హైందవ స్వరాజ్యము/పదునేడవ ప్రకరణము

పదునేడవ ప్రకరణము.

సాత్త్విక నిరోధము.

చదువరి: మీరు ఆత్మబలము, ప్రేమబలము మంటిరే అది యెచ్చటనైనను విజయమందినట్లు చారిత్రక నిదర్శనము లున్నవా? ఏజాతియు ఆత్మబలముచే అభివృద్ధియైన ట్లెచ్చటను చెప్పబడలేదు. పశుబలశిక్ష లేక దుర్మార్గులు దుర్మార్గమును వదల రని నా కింకను నమ్మకమే,

సంపా: కవి తులసీదా సిట్లనుచున్నాడు. “దేహమునకు అహంకారము బీజ మయినట్లు మతమునకు దయాప్రేమలు బీజములు. కాబట్టి మన మెప్పుడును దయను వీడరాదు.” ఇది సశాస్త్రీయము. రెండునురెండు నాలుగను టెంతసంపూర్ణ సత్యమో ఇదియు నంత సంపూర్ణ సత్య మని నానమ్మిక. ప్రేమ యొక్క శక్తి ఆత్మశక్తి, సత్యశక్తితో నైక్యము. నిమేషనిమేషము దానిప్రభావము మనకు దృష్టము. ఆశక్తియే లేనిచో ఈప్రపంచమే యుండదు. మీరు చారిత్రక నిదర్శనము కావలయు ననుచున్నారు. కాబట్టి చరిత్రయనగా నేమో యెరుంగుట యవసరము. గుజరాతీభాషలో చరిత్రకుగల పర్యాయపదము " ఇతిహాస్ ” “ ఇది ఇట్లునడచినది”. చరిత్రకు అర్థము ఇదే యగునేని జరిగినసంగతు లెన్ని యో చెప్పవచ్చును. కాని చరిత్ర మనగా రాజులయు సార్వభౌములయు కార్యా కార్యములే యనుచో అచ్చట ఆత్మశక్తి సాత్త్విక నిరోధముల కార్యపరత్వ మేమూలను కానరాదు. గాజులగనిలో వజ్రము వెదుకరాదు. చరిత్ర యనగా నేడు యుద్ధములచరిత్ర. అందుచేతనే ఇంగ్లీషులో నొకజనోక్తి యేర్పడినది, చరిత్రలేని దేశము, అనగా యుద్ధములు లేని దేశ మని యర్థము, క్షేమదేశము! రాజు లెట్లాడినది వా రొండొరులతో నెట్లు వైరపడినది, వా రొక్కరినొక్కరు ఎట్లు హతము చేసికొనినది చరిత్రలో చక్కగా వర్ణితమయి యున్నది. నిజముగా ఇదియే లోకములో జరుగుపని యైనయెడల లోక మెన్నడో అంతమై యుండును. ప్రపంచకథ యుద్ధములతో ప్రారంభ మగునేని నేటికి ఒక్క మనుష్యు డైనను సజీవియై యుండడు. ఎవ్వరిమీద యుద్ధములు జరిగినవో వారు విశేషముగా నశింపు నందినారు. ఉదాహరణార్థము ఆస్ట్రేలియా ఆదిమనివాసుల నాలోచింపుడు. బయటివారి దాడికి వా రందరు రూపులేక చనినారు. ఒక్కటి జ్ఞాపక ముంచుకొనుడు. ఆ యాదిమనివాసులు ఆత్మశక్తిని వినియోగించ లేదు. తద్వినియోగము చేయని ఆస్ట్రేలియనులుకూడ ఒక్క నాటికి ఆగతియే పట్టవలసి యుందురు. నీట నీదువానికి నీటిగండము తప్ప దనునట్లు కత్తిపట్టువానికి కత్తిగండము తప్పదు. లోకములో ఇంకను ఇందరుప్రజలు బ్రతికియున్నారుగదా! ఇది యేమిసూచించుచున్నది ? లోకనిర్మాణము కత్తులమీద పశుబలముమీద ఆధారపడి యుండలేదు. ప్రేమ సత్యముల మీద ఆధారపడి యున్నది. అందుచేత ఆత్మశక్తియొక్క ఫలమునకు వేరువాదమే అక్కరలేదు. ఇన్ని యుద్ధములు జరిగినను లోకము నిలిచియుండుటే అత్మశక్తికి ప్రేమశక్తికి ప్రబల తార్కాణము. వేన వేలు కోటానుకోటులు జీవించుట ఈ శక్తి ఆధారముగానే జరుగుచున్నది. లక్షలకొలది కుటుంబములలో అహరహము జనించు చిన్న చిన్న పోట్లాట లన్నియును ఈశక్తిమూలకముగనే నిమేషనిమేషమును తీర్మానమగుచున్నవి. నూర్లకొలదిజాతులు శాంతముగా బ్రతుకుచున్నవి. చరిత్రము ఈవిషయము గమనించలేదు. గమనించ జాలదు. . ఈప్రేమశక్తి ఆత్మశక్తుల ప్రచారమును నాటంకపరచునట్టి సంగతులే చరిత్రనామమున బరగుచున్నవి. ఇరువురుసోదరులకు విభేదము కలిగినది. ఒక్కడు తనతప్పు నెరింగి రెండవనానిదయను ప్రేరేపించు చున్నాడు, ప్రేమను ప్రేరేపించు చున్నాడు. ఇరువురకు శాంతికుదిరి కాలము గడుపుచున్నారు. దీని నెవ్వరును వ్రాసియుంచుట లేదు. కాని వీ రిరువురు, ఏవక్కీలు అడ్డపడుటచేతనో మరి యే కారణమున నో, ముష్టియుద్ధమునకు దిగినప్పుడు తత్తుల్య మగు న్యాయ విచారణకు కడంగినప్పుడు వీరివిషయము రచ్చ కెక్కు చున్నది. పత్రికలలో ప్రకటిత మగుచున్నది. ఇరుగుపొరుగు వారి సంభాషణకు పాత్ర మగుచున్నది. చరిత్రలో భాగము కూడ కావచ్చును. కుటుంబములు తెగలసంగతి యెంతో జూతులసంగతియు నంతే. కుటుంబముల కొకస్వభావము జాతుల కొకస్వభావము కలుగు నని వేరుచేయుటకు కారణము కానరాదు. కాబట్టి చరిత్ర మనునది స్వభావస్థితికి కలిగిన విఘాతములకథగాని వేరుగాదు. ఆత్మశక్తి సహజస్థితి కావున చరిత్రకు నెక్కినది కాదు.

చదువరి: మీరు, చెప్పునదిచూడగా సాత్త్వికనిరోధమునకు సంబంధించిన యుదాహరణములు చరిత్రమున లేవనుట స్పష్ట మగుచున్నది. కాబట్టి ఈ సాత్త్వికనిరోధ మనగా నేమో ఇంక కొంచెము విపులముగా నెరుగుట అవసరము. దయచేసి విశదీకరింపుడు.

సంపా: సాత్త్వికనిరోధ మనగా మనవలె స్వకాయమును కష్టపెట్టుటచే స్వాతంత్ర్యముల సంపాదించుటయే. ఆయుధ ధారణోపాయమున కిది ప్రత్యక్షవిరోధి. నామనస్సాక్షికి సమ్మతము కానిపనిని నేను చేయనిష్టపడక నిలుచుట ఆత్మ బలమును వినియోగించుట. ముష్టిబలపద్ధతుల నుపయోగించి ప్రభుత్వము వారిచే నాకు సమ్మతముకాని శాసనమును రద్దు చేయింతునేని అది దేహబలోపాయ మగును. శాసనమునకు నేను లోబడనని తెలిపి అది విధించుశిక్షల ననుభవింతు నేని అది ఆత్మబలోపాయ మగును. దీనికి ఆత్మత్యాగ మవసరము.

అందరును ఇతరులను బాధపెట్టుటకన్న ఆత్మత్యాగము మహోత్తర మని యంగీకరించుచున్నారు. అంతేకాక న్యాయముకాని విషయములలో ఈశక్తి నుపయోగించినను ఉపయోగించువా డొక్కరుడే నష్టపడును. అతనితప్పుమై ఇతరులను బాధపెట్టినవాడు కాడు. ఇదివరలో మానవు లెన్నియోపనులు చేసినారు. అందులో ననేకములు తప్పనుట తరువాత బయల్పడినది. ఏమానవుడును సంపూర్ణత్వమును ఆరోపించుకొనరాదు. ఎప్పుడును తనయభిప్రాయమే సంపూర్ణముగా ననుకరణీయ మనరాదు. ఎవ్వడును ఇదితప్పు ఇది నిజ మని అచలసిద్ధాంతము చేయరాదు. తనయలోచనకు తప్పనితోచినది తనమట్టుకు తప్పే, సందియములేదు. అందు చేతనే తనకు దోష మని తోచినది యెవ్వడును చేయరాదు. అందువలన కలుగుఫలము ఎట్టిదైనను అనుభవింపవలసినది. ఇదియే యాత్మశ క్తికి మూలాధారము.

చదువరి: అట్లైన మీరు శాసనముల నుల్లంఘింతురా ? అది రాజభక్తికి మహావ్యతిరేకము. మనమెల్ల కాలము న్యాయ బద్ధుల మనుకీర్తి గడించినాము. మీరు అతివాదులను మించిపోవున ట్లున్నారు. వారు చెప్పున దేమి ? ఎట్టిశాసనములకును. మనము బద్ధులము గావలెను. అవి చెడ్డవియైనవి యగు నేని వానికర్తలను బలాత్కారముగా నైననుసరే తరిమి వేయవలెను.

సంపా: నేను అతివాదుల మించెదనో లేదో దానితో మన కవసరము లేదు. ఏది రుజుపథమో కనిపెట్టుట మన ధర్మము. తదనుగుణముగా నడుచుకొనుట మనకు కర్తవ్యము. మనము న్యాయబద్ధుల మనుట కర్ణము మనము సాత్త్విక నిరోధుల మనియే. ఏదేనిశాసనము మన కరిష్టమగుచో శాసనకర్తల నెత్తులు బ్రద్దలుకొట్టువారము కాము. మనము దానిని తిరస్కరించి అందువలన కలుగుకష్టముల ననుభవింతుము. శాసనము శిష్ట మైనను దుష్ట మైనను లోబడవలయు ననుట క్రొత్తసిద్ధాంతము. పూర్వ మిట్టిఆలోచనయే యుండలేదు. ఏశాసనములు తమ కసమ్మతములో వానిని తిరస్కరించి ప్రజలు తత్ఫలము ననుభవింతురు. మనస్సాక్షికి విరోధ మగుశాసనములకు లోబడుట పౌరుషవ్యతిరేకము. మతమునకు విరోధము. దాస్యమునకు బునాది. ప్రభుత్వమువారు నన్ను లై తిరుగవలసిన దందు రనుకొందము. మన మట్లు కావింపవలసినదేనా. నేను సాత్త్వికవిరోధినేని వెంటనే అయ్యలారా, మీ యీశాసనము నా కన్వయింపజాల దని వారికి తెలియ పరతును. మనము మనయాత్మలకు మరచిపోయినాము. అడుగుల కెరగుట మన కభ్యాసమై పోయినది. కావున ఎంతటి నీచ శాసనము నైనను శిరసావహించుట కేవగింపకున్నారము. ఎవ్వడు పౌరుషవంతుడో, ఎవ్వని కాయీశ్వరునిభయము దక్క వేరుభయములేదో వాడు ఇతరులకు జంకడు. మానవ నిర్తితశాసనములు వానిని బంధింపవు. ప్రభుత్వమువారుకూడ ఇట్లు బంధితులు కావలెనని మిమ్మును గోరరు. వారు మీ రిట్లుచేయునది యని యెప్పుడును చెప్పుటలేదు. ఇట్లు చేయ రేని ఈరీతిని దండింతుమందురు. శాసనములో వ్రాసినది వేద మనియు లోబడుటే ధర్మ మనియు అనుకొనునంతటి అధోగతి మనకు సంభవించినది. అన్యాయశాసనమునకు లోనగుట పౌరుష విహీనత్వ మనుటను మానవు డెరుంగునేని అన్యు డెంత నిరంకుశాధికారి యయినను ఇతని కాతడు బానిసీ డెన్నడును కాడు. స్వరాజ్యమునకయి యెరుంగదగిన పరమరహస్యం బిదియే.

అనేకు లేదిచేసిన నది స్వల్ప సంఖ్యాకులను బంధింపవ లె ననుట అంధపరంపరత్వము, ఆధ్యాత్మిక వ్యతిరేకము. అనేకుల అపభ్రంశము కొందర వివేకము – వీనికి సంబంధించిన తార్కాణము లెన్ని యైన చూపవచ్చును. ఎల్లసంస్కారములు అనేకులను సంస్కరించుటను కొందరు ప్రారంభించు నట్టివే గదా! దోపిడిగాండ్రగుంపులో దోపిడికి కావలసిన శిక్షణ మవసర మని యభిప్రాయము. అందులో నొక శిష్టుడు జన్మించినాడు. వా డీసిద్ధాంతము నంగీకరింపవలెనా? అన్యాయశాసనముల నైనను అనుకరింపవలె ననుసిద్ధాంత మెంత కాలముండునో అంతకాలము మానవులకు దాస్యము తప్పదు. సాత్త్విక నిరోధియే యీసిద్ధాంతమును త్రుంచగలడు.

పశుబలోపయోగము సాత్త్వికనిరోధ సిద్ధాంతమునకు వ్యతిరేకము. ఏలయందురా ! మనము కోరునది, శత్రువు కోరనిది అతనిచేత బలాత్కారముగా చేయించువార మగుదుము. అట్టి బలాత్కారము న్యాయ మైనయెడల అతడు మన యెడల అదేరీతిని ప్రవర్తించుట న్యాయమే యగును. కాబట్టి సమాధాన మెన్నడును కుదురబోదు. గుడ్డిగుర్రము గానుగ చుట్టు తిరుగుచు “ముందుకు బోవుచున్నాను” అనుకొనుపగిది మనమును కుమ్మరిసారెవలె తిరుగుచు అభివృద్ధి నందుచున్నామని పిచ్చి సంతసమును పొందవచ్చును. తమ మనస్సాక్ష్మికి సమ్మతముకాని శాసనములను అనంగీకారార్హము లని యను కొనువారికి సాత్త్వికనిరోధ మొక్కటియే సాధనము. మరి యన్ని యు అరిష్ట కారణములు.

చదువరి: మీరు చెప్పుదానినిబట్టి యాలోచింపగా బలహీనులకు సాత్త్వికనిరోధము పరమాయుధ మనియు బలవంతులు యుద్ధసన్నద్ధులు కావచ్చు ననియు తోచుచున్న ది.

సంపా: ఇది వట్టియజ్ఞానము. సాత్త్వికనిరోధము అనునది యే ఆత్మశక్తి, అజయ్యము. అట్టియెడ దానిని బలహీనులసాధనం బనిమాత్ర మెట్లాడవచ్చును ? పశుబల సిద్ధాంతమును వా దించువారలలో ధైర్యము తక్కువ. సాత్త్వికనిరోధియం దది యెక్కువ, అపారము. తన కనిష్ట మగుశాసనమును పిరికివా డెప్పుడైనను తృణీకరింపగలుగునా ? అతివాదులు పశుబల పక్షపాతు లందురు. వా రేల శాసనబద్ధతను మాటిమాటికి ప్రకటించుచుందురు? వారిని నే నిందించుట కాదుకాని వా రింకొకరీతిగా మాటలాడుటకె రాదు. ఇంగ్లీషువారిని వెడల గొట్టి, తాము పరిపాలకు లైనప్పుడు, వారు నన్ను మిమ్మును వారిశాసనములకు దాసులు కావలసిన దని కోరగలరు. వారి రాజ్యాంగాభిప్రాయమున కది తగినదియే. ఫిరంగి యెదుట బెట్టి ప్రాణములుతీసినను సరియే తన కనిష్ట మైనశాసనమును తా నంగీకరించుట లేదని సాత్త్వికనిరోధి నిలువంబడగలడు.

మీ యభిప్రాయ మేమి ? ఎవ్వడు ధైర్యముకలవాడు ? ఫిరంగివెనుక దాగికొని ఇతరులపై గుండుప్రేల్చి చంపునట్టి వాడా? హసన్ముఖముతో ఫిరంగినుండి వెలువడుగోళము నెదుర్కొని ప్రాణము లర్పించువాడా? ఎవ్వడు వీరుడు ? ' కాలుని పరమమిత్రునిగా భావించువాడా? ఇతరులప్రాణముల తనవశము చేసికొనువాడా? పౌరుషము ధైర్యములేనివా డెవ్వడును సాత్త్వికనిరోధి యెప్పటికిని కాజాలడు. దేహబల మెక్కువగా లేనివాడుకూడ సాత్త్వికనిరోధి కావచ్చును. ఇది నా కంగీకారమే. ఒంటరియై ఈ నిరోధము నెరపవచ్చును. కోట్లతోగూడియు నెరపవచ్చును. పురుషులు స్త్రీలు అను విభేదము నిందు లేదు. ఇందులకు సైనికశిక్షణ మక్కరలేదు. జియుజిట్సు అక్కర లేదు. మనమును నిగ్రహించుశక్తిమాత్ర మవసరము. అది కలిగెనేని మానవుడు పురుషసింహ మగును. అతని చూపుమాత్రన శత్రువు భయకంపితుడు కావలసి యుండును.

సాత్త్వికనిరోధము అనేకధారాయుత ఖడ్గము. ఎట్లు కావలసిన నట్లు దానిని త్రిప్పనగును. ఎవ్వ డుపయోగించునో వానిని, ఎవ్వనిపై ఉపయోగింపబడునో వానిని, ఇరువురనుగూడ నీఖడ్గము పవిత్రముచేయును. ఒక్క బిందువు రుధిరము చిందింపక యియాయుధము మహత్తమఫలములను సంపాదించును. సాత్త్వికనిరోధులలో పోటీ వైచికొనినను పరాజయ మందువా రుండరు. సాత్త్వికనిరోధఖడ్గమునకు వరయు నక్కర లేదు. ఇట్టి మహాయుధమును బలహీనులయాయుధ మని మీరు వర్ణించుట చిత్రముగానేయున్నది.

చదువరి: సాత్త్వికనిరోధము భారతభూమికి ప్రత్యేక సాధన మంటిరి. ఈ దేశమున ఫిరంగు లెప్పుడును ఉపయోగించ లేదా?

సంపా: మీయభిప్రాయమున భారతభూమియనిన నిచ్చటి కొన్ని రాజనంశములనుటగా నున్నది. ఏకోటానుకోటి ప్రజ పై ఆరాజవంశములును మనమును ఆధారపడియున్నామో ఆకోటానుకోటి ప్రజయే నామానసమున భారతభూమి. రాజులు ఎప్పుడును రాజసాయుధములను వినియోగింతురు. పశుబలదీక్ష వారికి పట్టినది. వారు అధికార మొనర్ప నాలోచింతురు. అయిన అధికారమును శిరసా వహించువారలకు ఫిరంగు లక్కర లేదు. ఈ రెండవ తెగవారే లోకమున మహ త్సంఖ్యాకులు. వీరు దేహబలమో ఆత్మబలమో అభివృద్ధి చేయవలసియుందురు. దేహబల మభివృద్ధిచేయుచోట పరిపాలితులు పరిపాలకులు అందరు మతి భ్రష్టు లగుదురు. ఆత బల మభివృద్ధి చేయుచోట రాజులయాజ్ఞలు వారికత్తి మొనలదాటి వ్యాపింపవు. ఏలయన, నిజపౌరులు అన్యాయాజ్ఞల నుల్లంఘింతురు. రైతుల నే ఖడ్గమును లోబరచుకొని యెరుగదు. ఇకముందును లోబరుచుకొన జాలదు. వారికి ఖడ్గ ముపయోగించుట తెలియదు. ఇతరు లుపయోగించిన వారికి భయము లేదు. జాతస్యమృత్యుం ధృవ మ్మని కాలుని తలగడగా నిడి ఏజాతి ప్రవర్తించునో అది యుత్తమజాతి. కాలుని గణింపని నాడు భయమునకు తావే లేదు. పశుబలము యొక్క పంచ రంగులను పవిత్రముగా నెంచి మోహితులైనవారి కీవర్ణన మననార్హము. నిజ మేమన. భారతభూమిలో జీవితశాఖల నన్నింటను ప్రజ సాత్త్వికనిరోధము నవలంబించియే యున్న ది. పరిపాలకులు మన కనిష్ట మగు కార్యములను చేసినప్పుడు మనము వారి కలసి పనిచేయుట లేదు. ఇదియే. సాత్త్విక నిరోధము. చిన్న సంస్థాన మొకటి కలదు. దాని యధిపతి యొక యాజ్ఞ పాలించెను. ఇది ప్రజలకు సమ్మతము కాలేదు. నాకు వెంటనే గ్రామమువదలి వలసపో నారంభించిరి. అధిపతి క ధైర్యము పుట్టెను. ప్రజలక్షమాపణను ఆతడు ప్రార్థించెను. తనయాజ్ఞ నుపసంహరించుకొనెను. ఇది నాజ్ఞాపకమున జరిగినసంగతి. ఇట్టి ఉదాహరణములు భారతచరిత్రమున నెన్ని యైనను కలవు. సాత్త్వికనిరోధము ప్రజలకు మహామంత్రముగా ఏర్పడినచోటనే నిజ మగు స్వరాజ్యము సాధ్యము. మరి యేసందర్భము పొసంగినను అది పరిపాలనయే కాని స్వరాజ్యము కాదు

చదువరి: అట్లైన కాయమును పోషించి శిక్షించుటయే యనవసరమా యేమి?

సంపా: అట్టిది నేనేమియు చెప్ప లేదు. కాయము శిక్షితమైనగాని సాత్త్వికనిరోధి యగుటకు వీలు లేదు. లౌల్యముచే డీలుపడినదేహము నాశ్రయించుమానసము బలవంతము కా జాలదు. మనోదౌర్బల్యము ఆత్మదౌర్బల్యమునకు కారణము. కాబట్టి బాల్యవివాహముల మానుటచేతను విషయలౌల్యమును వీడుటచేతను దేహపటుత్వము సంపాదింపవలసియుందుము. ఒక్కి కట్టెను ఫిరంగిగుండున కెర కమ్మని నే ప్రోత్స హింతునేని లోకమంతయు నను నవ్వుదురు. చదువరి: మీమతానుసారము సత్యాగ్రహియగుట సుసాధ్య ముకాదు. అందు కేమార్గ మవలంబనీయమో దయచేసి చెప్పునది.

సంపా: సత్యాగ్రహి యగుట సులభమే. మిక్కిలి కష్టంబును నగు. పదునాలు గేండ్ల పసిబాలుడు సత్యాగ్రహియగుట నే నెఱుంగుదు; అదేరీతిని రోగపీడితులును నైనారు; బలిష్టులును సుఖులును నైనవా ర నేకులు కాలేకపోయిరి. అనుభవముమీద నా కొక్కటి స్పష్ట పడినది. దేశ సేవకై సత్యాగ్రహ మవలంబించువారు బ్రహ్మచర్యవ్రతనిష్ఠులై, దారిద్ర్య వ్రతగరిష్ఠులై, సత్యదీక్ష ప్రవర్తకులై, నిర్భయగుణ భరితులు కావలెను. బ్రహచర్యము, వ్రతనిష్ఠ, లేక మానసమునకు అవసరదార్ఢ్యము కలుగదు. విషయలోలుడు పతితుడై పౌరుషవిహీనుడై ధైర్యదూరు డగును. మహాప్రయత్నమున కనర్హుఁ డగును. అనేకోదాహరణములచే దీనిని దృఢ పరుప వచ్చును. అయిన వివాహితు డేమిచేయవలె ననుప్రశ్న తోచకపోదు. అది తోచవలసిన యవశ్యము లేదు. భార్యా భర్తలు తమమోహముల దీర్చుకొనునప్పుడు అది పశుప్రాయము కాకపోదు. సంతానవృద్ధికి దక్క ఈలౌల్యము నిషేధము. సత్యాగ్రహి ఈ కొద్దిపాటి యనుభోగమునుగూడ జింపవలసి యుండును. అతడు సంతానాభివృద్ధినిగూడ కోరడు. కాబట్టి వివాహితు డైనవాడును బ్రహ్మచారిగ నుండనగు ఈవిషయము దీర్ఘతరముగ విమర్శింపరాదు. ఇం దెన్ని యొ పిల్ల ప్రశ్నలు పుట్టక తప్పదు. భార్య నేమిచేయవలెను ? వెంట మోసికొని పోవచ్చునా ? ఆమెకు గలహక్కు లేవి ? ఇత్యాదులు. మహత్కార్యనిమగ్ను లీవిషయములకు సమాధానము నిశ్చయించుకొనవలసి యుందురు.

బ్రహ్మచర్యమున కవసర మున్నయట్టులే దారిద్ర్యదీక్షకును అవసర మున్నది. ద్రవ్యాకాంక్ష సత్యాగ్రహము రెండు నేకస్థలమున నుండజాలవు. ద్రవ్యము కలవారు పారవేయ వలయు నని కాదు ఇందు కర్థము. దానిని గురించి వారు ఉదా సీనులై యుండవలెను. తుది దమ్మిడీవరకు పోయినను సిద్ధపడ వలసినదే కాని సత్యాగ్రహముమాత్రము వీడరాదు.

మనవివరణములో సత్యాగ్రహము సత్యశక్తి యని నాము. అందుచేత సత్య మనుకరణీయము. ఎంతటినష్టము కలిగినను సత్యము వీడరానిది. ప్రాణనష్టము కలుగ నున్నప్పుడు మొదలైనవేళల ననృత మాడరాదా యను మున్నగుప్రశ్న లిచ్చట పొడగట్టును కాని అనృతమును సూనృతము చేయ దలచువారే యీవిమర్శకు దిగుదురు. ఎల్లప్పుడు సూనృతము పాటింప నెంచువారల కిట్టిస్థితులు సంప్రాప్తమే కావు. అయినను, వారికి అసంబద్ధకార్యములు తటస్థించవు.

నిర్భయమానసము లేనిది సత్యాగ్రహ మొక్క యడుగైనను, పెట్టజాలదు. ఆ స్తి యని, గౌరవ మని, బందుగు లని, పరి పాలకు లని, అపాయము లని, మృత్యు వని భయ మందువారికి సత్యాగ్రహము నహి.

కష్ట సాధ్య మని సత్యాగ్రహము వీడరాదు. ఎంతటికష్టము వచ్చినను మనము చేసికొనినది కానిచో భరించు మహత్తమ శక్తిని దైవము మనకు ప్రసాదించినాడు. దేశసేవయే పరమావధిగా లేకున్నను ఈ సత్యాగ్రహగుణ మలవడచేసి కొనుట యావశ్యకము. ఆయుధధారులు కా నెంచువారు కూడ సత్యాగ్రహగుణములు సంపాదించియే కావలెను. ఆ లోచనమాత్రన ఆగర్భశూరు డెవ్వడునుకాడు. వీరుడు కా దలచువాడు బ్రహచర్యము ననుష్ఠింపక దప్పదు. దారిద్ర్య వ్రతము నంగీకరింపక తీరదు. నిర్భయవిరహితు డగువీరుడు గగనకుసుమమువంటివాడు. అతడు సత్యవాదియే కావలయు ననునిశ్చయము లేదందురేమో. ఎప్పుడు నిర్భయమానసుడో అప్పుడు మానవుడు రుజుప్రవర్తకు డగును. ఏదోయొకరూపమున భయ మావేశించిననేకాని మానవుడు సత్యమును వదలడు. పై చెప్పిన నాలుగుగుణములసంపాదన మందుచేత నెల్లరకు అవశ్యకర్తవ్యము. ఎవ్వరును తత్పథమునకు నెరవ నవశ్యము లేదు. పశుబలపక్ష పాతికి ఈ గుణములతోడంగూడ ఇంక నెన్ని యో వ్యర్థగుణము లవసర మగును. సత్యాగ్రహి వానిం గోరడు. అంతియగాదు. ఖడ్గధారి అవలంబించు ఇతర గుణము లన్నియు పాక్షిక భీతి యుండుటచేతనే ఆవశ్యకము లగుచున్న వనుటయు స్పష్టమే. ఎప్పుడు భయమువీడునో అప్పుడు ఖడ్గ మాతనిచేతిని వదలిపోవును. దానిసహాయ మతనికి ననావశ్యము. వైరకల్మషము లేనివానికి ఖడ్గముతో పనిలేదు. ఒకానొకమనుష్యుడు దారినడచుచున్నాడు. అతని చేత కఱ్ఱ యున్నది. ఆకస్మికముగా సింహ మెదురుపడినది. నిరాలోచనమై ఆత్మసంరక్షణకై కఱ్ఱ నెత్తినాడు. ఆనిమేషముననే యొక భావ మాతని మనోవీథిని తోచినది. ధైర్యము లేకున్నను ధైర్య మున్నట్లు దంభములాడుకొని యుండుట స్మరణకు వచ్చినది. వెంటనే అతడు కఱ్ఱను క్రింద పడవైచినాడు. భయము పారిపోయినది.


___________