కాశీమజిలీకథలు/ఎనిమిదవ భాగము/161వ మజిలీ

యైపోయెను. విధివిధాన మతిక్రమింప విధి కే శక్యముగాదనినచో నితరులమాట జెప్పనేల.

క. చిరకాలజీవియగు న
   ప్పరమతపోధనుని గురుని బలవంతముగా
   శిరమున రాయిడి చంపిన
   దురితాత్ముని కరుదె యవిహితుం బంధింపన్ .

అని యెఱింగించి కాలాతీతమైనంత ననంతరవృత్తాంత మవ్వలి మజిలీయం దిట్లు చెప్పెను.

161 వ మజిలీ.

చారాయణుం డరిగినకొన్ని నెలలకు మల్లిక పుష్పవతియై మనోజ్ఞ తేజంబునం బ్రకాశించుచుండెను. అల్లుఁడు వత్తుననిచెప్పిన మితి దాటిన తరుహత బ్రహ్మదత్తునిభార్య మిక్కిలి పరితపించుచుఁ గాకికూసినఁ జారాయణుఁడు వచ్చునా అని ప్రశ్న మడుగును. పరదేశు లరుదెంచిన నతని వార్త లడుగుచుండును. సంతత మతనిరాకగురించియే చింతించుచు నొకనాఁడు భర్తతో నార్యా ! కులశీలాదులం దెలియక మనము చారాయణునికిఁ బిల్లనిచ్చితిమి. అతండు పుస్తిగట్టి లేచిపోయెను. వానిగ్రామ మేదియో బంధువు లెందున్నారో మనకుఁ దిన్నగాఁ దెలియదు. కేవలము విద్యనునమ్మి పిల్లనీయఁగూడదు. మల్లిక సిగ్గుపెంపునఁ జెప్పదు కాని మాటునఁ గూర్చుండి యేదియో ధ్యానించుచుండును. ఏపేదవానికిచ్చినను నిల్లువదలకుండును. ఇప్పు డేమిచేయఁదగినదని యడిగిన బ్రహ్మదత్తుం డిట్లనియె

చారాయణుండు మహాపండితుండు. ఏమహారాజుసంస్థానములోఁ బూజింపఁబడుచుండెనో. రెండుమూడుదినములలో వచ్చిన లెస్సయే లేకున్న నేను ధారానగరంబున కరిగి యతనివృత్తాంతము దెలిసికొని వచ్చెద, మీరిందుండఁగలరా? అనిచెప్పిన నామె యంగీకరించినది. మల్లిక యామాటవిని తండ్రీ! మేముమాత్ర మొకసారి దేశవిశేషములఁ జూడఁగూడదా ? కూపస్థకూర్మమువలె నెల్లకాల మీయడవి నడుమ వసింపవలయునా ? మమ్ముగూడఁ దీసికొనిపొండు అని బ్రతిమాలికొన్నది. అతం డంగీకరించి శుభముహూర్తంబునఁ గుటుంబముతో బయలుదేరి ధారానగరము మాళవదేశమందున్నదని తెలిసికొని యా దిక్కుగాఁ బోవుచుఁ గొన్నిదినంబుల కష్టాపథసత్రము జేరికొనియెను.

−♦ అష్టాపథసత్రము కథ. ♦−

ఒకమహారణ్యమధ్యంబున నెనిమిదిదిక్కులనుండి వచ్చిన మార్గములు గలిసికొనినవి. అందొక పుణ్యాత్ముండు గొప్పసత్రమును గట్టించెను. దాని కష్టాపథసత్రమని పేరువచ్చినది. అందలిభూమి తృణకాష్టజలసమృద్ధిగలిగి మధురరసఫలకుసుమదళబహుళములగు తరులతా గుల్మాదులచే నొప్పుచున్న యారామములచే మనోహరమై యున్నది. ఆసత్రమునకు మూఁడుయోజనముల దూరములో గ్రామమేదియును లేదు. పాషాణకంటకదుర్గంబగు మార్గములచే వెలయుచున్నది. బాటసారులు మిక్కిలి దూరమునడిచివచ్చి యందు గొన్ని దినములుండి విశ్రాంతివహింతురు. అందు నాలుగువర్ణములవారికి భోజనసదుపాయములు చేయుదురు. ఏఁబదియాఱుదేశములవారు నాసత్రమున. గూడి యుందురు. అన్ని భాషలు నన్ని దేశవిశేషములు నందు వినంబడుచుండును.

బ్రహ్మదత్తుం డాసత్రములోఁ గుటుంబముతో నొకగదిలోఁ బ్రవేశించెను. సత్రాధికారులు వారికిఁదగిన సదుపాయములు సేయుచుండిరి. సత్రాధిపతిం బొగడుచు ధర్మకర్తల నగ్గించుచు నుద్యోగస్థుల స్తుతియించుచు బ్రహ్మదత్తుండు కుటుంబముతోఁ గొన్నిదినము లందుండి దేశ విశేషములం దెలిసికొనెను.

ఒకనాఁడురాత్రి పండువెన్నెలలు గాయుచుండెను. బ్రాహ్మణు లెల్లరు భుజించి సత్రముముందరి విశాలవితర్దికలపైఁ గూర్చుండి వింత మాటలం జెప్పుకొనుచుండిరి. బ్రహ్మదత్తుండు వారిమాట లాలించుచు నోరగాఁ గూర్చుండెను. ఒకతార్కికునకు కవికి నిట్టి సంవాదము జరిగినది,

తార్కికుఁడు — కవీంద్రా ! నీవు ధారానగరంబునుండి వచ్చితినని చెప్పితివికదా, భోజుండు కవికల్పభూజుండని చెప్పుదురు. ఆ వదాన్యుండు కుశలియై యున్నవాఁడా ? కవీంద్రులనేకాక పండితులగూడ సత్కరించునా ?

కవి - ఆరాజిప్పు డాయూరలేడు. కుపితుండై యరిగిన కాళిదాస కవిం దీసికొనివచ్చుటకై విదేశమున కరిగెననిచెప్పిరి. ఆయనకుమారుఁడు విద్యాంసుల నాదరించుచున్నాఁడు కాని పరీక్షలు లేవు. మీరేమైనఁ గవిత్వము సెప్పఁగలరా?

తార్కికుడు - ప్రౌఢముగాఁ జెప్పలేను. అలవాటుచేయుచున్నాను. అబ్బా ! అది సహజముగానుండ వలయునుగాని బలవంతముచేసిన విరసముగా నుండును. ఒకచరణము మాదిరిగా రెండవది కుదరదు. నే నొకశ్లోకము రచించితిని విందురా ?

కవి - ఇప్పుడు నిద్రవచ్చుచున్నది. రేపు వినియెదనులెండి. మఱి యేవేని విశేషములు చెప్పుదురు.

తార్కి - శ్లోకము వినుటకు నిద్రవచ్చుచున్నదా? విశేషములకు నిద్రరాదూ? పోనిండట్లె చెప్పెదవినుండు. పురందరపురవిశేషములు వింటిరా?

కవి - ఆరాజుకూఁతురు సరస్వతిమాటయేనా? ఆమెకడ మీ తార్కికములు నాకవిత్వము నిలువవు. ప్రతిపండితుఁడు నామెకు మ్రొక్కవలసినదె. ఆవిశేషము చెప్పనక్కఱలేదు.

తార్కి - అయినది. వినుండు. కుచుమారుండనుపండితుఁ డామె నన్నివిద్యలలో నోడించి పెండ్లిచేయమనుచున్నాఁడు.

కవి - అందులకుఁ బ్రార్థనయేటికి ? ఆమె యట్టిప్రకటనమే చేసియున్న దే.

తార్కి - అక్కడనే సందిగ్ధముగానున్న ది బ్రాహ్మణుని బెండ్లియాడుటకిష్టములేకకాఁబోలు నేవియో ప్రతికూలములు సెప్పియాటంకము గలుగఁజేయుచున్నది.

కవి - మీ రందుఁబోయితీరా ?

తార్కి - గొప్పవివాహము జరగును సంభావన దొరకునని పోయితిని. ఏదియు లేకపోయినది.

ఆసంవాదము విని బ్రహ్మదత్తుఁడు ముందరికివచ్చి కవీశ్వరునితో నార్యా! మీరు ధారానగరమునుండి వచ్చుచున్నామని చెప్పితిరి. అందుఁ జారాయణుఁడను పండితుండు గనంబడలేదుగద. అతని మిత్రులు దత్తకాదులు మహావిద్వాంసు లార్వురుండవలె. వారివాడుక పురమంతయు వ్యాపించియే యుండును. వింటిరా? అని అడిగిన నేను మూఁడుదినములు మాత్రమే యందుంటిని. వారిపేరు వినలేదని చెప్పెను.

అప్పుడు వేఱొకప్రక్కం గూర్చున్న యొకబ్రాహ్మనికుమారుఁ డాప్రాంతమునకువచ్చి బ్రహ్మదత్తునిమొగము పరీక్షించిచూచి మీరెవ్వరు? చారాయణుని దత్తకాదుల నడుగుచున్నారు. వారి నెఱుఁగుదురా యేమి ? అని యడిగిన బ్రహ్మదత్తు డిట్లనియె.

అయ్యా ! చారాయణుఁడు మార్గవశంబున మాయింటి కతిధిగా రాఁగా నతనికి నాకూఁతురు మల్లిక నిచ్చివివాహము గావించితిని. దత్తకాదులు తనమిత్రులనియు. ధారాపురంబునఁ దననిమిత్తము వేచి యుందురనియు వారింగలిసికొని వేగముగా వత్తుననిచెప్పి యరిగెను. చెప్పినమితి దాటినది. అతనిజాడ యేమియుం దెలియలేదు. అతని వెదకుచుఁ గుటుంబముతో బయలుదేరితినని తనవృత్తాంత మంతయుఁ జెప్పెను.

ఆకథవిని యావిప్రకుమారుండు సంతసించుచు నో హెూ! మీ రు మాచారాయణునికిఁ బిల్లనిచ్చితిరా ? అట్లైన మాకునుం బూజ్యలే. నే నామిత్రులలో నొక్కరుఁడను. నాపేరు ఘోటకముఖుఁడందురు. నామిత్రులందఱు నీపాటికి ధారానగరము చేరియుందురు. నాకు దారిలోఁ గొన్నివిఘ్నములు తటస్థించినవి. అందులకై క్రుమ్మఱుచుంటిని. ఒకమహానీయునిభార్యను భైరవుండనువాఁడు హరించెను. వానినిమిత్తము తిరుగుచుంటిని. వాఁడిప్పుడు పురందరపురమున నున్నట్లు వార్తలు దెలిసినవి. మే మందుఁ బోగలము. మీరు తిన్నగా ధారానగరమున కరుగుఁడు. అందఱు నందుఁ గనంబడుదురని తనకథ నెఱింగించెను.

బ్రహ్మదత్తుండు ఘోటకముఖుం గౌఁగిలించుకొని ఆర్యా ! నీమాట చారాయణుఁ డెఱింగించియుండెను. నీవు గనంబడుటచే సగము విచారము వోయినది. నీమిత్రునిభార్యను జూతువుగాని రమ్ము. సర్వదా అతని నిమిత్తము విచారించుచుండునని పలుకుచు నతనిచేయిపట్టుకొని తనగదియొద్దకుఁ దీసికొనిపోయి పుత్రికతో నాతనిచారిత్ర మెఱింగించెను. మల్లిక ప్రీతిసూచకములగు చూపులచే నతనిం జూచుచు సిగ్గు పెంపున నేమియు మాటాడినదికాదు.

తదాకారలక్షణంబులు పరీక్షించి సంతసించుచు నామె యేమైనం జదివికొన్న దా? అని యడిగెను. నీమిత్రుఁడు చదువుపరీక్షించియే చేసికొనెనని యతం డుత్తరముజెప్పెను. పిమ్మట ఘోటకముఖుండు బ్రహ్మదత్తుని దనగదియొద్దకుఁ దీసికొనిపోయి భోజుంజూపుచు నీయుదారుని దార నరయుటకై తిరుగుచుంటిమని చెప్పుచు భోజునితో బ్రహ్మదత్తుని వృత్తాంత మెఱింగించెను.

అతండు భోజుండని ఘోటకముఖునికే తెలియనప్పు డితరుల కెట్లుతెలియును. బ్రహ్మదత్తుండు గొప్పపండితుఁడు కవియని విని భోజుండు లేచి నమస్కరించె. అతని రూపలక్షణంబులు పరీక్షించి యెవ్వఁడోయొక దేశాధికారియని నిశ్చయించి తగిన ట్లాశీర్వదించెను. ఆరాత్రి వారు చాలసేపు విద్యావిషయంబుల ముచ్చటించిరి. ఘోటకముఖుండు భోజునితో భైరవుండను తాంత్రికుఁడు పురందరపురములోనున్నట్లు వర్తమనము తెలిసినది. మన మందు పోవలయునని సూచించెను. ఆయన యందుల కంగీకరించెను.

మఱునాఁడు భోజుండును ఘోటకముఖుండును పురందరపురమున కరుగుచు బ్రహ్మదత్తుఁడున్న గదియొద్దకువచ్చి యతనితో ముచ్చటించుచు మల్లిక ప్రౌఢముగాఁ గవిత్వము చెప్పఁగలదని విని భోజుండు మిగుల నానందించుచుఁ బుత్రీ ! నేను నీకుఁ దండ్రివంటివాఁడ, నాకడ సిగ్గుపడనవసరము లేదు. నాకుఁ గవులయందుఁ జాలప్రేమగలదు. ఏదీ ? యొక్క శ్లోకము రచించి శ్రోత్రానందము గావింపుమని సాదరముగాఁ బలికెను.

అప్పు డాచిన్నది ఇంచుక తలవాల్చి మహాత్మా ! స్త్రీవిద్య యల్పమైనను గొప్పగాఁ జెప్పికొందురు. మీవంటి మహావిద్వాంసులకడ నేనొక పండితురాలననియుఁ గవిననియుం జెప్పికొనఁగలనా ! అయినను మీరు నన్నాదరించి యడిగినప్పు డుపేక్షించుట న్యాయముగాదు దేనిగుఱించి వర్ణింపవలయునో మీరే నిరూపింపుఁడు. నాశక్తికొలఁది శ్లోకము గావింతునని మృదుమధుర వాక్యములతోఁ బలికిన సంతసించుచు భోజుండు ముందుగా నీసమస్య నిచ్చి పూర్తిచేయుమనెను.

శ్లో॥ క్రియాసిద్ధిస్స త్వెభవతి మహతాంనోపకరణైః

ఆసమస్యను బ్రహ్మదత్తుండును భార్యయు ఘోటకముఖుండును మల్లికయుఁ బూర్తిజేసిరి.

బ్రహ్మదత్తుఁడు-

శ్లో. ఘటోజన్మస్థానంమృగపరిజనోభూర్జవసనో
    వనెవాసః కందాదికమశనమేవంవిధగుణః ।
    అగస్త్యః పాధోధిం యదకృతకరాంభోజకుహరె
    క్రియాసిద్ధిస్స త్వెభవతి మహతాంనోపకరణైః॥

బ్రహ్మదత్తునిభార్య-

శ్లో. రధస్యైకంచక్రం భుజగనమితాస్సప్తతురగా
    ని రాలంబోమార్గశ్చరణ వికలస్సారధిరపి !
    రవిర్యాత్యేవాంతం బ్రతిదిన మపారస్యనభసః
    క్రియాస్సిద్ధిస్సత్వెభవతి మహతాంనోపకరణైః ॥

ఘోటకముఖుఁడు--

శ్లో. విజేతవ్యాలంకా చరణతరణీయోజలనిధిః
    విపక్షఃపౌలస్త్యోరణభువిసహాయాశ్చకపయః।
    పదాతిర్మర్త్యోసౌసకలమవధీద్రాక్షుసకులం
    క్రియాసిద్ధిస్స త్వెభవతి మహతాంనోపకరణైః ॥

మల్లిక.

శ్లో. ధనుఃసౌష్పం మౌర్వీమధుకరమయీ చంచలదృశాం
    దృశాంకోణో బాణస్సుహృదపిజడాత్మాహిమకరః ।
    స్వయంచైకోనంగ స్సకలభువనం వ్యాకులయతి
    క్రియాసిద్ధిస్స త్వెభవతి మహతాంనోపకరణైః॥

మహాత్ములకుఁ గార్యసిద్ధి ప్రభావముచేతనే యగును. ఉపకరణములతోఁ బనిలేదు అని సమప్యార్ధము. కుండయందు బుట్టి మృగములతోఁ గూడి యడవివసించెడు నగస్త్యుఁడు సముద్రమును గ్రోలెను. తాను మనుజుండై శ్రీరాముఁడు కోతులతోఁగూడి సముద్రమున రాళ్లుతేలించి లంకను ముట్టడించి రావణుని సంహరించెను. ఒకచక్రముగలబండి నెక్కి నిరాలంబమగు నాకాశమున కాళ్లులేని సారథితో సూరుఁడు తిరుగుచున్నాఁడు. కావున మహాత్ములకు సాధనము లవసరములేదని బ్రహ్మదతుఁడు భార్య ఘోటకముఖుఁడు చెప్పిరి. మల్లిక పుష్పధనుస్సు తుమ్మెదలనారియుం గలిగి స్త్రీల చంచల దృక్కులయొక్క వారచూపులు బాణములుగాఁ జేసికొని మన్మథుఁడు దేహములేనివాఁడైనను మూఁడులోక ముల వ్యాకులపెట్టుచున్నాఁడు అని మల్లిక చెప్పినది.

ఆనాలుగుశ్లోకములలో మల్లిక చేసినశ్లోకమే చాల రసవంతముగా నున్నదనితలంచి భోజుండు దాని కక్షరలక్ష లిచ్చుటకు మనంబున నిశ్చయించి యెల్లరు విన మల్లికను బెద్దగాఁ బొగడి మేము కొలఁదిదినములలో ధారానగరము వత్తుమనియు నప్పుడు తిరుగా దర్శనము చేయుదుమని చెప్పి బ్రహ్మదత్తుని యనుజ్ఞపుచ్చుకొని భోజుండు ఘోటకముఖునితోఁగూడఁ బురందరపురమున కరిగెను.

బ్రహ్మదత్తుండు కుటుంబముతో ధారానగరంబునకుఁ బోయెను. అని యెఱింగించి యవ్వలికథ మఱల నిట్లు చెప్పదొడంగెను.

162 వ మజిలీ.

−♦ పురందరపురము. ♦−

పురందరనగరాధీశ్వరుండగు హిరణ్యగర్భుండు ధర్మసందేహమొండుతీర్పదలంచికొని సుప్రసిద్ధులగు పండితులను బండితప్రభువులను రమ్మని యాహ్వానపత్రికలు వ్రాయించెను. సభాదివసంబునకు నానా దేశములనుండి రాజులు కవిరాజులు తమతమ బిరుదములతో వచ్చి పురము నిండించిరి. దానంజేసి యాపట్టణ మప్పుడు బహుజనాకీర్ణమై రథహస్తి పత్తిసంకులంబై భేరీపటహవేణువీణాది మంగళవాద్యముఖరితంబై యొప్పుచుండెను.

భోజుండును ఘోటకముఖుండును దైవికముగా నాఁటికే యవ్వీటికిం బోయిరి. వీధులలో జనులు గుంపులుగుంపులుగా మూగికొని సరస్వతిమాటలం జెప్పుకొనుచుండిరి. కొందఱు కుచుమారుని గుఱించి ముచ్చటింపుచుండిరి. ఒకచోటఁ గొందఱు శృంగారపురుషులు సరస్వతీవివాహమును గుఱించి యిట్లు సంభాషించిరి.

ఒకఁడు - నేఁటితో నేదోయొకటి తేలఁగలదు. అతండు జామాతయో ప్రేతయో కాఁగలఁదు.