హరివంశము/ఉత్తరభాగము - నవమాశ్వాసము

శ్రీరస్తు

హరివంశము

ఉత్తరభాగము - నవమాశ్వాసము

     కీర్తివిభవవిజయో
     త్సేకసుఖవదాన్యతావిశిష్టైశ్వర్యా
     వ్యాకాంక్షాయోగ్యార్ధస
     మాకలనగుణాభిరామ యన్నయవేమా.1
వ. అక్కథకుండు శౌనకాదిమహామునులకుం జెప్పె నట్లు హరివంశం బాకర్ణించి
     నైమిశారణ్యవాసు లగు తాపసోత్తములు రోమహర్షణపుత్రు నభినందించి.2
క. జనమేజయునకు నెందఱు, తనయులు చిరకాల ముర్విఁ దద్వంశము గ
     ల్గె నెఱింగింపు మనిన ని, ట్లను నుగ్రశ్రవసుఁ డమ్మహాద్విజతతికిన్.3
క. వినుఁడు వపుష్టమయం బా, జనమేజయనృపతి గనియెఁ జంద్రాపీడుం
     డన సూర్యాపీడుం డనఁ, జనుతనయుల నిద్దఱం బ్రశస్తచరితులన్.4
వ. అం దాచంద్రాపీడునకుం బుత్రులు నూర్వురు జనియించి యనేకవంశంబులు
     సృజియించి రందఱుకుఁ బెద్దవాఁ డగు సత్యకర్ణుండు హస్తిపురంబునకు రాజై
     విరాజితవిభవంబునఁ బ్రసిద్ధి నొందె.5
ఆ. శ్వేతకర్ణుఁ డనంగ నాతని కుదయించి, యదుకులాభిచంద్రుఁ డగు[1]సురాజ
     పుత్రి మాలిని యనుపూఁబోఁడిఁ బెండ్లియై, యఖిలరాజ్యసుఖము లనుభవించి.6
వ. [2]ఉండియుండి విరక్తుం డై ధరణీపాలనకృత్యం బమాత్యుల కిచ్చి వనంబున
     కరుగునప్పు డప్పొలఁతి యధికదుర్భరం బగు గర్భంబుతోడ నతనివెనుకం జనుచు
     నొక్కయెడ.7
క. శైలనికుంజమునఁ దనయు, బాలార్కప్రతిముఁ గాంచి పతిశుశ్రూషా
     లోల యయి పోయె నచటన, బాలుని నిడి కరము వెఱఁగుపడ భూతంబుల్.8
వ. అంత.9
క. కొండవడదాఁకి వాడియొ, కొండును దెసలేక యేడ్చు కోమలతను నా
     ఖండలసముఁ డగు శిశువును, నిండినకృపఁ గోరి చేరె నెఱి నంబుదముల్.10
వ. ఆత్మీయతోయకణంబుల నొయ్యన సంతర్పితుం జేయునెడ గనిశ్రవిష్టాతనయు లైన
     పైలపిప్పలాదకౌశికులను బ్రాహ్మణోత్తము లెత్తుకొనిపోయి గర్భక్లేశంబు వాయం

     బర్వతనిర్ఝరంబులం గడుగుచోటం బ్రక్కలు రెండును రాళ్లు సోఁకి చిఱునెత్తురు
     వెడలి కంది యజతనుచ్ఛాయంబు లగుటం జేసి యజపార్శ్వుం డను పేరు పెట్టి.11
క. వేమకుఁ డనుమునిపతికిం, బ్రేమముతో నిచ్చుటయును బెనిచె నతం డు
     ద్దామనవయౌవనంబున, భూమీశ్వరుఁడై కుమారపుంగవుఁ డెలమిన్.12
వ. ఆవిప్రుల నిద్దఱం దనకు మంత్రులంగాఁ గైకొనియె నన్నరనాయకునకు నమా
     త్యులకునుం బుత్రపౌత్రు లనేకులు గలిగి తుల్యంబుగాఁ జిరకాలంబు బ్రతికి
     రిట్లు పూరుండు మొదలుగా నవిచ్ఛిన్నం బై వచ్చిన పాండవవంశంబు జగంబున
     సుప్రతిష్ఠితం బై యిప్పుడు వెలయుచున్నది యని యవ్విధంబున నహుషసూతి
     యగు యయాతి చెప్పిన శ్లోకం బొక్కటి గల దది యె ట్లనిన13
క. రవిశశితారలు వెలిగా, దివి యున్నను నుండుఁగాని తెల్లంబుగఁ బౌ
     రవవంశము లేకుండుట, భువి నెందును లేదు కాలములు దగ మూఁటన్.14
వ. అనియె నని చెప్పిన సూతునకు శౌనకాదిమహామును లి ట్లనిరి.15
సీ. జన మేజయునకు వైశంపాయనుఁడు వాగ్మివిభుఁ డాదరంబున విస్తరించి
     నట్టి మార్గంబున హరివంశకథనంబు సర్వంబు నితిహాసపూర్వకముగ
     నీ వుపన్యాసంబు గావింప వీనుల కమృతంపుసోన లై యమర నేము
     వింటిమి నెఱయంగ గంటిమిఁ గాంక్షితసిద్ధిఁ బుణ్యము లెల్లఁ జేరె మాకు
తే. ననఘ భారతాఖ్యానంబు నచ్యుతాన్వయప్రశంసయు వినినయనంతరంబ
     యాపరీక్ష్మిత్తనూజుఁ డుదాత్తచిత్తుఁ, డేమి యొనరించె నవ్విధం బెఱుఁగఁ జెపుమ.16
వ. అని యడిగిన నతండు వారల కి ట్లనియె జనమేజయుండు సర్పసత్రానంతరంబ
     ఋత్విక్పురోహితాచార్యులం బిలిచి.17
క. హయమేధ మే నొనర్చెదఁ, బ్రియమునఁ బనుపుఁడు సమస్తపృథివిం ద్రిప్పన్
     హయరత్నము ననుటయు న, ట్ల యియ్యకొని నిర్మలప్రతిభమెయిన్. 18

శ్రీ వేదవ్యాసమునీంద్రుండు జనమేజయునకు ననాగతంబు చెప్పుట

వ. సంభృశప్రారంభు లైన యనంతరంబ.19
శా. వేదజ్ఞుండు ద్రిలోకవేది ధృతసంవిత్సంప్రమోదుం డని
     ర్వేదుం డప్రతిమప్రభావుఁడు తపోవిద్యానవద్యాత్మకృ
     త్యోదీర్లుం డవిదీర్ణధర్ముఁడు సదద్యుక్తుండు యుక్తుండు శ్రీ
     వేదవ్యాసమునీశ్వరుండు గరువ న్విచ్చేసె నచ్చోటికిన్.20
క. మునివరు నంతంతం గని, జనపతి పరిజనముఁ దాను సంప్రీతి నెదు
     ర్కొని యర్ఘ్యపాద్యముఖ్యా, ర్చనములఁ బరితుష్టుఁ జేసి సవినయబుద్ధిన్.21
వ. కొంతసే పుచితవాక్యసంవాదంబునం బ్రమోదించి పదంపడి యమ్మహాత్ముతో
     ని ట్లనియె.22
శా. సర్వామ్నాయపురాణశాస్త్రపదవీసంభావితార్థస్థితుల్
     నిర్వాహంబునఁ బొంద సర్వకవితానిర్బంధముం బూర్ణమై

     గర్వారూఢిఁ దలిర్ప సర్వజనతాకర్ణామృతస్యందిగా
     సర్వజ్ఞుల్ భువి మీరు భారతము ప్రజ్ఞంజేఁత యిం తొప్పునే.23
క. హరివంశకథోత్తరముగఁ, గురువంశకథారసంబు గ్రోలెడునెడ నొం
     డురసంబులు చెవు లొల్లవు, పరవశమై మనసు చెవులపాలిద యయ్యెన్.24
ఉ. ఇంతకృతార్థతన్ వెలయునే కురుపాండవకీర్తి యిట్టు ల
     త్యంతగుణోజ్జ్వలం బగునె యాదవవృత్తము యోగదృష్టి మీ
     కెంతయుఁ బర్వె నంతయును నెందును దెల్పెడివాఙ్మయంబు ప
     ర్యంతము గాఁగ భారతమహాగమ మిమ్మైయి మీ రొనర్చుటన్.25
క. భారతమున హరివంశము, పారాయణ మొంద వినియుఁ బ్రాజ్ఞోత్తమ
     కోరిక దనియదు వెండియుఁ, గోరెడు భవదీయవాగ్విగుంభనరుచికిన్.26
వ. కావున నొక్కటి యడిగెద రాజసూయమహాయజ్ఞంబు సేయు మనునప్పుడు
     తత్క్రియాపరిసమాప్తివలన నపరిమితజనక్షయకారణం బగు నని నారదుండు
     సెప్పిన వినియును ధర్మజుం డేల ప్రవర్తించెఁ దొల్లి సోమునిరాజసూయంబువలనం
     దారకామయసంగ్రామంబును హరిశ్చంద్రురాజసూయంబుకతంబున నాడిబక
     యుద్ధంబును బహుజీవలోకంబున కపాయకరంబు లై కలిగె ననం బెద్దలచేతం
     బ్రాజ్ఞులు వినియుండ దురు పాండవజ్యేష్ఠుం డయ్యనుష్ఠానంబునకుఁ జొరకుండు
     నట్లుగా నుడిపెడు తెరువు మీకునుం బుట్టదయ్యెనే యిది నామనంబున నెప్పుడుం
     గలిగియుండు.27
శా. త్రైకాల్యజ్ఞులు సర్వభూతహితచేతస్కు ల్విశేషించి మీ
     రీకౌరవ్యకులప్రరోహమునకున్ హేతుత్వసంభావితుల్
     మా కెల్లన్ భయదోషవిప్లవములన్ మాన్పన్ శరణ్యుల్ శుభ
     శ్లోకాపేక్షు లుపేక్షసేయుటకు నెట్లో మూల మయ్యాపదన్.28
క. ఇది యగుఁ గా దనఁ దగువా, రొదవనిదుర్మతులఁ గీడు లొదవునుగా క
     భ్యుదితమతు లగుసనాథులఁ, గదియునె యేవికృతులును జగత్త్రయవంద్యా.29
వ. అనిన నమ్మహాత్ముం డమ్మహీపతి కి ట్లనియె.30
క. విను మప్పటిజనములకును, జనవర యవసాన మొందుసమయము నేరం
     జనుదెంచుటఁ గ్రతువిధికై , జనియించెఁ దలం పజాతశత్రున కాత్మన్.31
తే. కాలచోదితు లయి భావికాలగతులు, వార లడుగర నేనును వా రడుగమి
     నెఱిఁగియును జెప్పనైతి సమిద్ధబుద్ధు, లే మెఱుంగుదు మని వత్తురే తలంప.32
క. మదిఁ గడిఁది కాల మెఱుఁగుట, తుది నెఱిఁగియుఁ బౌరుషమునఁ ద్రోవఁగ భరమే
     చదురునకు బ్రహ్మ వ్రాసిన, నుదుటిలిపులు దుడువఁ గలవె నూల్కొను వెరవుల్.33
వ. అయిన నేమి నీకు ననాగతంబు సెప్పెద నీ వశ్వమేధంబు సేయుతలంపున నున్న
     వాఁడవు తత్ప్రారంభంబు నొనర్చెద వమ్మహాక్రతువు శతక్రతుచేత విఘాతంబు
     నొందెడుఁ బ్రారంభింపక తక్కెద వన్నఁ బౌరుషంబుకంటె దైవంబు బలవంతంబు

     గావున నవశ్యంబును దొడంగన వలసియుండు నింతట నుండి యశ్వమేధయాజు
     లగు రాజు లెవ్వరు లేకుండుదురు సేనాని యను పార్థివుం డీ కలియుగంబునం గడ
     పట నమ్మఘం బొనరింపం గలవాఁ డదియాదిగాఁ దదీయాన్వయమహీపతు లెల్లం
     దదనుష్ఠాననిష్ఠు లయ్యెద రనిన జనమేజయుండు.34
క. కలియుగమున ధర్మంబులు, నలిగులి యగు నని సుధీజనమ్ములవాక్యం
     బుల విందుఁ దత్ప్రకారం, బలఘువచోవిభవ నాకు నానతి యీవే.35

శ్రీ వేదవ్యాసమునీంద్రుండు జనమేజయునకుఁ గలియుగధర్మంబు లెఱిఁగించుట

వ. అనిన వేదవ్యాసుం డతని కి ట్లనియె.36
తే. వర్ణములు నాశ్రమంబులు వసుమతీశ, కలియుగంబునఁ గత్తరి గలసిపోవుఁ
     గాన ధర్మంబు రూపయి కానరా దొ, కింత గలిగిన నది ఫలం బెక్కుడించు.37
క. అరులు గొనియు నృపతులు ప్రజ, నరయ కుపేక్షింతు రుర్వి నక్షత్రియులే
     పరిపాలింతురు వారు, బరహితము లొనర్ప రాత్మభరణమ తక్కన్.38
తే. ఆయుధీయు లై బ్రాహ్మణు లాత్మవిధుల, విడిచి శూద్రులఁ గొలుతురు వినుము శూద్రు
     లంచిత బ్రాహ్మణాచారులై చరింతు, రిరుదెఱఁగువారు భుజియింతు రేకపఙ్క్తి.39
క. చోరులు నరపతు లగుదురు, చోరు లగుదు రవనిపతులు సుజనచరిత మె
     వ్వారికి నపూజితము ధన, మేరూపునఁ బడయుట యభీష్ట మొకండున్.40
క. భృతి గానక భృత్యజనము, పతి యొసఁగనిసొమ్ము లాసపడుదురు మనుజుల్
     పతితులదెస నొక్కింతయు, మతి రోయరు గలయుటకు సమసక్రియలన్.41
క. కూ డమ్మికొండ్రు జనములు, బాడబు లాగమము లమ్మి బ్రతుకుదు రెందుం
     జేడియ లమ్ముదు రచ్చోటు, గాడువడిన కలియుగమునఁ గౌరవముఖ్యా.42
తే. పండ్లతెలుపును నింద్రియప్రతతి గెలుపుఁ, దలలబోడతనంబుఁ గావులబెడంగుఁ
     గలుగు ధర్మంబు శూద్రులతలన నిలుచు, శాక్తబౌద్ధాదిదుర్మతశ్లాఘు లెసఁగు.43
క. క్రూరపుమృగములు గములగు, గోరాశి యడంగిపోవుఁ గుజనులు వృద్ధిం
     గూరుదురు సాధుజనులకు, దారుణదుర్దశలు బొందుఁ దఱుచుగ నెందున్.44
క. కడపటిభూములు నడుమగు, నడుభూములు కడప లగు వినమ్రస్థలి ని
     ల్లడగొండ్రు జనులు చెఱుపం, బడుఁ జేనులు చిత్రవృద్ధిఁ బండవు మిఱ్ఱుల్.45
క. అడిగెడువారలు మునుమయి, పుడికెడువాఁ డొకఁడు లేక పురుషాల్పతయై
     పడఁతులు తఱచై కులములు, సెడ యన్యులు ప్రబలి జగము శిధిలతఁ బొందున్.46
క. మ్రుచ్చులు జారులుఁ బొర్ఁబొరిఁ, జిచ్చులఁగఱవులను రాచసిలుగులఁ జెడియున్
     జచ్చియుఁ బ్రజ కొంచెముగా, నెచ్చోట్లును బాడయగు మహీతల మెల్లన్.47
క. ఒడఁబాటులు సత్యములును, గడు నమ్మగఁ బల్కుటలునుఁ గయికొనక వృథా
     విడుతురు జనములు ఋణ మి, చ్చెడికొనియెడిచోటఁ దగవు సెల్లకపోవున్.48
క. చదువక పెద్దలగోష్ఠికి, నొదవక ధర్మంబు లెఱుఁగ కూరక మిగులన్
     జదివినవారై యెఱుకలు, పదివేలు నటింతు రుర్విఁ బండితమానుల్.49

క. పరలోకము సందియ మని, చిరములు జీవితము లని యసిద్ధము సుకృతో
     త్తరఫల మని పాదింతురు, శరిరముల సువిహితప్రసరసౌఖ్యములన్.50
చ. వినిమయయాజ్యయాజనము విప్రు లొనర్తురు యజ్ఞమున్ దపం
     బు ననఘ! జట్టియిత్తురు విమూఢతఁ బాయుదు రగ్నిహోత్రముల్
     గొనకొని బ్రహ్మవాదు లయి కొందఱు మద్యము గ్రోలి మాంసమున్
     దిని ధనవాంఛమై జనులఁ ద్రిప్పుదు రుగ్రపువంచనంబులన్.51
క. బలియును భిక్షము పెట్టక, యిలవేల్పులఁ బూజసేయ కిచ్చమొయి గృహ
     స్థులు గుడుతు రతిథిసత్కృతి, దలఁపరు పితృమేధవిధులు దడవరు బుద్ధిన్.52
తే. కొడుకు తండ్రి నాజ్ఞాపించుఁ గోడ లత్త
     నాదరింపక పనిగొను నతివ మొఱఁగు
     మగఁడు పతి డాగురించి భామయును దిరుగు
     నుఱక గురుని శిష్యుఁడు, నిష్ఠురోక్తి నడఁచు.53
క. శారీరమానసము లగు, దారుణరోగములు మదము దర్పంబు నసూ
     యారోషాదులు జనుల వి, కారులఁ గావించు బెట్టుగా నెల్లెడలన్.54
క. అతివైరము లతియుద్ధము, లతివిషము లతిమరుత్తు లత్యగ్నులు ప్ర
     క్షతి నొందించు మనుష్యుల, ధృతియును లజ్జయును మురువుఁ దేఁకువయుఁ జెడున్.55
సీ. అవగతస్వాధ్యాయు లవధూతహవ్యు లహంకారదుస్సహు లధికమూర్ఖు
     లర్థపరాయణు లతిమాత్రలుబ్ధులు పరచారనిరతులు పరధనాప
     హరులు కామపరులు నతిలోలు రనపేక్షసాహసు లప్రియస్ఖలితవాక్యు
     లప్రియచారిత్రు లపరాధకారులు నిజకార్యనిష్ఠులు నీచు లనఁగ
తే. విప్రరాజన్యకులజు లుర్వీతలమున, ధర్మ మంతయుఁ జెడఁజేసి తారుఁ జెడుదు
     రాదరింతురు కొండియం బవనిపతులు, ప్రోవ రాశ్రితజనులను భూపవర్య.56
క. ఇవ్విధమున నేధర్మము, నెవ్వలఁ బొడలేక పోవ నే మని చెప్పం
     బ్రువ్వులుఁ బాములు మొదలుగఁ, గ్రొవ్వెసఁగఁగ నెందుఁ బర్వికొని కాఱించున్.57
క. అని చెప్పిన జనమేజయుఁ, డనఘా యంతంత కెట్టు లగు మఱి లోకం
     బనయము ఘోరం బిదియే, యనువునఁ గృతయుగము సొచ్చు నంతటిమీఁదన్.58
వ. ఇది వినవలయు ననినం బరాశరతనయుం డి ట్లని చెప్పె.59
క. కలికాలము గలయంతయుఁ గలుషము కా కొండుతెఱఁగు గలదే దీనన్
     గలదోష ముగ్గడింపఁగఁ, గొలఁదియె యిందు జనియింపఁ గూడునె చెపుమా.60
వ. నీ వడిగినవిధంబు వివరించెద వినుము.61
తే. కుటిల మన్నియు మము దముఁ గూటువప్రజ పెద్దసేయంగ నొకరాచపేరు దాల్చి
     బలియు రేలెద రరులఁ దూటులుగఁ ద్రుంచి, ధరణిఁదారయేలికలును దస్కరులుఁగ.62
సీ. తమలోన రాసిభూధవులు చూఱులు గొన్నఁ గలుములెల్లను బోయి నెలవు లెడలి
     బాంధవులును దారు బహుకుటుంబులు ముదుసళ్ల బాలుర నఱచట్లమోచి

     నీరు కూడును గాన కారటంబున భీతు లయి పాఱెదరు కళింగాంగవంగ
     కాశ్మీరభూములు గౌశిక యనునేఱుఁ జలికొండయును బెఱ యలఘుగిరులు
తే. సాగరోపవనంబులు సంశ్రయింపఁ, గలరు జనులు పాడునుఁ బాడుగానియదియుఁ
     గాక యీయుర్వియుండు రక్షకులుగాని, వారుఁ గాకుండుదురు ధరావరులు నపుడు.63
ఉ. నారలు పట్ట లాకులు జనంబులు తాపసు లట్లు కట్టుదుర్
     వీరలు గాఁగఁ బల్లములు చిక్కనికొయ్యలఁ ద్రవ్వి విత్తుదుర్
     గోరిన యారటంబులుగఁ గొండలకాలువ లడ్డకట్టుదుర్
     నీరికి నొయ్యనొయ్య నతినీచత నొంది మనుష్యు లెయ్యెడన్.64
చ. మలినములై శరీరము లమంగళతం గులగోత్రచిహ్నముల్
     దొలఁగఁగ నల్పసంతతులతోఁ బరమాయువు ముప్పదేండ్ల యై
     కొలఁదికి వచ్చి లావులును గ్రొవ్వులుఁ బోవఁగ నింద్రియార్థిసం
     కలనము గొంచెమై మఱియుఁ గల్గు ననేకరుజావికారముల్.65
వ. ఈభంగి నాభీలం బై కాలంబు దవ్వుగా నరుగఁ గడపట నఖిలవ్యవహారవిభేదంబున
     నిర్వేదంబు పుట్టు నిర్వేదంబున సత్త్వగుణంబును సత్త్వగుణంబున జిజ్ఞాసయును
     గలుగుఁ గలిగి సాధుజనంబుల వెదకికొనిపోయి యెయ్యది శోభనం బెయ్యది
     యొనర్చిన నశేషదోషనివృత్తి యగు నట్టిది ధర్మం బని యడుగుదు రట్టి
     తలఁపువారునుం బెక్కం డ్రై యెల్లయెడల నొదవ నది గారణంబుగాఁ గ్రమ్మఱ
     ధర్మంబు దలసూపి వర్ణాశ్రమగోచరం బై వర్తిల్లుచుఁ దొల్లిటిక్రమంబున
     నెంతెంతహాని యై వచ్చె నంతంతియ వృద్ధియు సంభవించు నవ్విధంబున కృత
     యుగం బై తోచి పరిణమించు.66
తే. రాహుకబళంబునను హిమరశ్మిపొలుపు, వెలయఁ గడఁగినమాడ్కి నక్కలియుగమున
     నొయ్య నడఁగు ధర్మము రాహు వోసరింపఁ, జంద్రరుచివోలెఁ గృతయుగోత్సవము దోఁచు.67
క. గుణకర్మవిభాగంబులు, ప్రణుతతపోధర్మములును బ్రహ్మవిబోధ
     ప్రణయములు గృతయుగమున, నణుమాత్రముఁ గొఱుఁతవడక యతిశయము గనున్.68
క. యుగముల త్రిమ్మట కాలం, బగణేయం బై చనంగ నఖిలజనంబున్
     జగతీవరపరివృత్తం, బగుచుండు సముద్భవక్షయంబుల నోలిన్.69
వ. మహామునులును ధర్మార్థకామరూపంబు లైన యాశంసనంబులం గాలజ్ఞు లై యెల్ల
     యుగంబుల నాత్మీయచరితంబు నస్ఖలితంబుగా నొనరించి నిర్దోషం బగుసంతో
     సంబునఁ దపంబు పోషింతు రని చెప్పిన యమ్మహామునివాక్యం బమ్మనుజేశ్వరుం
     డభినందించె నచ్చటిజనంబు లందఱు నానందపులకాశ్రుశోభితశరీరు లగుచు విని
     యమృతాస్వాదనతుల్యప్రమోదకల్యం బగుకల్యాణంబు గని రనంతరంబ.70

క. అభిమన్యుపౌత్రు వీడ్కొని, సభాసదులు ననుప నతఁడు సమధికతేజో
     విభవుఁడు పారాశర్యుఁడు, ప్రభావభాసితుఁ డభీష్టపదమున కరిగెన్.71

జనమేజయమహారాజు అశ్వమేధయాగంబు చేయ నుద్యోగించుట

వ. కురువంశవర్ధనుం డగు నతనిం గొంతద వ్వనిచి మగుడం జనుదెంచి జనమేజ
     యుండు సర్వసభ్యప్రకరంబును దత్తదుచితస్థానంబులకు వీడుకొలిపి సర్పసత్ర
     ప్రదేశంబున నుండి యఖండితైశ్వర్యం బగుపరికరం బమరం గరిపురంబున కరిగి.72
మ. భుజగేంద్రాయతభోగభాసురభుజాభోగంబునన్ భూభరం
     బజితశ్రీ యెలరారఁ దాల్చి జనముల్ హర్షింప నుత్కర్షభా
     గ్భజనీయోత్తమరక్షణక్షమతమైఁ బ్రాచ్యక్షమాధీశులన్
     విజితోత్సకులఁ జేసి నూర్జితయశో[3]విక్రాంతదిక్చక్రుఁడై.73
వ. ఇ ట్లుండి కొంతగొలంబునకు; బూర్వసంకల్పితం బైన యశ్వమేధంబునకు నుత్సా
     హించి సముచితసమయంబున సమగ్రదీక్షామంగళం బంగీకరించె నంత.74
సీ. ధరణి యంతటఁ ద్రిప్పి మరలంగఁ దెచ్చిన యశ్వంబుఁ బ్రోక్షించి యంతికమున
     నధ్వర్యుఁడును రాజు నంతంత నుండ నారాత్రి యమ్మేదినీరమణుదేవి
     కాశిరాజతనూజ కమనీయమూర్తి వపుష్టమ విధియుతంబుగ హయంబుఁ
     గదిసి నిద్రింపంగఁ ద్రిదశేశ్వరుఁడు కాంతఁ గామించి ఘోటకాంగంబు సొచ్చి
తే. చెలువఁ జెనకుటకై చలించిన నెఱింగి, నృపతి తురగము మెదలెడు నెఱయ నేల
     ప్రోక్షణము సేయరనిన నబ్భూసురుండు, సెప్పె నతనికి నది యింద్రుచేష్ట యగుట.75
వ. విజ్ఞానమహనీయుం డగు నతం డట్లు చెప్పినం గోపించి రాజర్షిముఖ్యుండు విప్ర
     ముఖ్యులు వినుచుండ నేను యజ్ఞదానతపఃఫలంబుల నపరిమితం బగుసుకృతంబులు
     సమకూర్చితినేని విశుద్ధాన్వయప్రభవుండనేనిఁ బ్రజారక్షణంబున నప్రమత్తుండ
     నేని నిర్జితేంద్రియుండ నగుదునేని నిర్జరేంద్రుని నేఁడుమొదలుగా నేరాజును
     వాజిమేధయాగంబున యజింపకుండెడుమని శపియించి యద్దురాత్ము దౌరాత్మ్యంబు
     పొందకుండ ననిందితం బగునియమంబు నిర్వహింపంజాలరు వృథాకర్మశీలురు
     యివ్విప్రులెల్లనును మదీయరాష్ట్రంబున నుండవలవ దెందేనియును వెడలిపోవునది
     యని పలికి పత్నీశాలయం దున్న యువిదలం జూచి వపుష్టమం జూపి.76
ఉ. నాయశము న్మగంటిమియు నానయు వమ్ముగఁ జేసె జూడఁగా
     దీయసతిన్ మదీయగృహ మిప్పుడ వెల్వడఁ ద్రోచి రండు కౌ
     రేయకలీఢ మైనహని లెప్సగఁ జూతురె యన్యదూషితం
     బాయఁగ వైవఁగాక కట [4]బ్రాయిఁడియైనను నిచ్చగించునే.77

జనమేజయునకు విశ్వావసుం డను గంధర్వుండు హితోపదేశంబు చేయుట

క. అని యొత్తిలి యాడఁగ నా, ఘనభుజు విశ్వావసుం డనుగంధర్వవిభుం
     డనఘుఁడు సనుదెంచి ప్రియం, బున నిట్లను నద్భుతంబుఁ బొందఁగ జనముల్.78

చ. అలుగకు పార్థవేంద్ర భవదన్వయభూషణ మివ్వరాంగి యే
     కలుషముఁ బొంద దింద్రుఁడు మఖంబునఁ జేర్చిననీనిరూఢికిం
     గలఁగి యొనర్చెఁ జూవె తురగంబు శరీరము సొచ్చి మాయ నీ
     కలఁక క్రతుక్రియావిధికిఁ గల్పితవిఘ్నతఁ గాంచె హర్షమున్.79
ఆ. విను పతివ్రత లగువెలఁదులదిక్కు రా, వెఱ్ఱియే యమర్త్యవిభుఁడు నీకు
     వలవ దతనిమీఁది వైరస్య మనుకూల, వృత్తిఁ బోలునయ్య విప్రియంబు.80
క. విదితయశుఁ డైనపురుషుని, బదిలుండై కూడినడువఁ బడయఁగ సామం
     బొదవఁగ రాయుట యేటికి, నెదిరిం దనయట్లకాదె యేకార్యములున్.81
తే. అనఘ యప్సరోరత్న మై యలరురంభ, యివ్వపుష్టమ యై పుట్టె నీలతాంగి
     దియ్య మెసఁగ భజింపుము దేవతాంశ, భవము యోగ్యంబుగాదె సంభావనలకు.82
క. ఖరకరదీప్తులు వైశ్వా, నరశిఖలును బోలె నెసఁగు నడవడిపేర్మిన్
     బరగు పురంధ్రులు దోషముఁ, బొరయరు దా రెచట నేమిపొందున నున్నన్.83
క. పాపంబు లేనికులసతిఁ, గోపంబునఁ గుదిలపఱుచు కుత్సితునకుఁ ద
     త్పాపంబులు బహుతరపరి, తాపం బిహపరములంచుఁ దరికొల్పు నృపా.84
క. తమయింటిస్త్రీలుగారే, సమంచితాచార లయిన సాధ్వులు సత్కా
     రము ప్రేమము సల్లాపము, నమర్పఁగా వలయు వారియం దనిశంబున్.85
వ. అని చెప్పినం గలంక దేరి జనమేజయుండు వపుష్టమ నభేదదృష్టిం జూచి విప్రులం
     బ్రసన్నులం జేసి దేవేంద్రునిదిక్కు విమత్సరుఁ డై గంధర్వపతివలనం బ్రీతినొందె
     నతండును నిజేచ్ఛ నరిగె నంత.86
క. పురి కరిగి తొంటిపగిదిన, సరసమహీరాజ్యవిభవసమ్మోదమునన్
     దరుణియుఁ దాను నెలర్చెన్, బరిక్షీదాత్మజుఁడు ధర్మపరిణతబుద్ధిన్.87
తే. వ్యాసవాక్యస్వరూపమై యతిశయిల్లు, నీభవిష్యత్కథాజాత మెవ్వఁ డర్థి
     వినుఁ జదువు వాని కాయువు వృద్ధి బొందు, బుద్ధి వర్తించు విభవానుభూతి వొదల.88
క. శతమఖజనమేజయత, త్సతులకు నపకల్మషప్రశంసన మగునీ
     యితిహాసము వినువారి దు, రితరహితులఁ జేసి యిచ్చు నిష్టాపూర్తిన్.89
వ. అని చెప్పి హరివంశభవిష్యత్పర్వరూపం బగు వాఙ్మయం బంతయుం బేర్కొని.90
సీ. ఇప్పురాణం బెప్డు నింపార జిహ్వకు నమృతంబుగాఁ గ్రోలునట్టివారు
     శ్రవణరసాయనం బవునట్లుగా నాత్మ నెలకొల్పువారును నిత్యసుకృతు
     లై దుఃఖనిర్ముక్తులై సారసంసారసుఖములు సుబ్బనఁ జూఱలాడి
     యాత్మజ్ఞులయి తుది నఖిలలోకముల వర్తింతురు వరసిద్ధదీప్తమహిమఁ
తే. గన్య విని పొందు సద్భర్త గర్భిణియును, విని సుపుత్రునిఁ గను బేద విని సమర్థుఁ
     డగు మహారోగి విని త్రోచు నఖలరుజలు, బంధనస్థుఁడు విని పాయు బంధనములు.91

మ. ధరణీదేవుఁడు భక్తి విన్న సుకృతోదాత్తస్థితిం గాంచు భూ
     వరుఁ డొందు సకలక్రియావిజయమున్ వైశ్యుండు లాభోన్నతిన్
     బరఁగు శూద్రుడు సర్వసౌఖ్యవిభవప్రాప్తుం డగు న్నిత్యసు
     స్థిరదేవత్వవిభూతి యిందఱకు సాదృశ్యంబునం జేకుఱున్.92
వ. అనిన సంతసిల్లి శౌనకాదిమహామునులు సూతుం ప్రియసత్కారంబులం బూజించి.93
క. జనమేజయ వైశంపా, యనులకు సద్గోష్ఠి యనఘ హరివంశాక
     ర్ణనమునఁ బరిపూర్తిశ్రీ, గనియెనొ మఱి కలదొ శేషకథ యేమైనన్.94
వ. అవ్విధం బె ట్లనిన నక్కథకుం డమ్మునులం జూచి.95
తే. వినుఁడు హరివంశకథ యెల్ల విని కురూద్వ, హుండు సాత్యవతేయశిష్యునిఁ బ్రియమున
     నడిగె మఱియును విష్ణుకథాంశవిలస, నంబు మీ కెఱిఁగింతుఁ దన్మతము వరుస.96
వ. జనమేజయుండు వైశంపాయనుతో మునీంద్రా కృష్ణావతారకథనంబునకుం
     దొడంగుసమయంబునఁ బౌష్కరవారాహనారసింహత్రైవిక్రమంబులగునవతారం
     బుల కథలును సంక్షేపరూపంబున నుదాహరించితిరి భవదీయవాక్యామృతాస్వాద
     నంబున మనంబునం దనివి లేకున్నది గావునఁ బ్రత్యేకంబ తద్విస్తరంబులు వినఁ
     గోరెదఁ బుష్కరనాభుండు పౌష్కరం బనునవతారంబున నెంతగాలంబు పుష్కర
     శాయి యై సౌఖ్యం బనుభవించు మేల్కని లోకసృష్టికి నెవ్విధంబున నిచ్చగించు
     నెవ్వరికి సృష్ట్యధికారం బొసంగు నెవ్వరు సృజియింపంబడుదు రఖిలచరాచర
     జంతుప్రణాళం బై యప్రకాశం బైన యాకాశంబున నక్లేశంబునం గేశవాత్మకం
     బగుపరమాత్మజ్యోతి యేతెఱంగున విద్యోతించు నింతయు సర్వజ్ఞప్రవరుండ
     వైన నిన్న యడుగవలయు నీవ చెప్ప శక్తుండవు. శుశ్రూషాపరు లైన మాబోంట్ల
     గృతార్థులం జేయుట మీయంతటి పెద్దలకుఁ గర్తవ్యంబకాదే యని ప్రార్థించినం
     బార్థివున కతం డి ట్లనియె.97
క. నారాయణాంశజాతులు, గారేని తదీయతత్త్వగరిమ యెఱుఁగఁగా
     గోరునె చిత్తము పుణ్య, ప్రారంభుఁడ వీవు విష్ణుపరతఁ గృతాత్మా.98
వ. అడిగి మేలు సేసి తేను బురాణవిదు లగుకోవిదులవలన వినిన విధంబునను విద్వ
     దారాధ్యుం డగుకృష్ణ ద్వైపాయనుండు నిజతపోబలంబునం గని యానతిచ్చిన
     మార్గంబునను మదీయబుద్ధి కెయ్యది ప్రకాశం బై తోఁచె నదియంతయు నెఱిం
     గించెద మాధవమాహాత్మ్యంబునందలి సాకల్యబోధంబున నాదివేధయు వైధుర్య
     వివశుండ యనినం దపస్విమాత్రుం డెట్లు శక్తుం డగు నాకర్ణింపుము.99
సీ. గోప్యవేదుల కతిగోప్యుఁ డనంగను దత్త్వవాదుల కాదితత్త్వ మనఁగ
     నాత్మబోధనుల కధ్యాత్మం బనంగను వేదంబునకు నిత్యవేద్యుఁ డనఁగఁ

     గర్తయుఁ గరణంబుఁ గార్యంబుఁ బురుషుండుఁ బ్రకృతియు బుద్ధియుఁ బ్రాణచయముఁ
     గాలంబుఁ గళయు వక్తయును వక్తవ్యంబు వాక్కును ననుబహుత్వంబు లెల్లఁ
తే. దానయై నిత్యుఁ డమృతుఁ డద్వంద్వుఁ డజరుఁ, డప్రమేయుఁ డనాద్యంతుఁ డజుఁ డనంగఁ
     బరఁగు విష్ణుండు విశ్వైకభర్త నిఖిల, మునకు నొక్కండ సంహర్త పుణ్యయశుఁడు.100
వ. కృతత్రేతాద్వాపరకలినామంబు లగు నాలుగుయుగంబులుం బండ్రెండువేలదివ్యా
     బ్దంబులం బర్యవసితంబు లగు నట్టిచతుర్యుగంబులును డెబ్బదియొక్కమాటు
     దిరుగ మన్వంతరం బగు నట్టిమన్వంతరంబులు పదునాలుగు ససంధికంబులయి
     చనుట సహస్రయుగపరిమితం బైన బ్రహ్మదివసం బాదివసంబుకడపలం బరమపురు
     షుండు సప్తమూర్తి యగుమార్తాండుం డై సర్వప్రాణిజాతంబును భస్మీకరించి
     యాత్మోద్భవం బగుదివ్యసలిలంబున నఖిలంబును నాప్లావితంబు చేసి యేకార్ణవ
     సంజ్ఞం బైన యమ్మహాజలౌఘంబున నద్భుతాకారుం డై పవ్వళించియుండు.101
మ. విను మమ్మైఁ బవళించి యున్నవిభుఁ డీవేషంబువాఁ డిట్టివాఁ
     డనఁగా నింత తదీయసుప్తిదశ కర్హం బైన కాలంబు మే
     ల్కను చందం బిది నా నెఱుంగఁ డొకఁడుం గాలంబు కర్మంబు నా
     తనికిం గీడ్వడియుండుఁ గావున నంచిత్యంబుల్ తదాకారముల్.102

జనమేజయునకు వైశంపాయనుఁడు మార్కండేయచరిత్రంబు చెప్పుట

వ. మఱియు నొక్కయాశ్చర్యంబు గలదు మార్కండేయుం డను తపస్వి యమ్మహా
     ప్రళయసమయంబున నమ్మహామూర్తిం గని తత్సంభాషణసౌహార్ధం బనుభవించి
     కృతార్థుం డయ్యె నవ్విధం బతనివలన వినినవారెల్లను నెఱుఁగుదురు తత్ప్ర
     కారంబు విను మమ్మునివరుం డద్దేవుని యుదరాభ్యంతరంబున లబ్ధసన్నివేశుం
     డగుచు భువనప్రపంచంబునందుఁ దీర్ధయాత్రాప్రసంగంబునం బృథివిగలయంతయుం
     బరిభ్రమించుచుఁ గ్రమంబునం జనుదెంచి తదీయవదనమార్గంబున వెలువడియె
     నయ్యది యెయ్యదియు యొండుం దా నెఱుంగండు పరవశుండపోలె నట్లు వెలు
     వడి యమ్మహాతిమిరసంహృతం బైన యమ్మహాప్రళయసలిలంబు సొచ్చి.103
ఆ. తల్లడంబు నొంది తనజీవితమునందుఁ, గరము సంశయించి కలయొ భ్రమయొ
     మాయయో తలంప నీ యుగ్రదశ నిజం, బగునె యెందు నిట్టి యద్భుతంబు.104
చ. తరులు గిరుల్ నరుల్ సురలు దైత్యులు పక్షులు లోనుగాఁ జరా
     చరతతి చూడఁజూడ నవసన్నత నెం దడఁగెం దమంబు ని
     ర్భరమయి యిమ్మెయిం బొదలె భాస్కరచంద్రవిభాస మెచ్చటన్
     సురిఁగె మహాజలం బఖిలశూన్యతఁ బేర్చుట యేమి చందమో.105
వ. అని తలంచుచు నటఁ జూచునప్పు డెదుర నుదకమధ్యంబునం గాలాంజనపర్వతం
     బునుంబోలె నతిప్రమాణం బగుదేహంబుతోడం దన తేజంబ తన్ను వెలయింపం

     దోయోత్థితం బగు జీమూతంబుమాడ్కి నుల్లసిల్లు పురుషుండు దృష్టిగోచరుం
     డగుటయు.106
క. కని యితఁ డెవ్వడొ యే నీ, తని నడిగెద నివ్విధంబు దప్పక నిఖిలం
     బును నని యొయ్యనఁ జేరం, జని తద్వదనపవమానసంఘమున వడిన్.107
వ. ఆకృష్యమాణుం డయి తదీయజఠరంబు ప్రవేశించి యందుఁ బూర్వపరిచితం
     బైన జగం బాలోకించి తనవశంబుగాక యెప్పటియట్ల తిరుగం దొడంగి యక్క
     డక్కడ ననేకాధ్వరప్రసక్తు లయిన యజమానులను బుణ్యదేశంబులం దప
     స్సమాధినిరతు లయి యున్న యోగీంద్రులను దమ తమ యాచారంబులం దగిలి
     నడుచు వర్ణాశ్రమధర్మంబులం గల జనులం గనుంగొనుచు విష్ణుమాయవలన
     నెందును గాల్కొని నిలువ సంబళింపక శతసహస్రసంఖ్యలయేండ్లు చరియించియుం
     గుక్షిలోఁ గడపలఁ గానఁడయ్యె నతని నివ్విధంబున.108
క. డయ్యఁ దిరిగించి దేవుం, డొయ్యన వెడలించె నోరియూర్పున నమ్మై
     నయ్యమివరుండు వెల్వడి, యియ్యన గనుఁగొనియెఁ దొంటియేకార్ణవమున్.109
వ. అందు మహోన్నతం బగు వటభూరుహం బొక్కటి గాంచి తదీయపర్ణపర్యం
     కంబున.110
మ. తనకాంతిన్ విలయాంధకారము నిరస్తంబై కడున్ దవ్వుగా
     జనఁ బూర్ణేందునిభంగి లోచనసమాస్వాద్యాకృతిం బొల్చుబా
     లుని నీలోత్పలదామకోమలతనున్ లోలత్కచాకీర్ణఫా
     లునిఁ గాంచె మధురస్మితోజ్జ్వలముఖున్ లోకై కరమ్యోదయున్.111
చ. కని తనమున్నుగన్నటులు గామికి విస్తయవారిరాశిలో
     మునుఁగుచు నమ్మహార్ణవసముద్ధతవీచులమీఁదఁ దేలుచున్
     మునిపతి ఖేదభారమున మోహము నొందఁగ నట్లు బాలుఁ డై
     తనరు ప్రభుండు విస్ఫురదుదాత్తమనోజ్ఞమితస్వరంబునన్.112
క. పాపఁడ మార్కండేయుఁడ, తాపసపూజితుఁడ వలదు తలఁకకుము భవ
     త్తాపం బెఱుఁగుచు నాదుస, మీపమునకు రమ్ము నెమ్మి మేలొనరింతున్.113
వ. అనిన విని కోపించి యతండు.114
చ. అమితసహస్రవర్షవిశదాయుషు న న్నిటు లెవ్వఁడొక్కొ నా
     విమలతపంబు గైకొనక సూడక బాలుగా నవ
     జ్ఞ మిగుల నిట్లు పేర్కొనియె సర్వపితామహుఁ డబ్జసూతియున్
     సమధికదీర్ఘజీవి యనుశబ్దము వెట్టక పిల్వఁ డెన్నఁడున్.115
తే. ఇట్టి గర్వతుఁ డస్మదుదీరితోగ్ర, శాపమునఁ బ్రేరితం బగుచండమృత్యు
     వునకు నెరగాఁ దలంచెఁ గాకని తలంప, మఱియు నల్లన నగుచు నమ్మాయశిశువు.116
వ. అతని నుద్దేశించి.117

మ. అనుమానింపకు రమ్ము నే ననఘ నీ కాయుఃప్రదుండై తన
     ర్చినదేవుండ నిరంతరంబును సమర్పింపంగ నర్హుండ మీ
     జనకుం డాదిఁ దపం బొనర్పఁ బరితోషం బంది యీ సర్వభూ
     తనికాయక్షితియందుఁ జావనిసుతున్ ధన్యాత్ము ని న్నిచ్చితిన్.118
క. ఇంతటివాఁడవు గా కి, ట్లంతము నాదియును లేని యవ్యయు ననుఁ గ
     ల్పాంతక్రీడారతు ని, శ్చింతతఁ గనుభాగ్య మెట్లు సేకుఱె నీకున్.119
చ. అనుటయు నాతఁ డాత్మ వెగడంతయుఁ బాయఁ బ్రబోధలక్ష్మి గ్ర
     మ్మనఁ దలయెత్త నాద్యు నసమాను సనాతను వాసుదేవుఁ దాఁ
     గని కదియంగఁ బోయి ఘనకౌతుకసంభ్రమభక్తియోగముల్
     పెనఁగొన గోత్రనామములు పేర్కొని నెమ్మి నమస్కరించినన్.120
వ. ఇందు రమ్మని దేవుండు సమధికాధికారంబు సూపుటయుఁ జేరం జని వినమ్రగా
     త్రుం డై కేలు మొగిచి నిలిచి ఫాలస్థలకరణంబు గావించి.121
చ. ఉదరమునందు విశ్వమును నున్నది వెల్పల శూన్య మిమ్మెయిం
     బొదలినమఱ్ఱియాకుపయిఁ బొచ్చెపుబాలుఁడవై వినోదసం
     పద విలసించె దింతటికిఁ బ్రాప్యము నాఁ దగు భూత మీవ కా
     నొదవెదు తర్కమిట్టి దనియున్ దెలియ న్భయమయ్యెడుం దుదిన్.122
క. నను నాశ్రితుఁడుగఁ గైకొని, మనుచుటకుం దగ భవత్సమగ్రవిభవముల్
     గనుతెలివి నిచ్చి నెఱపుము, ఘన మగు నీకరుణపెంపు కారుణికవరా.123

నారాయణుండు మార్కండేయునకు నాత్మప్రభావం బెఱింగించుట

క. నావుడు మున్ను ప్రసన్నుఁడు, గావున నద్దేవుఁ డాత్మగౌరవ మెల్లన్
     వేవిధముల నిట్లని య, ప్పావనచరితునకుఁ జెప్పెఁ బ్రస్ఫుటఫణితిన్.124
తే. అనఘ నారాయణుఁడు నాఁగ నాద్యమైన, దైవశం బేను బ్రహ్మనై తగ నఖలముఁ
     దొలుతఁ గలిగింతుఁ గడపటఁ బ్రళయదహన, చండమూరినై యంతయు సంహరింతు.125
క. క్రతుకోటియెల్లను శత, క్రతుఁ డై చేసితిని గ్రతువు గ్రతుపురుషుఁ డనన్
     నుతిఁ గాంతు హుతవహుఁడనై , హుతములఁ గ్రమభాగరతుల కొసఁగుదుఁ దృప్తిన్.126
ఉ. వేయుకరంబులన్ వెలిఁగి విశ్వజగంబు వెలుంగఁ జేయుదున్
     వేయుశిరంబులం దనరి విశ్వజగంబును దాల్తుఁ దాలిమిన్
     వేయుపదంబులుం గలిగి విశ్వజగంబున కిత్తు సంస్థితిన్
     వేయుముఖంబులన్ బరఁగు విద్యలు ధర్మము లస్మదాకృతుల్.127
క. [5]క్రియయును క్రియాఫలంబును, గ్రియారహితపురుషుఁడును బ్రకృతియున్ విద్వ
     త్ప్రియము లగు సాంఖ్యయోగా, శ్రయపరిబోధములు నాదుసంజ్ఞలు వత్సా.128

తే. అంబరము వాయు వగ్ని తోయంబు పృథివి, దెసలు పర్జన్యుఁ డబ్ధులు దీవు లేఱు
     లమృతకరుఁడు తారకములు యముఁడుఁ గాల, మింతయును నన్న కాఁ జూడు మింత నిజము.129
క. బాడబదహనుఁడనై వడి, నేడుసముద్రములజలము లేఁ గ్రోలుదు నీ
     రేడుజగంబులు విలయముఁ, గూడెడునెడఁ దజ్జలంబు గొనకొని విడుతున్.130
క. మునివర యింక బహూక్తులఁ, బనియేఁమీ చూడ వినఁగఁబడియెడునవి యె
     ల్లను నేన యేను గానిది, యనుమానం బేల? కలుగ దణువును జగతిన్.131
క. జ్ఞేయం బని యెయ్యది ప్ర, జ్ఞాయుక్తులు యుక్తబుద్ధిఁ జర్చింతురు నీ
     వా యిద్ధపదము మార్కం, డేయ కనుము నన్నుఁగాఁ బటిష్ఠపునిష్ఠన్.132
ఆ. విలయసంప్లవంబు వెలుపలఁ బచరించి, లోన నబ్జభవుఁడు లోనుగాఁగ
     నడఁచినాఁడ జగము నట్టి మన్మాయావి, కాస మీవు కొంత గంటి గాదె.133
క. నావాఁడ వైతి దుఃఖము, లేవియు నినుఁ బొంద వింక నెప్పటిభంగిన్
     నీవలసినయ ట్లుండు మ, హావిస్తారమునఁ బొదలు నస్మత్కుక్షిన్.134
వ. అని యానతిచ్చి పూర్వమార్గంబున నతని నాత్మస్థుం గావించిన నమ్మహామునియు
     నచ్యుతప్రసాదలబ్ధం బైన యుపలబ్ధివిశేషంబున నశేషంబునుం గని యుల్లసిల్లె నని
     చెప్పి వైశంపాయనుండు మఱియు ని ట్లనియె.135
సీ. అమ్మెయి జలశాయి యై యున్నపరమేశుఁ డఖిలంబు సృజియింప నాత్మఁ దలఁచి
     తనయంద తనబుద్ధి దగిలించి యుగ్రంపుఁదప మాచరించి యత్తపముపేర్మిఁ
     గర్తవ్యమార్గంబు గాంచి నీరంధ్రమై యెసఁగుతోయమున నొక్కింత బయలు
     గని యొయ్య వెరవునఁ గలఁచంగ శబ్దంబు వుట్టె శబ్దంబునఁ బుట్టె గాడ్పు
తే. గాడ్పు దోడ్తోడ ముదురంగఁ గలిగె వహ్ని, వహ్ని తోరంబుగా దివ్యవారి దొరఁగె
     వారి క్రమమున బలియంగ వారిరుహము, మొలచెఁ దన్నాభియందు భూమూర్తి యగుచు.136
వ. అమ్మహాపుష్కరంబునకు మేరువు గర్ణికయును దిక్ప్రదేశంబులు బత్రంబులుఁ
     బర్వతంబులు గేసరంబులు నంబుధులు మకరందంబులు నై యుండు నూర్ధ్వాధో
     విభాగంబులు దేవాసురసన్నివేశంబులయి యుల్లసిల్లె.137
చ. అతులహిరణ్యమూర్తి యగునయ్యరవిందమునందుఁ దోఁచి య
     ద్భుతచతురాగమాత్మకచతుర్ముఖుఁ డైన హిరణ్యగర్భుఁ డ
     ప్రతిమతపోవిభాసితవిభావసుఁ డచ్యుతు శాసనంబునన్
     జతురుఁడు సర్వభూతచయపర్జనచింత వహించె నాత్మలోన్.138
వ. ఆసమయంబున వాసుదేవవశంబునం బేర్చు రజస్తమోగుణంబులు రెండును

     మధుకైటభు లనుపేళ్ల నతిప్రమాణదేహు లగు నసురు లై యా బిసరుహాసనుం
     గని చేరంబోయి యనాదరంబున నతని కి ట్లనిరి.139
తే. తమ్మినడుకొనఁ గూర్చుండి నెమ్మొగములు, నెమ్మి నాలుగు ధరియించి మమ్ము నాత్మఁ
     గైకొనక యున్నవాఁడవు గర్వితుఁడవు, సెప్పు మెవ్వాఁడ వేపని చేయు దిచట.140
క. నినుఁ బుట్టించినవానిని, బని పనిచినవానిఁ గావఁ బ్రభుఁ డగువానిన్
     వినవలయుఁ జెప్పు పిమ్మటఁ, బెనఁకువ మము నోర్చికొనుము పేరును బెంపన్.141
వ. అనినం బరమేష్ఠి, యప్పరమసాహసనిష్ఠులం గనుంగొని.142
క. ఎవ్వఁడ వని మీ రడిగిన, యవ్వచనము నాకు నాహ్వయం బెవ్వని వే
     రెవ్వరు నెఱుఁగ రతఁడ నసు, నివ్విశ్వంబును సృజింప నిటు సృజియించెన్.143
వ. అమ్మహాత్ముండ యస్మదీయసంరక్షణక్షమం బగు ప్రాభవంబునుం బూనినవాఁ డనిన
     నద్దనుజులు దద్దయుం విజృంభించి.144
చ. వినుము రజస్తమంబు లనవిశ్రుత మైనగుణద్వయంబు మా
     తనువులు గాన విశ్వవిదిశం బగుపేర్మిఁ దనర్తు మేము గ
     ర్మనిరతులందు ధర్మరుచిమానుతు మర్థముఁ గామమున్ సుఖం
     బును నిరతంబు భూతతతిఁ బొందుట లెల్లను మావికారముల్.145
క. ఎచ్చటు బహుళపరిగ్రహ, మెచ్చటు సిరి మదము ముదము నెచ్చటు నచ్చో
     టచ్చుగ మానెలవుగ ని, విచ్చఁ గనుము పిచ్చలించె దేటికి నొరులన్.146
వ. అనుటయుఁ బద్మసంభవుండు.147
క. వినుఁడు రజస్సు దమస్సును, మును సృజియించిన ప్రభుండు మొదలు త్రిభువనం
     బునకును సత్త్వగుణం బా,తని సొమ్ము భవద్విరుద్ధధర్ముఁడ చూడన్.148
వ. అమ్ముకుందుండు వీఁడె సమీపస్థుం డై 'వెలిం గెడు నతనిం గదిసి మీ రెట్టివా
     రైన నగుం డనిన నయ్యసుర లసురాంతకుం జేర నరిగి కృతాంజలు లై నీవు
     సకలభూతస్వామివి నీమహత్త్వంబు గంటిమి ని న్నుపాస్తి సేయుటకుఁ బ్రశస్త
     యైన బుద్ధి జనియించె నమోఘదర్శనుండవు నఖిలవరదుండవు నగు నీవలన వరం
     బులు వడయఁగోరెద మనిన నతం డట్ల కాక మీతలం పేమి యనుటయు.149

మధుకైటభులను దనుజులు నారాయణునిచే నిహతులయిన వృత్తాంతము

చ. దనుజులు దేవ నీ వధికదర్పితులం దమియింపఁ గర్తవై
     యునికి నిజంబుగా నెఱిఁగియుండుదు మేము భవద్భుజాబలం
     బున కిట యెమ్మెయిం బ్రిదిలిపోవఁగ లేము వధించె దేని మ
     మ్మనఘ వధింపు తొల్లి నరు లన్యులు సావనియట్టి తావునన్.150
వ. నీకుం బుత్రుల మై జన్మింపఁ గోరెద మనినం బురుషోత్తముండు, మీ కోరినయట్ల
     చేసెదఁ గల్పంబు కల్పంబున మదీయశరీరసంభవు లయ్యెద రని యయ్యిరువురం
     గరికరోపమంబు లగు నూరువులపైఁ బెట్టి యదిమి సమయించి బ్రహ్మకుం
     బ్రమోదం బాపాదించె నంత.151

క. ఆరాజీవభవుం డతి, దారుణ మగుతపము చేసి తద్దయుఁ బ్రబలుం
     డై రచియింపఁ దొడంగె న, పారభువనసంచయప్రపంచము లోలిన్.152
వ. అందుఁ దొలుత యోగసాంఖ్యంబులం దదాచార్యులను సృజియించి మహా
     వ్యాహృతిత్రయంబున లోకత్రయంబు ను త్పాదించి నిజశరీరార్ధంబున నఖలవాఙ్మ
     యమూర్తి యగు సుందరిఁ గలిగించి తదీయసంగతి ననేకకాలం బభిరతుం డై
     సావిత్రింగని యాయమ సవిత్రిగా నఖిలనిగమంబులు నిర్మించి ధర్మునిం బుట్టించి
     వరుస దక్షమరీచ్య త్రిపులస్త్యపులహక్రతువులను గౌతమాంగిరోభృగువసిష్ఠ
     దక్షమనువులను జనితులం జేసి వారివలన నాదిత్యరుద్రవసువిశ్వమరుత్సా
     ధ్యప్రభృతిదేవగణంబులను దైత్యదానవనివహంబులను యక్షరాక్షసగంధర్వాది
     దేవయోనులను విహంగభుజంగమనుష్యమృగపశుపర్వతమహిరుహగుల్మలతా
     తృణసముదయంబులనుం గల్పించె నిది యంతయుఁ బౌష్కరసర్గం బనం బరఁగు
     నిట్టిసంసరణంబునందు.153
సీ. వినుము గురూపాస్తి యొనరించి శ్రుతమున యంతంబు గని గృహస్థాశ్రమమున
     నావృత్తయజ్ఞులై యలమి తపంబునఁ బండిన కర్మముల్ బాఱవైచి
     యాత్మసంప్రీతికి నలవడ్డకృతబుద్ధు లిపుడు గీర్తించిన యీప్రపంచ
     మింతయు వెలిఁజూడ కంతరంగమునన కని నిరంతరయుక్తి గారవమున
తే. విఘ్నములఁ ద్రోచి యపసర్గవితతమూర్తు, లై నసిద్ధులఁ దవులక యవుల నిగిడి
     పొందుదురు నిత్యనిర్వాణభూరిచిత్సు, ఖాద్వయానందనారాయణాఖ్యపదము.154
వ. పౌష్కరప్రాదుర్భావం బెఱింగించితి నింక నాదివరాహదేహుం డైన దేవదేవు
     చరితంబు వివరించెద.155
మ. పరమం బెల్లపురాణజాతములకున్ బ్రహ్మోక్త మత్యుత్తమం
     బరు దామ్నాయసమంబు నాస్తికుల కీనర్హంబు గా దిమ్మహో
     వరవిజ్ఞానము సాంఖ్యయోగసకలార్థజ్ఞానతుల్యంబు భూ
     వర నీ వర్హుఁడ వాత్మలో నిలుపు మవ్యాపన్నవృత్తోన్నతిన్.156
వ. శుచియును సమాహితంబును నగు చిత్తంబు శ్రవణేంద్రియాయత్తంబు గావించి
     యాకర్ణింపుము చతుర్యుగసహస్రపరిమితం బయిన వారిరుహాసనువాసరంబు
     కడపటం బరమేశ్వరుండు వైశ్వానరూపంబున నుండి ప్రేరితుం డై దేవాసుర
     మానుషం బగుచరాచరప్రపంచంబు నెరియింపం దొడంగునప్పుడు దయాళుం
     డగుధాత యంతయుం గనుంగొని.157
ఉ. అందఱఁ గొంచుఁ జంచదితిహాసపురాణసమన్వితాఖిల
     చ్ఛందములుం దనుం బొదువ సమ్మతిఁ బోయి పురాణుఁ బుణ్యు న

     స్పందితు విశ్వసంప్రభవసంహరణప్రభు నాదిదేవు గో
     విందు ముకుందు నందు నరవిందదళేక్షణుఁ జొచ్చుఁ జెచ్చెరన్.158
తే. కడఁగి కల్పాదిఁ గ్రమ్మఱఁ గలుగఁజేయఁ, దనక పని గాన నట్లు సొచ్చినజగముల
     నోలిఁ గంజోదరుండు నిజోదరమున, నింట్రపడకుండఁగా నిల్పె నెడము లిచ్చి.159
వ. అవియును దదీయగర్భవాసంబున ననాయాసం బగు సంచారంబున భూరిప్రమో
     దంబున నాది నెట్లు ప్రవర్తిల్లు నవ్విధంబునఁ బ్రవర్తిల్లు నట్ల ప్రబలిన చంద్రార్క
     తేజంబును బ్రధ్వస్తజీవలోకంబును బ్రగాఢతిమిరపరివృతంబు నై నమహాగహ్వరం
     బాత్మయోగసంభవం బగు నమ్మహస్సునం బూరించి యందు.160
సీ. నీలజీమూతసన్నిభ మైనశుభమూర్తి బహుబాహుమండలమహిమ నొప్ప
     శ్రీవత్సకౌస్తుభోర్జితవక్ష మతులపద్మసహస్రరచితదామమున మెఱయ
     అసితకుంచితకేశవిసరబంధము ప్రశస్తమనోజ్ఞమణికిరీటమున నలర
     రమణీయపీతాంబరస్ఫీతకటికమ్రకలరత్నఘటితమేఖల దలిర్ప
తే. నతులకల్యాణనిధి యైనయాదిలక్ష్మి, చిక్కఁ దనుఁ గౌఁగిలించి రంజిల్లు నాద్యుఁ
     డచ్యుతుం డెవ్వరికి నిట్టిఁడని యెఱుంగఁ, బడనిచొక్కున సొగయించి పవ్వళించు.161
వ. ఇట్లు నారాయణాభిధానంబున యోగనిద్రాసక్తుం డై సహస్రయుగమయం బైన
     కాలంబు గడచినం దనయంతన మేల్కని లోకసృష్టి చింతించి యాపరమ
     హంసుండు.162
తే. ఆత్మకుక్షిలో నున్న మహాండమొకటి, వెడలనుమియఁ గాంచనరూపవిస్ఫుటముగ
     నదియు వేయువత్సరములయంతఁ బక్వ, మైన నొయ్యన రెండు వ్రయ్యలుగఁ జేయు.163
వ. అవ్విభాగంబు లూర్థ్వాధోనివేశంబుల నాకాశంబును బృథివియు ననుపేళ్ళం
     బరఁగు నతండు వెండియు నయ్యండంబుచుట్టును నెనిమిది దూంట్లు వుచ్చి దిక్కుల
     వేర్వేఱ సంజ్ఞ గావించె మీఁదు చిల్లి పుచ్చి కనకరసధార దొరఁగించిన నది కఠినం
     బై నిలిచి మేరుశైలం బయ్యెఁ దక్కినతెరువులం గాఱిన బహువర్ణసలిలంబులు
     నట కులనగంబు లై తనరె నంత నిలువక యమ్మహాతోయంబు దోడ్తోన తొరఁగి
     వెల్లి గొని సాగరంబు లై యవియును గరుసులు దప్పి పరఁగిన వ్రేఁగునకు నుర్వి దేలి
     యోర్వనేరక దిగంబడినం గనుంగొని జగదీశ్వరుండు.164

నారాయణుఁడు వరాహరూపంబునఁ బాతాళగతయైన భూమి నుద్ధరించుట

క. నాయాత్మశక్తివై మ, త్ప్రేయసివై యుండు దీవు పృథివీ నిను నే
     నీయఖిలచరాచరములఁ, జేయుటకై సుప్రతిష్ఠఁ జేసితిఁ గరుణన్.165
తే. అట్టినీవు పంకనిమగ్న యైనగోవు, భంగిఁ బాతాళమున దిగఁబడి చనంగఁ
     జూడ నేర్తునె యోడక చూడు నాదు, శక్తి భవదుద్ధరణకళాసక్తియందు.166

వ. అనిన యాశ్వాసవచనం బాకర్ణించి యద్దేవి యి ట్లనియె.167
శా. ఈ విశ్వంబును దాల్ప శక్తుఁడవు నీ వెవ్వాఁడునుం దాల్ప లేఁ
     డేవానిం గనుఁగొందు వీ వొరుఁడు ని న్నెవ్వాఁడుఁ గానండు నీ
     వేవానిం బచరింతు వానిఁ దెలియం డేవాఁడు నీ వెవ్వరిం
     గావం బూనితి వారు ధన్యులు జగత్కల్యాణ నారాయణా.168
క. విశ్వంభర నీవలనన, నీశ్వంభర నైతి నేను విశ్వంబునకున్
     శాశ్వతభర్తవు కర్తవు, నీశ్వరుఁడ వనీశ్వరుఁడవు హితుఁడవు నాకున్.169
చ. అసురులచెయ్ది ధర్మము లపాయము నొందిన నోర్వలేక యే
     నసమఱి మ్రొగ్గి నీకు శరణంచు భయంబునఁ గూయిడం గృపా
     రసికుఁడ వీవు చేయు దభిరక్ష యుగంబుల నెల్ల నిట్ల యై
     యెసఁగు భవత్సమాశ్రయసమిద్ధజనాత్మత నాకు నచ్యుతా.170
ఆ. నన్ను నుద్ధరించి నా కింత దగు నని, నీవ చూచి మోపు నెమ్మి నెత్తు
     మేను నీవు నిలుప నెల్లకాలంబు సు, స్థిరత నొందుదానఁ బరమపురుష.171
వ. అనిన నట్ల చేయుదు నని యభయం బిచ్చి జలక్రీడాలోలస్వభావం బగు క్రోడ
     భావంబునం గాలాభ్రశోభిశ్యామం బగు ధామంబును నిరంతరనిర్భరోల్లసత్పరి
     ణాహం బగు ఘ్రాణంబును దీక్ష్ణదంష్ట్రాఖనిత్రం బగు పోత్రంబును స్తబ్ధరోమం
     బగు స్కంధంబును నుత్సాహజనితాశ్రుసేచనంబు లగు లోచనంబులును నిర్ని
     రోధరాగం బగు చరణన్యాసవేగంబును నమర ననేకశతయోజనాయామసము
     చ్ఛ్రయంబు ననుపమానచ్ఛాయం బగు కాయంబునం బొదలి పాతాళమూలంబు
     ప్రవేశించి.172
శా, ముస్తాకందముఁ గ్రుచ్చి యెత్తుక్రియ నిర్ముద్రస్ఫురద్దంష్ట్రికా
     హస్తాగ్రంబునఁ గ్రుచ్చి యెత్తెఁ బ్రియ మొప్పారంగఁ గేళీరసా
     భ్యస్తోదీర్ణజవంబునన్ వెడలి యయ్యాశ్చర్యతోయంబు నా
     యస్తాధారపథంబుగా నునిచె విశ్వాధారుఁ డద్ధారుణిన్.173
ఆ. అమ్మహాత్తు నాజ్ఞ నంబుమధ్యంబునఁ, బోతపాత్రవోలె భూతధాత్రి
     భూతభరణమున కభూతపూర్వం బగు, గర్వ మపుడు దాల్చి కర మెలర్చె.174
వ. ఇవ్విధంబున వసుధఁ బ్రతిష్ఠించి యప్పరమేష్ఠి సరిత్తులు దీర్చి సాగరంబులు గరులు
     వెట్టి పర్వతంబులు గుదురుపఱచి దీవు లేర్పఱించి భువనంబు లచ్చుకట్టి భువనాధి
     పతుల నిర్ణయించి వాఙ్మయంబుల సృజియించి వాచకుల నియోగించి వాక్యం
     బులు దెలిపి దిక్కులు నిర్దేశించి జ్యోతిస్సులు వెలయించి కాలంబు గణియించి
     కర్మంబులు గలిగించి శర్తల నాజ్ఞాపించి ఫలంబులు సూచించి ఫలమూలంబులు
     రూపించి యర్థంబులు సూత్రించి నేర్పుల నిర్మించి కామంబులు గెరలించి
     కామ్యంబులు సవరించి యోగంబు లుపదేశించి యోగ్యులఁ బ్రకటించి నిర్వా

     ణంబు నిర్వచించి నిర్విమోహం బగు నుత్సాహంబున విహరించుచుండె నట్టి
     సంస్కారంబులం బ్రస్ఫురితసారం బై సంసారంబు ప్రవర్తిల్లె నొక్కకాలంబున.175
చ. కులగిరిపూర్వకంబు లగుగోత్రము లన్నియు మేటిఱెక్కలం
     గలిగి నిజేచ్ఛ భూతలము గ్రక్కదల న్వెసఁ బెల్లగిల్లి యె
     వ్వలన ఖగంబులట్టుల దివంబునఁ గ్రుమ్మరఁ బ్రాణిబాధగా
     నెలయు మహాజలాశయము లెందును జొచ్చు గజంబులో యనన్.176
వ. ఇట్టి యద్భుతంబువలన భూదేవి యెంతయుం బీడిత యగుచుండె నింతియ
     కాదు హిరణ్యాక్షుం డను దైత్యపతియు నత్యుత్కటం బగు బలదర్పంబునం
     ద్రొక్కిన నొక్కొక్కచోటు క్రుంగి పాతాళంబునకుం బోయెఁ దదీయభృత్యు
     లగు దైత్యులచేతి యాతంకంబును భూతసంప్లవకారి యయ్యె నాసమయంబున.177

హిరణ్యాక్షప్రముఖరాక్షసు లింద్రాదిదేవతలతో యుద్ధంబు చేయుట

ఆ. సురలఁ బిలుకు మార్చి సురరాజుఁ జెఱఁ బెట్టి, కోరి త్రిదివపదవి గోని సుఖింత
     మేల యూరకుండ నింతశక్తుల మయ్యు, ననుచు దనుజు లాత్మ నదటు మిగిలి. 178
మ. తమరా జైనహిరణ్యనేత్రునకు నుత్సాహంబు పుట్టించి దు
     ర్దమదంతావళపూర్వకం బగుసముద్యత్సర్వసేనాంగజా
     తము సన్నద్ధము సేసి యస్త్రములు శస్త్రంబుల్ తనుత్రంబు లు
     గ్రములై యొప్ప నుదగ్రులై నడిచి రుత్కంపింపఁ ద్రైలోక్యమున్.179
చ. అమరులు నవ్విధం బెఱిఁగి యాయితమై యమరాధినాథుఁ డ
     భ్రముపతి నెక్కి వజ్రపటుబాహుతతోఁ దమ కగ్రగామి యై
     యమరఁగఁ దూర్యనాదములు నార్పులు మిక్కుటమై దిగంతభా
     గములు వగుల్పఁగా నెదురుగా నడతెంచిరి వైరికోటికిన్.180
క. సురబలము నసురబలమును, బరవసమునఁ దాఁకెఁ బ్రళయపాథోధులు ని
     ర్భరముగ నొండొంటిపయిన్, దెరలఁగఁ దోతెంచి బెరయు తెఱఁగునఁ బెలుచన్.181
వ. అట్టి క్రందునం బరిఘాఘాతంబులు ముసలనిపాతంబులుఁ గుంతప్రహారంబులు
     నస్త్రసంచారంబులుఁ గృపాణధారాఖండనంబులు గదాదండదండనంబులుఁ
     దోమరక్షేపంబులు శక్తిహననాటోపంబులు మొదలుగా బహువిధప్రమథనం
     బుల నిరుదెఱంగులపోరును బరస్పరధ్వంసం బొనర్చిరి గజతురంగస్యందనవ్యతిక
     రంబు లతిభయంకరంబు లయ్యెఁ బేరుగల యోధుల తలపాటులు చలంబున
     బలంబున నిశ్చలం బగు నిశ్చయంబున ననపేక్షితజీవితంబు లై చెల్లె నప్పుడు
     దైత్యుల చెయిదం బాదిత్యులకు భయంకరం బగుటయు బెగడనీక నాకపతి.182

మ. ఘనసంధ్యారుణతుంగదేహుఁడు పిశంగశ్మశ్రుకేశుండు దీ
     వ్రనిశాతోత్కటదంష్ట్రుఁ డుగ్రపరిఘవ్యాదీర్ఘదీవ్యద్భుజుం
     డనిరోధాయుధయోగదీప్తుడు హిరణ్యాక్షుండు దుర్వీక్ష్యభా
     వనిరూఢిన్ రిపుకోటి మార్కొనియె సంవర్తాంతకాకారుఁడై.183
క. స్వామిసముత్సాహంబున, నేమియు నరవాయి గొనక యిరువాఁగును ను
     ద్ధామసమరం బొనర్పఁగ, నామెయి భూతములకెల్ల నద్భుత మయ్యెన్.184
వ. అందు.185
మ. క్షతులై పాతితులై విధూతు లయి ర కస్యందిసందిగ్ధజీ
     వితసమ్మూర్ఛితచేష్టులై విరథులై వీతాశ్వులై వారుణ
     చ్యుతులై పాటితహేతులై విశిఖసంక్షుణ్ణాంగులై నిర్జరుల్
     ధృతి దూలంగఁ దొలంగి రెల్లెడల దైతేయాహవాభీలతన్.186
వ. హిరణ్యాక్షుండును సహస్రాక్షుం దలపడి యప్రమేయప్రమేయవిశిఖపాశంబుల నై
     రావణసమేతంబు ప్రతిబద్ధదేహుం జేసిన గదల నేరక యూరక నిష్ప్రతీకారుం డై
     యతం డుండె నంత నిలువక మఱియును.187
తే. అనిమిషుల నెల్లఁ బోనీక యాఁగి యున్న, వాని నున్నచోఁ గట్టి దుర్వారదైత్యుఁ
     డార్చె సంహారసమయసప్తార్చి నార్చు, కాలమేఘంబు గర్జిల్లు లీలఁ జెలఁగి.188
వ. ఇవ్విధంబున నఖిలవిబుధులు దిక్కు లేక చిక్కిన విధంబును విబుధవైరి యొక్కరుం
     డుక్కుమిగిలి మగఁటిమి సుక్కివుం డై పేర్చిన భంగియుం దన చిత్తంబున నవధ
     రించి యాశ్రితాభయప్రదానవిదగ్ధుండును గేవలకరుణాముగ్ధుండును సర్వ
     భూతచిత్రజ్ఞుండును బ్రవర్తితాఖలయజ్ఞుండును నగు యజ్ఞపురుషుండు యజ్ఞ
     వరాహదేహం బవ్యాహతబాహులలితంబును బ్రభూతదివ్యాయుధకలితం
     బునుం గా నుద్వహించి.189
క. చనుదెంచి పాంచజన్య, స్వనమున దానవులహృదయసంపుటభేదం
     బొనరించుచుఁ దనునీలిమ, పెనుఁజీఁకటి గదిసి రిపులు బెగ్గిలి కలఁగన్.190
క. సితశంఖదీప్తచక్ర, ద్వితయావిర్భూతిఁ బొలిచె దేవోత్తముమే
     నతులితశశిరవిబింబ, ప్రతిబద్ధం బైనమేచకాభ్రముఁ బోలెన్.191
వ. అమ్మహామూర్తి నాలోకించి యాలోకవిద్వేషులు వెఱుఁగుపాటున హృదయం
     బులు గలంగఁ దమలోన.192
చ. అమరులఁ గావఁ బూని వికృతాకృతియై యిట వచ్చినాఁ డితం
     డమితబలుండు నాఁబరఁగు నమ్మధుకై టభశత్రుఁ డింక నే
     క్రమమున నైన నీ వతని ఖండితగర్వునిఁ జేయు మంతలో
     సమయు నిలింపకోటికిని సర్వముఁ జేకుఱు నస్మదీయ మై.193

వ. అనియు నుత్సాహంబు సేసి యనేకసహస్రసంఖ్యలు గల యసుర లందఱు
     నొక్కమొగం బై క్రోధరక్తాక్షుం డగు హిరణ్యాక్షుం బురస్కరించి యప్పురాణ
     వీరున కెదురు నడచిరి పరమేష్ఠి పరమయోగిప్రకరపరివృతుం డై చనుదెంచి
     దేవతల నాదరించుచు విశ్వవంద్యు పిఱుంద నిలిచె నప్పుడు.194
క. దై తేయుల వివిధాయుధ, జాతంబులు వొదివెఁ బ్రభుని సర్వాంగముఁ బ్ర
     స్ఫీతాతతనూతనజీ, మూతబలము లుద్యదచలముం బొదువు క్రియన్.195
తే. చక్రధారలఁ జెదరెడు చండదహన, శిఖల నవి యెల్ల భస్మమై చెడఁగ మంచు
     విరియ వెలుఁగొందు మార్తాండుకరణి నొప్పె, నొకఁడ తేజస్వియై పురుషోత్తముండు.196

నారాయణుఁడు హిరణ్యాక్షునిఁ బొలియించి సురల రక్షించిన వృత్తాంతము

క. ఆతనిఁ జూచి సహింపక, దైతేయవిభుండు వైచెఁ దద్వక్షము న
     త్యాతతముగ లక్షించి వి, ధూతాహితశక్తి యైనతోరపుశక్తిన్.197
వ. అమ్మహాశక్తి యనర్గళగతి నరుగుదెంచి దేవదేవుదేహంబు దాఁకి రుధిరధారలు
     చెదరం జేసిన నంబుజాసనుం డాదిగా సురలందఱు నచ్చెరువు నొంది యసుర
     లార్చుచుఁ బిచ్చలింప నిశ్చలుం డై నిలిచిన నిఖిలేశ్వరుండు శాశ్వతయశోవిభూ
     షణంబునుఁ బ్రతిపక్షతేజోదూషణంబును బరితోషితాశ్రితచక్రంబు నగు
     చక్రంబు దనుజుదెసకుం బ్రయోగించె నది కల్పవిచ్ఛేదజ్వలితజ్వలనంబపోలేఁ
     జని దానవు మెడమీఁదఁ బడి శిరంబు శరీరంబునకుం బాపెఁ బ్రదీప్తహరిహేతి
     పాతితశిఖరం బగు సిద్ధమహీధరంబు పగిది నద్భుతావహుం డగుచు నసురకులో
     ద్వహుండు వసుధాశాయి యయ్యె నవ్విధంబున.198
మ. అహితుం జంపి తదీయజాతు లగుసర్వారాతులన్ భోగభృ
     ధ్ధహనం బైనరసాతలంబు సొర వీఁకం దోలి లీలాయిత
     స్పృహణీయాకృతి నమ్మహాత్ముఁడు గృపన్ జిష్ణుండు లోనైన స
     ర్వహితశ్రేణికి మాన్చె శత్రుకృతదుర్బంధోత్థనిర్బంధమున్.199
వ. ఇవ్విధంబునం బ్రాప్తనిర్వాణు లై గీర్వాణులు వాణీపతి మున్నిడుకొని చేరి
     యయ్యాదిపురుషునకుం బ్రణామంబులు సేసి దేవా దేవర మామీఁదివాత్సల్యం
     బెయ్యెడ నేమఱమి దెల్పెడు నట్టి యిమ్మహాపౌరుషం బేమని కొనియాడ నేర్తు
     మెల్లనాఁడు నిట్ల మీబంట్ల మగుట నిక్కంబు చేసి మమ్ము రక్షింపఁగా వరంబుగా
     వేఁడెద మనినం గరుణించి కమలేక్షణుండు.200
క. మును మీ కే నిచ్చినయ, వ్వినుతైశ్వర్యంబులును హవిర్భాగంబుల్
     బెనుపుగం గ్రమ్మఱఁ జేరుం, జనుఁ డాత్మీయాధికారసంపద కెలమిన్.201
సీ. తమతమయాశ్రమధర్మంబు లిమ్ముగా నడచినవారు దానవ్రతులును
     సత్యసంధులు మహాసమరశూరులు ననసూయులు సత్యయజ్ఞులు సదయులు

     నగుపుణ్యులకు నెల్ల నర్హలోకంబు లీ నొడయఁ డీయిం ద్రుఁ డర్హుండు మీకు
     నర్థకామాశ్రయులయి శాఠ్యతం బరలోకము నమ్మక లోకనింద్య
తే. మైనచందంబు గైకొని యవనిసురల, నాదరింపక శ్రుతివాక్య మాక్రమించి
     తిరుగు దుర్బుద్ధు లుధ్ధతనరకవహ్నిఁ, బడుదు రందుపేక్షయ మీకుఁ బ్రభుగుణంబు.202
క. వినుఁ డిట్టివారలయి తగ, ననిశము నామీఁదితలఁపునందును నవధా
     ననిరూఢు లగుట మే లెం, దును నేదురితములు మిమ్ముఁ దొడరక యుండున్.203
వ. అని యానతిచ్చి యయ్యనంతుం డంతర్హితుం డయ్యె [6]నహితనిరాసనంబునకు
     నుల్లాసం బెసంగ వాసవాదులు నబ్జాసనుండు మున్నుగా నమ్మహావరాహమూర్తిం
     గీర్తించుచు నిజనివాసంబుల కరిగె ధరణీదేవియు దేవారాతులు విఘాతు లగుట
     నపేతవికృత యై యాత్మప్రకృతియంద నిలిచె మఱియు నయ్యమకు నతిస్థైర్యంబు
     గావింపం దలంచి.204
ఉ. పూని పురందరుం డఖలభూమిధరంబుల నెయ్యేడ న్నిజ
     స్థానములంద యుండుఁ డని సర్వసమర్థత నాజ్ఞ వెట్టి యు
     త్తానకఠోరధార మగుదారుణవజ్రము దాల్చి సంతతో
     త్తానతదీయపక్షసముదాయము మ్రోడుగఁ జెక్కె నుక్కునన్.205
క. ఆకలకలమున నొకఁ డ, న్నాకాధిపహేతిఘాతనకుఁ దప్పెను మై
     నాకం బనేకలహరీ, వ్యాకీర్ణపయోధిగర్భవాసప్రాప్తిన్.206
వ. ఇది వరాహావతారప్రకారంబు.207
చ. తనయులఁ గోరువారు వసుధాతలనాథతఁ గోరువారలున్
     విను సిరి యాయువర్థ మభివృద్ధి యశంబు జయంబుఁ గోరువా
     రు నిగమసమ్మతంబు నతిరుచ్యము లైనమహావరాహవ
     ర్తనము పఠించినన్ వినినఁ దథ్యము పొందుదు రిన్నికోర్కులున్.208
క. పితృయజ్ఞులు సురయజ్ఞులు, నతులితయోగమున నాత్మయజ్ఞులు నగువా
     రతిపుణ్యయజ్ఞమయు న, చ్యుతుఁ గొలిచినవార యగుదు రుత్తమభ క్తిన్.209
వ. నీవు భక్తిమయం బగుభావయజ్ఞంబున యజ్ఞేశ్వరు నర్చింపు మని చెప్పి వైశం
     పాయనుండు జనమేజయుతో నింక నారసింహరూపధరుం డైన చక్రధరుచరితంబు
     విను మని యి ట్లనియె.210
క. ఆదియుగంబున నసురుల, కాది యగు హిరణ్యకశిపుఁ డవిరతమదధై
     ర్యాదిగుణమ్ములఁ దనపెం, పాదిమునులు వొగడఁ జేసె నధికతపంబున్.211
వ. ఏకాదశసహస్రసంవత్సరంబులు నిర్మత్సరం బగుయోగంబున నభియోగించి
     శక్యంబు గాని యైక్యం బట్లు నిర్వహించిన యాపూర్వగీర్వాణసంయమికిం బ్రస

     న్నుం డై ప్రపన్నవత్సలుం డగుసరోజసంభవుండు సకలసురసంఘంబులు గొలువ
     హంసయుక్తవిమానంబుతో నేతెంచి యాతని కోరిన వరంబు లిచ్చి సర్వభూత
     దుర్జయుం జేసిన.212
తే. తలఁకి వేల్పులు విశ్వవిధాతపాలి, కరిగి యెంతయు దూఱిన నతఁడు వారి
     కసుర యెయ్యది యడిగిన నొసఁగవలయు, తీవ్రతపము మహత్త్వంబు తెలియఁజెప్పి.213
వ. అవ్విరోధికి నవసానంబు నిట్టిది యని నిర్ణయించిన నిలింపులు కాలాంతరం బపే
     క్షించి యుండిరి దితినందనుం డదితినందనుల నందఱం దొడరి క్రమంబున భంగ
     పఱిచి మెఱసిన సత్త్వంబున సత్వపరిచితు లగుమునుల నవమానించి లోకంబులఁ
     దాన కైకొని బహుకాలం బేలుచుండఁ బదచ్యుతు లై శరణంబు సొచ్చి యమర
     వరులు దమ పడినపాట్లు విన్నవించిన నభయం బిచ్చి యద్దేవుండు వారి
     వీడ్కొలిపి.214

నారాయణుఁడు దేవతాప్రార్థితుం డై నరసింహరూపంబున నావిర్భవించుట

ఉ. వేవురు చంద్రు లోలిఁ బదివేవురు సూర్యులు లక్షపావకుల్
     ప్రోవయి యున్నయట్టి దగుభూరితరం బగుతేజ మీయజాం
     డావలి కెల్ల దుష్ప్రసహమై యెసఁగంగ నృసింహభావసం
     భావితమూర్తి గైకొని విపక్షపరిక్షపణక్షణోద్ధతిన్.215
వ. ఆక్షణంబ దైత్యేంద్రుపురంబున కరిగె నాకర్ణింపుము.216
క. దితిసూనుని యైశ్వర్యం, బతిలోక మపేతశోక మాశ్చర్య మత
     ర్కితసంపద్భరధుర్యం, బతిరమ్య మగమ్య మీశ్వరాదులకైనన్.217
వ. ఒక్క సభాభవనంబు శతయోజనవిస్తారంబును సార్ధయోజనదీర్ఘంబును బంచ
     యోజనోన్నతియుఁ గలిగి కామగామియు సర్వకామికవస్తుభరితంబు నై మణి
     కనకనిర్మితస్తంభభిత్తికనకవలభిఘనకవాటాదులను సకలకాలకుసుమఫలోల్లసిత
     పాదపప్రకరంబులను బద్మోత్పలాకీర్ణపూర్ణసరసీస్తోమంబుల నభిరామం బగు
     చుండు నందుఁ గిష్కుశతోన్నతవిస్తీర్ణం బైన స్వర్ణసింహాసనంబున నాసీనుం డైన
     యతని నూర్వశి ఘృతాచి మేనక మొదలయిన యచ్చరలు పదివేవురును విశ్వా
     వసుప్రముఖు లగు ననేకగంధర్వులు నాటలఁ బాటల నేప్రొద్దుం గొలుతురు దివి
     జులకంటెం దేజంబు మిగిలి సర్వాలంకారకలితులయి విప్రచిత్తి మయుండు శంబ
     రుండు రాహువు లోనుగా నఖిలదానవు లుద్యతాయుధహస్తు లై పరివేష్టిం
     తురు ప్రహ్లాదుం డాదియగుతనయులు వినయంబునఁ బ్రాంజలు లై యుండుదు
     రట్టివిభవంబుతోడఁ గొలు వున్న సమయంబున నారసింహదేవుం డాదేవద్విషు
     ముందట నావిర్భవించిన.218
క. తనపాలిమృత్యుదేవత, యునుబోలెను వచ్చి యిట్టు లున్న మహాత్ముం
     గని దైత్యుఁడు మది విస్మయ, మును భయమును గౌతుకంబు ముప్పిరిగొనఁగన్.219

వ. సర్వమంత్రులం జూచి చూచీతిరే యిది యొక్క యద్భుతాకారంబు నరుండును
     నఖరాయుధుండును నై కవిసె నిది యది యని నిశ్చయింపరాక శరీరచ్ఛాయ
     శంఖకుందేందుసన్నిభం బై నైజం బగు తేజంబున జగదుద్వేజకం బైన
     య ట్లున్నది యనిన నందఱు సంభ్రమావేశవిహ్వలు లై ప్రహ్లాదుండు దివ్యావ
     లోకనంబున నాలోకేశ్వరుం బరతత్త్వంబుగా నిరూపించి తండ్రి కి ట్లనియె.220
మ. దితిజాధీశ్వర దేవమర్దన మహాతేజస్వి సంపూజ్య యి
     వ్వితతాశ్చర్యనృసింహమూర్తిఁ దెలియన్ వీక్షించితే సత్త్వశా
     శ్వతసర్వజ్ఞసదద్వయాచింతచిదవ్యక్తాత్మ సువ్యక్తమై
     దితిజోచ్ఛేదనకేళికై యిటులు దోతెంచెం జుమీ యారయన్.221
సీ. నదులు సాగరములు నగములు చంద్రార్కనక్షత్రతారాగణంబు దివము
     ధరణి దిక్కులు మారుతంబు లాదిత్యాశ్వివసురుద్రసాధ్యవిశ్వప్రముఖులు
     మునులు యోగీంద్రులు మనువులు దాతలు సరసిజగర్భుండు చంద్రధరుఁడు
     యక్షులు గంధర్వు లచ్చరుల్ పక్షులు పన్నగుల్ మనుజులు పశుచయంబు
తే. నీసభాంతరమున నున్నయింతవట్టు, వారు నీవిశ్వరూపుని ఘోరరూప
     ముననయున్న తెఱంగుసూపునకు వెలసెఁ, జంద్రబింబంబులోఁ దోఁచుజగమువోలె.222
వ. మీరు గంటిరో కానరో కాని యే నింతయుం గంటి నాకుం జూడ నా యుగ్ర
     తేజంబు నిగ్రహించుకొలఁదిగా దెయ్యెదే నొక్క భవ్యోపాయంబునం దప్పించు
     కొనుటయ యిప్పటికి నొప్పెడు కర్జం బనిన నా దుర్జనుండు దుర్జాతు లగు
     దైతేయులం బిలిచి.223
క. ఏయడవినుండి వచ్చెనొ, యీయర్ధమృగేంద్ర మిచటి కిప్పుడు బాహు
     వ్యాయామంబున దీని న, జేయుల రై కిట్టిపట్టి చెండుఁడు కడిమిన్.224
క. పోనీకుఁ డనిన నసురులు, నానాప్రహరణము లెసఁగ నరసింహునిపైఁ
     గాననసింహముపై శున, కానీకం బడరుమాడ్కి నడరిరి పెలుచన్.225
వ. ఆందఱం బొరిగొని యద్దేవుం డట్టివారికి విహారస్థానం బైన యయ్యాస్థానం
     బంతయుం గరచరణవిక్షేపంబులం బొడిచేసి లేచె నిట్లు భగ్నసభాస్థలుం
     డయ్యును సభయుండు గాక యతండు దనకుఁ గల యస్త్రశక్తి యంతయు సంస్మ
     రించి క్రమంబున మహాదండంబు బ్రహ్మదండంబుఁ గాలదండంబు ధర్మచక్రంబు
     గాలచక్రంబు సృష్టిచక్రంబు బ్రహ్మవిష్ణుమహేంద్రచక్రంబు లార్ద్రశుష్క
     సంజ్ఞం బగు నశనిద్వయంబు రుద్రశూలంబు గంకాళంబు ముసలంబు బ్రహ్మ
     శిరంబు బ్రహ్మాస్త్రం బైషీకంబు శక్రాగ్నిపవనశిశిరాస్త్రంబులు గపాలంబు గైంక
     రంబు హయశిరంబు సోమపైశాచికాస్త్రశస్త్రంబులు మోహనశోషణతాపన
     విలాపనచర్వణంబులును గాలముద్గరంబు సంవర్తనంబు మాయాధరంబు ప్రస్థా
     పనంబు మొదలుగా నపరిమితంబు లైన యస్త్రంబులు పఱపి సర్వాస్త్రరాజంబును

     నప్రతిహతప్రభావం బగు పాశుపతంబుం బ్రయోగించిన నయ్యస్త్రంబులన్నియు
     నన్నరమృగేంద్రుం బొదువుటయు ఘర్మసమయంబున ఘర్మాంశుకిరణంబులు
     తుహినశైలంబుం బొదువుచందం బయ్యె నాలోన.226
మ. సకలానీకము పన్ని విష్ణునిపయిన్ సంహారవాత్యాభయా
     నకవేగంబున వచ్చి తాఁకి వరుసన్ సర్వాస్త్రశస్త్రంబులం
     బ్రకటోపాయనికామనిర్భరముగాఁ బ్రక్షిప్తముల్ సేయ న
     య్యకలంకుం డవియెల్ల మ్రింగె వికటవ్యాలోలవక్త్రంబునన్.227

విప్రచిత్తిప్రభృతిదానవులు హిరణ్యకశిపుతోడం గూడి నరసింహదేవునితోఁ బోరుట

చ. ఉడుగక వెండియుం దనుజయోధులు శక్తిశరాదు లోలి ను
     గ్గడువుగ దీటుకొల్పి హరిగాత్రము సర్వముఁ గప్పి యాకసం
     బెడపడకుండఁగాఁ బొదివి యేపున నార్చి నిజేశుచూడ్కికిం
     గడుఁబ్రమదంబు నద్భుతవికాసముఁ గల్గగఁ జేసి రుధ్ధతిన్.228
మ. అలుకం బేర్చి నృసింహుఁ డొక్కమొగి నయ్యస్త్రంబు లుధ్ధూనన
     స్ఖలితస్కంధసటాసమీరునకు మేఘశ్రేణి గావించి య
     వ్వలనం గన్నులగ్రేవలం గనలు తీవ్రజ్వాల లాభీలభం
     గులుగాఁ జూచిన విచ్చె నల్దెసలకుం గ్రొవ్వేది తత్సైన్యముల్.229
వ. అప్పుడు నరమృగేశ్వరు నా దైత్యేశ్వరుం డెదిర్చి యర్చిష్మతి యగు శక్తి
     యొక్కటి వైచిన నతండు దాని నుగ్రహుంకారంబున నడంచి పెలుచం గర్జిల్లిన
     నమరశత్రుండు శరాసనంబు గైకొని నిశాతశరంబు లతనిపైఁ బఱపిన నవి
     క్రొమ్మొనల నలువున నాభీలనలినీకాననంబు కాంతి గగనంబునకుం గలిగించె
     నయ్యుత్సాహంబు గని యటమున్ను చెదరిన దొరలుం గూడికొని.230
తే. పొదలి మాయ నదృశ్యులై చదలనుండి, కొండలంతలురాలు ముకుందుమీఁద
     నూఁడుకొన వైవఁదొడగి రొండొండదెసలు, మూసెఁ బాషాణరోధసముత్థతమము.231
క. అవియెల్లను నానరహరి, యవయవములు సోఁకి యిసుకలై చెడిపోయెన్
     దివిజవిరోధులు మఱియును, వివిధం బగునింద్రజాలవిభవము పేర్మిన్.232
వ. వేదండతుండస్థూలం బగు సలిలధారలు గలిగించి నిరంతరాసారంబు ప్రచండ
     సమీరప్రహారఘోరంబుగాఁ గల్పింప గల్పాంతకాలంబునఁ గాలాంబుదంబు
     లడరి కురిసిన మురిసిపోవుపగిదిఁ బృథివి యెయ్యెడలను వ్రయ్యం జొచ్చె
     నెచ్చోట్లు నెవ్వరికిం దోఁపనీక చీఁకట్లు పర్వి సర్వలోకంబు నాకులంబుఁ జేసిన
     నయ్యుగ్రప్రయోగంబునందు.233
క. ఒకచినుకుఁ జోఁక దవ్విభు, నొకయింతయుఁ దాఁక దనిల మొకలవముం జూ
     డ్కికి నడపడుడదు తిమిరము, వికసితదివ్యప్రభావవిభ్రముఁ డగుటన్.234
ఉ. దానవు లంతఁ బోక పటు దారుణవహ్ని సృజించి తీవ్రవే
     గానిలవర్ధమాన మగునట్లుగఁ జేసి తదీయవిగ్రహ

     గ్లాని యొనర్పఁ జూచిరి శిఖాచయముల్ జగదండదాహదీ
     క్షానటదుగ్రనేత్రరుచికల్పములై పొదివెన్ దిగంతముల్.235
వ. అంతయు నెఱింగి శతమన్యుండు శతసహస్రసంఖ్యలజలధరంబుల సత్వరంబుగాఁ
     బనుప నవి యవిరళోద్ధతధారావర్షమున నమ్మాయాదహను నుపహతుం జేసి య
     ద్దేవునకుఁ బుష్పవృష్టిప్లావనం బొనర్చి చనియె నివ్విధంబున.236
క. తమకపటపుఁజేఁతలు మో, ఘములై చెడుటయును భీతికంపితమతులై
     యమరద్రోహులు నిజవిభు, నమేయబలుఁ జేరి యొదిఁగి రచ్చట నచటన్.237
వ. ఆసమయంబున నపర్వరాహుగ్రహదిగ్దాహలోహితవర్షనిర్ఘాతపాతంబులు లోనైన
     యుత్పాతంబులు దైతేయాన్వయవినాశపిశునంబు లై తోఁచె నవ్విధం బుప
     లక్షించి హృదయక్షోభంబునఁ గోపంబు రెట్టింప బెట్టిదం బగురభసంబున గడంగి
     దితిసూనుండు.238
సీ. కులపర్వతంబులు కుదురులు గదలి సంధులు నాసి తటములు దునిసి పడఁగ
     జలరాసు లేడునుం గలఁగుండుగొని యెడ గడ్డలపై దొరగడలుదొడర
     దిక్కూలములు గూలి దిగ్గజంబులు గట్టుఁబట్టులు విడిచి విభ్రాంతిఁ దూల
     దర్వీకరాధిపుతలలచుట్టలు వీడి పడఁగ లొండొంటితోఁ దొడరి మ్రొగ్గ
తే. నాదికూర్మంబునకు భీతి యగ్గలింప, సప్తపాతాళములు దిగజాఱి యడగ
     నూర్ధ్వభువనంబు లుత్కంప మొంద నుర్వి, రెండుచెఱుఁగులఁ బట్టి యొండొండ యాఁచె.239
వ. అట్టి రౌద్రంబునకుఁ దల్లడిల్లి త్రిదివనివాసు లందఱు మునిబృందసమేతంబుగా
     జీమూతమార్గంబున నిలిచి యద్దేవుం బ్రస్తుతించి దేవా యీదుష్టదైత్యుం డత్యంత
     విప్లవంబునకుఁ దొడంగెఁ జరాచరభూతంబు లుపఘాతంబు నొందుచున్న వింకఁ
     దడవుగా వినోదింపవలవదు. వీనిం బొరిగొని వీనియంతటివారైన దానవుల
     నిందఱ బారిసమరి సంప్రాప్తవిజయలక్ష్మీసమాగమసౌఖ్యుండ వై సురముఖ్యులం
     గావుము జీవలోకంబునకు సుస్థితి గావింపుము.240
క. అసురాంతకరణములు స, ర్వసురాభయవితరణములు భవద్భాహులకున్
     వసమగుఁగాక కలఁడె యెం, దు సమర్థుఁడు వేఱయొకఁడు దురితధ్వంసీ.241
క. శతమఖుఁ జెప్పదు చెప్పదు, శతధృతిఁ జెప్పదు విముగ్ధశశిధరు భువన
     స్థితికి నభూతో నభవి, ష్యతి యని శ్రుతి నిన్న కాదె యచ్యుత! పొగడున్.242
వ. అని ప్రశంసించు నెలుంగు లాకర్ణించి యాకర్ణాంతవదనకుహరుం డై యట్ట
     హాసంబు సేసి యాసింహాకారవీరుండు.243
సీ. దౌడ లొండొంటితోఁ దాటించి సెలవుల జిహ్వయార్చుచు నగ్నిశిఖలు సెదరఁ
     బెలుచఁ గర్ణంబులు బిగియించి ముడివడుబొమ్మతో నుదుటఁ బెంజెమట యొలుకఁ
     గనలుకన్నులు ద్రిప్పుకొనఁగఁ బింగచ్ఛాయ నెఱయఁ దారకములు నిప్పు లుమియ

.

     నడరునిట్టూర్పులు వడ చల్లఁగా ముక్కు పుటము లొండొంట నుప్పొంగి తనర
ఆ. మెడ విదిర్చి సటలు మింటిపై నెఱసంజ, వఱపఁ గినుక నిండుపఱపుగాఁగ
     మ్రొగ్గి దాఁటుగొని సముద్ధతి పైఁ బడి, పట్టెఁ బులి మృగంబుఁ బట్టురీతి.244
వ. ఇవ్విధంబునఁ దనవిక్రమక్రీడారభసంబునకు వశం బై చిక్కిన యక్కజంపురక్కసు
     నయ్యమితసాహసోద్దీపుండు దీప్తకరరుహంబుల నురంబు వ్రచ్చి పెచ్చు వెరిఁగి
     సురుఁగు లురులు క్రొన్నెత్తురు వెల్లువగొన నెల్లయెడలం జల్లి ప్రేవులు వెఱికి
     కుఱుకులు గొన వైచి తెగటార్చి యార్చిన నయ్యార్పుటెలుంగు నింగిముట్టి
     త్రిలోకంబులకు నాహ్లావసంపాది యయ్యె నయ్యవసరంబున నఖిలబృందార
     కులుఁ బురందరపురస్సరంబుగా నరుగుదెంచి యద్దేవునిం గని కృతాంజలు లై
     తదీయవిభవంబు నభినందించి యి ట్లనిరి.245

హిరణ్యకశిపుని సంహరించిన నరసింహదేవుని దేవతలందఱు నభినందించుట

చ. విమతవిదారణార్థముగ విశ్వగురుండవు నీవు లీల ని
     ట్లమరఁగఁ దాల్చినట్టి పురుషార్థవిచిత్రమృగేంద్రరూప మిం
     కమరమునీంద్రమర్త్యతతులందుఁ బరాపరవేదు లెల్లఁ బూ
     జ్యముగ నుదాత్తభక్తిఁ దమయాత్మల నుంచెద రంబుజోదరా.246
క. శ్రుతియును నిన్ను మృగేంద్రా, కృతి యని కీర్తింపఁగలదు కేశవ మృగసం
     తతికి మృగేంద్రునిక్రియ దే, వతలకు నెల్లను నృసింహవపు వెక్కుడగున్.247
ఆ. అక్షరం బచింత్య మవ్యక్త మవికార, మక్రియంబు ధ్రువ మనామయంబు
     గోప్య మనఁగ నొప్పుకూటస్థపదము నీ, యొడలుగాఁ దలంచు యోగిజనము.248
క. కేవలకరుణామూర్తివి, నీ వఖిలేశుఁడవు నాల్గునిర్మలమూర్తుల్
     నీవై ధరింతు విశ్వము, నీవ యుగసహస్రసంప్రణేతవు వరదా.249
క. నీలావుం బౌరుషములు, దూలెడు నవి గావు కాలదోషములఁ గ్రియా
     జాలోచ్చలనంబులు నా, త్మాలంబనసుస్థిరము లనంతవిభూతీ!250
క. కపిలాదిమునులు ప్రజ్ఞా, నిపుణులు ని న్నెఱింగి కాదె నిర్ద్వంద్వగుణ
     వ్యపగమశోభితశాశ్వత, విపులోన్నతి గనిరి దేవ విశ్రుతభక్తిన్.251
క. హరి యనఁగా హరుఁ డనఁగా, సరసిజసంభవుఁ డనంగ శతమఖుఁ డనఁగా
     వరుణుం డన యముఁ డనఁగాఁ, బరమపురుష నీదుబాహ్యభావక్రీడల్.252
క. ఆదియు నంతయు నరయఁగ, లే దీతని కితఁడ చేయు లీలారతిమై
     నాదియు నంతము నింతకు, నాదిజుఁ డన నొప్పు దీన యజమాననుతా.253
సీ. పరమదైవంబును బరమతంత్రంబును బరమధర్మంబును బరమతపముఁ
     బరమహోత్రంబును బరమహవిస్సును బరమపవిత్రంబుఁ బరమదమముఁ
     బరమసత్యంబును బరమయోగంబును బరమరహస్యంబుఁ బరమయశముఁ
     బరమసత్త్వంబును బరమతత్త్వంబును బరమధామంబును బరమగతియు
తే. నిన్నకా నెన్నుదురు ధృతి నిశ్చితాత్ము, లార్తులకుఁ జేరఁజోటు సత్కీర్తనముల

     కాశ్రయంబు మంగళముల కాస్పదంబు, దివ్యభవదంఘ్రియుగళంబు దేవదేవ.254
క. మము నాపదలకుఁ బాపితి, సమకూర్చితి శుభము పూర్వసంపదకుఁ బ్రమో
     దము మిగులఁగ మనిచితి గృప, యమరఁగ [7]నెప్పుడును మఱవకయ్య ముకుందా.255
వ. అని వినుతించిరి సర్వలోకపితామహుండు సనుదెంచి వివిధస్తోత్రంబుల నవ్విచిత్ర
     చరిత్రు నభ్యర్చించె నవ్వరదుండు ప్రసన్నుం డై వరప్రదానంబుల నానందశీతల
     చేతస్కులం జేసి దివ్యతూర్యంబులుం గిన్నరగంధర్వగానంబులు నారదాది
     మునీంద్రప్రశంసావచనంబులు భువననివాసుల జయజయశబ్దంబులు గలసి యొక్క
     మ్రోఁత యై మ్రోయఁ బయఃపారావారంబు నుత్తరపారంబునకుం బోయి యంద
     ఱను వీడ్కొలిపి యాత్మీయపురాణరూపంబు గైకొని యష్టచక్రంబును భూత
     యుక్తంబు నగు మహాశకటంబునఁ బ్రకటక్రీడాకౌతుకపరాయణుం డై నారాయ
     ణాభిధానంబునం బ్రమోదించుచుండె నిది నారసింహం బగు నవతారంబు.256
ఉ. శ్రీనరసింహదేవుకథ సెప్పిన విన్నను దత్క్షణంబ ము
     క్తైనసులై వినిశ్చలనిరంతరధర్మపరాయణస్ఫుర
     న్మానసులై సమస్తయజనవ్రతతీర్థజ శ్రుతిస్మృతి
     ధ్యానఫలాడ్యులై సిరియు నాయువుఁ గండ్రు తిరంబుగా జనుల్.257
వ. అని యిట్టు లవతారవిశేషంబులు వైశంపాయనుచేత నుద్గీతంబు లైన మార్గంబున
     నిసర్గస్వరంబుగా.258
క్రౌంచపదవృత్తము. సారవివేకా సౌఖ్యవిలోకా సకలరిపుభయద సమదసమీకా
     భారమణీయా బంధువిధేయా పరహితకరుణాఫలసదుపాయా
     ధీరచరిత్రా దీపితగోత్రా దివిజనగసదృశధృతియుతగాత్రా
     వీరవరేణ్యా విశ్రుతపుణ్యా వినయగుణవిజయవిలసనగణ్యా.259
క. వితతయువరాజవిభవో, న్నత పోతయసైన్యనాథనయమార్గసమీ
     హితసంతతసేవావిల, సితపుత్ర శ్రీసమృద్ధ శివగుణసిద్ధా.260
మాలిని. భరితసకలధర్మా ప్రాప్తసంతానలాభా
     స్ఫురదతులితశర్మా భూభృదామ్నాయకీర్త్యు
     ద్ధరణధృతసమాఖ్యా దానధౌరేయసౌఖ్యా
     కరణసమయముఖ్యా కల్పితానల్పసఖ్యా.261
గద్యము. ఇది శ్రీ శంకరస్వామిసంయమీశ్వరచరణసరోరుహధ్యానానందసౌందర్య
     ధుర్య శ్రీసూర్యసుకవిసంభవ శంభుదాసలక్షణాభిధేయ యెఱ్ఱయనామ
     ధేయప్రణీతం బైన హరివంశంబు నుత్తరభాగంబున నవమాశ్వాసము.

  1. నుదారు
  2. వెండియు
  3. విభ్రాంత
  4. పాయిది
  5. క్రియలునుఁ గ్రియాఫలంబులుఁ, గ్రియవిరహితపురుషుఁ డనఁ
  6. నహితుల యుల్లాసంబు నిరాసం బైన
  7. నెప్పుడు మఱాకు మయ్య