ఏ రాముని నమ్మితినో నేనే పూలఁబూజ జేసితినో

త్యాగరాజు కృతులు

అం అః



ఏ రాముని నమ్మితినో నేనే పూలఁబూజ జేసితినో 
రాగం: వకుళాభరణం
తాళం: త్రిపుట

పల్లవి:
ఏ రాముని నమ్మితినో నేనే పూలఁబూజ జేసితినో ॥ఏ॥

అను పల్లవి:
వారము నిజదాసవరులకు రిపులైన
వారి మదమణచే శ్రీరాముడుగాదో ॥ఏ॥

చరణము(లు)
ఏకాంతమున సీత సోకార్చిఁ జోగొట్ట
కాకాసుతుఁడు చేయు చీకాకు సైరించు
కోక మదిని దయలేక బాణమునేసి
ఏకాక్షునిఁ జేసిన సాకేతపతి గాదో ॥ఏ॥

దారపుత్రులవద్ద చేరనీక రవికు
మారుని వెలవట బారదోలి గిరిఁ
జేరఁ జేసినట్టి తారానాయకుని సం
హారము జేసిన శ్రీరాముడు గాదో ॥ఏ॥

రోషము నాడు దుర్భాషలను విని వి
భీషణుఁడావేళ ఘోషించి శరణన
దోషరావణు మదశోషకుఁడైన ని
ర్దోష త్యాగరాజ పోషకుఁడు గాదో ॥ఏ॥