హైందవ స్వరాజ్యము/మూడవ ప్రకరణము

మూడవ ప్రకరణము.


అసంతృప్తి, అశాంతి.


చదువరి: అట్లైన బంగాళావిభజనము ప్రబోధమునకు కారణమని మీరంగీకరించుచున్నారు. అందువలన కలిగిన అశాంతి మీకు సమ్మతమేనా?


సంపా: నిద్రనుండి మేల్కాంచునాడు అంగమును విరుచుకొనుచు లేచును. ఆవల ఈవల పొర్లాడును. పూర్తిగా లేచునప్పటికి ఒక కొంతసేపు పట్టుచున్న ది. అటులే బంగాళావిభజనము ప్రబోధము కలిగించినను మేల్కొనుటకు సంబంధించిన వికారములు మాత్రము వీడలేదు. ఇంకను మనము అంగములు విరుచుకొనుచు ప్రక్కపై పొరలుచునున్నాము. నిద్రకు జాగ్రత్తకు మధ్యమావస్థ ఎట్లనసరమో అట్ల యీయవస్థయు మన పరిణామమున అవసరము ఉచితము అగుచున్నది. 'అశాంతి కలదు.' అను జ్ఞానమే దానిని తరించుటకు మార్గము కాగలదు. నిద్ర మేల్కాంచట కారంభించిన పిదప అరగను మోడ్చుతో నెంతో కాలముండము. త్వరగానో కొంచెమాలస్యముగనో మనమన శక్తికొలది సంపూర్ణజాగ్రవవస్థను పొందుచునే యున్నాము. అందుచేత, ఎవ్వరును వలెననికోరని యట్టి యీయశాంత స్థితిని మనము తరింపగలము.


చదువరి: మరి యింకొక విధమైన అశాంతి కలదా? దాని స్వరూప మెట్టిది?


సంపా: అశాంతి నిజముగా అసంతృప్తి. అసంతృప్తినే అశాంతి యనుచున్నారు. దేశీయ మహాసభ యుగమున దీనికి అసంతృప్తియను పేరు కలిగినది. హ్యూము ఈయసంతృప్తి వ్యాపన మత్యవసరమని యెల్లప్పుడును చెప్పుచుండువాడు. ఈ యసంతృప్తి మిక్కిలి యుపయోగకారి. మానవుడు తన ప్రస్తుత స్థితికి సంతసించునెడల అతనిని దానినుండి బయటకు లాగుట కష్టము. కాబట్టియే ప్రతి సంస్కారమునకును అసంతృప్తి ప్రథమాధారము. మన కెప్పుడు వస్తువుపై ననిష్టముజనించునో అప్పుడుకాని మనము దానిని పార వేయము. హైందవులలో ఆంగ్లేయులలో ఉద్దండు లైన వారు వ్రాసిన దానిని చదివిన మీదట మనకు అసంతృప్తి జనించినది. అసంతృప్తి వలన అశాంతికలిగినది. ఈ రెండవది కారణముగ ఎన్ని యోమరణములు ఎన్నియో కారాగృహశిక్షలు, ఎన్ని యో ప్రవాసములు సిద్ధించినవి. అట్టి స్థితి ఇక ముందును కొంత కాలము తప్పదు. అది సహజము. ఇవన్నియు మంచి సూచనలే యగును కాని వీనివలన దుష్టఫలములు కూడ కలుగవచ్చును.