చేతులార శృంగారము జేసి

త్యాగరాజు కృతులు

అం అః

ఖరహరప్రియ రాగం - ఆది తాళం


పల్లవి

చేతులార శృంగారము జేసి చూతును; శ్రీరామ !


అనుపల్లవి

సేతుబంధన సురపతి సర

సీరుహభవాదులు బొగడ, నా


చరణము 1

మెరుగు బంగారందెలు బెట్టి

మేటియౌ సరిగ వల్వలు గట్టి

సురతరు సమముల సిగనిండజుట్టి

సుందరమగు మోమున ముద్దుబెట్టి


చరణము 2

మొలను కుందనపు గజ్జలు గూర్చి

ముద్దుగ నుదుట దిలకము దీర్చి

యలకలపై రావిరేకయు జార్చి

యందమైన నిన్నురమున జేర్చి


చరణము 3

ఆణి ముత్యాల కొండె వేసి

హవుసుగ పరిమళ గంధము బూసి

వాణి సురటిచే విసరగవాసి

వాసియనుచు త్యాగరాజనుతయని రోసి