కాశీమజిలీకథలు/ఎనిమిదవ భాగము/159వ మజిలీ

సామర్థ్యము గలిగినది. నీ కుపకారముసేసితినేని పాపవిముక్తుండ నగుదునని తలంచుచుంటినని నా చెవులో నేదియో రహస్యము చెప్పి యీరూపముగా నీకురాజ్య వైభవముగలుగునట్లు చేసెదనని యుపాయముచెప్పెను.

రాజ్యముమాట పిమ్మటఁ జూచికొనవచ్చును, నేఁటికి బ్రతికితిని గదా? అని సంతసించుచు నాబ్రహ్మరాక్షసు ననేకస్తోత్రములు చేసితిని. అంతలోఁ దెల్లవాఱుసమయమైనది. అప్పు డాబ్రహ్మరాక్షసుఁ డారావిచెట్టుకొమ్మలు గలగలలాడఁ జప్పుడుసేయుచు నెగిరి యెక్కడికో పోయెను. నేనును బ్రతుకుజీవుఁడా ! అని యటఁగదలి దక్షిణాభిముఖముగాఁ బోయిపోయి కొన్ని దినము లాయడవి గడచితిని. అని యెఱింగించి యవ్వలికథ తరువాతిమజిలీయందుఁ జెప్పుచుండెను.

159 వ మజిలీ.

−♦ మదయంతికథ. ♦−

శ్లో॥ నాకాలె మ్రియతె జంతు ర్విద్ధశ్శరశ తైరపి
     కుశాగ్రేణైవ సంస్పృష్టః ప్రాప్త కాలోనజీవతి.॥

నూఱుబాణములచేఁ గొట్టినను కాలముమూడనివాఁడు చావఁడు, కాలమువచ్చినవాడు దర్భగ్రుచ్చికొనినను చచ్చును

అనునట్లు అయ్యడవినుండియు బ్రహ్మరాక్షసునినోటినుండియు నాయు శ్శేష ముండఁబట్టి యీవలఁ బడితిని,

శ్లో॥ ధనాశా జీవితాశాచ గుర్వీ ప్రాణ భృతాంసదా॥

ప్రాణధారులకు జీవితాశయు, ధనాశయు, నన్నిటిలో గొప్పవి కదా? నేనంతటితోవిడువక బ్రహ్మరాక్షసుం డెఱింగించినవిషయంబు పరిశీలించుటకై కొన్నిదినము లాప్రాంతదేశములు దిరిగితిని. నీవలెనే నేనును నొకనాఁ డొకయగ్రహారములో నొకవిప్రునింటి కతిథినై భుజించుచున్న సమయంబున మఱియొక్క బ్రాహ్మణుం డరుదెంచి నాతో భుజించుచున్న గృహమేధిం జూచి ఓయీ ! నీతండ్రిగారు జయపురమునుండి వచ్చిరా? ఏమిజరిగినది ? భూతోచ్చాటనము గావించిరా? కానుక లందివచ్చిరా? అనియడిగిన నతండు కానుకలవలెనేయున్నది చావుదప్పించుకొని వచ్చి మాకన్నులం బడియెను. అదియే పదివేలు. ఆయన నేఁటికి మూఁడులంఘణములు. ఆగదిలోఁ బండికొనియున్నారు. చూడుము అని చెప్పెను.

ఆమాటలు విని నేను అయ్యా ! భూతోచ్చాటన మనుచున్నా రదేమి ? ఎందలివార్త ? అనియడిగిన నాగృహమేధి యిట్లనియె. ఈదేశమునకు రాజధాని జయపురము. అప్పురాధిపతికి మదయంతియను కూఁతు రొక్కతియే చిరకాలమునకుఁ గలిగినది. ఆచిన్నది రూపంబునను విద్యలను శీలమునను మిక్కిలి పేరుపొందియున్నది. సమారూఢ యౌవనయై సానబట్టినరత్నమువలె మెఱయుచున్న యాతరుణీరత్నమునకు వివాహము చేయవలయునని తండ్రి ప్రయత్నించి నానాదేశరాజకుమారుల చిత్రఫలకములఁ దెప్పించుచుండెను.

అదియట్లుండ రెండునెలలక్రిందట నయ్యిందువదన నిద్రబోవుచుండ భూతమో బ్రహ్మరాక్షసుఁడో తెలియదు. ఆమెమీఁదఁబడి యావేశించెనఁట. అదిమొద లమ్మదవతి నిద్రబోవదు. ఆహారము తినదు. ఊరక కేకలుపెట్టుచుఁ గనంబడినవారినెల్ల వెఱ్ఱికుక్కవోలెఁ గఱచుచు గీరుచు బాధింపఁదొడంగినదఁట.

కొన్నిదినములు గదలకుండ నదిమిపట్టికొనుచుండిరఁట. మఱికొన్నిదినములు పట్టుకొనలేక కట్టిపెట్టిరి. అందులకును వశముగాకున్న నొకగదిలోఁ బెట్టి తలుపువైచి కాచుచుండిరఁట. ఆభూత మెంతగట్టిదో తెలియదు. ఆరాజు పుడమింగల మాంత్రికులనెల్ల రప్పించెను. మా తండ్రిగారు భూతవైద్యములోఁ బేరుపొందియుండిరి; ఆయనకుఁగూడ వర్తమానమురాఁగా నక్కడికి వెళ్లిరి. మాంత్రికులందఱు కలిసి యాలో చించి నలువదిదినములు నారసింహము జ్వాలాముఖి ఉగ్రభైరవము బాలాబగళాముఖి మొదలైనమంత్రములు జపించుచుఁ బద్మములు మ్రుగ్గులుపెట్టి హోమములు సేసిరఁట. తరువాత నొకదినమున భూతోచ్చాటనము చేయుటకు నిశ్చయించుకొని యక్కుటిలకుంతలకు జటవేయుటకై పదుగురుమాంత్రికులు సాహసించి తలుపుతీసికొని హుం పటుస్వాహా మారయ మారయ, ఛింది ఛింది అని యుచ్చరించుచు నాచిన్నదియున్న గదిలోనికిఁ బోయిరఁట. వారిలో మాతండ్రిగారు మొదటివాఁడు.

బాబూ ! ఇఁకఁ జెప్ప నేమియున్నది. ఆభూతముగూడ మారయ మారయ తాడయ తాడయ ఛింది ఛింది హుంపటుస్వాహా- అని కొందఱం జఱచినది. కొందఱం గీరినది. కొందఱం జీరినది. అప్పుడు మాంత్రికులు మొఱ్ఱోయని యఱచుచుఁ గాయములెల్ల గాయములుపడి రక్తముగారఁ దలుపులువైచి యీవలఁబడువఱకు బ్రహ్మాండమైనది. వారిలో మాతండ్రిగారితొడఁ గఱచినది. కండ లూడివచ్చి పెద్దగాయముపడి రక్తముగారుచుండెను. జ్వరము వచ్చినది. మూఁడుదినము లొడ లెఱుంగక మంచముపైఁ బడియుండిరఁట. ఇతరమాంత్రికులును మంచముపట్టిరఁట. వారియవస్థఁజూచి యెల్లవారు నవ్వఁజొచ్చిరఁట, మాతండ్రిగారికి బాధ యెక్కువైనందున సవారిపై నెక్కించి మాయింటికిఁ బంపివైచిరి. నేఁటికి మూడులంఘనములు.

ఆయు శ్శేషముండుటచే బ్రదికిరి కాని యది చావవలసినగాయమే. పెద్దపులియైన నంతలోతుగాఁ గఱవలేదు. ఆకుందరదన కాశక్తి యెట్లువచ్చినదో తెలియదు. అని యాభూతవృత్తాంతమంతయుం జెప్పెను.

నే నాకథ విని మిక్కిలి వేడుకచెందుచు భుజించినవెనుక గది లోనికిం బోయి యాభూతవైద్యుం జూచితిని. ఊరక మూల్గుచుండెను. గాయము. మానుపట్టినదికాని చాలలోతుగా దిగియున్నది. తిరుగా నే నాయనతో నచ్చటివిశేషము లేమని యడిగితిని. అతండు అయ్యో ! నాజన్మావధిలో నిట్టిభూతమును జూచి యెఱుంగను. నూఱ్వురము మండలముదినములు మహామంత్రములు జపించి తంత్రములు తీర్చితిమి. వాని నించుకయు గణించినదికాదు. నాగాయ మొకలెక్కా ? ఒకమాంత్రికుని శిరముపై గ్రుద్దినది. తలంచికొనిన నిట్టిబాధలోఁగూడ నవ్వువచ్చుచున్నది. ఆమాంత్రికుఁడు దెబ్బ దినిన కుక్కవలె నఱచుచు ముక్కునుండి రక్తముగార నీవలకుఁ బారిపోయివచ్చెను. ఒకని గుండెకాయకండలు పీకినది. వారిద్దఱు చావుబ్రదుకులమీఁద నున్నారు. ఇఁక భూతవైద్యులమని పేరుపెట్టుకొనినవాఁ డెవ్వఁడు నందుఁ బోవఁడు. పాప మారాజుగారుమాపరాభవమునకుఁజాల వగచుచున్నారు. ఆచిన్నదానిప్రాణములు దీయక యాభూతము వదలదు.

ఆభూతమును నదల్చి యాచిన్నదానిని నిరామయం జేసినవానికే రాజ్యముతోఁగూడ నాచేడియ నిచ్చి వివాహముగావింతునని తిరుగాఁ బ్రకటించినారఁట. అభూతమును బ్రహ్మదేవుఁడు వదల్చలేఁడు. రాజ్యము కాదు మూఁడులోకములిచ్చినను నసాధ్యమైనపని యెవ్వరుసేయఁగలరు? అని యాభూతవైద్యుఁ డచ్చటివృత్తాంతము క్రమ్మఱ నెఱింగించెను.

అయ్యుదంతము విని నిరంతరసంతోషభూషితస్వాంతుండనై యటఁగదలి కతిపయప్రయాణంబుల జయపురంబున కరిగితిని. మిత్రమా! అప్పు డాపట్టణమంతయుఁ బాడుపడినట్లున్న ది. ఎవ్వడును గడుపునిండఁ గుడుచుటలేదు. గృహము లలంకారశూన్యములై యున్నవి. ఎవరికివారే యాయాపద తమకువచ్చినట్లుగా విచారించుచుండిరి. లేచినతోడనే పౌరులెల్లఁ గోటలోనికిఁబోయి రాజుగారితోపాటు విచారించుచు సాయంకాలమున కింటికి వచ్చుచుండిరి. నృపతియు రాజ్యకార్యము లేమియు

విచారింపక సంతతము పుత్రికారోగనివారణోపాయమే యాలోచించు చుండెను. నేను గ్రామమంతయుఁ దిరిగితిరిగి కోటసింహద్వారమునొద్దకుఁ బోయితిని. అందొకచో నీప్రకటనపత్రిక వ్రాయఁబడి యున్నది.

సీ. బగళాముఖీమంత్ర పారాయణుని పండ్లు
                 డులియఁగొట్టెను మోము డొప్పవడఁగ
    నుగ్రభైరవునిమంత్రో పాసకునిమేని
                 యెముకలు విఱుగంగ నెగిరి తన్నె
    నారసింహోపాసనాదక్షునూరువు
                 కఱచి రక్తము గారఁ గాయపఱచె
    జ్వాలానృసింహమంత్రాలాపనిరతుని
                తలగ్రుద్దె బ్రహ్మరంధ్రంబు పగుల

గీ. నాంజనేయరతున్ గుండె లవియఁ బొడిచె
   గణపతిప్రియు పొట్ట వ్రక్కలుగఁ జీల్చె
   ఛండికారాధకునిఁ గాలఁ జదిమి యడఁచె
   భూపసుత నాశ్రయించినభూత మకట!

శా. ఏతద్భీకరదారుణక్రియలచే హింసారతిం బొల్చు నా
    భూతంబు న్వదలించి మత్సుతి యథాపూర్వంబుగా నంచిత
    శ్రీతో నొప్పుఁగఁ, జేసినట్టిద్విజు ధాత్రీరాజ్యసంయుక్తజా
    మాతృస్థాన మలంకరింపఁగను సన్మానింతు సత్యంబుగన్ .

ఆప్రకటనపత్రికం జదివికొని నేను మందహాసము గావించుచు నందున్న రాజపురుషులతో నే నాభూతోచ్చాటనము గావింపఁగలనని చెప్పితినో లేదో వేగురు నాచుట్టును బ్రోగుపడి అయ్యా ! తమ రెవ్వరు? ఏదేశము? ఏమిచదివికొంటిరి? అని యూరక యడుగుచుండ నందఱకుఁ దగినసమాధానము చెప్పుచు భూతమును వదలింతునని గట్టిగా శపథము జేసితిని.

అప్పుడు రాజపురుషులు నన్ను నగరిలోనికిఁ దీసికొనిపోయి రాజుగారియెదుటఁ బెట్టి మదీయ ప్రతిజ్ఞాప్రకారం బెఱింగించిరి.

రాజు - (నమస్కరించుచు) మీదేయూరు ? నేను - కాశీనగరము.

రాజు - బ్రాహ్మణులా?

నేను - అవును,

రాజు - ఏమిచదివికొంటిరి?

నేను - నాలుగువేదములు నాఱుశాస్త్రములు నఱువదినాల్గు విద్యలుం జదివికొంటిని.

రాజు — (విస్మయమభినయించుచు) మీ రాకోటముంగలి ప్రకటనపత్రికం జదివికొంటిరా?

నేను - చదివికొనియే యిక్కడికి వచ్చితిని.

రాజు — ఇదివఱ కిట్టిభూతము నెందైన వదలించితిరా ?

నేను – లేదు. ఇదియే మొదటిప్రయత్నము.

రాజు - (పెదవివిఱచుచు) ఈభూతము విద్యలకు సాధ్యముకాదు.

నేను - ఆమాట నే నెఱుంగుదును.

రాజు — మీకు భూతవైద్యమునందుఁ బ్రవీణత గలదా ?

నేను - లేకున్న నిం దేలవత్తును ?

రాజు - మీరు చిన్నవారలు, తెలియక వచ్చితిరనినే నభిప్రాయము పడుచుంటిని.

నేను - అట్టియభిప్రాయము పడనవసరము లేదు.

రాజు — మీప్రాణహానికి నేను బూటకాపును కానుచుఁడీ బాగుగా నాలోచించుకొని దిగుఁడు. ఊరక కాలసర్పమునోటఁ జేయినిడకుఁడు.

నేను - వెఱుపులేదు. ఆలోచించుకొనియే వచ్చితిని.

రాజు - ఎన్ని దినములకుఁ గుదురుతురు ? ఏతంత్ర ముపయోగింతురు?

నేను - ఎన్నోదినములా? అయిదునిమిషములు; తప్పిన రెండు గడియలు. రాజు - ఏమీ! మీ కింతసామర్థ్యము గలదా ? మహాత్మా ! నేఁటిసాయంకాలములోపున నాబిడ్డను నాతో మాటాడఁజేయుదువా ?

నేను -- సాయంకాలమువఱకు నేల? రెండుగడియలలో మాటాడింతును.

రాజు - అందుల కేమిసన్నాహము కావలయును తండ్రీ !

నేను - ఏమియు నక్కఱలేదు. ఆచిన్నది యెందున్నదో చూపుఁడు. నేనక్కడికిఁ బోయెదను.

రాజు - అయ్యో ! లోపలికే పోయెదరా? అమాంతముగా మీఁదఁబడి చంపునుచుఁడీ ! నాకు భయమగుచున్నది.

నేను - నాకులేనిభయము మీ కెలా ? ఆచిన్నదియున్నగది చూపుఁడు. చూపుఁడు. అని యడిగితిని.

నామాటలు విని యాభూపాలుం డపారసంతోషముతో నార్యా! రెండుగడియలలో నాకూఁతురితో సంభాషింపఁజేసితివేని నిన్నిప్పుడే రాజ్యపట్టభద్రుం జేసి యల్లునిగాఁ జేసికొనుచున్నా ను. అని పలుకుచు నాపాదములకు సాష్టాంగ నమస్కారములు గావించెను.

భూపా ! లెమ్ము లెమ్ము. నా కీరాజ్యప్రాప్తికొఱకే యీభూతంబు నీకూతుం బట్టినది. ఆలస్య మేలచేసెదరు. గది చూపుఁడని యడిగితిని,

అమ్మహారాజు దండహస్తులైన రక్షకభటుల నాప్రాంతమందుఁ గాచియుండునట్లు నియమించి న న్నాగదియొద్దకుఁ దీసికొనిపోయి బీగము తీయించి జడియుచు దూరముగాఁబోయి తొంగిచూచు చుండెను. అప్పుడు నేను గొంతయట్టహాసము గావించితిని. స్నానముచేసి విభూతి రుద్రాక్షమాలికాలంకృతసర్వప్రతీకుండనై చేత బెత్తముబూని హుంకారపూర్వకముగ గొణ్ణెముదీసి తలుపులుత్రోసి లోపలకుఁ బోయితిని.

ఆచిన్నది తలవిరియఁబోసికొని శల్యావశిష్టయై మంచముపైఁబడి యున్నది. నన్నుఁ జూచినతోడనే గాండ్రుమని పెద్దపులివలె నఱచినది. నాకు మేనఁ గంపము జనించినది కాని యంతలో ధైర్యము దెచ్చికొని యామెదెసఁ జూచుచు గోడకుఁ జేరఁబడి చూచుచుంటిని

అప్పు డారాచపట్టి యట్టెలేచి పిడికిలిపట్టి రావణునిమీఁదికిహనుమంతుఁడువోలె నామీఁదికి వచ్చుచుండెను. అప్పుడు నేను జేతులుజోడించి నమస్కరించుచు నీశ్లోకము జదివితిని.

శ్లో॥ భూతేంద్ర తవశిష్యోహం గోనర్దీయాభిధానకః
      పూర్వోదిత పరందేహి దేవభూతె నమోనమః॥

దేవభూతే ! అని సంబోధించి నేను బలికినంత నాకాంత నన్నెగా దిగఁజూచి యందె నిలువంబడి నమస్కరించుచు మహాత్మా! నేఁటికి వచ్చితివా ? ఇంతయాలసించితివేల ? నీకొఱకే యింతయట్టహాసము గావింపుచుంటిని. ఇఁక నీ వీరాజ్యముతోఁగూడ నీరాజపుత్రికం బెండ్లియాడి సుఖింపుము. నీకుఁగావించిన యుపకారవిశేషంబునంజేసి నేను గూడఁ బాపవిముక్తుండ నయ్యెదనని పలుకుచు నాబ్రహ్మరాక్షసుఁ డా యంబుజాక్షిని విడిచి యింటిపైకప్పు విడఁదన్ని పెంకులు జలజలరాల నాకసమువంకఁ బోయెను.

అప్పుడు రాజపుత్రిక యొడలెఱుంగక నేలం బడిపోయినది. నేను దలుపులుదీసికొని యీవలకు వచ్చినంత నాప్రాంతమందుఁగాచి చూచు చున్నరాజు నాకడకువచ్చి మహాత్మా ! ఏమిజరిగినది ? అని యడిగిన భూతము వదలినది నీపుత్రికం జూచికొమ్మని పలికితిని.

అందుఁబడియున్న యాయన్నుమిన్నం జూచి దుఃఖముతో దాపునకుఁ బోయి అమ్మా ! మదయంతీ ! అని పిలిచెను. ఆకలికి కన్నులం దెఱచి దాహమిమ్మని సంజ్ఞ చేసినది.

అప్పు డారాజు నన్నుఁ గౌఁగిలించుకొని మహాత్మా ! నీవు మనుష్యమాత్రుఁడవు కావు. నన్నుఁ దరింపఁజేయ నరుదెంచిన భగవంతుఁడవు. కానిచో దారుణక్రియాచరణదక్షుండగు నీబ్రహ్మరాక్షసుని వదలింప శక్యమా ? నేను గృతకృత్యుండ ధన్యుండ. ఇప్పు డీబాల దాహమడుగుచున్నది యీయవచ్చునా? అని యడిగిన నేను వేడినీళ్ళ జలకమాడింపుఁడు. పథ్యపానాదులు యథాయోగ్యముగా నడిపింపుఁడు అని చెప్పితిని. అంతలో నాశుభవార్త తల్లియు బంధువులు విని గుంపులుగా నచ్చటికివచ్చి యచ్చిగురాకుఁ బోఁడింజూచి మీఁదఁబడివిలపింప మొదలుపెట్టిరి.

అవ్వరారోహ చిరాకుపడి రొదసేయవలదని సూచించినది. అప్పు డందఱు నన్ను దైవముఁబూజించు నట్లు పూవులచేఁ బూజించిరి. పిమ్మట నాకొమ్మను జలకమాడించి నూత్నాంబరభూషణాదులచే నలంకరించి లఘ్వాహార మొసంగిరి. ఇంచుక స్మృతిగలిగి మాట్లాడుట ప్రారంభించినతరువాతఁ దల్లి మెల్లగాఁ దలచిక్కుఁ దీర్చుచు అమ్మా ! నీవుజేసిన క్రియలు దారుణములు. నీ కిట్టిబల మెక్కడనుండి వచ్చినదో తెలియదు. ఆవిషయములు నీ కేమైన జ్ఞాపకమున్నవియా ? అని యడిగినదఁట.

ఆచిన్నది అయ్యో ! నాకేమియుం దెలియదు. నాఁటిరేయి మంచముమీఁదఁ బరుండి నిద్రించుచుండ గుభాలున నెవ్వఁడో వచ్చి మీఁదఁ బడినట్లైనది. నాశరీరము బ్రహ్మాండమంత లావైనట్లు తోఁచినది. అంత వఱకు జ్ఞాపకమున్న ది. తరువాత నేమిజరగినదో యెఱుఁగను. ఏమేమి చేసితిని ? అని సిగ్గుతో నడిగినఁ దల్లి యాచేష్టలన్నియుం జెప్పినది. గోనర్దీయుఁడను మహానుభావునివలన విముక్తినొందితివి. ఆతఁడే నీకు భర్తయని చెప్పినదఁట. .అయ్యయ్యో ! నేను నిష్కారణము మాంత్రికులైన బ్రాహ్మణోత్తముల సంకటపఱచితినా? కటకటా! వారు మిక్కిలి బాధపడుచున్నారుకాఁబోలు ! తల్లీ ! పాపము వారికి మాతండ్రిగారు తగినచికిత్సలు చేయించిరా? నాపడినబన్నముకన్న వారియిడుములు విన్న నా కెక్కుడు పరితాపముగానున్నది. అని వగచుచుండఁ దల్లి వారించు చు పట్టీ! నీ వెఱుంగకచేసినదాని కెవ్వరికిఁ గోపముండును ? మీతండ్రి వారికిం దగినసాహాయము చేయించిరి. నీ వందులకు విచారింపఁబనిలేదు. అని యోదార్చినది. కొలఁదిదినములకే యాకలికి యథాప్రకారము మారునిములికివలె మెఱయఁదొడంగినది.

అప్పుడు నాకు వారు చేయునుపచారము లిట్టివని చెప్పఁజాలను. ప్రజలెల్ల నన్ను భగవంతుఁడనియె తలంచుచుండిరి. రాజున కల్లుఁడనై రాజ్యమున కధిపతినిగానైయున్న నన్ను ప్రజలు మన్నించుట విధియైనను సహజానురాగములు గలిగియుండుట స్తుత్యమైయున్నది.

మఱియొక నాఁడు మదయంతి తనసఖురాలిచే నీక్రిందిపద్యము వ్రాసి యంపినది.

చ. హరునిశరాసనంబు దునియల్ పొనరించి వసుంధరాసుతం
    బరిణయమయ్యె రాఘవుఁడు పార్థుఁడు ము న్నలమత్స్యయంత్రముం
    బరిగొని ద్రోపదిం బడసె మామకభూతభయంకరార్తి స
    త్కరుణ నడంచి తోలి యొసఁగంబడె నన్నుఁ బరిగ్రహింపుమీ!

ఉ. ప్రీతి మహోపకార మొనరించెఁగదా ! నను నాశ్రయించి యా
    భూత మభూతపూర్వపరిపూర్ణ కళావిభవాభిరామవి
    ఖ్యాతయశోధురంధురుఁడవై తగు ని న్నిటఁదెచ్చి యిచ్చె నా
    హా ! తటిదార్భటీభయదమై జల మిచ్చు ఘనంబువైఖరిన్.

తదనుగుణ్యములైన శ్లోకములు వ్రాసి నే నంపితిని. ఇట్లు మే మొండొరుల మత్యంతప్రేమానుబంధ ప్రకటీకరణపత్రికాప్రేషణంబుల నానందింపుచుండఁ గొండక శుభముహూర్తంబున నమ్మహారాజు నా కామదయంతి నిచ్చి మహావైభవంబున వివాహంబు గావించె. వయస్యా ! మదయంతీసౌందర్య చాతుర్యకళావిశేషంబు లిట్టివని చెప్పుట కిది సమయముకాదు. మఱియొకప్పు డెఱింగింతు. తొలుత ననంగసామ్రాజ్యపట్టాభిషిక్తుండనై యాలావణ్యవతితో ననన్యజనసామాన్య శృంగారలీలాసౌఖ్యాంభోనిధి నోలలాడితిని. అనంతరము తద్రాజ్యపట్టభద్రుండ నైతి. రెండునెలలు పాలించితి నింతలోఁ గుచుమారుండను మహావిద్వాంసుండు స్వకీయనిరవద్యవిద్యాసంపత్తి నుంకువగా నిచ్చి పురందరపురాధిపతికూఁతురు సరస్వతిని వివాహమాడుచున్నాఁడు. అను వార్తఁ బండితులవలన విని అట్టికళాప్రవీణుఁడవు నీవేయని నిశ్చయించికొని సంతసముతో నాయుత్సవముఁ జూడఁ బయలుదేరి యందుఁ బోవుచుంటిని. ఇందే నీవు గనంబడితివి. అదియే పదివేలు. అని గోనర్దీయుఁడు తన వృత్తాంతమంతయుఁ గుచుమారుని కెఱింగించుచు మిత్రమా! ఈరాజ్యము నాయొక్కనిదే కాదు మనమేడ్వురము పంచికొనవలసినవారమే. మనమిత్రు లీపాటికి ధారానగరము చేరియుందురేమో? మన మిప్పు డందుఁ బోవలయునా ? కర్తవ్య మేమి ? అని యడిగినఁ గుచుమారుం డిట్లనియె.

వయస్యా ! తొలుతం బురందరపురమున కరిగి యందలివిశేషము లేమియో తెలిసికొని తరువాత ధారానగరంబున కరుగుదము అని చెప్పిన నతం డొప్పుకొని యప్పుడే యారేవుగుత్తజేసినవర్తకుని రప్పించి కుచుమారుని కిచ్చినవిత్తమునకుఁ బదిరె ట్లతనికిచ్చి సంతోషపఱచెను.

తరువాతఁ గుచుమారుని వెంటఁబెట్టికొని చతురంగబలపరివృతుండై గోనర్దీయుఁడు ఆరేవు దాటి తొలుత బెస్తలున్న పల్లె కరిగి బలములనెల్ల దూరముగా నుండనియమించి కుచుమారుని కైదండఁగొని యాపల్లెవాండ్రవెంబడి సంచరించుచు వారినెల్ల రప్పించి యాయాగుఱుతులు చూచుచు,

సీ. నెత్తిపైఁ గట్టిన నెత్తుట జొత్తిల్లు
              మరకగుడ్డలఁ జూచి పరితపించె
    పరిఘాంబువులనుండి పైకిఁదీసిన మేటి
              జాలంబు గని యశ్రుజలము విడిచె
    నొడలెఱుంగకయున్న యెడఁ బండుకొనఁబెట్టు
              నులకమంచముఁ జూచి కలక జెందె

    కట్టులకై తెచ్చి కడఁబారవైచిన
                  యోషధు ల్గాంచి నిట్టూర్పు విడిచె

గీ. వానినెల్లను గైకొని వాంఛతోడ
    జాలరులఁ గౌఁగిలించి యుత్సాహమంద
    నుతులఁ గావించె నలపురోహితుని బిలిచి
    తెలిసికొని వెండి మిత్రుఁ డొందినశ్రమంబు.

మిక్కిలి పరితపించుచుఁ గుచుమారుని కుపకారముగావించిన బెస్తలగృహంబుల నంత విత్తబహుళంబై యొప్పునట్లు చేసి యతని కన్న ప్రదానాదుల నాదరించిన పురోహితుని బురోహితునిఁగాఁ జేసికొని యటనుండి పరివారసమేతముగాఁ బురందరపురంబున కరిగెనని యెఱింగించువఱకు వేళ యతిక్రమించినది. అవ్వలికథ పైమజిలీయందుఁ జెప్పం దొడంగెను.

160 వ మజిలీ.

−♦ భైరవునికథ. ♦−

ధారుణీపయోధరాగ్రహారమై యొప్పారు. గిరితటంబను నగ్రహారమున గౌతముండను బ్రాహ్మణ బ్రువుండు గలఁడు. వాఁడు కడుపవిత్రమగు ధాత్రీసురవంశంబునఁ బుట్టియు జనకంటకములగు పనులఁ గావింపుచుండుటంజేసి వాని నెల్లరు భైరవుండని పిలుచుచుందురు.

సీ. ఒకసారి కవినంచుఁ బ్రకటించి బెదరించుఁ
                 బద్య మల్లుచు జానపదు లఁ జేరి
    యొక తేపఁ గరిణీక మొనరించుఁ గాపువా
                 రలనోరుగొట్టు లెక్కలను వ్రాసి
    యొక పరి బేరియై యూరూరుఁ దిరుగు వే
                 ఱొకతేఁప దున్ను హాలికతఁ బూని