకు చెలికాడై లోకం మెచ్చుకునేలా సత్య నిష్ఠతో దుర్మార్గులు అయిన యక్ష రాక్షసులను శిక్షించాడు.