కాశీమజిలీకథలు/ఎనిమిదవ భాగము/160వ మజిలీ

    కట్టులకై తెచ్చి కడఁబారవైచిన
                  యోషధు ల్గాంచి నిట్టూర్పు విడిచె

గీ. వానినెల్లను గైకొని వాంఛతోడ
    జాలరులఁ గౌఁగిలించి యుత్సాహమంద
    నుతులఁ గావించె నలపురోహితుని బిలిచి
    తెలిసికొని వెండి మిత్రుఁ డొందినశ్రమంబు.

మిక్కిలి పరితపించుచుఁ గుచుమారుని కుపకారముగావించిన బెస్తలగృహంబుల నంత విత్తబహుళంబై యొప్పునట్లు చేసి యతని కన్న ప్రదానాదుల నాదరించిన పురోహితుని బురోహితునిఁగాఁ జేసికొని యటనుండి పరివారసమేతముగాఁ బురందరపురంబున కరిగెనని యెఱింగించువఱకు వేళ యతిక్రమించినది. అవ్వలికథ పైమజిలీయందుఁ జెప్పం దొడంగెను.

160 వ మజిలీ.

−♦ భైరవునికథ. ♦−

ధారుణీపయోధరాగ్రహారమై యొప్పారు. గిరితటంబను నగ్రహారమున గౌతముండను బ్రాహ్మణ బ్రువుండు గలఁడు. వాఁడు కడుపవిత్రమగు ధాత్రీసురవంశంబునఁ బుట్టియు జనకంటకములగు పనులఁ గావింపుచుండుటంజేసి వాని నెల్లరు భైరవుండని పిలుచుచుందురు.

సీ. ఒకసారి కవినంచుఁ బ్రకటించి బెదరించుఁ
                 బద్య మల్లుచు జానపదు లఁ జేరి
    యొక తేపఁ గరిణీక మొనరించుఁ గాపువా
                 రలనోరుగొట్టు లెక్కలను వ్రాసి
    యొక పరి బేరియై యూరూరుఁ దిరుగు వే
                 ఱొకతేఁప దున్ను హాలికతఁ బూని

    యొకమాటు రసవాదయుక్తులఁ బన్ను సం
                  తల కేగి యందు జూదంబులాడు

గీ. మూటలను మోయుఁ గూలికి బాటగొట్టు
    మృత్యువై పాంథులకు నిట్లు మెలఁగి మెలఁగి
    యేదినంబున కాదినంబే యతండు
    కళవళము జెందుఁ గూడుగుడ్డలును లేక.

గీ. దేవళంబులలోపలి దీప మార్చి
    భారతము నెత్తిబూని యబద్ధమాడుఁ
    జేత నొక కాసు వెట్టినఁ జిచ్చువెట్టుఁ
    దలఁకఁ డించుక బ్రహ్మహత్యకును వాఁడు.

ఆపాపాత్ముం డెట్టిపాపకృత్యములు సేయుచున్నను నిప్పచ్చరము వదలినదికాదు. వాఁడు మ్రుచ్చులంగూడుకొని విచ్చలవిడి చౌర్యక్రియాదక్షుండై క్రుమ్మరుచుండ రాజభటులు వానింబట్టుకొని చెఱసాలం బెట్టిరి.

ఎట్లో తప్పించుకొని పారిపోయి గ్రామములు విడిచి తలపెంచుకొని మహారణ్యసంచారము గావింపుచు నొకనాఁ డొకకాంతారాంతరమునఁ బొద్దుగ్రుంకుచుండ నాఁటిరాత్రి నివసింపందగిన నెల వేదియని యాలోచింపుచుండ దీర్ఘశాఖలచే దెసలనావరించియున్న యొకవృక్షం బాసమక్షమునఁ దన్ను రక్షింపఁ బ్రత్యక్షంబైన భగవంతుఁడోయనఁ గన్పట్టినది. విశాలంబగు తదంతికభూతలంబంతయుఁ దృణకంటకాదులు లేకుండ బాగుచేయఁబడియున్నది. అందందు మెత్తనిపల్లవములు పుష్పములు దళములు విష్టరములుగాఁ బరువఁబడియున్నవి. ఆవింత జూచి భైరవుం డయ్యా రే ! ఇది మనుష్యులు సంచరించు ప్రదేశంబని తోఁచుచున్నది. ఈచెట్టుక్రిందకు వచ్చి గొప్పవారు రాత్రులఁ జల్లగాలి సేవింపు చుందురుకాఁబోలు. ఏదియెట్లైన దీనిక్రింద వసించుట నీతికాదు. దీనిశా ఖాంతరములనుండినఁ బరమేశ్వరుఁడు కనుంగొనలేడు. కోటరమునవసించి యిందలివింతలఁ జూచెదంగాక యని నిశ్చయించి యొకానొక తొఱ్ఱ శుభ్రముసేసికొని యందు వసించియుండెను. ఇంతలోఁ బ్రొద్దు గ్రుంకినది. అప్పుడు-

గీ. వెల్గురాయనిజోడు వెన్నెలలఱేఁడు
    పాలసంద్రంబుపట్టి చూపట్టె నుదయ
    మేదినీధరకూటగ్రసౌధసీమ
    నిజక రావళి దెసల వన్ని యల నిడుచు.

−♦తిర్యగ్జంతుమహాసభ ♦−

క్రమంబున వెండిపూసినట్లు పండువెన్నెలలు దెసల నిండియుండ సింహ శార్దూల వరాహ శాఖామృగ భల్లూక ప్రముఖములగు నారణ్యకమృగంబులును అజగజాశ్వమూషకశునకమార్జార ధేనువృషభ ప్రముఖములగు గ్రామ్యజంతువులును సందోహములుగా నాచెట్టుక్రిందకు రాఁదొడంగినవి. అందు ముందుగా జంబుకంబులు వచ్చి రాఁబోవు మృగంబుల కెదురుబోయి మృగంబులఁ దీసికొనివచ్చి యుచితస్థానంబులఁ గూర్చుండఁబెట్టుచుండెను. జాముప్రొద్దుపోవువఱకు నాప్రదేశమంతయు మృగములచే నిండింపఁబడియున్నది.

గీ. తోఁక యాడించుకొనుచు నస్తోకవేగ
    మడరఁ గేసరములు వాయుహతిఁ జలింప
    వచ్చె హర్యక్ష మొకటి లేవఁగ మృగంబు
    లెల్ల వలదంచు సంజ్ఞ గావించి యటకు.

అట్లువచ్చి యమ్మృగేంద్రంబు దనకై యమరింపఁబడియున్న పెద్ద గద్దియం గూర్చున్నది. అప్పుడు మృగంబులెల్ల సంతోషారావంబులు వెలయించుటయు నభినందించుచు జంబుకంబులు నిలువంబడి మహాత్మా ! భూమండలంబంతయు దిరిగి గ్రామ్యమృగంబులకు నారణ్యకమృగంబు లకుఁగూడఁ దమశాసనం బెఱిఁగించితిమి. ఆయాదేశంబులంగల మృగంబులెల్ల సంతసించుచు నేఁ డిటకుఁ దమతమ ప్రతినిధుల నంపినవి. కాని సిద్ధాశ్రమమందున్న మృగముయొక్కటియు నిక్కడికి రాలేదు.

మేము బిలువఁబోయినప్పుడే సిద్ధునియానతి లేనిదె మాకు మా యడవిదాటి పో వశముకాదని చెప్పియున్న వి. తక్కినదేశములనుండి సత్వంబులన్నియు వచ్చియున్నవని యెఱింగించి కూర్చున్నవి.

అప్పుడు మృగరాజు లేచి యిట్లుపన్యసించినది. మిత్రులారా ! మనమందఱము నేఁ డిటకు సమావేశముమగుటకుఁ బ్రోత్సాహము గావించిన యీజంబుకంబుల నభినందించుచున్నాను. వినుండు. సృష్టికర్త యొక్కఁడే సర్వాధికుండు. సృష్టింపఁబడిన జంతువులన్నియు వానివాని బుద్ధిబలంబునంజేసి న్యూనాధిక్యములు వహింపుచున్నవి. మనుష్యులవలెనే మనము సృజింపఁబడితిమి. కాని వారు మనల సృజింపలేదు. వారు మిగుల బుద్ధిబలము గలవారగుట మనలమించి భౌతికసృష్టిలో వారే ప్రధానుల మనిపించుకొనుచు మనలో లొంగనివానిఁ జంపుచు లొంగిన వానిచేఁ బనులఁ గావించుకొనుచున్నారు.

మనలో సామాన్యజంతువునకుగలశక్తి వారిలో నూర్వురకు లేదు. నూర్వురఁ గాళ్లక్రిందవైచి చీమలవలె నలుపు సామర్థ్యముగల యేనుఁగులు ఒక్కనికి లొంగి తొత్తువలెఁ బనులుచేయుచున్నవి. ఇంతకన్నఁ జిత్ర మేదియైనం గలదా ? ఇఁక గుఱ్ఱములు నెద్దులు మేకలు లోనగు జంతువులమాటఁ జెప్పనవసరములేదు. ఇందుకుఁ గారణము మన బుద్ధిమాంద్యము, పరస్పరవైరము. మనుష్యులఁ జూచి మనము నేర్చికొనవలసిన విషయము పరస్పరమైత్రియే. ఒక మనుష్యుఁడు మఱియొకమనుష్యుని జంపిన గొప్పయపరాధముకదా? మనలో నెలుకను బిల్లియుఁ బిల్లిని గుక్కయు లేళ్లను దోడేళ్లు నావులఁ బులులును భక్షింపఁ జూచుచుండును. జాతివైషమ్యము విడిచి యైకమత్యముగా మెలంగినచో నొక రికి లొంగవలసినపని లేదు. ఆరణ్యకములు మనుష్యులఁ బ్రేమింపవు. గ్రామ్యములు లొంగియుండి వారిం బ్రేమించుచున్నవి. కావున వారిపైఁ గత్తికట్టి సాధించుటకు గ్రామ్యమృగముల యభిప్రాయము తెలిసికొనవలసియున్నది. మీమీయభిప్రాయము లెఱింగింపుఁడని పలికి సింహము కూర్చున్నది. అప్పుడు బలీవర్ధంబులు నిలువంబడి యిట్లు చెప్పినవి.

అక్కటా ! మాయిక్క ట్లేమెకంబులకును లేవు. వినుండు.

సీ. బలము చేరుటకు మందలగట్టి పొలములఁ
                 బెంట దోలుదు మగ్గి ప్రేలుచుండ
    బదునురా భూమి దున్నుదు మెల్లసస్యముల్
                ఫలియింపఁ బలుమారు హలముఖమున
    వాడిడెక్కల ద్రొక్కి వరిగడ్డి విడిపోవ
                ధాన్యముల్ నూర్తు ముద్దామలీల
    నూర్చిన ధాన్య మానోగణంబులను గా
               దులకుఁ దోలికొనిపోదుము గదయ్య

గీ. ఇన్నిపాటులుపడి ఫలియింపఁజేయఁ
    జేరెడైనను ధాన్యంబు చేతితోడఁ
    దినఁగఁ బెట్టరు పనికిమాలినది గడ్డి,
    పొల్లు, దూగర, గాకయెప్పుడును జనులు.

అదియునుంగాక

ఉ. బండికిఁగట్టి మమ్ముఁ గడు భారమువైచి యొకండు ముందుఁ గూ
    ర్చుండి వడిన్వడింజన చొఛో యనుచుం జనకున్న వీపుపై
    ఛండకశాగ్రభాగమున భళ్ళునఁ గొట్టుచు విచ్చి రక్తపుం
    గండబయల్పడం గరుణ గాంచఁడు సీ! మనుజుండు సేవ్యుఁడే ?

గీ. ఎట్టినీరసపడినట్టి యెద్దునైన
    గట్టి యొంటెద్దుబండి కెక్కసముగాఁగ

    జనుల నెక్కించి నడకున్నఁ జావమోదు
    నయ్యయో ! యేరులేరు మాకుయ్యవినఁగ.

క. ఇలను దనంతటనేపడి
   మొలచిన పచ్చికభుజించి మురువుగ బ్రతుకం
   గల మిట్టి మాకు మనుజుల
   కొలువేమిటికో యగమ్యగోచర మరయన్ !

అచ్చువేసి విడిచినయెద్దు లెట్లు బలియునో చూచితిరా? స్వేచ్ఛ దిరుగనిచ్చిన మేమెల్లరము నాలఁబోతులవలె బలిసియుందుముగదా. రాత్రింబగళ్లు మాచే బనులు గొనుచు మమ్ము మిక్కిలి బాధలుపెట్టుచున్న మనుష్యులఁ దప్పక శిక్షింపవలసినదేయని యెద్దులు పల్కినవి. దున్నలు నామాటలే పలికినవి. ఆవులును గేదెలును నందుల కనుమోదించినవి. పిమ్మట మేకలు నిలువంబడి మృగేంద్రమా ! మాకష్టము లిట్టివని చెప్పఁజాలము. పశుమృగపక్షికీటకాదులలో మావంటి మెత్తని జాతి మఱియొకటిలేదు. మాయునికి గ్రామమందైనను నాహార మారణ్యకము. మునులవలె నాకలములు దిని యెవ్వరికిని వెఱపుగలుగఁజేయక సాధువృత్తి మెలంగుచున్నను మమ్మందఱు బలవంతమున జంపుచుందురు. అక్కటా మనుష్యుల పండువులు మాకు గండములు. వారి యుత్సవములు మాకాపత్సమయములు. దొరలరాక మాకవసానసమయము. వారి మసూచికములు మాకు మరణసూచకములు. అయ్యయ్యో! మనుష్యుల కే కాక మెకాలకుఁగూడ మేమే లోకువ! అదియొకటేకాదు. మాంసమాసింపని వేలుపులుగూడ బులులవలె మావపఁ దిన నాసించుచుందురఁట ! ఇఁక మాకు సుకమెక్కడిది? రోగముల వలన మాకు మరణములేదు. బలవన్మరణమే మాకుశరణము. పుడమి నిర్మానుష్యము సేయించినచో మేము హాయిగా జీవింతుము. మీ దయవలన మెకములిఁక మాజోలికి రావుగదా ? మనుష్యులఁ బరిభవిం పవలయునని మేకలు చెప్పినవిని గొఱ్రెలు నట్లు చెప్పినవి. పిమ్మట నేనుఁగులు లేచి,

మహారాజా ! నీరూపము మేము కలలోఁజూచినఁ బ్రాణములు విడుతుము. అట్టినీవు దాక్షిణ్యమూని మమ్మురప్పించి మీపక్షమేమని యడిగిన మేము ప్రతిపక్షులఁజేరుదుమా? మేము పెద్దదేహము గలిగియు బుద్ధిమాంద్యముచే మనుష్యులకు లొంగియుంటిమి. మాకాహారము వారిడనక్కఱలేదు అడవి రొట్టదిని జీవింపఁగలము. నల్లమందువైచి మాబుద్ధిని మందపఱచుచున్నారు. మనుష్యులు మాకు శత్రువులుగాని మిత్రులుగారు. అవశ్యము వారిఁ బరిభవింపవలసినదే యని యేనుఁగులు పలికినవి. హర్యక్షంబు:

గీ. ఒడలు తోమిత్రోమి కడిగి కాళులువంచి
   పిసిగి పిసిగి దువ్వి ప్రీతిజనులు
   హరుల నాదరింతు రది హేతువుగ నవి
   మనలఁ జేరవేమొ యనుఁడు హరులు.

నిలువంబడి సింహంబునకు మ్రొక్కుచు నిట్లుచెప్పినవి. మృగ ప్రభూ ! మనుష్యులు మాకుఁజేయు నుపచారములన్నియు వారిపనులం జేయించికొనుటకు గాని మాయందలి యనుగ్రహమువలనఁగాదు. మనుష్యులు మమ్ము బండ్లకు గట్టియు బరువుమోయించియుఁ బొలముల దున్నించియు నెద్దులకన్న బెద్దగా బాధించుచున్నారు. మఱియు మమ్మాడుగుఱ్ఱము మొగము జూడనీయక సర్వదాకట్టిపెట్టి మాచే బ్రహ్మచర్యవ్రతంబు సేయించుచున్నారు. ఇంతకన్న నపకారమేమియున్నది? మేమడవిలో గడ్డి తిని బ్రదుకగలము. మనుష్యులపై మాకు జాలి లేదు. పరిభవించుటయే మాయభిప్రాయమని యశ్వములు పలికినవి. ఖరములు నుష్ట్రములు నట్లే నరులయెడ ద్వేషము సూచించినవి.

లేళ్ళు పందులు మేకలవలెఁ దమ బలవన్మరణముగుఱించి దుః ఖింపుచుఁ జెప్పికొనినవి. అప్పుడు వార్యక్షంబు శునకములఁజూచి మీయాశయమెఱింగింపుఁ డనవుడు శ్వానములు నిలువంబడి మ్రొక్కుచు నిట్లు చెప్పినవి.

దేవా ! మమ్ము అల్పులమని తలంపక మృగంబులతోఁగూడఁ బ్రాతినిధ్య మిప్పించి యీసభకు రప్పించినందులకు వందనశతంబు లర్పించుచున్నాము. మాకు మనుష్యులేమియు నపకారము సేయకున్నను జాతి సాధర్మ్యమున మీతోఁజేరకతీరదు. కాని యొండు వినుండు. మీకు మొగమాటపడి యెదనొండుబెట్టుకొని యొకటిచెప్పుట సభ్యుని ధర్మముగాదు. మేము మనుష్యులు తిను నాహారము భుజింతుము. వారిని విడిచి మేమడవికివత్తుమేని మాకాహారమేది ? క్రొత్తశాసనప్రకారము ఒకజంతు వొకజంతువును భక్షింపఁగూడదుగదా ? అన్నమైన మాంసమైన మాకుఁ గావలయును అడవిలో రెండును దొరకవు మనుష్యులపై మేమెట్లు ద్వేషింతుము? ఈగుఱ్ఱములు నెడ్లు గజంబులును నరుల పై వైరముసూచించి పలికినవికాని వారు పెట్టెడుతిండి యడవిలో వానికిఁ దొరకునా ? తమ పిల్లలవలెఁ జూచుకొని యాహారము పెట్టుచున్న మనుష్యులవిడిచి యడవికిఁబోవుట చెడుబుద్ధిగాని మంచిబుద్ధి గాదు. ఇట్లు పలికితిమని దేవర మాయందు వైరము బూనఁదగదు క్షమింపవలయునని శునకంబులు పలికినవి.

మార్జాలము లామాటలే యనువదించుచు మహాత్మా ! నరులగృహములలో సంచరించుటకుఁ గుక్కలకు నిషేధమున్నదికాని మా కేమియు నాటంకములేదు. మహారాజుల యంతఃపురములు సూతికా గృహములుగాఁ జేసికొందుము. మనుజులు భుజించివిడిచినపదార్థములన్ని యు మాపరములగును. గృహములలో స్వేచ్ఛగాఁ దిరుగుదుము వారి పాలు పెరుగు త్రాగుచుందుము వారిపైఁగత్తిగట్టి మీతో నడవికి వచ్చి మేమేమి చేయుదుము. మీకునమస్కారము క్షమింపుడు. క్షమిం పుఁడు అని పలుకుచుఁ. బిల్లు లోరసిల్లినవి.

అప్పుడు శార్దూలంబులు వాలంబులు త్రిప్పుచు గంభీరస్వరంబున నిట్లుపలికినవి. మహారాజా ! కుక్కలుఁ బల్లులుందక్క తక్కిన గ్రామ్యమృగంబులన్నియు మనుష్యులపై ద్వేషించుట కంగీకరించినవి. తదుచ్ఛిష్ఠభోక్తలగునవి యట్లుపలుకుట వింతగాదు. వానితో మనకంత పనిలేదు. వృషభాశ్వములు వారినివిడిచి మనలోఁ గలియుట కంగీకరించినవిగదా. ఎడ్లు భూమిదున్నకున్న నడవి బలియును. అరణ్యావృతములగు గ్రామములసమీపముల మన మేగవచ్చును. అప్పుడు మనము మనుష్యుల జయించుట సులభమని పెద్దపులులు పలికినవిని యితరమృగంబులన్నియు నామాట కంగీకరించినవి.

అప్పుడు అగ్రాసనాధిపత్యము వహించియున్న సింహము నిలువంబడి వినుండు. వినుండు. తొందరవలదు. మనుష్యులు కడునేర్పరులు బుద్ధిబలముగలవారు వారిం బరాజితులఁగావించుట సామాన్యముకాదు. మనలో నైకమత్య మింకనుం గలుగలేదు. అండజములు సరీసృపములు కీటకాదులు కూడ మనలోఁ జేరవలయును. అప్పుడుకాని మనమాపనికిఁ బ్రయత్నింపరాదు. మఱియొకసభకు వానింగూడ రప్పింతుము. ఇందుల కందఱు ననుమోదింపవలయునని సింహం బుపన్యసించినది. ఏకగ్రీవముగా నామాట కాసత్వంబు లంగీకరించినవి. ఆతీరుమానమునకు మార్జాల కుర్కురములు పరిహాసము గావించుచు లేచిపోయినవి. అంతలోఁ దెల్లవారుసమయమగుటయు నామృగంబులెల్లఁ దమతమ నెలవునకుఁ బోయినవి.

బైరవుం డాకోటరమున వసించి మృగసభావిశేషము లన్నియుం జూచుచుండెను. కాని వానిసంభాషణ మేమియుం దెలియలేదు. ఏమృగ మెప్పుడువచ్చి మీఁదఁబడిచంపునోయని యడలుచు నొంటిప్రాణముతో నాతొఱ్ఱనంటుకొని కూర్చుండెను. తెల్లవారినతరువాత మృగములన్ని యు దూరముగాఁబోయెనని నమ్మకము గలిగినపిమ్మట భైరవుఁడు మెల్లగా నాచెట్టుదిగి యొంటిప్రాణముతో నొకదారింబడి నడువసాగెను. ఏచెట్టుపైఁ బిట్ట పుఱ్ఱుమన్నను నేదియోమృగము మీఁదఁబడునని వెఱపుగదురఁ బరుగిడుచుండును. అట్లు వాఁ డమ్మహారణ్యమధ్యంబున నత్యంత సాధ్వసభ్రమితస్వాంతుండై తిరుగుచు నొకనాఁడు సాయంకాలంబునకు దైవికముగా సిద్ధకూటంబునకుఁ బోయి యందొకవృక్షాంతరంబున వసించి యాఱేయి వేగించెను.

−♦ సిద్ధునికథ. ♦−

సూర్యోదయసమయంబున నతని కొకఘుంటానాదంబు వినంబడుటయు నక్క జముతో నోహో ! యిందు మనుష్యులుండిరా యేమి ? లేనిచో నీధ్వని యెట్లుబయలువెడలెడిని? నా కాయుశ్శేష మింకనుం గలదుకాఁబోలు. అని తలంచుచు నారవంబు బయలువెడలుచున్న దెసకుఁ జూడ్కులు వ్యాపింపఁజేసెను. అల్లంతదూరములో శాఖా సమావృతదిక్తటంబగు వటవిటపియొండు కన్నులపండువు గావించినది.

దానిపొంత నిరంతరలతాంతమనోహరలతాంతర పరిశోభితంబగు పర్ణశాల విశాలమాలతీవేల్లితంబై యొప్పుచుండెను. తదంతికంబున శాఖాతంబున వ్రేలంగట్టినఘంటిక నొకభల్లూకంబు గొట్టుచుండెను. ఆవింతజూచి భైరవుండు గడగడ వడంకుచు నయ్యో ! మఱల నామృగంబులన్నియు నిందు వచ్చునుగాఁబోలు. నాఁడు రాత్రియగుటఁ జూడక విడిచినవి. నేఁడు చంపును. అదిగో మృగములరొద వినంబడుచున్నది. ఈయెలుఁగుబంటి యీగంట నెందుసంపాదించినదో అని యాలోచించుచు డిల్లవడి యాదెస చూచుచుండె నప్పుడు,

సీ. సమ్మార్జనము చేసెఁ జమరీమృగంబులు
                   చలితవాలప్రభంజనముచేతఁ

    గరిపోతములు గరాగ్రమున నీరుగ్రహించి
                   కలయంపి వాకిటఁ గలయఁజల్లెఁ
    గటిచయం బలికె వాకిలి వేదికల వల
                   పులపచ్చకస్తురి బురదఁ దెచ్చి
    కరికుంభసక్తముక్తాఫలంబుల నేరి
                   కలయ సింగములు మ్రుగ్గులుఘటించె

గీ. గీతములు బాడె శారికాకీరచయము
    నెమళు లొప్పుగ నాడెఁ బింఛములు విప్పి
    యరుణుఁ డదయింపకయమున్న యటకు వచ్చి
    శాంతమతి సిద్ధు సత్తపశ్చర్యమహిమ.

మఱికొన్నిమృగంబులు భక్తివిశ్వాసములతోఁ గందమూలఫల కుసుమదళాదులం దీసికొనివచ్చి యప్పర్ణశాలయందు జపముసేసికొనుచున్న సిద్ధునిపాదమూలంబున నిడి తత్ప్రసాద మాకాంక్షించుచు మోడ్పు చేతులతో నాప్రాంతమున వసించినవి.

ఆమృగచేష్టలన్నియుం బరికించి భైరవుండు గుండెచెదర నందున్నసిద్ధుండు దనకుఁ గనఁబడమి నయ్యో ! మృగోపద్రవంబు నన్ను విడువదుకాఁబోలు. నాఁ డెట్లో బయలుపడితిని. నేఁ డిందు నాకుఁ జావు మూడినది. తప్పదు. కానిమ్ము. మృగంబు లిందన్యోన్య వైరంబులు విడిచి మైత్రితో మెలగుచున్నవి.

ఇదియేమిమహిమయో తెలియదు. ఏనుఁగకు సింహంబు గలలోఁ గనంబడినంతనే చచ్చునని చెప్పుదురు. ఆరెండుమృగము లెట్లు చెలగాట లాడుచున్నవో! అయ్యారే! కండూతివాయం బులి గంగడోలు నాకుచుండ ధేనువు మెడసాచి చూచుచున్నది. ఇంతకన్నఁ జిత్రమేమి? యనితలంచుచు నాతరుశాఖాంతరముల నణఁగి యొంటిప్రాణముతోఁ జూచుచుండెను.

మఱియు నంబరమణి గగనమధ్యంబలంకరింప మఱల నాఘంటా నాదంబు వినంబడినది. భైరవుం డాదెసఁ గన్నులెత్తి చూచుచుండెను.

గీ. భూతిరుద్రాక్షమాలికాభూషితాంగుఁ
    డురుజటాంచితమస్తకుం డొక్క సిద్ధ
    యతివరుండు కమండలూద్యత్కరుండు
    జపము చాలించి యప్పర్ణశాలనుండి.

స్నానార్థము బయలువెడలి తటాకంబున కరుగుచుండ మృగ తండంబులెల్ల ముందునడుచుచుండె. వృక్షశాఖాంతరమునుండి యవ్వింత జూచి భైరవుండు నెఱపుడిపికొనుచు సాహసముచేసి యాసిద్ధుండు తానున్న చెట్టుక్రిందుగాఁ బోవుచున్నసమయంబునఁ దటాలున నేలకురికి పిరికితనంబున నతనిపాదంబులంబడి మహాత్మా! రక్షింపుము. రక్షింపుము. అని మొఱవెట్టికొనియెను.

దయాహృదయుండగు నయ్యతీశ్వరుండు వానిం గరుణావిలోకనంబుల నీక్షించుచు నీ వెవ్వండవు? ఎందుండివచ్చితివి ? నీయుదంత మెఱింగింపుమని యడిగిన భైరవుం డల్లనలేచి యిట్లనియె.

మహాత్మా ! నావృత్తాంత మాలింపుఁడు. గిరితటంబను నగ్రహారము నాకాపురము. నాపేరు గౌతముఁడందురు. నాతలిదండ్రులు చిన్ననాఁడే గతించిరి. దిక్కుమాలినవాఁడనై నే నక్కడక్కడ సంచరించుచు బ్రాహ్మణునికి విధాయకములైన విద్య లభ్యసించి వైరాగ్యప్రవృత్తితోఁ దిరుగుచుంటిని. ధసవిహీనుండనగుటయు నా కెవ్వరు బిల్లనిచ్చిరి కారు. అదియే నావైరాగ్యమును బలపఱచినది. నన్నందఱు బైరాగియని పిలువమొదలుపెట్టిరి. క్రమంబున నాకాపేరే రూఢియైనది. నేను బుట్టు బ్రహ్మచారినగుట యధావిధి బ్రహ్మచర్యవ్రతంబు చేయుచుఁ దీర్థయాత్రల సేవించుచు మహాత్ముల దర్శించుచు దేహయాత్ర నడుపుచుంటిని.

నాచిత్తము విరక్తిఁ జెందియున్నది. ఎప్పుడును మీవంటి తపోధనుల నాశ్రయించి సేవింప నుత్సుకత్వము గలిగియుందును. నాచూడని శైలములు నాచూడనితీర్థములు నరణ్యములులేవు. బదరీవనంబుననుండఁగా నందలితాపసులు మీయుదంత మెఱింగింప సంతసముతో బయలుదేరి యాఱుమాసములకు నతికష్టముమీఁద మిమ్ముఁ బొడఁగంటిని కృతార్థుండనైతి. ఇఁక నా కీజన్మమునకుఁ గావలసినదేదియును లేదు. ఆజన్మాంతము మీశుశ్రూషచేయుచు మీపాదమూలమున దేహము చాలించెద నట్టివరంబు నాకుఁ బ్రసాదింపవలయును.

ఆహా ! మీమహానుభావత్వ మీసత్వంబులసేవయే ప్రకటించుచున్న ది. ఇట్టివింత యెందును జూచియెఱుంగనని యాసిద్ధునిఁ బెద్దగా నుతియించుటయుఁ గాపట్యమెఱుంగని యమ్మహాత్ముఁడు వాని కభయ హస్తమిచ్చుచు నోయీ ! ముముక్షుండవగు నీ విందుండుట కేమియు నభ్యంతరములేదు. నీయిష్టమువడువునఁ దపంబుసేసికొనుచుఁ గాలము గడుపుము. నేను స్నానముసేయఁ దటాకంబున కరుగుచున్నవాఁడ. అల్లదే పర్ణశాల యందుఁబోయి కూర్చుండుము. నేను రెండుగడియలలో వచ్చెదననిపలికిన విని వాఁడు సామీ ! నేనెంత విరక్తుండనైనను మృగములఁజూచిన నాహృదయము బెదరుచున్నది. ఎంతబోధించినను గుదురుపడకున్నది. మీసాన్నిధ్యంబుననుండఁబట్టి గట్టిగా మాట్లాడఁగలిగితిని కాని లేకున్న నోటినుండి మాటయేరానేరదు. దారిలో మృగసంఘము నుండి తప్పించుకొని వచ్చితిని. ఇందున్న క్రూరమృగములు నన్ను మ్రింగునని వెఱపుగలుగుచున్నది. మిమ్మువిడిచి నేనొంటిగాఁ బర్ణశాల కేగఁ జాలనని పలికిన నవ్వుచు యతి యిట్లనియె.

అడవులు పెక్కు తిరిగితినని చెప్పితివే? ఇంతపిరికివాఁడ వెట్లుపోయితివి. ఇందు మృగములు నిన్నేమియుఁ జేయవు. విస్రంభముగా సంచరింపుము. స్నానముచేయుదువుగాక - నాతోఁ దటాకమునకు రమ్ము. వెఱపుడిగింతునని పలుకుచు వాని వెంటఁబెట్టికొని తటాకంబునకుఁ బోయెను. మృగంబు లాయతి ననుగమి౦చి యరిగి కాసారతీరంబున నిలువం బడినవి. సిద్ధుండు స్నానముసేసి మధ్యాహ్నికక్రియలు నిర్వర్తింపుచుండ భైరవుండును దీర్థమాడి యేదియో జపించుచున్నట్లు ముక్కు బట్టికొని గొణుగుచుండెను.

క్రియావసానంబున సిద్ధుండు కమండులువున జలంబెక్కించికొని బయలుదేఱెను. భైరవుఁడును జపము ముగించికొనినట్లుగా నడిపి యాయనవెంట నడుచుచుండెను. మృగములు గింకరులవలె లేచి ముందు నడుచుచుండెను. యతీశ్వరుఁడు పర్ణశాలలోఁ బ్రవేశించినంత మృగములు పరివేష్టించి కూర్చున్నవి. తరువాత నయ్యోగి తదానీతంబులగు పదార్థంబులు భైరవునకుఁ గొన్నియిచ్చి తాను భజించి శేషము మృగములకుఁ బంచిపెట్టెను.

ప్రసాదమువలె నామృగము లొక్కటొక్కటిగావచ్చి స్వీకరించి పోవునవి. యతితో నాఁడు భైరవుఁ డిష్టాలాపములాడికొనుచు సుఖముగా వెళ్ళించెను. మఱునాఁడు భైరవుఁడు యతీశ్వరునిఁజూచి సామీ! అన్నిటికంటెఁ బ్రాణములు చాలతీపుసుఁడీ ! నాకు భార్యాపుత్రాదులు లేరు శుద్ధవిరక్తుండ నిట్టినాకును జావనిన భీతిగలుగుచున్నది. ఒరుల మాట చెప్పనేల? వినుండు. నేను జపంబునకై కన్నుమూసినంత నీమృగములు నాపైఁబడి చంపునని వెఱపుగలుగుచున్నది. మీకడ నిజముదాచ నేల ? జప మేమియుం దోచకున్నది. ఇంతకన్న వేఱొక ప్రతిరోధ మేదియు నిందులేదు. ఇందుల కేదియేని ప్రతిక్రియఁ దెలియఁజెప్పుఁడని వేఁడుకొనుటయు నాసిద్ధుండు,

ఓయీ! నీవిందులకుఁ జింతింపకుము. నాకుంబోలె నీకుఁగూడ మృగములన్నియు వశములై యుండునట్లు తంత్ర మొకం డెఱింగించెదఁ బరిగ్రహింపుము. తద్వేతృత్వంబున మనుష్యుల మృగములఁజేయవచ్చును, మృగములు తొత్తులవలె స్వాయత్తములై పనులు గావింపఁగలవని పలుకుచు వానిదుర్వృత్తిందెలిసికొనలేక యాప్రక్రియ వానికెఱిగించెను. ఆవిద్య తెలిసికొని వాఁడు మిగులసంతోషించుచు మృగములన్నియు వశవర్తులై సంచరించుచుండ నిర్భయముగా నాపర్ణశాలయందు సిద్ధునిప్రక్కవసించి ముక్కు మూసికొని యేదియో జపించుచున్నట్లు నటించుచుఁ గొన్నిదినములు వెళ్ళించెను.

సిద్ధునకు వానియందు మంచిదయ కలిగినది. చనువుగలిగినపిమ్మట భైరవుం డొకనాఁడు సిద్ధునితో నార్యా ! మీవంటితపశ్శాలులకుఁ గాంచనము చేయుప్రజ్ఞ గలిగియుండునని చెప్పుదు రదియెంతనిజము ? అని యడిగిన నతండు ఆయోగము నాకుఁ దెలియును. కాని దానితో మాకేమిప్రయోజనమున్నది? లోష్టము కాంచనము సమముగాఁ జూచువారముకాదా? అని చెప్పిన వాఁడు చేతులు నలుపుచు స్వామీ ! దానితో నాకునుం బనిలేదు. కాని అది యెట్లగునో చూడవలయునని యభిలాషయున్నది. నూత్నవిద్యాభిలాషుఁడ నగు నే నాయోగ ముపదేశము గావింపవలయునని సాహసించి యడుగుచున్నాను. మీకుఁ బుత్రతుల్యుండనగుట నిట్టిమాట కోరితిని. అని యభిప్రాయము సూచించిన నయ్యతి ఓయీ ! అహంకారమమకారగ్రస్థు లావిద్య స్వీకరింప నర్హులుకారు. స్వార్థపరుల కది చెప్పరాదు. నీబుద్ధివిశేషము గ్రహించి ముందు నీకా విద్య నుపదేశించెదనులే! అని సమాధానము చెప్పెను వాఁడును చిత్తము. చిత్తము. అని వినయ మభినయించుచు మఱికొన్నిదినము లరిగిన వెనుక మఱియొకసారి యాప్రస్తావము దెచ్చెను.

ఆమాటలలో వానిస్వార్థపరత్వము గ్రహించి కొంతకాల మరిగినంగాని యుపదేశింపనని సూచించెను. అప్పుడప్పు డడుగుచుండ నీమనసు పరిపక్వమునొందినట్లు లేదు. నిష్కామునకుఁగాని యధి యుపదేశింపరాదు. విరక్తుండవై యడుగుమని పలుకుచుండును.

ఒకనాఁడు మధ్యాహ్నసమయంబున సిద్ధుండు భైరవయుక్తుండై తటాకంబున స్నానముచేయుచున్న సమయంబున నొక బ్రాహ్మణకుమా రుఁ డాసరసిదరికరుదెంచి సిద్ధేంద్రా ! పాహి పాహి మృగేభ్యః పాహి అని యాక్రోశించెను. మాబైషీః ఏహి ఏహి అని సిద్ధుండు ప్రత్యుత్తర మిచ్చెను. ఆభాష భైరవున కేమియుం దెలిసినదికాదు. నీ వెవ్వఁడవు? ఏమిటీకివచ్చితివి ? పో, పొమ్ము. ఇది రహస్యస్థలము పామరు లిందుండ రాదనిపలికిన విని యతండు బెదురుగదుర నయ్యో! నేను బ్రాహ్మణుఁడ విద్వాంసుఁడ ధారానగరమున కరుగుచు దారితప్పివచ్చితిని. శరణుజొచ్చితిని. తపోధనులకుమాత్రము భూతదయ యుండవలదా మీరహస్యమునకు నేనేమియు భంగము గలుగఁజేయఁజాలను. మృగములకు వెఱచు చున్నాను. రక్షింపుఁడు. అని వేఁడికొనియెను. అప్పుడు సిద్ధుండు రమ్ము భయములేదు. అని హస్తసంజ్ఞ గావించెను. ఆవిప్రకుమారుం డల్లన తటాకముదాపునకుఁ బోయి భైరవునకు సిద్ధునకు సమస్కరించి యోరగా నిలువంబడి వారి జపావసాన మరయుచుండెను.

అనంతర మాయతి కన్నులందెఱచి కమండులూదకము పూరించి యావిప్రకుమారునితోఁగూడ బైరవుండు వెంటరాఁ బర్ణశాలకరిగి ఫలాహారములచే వారిం దృప్తులంగావించెను. తరువాత వాడుకప్రకారము మృగములకుఁ బ్రసాదము పంచిపెట్టెను. ఆవింతయంతయుఁ గన్నులారఁ జూచి బ్రాహ్మణపుత్రుఁడు తపోమహత్వమునకు మిక్కిలి యక్కజపడఁజొచ్చెను.

తనప్రక్క వినమ్రుఁడై కూర్చున్న యాచిన్నవానింజూచి సిద్ధుండు వత్సా ! నీదేయూరు ? ఎందుఁబోవుచుంటివి? నీవృత్తాంత మెఱింగింపుమని యడిగిన నతఁడు మొగంబున భయభక్తి విశ్వాసములఁ బ్రసరింపఁజేయుచు మహాత్మా! భవదీయకటాక్షవీక్షణంబుల నాపై వ్యాపింపఁజేయుటం జేసి నేను బవిత్రుండనైతి. నావృత్తాంతము చెప్పి నాచరిత్రనుగూడఁ బవిత్రముచేసికొనెద నాలింపుఁడు.

___________

−♦ చారాయణుని కథ. ♦−

నేనొక బ్రాహ్మణపుత్రుండఁ జిన్నతనమునందె తల్లిదండ్రులు స్వర్గస్థులైనంత నిశాంతమునఁ బోషించువారు లేమింజేసి కాశీపురంబున కరిగితిని. అందు దత్తకాదిమిత్రులతోఁ గలిసికొని విద్యాభ్యాసము గావించితిని. వేయిమందిసహాధ్యాయులలో మే మేడ్వుర మచిరకాలములో సమస్తవిద్యలలో నుత్తీర్ణులమైతిమి. మాతో వాదింపఁదగిన పండితు లెందున్నారని తలంచి ధారానగరంబున భోజభూభుజుని యాస్థానమున గొప్పపండితులున్నారని విని వారితోఁ బ్రసంగింప వేడుకజెంది తలయొక దారి నయ్యూరికిఁ బోవుచుంటిమి. దేశవిశేషములం దెలిసికొనుచు వత్సరమునాఁటికి నావీటికిఁ జేరుటకుఁ గడు వేర్పఱచుకొంటిమి.

నే నొకమార్గంబునంబడి పురనదీపక్క ణారణ్యవిశేషంబులం జూచుచుఁ బోవుచుంటిని. యౌవనమదము కడుగర్వమును గలిగించును. ఈమార్గము కడుసంకటమైనది. దూరమునఁగాని గ్రామమేదియును లేదు. పోవలదని బయలుదేరునపు డొకపల్లెలోనివా రెంతచెప్పినను లక్ష్యముసేయక యాదారినే పోవ మొదలుపెట్టితిని. అక్కటా ! ఆపయనంబునంగల యిక్కట్టు చెప్పుటకుఁ బదిదినములు పట్టును. ఎడారియును గాదు, ఆరణ్యముం గాదు, పాషాణకంటకాదులచే నావృతమై యున్నది. ఎంతదూరముపోయినను నీరు దొరకదు. పశుపక్షిమృగాదు లేవియుం గనంబడవు. మధ్యాహ్నసమయంబుల వైతరణీనదియుంబోలె నెండమావు లూరక ప్రవహింపుచుడును. వానింజూచి జలమని పెక్కుసారులు మోసపోయితిని.

నేను దెచ్చికొనిన ద్రవపదార్థములు పిండియు నై పోయినవి. నాలుగుదినములు ధైర్యముతో నడిచితిని. మార్గమంతయు నొకరీతిగానే యున్నది. కాళులు పొక్కు లెక్కినవి. జవసత్వము లుడిగినవి. అడు గామ డగా నుండెను. నాలుగవదివసంబున రాత్రియెల్ల నొకరాతిపైఁ బండికొని యైదవనాఁడుదయంబున లేవలేక లేచి నలుమూలలు సూచితిని. యోజనదూరములో నొకతోపు కన్నులపండువు గావించినది. యోజనము మునుపు నాలుగుగడియలలో నడుచువాఁడ నప్పుడు సాయంకాలమునకైన నందుఁ జేరఁగలనో లేదో యని యధైర్యము గలిగినది. ఎట్టులోలేచి యడుగులు తడఁబడ నడువసాగితిని. మహాత్మా ! ఆతోట రెండుక్రోశములదూరములోనే యున్నది. జాముప్రొద్దెక్కు నప్పటి కెట్లో దేహ మందుఁ జేర్చితిని. అది భగవంతునిమహిమగాని నాశక్తి గాదు. తృణకాష్టజల సమృద్ధంబైన యాప్రదేశ మొక చిన్నపల్లెగా నున్నది. అందు బ్రాహ్మణగృహ మొక్కటియే యున్నది. నేనప్పు డేదియుం దెలిసికొనఁజూలక నారికేళవృక్షచ్ఛాయములచే నావరింపఁబడి మెత్తనియాస్తరణలచే నొప్పుచున్న యొకయరగుపైఁ బండుకొంటి మేను వివశమైనది.

కొంతసేపటికి నాకుఁ దెలివివచ్చి కన్నులం దెఱచిచూచితిని. నా మొగంబుననీళ్లు చల్లఁబడియున్నవి. పది రెండేఁడులప్రాయముగల యొక బాలిక నాప్రాంతమున నిలువంబడి తాళవృంతముతో విసరుచుండెను. నేను రెప్పలు విప్పుటఁజూచి యాబాలిక ఆర్యా ! దూరమునడచుటచే నలయిక జెందినట్లుంటిరి. వంటయైనది. లేచివచ్చి స్నానముచేసి భుజింపుఁడు. మాతండ్రిగారు వైశ్వదేవముచేసి మీనిమిత్తము వేచియున్నారని పలికినది.

ఆపలుకు లమృతమువలె నాచెవులకు సోఁకినవి. మాటాడనేరక వడగొట్టినది. లేవఁజాలను. దాహమిమ్మని సూచించితిని. అప్పుడా చిన్నది వడిగా లోపలికిఁబోయి యరనిముషములోఁ దలిదండ్రులఁ దీసికొని వచ్చినది. ఆయజమానుఁడు నన్నుఁబిలిచి పలుకకున్న వెఱపుజెందుచు నన్నుఁ బట్టుకొని లేవనెత్తి తనమేనికిఁ జేరవైచుకొని నాలుగుబిందెల చల్లని నీటిచే నన్ను స్నానముచేయించెను. ఆహా ! పోయినప్రాణములు మఱల నాదేహములోఁ బ్రవేశించినవి. చల్లనితేటమజ్జిగ నానోటఁ బట్టిం చెను. అప్పుడు నాకు స్మృతివచ్చినది. ఆబాలిక నాకు విసరుచుండెను. అప్పుడు నే నాయనకు నమస్కరించుచు నన్ను బ్రతికించినందునకుఁ గృతజ్ఞత సూచించితిని.

ఆయజమానుఁ డడుగ మెల్లఁగా నావృత్తాంతమంతయుం జెప్పితిని. అతఁడు మిగులసంతసించుచు నన్ను లోపలికిం దీసికొనిపోయి మృష్టాన్నములచే సంతృప్తుంగావించెను పదిదినము లందు నాకు రాజోపచారములు గావించిరి. దేహమున బలముగలిగి యథాప్రకారముగా నొప్పుచుంటిని.

ఆబ్రాహ్మణునిపేరు బ్రహ్మదత్తుఁడు. చతుశ్శాస్త్రపారంగతుండై యొకమహారాజువలన నాగ్రామ మగ్రహారముగాఁగైకొని యందువసించి భూమి ఫలపతియగుట సకలసస్యములు ఫలింపఁజేయు చుండెను. తోటలునాటి కేదారములుగట్టి కాలువలు త్రవ్వించి యాభూమినంతయు బాగుచేయించెను. ఆబాలిక యాబ్రహ్మదత్తునికూఁతురు. దాని పేరు మల్లిక. ఆపారునకు వేఱొకపనిలేమిం జేసి యాకన్నియకు సంతతము విద్యలు గఱపుచుండును. అప్పటికి తర్క వ్యాకరణములయందుఁ బాండిత్యము గలిగినది. కవిత్వము చెప్పఁగలదు. సంగీతము పాడఁగలదు.

ఒకనాఁడు బ్రహ్మదత్తుఁ డాచిన్న దానిచే శాస్త్రములలో నన్నుఁ గొన్నిప్రశ్నల నడిగించెను నాపాండిత్యము దెలిసికొనవలయునని యడిగినట్లు గ్రహించి యాప్రశ్నలకు సమాధానము చెప్పుచు నాకుఁగల విద్యాపాటవమంతయుఁ దేటపఱచితిని. బ్రహ్మదత్తుఁడు నాపాండిత్యమున కక్కజమందుచు నన్నుఁ బెద్దగాస్తుతించి నన్నామల్లికను బెండ్లిచేసికొమ్మని ప్రార్థించెను సిరిరావలదనువాఁడుండునా ? నేను సంతోషముతో నంగీకరించితిని. ఒకశుభముహూర్తంబున బ్రహ్మదత్తుండు మల్లికను నాకిచ్చి మహావైభవముతో వివాహముగావించెను. కొన్నిదినము లందుండి మిత్రులవృత్తాంతము సెప్పి ధారానగరంబునకుఁ బయనమైతిని. నన్నుఁ బోవలదని బ్రహ్మదత్తుండు బ్రతిమాలికొనియెను. మిత్రుల వెంటఁబెట్టికొని సత్వరము రాఁగలనని చెప్పి యెట్ట కే నావిప్రునొప్పించి బయలుదేరితిని. సుఖము కష్టమునకును గష్టము సుఖమునకును గారణమగుచుండునుగదా? పదిదినములు శ్రమపడి నడిచితిని, దైవికముగా మీ యాశ్రమము గనంబడినది. మార్గగమనశ్రమమంతయుఁ బటాపంచలైనది. ఇందలిసత్వంబు లన్యోన్యవైరంబులు విడిచి తిరుగుచుండుటంబట్టి యిది తపోధనాశ్రమంబని తలంచితినిగాని స్వభావజన్యమగు భయము వదలినదికాదు.

జన్మపావనంబైన మీదర్శనంబై నది. కృతార్థుండనైతి. నా కింక కావలసినదేమియులేదని స్తుతియించుచుఁ దనవృత్తాంతమంతయు నెఱింగించెను. సిద్ధుండు చారాయణవిద్యావైదుష్యమును గుఱించి మిక్కిలి సంతసించుచుఁ బ్రస్థానత్రయమునందు నతనితో ముచ్చటించి తదీయాత్మ వేతృత్వమును బ్రశంసింపుచు సంతతము వానితోనే గోష్ఠిసేయుచుండును. తపముసేసికొను చున్నపుడుకూడ నవకాశముచేసికొని జ్ఞానమును గుఱించి యతనితో మాటలాడుచుండును.

కొన్నిదినములు గడిచినతరువాత సిద్ధునకుఁ దనవిద్య లతని కుపదేశముసేయవలయునని యభిలాష గలిగినది. బైరవునితోఁ జారాయణుఁడు వచ్చినదిమొదలు యతి తిన్నగా మాటాడుటలేదు. వాఁడు కపటాత్ముఁడని గ్రహించుటచేఁ బ్రీతి మునుపే తగ్గినది. బైరవుఁడు చారాయణునం దీసుబూని వీఁ డిక్కడినుండి యెట్లుపోఁగలఁడు ? ఉపాయమేమి ? యీ సిద్ధుండు వీనికతంబున నాతో మాటాడుటయే మానివేసెను. కాంచనయోగ ముపదేశింపమని నేనడుగ నిదిగో యదిగోయని జరపుచుండెను. నిన్న రాతిరి నీ కాయోగ ముపదేశించెదనని యారండాపుత్రునితోఁ జెప్పుచున్నాఁడు. అందులకు సరిపడిన నియమములు నాకడ లేవఁట. నే నుపవేశార్హుండఁ గానని టక్కు సేయుచున్నాడు. ఎట్లైనను రెండు మూఁడుదినములలో వాని కావిద్య యుపదేశింపకమానఁడు. నాపడిన శ్రమమంతయు వ్యర్థమైనది. గెద్దవలె వచ్చి వీఁడావిద్దె తన్ను కొనిపోవుచున్నాఁడు. ఇందుల కంతరాయ మెట్లుకల్పింతును? అని ధ్యానించు చుండెను.

సిద్ధునకుఁ జారాయణునందుఁ బ్రేమానుబంధము క్షణక్షణము వృద్ధిబొందుచుండెను. భైరవునకు వారిద్దఱియందును గ్రోధ మభివృద్ధి నొందుచుండెను. ఎల్లి శుభముహూర్తము వశిత్వముపదేశించెదఁ గైకొనుమని సిద్ధుండు చారాయణునితో రహస్యముగాఁ జెప్పుచుండ భైరవుండు చాటుననుండి యాలించెను. వానికి మనంబున నాందోళనము జనించినది. అనేకోహలు పుట్టినవి. కొన్ని నశించినవి. కొన్ని పూర్వపక్షములైనవి. తలఁచితలఁచి చివర కొకవిధానము నిశ్చయము చేసికొనియెను. ఆరాత్రి నిద్రబోలేదు.

ప్రతిదినము సిద్ధుండు యామావశిష్టమగు త్రియామనులేచి తటాకమున కరిగి స్నానముచేసి పర్ణశాలకు వచ్చి జపముచేసికొనుచుండును. చారాయణుఁడు సూర్యోదయమువఱకుఁ దటాకమునొద్దనే నిత్యక్రియలు నిర్వర్తించి పిమ్మట సిద్ధునొద్దకువచ్చి కూర్చుండును.

నాఁడు సిద్ధుండు వాడుకప్రకారము స్నానముచేసివచ్చి ప్రాణాయామయోగంబున జపముగావింపు చుండెను. చారాయణుఁడు తటాకంబున కరిగెను. ఆయవకాశము గ్రహించి బైరవుండు పెద్దపాషాణ మొకటి దెచ్చి సిద్ధుండు సూర్యోపాస్తికై భూమిజాగిలిబడి మ్రొక్కుచున్న సమయంబున పాషాణము సిద్ధునిశిరంబున గుభాలునఁ బడవైచెను. హా! పరమేశ్వరా! యని పలుకుచు గిలగిలఁ దన్నుకొని యతండు ప్రాణములు విడిచెను

పరమేష్ఠి వానిహృదయము ఇనుముతోనో చిట్టముతోనో చేసెను. కానిచో పరమదయాళుండై తనకెంతయో యుపకారముచేసి యాదరించిన మహానుభావునిఁ జంపుట కాక్రూరాత్ముని కెట్లుచేతులు వచ్చెనో తెలియదు. సీ, సీ, అట్టివానిపేరు దలంచుటయు మహాపాతకమే. కథాసందర్భంబునఁ జెప్పవలసివచ్చె. గోపా ! వినుము. ఆసిద్ధుని పాటుజూచి యందున్నమృగములన్నియుఁ గన్నీరుగార్చుచు బైరవునకు వెఱచి దూరదూరముగా మూగికొనుచుఁ గొన్ని చారాయణుఁడున్న తటాకమునకు గుంపులుగాఁబోయి యేదియో మొఱ్ఱవెట్టుకొనుచున్న ట్లాక్రోశించినవి. ఆక్రొత్తవింతజూచి చారాయణుఁడు మది దిగులుదోప మృగములయార్పుల కేదియో కారణమున్నదని నిశ్చయించి నిత్యకృత్యములు సాంతముగాఁ దీర్చికొనుటకు మనసురాక తటాలునలేచి పర్ణశాలకుఁబోయి మోడ్పుచేతులతో నేలంజాగిలిబడి బ్రహ్మరంధ్రంబు పగిలి రక్తప్రవాహము గారుచుండ దీర్ఘనిద్రాముద్రితనయనుండై యున్న యాయతిసత్తముం జూచి గుండె గుభాలు మన జేతనున్న కమండలువు జాఱవిడిచి హా ! గురువరా ! హా! కారుణికోత్తమా ! హా తపోనిధానా ! అని పలుకుచు నేలంబడిపోయి మూర్ఛిల్లెను. పెద్దతడవున కొడలుదెలిసి యతని మేనిపయింబడి మహాత్మా ! నిన్నిట్లు చంపినవాఁడెవ్వఁడు? తండ్రీ ! నీ వజాతశత్రుండవే నీ వెవ్వరి కపకారముచేసితివి ? నీప్రభావంబున మృగము లన్యోన్యవైరంబులు విడిచి యూడిగంబులు సేయుచుండ నీయం దీసుబూనిన పాపాత్ముం డెవ్వఁడు ? 'బాబూ ! నీయుపన్యాసము వినిన నమృత మసహ్యమగుచుండునుగదా ! అయ్యో ! నీచావు గన్నులార చూచితిని నే నెంతపాపాత్ముండనో ? చిరకాలము బ్రదికి చివర కిట్లు బలవన్మరణమునొందితివేమి సామీ ! మొన్న నేదియో ప్రస్తావములో నే నిఁక నెంతకాలమో బ్రతుకను. నీకు వశిత్వాదివిద్య లుపదేశించెద ననిచెప్పితి వింతలోఁ జావుమూడునని యనుకొనలేదు తండ్రీ ! హా ! సిద్ధప్రవరా ! కారుణ్యనిధీ ! తపస్వరూపా ! ఒకసారి నాతో మాటాడుము. నాదెసఁజూడుము. అవసానోపదేశము సేయవా? ఆహా! మహా నుభావులసాంగత్యము స్వల్ప కాలమైనను దీర్ఘ కాలప్రీతి గలుగఁజేయును గదా. అక్కటా ! నాదారిని నేనుబోవక నీకడ కేలవచ్చితిని ? ఆ! తెలిసినది. నానిమిత్తముననే నీ కీమరణము సంభవించినది. నాతో నీవు చనువుగా మాటలాడుచున్నావనియే వాని కసూయగలిగినది. భైరవా! యెందుబోయితివి ? నీకితం డేమియపకారముచేసెను ? నీవో నేనో కాక యితరు లెవ్వరున్నారు ? నిష్కారణము గురుద్రోహి వైతివేమి ? వీరిం జంపి యేమి మూటగట్టికొంటివి ? సందియము లేదు. నీవే చంపితివి. అని భైరవు నుద్దేశించి పలుకుచుండ నాదాపునడాగియున్న భైరవుం డత్యంతభైరవుండై యందువచ్చి యేమిరా చారాయణా ! ప్రేలుచుంటివి? ఈసిద్ధుని నేను జంపితినా? నీవు జూచితివా? నీవే చంపి నామీఁదఁ బెట్టుచుంటివి. తారతమ్య మెఱిఁగి మాట్లాడుము. ముందువచ్చిన చెవుల కన్న వెనుకవచ్చినకొమ్ములు వాడిగలవను సామెతవలెను నీవువచ్చి నన్నా క్షేపించుచుంటివా ? నాకంటె నీ కతండు దగ్గిరచుట్టమా? పో. పొమ్ము. నీవే చంపితివని గద్దించెను.

అప్పుడు చారాయణుఁడు కన్నీరుగార్చుచు నీమహానుభావుం జంపుటకు నా కేమియపకారము గావించెను ? మనముగాక యితరులు లేరు. మృగములు రాయి నెత్తిమీఁదవైచి చంపనేరవు. నిన్న నీ వారా యినితెచ్చుచుండ నేను జూచితిని. తప్పక నీవే చంపితివి. నీచా! నీ మొగము చూడఁగూడదు. నీకు యముఁ డెట్టినరకమిచ్చునో తెలియదు. మహాసాధువును నిష్కారణము జంపితివని క్రమక్రమప్రవర్ధమానంబగు కోపంబున నిందించుటయు వాఁడు, ఆఁ ! ఏమి నీక్రొవ్వు ! ఏమీ నీగరువము ! నన్ను నీచా ! యని సంబోధింతువా? యతిచావుమాట యటుండనిమ్ము. నీబ్రదుకుమాట చూచుకొమ్ము. అనిపలుకుచు నంతకు పూర్వమే తనచేతిలోదాచియుంచిన యోషధిందీసి చారాయణుని శిరంబున రుద్ది యేదియో తాయెత్తు గట్టెను. అతం డప్పుడే యొకగాడిద యైపోయెను. విధివిధాన మతిక్రమింప విధి కే శక్యముగాదనినచో నితరులమాట జెప్పనేల.

క. చిరకాలజీవియగు న
   ప్పరమతపోధనుని గురుని బలవంతముగా
   శిరమున రాయిడి చంపిన
   దురితాత్ముని కరుదె యవిహితుం బంధింపన్ .

అని యెఱింగించి కాలాతీతమైనంత ననంతరవృత్తాంత మవ్వలి మజిలీయం దిట్లు చెప్పెను.

161 వ మజిలీ.

చారాయణుం డరిగినకొన్ని నెలలకు మల్లిక పుష్పవతియై మనోజ్ఞ తేజంబునం బ్రకాశించుచుండెను. అల్లుఁడు వత్తుననిచెప్పిన మితి దాటిన తరుహత బ్రహ్మదత్తునిభార్య మిక్కిలి పరితపించుచుఁ గాకికూసినఁ జారాయణుఁడు వచ్చునా అని ప్రశ్న మడుగును. పరదేశు లరుదెంచిన నతని వార్త లడుగుచుండును. సంతత మతనిరాకగురించియే చింతించుచు నొకనాఁడు భర్తతో నార్యా ! కులశీలాదులం దెలియక మనము చారాయణునికిఁ బిల్లనిచ్చితిమి. అతండు పుస్తిగట్టి లేచిపోయెను. వానిగ్రామ మేదియో బంధువు లెందున్నారో మనకుఁ దిన్నగాఁ దెలియదు. కేవలము విద్యనునమ్మి పిల్లనీయఁగూడదు. మల్లిక సిగ్గుపెంపునఁ జెప్పదు కాని మాటునఁ గూర్చుండి యేదియో ధ్యానించుచుండును. ఏపేదవానికిచ్చినను నిల్లువదలకుండును. ఇప్పు డేమిచేయఁదగినదని యడిగిన బ్రహ్మదత్తుం డిట్లనియె

చారాయణుండు మహాపండితుండు. ఏమహారాజుసంస్థానములోఁ బూజింపఁబడుచుండెనో. రెండుమూడుదినములలో వచ్చిన లెస్సయే లేకున్న నేను ధారానగరంబున కరిగి యతనివృత్తాంతము దెలిసికొని వచ్చెద, మీరిందుండఁగలరా? అనిచెప్పిన నామె యంగీకరించినది.