నా జీవిత యాత్ర-3/గాంధీ - ఇర్విన్ ఒడంబడిక, మా విడుదల
11
గాంధీ - ఇర్విన్ ఒడంబడిక, మా విడుదల
కాంగ్రెసు వారు నడిపిన ఉప్పు సత్యాగ్రహ సమరం పూర్తి విజయాన్ని సాధించిన కారణంగా, ఆంగ్లేయులకూ మనకూ మధ్య రాజీ షరతులు ప్రతిపాదించబడుతున్నాయనీ, రాజీ కుదరవచ్చుననీ పత్రికా ముఖంగా తెలియరావడంతోనే, సత్యాగ్రహ ఖైదీల కందరికీ నూతనోత్సాహం బయల్దేరింది. తాము ఎప్పట్లో బయటపడగలమా అన్న ఆతురతా బయల్దేరింది. వారిలో చాలామందికి బ్రిటిష్‌వారి తత్వం తెలియదు. నాయకులకు కూడా ఏవేవో తీరని కోర్కెలు ఉత్పన్నమయినాయి. కాంగ్రెస్ వాలంటీర్లూ, వర్కర్లూ మొదలైన చిన్న పెద్ద లందరూ, నాయకులను నిశ్చింతగానూ, గ్రుడ్డిగానూ అనుకరిస్తూన్నారన్న విషయం మాత్రం అందరూ ఎరిగి ఉన్నదే.
నేను కాంగ్రెసు 'కాబినెట్'లో ఉన్నది స్వల్పకాలమే అయినా, అ 1921 - 22 మధ్య దినాలలో ఉండిన ఆ కాబినెట్ వారి 'లోగుట్లు' నాకు బాగా అర్థమయ్యాయి. దర్మిలా నేను రాజీనామా ఇచ్చిన తరవాత కాంగ్రెసులో ఉన్న ఇతర సభ్యులకు వలెనే, నాకూ ఆ కాంగ్రెసు కాబినెట్ వారి లోట్లన్నీ తెలియరాలేదు. ఆచార ప్రకారం కార్యనిర్వాహక వర్గంలో ఒక ఆంధ్రు డుండడం మామూలు. ఆలాంటి సభ్యులలో మొట్టమొదటివాడు దేశభక్త కొండ వెంకటప్పయ్య పంతులుగారు. దర్మిలా నేనూ, నా తరవాత బులుసు సాంబమూర్తిగారూ ఆంధ్ర సభ్యులంగా ఉండేవారము. సాంబమూర్తిగారి తరవాత డా॥ భోగరాజు పట్టాభి సీతారామయ్యగారు ఆ స్థానాన్ని ఆక్రమించారు. అంతేగాని, మాలో ఎవ్వరికి స్థిరమయిన శాశ్వత సభ్యత్వం లేదు. ఈ సభ్యులు, అధ్యక్షునితోపాటు సాధారణంగా ఏటేటా మారేవారు.
రాజీ వదంతులు
కన్ననూరు జెయిలులో ఉన్న మేమంతా కాంగ్రెస్సుకూ, ప్రభుత్వానికీ మధ్య కుదరబోయే రాజీని గురించి కలలుగంటూ, ఆ రాజీ ఎప్పుడు, ఎంత త్వరగా కుదురుతుందా అని ఆశగా ఎదురు చూసే వారం. మాలో కార్యనిర్వాహక సభ్యు లెవ్వరూ లేని కారణాన్ని, మాలో ఎవరూ ముందుగా విడుదల కావడానికిగాని, అట్టివారి ద్వారా వారికొచ్చే ప్రత్యేక వార్తలద్వారా నిజా నిజాలు గ్రహించడానికిగాని అవకాశం ఎంతమాత్రమూ లేకుండా పోయింది.
రాజీ ప్రతిపాదనలు జరుగుతాయి, జరుగుతున్నాయి అన్న పుకార్లు 1930 ప్రారంభ దినాలలోనే ఆరంభమయ్యాయి. జయకర్ గారూ, సర్ తేజ్‌బహదూర్ సప్రూ ప్రభుత్వంవారి సూచనలు ఏమీ లేకుండా, తమంతట తాముగానే ఏదో రాజీ కుదిరితే బాగుండును అనుకుని ప్రయత్నించడానికి బయల్దేరితే, వారివలన ఏదో జరిగిపోతుందని తలచడం అవివేకమే గదా! కాని, పాపం, ఆశపడిన యువక బృందం నోరు తెరుచుకుని కూర్చుంది. పేపర్లలో మాత్రం ఈ మధ్యవర్తులు, ప్రభుత్వంవారి అనుమతితో గాంధీగారినీ, మోతీలాల్, జవహర్‌లాల్ నెహ్రూ లను జెయిళ్ళలో కలుసుకుంటారని వార్తలు పడ్డాయి. కాని వీరు అలా చేయడానికి ప్రభుత్వం అనుమతి ఇచ్చినట్లుగాని, రాజీ ప్రతిపాదనలు చేసినట్లుగాని ఎక్కడా కనబడలేదు. మా ఊహాగానాలు
ఇల్లా ఏదో పుకారుగా ఒక వార్త పేపర్లో వచ్చేసరికి, ఆ వార్త అధికార పూర్వక వార్తగానే నమ్మి, ఊహాగానాలు చేశాం. ఆ రాజీ విషయాలన్నీ ముందు ముందు వ్రాస్తాను. ఏ ప్రకారంగా నాయకులను తప్పుదారి త్రొక్కించారో, ఏ కారణంగా ఆ రాజీ ప్రయత్నాలు విఫలం అయ్యాయో, సప్రూ - జయకరుగార్లూ, కాంగ్రెసు నాయకులు కూడా ఏ విధంగా పప్పులో కాలేశారో అన్నీ వివరిస్తాను. ఈ లోపల కన్ననూరు జెయిలులో ఉన్న మేము రాజీ ప్రతిపాదనలు జరుగుతున్నాయి, రాజీ కూడా కనుచూపుమేర దూరంలోకి వచ్చింది అని అనుకుంటూ, ఆ జూలై - ఆగస్టు మాసాలు ఉత్సాహంగా గడిపాం.
ఆ నాటి పరిస్థితి అత్యంత ఆశాజనకంగా ఉండడానికి కారణం, తండ్రీ కొడుకులయిన ఆ నెహ్రూ ద్వయమూ, డా॥ సయ్యద్ మహమ్మదూ, కార్యనిర్వాహక సభ్యులు ఒకరిద్దరూ, ఉత్తర ప్రదేశంలో ఉన్న నైనిటాల్ జెయిలునుంచి గాంధీగారిని కలుసుకోడానికిగాను ఎరవాడా జెయిలుకు తీసుకురాబడ్డారన్న వార్త. ఇదంతా ఒకపక్కనుంచే వస్తూన్న సమాచారం అని మాకు తెలియదు. కాంగ్రెసు నాయకుల నోటంట వారి కోర్కెలు రాబట్టాలని చేసిన తంత్రమేమో గాని, వారందరూ కలిసికట్టుగా ఆలోచించిన మీదట, ఒకే అభిప్రాయానికి రావడానికి వారికి ఏ విధమయిన సావకాశమూ కల్పించబడలేదు. కాని వారి వారి అభిప్రాయాలు యిలా యిలా ఉన్నాయనిమాత్రం వైస్రాయిగారికి వార్తలు చేరేశారు.
బెల్లంకొట్టిన వైస్రాయి
అంతవరకూ వైస్రాయ్‌గారు బెల్లంకొట్టిన రాయిలా, శబ్దరహితంగా, ఉలుకూ పలుకూ లేకుండా కూర్చున్నాడు. అంతేకాదు, తాను ఏవయినా సూచనలు చేసి ఉంటే, వాటిని వెనక్కు లాక్కుని కాంగ్రెస్ వారిని చికాకులపాలు చెయ్యడానికి సిద్దం అవడానికి కావలసిన పన్నుగడలూ, సన్నాహాలూ చేస్తూ వచ్చాడు. నిజానిజాలు తెలుసుకుని, అవసరమయిన సలహాలు, సూచనలూ ఇవ్వడానికి మా కెవ్వరికీ ఖైదు కారణంగా హక్కు లేకుండా పోయింది. అందువల్ల సాధారణకాంగ్రెస్ సభ్యునిగా గాని, అఖిల భారత కాంగ్రెస్ కమిటీ మెంబరుగా గాని నేనేమీ సలహా ఇవ్వగల స్థితిలో లేను.
ముందుగా ఏ లీడర్నీ వదలని కారణంగా రాజీ జరగడానికి ఎల్లా సాధ్యం అవుతుందనే అనుమానం నన్ను పీడిస్తూనే ఉంది. కాని చాలామంది యువకులూ, కొంతమంది పెద్దలూ కూడా అన్యధా తలచి, నేను అనుమానం సూచిస్తూంటే నామీద విరుచుకు పడేవారు. అల్లా ఆ జూలై - ఆగస్టు మాసాలు రెండూ ఆశాపూరితంగానే వెళ్ళిపోయాయి. అనుకోని విధంగా, ఎంతో ముందుగా ఈ యుద్ధ కాండంతా ఎంతో విజయవంతంగా ముగుస్తోందని మా వాళ్ళంతా కేరింతలు కొడుతూ చాలా ఉల్లాసంగా తయారయ్యారు. వార్తాపత్రికలలోని గడబిడ తప్ప, మధ్యవర్తి ప్రయత్నాలను గురించీ, జెయిళ్ళల్లో ఉన్న నాయకులు ఖైదీలుగానే ఉంటూ ఉన్నా వారిలో వారు కలుసుకుని సంప్రతించుకోవడానికి అవకాశాలు కలుగజేయబడ్డాయని కానీ, స్పష్టంగానూ, సవ్యంగాను, ఆ జూలై - ఆగస్టు మాసాలలో గాని, దర్మిలాగాని ఎలాంటి సమాచారమూ, సరిగా గ్రాహ్యం అయ్యేరీతిని, ఏ మూలనుంచీ అందలేదు. రాజీ ప్రయత్నాలు విఫలం అన్న వార్తయినా ఎక్కడా పొక్కలేదు.
వట్టి పేపరు వార్తలు
గవర్నమెంటువారు రాజీ ప్రయత్నాలు విఫలమయ్యాయని చెప్పకపోవడానికి అనేక కారణా లున్నాయి. మీరు కలుగజేసుకుని రాజీ ప్రయత్నాలు జరపడంగాని, ఫలాని విధంగా ఫలానా ఫలానా సూచనలు గాంధీగారితోనో, నెహ్రూ ద్వయంతోనో చేయవల సిందనిగాని ప్రభుత్వంవారు ఎప్పుడూ ఏ మధ్యవర్తికీ సూచించి ఉండలేదు. ప్రభుత్వం వారికి సంబంధించి నంతవరకూ అసలు ప్రతిపాదనలూ జరగలేదు, ప్రయత్నాలు విఫలమూ కాలేదు. అందువల్ల ఎలాంటి ప్రకటనా చేయవలసిన బాధ్యతా ప్రభుత్వం వారిమీద లేదు. భారతదేశమందలి కాంగ్రెసు నాయకులూ, దేశం అన్నిమూలలా ఉన్న జెయిళ్ళలో మ్రగ్గు తూన్న కాంగ్రెస్ ఖైదీలూ, ప్రజానీకమూ పేపరు వార్తలు చూసి, వాటిని నమ్మి ఎల్లా తెలివి తక్కువగా ప్రవర్తించారో గ్రహించిన వైస్రాయి మాత్రం జరిగిన సంఘటనల కన్నింటికీ తనలో తాను కులుకుతూ ఆనందించి ఉండి ఉండచచ్చును.
జూలై - ఆగస్టు మాసాల దర్మిలా ఎలాంటి సమాచారమూ అందని కారణంగా ఏ విధమయిన తాజావార్తలూ ప్రకటించడానికి పత్రికలవారికి అవకాశమే చిక్కలేదు. మేమంతా గాంధీగారికీ, వైస్రాయిగారికీ మధ్యను నడస్తూన్న సుదీర్ఘ చర్చల కారణంగా రాజీ కుదరడం ఆలస్యం అయిఉండవచ్చునని భావించాం. అందువల్ల చర్చలలో పాల్గొన్న ఆ ఇరువురు ముగ్గురు నాయకులకూ తప్ప తదితరుల కెవ్వరికీ ఏ విధమయిన వార్తలూ అందక పోవడాన్ని, కాస్త ఆలస్యం అయినా ప్రతిపాదనలు మాత్రం ఫలవంతంగానే ముగుస్తాయి అనే ఆశతోనే ఉన్నాం. అదృష్టవశాత్తూ, ఆ ప్రయత్నాలు ఏనాడో విఫలమయ్యాయన్న ముక్క వినబడలేదు. విఫల మయాయన్న వార్త విని ఉంటే ఎంతో నిరుత్సాహ పడిపోయి, ఎలాంటి అలజడులు రేకెత్తించే వారిమో! "As dead as Queen Anne" అన్న ఈ ఆంగ్ల జాతీయం ఈ ప్రతిపాదనలకు బాగా వర్తిస్తుంది.
రాజకీయ ఖైదీల విడుదల
1930 జూలైలో ఆరంభం అయిన రాజీ ప్రతిపాదనలు విజయవంతంగా జరిగాయని నమ్మడం నిజంగా చాలా దు:ఖకరమైన విషయం. నిజానికి, నాయకులను సెక్రటరీ ఆఫ్ స్టేట్ ఇచ్చిన ఒక ఆర్డరు ప్రకారంగా విడుదల చేయడమన్నది మొదటి రౌండ్ టేబిల్ కాన్పరెన్స్ అయిన తరవాత జరిగింది. కాంగ్రెసు తరపున తమ ప్రతిపాదనలు చెయ్యడానికి నాయకులను, వారిలో - వారు సంప్రతించుకోడానికి వీలుగా, విడుదల చెయ్యడమే సవ్యమయిన మార్గం. జూలై - ఆగస్టుమాసాలలో రాజకీయ ఖైదీలు పడిన ఆశ క్రమేపీ వృద్ధయి, పరిష్కారం ఆలస్యం అయ్యే సరికి నిరాశ మరీ ఎక్కువయి పోయింది. ఆ ప్రకారంగా ఆనాడు జెయిళ్ళలో ఉన్న ఖైదీల మనోభావాలు అల్లా ఆశా నిరాశల మధ్య ఊగులాడాయి. ఆ పరిస్థితిని అపసవ్యంగానూ, అస్తవ్యస్తంగానూ చక్కబెట్టిన దానికి ప్రతిఫలం అది. వారు చేసిన ఎన్నో త్యాగాలకు ప్రతిఫలంగా, గౌరవ ప్రదమయిన పరిష్కారం జరుగనున్నదని ఖైదీ లెంతగానో ఆశించారు.
విడుదలకి అసలు కారణం
కాని అసలు జరిగిందేమిటంటే, సెక్రటరీ ఆఫ్ స్టేటూ, బ్రిటిష్ క్యాబినెట్టూ నవంబరు 30 వ తేదీని జరిగిన ఆ మొదటి రౌండ్ టేబిల్ కాన్ఫరెన్స్‌లో కాంగ్రెసువా రెవ్వరూ లేని కారణంగా అది వట్టి బూటకపు నాటకమే అయిపోయిందని గ్రహించి, ఆ రౌండ్ టేబిల్ కార్యక్రమాన్ని ముందు సంవత్సరానికి వాయిదా వేసి, దానిలో పాల్గొనడానికి కొంతమంది కాంగ్రెసువారికి అవకాశం కలుగజేయడానికి మాత్రమే, ఒక్క యేడాది పూర్తి జెయిలు అనుభవాలతో ఉన్న అన్నివర్గాల కాంగ్రెసు నాయకులనూ విడుదల చేశారు.
గాంధీగారిని యావత్తు భారతదేశానికీ ఏకైక నాయకునిగా గుర్తించి, వైస్రాయ్‌గారు ఆయనతో సంప్రతింపులు ఆరంభించారు. ఆ సంప్రతింపుల పర్యవసానంగానే, గాంధీ - ఇర్విన్ ఫ్యాక్టు అనే ఒక ఒప్పందానికి ఆ ఇరువురూ రావడమూ, ఆ ఒప్పందాన్ని అనుసరించి దేశంలో అన్నిప్రాంతాలలోనూ జెయిళ్ళలోఉన్న కాంగ్రెసు వారినందరినీ ఏకంగా జెయిళ్ళనుంచి విడుదల చెయ్యడమూ, దాని మూలంగా మేము కన్ననూరు జెయిలునుంచి బయట పడగలగడమూ సంభవించింది.
కాంగ్రెసువారి కాళ్ళబేరం
ఊహించ శక్యంగానంత ఘనంగా సైమన్ కమీషన్ బహిష్కరణ జరుపగలిగిన కాంగ్రెసు పార్టీవారు, అనగా ఆ పాతకాలపు స్వరాజ్య పార్టీ నాయక వర్గం ఎంతో ఓరిమి వ్యక్తం చేసే తమ మితమైన వాంఛలతో బ్రిటిష్‌వారినీ, బాహ్య ప్రపంచాన్నీకూడా తాము కోరిన కోర్కెలు చాలా పరిమితంగానూ, సబబైనవిగానూ ఉన్నాయని నమ్మించాలని చూశారు. వారు నిజంగా స్వాతంత్ర్య ప్రతిపాదనే గనుక పట్టుకు కూర్చుంటే వారి కోర్కెలు చాలా అతిగా ఉన్నట్లు భావింపబడతాయని తలచారు.
అంతేకాదు, తమ స్వాతంత్ర్యవాంఛను విస్మరించి, అఖిల పక్ష సమావేశం వా రంగీకరించిన విధంగానే నడవాలని, అఖిల భారత కాంగ్రెసు కమిటీవారూ, పండిత మోతీలాల్ నెహ్రూగారూ కూడా, బాగా ఆలోచించి, అన్ని పార్టీలవారిని 1928 నాటి కలకత్తా కాంగ్రెస్‌కు ఆహ్వానించారు. సెక్రటరీ ఆఫ్ స్టేటూ, బ్రిటిష్ కాబినెట్టూ కూడా తాము ఎంతో వినయంగా కోరిన అ తగు మాత్రపు కోరికలను చాలా నిదానంగా పరిశీలించి అంగీకరిస్తారనే ఆశతోనే అఖిల పక్ష నాయకులూ ఆ కాంగ్రెస్‌కు హాజరయ్యారు.
గత సంవత్సరం మదరాసు కాంగ్రెస్‌లో ఆమోదించిన స్వాతంత్ర్య తీర్మానానికి భంగంరాని రీతిగా, అఖిల పక్ష సమావేశం వారు అంగీకరించిన ఆ పథకాన్నే మోతీలాల్ నెహ్రూ కమిటీవారు తమ రిపోర్టులో మూర్తీభవింపజేశారు. కాంగ్రెసు నాయకుల ఆలోచనా, వారి విధానమూ బ్రిటిష్‌వారి హృదయంలో పూర్తిగా వ్యతిరేక భావాన్నే కలిగించాయి. సైమన్ కమిషన్ బహిష్కారం వైస్రాయి హృదయంలోనూ, బ్రిటిష్ కాబినెట్‌లోనూ ఆగ్రహావేశాలు కలిగించింది. బాధ్యతా యుత ప్రభుత్వం, స్వాతంత్ర్యం అన్న కోరికలు వారిని ఇంకా కలవరపెట్టాయి. సైమన్ కమిషన్ బహిష్కరణ విజయమూ, అఖిల పక్ష సమావేశంవారి రాజ్యాంగ పథకమూ, వైస్రాయ్ ఇర్విన్‌ని కోపోద్రిక్తుణ్ణి చేశాయి. అటువంటి ఆవేశాలనూ, వాంఛలనూ అణగ ద్రొక్కి రూపుమాపడం తమ అందరి విధియని ఆయన తలచాడు.
ఆంగ్లో - ఇండియన్ పత్రికాధిపతులు ఉచితానుచితాలను మరచారు. భారత దేశాన్ని తుపాకి చేతబట్టి నడిపించవలసి ఉంటుందనీ, దానికి సంస్కరణలు ప్రసాదించడం కొన్ని సంవత్సరాల పాటు వాయిదా వేయవచ్చుననీ వారి పత్రికలు వ్రాశాయి. దీని కంతటికి కారణం ఆ పాతకాలపు స్వరాజ్య పార్టీవారు కాళ్ళ బేరానికి దిగి, స్వాతంత్ర్యాది వాంఛలను దిగ మింగడమే. కలకత్తా కాంగ్రెస్‌లో మన ఆశయం స్వాతంత్ర్యమేనని నిరూపించడం జరిగిన మాట వాస్తవమే. ఒక ప్రక్క తీవ్ర నిరసనతో కూడిన బహిష్కరణ, ఇంకోపక్క ఏదో ఒకటి ఇప్పించండి బాబూ అంటూ కాళ్ళ బేరమూ, ఇవే ఆంగ్లో - ఇండియనులు బిర్రబిగిసి పోవడానికి కారణ భూతాలయ్యాయి.
పాతపాటే
స్వరాజ్య పార్టీవారికి ఈ పద్ధతి నూతనం కాదు. వారి తత్వం మొదటినుంచీ ఒక్కలాగే ఉంది. 1917 - 18 మాటే యేమిటి, అంతకు ముందునుంచీకూడా వారి పద్ధతులు అల్లాగే ఉన్నాయి. మాంటెగ్, ఛెల్మ్స్‌ఫర్డ్ గారల పరిశోధనలు ఎల్లా నడిచాయి? డా॥ అనిబిసెంట్ మొదలైన నాయకులందరూ 1917 కు పూర్వం ఏ దారి తొక్కారో ఆ బాటలోనే 1928 - 29లో కూడా మన స్వరాజ్యపార్టీ నాయకులు నడిచారు. ఆ 1917 - 18 సంవత్సరాల లోనూ, 1928 - 29 లలోనూ జరుపబడిన అలజడులతో నాకు సంబంధం ఉన్న కారణంగా, ఆ రెండు సందర్భాలలో నడచిన చరిత్ర ఇక్కడ టూకీగా తెలియజేయడం నా కర్తవ్యంగా భావిస్తాను. 1917లో జరిగిన కలకత్తా కాంగ్రెస్ అధ్యక్షురాలిగా అనిబిసెంటమ్మ 1918 లో భారత దేశానికి డొమినియన్ స్టేటస్ ఇవ్వక తప్పదనీ, ఆలా ఇవ్వబడిన అధినివేశ ప్రతిపత్తి పద్ధతులనూ, విధానాలనూ భారతదేశం బాగా ఆకళించుకున్న తరవాత, అనగా సుమారు ఐదు మొదలు పది సంవత్సరాల లోపల ఆ డొమినియన్‌ను స్టేటస్‌ను పూర్తిగా భారతదేశంలో అమలు పరచాలనీ ఆమె కోరారు.
1918 లో నడచిన చరిత్ర
అదే సంవత్సరంలో జరుపబడిన రెండవ కాంగ్రెస్‌లో, బ్రిటిష్ ప్రభుత్వంవారు భారతదేశానికి స్వయంపరిపాలనావకాశం తప్పక కలుగజేస్తామనీ, ఎప్పటినుంచి ఆలాంటి అవకాశాన్ని భారతదేశానికి ఇవ్వవచ్చునన్నది నిర్ధారణ చేస్తూ, రాజ్యతంత్ర పద్ధతిని, కట్టుబాట్లను రూపొందిస్తూ త్వరలోనే ప్రకటన చేస్తామనీ చెప్పిన కారణంగా, వారికి కృతజ్ఞతలు తెలుపుడు చేయాలనీ, డొమినియన్ స్టేటస్ రూపొందించే లోపల, కాంగ్రెస్ - లీగ్ పథకం భారతదేశానికి స్వయంపరిపాలన కలుగజేస్తామన్న ఈ శుభ సమయంలో వెంటనే అమలు పరచాలనీ కోరారు. ఇంతా జరిగాక, తీరా మాంటేగ్ వచ్చి స్వయంగా సంగతి సందర్భాలు విచారిస్తున్న సమయంలో, డా॥ అనిబిసెంట్ దేశం కోరుతూన్న కోర్కెలను వివరిస్తూ, సర్ శంకరన్ నాయరు అభిప్రాయమే తన అభిప్రాయం అంది.
సర్ శంకరన్ నాయర్ కాలానుగుణంగా నడవగల మనిషి కాడన్న విషయం లోక విదితమే. ఆయన 1897 లో కాంగ్రెస్ అధ్యక్షుడు. ఆ తరవాత మైలాపూరు మిత్రులతో కలిసి ఉద్యోగాది హోదాల మీదికి దృష్టి మళ్ళించుకున్నాడు. అక్కడ ఆ మైలాపూరు యోధులు ఈయన్ని దిగద్రొక్కి పైకి వెళ్ళిపోయారు. 1907 లో ఆయన మదరాసు హైకోర్టులో ప్రభుత్వ న్యాయవాది గానూ, పబ్లిక్ ప్రాసిక్యూటరుగానూ ఉండేవాడు. నాతోబాటు ఆయన లండన్ నగరంలోని గ్రేస్ ఇన్ (Gray's Inn) ద్వారా బారిష్టరు పరీక్షకు హాజరయ్యాడన్న సంగతి ఇదివరలోనే చెప్పి ఉన్నాను. ఆయన 1917 - 18 లో గాని జడ్జీ కాలేదు.
ఆయన స్వాభావికంగా మితవాది. 1918 లో కాంగ్రెసును బలపరచడానికి సర్ శంకరన్ నాయర్‌కి ఏయే కారణాలున్నయో మనకు తెలియదుగాని, డా॥ అనిబిసెంట్ మాత్రం శంకరన్ నాయర్‌ని గురించి మాంటేగ్‌తో చెప్పడమూ, ఆ శంకరన్ నాయర్ అభిప్రాయమే తన అభిప్రాయమని సూచించడమూ మాత్రం క్షమార్హం కాదు.
ఆ ముక్కలలో కాంగ్రెస్ అధ్యక్షురాలిగా ఆమె తన వాంఛితార్థమూ, కాంగ్రెస్ తీర్మాన రూపకంగా కోరిన కోరికా, మాంటేగ్‌తో నొక్కి వక్కాణించి ఉండవలసింది. అంతేకాదు, కీ. శే. ఎస్. శ్రీనివాసయ్యంగారు మాంటేగ్‌తో చెప్పిన విషయాలు మనం గ్రహించాలి. ఆయన ధర్మమా అని, మాంటేగ్ తనతో శ్రీనివాసయ్యంగారు చెప్పిన విషయాలన్నీ తు. చ. తప్పకుండా, తన డైరీలో వ్రాసుకున్నాడు.
మాంటేగ్ కథనం ప్రకారం శ్రీనివాసయ్యంగారు భారత దేశంలో ఏ ఒక్కరూ కూడా కాంగ్రెస్ - లీగ్ పథకం పట్ల సుముఖంగా లేరనీ, అందువల్ల ఆయన దానిని మన్నించవలసిన అవసరం ఉండదనీ, ఆశాజనకంగా ఏదో అనుగ్రహిస్తాం అని అంటే, చిత్తం అలాగే తమ దయ అని ప్రజలంటారనీ నమ్మబలికినట్లు తెలియవస్తోంది. అప్పట్లో శ్రీనివాసయ్యంగారు చెన్నరాష్ట్రానికి అడ్వకేట్ జనరల్.
ఇటువంటి పరిస్థితులలో, కాంగ్రెసు 'డిమాండ్'ను కాదని, ఏదో ద్వంద్వప్రభుత్వ పద్ధతిని ఆ మాంటేగ్ - ఛెల్మ్స్‌ఫర్డ్‌గారలు దేనినో ఇస్తామని ఊరుకున్నారు. మాంటేగ్ రాకముందు, ఆయన చాలా సరళ హృదయంతోనూ, సదభిప్రాయంతోనూ వస్తున్నాడనే అందరూ భావించారు. ఆయన వచ్చినప్పుడు దేశీయులు గట్టిగా తమ అభిప్రాయాన్ని నొక్కి వక్కాణించ గలిగిఉంటే 'ప్రొవిన్షియల్ ఆటోనమీ' లాంటి దేదయినా భారతీయుల కివ్వడానికి ఆయన ఆయత్తపడేవాడు.
డా॥ అనిబిచెంట్ 1917 కు పూర్వం భారతదేశానికి ఎంతో సేవ చేసి, భారతదేశానికి 'హోం రూల్' ఇవ్వాలి, ఇచ్చి తీరాలి అని స్వాతంత్ర్య సమరం సందర్భంగా జెయిలుకు కూడా వెళ్ళిన ఇల్లాలు. పైగా మాంటేగ్ వచ్చేముందు, కాంగ్రెస్ అధ్యక్షురాలిగా, భారతదేశానికి స్వపరిపాలనావకాశం కలుగజేసితీరాలని గట్టిగా చెప్పింది. కొద్ది నెలలో ఆమె తత్వం పిరాయింపవడమేగాక, తన అభిప్రాయమూ, సర్ శంకరన్ నాయర్ అభిప్రాయమూ ఒకటేనని చెప్పడాన్ని, అనుకోకుండా, పప్పులో కాలేసింది.
శ్రీనివాసయ్యంగారు అడ్వకేట్ జనరల్‌గా ప్రజాహృదయాన్ని గుర్తెరిగినవాడే. తనకు తానే మాంటేగ్‌ను కలిసి మాటాడగోరి, తన వ్యక్తిగతమైన అభిప్రాయంతో ఆయన్ని ముంచెత్తకుండా ఉండి ఉండవలసింది. ప్రజాభిప్రాయానికి భిన్నంగా, ఆయన సొంత డబ్బా వాయించి, దేశానికి తీరని అన్యాయం చేశాడు. శ్రీనివాసయ్యంగారు తనకు తానుగానే వచ్చి కలుసుకున్నాడనీ, తనముందు సాక్ష్యం ఇవ్వడానికని ఆయన్ని ఎవ్వరూ ఆహ్వానించలేదనీ మాంటేగ్ తన డైరీలో వ్రాసుకున్నాడు. ఆయనకి తనకి అప్పట్లో రాజకీయాలతో సంబంధం లేకపోయినా, అడ్వకేట్ జనరల్‌గా మాటాడిన కారణాన్ని మాంటేగ్ ఆయన అభిప్రాయం మీద విలువ ఉంచవలసి వచ్చింది.
అప్పటికి పండిత మోతీలాల్ నెహ్రూకీ రాజకీయాలతో సంబంధం లేదు. అయినా ఆయన, తన స్వంత అభిప్రాయంగా, మాంటేగ్‌తో ఇప్పటినుంచి ఇరవై యేళ్ళ లోపుగా భారత దేశానికి బాధ్యతాయుత ప్రభుత్వం (Responsible Government) ఇస్తే జనం సంతోషిస్తారని చెప్పాడు. ఇలాంటి సాక్ష్యాలు ఆధారంగానే, మాంటేగ్ 'రౌండ్ టేబిల్' పత్రికాధిపతి లయొనెల్ కర్టిస్ (Lionel Curtis) సలహా ప్రకారం, ద్వంద్వ ప్రభుత్వ సూచనలు చేసి ఊరుకున్నాడు.
కొంతమంది నాయకులే గనుక ద్రోహంచేసి ఉండకపోతే, వెంటనే 'ప్రొవిన్షియల్ ఆటోనమీ' (Provincial autonomy) స్థాపన అయిఉండేది. దానిని అనుభవిస్తూ, పూర్తి బాధ్యతలకోసం ఆందోళనచేస్తూ ఉండిఉంటే, అటువంటి పూరాపూచీగల ప్రభుత్వాన్ని కూడా ఇప్పటికీ ఏ పది సంవత్సరాలలోపుగానో, సాధించి ఉండేవారం. భారతదేశ చరిత్ర వేరు విధంగా రచియింపబడి ఉండేది.
ఈ పట్టున ఆ 1918 - 19 నాటి స్థితికీ, సైమన్ కమీషన్ బాయ్‌కాట్ నాటి స్థితికీ (1928 - 29) విలియా వేయడం న్యాయం.
1928 లో జరిగిన కథ
మదరాసులో 1927 లో జరిగిన కాంగ్రెస్‌లో పండిత జవహర్‌లాల్ నెహ్రూచే ప్రతిపాదించబడిన 'స్వాతంత్ర్య' తీర్మానం ఆమో దించబడింది. మహాత్మా గాంధీగారికిని, మోతీలాల్ నెహ్రూగారికిని ఈ తీర్మానం పట్ల ఎలాంటి అభిలాషా లేదు. 1885 నాటి ప్రథమ కాంగ్రెస్ లగాయతు బెంగాల్, కాంగ్రెసుపట్ల ఆదరాభిమానాలతోనే ఉంటూ వచ్చింది. కాని దర్మిలా తిరుగుబాటుదారీ విధానాలకు ఆలవాలం అయింది. చాలాకాలం ఆ తిరుగుబాటుదారీ విధానం బెంగాల్‌లో నాటుకు పోయింది. బెంగాల్ యువకులు ఎందరో అహింసా పద్ధతిని దేశాన్ని సేవించగోరి ఎన్నో సాహసకార్యాలుచేసి మృతజీవులయ్యారు. గాంధీగారి అహింసాత్మక విధానం క్రమేపీ బెంగాల్ యువకుల మనోతత్వాలమీద పనిచేసి, 1923 నాటికి వారిని శాంతపరచి, మితవాదులనుగా తయారుచేసింది. అటువంటి పరిస్థితులలో, 1928 లో కాంగ్రెస్ తిరిగీ కలకత్తాకు ఆహ్వానించ బడింది. నాటి కాంగ్రెస్‌కు అధ్యక్షునిగా ఎవరిని నిర్ణయించాలి అన్న ఆలోచనలో బెంగాల్ వారిదృష్టి మోతీలాల్ నెహ్రూ మీద పడింది. నిజానికి ఆయనే తన కుమారునిచే ప్రతిపాదించ బడిన స్వాతంత్ర్య తీర్మానాన్ని తిరగతోడగలడని వారు భావించారు. ఈ కథ అంతా లోగడ మనవిచేసే ఉన్నాను.
1918 లో డా॥ అనిబిసెంట్‌లా, కలకత్తాలో పండిత మోతీలాల్ నెహ్రూ తన అధ్యక్ష ఉపన్యాసం లోనే స్వాతంత్ర్య తీర్మానాన్ని వెనుకకు నెట్టి అఖిల పక్ష సమావేశం అంగీకరించిన పథకాన్ని ముందుకు పెట్టి, కాంగ్రెస్ దానినే ఆమోదించవలసిందని సూచించాడు. కాంగ్రెసు ఆశయం మాత్రం పూర్తి స్వాతంత్ర్యమే అంటూ కూడా, బ్రిటిష్ వారు, ఈ దేశ పరిస్థితులను బాగా గమనించి, ఏమిచ్చినా సంతోషమే అన్నాడు.
గాంధీగారు చూపించిన మార్గాన్ని అనుసరించి సైమన్ కమిషన్ బహిష్కరణ విషయంలో అంతటి మహోన్నత శిఖరాన్ని అధిష్టించిన కాంగ్రెసువారే, ఆంగ్లేయుల వద్దనుంచి తమ వాంఛితార్ధమైన స్వేచ్చా స్వాతంత్ర్యాలను పిండాలని తలుస్తూనే, దేశం తరపున, దేశీయుల తరపున స్వాతంత్ర్యమే తమ ఆదర్శం అని చెపుతూనే, ఏక్ దమ్ దిగజారిపోయి, సైమన్ కమిషన్ వారినుంచి, అధమం పరిపూర్ణమైన 'ప్రొవిన్షియల్ ఆటోనమీ' సూచనకైనా నోచుకోని పరిస్థితికి పడిపోయిన ఉదంతమూ, అందుకు కారణాలూ ఎన్నిసార్లు చెప్పినా, నాకు చెప్పాలనిపిస్తుంది. ఈ విషయం గుర్తుకొచ్చినప్పుడల్లా నాకు బాధ వచ్చి, "ఆంగ్లేయులు శక్తిహీనులయిన శత్రువులను చూసి జాలి పొందరు. కాదా అంటే నెత్తికెక్కుతారు" అన్నది మళ్ళీ మళ్ళీ మనవి చెయ్యకుండా ఉండలేను. వారు మనలను అధ:పాతాళానికి అణగద్రొక్కాలనే ఉద్దేశంతోనే, కత్తి చేతబట్టి సంపాదించిన రాజ్యాన్ని కత్తి చేతబట్టే పరిపాలిస్తాం అని అన్నారనీ, వారు అలాఅనగలగడానికి కారణం మన నాయకులూ, వారి చేతలూ, వ్రాతలూ, పలుకులూ కల్పించిన మన దుస్థితేనని మళ్ళీ ఒకసారి మనవి చేసి, నా మన:క్లేశాన్ని మరి కాస్త తగ్గించుకోడానికి ప్రయత్నిస్తాను. కాగా, దున్న పోతునీ దూడనీ ఒకే కాడికి కట్టిన విధంగా, మన దేశంలో ఉన్న రాజుల ప్రసక్తికీ, రాష్ట్రాలలో ఉన్న ప్రభుత్వ విధానాలకీ కూడా పనిలో పనిగా ముడిపెట్టగలిగిందా కమిషన్. దీని కంతటికి కారణం మన పిరికితనమేనని తిరిగి వక్కాణించి నా ఆవేదన తీర్చుకోనివ్వండి.
ఆ యువక ద్వయం - సుభాష్‌బాబూ, జవహర్‌బాబూ, ఇటువంటి పతనం ఏదో రాబోతోందని గ్రహించే, కలకత్తా కాంగ్రెస్‌లో విషయ నిర్ధారణ సభ వారు అంగీకరించిన ప్రతిపాదనకు బహిరంగ సమావేశంలో అడ్డు తగిలి, తమ సవరణ ప్రతిపాదించారు. అనుకున్న దానిని కాదంటున్నారని గాంధీగారు అడ్డు తగలడం చేతనే, ఆ సవరణ వీగిపోయింది. ఈ సందర్భంలో కూడా భారతీయ నాయకులు తమ బలహీనతనే తిరిగీ ప్రదర్శించుకున్నారు. దేశక్షేమాన్ని విస్మరించారు. మోతీలాల్ నిరంకుశులలో నిరంకుశుడు. ఆయనకు తిరిగీ మహాత్ముని అండ దొరకగానే, శాంతంగా మంచి చెడ్డలు విచారించడం న్యాయమేమో అన్న దృష్టే సన్నగిల్లింది. ఆ అత్యవసర పరిస్థితులలో ఆయన ధీశక్తిని ఉత్తేజపరచి, ఆ రాజీ ప్రతిపాదనలకు వ్యతిరిక్తత ఆయనలో కలిగించలేకపోయాము.
1918 - 19 సంవత్సరాలలో అనిబిసెంటమ్మ పరిస్థితీ అల్లాగే ఉండేది. మేము ఆమెతో కలిసి 'హోం రూలు' సంరంభంలో పనిచేసిన సందర్భాన్ని పురస్కరించుకుని, ఉపన్యాసాల ద్వారానూ, వార్తా పత్రికల ద్వారానూ ఎంతగా ప్రయత్నించి తంటాలుపడ్డా, ఆమెను మాంటేగ్ ముందర దిగజారి పోతూన్న పరిస్థితినుంచి ఆనాడు తప్పించలేకపోయాం. ఆమె మొదటిసారిగా మాంటేగ్‌ను దర్శించి నప్పుడు, ఆయన నిశ్చల, నిర్మల, శాంతియుత వాతావరణంలో తన విచారణ జరపగల అవకాశం కలుగజేయమని కోరిన కోర్కెను మన్నించిన కారణంగానే, ఆమె అంత హఠాత్తుగా దిగజారిపోయిందని మాలో కొందరికి అనుమానం కలిగింది.
సప్రూ - జయకర్ రాయబారాలు
1930 నాటి రాజీ ప్రయత్నాలు మహాత్మాగాంధీతో సహా అన్నివర్గాల కాంగ్రెసు నాయకులూ జెయిళ్లల్లో ఉన్న సమయంలో ఆరంభించబడ్డాయి. ఆ ఉద్యమ సమయంలో చాలాకాలం మోతీలాల్ నెహ్రూగారు బయటే ఉన్నారు. ఆ నాడు ఆ రాజీప్రతిపాదనలు సర్ తేజ్ బహదూర్ సప్రూ, జయకర్‌గార్ల నాయకత్వాన నడిచాయి. ఆనాటి ఉద్యమం మాంచి రసకందాయ పట్టుగానే నడిచింది. బ్రిటిష్ రాజకీయ వేత్తలూ, ప్రభుత్వం వారూ కూడా ఆ పరిస్థితిని ఎదుర్కోవడం అంత సులభం కాదని మెల్లి మెల్లిగా గ్రహిస్తున్నారు.
ఆంగ్లరాజకీయవేత్తలు సందర్భానుసారంగా మార్గావ్వేషణచేసి జాగ్రత్తపడగల నేర్పరులు. వారు భారత నాయకుల మనోభావాలు గత 20 సంవత్సరాలుగా పూర్తిగా శోధించి గ్రహించి ఉన్నారు. ఈ సారి భారతీయుల దృష్టి ప్రక్కత్రోవల పట్టించాలనే కోరికతో, రౌండ్‌టేబిల్ కాన్ఫరెన్స్ అనే నూతన పంధాను చేబట్టారు.
మొదటి రౌండ్‌టేబిల్ కాన్ఫరెన్స్ 1930 నవంబరులో జరుగవలసి ఉంది. ఆ కాన్ఫరెన్స్ జరిగేలోపల సప్రూ - జయకర్ గార్లు ఎల్లాగయినా గాంధీగారినీ, నెహ్రూ ద్వయాన్నీ ప్రభుత్వం వారి అనుమతితో కలుసుకుని సంప్రతించాలని ప్రయత్నించారు కాన్ఫరెన్స్‌కి ముందుగా మన నాయకులు ప్రభుత్వంవారితో సంప్రతించడానికి వీలుగా వారిని మున్ముందుగా విడుదల చేయమని కోరడానికి బదులుగా, మాకు వారిని కలవడానికి అవకాశం ఇవ్వండి అని సప్రూ - జయకర్లు అడగడం ఒక అసాధారణ విధానం.
పైగా, ఈ మధ్యవర్తిత్వం వహించిన పెద్దలకు కాంగ్రెసన్నా, కాంగ్రెసు వారి విధానాలన్నా మొదటినుంచీ వ్యతిరేక భావమే. కాగా, వారు బహిరంగంగా ఈ శాసన ధిక్కారాన్ని ఈసడించిన పెద్ద మనుషులు. అటువంటి పరిస్థితులలో ఈ పెద్దలు కాంగ్రెసు వారికీ, ప్రభుత్వం వారికీ మధ్య సంప్రతింపులు సాగిస్తాం అంటే, వారియందు విశ్వాసం ఉంచడం ఎల్లా సాధ్యం అవుతుంది? వారు కాంగ్రెసువారి మనోభావాలను గ్రహించి, ఆ నాయకులను విడుదల చెయ్యకుండా, సంప్రతింపులు జరపడం న్యాయం కాదుగనుక, వారిని ముందుగా విడుదల చెయ్యవలసిందని ప్రభుత్వానికి సలహా ఇచ్చి ఉండవలసింది. అదే న్యాయ మయిన పద్ధతి గదా! లేదా, వారు ప్రభుత్వంవారి మనోభావాలను గ్రహించి, వారు ఇవ్వ దలచిన దేమిటో తెలుసుకుని, ఆ వివరాలు కాంగ్రెసు వారికి తెలియజేసి ఉండవలసినది. ఈ రెండు పద్ధతులలో యేదీ వారు అనుసరించలేదు.
వారు మున్ముందుగా పండిత మోతీలాల్‌నెహ్రూగారితో సంప్రతించి, వారి మనోభావాలను గ్రహించి, వారిని పిడికిల్లో ఇముడ్చుకున్నారు. ఎప్పుడూ ఏదో ఒకరకంగా రాజీపడితేనే మంచిదని వాంఛించే ఆ మోతీలాల్‌గారు, అడిగినదే తడవుగా తమ మనోభావాలన్నీ వారితో విప్పి చెప్పేశారు. అల్లా చెప్పేముందర, ఆయన మంచి చెడ్డలు యోచించలేదు. ఆయనకు తాను పలుకుతూన్న పలుకులు కాంగ్రెసుకూ, తనకూ కూడా చిక్కులు కలుగజేస్తాయేమోనన్న ఆలోచన లేకుండా పోయింది. మోతీలాల్‌గారిని 1930 జూన్ వరకూ అరెస్టు చేయలేదు.
లండన్‌లో ప్రచురించబడే డెయిలీ హెరాల్డ్ స్లోకోంబ్ సూచనలు విలేఖరులలో స్లోకోంబ్ (Slocombe) ఒక ప్రముఖ విలేఖరి. ఆయన ఆంగ్లేయుడు. ఆయన తన పత్రికలో 1930 నవంబరులో కలువ నున్న రౌండ్‌టేబిల్ సమావేశంలో కాంగ్రెసువారు కలిసివస్తే మంచిది అంటూ కాంగ్రెసు వారికి కొన్ని సూచనలు ఇచ్చాడు. మోతీలాల్‌నెహ్రూగారి అభిప్రాయాలు స్లోకోంబ్‌కి అందచేస్తూ, సప్రూ - జయకర్లు మధ్యవర్తిత్వం వహించడానికి పూనుకున్నారు. స్లోకోంబ్ యందు కలిగిన విశ్వాసం వల్లనో, లేక స్లోకోంబ్ ఆంగ్లేయుడయిన కారణంగా - తమ వాంఛలను సరిగా నివేదించ గలడనో, మోతీలాల్‌గారు తాను తన దేశానికి బ్రిటిష్ వారి వద్దనుంచి వాంఛించే దేమిటో ఆ విలేఖరి కెరుక పరచాడు
"కాంగ్రెసువారు రౌండుటేబిల్ కాన్ఫరెన్స్‌లో పాల్గొనడానికి ముందు, భారతదేశానికి డొమినియన్ స్టేటస్ ఇవ్వడం ఖాయమని ఆంగ్లేయులు రహస్యంగా వాగ్దానం యివ్వాలి. ఈ వాగ్దానానికీ, రౌండ్ టేబిల కాన్ఫరెన్స్‌వారి సలహాలకీ, పార్లమెంట్‌వారు చేయదలచు కున్నదానికీ లంకె ఉండరాదు. కాంగ్రెసు వారికి బ్రిటిష్‌వారూ, వైస్రాయిగారూ రహస్యంగా ఇచ్చిన ఈ వాగ్దానం, కాన్ఫరెన్స్‌వారూ పార్లమెంట్ వారూ ఏవయినా ప్రత్యామ్నాయ సూచనలు చేస్తే, వారు చేసిన ఆ చిట్ట చివరి సూచనలకు లోబడే తాము ఇచ్చిన వాగ్దానాన్ని చెల్లించుకోవచ్చు"నని మోతీలాల్‌గారు స్లోకోంబ్‌కి తెలియజేశారు. మోతీలాల్ గారి సూచనలను గాంధీగారి ఎదుటా, ఇంకా కొందరి నాయకుల ఎదుటా ఉంచడానికి సప్రూ - జయకరుగారలు వైస్తాయ్‌గారి అనుమతి కోరారు. భారత ప్రభుత్వంవారు ఆనందంగా అనుమతిని ప్రసాదించారు. యెరవాడ జెయిలులో ఉన్న గాంధీగారిని చూడడానికి సప్రూ - జయకర్ గారలు వెళ్ళారు.
గాంధీగారి ప్రతిపాథనలు
ఎట్టి పరిస్థితిలోనయినా, ఏ విషయం మీదయినా, ఇంకొకరి ప్రోత్సాహం, పోద్బలం లేనంతవరకూ గాంధీగారికి ఎప్పుడూ నిశ్చిత అభిప్రాయా లుంటాయి. పూర్తిగా బాధ్యతాయుత ప్రభుత్వం భారత దేశానికి ఇస్తామని బ్రిటిష్ గవర్నమెంట్‌వారి తరపున భారతప్రభుత్వం వారు హామీ ఇవ్వాలనీ, ఈ హామీని రౌండు టేబిల్ కాన్ఫరెన్స్‌వా రంగీ కరించి తీరాలనీ, రక్షణల విషయంలో తీసుకోతగ్గ మార్గాలను వారే నిర్ణయించవచ్చుననీ గాంధీగారు సూచించారు. సరిఅయిన రాజ్యాంగ విధానం రూపొందించి తీరాలనీ చెప్పారు. కాగా, ఈ మధ్య కాలంలో కల్లు దుకాణాల దగ్గర, విదేశీ బట్టల దుకాణాల దగ్గరా పికెటింగ్ కొనసాగించే హక్కు కాంగ్రెసువారికి ఉండా లన్నారు.
ఇద్దరు మధ్యవర్తులు గాంధీగారి సూచనలనుకూడా గ్రహించినవారై, నాయకుల అభిప్రాయాలనూ పరిశీలన చేయవలసి ఉంటుందంటూ, వాటిని వైస్రాయ్‌గారి ముందు ఉంచారు. ప్రభుత్వంవారి మనస్సులో ఏముందో ముందుగా గ్రహించకుండానే రాయబారాలకి ఆ ఇరువురూ పూనుకోవడం శుద్ధ తప్పు. అంతేకాదు - మోతీలాల్‌నెహ్రూ గారిని అరెస్టు చేసేముందు, ఆయన స్లోకోంబ్‌కు తెలియజేసిన అభిప్రాయాలను నిర్భంధంలో ఉన్న గాంధీగారి అభిప్రాయాలతో గుదిగుచ్చడం ఇంకొక తప్పు.
మున్ముందుగా అప్పటి కప్పుడు భారతదేశానికి పూర్తి బాధ్యతాయుత ప్రభుత్వాన్ని ఇస్తామని వాగ్దత్తం చేసితీరాలని గాంధీజీ తన అభిప్రయాన్ని స్పష్టంగానూ, స్ఫుటంగానూ చేప్పేశాడు. పైగా ఆ వాగ్దత్తం రౌండ్ టేబిల్ కాన్ఫరెన్స్‌వారి ఎదుట బహిరంగ పరచాలనీ, అధమం పార్లమెంటు వారి ఎదుటనయినా దాని ప్రసక్తి ఎత్తాలనీ ఆయన సూచించాడు. వారు చేసే ప్రత్నామ్నాయ సూచనలకు అది కొంత వరకూ అనుగుణంగా ఉండవచ్చునని అన్నా డాయన.
వైస్రాయ్ వెనకడుగు
కాని పూర్తి బాధ్యతాయుత ప్రభుత్వాన్ని భారతదేశానికి ఇవ్వడానికి ఒప్పుకున్నా డనుకున్న ఆ వైస్రాయ్‌గారు, అప్పుడే తన పుట్టె మునిగినటు అడుగులు వెనక్కి వెయ్యడం ఆరంభించాడు. అల్లా వెనకడుగు వేస్తూనే నాయకులను సందర్శించడానికి సప్రూ - జయకర్ల గారికి అనుమతి ప్రసాదించాడు. వైస్రాయ్ వెనకడుగు వేయడానికి కారణం మోతీలాల్ నెహ్రూగారు. ఆయన అరెస్టుకు పూర్వం, స్లోకోంబ్‌ను నమ్మి తన హృదయంలో ఉన్న ఏ భావాలనయితే ఆయన ఎదుట పెట్టాడో, అవన్నీ అప్పుడే స్లోకోంబ్ వైస్రాయ్‌గారికి అందజేయడమే.
ఎప్పుడయితే మోతీలాల్‌నెహ్రూ సంపూర్ణ బాధ్యతాయుత ప్రభుత్వం ఇచ్చే విషయమై రహస్యపుటొప్పందానికి దిగజారిపోయాడో, పైగా రౌండ్‌టేబిల్ కాన్ఫరెన్స్‌వారి ప్రత్యామ్నాయ సూచనలకు ఆ ఒప్పందం లోబడవచ్చునని అంగీకరించాడో, ఆ తక్షణం వైస్రాయ్ గారు తాను ఏ విధమయిన రహస్యపు టొప్పందాలకూ అంగీకరించ కూడదనే నిశ్చయానికి వచ్చేశాడు.
న్యాయంగా, స్లోకోంబ్ ద్వారా నెహ్రూగారి సూచనలను గ్రహించిన తక్షణం, సప్రూ - జయకర్ గార్లకు గాంధీగారిని కలుసుకోవడానికి అనుమతి నిరాకరించి ఉండవలసింది. దానికి బదులుగా, దెబ్బతో బాధపడేవాడి నెత్తిన మొట్టికాయ కూడా మొట్టినట్లుగా, తాను కాంగ్రెసువారి కోరిక ప్రకారం, ఏవో కొన్ని సంస్కరణలను మాత్రమే సూచించ గలననీ, వాటిని పట్టుకునే ప్రజలు వారి వ్యవహారాలను వారు చక్కదిద్దు కోవాలని చెప్పేశాడు. మధ్యవర్తులుగా వ్యవహరిస్తామని బయల్దేరిన పెద్దలు తప్పుటడుగు వేస్తే ఇంతకంటె అధికంగా ఏం జరుగుతుంది?
జెయిలునుంచి గాంధీగారి స్టేట్‌మెంటు
గాంధీగారు, తాను ఖైదీగా ఉంటూ తన తరపునా, దేశం తరపునా ఏ విధమయిన సూచనలనూ చెయ్యజాలనని అనడం న్యాయంగానూ, ధర్మంగానూ ఉంది. ఈ రూలు ఎల్లప్పుడూ, అందరికీ, అన్ని దేశాలవారికీ వర్తిస్తుంది. అంత తీవ్రంగా జవాబు ఇస్తూ గాంధీగారు, మళ్ళీ ఇవి నా స్వంత అభిప్రాయాలంటూ కొన్ని సూచనలు చెయ్యకుండా ఉండి ఉంటే బాగుండేది. స్వంత అభిప్రాయాలంటూ గాంధిగారు కొన్ని సూచనలు చేసిన కారణంగానే, నెహ్రూద్వయం వారితో ఏకీభవించ జాలమని అనడంలో దోషం ఏమీ లేదు.
ఎంతో ఘనంగా అహింసాత్మకంగా పోరాటాన్ని సాగించిన అనంతరం, ఒక దేశ స్వాతంత్ర్య విషయమైన ప్రస్తావనలో, తమ తమ స్వంత అభిప్రాయాలను బహిరంగ పరచడం ఎప్పుడూ న్యాయం కాదు. దేశం తరపున తాము తమ నిశ్చితాభిప్రాయాలు తెలియ చెయ్యవలసి ఉన్నందున తమకు మున్ముందుగా స్వాతంత్ర్యం లభింప జేయవలసిన బాధ్యత ప్రభుత్వం మీద ఉన్నదన్న విషయం మన నాయకులు స్పష్టంచేసి ఉండవలసింది.
కాని ఆచార విరుద్దంగా, 1930 ఆగస్టు 15 వ తేదీని మహాత్మాగాంధీ జెయిలునుంచే ఒక స్టేట్‌మెంట్ చేశారు. తానున్నూ, తన మిత్రులున్నూ, సప్రూ - జయకర్లు నడపిన రాజీ ప్రయత్నాలకు కృతజ్ఞులమనీ, ప్రభుత్వంవారు శాంతి నెలకొల్పే సదుద్దేశంతో కాంగ్రెసు వారితో సంప్రతించ తలచి ఉంటే. జెయిళ్ళలో ఉన్న ఆ నాయకులతో నిరాక్షేపణీయంగా సంప్రతింపులు జరపవచ్చుననీ ఆ స్టేట్‌మెంట్‌లో ఉంది. రాజీ ప్రతిపాదనల విషయంలో వైస్రాయ్‌గారి అనుమతికూడా ఉండి ఉంటే, గాంధీగారు అటువంటి స్టేట్ మెంట్ ఇవ్వవలసిన అవసరం ఉండేదికాదు.
రాయబారాల వైఫల్యం
మధ్యవర్తులు రెండు నెలలపాటు పడిన తంటాలుకు ప్రతిఫలంగా జెయిళ్ళలో ఉన్న నాయకుల వద్దనుంచి ఇటువంటి స్టేట్ మెంట్ తీసుకు రాగలగడం వారి ప్రతిభే యేమో! గాంధీగా రిచ్చిన ఈ స్టేట్ మెంట్‌తో వైస్రాయ్‌గారి బుర్ర తిరిగిపోయిందనీ, తాను ఏవిధమయిన రాజీ ప్రతిపాదనలూ చెయ్యకుండా నిమ్మకు నీరెత్తినట్లు చల్లగా ఊరుకుంటానేమో అనుకునే గాంధీగారు ఈ స్టేట్ మెంట్ ఇచ్చి ఉంటాడని వైస్రాయ్ తలచి ఉండాలనీ, ఈ పరిస్థితికి గాంధీగారి స్టేట్ మెంట్ కారణ భూతమయిందనీ, నైనిటాల్ జెయిలునుంచి ఆ నెహ్రూగారు ఎరవాడ జెయిల్లో ఉన్న గాంధీగారికి తెలియజేశారు.
ఆగస్టు 31 వ తేదీని మధ్యవర్తిత్వ ప్రయత్నమనే ఆ తతంగమంతా నిష్పలం అయినట్లు తేలిపోయింది. స్వరాజ్య సాధనకై చరిత్రాత్మకంగా సాగించిన బ్రహ్మాండమయిన అహింసాత్మక సమరంతో ప్రపంచ దృష్టినే ఆకట్టుకోగలిగిన కాంగ్రెసువారు, అనుకోని విధంగా మళ్ళీ దిగజారిపోయారు. ఎన్ని వేలమంది జెయిళ్ళకు వెడితేనేం, పోరాటం ఎంత ముమ్మరంగా సాగిపోతేనేం - తుదకు మిగిలినదంతా దిగజారుడే. ఈ పరిస్థితికి కారణం ఆ 1917 - 18 నాటి అనిబిసెంటమ్మ విధానమే తిరిగీ ఈ 1930 లో కూడా, బ్రహ్మాండమయిన యుద్ధం మధ్య ఉండీకూడా, అవలంబించడమే.
అగ్రనాయకులు విడుదల, ఇర్విన్‌తో ఒడంబడిక
ఎంతగా తమ్ముతాము బయటపెట్టుకున్నా తమ్ముతాము సంబాళించుకోగల నేర్పరితనం కాంగ్రెసువారిలో ఉండబట్టే, ఆ 1930 ఆఖరునాటికి తిరిగీ ఈ కయ్యం ముమ్మరం అవడమూ, దాన్తో 1931 మొదటి రోజులలోనే బ్రిటిష్‌వారు కాంగ్రెసు కార్యనిర్వాహక సభ్యులుగా పనిచేసిన ఆ పాత వారినీ, కొత్త వారినీకూడా వదలి పెట్టడానికి నిశ్చయించు కోవడమూ, అప్పుడే వారికి వైస్రాయ్ గారితో నిర్మల వాతావరణంలో తర్జన భర్జనలు చేయడానికి సదవకాశం ఉంటుందని గ్రహించగలగడమూ జరిగింది.
అసలు న్యాయానికి ఇదే సవ్యమయిన మార్గ మవడాన్ని 1930 జూలై - ఆగస్టులలోనే ఇలాంటి విడుదల ప్రయత్నాలు జరిగి ఉండ వలసినది. ఈ ప్రకారం నాయకులు విడుదల అయిన వెంటనే, గాంధీగారూ ఇర్విన్ కలిసి సక్రమంగా సంప్రతించడానికి సావకాశం కలగడమూ, సంప్రతింపులు సఫలమై, సంతకాల దాకా రావడమూ, దానిని గాంధీ - ఇర్విన్ ఒడంబడికగా రూపొందించగలగడమూ జరిగింది. ద్వంద్వ నాయకత్వమూ, వారిలో వారికి కలిగిన అభిప్రాయా భేధాలూ, కాంగ్రెసు వారి కోరికలు 1917 - 18, 1928 - 29, 1930 లలో విఫలం అవడానికి కారణా లయ్యాయి.
ఈ గాంధీ ఇర్విన్ సంప్రతింపులు సఫలం అవడానికి కూడా కారణాలు గాంధీగారు వెనుకటి అపజయ కారణాలను గ్రహించ గలగడం, తానే యావత్తు భారత దేశానికి కాంగ్రెసు తరపున ఏకైక నాయకునిగా, నిలిచి, సంప్రతింపుల విషయంలోనూ, సవరణలూ, దిద్దు బాట్ల విషయంలోను పైవారి ప్రమేయం లవవేశమూ లేకుండా చూసుకుని, మాంచి రసకందాయ పట్టుతో నిగ్రహించుకు రాగలగడం. ఈ కారణాలవల్ల అపజయం అన్నది దరికి రాకుండా పోయింది.