హైందవ స్వరాజ్యము/ఐదవ ప్రకరణము

ఐదవ ప్రకరణము.


ఇంగ్లండు స్థితి.


చదువరి: మీమాటలను బట్టిచూడగా ఇంగ్లండు పరిపాలన పద్ధతి మంచిది కాదనియు కాబట్టి అనుకరణీయము కాదనియు మీయభిప్రాయమైనట్టు తోచుచున్నది.


సంపా: మీయనుమానము సకారణమే. ఇంగ్లండుస్థితి నేడు కరుణాస్పదము, భారతభూమి కట్టిస్థితి యెన్నడు రాకుండును గాకయని నేను ప్రార్థించుచున్నాను, రాజ్యాంగ సభలకు మాతృకయని మీరెంచునట్టిది గొడ్డుపోతు, అభిసారిక. ఈ రెండును కఠినోక్తులుగా దోచవచ్చును. కాని యవి మిక్కిలి యుచితములు. ఆ రాజ్యాంగ సభ స్వేచ్ఛగా ఇదివర కొక్క మంచి పనిచేసి యెరుగదు. కాబట్టి గొడ్డుపోతంటిని. ఆ రాజ్యాంగ సభ యొక్క, స్వభావము చిత్రముగా నేర్పడినది. బయటనుండి యొత్తిడి పెట్టక అది ఒక్క పనికూడ చేయదు. అభిసారికయని యేలయంటిననగా దానిని భరించుమంత్రులు నేడొక్కరు, రేపొక్కరు. నేడు ఆస్క్విత్తుగారు, రేపు బాల్ఫరుగారు.


చదువరి: మీరు గొడ్డుపోతని ఛలోక్తిగ చెప్పినారు. అది ఈ రాజ్యాంగ సభకు అన్వయింపదు. ప్రజలు ఈసభను ఎన్ను కొనుచున్నారు. ప్రజాభిప్రాయపు ఒత్తిడి కిది లోబడుచున్నది. ఇది దీనిగుణము.


సంపా: మీరు పొరబడుచున్నారు. ఇంక కొంచెము సవిమర్శగా ఆలోచింపుడు. ప్రజలు ఉత్తములను ఏరుకొందురని యనుకొందుము. సభ్యులు ఉచితముగా పనిచేయుదురు. కాబట్టి ప్రజాహితమునకే చేయుదురని యెరుంగవలెను. నిర్వాచకులు విద్యగలవారు. కాబట్టి వారు నిర్వచనములో సామాన్యముగా తప్పులు చేయ రనుకొనవలెను. ఇట్టి రాజ్యాంగ సభకు అర్జీలు మొద లైన యొ త్తిడి యవసరముండరాదు. దాని కార్యసరణి సరళముగా నడిచిపోయి తత్ఫలము దినదినము సువ్యక్తము కావలసినదే. కాని నిజమరయుదము. సాధారణముగా సభ్యులు స్వార్థపరులని కపటభావులని అంగీకృతమయియున్నది. అందులో ప్రతివాడును తన లాభాలాభములే ఆలోచించును. న్యాయముగా ప్రవర్తించుటకు ఉద్దీపకము అట్టివారికి భయము. అందుచేత నేడు చేసినది రేపు మారుచ్పుడును. ఒక్క సంగతి లోనైనను, ఇది దీనికి కడపటి స్వరూపము అని చెప్పుటకు రాదు. అతిముఖ్యములైన విషయములు చర్చలో నున్నప్పుడు కూడ ఈ రాజ్యాంగ సభ సభ్యులు కాళ్లు చాచుకొని నిద్రించుట సహజమైనది. ఒకొక్కప్పుడు వినువారికి ఏనుగుకలుగునట్లుగా సభ్యులు చేంతాడు ఉపన్యాసములు చేయుటయుకలదు. కార్లై లను సుప్రసిద్ధాంగ్లేయ గ్రంథకారుఁడు ఈ రాజ్యాంగసభను ప్రపంచమున కంతటికిని మాటలమారిదుకాణమని వర్ణించినాడు. సభ్యులు సమ్మతి యిచ్చునప్పుడా? ఆలోచన యేమియు చేయరు. తమకక్షువా రెట్లు కోరిన నట్లేయందురు. అది కక్షశిక్షణయట. ఏసభ్యుడైనను కాదని స్వతంత్రముగా తనసమ్మతి నిచ్చెనా అతడు తనవర్గమునకు ద్రోహచింతకుడుగా గణింప బడుచున్నాడు. రాజ్యాంగ సభలో నష్టమగుకాలమును ద్రవ్యమును ఎవరో కొందరు శిష్టుల చేత పెట్టినఎడల ఇంగ్లీషుజాతి యీనాటి కింకను నెంతో ఉచ్చతర స్థితియందుండి యుండును. ఈ రాజ్యాంగ సభ ఇంగ్లీషు జాతివారు పెట్టికొనిన దండుగవ్యయపుబొమ్మలాట. ఈయభిప్రాయములు నాయొక్క నివే యనుకో బోకుడు. గొప్ప ఇంగ్లీషు భావజ్ఞు లీరీతిని నుడివియున్నారు. ఆరాజ్యాంగ సభలోని సభ్యుడొక్కడు క్రైస్తవుడెవ్వడును ఆసభలో సభ్యుడుకా వీలులేదని ఇటీవలనే వాకొనియున్నాడు. మరియొకడు ఈసభను వట్టిశిశువుగా వర్ణించినాడు. ఏడునూరేండ్లిది శిశువుగానున్న, దీని కెప్పుడు యౌవనముకలుగునో యెవరు చెప్పగలరు?


చదువరి: మీరాలోచన పురికొల్పినారు. మీరు చెప్పినదంతయు వెటనే యుగీకరింప మనరుగదా! క్రొత్తక్రొత్త భావ మార్గములను వారు సూచించుచున్నారు. నాకవి శల్యగతము కావలసియుండును. "అభిసారిక" యనుటలో మీభావమేమో తెలుపుదురా?


సంపా: మీరు నాయభిప్రాయములను వెంటనే యంగీకరింపకుండుట న్యాయమే. ఈ విషయమున ప్రకటితమైన వాజ్మయము మీరు చదివినచో దీని సంగతి మీకు తెలియును. ఇంగ్లీషు రాజ్యాంగ సభకు నాథుడు లేడు. ముఖ్యమంత్రి హయాములో దాని బ్రతుకు తిన్నగా నడువదు. అభిసారిక బ్రదుకుబోలె అటునిటు డోలాయిత మగుచుండును. ముఖ్యమంత్రికి ముఖ్యోద్దేశము తనయధి కారమే, రాజ్యాంగ సభ యొక్క మేలుకాదు. అతని శక్తియంతయు తనకక్ష వారివిజయమును సంపాదించుటకే వ్యయపడుచున్నది. కాబట్టి రాజ్యాంగ సభ ధర్మ మొనర్చుచున్నదా యనుట యతని కంతగా నవసరముండదు. కొందరు ముఖ్యమంత్రులు తమకక్ష యొక్క లాభమునుకోరి రా జ్యాంగ సభ చే ఎట్టికార్యమునేని చేయించిర నుటకు ఆధారము కలదు. ఇదంతయు ఆలోచనీయము.


చదువరి: ఇదివరలో మన మెవరెవరు దేశభక్తు లనుకొను చుంటిమో యెవరెవరు ధర్మపరులను కొనుచుంటిమో వారినే మీరు తూలనాడుచున్నారు.


సంపా: అవును నిజమే. ముఖ్యమంత్రులపై నాకు ద్వేషమేమి లేదు. కాని నేను చూచిన దానినిపట్టి వారు నిజముగా దేశాభి మానులు కారని యోచింపవలసివచ్చుచున్నది. సామాన్యముగా లంచము తీసికొననివాడు ఇయ్యనివాడు ధర్మపరు లనుకొందు రేని వీరు ధర్మమార్గానువర్తు లనుకొనవచ్చును. అయినలంచ ములకంటె సూక్ష్మతరమగు ప్రోద్బలములు లేక పోలేదు. తమ కార్యములను సిద్ధింపచేసికొనుటకు వారితరులకు బిరుదములను లంచములిచ్చుట సామాన్యముగానున్నది. వారియందు నిజమైన ధర్మపరతకాని కళాసహితంబగు అంతరాత్మకాని లేదని నేను స్పష్టముగా చెప్పగలను.


చదువరి: మీరు రాజ్యాంగ సభనుగురించి ఇట్టి భావములు చెప్పుచున్నారే. ఇంగ్లీషు ప్రజనుగురించి యేముందురు? అప్పుడు వారి ప్రభుత్వమును గురించి ఆలోచించుకొందును.


సంపా: ఇంగ్లండులోని నిర్వాచకులకు వారి వార్తాపత్రికలే వేదగ్రంథము. వారు వీని ననుసరించి తమయభిప్రాయములను తీర్చుకొనుచున్నారు. పలుమారు ఈ పత్రికలు అబద్ధములు వ్రాయును. ఒకేవిషయమును ఇవెల్లయు తమతమకక్ష యొక్క లాభమునకు అనుకూలించనట్లు వేరు వేరురంగులతో చిత్రించును. గొప్ప యింగ్లీషునాయకుని నొక పత్రిక మహాసాధువని ఆకసమునకు పొగడును. అతనినే మరియొక పత్రిక అన్యాయము యొక్క అపరావ తారముగా నిశ్చయించును. వార్తాపత్రికలీ స్థితియందుండవ లెనన్న ప్రజల స్థితి యెట్లుండవలెను?

చదువరి: అది మీరే వర్ణింపుడు.


సంపా: ఈప్రజలు అభిప్రాయములను మాటికి మాటికి మార్చుకొందురు. ఏడేండ్లకొకమారు మార్పెదరని ప్రతీతి. గడియారములోని గంటముమాదిరి వీరి యభిప్రాయములు ఎల్లప్పుడు చలించుచ్పుడునే కాని ఒకప్పుడును నిలుకడనండవు. మంచివక్తగాని మంచి విందులిచ్చు గృహస్థుగాని దొరికినచో అతని వెంబడి వీరు పరువు లెత్తుదురు. ప్రజలెట్లో పార్ల మెంటు (రాజ్యాంగసభ) అట్టులే. అయిన వీరిలో ఒక్క గుణముమాత్రము, బహుచక్కగా వృద్ధియయినది. తమ దేశము మాత్ర మెప్పుడు పరుల పాలు కానీరు. ఎవ్వరైనను దానిపై కన్నలు వేసిరా వెంటనే ఆకండ్లను పెరికి పార వైతురు. అంతమాత్రముచేత ఆజాతికి తక్కిన యన్ని సద్గుణము లున్న వని కాని వారిని మనము అనుకరింపన లెనని కాని తలంపరాదు. ఇంగ్లండును భారతభూమి అనుకరించు నేని నాశము తప్పదని నా యభిప్రాయము.


చదువరి: ఇంగ్లండు యొక్క ఈ స్థితికి ఏమి కారణమందురు?


సంపా: ఇంగ్లీషువారిలో ప్రత్యేక లోపమేమియు లేదు. ఈ స్థితి నవీన నాగరకమువలన జనించినది. దానివలన యూరపులోని జాతులు దినదినము అధోగతిపాలయి నశించు చున్నారు.