హైందవ స్వరాజ్యము/పదునెనిమిదవ ప్రకరణము

పదునెనిమిదవ ప్రకరణము.


విద్య.

చదువరి: ఇంత మాట్లాడితిమి. ముఖ్యమైనది విద్య. దాని సంగతి రాలేదు. బడోదా గైక్వాడు మహారాజు నిర్బంధోచిత ప్రారంభవిద్య పెట్టినాడు. మే మంద రాతనిని పూజించుచున్నాము. ఇదంతయు వ్యర్థమేనా.

సంపా: మహారాజు ఉత్తమోద్దేశమువాడు. కాని ఈ విద్యవలన ఫలముమాత్ర ముండదు.

విద్యయనగా అక్షరజ్ఞాన మగునేని అది యొకసాధనము. దానిని సద్వినియోగము చేయవచ్చును. దుర్వినియోగమును చేయవచ్చును. దుర్వినియోగము నే డెక్కువగనున్నది. కావున ఎక్కువగా నష్టముకలిగిన దనియే చెప్పతగియున్నది.

పిల్లలకు చదువు, వ్రాత, లెక్కలు నేర్పిన, అది విద్య యనుకొనుచున్నాము. రైతు కష్టపడి న్యాయముగా జీవనము చేయుచున్నాడు. సామాన్యలోకవ్యవహార మతనికి తెలుసును. అయిన అక్షరములు వ్రాయుటమాత్ర మతనికి రాదు. అక్షరములు నేర్పి అతనికి ఎక్కువ మ రేమి కలుగ జేయుచున్నారు. ఆతనిసౌఖ్యమున కొక్కలవము పెంపు గల్గింపగలరా? అనవసరాసంతుష్టిని పెంపొందించుటయే గదా! దానికిగూడ నిప్పటివిద్య వలంతికాదు. పాశ్చాత్య నాగరికమోహముచే మన మీవిద్యను పట్టుకొని పెనగు చున్నాము.

ఉత్తమవిద్య యనునదియు మిథ్యయే. నేను భూగోళశా స్త్రము, ఖగోళశాస్త్రము, గణితశాస్త్రము, బీజగణితము, రేఖాగణితము అన్నియు నేర్చితిని. వీనిని నేనేమి యుపయోగించినాను? అవి యెందుకు పనికివచ్చినవి ? హక్‌స్లీపండితుడు విద్య నిట్లు వర్ణించినాడు. సంకల్పమున కనుగుణముగ సంతసమున సేవయొనర్చు శరీర మలవడునట్లు ఏవాడు బాల్యమున శిక్షనందినవాడో ఎవ్వనిబుద్ధి కుశాగ్రమయి శాంతమయి తేట యయి ప్రకాశించునో ఎవ్వనిమానసము స్వభావసిద్ధసూత్రముల గ్రహించినదో ఎవ్వనియింద్రియములు సుశిక్షతములైన మనస్సాక్షికి నిరంతర మడకువతో ప్రవర్తించునో ఎవ్వడు ఎల్ల నైచ్యమును నిరసించి ఇతరునింగూడ తన్ను బోలె గారవించునో వాడే విద్యావంతుడు.

ఇట్టివిద్య మన ప్రాథమికవిద్యాపద్ధతిలోను కానము. ఉత్తమవిద్యలోను కానము.

చదువరి: మీయుత్తమవిద్య మీకు ఫలమునియ్యనిచో ఇంతదూరము మీరు నాకు విమర్శించి చెప్పియుండజాలరు.

సంపా: నాకు ప్రాథమికవిద్యగాని ఉత్తమవిద్య కాని మా పెద్దలు నేర్పనియెడల నాజీవనము చెడిపోయి యుండజాలదు. ఆడినంతమాత్రన కార్యము సాధించుట కాదు. ఈమాట లైనను మీకు చెప్పగలనేకాని దేశములోని కోట్లసంఖ్యాక మగు సోదరబృందమునకు చెప్పలేను. మన విద్యాపద్ధతిని ఖండించుటకు ఇదియే చాలును. దానిలోపములనుండి వీడ్వడినానని నాతలంపు కావున మీకును నామార్గ ముపదేశంప తల పెట్టినాను.

అక్షరజ్ఞాన మంతట పనికిరా దనరాదు. అయిన దానినే పెద్దచేసి శరణ్య మనరాదు. అది కామధేనువుగాదు. మన ప్రాచీనవిద్యాపద్ధతి మంచిది. దానిలో శీలనిర్మాణము ప్రధమాంగము. అదియే నేర్పదగిన ప్రథమవిద్య. దానిపై కట్టు హర్మ్యము ఉత్తమస్థితము. నేటివిద్య గడించి దానికి రంగు పెట్టవచ్చును.

చదువరి: ఐన ఇంగ్లీషువిద్య అనవసర మని మీరందురా ?

సంపా: అవసరము, అనవసరము రెండును. కోట్లప్రజకు ఇంగ్లీషునేర్పుట వారిని దాస్యమున వేయుట. మెకాలే ప్రభువు మనవిద్యకువేసిన బునాదులు మనలను దాసులం జేసినవి. అతనియుద్దేశ మది కాకపోవచ్చును. ఫలముమాత్రము తప్ప లేదు. స్వరాజ్యమునుగురించి మాట్లాడుటకుకూడ మన కింగ్లీషే కావలసివచ్చినది. అది సిగ్గుమాలినస్థితి కాదా?

ఇక మనవిద్యాపద్ధతు లందురా సీమలోవా రేకాలముననో త్యజించినవి మనకు నే డమృతప్రాయములు. ముఖ్యమంత్రి లాయడుజార్జివేల్సుపిల్లలు వెల్గుభాష నే అభ్యసింపజేయ ప్రయత్నించుచున్నారు. మనగతి ? పత్రికలకు, సభలకు, ఉత్కృష్ట భావప్రకటనకు, తుదకు జాబులకు అన్నిటికి ఇంగ్లీ షే. ఇట్లే జరుగుచుపోయిన యెడల అచిరకాలములోనే మనసంతతివారు మనల శపించవలసి యుందురు.

నేను బారిస్టరు. కోర్టులో నే నింగ్లీ షే మాట్లాడవలె. నా ఇంగ్లీషును ఇంకొకరు నా మాతృభాషలోనికి తర్జుమా చేయవలసి యున్నది. ఇది దాస్యముకాదా? దీని కెన రుత్తర వాదులు? ఇంగ్లీషువారు కాదు. మనమే. భారతజాతిశాపములు వారికి దగులవు. మనకు తగులును.

ఈ ప్రశ్నకు అవును కాదని రెండురీతులు ప్రత్యుత్తర మిచ్చితిని. కాదనుటకు కారణములు నిరూపించితిని. ననుటకును కారణములను దెల్పెద. మనకు ఇప్పటి నాగరికము మిక్కిలి ఎక్కువగా పట్టుపడినది. కాబట్టి ఇంగ్లీషులను వెంటనే వీడిపోదు. ఇంగ్లీషువారు తమనాగరకము యెంత ఏవగించుకొనునది ఎరుంగుటకును ఇంగ్లీషు అవసరము ఇంగ్లీషుమూలకముగా ద్రవ్య మార్జింపవలె నను దురాశ త్రము మానితీరవలెను. ఇప్పు డింగ్లీషు నేర్చినవారు తమసంతతులకు జీవరహస్య జ్ఞానము నంతయు దేశభాషలమూలకముగా నేర్పవలెను. వారు పెద్దలైనప్పుడు ఇంగ్లీషు నేరువవచ్చును ఇట్లు మితముగా నేర్చుటలో కూడ ఏవిషయ మభ్యసనీయము ఏవిషయము కాదు, ఏశాస్త్రము అవసరము ఏశాస్త్రము కాదు అనువిషయము లాలోచింపవలసి యుందుము. ఇంగ్లీషు పట్టములకు మన మెప్పుడు ఆశింపమో అప్పుడే మనపరిపాలకులు గాఢాలోచనపాలు గావలసియుందురు.

చదువరి: అయిన మన మేవిద్య నేరువవలెను ?

సంపా: మనభాష లన్నిటిని అభివృద్ధిచేయవలెను. ఇంగ్లీషులోని ఉత్తమగ్రంథములను ఇందులోనికి వ్రాయవలెను. శాస్త్రములన్ని నేర్చెద మనునటమును మానవలెను. నీతిమత బోధకు అగ్రస్థాన మీవలెను. విద్యావంతు డగుప్రతి హైందవుడు తనదేశభాష నెరుంగుటతోడగూడ హిందీ నేరువవలెను, దానితో గూడ హిందువైన సంస్కృతము, మహమ్మదీయుడైన అరబ్బీ అభ్యసింపవలెను. కొందరు హిందువులు అరబ్బీ నేర్చుటయు కొందరు మహమ్మదీయులు సంస్కృతము నేర్చుటయు అవసరము. హిందీ సామాన్యభాష కావలెను. దానికి లిపి నాగరీ పారసీలు ఇష్టానుసారము వాడవచ్చును. హిందూ మహమ్మదీయ సోదర భావము వృద్ధియగుటకు రెండులిపులును వాడుట యుత్తమము. ఇది చేయగలమేని ఇంగ్లీషుభాషను బహుత్వరలో ముఖ్యస్థానమునుండి కదల్చి వేయవచ్చును. బానిసలగు మనకు ఇదియంతయు నవసరము. మన బానిసము మన దేశ మంతయు బానిసమైనది. మన స్వాతంత్ర్యముతో దేశమంతయు స్వతంత్రము కాగలదు. చదువరి: అయినను దానిం దక్క మన మేమియు చేయ జాలము. భారతభూమి ఏనాడును దైవమును త్యజించునది కాదు. నాస్తిక మిచ్చట పెచ్చు పెరుగజాలదు. కార్యము కష్టతమము. మతవిద్యనుగూర్చి యాలోచించినచో తల తిరుగుచున్నది. మన మతాచార్యులు దంభోపేతులు, స్వార్థపరులు, వారిని మనము వినియోగింపవలసియుండును. ముల్లాలు, దస్తూరులు, బ్రాహ్మణులు మతవిద్యకు ధర్మకర్తలైయున్నారు. వారు జాగ్రత్తపడి ధర్మమునెరవేర్చ రేని ఇంగ్లీషువిద్యచే మనకు గలిగినశ క్తిని తత్కార్యసాధనకు నియోగింతుము. మత మను మహాసముద్రగర్భము గంభీరముగ నే యున్నది. భూస్పర్శగల యలలుమాత్రము కలుషితములై యున్నవి. ఈయలలు మనము. కోటానుకోట్లు ప్రజ అకలుషితులు. మనము హైందవత్వము నందవలెను. పాశ్చాత్యనాగరకమును తరుమవలెను. మన పరిణామమున అభివేద్ధి, లోపములు, దోషములు, అపాయములు కలుగనచ్చును. కాని ముక్తిమాత్రము కరతలామలకము.