హరివంశము/ఉత్తరభాగము - అష్టమాశ్వాసము
శ్రీరస్తు
హరివంశము
ఉత్తరభాగము - అష్టమాశ్వాసము
నందనసమసౌంద
ర్యానందితయువతిహృదయ యధికాభ్యుదయా
యానతజనహృద్యదయా
భూనుతజయశక్తిభీమ ప్రోలయవేమా.1
వ. అక్కడకుండు శౌనకాదిమహామునులకుం జెప్పె నట్లు దేవీవచనసమాశ్వాసితుం
డై వాసుదేవతనయ తనూభవుం డున్నంత నటమున్న యక్కడ.2
సీ. ఆచిత్రరేఖ మాయాచిత్ర[1]ముఖమున నమ్మహాభుజుఁ బ్రణయమునఁ గొనుచుఁ
బోవ నాతని యంతిపురముభామిను లెల్ల నాత్మేశుఁ బొడగాన కార్తి నొంది
ప్రియులఁ బాసినకిన్నరీసమూహముఁబోలే నాక్రందనము సేయ నప్పొలఁతుల
యులివు దివంబున నుద్విగ్న[2]కురరీవిరావంబు క్రమమునఁ బ్రబల మగుచుఁ
తే. బరఁగె నయ్యేడ్పులోన నప్పడఁతుల కట, యెవ్వఁడొకొ మామనోనాథుని నసమానుఁ
గడఁగి మాకన్ను లెల్లను గప్పి మమ్ము, ననదలుగఁ జేసి యెక్కడేఁ గొనుచుఁ బోయె.3
చ. బలరిపుఁ డాదిగాఁ గలసుపర్వులు గర్వితదైత్యభీతు లై
బలమఱి వచ్చి మీవిభునిబాహులనీడ యుపాశ్రయింతు ర
య్యలఘునిపౌత్రుఁ గొంచుఁ జనునంతటివాఁడును గల్గె నౌర యే
బలియుఁడొ భీతిదాయికినిణ బ్రస్ఫుటభీతిదుఁ డయ్యె నియ్యెడన్.4
తే. పగఱ బరి వ్రేసి యాఁగి దర్పంబుఁ జలముఁ
గోలుపుచ్చుమురారాతిక్రోధవహ్ని
యుఱుక యిట్టుల మండఁగ నూఁదునుదుటు
గలుగు గుండియగలవాఁడు గలఁడె జగతి.5
చ. తెఱచిననోరితో నొదవుతీవ్రపుమృత్యువుకోఱ లూఁపఁగా
నఱుముట గాదె మాధవున కప్రియ మి ట్లొనరించు నింద్రుడుం
బఱిపఱిగాక పోఁగలఁడె బాహుమదంబున వాసుదేవు న
క్కఱపడఁ జేసిరేవి విధి గానరొ కాక దురాత్ము లేమియున్.6
తే. వగలపెనువెల్లిఁ బడితి మెవ్వలనఁ దేప, గాంతు మసురాంతకునికృప గాంచుచంద
మెద్ది పతిలేనియతివల యెడరు జముని, యాటకట్టు దుర్దశలకు నాకరంబు.7
వ. అని యి ట్లొనర్పు విలాపంబునకుం గలంగి యిది యేమి యెక్కడి యార్తస్వరం
బనిరుద్దుదేహంబున నేమిభయంబు పుట్టె గృష్ణసంరక్షితులకు భయంబు కలిమి
యపూర్వం బనుచు నొండొరుల కెఱింగించుచు యాదవు లెల్లను సంభ్రమం
బున నసహ్యధిక్కారవిహ్వలంబు లై గహ్వరంబులు వెలువడు సింహంబులుంబోలె
నొక్కెడ యాత్మమందిరంబులు వెలువడ నంతటిలోనన సభాపాలప్రహతం బై
సంవర్తజలధరారావం బై భైరవంబుగా సన్నాహభేరి చెలంగిన.8
శ్రీకృష్ణబలరామప్రభృతు లనిరుద్ధునిపోకకుఁ గారణం బూహించుట
ఉ. ఆసభ కందఱున్ హరిహలాంకులు మున్నుగ వచ్చి పుష్పబా
ణాసనుపట్టిపోక దెలియ న్విని యొక్కట శోకబాష్పని
శ్వాసవివర్ణమూకవదనాంబురుహంబులతోడ విస్మయా
యాసితమూర్తులై యొకకళాంతర మున్నెడ వారిలోపలన్.9
వ. వికద్రుం డను యదుముఖ్యుండు మురాంతకున కి ట్లనియె.10
మ. భవదీయోద్ధతబాహుపంజరమునం బర్యాప్తగుప్తంబు యా
దవవంశంబ యనంగనేల దివిషత్పాలుండు నాభీలశా
త్రవసంతాపశరణ్యుఁగా నిను మదిం దా నమ్మి [3]యుండం గడున్
భువనేశుండవు నీవు నీకుఁ దగునే పోరామితోఁ జింతిలన్.11
క. అనిరుద్ధునిఁ [4]గానమికం, టెను నీ విబ్భంగిఁ జింత డిందుట గని నీ
యనుఁగులు వగచెద రిందఱ, ననునయవాక్యములఁ దేర్పు మనఘవిచారా.12
వ. నీవు నీమనంబున నొక్కింత దెలిసి చూచినం దోఁపని తెరువులు లేవు గుమారు
పోక యూహించి తగిన యుద్యోగంబు వాటింపు మూరకయుండుట తగ దనిన
నీషదుల్లాసవిశదవదనుం డగుచు నంబుధిసదనుం డి ట్లనియె.13
క. పాపనిపోయినతెరు వే, నోపి యరసి చక్కఁబెట్టకున్నను జను లా
రోపింతురు నాపై నొక, యోపమి యటుగాన చింత నొందఁగ వలసెన్.14
తే. చిఱుతనాఁడు ప్రద్యుమ్నుని గఱకుటసుర, గొనుచుఁ బోయిన పోకడ గనుట లేక
యేము వగవంగ రిపుఁ జంపి యెలమి నతఁడు, దాన యేతెంచి తఱిగె మత్పరిభవంబు.15
ఉ. ఈతనిచందముం దలఁప నిట్టిద వైరులు వేగ నుగ్రులై
నాతలపై సభస్మచరణం బిడిపోయిరి గాక యల్పమే
యీతెఱఁ గేమి సేయుదు నుదీర్ణబలంబున నీనికారమున్
వే తొలఁగింతుఁ ద్రోవ గనువెంటకుఁ జూడుఁడు మీ రుపాయముల్.16
క. అనవుడు సాత్యకి దేవా, పనుపుము బహుజనుల నరయ బహుభూముల కెం
దును బహుభంగుల నరయఁగఁ, గనియెదము కుమారు నరసి కాదే చేఁతల్.17
వ. అనిన నుగ్రసేనుం డది యట్టిద యరయక యెఱుఁగవచ్చునె యిప్పనికి నాలస్యం
బేల యనుమాటకు మాధవుండు రథచారుల నశ్వచారులం బాదచారుల
నాక్షణంబ యనేకులం బిలుపించి రైవతంబు లతావేష్టంబు ఋక్షవంతంబు నను
పర్వతంబులయందును వివిధోద్యానవనంబులయందును నదీప్రస్రవణవేశంతసరో
వాపికాతీరంబులయందును గుమారు వెదకుం డనుచుం బనిచె నట్టియెడం దదీ
యసేనాపతి యగు ననాదృష్టి యతని కి ట్లనియె.18
సీ. అధిప యింతయుఁ గాల మాత్మలోపలన యే నొకకార్య మూహించుచుండి నీదు
మనసుచొ ప్పెఱుఁగక మాటగా వెడలంగ నది విన్నవింపంగ నయితి నిప్పు
డవసరం బై యున్నయది కాన యాడెదఁ [5]బనిలేక వేల్పులపనికి నీవు
కడఁగి దానవులఁ బెక్కండ్రం ద్రుంచి వారిపుత్రపౌత్రసహాయమిత్రవితతి
ఆ. సాలఁ గలదు పారిజాతంబు గొనునెడఁ, దొడరి వృత్రభేది నొడిచి తతఁడు
గొంత మనసునందుఁ గొఱకొఱ గాకున్నె, యోట సైఁచునే మహోన్నతుండు.19
వ. నాకుం జూడ నీయపాయంబు వీరిలో నొక్కదెసం బొడమినది కావలయు నని
రుద్ధహరణం బన్యులకుం బనియేమి విశేషించి యింద్రుండు దీనికిం గారణం బగు
నని తలంచెద ననినఁ గృష్ణుండు నవ్వుచు నతనియాననం బాలోకించి.20
చ. అసురులచేఁతయే యిది సురాధిపు లక్కట దుష్టచిత్త లే
యసదృశవిక్రమంబున సురార్థమగాదె నీరంతరంబు నీ
వసుమతి నేను వర్తిలుట వారక యింత యెఱుంగరే సురల్
పసగఁ బరోపకారులకుఁ బాప మొనర్తురె పుణ్యచేతనుల్.21
వ. నీ వెఱుంగక యి ట్లాడి తనిన నక్రూరుండును దదనురూపంబుగాఁ బలికెఁ గృష్ణుండు
మఱియును.22
క, వినుఁడు పురుషు లెవ్వరికిం, బనిగా దనిరుద్ధుచనినభంగి జఱభి నాఁ
జనునది యెవ్వతెయేనియు, ననురక్తి నటించి కొనుచు నరుగం బోలున్,23
తే. దైత్యదానవదేవసుందరులు మాయ, [6]లెన్నియేఁ జూపఁగా నేర్తు రెట్టివాని
నైనలోఁతు రెక్కడనైన నధికగుప్తి, జొత్తు రరుగంగ వలఁతు రెచ్చోటికైన.24
వ. కావున మన మవ్విధంపుజాడ లరయింపవలయు ననియె నట్టివిచారంబున నయ్యం
దఱు నున్నచోఁ గొన్నిదివసంబులకుం జారు లరుగుదెంచి సభాద్వారంబున యదు
వీరవర్గంబు నెదుర నిలిచి వాసుదేవునకుం బ్రణమిల్లి దీనానను లగుచుఁ గరం
బులు మొగిచి.25
క. దేవర యానతి యిచ్చిన, యావివిధస్థలములందు నన్యములందున్
వేవిధముల వెదకితి మె, చ్చో వీరుఁ గుమారుఁ గానఁ జొప్పడదయ్యెన్.26
వ. ఇంక నెక్కడి కరుగుదు మెయ్యెడ రోయుదు మేమి యానతి యనిన నందఱు డెందం
బులు గలంగం గన్నీరు నినిచి యొండొరుల మొగంబులు సూచి యెయ్యెది
గర్తవ్యం బని యెప్పటియట్ల భిన్నప్రకారవిచారు లై రాదివసంబును రజనియు
నవ్విధంబునన కడచిన.27
తే. భద్రతూర్యనాదంబులఁ బ్రకటసూత, మగధకీర్తనంబుల వందిమధురనుతుల
మేలుకని కృష్ణుఁ డుచితసమీహితక్రి, యాకలాపంబు దీర్చి సమాదరమున.28
వ. సభామండపంబునకుం జనుదెంచి యుగ్రసేనపురస్సరంబుగాఁ దగినతేఱంగున సకల
యాదవులు నాసీనులుగా నాసీనుం డై యున్న సమయంబున.29
నారదమహాముని శ్రీకృష్ణునికి ననిరుద్ధుని వృత్తాంతంబంతయు నెఱింగించి పోవుట
క. ఉదయించినభానుఁడు గా, కుదయించెనొ కాక పేఱ యుష్ణకరుఁ డొకం
డిది యద్భుత మనఁగా నా, రదముని కట్టెదురఁ దోఁచె రాజితలీలన్.30
వ. అంత నమ్మహాత్మునిఁ గనుంగొని కమలనయనుండు మున్నుగా నందఱు నభ్యు
త్థితు లై జయజయ శబ్దంబులం బూజించిరి కృష్ణుండు మధుపర్కంబున నఖిల
లోకార్చనీయు నతని నర్చించిన నతండు నర్హపీఠంబున నుండి యందఱ నెప్పటి
యట్ల యుండం బనిచి యిది యేమీ యందఱుం జింతావికలంబు లైన య ట్లున్న
భావంబులతోఁ బౌరుషంబులదెస నుదాసీనులుం బోలె నున్నా రనిన నారా
యణుం డతనిం జూచి.31
క. మునివర యనిరుద్ధుం డెట, చనియెనొ యెఱుఁగంగ లేక సర్వదిశల నా
తని వెదకించియుఁ గానక, మనములు నేడ్పడఁగ నిట్లు మఱిఁగెద మిచటన్.32
వ. త్రైలోక్యజంఘాలుండ వగు నీ విచ్చటికి విచ్చేయుట మాభాగ్యంబు గాదె
కుమారునకు నింక నభ్యుదయంబ యనిన నవ్వుచు నవ్వి బుధసంయమి యి ట్లనియె.33
క. కన్నులకసివోఁ జూచితి, మెన్నఁడు నెచ్చోటఁ బోటు లిట్టు లెఱుఁగ మో
యన్న భవత్పౌత్రుఁడొకఁడ, యున్నతభుజు బాణుఁ దొడరి యుక్కునఁ బెనఁగెన్.34
వ. ఎ ట్లనిన బాణదైత్యునికూఁతు రైన యుష యను కన్య యనిరుద్ధునిఁ గామిం
చినం జిత్రరేఖ యను నచ్చర యచ్చెలవకై యిచ్చటకి వచ్చి యతనిం దోడ్కొని
పోయి యిరువురం గూర్చిన నెఱింగి బాణాసురుండు కుమారుపైకి నడిచినం
బొడిచి యతం డతనికి మిక్కుటం బగు మగంటిమి మెఱయుటయు.35
ఉ. లావున గెల్వలేక తనలావగుమాయ యొనర్చి సర్పరూ
పావిలఘోరపాశముల నాతనిఁ గట్టెఁ బురందరద్విషుం
డావిధ మెల్ల నేను దెలియం గని వచ్చితి నీకుఁ జెప్పఁగాఁ
జేవ యెలర్ప లె మ్మఖిలజిష్ణు జయింపు బలీంద్రనందనున్.36
వ. బాణనివాసం బగు శోణపురంబునఁ బ్రద్యుమ్నసూనుం డున్నవాఁ డది యిచ్చ
టికిఁ బదునొకండువేల యోజనంబుల దవ్వు గలదు మానుషంబున నధిగమింప
నశక్యంబు.37
క. తలఁపుము వినతాసుతు న, బ్బలియుండు మనోజవుండు ప్రతిహతి లేదె
వ్వలన నతనిగతి కేటికి, నలఘుమతీ యింకఁ దడయ నని పలికి తగన్.38
వ. నారదుం డరిగిన నాక్షణంబ పుండరీకాక్షుండు తార్క్ష్యుఁ దలంప నయ్యకంపిత
ప్రభావు భావం బెఱింగి యెఱకల మెఱుంగులు దుఱంగలిగొనం జనుదెంచి
భుజంగమథనుండు భుజంగశయను కట్టెదురం బ్రాంజలి యై నిలిచి ప్రణత
మస్తకుం డై ప్రశస్తపర్ణస్వరమనోహరంబుగా ని ట్లనియె.39
తే. అఖిలజగదుపకర్తవై యలరునీకుఁ, బిలిచి ననుఁ బంచి చేయింప వలయునట్టి
కార్య మెయ్యది యిత్తఱిఁ గలిగె నాన, తిచ్చి యిప్పుడు రక్షింపు మింపుమిగుల.40
సీ. పక్షవిక్షేపసంభవమారుతంబునఁ దొడరి యెవ్వనివీడు ధూళిఁబుత్తుఁ
గ్రోధరూపేక్షణక్షుభితాగ్నికీలలఁ జేసి యెవ్వని బలశ్రేణిఁ గాల్తుఁ
జరణనిపాతనచఱులఖేలనముల నెఱపి యెవ్వని వెఱచఱవ నడతు
దారుణత్రోటీవిదారణతీవ్రతఁ గడఁగి యెవ్వనియంగకములు గూల్తు
తే. నేను నీబంట నై యుండ నెఱుఁగ నేర, కకట యెవ్వాఁడు నీకు నె గ్గాచరించె
మిగిలి మిన్నందిపెనఁగొనుమేటియైన, నాయువును శ్రీయు నెవ్వాని కవశమయ్యె.41
మ. అనవద్యోన్నతమాంసలస్థిరమదీయస్కంధపీఠస్థితున్
నిను నెవ్వాఁ డనిలోన మార్కొని కన న్నిర్ణిద్రచక్రానలం
బున కాత్మీయశరీరజీవితధనంబుల్ సాధుసాన్నాయ్యతా
వినియోగ్యంబులుగా నొనర్పఁ దలఁచెన్ విశ్వైకరక్షామణీ.42
సీ. పాంచజన్యస్వనపారుష్య మెఱుఁగక యదుసేన ముంగలియగుట గనక
కౌమోదకీఘోరఘాతంబు దలఁపక నందకగరిమ యెన్నంగఁ జొరక
శార్ఙ్గమౌర్వీఘోషచండత యూహింప కలఘుదివ్యాంబకకలన వినక
హలిసీరకర్షణవ్యాప్తి పాటింపక ముసలసంప్రహరణముఖ మరయక
తే. నిన్ను నెవ్వఁడు నెమకి యన్నీరజాప్త, సుతునియింటికి నతిథి గాఁ జూచె నిప్పు
డింతయును నానతిమ్ము సర్వేశ సర్వ, భద్రకారి కృపాలాభ పద్మనాభ.43
వ. అనినం బ్రసన్నవదనుం డగుచు వాసు దేవుండు పక్షీంద్రున కి ట్లనియె.44
క. బలిసుతుఁడు బాణుఁ డనియెడు, బలియుం డిఫు డనఘ వినవె ప్రద్యుమ్నసుతుం
గలుషవిషోరగపాశం, బులఁ జుట్టినవాఁడు కూతుఁ బొందినకతనన్.45
వ. బాణనగరంబు మర్త్యలోకచారులకుఁ జరింపరానితెరువు దూరంబునం జేర నలవి
గానిది యై యుండు నీవు మము నట తోడ్కొని పోయితేని పగ సాధింప
సుకరంబు.46
క. నీకోడలు కొడుకునకై, శోకం బుడిగింపరాక సుడిసినయది య
స్తోకబలంబునఁ దమ్ముఁడ, వే కడగఁగవలయు బాలు విడిపించుటకున్.47
చ. ఎఱకలధూళి పన్నగుల యీక్షణము ల్గబళించి చుట్టునుం
జుఱచుఱఁ బ్రేల్చుమంటలవి సొంపున నార్చి యుదగ్రయోధులన్
బఱిపఱి చేసి వేలుపుల పాలిసుధాధన మీవు దెచ్చి వే
చెఱ యుడిగించి తల్లికిఁ బ్రసిద్ధిగఁ జూపవె పుత్రకృత్యముల్.48
క. ఆతతజవసత్వధృతి, ఖ్యాతుల నిక్కము గణింపఁగాఁ బక్షివరా
నీతోడు నీసమానులు, భూతావళిలోన నెందుఁ బుట్టరు పురుషుల్.49
తే. అఖిలజీవజాతము వీఁపునందు మోచి, కన్ను గిఱిపినంతన త్రిలోకములు దిరుగ
నోపు దీవు ఱెక్కలతోడ నొప్పుమేరు, వనఁగఁ దగుఁగాక నిన్ను నొం డనఁగ వశమె.50
క. చెలికాఁడవు నాపై న, గ్గల మగుకూర్మియుఁ బ్రీయంబుఁ గలవాఁడవు నా
కొలసిన పోరామితఱిం, దలకొని నీపేర్మి సూపఁ దగదె మహాత్మా.51
వ. అని యి ట్లతండు తన్నుఁ బ్రశంసించుట కోర్వక విగతగర్వుం డగువిహంగమపార్వ
భౌముండు భయవినయవినమ్రుం డగుచు నప్పరమేశ్వరుం దప్పక చూచి యి ట్లనియె.52
గరుత్మంతుఁడు శ్రీకృష్ణుని ననేకవిధంబుల స్తుతి చేయుట
క. కడుఁగ్రొత్తలు నీ విటు నను, బడుగుం బాటించి మిన్ను ప్రాకించెదు నీ
యడుగులగొనియాటకుఁ బను, పడినారము నీకు మమ్ము బాడియె పొగడన్.53
క. ము న్నిట్టి భవదనుగ్రహ, మెన్నఁడు గన్నారు గలరె యెవ్వారలు నే
నెన్నిక కెక్కినధన్యుఁడ, వెన్నుఁడ నీమీఁదిభక్తివిభవముకతనన్.54
సీ. నిఖలనాయకుఁడవు నిఖిలసురాసురేశ్వరుఁడవు భక్తవాంఛాప్రదుఁడవు
సంతతామోఘదర్శనుఁడవు సకలయజ్ఞప్రవర్తకుఁడవు సత్వనిధివి
చతురాశ్రమప్రకాశితవు చతుర్దేహుఁడవు చతుర్బాహుమండలనిభాసి
వంచితశంఖచక్రాసిశరాసనధరుఁడ వనేకావతారకృతివి
తే. దేవకీదేవికిని వసుదేవునకును, బట్టి వై పిన్ననాఁ డాలపదువుఁ గాచి
కొండ గొడుగుగ ఘటియించి ఘోరరాక్ష, సుల వధించితి కేశికంసులు మొదలుగ.55
క. హలముసలలాంఛనుఁడ వై, బలనామము దాల్చి నీవు పటుదైత్యవిని
ర్దళనచణచండబాహూ, జ్జ్వలత వెలింగెదవు సకలచక్షుష్కుఁడ వై.56
క. విప్రకులరూపకుండవు, విప్రప్రియుఁడవు సమస్తవిప్రాత్ముఁడవున్
విప్రప్రాణప్రదుఁడవు, విప్రప్రాణుఁడవు భజితవిప్రుఁడ వెందున్.57
క. నీవు గతకాలమున సు, గ్రీవునిచెలిపై సురారిఁ గిల్బిషకారిన్
రావణుఁ గూల్చి తదీయ, శ్రీవిభవము తదనుజన్ముఁ జేర్చితి [7]కరుణన్.58
క. బలిరాజ్య మపహరించితి, జలనిధిఁ ద్రచ్చితి ధరిత్రి సర్వము గ్రోడా
కలనమున నుద్ధరించితి, గొలిచితి శాసించి తఖిలగోప్తవు పేర్మిన్.59
తే. నేలయును నీవ నింగియు నీవ దిశలు, గాలమును నీవ యగ్నియు గాడ్పు రవియుఁ
జందురుఁడు నీవ సృష్టియు సంహృతియును, నీవ కావింతు విశ్వంబు నీవ తాల్తు.60
క. అజుఁడవు హిరణ్యగర్భుఁడ, వజరామరదేహుఁడవు మహాదేవుఁడ వీ
వజితుఁడవు నిత్యజై త్ర, స్వజనుఁడవు జనార్దనుఁడవు జని వఖిలముకున్.61
క. పొగడుటలు నిన్న చేరును, బొగడెడువారలును నిన్న పొగడుదు రర్థిన్
బొగడెడువారికి నీ వి, మ్ముగ రాజ్యస్వర్గమోక్షముల నిత్తు హరీ.62
క. నీ వించుక క్రోధముతో, నేవారలఁ జూతు వారి కేలోకములున్
లేవు భవత్ రుణోద్య, బ్భావితు లాబ్రహ్మభువనభాగ్యోదగ్రుల్.63
వ. అని వినుతించి గరుత్మంతుండు దేవా యేను నీతలంపులోనివాఁడ నెవ్విధంబునం
బనిగొనఁ దలంచి తవ్విధంబున కెల్లను వశ్యుండం గర్తవ్యంబులయందు
నన్ను ని ట్లాదరించుట మహాప్రసాదం బిదె యాయితం బైతి నెక్కు మెక్కడ
విజయం చేసెద వక్కడ నడిచెద ననిన నెంతయు సంతసిల్లి శ్రీకాంతుం డమ్మహా
సత్వుం దిగిచి కౌఁగిలించి.64
శ్రీకృష్ణుఁడు బలరామప్రద్యుమ్నులతోఁ గూడి బాణుని జయింపఁ బోవుట
సీ. అర్ఘ్యంబు దెప్పించి యతనితో జయహేతు విది నీవు గైకొను మింపు మిగుల
ననుటయు నవ్వీరుఁ డట్ల చేయఁగ సర్వసన్నాహమును బూని చక్రధరుఁడు
యదువృద్ధు లెల్లఁ బ్రియంబున దీవింప విప్రులు జయవచోవితతి యొసఁగ
నర్థిఁ బుణ్యాంగన లక్షత లొలుకంగ వందిమాగధసూతవరులు వొగడ
తే. జయవిధాయి తూర్యధ్వని సకలదిశలఁ, బరగఁ జేతఃప్రసాదసంభరితుఁ డగుచు
నెక్కె గరుడని దోడనె యెక్కె రాముఁ, డెక్కెఁ బ్రద్యుమ్నుఁడును మోద మెగకమెసఁగ.65
వ. అప్పుడు సిద్ధమార్గంబునఁ బ్రసిద్ధు లగుమునులును సురలును సిద్ధవిద్యాధరులును
నొక్కట యెలుం గెత్త.66
క. గెలువుమ యసహాయుఁ డగుం, బలిసూనుని నీకు నెదురుపడ లేరు జగం
బుల నెవ్వరు సిరిఁ దేజముఁ, దెలివియు నీయందు నిత్యదీప్తము లనఘా.67
వ. అనుచుండ వినుచుం బ్రమోదమేదురచిత్తుం డగు దామోదరుచిత్తం బెఱింగి
మెత్తన వియత్తలంబున కెగసి వైనతేయుండు వైమానికమార్గంబు గైకొనియె
నట్టియెడ నాచతుర్భుజుం డష్టభుజవైభవోత్తుంగం బగునంగంబు నంగీకరించు
టయుఁ జక్రగదాఖడ్గబాణంబులు దన పాణితలంబుల మెఱసె శంఖపద్మచర్మ
శార్ఙ్గంబులు వామకరంబుల నవతరించెఁ గృష్ణకుంతలంబులును దీర్ఘోన్నతనాసం
బును విశదవృత్తాయతేక్షణంబులును దామ్రాధరబింబంబును నాజానులంబి
బాహులు నా రక్తనఖాంగుళికంబులును మధురస్నిగ్ధగంభీరఘోషంబును నై
యయ్యాదిదేవు దివ్యరూపంబు రూపించువారికిం గన్నులపండు వై సహస్రసూ
ర్యోదయతీవ్రం బగు తేజంబునం బొదలె బలదేవుండును వేయుపడగలం బొలుచు
మానికంబులు దిక్కులం గ్రొత్తయెండగాయ నిండుఁజందురుచాయం జెలువొంది
చంద్రధరశైలంబుపోలికం దనరారు తనపురాణమూర్తిం గీర్తనీయుం డయ్యెఁ
బ్రద్యుమ్నుండును ననవద్యం బగుపూర్వాకారంబున నమానుషమహిమో
దారుం డై యొప్పె నిట్టి యమ్మువ్వుర నుద్వహించి.68
మహాస్రగ్ధర. ఘనపక్షాక్షేపవాతోత్కటనిహతిఁ గులధరంబుల్ వడంకం
దనుసంపాతోద్ధతీధ్వస్తము లయి దివిజోద్యానముల్ దవ్వుదవ్వై
చనఁ దీవ్రాంఘ్రిప్రసక్తిన్ జలధరచయ ముత్సంగముం బొంది తూలన్
జనియెం బక్షీంద్రుఁ డిచ్ఛాసదృశగతుల నాచక్రహస్తుండు మెచ్చన్.69
వ. ఇట్లు మనోమారుతవేగంబున సిద్ధసంచరితప్రదేశంబు లనేకంబులు గడచి యరుగు
చుండ నొక్కయెడం గృష్ణుం జూచి బలభద్రుండు.70
చ, మనతనుదీప్తు లన్నియును మాధద వేఱొకచందమై కన
త్కనకసువర్ణతం దనరెఁ గాంచనశైలము నేఁడు జేరవ
చ్చిన నిటు లయ్యెనో కడువిచిత్రము కారణ మొండు గల్గునో
యనుపమబుద్ధి దీనితెఱఁ గారసి కర్జము చూడు మిత్తఱిన్.71
వ. అనవుఁడు నతం డిది బాణనగరసమీపంబు తద్రక్షణార్థంబు రుద్రాజ్ఞ నఖిల
వహ్నులుం బరివేష్టించి యుండు నందులో నాహవనీయం బను వహ్ని మనకు
నెదురై వచ్చినఁ దదీయద్యుతివలన నిట్టి వికారం బొలసె నిమ్మహాగ్ని యధికదుర్జ
యంబు వినతాసుతుండు దీనికిఁ బ్రతినిధానం బెఱుంగు ననిన నాక్షణంబ యప్పక్షి
వరుండు.72
చ. వెడలుపుగల్గునోరు లొకవేయి ధరించి వియన్నదీజలం
బడరఁగఁ బుక్కిలించి రయమారఁగఁ దెచ్చి మహానలంబుపై
నెడపడకుండఁ జల్ల నది యెంతొవెసం బొడవేది పోయె న
ప్పుడు భుజగారి యద్భుతముఁ బొంది మదిం దనుఁదాన మెచ్చుచున్.73
మ. విపులజ్వాలలఁ గల్పసంక్షయదశన్ విశ్వంబు భస్మీకరిం
చి పటుస్ఫూర్తి వెలుంగునట్టిది మహార్చిశ్చండ మివ్వహ్ని యి
ట్లవధూతం బయిపోయెఁ గృష్ణుఁడును సీరాంకుండుఁ బ్రద్యుమ్నుఁడుం
ద్రిపురారాతికి నైన నింక వెఱవం దెల్తుర్ త్రిలోకంబులన్.74
వ. అని తలంచుచుండ నన్నరకాంతకుండును నాగాంతకు విక్రాంతికి నత్యంతంబును
సంతోషించి యతనిం బిచ్చలించె నవ్విధంబున నాహవనీయంబు ప్రశాంతం
బయిన తెఱపిఁ బక్షిప్రభుండు భాసమాననిజపక్షపాతంబులం బ్రభూతం బగు
నాతపంబు నుత్పాదించుచు నుత్పాతపతంగుపగిది నధికభీషణచక్షుఃప్రభాపరివేషం
బుతో నట కడచిపోవ మఱియు రుద్రానుచరు లైన యగ్నులు బ్రహ్మపుత్రులు
గుల్మాషుండును గుసుముండును దహనుండును శోషణుండును దపనుండు ననువా
రేవురును బితరుండును బతంగుండును స్వర్ణుండును నౌర్వుండును భ్రాజుండు
నన నేవురును రెండు మొత్తంబు లై నడచి.75
క. ఈవచ్చువాడు గరుడం, డీవీరునివీఁపుమీఁద నెవ్వరొ యుగ్రుల్
మూవురు వెలిఁగెద రేమిటి, కై వచ్చెదరో మహాద్భుతాకారధరుల్.76
వ. మనము వీరిఁ బ్రతిహతులం జేయవలయు నని యెదిర్చి సింహగర్జితంబులంబోని
యెలుంగుల శోణపురప్రాసాదరంధ్రంబులం బరఁగించిన నమ్మహాధ్వని విని బాణుం
డవ్విధం బరయించి సర్వసైన్యంబుల సన్నద్ధంబులఁ గావించె నంత.77
సీ. ఘనులు జ్యోతిష్టోముఁడును విభావసుఁడునన్ వహ్ను లిద్దఱు రెండువలఁకులందుఁ
దనకుఁ దోడై రా నుదగ్రతేజోమయం బగు రథం బెక్కి స్రువాయుధంబు
దాల్చి యంగిరసుఁడు ధనువు లోనగు నస్త్రశస్త్రజాతము రథస్థంబు సేసి
సన్నుతస్వాహావషట్కారవిభు లగు నాదశాగ్నులును మురారితోడ
ఆ. నాహవం బొనర్ప నచటి కేతెంచి చా, పంబు గొని యనేకబాణవితతిఁ
బఱపె నట్లు గూడఁబడినకృశానులఁ, జూచి నగుచుఁ గంససూదనుండు.78
క. గోవకులార మహోద్దీపితభవదీయతీవ్రతేజ మఖిలమున్
మ పెద మదస్త్రతేజో, వ్యాపృతి నొక్కింత నిలువుఁ డాహవభూమిన్.79
క. అంగిరసుఁడ నీ కేటికి, సంగరముఁ దపస్వివరుల సవనము హుతముల్
మ్రింగినలా వకట యిచటి, కిం గొఱయే తొలఁగు మెదిరి కెడయక నాచేన్.80
వ. అనిన నయ్యంగిరసుండు గోపించి విల్లు విడిచి శూలంబు గొని దీనఁ గృష్ణుని
ప్రాణంబులు గొందు ననుచుఁ బూని వైచిన నది యద్దేవుండు నడుమన యర్ధ
చంద్రాంబకంబునం ద్రుంచి మఱియొక్కబాణంబు దొడిగి దృఢముక్తంబు
గావించిన.81
ఆ. వెస నురంబు గాఁడి వీఁపున వెడలె న, య్యాశుగంబు నెత్తు రంగ మెల్లఁ
దొప్పఁదోఁగ మూర్ఛదొడరి రథంబుపై, ముచ్చముడిఁగి పడియె మునివరుండు.82
వ. ఇ ట్లంగిరసుండు పడినం దదీయసారథి రథంబు దొఱంగం దోలెఁ దక్కినయగ్నులు
భగ్ను లై నలుదెసల బొనుంగుపడి యడంగి రట్టియడ్డవాటు వాసినవాసుదేవునకు
నసురేంద్రపురంబు లోచనగోచరం బయ్యె నప్పుడు నారదుం డరుగుదెంచి
యమ్మహాభాగుం గని.83
ఉ. బాణునిపట్టణంబు మురభంజన చూచితె రుద్రుఁ డిందు రు
ద్రాణియుఁ దాను గ్రౌంచగిరిదారణపూర్వము గాఁగఁ బ్రాణసం
త్రాణధురీణలీలఁ బ్రమదం బలరారఁగఁ బాయకుండు న
క్షీణభవత్సముద్యమము సిద్ధికిఁ జూడుము త్రోవఁ బొందుగాన్.84
చ. అన విని యల్ల నవ్వుచు బలానుజుఁ డాతనిఁ జూచి యేము నీ
పనికిఁ గడంగుచో హరుఁడు బల్పున నంకిలి గాఁగ నడ్డపా
టునకుఁ దొడంగె నేనియుఁ గడుం బ్రియ మవ్విధ మోపినంత నే
యన తగఁ గాక మాకుఁ జనునయ్య తొలంగుట కార్యహానిగన్.85
వ. నీ వెక్కడ వోయె దింద యుండి చూచెదవు కాదె యనియెం దదనంతరంబ
నిమేషమాత్రంబునం బురద్వారంబు చేరి యతండు పాంచజన్యంబు పూరించిన.
శ్రీకృష్ణబలరామప్రద్యుమ్నులు బాణసైన్యంబులం బాఱఁదోలుట
మ. పరివర్తోద్గతమేఘగర్జితసమప్రారంభమై పేర్చుత
ద్గురుఘోషంబు సహింప కొక్కమెయి సంక్షోభించి బాణాగ్నికిం
కరసైన్యంబు లసంఖ్యము ల్గజతురంగస్యందనోగ్రంబుగా
నురలం ద్రోచె రథాంగపాణి కెదురై యెండొండ చండాకృతిన్.87
క. ప్రమథగణమిశ్ర మగున,య్యమరారిబలంబు లట్టు లరిగి ఖగేంద్రుం
గమలాక్షు బలుని మన్మథు, నమితాయుధసమితిఁ బొదివె నాశ్చర్యముగన్.88
వ. అన్నలువురు నేకక్షణంబునం దదస్త్రహతు లై బహుళక్షతజధారలం దొప్పఁ
దోఁగి రప్పుడు బలదేవుండు.89
క. వీరల కాఱించుట యిటు, సైరించిన మనకు మీఁద సాగునె వేవే
వారించి నిగుడు మనుటయు, వారిజనాభుఁడు ప్రదీప్తవదనుం డగుచున్.90
వ. ఆగ్నేయరాక్షసంబు లగు దివ్యాస్త్రంబులు ప్రయోగించి యమ్మహాసైన్యంబులఁ
దెరల్చిన నవి మహాపవనవిధూతంబు లగు జీమూతవ్రాతంబులతెఱంగునం
గులిశవిధ్వస్తసన్నహనం బగు శైలవ్యూహంబువిధంబున వికలంబు లై తొలం
గుటయుఁ బురంబులోఁ దఱియం జొచ్చె నప్పుడు.91
ఆ. చేయఁగలుగు సైన్యనాయకు లెల్లను, బహురథద్విపాశ్వపత్తితతులు
మొనలు సేసి వృష్ణిముఖ్యు మార్కొని రుగ్ర, తూర్యభటనినాదదుస్సహముగ.92
క. అమ్మోహరములపెల్లును, సమ్ముఖమై వచ్చురభసచండతయునుఁ దె
ల్లమ్ముగఁ గని బలదేవుఁడు, తమ్ముని కెఱిఁగించి బాహుదర్పం బెసఁగన్.93
ఉ. సేనలఁ బెక్కుమొత్తములు సేసి సముద్ధతి దోఁప నుగ్రు లై
దానవు లేఁగు దెంచెదరు తక్కక యిత్తఱి రౌక్మిణేయుతో
నేనును గృష్ణ నీకు నొకయించుక బాసట యౌట లెస్స గా
దే నిజ మాహవేచ్ఛయు మదిం దళుకొత్తెడి మాకు నెంతయున్.94
వ. దీనికి సమ్మతింపు మనిన నతం డేనును నట్ల తలంచితి మే లని దక్షిణపార్శ్వంబున
నవ్వీరుండును వామభాగంబునం బ్రద్యుమ్నుండును నుండ నలవరించె నిట్లాయి
తం బై వైరివ్యూహంబులం దలపడి రట్టియేడ.95
క. ఏవిధముచేత నైనం, దా వెరవయి మలఁగి తిరుగుతార్క్ష్యునిపై న
మ్మూవురుఁ బరాక్రమించుట, దేవారాతుల కసహ్యతీవ్రం బయ్యెన్.96
వ. అప్పుడు.97
మ. ప్రళయావాప్తి నశేషభూతచయముల్ భస్మీకరింపన్ సము
జ్జ్వలుఁ డై యాత్మవిలాసమంతయు నభివ్యక్తంబు గావించు సం
కులసప్తార్చియపోలెఁ బేర్చెఁ గడు నుగ్రుం డై నిజస్ఫూర్తి శ
త్రులకుం జూపఁ గడంగురాముని మహాదుర్దాంతరూపం బనిన్.98
క. సీరమునఁ బట్టి తిగుచుచు, దారుణముసలమునఁ బటుగదాయష్టిని దు
ర్వారత బారిసమరు బలు, బారి గడవలేక మడిసెఁ బ్రతిభటబలముల్.99
చ. కుసుమశరాసనుం డధికకోమలలక్ష్యము లేయు నాఁగ ము
న్నెసఁగిన చుల్కపాటు మది నేమియు నోర్వక కాక యిమ్మెయిన్
మసఁగె ననంగఁ గృష్ణునికుమారుఁడు గర్కశచాపముక్తదు
ష్ప్రసహశరావలిన్ రిపులప్రాణసమీరముఁ బీల్చె నుద్దతిన్.100
క. ప్రద్యుమ్నుబాణవిసరము, సద్యోజనితాంధకారసంతతులు సమ
స్తద్యోభూమ్యంతరములు, ప్రద్యోతనకిరణసంప్రపత్తికిఁ బాపెన్.101
స్రగ్ధర. జ్యానాదోదగ్రగర్జాచటులమయసముచ్ఛండచిత్రోరుచాప
శ్రీ నిండారంగఁ దార్క్ష్యోర్జితచలదచలాసీనకృష్ణాభ్ర ముద్భూ
తానేకాస్త్రప్రతానం బశనిసమితిగా నాహవక్షోణి విద్వి
ణ్నానాసేనాంగవృక్షోన్మథనపరుషసన్నాహసంక్రీడఁ గ్రాలెన్.102
మ. హరిబాణావళి మృత్యుదంతతతియ ట్లాశీవిషశ్రేణియ
ట్లురువేగంబున బ్రహదండములయ ట్లొండొండ దుర్వారని
ష్ఠురలీలం బొదువంగ దానవు లొకండున్ మాఱుసేయంగ లే
కరుదారం దెగటారి రర్కకిరణవ్యస్తాంధకారాకృతిన్.103
క. ఱెక్కల నరిచియు నఱిముఱి, ముక్కునఁ బొడిచియును నఖరములఁ జీరియు నే
దిక్కు హరి సూచెఁ దానా, దిక్కురిపులనెల్ల వైనతేయుఁడు నుఱిపెన్.104
క. గరుడఁడు బాణానీకముఁ, బొరిగొనియెడుజాడ జమునిపోయెడు క్రీడా
సరణికరణి శవమయమై, యురురౌద్రభయానకాద్భుతోద్ధతిఁ బెంచెన్.105
వ. ఇబ్భంగి నలువురచేత హన్యమానం బగు దాననసైన్యంబు నిలువ నోర్వక నలు
వంకలకుం బఱచె నెఱచితోడి నెత్తురువెల్లువ పెల్లుగా బాణునగరి నలుత్రోవలం
దొలఁకులాడం దొడంగె నట్లు గడంగి మాఱులేక యుద్రేకంబున వెలుంగు
రథాంగధరుం గనుంగొని సైరింపక విజృంభించి.106
ఉగ్రజ్వరంబు శ్రీకృష్ణునితో యుద్ధంబు చేసి పరాజయంబు నొందుట
ఆ. మూఁడ మస్తకములు ముమ్మూఁడుగన్నులు, మూఁడుగాళ్లు రెండుమూఁడు కేళ్లు
గలమహాజ్వరంబు ప్రళయాగ్నియునుబోలె, నెదురుపడియె నార్పుటెలుఁగుతోడ.107
వ. ఇ ట్లెదర్చి వారల నుద్దేశించి.108
క. లావునను గ్రొన్వి యిచటికిఁ, జావఁగ వచ్చితిరి నావసంబునఁ బడినన్
బోవఁగవచ్చునె మెయిమెయి, దేవతలకు మీకు నింక ది క్కొరుఁ జెపుఁడా.109
వ. జ్వరనామధేయంబునఁ ద్రిలోకంబుల నెరియించునట్టి నన్ను మున్నెఱుంగరేని
నిప్పు డెఱింగించెద నని యదల్చి హలాయుధుం బొదువ వసమఱి సమదసంవర్త
జలధరనిర్ఘాతంబులంబోని పిడికిళ్ల నతనిపయిం బూఁచిన వైనతేయు గగనముండల
భ్రమణవేగంబుల నవి సోఁకకున్నం గోపించి.110
క. తనయాయుధ మగుభస్మం, బున వైచిన నది తదీయభుజమధ్యము బో
రనఁ దాఁకి చెదరి దవ్వుగఁ, జని మండుచు మేరునగము చఱియంబడియెన్.111
వ. తత్పరిపాతవేగంబున నయ్యుదగ్రతటంబు వ్రయ్య లై పడియె నట్టి యాజ్వరస్పర్శ
నంబున వాసు దేవపూర్వజుండు.112
చ. వివశత నొంది మేను నిడువెండ్రుక వెట్టఁగ వెక్కుమీఱి క
న్గవ దెఱవంగ రాక పొరిఁ గంపముఁ బొందుచు నిశ్వసించుచున్
దవిలి భ్రమంబుఁ జాడ్యమును దందడీ చేతనఁ బాపఁగా భయ
ప్రవికలచిత్తుఁ డై భుజగభంజనుఁ బేర్కొని గద్గదోక్తులన్.113
క. అనఘ సముద్దీప్తం బగు, ననలంబున నెరియుచున్నయవి గాత్రంబుల్
ననుఁ గావు మెవ్విధంబునఁ, గనువాఁడఁ బ్రశాంతి యిన్నికారంబునకున్.114
తే. అనినఁ దలఁకకు మిం తేల యకట యేను, గలుగ ననుచు నవ్విభుఁ డన్నఁ గౌఁగిలించెఁ
గృష్ణసంస్పర్శమునఁ బాసె గిల్బిషంబు, బలున కెప్పటికంటెను బల మెలర్చె.115
వ. తదనంతరంబ జనార్దనుం డనాదరదృష్టి నయ్యుగ్రజ్వరంబు నాలోకించి. 116
క. జ్వరవర యే నుండఁగ నీ, కొరుఁ దొడరఁగ నగునె రమ్మ యురణింపుము నీ
పరు వెల్లఁ జూపు నాచేఁ, బొరివోయెడుతెఱఁగు నొయ్యఁ బొందెదు పిదపన్.117
వ. అని పలుకుటయు నమ్మహాజ్వరంబు ప్రచండజ్వాలాగర్భం బగు భస్మం బతనిపై
వైచిన నది యవ్వసుదేవపుత్రుఁ బ్రదీప్తగాత్రుం జేసి కొండొకసేపునకుఁ
బ్రశాంతం బగుటయు విద్వేషి కలుషించి.118
క. భుజగేంద్రభీషణము లగు, భుజముల హరిఁ బొదివి పట్టి పొడిచెను గ్రీవా
భుజమధ్యంబులుఁ గడున, క్కజ మగు పటుముష్టి నతఁడు గడురోషమునన్.119
తే. తాను నందంద పిడికిళ్ల దాని నొంచె, వారలిరువురముష్టిప్రహారవిధము
పెద్దకొండలపైఁ బడుపిడుగులట్లు, గడఁగె పరుసనిమ్రోఁత లగ్గలముసేసె.120
చ. తడవుగఁ బోరి శాత్రవుని దందడి లోపడఁబట్టి బాహులం
గడు నలియంగ నొత్తి మృతుఁగాఁ దలపోసి ధరిత్రిమీఁదఁ బో
పడుమని వైచినం బడక పంకజనాభుని మేను సొచ్చె న
క్కడిఁదివిరోధి యాత్మబలగర్వ [8]మఖర్వముగాఁగ నుధ్ధతిన్.121
వ. అట్టి యుగ్రజ్వరావేశంబున వివశుం డై విశ్వంభరుండు మున్ను పూర్వజుండు
పొందినసమవర్ధన పొంది మహాబుద్ధి గావున నంతయు నెఱింగి తత్ప్రతిఘాతి
యగు నట్లుగా ననుప్రకృతి యనుజ్వరంబు నుత్పాదించిన.122
క. హరిజనితజ్వర మాద్య, జ్వరముఁ దదంగకముఁ బాయవడఁ దిగిచి బలం
బరుదుగఁ బ్రిదులఁగనీ కా, మురారి కొప్పించుటయు సముద్ధతి నతఁడున్. 123
వ. దానికడకాళ్లు వట్టి విసరి నూఱుపఱియలు సేయుతలంపున నుర్వీతలంబున వ్రేయం
బూన్చిన నది యార్తితోడం గావవే యని యాక్రోశించె నంతఁ గృష్ణ కృష్ణ
యుడుగుము జ్వరంబు రక్షణీయం బని యశరీరవాణి వీతేర నతండు నల్లకాక
యని విడిచె నదియును శరణాగతత్రాత యగు నాజగద్విధాతపదంబులు శిరంబు
సోఁకఁ బ్రణామంబు సేసి.124
క. జ్వర మనుపేర నొకండన, జ్వర మొం డెయ్యదియు లేదు జగముల నెందున్
వరద యది యట్ల చెల్లఁగఁ, గరుణింపుము పారమెయిదఁ గావుము నన్నున్.125
వ. అని యనేకవిధంబులం బ్రస్తుతించినం బ్రసన్నుం డై వాసుదేవుండు నీకోరిన
యట్ల వరం బిచ్చితి నాచేత నిర్మితం బైన ద్వితీయజ్వరంబు నాయంద లీనం బగు
నీవును మనుష్యస్థావరతిర్యక్కులయందు నీతేజంబు మూఁడుభాగంబులు
గావించి మత్ప్రసాదంబున సుదీర్ణుండ వై చరింపు మనినఁ బ్రియంబు నొంది
జ్వరంబు మఱియుం బ్రణమిల్లి.126
చ. అసురకులప్రమాథి యగునాత్రిపురాంతకుపేర్మిఁ దొల్లి యిం
పెసఁగ సృజింపఁగాఁ బడితి నే నఖిలంబున దుర్జయుండ నీ
యసదృశశక్తిచే జితుఁడ నై పరిరక్షణ మిప్డుగాంచి నీ
వసమునఁ జిక్కితిం బను లవశ్యము సేసెదఁ బంపు మచ్యుతా!127
క. అనవుడు యదుభర్త ప్రియం, బునఁ గనుఁగొని నాదుపనుపు పొనరింప మనం
బున నీకు వేడ్క గలిగిన, విను చెప్పెద నొకతెఱంగు విస్పష్టముగాన్.128
ఉ. ఏనును నీవుఁ గయ్యమున నిట్లు పెనంగిన విక్రమక్రియా
నూనవిధంబు లెవ్వరు సముద్గతభక్తిఁ బఠింతు రర్థితో
వీనుల నింతు రట్టిసుపవిత్రులకున్ వివిధామయజ్వర
గ్లానిభయంబు నొందక సుఖం బగునట్లుగఁ జేయు మెప్పుడున్.129
క. నావిని యియ్యకొని జ్వరం, బావిష్ణుఁడు వీడుకొలుప నాహవమహికిన్
వేవేగఁ దొలఁగె బలుఁడును, గోవిందునిసుతుఁడుఁ బ్రీతిఁ గొరలిరి బుద్ధిన్.130
వ. అమువ్వురు మూఁ డగ్నులుంబోలె బ్రజ్వరిల్లి వైనతేయపవనవేగంబున దైతేయ
సేనాసహస్రంబు లను కాననంబు లాక్రమించి చక్రగదాముసలశరపాతంబులు
ప్రచండజ్వాలాఘాతంబులు గాఁ బె ల్లుపక్రమింప నవ్విక్రమంబునకు వెఱచఱిచి
దానవు లెవ్వరు నెదురై నిలువక కనుకనిం బఱచినం గని బాణుం డెలుంగెత్తి
దొరల నుద్దేశించి.131
శా. శౌర్యోదగ్రత దానవాన్వయమున జన్మించి గాంభీర్యముం
గార్యంబుం జెడకుండఁ గాంచుచుఁ గనత్ఖడ్గత్రిశూలాద్యసం
హార్యానేకవిధాస్త్రశస్త్రకళలం దారూఢు లైనా రనిన్
ధైర్యం బిమ్మెయిఁ బోవఁ బెట్టఁగఁ గటా ధర్మంబె మీబోంట్లకున్.132
తే. మానఘనుఁడ నే నున్నాఁడ మంత్రివరుఁడు, వీఁడె కుంభాండుఁ డున్నాఁడు వీరవరులు
ప్రమథు లున్నారు మీ రేల భయము నొంది, యిట్టి రైతిరి విద్వేషు లెంతవారు.
వ. వలదు నిలువుండు న న్నొకింత చూచుం డనుచుండ నిలువక ప్రమథగణశేషం
బుగా నశేషబలాధ్యక్షులుం దమతమబలంబులతోఁ బలాయనంబ పనిగాఁ బాటిం
చిరి బాణమంత్రియుం బ్రభువాక్యంబులకు ననురూపంబు లగు నాలాపంబుల
సైనికవరులం బేర్కొని.134
మహాస్రగ్ధర. శరణార్థిత్రాణవిద్యాచణుఁడు త్రిణయనస్వామి యస్మత్కుటుంబో
ద్ధరణవ్యాపారనిత్యాదరమున నిచటం దాను షాణ్మాతురుండుం
గరుణన్ సాన్నిధ్యలీలం గయికొని వెలుఁగంగా నపాయంబు బాణుం
బొరయింప న్శక్తుఁడే యేపురుషుఁడు వెఱుపుం బొంద ని ట్లేల మీకున్.135
క. నిలుఁ డని నిలుపఁగ నెవ్వరు, నిలువర హరిచేత వెలుఁగునిష్ఠురధారా
కలితఘనచక్రదీప్తులు, దలఁ కధికము [9]సేయుచుండ దానవయోధుల్.136
వ. ఆ సమయంబున.137
సీ. తన ప్రియభక్తుఁ డాదైత్యేశ్వరుసకు నబ్భంగిఁ బాటిలిన యాపద మనమున
సైరింపనేరక శంభుండు సంరంభ మొదవఁ గయ్యమునకు నుత్సహించి
యతులితసింహసహస్రయుక్తంబును నున్నతవృషభకేతూజ్జ్వలంబుఁ
బ్రకటనందీశసారథికంబుఁ బృథులరత్నప్రభాపటలదీప్తంబు నైన
తే. రథము మేఘవినిర్ముక్తరవిసమూహ, కరినదీప్తి నొప్పార శీఘ్రంబ యెక్కి
గుహుఁడు నిజవాహనస్థుఁడై కొలువ భువన, విలయకృతికి కడంగెడువిధము దోఁప.138
వ. గరుడధ్వజు చనుదెంచుదెసకు రభసంబుగా నడచె నద్దేవుముందటం బిరుందను
బార్శ్వంబుల ననేకవిధవికృతవక్త్రులు నసహ్యబాహుచరణనేత్రులు నాభీల
వ్యాళయజ్ఞోపవీతులు నతివిశాలసింహశార్దూలచర్మవసనులు నాసక్తమణిమనోజ్ఞ
మకుటకుండలాదివిభూషితులు నభిరామగంధమాల్యాంబరాలంకృతులు నాకలిత
వివిధాయుధప్రదీప్తులు నతిరౌద్రసౌమ్యసత్వభావులు నప్రమేయప్రభావులు
నతులితాష్టైశ్వర్యధుర్యులు నగు ప్రమథవీరులు వెలింగిరి బాణసైన్యంబులును
దొరలు మున్నుగాఁ గ్రమ్మఱం గడంగి యమ్మహాదేవుం బరివేష్టించె నవ్విధంబున
నురవడించు నుగ్రు నంతంత నాలోకించి.139
స్రగ్ధర. క్షేపిష్టప్రేష్ఠతార్క్ష్యోత్క్షితరుచివిసరక్షిప్తసప్తాశ్వదీప్తి
వ్యాపారుండుం బ్రగాఢవ్యవసితధనురుద్వాంతమౌర్వీవిరావ
వ్యాపృత్యుద్ధత్యఖండవ్యధికభువనుఁడున్ వర్ధితోద్వృత్తచక్ర
శ్రీపర్యాప్తిప్రభావోర్జితుఁడు నగుచు లక్ష్మీవిభుం డుగ్రలీలన్.140
వ. సమరసమ్ముఖుం డయ్యె నయ్యవసరంబున రుద్రదామోదరద్వయవ్యతికరంబునం
దలంకి ధరణి వడంకెఁ బర్వతంబులు గ్రుంగె నుత్తుంగశృంగంబు లురలిపడియె
దిక్కులు నాకసంబునుఁ బెనుమంటలు పొదివె నుల్కానిర్ఘాతపాతంబులు నిర్మేఘ
నిర్జానినాదంబులం బ్రవరిల్లె మారుతం బడంగె బతంగప్రభలు మాసె
వైహాయసవిమానంబులు విపర్యస్తగతిం జరించె విరించి మొదలుగా నఖిల
త్రిదశులు నశేషమునులును సమస్తదేవయోనులుం జనుదెంచి సభయంబుగా
దివంబున నిలిచి రట్టి తలపాటున దవ్వుదవ్వుల శర్వుండు శౌరిమిఁద శరశతకం
బేయుటయు నారాయణుం డైంద్రాస్త్రంబు ప్రయోగించిన.141
క. [10]ఆయస్త్రమువలన మహా, సాయకములు శతసహస్రసంఖ్యంబులు వే
వే యుప్పతిల్లి పొదివెన్, ద్రైయంబక మగురథం బుదగ్రస్ఫూర్తిన్.142
చ. [11]అలిగి పురాంతకుండు దహనాంబక మేసిన నెల్ల దిక్కులు
న్వెలుఁగఁ గృణానుకీలములు విష్ణుశరావలి మ్రింగి యాతనిం
బలునిఁ బ్రసూనసాయకునిఁ బక్షివరేణ్యునిఁ జుట్టుముట్టినం
బొలిసిరి వైరులం చసురపుంగవు లార్చిరి పేర్చి యుబ్బుచున్.143
క. మురరిపుఁడు గినుక వారుణ, శరము ప్రయోగింపఁదడవ శాంతం బయ్యెన్
హరుబాణము బాణాసురు, పరివారంబునకు విన్నఁబాటు దలిర్పన్.144
వ. భర్గుండు మఱియును బైశాచరాక్షసరౌద్రరాక్షసాంగిరసంబు లను నస్త్రంబులు
గ్రమప్రయు క్తంబులు గావింప గోవిందుండును వాయన్యసావిత్రసమ్మోహన
సంజ్ఞంబు లగు మార్గణంబులవలన వరుసన నాలుగిట నద టణంచి వైష్ణవాస్త్రం
బభిమంత్రితంబు సేసి యేసిన.145
తే. తలఁకి సురసిద్ధసాధ్యగంధర్వు లాది, గాఁగ దివి నుండ నోపక కలఁగఁబడిరి
బాణబలములుఁ గ్రమ్మఱ భయము నొంది, చెదరెఁ గనుకని భూతంబు లదరె నాత్మ.146
వ. అమ్మహాస్త్రంబు చనుదెంచు రౌద్రంబునకు రుద్రుండును బ్రతీకారం బెఱుంగక
యొక్కింత విచారవివశుం డయ్యె నాలోన నాభీలజ్వాలాకరాళం బై యది
యద్దేవుతేరు సరథ్యసారథికంబుగా గాఁ బొదివి ప్రజ్వరిల్లె నంత నంతయు నెఱింగి
యతిత్వరితంబుగ బాణుండు సమరంబునకు నిశ్చయించి బ్రాహ్మణోత్తములకు
నమస్కరించి వారు గావించు శుభస్వస్త్యయనంబులును సిద్ధమంత్రౌషధిసంభా
వనంబులుం గని యుద్దీపితుం డై గోభూహిరణ్యదానంబు లనేకంబు లొనర్చి
దివ్యం బగు రథం బెక్కి మహారథులు పరివేష్టింప నరిగి మహాదేవస్యందనంబు
చేరువ నిలిచె నట్టి సమయంబున.147
ఉ. వైష్ణవబాణపావకనివారణభంగికి నొండుమై నలం
భూష్ణుత సంభవింపమిఁ బ్రభుండు పురత్రయదాహధుర్యతా
[12]ధృష్ణువనంగఁ బేర్చినప్రదీప్తతరాంబకమున్ యుగాంతకా
లోష్ణకరాభముం బటుబలోద్దతిఁ గైకొని క్రోధచండుఁ డై.148
వ. కార్ముకంబున సంధింప నుద్యుక్తుం డగుటయు నెఱిఁగి వాసుదేవుం డమ్మహాదేవు
నయ్యుద్యోగంబువలనం బాపుటకు వెరవు గనుంగొని.149
ఉ. జృంభకబాణమున్ భుజవిజృంభణ మొప్పఁగ నేసె నేసినన్
శంభుని కావులింతలును జాడ్యము నిద్రయుఁ బొంది శౌర్యసం
రంభము మాన్చె విల్లును శరంబును జే సడలంగ దేహసం
స్తంభము గాఢ మయ్యెఁ బ్రమథప్రవరుల్ వెఱఁగంది చూడఁగన్.150
శివుఁడు శ్రీకృష్ణునితో యుద్ధంబు సేయక తొలంగిపోవుట
వ. బాణాసురుం డద్దేవుం గదిసి యొయ్యన ప్రబోధించిన నొక్కింత దెలిసి యప్పర
మేశ్వరుండు యోగదృష్టి. నాలోకించి యాలోకస్థితికర్తకుం దా నొసంగిన వరం
బును నతనికిం దొల్లి ద్వారావతీపురంబునఁ బ్రత్యక్షం బై మేలొనర్చి యాడిన
మాటయుం దలంచి యుత్తరం బెయ్యదియుం బలుకక యేమియుం జేయనేరక
యూరకుండె న ట్లున్న యాఖండపరశుం గనుంగొని.151
తే. పాంచజన్యఘోషంబునఁ బదిదెసలును, నినిచె గోవిందుఁ డదియెల్లఁ గని సహింప
కడరి ప్రమథవీరావలి యచ్యుతాత్మ, జనుఁ బొదవె ననేకాస్త్రశస్త్రతతుల.152
వ. దానవులును బ్రవృద్ధం బగు మాయాయుద్ధంబున నతనిం జిక్కుపఱుపం దొడం
గినం గినుక నమ్మకరకేతనుండు సేనాస్తంభన యగు సమ్మోహనవిద్య నయ్యందఱం
గొంతవడి నిద్రాసక్తులం గావించి యసురులం బెక్కండ్ర నొక్కట విగతాసులం
జేసె నంత.153
క. అందంద యావులింపఁగ, నిందుధరునివదనమున ననేకాగ్నిశిఖా
సందోహంబులు వెలువడి, కందుగ దశదిశలుఁ బొదివి కాల్పఁగఁ దొడఁగెన్.154
వ. అట్టి దారుణత్వంబునకు నఖిలభూతంబులు భీతిభ్రాంతంబు లయ్యె భూదేవి తల్ల
డిల్లి పితామహుపాలికింబోయి దేవా మహాదేవవాసుదేవసంగరభరం బోర్వ
లేక దిగంబడియెడికొలఁదికి వచ్చితి నకాలప్రళయంబునం జరాచరంబులుం బొలియు
నేకార్ణవంబును నయ్యెడు నింతియ యింతకు మిక్కిలి విన్నవింప నేర నఖిల
విధాతవు నీవ యెఱుంగు దనినం జతురాననుండు.155
తే. ఒకముహూర్తంబు సైరింపు మువిద నీకుఁ, జులుకనగునట్లు సేసెదఁ దలఁకుమాను
మనుచుఁ గ్రమ్మనఁ జనుదెంచి యభవుఁ గాంచి, యొక్కభక్తిభావంబున మ్రోల నిలిచి.156
వ. ఇ ట్లని విన్నపంబు సేసె.157
చ. అసురు లవశ్యవధ్యు లని యాదిన కాదె మహేశ! యేను ద
ద్వ్యసనము నిర్ణయించితి భవత్కృప యేటికి నిట్టు వీరిపై
నెసఁగెడుఁ గృష్ణుతోడఁ దగునే పెనఁగంగ నొకింత బుద్ధిలోఁ
బసరిడిచూడుమా హరియు భర్గుఁడు నా నొక్కడో విభిన్నులో?158
క. నీవ నిను నెఱుఁగకుండిన, నేవారికిఁ దెలుపవచ్చు నిటు సకలక్షో
భావహ మగునీయుగ్రపు, భావమునకుఁ జాల వ్రేఁగుపడినవి జగముల్.159
వ. ప్రసన్నుండ వగు మనినఁ బరమేశ్వరుం డాపితామహుం జూచి నీ చెప్పినట్ల
సేసెదఁ గయ్యంబు మానితి ననియె నప్పుడు గృష్ణుండును గదియ నేతేర నా
హరియు హరుండు నొండొరులం గౌఁగిలించుకొని పరస్పరోపలాలనపరు లై రనంత
రంబ పురాంతకుం డచ్చోటు వాసి యొండెడకుం జనియెఁ జతుర్ముఖుండును
మార్కండేయాదిమునిప్రణీతంబు లగు శంకరనారాయణైక్యంబు లగు వాక్యం
బులు [13]వాగ్ము లగుసిద్ధులు ప్రశంసింప వినుచు నిజలోకంబున కరిగె నంత.160
కుమారస్వామి శ్రీకృష్ణ బలరామప్రద్యుమ్నులతో యుద్ధంబు చేయుట
క. హరుఁ డరుగుఁగాక యసురే, శ్వరరక్షణ మింకఁ దొలఁగవచ్చునె నాకున్
హరి నొడుతుఁబొడుతు మగఁటిమి, యరుదుగ నని కార్తికేయుఁ డనికిం దొడఁగెన్.161
వ. ఇట్లు కుంభాండసంప్రహితం బగు రథంబుతో నడరి యతండు.162
ఉ. దానవకోటి యుబ్బ వినతాసుతుమేనును గృష్ణుమేను ద
త్సూనునిమేను ముష్టికనిషూదనుమేనును వాలురంపపెన్
సోనల ముంచి సాంద్రతరశోణితధారలు ధాత్రి నించినం
దా నొకచేఁతకున్ సమవధానము లేక మురారి ధీరతన్.163
వ. ఒక్కింత సైరించి శార్ఙ్గనిర్ముక్తశరంబు లాశరజన్ముపై నిగుడింప రౌహిణేయ
రౌక్మిణీయులును సాయకసహస్రంబులం బరగించి రమ్మువ్వురు మూఁడగ్నుల తెఱం
గున మహాతేజంబు సూపి మహాసేనుతేజంబు [14]మట్టుపడం బేర్చినం గోపించి
కుమారుండు.164
చ. జగముల నేర్చునాఁటిరవిచాడ్పున దుస్సహచండదీప్తమై
నెగడి సమస్తశాత్రవవినిర్మథనోత్సవసాధనంబునం
బ్రగుణవిభూతిఁ బెం పెసఁగుబ్రహ్మశిరం బనుసాయకంబు న
న్నగధరుమీఁద నేయ గగనంబున నిండె సురార్తనాదముల్.165
మ. హరి యాలోన సమాహితాత్ముఁ డయి సర్వాస్త్రావమర్దక్రియా
పరుపోపక్రమ మైన చక్రము నతిస్పర్ధం బ్రయోగింపఁ ద
త్పరితాపంబున షణ్ముఖాంబకము విధ్వస్తప్రభాజాల మై
పరమక్లీబత నొందె మేఘపటలప్రచ్ఛన్నసూర్యాకృతిన్.166
తే. బ్రహ్మశిర మివ్విధంబునఁ బ్రతిహతప్ర, భావ మగుటయు నగ్నిసంభవుఁడు మఱియుఁ
దనకుఁ బ్రియసాధనంబయి తనరుశక్తి, వైచెఁ దడయక హరిఁగూల్చువాంఛఁ బేర్చి.167
మ. చలదుల్కావళిమాడ్కి సంక్షయశిఖజ్వాలాకరాళాకృతిన్
గలఘంటాతతి మ్రోయ దిగ్గగనభాగం బెల్ల నొక్కింతయై
వెలుఁగన్ వచ్చుతదస్త్రమున్ సురలు సంవీక్షించి విభ్రాంతిమై
జలజాతాక్షుదెస న్నిరాశు లయి చేష్టల్ దక్కి రత్యంతమున్.168
తే. శక్తి గలవాఁడు గావున శక్తి సేర, వచ్చినందాఁక సుస్థిరత్వమునఁ జూచి
చేర రానిచ్చి యుగ్రహుంకారమునన, నిలిపె నమురు లెలర్ప నయ్యలఘుయశుఁడు.169
క. అంత నిలువక మఱియును, నంతకవక్త్రానుకారి యగు చక్ర మతం
డెంతయు వెస గుహుపై ని, శ్చింతత వైచుటకుఁ జక్కఁ జేత నమర్చెన్.170
సీ. ఆ సమయమున మహాదేవుపనుపున పార్వతిచైతన్యభాగ మైన
లంబాభిధానలీలామూర్తి గాంచనాభరణదీధితు లెందుఁ బ్రజ్వరిల్ల
దిగ్వాసయై వచ్చి దేవసేనానికి నడ్డమై నిలువంగ నచ్యుతుండు
గని శీఘ్రమున దృష్టి గ్రమ్మఱించి యిటేల నిశ్చితకార్యంబు నీవు చెఱిచి
ఆ. తకట తొలఁగు తొలఁగుమట్లుగాకున్న వి, శాఖుఁ గొనుచుఁ బాసి చనుము వేగ
మేను జక్ర ముడిపి యిదె యూరకుండితి, ననిన సంతసిల్లి యవ్వధూటి.171
వ. అమ్మహాప్రభావు పలికినట్ల చేసె నట్లు మహాసేనుండు ప్రశాంతుం డగుటయు
మాఱు లేక మలయు మాధవుం గనుంగొని బాణుండు.172
మ. కలవారెల్ల ను దక్కి రిక్కలన నొక్కండం దుదిం జిక్కితిన్
బలియుండై పగతుండు గ్రాలెడుఁ బటుప్రారంభఘోరంబుగాఁ
గలహం బీతనితోడఁ జేయుటయు తక్కం గర్జ మొం డెద్ది బా
హులకుం గోరినపండు విప్పుడు గదా యొప్పెం బ్రియం బేర్పడన్.173
క. దైతేయవంశ మంతయుఁ, బ్రీతిం బొదలంగ నఖిలబృందారకులుం
జేతోవృత్తంబుల న, త్యాతురులై యొదుఁగ నడరి యహితుల నోర్తున్.174
వ. ఇదియ నిశ్చయం బని తలంచి సేనాచరులం బిలిచి తన యుత్సాహం బెఱింగించి.175
క. చిందంబులు మ్రోయించి య, మందగమనమున రథంబు మధురిపుదెసకున్
గ్రందుగఁ బఱపించి విశిఖ, సందోహం బఖిలదిశల సంఛాదింపన్.176
వ. కదిసి యవ్వీరవర్యున కభిముఖుం డై యి ట్లనియె.177
క. ఇందాఁక నీ వొనర్చిన, దొందడిపని మెచ్చ నేనుఁ దొడరి నపుడు లా
వుం దాల్మియుఁ జూపి కదా, యెందుఁ బొగడు గనుట నిలువు మించుక యాజిన్.178
మ. కనకచ్ఛాయఁ దలిర్చువృక్షములు నిక్కంబున్ విలోకించితే
యనుమానింపక కాలచోదితుఁడ వై యస్మద్విరోధం బెడం
బనిగా వచ్చితి బేల యింక మగుడన్ బంధువ్రజంబుం బురిన్
గను మే లొందెదవేని నిష్ఫలభుజాగర్వుండఁ గానే తుదిన్.179
చ. ఎనిమిదికేళ్లవాఁడ నని నెక్కటి వేయుభుజంబులం దన
ర్చినననుఁ జేరఁగా వశమె చిత్రము నాదగు దోస్సహస్రకం
బున నిను సుక్కునం దొడరి పోరునెడ బహుకోటిసంఖ్య లై
యొనరెడుఁ జూడు మెప్డు వివిధోజ్జ్వలహేతివిహారభంగులన్.180
క. సురవరులనెల్ల గెలిచిన, గరువపుబంటునకు నేడు గడయంకము సం
గరమున నిను గెలుచుట నా, కిరవగు భాగ్యంబు గాదె యిది యొక్కటియున్.181
క. అని బాణుఁడు గర్జిల్లఁగ, విని నభమున యోగపట్టె విసరుచు మోదం
బున నాడె నారదుఁడు దన, మనమునఁ గౌతూహలంబు మల్లడిగొనఁగన్.182
వ. నవ్వి యయ్యదునాయకుం డవ్విరోధి నుపలక్షించి.183
ఉ. నీకని పూని నిల్చిన వినిర్భరశౌర్యులు నీవ చూడ నే
పోకలఁ బోయిరో తెలిసి బుద్ది నెఱింగితి యేల యిట్లు జ
ల్పాకుఁడ వై వృథావచనపఙ్క్తులఁ గయ్యము సేయ నొల్ల క
వ్యాకులమద్భుజారుచికి నంకిలి సేసెదు దైత్యపుంగవా.184
మ. గెలువం బోయిననిన్నుఁ బట్టితిమె యక్లేశుండవై పోర రా!
బలవద్భాహుఁడ వేటి కి ట్లొదుఁగ మత్పర్యాప్తచక్రాగ్నికిన్
శలభత్వంబునఁ దొల్లి పొందిన భుజాశ్లాఘ్యుల్ రిపు ల్లెక్క క
గ్గల మీ వంతటికంటె నెక్కు డయినం గాదంటిమే యిత్తఱిన్.185
క. మ్రోడుపడిన చేతులతోఁ, గీడగుదశఁ బొంది కాక కిన్నరగీతా
మ్రేడితమద్భుజసంప, త్క్రీడలు నీ కకట యిపుడు దెలియఁగ నగునే.186
క. అని మర్మభేదనము లగు, ననేకవాక్యముల నొంచి యట్టివ యై పే
ర్చినసాయకముల నొంచెన్, దనుజారి యనంతరంబ దనుజాధీశున్.187
బాణాసురుఁడు శ్రీకృష్ణునితో యుద్ధంబు చేసి పరాజయంబు నొందుట
ఉ. బాణుఁడు వృష్ణిపుంగవుని బాణపరంపర కెల్ల మాఱుగా
బాణము లేసి వెండియుఁ గృపాణగదాదులు మున్నుగా మహా
బాణసహస్రముల్ పృథులబాహుసహస్రమునన్ సమాహిత
ప్రాణసముద్యమం బలరఁ బర్వఁగఁ జేసి నభంబు మూసినన్.188
క. తమ ప్రపితామహుఁ డగువి, క్రమకోవిదుఁ డాహిరణ్యకశిపునకే లా
వమరు నతం డిట్టిఁడ యని, యమరద్విషు లతనిఁ బొగడి రప్పటిదశకున్.189
వ. బలిసూనుండు తామసాస్త్రంబు ప్రయోగించెఁ దదీయప్రభావంబునం జీఁకట్లు
నలుదెసలఁ బొదువ నెఱమంటలం బగఱ నెరియించె నట్టి యాశ్చర్యంబునఁ దిమిర
తిరోహితంబు లగు దిగ్వివరంబులు నగ్నిసేనాపరీతం బగు నాత్మీయసమవస్థానంబును
గని గోపాలదేవుండు దేవేంద్రదైవత్యం బగు సాయకం బేసిన.190
మ. దెస లెల్లం దెలుపెక్కఁజేసి దహనోద్రేకం బడంగించి శార్
ఙ్గసమాఘోషము దైత్యకర్మదళనప్రారంభమై పర్వఁగాఁ
బ్రసరద్బాణసముత్కరంబున నభోభాగంబు రోధించె ని
ట్లసమోత్సేకమునం గడుం దడవు క్రీడాయత్తుఁ డై యంతటన్.191
వ. వైరసమాప్తి గావింపం దలంచి యమ్మహానుభావుండు భవ్యాంబకప్రకరంబు
నిగుడించి.192
మ. అరదం బల్పకణంబు లై తొరుఁగ నుద్యత్కేతు వుర్విం బడన్
వరరత్నోజ్జ్వలమౌళిమండనము విధ్వస్తంబుగా నాయుధో
త్కరముల్ నుగ్గుగఁ గంకటంబు దునియం దర్పంబుతోఁ బేర్చి పే
రుర మొక్కమ్మున నుచ్చిపోవఁగ నసహ్యోత్సాహుఁ డై యేసినన్.193
వ. దైత్యేశ్వరుండు మూర్ఛితుం డై పడియె నట్టి సమయంబున జయజయశబ్దంబు
లతో దేవతలు దేవా నీ వవతరించినపని నెనయం జూడుము జగంబులు కావు
మను నెలుంగులు సెలంగ సంతసిల్లి రెంతయుం గలంగి దనుజు లవ్విధం బాలో
కించి శోకం బెసంగఁ గుమారదత్తం బగు బాణధ్వజమయూరంబు.194
ఉ. కన్నుల మున్న కాఱు నుదకంబులు రెట్టిగఁ జేయుక్రోధ మ
భ్రోన్నతిఁ గాలమై తనకు నుధ్ధతిఁ జేయఁగ నర్తనక్రియా
సన్నహనంబునం దనరుచాడ్పునఁ దీవ్రగతిం బ్రవృద్ధమై
పన్నగవైరి దాఁకెఁ గను పంకజనాభున కద్భుతంబుగాన్.195
ఆ. గృధ్రపుంగవుఁడును గేకినాయకుఁడును, నిట్లు దాఁకి పోరి రేపు మిగిలి
నఖరముఖవిదారణములఁ జంచూభేద, నములఁ బక్షతాడనములఁ దొడరి.196
సీ. తదనంతరమ వినతాసూనుఁ డలుకతో నమ్మహాబర్హి బిట్టాక్రమించి
పదముల రెంటను బార్శ్వంబు లిఱికి పే రెఱకలఁ గొని వెఱుచఱవ నడిచి
యజ్ఞంబు నిడుపు నూర్ధ్వాధరభాగంబులునుగా విచిత్రఖేలనగతములఁ
దిగిచి లోఁ బఱిచి యుదీర్ణవేగంబున నవ్విహంగమము నుదగ్రలీలఁ
ఆ. గడఁక యెసఁగఁ బూన్చి పుడమిపైఁ బడవైవఁ, బడియె నది నిజప్రభావ మెడలి
యంబరముననుండి యపగతతేజమై, యెడలు భానుబింబ మిది యనంగ.197
క. భుజగాశనుచే నిటె దన, భుజగాశనుఁ డధికభంగముం బొందుటయున్
బ్రజనితభయుఁ డై దనుజుఁడు, భుజగర్వం బెల్ల నపుడు పోవిడిచి మదిన్.198
చ. మదిమదినుండి యేను బలమత్తుఁడ నై బెడిదంపుఁగయ్య మె
ట్లొదవునొ యంచు నాప్తసచివోక్తుల కెన్నఁడు వీనులొగ్గ కి
య్యదనది పొందఁ బా లయితి నక్కట మెచ్చనిదైత్యదానవ
త్రిదశవరుల్ గనుంగొనఁగ దీనతవచ్చెను నేర్పు చాలమిన్.199
వ. ఇంక నేమి సేయుదు నని చింతింపఁ దదీయచింతాభరం బాత్మచింతితంబున నవ
ధారణంబు సేసి మహాదేవుండు నందికేశ్వరుం బేర్కొని.200
తే. భగ్నవాహనుఁ డై చిక్కె బాణుఁ డనఘ, పొమ్ము మనసింహయుక్తరథమ్ము గొనుచు
గణసమన్వితుఁ డగు నాకుఁ గయ్య మింకఁ, దగదు వానిఁ గావుము నీవ తగువిధమున.201
చ. అనుఁడు శిలాదసూనుఁడు రయంబునఁ దే రటు గొంచుఁబోయి శం
భునికృపకల్మి దైత్యకులపుంగవుతోఁ దగఁ జెప్పి నెమ్మి నా
తని రథిఁ జేసి సూతకృతిఁ దాను వహించె నతండు క్రమ్మఱన్
దనుజవిభేదిపై నడరె దర్పము నూతనమై జనింపఁగాన్.202
వ. ఇట్లు బ్రహ్మనిర్మితం బగుదివ్యస్యందనంబుపై నున్న యతనికి బ్రహ్మసృష్టం బగు
బ్రహ్మశిరం బను నస్త్రంబు ప్రత్యక్షం బై నిలిచె నంత.203
క. దానిఁ బ్రయోగించెఁ గడఁగి, దానవుఁడు ముకుందుపై సుదర్శనసుమహా
భానునెదుర ఖద్యోత, గ్లానిఁ బడి యడంగె నదియుఁ గడుఁజోద్యముగాన్.204
వ. అప్పుడు బలిధ్వంసి బలినందనున కి ట్లనియె.205
మ. జగ మెల్లం గొనియాడ నప్రతిమదోస్సంపత్తిఁ బెంపొంది యా
తగవుం గానక పిమ్మటన్ వెడఁగ వై దర్పించి తెల్లప్పుడున్
బిగువు ల్వల్కుదు [15]సారెసారె కిటు రప్పించె విధాతృండు ని
న్మగచందంబున కింకఁ బాయక యని న్మల్లీల సైరింపుమా.206
మ. మును వేచేతులు గల్గి క్రొవ్విన మహామోహాంధునిన్ హైహయా
ర్జునుఁ డన్ రాజు సుదీర్ణుఁ డై భృగుతనూజుం డాజిలో నెవ్విధం
బునకుం దెచ్చె నెఱుంగవే యటుల నీపొం గే నడంగింతు నెం
దును బో నిన్ బొరివుచ్చెదన్ గెలిచెదం దో డెవ్వ రేతెంచినన్.207
వ. అని పలికి యమ్మహాబాహుండు సహస్రధారాకరాళంబును లయకాలసహ
స్రకరసహస్రసమప్రభాభీలంబును సూర్యసోమాగ్నిగ్రహనక్షత్రవజ్రాశనివిద్యు
త్ప్రముఖసకలతేజోమయంబును యమనియమబ్రహ్మచర్యపాతివ్రత్యయోగ్య
వ్రతాదిసుకృతసముచ్చయసంశ్రయంబును దేవాసురగంధర్వమనుష్యస్థావరాత్మక
త్రైలోక్యసత్త్వస్వరూపంబును సర్వభయతిమిరనిత్యప్రదీపంబును ప్రమోదితా
శేషదివిషచ్చక్రంబు నగు చక్రం బమ్మహాదైత్యుపై వైవ నుద్యుక్తుం డయ్యె
ననంతరంబ.208
క. శర్వుఁడు పార్వతిఁ గనుఁగొని, సర్వజగంబులను విష్ణుచక్రము తేజో
గర్వ మజయ్యము గావున, దుర్వారము బలసుతునకుఁ దోయజవదనా.209
క. నీ వొకవెరవున వానిం, గావుము నావుఁడు మృడాని గ్రక్కున లంబా
దేవిఁ బనిచె నెప్పటిక్రియ, గావింపఁగ దాను నపుడు కరుణ యెలర్పన్.210
పార్వతీదేవి శ్రీకృష్ణునిఁ బ్రార్థించి బాణాసురునిచావు దప్పించుట
వ. విజయాసమన్విత యై యదృశ్యరూపంబునం దోడన చనియె లంబయు బాణున
కడ్డం బై ముందటి చందంబున నిలిచెఁ బరమేశ్వరియుఁ గృష్ణున కొక్కనిక కాన
వచ్చునట్లుగాఁ దన పొడవు సూపి యా[16]నగ్నశక్తికి సమాసన్న యయ్యె నప్పుడు
చక్రధరుం డయ్యాదిమశక్తి నుద్దేశించి.211
క. ఈ వెడమాయము లేటికి, దేవీ యొనరించె దిట్టు దీనికి నెడగా
నీ వొకటి యొడ్డి చూపినఁ, బోవఁగ నిత్తునె విరోధిఁ బొరిగొన కెట్లున్.212
వ. అనినఁ గాత్యాయని దైత్యారి కి ట్లనియె.213
ఉ. ఆదిజు నవ్యయుం బ్రభు ననాది ననంతు మహాత్ము సర్వభూ
తోదయకర్త నిన్నుఁ బురుషోత్తముఁ దథ్యముగా నెఱుంగుదున్
గా దన నేను నీ క్రియ కొకంటికి నైననుఁ దొల్లి పుత్రుఁగా
నీ దితిజాన్వయుం గరుణ యిం పెసలార ననుగ్రహించితిన్.214
క. జీవత్తనూజఁగా నను, భావింపఁగఁ దగదె నన్ను బాణాసురునిం
గావుము నాయత్నము వృథ, పోవఁగనీకుము త్రిలోకపూజితశౌర్యా.215
చ. అనుటయుఁ గృష్ణుఁ డి ట్లనియె నంబిక యీదనుజుండు బాహువుల్
పెనఁగొన వేయు మోచి మదిఁ బెద్దయు మత్తిలి యుండు నిన్నియుం
దునిమినఁగాని పాయదు సుదుర్దమదర్పము రెండుచేతులే
నునుపఁగ జీవపుత్రతయు నొందెడు నీకు ననిందితస్థితిన్.216
క. ఆసురభావం బీతఁడు, పాసి భవత్సంశ్రయమునఁ బ్రతికెడు నీసున్
రోసము నంతట నుడి గెడు, నేసిలుగునఁ బడక తొలఁగు మీ వనుడుఁ దగన్.217
వ. అదేవి సఖీసమేత యై లంబం దొలంగి రాఁ బనిచి యంతర్ధానంబు నొందె నంత
నసురాంతకుండు.218
ఉ. ఇంచుక యడ్డపా టొదవె నింతన యంతయుఁ గంటి మంటి నే
నంచు భవాదృశుం డకట యాఁటది గావ నొదుంగఁ బాడియే
మించిన దర్పము న్మదము మిన్నకపోయెనె యిస్సిరో తుదిన్
వంచన సేసినం బ్రిదులవచ్చునె నాదగుచక్రధారకున్.219
ఆ. చేటుదలకు బాణ చిక్కి నీమనసుతో, నిలువు మెందుఁ బోవ నేర్చె దింక
ననుచు బెట్టు వైచె నతఁడు మహాఘోర, దర్శనంబు నాసుదర్శనంబు.220
వ. ఇట్లు కృష్ణకరవిముక్తం బై [17]ఖరకరసహస్రప్రభాచక్రంబునుం బోలె నమ్మహా
చక్రం బడరం దదీయసంరంభంబున నఖిలభూతంబులు బ్రమసి చేష్టలు దక్కె
ని ట్లడరి యా దివ్యసాధనంబు నిజతేజంబున దైత్యుతేజం బుపసంహరించి.221
ఉ. చేతులు రెండు దక్కఁగ విశృంఖలలీల నిమేషమాత్రలో
నాతనిచేతు లన్నియును నాతతశోణితధార లూర్ధ్వని
ష్ఠ్యూతత నొంది యంబరము నుద్ధతసాంధ్యవిభావిభావసం
స్ఫీతము సేయ రూపడఁగఁ జెక్కె సమూలముగాఁ గ్రమంబునన్.222
క. స్వామి మన సెఱిఁగి కర్జం, బేమియుఁ గడమవడకుండ నిటు నెఱపి తదు
గ్రామేయహేతిఁ గ్రమ్మఱ, దామోదరు కరమునంద తగ నెలకొనియెన్.223
తే. నెత్రు లొండొండ పెల్లైన నేలఁ బెద్ద, కాలువలు గట్టి పాఱంగఁ గడుఁ దనర్చి
కావి సెలయేఱు [18]లురిలెడు గనపకొండ, కరణి నుండె బాణుఁడు బాహుకర్తనమున.224
క. ఆవిధమున నిశ్చలుఁ డై , పోవక యయ్యసుర పోకు పోకని వియదా
శావివరమెల్ల నద్రువం, గా వెస బొబ్బలిడి యార్చి కడురభసమునన్.225
వ. కార్ముకసాయకంబులు కరయుగంబున నమర్చి పేర్చినం గని సైరింపక శౌరి
వెండియుం జక్రక్షేపంబునందు నాయితం బగుటయు నమ్మహాదేవుండు మహాసేన
సహితుం డై సత్వరంబుగాఁ జనుదెంచి.226
సీ. ఓకృష్ణ కృష్ణ యత్యుగ్రపరాక్రమ నిన్ను నే నెఱుఁగనే నీవు సకల
జగములు గలిగించి సర్వంబు నొదవించి యఖిలంబునకు దేపవై యజేయుఁ
డెల్లలోకంబుల నీదేవుఁ డన మధుకైటభాద్యసురవిఘాతి వైతి
సురల కాద్యుండవు [19]పురుషోత్తముఁడవు సనాతనుఁడవు విశ్వభూతనిధివి
తే. నీదుచక్రము రణముల నిక్క మెవ్వ్వ, రికి నసంహార్య ముపసంహరింపు మీవ
బాణుఁ డస్మదాశ్రితుఁడు నాభక్తుఁ డనఘ, విఫలముగఁ జేయకుము నాదువిభుత యిపుడు.227
వ. అనినఁ బుండరీకాక్షుం డవ్విరూపాక్షు నుపలక్షించి.228
తే. దేవ నీవు జగంబుల దేవదైత్యు, లాదిగా నెల్లవారి కభ్యర్చితుఁడవు
సేయకుండవచ్చునె నీవిశిష్టవాక్య, మేను జక్రంబు నిలిపితి నీశ్వరేశ.229
క. దితిసుతుఁడు బ్రతుకుఁగా కను, మతి నిమ్మెయి నరిగెదను నమస్కృతి యిదె నీ
కతులభవత్ప్రియకరణ, ప్రతిపాదన మెందుఁ బరమభద్రమ కాదే.230
వ. అని యమ్మహాదేవు వీడ్కొని వాసు దవుండు గరుడగమనమనోహరం బగు రభసం
బునం బ్రద్యుమ్నతనయుం డున్నయెడకుం జనియే నక్కడ నందికేశ్వరుండు
దైత్యేశ్వరుం గనుంగొని మహేశ్వరోపవాహ్యం బగు రథంబున నద్దేవుం డున్న
దెస నేరం గొనిపోయి బాణుం జూచి.231
మ. అనిలోనం బ్రతియోధుచే నిటు కరం బారుండ వై యున్ననీ
కనఘా యార్తిహరుండు వీఁడె సుముఖుండై శంభుఁ డున్నాఁడు నీ
తను దైన్యవ్యపనోది యైన శుభ మొందం గల్గు వేగంబ చి
క్కినయాచేతులు రెండు విచ్చి ప్రభుఁ డీక్షింపంగ నర్తింపుమా.232
చ. అనుటయు భక్తియున్ భయము నార్తియుఁ దోఁపగ మే నసహ్యవే
దన నెరియంగ నాడె ప్రమథప్రియుముందట బాణుఁ డవ్విభుం
డును బ్రసరద్విలోకనకఠోరకృపాయతపూర్ణచిత్తుఁ డై
దనుజునిఁ జూచి విస్మితనితాంతమనోహరరీతి ని ట్లనున్.233
శివుఁడు బాణాసురునకు నభిమతవరంబు లిచ్చి ప్రమథపదం బొసంగుట
క. చిరకాల మేను నీకును, వరము లొసంగుటకుఁ గరము వాంఛించి తదా
చరణసమయంబు వార్చితిఁ, బరిపాకముతోడ నది యుపాగతమయ్యెన్.234
వ. కావున నొక్కవరం బడుగు మనిన నతండు దేవా యేను లోకంబుల నెవ్వరికి
నజేయుండ నై యుండంగాఁ గోరెద ననుటయు శివుండు.235
క. నీయడిగినట్ల యిచ్చితి, నేయేడలను లేదు మృత్యు వెన్నఁడు నీ క
త్యాయతమతి నింకను నొకఁ, డేయది ప్రియ మడుగు మనఘ యిచ్చెద నీకున్.236
వ. అనిన బాణుండు.237
శా. ఏనిమ్మై భవదగ్రభాగమున ని ట్లీశాన నర్తించి ని
న్నానందప్రదుఁగా నొనర్చితిఁ బ్రియం బారంగ నీదైనభ
క్త్యానందంబున నాడు పుణ్యులకు నత్యంతప్రసన్నుండ వై
నానావాంఛితసిద్ధు లి మ్మిది దగు న్నాకిచ్చు మే లిత్తఱిన్.238
వ. అనిన విని శంకరుండు నియతాహారులు నిత్యక్షమావంతులు నితాంతనిత్యా
ర్జనసమాహితులు నై మద్భక్తు లెవ్వరు నా యెదురం [20]గెరలి యాడుదురు వారికి
నఖిలంబును సులభం బగుఁ దృతీయం బగు వరంబు వేఁడు మనవుడు నద్దనుజ
వరుండు చక్రచ్ఛేదనసంభవ యగు వేదన యణఁగునట్లుగా నడిగిన.239
క. వేసేతులు పోయినఁ గడు, గాసిఁబడక మేను తొంటికంటెఁ గరయుగ
వ్యాసక్తి నెంతయును ను, ద్భాసితమై మెఱయ నిచ్చి పశుపతి మఱియున్.240
వ. చతుర్థం బగువరంబున కతని నుద్యుక్తుం జేసిన నమ్మహాసురుండు.241
ఆ. ప్రమథకోటియందఁ బ్రవరుఁ డీతఁడ నాగ, నందితుల్యపదవి నంది మెలఁగు
నట్టి మేలు వేఁడె నట్లుకా కని యమ్మ, హేశ్వరుఁడు దయార్ద్రహృదయుఁ డగుచు.242
వ. మహాకాళాభిధానుండ వై ప్రమథపదంబునం బ్రదీప్తుండ వగు మని యిచ్చి
వెండియుం బంచమం బగువరంబున నతని కనంతతేజంబును నప్రతిమరూపంబును
ననుగ్రహించి యి ట్లనియె.243
క. విను నాభక్తుల కాపద, లును శోకంబులును లేవు లోకంబున నెం
దును నేను బ్రసన్నుఁడ నయి, యనుపమసర్వార్థదాయి నంచితచరితా.244
ఆ. భక్తరక్ష నాకుఁ బని వార లడిగిన, నెద్ది యైన నిత్తు నింత నిజమ
సిద్ధదేహుఁడవు ప్రసిద్ధుండవై యొప్పు, మింక జగములందు నేపు మిగిలి.245
వ. అని పలికి యద్దేవుండు దేవతలును మునులును దివంబుననుండి కనుంగొను
చుండ సపరివారంబుగా నచ్చోట నంతర్ధానంబు నొందె నటఁ గృష్ణుండు.246
క. నారదుఁడు వచ్చి ప్రియ మిం, పారఁగఁ గాంచుటయుఁ బ్రీతుఁ డై మునివర వే
వే రౌక్మిణేయసుతునకు, గారవమునఁ జేయవలయుఁ గల్యాణంబున్.247
వ. ద్వారకానగరంబున నతనిం గానక పడిన పాటు గ్రమ్మఱం దత్సందర్శనప్రమోద
శోభనంబు శోభిల్లం జూచినయప్పుడుగదా నామనంబు సమాధానంబు నొందుట
యనిన నయ్యోగీంద్రుండు కన్యాంతఃపురంబున నతని యునికి యెఱింగించి
యందులకుం దోడ్కొని చను సమయంబునం జిత్రరేఖ యెదురుగా వచ్చె న
య్యింతి ముంగలిగా వారలందఱుం దన్మందిరంబు బ్రవేశించి వాహనంబులవలన
నవతీర్ణు లై రప్పుడు.248
క. గరుడాలోకనమాత్రన, యురగము లనిరుద్ధు విడిచి యుర్వీస్థలికిన్
సురిఁగి తొలఁగి చని యెప్పటి, శరంబులై యుండె నక్కజం బగు భంగిన్.249
వ. వాసుదేవుండును సమ్మోదసంభ్రమంబునం జని మనుమనిం గౌఁగిలించిన నద్దేవు
దివ్యాంగస్పర్శనంబున నక్కుమారుదేహంబు నిర్వ్రణంబును విగతపీడనంబును
బ్రభూతసర్వహర్షోత్సవంబును నై యొప్పె బలదేవప్రద్యుమ్నులు నతని గాఢపరి
రంభణంబుల సంభావించిరి నారదవైనతేయపూర్వు లైన యమువ్వురకుం గ్రమం
బున నమస్కరించి యా ఋష్యకేతుండు తదాశీర్వాదంబుల నభివర్ధితుం డయ్యెఁ
జిత్రరేఖాప్రభృతిసఖీజనంబులపనుపున నుషాసుందరియు నంతంత నమ్మహాభా
గులకుం బ్రియభక్తిలజ్జారమణీయం బగు సాంజలిప్రణామం బొనరించిన దీవించి
రిట్లు సముచితాచారంబులు నడిచిన యనంతరంబ.250
క. నారదుఁడు గృష్ణువదనాం, భోరుహమునఁ జూడ్కి నిలిపి పురుషోత్తమ యి
ద్ధారంభుఁడ వై తింకఁ గు, మారున కొనరింపు ముచితమంగళ మిచటన్.251
వ. శోభనతిథినక్షత్రం బగు కాలంబున నభిమతం బగు లగ్నంబు సమాసన్నం బైనది
తడయ నేల యను నవసరంబున సర్వవైవాహికద్రవ్యంబులు నలవరించుకొని
కుంభాండుం డరుగుదెంచి యంతంతఁ గృతాంజలి యై నిలిచి.252
క. శరణాగతరక్షకుఁడవు, కరుణాకరుఁడవు త్రిలోకకల్యాణుఁడ వీ
శ్వరుఁడవు గావున నిన్నే, శరణము చొచ్చితి ముకుంద సర్వార్తిహరా.253
వ. ప్రసన్నుండ వగు మనిన నారదుండును నయ్యసురోత్తముఁ బ్రసాదయోగ్యుం
గా నుదాహరింప నభయం బిచ్చి యచ్యుతుండు.254
క. నిను లెస్సవానిఁగాఁ గను, వినినాఁడం గాన బాణువిభవము సర్వం
బును నీ కిచ్చితిఁ జిరజీ, వనసౌఖ్యము నొందు మసురవర యని నెమ్మిన్.255
వ. అతనిం బిలిచి కుమారునకుం గన్యకకు నభిషేకంబులు నలంకారంబులు నర్హజనం
బులచేతం జేయించి వివాహవేదిపై నయ్యిరువుర నునిచిన సమయంబున.256
సీ. వరమునిసహితుఁ డై వనజాసనుఁడు వచ్చె నమరసమేతుఁ డై యనిమిషేంద్రు,
డే తెంచె నప్పరోన్వితు లై గంధర్వు లరుగుదెంచిరి పరిస్ఫురితలీల
నాటలుఁ బాటలు నలరంగఁ దతవితతాది వాద్యములు హృద్యముగఁ జెలఁగఁ
గైసేసి శచిలోనుగాఁగల దేవపురంధ్రివర్గములు పేరటము సేయ
తే. దివిజమంత్రి ఋత్విజుఁడయి దివిజవహ్ని, యందువిధియు క్తముగ వేల్చి హర్ష మెసఁగఁ
గరసరోరుహగ్రహణమంగళము సాంగ, ముగ నొనర్చె దంపతుల కింపులు దలిర్ప.257
వ. అట్లు వివాహంబు సంపన్నంబు గావించి గోవిందుం డయ్యిరువురం దోడ్కొని
రుద్రుండును రుద్రాణియు నున్నయెడకుం జని మ్రొక్కించిన నయ్యాదిమగృహిణీ
గృహస్థు లా నూతనమిథునంబు నాదరించి యభినందించిరి శైలనందన యయ్య
సురరాజనందనకు బ్రద్యుమ్ననందనునకు వాహనంబుగా బాణవాహనం బగు
బర్హిపుంగవు నిచ్చె నవ్విధంబునకుం బ్రీతుండై పీతాంబరుండు.258
క. భవుని భవానిని వీడ్కొని, [21]దివిజేంద్రుని దివిజగణము దివిజజ్యేష్ఠున్
సవినయముగ వీడ్కొలుపుచుఁ, బవనాశనదమను నెక్కి పయనం బయ్యెన్.259
తే. అపుడు హరిఁ జేరి కుంభాండుఁ డధిప వరుణు, పాల నున్నవి బాణునిపసులు వాని
పాలు ద్రావిన సత్త్వసంపన్ను లఖిల, దుర్జయత్వవిభూతి నొందుదురు వినుము.260
శ్రీకృష్ణుఁడు బాణుని గోధనంబుకొఱకు వరుణునితో యుద్ధంబు చేయఁబోవుట
వ. అవి దేవరసొమ్ము గావించుకొనుట లెస్స యనుటయు నవ్విధంబునకుం జిత్తగించి
యట్ల చేయుద మని యతని నిలిపి మయూరాధిరూఢు లగు కన్యాకుమారుల
మున్నిడుకొని వెన్నుం డన్నయుం గొడుకును దన్ను నుభయభాగంబులం
గదియం గదలి గరుడాత్మకం బగు యానం బనూనవేగంబున గొనిపోవ నతి
దూరం బరిగి.261
క. చరమాంబుధితీరవనాం, తరముల బహువర్ణచిత్రితము లై లీలన్
జరియించు గోగణంబులఁ, జరితార్థుఁ డనేకలక్షసంఖ్యలఁ గనియెన్. 262
వ. ఇట్లు గాంచి.263
ఆ. పసులఁ బిల్చు నేర్పు పసిపాపనాఁటనుం, డియును దనకు నైజ మయిన తెఱఁగు
గానఁ బసులఁ బిలువఁగా నుత్సహించి వి, హంగగమనుఁ డడరి యడ్డ మేఁగె.264
క. ఆతనికి నగపడక యవి, యాతతవేగమున నరిగి యబ్ధి నడఁగినన్
జాతరభసుఁ డయి కాశ్యప, సూతికి ని ట్లనియేఁ గంససూదనుఁడు తగన్.265
సీ. వినుము పక్షీంద్ర బాణుని జయించుట కేను జను దెంచునప్పుడు సత్యభామ
నాతోడ బాణధనం బగు మొదవులు గలవఁట కొలది కగ్గలము వాని
పాలు ద్రావినవారు బలము సత్త్వము నెక్కుడై యెన్నఁడును ముదియక సుఖింతు
రని వింటి నతనిఁ గయ్యంబున నోడించి యైనఁ దేవలయు నా కవి ప్రియమున
తే. ధర్మ మెడలక తగు కార్యతత్త్వమునకు, నేమియును గీడు గాకున్న నిట్లు సేయు
మనియెఁ బసులఁ జేరంగ మిథ్యాప్రయత్న, మగుట మేలె యుద్యోగ మి ట్లగుట నీవు.266
వ. ఎయ్యది కర్తవ్యం బూహింపు మనిన నతండు.267
క. ఒండేమిగలదు వరుణుని, దండించి ధనంబు గొనుట దక్కఁగ నని యొం
డొండ ప్రభునిమది మెచ్చఁగఁ, జండోద్ధతపక్షపవనసంరంభమునన్.268
చ. ఉఱక పయోధితోయము మహోరగవాసముదాఁక నెంతయుం
దెఱపిగఁ జేయఁ జొచ్చి జగతీవిభుఁ డబ్ధిపువీడు ముట్టెనే
డ్తెఱఁ బటుశంఖఘోషమున దిక్కులు వ్రయ్యఁగఁ దేరు లొక్కమై
నఱువదియాఱువేలు రయమారఁగ వెల్వడి తాఁకె నవ్విభున్.269
క. అప్పుడు ఘోరపుఁగయ్యం, బప్పురుషోత్తమున కయ్యె నద్భుతబలు లై
యప్పతియోధులు మాధవుఁ, గప్పిరి దివ్యోజ్జ్వలాంబకప్రకరములన్.270
క. తనశరములఁ దచ్ఛరములు, దునుమాడి మురారి దొప్పఁదోఁచె బెలుచఁ ద
త్తనువులు నిశితశరక్షత, జనితబహుళశోణితప్రసరణమున వెసన్.271
మ. బలుఁడుం బుష్పశరుండుఁ దత్తనయుఁడుం బద్మాక్షునిం గూడి పే
రలుకల్ సూపిరి పక్షిపక్షనఖతుండాఘాతముం దత్క్రియా
తులితక్రీడఁ దనర్చె ని ట్లెసఁగుతద్ఘోరాహవవ్యాప్తికిం
గలఁగంబాఱి తొలంకె వారుణబలౌఘంబుల్ విమోఘంబు లై.272
క. అంతయు నెఱింగి వరుణుం, డెంతయుఁ గోపించి యౌర యేమీ కృష్ణుం
డింత గనుఁగొనక మసఁగెనె, యంతియకా కేమి యనుచు నాటోపమునన్.273
వ. పుత్రపౌత్రగణసమేతుం డై సమస్తసై న్యంబుల సమకట్టి సమున్నతస్యందనంబు
నం గనకస్యంది యగు సితచ్ఛత్రంబు మెఱయఁ జిత్రతనుత్రంబు దాల్చి చారణు
లిరుదెసలం గైవారంబులు చేయ నచ్చరలు గంధర్వుల నాడుచుం బాడుచుం
గొలువ దేవతలును మునులును జయాశీర్వాదంబులు పచరింపఁ బెంపారుభూరి
ధనుస్స్ఫారంబులు ఘోరంబులునై వారిధరంబులు రణసంవిరావంబులు సంభావింప
శంభుండు బాణత్రాణసంరంభంబున వెడలు మాడ్కి వెడలి విష్ణుం దలపడి
తీవ్రబాణసహస్రంబున రసాతలతిమిరంబునకుఁ బ్రోదిసేసినఁ బ్రహాసవిభవో
దారుం డగుచు వృష్ణికులవీరుండు.274
క. దారుణరూపం బగున, వ్వారుణబాణోత్కరప్రవాహము దనదు
ర్వారవిశిఖసేతువున ని, వారించి విరోధిమేను వ్రయ్యఁగ నేసెన్.275
క. అలిగి ప్రచేతసుఁ డొక్కట, బలమన్మథతత్తనూజపతగేంద్రులతో
గలయఁగ ననేకశరముల, జలజాక్షునితనువు రుధిరజలములఁ దేల్చెన్.276
వ. అట్టి విపక్షోత్సాహంబు సైఁపక దుస్సహప్రభావుం డగు వాసుదేవుం డాత్మీయ
తేజోనిర్మితం బై నిర్మితానేకరిపుధ్వంసం బగు నస్త్రకళావతంసంబు కేలం గైకొని
యభిమంత్రించి వరుణుం బేర్కొని.277
ఉ. ఏను మదస్త్రరాజ మిదె యేసెద నీవు మదంబుపెంపునం
గానక నన్ను మార్కొని మగంటిమిఁ జూపెద నంచు నాజికిం
బూనితి నిల్వు మింక నెట పోవఁగ వచ్చు భవద్దిగీశల
క్ష్మీనిరవద్యభోగముల మేలిమికిం దుదియయ్యె నియ్యెడన్.278
వ. అని పలికి నియతిం బ్రయోగించిన నవ్వైష్ణవాస్త్రంబు.279
మ. దెస లెల్లం గబళించి మంటలు గడుం దీవ్రంబు లై పర్వఁగాఁ
బ్రసరద్దాహ మొనర్పఁ జొచ్చిన వెఱం బ్రత్యర్థియున్ వారుణా
స్త్రసమాయోగ మొనర్చెఁ దత్సలిలముల్ దైత్యారిబాణానిల
ప్రసభవ్యాప్తి నడంగె నల్ఫకణసంభావ్యంబు లై గ్రక్కునన్.280
తే. వారుణాస్త్రంబు సమయించి వరుణుదెసకుఁ, గవిసె వైష్ణవసాయకాకారవహ్ని
ప్రాణరక్ష వేవొండు మైఁ బడయరామి, దెలిసి యంత నాపశ్చిమదిగ్విభుండు.281
వరుణుఁడు శ్రీకృష్ణునితో యుద్ధము చేసి పరాజితుం డై స్తుతించుట
క. కరముల నున్నశరంబును, శరాసనముఁ దొలఁగఁ బెట్టి సమధికశాంత
స్వరమగువాక్యంబుల నా, హరి నుద్దేశించి యిట్టు లనియె వినీతిన్.282
సీ. భవదీయశాశ్వతప్రకృతి యారయ సత్త్వగుణము నీ విప్పు డాగుణము విడిచి,
తామసియగువృత్తిఁ దగునె పాటింపంగఁ బంచభూతాశ్రయ బహుళదోష
సంకీర్ణ యైన యహంకృతి నినుఁ బొంది యున్నది జలమూర్తి యోగివర్య
నీయధీనమ నేను నీవ కాఁ దలఁతు నిట్లేటికి మద్దాహ మిచ్చగించి
తే. తగ్నిదెస నగ్ని యేమి సేయంగనోపుఁ, గాన నుడుగు మీయుగ్రంపుఁగడఁక యీశ
ప్రభుఁడ వీవిశ్వమునకును బ్రభుత నీకుఁ, జూపి చక్కఁబోఁగలఁడె యేశూరుఁడైన.283
వ. ఆగ్నేయవారుణసంజ్ఞం బగు ప్రకృతిద్వయంబున నయ్యఖిలజగంబు నుత్పన్నం
బైన యది సాత్త్వికంబున విష్ణుండ వై పాలనంబు సేయుదువు తామసంబున రుద్రుం
డవై జయంబుఁ జేయుదువు నిజాధికారంబుల నడపించు నేను మదీయప్రకృతియంద
యున్నవాఁడఁ బ్రకృతిదూషకుండఁగాను ఇట్టి నన్ను నాత్మీయప్రకృతికిఁ బాపం
దొడంగెదవు సర్వభూతంబుల కాదికర్తవు సర్వసత్త్వంబులకు నజేయుండవు
సర్వధర్మప్రవర్తకుండవు మానుషప్రకృతిం జెంది బాలుండు గ్రీడ ననేకవస్తువుల
వినోదించువిధంబునఁ బ్రమోదించెదవు సర్వజ్ఞుండవు నీయెఱుంగనియది లేదు
మాబోంట్లకు సమ్మోహనం బొదవించుకొఱ కిట్టివాఁడ వైతి. అది యెఱుంగుట
గహనం బెట్లున్న నుండుము రక్షణీయుండ నగుదు నన్ను రక్షింపుము నీకు
మ్రొక్కెద ననిన నక్కరుణాకరుండు కరుణాపేశలుం డై పాశపాణిం జూచి.284
క. వాణీవిభవమున నతి, ప్రీణన మొనరించి యిట్లు ప్రిదులఁ దలఁచె దా
బాణుపసి నొసఁగ కూరక, ప్రాణత్రాణంబు నీకుఁ బడయఁగ వశమే.285
వ. ఇంత యెఱింగి బుద్ధిమంతుండ వగు మనిన నవ్వరుణుండు దేవా దేవద్విషుండు
పశుధనంబు నిల్లడ వెట్టునప్పు డెవ్వ రడిగినఁ బ్రాణాత్యాయపర్యంతంబుం బెనంగు
నదిగాని యీఁదగ దని సమయంబు సేయించుకొనియెఁ బలుకు దప్పనోడుదుఁ
దగవు లెల్ల నడప నొడయండ వింత యవధరింపుము.286
క. నను మన్నింపఁగఁ దలఁచిన, మనిచి పసులమీఁదితలఁపు మాని చను పసిం
గొనిపోకయ నిర్బంధపు, బనియైనం బండె నాకుఁ బాపం బనఘా.287
తే. ఇది నిజంబుగఁ జెప్పితి నెట్లు చూడఁ, బోలె నట్లు చేయుము మహాపురుష! పూజ్య!
యనిన నల్లన నవ్వి దివ్యాస్త్రవహ్ని, యుడిపి గోధనాపేక్షయు నుజ్జగించి.288
వ. తదనురూపం బగుసల్లాపం బొనర్చి యదునాథుండు యాదోధినాయకునకు నభయం
బిచ్చి యతనిచేత ననర్ఘ్యరత్నపూర్ణం బగు నర్ఘ్యప్రదానంబునం బూజితుం డై
తదీయలోకంబు వెలువడి నిజస్థానాభిముఖుం డయ్యె నయ్యవసరంబున.289
సీ. ఆదిదేవుఁడు విష్ణుఁ డఖలలోకహితార్థ మాశ్చర్యకార్య మి ట్లాచరించి
వేడ్కఁ బురంబు ప్రవేశించునప్పుడు మిక్కిలివిభవంబు మెఱయవలదె
యని పురందరుఁడు సర్వామర్త్యులను నారదాదిసిద్ధులను సమస్తభువన
వాసులఁ గొనుచు నవ్వాసుదేవునిఁ గొనవచ్చి దీపవిమానవైభవముల
తే. నంబరము తిగ్మకిరణసహస్రభాసు, రంబు సేయుచు దివ్యతూర్యధ్వనులను
గుసుమవృష్టిని సంస్తుతిఘోషములను, హృష్టజనవర్గములకు నిం పెసఁగఁ గొలిచె.290
వ. అవసరోచితం బైన తదీయసేవాధర్మధుర్యుండు గావున నాత్మీయభావంబునం బరి
గ్రహించి యయ్యింద్రు ననుగ్రహించి యగ్రేసరం బై సురప్రకరంబు మార్గం
బొసంగ ననర్గళోత్సవంబున.291
చ. గరుడమయూరయానములఁ గంజదళాక్షుఁడు పుత్రపౌత్రసం
భరితవిభూతి యై దివిజపఙ్క్తులచూడ్కుల కెల్ల నుత్తరో
త్తరకుతుకానురంజనవిధాయక మైన విధం బెలర్పఁగా
నరిగె నపూర్వసమ్మదభరార్ద్రతఁ దానును బూర్వజన్ముఁడున్.292
వ. ఇ ట్లరిగి నిజరాజధాని నంతంతం గని విజయసూచకం బగు క్రమంబునం బాంచ
జన్యశంఖధ్వానం బొనర్చిన.293
చ. విని యదువంశవృద్ధులు ప్రవృద్ధకుతూహలలీలమైన బురం
బునకుఁ బ్రభూతశోభనవిభూషణభంగులు సంఘటింపఁగాఁ
బనిచి రథద్విపాశ్వభటబంధురసైన్యసహస్రలక్ష్మితో
ననుజతనూజపౌరసచివాన్వితు లై యెదురేఁగి రర్థితోన్.294
క. అటమున్న వచ్చి నగరని, కటకేళీవనములందు గరుడని డిగి వి
స్ఫుటనిర్జరపరిపాలో, త్కటముగఁ బరమేశుఁ డుండెఁ గడుమోదమునన్.295
శ్రీకృష్ణుం డింద్రాదిదేవతలతో ద్వారకాపురంబునకు వచ్చుట
వ. ద్వారకానివాసు లనేకమంగళతూర్యజయాశీర్వాదనాదంబుల నద్దేవు దర్శించి
రమ్మహానుభావుం డట్లు సనుదెంచి యాత్మీయజనంబు నఖిలంబును సముచితప్రకా
రంబు లగు సత్కారంబుల గారవించి దారుకసారథికం బగు రథం బగ్రజతనూజ
సమేతంబుగా నెక్కి మయూరావతీర్ణు లగు నుషానిరుద్ధుల నుద్ధతస్యందనా
రూఢులం జేసి వినతాతనయుండు వినతుండై కొలువ నఖిలనిలింపులు నిలింప
పతి మున్నుగా ననుసరింపఁ బెంపారి పురంబు ప్రవేశించె నంత.296
క. తన విజయవార్త యంతన, యనేకముఖములఁ బ్రసిద్ధ యై పురజనులన్
జనితవచోవిభవులఁగా, నొనరింపఁగ నిరుగెలఁకుల నుద్భటఫణితిన్.297
సీ. అదరుటగ్నులకోటు లార్పి బ్రహ్మాదులుఁ జొర లేని బలిసూనుపురముఁ జొచ్చెఁ
బ్రమథవీరులుఁ దానుఁ బన్నినమిక్కిలికంటివేల్పునకు నగ్గలికఁ జూపె
నాఱుమోములపట్టి కడ్డమై వచ్చినదాక్షాయణికిఁ బుత్రభిక్ష యొసఁగె
దనయిచ్చఁ బగవానిదర్ప మంతయుఁ బుచ్చి యిరుగేలితోఁ బ్రాణ మిచ్చి కాచె
తే. సురలు బంట్లయి తిరిగెద రరిది యెల్ల, భువనములకు నితఁడు రాజు భూరితేజుఁ
డివ్విభుని రాజుగాఁ గంటి మెట్టిపుణ్య, మట్టితప మెట్టిభాగ్య మి ట్లెసంగె మనకు.298
వ. అని యనేకవిధంబుల వీతెంచు సంతోషకలకలంబు వీనుల కానందం బొసంగ
నాకసంబునం దొరఁగు దివ్యపుష్పవర్షంబులం బెరసి పుణ్యాంగనాకరకలితలలితా
క్షతవిక్షేపంబులు కిరీటకుసుమస్రగుత్తరీయాదులం దగిలి మిగిలిన యెప్పిదం
బొనర్పఁ దరుణీవిలోచనరోచులు రుచిరస్మితచంద్రికలఁ దార్కొన నర్కప్రభాపరి
భావి యై భవ్యకౌస్తుభగభస్తిరాగంబున ననురాగరమ్యం బగు పురం బంతయుం
గుంకుమపంకాభిషేకంబున నుత్సేకంబు నొందింప మందానిలాందోళితమణిధ్వజ
వైజయంతీవిరాజితం బగు రాజమార్గంబునం జని యదురాజు రాజమందిరంబు
సొచ్చి యుషాసమేతంబుగా ననిరుద్ధు నంతఃపురంబునకుం బోవం బనిచె నచ్చట
నచ్చట నవతీర్ణు లయిన విబుధుల విమానంబుల మృగవృషభవాజివారణహంస
సారసమయూరాద్యనేకవాహనకల్పంబు లగు నద్భుతంబులు జనంబుల కావ
హించుచు నపరిమితరథగజతురగసంకీర్ణ యగు నగరభూమికి మీఁదటి నగరంబు
నందుఁ దందడి సందడి యై యుండె నప్పుడు గోవిందుండు సర్వయాదవులం గనుం
గొని యి ట్లనియె.299
ఉ. నాకుఁ బ్రియం బొనర్ప నిదె నాకవిభుం డిట వచ్చినాఁడు నా
కౌకసు లందఱున్ సురగణాధిపుతోఁ జనుదెంచినారు సు
శ్రీకులు నారదాద్యఖిలసిద్ధులు నొక్కట నేఁగుదేంచినా
రీకమనీయమూర్తులకు నింపుగ మ్రొక్కుఁడు సూడుఁ డిందఱున్.300
సీ. వీరె రుద్రాదిత్యవిశ్వాశ్వివసువులు గంధర్వయక్షరాక్షసులు వీరె
వీరె వాసుకిముఖ్యవివిధభోగీంద్రులు ద్రిదివస్థపూర్వపార్థివులు వీరె
వీరె సప్తర్షులు మేరగా నూర్జితజ్యోతిరాకృతు లైన సుకృతపరులు
వీరె సర్వప్రజావిభుపురస్సరముగా నధికులు మన్వంతరాధిపతులు
తే. నగము లగములు హ్రదములు నదము లుదధు, లివె విదిక్కులు దిక్కులు పవనపథము
వనజభవలోకగోలోకవాసవితతి, యాదిగా మూర్తిమంతంబు లయిన విచట.301
వ. మీర లందఱును చందనాదిసమాచారంబులు నడపుట లెస్స యనీన నమ్మహా
ప్రభావు పనుపున వార లవ్వేల్పులకెల్ల నుల్లసితచందనకుసుమాక్షతాదిద్రవ్యం
బుల నధికభవ్యంబు లగు నర్ఘ్యపాద్యాదిపూజనంబు లొనర్చి ప్రియవాక్యోప
న్యాసంబులఁ జేతోవికాసంబు గావించి.302
క. తలఁపఁగ బువ్వులకతనం, దలకెక్కెను నార లనువిధంబున హరివా
రల మగుట నిట్టిపేర్మికి, నలవడితిమి ధన్యతముల మైతిమి ధరణిన్.303
వ. అని సంతసిల్లి రనంతరంబ వాసవుండు వాసుదేవు నిరుగేలం గ్రుచ్చి యురంబునఁ
గదియించి వసుదేవబలదేవుల నుగ్రసేనసాత్యకిప్రద్యుమ్నులను దక్కిన కుమార
వర్గంబునుం బ్రత్యేకపరిరంభణంబులఁ బరిగ్రహించి కుశలం బడిగి వారికి వారి
జోదరుదెసఁ జూపి యి ట్లనియె.304
మ. యదువంశైకవివర్ధనుం డలఘుసత్వాకల్పుఁ డీకృష్ణుఁ డ
భ్యుదయోదగ్రుఁ డొనర్చినట్టి పను లీభూతప్రపంచంబులో
మది నెవ్వానికిఁ జేయఁ జూడఁ దలఁపన్ మానంబులే యద్భుత
ప్రద మీయిన్నిట బాణునిం బఱుచుటే పారంబు గా కారయన్.305
ఉ. కావఁగ నేర కాహరుఁడుఁ గ్రౌంచవిభేదియుఁ దాను జూడ బా
హావన ముగ్రచక్రహతి నంతయు నొక్కట నుగ్గు చేసి యా
దేవుని ప్రార్థనం గరుణ దేవవిరోధికిఁ గేలుదోయితో
జీవిత మిచ్చె నేమి యని చెప్పుదు మివ్విభు దోర్విలాసముల్.306
వ. ఇమ్మహానుభావుండు మహీతలంబున నవతరించిన కార్యంబు జగద్ధితధుర్యం బై
పర్యాప్తం బొందె నేము విగతశోకుల మైతి మింకను నిమ్మహాబాహుబాహుల
ప్రాపు గలదు గావున నేవిధంబులయందును బరిస్పందంబు లేక నాకంబున సుఖిం
చెదము మీరు ద్వారకానగరసౌధోద్యానసరసీప్రముఖంబులు సుఖోచితస్థానం
బులుగా మనుష్యోచితపురుషాయుష్యం బంతయుం జింతం బొరయక నిర్వ
హించువా రని పలికి పాకశాసనుండు.307
ఉ. క్రమ్మఱఁ బంకజాక్షు నతిగాఢతరంబుగఁ గౌఁగిలించి హృ
ద్య మ్మగుభాషణమ్మునఁ బ్రియప్రవిపూరణ మాచరించి నె
య్య మ్మలరార వీడ్కొని సమస్తసురాసురసంయమీంద్రసం
ఘమ్ములు గొల్వ నేఁగె నవికల్పత నాత్మనివాసభూమికిన్.308
వ. ఇక్కడ గమలనాభుండు సభాసీనుం డై సర్వయాదవులం గుశలం బడిగి తన
పోయివచ్చిన వృత్తాంతం బంతయు సవిస్తరంబుగా వారల కెఱింగించి తదీయంబు
లగుప్రత్యభినందనవాక్యంబుల సవిశేషసంతోషంబు నొంది వినతాతనయు నభి
నందనపూర్వకంబుగా వీడ్కొలిపి నారదమునీంద్రు నమందమాధుర్యధుర్యంబు
లగు వచనచాతుర్యంబుల నుత్పాదితప్రమోదుం జేసి విజయం చేయుండని పనిచి.309
ఉ. ము న్ననిరుద్ధుఁ బాసి పతిమోహభరంబున స్రగ్గి యెంతయున్
విన్నఁదనంబునం బడినవీ డఖిలంబునకున్ మహోత్సవం
బెన్నఁడు నెందు నెవ్వరును నిట్టి దెఱుంగ రనంగఁ జేయుఁ డం
చున్నతి నానతిచ్చెఁ గురుసోదరబాంధవపౌరకోటికిన్.310
వ. అమ్మహోత్సవసమయంబున నుగ్రసేనాభ్యనుజ్ఞాపురస్సరంబుగా నతండు బాణ
తనయతోడం జనుదెంచిన చెలికత్తియలలోనం గుంభాండు కూతుఁ జిత్రరేఖ చెలి
యలి రామాభిధాన యగు కన్యక సాంబకుమారునకును సురాసురసిద్ధకన్యలం
బెక్కండ్రఁ దక్కిన కుమారులకును వివాహంబు సేసె నట్టి కల్యాణపరంపరయందు
గృహంబున నరనారీసముదయంబులకు ననేకచిత్రాలంకారవిరచనంబులు నభి
రామతూర్యనాదంబులు నవిశంకితప్రమోదనర్తనంబులుఁ బ్రవరిల్ల నఖిలగృహం
బులు నేకగృహంబు తెఱంగున శోభల్లె నంత.311
క. ఒకనాఁడు యదుప్రవరులు, సకలోత్సాహమునఁ గృష్ణుసదనమునకు ను
త్సుకతఁ జనుదెంచి సమ్మద, వికసితసంభాషణప్రవీణత యొప్పన్. 312
వ. అప్పరమేశ్వరు నైశ్వర్యంబులుం గార్యంబులు నాశ్చర్యంబు లగుట యుదా
హరించి యవి ప్రసంగంబులుగా ని ట్లనిరి.313
క. దేవా దేవరబాంధవ, భావంబున మమ్ముఁ గలసి భవ్యక్రీడా
ప్రావీణ్యమున నటించుట, నేవారలు లేరు తుల్యు లెందును మాకున్.314
మ. నిను నిత్యంబునుఁ గన్నులారఁ గనుటన్ నీవాక్యముల్ నిత్యముం
దనియన్ వీనులఁ గ్రోలుటన్ భవదనుధ్యానంబు నిత్యంబు నె
మ్మన మానందమయంబుగాఁ బడయుట న్మాపుట్టువుల్ దివ్యభా
వనిరూఢంబుగఁ జేసె నిట్ల కరుణావ్యాసక్తిఁ బాటింపుమీ.315
వ. అని పలికి యమ్మహాత్ముచేత నభినందితు లై వారలు నిజగృహంబుల కరిగి సుఖంబున
నుండిరి హరియును బూర్వప్రకారంబున విహరించె నంత.316
క. దేవకియును రోహిణియును, రేవతియును రుక్మిణియును బ్రియము లెసఁగ సం
భావన లొనర్ప గారా, మై వెలసె బలీంద్రుపౌత్రి యదుతతి కెల్లన్.317
క. ప్రద్యుమ్నుదేవి కోడలి, హృద్యచరితమునకుఁ బ్రీతి యెలయఁ దమకులం
బుద్యోతిత మగు నియ్యమ, యుద్యద్గుణసమితి నని ప్రియోత్కట యయ్యెన్.318
ఉ. ఆవనజాక్షిఁ జెంది సరసాభిమతోజ్జ్వలవస్తుజాతముల్
కేవలయోగభాగ్యపరికీర్తిఁ దలిర్పఁగ వీతఖేద యై
యౌవన ముల్లసిల్లఁ గరుణాభిమతుం డనిరుద్ధుఁ డుద్ధత
శ్రీవిలసత్సుఖోన్నతులఁ జెందె నమందరసోదయాత్మతన్.319
వ. ఆ చిత్రరేఖయు సఖిసాంగత్యసంప్రమోదంబునం గతిపయదివసంబులు వసియించి
యనంతరంబ యయ్యింతి వీడ్కొని తక్కిన చెలులకుం బ్రియపూర్వకంబుగా
నెఱింగించి యప్సరోలోకంబున కరిగె నని చెప్పి వైశంపాయనుండు జనమే
జయున కి ట్లనియె.320
క. నీ వడిగిన బాణకథా, శ్రీవిభవము విస్తరించి చెప్పితి నిమ్మై
గోవిందుచరిత మతిసం, భావితము సమస్తభువనపావనము నృపా.321
ఉ. విష్ణుమూలతత్త్వమును వేమఱు[22] నయ్యయిజన్మకర్మవ
ర్తిష్ణుత లాదరించుటలు దేవకికిన్ వసుదేవుకున్ ధరన్
గృష్ణుఁ డనంగఁ బుట్టి శిశుఖేలన మాదిగఁ గల్గుభావముల్
ధృష్ణుత నిర్వహించుటలుఁ దెల్లగ వింటి నరేంద్రపుంగవా.322
సీ. వినుము నారదముని చనుదెంచి సకలరాజన్యుల యెదుర నాశ్చర్యభూతుఁ
డితఁ డని కృష్ణుని నుతియించు టాదిగా గోవిందుమాహాత్మ్యకోటి యెల్ల
నాశ్చర్యముగ నోలి ననఘ కీర్తించితి నాశ్చర్య మంభోరుహాక్షునంద
కాక యొండెడ మఱి గల్గునే యవ్విభుజన్మంబు లాశ్చర్యసంశ్రయములు
తే. కర్మములు మహాశ్చర్యముల్ నిర్మలంపు
గుణము లాశ్చర్యపరసీమ లణువునకును
[23]నణువును మహత్తునకును దా నతిమహత్తు
నాత్మ నారాయణుఁడు సత్పరాయణుండు.322
క. దైత్యులయందును మఱి యా, దిత్యవరులయందు నఖిలదివ్యులయందున్
నిత్యుఁడు ముకుందుఁ గడవఁగ, నత్యధికుం డైన ధన్యుఁ డన్యుఁడు గలఁడే.324
క. వసురుద్రాదిత్యాశ్వి, శ్వసనులు దిగ్గగనములును సలిలాగ్నులు ధ
ర్మసమాధితపోదమశాం, తిసత్వయజ్ఞములు వాసుదేవునిమూర్తుల్.325
క. ధాతయు సంహర్తయును వి, ధాతయు నచ్యుతుఁడ హరిపితామహమూర్తి
స్ఫితుఁడు పీతాంబరుఁడ మ, హాతత్త్వము విష్ణుఁ డొకఁడ యను నాగమముల్.326
క. దేవదనుజమనుజాదిక, జీవచయంబులకు నెల్ల శ్రీవిభవములుం
గైవల్యము నొసఁగెడు పర, దేవత మఱి గలఁడె విష్ణుదేవుఁడు దక్కన్.327
క. నీ విదియంతయు సమ్య, గ్భావంబున నెఱిఁగి విష్ణుపదకమలధ్యా
నావేశమునఁ గృతార్థపు, జీవనుఁడవు గమ్ము నృపతిశేఖర భక్తిన్.328
తే. అనఘ యీబాణ యుద్ధకథానుబద్ధ, మైనపుండరీకాక్షుమాహాత్మ్య మర్థి
వినినఁ జదివినఁ దలఁచినఁ దనకులప్ర, తిష్ఠయును శ్రీయు ధర్మబుద్ధియునుఁ గలుగు.329
వ. అని యుపన్యసించి యమ్మునీంద్రుం డన్నరేం ద్రు నుపలక్షించి.330
సీ. నీమహాయజ్ఞంబు నిర్వర్తితంబుగాఁ దత్పరమతి భారతప్రసంగ
మున విష్ణువంశంబు మొదలింటినుండియు నెలమిఁ గీర్తించితి నిద్ధపుణ్య!
యెవ్వఁ డీయాఖ్యాన మెప్పుడు పఠియించు వినయంబుతో విను విని మనమున
మఱవక యునుచు నమ్మనుజుఁడు నిర్ముక్తకలుషుఁడై విష్ణులోకంబు నొందు
తే. నిచ్చలును రేప మేల్కని నియతి నిందు, గొంతకథ యేది యేనియుఁ గోరి జపము
సేయుసుకృతాత్మునకు నఱచేతిలోని, వైహికాముష్మికప్రితు లఖిలములును.331
మ. హరివంశశ్రవణానుకీర్తనల బ్రహ్మక్షత్రవిట్ఛూద్రు లా
దరణీయశ్రుతిలక్ష్మియున్ విజయనిత్యశ్రీయు భవ్యార్థలా
భరమావర్గము సర్వసౌఖ్యరుచులం బ్రాపింతు రారోగ్యమున్
బరమాయుస్సుతకీర్తులున్ సమత యొప్పం జెందు నిత్యంబుగాన్.332
క. అని వైశంపాయనముని, వినుతవ్యాఖ్యాన [24]మెల్ల వివరించిన న
జ్జనమేజయజననాథుఁడు, మనమున సమ్మోదసుఖసమగ్రత నొందెన్.333
వ. మీర లిమ్మహావాఙ్మయప్రపంచంబునందలి సమంచితార్థంబు సమర్థమేధాగోచరంబు
గావించి శ్రుతంబు కృతార్థంబుగా జేయుం డని సమస్తయదువంశాను
చరిత్రసమేతం బగు కృష్ణావతారగుణకర్మజాతంబు సమధికరససమన్వితంబుగా.334
తోదకము. మానవతీజనమానసవర్తీ, మానవనాథసమర్పితకీర్తీ
దానవభేదికథానతమూర్తీ, దానపరాయణతానుతమూర్తీ.335
క. జగదవనహేల సంతత, జగతీసురభరణలోల సన్నుతశీలా
విగతపరితాపకారా, నిగళితరిపుభూప రాజనిగమదిలీపా.336
మాలిని. నిరుపమగుణరత్నోన్మేషనిర్దోషశశ్వ
త్పరిచితమితసమ్యగ్భాష సత్పోష విద్వ
ద్విరచితపదవాక్యోద్గేయధౌరేయ చేతః
పరిణతబహుధర్మోపాయ వీతవ్యపాయా!337
గద్యము. ఇది శ్రీశంకరస్వామిసంయమీశ్వరచరణసరోరుహధ్యానానందసౌందర్య
ధుర్య శ్రీ సూర్యసుకవిసంభవ శంభుదాసలక్షణాభిధేయ యెఱ్ఱయనామధేయ
ప్రణీతం బైనహరివంశంబున నుత్తరభాగంబునందు అష్టమాశ్వాసము.
- ↑ విధమున
- ↑ కుహరరావంబు క్రమంబున
- ↑ యుండం దగన్
- ↑ గాన కిట్లీ, వొనరఁగ నీభంగిఁ జింతనొందుఁ గని నీ
- ↑ బగ లేక
- ↑ లెన్నియేనియుఁ జాలంగ నేర్తు రెట్టి, వానినైన లోఁతెంతురు
- ↑ కడఁకన్
- ↑ ము సర్వముతోడ
- ↑ సేసియుండ
- ↑ క. ఆయస్త్రమువలన ననే, కాయుతమస్తములు పుట్టి కాల్వఁగఁ దొఁడగన్
కాయజదహనుఁడు ప్రతిశర, మేయఁగ శాంతమునఁ బొందె నింద్రుని శరమున్. - ↑ బలుపగు శంకరుండు వడి బంధురలీల నమర్చె వారికిన్, వెలుఁగుచు, బావకాస్త్రమును
- ↑ ధిష్ణు
- ↑ వాఙ్మయు లగు
- ↑ పట్టుపడం
- ↑ సారెసాన
- ↑ నగ్నశరీరిణి
- ↑ అలాతచక్రం
- ↑ లరిగెడు
- ↑ పురుషోత్తముండవు భూనాథుఁడవు
- ↑ గేలి
- ↑ దివిజశేష్ఠు దివిజేంద్రు దివిజగణములన్
- ↑ 'వనుదేవసూనుఁడై' అని వెనుకటి ముద్రణము.
'వసుదేవుకున్' అని ప్రాచీనపాఠము. - ↑ ప్రణువునకును, నణువును మహత్వములకును నతిమహత్త, రాత్మ...
- ↑ సంప్రవీణత ప్రకటిం, చిన జనమేజయజనపతి, యనుపమ ......