పాంచాలీపరిణయము/ద్వితీయాశ్వాసము

పాంచాలీపరిణయము

ద్వితీయాశ్వాసము

క.

శ్రీరంగధామపోషిత, సారంగలలామ చక్రశంఖస్రేంఖ
ర్దోరంగసీమకమలా, నారంగఫలామలస్తసన్యస్తకరా.


వ.

అవధరింపుము జనమేజయునకు వైశంపాయనుం డిట్లనియె.


శా.

గాంధారీతనయాగ్రణీరచితలాక్షాగేహభూహవ్యవా
ట్పంథిం జిక్కక యేకచక్రపురి భిక్షాదీక్షసంసారదు
స్సంధుం దాటి ధరాసురాకృతులలో శ్రీసత్యవత్యాత్మజా
జ్ఞం ధర్మానిలశక్రభూముఖులు పాందాలోత్సవోత్సాహులై.


చ.

అలఁతియరంగుముంజవికె యావపుబూడిద పూఁతకోఁత పెం
కలను గురందు నిండు ఘటికాక్రయధాన్యపుఁ గువ్వలాసనం
బులు గొఱ్ఱెతోళ్ళు జాగిలపు ముంగిలిచట్టులు చట్టిమూఁతలుం
గలుగు కులాలగేహము ప్రఘాణము చేరిరి పాండునందనుల్.


క.

అట్టియిలు కాఁపుఁ బొడగని, సెట్టీ యీపూఁట కిట వసీిం చెదమిమ్మా
పట్టని యచ్చటఁ గుంతిని, బెట్టి నృపులు చనిరి ధరణి భృన్మణిపురికిన్.


వ.

చనిచని పలుచని రాచనిలయంబులు దెలుపని వెలిపాళెంబులు గడచి వడలికుడ్య
లడంచిన జడ చిత్రవర్ణ పర్ణ తూర్ణ రతగపతగక్షత గాత్ర శతపత్ర కుజము---
తాకలితాభినవసౌరభసౌభాగ్యనభస్వద్విభవపరాభవవిభావితభామినీ---
భారంలుగు పరిఘాపారవారంబు విడిచి యరాబులో నడిచి ధరాసురాం----
లంబు వెంబడింబడి యంబడరిన యంగడియంగడిం గడుపింగడిండిర----
చరణపట్టాంబర డంబర నూతనకేతన చామరస్తోమ రమణీయమణితో----
లవాకిసలయప్రసూసనానావితానకాయమానవితానంబు లవలోకించి----
కాశరహితప్రవేశకురుకుకురుకాశకరూశకోసలాది దేశాధీనసేనాధురంధర
స్కంథావారంబులు చేరి తదీయ భూరిభేరీశంఖపణవకంఖాణాది పుంఖానుపుంఖ
విశృంఖలఘోషణాశేషమానుషకోలాహలంబులచేత నూఱా - - - - - -
భంగివైయ్యారులు సైయేరులు దెంచుకొన్న తెఱంగున సప్తమంధర-----
బుల చందంబున ఘూల్ణిల్లుచున్న ప్రజం గాంచి యన్యొన్య ------
ప్రణామోపగూహనంబును బరస్పరబంధువృత్తాంత ప్రహృష్టంబును-------

పరిణయపత్రికాపఠనకంపితోత్తమాంగంబును గగనయంత్రవిలోకననిటలతటఘటిక
ప్రసృతిపాణియు నిజసహచరసుహృద్వియోగముహుర్ముహుర్బాహుతలాహ్వాక
పాదాంగుష్టదీర్ఘోత్తిష్ఠదాశావలోకియు శ్రవణరాహిత్యహస్తమస్తాభినయవార్తా
ప్రవర్తకంబును ద్రౌపదీకృశోదరీదర్శనవసంతసమయావ్యధారథాంగాస్తావ
లోకనాకులంబును బాంచాలీసమాగమనకాలక్షేపనిజనివేశపౌనఃపున్యగమనా
గమనకేవలవలమానమానసంబును నైన మానవసంఘంబునడమం జొచ్చి సమీహిత
సమీపసమీచీనచీనాంశుకాంచలసంసృష్టిమాత్రసంతుష్టచిత్తులను వృత్తవక్షో
రుహాముఖక్షణదాధ్యక్షవీక్షణక్షణక్షతక్షణక్షణక్షుత్పిపాసాకేశులను నిర్దమ
సమ్మర్దమధ్యమిథ్యామధ్యహసత్కులటాకులస్థలకులవిమర్శిదూరరదర్శివిపశ్చి
ద్విటులను ననేకహాయనంబుల కగపడి యొండొరులం గొంగులొడిసి వ్యవసాయ
వ్యవహారఋణవ్యాజంబుల కెదురుపలుకులం గొట్టులాడు నాగ్రహారికగ్రామ
ణులను గాలుమెట్టుటకుం గేలుపట్టుటకుం జీరచించుటకుం గేరడించుటకు నిష్టం
కించి ముష్టాముష్టిం గచాకచిం గలహించువారల వహించుకొని చేపట్లకుం బూను
జానపదులును ఐదుగురైదుగు రత్తఱి నుద్దులై పిడిగ్రుద్దులాటకుఁ గాలుఁద్రవ్వు
నితరేతరతృటితోపవీతజానుతలాంగుళీపంచకసంచరదుష్టపరిభ్రష్టపరిణయా
ష్టాదశవత్సరమత్సరభూవియచ్చరవత్ససముచ్చయంబులను జూచి నగుచు సవ్య
సాచిముఖులు కృతహోమధూమప్రకాశంబు వినిర్మితయంత్రమత్స్యంబు గంధా
క్షతమాల్యసమర్చితపంచకాండప్రకాండకోదండదండంబు చతుశ్శీమాపరి
వృతకుసుమవాసనాలంకృతసర్వసర్వంసహాధిపవిరచితసమంచన్మంచసంచ
యంబు పాంచాలగోత్రాకళత్రవేత్రధారాదూరనివారితమనుజవ్రజంబు మహా
రాష్ట్రభటభుజాలంబిచర్మభస్త్రికాశస్తపన్నీరధూతధూళిపాళిభరంబు కమ్ర
సామ్రాణిధూపఘుమఘుమాయమానంబగు రంగప్రదేశంబు ప్రవేశించి రంత.


ఉ.

ముక్కరం బెట్టి గట్టి హురుముంజి చొకారపు ముత్తియంబు చే
ర్చుక్క యమర్చి చెక్కులను జొక్కపుసంజుల కమ్మలుంచి య
మ్మక్కన మీఱు మేలు కడియమ్ములు గొమ్మని వ్రేలిపచ్చరా
చెక్కడపుంగరంబు దయచేసి తనూభవఁదల్లి వంపివన్.


గీ.

తెఱవైకైదండయంది యందియలు మ్రోయఁ, గంకణకరాబ్జహతిఁ గాంచి గల్లు మనఁగఁ
గచభరకుచావలగ్నముల్ కంపమొందఁ, గంబుకంధర యంతఃపురంబు వెడలి.


సీ.

పాద మొక్కటి పట్టుపరపుపైఁ బవళింప మెట్టికపై యంఘ్రి మెలంత యొత్త
సవటుపై నొరగూఁత హస్తతలంబొప్పఁ గడమకేల్ విరిబంతిఁ గౌఁగిలింప

నొరకపోలము సఖి సూక్తికిఁ బనియూన నొకచెంప మకరిక కొడఁబడంగ
డాచూడ్కి ముకురతటంబుపై నటియింస నలచూపు చేమోడ్సు చెలువఁబిలువ
నడిమిసావడి కొక్కింతపడమరంట, చక్కిచిక్కొమ్మతుదపనుల్ నిక్కుచొక్క
టంపుటేకాంతసౌధంబు టాకులోన, యుళతి పాంచాలి కొలువున్నయవసరమున.


ఉ.

కల్లతటంబునం జెమట గ్రమ్మ హుటాహుటి బోటివచ్చి యో
పల్లవపాణినిన్ బిలువరబంపిరి నన్నిట రాజుగార నం
బల్లకి యెక్కియా దొరకొమారిత గొల్లలు సౌవిదల్లులున్
జిల్లరదాదు లూడిగపుఁజేడెలు చెంతల సందడింపఁగన్.


ఉ.

కట్టలు కట్టలై తనదు కట్టెదుటన్ జయవెట్టి పాటనల్
పెట్టెడుసొమ్ము పెట్ట దొరబిడ్డయి పుట్టుటకున్ ఫలంబు నెం
దిట్టియొయార మిట్టియొఱ పిట్టిగభీరత యిట్టిరాజసం
బిట్టికుమారిఁ గంటిమె న్నహివయంచు రహి న్నుతించఁగన్.


క.

అల్లనఁ జని రంగస్థల, మల్లంతటఁ గాంచికాంచి కాంచితఘంటా
వేల్లన్మణికటికార్భటిఁ, బల్లకి డిగి పల్లవోష్ఠి పదచారిణియై.


సీ.

బెత్త మెత్తి రుచులు బిగి వెన్కఁగట్టిన హెగ్గడుల్ కైవార ముగ్గడింపఁ
గదవన్నెయడపంబు గట్టి పావడ చెక్కి శుకవాణి తెలనాకు చుట్టియొసఁగ
దోర్మూలరుచితటిద్ద్యుతులు తోరణ కట్ట రమణు లిద్దఱు చామరములు వీవఁ
గంకణపక్వనిక్వణము జక్కిణిద్రొక్కఁ గరటియాన యొకర్తు సురటి విసరఁ
బిక్కటిల్లిన చనుకట్టు బిత్తఱింప, హొయలరిగ లిందుముఖు లండ నొఱసిపట్టఁ
గడమ యుడిగంపుఁబడఁతుకల్ కదియ నరుగు, దెంచెఁ బాంచాలి రంగప్రదేశమునకు.


సీ.

నెఱిపెట్టికట్టిన నిండుచెంగావిపైఁ గాంచికాఘంటికల్ కళవళింపఁ
గులుకుగుబ్బమఱుంగుకొంగులో హారాళి లేమౌక్తికంబులు లెక్కకొదవ
వెలలేనినీరుకెంపులకమ్మపంజుడాల్ తేటచెక్కులఁ బిల్లదీపులాడ
లలితసీమంతలలంతిమణిశ్రేణి వేణిశ్రోణీభరక్షోణి గునియఁ
బాణినింద్రాణి కడియంపుటాణిపాణి, ముత్తియంబులు వెన్నెల మొలకలెత్త
మట్టియలు మ్రోయ మదనసామ్రాజ్యలక్ష్మి, రమణి రాణించె రమణీయరంగధరణి.


క.

రాజు ద్రుపదుండు రాజ, ద్రాజన్యసమాజముల యథాస్థానములం
దేజమున నుంచి వారలఁ, బూజలు గావించె సదయపూర్ణహృదయుఁడై.


గీ.

అప్పు డొప్పులకుప్ప కకుప్పునిభులఁ, దప్పకందఱ ప్రభులఁ గందర్సనిభులఁ
గొప్పకన్నులఱెప్పలు విప్పి కనుచు, నిప్పపూదండఁ గొని నడల్ గుప్పళించె.

క.

గంధవహ సఖసమీపగ, గంగాక్షత పుష్పధూప కల్పితపూజా
బంధుర ధనురస్త్రముల సు, ధాంధఃపథయంత్రమత్స్య మటుచూపి వడిన్.


శా.

ఆవేళన్ ద్రుపదాత్మజుండు సహజాహస్తాజ్ఞనుం బట్టి బా
హావిన్యాస మెలర్ప దిక్పతులతో నాడెన్ దొరల్ వింటిరా
యీ విల్లెక్కిడి యెవ్వఁడేని గగనప్రేక్ష్యోచ్చలల్లక్ష్యమున్
రీవిన్ బంచశరిన్ హరించిన యతండే భర్త యిక్కొమ్మకున్.


శా.

బాహాస్తంభవిజృంభమాణబలశుంభత్కీర్తికిన్ జాపవి
ద్యాహంకారపరాక్రమక్రమణదక్షారాతికిన్ ఖ్యాతికై
యాహా నేఁడిదె కేల విల్లుకొని లక్ష్యం బేసి పాంచాలిఁ గొన్
బాహూత్పన్నున కిట్టిచో నొడలు డాఁపం జెల్ల దొక్కింతయున్.


మ.

అని యాసల్ గనిపించనాడి ప్రభుచర్యల్ గాంచి పాంచాలి కి
ట్లను దిగ్దేశమహీశకోటి భవదీయఖ్యాతకళ్యాణద
ర్శనవాంఛం జనుదెంచెఁ గాంచితె జరాసంధాంశు మద్భూ సుయో
ధన దుశ్శాసన శల్య సాళ్వముఖి నేతల్ వీరు శాతోదరీ.


మ.

ఇతఁ డంగేశుఁ డతండు కేరళవిభుం డీరాజు చేదిక్షమా
పతి వీఁ డాహవదోహలాహిప మహాబాహాకఠోరాసి ఖం
డిత ఖండేతర గర్వధూర్వహనుఁ డీనేపాళుఁ డారట్టక
క్షితిపాలుండు విలోకనీయుఁడు సుమీ శీతాంశుబింబాననా.


శా.

ఏరాజుల్ సరిసాటి సోదరశతం బిర్వంకలం గొల్వఁగా
రారాజు న్మరి చీరికింగొనఁడు నీరంధ్రాష్టసంపత్కళన్
రేరా జన్వయకర్తగాఁగల కులశ్రేష్ఠున్ గళాకోవిదున్
రారాజుం గనుగొంటె మానధనునిన్ రాకేందుబింబాననా.


శా.

అర్ణోరాశిఁ దృణీకరించి వెలిచెట్టట్టిట్టు గావించి దృ
క్కర్ణస్వర్ణపదాంగదప్రియసఖుం గద్దించి యుద్దామసం
పూర్ణోదారత నీడుజోడుగనఁ డీభూలోకచింతామణిం
గర్జుం గంటివె వర్ణనీయుఁ డబ లాకర్ణాంతనేత్రోత్సలా.


సీ.

కాంభోజభూభర్తఁ గంటివా కమలాక్షి వరహయారోహ రేవంతుఁ డితఁడు
కాశ్మీరమహికాంతుఁ గంటివా కంజాస్య కుంకుమపంకభోగాంకుఁ డితఁడు
గాంధారధాత్రీశుఁ గంటివా గజయాన సప్తతంత్రీవాద్యచతురుఁ డితఁడు
గౌళధరాధ్యక్షుఁ గంటివా కనకాంగి సంగీతవిద్యాప్రచండుఁ డితఁడు

కుంతలాధీశుఁ గంటివా కుందరదన, వదనఘూర్ణితపూర్ణిమావరనఖేందు
మందగమనాద్వయీధూయమాన చమర, వాలహేలాచలత్కచవ్రాతుఁ డితడు.


క.

అహితమహీతలధవజవ, సహితాహవమహితబాహు జయధూర్వహు నా
గ్రహగహనదవదహనునిన్, మహామహునిఁ గంటె వీని మహిళాదహళున్.


సీ.

అకళంకవరపంకహరిణాంకహైమాంబుగంధసారమువాఁడు సింధునృపుఁడు
నృగణాభినుతశోభి మృగనాభిశాదంపుగీరునామమువాఁడు కేరళుండు
ఫణిబృందకురువిందమణికుండలయుతంపుసిగతాయెతులవాఁడు మగధరాజు
కటిబద్ధపరిశుద్ధపటనద్ధకాంచనత్సరుకఠారమువాఁడు దహళనృపతి
మంజుహురుముంజి ముక్తానురంజిచరణ, కంజమంజీరరుచివాఁడు కాశమహిమ
కుంజరుఁడు మంజులామోదమంజులాగ్ర, కబరికావిభ్రమమువాఁడు గౌళవిభుఁడు.


సీ.

హిమభానుమేనల్లుఁ డితనిలావణ్యంబు దలఁచిన మశకమాత్రమ్ము సుమ్ము
శతపత్రదాయాదుఁ డీతనితేజంబు ముందరను ఖద్యోతమాత్రమ్ము సుమ్ము
చతురాననబ్రహ్మ యితని పొక్కిటి తామరకుఁ బరాగాణుమాత్రమ్ము సుమ్ము
నిఖిలప్రపంచంబు నిక్క మీతనిడొక్క ప్రక్కకు నొతుకుమాత్రమ్ము సుమ్ము
మనుపఁ బుట్టింపఁ ద్రుంప సమర్థుఁ డీవి, భుండు పదియాఱువేలాఁడుపిండు సుమ్ము
మిండఱికమునఁ గడముట్టకుండుమనసు, వాఁడు వీఁ డమ్మ యదువంశవల్లభుండు.


సీ.

అనిరుధ్ధుఁ గంటినా యనిరుధ్ధబలశాలి బాణకన్యాబహిఃప్రాణ మితఁడు
బలభద్రుఁ గంటివా కలభద్రఢిమసారు రేవతీగుణవతీజీవ మితఁడు
ప్రద్యుమ్ను గంటివా ప్రద్యుమ్నకేయూరు రతికథాశ్రుతివిధారసికుఁ డితఁడు
సాంబునిఁ గంటివా కంబునిభగ్రీవు లక్షణాబ్జేక్షణాపక్ష మితఁడు
సాత్యకి యితండు కంటివా సత్యకీర్తి, నర్తకీహస్తగళితసంతానసూన
మంజకీకారితానంతమండలాంత, తారకుఁడు శౌరితమ్ముఁ డో తరళనయన.


గీ.

అనుచుఁ దోడెచ్చరించఁ గల్గొనుచురాఁగఁ, గనినివినియెఱుంగని విలాస -----
పొచ్చ మించుక లేని యమ్మచ్చెకంటి, యచ్చెరువు నొంది మెచ్చె రాజచ్ఛటంబు.


క.

పాంచాలీచంచన్మణి, పాంచాలీకనదురోజపాళింజోళిం
బాంచాలీకృతకుకురా, ట్చంచలదృక్పంచరీకచయము చరించెన్.


సీ.

జడదగుల్ కొనుచూపు జలదాంతచంచల యలనవ్వుచూడ్కి వెన్నెల----
కెమ్మోవిపై దృష్టి కెంపుతో నీలంబు కుచయుగాపాంగంబు కుధరతమము
మెఱుఁగారు పైవీక్ష మిహిరజాంబుచరంబు వలుదపొక్కిన ది-----
జఘనావలోకంబు జగతినాఁటినయమ్ము చరణకటాక్షంబు జలజభృంగి

లోచనానంద మొంద విరోచన ప్ర, భాచణా చక్రవాళా చలాచటాస్థ
లీచలత్ప్రభులతను నారాచమైన, రాచకొమరిత పాంచాలి చూచునపుడు.


సీ.

కోసలాధీశుండు మీసముల్ వడిగొల్పె నంగి చేతులఁ ద్రోచె నంగవిభుఁడు
జము ళిలోఁ జేయి సవరించెఁ గురురాజు శకభర్త చౌకట్లు చక్కదిద్దె
గౌళభూభుజుఁడు బాగాలకుఁ గైసాచె బంటుపై నొరిగె లంపాకనృపతి
బీరంబుతో బిఱ్ఱబిగిసెఁ గాశ్మీరుండు దహళుండు పూబంతి తావిగొనియె
సూరసేనుండు భుజములు చూచుకొనియెఁ, గుంతలము లింత యెగదువ్వెఁ గుంతలుండు
చంచలదృగంచలములు పాంచాలిఁ జేరి, యించుకించుక మీఁద వర్షించునపుడు.


మ.

ధృతిదూలింపని పార్థివుండు నురుబారిం గాసిలంబోని భూ
పతి భూషింపని రాజు మ్రాన్పడని భూపాలుండు చేతోగతిన్
నతి గావింపని మేదినీశుఁ డొకఁడైనన్ లేఁడు పాంచాలరా
జతనూజాతనుజాతనూతనవిలాసప్రౌఢి సామాన్యమే.


గీ.

కలజనంబుల తలఁపులో వలపు గరఁచి, కరువు గట్టిన బొమ్మ యీకలికికొమ్మ
ముజ్జగంబులు మోహాబ్ధి మునుఁగు టెట్లు, వనిత పాంచాలి యనిపించుకొనుట యెట్లు.


సీ.

తులఁదూఁగు మౌక్తికంబులతోడ దంతముల్ లలితగాత్రము కల్పలత యొసంగుఁ
బాలిండ్లు వెచ్చించు భర్మకటాహముల్ ధరదయచేయు నితంబతటము
తిలపద్మములనిచ్చుఁ దీరైనముక్కు మో మంబరంబు ఫలించు నసదుఁగౌను
నతనాభిశోభి పున్నాగంబుగొమ్మను బృథుచానురము సమర్పించువేణి
యెంచఁచగు నీఠీవిఁ దేలించె నౌర, కాకయుండిన ఘనకీర్తి కలుగు టెటులు
పటుకిరీటంబుగల నరపతికిఁగాని, కొంచెగానికి దొరక దీకువలయాక్షి.


క.

కడుమింటిపోల్కి విడుమీ, నడుమింతయుఁ గానరాదు నఖములరేఖల్
నిడుమించు లీనుకన్నులు, నుడుమీసంబులకు నెక్కుడోహెూ చెలికిన్.


క.

చెవులారఁ బల్కుపల్కుల్, చవులా మకరందమునకుఁ జవులాదంత
చ్ఛవులాహా కుచములకో, కవులా వర్ణించువారు కవులాచెలువన్.


శా.

చంద్రాంతఃపురకామినీమణి విలాసంబుల్ విలోకింప మో
యింద్రాదిత్య భవావరోధమహిళాహేళాకళల్ చూడ మో
సాంద్రంపుం బసిపాపయల్లు నవలాసౌందర్య మీక్షింప మో
రుంద్రశ్రోణులు మందగామిను లొయారుల్ సాటియే దీనికిన్.


శా.

ఒయ్యారమ్ముల యిక్క యిక్కలికి నేత్రోత్ఫుల్లవిద్యుల్లతల్
వెయ్యారమ్ముల కమ్మవింటిదొరకున్ వెచ్చించుఁ బొమ్మంచులం
బయ్యాడుందల మంచుబింబముల సంబాళించుఁ గెమ్మోవి దా
లియ్యాఁడుం దలమిన్న చన్నుగవతో నీడాగిరీడావళుల్.

శా.

అష్టాంగంబుంలడాలు మేలునగు మోమమ్మక్క దృక్కోణమౌ
నిష్టాలాపము లాడు బేడసలతో నిట్టౌర చక్కట్టు హా
ముష్టింబట్ట నడంగు మధ్య మనుచున్ మూర్ధన్యు లర్థించి రా
ధృష్టద్యుమ్న సహోదరీమణికి నేరీసాటి నారీమణుల్.


శా.

ఈ లావణ్యవతీశిరోమణి తనూహేలాకళావార్ధిలో
నోటాడంగలవాని భాగ్యమె సుమీ యోగ్యంబు సాధ్యేతర
ద్యోలక్ష్యం బెడలింపఁగూడనియెడన్ బ్రోద్దామసంచారి భూ
పాళిందోలి మదాళికుంతల వివాహంబౌదు మంచుం దొరల్.


చ.

తటుకున మంచెడిగ్గుపొర దట్టిబిగించఁగఁ జూచు రాజు దు
ప్పటి కటిఁగట్టు పార్థివుఁడు ప్రజ్ఞలుపల్కుచుఁ గార్ముకమ్ము చెం
గటి కరుదెంచి కాంచి విలుకైఁ గదలింపఁగనోడి గుండియల్
తొటుకుతొటుక్కనన్ దిగులుదొట్టిన భూభుజుఁడయ్యె నయ్యెడన్.


మ.

పటుచాపంబుఁ గదల్చు టెట్లు కదలింపంగూడుఁగా కెక్కు పె
ట్టుట యెట్టెక్కిడుఁగాక యాకసమునన్ డోలాయమానంబుగాఁ
జటులంబైన శరవ్య మేనుశరముల్ సంధించి త్రెళ్లంగ నే
యుట యెట్లంచొక కొందఱుండిరి నిరుద్యోగాత్తచిత్తంబులన్.


మ.

జవసత్వస్థిరసంధిబంధుఁడు జరాసంధుడు గోరంత త
క్కువగా నెక్కిడి యుక్కుదక్కి పడియెం గోదండదండాహతిన్
యవమాత్రంబు కొఱంతగా గుణము కొప్పందించి చేజాఱి తా
మవలం ద్రెళ్ళిరి శల్యనీలశిశుపాలాదుల్ ధనుర్ఘట్టనన్.


సీ.

కఠినకోదండంబుఁ గాంచి దండముఁ బెట్టి తిరిగిచూడక పోయె మరువిభుండు
దీనితో గొడవేల పోనిమ్ము రమ్మని లాటుఁదోడ్కొనిపోయె భోటవృంత
తమపట్టి నొకని కీసమకట్టి వశపోని విలు వెట్టిరని తిట్టి విరటుఁ డరిగె
విలుముట్ట నేల రోఁతలు పుట్ట నేల యీ యిల మెట్టరాదని యేగె శకుని
చాలుఁ బదివేలువచ్చెఁ బాంచాలి దొరకి, నట్టెకద నేఁడు మనయూరిం గట్టునన్
గుట్టుతోనని తనవచ్చినట్టి తెరువె, పట్టె ఘోట్టాణుఁ గూడి యారట్టనృపతి.


మ.

బలదేవాదులు యాదవుల్ పదరినం బాంచాలి కొంచెంపువా
రలకుం గూడదు గూఢరూపముల గోత్రాదేవసంఘంబులో
పల నున్నారదె పాండవేయులకె లభ్యంబౌ వృధాయత్నముల్
వలదంచున్ వసుదేవసూనుఁడు వడిన్ వారించెఁ జేసన్నలన్.

క.

నీలశిశుపాల మద్రనృ, పాల జరాసంధలోక బంధుతనూజుల్
చాలించి వెనుకఁ దిగిచిన, వేళన్ దివిజేంద్రసుతుఁడు ద్విజసభ వెడలెన్.


క.

వెడలి కడుఁబుడమినల్గడ, గడగడఁ గంపింపఁ గదలి కదళీకాండం
బొడియు కరివోలె వలగా, నడిచి నతుల్ చేసి ధనువునకు చేసాచెన్.


ఉ.

అక్కట దిక్కుటీరనట దాహవతేజులు రాజు లెల్ల ని
ల్లెక్కిడ లేకయుండ ద్విజుఁ డెక్కడ కార్ముక కర్మ మెక్క డ
మ్మక్క యితండు విప్రకుల మాఱడి బెట్టె నటంచుఁ గొందఱే
యుక్కును లేక యిట్టిపని కొగ్గునెయం చొకకొంద ఱాడఁగన్.


శా.

పూర్వాభ్యస్తశరాసముంబలె గరాంభోజంబునం బట్టి వి
ల్మౌర్వీధూర్వహనంబు గాఁగ నవలీల న్వంచి పంచాస్త్రత
ద్గీర్వాణాస్త్రశరవ్య మవ్యయగతిం ద్రెళ్ళంగ నేసెన్ సురల్
శర్వాణీశుఁడే యీతఁడంచు సుమవర్షంబుల్ ప్రవర్షింపఁగన్.


శా.

వీనింగన్నది తల్లి గాక నరుఁ డుర్వింబుట్టినం జాప వి
ద్యానైపుణ్యము లిట్టులుండవలదా యౌరా భుజాగర్వ మా
హా నిశ్శంకధృతిన్ సతేజుఁడు ద్విజుం డాభూభుజుడంచు న
చ్చానం గాంచు వియచ్చరోచ్చయము మెచ్చంజొచ్చె వివ్వచ్చునిన్.


ఉ.

ఎంతటివన్నె దెచ్చే గుఱియేసి యితండు ద్విజన్మజాతికిన్
వింతయుటంచు రాజులగణింపక తిట్టుచు గేలి గొట్టుచున్
గంతులు వైచుచుం దలకుఁగట్టిన చెంగెగవైచి పట్టుచున్
గొంతులు రాయఁ గోయనుచుఁ గూఁతలు వెట్టిరి గ్రామ్యభూసురుల్.


క.

మనలో మన మిటు పొరిచూ, పున నుండిన నుంటి మేకముగ నుండినఁ గుం
భిని యేలమె యని భృగురా, మునిఁ దిట్టిరి శ్రోత్రియోత్తములు ముంగోపుల్.


ఉ.

ఆసమయంబునం దజహయాసమయాన యొయారిరంగ సం
వాస వసత్ప్రసన్నముఖు వాసవసంభవు సాయకాసనా
భ్యాస నవప్రభావ వృషభాసన శాసనవాసనాభరున్
బ్రాసవదామకంబు మెడపై సవరించి వరించెఁ బూజలన్.


శా.

పాంచాలాత్మజ పాండునందను వరింపం గాంచి మమ్మెల్ల రాఁ
బంచెం బంచినవాఁడు చుట్టముబలెం బట్టిన్ సమర్పింపక
భ్రాంచచ్చంచలలక్ష్య మేయుమని మాయల్ పన్ని కన్నెం బ్రసా
దించె న్విప్రునికంచు నా ద్రుపదుపై దిగ్రాజు లత్యుగ్రులై.

శా.

రాటవ్యాధముఁ గొట్టి పట్టణము చూఱల్వట్టి రాజ్యంబుఁ వి
భ్రాజద్వైఖరి గట్టికొన్నఁగద కోపంబాఱుఁ బాఱుండు దో
స్తేజం చెంది తలోదరింగొనియె భూదేవుం డవధ్యుండు ని
ర్వ్యాజుం డే లతఁడుండ నిమ్మని రణవ్యాపార మేపారఁగన్.


క.

పాంచాలరాజు గదిసినఁ, జంచలపడి యతఁడు విప్రసభ మఱుఁ చొరం
గాంచి ద్విజకోటి నిజబా, హాంచితదండంబు లెత్తి యనికిం దొడరన్.


ఉ.

కవ్వడి నవ్వుచుం బలికెఁ గాంచనగర్భకులోద్భవాళితోఁ
బవ్వలు మీరు సాఁపుదురె శిష్యునిఁ జూడుఁడు క్రొవ్వెదల్విడన్
బవ్వెదఁ గ్రొవ్వెదం గల యశేషవిరోధుల యీశిరోధులన్
జివ్వకుఁ జువ్వరించు ననుఁ జెంతల గన్గొనుఁ డందఱుందగన్.


క.

అని కాంచి యనికిఁగొంచక, చనుదెంచిన కురుబలంబు శతమఖజుఁడు వి
ల్గొని నిలిపెం గోపాటో, పనటత్ఫణిబృందమునకు బదనికవోలెన్.


క.

గాండీవి మొనసి చండిమ, గండిమవిక్రమమువాఁడు గాఁడనఁగా ను
ద్దండతరు వెత్తి మారుతి, దండధరుండనఁగ దండ దార్కొనునంతన్.


క.

బలభిన్నందనునకుఁ గురు, కులతిలకున కపుడు పోరు ఘోరంబైనన్
దలవడఁకఁ బఱచెఁ బరచయ, మెలుఁ గెఱుఁగున్ జేసి రెడ్డి యెఱుఁగు నటంచున్.


శా.

తాలోత్తాలధనుర్ధరుఁడు నరుడండంతం జెంత నేతెంచు దో
స్సాలాంకుండు మరుత్తనూభవుఁడు లక్ష్యం బేసినం బోవు న
ప్పాలాశాంగుఁడు ధర్మజుండు కవలప్పార్శ్వానుగుల్ సుమ్మనం
దాలధ్వంసకు శీతలోక్తి కలరెం దాలధ్వజుం డయ్యెడన్.


క.

త్రిజగన్నుతబలమాద్య, ద్భుజునకు దుశ్శాసనునకు ద్రుపదసుతునకున్
విజయునకుఁ గర్ణునకు వా, యుజునకు శల్యునకు ద్వంద్వయుద్ధం బయ్యెన్.


మహాస్రగ్ధర.

నరు దాఁకెం గర్ణుఁ డంతం దరణితనయునిం దాఁకె గాండీవి తద్దు
ద్భరదోర్దండాగ్రజాగ్రత్కఠినధనురితాస్త్రంబు లభ్రంబు గప్పెన్
నరుం డొప్పెన్ శౌరి రొప్పెన్ ఖగములవిడుపుం దప్పెనప్పార్థుకుప్య
చ్ఛరధారల్ చేరి వారింపఁగ వసమరి భాస్వత్తనూజుండు పల్కెన్.


శా.

ఆంభోజాప్తతనూజుతోడ ననిసేయం గార్తవీర్యాదిదో
స్స్తంభధ్వంసి పురారివైరి రణవాంఛమబట్టి కేల్గట్టి ము
న్కుంభీసంభవు మ్రోలఁబెట్టిన ప్రవీణుం డేమొ యన్యుండు త
ద్గంభీరాస్త్రనిపాత మోర్వఁగలఁడే ధాత్రీబుధగ్రామణీ.

ఉ.

నీజగవింటినేర్పునకు నీభుజశక్తికి నిచ్చ మెచ్చితిం
జూజయశీల నానరుఁడు సూతజు చెప్పినవారిలోన నే
రాజను గాను విప్రుఁడదురానకు రాజనటన్న నగ్రభూ
తేజ మజేయమంచు సవితృప్రియనందనుఁ డేగె వెన్కకున్.


సీ.

అనిలనందనుఁడు శల్యునిమొగంబై చెట్టు పడవైచి చొరఁబాఱి పట్టుకొనియె
పట్టుపోఁదట్టి యబ్బల్లిదుం డల్లటు బిల్లమీఁటిన యట్లు భీముఁ జిమ్మె
చిమ్మితౌనని భీమసేనుండు దృఢముష్టిఁ దప్పించుకొమ్మని గుప్పె ఱొమ్ము
ఱొమ్ము గ్రుదిన నింత సొమ్మసిల్లక మద్రభూభర్త చనుమరఁ బొడిచి యార్చె
పొడుపువిడుపును గెంగేలియడఁపు గెడుపు
నిడుపు గుఱుచల నడుపురా డుడుపు లెంచ
జడుపు లెంచని తోఁడేటి యుడుపు మేటి
మాద్రియన్యుఁ బెనఁగి రున్నిద్రపటిమ.


క.

వడముడి శల్యునిఁ దొడిఁబడఁ, బుడిసేటిపట్టుగను బట్టి పుడమి వడంకన్
బడవైచిన యెడనొడలన్, గుడిగొను దుమ్మతఁడు తుడుచుకొనుచుం జనియెన్.


ఉ.

భార్గవుఁడుం గిరీటియును భర్గుఁ డెకాకల భానుసూనుతో
మార్గణమేయుచోట మఱిమానుసులే బలి భీమసేనుఁడున్
దోర్గతశీరుఁడొక్కరుఁడె తూఱిపెనంగఁగ శల్యుతోడ వీ
రార్గుఱి మించి రెవ్వరొకొ యంచు సుయోధనముఖ్యు లాడఁగన్.


శా.

అన్యావార్యములైన కార్యములు చేయఁంబూని పాందాలరా
ట్కన్యారత్నముఁ బత్నిగాఁ గొనియె లక్ష్యం బేసి యీభూసురుం
డన్యార్థంబులు మానిపొండనుచుఁ గంసారాతి వారింప రా
జన్యానీకము లంతట న్నిజనివాసుక్షోణి చేరెందగన్.


క.

అట్టి హరిపట్టి కోలం, దొట్టున యంత్రంబు పడిన దొర లాత్మధరల్
మెట్టిరి పుణ్యము చెల్లిన, పట్టుననుడు రాజి పుడమిఁబడిన కడంకన్.


గీ.

అక్కముక్కర పదిల మోయమ్మకమ్మ, యెచ్చరికప్పన గవదకట్టి తగట్టు
బొట్టెజతనంబు ననుజంకఁ బెట్టుకొమ్ము, -------ను నడిచరి చేడె లెల్ల.


మ.

వనజాక్షీకుచఘర్షహర్షరసదివ------కాం
చనభూషకృతి గూఢసంచర--------బశ్వభి
స్వనదన్యోన్యతనూపగూహనవలత్సంసారి సమ్మిశ్రమ
జ్జనసమ్మర్దము మర్దళాద్యనిన దా స్పష్టోక్త మిష్టార్థమే.

శా.

ఈపాళెంబున నిల్తమింతయన మీరేవైష్ణవుల్ నేటికిన్
బాపావాదులు తత్వవాదు లదయుల్ పాపాస్వయంపాక మే
లా పల్లెం గలదన్న మందరుబుధుల్ యజ్వల్ విధూతక్షుతన్
ఱేపే చేరెద మూరకంచుఁ బ్రజజాఱెన్ విచ్చుమొగ్గైవడిన్.


చ.

విభవము లెల్లఁ జూచితిమి వేడుక దీఱె దిగంతరాగత
ప్రభునికరంబుఁ గాంచితిమి బత్తెము చెల్లెను గుట్టుతోడ నేఁ
డభిమత మాత్మదేశముల కందఱ మేగుటయంచు భూసురుల్
రభస లసద్గతిం దమపురంబులు చేరఁగ వచ్చి రంతటన్.


ఉ.

తెచ్చిన చల్దికూళ్ళు తిని తిత్తులబియ్యము గార్చి కాసులున్
వెచ్చ మొనర్చి వక్కలును వీడెము చేసియుఁ గోకమాసియున్
వెచ్చనినీళ్ళు వాసి పొది వేసియు జానపదోచ్చయఁబు ము
న్వచ్చిన యుబ్బునోఁ దిరిగివచ్చె హుటాహుటి నూళ్ళు చేరఁగన్.


క.

ఆక్షణమునఁ జనిరనిల ఋ, భుక్షతనూభవులు ద్రుపదపుత్రీమణితా
బిక్షాశన దీక్షాదళ, నక్షమ నిజభాగ్యలక్ష్మి నా వెనుదగులన్.


శా.

కావేరీసరిదంతరాళ పులినిక్ష్మామధ్య విధ్యంతరా
ధ్యావాసానత కృత్తివాస కృపణార్తత్రాణ లోలానుకం
పావాలా తపనీయచేల రవిచంద్రాబ్జాలయాలంకృతే
క్షావక్షా సరసీరుహాక్ష గజరక్షాదక్ష దీక్షానిధీ.


క.

దైవతకులకంఠీరవ, దైవతగాంధారతాన తతగానకళా
కోవిదబైరించని నా, నావైపంచి ప్రపంచనమితశ్రవణా.


పృథ్వ.

జటీకృతవిటీపతి స్వమృదు సాదపాదచ్ఛటా
విటీకృతఘటీ కుచద్వితయ గోపకన్యాఘటా
భటీకృతఘటీ కసత్పతి విధాతృసంధ్యానటా
నటీకృతపటీరజిన్మధు బిభేదకీర్త్యుద్భటా.


గద్య.⁠

ఇది శ్రీమద్రామభద్రభజనముద్రకవిపట్టభద్ర కాద్రవేయాధిపవరసమాగత
సరససారస్వతలహరీపరిపాక కాకమాని ప్రబోధబుధకవిసార్వభౌమపౌత్ర
రామలింగభట్టపుత్ర కౌండిన్యగోత్రభాగధేయ మూర్తినామధేయప్రణీతంబైన
పాంచాలీపరిణయంబను మహాప్రబంధంబునందుఁ ద్వితీయాశ్వాసము