నా జీవిత యాత్ర-3/1932 లో నా అరెస్టు

12

1932 లో నా అరెస్టు

1932లో నన్నూ, నాతోడి వర్కర్లనూ నిర్భధించడానికి కారణంగా, మేము పన్నుల నిరాకరణ ఉద్యమం సాగింపబోతున్నామని చెప్పబడింది. నిజానికి అలాంటి ప్రయత్నం ఏదీ మేము చేయదలచి ఉండలేదు. అయినా రెండవ రౌండ్ టేబిల్ కాన్ఫరెన్స్ నుంచి తిరిగి వచ్చి గాంధీగారు భారతదేశంలో అడుగు పెట్టేనాటికి అన్ని రాష్ట్రాలలోని అగ్రనాయకులనూ నిర్భంధించి తీరాలనే ప్రభుత్వపుటెత్తే రకరకాల కారణాలను సృష్టించి, దేశవ్యాప్తంగా అగ్రనాయకు లన్నవారి కందరినీ అరెస్టుచేసి, కటకటాలు వెనక్కి పంపించింది.

అప్పట్లో లండన్‌లోని పత్రికలలోనూ, భారత దేశమందలి ముఖ్య పత్రికలలోనూ కొన్ని వార్తలు పడ్డాయి. రౌండ్‌టేబిల్ కాన్ఫరెన్స్‌లో సర్ శామ్యూల్ హోర్ (Sir Samuel Hoare) ప్రతిపాదనలను గాంధీగారు అంగీకరించని కారణంగా, ఆయన్ని అవమాన పరచడమూ, చిన్న బుచ్చడమూ సాగించిన పెద్దలు 'వెళ్ళవయ్యా వెళ్ళు, ఎల్లా వచ్చావో అల్లాగే వెళ్ళు, ఆ వెళ్ళడం వెళ్ళడం తిన్నగా జెయిలుకేలే" అని భయపెట్టినట్లు తెలియవచ్చింది.

దర్మిలా, ఆయనతోపాటే అన్ని రాష్ట్రాలలోని ముఖ్య నాయకులనూ కూడా అరెస్టు చెయ్యమని వచ్చిన హుకుంతోనే పైవిధంగా సృష్టించబడిన రకరకాల కారణాలతో, వారిని నిర్భంధించి జెయిళ్ళలో పెట్టారు. బ్రిటిష్ తీరాన్ని వదిలేముందు గాంధీగారిని హెచ్చరించీ, చిన్నబుచ్చీ, అవమానపరచీ పలికిన పలుకుల ఫలితంగానే గాంధీగారు ఓడ దిగకుండానే అరెస్టు కావడం జరిగింది. అన్ని ప్రాంతాల నాయకులూ నిర్భంధించబడడం జరిగింది.

ఆ పరిస్థితులలో 1932 లో నేనూ తిరిగి అరెస్టు అయ్యాను. సర్ శామ్యూల్ హోర్ భారత దేశంలో మళ్ళీ ఏ విధమయిన ఆరాటాలూ, కలతలూ రేగకుండా తగు చర్య తీసుకో వలసిందని ఇచ్చిన సలహా ప్రకారమే ఈ అరెస్టులన్నీ సాగిస్తున్నామని ప్రభుత్వం వారు బాహాటంగా ఒప్పుకోలేకపోయారు. అలాంటి సూచనలూ, సలహాలూ అందిన కారణంగానే నిజానిజాలతో నిమిత్తంలేకుండా, ఒక్కొక్కరి అరెస్టుకూ కారణం చూపాలి గనుక, ఏదో ఒకటి చూపించారు. నా అరెస్టుకు కూడా అటువంటి విపరీత కారణమే చూపబడింది.

అరెస్టుకు కారణాలు

నేను అప్పుడు రాష్ట్ర కాంగ్రెసు కమిటీ అధ్యక్షునిగానే ఉంటూ ఉండేవాడిని. ఏలూరులో మేము రాష్ట్ర కాంగ్రెసు కమిటీ మీటింగు పెట్టుకున్నాము. ఆ మీటింగు కొన్నాళ్ళపాటు నడిచింది. పెంచబడిన రీసెటిల్మెంట్ రేట్ల విషయంలో కొన్ని ముఖ్య విషయాలు తర్జన భర్జన చేస్తున్నాము. 1930 లో మేము నడపిన శాసన ధిక్కారాన్నీ, నన్నూ నాతోటి వర్కర్లని ఆ సంవత్సరం ఉప్పు సత్యాగ్రహ సంబంధంగా అరెస్టుచేసిన సందర్భాన్ని పురస్కరించుకునీ, ప్రభుత్వంవారు ఎక్కువ చేయబడిన ఆ రీసెటిల్మెంట్ పన్నులను వసూలు చేయడానికి పూనుకున్నారు.

మేము జెయిళ్ళనుంచి తిరిగివచ్చాక, 1931 లో ఆ విషయమై ఏం జేస్తే బాగుంటుందని ఆలోచిస్తున్నాం. ఒకప్రక్క రౌండ్‌టేబిల్ కాన్ఫరెన్స్ నడుస్తూండడంచేత దాని పర్యవసానం ఎల్లా ఉంటుందో తెలియదు కనుక, ప్రభుత్వం ఆ పన్నుల వసూలు సందర్భంలో నిర్భంధ విధానాలను ప్రవేశపెట్టలేదు. ఆ కాన్ఫరెన్స్ విఫలం అయిన కారణంగా అరెస్టు వారెంట్ మాత్రం పంపించారు.

ప్రభుత్వంవారు జారీచేసిన ఆర్డరు పురస్కరించుకుని నేను చెన్నపట్నం వెళ్ళకుండా నా ప్రయాణాన్ని ఆపుజెయ్యాలనే ఉద్దేశం తోనే వారెంట్ పుట్టిందని తలుస్తాను. నేను పట్నంలో ఉండగా నన్ను పట్టుకుంటే అనుకోని అలజడులు కలగవచ్చుననీ, అందులో మేము ప్రభుత్వ విరోధ చర్యలు ఏమీ నడవని సందర్భంలో అరెస్టు జరిగితే అలజడులూ, గడబిడలూ అదికమవుతాయనీ, ఏదో ఒక అబద్దపు ఛార్జీతో ఏ జిల్లాలోనయినా అరెస్టు చేస్తే కొంత గందరగోళం తగ్గుతుందనీ ప్రభుత్వంవారు తలచారు.

తప్పుడు కేసు

మర్నాటి ఉదయం నన్ను మేజస్ట్రేటుగారి ఎదుట హాజరుపెట్టేవరకూ, నా అరెస్టు కారణం తెలియదు. నా కేసు విచారణ జరగడానికి సాక్షులు కూడా హాజరులాగే ఉన్నారు. ఏలూరు నేషనల్ స్కూలు ఎదుట నేను నా కారులోనే నుంచుని ఒక బహిరంగ సభలో ఉపన్య సించానని ఆ సాక్ష్యంవల్ల నాకు తెలియ వచ్చింది. బహిరంగ సభ జరిగింది అన్నది దబ్బర. దానికి జనం హాజరయ్యా రన్నది అబద్ధం. సభ జరుగుతుందని ప్రకటన అయినా జరిగి ఉండలేదు. నేను కారులో బెజవాడ వెడుతూ అక్కడ ఆగిన సందర్భాన్ని పురస్కరించు కుని ఒక కథ అల్లారు.

నా కాలాన్నీ, కోర్టువారి కాలాన్ని వృథాపరచడం ఇష్టంలేక నేను ఏ విధమయిన క్రాసు పరీక్ష చెయ్యదలచుకోలేదు. నా తరపున డిఫెన్స్ సాక్ష్యాన్ని పెట్టి కేసు సాగించడమూ అనవసరం అనిపించింది. వారికి తోచిన రాజకీయ కారణాలతో నన్ను అరెస్టుజేసి జెయిలుకు పంపించాలని వారికి బుద్ధి పుట్టింది. "ప్రభుత్వంవారు కోరినప్పుడల్లా జెయిళ్ళకు వెళ్ళడానికి మేము సర్వదా సిద్ధంగానే ఉంటున్నాము గదా! అలాంటప్పుడు ఈ తప్పుడు కేసు మాత్రం ఎందుకు?" అని మాత్రం కోర్టులో అంటూ, "ఎందుకింకా ఆలస్యం? మీరు తలచినంత కాలం త్వరగా శిక్ష విధించండి" అన్నాను. ఆయన నాకు ఎనిమిది మాసాలు విధించాడు.

లండన్‌లో రౌండ్ టేబిల్ కాన్ఫరెన్స్ విఫలం అవడంతోనే జవహర్‌లాల్ నెహ్రూగారినీ, ఇతర ముఖ్య నాయకులనూ, గాంధీగారి అరెస్టుతో పాటే, ఏవేవో కారణాలు చెప్పి, అరెస్టుచేసి జెయిళ్ళకు పంపించారు.

రౌండ్ టేబిల్ నాటకం

భారత రాజ్యాంగ కార్యదర్శి (సెక్రటరీ ఆఫ్ స్టేట్), బ్రిటిష్ ప్రభుత్వంవారూ నిన్న మొన్ననే గాంధీ ఇర్విన్ ప్యాక్ట్ ధర్మమా అని ఒక మంట చల్లారిందనీ, అల్లా చల్లారిన మంట ధర్మమా అనే గాంధీగారిని దేశానికి ఏకైక నాయకుడుగా రౌండ్ టేబిల్ కాన్ఫరెన్స్‌కు పంపగలిగాం అని గ్రహించగలిగిన కారణంగానే, మళ్ళీ ఇంతట్లోనే ఇంకో పెద్ద మంట అంటుకుని, అది గబగబా అన్ని ప్రాంతాలకూ ప్రాకుతుందేమో అన్న భీతివల్ల పుట్టిన దడతో ఒకేసారిగా అన్ని ప్రాంతాలలోని అగ్రనాయకుల్ని ఏదో ఒక సాకుతో గబగబా అరెస్టుచేసేసి నిర్బంధంలోకి తీసుకుని, కటకటాల వెనక్కి పంపించి హాయిగా ఊపిరి పీల్చుకున్నారు.

ఒక మహోన్నతమయిన అహింసాత్మక సమరం గాంధీ - ఇర్విన్ ఒప్పందం ధర్మమా అని ఆగిన సంగతి గ్రహించిన ఆంగ్లేయులు భారతదేశంపట్ల ప్రవర్తించిన తీరు ఇది! లార్డ్ ఇర్విన్ బ్రిటిష్ వారి ప్రతినిధిగానూ, గాంధీగారు భారతదేశపు ఏకైక నాయకుడుగానూ ఆ ఒప్పందంపై సంతకాలు చేసినా, బ్రిటిష్ కాబినెట్‌వారికిగాని, సెక్రటరీ ఆఫ్ స్టేట్‌కిగాని ఆ సంధి షరతులను మన్నించాలనీ, వాటిని అమలు పరచాలనీ ఏ కోశానా అభిప్రాయం ఉన్నట్లు కనబడలేదు. అమలుపరచకుండా ఉండడానికి కారణం చూపాలిగా! అలాంటి కారణంగానే ఈ రౌండ్ టేబిల్ కాన్ఫరెన్స్ పుట్టింది.

దేశాన్నీ, దేశీయుల్నీ, నాయకుల్నీ, కాంగ్రెసువారినీ అందర్నీ చల్లచల్లగా నేర్పుతో ఒక వల పన్ని లాగారు. ఆ రౌండ్ టేబిల్ కాన్ఫరెన్స్‌లో గాంధీగారిని సరిగా చూడలేదు సరికదా, ఆయన్ని అవమాన పరచడానికీ, చిన్నబుచ్చడానికీ ప్రయత్నించారు.

విభీషణాయిలు

మనదేశ స్వాతంత్ర్యానికి విరోధులయిన ఆ విభీషణాయిలు ఏదో ఒక కులం పేరిటో, మతం పేరిటో, మరో రూపంలోనో తమకు రక్షణ కావాలంటూ, తమరిని ప్రత్యేక దృష్టితోనూ, అభిమానంతోనూ చూడవలసి ఉంటుందంటూ ఆ రౌండ్ టేబిల్ కాన్ఫరెన్స్‌కు హాజరయ్యారు. భారతీయులచే ఆంగ్లేయుల గడ్డపై ఆడించిన విషాద కరమయిన వింత నాటక మది. గాంధీగారికి దేశీయులూ, విదేశీయులూ కూడా ద్రోహం చేశారు.

భారత దేశం తరపున 'స్వాతంత్ర్య' తీర్మానం తీసుకువచ్చి నందుకు గాంధీగారిని ఎగతాళి చేశారు. గుంఫితంగా, గంభీరంగాను ఎగతాళి చేశాక, సర్ శామ్యూల్ హోర్ భారతదేశానికి గాంధీగారి అరెస్టుతో ఒక పాఠం చెప్పి తీరతానని భయపెట్ట సాగాడు. ఆయనే కాదు, యావత్తు భారతదేశంలోని నాయకులంతా జెయిళ్ళకు పోతా రన్నాడు. అన్న మాట ప్రకారం చెయ్యనూ చేశాడు. రెండవ రౌండ్‌టేబిల్ కాన్ఫరెన్స్ అనంతరం వెనువెంటనే దేశాన్ని అణగద్రొక్కడానికి జరిపిన చర్య ఇది. ఆ దేశవిస్తృతమైన చర్య సందర్భంగానే నేనూ అరెస్టయ్యాను.

తిరిగి వెల్లూరు జెయిలుకి

వెనుక పుటలలో నా అరెస్టూ, విచారణా, జెయిలు శిక్ష అన్న విషయాలను గురించి చెప్పే ఉన్నాను. శిక్ష విధించిన తరువాత నన్ను మదరాసు తీసుకు వెళ్ళారు. అక్కడనుంచి, రెండవ సారిగా నన్ను వెల్లూరు జెయిలుకు మార్చారు. ఆజెయిలు సూపరింటెండెంట్‌గా మేజర్ ఖాన్ పనిచేస్తూనే ఉన్నాడు. ఈ సారి ఒకరి నొకరం అర్థం చేసుకున్న కారణంగా, శిక్షాకాలం పూర్తి అయ్యేదాకా అక్కడే నన్ను ఉంచారు. వెనకటి లాగే ఈసారి కూడా చాలామంది హితులూ, స్నేహితులూ, సన్నిహితులు తోడి ఖైదీలుగా అక్కడికి వచ్చి చేరారు.

మామూలు జెయిలు పరిస్థితులు తప్ప చెప్పుకోతగ్గ క్రొత్త విశేషాలు ఏమీలేవు. మామూలు దోరణిలోనే జెయిలు పరిస్థితులు నడిచా యనీ, పైల్ పద్దతిలోనూ, 'సి' క్లాసు వారిని చూసే విధంలోనూ మార్పులేదనీ, 'సి' క్లాసు వారిలో కొందరికి 'క్వారంటైన్‌' రాళ్ళు కొట్టే పనికూడా ఒప్పగించ బడిందనీ చెపితే చాలనుకుంటాను. నన్ను కొన్ని దినాలపాటు ఆనవాయితీ ప్రకారంగా 'క్వారంటైన్‌'లో ఉంచినప్పుడు ఈ విషయాలన్నీ నా కళ్ళతో చూసి గ్రహించ గలిగాను. ఈ సంగతులన్నీ సూపరింటెండెంట్ గారి దృష్టికి తీసుకువచ్చిన కారణంగా నేను అక్కడ ఉన్నంతకాలం కొద్దిగా మార్పు కనబరిచారు. కాని నన్ను లోపలికి మార్చగానే, మామూలు కథే నడిచిందని విశ్వసనీయ వర్గాల ద్వారా తెలియవచ్చింది.

ఈ అరెస్టును గురించీ, జెయిలు శిక్షను గురించీ మేము ఏ విధంగానూ ఎప్పుడూ అనుకుని ఉండలేదు. ఆ కారణంగా ఈ సంగతులన్నీ చాలా తొందర తొందరగా జరిగిపోయాయని అనుకోక తప్పదు. మేమూ - ఏ విధమయిన ప్రచారాలుగాని, సత్యాగ్రహ సమరాలుగాని జరపడంలేదు. గాంధీగారా - రౌండ్ టేబిల్ కాన్ఫరెన్స్‌నుంచి తిరిగి రానై ఉన్నారు. గాంధీగారు బొంబాయి రేవులో దిగిన తక్షణం ఆయన్నీ, ఆయనతో పాటే ఆసేతుశీతాచల పర్యంతం ఉన్న కాంగ్రెసు నాయకులనీ ఒక్కుమ్మడిని అరెస్టు చేస్తారని కలలోకూడా అనుకోలేదు.