ఓడను జరిపే ముచ్చట గనరే

త్యాగరాజు కృతులు

అం అః

ఓడను జరిపే ముచ్చట గనరే వనితలారా నేడూ
రాగం: సారంగ
తాళం: ఆది

పల్లవి:
ఓడను జరిపే ముచ్చట
గనరే వనితలారా నేడూ

అనుపల్లవి :
ఆడవారు యమున కాడ కృష్ణుని కూడి
ఆడుచు పాడుచునందరూజూడగ

చరణములు :
౧.
కొందరు హరికీర్తనములు పాడ
కొందరానందమున ముద్దులాడ
కొందరు యమునా దేవిని వేడ
కొందరి ముత్యపు సరులసియాడ
౨.
కొందరు తడబడ పాలిండ్లు కదల
కొందరి బంగరు వల్వలు వదల
కొందరి కుతిలాలకములు మెదల
కొందరు పల్కుచు కృష్ణుని కథల
౩.
కొందరు త్యాగరాజ సఖుడేయనగ
కొందరి కస్తూరి బొట్తు కరగగ
కొందరి కొప్పుల విరులు జరగ
కొందరి కంకణములు ఘల్లనగ