నా జీవిత యాత్ర-3/జెయిలు అనుభవాలు

10

జెయిలు అనుభవాలు

ఆ 1930 - 31 లో ఎందువల్లనో గాని నన్ను ఆ జెయిలు నుంచి ఈ జెయిలుకీ, ఈ జెయిలునుంచి ఇంకో జెయిలుకీ, ఇల్లా పలు తావులలోని జెయిళ్ళకి మార్చారు. అందువల్ల ఎన్నో జెయిళ్ళను చూడగల విశేషాధికారాన్నీ, హక్కునూ నాకే ఇచ్చారనుకుంటాను. నాటి జైళ్ళ పరిస్థితి చాలా అధ్వాన్నంగా ఉంది. రాజ కీయ ఖైదీలుగా మా కిచ్చే ఆహారానికి, మామూలు 'సి' క్లాసు ఖైదీల ఆహారానికీ తేడాయే లేదు అదే, ఆ మామూలు 'సి' క్లాసు నేరస్తులకిచ్చే ఆహారమే, అక్కడ వంటశాలలోనే తయారుచేసి, మాకు వడ్డింపించేవారు. ఈ పరిస్థితి చాలాకాలమే సాగిందిగాని, తరవాత తరవాత 'ఏ", 'బి' తరగతి ఖైదీలకు వేరే వంటశాలలు ఏర్పరచి, వాటిని నడుపుకునే అధికారంకూడా వారికే హస్తగతం జేశారు. ఈ పద్ధతి ముందుగా 'ఏ', 'బి' క్లాసు ఖైదీలకు మాత్రమే లభింపజేసి ఉన్నా, ఆ వెల్లూరు జెయిలు అధికారులు క్రమేపీ అటువంటి పరిశుభ్ర మయిన భోజనం 'సి' క్లాసు రాజకీయ ఖైదీలకి కూడా లభింపజేశారు. ఆ వంటశాల జెయిలు ఆవరణలో లోపలి ముఖద్వారానికి చేరి రోడ్డుమీదకే ఉన్న ఒక ఇంటిలో ఉండేది.

పెనిటెంషరీలో - 'మిష్టర్ హో'తో

మొట్టమొదటి సారిగా నన్ను మదరాసు పెనిటెంషరీలో నిర్భందించారు. నాకు వేడివలన పుట్టిన ఆ కురుపులు తగ్గేవరకూ ఆ పెనిటెంషరీలోని ఆస్పత్రి బ్లాకులోనే ఉంచారు. ఎండా కాలంలో ఇంటిపట్టున నీడలోనే నివసించే వారికి వేసే మామూలు ఎండతాపపు కురుపులు కాదు నాకు లేచినవి. పదిహేనురోజులపాటు విధీ విరామం లేకుండా కాలినడకను నగర వీధులన్నింటినీ చుట్టితిరిగే సందర్భంలో కలిగిన శరీర తాపంవల్ల వచ్చిన కురుపులవి. ఆ ఉత్సాహంలో నాకు నా శరీరంలో ఏదోలా ఉంటూందన్న సంగతి జెయిలుకు వెళ్ళిందాకా తెలియనే తెలియదు. అనుదినమూ ఎండలో ఎన్నో మైళ్ళు నడవందే సముద్రతీరానికి జేరుకోలేక పోయేవాళ్ళం. అల్లా రోజు కొక్కతావుగా, అడయారు, మైలాపూరులో ఇన్‌స్పెక్టర్ జనరల్ గారి ఆఫీసు ఎదుట ఇసుకలో, తిరువళిక్కేని బీచిని, హైకోర్టు బీచిని, రాయపురంలో రోజూ ఒక కొత్త తావుకుజేరి ఉప్పు తయారు చేస్తూ, అనుదినమూ ఒక కొత్త అనుభవాన్ని సంపాదించాం. కాని నాకు ఈ తిరుగుళ్ళ అనంతరం జెయిల్లో కాస్త విశ్రాంతి శరీరానికి లభించేసరికి వేడి పైకి తన్ని కొత్తరకం కురుపులు, సెగ్గెడ్డలూ తలలోనే గాక, శరీరంమీద కూడా లేచాయి. వీటివల్ల కలిగిన బాధ మశూచికపు బాధతో సమానంగా ఉండేది. గడచిన 35 ఏళ్ళుగా నేను అనుసరిస్తూన్న తొట్టి స్నానపు వైద్యం ఈ కురుపులు తగ్గడానికి ఎంతయినా సహాయకారిగా ఉండేది కాని, ఉన్నది జెయిలు; దాని అధికారా - మిస్టర్ హో ( Mr. Howe)

మిస్టర్ హో అక్కడ జెయిలు అధికారి. ఖైదీలను అమానుషంగా చూడడమూ, వారిని రకరకాల బాధలకు లోనుచేయడమూ ఆయనకు సరదా. ఖైదీ మామూలు ఖైదీయేనా, లేక 'ఎ', 'బి', 'సి' వర్గాలలో దేనికైనా చెందుతాడు అన్న ప్రశ్నలేకుండా, పాపం, ఆయన అందర్నీ ఒకేరకంగా, మామూలు దృష్టితోనే చూసి హింసించడంతో, ఉద్యోగం స్వీకరించిన మొదటి దినాలలోనే ఖ్యాతి గడించాడు. నా మామూలు అలవాటు ప్రకారం ఒంటిమీద ఏ విధమయిన ఆచ్ఛాదనా లేకుండా, హాయిగా కాళ్ళు జాపుకుని, ఇంటివద్ద పడుకునే రీతిగానే, ఆ అస్వస్థపు దినాలలో జెయిలులో పడుకుని ఉండేవాడిని.

ఒక రోజున నేను అల్లా పడుకుని ఉండగా, ముందు హెచ్చరిక లేకుండా నా గదిలోకి వచ్చి నా మంచం పక్కన నిలబడి ఒకటి రెండు నిమిషాలపాటు నావైపు చూశాడు. ఆయన్నిచూసి జెయిలు సూపరెంటెండెంటుగా గ్రహించుకుని, వెంటనే లేచి, ఆయనకు లాంచన ప్రకారంగా చేయవలసిన సలామో, గుడ్‌మార్నింగ్ చెప్పడమో చెయ్యకపోవడాన్ని ఆయన శాంతిని గోల్పోయి, చాలా మెల్లిగా "నేను సూపరెంటెండెంట్ నన్న సంగతి తెలియదా? ఇక్కడ కొన్ని నిమిషాలుగా ఉన్నా మంచంమీద పడుకున్నవాడివి లేవనయినా లేవలే" దన్నాడాయన. నేను చిన్ననవ్వునవ్వి "జెయిలు సూపరెంటెండెంట్ అన్నవాడికి ఖైదీలపట్ల, అందులో రోగంతో తీసుకుంటూన్న ఖైదీలపట్ల, ఒక బాధ్యత ఉన్నది కదా? సూపరెంటెండెంట్ అయినా, రోగంతో తీసుకుంటూన్న ఒక ఖైదీ గదిలోకి, ఒంటిమీద సరిగా బట్టయినా లేని స్థితిలో ఆ రోగి ఉంటూన్న సమయంలో, హెచ్చరికయినా లేకుండా చొచ్చుకుని రావడం న్యాయం కా"దన్నాను. "ఖైదీగా సూపరెంటెండెంట్‌కు చేయవలసిన మర్యాద చేయ జాలనందుకు చింతిస్తున్నా"నని చెప్పాను. "ముందు ముందు కాస్త హెచ్చరిక జేసి మరీ దయచేయం"డని కోరాను.

ఆయన ఏ మనుకున్నాడో యేమోగాని, కాస్త తమాయించుకుని క్షమార్పణ చెప్పుకుని, మెల్లిగా గదినుంచి బయటికి నడిచాడు. నాకు ఇవ్వబడిన గది ఆస్పత్రి మెయిన్ వార్డులోని జాగా కాదు. అది నా కోసం, నేను నా మానాన - ఒక నర్సుయొక్కగాని, ఏ యితర నౌఖరుయొక్కగాని సహాయం లేకుండా - ఉండడానికిగాను ప్రత్యేకించబడిన గది.

పైకి ఎంత గంభీరంగానూ, క్రూరంగానూ కనబడ్డా మిస్టర్ హో మాత్రం సరళహృదయం కలవాడనే నా నమ్మిక. నాకు స్వస్థత చేకూరాక, నన్ను జెయిలులోకి మార్చారు. దుమ్ము, ధూళీతో నిండి, ఏదో మూలగానున్న ఒక గదిని నా కిచ్చారు. నా గదిని చేరి బాత్‌రూం లేదు సరికదా, ఆఖరికి ఒక 'కరోడ్‌' అయినా లేదు. ఇచ్చే ఆహారం చాలా పాడుగా ఉంది. మాకు కావలసిన ఆహారం మేము కొనుక్కోడానికి, ఇతర విధంగానూ ఆహార అవసరాలు తీర్చుకోవడానికి గాని అవకాశం లభించలేదు. అల్లా ఆ గుహలో రెండు, మూడు వారాలపాటు ఉన్నాను. మమ్మల్ని సాయంత్రం 6 గంటలకు లాకప్పులో పెట్టి, ఉదయం 6 గంటలకు బయటకు రానిచ్చేవారు. అల్లా జెయిల్లో అయిదారు వారా లున్నాక, నన్ను తిరుచిరాపల్లి జెయిలుకు మార్చారు.

తిరుచీ జెయిలుకి సత్యాగ్రహుల వెల్లి

తిరుచిరాపల్లి జెయిలుకు నేను వెళ్ళేసరికి అక్కడి పెద్ద జెయిలుకు అంటి ఉన్న 'క్వారెంటైన్‌' (Quarantine)లో, చెన్న రాష్ట్రీయులే గాక, హిందూదేశపు పలుతావులనుంచి అక్కడికి పంపబడిన అనేక సత్యాగ్రహులు నాకు తారస పడ్డారు. ఐర్లెండ్ దేశానికి చెందిన మిస్టర్ కార్‌నిష్ (Mr. Cornish) అప్పట్లో అక్కడి జెయిలు సూపరెంటెండెంట్‌గా ఉండేవాడు.

అక్కడ వార్డర్లు మామూలు ఖైదీలను వారి ఇష్టం వచ్చినట్లు బాదేవారు. తప్పిదమన్నది ఉన్నా లేకపోయినా ఖైదీలను బాదడం అన్నది అక్కడి వార్డర్లకు అలవాటయిపోయింది. ఒకనాడు ఆ ఇనుప పెన్సింగ్‌కు సమీపంగా ఉన్న ఒక ఖైదీని తన తోలు బెల్టుతో అదేపనిగా ఒక వార్డరు బాదడం నా కంట బడింది. నేను అప్పుడు ఇతరులతో కలసి ఒక వరుసలో నిల్చుని ఉన్నాను. పాపం, ఆఖైదీ నోరుమూసుకుని ఆ దెబ్బలను సహిస్తున్నాడు. బాధతో ఏడుస్తున్నాడు. ఆ వార్డరు మాత్రం బాదడం మానలేదు. అట్టి పరిస్థితిలో నా మిత్రు డొకాయన గబగబా నా గదిలోకివచ్చి నన్ను పిల్చాడు. నేను బయటికి వచ్చి 'ఆపు' అని కేక వేసేసరికి, ఆ వార్డరు ఆ బెల్టు అక్కడ పారేసి పారిపోయాడు. ఈ విషయం కార్‌నిష్‌కు తెలుపబడింది. ఆయన వచ్చి నన్నూ, ఇతరులనూ అడిగి, జరిగిన సంగతి తెలుసుకుని తానే స్వయంగా ఆకేసు ఫయిసలు చేశాడు.

ఆ తర్వాత మమ్మల్నందర్నీ 'క్వారెంటైన్‌' నుంచి లోపలికి, అసలు జెయిలులోకి మార్చారు. అంతకంతకు సత్యాగ్రహ ఖైదీలు ఎక్కువయిపోయారు. జెయిలు అదికారులకు వారిని అదుపులో పెట్టడం ఎల్లాగో అర్థంకాలేదు. అందులో 'సి' క్లాసు యువక ఖైదీలను అసలే హద్దులో పెట్టలేకపోయేవారు. వారికి స్నానానికి ఇతరత్రా ఏ ఏర్పాట్లు లేకపోవడాన్ని ఒక పెద్ద దిగుడు బావిలో స్నానం చెయ్యమని అనుమతి ఇచ్చారు. జెయిలు అధికారులకు వారిని సరిదిద్ది శాంతి నెలకొల్పడానికి సాధ్యంకాని పరిస్థితిలో మాలో ఎవరినయినా తీసుకుని వెళ్ళి, మా సహాయంతో, శాంతి, క్రమపద్ధతి నెలకొల్పుకునేవారు. పరిస్థితి వారి చెయ్యిదాటి నప్పుడల్లా వారు మా సహాయంతోనే ఆ యువక రాజకీయ ఖైదీలలో శాంతి నెలకొల్ప కలిగేవారు.

మా 'ఎ' క్లాసు ఖైదీలను ఉంచిన గదులకు సరిగా వెనుక వరుసలో ఖైదీలందరికోసం ఏర్పాటయిన మామూలు వంటశాల ఉండేది. దానిలో వంట తెలిసిన ఖైదీలే వంటపనులు నిర్వహిస్తూ ఉండేవారు. అక్కడ తెల్లవారగట్ల 3 గంటలనుంచీ ఏవేవో పనులుంటూనే ఉండేవి. ఒకరోజు తెల్లవారగట్ల 4 గంటలకు వార్డర్లు ఆ వంటశాలలో పనిచేస్తూన్న ఖైదీలమీద లాఠీఛార్జీ చేశారు.

ఆ ఖైదీల అరుపులు, ఏడ్పులు, లాఠీల చప్పుళ్లు మాకు బాగా వినబడ్డాయి. కంటితో చూడకపోయినా ఆ సంఘటన హృదయ విచారకంగా ఉంది. మేము ఏమీ చెయ్యలేనీ స్థితిలో ఉన్నాం. మేమూ ఖైదీలమే అయిన కారణంగా అక్కడికి వెళ్ళడానికి కూడా మాకు అవకాశం లేదు. మర్నాడు ఆ విషయం సూపరెంటెండెంట్ గారితో చెప్పాం. ఆ తరవాత అటువంటి సంఘటనలు మేము ఆ జెయిల్లో ఉన్నంత కాలమూ జరుగలేదు.

యువక ఖైదీకి అంత్యక్రియలు

జెయిల్లో వైద్యసహాయమూ అంతమాత్రంగానే ఉండేది. ఒక రోజున ఒక సత్యాగ్రహ యువక ఖైదీ మరణించాడు. డాక్టరు సరిగా చూడని కారణంగానే ఆ కుర్రవాడు మరణించాడనే వార్త పొక్కింది. అల్లరి యేదో జరుగనుంది - యువకుల హృదయాలలో ఏదో అశాంతి బయల్దేరిందనే వార్తా పొక్కింది. దాన్తో కాస్త కలుగజేసుకుని హృదయాలను శాంతపరచి, సక్రమంగా వైద్యం జరగడానికి వలసిన అవసర చర్యలు తీసుకున్నాము. చనిపోయిన కుర్రవా డాంధ్రుడు. వాని జననీ జనకులు ఎక్కడో దూరతీరాలలో ఉన్నారు. అంత దూరంనుంచి వాని బంధువులు వచ్చేదాకా దహనాది క్రియలు ఆపడానికి అవకాశం లేదు. అందువల్ల నేనూ, ఇతర సత్యాగ్రహ మిత్రులమూ కలిసి ఆ దహనకాండ దేశ స్వాతంత్ర్యం పేరుమీదుగా జరిపించాం. అప్పట్టున ఇచ్చిన ఒక చిన్న ఉపన్యాసంలో వాని త్యాగాన్ని పొగడి, భారతమాత దు:ఖోప శమనానికి వాని అసువులు అర్పించబడ్డాయని, అది మనకు గర్వకారణమనీ, దేశంకోసం ఆత్మార్పణకు, ఆ యువకునివలె, అంతా సర్వసన్నద్ధులమయి ఉండాలనీ, ఏవేవో చెప్పి యువక హృదయాలలో శాంతి నెలకొల్పాం.

'పిండా కూడు'

'క్వారంటైన్‌' కాలంలో మాకు అన్నపు ముద్దలు - పిండాలు, రసమూ - కొళంబూ అని పిలువబడే ఏదో చిక్కని ద్రవమూ ఆహారంగా లభించేవి. నిజానికి ఆ ఆహారం ఎటువంటి మానవునకయినా ఆరోగ్యదాయకం అని చెప్పడానికి వీలులేని స్థితిలోనే ఉండేది. కొళంబులో నిజంగా వాడవలసిన కూరలూ, పప్పులూ విచిత్రంగా మాయమయి, వాటి స్థానంలో యేదో ఇంత తుక్కూ, గడ్డీ ఉపయోగింపబడేవి. ఇట్టి కారణాల వల్లనే ఖైదీలలో చాలామందికి ఆరోగ్యం దెబ్బతింది. ఆ అన్నపు ముద్దలలో రాళ్ళు రప్పలే కాదు, పురుగులుకూడా ఉండేవి. అటువంటివి కంటబడినప్పుడు నిరాహారంగా రామభజన చేసేవారం. క్రమేణా మాలో ఇరువురు వ్యక్తులకు వంట ఏర్పాట్లు చూడడానికి అనుమతి లభించడమూ, కాస్త మంచి ఆహారం లభ్యం చేయబడడమూ జరిగింది. కార్నిష్‌గారూ, వారి పై అధికారులూ ఒప్పుకున్న కారణంగా మా ఆహారస్థితి మెరుగున పడింది.

మామూలుగా నేరస్తులకోసం జెయిళ్ళు అన్నవి సృష్టించబడిన నాటినుంచీ చల్ల (మజ్జిగ) ఖైదీల కివ్వడ మన్నది ఆచారంలో లేని విషయమే 1921 లో మొదటి సత్యాగ్రహం, శాసన ధిక్కారాదులు జరిగిన నాటినుంచీ రాజకీయ ఖైదీలకుకూడా ఈ మజ్జిగ అన్నది ఎప్పుడూ సప్లయి చేయబడలేదు. కాంగ్రెసు మిత్రులు, అధమం రాజకీయ ఖైదీలకైనా మజ్జిగ సప్లయి చేయించాలని, ఆనాటినుంచీ తంటాలు పడ్డారు.

జస్టిస్ పార్టీ 'మహాశయులు'

కాని జస్టిస్ పార్టీవారు చెప్పేశారు - కాంగ్రెసు సత్యాగ్రహులకూ, మామూలు ఖైదీలకూ తేడా అనేది పాటించడం సబబు కాదని. అందువల్ల వారికి ఏవిధమయిన అదనపు సౌకర్యాలూ ఇవ్వబడవని ఖచ్చితంగా చెప్పేశారు. ఇంకో జస్టిస్ పార్టీ మహాశయుడు భారతీయ ఆహార విధానంలో మజ్జిగ అన్నది అవసరమైన ఆదరవు కాదన్నాడు. ఆ రోజులలో అధికారంలో ఉన్న మహాశయుల పద్ధతులవి! అందులో కాంగ్రెసు నాయకుల కోర్కెల విషయంలో వారి వక్రబుద్దే బలిష్టమయ్యేది. కాంగ్రెసువారు ఇటువంటి కష్టాలన్నింటినీ భరించారు.

తరవాత రాజ్యాంగయంత్రం వారి హస్తగతమై రెండున్నర సంవత్సరాలు వారి చేతులలోనే నిలిచింది. "కాంగ్రెసు గవర్నమెం"టనే శీర్షిక కింద, కాంగ్రెసు మంత్రులు రాజకీయ ఖైదీల విషయంలో ఎల్లా ప్రవర్తించారన్న విషయం వివరంగా చర్చిస్తాను.

ఒక్క విషయం మాత్రం నిజం. రాజకీయ ఖైదీల అగచాట్ల విషయంలో కాంగ్రెసు మంత్రులు ఏవిధంగానూ కలుగజేసుకోలేదు. వారి బాధలు గుర్తించలేదు. ఒక్క మజ్జిగమాత్రం సప్లయి చెయ్యడానికి అనుమతి ఇచ్చారు. అంతే!

కాంగ్రెసు గవర్నమెంట్‌లో మంత్రులుగా ఉన్న మహాశయులు ఇతర కాంగ్రెసు వారితో సహా తిరిగి 1941 లో జెయిళ్ళకు వెళ్ళారు. వారు తిరిగి జెయిళ్ళకు వెళ్ళినప్పుడు వారి స్థితి స్వయంకృతాపరాధంగానే తయారైంది. ఏదో సామెత చెప్పిన తరువాయిగా, నీరు చాలా ఉండే అనపకాయ బీరకాయలాంటి కూరలు నీళ్ళు పొయ్యనవసరం లేకుండానే వాటి రసంలోనే అవి ఉడికినట్లు, ఆంగ్లంలో 'Stew in their own juice' అని చెప్పబడే స్థితి వారికి సంప్రాప్తమైందన్నమాట! అత్తగారి స్థానంనుంచి కోడలు స్థానానికి దిగజారిపోయినట్లే గదా! ఆ కాంగ్రెసు మంత్రులే తిరిగి జెయిళ్ళకు వెళ్ళినప్పుడు వారికి అనుభవమైంది. మంత్రులుగా తాము రాజకీయ ఖైదీలకు తమ హృదయాలలో ఏవిధమయిన స్థానమూ ఇవ్వకపోవడం బాగా తెలిసివచ్చింది. ఈ పరిస్థితులను గురించి ముందు ముందు వివరిస్తాను.

వెల్లూరు జెయిల్లో నీటి ఎద్దడి

తిరుచ్చీ జెయిలులో రాజకీయ ఖైదీలను గురించి కొన్ని మాసాలుగా ఆందోళన జరుగుతూన్న కారణంగా, మమ్మల్ని వెల్లూరు జెయిలుకు మార్చారు. వెల్లూరులో మాకు మంచి ఆహారం లభిస్తుందనీ, మమ్మల్ని ఎక్కువ ఇదిగా చూస్తారనీ భావించాం. అనేక విషయాలలో వెల్లూరు జెయిలు బాగానే ఉందిగాని, నీటి ఎద్దడి విషయంలో తిరుచిరాపల్లి జెయిలుకు ఏమీ తీసిపోదు. 'ఎ', 'బి' తరగతి ఖైదీలకు విడిగా ఒక కాంపౌండ్‌లో ఉన్న ఒక హాలు ప్రత్యేకించబడింది. మేజర్ ఖాన్ అప్పు డక్కడ సూపరెంటెండెంటుగా ఉండేవాడు. రూల్స్‌కు భిన్నంగాని పరిస్థితు లన్నింటిలోనూ ఆయన సత్యాగ్రహ ఖైదీల గోడు వినేవాడు.

మాకు నిర్దేశించబడిన బ్లాకులలో నీటికొరత బాగా ఏర్పడింది. అప్పటికి నాకు తొట్టి స్నానానికి వీలుగా ఒక తొట్టి యివ్వబడింది. కాని స్నానాలగది ఆవరణలో నీటి సప్లయికి ఏర్పాటు లేదు. అది మా కందరికీ కలిపి ఇవ్వబడిన బ్లాక్. సాధారణంగా, 'ఎ' క్లాసు ఖైదీలు మా జెయిలుకు ఎక్కువగా తరలించబడిన పరిస్థితులలో, కాంపౌండ్ వెలుపల ఉన్న చిన్న చిన్న 'ఔట్ హౌస్‌' లో వారికి జాగా చూపించేవారు. ఆ బహిర్గృహాలలో మలయాళ దేశీయులూ, నా మిత్రులూ అయిన కీ॥ శే॥ రామున్నీ మేనోన్ (ఆయన మంత్రిగా కూడా కొంతకాలం వ్యవహరించాడు), కె. మాధవ మేనోన్, ఆర్. రాఘవ మేనోన్ ప్రముఖు లుండేవారు.

తలవంపు పద్ధతి

పైల్ పద్దతన్నది 'జెయిల్ రూల్స్‌'లో అనాదినుంచీ ఉన్న ఆచారమే. ఆ పద్ధతి సాధారణ ఖైదీలకోసం పుట్టింది. జెయిలు పరిపాలనా విధానంలో "రాజకీయ ఖైదీలకు" అంటూ ప్రత్యేకించబడిన నిబంధనావళులు ఏవీ లేవు. ఆ దురదృష్ట దినాలలో, లోకమాన్య బాలగంగాధర తిలక్, లాలా లజపతిరాయ్ వంటి మహానీయులను అరెస్టుజేసి శిక్షించడం జరిగినా, వారిని ఇతరులతో కలవకుండా ప్రత్యేకించి వేరువేరు జాగాలలో ఉంచేవారు.

ఈ సహకార నిరాకరణ ఉద్యమం అంటూ ఆరంభం అయ్యాక జీవితాన్నే దేశసేవ కర్పించిన నూతన వర్గపు రాజకీయ ఖైదీలు ఆవిర్భవించారు. అటువంటి రాజకీయ ఖైదీలు 1921 నుంచీ జెయిళ్లలో నిండిపోతూన్న సందర్భాన్ని పురస్కరించుకుని, జెయిలు నిబంధనావళిలో అటువంటి రాజకీయ ఖైదీల ఆహారమూ, ఖైదీలుగా ధరించవలసిన ఉడుపుల తీరూ, పైల్ పద్ధతీ మొదలైన ఎన్నో విషయాలలో జెయిలు నిబంధనలు న్యాయంగా మార్చవలసి ఉన్నాయి. కాని ఆ రోజులలో అధికారంలో ఉన్న పెద్దల కెవ్వరికీ, రాజకీయ ఖైదీల విషయంలో కొన్ని మార్పులు చేయడం న్యాయమన్న ఆలోచన తట్టలేదు. అందువల్ల వారికీ, ఇతర ఖైదీలకు ఏ విధమయిన భేదాలూ చూపబడలేదు.

ఇప్పటికీ చాలా జెయిళ్ళలో ఈ పైల్ పద్ధతి అమల్లోనే ఉంది. తిరుచిరాపల్లిలోనూ, మదరాసు పెనిటెంషరీలోనూ జరిగిన పద్ధతిగానే వెల్లూరు జెయిలులోకూడా ఆ పైల్ పద్ధతి అమలు పరచబడింది. మేమంతా ఒక వరసలో నిలవక తప్పేదికాదు. ఈ రకమయిన 'తలవంపు పద్ధతి' మాకు ఎంతో చికాకుగా ఉండేది. కాని సత్యాగ్రహుల మవడం వల్ల సరిపెట్టుకోక తప్పేదికాదు. మేము ఈ విషయంలో సూపరెంటెండెంట్‌గారితో మాట్లాడాము. ఆయన ఆ పద్ధతి అమలు పరచకపోతే వారి పీకలమీదికి వస్తుందని సమాధాన మిచ్చాడు.

అసలు ఈ ఫైల్ పద్ధతి ప్రకారం వారానికి ఒకటి రెండుసార్లు ఖైదీలందరూ ఒక వరసలో నిలబడాలి. అట్లా నిలబడిఉన్న ఖైదీల నందరినీ జెయిలరూ, సూపరెంటెండెంటూ సరిగా ఉన్నారో లేదో చెక్ చేసుకోవాలి. ఖైదీలందరూ నిటారుగా నిలబడి, వారివారి బరువును చూపించే, తూకపు ఛార్టులను సరిగా పట్టుకుని నిలబడాలి. అధికార్లకు, ఎవరయినా బరువు తగ్గిందీ లేందీ, ఆ పద్ధతివల్ల వెంటనే గ్రాహ్యం అవ్వాలన్నమాట. అటువంటి సమయంలో ఏమయినా చెప్పుకోవడానికి ఖైదీలకు సావకాశం ఉండేది. ఈ పద్ధతి రాజకీయ ఖైదీలకు వర్తించరాదని వాదించే వారిలో నేను ఒకణ్ణి.

మేజర్ ఖాన్ చతురజ్ఞత

'సి' క్లాసు వారితోసహా మా సంఖ్య పెరిగినకొద్దీ, మాకు కొన్ని కొన్ని సదుపాయాలు కలుగజేశారు. కొంత కాలంపాటు మాలో 'ఎ' క్లాసు ఖైదీల ఉపయోగానికి మాత్రమే ఒక 'ఔట్‌హౌస్‌' ఇచ్చేవారు. తరవాత అందరి ఉపయోగంకోసం ప్రత్యేకంగా వంటశాల ఏర్పడింది. ఏవో నిర్ణీత దినాలలో నిర్ణయించబడిన కాలంలో 'బి' క్లాసు వారికి మాత్రం మమ్మల్ని కలుసుకుని కాలక్షేపం చెయ్యడానికి అవకాశం కల్పించబడింది. ఇతర సమయాలలో ఆ కాంపౌండ్ ద్వారాలు బంధించబడి ఉండేవి. వారికి తోచినప్పుడల్లా వీలునుబట్టి 'బి' క్లాసువారు గోడలుదాటి, కాలక్షేపానికి గాను మా 'ఎ' క్లాసు ఆవరణలోకి వచ్చేవారు.

తన అధీనంలో అప్పగించబడిన రాజకీయ ఖైదీల విషయంలో మేజర్ ఖాన్ చాల చాకచక్యంగా వ్యవహరించేవాడు. ఒకటి రెండుసార్లు మా 'ఎ' క్లాసు ఖైదీలు ప్రక్కనున్న ఆడవాళ్ళ జెయిలుకు వెళ్ళి పరిస్థితులు గమనించగల అవకాశం కలిగించాడు. తమని ప్రత్యేకించి ఎక్కడో ఎవరిముఖాలూ చూడడానికి వీలులేకుండా బంధించారన్న బాధలేకుండా వారికి జీవితం గడచిపోయేది. ఎన్ని చేసినా ఒక్కొక్కప్పుడు యువక ఖైదీలతో ఏదో భేటీ వచ్చేది. అలాంటి పరిస్థితులను మేజర్ ఖాన్ మా సహాయంతో ఎదుర్కొనేవాడు.

అప్పట్లో నాతోపాటు వెల్లూరు జెయిలులో దేశోద్ధారక కాశీనాధుని నాగేశ్వరరావు పంతులుగారు, బులుసు సాంబమూర్తి (మదరాసు శాసన సభ మాజీ స్పీకరు), విశ్వనాథదాసు (ఒరిస్సా రాష్ట్రానికి కొంతకాలం ముఖ్యమంత్రి), డా॥ భోగరాజు పట్టాభి సీతారామయ్య (దర్మిలా నాగపూరులో గవర్నరుగా కూడా ఉండేవారు. కాంగ్రెసు చరిత్ర వ్రాశారు), చక్రవర్తుల రాజగోపాలాచారిగారు (కొంతకాలం మదరాసు రాష్ట్ర ముఖ్యమంత్రి) ఎస్. సత్యమూర్తి, అయ్యదేవర కాళేశ్వరరావు మొదలైన వా రుండేవారు. ఎండకాలంలో ఆ ఆవరణ లోపలే ఆరు బయట పడుకోవడానికి మాకు అవకాశం కలుగ జేయబడింది. ఆరోగ్య విషయకంగా ఈ సహాయం మా కెంతగానో సహాయపడింది.

జెయిలులో వ్రాసిన పుస్తకాలు

ఈ ఆరు బయట పడక అమరడంతో నేను తలపెట్టిన రెండు పుస్తకాలూ వ్రాయడానికి నాకు అవకాశం లభించింది. అందులో మొదటిది "ప్రపంచ ఆర్థిక విధానము" (Monetary system of the world), రెండవది "భారతీయ ఆర్థిక విధానము" (Indian Monetary system). ఈ పుస్తకాలు రెండూ ఆంగ్లంలో వ్రాయకలిగాను.

కేంద్ర శాసన సభలో సభ్యునిగా ఉంటూ ఉండిన ఆ మూడు సంవత్సరాలలో, నాకు అభిమాన విషయమైన ఈ ఆర్థిక విధానాన్ని గురించి ప్రత్యేక శ్రద్ధతో గమనిస్తూ, ఆ విషయమైన ప్రసక్తి వచ్చినప్పుడల్లా వాదోపవాదాలలో పాల్గొంటూ ఉండేవాణ్ణి. అ కారణంగానే రిజర్వు బ్యాంక్ బిల్లూ, మారకపురేటు ప్రసక్తి వచ్చినప్పుడు క్షుణ్ణంగా ఆ విషయంలో వాదించగలిగాను. అదృష్టవశాత్తూ జెయిలులో ఉండగా ప్రపంచ ఆర్థిక విధానానికి తగిలిన దెబ్బను గురించీ, ప్రపంచ ఆర్హిక విధానాలూ - అవి భారత ఆర్థిక విధానంపై తెచ్చిన ఒత్తిడిని గురించీ క్షుణ్ణంగా చదవడానికి అవకాశం చిక్కడాన్ని, "భారత ఆర్థిక విధనమూ," "ప్రాపంచిక ఆర్థిక విధానమూ" అన్న మకుటాలతో ఆ రెండు పుస్తకాలూ వ్రాయాలని బుద్ధి పుట్టింది.

అప్పట్లో ప్రపంచ ఆర్థిక విధానానికి తగిలిన దెబ్బ, లోగడ ఎప్పుడూ తగలనంత గట్టిగా తగలడాన్ని, ఆ విషయాన్ని గురించి శ్రద్ధగానూ, పరిశీలనగానూ, క్షుణ్ణంగానూ చదివి సంగతి సందర్భాలు సరిగా గ్రహించగలిగాను. ఆ తెల్లజాతులవారు ప్రపంచంలోని అన్ని ప్రాంతాల వారితోనూ వర్తక వ్యాపారాది సంబంధాలు కలిగిఉండడాన్ని ఆయా దేశాలలో ఉండే మార్కులో, షిల్లింగులో, డాలర్లో, రూబిల్సో, రూపాయలో - అవి యేవయినా, వాటిమధ్య మారకపు విధానమూ, తద్వారా అనేక నిత్య అవసర వస్తువుల ధరలూ అన్నీ ఆ తెల్లజాతులవారు తమ చేతులలో పెట్టుకున్నారు. నిజానికి ఏదేశపు ఆర్థిక విధానమైనా ఆ రెండింటి మీదే కదా ఆధారపడి ఉండేది?

ఈ సందిగ్ధ పరిస్థితులలో ఆంగ్లేయులు 7 షి. అమ్మవలసి ఉండగా, జర్మనీ దేశపు 'మార్కు' 200 పాయింట్లు పెరగడాన్ని జర్మనీవారు తమ స్టేట్ బ్యాంక్‌ని మూసి వేయవలసి వచ్చింది. వారి దేశంలో వారి స్టేట్ బ్యాంక్ బ్రాంచీలు సుమారుగా దేశం అన్ని ప్రాంతాలలోనూ కలిపి 1700 ఉండేవి. అవన్నీ మూత పడినట్టే గదా! అంటే గవర్నమెంటు దివాలా తీసిందన్నమాట! అందువల్ల వారు తమ బ్యాంకులముందు బ్యాంకులో డబ్బు దాచుకున్న వారికిగాని, తమతో వ్యాపార సంబంధాలున్న వారికిగాని డబ్బు వాపసు ఇవ్వబడదు అని వ్రాసిన ప్రకటన కాగితాలు అతికించ వలసివచ్చింది.

ఇటువంటి పరిస్థితులెల్లా ఉత్పన్నం అవుతాయో గ్రహించ గలగడాన్ని, ఆ ఆర్థిక విధానాలను గురించి క్షుణ్ణంగా చదవాలనీ, వాటిని గురించి జెయిలులో ఉన్న ఆ రోజులలో వ్రాయాలనీ బుద్ధి పుట్టింది. ఆ ప్రకారంగా, అటు కేంద్ర శాసన సభలోనూ, ఇటు జెయిలులోనూ గ్రహించిన విజ్ఞానంతో ఆర్థిక విధానాదులను క్షుణ్ణంగా చర్చించి ఆ పుస్తకాలు వ్రాయగలిగాను.

ఆ పుస్తకాలను చదివిన మన నాయకులకూ, ప్రజానీకానికీ కూడా అనువైన సందర్భాలలో ప్రత్యక్ష చర్యలకు పూనుకున్నట్లయితే పూర్ణ స్వాతంత్ర్య సముపార్జన సులభ సాధ్యమ వుతుందన్న విషయం కరతలామలకం అవుతుంది. ఏ యే సందర్భాలలో ఆ ఆర్థిక విధానాలు ఎల్లాంటి దారులు తీస్తాయో, ఆ యా సమయాలలో ఎక్కడ నొక్కితే అవి చక్కపడతాయో వివరించడాన్ని, సందర్భ శుద్ధిగా సాగించే సత్యాగ్రహాలూ, సహకార నిరాకరణాలూ, శాసన ధిక్కారాలూ ఉపయోగపడే తీరులన్నీ మన నాయకులు గ్రహించడానికి ఆ పుస్తకాలు బాగా ఉపయోగ పడతాయి.

గాంధీగారు చెయ్యమన్నప్పుడల్లా సత్యాగ్రహం చేసి జెయిళ్ళు నింపడం కంటె, కీలెరిగి వాత పెట్టడం మంచిది కాదా? నా పుస్తకంలో పశ్చిమ జాతులవారు ప్రాపంచిక ఆర్థిక విధానాన్ని ఎల్లా పెంపొందించారు, వారు ఏ ప్రకారంగా అమెరికా యునైటెడ్ స్టేట్స్ వారితో కలిసి ఆ ఆర్థిక విధానాన్ని ఎల్లా ఎల్లా రూపొందించ పూనుకున్నారు అన్న విషయాలను గురించి పూర్తిగా చర్చించడానికి సావకాశం లేక పోయినా, నా పుస్తకం చదివిన ఒక్కొక్కరికీ ఆంగ్లేయులు ఏ యే కారణాలవల్ల భారతదేశాన్ని వదులుకోవడానికి అనిష్టత చూపుతున్నారో మాత్రం క్షుణ్ణంగా అర్థమయి తీరుతుంది.

కన్ననూరు జెయిలుకు బదిలీ

హఠాత్తుగా ఒకనాటి ఉదయాన్ని, నన్ను కన్ననూరు జైలుకు మార్చనున్నారనీ, ఆ సాయంత్రమే నేను బయల్దేరవలసి ఉంటుందని చెప్పారు. ఏ కారణం వల్ల ఈ మార్పు చేస్తున్నారో నాకు వారు చెప్పలేదు. నాకూ తెలియదు. ఎంత ఆలోచించినా, క్రమశిక్షాణాది విషయాలకు నేను ఎప్పుడూ భంగం కలిగించలేదనీ, ఎటొచ్చీ 'సి' క్లాసు ఖైదీలను గురించి మాత్రం తరుచు సూపరింటెండెంట్‌తో వాదించే వాడిననీ, ఆ వాదన తీరూ, ధోరణీ నేను అనుకోని విధంగా సూపరింటెండెంట్‌ను చికాకు పరచాయేమోననీ భావించాను. నేను నిశ్చయంగానూ, నమ్మకంగానూ భావిస్తూన్న విధానాల ప్రకారం, రాజకీయ ఖైదీలు సామాన్య ఖైదీలవలె చూడబడకూడదన్నదే నా వాదం. రాజకీయ ఖైదీలుగా 'ఎ', 'బి', 'సి' క్లాసులలో ఏ క్లాసుకు చెంది ఉన్నా, మేమంతా అహింసాత్మక విధానంగా దేశ స్వాతంత్ర్యంకోసం పెనగులాడుతూన్న రాజకీయ ఖైదీలమే అవడాన్ని మా విషయంలో తగు విచక్షణతో ఆ జెయిలు అధికార్లు మెలగవలసి ఉంటుందన్నదే నా పట్టు. ఎంత ప్రయత్నించినా నాకు నమ్రత, అణకువ అన్నవి. అలవాటు కాలేదు సరికదా - తలవంపు, చిన్నతనమూ అన్నవి పీడిస్తూనే ఉండేవి. బహుశ: అందువల్ల నా మామూలు నడతా, నా ప్రవర్తనా ఆ సూపరింటెండెంట్ గారికి నాపై విరుద్ద భావ మేర్పడడానికి కారణమయి ఉండవచ్చును.

కాగా ఇప్పటికి మరపురాని ఇంకో చిన్న సంఘటన ఒకటుంది. ఒకనాడు నాకు సూపరింటెండెంటుగారి వద్దనుంచి కబురు వచ్చింది. నేను వెళ్ళేసరికి ఆయన ఒక బురుజులో ఆసీనులయి ఉన్నారు. నేను వెళ్ళి, ఆచార ప్రకారం ఆయనకు నమస్కరించాను. నన్ను కూర్చోమని అనకుండా ఆయన అలా నిలబెట్టేసే ఉంచాడు. న్యాయానికి ఖైదీలుగా మా కలాంటి మర్యాదలు (బహుశ:) చేయరు. చేయకూడదు. కాని నాలో ఇంకా ఆ అహంభావం అల్లాగే ఉండిపోవడాన్ని, నాకు జెయిల కు రాకపూర్వం ఉండిన హోదా, గౌరవమూ, అంతస్తూ లాంటివి నేను మరవక పోవడాన్ని, సూపరింటెండెంటు నాకు ఆసనం చూపించక పోవడం అమర్యాదగా భావించాను. నేను చుట్టూ కలయజూచి, అ ఆఫీసులో ఒక మూలను ఒక కుర్చీ ఉండడం గమనించాను. ఆ కుర్చీ తెచ్చుకుని ఆయన బల్లకు సమీపంగా వేసుకుని కూర్చున్న తర్వాతనే ఆయనతో మాటలాడ నారంభించాను. ఆ చర్య ఆయన్నే అన్నమాటేమిటి, ఏ సూపరింటెండెంట్ నయినా చికాకుపెట్టి తీరుతుంది. ఇది జరిగిన కొద్ది రోజులలోనే నా బదిలీ సంగతి తెలుపబడింది. బహుశ: నా బదిలీకి పైని ఉదహరించిన రెండు ఉదంతాలూ కారణమయి ఉండవచ్చును.

ఏది ఏమయినా ఆ బదిలీవార్త నాకు విచార కారణం కాలేదు సరిగదా, ఒక్కయేడాదిలోనే నాల్గవ జెయిలుకూడా చూడబోతున్నాననే ఒక చిన్న ఆనందమే అంకురించింది. కన్ననూరు నాకు కొత్త జాగా కాదు. అప్పటికి 15 సంవత్సరాలుగా, మలయాళ దేశంతో నాకు పరిచయం ఉంది. జెయిలుకు రాకపూర్వమే నేను మలయాళ దేశమంతా పర్యటించాను. నేను అంత క్రితం కన్ననూరు జెయిలులో ఖైదీగా ఉండక పోయినా, అక్కడకు వెళ్ళి, ఆ జెయిలులో రెండు సంవత్సరాల శిక్ష ననుభవిస్తూన్న యాకుబ్ హుసేను గారిని ఆ జెయిలులో కలుసుకున్నాను. ఆ జెయిలు ఉన్న తావును బట్టీ, అక్కడ ఉన్న వాతావరణ పరిస్థితిని బట్టీ నాకా జెయిలు నచ్చింది. ఆ జెయిలు మంచి ఎత్తుమీద ఉంది. మలయాళ దేశపు శీతోష్ణస్థితిగతులు అంత యెక్కువ ఆరోగ్యకరమయినవి కాకపోయినా, అక్కడ ఉష్ణోగ్రత తక్కువ. రాష్ట్రంలోని ఏ ఇతర సెంట్రల్ జెయిలూ అటువంటి మంచి వాతావరణంలో లేదనే నా తలంపు. అన్నిటికంటె ముఖ్యం, ఉప్పు సత్యాగ్రహ విషయంలో ఆ జెయిలు ఎక్కువ ప్రసక్తిలోకి వచ్చింది. అందువల్ల ఆ జెయిలుకు ఆనందంగానే వెళ్ళాను. అక్కడ ఉన్న వేలాది తోటీ ఖైదీలు నన్ను ఆహ్వానించి, నాకు ఏమి కావలసినా, ఏ సదుపాయం కావలసినా, అన్ని వేళలలోనూ, అన్నీ సమకూరుస్తూ ఉండేవారు.

చిన్న చిన్న దొంగతనాలు

జెయిలు ఆవరణ లోపల మంచి కూరగాయ తోటలుండేవి. వాటిని జాగ్రత్తగా పెంచుతూ ఉండేవారు. కొంతమంది యువకఖైదీలు ఉదయం 6 గంటలకు జెయిలు తెరవబడడంతోనే ఆ తోటవైపునకు పరుగెత్తి, ముళ్ళతీగెలతో ఏర్పరచబడిన కంచెను గెంతి అక్కడ పెరుగూతూన్న లేత బెండకాయలు మొదలైన వాటిని తెగ తినేవారు. వార్డర్లు వాళ్ళను పట్టుకుని జెయిలరు దగ్గరకో, సూపరింటెండెంట్ దగ్గరికో తీసుకు వెళ్ళేవారు. అందువల్ల ఆ సూపరింటెండెంట్ నన్నూ, వెంకటప్పయ్యగారినీ, ఇంకొక రిద్దరినీ పిలిపించి, ఆ కుర్రవాళ్ళు అల్లరి చేయకుండా చూడవలసిన పూచీ మాదనీ, వాళ్ళని అదుపులో పెట్టి సరిగా ప్రవర్తించేటట్లు చూడమనీ మాకు చెప్పారు.

స్వాతంత్ర్యదినంనాడు, తెలతెలవారుతూండగా, మేము మా సెల్స్‌లోంచి బయటకు వచ్చేసరికి ఆఫీసర్లలో ఉత్పన్నమైన పెద్ద కలవరం వినబడింది. కాంగ్రెసు జెండాలు టవర్‌మీదా, ఖైదీలుంటూన్న బ్లాకు బ్లాకుమీదా ఎగురవేయబడుతున్నాయన్న గందరగోళం ఎక్కువయింది. ఆఫీసర్లు చిక్కులలో పడడం న్యాయమే కదా! ఈ చర్యకు నాయకు లెవరో తేల్చుకోవా లన్న విషయంలో, ఎంతో తర్జన భర్జన జరిగింది. పరిశోధన పెద్ద ఎత్తునే జరిగింది. కాని, ఈ కార్యానికి కర్త ఎవరో తేలలేదు.

నన్ను కన్ననూరు బదిలీచేసిన కొద్ది రోజులలోనే బొంబాయి నివాసి బాట్టివాలా అన్న అతడు బదిలీ అయి, అక్కడకు సూపరింటెండెంట్‌గా వచ్చాడు. ఆయన వచ్చిన కొద్దిరోజులలోనే యువకులు చాలా మంది అతన్ని చుట్టుముట్టి, తమకు కొన్ని ప్రత్యేక సదుపాయాలు కావాలని కోరారు. జెయిలు అధికారులు ఆ కోర్కెలు మన్నించలేదు. యువకులు నిరాహార దీక్షకు ఉపక్రమించారు. ఈ సంగతి నాకు నాలుగైదు రోజుల వరకూ తెలియదు. ఆ యువకులంతా జెయిల్లో మాకు చాలా దూరంగా ఉన్న వేరే జాగాలో ఉండేవారు. పరిస్థితి విషమించిన కారణంగా, సూపరింటెండెంట్ నన్ను కలుగజేసుకోమని కోరాడు. అతి కష్టంమీద పరిస్థితిని చక్కబరచగలిగాను. కాని, దానికి కొంత కాలం పట్టింది.

లాఠీఛార్జి

కొంతమంది ఖైదీల నడత జెయిలు అధికారులకు చికాకుగా ఉండేది. ఆ పరిస్థితి ఆరంభ దినాలలో మాకు తెలియదు. ఒక రోజు రాత్రి లాకప్పయ్యాక, సూపరింటెండెంట్ వెళ్ళిపోయాక, క్రింది తరగతి ఉద్యోగస్తులకు, తలుపులు తెరచి, అనుమానితులపై లాఠీఛార్జి చెయ్యాలని బుద్ధి పుట్టింది. మాకు ఏడ్పులూ, పెడబొబ్బలూ వినబడుతూన్నా, మమ్మల్ని లాకప్పులో ఉంచిన కారణంగా, తెల్లవారిందాకా అసలు ఏం జరిగిందో మాకు తెలియ రాలేదు. సూపరింటెండెంట్ తనకు ఏమీ తెలియదనీ, లాఠీఛార్జి విషయంలో తాను ఎట్టి ఉత్తరువూ ఇవ్వలేదనీ అన్నాడు. పరిస్థితి విషమించి ఉంటే, తన తరవాత ఒక్క జెయిలరుకు మాత్రమే లాఠీఛార్జీ జరిపించగల అధికారం ఉందన్నాడు.

ఉడ్స్ రాక

అప్పట్లో మలబారు జిల్లాకు ఇ. సి. ఉడ్స్ జిల్లా కలెక్టరు. ఆయన జెయిలును పరిశీలిస్తూ నా గదిలోకి వచ్చాడు. నా గదిలో ఒకదాని నిండా పుస్తకాలూ, తెల్ల కాగితాలూ, వ్రాత సామగ్రీ ఉన్నాయి. ఆ గదిలో నేను వ్రాసుకుంటూ కూర్చొని ఉన్నాను. నా గదిలోకి వచ్చి, ఆ పుస్తకా లన్నీ ఏమిటని అడిగాడు. వాటిని ఉపయోగించుకోడానికి ఎవరు అనుమతి ఇచ్చారని అడిగాడు. ఆయనకు ఒక ఖైదీ బండెడు పుస్తకాలు ముందువేసుకుని వ్రాసుకుంటూ కూర్చోవడ మన్నది కిట్టలేదు. "నీవు యే విషయంమీద వ్రాస్తున్నా"వని నన్ను అడిగాడు. నేను ప్రపంచ ఆర్థికవిధానాన్ని గురించి, బర్మా, సిలోన్‌లాంటి దేశాలలో నా పర్యటన అనుభవాలూ వ్రాస్తున్నా నన్నాను. ఆయన చికాకు చెందాడు కాని, ఎవరితో మాట్లాడుతున్నాడో గ్రహించుకొని తశ్శాంతి పొందాడు. నవ్వుముఖంలో, తాను గంజాం జిల్లాలో ఉంటూండగా నేను ఆయన ఎదుట ఒక కేసులో హాజరయిన ఉదంతాన్ని గురించి చెప్పాడు. అయన చెప్పిందాకా నాకా ఉదంతం గుర్తుకు రాలేదు. తరవాత జెయిలు అధికారులను ఎందువల్ల నాకు అటువంటి సదుపాయల కలుగ జేశారని అడిగాడు. నేను ప్రభుత్వం వారి అనుమతిని సంపాదించానని సూపరింటెండెంట్ చెప్పాడు. నేను కాంగ్రెసు పరిపాలనా దినాలలో రెవిన్యూ మంత్రిగా ఉంటూన్న కాలంలో ఆ ఉడ్స్‌దొర నా చేతికింద ఒక జిల్లా కలెక్టరుగా పనిచేశాడు. ఆయన విషయంలో ఒక విచిత్రమయిన సంఘటన జరిగింది. అది చాలా ముచ్చటయిన కధ. దానిని 'కాంగ్రెసు పరిపాలన' అన్న శీర్షికలో పొందుపరుస్తాను.