హరివంశము/ఉత్తరభాగము - దశమాశ్వాసము
శ్రీరస్తు
హరివంశము
ఉత్తరభాగము - దశమాశ్వాసము
వేమక్ష్మానాథ మ
హావిభుతావశ్యబహునృపాశ్రయ సుకర
శ్రీవిశ్రాణనవైశ్రవ
ణావజ్ఞా చతురచతురుపాయవిధిజ్ఞా.1
వ. అక్కథకుండు శౌనకాదిమహామునులకుం జెప్పె నట్లు నారసింహావతారంబు
విస్తరించి వైశంపాయనుం డింక వామనప్రాదుర్భావం బెఱింగించెద నవ
హితుండ వై విను మని జనమేజయున కి ట్లనియె.2
క. జనవర బ్రహ్మకు మానస, తనయుఁ డగుమరీచిసుతుఁడు ధన్యతపోవ
ర్తననిధి కశ్యపుఁ డాతని, యనుఁగుసతులు గలరు దితియు నదితియు ననఁగన్.3
వ. దితికి హిరణ్యకశిపు హిరణ్యాక్షులు పుట్టి రదితికి ధాతయు నర్యముండును విధా
తయు మిత్రుండును వరుణుండును నంశుండును భగుండును నింద్రుండును
వివస్వతుండును బూషుండును బర్జన్యుండును ద్వష్టయు నను నాదిత్యులు పది
యిద్దఱు పుట్టిరి తదనంతరంబ హిరణ్యకశిపు పిమ్మట ప్రహ్లాదుండు రాజై దివిజుల
జయించునంతటి తేజంబు చాలకుండెఁ దత్తనూజుం డగువిరోచనుండు నట్టివాఁడ
యయ్యె వైరోచనుం డగుబలి తద్దయు బలిష్ఠుం డై.4
ఉ. దానము సత్యముం దపము ధర్మము నెందుఁ బొగడ్త కెక్క వి
జ్ఞానము శాస్త్రనిశ్చయవిశారదమై వెలయం గృపారతం
బైనమనంబుతో సరసిజాసనుఁ డాదిగఁ బెద్దలెల్ల నౌ
నౌనన నుల్లసిల్లె ననపాయసముజ్జ్వలనైజతేజుఁడై .5
తే. అతనిప్రపితామహుం డగునా హిరణ్య, కశిపునంతటివానిఁగాఁ గని దనుజులు
గడఁగి దైత్యేంద్రపదవికి నొడయుఁ జేయఁ, దలఁచి ప్రార్ధించి రెలమి నందఱును గూడి.6
వ. ప్రహ్లాదవిరోచనసమేతంబుగా సర్వప్రయత్నంబులం బొదలి.7
శా. గంగాసాగరసంగమాదివిలసత్కల్యాణతీర్థాంబువుల్
గాంగేయోజ్జ్వలకుంభసంభృతముగాఁ గావించి దివ్యౌషధీ
మాంగల్యాక్షతపుణ్యగంధతతితో మంత్రజ్ఞపూర్వంబుగాఁ
దుంగస్వర్ణమయాసనస్థు నభిషిక్తుం జేసి రవ్వీరునిన్.8
క. మీపెద్దతాతఁ బోలుము, దీపింపు ప్రతాపలక్ష్మి దితిజుల కెల్లన్
దేపవగు మనుచు దీవన, లేపార సురారు లాబలీంద్రున కొసఁగన్.9
వ. ఇ ట్లభిషేకించిన యనంతరంబ దొర లెల్లను దండప్రణామంబులు సేసి యంజలి
పుటఘటనంబులు శిరశ్శేఖరంబులం బెలయ నతని కి ట్లనిరి.10
మ. భవదీయప్రపితామహుండు మహితోద్భాసిప్రతాపాఢ్యుఁ డ
వ్యవసన్నోదయుఁ డాహిరణ్యకశిపుం డాత్మీయసత్త్వంబునన్
భువనాభోగము లన్నియుం దనవశంబుం జేసి వర్తిల్లఁగాఁ
బ్రవరశ్రీసుఖలీలలం గనుట సెప్పన్ వింటె వీరోత్తమా.11
ఆ. కపటనరమృగేంద్రకాయుచే నతనిఁ జం, పించి యేమి చెప్పఁ బెరిఁగి సురలు
శక్రునకుఁ దదీయసంపద యిచ్చి యే, లించి రీజగత్ప్రపంచ మెల్ల.12
ఉ. ఇంతయుఁ జూచియుం గడిమి కేమియుఁ గోల్పక లావుకల్మి దు
ర్దాంతుల మయ్యు నే మిటు నిరాశ్రయతాదశ బ్రుంగియుండి నీ
యంతటి రాజు నిప్పుడు ప్రియం బెసఁగం గని మిన్ను దాఁకి య
త్యంతపరాక్రమక్రియకు నఱ్ఱులు సాఁచెద ముబ్బుపెంపునన్.13
క. నీయాద్యుల యైశ్వర్యము, నీయదిగాఁ గ్రమ్మఱం గొనిన లెస్స మహో
పాయుఁడ వై మముఁ జేకొని, చేయుము బవరంబు లక్ష్మి చేరెడు నిన్నున్.14
క. బలవిక్రమములఁ గడుమి, క్కిలి తేఁకువ గలవు నీవు కినిసిన నెదురం
గలరె నిలింపులు వారల, కొలఁదు లెఱుఁగ వెట్లు సరకుగొనకుము బుద్ధిన్.15
వ. మా విన్నపం బనధరించి రాజధర్మం బవలంబింపు మనిన నయ్యసురల వచనంబులు
రుచియించిన విని వైరోచనుం డాక్షణంబ.16
క. గెలుతు నవశ్యము నమరులఁ, బొలివోనిపరాక్రమంబు భువనభయదమై
వెలయఁగ వెలుఁగుదు నని య, గ్గలిఁ బగఱమీఁద నడువఁ గౌతూహలియై. 17
వ. సర్వసేనాపతులును సర్వసైన్యసమేతంబుగా వెడల నాజ్ఞాపించి ప్రస్థానభేరి
చేయించిన.18
క. అరదంబులుఁ గుంజరములు, హరులుఁ బదాతులును బహుసహస్రము లోలిన్
దరతరమ దైత్యు లత్యు, ద్ధురశౌర్యులు వెలువడంగఁ దొడఁగిరి గడఁకన్.19
మ. హరితాశ్వంబులు వేయు పూనినమహార్హస్యందనం బెక్కి యా
హరిదశ్వుం బ్రహసించుచుం గరసహస్రాభీలతం జాపము
ద్గరఖడ్గాదివిచిత్రశస్త్రము లనేకంబు ల్లలిం దాల్చి ని
ర్భరబాణుం డగు బాణుఁ డొప్పె సమరప్రస్థానసంరంభియై.20
వ. ఇట్లు వెడలిన బలితనయు నిరుగెలంకుల ననేకరథసహస్రంబులు పరివేష్టింప నతని
కత్యంతాప్తు లైన సుబాహుండు మేఘనాదుండు గజముఖుండు వేగవంతుండు
గేతుమంతుండు నను నేవురు రథికులు రథంబు గదిసి కావలి యై కొలిచిరి
మఱియు.21
చ. ఎలుఁగులు వేయు పూనినసితేతరలోహరథంబుమీఁదఁ గ్రొ
న్నలుపగు మేను నీలమణినవ్యవిభూషలనొప్పురూపుగా
మలఁచినకొండభంగి నసమం బగు చీఁకటిప్రోవుకైవడిన్
బలుఁ డరిగెం గోరపటుబాణుఁడు తేరులు కోటి గొల్వఁగన్.22
పులోమహయగ్రీవప్రముఖదనుజముఖ్యులు యుద్ధంబునకు వెడలుట
చ. కినుకఁ బులోముఁ డుద్యదహికేతనుఁ డర్వదివేలు తేరు లు
బ్బున నడువం గదాకలితభూరిభుజుం డయి యుష్ట్రలక్షపూ
నినయరదంబుపైఁ దనదునిల్వు యుగక్షయహేతు కేతువో
యనఁ జనియెన్ సరత్నమకుటాంశులు ప్రజ్వలితాగ్నిచాడ్పుగన్.23
మ. సితవస్త్రాభరణప్రసూనముల లక్ష్మీమంతుఁడై శ్వేతప
ర్వతతుల్యుండు సితాశ్వలక్షయుతదివ్యస్యందనస్థుం డలం
కృతసప్తాశ్వసితాహికేతుఁడు హయగ్రీవుండు పేర్చెన్ ఘనా
వృతినిర్ముక్తశరచ్ఛశాంకుఁ డన విద్విష్టాంబుజశ్రేణికిన్.24
తే. స్ఫురితతాలధ్వజంబును హరిసహస్ర, రాజితము నైనమాణిక్యరథముమీఁద
నరిగెఁ బ్రహ్లాదుఁ డమరభయంకరు లగు, కింకరులు కోటిరథికు లశంకఁ గొలువ.25
మ. అలఘుస్వర్ణభుజంగకేతులసితం బై వేయునిన్నూఱు కి
ష్కులవిస్తారము నాల్గుగండ్లు నమరన్ శుంభన్మృగేంద్రాస్యవా
జులు వే పూనినమేటితేరిపయి నక్షోభ్యుం డనుహ్లాదుఁ డి
మ్ముల నేగెం దనుఁబోలు దైత్యులరథంబుల్ గోటి సుట్టుం జనన్.26
చ. కనకమృగేంద్రకేతు వెసఁగం దురగంబులు వేయి పూనఁగా
ననుపదురత్నదీప్తియుతమై నవసాంధ్యపయోధరద్యుతిన్
ఘనతరనేమిఘోష పటుగర్జఁ దనర్చురథంబుతో మయుం
డనిభృతమాయుఁ డొప్పె నుదయస్థదివాకరుఁ గ్రేణి సేయుచున్.27
శా. శార్దూలంబులు వేయి పూనురథరాజం బొప్పఁగాఁ గేతువుల్
శార్దూలాంకముగా ఖరాళికలితోద్యత్స్యందనుల్ దానవుల్
శార్దూలంబులువోలె నర్వది సహస్రంబుల్ దనుం గొల్వంగా
దోర్దర్పోజ్జ్వలమూర్తియై నముచిదైత్యుం డేఁగె నిశ్చింతతన్.28
ఉ. అంబరమధ్యవర్తి యగునంబుజబాంధవుఁబోలి క్రౌంచకా
యం బగు కేతువున్ హరిసహస్రము గల్గిన తే రెలర్పఁగా
శంబరుఁ డేఁగెఁ గోటిరథచారులు గొల్వఁగఁ బెంపుమీఱి ది
వ్యంబు పసిండినేవళము హస్తి కమర్చిన కక్ష్య గ్రాలఁగన్.29
చ. అతులమృగేంద్రకేతులలితాశ్వసహస్రసమేతకాంచనో
న్నతరథ మెక్కి భూరిపృతనాన్వితుఁడై చనియెం బ్రవీరస
మ్మతమహనీయబాహుఁ డసమానధనుర్ధనుఁ డంతకాలమా
రుతసఖతుల్యతీవ్రుఁడు విరోచనుఁ డిద్ధవిరోచనుం డనిన్.30
క. కాలాంగుం డగుజంభుఁడు, కాలుఁడపోలెం బ్రదీప్తకనకరథం బు
త్తాలం బై తాలధ్వజ, లీల నమర నడచె దురవలేపము మిగులన్.31
మ. అసిరోముండు రథాంగమాత్రనయనుం డాభీలనీలాంగుఁ డు
ర్వి సలింపంగఁ బదాతియై నడిచె నుర్వీధ్రప్రభూతాయుధుం
డసమానుల్ దనకు సమాను లగునుద్యచ్ఛైలశస్త్రుల్ పటు
ప్రసరోదగ్రులు దానవుల్ బహుసహస్రంబుల్ దనుం గొల్వఁగన్.32
మ. కపిలశ్మశ్రుఁడు నీలవర్ణుఁడు మహాకాయుండు వృత్రుండు ర
క్తపరివ్యాకులనేత్రుఁ డశ్వశతయుక్తస్యందనుండున్ మహా
విపులోదంచితదంతికేతనుఁడు నై వేవేలుదైత్యుల్ విచి
త్రపరిక్రాంతి భజింపఁగా నరిగె నుత్సాహంబునం బోరికిన్.33
వ. ఏకచక్రుం డను దైత్యుం డేకచక్రశోభితం బగు కరంబునం జక్రధరుతోడం
బురణించుచు ననేకభారనిర్మితం బై నవచక్రచతుష్టయంబు గలిగినకాల
చక్రంబు పగిది భయదం బైన చక్రద్వయంబునం బొలుచు రథం బుల్లసిల్లం
గాలాయససకలాయుధు లగు దైతేయులు కాలకాయులు నభశ్చరులు నై
నభోభ్రంబులభంగి నభంగురపక్షంబు లగు భూధరంబులకరణిఁ దన్ను ననువర్తింప
నాహవార్థి యై యరిగె వృత్రభ్రాత యగు వేగవంతుండు రక్తగర్దభయుక్తం
బగు రత్నమయరథంబున సంధ్యాగర్భగతుం డగు గభస్తిమంతుఁ గ్రేణి
సేయుచుఁ దాళప్రమాణం బగు కార్ముకంబు చేకొని గుణధ్వనిఁ గావించుచుం
దీవ్రనారాచనఖరంబులు దాల్చి శార్దూలంబు పోలిక నహితమృగయూధవిదళనా
పేక్ష దీపింపఁ జనియె మఱియును.34
మ. శతశీర్షుండు శతోదరుండు శతదంష్ట్రాఘోరవక్త్రుండు ప
ర్వతతుంగాంగ్రుఁడు చంద్రసూర్యరిపు డారాహుండు బాహూత్కరం
బతిరౌద్రంబుగ విశ్వకర్మకృతదీవ్యద్బర్హికేతూజ్జ్వలో
ద్యతయానంబున నేఁగె నార్చుచు ననేకానీకసంవీతుఁడై .35
సీ. వేదాదివిద్యల విశ్రుతుఁడై క్రతువులు వేయునుం జేసి జలజభవుని
చే వరంబులు గొని సిద్ధ్యష్టకంబును దనుఁ జెంద నెందుఁ గీర్తనలఁ బరఁగి
విలసితంబై మూఁడువేలునిన్నూఱుచేతులపఱ పైనయుజ్జ్వలరథంబు
నెక్కి హంసధ్వజం బెత్తి సితోష్ణీలీషగంధమాల్యాంబరకలన మెఱసి
తే. రజతశైలంబపోలె నాత్మజులు మనుమ, లాత్మసము లెందఱైన నెయ్యమునఁగొలువ
వెడలెఁ గశ్యపసుతుఁ డైనవిప్రచిత్తి, చిత్త ముత్సాహరసమునఁ జెన్ను మిగుల.36
తే. కేశి యేఁబదిరెండువేలాశుగతము, లగురథంబులతోడ నుష్ట్రాంక మైన
పడగ గలతేరిపైఁ బెద్దబారివిల్లు, చేత నొప్పగ నేగె నాజికి రయమున.37
క. వృషపర్వుండు గర్వంబున, వృషపూర్వకు లైనసకలవిద్విషులదెసన్
విష మొలుకుకినుక నరిగెను, వృషభధ్వజరథముమీఁద విషమాక్షుక్రియన్.38
వ. మఱియు సుపార్శ్వుండు నుల్కాంబకుండును కుంభాండుండు మొదలుగా
నసంఖ్యేయు లగుదైతేయు లప్రమేయసేనాసమేతంబుగా నాముక్తకవచులును
నాత్తకిరీటులు నాగృహీతవివిధాయుధులు నారూఢవిక్రమప్రయత్నులు నాబద్ధ
సమరపరికరులు నై వెడలునెడ బలీంద్రుండు చంద్రాంశుధవళదుకూలవాసస్సు
గంధికుసుమదామసురభిగంధబంధురాభరణంబుల నలంకృతుం డై వీర్యవంతంబు
లగుమంత్రంబుల నౌషధంబుల నుపబృంహితంబును బహువిజృంభణంబును
నగునైజతేజంబునం బొదలి బ్రాహ్మణోత్తములకు నుత్తమంబు లగువిత్తంబుల
రాసులు గోభూమీప్రముఖంబులుం బ్రియభక్తిపూర్వకంబుగాఁ బ్రతిపాదించి
తదాశీర్వాదసహస్రంబు నభివర్ధితుం డై రిపుపరాజయత్వరితం బగు మనంబు
తోడ ననల్పవిస్తీర్ణంబును సౌవర్ణవృకధ్వజవిరాజితంబును నగు విశ్వకర్మ
నిర్మితమాణిక్యస్యందనం బధిరోహించి రోహణాచలస్థితం లైన మహామేఘంబు
మహేంద్రచాపంబునం బొలుచు కరణి వివిధమణికిరణవ్యతికరస్ఫురితం బగు
శరాసనంబు ధరియించి నిఖిలదిగంతరవ్యాప్తం బగు తూర్యఘోషంబునం బెరసి
వందిమాగధ జయజయశబ్దంబులు బహువీరబిరుదాలాపంబులు నాటోపంబు
నుద్దీపితంబు సేయఁ గదలె హయశిరుండు నశ్వశిరుండు శతాక్షుండు జంభుండు
కుపథుండు శిఖిమతంగుండు కిరాతుండు దురాపుండు నికుంభుండు హరుండు
నను దానవులు పదుండ్రు తదీయరక్షకు లై కదిసి నడిచి రివ్విధంబున.39
క. బలిఁ బ్రభుఁగా మున్నిడుకొని, బలియురు బలుఁడాది యైనప్రత్యర్థు లనా
కులరభసంబునఁ దమపైఁ, జలమునఁ జనుదెంచువిధము శక్రుఁడు వినియెన్.40
తే. విని సమస్తదేవతల రావించి యంత, యును నెఱింగించి శత్రులయుద్యమమున
కుచితమైనట్టిప్రతికార మోపి చేయ, కునికి యైశ్వర్యకాంక్షికిఁ జనునె యెందు.41
వ. కావున నెదురు నడిచి పొడిచి గెలుతుము లెండు సన్నద్ధు లై రం డని పనిచి. 42
ఇంద్రుండు సకలదేవతలతోడ బలితోడి యుద్ధమునకు వెడలుట
శా. వీరోల్లాసము హాసవిభ్రమముగా వేగంబ కైసేసి యిం
పారన్ వేల్పులు వేల్పుభామలును రాగారూఢత న్మెచ్చఁగా
ధారారోచుల వహ్ను లొల్కెడుమహాదంభోళి చేఁ బూనీ దు
ర్వారోద్యద్గజరాజు నెక్కి వెడలెన్ వర్ధిష్ణుదోర్వీర్యుఁడై.43
వ. అతని యగ్రభాగంబున.44
చ. హయములు వేయి పూనినమహారథ మెక్కి మహేశమిత్రుఁ డ
క్షయనిధిగోప్త యక్షతభుజబలుఁ డర్థవిభుండు యక్షసం
చయసముపేతుఁడై నడిచెఁ జందదుదాత్తగదావివర్తన
ప్రయతనలీల చూపఱకు భ్రాంతవిలోకత నావహింపఁగాన్.45
ఉ. ఘోరశితప్రతాపశతఘోటకయుక్తరథంబు నెక్కి క్రో
ధారుణనేత్రరోచు లసితాంబుదతుల్యశరీరకాంతితోఁ
గ్రూరము లై తలిర్ప బహుకోట్యమితోద్ధత కింకరుల్ పరీ
వారము గాఁగ నేఁగె సమవర్తి సముద్యతదండపాణియై.46
మ. అమితాభీలభుజంగవాహ్యరథుఁడై యాదోగణం బిద్ధవి
క్రమతం దో నడువం బ్రదీప్తమణిరేఖాచిత్రభూషామనో
రమవేషంబున వార్ధిపుం డరిగెఁ గ్రూరద్వేషికంఠగ్రహో
ద్యమనిర్నాశము లైనపాశములు హస్తాలంకృతిం జేయఁగన్.47
వ. మఱియును వసురుద్రాదిత్యాశ్వివిశ్వసాధ్యులు లోనుగా నశేషగీర్వాణులును
సర్వగంధర్వసిద్ధవిద్యాధరగరుడోరగాధిపతులును సముద్రనగగ్రహనక్షత్రదేవత
లును దివంబున నున్న రాజర్షులును సకలభూతాంతరాత్మలు నలంకారంబు లుల్ల
సిల్ల నతిగంభీరంబు లైన యాకారంబుల విలసిల్లి యవికారంబు లైన వాహనం
బులు రంజిల్ల నాత్మీయపరివారంబులతో నాహవకౌతూహలంబు మనంబులఁ
బ్రజ్వరిల్ల నవూర్వగర్వంబు లుత్పాదింపఁ బెంపారి నిలింపపతిముందటం బిఱుంద
నుభయపార్శ్వంబుల నరిగిరి వసిష్ఠుండు జమదగ్ని వాచస్పతి నారదుండు పర్వ
తుండు నాదిగాఁ గల మహానుభావు లతనికి జయంబు గోరుచు నంబరమార్గంబునం
దోన చనిరి వనరుహాసనుండును సనత్కుమారాదిసిద్ధులు గదిసి కొలువ మూర్తి
మంతంబు లైన నిగమప్రముఖవిద్యాధర్మతపస్సత్యంబులు పరివేష్టింప నరనారా
యణసమేతుం డై సమరవ్యాపారం బనుసంధించు తలంపున నరుగుదెంచి యంత
రిక్షం బలంకరించె నమ్మహాసైన్యంబు కేతుపతాకాదివికాసంబుల గజాదిచతురంగ
విజృంభణంబులం దూర్యవిరావంబుల గాంభీర్యంబునం జారణసంకీర్తనతుములం
బున నధికదర్శనీయంబును నతిమాత్రభయదంబును నతిసముల్లసితంబును నత్యంత
మనోహరంబును నై నడచె నంత.48
క. కదియఁ జనుదెంచు దైత్యులు, త్రిదశులఁ గని సరకుగొనక తెంపుఁ గడిమియున్
మదమును నొండొంటిఁ గడచి, యొదవఁగఁ దలపడిరి సర్వయుక్తులు మెఱయన్.49
క. అమరాసురసైన్యద్వయ, సమవాయం బప్పు డధికచండం బయ్యెన్
సమసుప్తిసమయజృంభిత, సముద్రయుగసన్నిపాతసమత యెలర్పన్.50
వ. అట్టి సంకులంబున బాణాసుకుండు సావిత్రుని బలుండు ధ్రువుం డను వసువును
మయుండు విశ్వకర్మనుఁ బులోముండు సమీరుని నముచి వసువులలోన ధరుం
డనువానిని హయగ్రీవుండు పూషాదిత్యుని శంబరుండు భగుని శరభశలభులు
చంద్రసూర్యులను విరోచనుండు విష్వక్సేనుం డను సాధ్యుని జంభుం డంశుని
వృత్రుం డశ్వినులను ఏకచక్రుండు సాధ్యుం డను దేవతను వృత్రభ్రాత యగు
బలుండు మృగవ్యాధుం డను రుద్రుని రాహు వజైకపాదుని గేశి భీముం డను
రుద్రుని వృషపర్వుండు నిష్కంపుం డను దేవతను బ్రహ్లాదుండు దండధరుని
ననుహ్లాదుండు కుబేరుని విప్రచిత్తి వరుణు నెదిర్చిరి బలీంద్రుం డింద్రునిం దొడఁగి
పెనంగె మఱియు ననేకద్వంద్వయుద్ధంబులు ప్రవర్తిల్లె నిప్పుడు సెప్పిన
యిన్నియుం గ్రమంబున వివరించెద.51
దేవదానవులకు ద్వంద్వయుద్ధంబు సుప్రసిద్ధంబుగా జరుగుట
క. బాణుఁడు సావిత్రునివిలు, బాణహతిం ద్రుంచి యతనిబలసాగరమున్
బాణాంశులఁ గ్రోలి మహా, ప్రాణుండై తేజరిల్లె బ్రళయార్కుక్రియన్.52
తే. ఏచి సావిత్రుఁ డొకశక్తి వైచుటయును, దనుజుఁ డెడద్రుంచె నతఁడు రథంబు డిగ్లి
ఖడ్గహస్తుఁడై కవిసినఁ గాలుసేయు, నార్పరాకుండ నేసి యయ్యసియుఁ దునిమె.53
క. బెగడి నిజరథముమీఁదికి, మగుడి హరులఁ దోలుకొని సమస్తామరులున్
దిగు లొందఁ బఱచె నాతఁడు, దిగంతములు నద్రువ నార్చె దేవద్విషుఁడున్.54
క. బలుఁడు గదఁ బూఁచి ధ్రువునడు, తలవైచిన సొమ్మవోయి తత్క్షణమాత్రన్
దెలిసి యతఁ డతని వివిధో, జ్జ్వలశరముల నేసె సురలు సంస్తుతి సేయన్.55
వ. ధ్రువుని తోడంబుట్టువు లైన యాప్తుండును నలుండు ననువార లతనికిం దోడ్పడి
బలుని ననేకవిశిఖంబులం గప్పి రబ్బలియుండు బలిష్ఠం బగు కార్ముకంబు గైకొని
యుగ్రంపుటంపఱవఱుప నయ్యన్నయుం దమ్ములుం బోక పెనంగినం గనుంగొని.56
క. క్రమ్మఱ గద గొని కడుశీ, ఘ్రమ్మునఁ దనరథము డిగ్గి కడఁగి రథానీ
కమ్ములకుఁ గవిసి పలువుర, నమ్మహితాయుధముచేత నసువులఁ బాపెన్.57
తే. విడిచిపొడిచి వైవఁగఁ బెనుపిడుగువోలె, మ్రోయుచును వచ్చి గద శిరంబుల నడఁపఁగఁ
బడినదివిజకాయంబులఁ బ్రథనభూమి, మెదడుప్రోవులమయమయ్యె మిక్కుటముగ.58
మ. తమచుట్టుం బయలైననుం గడిమియున్ ధైర్యంబుఁ బాటించి సాం
ద్రముగా సాయకవర్షముం గురియుచున్ దైత్యు న్నిరోధించి వి
క్రమముం జూపె వసుత్రయంబు బలుఁ డాగర్వంబు సైరింప కు
ద్భ్రమితస్ఫారగదాప్రవర్తనము ఘోరంబై ప్రకాశిల్లఁగాన్.59
వ. ధ్రువవ్యతిరిక్తు లయిన యయ్యిద్దఱుమీఁదం బఱతెంచినం గని యడ్డంబు వచ్చి
ధ్రువుండు దానును గదాపాణి యై రథంబు డిగ్గి యసురం దలపడియె నమ్మహా
వీరద్వయంబు శుండాదండచండం బగువేదండయుగళంబు తెఱఁగునఁ బటు
సటాటోపదీపితం బగుమృగేంద్రయుగ్మంబు విధంబునం బెద్దయుం బ్రొద్దు గదలం
బోరాడి గద లొండొంటిం దాఁకి విఱిగినం గృహణఫలకపాణు లై యేటు
లాడి కృపాణఫలకంబులు నట్ల తుమురు లైన బాహుప్రహారంబులం గొంత
దడవు సురాసురయశస్కరు లై పెనంగి రంత.60
క. బలమఱి ధ్రువుఁ డహితునిదో, ర్బలవిభవము సైఁప లేక పరిభవదైన్యా
కలనమున కోర్చి శత్రులు, సెలఁగఁ దొలఁగఁబాఱె దేవసేనలు గలఁగన్.61
వ. తక్కినవారలు నతని పోయిన పోకలన పోయిరి ధరుం డను వసువుం దలపడిన
నముచి తొమ్మిదియలుగులు గుప్పించినం బరిగోలలపోట్లం గనలు కరిపతివిధంబునం
బేర్చి యతండు.62
క. వెలిమావుల నొప్పెడి తన, యలఘుస్యందనముతోడ నతిభీషణమై
యలరెడురిపురథమున క, గ్గలము సమీపముగఁ బఱపఁగాఁ బంచి వెసన్.63
శా. జ్యానిర్ఘోషముల న్నభం బెదురుమ్రోయం బక్షవాతోద్యమ
గ్లానిం బొంద దిగంతమేఘములు ప్రేంఖత్పుంఖరత్నప్రభల్
భానుద్యోతతిరస్క్రియానిపుణతం బర్వంగ సర్వంకషో
గ్రానేకాస్త్రపరంపర ల్వఱపె నత్యాశ్చర్యచాపంబునన్.64
క. ఏభంగి నేసె సురవరుఁ, డాభంగిన పేర్చి యేసె నసురవరుఁడు త
ద్వైభవ ముభయబలభయ, క్షోభావహ మగుచు నుండెఁ గ్రూరస్ఫూర్తిన్.65
క. మునులును సిద్ధులు నంబర, మున వారలపోరు సూచి మోదం బెసఁగన్
వినుతించిరి నారదముని, యనుపమనటనరసతన్మయత్వము నొందెన్.66
తే. ఒడుతుఁ బగవాని నే ననునుద్యమమున, దానవుండును గూల్తు శాత్రవుని నిపుడ
యనుచలంబున దివిజుఁడు నధికరోష, భరము సదృశంబుగా నొనర్చిరి రణంబు.67
వ. అంత.68
క. ధరుఁ డడ్డవాతియమ్మున, సరభసుఁ డై త్రుంచె నముచిచాపము నతఁ డు
ద్ధురుఁడై యుగాంతభాస్కర, పరిధి నెనయుచక్ర మొకటి పటువేగమునన్.69
వ. కరంబున నమర్చి ధరునిదిక్కు వైచిన నది పరిస్ఫురద్ధారాస్ఫులింగం బగుచు
గడంగి తదీయరథ్యశరీరంబు లన్నియు వ్రయ్యలు గావించి సూతు శిరోవిదళనం
బొనర్చె నయ్యంతరంబున యరదంబు డిగ్గ నుఱికి నిలువ నోర్వక యవ్వసువు
పలాయనంబు వాటించె నట్లు ప్రత్యర్థి బఱపి దనుజపుంగవుండు సెలంగి
యార్చి శంఖంబు పూరించి వైరినికరంబులఁ జీరికిం గొనక నిగుడి చాపహస్తుం
డై హస్తితురంగరథానీకంబులు పొడిసేసె విశ్వకర్మ తన్ను నెదిర్చిన మయుని
మీఁద ముప్పదమ్ము లేసిన నతండు.70
క. కొలఁది యిడరానిశరతతిఁ, బొలివోవక దేవశిల్పిఁ బొదివినఁ గ్రోధా
కలన న్మొగ మొప్పంగా, నలఘుశరాసనము విడిచి యాతఁడు పెలుచన్.71
తే. అసురకోటిప్రాణము లెల్ల నపహరింప, నిదియచాలుఁ బొమ్మనఁగ సద్విదితశక్తి
యైనశక్తి గైకొని వైచె నహితుదెసకు, నశని యద్రిపై విడుచుజంభారిపగిది.72
క. అంతంతన యాకైదువు, నింతంతలు తునియలై మహిం బడనేసెన్
సంతసముగ నసురులకు ని, తాంతభుజస్మయుఁడు మయుఁడు దారుణలీలన్.73
క. శక్తి యెడలుటయు నెంతయు, శక్తి యెడలి యున్నరిపునిఁ జటులధనుర్ని
రుక్తాస్త్రంబులచే ని, ర్ముక్తాహుతు లగ్గిబోలె నతని రుద్ధునిఁ జేసెన్.74
వ. త్వష్టయును విల్లు గైకొని యంపగముల సుఱక మయునిశరీరంబు సెక్కె నయ్యిరు
వురు శాతనఖచంచూపాతనంబులం బోరు మహాశ్యేనంబులపోలికం దడవుగా
నేట్లాడుచు నొండొరులం దెఱల్పం జాలక సదృశదశం దేజరిల్లి రది సహింపక
యసురశిల్పి యనల్పరోషంబున.75
ఉ. చేతిశరాసనం బురివి శీఘ్రమ సర్వవిపక్షజీవితా
ఘాతిని యైనయుగ్రగదఁ గైకొని వైచినఁ దన్నిపాతనన్
సూతతురంగకేతువులు చూర్ణములై యెడలెన్ రథంబు వే
భూతలగామియై నిలిచె బుద్ధి గలంగక విశ్వకర్మయున్.76
క. అప్పుడు గుణసంరావం, బొప్పఁగఁ జేయుచును బహువిధోగ్రశరములం
గప్పెను మయు నాతండును, నెప్పటి విలుగొని విరోధి నేసెఁ గడంకన్.77
క. మయునమ్ములు సురవర్ధకి, మెయి గాఁడి పసిండితగడు మెఱవఁగ నస్తా
శ్రయహీనరుచి యగుహరి, ద్ధయు మేనం బొలుచుదీప్తులట్టుల మెఱసెన్.78
వ. ఇట్లు పోరుచు విరథత్వంబుకతంబునం బ్రయత్నంబు లేవియు ఫలియింపమి నతండు
దొలంగి చనియె మయుండును బ్రతివీరుని భంగించి రంగత్తురంగం బగురథంబు
దోలి విరోధివాహినిం దఱిసి చిత్రక్రీడావిలోకనంబుల విలసిల్లె మఱియును.79
పులోముండు వాయుదేవునితో యుద్ధంబు సేయుట
మ. పవనుం దాఁకి పులోముఁ డుగ్రపటుచాపజ్యానినాదంబునం
దివియున్ దిక్కులు వ్రయ్యఁ జేయఁ బ్రతిహస్తిక్రోధగర్జారవ
శ్రవణం బాత్మ సహింప లేనిసమదస్తంబేరమంబో యనం
గవిసెన్ సాయకదానధార లురులంగా నాతఁ డాశత్రుపైన్.80
క. ఇరువురు నేయువెరవు ల, చ్చెరువుం జేయంగ నుభయసేనలవారున్
బొరిఁబోరిఁ బొగడఁ దదారవ, భరితం బయ్యెను దిగంతభాగం బెల్లన్.81
వ. అయ్యవసరంబునం బులోముండు మన్నించు దైత్యు లేడ్వు రతనికిం దలకడచి
వాయుదేవునిపై ననేకాస్త్రశస్త్రంబులు ప్రయోగించుచుఁ గదిసిన నమ్మహా
బలుండు నిజబలంబు ప్రబలవేగనిపాతంబున నుద్యోతింప నుఱికి.82
తే. ఎడమచేత వి ల్లుండంగ నితరబాహు, ముష్టి నమ్మహాదనుజులమూర్ధతలము
లేడు దాఁకింప నొక్కట యిల సలింపఁ, బడిరి నవరంధ్రముల నెత్తు రడరి మఱియు.83
వ. మహాబలుండు పూర్వభంగి నిలుకడన నిలిచి కార్ముకవిస్తారంబు ఘోరంబుగా
నేయం దొడంగినం గినిసి పులోముని యిరుగెలంకుల నున్న యసుర లనేకులు
రథగజాశ్వసంకులంబుగా నడరి యంబుదంబులు పర్వతంబుం బొదువు భంగిం
బవను నిరోధించి తదీయవిక్రమంబున నొక్కముహూర్తంబున సైన్యసమేతు లై
మ్రగ్గినం గరులు గూలినచోట్లు శుండాఖండదంతచ్ఛేదకుంభకర్పరంబులు బెర
సిన విస్ఫురితఘంటావిభిన్నకక్ష్యావికీర్ణతోమరాంకుశంబులును హయంబులు మడి
సినయెడలు నిర్ఫిన్నోదరనిర్దళితస్కంధనికృత్తచరణంబులతోడం గూడి పగిలిన
పల్యాణకృపాణపర్యసనంబులును రథంబులు సమసిన ఠావులు భగ్నాక్షశకలిత
రథాంగవిఘటితత్రివేణుకంబులు గలసి కనత్కేతుచ్ఛత్రకూబరధనుస్తూణీరశక
లంబులును దంతురంబు లయి నిపతితవసామాంసమస్తిష్కభారంబు లగురుధిర
పూరంబులు భీరుభయావహంబులు శూరప్రమోదసంపాదకంబులు నయ్యె నివ్వి
ధంబున నవ్వీరుం డెనమన్నూఱు దైత్యనాయకుల సమయించి జయంబుగొని
యొక్కదెస దెఱపి సేసి యాకసంబున నిజేచ్ఛం జనియె నతని పోయిన త్రోవ
వాయుపథంబన నెందును నేర్పడి సిద్ధసంచారయోగ్యం బై యుల్లసిల్లు.84
సీ. వినుము హయగ్రీవుఁ డనుపమశౌర్యుండు పూషు నత్యుద్భటరోషదృష్టిఁ
గనుఁగొని సంధానకర్షణభేదంబు నిశ్చయింపఁగ రానినిర్భరంపు
రయమునఁ గార్ముకభ్రమణంబు నెరయంగ నగ్నిమండలమున నమరుమంట
లివి యనఁ దగుతూపు లెన్నంగఁ బెక్కులు పరఁగించి పూషునిఁ బ్రక్షతాంగుఁ
తే. జేయ నాతఁడు ధైర్యంబు సిక్కఁబట్టి, తనదుపెంపును బేరును దలఁచి నిలిచి
యహితుఁ బ్రతిబాణముల నొంచునగ్గలికకు, నద్భుతము నొంది రుభయసైన్యములవారు.85
ఉ. ఒండొరు నేయుసాయకము లుక్కున నిద్దఱు ద్రుంపఁగా సము
చ్చండములై కరం బెసఁగుశబ్దములున్ వెసఁ దాఁకి క్రొమ్మొనల్
మండగ నుజ్జ్వలోల్కములమాడ్కిఁ దలిర్చు మహోగ్రకీలలు
న్నిండి వియద్దిగంతధరణీతలమధ్యము మ్రింగె సర్వమున్.86
క. కోపించి హయగ్రీవుఁడు, చాపముఁ గేతువును నఱకి సారథి హరులన్
వే పడనేసిన విరథుం, డై పఱచెం బూషుఁ డాసురావళి యార్వన్.87
వ. శంబరుండును ద్వాదశారత్నిదైర్ఘ్యప్రచండం బగుకోదండంబున నక్షదండప్రమా
ణంబు లగుబాణంబులు భగునిమీఁద నిగుడించె నతండును విశ్వకర్మనిర్మితం
బగు కార్ముకంబున నిరుక్తంబు లయిన రిపుసత్త్వాపహసాయకంబుల నయ్యసుర
వరుశరీరం బంతయుం గప్పె వారిరువురుఁ బరస్పరశరనికరవిదళితాంగు లై చైత్ర
సమయకుసుమితంబు లగుకింశుకంబులకుం బాటి యగుచు నెత్తుటం దోఁగి
మగంటిమి నొండొరులకు వట్రపడక పోరుచుండ నప్రమేయం బగుమాయ నెక్కు
డగుదైతేయుండు మాయ గావింపం దొడంగి.88
క. హరులఁ బరిమార్చి సారథిఁ, బొరిగొని కేతనము నఱకి భూరిశరంబుల్
వరపి పరిపంథి దేహం, బరవ్రేలెఁడు తెఱపి లేనియట్లుగఁ జేసెన్.89
వ. అనంతరంబ యదృశ్యుం డై యాకసంబున నార్చి క్రమ్మఱ దృశ్యమూర్తి యై
మహీతలంబున నిలిచి పెలుచం బగతుబాణంబుల చేత నచేతనుం డైన యట్ల
కొంతవడి యుండి యంతన తెలిసి యైరావణారూఢుం డైన దివిజపతి తెఱంగునం
దోఁచి యాలోనన పర్వతప్రమాణఘోరంబు లగుశరీరంబులు నూఱు దాల్చి
యెల్లదెసలు దానయై పొడసూపి యుడిగి ప్రాదేశమాత్రం బగుగాత్రంబున
నుజ్జ్వలుం డై యెగసి జలధరంబు చందంబున నుదారంబు లగునాకారంబు లనే
కంబులు గైకొని తిర్యగూర్ధ్వసంచారంబుల గర్జిల్లి విలయకాలంపువానపగిదిం
గురిసి యవ్విధంబు మాని సంవర్తవైశ్వానరు పడువున బెడిదంపుమంటలం బేర్చి
యేర్చి శతమస్తకుండును శతోదరుండును శతసహస్రబాహుండును నై పోరి
యెదిరి సేనలవలనం జనుదెంచు శస్త్రాస్త్రపరంపర లెల్లను మ్రింగుచుం దనకుం
దగినయట్టి మహారథం బెక్కి వివిధాయుధంబుల యుద్ధంబు గంధర్వనగరంబు
పగిది నక్కడన యంతర్ధానంబు నొంది యాత్మీయరూపంబున నెప్పటి యరదంబు
పయిం గానఁబడి విరోధి నతినిరోధి శరనికరంబులం బొదివిన.90
క. అతఁడు వెఱచఱచి లజ్జయు, ధృతియును బోవిడిచి పఱచి దేవేంద్రుని ను
న్నతశౌర్యుఁ జేరి యొదిఁగెను, దితిసుతసైన్యంబు లార్వ దెస లద్రువంగన్.91
శరభశలభు లను దైత్యులు సూర్యచంద్రులతో మహాయుద్ధంబు చేయుట
వ. శరభశలభు లను దైత్యు లత్యుగ్రసాయకంబుల సూర్యశశాంకుల శరీరంబులు
నించినం గోపించి యందుఁ జందురుండు.92
క. ఆయిరువురకాయంబులు, నాయతహిమరూపదారుణాస్త్రంబులపె
ల్లై యుడిగి పడఁగఁజేసి య, జేయుండై కవిసె దైత్యసేనలమీఁదన్.93
సీ. కవిసి నీహారంబుఁ గదియింప నొడళులు ముడిఁగియు డస్సియు మూర్ఛిలియును
హయవారణస్యందనావలిపై నుండలేక యారోహకు ల్పృథివిఁ గూల
నెక్కడెక్కడఁబోయె నక్కడె యెల్లను దావాగ్ని త్రొక్కినదావభూమి
క్రమమునఁ బొడివొడిగాఁ గాలమృత్యువుఁ జూచిన ట్లసురలు చూచి తలరఁ
తే. బ్రళయసమయంబునం దుగ్రభంగి జీవ, పశుగణంబుల సమయించు పశుపతియునుఁ
బోలె నాభీలదుస్సహలీల యెసఁగఁ, జల్లఁజంపయ్యెఁ జంద్రుఁడు శత్రుతతికి. 94
వ. అట్టియేడ రెండుసేనలయందును నుదటు గల సోటరు లామనికాలంబు మేపు
క్రొవ్వున మందలయందఁ గడంగి నలిరేఁగి తొడంగు వృషభంబులుం బోలె దర్పించి
తలపడిన నధికసంకులం బయ్యె నందుఁ బలువురమీఁద నొక్కరుండును నొక్కని
మీఁదం బలువురును బలువురు పలువురమీఁదనుం గవిసి పోట్లాడ నన్యోన్య
శస్త్రపాతంబులవలన నంగకంకటంబులు చినింగియు శిరస్త్రాణంబు లెడలియుఁ బరిక్ష
తాంగులగువారును రథ్యంబులు మడిసియు సారథులు వడియును విరథులై వెడంగు
పడువారును విండ్లు విఱిగియు ఖడ్గాదిసాధనంబులు సమసియుఁ జేయునది లేక
చేడ్వడు వారునుఁ గాలుసేయుఁ దునిసియు నవయవంబులు వ్రస్సియుఁ ద్యక్తజీవితు
లగువారును నానాభూషణస్థానంబులం బ్రదీప్తబాణంబులు గాఁడి చందనోత్క్షిత
వక్షంబులు మేదోమాంసవసావిసరంబుల బ్రుంగి హసితోల్లసితవదనంబుల బహుళ
రుధిరంబులు గ్రక్కి కూలియు లీలావికాసంబున భాసిల్లువారు నగుచు నార్పులుఁ
బెడబొబ్బలుం దూర్యరవంబులుఁ దర్జనంబులుఁ బొగడ్తలు నెసంగఁ గోలా
హలమయంబు లగు చోట్లును దూళిబ్రుంగి మడంగి మ్రగ్గి మడిసి యులివు
లడఁగి పాడువాఱు ప్రదేశంబులును గరినరతురగకళేబరంబులుఁ గరాళంబు లయి
కీలాలంబులు కాలువ లై మాంసకర్దమంబుల దుర్గమంబు లై దుర్దర్శనంబు లగు
నెడలు నై మహారణంబు ప్రవర్తిల్లుచుండ.95
క. ఉరవడి విష్వక్సేనుని, యురస్థలమునందుఁ జొనిపె నొకశరము రిపూ
త్కరతిమిరవిరోచనుఁ డగు, విరోచనుఁడు దానఁ గనలి విబుధోత్తముఁడున్.96
తే. నవశరంబుల నొంచె దానవుని దేహ, మాతఁ డాజ్యాహుతులఁ బేర్చునధ్వరాగ్ని
పగిది నుద్దీప్తుఁడయి యేడుబాణముల వి, రోధిపర్వమర్మంబులు గ్రుచ్చుటయును.97
క. సాధ్యుఁడు మూర్ఛమునింగి రథ, మధ్యంబున వ్రాలి వేగమ ప్రబుద్ధుండై
యధ్యారూఢసముద్యమ, సిధ్యద్బలుఁ డగుచు నేసె శీతవిశిఖంబుల్.98
ఉ. ఆతనిచెయ్ది గైకొనక యయ్యసురేంద్రుఁడు తద్బలంబుపై
నాతతకార్ముకధ్వనిత మష్టదిగంతవిభేదిగా శర
వ్రాతము నించుచుం గడఁగి వారణఘోటరథస్థమస్తముల్
భూతల మంతయుం దఱచుప్రోవులు చేసే భయంకరోద్ధతిన్.99
తే. దొరలు గడిమి విష్వక్సేనుతోడఁగూడి, భీతకోటి నాశ్వాసించి పేర్చి సర్వ
సైన్యములఁ బురికొల్పి యాశత్రుమీఁదఁ, దెచ్చి క్రమ్మఱఁ దల పెట్టి రచ్చెరువుగ.100
వ. అమ్మహాయుద్ధంబున నసాధ్య యగు సాధ్యధ్వజిని నుద్ధతద్విరదబృంహితంబులు
బహుళహయహేషితంబులుం బ్రథితరథనేమినినదంబులు బ్రకటభటసింహనా
దంబులు నుద్దండకోదండవిస్ఫారంబులు విశంకటశంఖధ్వానంబులు నుదారభేరీ
నిస్సాణరావంబులు నొక్కటి యై బ్రహ్మాండకర్పరదళనదర్పంబునఁ జెలంగె శరం
బులుఁ దోమరంబులు శక్తులు గదలును గరవాలంబులు భిండివాలంబులుఁ బరి
ఘంబులఁ బరశువులు మఱియును బహువిధంబు లగు నాయుధంబులు శూరనికర
కరోచ్చలితంబు లయి సముచ్చండరోచులం జండకరసహస్రవిస్రంసనం బొనర్చె
నాభీలం బగు ధూళిజాలంబు సకలమాలిన్యకారి యై యంధకారంబు ననుకరించె
నట్లు దారుణం బగు వైరుల యాక్రమణంబు సైరింపక విరోచనుండు.101
విరోచనుండు విష్వక్సేనప్రముఖదేవతలతో మార్కొని ఘోరయుద్ధంబు చేయుట
క. అసితఫణిభీషణం బగు, నసి చేకొని యాయతమగు నంసమున నమ
ర్చి సముద్ధతి నరదము డిగి, మసరుకవిసి కదిసె మారి మసఁగినభంగిన్.102
వ. ఇవ్విధంబునం గడంగి.103
సీ. ధనువులు దెగవ్రేసి తనువులు దెగవ్రేసి శిరములు దెగవ్రేసి కరములోలిఁ
దెగవ్రేసి పడగలు దెగవ్రేసి గొడుగులు దెగవ్రేసి రథములు ద్రెవ్వవేసి
కరులఁ ద్రెవ్వఁగవ్రేసి హరులఁ ద్రెవ్వఁగవ్రేసి రధికుల వ్రేసి సారథుల వ్రేసి
యాశ్వికతతి వ్రేసి హాస్తికావలి వ్రేసి భటసమూహము వ్రేసి బల మెలర్ప
తే. నెచటికేనియు నురికి యెందేనిఁ జొచ్చి, యెట్టివానిని మిగిలి యె ట్లేనిఁ జేసి
వేయు దెఱఁగులఁ జిత్రంపువిన్ననువులఁ, జంపె నొప్పించెఁ బఱపె నిర్జరబలముల.104
వ. ఇబ్బంగి నపహతసేనుం డై విష్వక్సేనుండు పలాయనంబ పరాయణంబుగాఁ
బాటించెఁ దత్సహాయులు నతనిజాడన యరిగిరి కుజంభుం డంశునిం బెక్కుబాణం
బులఁ బరిక్షీణప్రాణునిం జేసిన నయ్యాదిత్యుండు తన చుట్లం బన్నిన నగంబులుం
బోని నాగంబులం బదివే లతనిపైఁ బురికొల్పిన నవి ప్రళయకాలకాళికా
కఠోరంబు లై ఘోరగర్జాతర్జనంబుతోడ నడరిన నాహిరణ్యకశిపునందనుండు
గదాహస్తుం డై రథంబు డిగ్గి.105
క. శతమన్యుఁడు శతకోటి, క్షతపక్షతులుగ నమర్చి శైలముల మహీ
పతితములు చేయుపగిదిని, మతంగజప్రసతి నెల్ల మడియించె వెసన్.106
తే. అంశునరదంబు దెసకునై యాది గొనిన, నతఁడు నిలువంగ వెఱచి సురాధినాథు
దెసకు సురిఁగె రయంబునఁ దేరు డిగ్గి, యసుర పొరివుచ్చెఁ దరవారి నహితబలము.107
క. అశ్వినులమీఁద వృత్రుఁడు, విశ్వభయదభంగిఁ దీవ్ర విశిఖంబులు ప
త్రశ్వసనచలిత ఘనచయ, శశ్వత్ప్రసరముగఁ బఱపె సమదస్ఫూర్తిన్.108
వ. తదీయసహాయు లై తాఁకిన యక్షరాక్షసవరులం దునిమి తూఁటాడిన నెవ్వరు
నతనిఁ దేఱిచూడను లేరైరి నాసత్యు లిద్దఱలోన నొక్కరుండు శూలంబున
వైచె నన్యుండు శరంబులు మూఁట నతని పార్శ్వంబును భేదించె నట్ల ప్రతిభట
ప్రహారంబున నొక్కింత స్రుక్కి యారక్కసుండు గదాదండంబు గైకొని
యాయితంబుగాఁ బట్టి బెట్టు వైచిన,.109
తే. కాలదండంబుక్రియ వచ్చుగదకుఁ దలఁకి, కైదువులు వైచి రథము లొక్కటఁ దొలంగి
వేల్పువెజ్జులు తమ[1]వేగవిద్యలెల్ల, మెఱసి పఱచిరి శత్రుసమీపమునకు.110
క. భీముఁ డనుపేరి రుద్రుని, భీమపరాక్రముఁడు కేళి పృథుబాణస్రో
తోమగ్నుఁజేయ నాతం, డామెయి సరకుగొన కడరి యద్భుతలీలన్ ,.111
వ. శక్తిగదాపట్టిసత్రిశూలంబుల నోలిన నొప్పించెఁ దదీయానుచరు లగుపారిషదుల
సంఖ్యు లడరి దైతేయులం బొదివిరి వారిప్రాపున నమరు లనేకులు గడంగిరి
దివిజోత్సాహంబు సైరింపక కేశికిం దోడ్పడి దానవానీకంబులు గ్రందం దఱిమి
రట్టియెడఁ బెంధూళి యెగసిన నెదిరి వారు దమవారిని నెఱుంగరాక కొండొక
సేపు రెండుదెఱంగులవారు తార కయ్యంబు సేయనొయ్యనం గ్రమంబునం
దొరుఁగు నెత్తురులు ధరణీతలంబు సంసిక్తంబుఁ గావింప సువ్యక్తదర్శను లయి
పేర్చి విచ్చలవిడిం బెనంగి రందు.112
క. రుద్రానుచరులు తద్దయు, రౌద్రు లయి విరోధితతులు త్రవ్వఁగ సమరం
బుద్రిక్త మయ్యె నసురలు, విద్రుతు లయి రెల్లదెసల విహ్వలభంగిన్.113
వ. అట్టి నిజసైన్యంబు దైన్యంబు సూచి కేశి యక్లేశంబున నిలిచి వజ్రాస్త్రం బేసిన.114
క. పారిషదులకు నసురలకు, సైరింపఁగ రానికడిఁదిసమరం బయ్యెం
బోర నొకటికిని నేరక, యూరక భీముండు చూచుచుండె వికలుఁ డై.115
వ. వృషపర్వుఁడు తనబలంబుల నెల్లను విశ్వగణముఖ్యుం డగు నిష్కంపుండు
భంగించుచుండ నంతంతం గని సారథి నద్దెసం దేరు పఱపం బనిచి బెట్టు దాఁకిన
నతనితోడన దైత్యసైన్యంబులు గదలి ప్రత్యర్థిం జుట్టుముట్టిన సమ్మర్దంబునందు.116
క. నిష్కంపహృదయుఁడై వెస, నిష్కంపుఁడు ప్రౌఢచాపనిర్ముక్తశరా
విష్కారంబులు గగనప, రిష్కారంబులుగ రౌద్ రేఖ వహించెన్.117
క. ఆతనిప్రాపున దివిజ, వ్రాతము లభిముఖము లగుచు వచ్చి కడిమిమై
దైతేయులతో సంగ్రా, ఘాతం బొనరించె హేతికల్పన లమరన్.118
క. శైలనిభుని నిష్కంపునిఁ, గాలాభ్రస్ఫురితమూర్తి గలవృషపర్వుం
డాలంబున సాయకధా, రాళం బగువృష్టి నిర్భరంబుగ ముంచెన్.119
మ. తనసైన్యంబులఁ గాచుచు రథగతుల్ ధాత్రీసముత్కంపముం
బొనరింపంగ సమిధ్ధహవ్యవహుఁడుం బోలెం బ్రదీప్తాకృతిన్
దనుజశ్రేష్ఠుఁడు ప్రత్యనీకముల నుద్దామాస్త్రదాహంబునన్
జనితోద్దాహత నొందఁ జేసెఁ ద్రిగజత్సంక్షోభసంపాదియై.120
ఉ. దేవతలున్ రథాశ్వగజతీవ్రచమూనివహంబుతోఁ గడున్
లావునఁ బూని దానవకులప్రభుపైణ బటు హేతిదీధితి
వ్యావృతదిగ్విభాగముగ వారక క్రమ్మిన నాతఁ డుద్భట
భ్రూవికృతాస్యుఁడై యరదమున్ వెస డిగ్గి భుజాబలోద్ధతిన్.121
వ. ఉదగ్రశాఖం బగు శాఖి యొక్కటి వెఱికి యుఱికి నుఱుపం దొడంగినం దలరి
దివిజులు దలలు వీడం దొడవు లూడ వలువలు సడల నొడళ్లు వడంక మగుడి
మగుడి చూచుచుం గనుకని పఱచిరి నిష్కంపుండును జేయునది లేక చూచు
చుండె వృషపర్వుండు మగుడి రథం బెక్కి.122
క. జ్యారనములు రోదోంతర, పూరణ మొనరింపఁ దీవ్రభూరిశరౌఘం
బారిపుపై నడరించె మ, హారోషత నతఁడు వేటులాడుచు నుండెన్.123
ప్రహ్లాదుండు సకలసైన్యసమేతుం డై యమునితో మహాయుద్ధంబు చేయుట
వ. ప్రహ్లాదుండు దండధరు నెదుర్చువాఁ డై భార్గవు రావించి విజయావహం బగు
క్రియానివహం బభ్యర్థించిన నతండు నియతుం డై యభిమతహుతంబుల హుతా
శను నర్పితుం జేసి యధర్వంబు లగుజప్యంబులు జపియించె నతని శిష్యులు పది
వేవురు గురుశాసనంబున నఖిలజై త్రమంత్రంబుల నాదితిజపతితేజంబునకు నుత్తేజం
బొనర్చిరి. తదభిమంత్రితమాల్యభూషణాదుల నలంకృతుం డై విజయాశీ
ర్వాదంబులు గైకొని యాహిరణ్యకశిపు తనయుండు హిరణ్యప్రముఖప్రభూత
దానంబుల ధాత్రీదివిజులం బ్రీతులం జేసి రథం బెక్కి తదీయబాంధవులు
దత్సమాను లనేకు లవ్విధంబునన యనుష్ఠితకల్యాణు లై వచ్చి యమ్మహారథుం
బరివేష్టించిరి డెబ్బదివేల రథంబులు నన్నియ యేనుంగులు లక్షలకొలందులు
ఘోటకంబులు నపరిమితపదాతులుం గల బలంబులు మోహరించి యంతటికిం
గాలనేమి నగ్రణిఁ గావించిన నవ్వీరుండు భేరీసహస్రంబుల శంఖపణవకాహళశత
సహస్రంబుల నమరు చండస్వనంబుల నజాండంబు పరియ లై పడు ననుభీతి భూతం
బుల చేతోగతుల నుత్పాదింప నుత్పాతపవనప్రేరణదుర్నివారం బగువారిధి
యుంబోలె నడచి యిరుగెలంకుల యోధులం గనుంగొని యి ట్లనియె.124
క. కడుఁ బెద్దగాలమున కి, ప్పుడు గలిగెను సురలతోడిపోరు కడు వెసన్
బొడిచెద నొడిచెద నహితుల, నుడుగక నాచేయి చూచుచుండుఁడు మీరల్.
తే. తొంటిరణములఁ జచ్చి పుత్రులు గలిగియు, లేనివారయి యున్నట్టి దానవులకు
నేఁడు మార్తుర నెత్తురునీటఁ బలల, పిండములు గల్గుఁగాత సంప్రీతవిధులు.126
మ. బలపాదక్షతి మిఱ్ఱుఁ బల్లము సమభావంబునం బొంది ని
ర్గళదస్రోదకసేకముం బడసి మాంగల్యస్థితిం బొల్చు భూ
స్థలిపై నేఁడు శయించుఁగాత బలవత్కాకోలకల్పానలో
జ్జ్వలమత్సాయకసర్పదష్టదివిషత్సంభూతతుంగాంగముల్.127
ఉ. తప్పులు వెట్టివెట్టి వివిధం బగుప్రాణిగణంబు నొక్కమై
ముప్పిరిగొన్న దర్పబలమోహము లెందునుఁ బట్ట లేక వే
యొప్పములం బొరిం బఱుచు నుధ్ధతుఁ బ్రేతపతిన్ వధించి నేఁ
డొప్పుగ విశ్వముం బ్రియరసోత్కటలీలఁ దలిర్పఁ జేసెదన్.128
ఉ. అక్షయబాణతూణములు నగ్రిమకార్ముకముం దపంబునన్
లక్షణయుక్తితోఁ బడసినాఁడ బలీంద్రుని ప్రీతిచేఁతకై
శిక్షితవిద్య యంతయు బ్రసిద్ధిగఁ జూపెద నేఁడు నేను దు
ష్ప్రేక్షుఁడ నయ్యెదన్ సురల నెవ్వరు శక్తులు న న్నెదుర్పఁగన్.129
ఉ. మీరును నేవిచారములు మిన్నక సేయక తెంపు మీఱ నా
చేరువ రండు గెల్చుటకు శ్రీయును గీర్తియు ముక్తియున్ దుదిం
జేరు రణప్రయత్నవిధి నెన్నటిఁబోవునె యజ్ఞదానసం
భారఫలంబులున్ సదృశభంగులె వీరులు పొందు పేర్మికిన్.130
తే. అనిన నందఱుఁ దగుభంగి నతఁడు మెచ్చ, విక్రమోక్తులు బహుభంగి విస్తరించి
రమ్మహాసేన యొప్పె మేఘాభిగమవి, వర్ధితామరతటినీప్రవాహలీల.131
సీ. ప్రహ్లాదతనయులు బహువిధాయుధకళాకుశలులు నిగమాదివిశదవిద్య
లన్నిటఁ బారగు లధ్వంశతయాజు లంచితసత్యశౌచాభిరతులు
బ్రాహ్మణప్రియులు సత్పాత్రమహాదాను లహితనిర్మథనకర్మైకధుర్యు
లెందఱేఁ గలరు వా రెల్ల నప్పుడు సితగంధమాల్యాంబరకనకరత్న
తే. భూషితాంగులై కైదువుల్ పొలుపుమిగులఁ, గరిహయస్యందనోదీర్ణగతు లెసంగ
వచ్చి తండ్రికిఁ బొడసూపి యచ్చెరువగు, తెగువ వాలిరి మూఁక లుత్సేక మొంద.132
వ. ఇట్లు చుట్టి బెట్టిదంపుటురవడిం బేర్చు కార్చిచ్చుకరణి నడరి దనుజబలంబు వైవ
స్వతసైన్యంబు తొడరి తలపడియె ప్రహ్లాదుడు సేనలకుం దలకడచి యెక్క
డెక్కడ యని యక్కమలమిత్రపుత్రునిం దాఁకి యుక్కునం బెక్కమ్ములం
బొదివె జముని పరివారం బగు వివిధవ్యాధిసముదయంబు సాకారం బై కింకర
నికరంబు మున్నుగాఁ బగతురం దొడరి పెనంగం దొడంగె నప్పుడు.133
మ. యమసైన్యంబులచేత దానవులు దైత్యానీకదర్పంబునన్
శమనాగ్రేసరులున్ విభగ్నవిహతస్రస్తావధూతక్షత
భ్రమితక్షోభితమూర్ఛితావదళితప్రాయాంగులై యాహవ
క్షమ నెల్లన్ బహురక్తమాంసకలితంగాఁ జేసి రస్త్రావళిన్.134
క. కాలుఁడు దైతేయుండును, గాలాంబుదయుగముభంగిఁ గాంచనమణిచి
త్రాలగ్నచాపు లయి శర, జాలసలిలవృష్టి గురిసి సలిపిరి రణమున్. 135
మ. శరము ల్తూణముఖంబునం దిగుచుట ల్సంధించుటల్ కర్షణం
బరుదారంగ నొనర్చుట ల్విడుచుట ల్సాటోపవేగంబులం
బరికింపంగ వశంబుగాక పరిధీభావంబునం జాపముల్
పరపం జొచ్చిరి వార లిద్దఱు సమప్రక్రాంతబాహూద్ధతిన్.136
క. పిడుగులగతి నొండొరుపైఁ, బడుబాణంబులయసహ్యపాతంబుల క
య్యొడళుల యోర్చెంగా కె, క్కడఁ గలుగుం దత్సమానకాఠిన్యంబుల్.137
క. ఎడసొచ్చి యుభయబలములఁ, బొడివొడి సేయుచు దిగంతములు మూఢముగా
నడరుచు మెఱుఁ గెక్కినరుచు, లడకుచుఁ గఱుకెక్కె వారియస్త్రోద్గమముల్.138
క. లే దేన్నగ మును నేఁడును, లే దిటమీఁదటను లేదు లే దని పోల్పం
గా దీనికి నెన యని ప్రహ్లాదయములపోరు మెచ్చి రంబరచారుల్.139
వ. అంత నంతకంతకు నంతకుండు పరిశ్రాంతసత్త్వుం డగుచు వచ్చె సత్త్వాధికుం
డగుట నసురోత్తము మానసశారీరవృత్తంబులు భేదాయత్తంబులు గాకుండె
నయ్యంతరం బెఱింగి కృతాంతసారథి రథం బపక్రాంతంబు సేసెఁ బ్రహ్లాదుం
డాత్మగతంబున.140
క. తనువుగలయాత్మ లెల్లన్, దనవశమునఁ దనరుదండధరుఁ డిట్లు విచే
తనుఁ డయ్యె మద్భుజాఘా, తన కింతియచాలు మేటితన మని యెలమిన్. 141
క. ఆతని వెనుకొన నొల్లక, యాతత మగురథము దేవతానీకముపై
సూతునిఁ బఱపగఁ బనిచి సు, శాతశరవ్రాతపాతచలితము చేసెన్.142
అనుహ్లాదుండు కుబేరుం దలపడి సంగ్రామంబు భీమంబుగాఁ జేయుట
వ. తదీయానుజుం డగు ననుహ్లాదుండు కుబేరుం దొడరి పోరునెడం బెక్కండ్రు
యోధవీరులు రథతురంగమాతంగబహుళపతాకినీసమేతంబుగాఁ బతికిం బాసట
యైన నతం డందఱం దునుమాడి సమరధరణీరుధిరధారావర్షంబున నభిషేకించిన.143
క. కినిసి ధననాథుఁ డాతని, ననవరతశరౌఘమగ్నుఁ డగునట్లుగఁ దా
నొనరింపగ నరదము డిగి, దనుజుం డొకతరువు వెఱికి దర్పస్ఫూర్తిన్.144
క. పౌలస్త్యురథాశ్వంబులఁ, గూలఁగ వ్రేయుటయు నట్టిఘోరక్రియకుం
జాలఁగ మెచ్చుచు నుతివా, చాలం బై యార్చె దైత్యసైన్యం బెల్లన్.145
వ. వేఱొక్కరథం బెక్కి ముక్కంటినెచ్చెలి చిచ్చఱపిడుగులకు సంగడంబగు కడింది
యమ్ముల నమ్మహాసత్త్వు నేయుటయు నతండు పర్వతప్రమాణం బగుపాషాణం
బొక్క టెత్తి యహితుపై వైచిన.146
మ. గద సేతం గొని శీఘ్రలంఘనకళాకల్పజ్ఞుడై పాసె న
ర్థదుఁ డాఱాయి హయధ్వజప్రతతితోఁ దత్స్యందనం బంతయుం
జదియం దీవ్రరయంబునం బడియె యక్షశ్రేష్ఠుఁ డొండొక్కచోఁ
బదిలంబారఁగ నిల్చి పిల్చె ననికిం బ్రత్యర్థి [2]నన్వర్థియై.147
క. దితిసుతుఁడును వేఱొకప, ర్వతశిఖరము బెఱికికొని జవంబున నలకా
పతిపైఁ బఱతెంచిన గద, నతఁ డతనియురంబు వైచె నతిరౌద్రముగన్.148
క. [3]వ్రేటును సరకుగొనక గిరి, కూటంబునఁ బ్రహతుఁ జేసె గుహ్యకవిభు న
మ్మేటిమగఁ డతఁడు మూర్ఛా, [4]స్ఫోటితచైతన్యుఁడై వసుంధరఁ బడియెన్.149
వ. ఆలోన నతిరయంబునం దదాప్తు లగు యత రాక్షసవీరు లందఱుం బఱతెంచి పరి
వేష్టించి యతని సహితుని కగపడకుండం బరిరక్షణం బొనర్చి రాక్షణంబున నేకపింగ
ళుండు జడను దొఱుంగి లేచి నిలిచి నింగియు దెసలు నద్రువ నార్చె నిట్లు మహా
చలశృంగతాడితాంగుం డయ్యును భగ్నంబు నొందని యతని నవధ్యుంగా
నెఱింగి దైత్యు లెవ్వరుం గోల్తలసేయక తొలంగినం గని పురికొల్పికొని కాల
నేమి సునేమి మహానేమినామంబులం గల యనుచరులతోడం గూడ ననుహ్లా
దుండు దలపడినం గుబేరుని సైనికుల మార్కొని రయ్యిరువాఁగునకు శక్తిగదా
ముసలప్రాసపరిఘపరశ్వథాదుల గిరిశిఖరశిలావృక్షకాష్ఠంబుల బాహుముష్టినఖ
దంతంబుల నతిఘోరంబు లగు సంప్రహారంబులు ప్రవర్తిల్లె నప్పుడు.150
చ. గదగొని రాజరా జడరెఁ గ్రమ్మఱ శాత్రవుమీఁద నాతఁడున్
గదగొని తీవ్రుఁడై యెదురుగా నడతెంచె నతండు వ్రేసె నా
గద నది నుగ్గుగా నడచె గ్రక్కున నాత్మగదాహతిం బలం
బొదవఁగ దానవేంద్రుఁడు సురోత్కర మొక్కట పిచ్చలింపఁగాన్.151
వ. కిన్నరేశ్వరుం డొక్కగదఁ గొని నిలిచిన ననుహ్లాదుండు చేతిగద యురివి కొండ
చఱి వ్రయ్యవాపి పుచ్చుకొని దీనం బగతుం బొరివుత్తు ననుచుం బ్రళయపర్వ
తాపహారి యగుమహాసమీరుండపోలె దారుణరయంబునం బఱతేరం
గనుంగొని.152
క. దనుజులకు మేలుచేయును, ననిమిషులకుఁ గీడుపాటు నగుచుండుట నె
మ్మనమున నూహించి తలఁకి, ధనదుండు దొలంగె నాప్తతతియుం దానున్. 153
సీ. జితకాశి యగు విప్రచిత్తి పశ్చిమదిశానాథునిఁ దీవ్రబాణములఁ బొదివి
ప్రళయకాలమునాఁటి భానుదీప్తులుఁబోలె [5]సర్వసత్వాళి శోషణముఁ జేయ
నతనియస్త్రముల విహ్వలుఁడై జలేశుండు కర్తవ్య మేమియుఁ గానఁ డయ్యె
నగ్నిమండలచండమై మండు దైత్యునాననమును దేఱి చూడను వశంబు
ఆ. గాకయుండె నట్లు కడు నుగ్రుఁడై యసు, రోత్తముండు వరుణు నుసుఱుగొందు
నింకఁ దడవు సేయ నేటికి నని యొక్క, పరిఘ మెత్తుకొనియె బలము మెఱయ.154
వ. అమ్మహాపరిఘంబు కేలం గొని త్రిప్పునప్పుడు సప్తపవనస్కంధసప్తమునిసప్తాశ్వ
సుధాకరగ్రహనక్షత్రదివ్యవిమానమేఘచయమండితం బగు గగనమండలం
బంతయు నదభ్రభ్రమితం బైనయ ట్లుండె నట్టి యాయుధంబు వూఁచి యతండు
వరుణుముందటి సైన్యంబులం బొడిసేసి యతనిని వ్రేసినఁ దదీయగాత్రస్పర్శనం
బున నది తుత్తుము రయ్యెం దచ్ఛకలంబులు ఖద్యోతంబులపోలిక నెల్లదెసలం
జెదరె నట్టివేటున నిశ్చలుం డైయున్న ప్రాచేతసుచేతనాస్థైర్యశరీరశక్తివిభవం
బులు సకలభూతంబులుం బ్రశంసించె నంత.155
తే. సప్తపాతాళపతు లగుసర్పపతుల, నెల్లఁ గనుఁగొని యాదోగణేశ్వరుండు
పనిచె బ్రత్యర్థి దలపడి ప్రకటసత్త్వ, మంతయును జూపు డని పేర్మి యతిశయిల్ల.156
క. ఏలిక పనుచుటయు విష, జ్వాలోత్కటదంష్ట్ర లతులశస్త్రంబులుగా
గాలాగ్నిచ్ఛటలకరణి, వాలి కడగె నురగతతు లవష్టంభమునన్.157
వ. విప్రచిత్తి యవ్విధంబునకు నల్ల నగుచు గారుడం బగునస్త్రంబు ప్రయోగించిన
ననేకంబు లగు గరుడాకారసాయకంబు లడరి ఘోరవిదారణం బొనర్చి సంగ
రోర్వి దర్వీకరశరీరశకలంబులం గప్పెఁ దదనంతరంబ.158
మ. తనకుం జేయగఁ గల్గుభృత్యు లరిదోర్దర్పంబుచే మ్రగ్గఁగాఁ
గని చిత్తంబున స్రుక్కియుం గడఁక డక్కంజాల కబ్ధిప్రభుం
డనిరోధోద్ధతబాణవేగమున దైత్యాధీశ్వరున్ ముంచె నా
తని నాతండును నొంచెఁ జాపధరుఁడై తత్తుల్యబాణావలిన్.159
క. వరుణుండు విప్రచిత్తియు, దుర మొనరింపంగ నొక్కతూకున శౌర్యం
బరుదై చెల్లఁగ దైత్యుండు, పరిభవముగఁ దలఁచె నట్టిభావము తనకున్.160
వ. అట్టి మత్సరంబునం దోడ్తోన వర్ధిల్లు నుద్ధతిం బ్రదీప్తమానప్రాణుం డగుపూర్వ
గీర్వాణు గర్వంబుచేత నెత్తువడి వడిచెడి వరుణుం డపసరణంబ శరణంబుగా శత
మఖుం డున్న దిక్కునకు నరిగె నతనితోడన సైన్యంబులుం జనియె నివ్విధంబున.161
క. వసురుద్రాదిత్యాదులు, ప్రసభంబున రిఫుల చేతఁ బరిభవభూరి
వ్యసనము నొందుటఁ గనుఁగొని, యసహాయుం డగ్నిదేవుఁ డతిరోషమునన్. 162
వ. ఆత్మగతంబున.163
తే. అమరులకు నేన దిక్కు హవ్యములు మోచీ, పెట్టి పోషింతు నిటు కీడు పుట్టినప్పు
డగునె యొప్పరికింప నామగఁటిమియును, వేఁడిమియుఁ జూపి పరిమార్తు విమతతతుల.164
అగ్నిదేవుండు సంరంభవిజృంభితుం డై దైత్యసైన్యంబులనెల్ల దైన్యంబు నొందించుట
వ. అని తలంచి లోహితవాహనంబును వాయుచక్రంబును ధూమధ్వజంబును నర్చి
ర్మయంబును నగురథం బెక్కి రక్తవర్ణంబును బిశంగకేశశ్మశ్రుతనూరుహంబును
నగు దేహంబు దనరారం దైజసంబు లగు నాయుధంబులు ధరియించి నిజోత్సా
హంబునకు నమర్త్యులు సంతసిల్ల మునులు ప్రస్తుతింప నడరి దైత్యసైన్యంబుఁ
జొచ్చి యొక్కొక్క మొత్తంబున వేలు పదివేలు లక్ష యను సంఖ్యలం గల దాన
వులఁ బ్రేల్పం దొడంగెఁ దదీయసఖుం డగుజగత్ప్రాణుండు ప్రతిభటప్రాణహారి
యగురభసంబునఁ జెలికానికడిమికిం దోడ్పడియె సంత నెల్లదెసల నాభీలంబు
లగుకీలంబులు రథంబులం చక్రకూబరకేతనయుగత్రివేణుకంబుల
నుద్ధూతధూమంబు లై యెసంగి యస్త్రధనుఃకవచంబులు సమరి ఖడ్గక్షురికాదు లతి
దాహభంగురంబులుగా నొనర్చి కరులం బొదివి కర్ణరంధ్రంబులు సొచ్చి కర
వివరంబులు దూఱి దంతంబులు గమల్చి కక్ష్యాకుథప్రముఖంబులు సుఱసుఱ
పుచ్చి తురగంబులం దగిలి మోరలు నఱికి బంధురస్కంధకేసరపుచ్ఛరోమవల్ల
రుల బెరసి వీఁపు లెరియించి మహాశరీరు లగువీరుల నరికట్టి మకుటకేశవస్త్ర
మాల్యంబులు పొడవడంచి చర్మమాంసాస్థిమేదోవసామజ్జ లొక్కటిగాఁ గలంచి
సమరభూమి యంతయు సంతప్తమేదోమజ్జాప్రవాహబహుళంబుఁ గావించె
నివ్విధంబునం గల్పాంతకల్పం బగు మహాదహనవిహారంబునకు సమస్తభూతం
బులు భీతిభ్రాంతంబు లయ్యె దనుజులు తల్లడిల్లి పెల్లెసఁగు నార్తస్వనంబులతోడ
మయశంబరుల మఱుంగు సొచ్చి రది యంతయుం గనుంగొని.165
క. పర్జన్యవరుణమాయా, సర్జన మొనరించి వారు సమధికయత్నం
బూర్జితముగ నయ్యనలుని, భర్జనశక్తి యడఁగించి పరఁగిరి కడిమిన్.166
తే. అసురవర్యులమాయల నగ్నిదేవు, కడఁక పొనుపడఁ దొడఁగుట గని రయమున
దేవమంత్రి యేతెంచి యాదేవపూజ్యు, నలఘుఫణితుల నిట్లని తలఁచెఁ బ్రీతి.167
సీ. కనకంబు నీరేత మనిలుఁడు నీయాత్మ యేడుజిహ్వలతోడ నెందు నొప్పు
దీవు జలంబుల నీవు పుట్టించితి సలిలంబు గ్రిందు పార్శ్వములు మీదు
నై సర్వతోగాము లగుముఖంబుల పేర్మిఁ బరఁగుదు భూతసంభవకరుఁడవు
భూతధారకుఁడవు భూతసంహర్తవు యజ్ఞంబు నీవ హవ్యంబు నీవ
తే. హవ్యవాహుండవును నీవ హవ్యభుజుఁడ, వీవ నీ విత్తు లక్ష్మియు నిద్ధజయము
నాశ్రితులకు నీయాశ్రితు లఖిలసురులు, జాతవేద వేదములు నీసంస్తవములు.168
క. అసురులదెస నీతేజము, ప్రసారితము జేసి మగుడఁబడు టొప్పునె యిం
కసమానశౌర్య క్రమ్మఱ, మసఁగుము రక్షింపు మమరమండలిఁ గరుణన్.169
చ. అనిన సురేజ్యువాక్యరస మాజ్యహుతంబుగఁ బేర్చి క్రమఱం
గనలి కృశానుఁ డుద్ధతశిఖాతతి నెప్పటియట్ల దైత్యవా
హినులపయిం బ్రకానుగతి నేపెసలారె వినష్టమాయు లై
దనుజులు వీఁగి రెంతయు ముదంబునఁ బొంగిరి దేవపుంగవుల్.170
వ. అప్పుడు ప్రహ్లాదుండు బలీంద్రుపాలికిం జని సబహుమానంబుగా నతని కి ట్లనియె.171
సీ. నీతపం బెద మెచ్చి నిఖిలలోకేశ్వరుం డెంతయుఁ గరుణ నీ కిచ్చె వరము
లింద్రత్వ మగ్నిత్వ మిందుత్వ మర్కత్వ మర్కతనూజత్వ మబ్ధిపత్వ
మర్ధేశ్వరత్వ మి ట్లమరినప్రభుతలు నణిమాదిసిద్ధులు నాహవమున
నపరాజితత్వంబు నమృతత్వమును మహాయోగీశ్వరత్వంబు నుదితయశము
తే. లైనయవియెల్లఁ గలుగ దైత్యాపజయముఁ, జూచుచుండంగఁ దగునె దదాహవమున
నమరపతి నోర్చి తద్రాజ్య మపహరించి, సత్యముగఁ జేయు మజువాణి సత్యధుర్య.172
చ. అని తెలుపంగ నాత్మ మహిమాతిశయం బఖిలంబు తెల్లగాఁ
గని దనుజేంద్రుఁ డాజిజయకౌతుక మాకృతి కెల్ల భూషయై
పెను పొనరింప నప్టు గిరిభేదిరథంబునకై రథంబు చ
య్యన నడవంగ సూతుఁ బ్రియమారఁగఁ బంచె నుదగ్రదర్పుఁడై .173
క. ఆతనియుద్యోగము గని, దైతేయబలంబు మగుడఁ దద్దయుఁ గడఁకల్
చేతోగతు లొందఁగ నభి, యాతిహననకాంక్షఁ గూడె నాటోపమునన్.174
ఇంద్రబలీంద్రులకు ద్వంద్వయుద్ధంబు సుప్రసిద్ధంబుగా జరుగుట
వ. ఇట్లు సైన్యసమేతుం డై నడచు బలీంద్రునకుఁ బ్రశస్తమృగపక్షికులంబు లను
కూలగమనవిచేష్టితరుతంబుల నభిమతంబు సిద్ధించుట దెలిపె నాంగికంబు లగు
మంగళసూచకంబు లెన్ని యన్నియుం గలిగే వివిధసత్కారసంతర్పితు లగుధరణీ
సురులు వీర్యవంతంబు లగుమంత్రంబులు జపియించుచు జయం బాశాసించి
రతండు సర్వదిశల దరికొని ప్రబ్బుహుతాశనువిజృంభణం బంతంతం జూచి
యెంతయుఁ గలంగినను మహత్త్వంబున సదోద్రిక్తంబులు నుద్యుక్తంబులు నగు
నసురవర్గంబు లనర్గళభంగిం దొడరి యనిమిషులం దాఁకె నప్పుడు.175
మ. తన బాణావళి సర్వదిక్కుల సముద్యద్రశ్మిజాలంబుల
ట్లనుబద్ధోద్ధతిఁ బర్వఁగాఁ బ్రళయకాలార్కుండపోలెన్ రయం
బున నేతెంచుబలీంద్రుఁ జూచి భయసమ్మూఢాత్ములై కన్కనిం
జని రొక్కండను నిల్వలేక దివిజుల్ శక్రాంతకక్షోణికిన్.176
వ. చని యతనితో నీవు సర్వామరస్వామిని ధాతవు విధాతవు నై భూతంబుల
రక్షించుపనికిఁ బూని యున్నాఁడవు మూఁడు జగంబుల నీకు సమానుం డగుమాన
ధనుండు లేఁడు సైన్యంబులు గలంగి పాఱెడు దొరలయందు నిపాతితద్విరదుం
డును నిహతహయుండును నిర్మధితరథుండును నికృత్తాయుధుండునుం గానివానిం
బొడగాన మేము నీమఱువు సొచ్చితిమి సముత్సాహంబున కిది సమయంబు కడిమి
వాటింపుము కడంగుము.177
క. శూరుఁ డగువాఁడు బాహా, ధౌరేయత నాత్మసంశ్రితప్రతతిఁ గడుం
బోరామిఁ గావకుండినఁ, బేరు గలఁడె డక్కునయ్య ప్రియజయలక్ష్ముల్.178
సీ. అనుటయు నట్లకా కని సహస్రాక్షుండు హయసహస్రోపేత మైనరథము
మాతలిసారథ్యమహిమాభినీతమై తనరారురత్నకేతనము వెలుఁగ
దివ్యకిరీటదీధితులతోఁ గర్ణికాంగదహారకుండలకంకణాంగు
ళియకద్యుతులు దలిర్ప సంధ్యాతపం బఖిలదిఙ్ముఖముల నావహింప
తే. సన్నిహితవజ్రుఁడును హస్తసంగృహీత, కార్ముకుండు నక్షయతూణకల్పనుండు
నగుచుఁ జరణకీర్తన లతిశయిల్ల, నేచి దైత్యనాయకునకు నెదురు నడచె.179
క. బలియును హరిఁ గన్నంతన, బలవన్నారాచపటలపరిపిహితదిశా
వలయుఁ డగుచుఁ దోతేరఁగఁ గలహం బిరువురకు నయ్యెఁ గడుఁ జోద్యముగాన్.180
క. ఆతెఱఁగుకయ్యములు ము, న్నేతఱిఁ జూచియును వినియు నెఱుఁగ రతివచ
శ్చేతోవిషయము దత్సమ, ఘాతము త్రైలోక్యభీతికంపన మెందున్.181
తే. చేరి ప్రహ్లాదముఖులు ప్రసిద్ధబుద్ధి, ధుర్యు లగ్గింప బలి బాహుదోహలంబు
సిద్ధమునికోటి గొనియాడ జిష్ణుబలము, వర్ధనము నొందెఁ దమలోన వట్రపడక.182
మ. బలిబాణావలి నింద్రుఁ డింద్రువిలసద్బాణాళిఁ దోడ్తోన యా
బలి ద్రెవ్వన్ పడి నేయనేయఁ దునుకల్ బ్రద్యోతమానాకృతిన్
శలభశ్రేణులుఁ బోలె మూసె దెస లుత్సాహంబునం బొందె న
గ్గలికల్ మీఱినతూపు లొండొరులఁ జిక్కం దాఁకె మర్మస్థలుల్.183
క. నెఱఁకులు దాఁకినయమ్ములఁ, జొఱఁజొఱ నెత్తురులు వడియ శోభిల్లిరి వా
రెఱసంజు మీఁదఁ బర్వఁగ, గుఱియై యొప్పారు క్రొత్తకుధరములక్రియన్.184
క. ప్రకృతిశరంబుల నిరువురు, నొకవడిఁ బోరాడి యుడిగి యుద్ధతదివ్యా
స్త్రకళాగర్వము లప్పుడు, ప్రకటించిరి రౌద్రచిత్రభంగులు వెలయన్.185
తే. తనకుఁ గలలావు లన్నియుఁ దరతరంబ, యహితుదెసఁ జేసి చూపి యనంతరంబ
హరిహయుండు ప్రయోగింతు నని తలంచె, నఖిలశైలపక్షాఘాతి యైనహేతి.186
వ. ఇవ్విధంబున నుత్సహించి ప్రయత్నపూర్వకంబుగా నమ్మహాయుధంబు కరంబున
నమర్చునంతలోన నంతరిక్షంబున నశరీరవాణి యతని కి ట్లని వినిపించె.187
సీ. ఓ దేవవల్లభ యీదైత్యనాథుండు వారిజోద్భవదత్తవరుఁడు గాన
నీకు నజేయుండు నీకకా దమరులలోన నెవ్వానికి నైన గెలువ
నలవిగా దీతని నధికధార్మికుఁ డట్లుగావున మానుము కడఁక యిప్పు
డితనికి నపజయహేతువై యుద్యుక్తుఁ డయ్యెడు నింకఁ గాలాంతరమున
తే. బ్రహ్మ సర్వస్వభూతుండు భవ్యధర్మ, మూలకందంబు దేవతామూర్ధరత్న
మాదిమధ్యాంతనిర్ముక్తుఁ డాదిదేవుఁ డచ్యుతుఁడు విశ్వమయుఁడు నారాయణుండు.188
క. అతఁ డెఱుఁగు భవత్పాలన, గతు లెల్లను మీరు రిత్త కాఱియఁబడ క
య్యతిశయకరుణానిధి మీ, మతిలో శరణంబు నొంది మనుఁ డతిభక్తిన్.189
వ. అనిన విని దంభోళి వైవం బూనిన కేలు సడలించి వషణ్ణుం డై దివిషత్ప్రభుండు
దొరలం జూచి గణదేవతల నెల్లం గ్రమ్మఱుం డని పలికి రథంబు మరల్చి యోటమి
కోర్చి తిరిగె నసురలు సింహనాదంబులు మున్నుగా విచిత్రవాదిత్రధ్వానంబు
లెసంగ నానందంబున బలిం బ్రస్తుతించి రివ్విధంబున విజయభాసితుం డై.190
క. స్వారాజ్యపదము గైకొని, వైరోచనుఁ డత్యుదగ్రవైభవమునఁ బెం
పారి జగత్త్రయనుతబల, పారీణత నొంది ధర్మపరుఁడై యొప్పెన్.191
తే. తాత ప్రహ్లాదుఁ డాదిమనీతిపథము, తెలిసి నడపంగ మయశంబరులు ప్రధాను
లై సురలకార్యములు ప్రతిహతముగా నొనర్ప నాతనికలిమ యున్నతివహించె.192
క. ఎవ్వడు దుశ్చరితుఁడు లేఁ, డెవ్వఁడు దుర్గతుఁడు లేడు హీనాత్ముఁడు లే
డెవ్వఁడు బలిరాజ్యంబున, నెవ్వలనఁ గృతార్థమతుల యిలఁ గలమనుజుల్.193
క. వర్ణాశ్రమధర్మంబులు, పూర్ణంబుగ నడపుచుం బ్రభూతజనపదో
దీర్ణసమృద్ధుల నెంతయు, వర్ణన గని రతనియాజ్ఞవలన నరేంద్రుల్.194
తే. యాగరతులును నిర్మలయోగపరులు, వీతవిఘ్నత నాత్మీయవిధులు నడువఁ
ద్రిదివమోక్షసాధనయత్నదీప్తు లైరి, తగ బలీంద్రు నిరక్షణోద్యమముపేర్మి. 195
వ. ఇట్లు చతుష్పాదం బై ధర్మంబు సరియింప నకుంఠితకల్యాణగౌరవుం డై తేజరిల్లు
వైరోచనుపాలికిం, బద్మహస్త యై చనుదెంచి పద్మవాసిని యగుపరదేవత ప్రసాద
సౌముఖ్యం బమర ని ట్లనియె.196
మ. తగవున్ ధర్మముఁ దప్పకుండ భుజసత్త్వప్రౌఢి ప్రఖ్యాతిగాఁ
బగవారిన్ బవరంబులో నొడిచి సుపన్నుండ వై పేర్చి యీ
జగము ల్మూఁటిని నీవు గైకొనుటకు సంతుష్టయై వచ్చితి
న్నిగమైకస్తుత నేను లక్ష్మి ననఘా నీపాల దీపించెదన్.197
క. ఘనుఁ డగుహిరణ్యకశిపుని, యనుపమసంతతికి నిట్టియైశ్వర్యంబుల్
దనరుట యరుదే నీవా, తనిఁ గడచితి గాదె బాహుదర్పనిరూఢిన్.198
వ. అని యద్దేవి తదీయగేహంబున వసియించె నబ్భంగిన యేతెంచి [6]హ్రీయును
ధీయును విద్యయు దయయును ధృతియు శ్రుతియుఁ బ్రీతియు వినీతియుఁ
బుష్టియుఁ దుష్టియు దాంతియు శాంతియు ననుపేళ్ళంగల దేవత లతనియంద నెల
కొనిరి గరుడగంధర్వాప్సరోగణంబులు గీతనృత్యకళావిన్యాసంబులం దదుపాసనం
బొనర్చె మఱియుం బరమేష్ఠి పురందరుల నెవ్వరెవ్వరు గొలుతురు వార
లెల్లను దైత్యపతి భజియింపం దొడంగి రంత.199
ఇంద్రుండు స్వారాజ్యహీనుం డై యదితికడకుం జని నిజపరాజయం బెఱింగించుట
సీ. త్రిదశేంద్రుఁ డాత్మీయపదపరిభ్రష్టుఁడై యదితిఁ గానఁగఁ బోయి యాహవమున
బలి మేలుచే యైనభంగియు వజ్రంబు గైకొన్న తన్ను నాకాశవాణి
వల దన్న తెఱఁగును వరుసతోఁ జెప్పిన నద్దేవి యట్లైన ననఘ మనము
మీతండ్రి నుద్యదమేయతపోదీప్తు నడిగి యప్పుణ్యాత్మునాజ్ఞ నడుత
తే. మని యతండును దానును నఖిలసురలుఁ, గూడిచని సురాసురజనకునిఁ గృపార్ద్రుఁ
గశ్యపబ్రహ్మఁ గని కార్యగతి సకలము, నాదినుండియు నెఱిఁగించి రవ్విభునకు.200
క. విని యాతఁడు వీరలఁ దో, డ్కొని యప్పుడ యరిగె విశ్వగురుఁ డగుచతురా
ననుపాలి కప్పు డందఱు, వినయంబునఁ బ్రణతిపూర్వవిహితాంజలు లై.201
వ. బహువిధస్తోత్రంబు లొనర్చినఁ గశ్యపసమేతం బట్లు సనుదెంచిన సురలం జూచి
సురజ్యేష్ఠుండు కరుణావికాసవిలసితుం డై.202
క. మీరాక కే నెఱుంగుదుఁ, గారణము బలీంద్రు, గెలువఁగా నోపుట య
న్నారాయణునకుఁ దక్కఁగ, నేరికిఁ జేకుఱదు నిక్క మిది యెబ్భంగిన్.203
క. బలి నొకనిఁ జెప్పనేటికి, బలవంతులఁ జంప నోర్వఁ బాల్పడినాఁ డా
జలరుహనాభుఁడు లోకం, బుల నతనికి నెదురఁజాలు పురుషులు గలరే.204
వ. అమ్మహాయోగీశ్వరుండు నిజయోగాంశంబున నియ్యదితియందుఁ గశ్యపునకుఁ
బుత్రుం డై జనియించి దివిజకార్యంబు నిర్వహింపఁగలవాఁ డట్టి యవతారంబున
కద్దేవుఁ బ్రార్థింపవలయు నతండు దన్నుం దాన కనియె నేనిం గాని యెవ్వ
రికిం గనుట దుర్లభంబు తపశ్శీలురకుం గాన నగుం గావున దుర్గాంబుధియుత్తరం
బున నమృతం బనుపేరి పరమస్థానంబు గల దది యతని విహారభూమి యచ్చటికిం
జని తదీయప్రసాదంబున లబ్ధమనోరథుల రయి రం డనిన నట్ల కాక యని యద్దే
వుని వీడ్కొని.205
ఉ, వార లుదఙ్ముఖప్రవణవర్తనులై బహుశైలసింధుకాం
తారమహిస్థలుల్ గడచి తత్పరతం జని సర్వజంతుసం
చారవిహీనమై రవినిశాకరదీప్తులు లేక చీఎకటుల్
పేరిన యొక్కచోటు గని పెద్దయు విస్మయ మంది యందరున్.206
వ. అవులఁ గడచిపోవం దమకు శక్యంబు గాకున్న నంతటన యుండి.207
క. వేయేఁడుల వ్రతమునకై , ధీయోగము సిద్ధి నొంద దీక్షించి మనః
కాయవచోనియమము నిర, పాయంబుగఁ దొడఁగి రురుతపస్సాధనకున్.208
తే. అందుఁ గశ్యపసంయమి యంగనయును, దాను బ్రహ్మచర్యవ్రతధారణమున
నిలిచి వీరాసనస్థుఁడై జలధిశయను, జలజనయనుఁ జేతోంబుజస్థాయిఁ జేసి.209
క. మును మునిముఖ్యులు భక్తిం, గొనియాడఁగ నిఖిలనిగమగోప్యం బై యొ
ప్పినవాఙ్మయమున ని ట్లని వినుతించె ననంతమహిము విశ్వాత్ము హరిన్.210
చూర్ణిక. జయ జయ జగదుద్భవ స్థితిసంహార హేతుగుణ [7]నిర్ధరణ వ్యవహితానేక
మూర్తి విలసన! సనకాదియోగీంద్రహృదయ సరోరుహ[8]సౌరభ్య సంవి
ధానావేశ వంశవర్ధన వదనవినిస్సృతానంతవాఙ్మయ ప్రవాహ పవిత్రీ
శృతాఖిలలోక! లోకాయతికాది దుస్తర్క తిమిరాంధదురధిగమదివ్యాను
భావ! భావనాపరాయణ [9]ప్రణయవారణ ప్రవణ కరుణాపరిణామవత్క
టాక్ష నిరీక్షణ! క్షణదాచరాపసర్పణ సగర్వ దుర్వార సంచరణ చటుల
చక్ర[10]ధర దండహస్త కమల! కమలభవోత్పత్తి నిమిత్త నిర్నిమీలననాభి
శతపత్ర! పత్రరథేశ్వర పత్ర పతాకభావసేవాద్వైతవిద్యాసిద్ధ్యత్
ప్రసాదసౌముఖ్య! ముఖ్యమునినికర నిరంతరోద్గీతనామసహస్ర! సహ
స్రాంశు పరిభావప్రభావవిభవ! భవరుజాబైషజ్యచరణ సరోరుహసమ్య
క్సమారాధన! ధనపతి నిధి నివహశత కామధేనువ్రజ కల్పతరుగహన[11]లక్ష్మ
సదృక్ష! క్షణమాత్ర మూర్తి సంస్మరణ సుకృత! కృతప్రముఖ యుగ
చతుష్టయ ప్రతిష్టాపిత సర్వధర్మప్రతిష్టాపన వ్యవసాయసంప్రవృత్త వివిధ
విచిత్రావతార! తారకానాథ నలినీనర్మసఖ స్వరూపనయన యుగళాలోక
శ్రమిత కాల చక్ర[12]బాల! బాలభాను సమీన నాభి కౌస్తుభ గభస్తి
ప్రసర సాంధ్య ఘనాయితదోరంతర తమాలకానన! కాననాట శ్లోకిత
శ్లాఘ్య యశో మౌక్తికావతంసిత శ్రుతి సీమంతభాగ! భాగధేయ పరం
పరా భోగ భక్తి విభ్రమ ! భ్రమ దమిత సంసృతి ప్రపంచ పరిణత యంత్ర
స్వతంత్ర సూత్రధార! [13]ధారణక్రమాభ్యాస ప్రాప్య పరమస్థాన!
[14]స్థానాభిమానియవిధృత విశ్వ వ్యాపకా నేకరూప! రూపగుణకర్మ వ్యతి
రిక్త ముక్త శుద్ధ బుద్ధావతారతాభాస! భాసమాన మధ్యమ మార్గ
మసృణమౌని మనోమార్గ! మార్గణ భుజంగ పీతాసురాసు పవమాన!
మాననీయ మహిమానంద నంద దిందిరా సుందరీ హృషీక ! హృషీకేశ!
కేశవ! నమస్తే నమస్తే నమస్తే నమః.211
శ్లో. నమః కైవల్యకల్యాణకల్యానందవిధాయినే
నారాయణాయ మహతాం వరదాయ వరీయసే.212
క. అని వినుతించినఁ గశ్యప, మునిదెసఁ బ్రీతుఁ డయి విశ్వమూర్తి ముకుందుం
డనుపమధీరధ్వని ని, ట్లనియె నభోవీథి నిలిచి యంతర్హితుఁడై.213
నారాయణుఁ డదితిగర్భంబున వామనుం డయి జనియించెడు కథ
చ. అమలచరిత్ర నీవు నియతాత్ముఁడ వైనతెఱంగు నీయను
త్తమ మగువాక్ప్రపంచమును దైవతవర్గము భక్తితోడ సం
యమమతి నున్నచందము మదాత్మకుఁ బ్రీతి యొనర్చె వేఁడు మి
ష్ట మయినయర్థ మవ్విధము సర్వజగత్ప్రియ మెవ్విధంబునన్.214
వ. అనినం గశ్యపమునీంద్రుండు దేవా దేవర మావలనం బ్రసన్నుండ వైతేని
నింద్రానుజుండ వై సకలబృందారకబృందంబులకు నానందప్రదం బగు నవతా
రంబు నంగీకరింపవే యనియె నదితియుం బ్రాంజలి యై పరమేశ్వరాదేశంబున
నాకాశంబుఁ జూచి నమస్కరించి.215
క. నాకపతికిఁ బెంపొదవఁగ, నాకంపితులై సురారు లడఁగఁగఁ గృపతో
నాకడుపు చల్లనయ్యెడు, నాకారముతో జనింపవయ్య ముకుందా.216
చ. అనునెడ దేవతావరులు నంబరలంబివిలోచనాంశులై
మనములు భక్తిపూరపరిమగ్నములై యలరంగ దేవ నీ
వనుజత నొంది దేవవిభునయ్యయు నేలికయున్ గురుండు వే
ల్పును శరణంబునై భయవిలోప మొనర్చి యనుగ్రహింపవే.217
క. నీ వదితిసుతుఁడ వగుటయు, దేవత లందఱును దేవదేవ ధ్రువముగా
దేవాహ్వయంబు దాల్తురు, నీవాత్సల్యంబు గోర్కి నెఱయఁగఁ బడదే.218
వ. అని యివ్విధంబున నందఱు నభ్యర్థించిన నేకవాక్యనిరూపితం బగు మతంబు
మనంబున నవధరించి మధుమథనుండు మధురస్వరంబున వారి కి ట్లనియె.219
క. భరితతపస్కులు గశ్యప, వరమునియును నదితియును ధ్రువంబుగ నే ని
య్యిరువురోర్కియు నిండఁగ, హరిహయసౌందర్యసుఖము నందెదఁ బ్రీతిన్.220
మ. క్రతుభాగంబులు గోలుపోయి కృశులై కాతర్యముం బొంది యే
గతియుం గానక యిట్లు దూలెడుసురల్ కల్యాణబుద్ధుల్ ధృత
వ్రతు లెబ్భంగి నిరీక్షణీయులుగ భావస్ఫూర్తి నేఁ జూచితిన్
దితిజుల్ నాకెదురే జయింతు నఖిలద్వేషివ్రజంబున్ వెసన్.221
క. క్రవ్యాదులు దమయెఱచులు, క్రవ్యాదుల కిత్తు రాజిఁ గడుమోదమునన్
గ్రవ్యాదులతోఁ గూడఁగ, హవ్యాదులు గాంతు రర్థి నాత్మపదంబుల్.222
వ. మీరు నిశ్చింతంబు లగు నంతరంగంబులతోడ నరుగుం డని యానతిచ్చిన మహా
ప్రసాదం బని యందఱు నానందధ్వనులతో నభినందించి నమస్కరించి య య్యల
క్షితమూర్తిచేత నామంత్రితు లైనవారై తమ మున్ను సనుదెంచిన మార్గంబున
మగుడి చని దివిజులు కశ్యపమహాముని యాశ్రమంబునంద యుండి.223
తే. జలధరోదయ మర్థించుచాతకముల, భంగి విభున తారంబు వార్చియుండ
నదితిదేవి యంతర్వత్నియై వహించెఁ, బ్రమదమునఁ జూలు దివ్యవర్షములువేయు.224
చ. హరి పరమేశ్వరేశ్వరుఁ డనంతుఁ డనంతగుణాశ్రయుండు పు
ష్కరదళలోచనుండు గుణగణ్యుఁడు సర్వశరణ్యుఁ డిందిరా
వరుఁడు వరప్రదుం డఖలవంద్యుఁడు గర్భమునంద యుండి య
చ్చెరువుగ నిర్దహించె నవిజేయసురాహితశక్తు లన్నియున్.225
తే. తల్లికడుపున నెలకొని దనుజదమనుఁ, డొదవి తానును బొదలుచుఁ బొదలఁజేసె
నిగమవైభవంబులు తపోనిలయములును, దివిజతేజంబులును గ్రతూద్దేశవిధులు.226
క. అమృతాశనులం గాంచిన, కమనీయోదరమునందుఁ గమలోదరు న
య్యమితబలు నమృతుఁ దాల్చుట, నమృతాస్వాదినియ పోలె నదితి యెలర్చెన్.227
వ. ఇట్లు పరిపూర్ణగర్భిణి యైన కశ్యపగృహిణికిఁ బ్రసవసమయంబున సమధికతేజుం
డగు తనూజుం డుదయించి పూర్వదిశాగర్భ ప్రసూతుం డైన సవితృ ననుకరించె
నమ్మహాత్ము నుదయంబునఁ బ్రత్యాసన్ను లై మరీచ్యాదిబ్రహ్మలును భరద్వాజాది
మునులును సనకాదియోగీంద్రులు ననేకశ్రుతిసూక్తంబులం బ్రస్తుతించిరి
తుంబురు నారద పురస్సరంబుగా నఖలగంధర్వులు దివ్యగానంబులం గీర్తించిరి
రంభాసమేతు లై యచ్చర లెల్ల నుల్లాసనృత్తంబులం గొలిచిరి వసురుద్రాదిత్యాశ్వి
విశ్వేసాధ్యులు సిద్ధవిద్యాధరయక్షగుహ్యకశ్రేష్ఠులు విహంగభుజంగమప్రము
ఖులుం బ్రమోదంబునం బ్రణామకలితు లగుచు వాగర్చనంబు లొనర్చిరి లోక
పితామహుండు హంసవిమానంబుతోడ నేతెంచి యయ్యదితినందను నభినందించి
యిక్కుమారుండు విశ్వస్తుతులకు నర్హుం డయ్యెం గావున విష్ణుం డనం బరఁగు
నని నామధేయంబు నిరూపించి యభిరూపం బగు నుత్సవం బనుష్ఠించి యా సమస్త
సురసంయమిసముదయంబులు ననుసరింప నాత్మీయసదనంబున కరిగె నంత.228
మ. ప్రతిపచ్చంద్రునిమాడ్కి నాతఁడు సమగ్రస్ఫూర్తితోవర్ధమా
నత నొందంగ నవాంబువాహనిభమున్ సంపూర్ణచంద్రాస్యమున్
సితపంకేరుహపత్రనేత్రముఁ బృథుశ్రీవత్సవక్షంబునై
యతిరమ్యం బగు కుబ్జరూపమున నొప్పారెం బ్రభాప్రాంశుఁడై.229
క. వామనుఁడు బ్రహచర్య, శ్రీమహితుం డగుచు నుల్లసిల్లెఁ దగఁ దదీ
యామితసౌందర్యము సుర, భామలచూపులకు నిచ్చపండుగు నిచ్చెన్.230
సీ. ఆఱంగములు గలయైశ్వర్యమునకు నివాసమై యొప్పు నెవ్వానిమహిమ
యెవ్వానియున్నచో టెఱిఁగినధన్యులు మగుడరు జన్మసమ్మర్దములకు
నిందునందును మేలు నొందఁగోరెడువారు క్రతుమూర్తి నెవ్వానిఁ గని భజింతు
రాకాశ మవ్య క్త మజర మనోమయం బానంద మమృత మెవ్వానితత్త్వ
తే. మమ్మహాత్ముఁ దపోమయు నాద్యు నచలు, నీశు విశ్వైకధుర్యు మహేంద్రుతమ్ముఁ
జూచి రుత్ఫుల్లలోచనాంశువులతోడ, నర్థి నిచ్చలుఁ జనుదెంచి యమరవరులు.231
వ. ఒక్కనాఁ డవ్విష్ణుండు నిజదర్శనసమాగతు లైన యదితిసుతుల నందరం గరుణా
తరంగితంబు లగు నాలోకనంబుల ననుగ్రహించి తదీయప్రయోజనంబు నెఱుం
గనివాఁడ పోలె ని ట్లనియె.232
క. అలఘుమతులార మీ ర, స్థలితచరితు లతులధైర్యశౌర్యాదిగుణా
జ్జ్వలులు విశేషించి మదీ, యులు మీ కొకయర్థసిద్ధి యొనరింతుఁ దగన్.233
క. ఎయ్యది ధర్మసమృద్ధం, బెయ్యది దుష్కరము లోకహిత మగుచందం
బెయ్యది చెపుఁడా చేసెద, నయ్యుత్తమకార్య మెద్దియైనఁ గడంకన్.234
వ. అనినఁ బురుహూతు నగ్రభాగంబున నిడికొని యజ్ఞభాగభుజు లందఱు నయ్య
మందప్రజ్ఞున కి ట్లనిరి.235
ఇంద్రాదిదేవతలు వామనుని బలిని నిర్జించి స్వారాజ్యంబు గొనం బ్రార్థించుట
సీ. బలి యనుదైత్యుండు పద్మసంభవుఁ దపోభరమున మెచ్చించి వరము వడసి
శక్తి నెవ్వరికి దుస్సాధుఁడై మముఁ ద్రోచి యఖిలవైభవములు నపహరించెఁ
జంపంగఁ జెఱుప నశక్తుల మాతని నీ వుపాయంబున లావు కలిమి
నధికుఁడ వయశాలి వమితతేజుండ వేవిధమున నైన నవ్విమతు నొడిచి
తే. భవదుపాశ్రయైకవ్రతపరుల మైన, మాకు నొలసినయాపద మాన్పవలయు
నొక్కఁడవు నిత్యకీర్తి వభ్యుదితవిశ్వ,గురుఁడ వగునినుఁ గడవఁగ నొరుఁడు గలఁడె.236
చ. అనిమిషనాయకుం ద్రిభువనాధిపుగా మును నీవ నిల్పి తా
యన యిటు తత్పదచ్యుతి ననాకలితద్యుతియై నశింపఁగాఁ
గనుఁగొన నీక కాదె వగఁ గశ్యపసంయమి తత్పురంధ్రి యా
యనిమిషు లీఋషుల్ ప్రియము నందరె యింద్రుఁ బ్రతిష్ఠ చేసినన్.237
శా. లోకాతీతుఁడవయ్యు లోకములకున్ లోనై విహారేచ్ఛమై
మాకుం జుట్టమ నంచుఁ బేరొకటి సన్మానించి యున్నాఁడ వి
ట్లీకార్యం బొనరించి యిందఱఋణం బెల్లం దగ న్నీఁగు మ
స్తోకస్తోత్రసహస్రపాత్ర మగుచున్ శోభిల్లు నీపేర్మియున్.238
వ. వైరోచనుం డిప్పుడు వాజిమేధమఖంబున దీక్షితుం డై యున్నవాఁడు దీనికిం
దగిన వెరవునం గర్తవ్యంబు చింతనం బొనర్పు మనిన నుపేంద్రుండు తద్వచనం
బులదెసం జిత్తంబు నిలిపి వారిం గనుంగొని.239
క. అగుఁగాక యట్ల చేసెదఁ, దగునింత యనంగ నేల దైవతకార్య
ప్రగుణసమాచరణంబున, నెగడిననా కేమి వింత నేఁ డిది యెల్లన్.240
మ. నను నాదానవనాథుజన్నమునకున్ సంప్రీతిపూర్వంబుగా
గొనిపో నుత్తమబుద్ధి తత్త్వనిధి యొక్కం డర్హుఁ డీమేరకున్
ఘనుఁ డీదేవగురుండు గావలయు నిక్కం బేను వేపోయి నా
పనికిం బోలినయట్లు చేసి విజయస్ఫారుండనై వచ్చెదన్.241
వ. అనియె నివ్విధంబునం గార్యనిశ్చయవిభాసి యైన యద్దేవునకు దేవతలు విజయ
ప్రస్థానంబు సంఘటించిరి వాచస్పతియు నవ్వచోనిధికి సాహచర్యధుర్యుం డయ్యె
నట్లు గదలి.242
వామనుఁడు బలికడకుంబోయి మూఁడడుగులు భూమి యాచించుట
సీ. చిఱుతకూఁకటి నున్న చిగురువెండ్రుకలతో మెఱసి మాఁగుడువడి [15]మెడల వ్రేల
ముచ్చుట్టు ముడిచినముంజితోఁ గట్టిన చెలువంపుగోఁచి ముంజెఱఁగు దూఁగఁ
గుశపవిత్రములతోఁగూడ డాపలికేలఁ దనయంతపొడ వైనదండ మమర
నిద్దంపుతెల్లజన్నిదముదీప్తుల తోడఁ దొడరి కృష్ణాజినద్యుతు లెలర్ప
తే. దబ్బవ్రేలియుంగరము మేదావిబొట్టు, మడుఁగుపేలిక పిరిచుట్టు బెడఁగుగాఁగ
వడుగుచందంబు దన కెడమడుగు గాకఁ, గొమరుగా నేఁగె నెలకఱ్ఱిగుజ్జువేల్పు.243
వ. ఇవ్విధంబున నరిగి సర్వకాలకుసుమఫలభరితపాదపవనాకీర్ణంబును ననేకముని
జనాధ్యాసితసిద్ధతీర్థసముదయంబును బురాతనదివిజద్విజయజనపరంపరాపరిణత
లక్షణోపలక్షితంబును సమంచితకాంచనమణిరచితశాలాకుడ్యకుట్టిమకుంభమండి
తంబును మహావిభవోదారంబు నగు గంగాతీరంబునఁ బ్రవర్ధమానం బగు
నధ్వరసంవిధానం బాలోకించి యజమానసదనంబు నేరం జని.244
క. అందు బలీంద్రుని విజితపు, రందరు ధర్మార్థకరణరక్షాచణు న
స్పందితదానవ్రతు నర, విందనయనుఁ డెదురఁ గాంచి వెర వొప్పారన్.245
వ. ఆల్లనల్లన చేర నరిగి యాశీర్వాదం బిచ్చి మధురోదాత్తస్వరంబున నతని నుప
లక్షించి యి ట్లనియె.246
మ. దితివంశంబు వెలుంగఁ బుట్టి కడిమిన్ దేవేంద్రు నిర్జించి యూ
ర్జితనీతిం గలితార్థసంచయుఁడవై శిష్టప్రమోదాత్తశీ
లత నిమ్మై బహుయజ్ఞదానతపముల్ గావించె దెవ్వారు నీ
ప్రతి లే రీభువనత్రయంబున జగత్ప్రఖ్యాత వైరోచనీ.247
ఉ. చేయఁడే బ్రహ్మ యజ్ఞములు సేయఁడె రుద్రుఁడు సేయఁడే తగం
దోయజనాభుఁ డర్ధపతి తోయపుఁ డిందుఁ డినుండుఁ జేయరే
శ్రీ యిటు నీమఖంబునకుఁ జెందినచాడ్పునఁ జెంద దెందుఁ దే
జోయుత పుణ్యలోకములు చూఱగొనం గల వీ వొకండవున్.248
తే. తురగ మగ్నిమయంబు తత్తురగమేధ, యజనమున బ్రహ్మహత్యాదులైన కడిఁది
పాతకంబులు చెచ్చెర భస్మసాత్కృ, తంబు లగు నని వేదవాక్యంబు గలదు. 249
చ. అనఘ మనుష్యులందు వసుధామరుఁడుం జతురాశ్రమంబులం
దును గృహమేధిధర్మమును దుర్దమదైవతదైత్యకోటియం
దనుపమసత్వవైభవసమగ్రుఁడు నింద్రుఁడువోలె నశ్వమే
ధనియమ మెల్లయజ్ఞసముదాయమునందును మేటి యారయన్.250
వ. ఇట్టి మహాధ్వరంబునందు దీక్షితుండ వై సర్వాపేక్షాపూరణవ్రతంబున నున్న
నిన్ను నర్థించువారలు సకలార్థసమృద్ధు లగుట యేమి చోద్యం బనిన విని సంతసిల్లి
బలీంద్రుం డవ్వామనదేవు నాలోకించి యల్లన నవ్వుచు.251
క. కఱుదులమాటల మమ్ముం, గుఱుచవడుగ యేల యింత గో నెక్కింపన్
నెఱయఁగ నీయిష్టము మా, కెఱిఁగింపుము వేడ్క నిత్తు మెయ్యది యైనన్.252
వ. అనివ నతం డేను గుర్వర్ణం బర్థినై వచ్చితిఁ బదత్రయమాత్ర యగు ధాత్రి
యిచ్చినం జాలుఁ గృతకృత్యుండ నగుదు ననవుడు నవ్వితరణకోవిదుం డవ్వేద
విదునితోడ.253
తే. చదువుదురుగాన విప్రులు చాలముగ్ధు, లకట యివి యేమి బుద్ధి మూఁడడుగు లడుగు
టేను శతలక్షపదమాత్ర యైనధన్య, ధరణి యిచ్చెదఁ గొను మొండుతలఁపు దక్కి.254
చ. అనునెడ శుక్రుఁ డాదితికులాగ్రణిఁ జేరఁగవచ్చి యొయ్య ని
ట్లను నిది యేల వేగపడ నద్భుతకృత్యరతుండు దైత్యసూ
దనుఁ డిటు వంచనన్ సురహితం బొనరింపఁగ వచ్చినాఁడు నీ
మనమున నీఁగిపైఁ గడఁక మానుము సూడకు మింక నీతనిన్.255
క. ఏమి యొనరింపఁ బోయిన, నేమి యగునొ మనకు నేల యీతొడుసులు నా
నామూర్తిధరుఁడు హరి మా, యామయుఁడన వినమె యంచితామ్నాయములన్.256
వ. అని చెప్పిన నొక్కింత చింతించి యసురవర్యుం డాచార్యుం గనుంగొని.257
సీ. ఇచ్చెద ననఁ గాని యీలే ననంగ నేరని నోరు దైన్యాక్షరములు వలుకు
టఖిలంబునకును మీఁదయి యొప్పు హస్త మీగికిఁ జాఁపగాఁ గడుఁ గ్రిందువడుట
నిత్యస్వతంత్రాదినిరతిఁ జెన్నగుమోము వేఁడుకష్టత వెలవెల్ల నగుట
సర్వలోకములకు సంశ్రయ మగు మేను యాచకభంగి భయమున వడఁకు
తే. టద్భుతం బిట్టిఁడయి వచ్చి యబ్జనాభుఁ డర్థి యగునటె దాత నే నగుట యరుదె
కలఁడె హరికంటెఁ బాత్ర మీఁ గంటి మంటి, నిత్తు నివ్వామనునికోర్కి యెల్లభంగి.258
క. తమతమవిద్యాతపముల, యమితఫలము లెవ్వరికి సమర్పించి మహ
త్త్వము వడసి రాద్యు లవ్విభుఁ, బ్రముదితుఁ జేయుటయ కాదె భాగ్యము మనకున్.259
క. మీ రడ్డము సెప్పక యీ, గారవము మదీప్సితంబుగా సిద్ధింపం
గోరుఁ డని పలికి వామనుఁ, జేరంగాఁ బిలిచి [16]చేయి చేకొని వినతిన్.260
క. అయ్యా నీయడిగినయది, యెయ్యెదియైన నగుఁగాక యిచ్చెద నిటుర
మ్మియ్యెడఁ గూర్చుండు మనుచు, నయ్యుత్తమగుణు నుదఙ్ముఖాసీనునిగన్. 261
వ. ఉనిచి యతని యభ్యర్థితం బయిన యర్థంబు సువ్యక్తంబుగా నుగ్గడించి.262
[17]మ. కమనీయోజ్జ్వలహేమరత్నరచనాకల్యాణమై యొప్పు కుం
భమునం బుణ్యజలంబు వుచ్చుకొని యీభవ్క్షితిత్యాగయో
గమునం బ్రీతుఁడ గాత విష్ణుఁడు ద్రిలోకస్వామి యుంచుం బ్రహ
ర్షము నిండారఁగ నించె ధార యతఁ డాసర్వాత్ముహస్తంబునన్.263
క. వైరోచనకరవితరణ, ధారాసలిలంబు నిశ్చితంబుగఁ దనచే
యారం దొరుఁగందడవ య, వారణమెయి వామనుం డవామనుఁ డయ్యెన్.264
వ. ఇట్లు విజృంభించి యద్దేవుండు సర్వదేవతామయం బైన యాత్మీయదివ్యరూపం
బుద్దీపితంబు సేసిన నమ్మహామూర్తికి భూలోకంబు చరణంబులు నూర్ధ్వలోకంబులు
శిరంబును నయ్యెం జంద్రాదిత్యులు లోచనంబులఁ బిశాచంబులు పాదాంగు
ళుల గుహ్యకులు హస్తాంగుళుల విశ్వులు జానువుల సాధ్యులు జంఘల యక్షులు
నఖంబుల నచ్చరలు రేఖల సూర్యాంశువులు కేశంబులం దారలు రోమమూలం
బుల మహర్షులు రోమాగ్రంబుల దిక్కులు బాహువుల నశ్వినులు శ్రవణంబులఁ
బవనుండు ఘోణంబున గరుండు మనంబున సరస్వతి జిహ్వ స్వర్గద్వారంబు
నాభిని మిత్రత్వష్టలు బొమలను బ్రజాపతి పుంస్త్వంబున నసువులు వీఁపున
రుద్రుండు హృదయంబున బ్రహ్మ యూరువుల వేదంబులు దంతంబుల సముద్రం
బులు ధైర్యంబున లక్ష్మీమేథాధృతివిద్యలు కటిప్రదేశంబునఁ బరమపదంబు లలా
టంబున నింద్రుండు స్రోతస్సులఁ దపోదమవ్రతంబులుఁ దేజంబునఁ గ్రతు
పూర్తంబు లోష్ఠకక్షవక్షంబుల వసియింప నమ్మహాతేజుం డొప్పెఁ దత్తేజంబు
సహస్రసూర్యోదయచంద్రశతం బని నిశ్చయింప రాదు గావున నప్రమేయం
బట్టియతర్కితప్రాదుర్భావంబున.265
మ. బలి యాశ్చర్యము నొంది సంభ్రమభయభ్రాంతత్వసమ్మేళనా
కులభావంబునఁ జూచుచుండె నసురల్ క్రోధోద్ధతిన్ వేలసం
ఖ్యలు దీప్తిస్ఫురదస్త్రశస్త్రవిటపిగ్రావోల్లసత్పాణు లై
పెలుచం జుట్టును ముట్టి రవ్విభు మహాభీమాభిరామాకృతిన్.266
చ. పదములు జాను లూరువులు బాహువు లంటఁగఁబట్టి యెందునుం
గదలక యుండ నొత్తుఁ డని క్రమ్మినయాబలవద్విరోధులం
బదములు జంఘ లూరువులు బాహువు లోలి నమర్చి తొక్కియున్
విదలిచియు న్నొగిల్చియును వ్రేసియుఁ ద్రుంచె నతండు వ్రేల్మిడిన్.267
క. తుహినంబు నాత్మకిరణ, ప్రహతముఁ గావించి మించుభానునిక్రియ న
ట్లాహితవిమర్దనలీలా, మహితుండై యువ్విభుం డమంథరసరణిన్.268
వ. విక్రమత్రయంబున లోకత్రయంబును నాక్రమించి త్రివిక్రమాభిధానంబున నిగ
మంబులు ఘోషింపం బరితోషభరితహృదయుం డై యవ్విశ్వరూపప్రపంచం
బుపసంహరించి సర్వసాధారణరూపంబున నిలిచి దనుజేశ్వరున కి ట్లనియె.269
తే. నీవు నాకు మూడడుగుల నేల యిచ్చి, తతులచారిత్ర సభ్యచయం బెఱుంగ
నేను నాయడుగులపాటి నీజగత్త్ర, యముఁ గైకోలుగొంటి నాసొమ్ము గాఁగ.270
క. నీ కింక నేల రాదీ, లోకము లెటయైనఁ బొమ్ము లుంఠితరాజ్య
శ్రీకుఁడ వై తనుటయు నతఁ, డాకంపితవినతదేహుఁడై కడుభక్తిన్.271
తే. ఏ ననఁగ నెవ్వఁడను దేవ యీయొడలు స, మర్పితము నీకు దీన నెయ్యది యొనర్తు
నానతిమ్ము కృపార్ద్రుండవై శరణ్య, భక్తవత్సల శ్రీనాథ పద్మనాభ.272
వ. అనినం బ్రసన్నుం డై పరమేశ్వరుం డసురేశ్వరున కి ట్లనియె.273
వామనుఁడు బలిని సబాంధవంబుగాఁ బాతాళంబునకుఁ బోవం బనుచుట
క. నీవలన సంతసిల్లితిఁ, గోవిదనుత యిష్టధనము గుణవత్ప్రాపం
బై వచ్చిన నా కిచ్చితి, గావున నిర్భయుఁడ వగు జగంబులయందున్.274
వ. పాతాళంబునందు సుతలంబనఁ బ్రసిద్ధం బైన నెలవు గల దచ్చోటికిం జని సభృత్య
బాంధవుండ వై వసియింపుము దివ్యంబులు నక్షయంబులు నపరిమితంబులు
నగుభోగంబులు భవదిచ్ఛానురూపంబు లై యం దొదవెడు నధికదక్షిణంబు లగు
నధ్వరంబులు నుదాత్తదానంబులు నాచరింప నర్హంబు లగువస్తువు లపరిచ్ఛేదంబు
లయి యఖిలకాలంబులు సంపన్నంబులుగాఁ గలయవి వినుము మహేంద్రుండు
మహానుభావుండు గావున నాకు నర్చనీయుం డతనికి నీవు వినమ్రుండ వై
విబుధులయందునుం బూజ్యభావంబు భావించి వర్తింపవలయు నిట్టిమదీయ
శాసనం బెప్పుడు దప్పిన నుదగ్రఫణంబు లగు ఫణాధరంబులు ప్రాణాంతకదండం
బున దండించు నవహితుండ వై బ్రతుకుము మీఁద నెంతయు మే లొనర్చెద
ననిన నవ్విభునకు విరోచనతనయుం డి ట్లనియె.275
క. క్రతుభాగభోగమున సుర, లతిమోదముఁ బొంది క్రాల నచ్యుత యేఁ బ్రా
కృతభోగంబుల సంప్రీ, తత నెమ్మెయి నుండువాఁడఁ దలఁపుము దీనిన్.276
సీ. నావుడు నంభోజనాభుఁ డశ్రోత్రియశ్రాద్ధంబు నవ్రతచర్యమైన
యధ్యయనంబును నపగతదక్షిణక్రతువు నమంత్రకహుతము శ్రద్ధ
చాలనిదానంబు సంస్కారవిరహితం బగుహవిస్సును నన నాఱుతెఱఁగు
లిచ్చితి నీభుక్తి కెవ్వఁ డీశ్వరున కప్రియకారి నన్ను గర్హించు నెవ్వఁ
తే. డగ్నిహోత్రియై క్రయవిక్రయముల బ్రతుకు, నెవ్వఁ డట్టివారలపుణ్య మెల్ల నీవు
గొనుము పొమ్మని వీడ్కొల్పదనుజపతియు, హర్షపూర్ణుఁడై హరికి సాష్టాంగ మెరఁగి.277
వ. సర్వదైత్యసమేతుం డై పాతాళంబునకుం జని జనార్ధననిర్దిష్ట ప్రకారంబున నుండె
నంత నిక్కడ.278
క. తనబుద్ధివిక్రమంబుల, ననుపమ మగు రాజ్యలక్ష్మి యవలీల మెయిన్
గొని విష్ణుఁడు త్రైలోక్యం, బును సురలకుఁ బూర్వమార్గమున విభజించెన్. 279
వ. అమ్మహాతుం డి ట్లేర్పరించి యొసంగ నీం ద్రుండు పూర్వదిగ్రాజ్యంబు గైకొనియె
ధర్ముండు దక్షిణదిశాధిపత్యం బధిష్ఠించె వరుణుండు ప్రత్యర్థిగానుశాసి యై నిలిచె
గుబేరుం డుత్తరహరిత్పాలనం బంగీకరించె భుజంగవిభుం డధోభువనభరణంబున
నుల్లసిల్లె సోముం డూర్ధ్వలోకాధీశ్వరుం డై యొప్పెఁ దక్కినవారును దమ తమ
పదంబులఁ బ్రమదంబుం బొంది రిట్లు సర్వలోకోపకారవినోదుం డై యద్దేవుండు.280
మ. అదితిం గశ్యపు నిత్యసత్కృతిఁ గృతార్థారంభులం జేయుచుం
ద్రిదశాచార్యుఁడు లోనుగాఁగలమునిశ్రేణిం బ్రియాహ్లాదనా
భ్యుదయప్రౌఢి ననుగ్రహించుచు సురల్ పూజింపఁ బ్రత్యాదర
ప్రదలీలం బ్రసరింపుచున్ భువనముల్ పాలించుచుండెం గృపన్.281
వ. అని చెప్పి వైశంపాయనుండు.282
క. ఈవామనావతారక, థావిస్తర మనఘ దేవతలకును ధరణీ
దేవతలకు సంభావ్యము, గావున వినఁ జదువఁ గల్గుఁ గల్యాణంబుల్.283
క. విను సర్వకాలమును ని, య్యనుపమకథనంబు వినిన నతినియతిఁ బఠిం
చిన నసురల విష్ణుఁడు గెలి, చినక్రియ జనవిభుఁడు గెలుచు శీఘ్రమ రిపులన్.284
క. వామనదేవుఁడు భువన, ప్రేమాస్పద మైనభంగిఁ బ్రియుఁ డగు మనుజ
స్తోమములకు నవ్విభునిమ, హామహిమలు విను మనుష్యుఁ డనవరతంబున్.285
క. ధనములఁ గోరిన ధనములఁ, దనయులఁ గోరినఁ దనయులఁ దరలాక్షులం గో
రినఁ దరలాక్షులఁ బడయును, జనుఁ డీబలిమథనకథను జదివిన వినినన్.286
క. ఆయువు నారోగ్యంబును, శ్రీయును బహుపుత్రపౌత్రచిరసౌఖ్యములం
జేయుఁ ద్రివిక్రముచరితము, పాయక యాకర్ణితంబుఁ బఠితము నగుచున్.287
క. అదితికిఁ గశ్యపునకుఁ దా, నుదయించిన యీచరిత్ర ముల్లంబున నిం
పొదవంగ నునుచుపుణ్యున్, సదయుండై ప్రోచు హరి నిజం బిది యెందున్.288
అస్మదీయగురుం డగునాదిమునిప, రాశరాత్మజుఁ డాగమరాశివలనఁ
బుచ్చుకొని మాకు నిచ్చె నిప్పుణ్యకథన, వస్తు వైహికాముష్మి వాప్తికొఱకు.289
వ. నీవును తదీయస్వరూపనిరూపణతత్పరత్వంబువలనం గృతార్థుండ వగు మనినం
బ్రీతమానసుం డే జనమేజయుండు.290
సీ. బంధురాష్టాదశపర్వనిర్వహణసంభావితం బగు మహాభారతంబు
హరివంశ పరిపూర్ణ మగునట్లుగాఁ గ్రమవ్యాఖ్యాన మొనరించి తనఘ నీవు
విని పవిత్రుఁడ వైతి వినఁగ నింకొక్కఁడు గల దేమి నియతి నిక్కథ వినంగ
వలయు వాచకుఁ డెట్టివాఁడు గాఁదగు నెన్నిమాఱులు వినుటొప్పు మాటిమాటి
తే. కగుఫలప్రాప్తు లెట్లు సమాప్తివేళఁ, బూజ్యు లేవేల్పు లేదానములు విధేయ
యౌను ప్రత్యేకపర్వానసానకృత్య, మెవ్విధం బింతయును జెప్పు మింపు మిగుల.291
వ. అని యడిగిన వైశంపాయనుం డతని కి ట్లనియె.292
క. విను నమ్మికయును భక్తియు, నెనయఁగ శుచియై శమంబు ఋజుతయు సత్యం
బును గల్గి విమత్సరమతి, వినవలయును భారతంబు విధియుక్తముగన్.293
మ. అనసూయన్ జితకామరోషుఁ గమనియాకారు సత్యోక్తిశీ
లు నశేషాగమశాస్త్రతత్త్వనిపుణు లోకజ్ఞుఁ బ్రాజ్ఞున్ శుచిన్
జనతాసమ్మతు భవ్యభక్తినియమశ్రద్ధాసమిద్ధుం బ్రియం
బున సత్కారము లొప్ప వాచకునిఁ గాఁ బూజించి యుంచం దగున్.294
తే. అతఁడు విమలవస్త్రోపవీతాంగరాగ, మాల్యభూషణశోభియై మహితలిఖిత
హృద్యమగుపుస్తకము గొని యెలమి యొలయఁ, బ్రాఙ్ముఖోదఙ్ముఖత్వతత్పరత నుండి.295
క. నారాయణు నరుని నమ, స్కారంబునఁ దెలచి వాణిఁ గల్యాణి నెదం
జేరిచి వేదవ్యాసుల, నారాధించి మఱి వలయుఁ బ్రారంభింపన్.296
చ. మునుకొనిపోవ కెంతయును ముట్టక నిల్పక భావమున్ రసం
బును వెలయం దగుల్పడక పొందుగ వాక్యవిభాగ మొప్పఁగా
నెనిమిదితానకంబులను నేర్పడి వర్ణము లుల్లసిల్ల నే
ర్పెనయఁగ వాచకుండు కడు నిం పగురీతిఁ బఠింపఁగాఁ దగున్.297
క. పదిరువ్వంబులు భక్తిం, బదిలుండై వినఁగ వలయు భారతము జగ
ద్విదితగుణ వాని నన్నిట, నొదవినఫల మేర్పడింతు నోలిన నీకున్.298
సీ. తొలుతరువ్వము వినఁ గలుగు నగ్నిష్టోమయాగంబుఫలము గామార్థసిద్ధు
లీలోకమునఁ గాంచి యాలోకమున నప్సరోగణసంకీర్ణ రుచిరదివ్య
యానంబు వడసి సమగ్రభోగంబులఁ బెద్ద గాలంబు సంప్రీతి నొందు
వినుము రెండవురువ్వు విని యతిరాత్రయజ్ఞముపుణ్య మొంది భోగముల నెలమిఁ
తే. దుది నుదద్రవిమానంబు త్రిదశవరులు, దేర నెక్కి వే చని మహోదారరతుల
విబుధయువతులు సొక్కింప వేనవేలు, వర్షములు మర్త్యుఁ డుండు దివంబునందు.299
వ. తృతీయవారశ్రవణంబున ద్వాదశాహం బను మఖంబు ఫలంబు సిద్ధింపం బ్రసిద్ధ
విభవుం డే బ్రతికి మీఁదట మణిమయం బగు విమానంబున కొడయం డై
వేలేండ్లు వేల్పువెలందులతోడఁ గ్రీడించు.300
ఉ. నాలవురువ్వమున్ విని జనస్తుత పొందు జనుండు వాజపే
యాలఘుభద్రమున్ జనన మంతయు సౌఖ్యమయంబుగాఁ జిర
శ్రీల భజించి కాంచు; దుది సిద్ధవధూరతి లక్షవర్షముల్
బాలపతంగతుల్యరుచిభవ్యవిమానమనోజ్ఞసుస్థితిన్.301
క. దీనికి నినుమడి మేలగు, నేనవుమాటు వినఁగా నరేశ్వర యటుదో
డ్తో నొక్కొకగుణ మెక్కుఁ గ్ర, మానుగతిన్ షష్ఠసప్తమాకర్ణనలన్.302
వ. కైలాసశిఖరాకారం బైన వజ్రమయవేదివిలసనం బగు విమానంబు నధిష్ఠించి
విబుధాంగనాసంగీతమృదంగధ్వనులు వలభి వివరంబులు ప్రతి ఫలన ద్విగుణంబు
లయి యింపు లొసంగ నిలింపులు వొగడ రెండవ మార్తాండు పగిది వెలుంగుచు
నఖిలభువనంబుల నప్రతిహతగతి యై చరించుటలె పర్యాయక్రమంబుల వీనికి
సదృశంబు లగు ఫలంబులు.303
క. ఎనిమిదవుసారి వినినన్, మనుజునకును రాజసూయమఖసిద్ధియ చే
రు ననంత మైహికసుఖం, బనఘా యటమీఁద నమరు లభినందింపన్.304
తే. పూర్ణచంద్రోదయస్ఫూర్తిఁ బొలుచు కాంతి, యుతవిమానంబు గైకొను నుజ్జ్వలాంగుఁ
డై సుగంధివస్త్రాభరణాంగరాగ, రమ్యవేషంబుతో వత్సరములు కోటి.305
ఉ. వేడుక వేల్పుఁదోయ్యలులవీఁగుచనుంగవమీఁద మన్మథ
క్రీడల వ్రాలి నిద్రల సుఖించి ప్రభాతములందు సాదరో
త్తాడనలోలతచ్చరణతామరసాంచితనూపురంబు లా
మ్రేడితనిస్వనంబు లయి మెల్పునఁ దెల్పఁగ నొందు భోగముల్.306
క. తొమ్మిదవుసారి విన య, జ్ఞమ్ములకుం బతి యనఁ జను హయమేధఫలం
బమ్మెయిఁ గాంచు నభీష్టఫ, లమ్ములఁ దాఁ బడసి నరుఁడు లక్ష్మీయుతుఁ డై. 307
[18]శా. దేహాంతంబున దివ్యయానగతుఁడై దివ్యార్కచంద్రద్యుతిన్
వ్యూహోద్భాసియు సర్వకామగము వజ్రోద్యద్గవాక్షాగ్రని
ర్వ్యూహంబున్ మణిబద్ధకుట్టిమము నై యొప్పారు యానంబునన్
మాహాత్మ్యం బెసఁగన్ జరించు సుఖియై మానాతిగాబ్దావలుల్.308
క. పదియగువరుస వినిన య, భ్యుదయఫలంబునకుఁ గొలఁది యూహించి నిజం
బిది యన నేరఁడు బ్రహ్మయు, సదభిమతా యతఁడు ధన్యజన్ముఁడు పేర్మిన్. 309
క. ఇచ్చటఁ గలమే లెల్ల ను, నిచ్చ వలసినట్లు పొంది యెంతయు సుఖియై
యచ్చటికిఁ బోయి దివిజులు, నెచ్చెలు లై యనుసరింప నిత్యప్రీతిన్.310
సీ. కామగమంబును గామితవస్తుసంభరితంబు తేజోవిభాసితంబు
నగువిమానంబున హారకేయూరచూడారత్నకటకకుండలనిబద్ధ
రత్ననూత్నద్యుతిరంభితమూర్తియై యుదయార్కుఁడునుఁబోలె నుల్లసిల్లి
యనిమిషకాంతాకరాధూతచామరపవమాననర్తిత భ్రమరకుండు
తే. నిర్మలాతపత్రదుకూలవర్మలోల, చంచలోష్ణీషవిస్ఫురితాంచలుండు
నగుచు బహుకోటివర్షంబు లఖిలనాక, లోకముల సంచరించు నిశ్శోకుఁ డగుచు.311
చ. క్రమమున నింద్రలోక మటఁ గంజవనప్రియలోక మావలం
గమలజలోక మప్రమితకామితరుద్రసదాశివాఖ్యలో
కముల సమగ్రపూజనసుఖంబులతోఁ జరియించి వెండి ని
త్యము నమృతంబు నౌపరమధామము నొందు నతండు ధన్యుండై .312
సీ. విను మబ్జసంభవవిష్ణురుద్రులు మొదలైన దేవతలు విద్యాధరాది
దేవయోనులు మునిద్విజరాజవంశముఖ్యులు గిరిసాగరక్షోణినభము
లర్కేందుతారాగ్రహంబు లింకిట నెన్న నేల చరాచరజాలమెల్ల
భారతంబున ఋషిప్రభులచే వర్ణితం బైనది గావున నఖిలమునను
తే. నాత్మగుణకీర్తనంబున నఖిలపాత, కములు సత్యంబు తొలఁగించుఁ గర్త కధిప
భారతాధ్యయనమువోలెఁ బాపములకు, బరమనిష్కృతి గలదె యెప్పాటనొండు.313
క. పరువడి పర్వసమాప్తుల, నరవర పుణ్యాహవాచనపురస్సరభూ
సురభోజనపూజనవిధు, లిరవుగ నొనరింపవలయు నెంతయుఁ బ్రీతిన్.314
సీ. ఆదిపర్వము విని యంచితమూలఫలాజ్యమధుప్రాయ మైన పాయ
సమున బ్రాహణతుష్టి సలుపుట ధర్మంబు విను సభాపర్వంబు విని హవిష్య
మిడునది యారణ్య మింపార విని తనిపండ్లును మేలిదుంపలును శీత
జలకుంభములు గలసర్వకామసమృద్ధి గలిగించునన్న మిం పొలయ నొసఁగఁ
తే. దగు విరాటపర్వము విని తవ్విధంబు, చేసి మఱియు విశ్లేషించి చిత్రనూత్న
వివిధరమ్యాంబరంబులు వేడ్క నిచ్చు, టర్హ మమృతాంశువంశమహాబ్ధిచంద్ర.315
క. నవగంధమాల్యపూర్వక, వివిధాన్నము లధికతృప్తి వెలయ సమర్పిం
పవలయు వినయముతో వి, ప్రవరుల కుద్యోగపర్వపర్యాప్తియెడన్.316
క. సరసమును సుగంధియు నగు, పరమామృతతుల్యబహుళపానములన్ భూ
సురులకు నభీష్టభోజన, పరిణతి సేయునది భీష్మపర్వసమాప్తిన్.317
క. మనుజేంద్ర ద్రోణపర్వం, బునకడకట ధరణిదేవముఖ్యులకుం గో
రినకుడు పమర్చి బాణా, సనశరకౌక్షేయకము లొసంగఁగ వలయున్.318
తే. కర్ణపర్వంబు దా విని కడను నగ్ర, జన్ములకు నన్న మిడునది శల్యపర్వ
మున నవూపమోదకఘృతభూరి యైన, యంచితాహారకల్పన మర్హ మనఘ.319
క. ఘృతముద్గసూపబహుళం, బతులితభోజనము సౌప్తికాంతంబున స
న్మతి నొడఁగూర్చి ధరాదే, వతలకుఁ బరితృప్తి చేయవలయుం బ్రీతిన్.320
క. స్త్రీపర్వంబున రత్నము, లోపి తొలుత నిచ్చి బ్రాహణోత్తమతతికిన్
భూపాల నేమ మొప్ప మ, హాపూర్తిగఁ గుడువఁబెట్టునది కడుభక్తిన్.321
తే. శాంతిపర్వము నానుశాసనికము మఱి, పూర్ణ మైనప్పు డాజ్యసంపూర్ణవృద్ధి
మృదుహవిష్యాన్న మిడునది మేదినీసు, పర్వులకు భవ్యదక్షిణపూర్వకముగ.322
తే. వరుస నశ్వమేధాశ్రమవాసపర్వ, యుగ్మమున భక్ష్యభోజ్యాదియుక్తవాంఛి
తాన్నమును హవిష్యంబు నింపారఁ గుడుచు, వారు ధారుణిదేవతావర్యు లెలమి.323
క. అనులేపములును మాల్యము, లును వస్త్రమ్ములును నిచ్చి లోకోత్తరభో
జన మిడునది దగ మౌసల, మునఁ దక్కిన రెండుపర్వముల సదృశముగన్.324
క. సరసఘృతశర్కరాయుత, పరమాన్నంబులను భక్ష్యపానములఁ గడున్
బరితుష్టిఁ జేయవలయును, హరివంశము భక్తి విని మహాద్విజతతికిన్.325
తే. ఎన్నివరుసలు విన్నను నిట్ల చేయు, టొప్పుఁ బ్రతిపర్వమున విశేషోత్సవములు
భారతం బంతయును విని భరతవర్య, బ్రాహ్మణులపూజ యాచరింపంగ వలయు.326
సీ. వేదవేద్యులు ధర్మవిదులుసు నగువిప్రవరులు దానును శుక్లవస్త్రగంధ
మాల్యవిభూషణమహనీయుఁడై కర్త సముఁడును శుచియునై యమరు నెలవు
నందు దుకూలాంబరాస్తరణంబున సంహితాపుస్తకసంచయంబు
లోలి నన్నియు నిడి యొక్కట యర్చించి యంతట నైవేద్య మర్పితంబు
తే. సేసి కాంచనరత్నదక్షిణల నిచ్చి, నరుని నారాయణుని సర్వసురుల నధిక
భక్తి గీర్తింప వాచకప్రవరుఁ బిలిచి, కొంతయొకచాయ సదివించుకొనఁగవలయు.327
వ. ఇట్లు పూజావిధి సమగ్రంబు గావించి.328
చ. దివముననుండి దేవతలు దివ్యము లైననిజాంశజన్మముల్
భువి గలిగించి భూరి యగుభూభరముం దొలఁగింప భారతా
హవకరు లైరి గావునఁ దదర్చనరూపము గాఁగ భారత
శ్రవణవిధాయి చేయునది సత్క్రియతో బహుదానధర్మముల్.329
చ. నిజవిభవానురూపముగ నిర్మలరత్నసువర్ణరౌప్యస
ద్గజరథవాజిగోతతులు కన్యలు దాసులు భూగృహాంబర
వ్రజములు నిండియున్ దనకు వాంఛిత మెయ్యది యెద్ది యుత్తమం
బజితభుజాఢ్య యన్నియును నంచితయోగ్యుల కిచ్చు టొప్పగున్.330
క. తదనంతరంబ యందఱ, నొదవఁగ హృద్యాన్నపానయుక్తిఁ బ్రమోదో
న్మద మమరఁ జేసి వాచకుఁ, బదిలంబుగ భవ్యపూజఁ బాటింపఁ దగున్.331
తే. పసిఁడిచీరలు గోవులుఁ బసులు గొల్చు, నూళు లిండ్లును బండ్లును నోలి నొసఁగ
వలయు నివియెల్ల నొసంగి యవ్వలన మోడి, సేయ కెంతయు సంతుష్టి సేయవలయు.332
క. వాచకుఁడు సంతసిల్లిన, నాచతురాననునిఁ దొట్టి యమరవరులు భ
వ్యాచారతుష్టి నొందుదు, రాచంద మొనర్ప నిచ్చు నభ్యుదయంబున్.333
తే. అనఘ వాచకుఁ డెట్లట్ల యర్హుఁ డఖిల, మునకు నా లేఖకుండుఁ దద్భూతితోడ
నిష్టశుభదంబు సభ్యుల నెల్ల నీగి, వలన నలరించి దీవన వడయవలయు.334
క. భారతపంచమవేద, ప్రారంభమునపుడుఁ దత్సమాప్తిని వలయున్
ధీరమతిని బహువిప్రస, మారాధన మది మహార్థి నాపాదించున్.335
క. నీవడిగినవిధ మంతయు, భూవర చెప్పితి నజస్రమును గోప్యముగా
భావింపు మవ్విధము స, ద్భావుల కెఱిఁగింపవలయుఁ దగ దితరులకున్.336
క. భారతము నిర్మలప్రతి, భారతమున్ వినినపఠనపరులకు శుభవి
స్తారము రవిశశితారక, తారకము తదీయపితృపితామహతతికిన్.337
క. వినవలయుఁ జదువవలయును, గొనియాడఁగవలయు నధికగోప్యార్థముగా
నునుపఁగవలయును మనమున, మనుజోత్తమ భారతాఖ్యమహితాగమమున్.338
ఉ. భారతపుస్తకప్రతతి పాయక యేసుకృతాత్మునింట నొ
ప్పారుచు నిత్యపూజనల నందుచు నుండు దదీయవాసముం
జేరి తలిర్చునిష్టజయసిద్ధి నిజంబు పురాణపూరుషా
ధారకథామయం బగుటఁ దత్సదృశంబులె యొండుగ్రంథముల్.339
క. మనుజులు గొనియాడవలయు, నని చెప్పుట గొఱుఁతయే మహామునులు సురల్
వనజజుఁ డాదిగ భారత, మనిశముఁ జదువుచును వినుచు నలరుదురు మదిన్.340
తే. భారతశ్రుతిరతులకు భవ్యయాన, దివిజసుఖములు సులభంబు లవుట యరుదె
ముక్తిపదము తదీయాంగమునను గల్గుఁ, దత్కథామూర్తి విష్ణుకీర్తనముగాదె.341
క. భారత గోవు విప్రుఁడు, భారతియును జాహ్నవియును బద్మావిభుఁడున్
గోరి నిరంతరచింత్యులు, గా రూపించు సుజనుండు కల్యాణి యగున్.342
క. శ్రుతియును భారతమును రఘు, పతిచరితముఁ జదువు వారు పరమపురుషు న
చ్యుతు మొదల నడుమఁ దుదిఁ బ్ర, స్తుతి సేయఁగవలయు విప్రచోదిత మొందన్.343
ఉ. ఏకథయందు విష్ణు జగదీశ్వరు నాద్యు ననంతు నంచిత
శ్లోకవరేణ్యుఁగాఁ దెలుపు సూక్తులు చాలఁగఁ గల్గుఁ బన్నుగా
నాకథ విస్తరింపఁ దగు నాకథ వీనులఁ గ్రోలఁగాఁ దగున్
శ్రీకరసద్గుణాకరవిశేషత యీకథ కౌరవోత్తమా.344
క. అని చెప్పిన వైశంపా, యనువాక్యము హృషిత మైనయంగ మెలర్పన్
గొనియాడి యతని కభ్య, ర్చనఁ జేసెఁ బరీక్షిదాత్మజన్ముఁడు ప్రీతిన్.345
క. మీరును బారాశర్యో, దారఫణితియందుఁ గల్గుతాత్పర్యంబున్
ధీరము లగుచిత్తంబులఁ, జేరిచి యానందసిద్ధిఁ జెందుఁడు నియతిన్.346
వ. శ్రీమహాభారతంబు హరివంశోత్తంసంబుగా నఖిలంబును యథాశ్రుతవ్యాఖ్యా
నంబుగాఁ జేసి మిమ్ము నారాధింపం గలిగె నే ధన్యుండనైతి ననిన నారౌమహర్షణి
వలనం బరితోషంబు నొంది.347
ఉ. శౌనకుఁ డాదిగాఁ గలుగు సంయమిపుంగవు లందఱున్ బ్రమో
దానుభవంబుస బొదల నాంతరబాహ్యవిచేష్టికంబు లిం
పై నెఱయంగ నక్కథకు నంచితకీర్తనపూర్వభూరిస
న్మానములం బ్రహర్షమయమానసుఁగా నొనరించి రున్నతిన్.348
క. శ్రీ వేమక్ష్మావల్లభ, భూవల్లభపూజనీయ భుజవైభవ ల
క్ష్మీవల్లభ గుణవితరణ, పావన నినుఁ బొందుఁగాత భవ్యశుభంబుల్.349
గద్యము. ఇది శ్రీ శంకరస్వామిసంయమీశ్వరచరణసరోరుహధ్యానానందసౌందర్య
ధుర్య శ్రీ సూర్యసుకవిసంభవ శంభుదాసలక్షణాభిధేయ యెఱ్ఱయనామధేయ
ప్రణీతం బైన హరివంశంబునం దుత్తరభాగంబునందు సర్వంబును దశమా
శ్వాసము.
- ↑ వైద్యవిద్య
- ↑ నత్యర్థియై
- ↑ వాటు
- ↑ చ్ఛోటిత
- ↑ సర్వావరోధనసమము
- ↑ సంస్కృతానుసారమగు పాఠము : కీర్తియు ద్యుతియుఁ బ్రభయు ధృతియు క్షేమయు
భూతియు నీతియు విద్యయు దయయు మతియు స్మృతియు మేధయుఁ దుష్టియుఁ బుష్టియుఁ
గాంతియుఁ గ్రియయు. - ↑ నిర్ధారిత
- ↑ సౌరభ్య సంవిదావేశ వదన
- ↑ పరాయణ వారణ
- ↑ దర
- ↑ లక్షసదృక్ష
- ↑ పబలకు లళలకు అభేదము. కాఁగా 'చక్రవాళ'.
- ↑ ధారణా
- ↑ 'స్థానాభిమానితా' అని యిటులు మార్చి చూచినచో అర్థమునకు కొంత చేరిక యగును.
- ↑ మ్రిళ్ల - మిళ్ల
- ↑ చేయఁ జే గొని
- ↑ శా. స్ఫీతానేకవినూత్నరత్నరచనం జెన్నొందుకుంభంబునం
బూతంబైనజలంబు పుచ్చికొని యీభూదానసంపత్తిచేఁ
బ్రీతుండై హరి గాచు మమ్ము ననుచుం బెంపార దద్ధార యా
దైతేయోత్తముఁ డమ్మహాపురుషుచేతం బోసె నుల్లాసియై. - ↑ క. అమరీముఖాబ్జచికుర, భ్రమరీరుచిదుగ్ధభావుఁ డగుచుఁ దా
నమరావలి గొలువఁ దిరుగు, నమరావతి లోనుగా బురావలినెల్లన్.