సూర్యశతకము (తెలుగు)/పీఠిక
పీఠిక
ఈ ఆంధ్ర సూర్యశతకమునకు మూలము సంస్కృతమున మయూర మహాకవి రచించిన సూర్యస్తుతి పరమగు శతకము1. అతిభయంకర మగు కుష్టు రోగముచే, దేహ మనసియున్న సమయమున ననవద్యమగు భక్తిప్రపత్తులతో సూర్యుని స్తుతించి, తనరోగమును బాపుకొనిన మయూరుడు, కవిత్వము సరా దింత మహత్త్వమున్నదని ప్రథమముగా లోకమునకు చాటినాడు. ఆతడు క్రీ. శ. 620 ప్రాంతమువాడు-ఈ పదమూడు శతాబ్దులనుండియు, సంస్కృత సాహితీ ప్రపంచమున-నాడును నేడును ప్రసిద్ధుడై యున్నవాడు.
మయూర కవివాగ్గుంభన మతిపౌఢమైనది - ఈ సూర్యశతకము కావ్య ప్రశస్తిని బడసినది- ఆనందవర్థనుడు మొదలుగా నాలంకారికు లెల్లడను దీని నుండి యుదాహరించిరి. దీనికి, పదునాలుగు వ్యాఖ్యలున్న పన్నచో దీని విశిష్టత తేటపడగలదు- ఇది ఖండాంతర భాషలలోను పరివర్తిత మైనది.
భారత వర్షమున, తక్కిన ప్రాంతముల కన్న ఆంధ్రదేశమున నీ సూర్యశతకము ప్రచుర ప్రచారము బడసినది. దీని వ్యాఖ్యాతలలో మువ్వు రాంధ్రులు- దీనిని ననుసరించి, సంస్కృతమున - వారణాసి ధర్మసూరి, లింగ కవి, చదలువాడ సుందరరామ శాస్త్రి - స్రగ్ధరావృత్తములతో శతకములు రచించిరి. సుప్రసిద్ధాంధ్ర దేశీయాలంకారికుడు, జగన్నాథ పండితరాయలు - సుధాలహరి దీనిననుసరించి స్రగ్ధరలలోనే రచించెను.
- 1మయూరుని గూర్చి అతని సూర్యశతకమును గూర్చి విపులమగు పరిశోధనచేసి, "మయూరమహాకవి-ఆంధ్రవాఙ్మయము." అను గ్రంథము రచించితిని. అది ముద్రితము కావలసి యున్నది.
సూర్యశతకము - తెలుగు కవులు
మయూర కవి సూర్యశతకమును తొలుత తెలుగువారికి పరిచయము చేసినవాడు శ్రీనాథమహాకవి. అతడు కాశీఖండమున 15 శ్లోకములను నాంధ్రీకరించినాడు. భీమ ఖండమున శివరాత్రి మాహాత్మ్యమున మరి రెండు శ్లోకములను తెనుగు చేసినాడు. విశేష మేమనగా, సంస్కృతమున, మయూరకవి రచన యెంత ప్రౌఢమో, తెలుగున శ్రీనాథమహాకవి రచన - అంత ప్రౌఢముగా సాగినది.
సంపూర్ణానువాదములు
అద్యతన కాలమున - క్రీ. శ. 1893 నుండియు తెలుగున సంపూర్ణానువాదములు ప్రారంభమైనవి. ఈ క్రిందివారి యనువాదములు లభ్యమగుచున్నవి.
- ఆకుండి వ్యాసమూర్తి శాస్త్రి గారు (1893)
- వడ్డాది సుబ్బారాయుడుగారు--(1899)
- దాసు శ్రీరాములుగారు
- యామిజాల పద్మనాభస్వామిగారు
- చదలువాడ జయరామ శాస్త్రిగారు
- నేమాని సూర్యప్రకాశకవిగారు
వానిలో మూడవది యగు - దాసు శ్రీరామ కవీంద్రుని యనువాద విధానమును గూర్చి యీ పీఠికలో వివరించుచున్నాను.
ఈ యనువాదము క్రీ.శ. 1902లో ప్రకటితమైనది కాబట్టి సూర్యశతకానువాదములలో మూడవది. శ్రీరామకవిగారును, పై రెండనువాదములు పరిశీలించియే, తాము తిరిగి దీని ననువదించుటకు పూనుకొనిరి. వ్యాసమూర్తి శాస్త్రిగారు, గొప్ప సంస్కృతపండితులగుటచే, వారియనువాదము తెనుగు కాకపోయినది-వడ్డాది సుబ్బారాయడు గారు, సహజముగా కవులగుటచేత, సంస్కృత మూలమున గల గంభీరార్థములు తెలుగులోనికి రాలేదు-అందువలన శ్రీరామకవిగారు సూర్యశతకమే గాక, వ్యాఖ్యానములను పరిశీలించి మయూర కవి కృతిని పూర్వరీతిగా-అనువాదములు గాక-తెనుగు గావించిరి. మహా గంభీరమైన మయూరకవి భావములను తెలుగువారికి తేటతెల్లము గావించిన యశస్సు, మయూర శతకానువాదకులలో నొక్క శ్రీరాములు గారికే దక్కినది. వా రెట్లు మూలశ్లోకములను తెలుగు చేసినారో చూపుటకు ప్రథమ శ్లోకానువాదములను నిచ్చుచున్నాను.
"జంభారతీభకుంభోద్భవ దధతం సాంద్రసిందూరరేణుం
రక్తస్సిక్తా ఇవమైరుదయ గిరితటే ధాతుధారాద్రవస్య
ఆయాంత్యాతుల్య కాలం కమలవనరుచే వారుణావిభూత్యై
ర్భూయాసుర్భానయంతో భువన మభినవాభానవో భానవీయాః
వసురాయడు:
శ్రీజంభారికరీంద్ర కు౦భయుగళీ సిందూర శుంభద్రజో
రాజవ్యాప్తినొ, ప్రాగహార్యతట నిర్యద్ధాతు ధారాద్రవ
స్రాజస్రార్ద్రతనో, సరోద్గమ సరోజాభాప్తినో పొల్చు తత్
భ్రాజన్నవ్యజగద్విభాసి ఘృణు వైశ్యర్యంబు మీ కిచ్చుతన్.
తూర్పుదిక్కున కధిపతియగు ఇంద్రునియైరావతము కుంభముల నుంచిన సిందూర రేణువులవలెను, ఉదయగిరి నుండి స్రవించుచున్న జేగురు ధారల వలెను, కమలవనము నుండి ప్రకాశమానమగు శోణకాంతివలెను నొప్పు నెఱునైన సూర్యకిరణములు మీకు శ్రేయస్సుల నిచ్చుగాక - అని తాత్పర్యము.
పై వసురాయనిపద్యమంతయు సంస్కృతభాషామయము- మూలమువలె మనకు తెలుగులో నున్నను నర్థము కాదు-అర్థము కాకపోవుట సరికదా, మూలముకన్న కొన్ని యధికముగా, నర్థస్ఫోరకముగాని పదములు యతిప్రాస నిర్బంధమువలన ప్రయుక్తము లైనవి.
వ్యాసమూర్తి శాస్త్రి గారు:
చ. తొలుదెస హ త్తికుంభములఁ దోరపుఁ జెందిరపుం న్రజంబునన్
ఐలె నుదయాద్రి సానువుల భాసిలు జేగురు టేటివెల్లువన్
బలె నపు చొప్పు నంబుజనిభంబలె నెఱ్ఱని డాలు మీఱు వే
వెలుఁగు వెలుంగు మీకు శుభవృద్ధి నిరామయసిద్ధిఁ జేయుతన్.
శా.జేజేరాయని కుంభి కుంభగతమౌ సిందూరముల్ తాల్చియో
యోజం జేగురుకాంతు లయ్యుదయ శై లోపాంతమం దంటియో
రాజీపప్రభ లేకకాలమున ప్రారంభించియో యెఱ్ఱనై
తేజుల్ గ్రమ్ము నవార్కఖాను లిడు నెంతే మీకు నైశ్వర్యముల్.
ఇందు మూలమునందలి ప్రతిపదము తెలుగులో నర్ధస్ఫురణతో నిలిచి, మనకు మూలశ్లోక భావము చక్కగా వివృతమై స్వతంత్ర రచనవలె భాసిల్లుచున్నది. మన ప్రాచీన కవులు సంస్కృత శ్లోకానువాదము చేసినప్పు డే పద్ధతి నవలంబించి, దానిని 'తెనుగు'గా చేసిరో శ్రీరాములుగారు నాపథకమునే యనుసరించిరి. పై పద్యమువలన శ్రీరాములు గారి యనువాదమున
- ప్రథమ విశిష్టత- తెనుగు దనము.
- రెండవది-భావవివృతి
దత్తానందాః ప్రజానాం సముచిత సమయాకృష్ణసృష్టైః పయోభిః
పూర్వాహ్నే విప్రకీర్ణా దిశిదిశి విరమ త్యహ్ని సంహారభాజః
దీప్తాంశోద్దీర్ఘ దుఃఖ ప్రభవభయభయోదన్య దుత్తార నావో
గావోవః పావనానాం పరమ పరిమితం ప్రీతి ముత్పాదయంతు.
ఈ శ్లోకమున శ్లేషోపము.
సూర్యకిరణ పక్షము | ధేనుపరము |
పయోభి:-జలము | పాలు |
సముచిత సమయం-ప్రాతఃకాలము | వర్షాదికాలములయందు |
పూర్వాష్టే విప్రకీర్ణా-మధ్యాహ్నమున చెదరిపోవును | మధ్యాహ్నము మేతకు బోవును |
సంహారరాజః-ఉపసంహృతి బొందును | సాయంకాలము ఇండ్లకు చేరుకొనును. |
సూర్యకిరణములు ప్రాతః కాలమున జలాదికములనిచ్చి, మధ్యాహ్నమున వ్యాపించి, సాయంకాలమున ఆస్తమించును. గోవులు ప్రొద్దుట పాలిచ్చి, మేతకుపోయి సాయంకాలము తిరిగివచ్చును. సూర్యకిరణ కాంతివలన దేవతాపరమైన కర్మల నాచరించి సంసార క్లేశము నుండి నరులు విముక్తులగుదురు. ఆవుపాలవలన దైనవిహితకర్మలను చేసి నరులు ముక్తిమార్గములను పొందుదురు. దీనికి వ్యాసమూర్తి శాస్త్రిగారి యాంధ్రీకరణము చూడుడు.
మ.సమయాకృష్ణ విసృష్ట పుష్కల వయస్సంప్రీతాత్మ ప్రజ
మ్మమితాఘ ప్రభవర్భవాబ్ధి కలమున న్ప్రా౦చత్సవిత్రోధిరా
జము ప్రాహప్రతిదిక్ప్ర కీర్ణము పునస్సాయం నివృత్తమ్ము గో
సమజ మర్కజ మిచ్చు మీ కమిత హర్షశ్రీ ప్రకర్షమ్ములన్.
ఉ.కాలమునుం బయస్సులను గాంచి యొసంగి ప్రజాసుఖం బిడున్
జాలఁ జరిఁచు ప్రొద్దుట, నికన్ విరమించును, దీర్ఘ దుఃఖజం
బాలభవాబ్ధి కోడలు సుమీ రవి గోవులు భవ్యపావన
త్వాలము లవ్వి మీకుఁ పరమాధిక తుష్టిని పుష్టి నిచ్చుతన్. 9ప.
ఇందు 'రవిగోవులు' అనుట యెంతో చక్కగా నున్నది - రవిగోవులు సూర్యకిరణములు-సూర్యుని గోవులు ధేనువులు అను అర్థద్వయ మప్రయత్నముగా లభించుచున్నది. 'దీర్ఘదుఃఖ ప్రభవభవ భయోదన్య దుత్తారనావో' అను మూలమునకు రెండు పక్షములు.
"దీర్ఘదుఃఖ జూడాలభవాబ్ధి కోడలు సుమీ రవిగోవుల"నుట యత్యంతము నన్వర్థమై మనోహరముగా నున్నది. మూలమున శ్లేషోపమాలంకారము గలదు. ఈ యనువాదమున కూడ అలంకారము లేకపోలేదు. అందలి శ్లేషోపమ యిందు రూపకాలంకారమైనది. ఇది శ్రీరామ కవిగారి అలంకారశాస్త్ర పరిజ్ఞానమును వ్యక్తపఱచును.
3. పద ప్రయోగ నైపుణ్యము.
తత్సమపదములను ప్రయోగింపక, తిక్కనవలె, యలతి యలతి తెలుగు పదములతో మూలభావమును వెల్లడి సేయుట యిందు చాలగా గలదు.
మూర్ఖ ద్ర్యెధాతురాగః తరుషు కిసలయో విద్రుమౌఘ స్సముద్రే
దిజ్మాతంగో త్తమాంగే ష్వభినవ నిహితస్సాంద్ర సిందూర రేణు
సీమ్నివ్యోమ్నశ్చ హేమ్నస్సుర శిఖరి భువో జాయతే యః ప్రకాశః
శోణిమ్నాసౌ ఖరాంశో రుషసి దిశతు కశ్శర్మ శోభైక దేశః. 41 శ్లో.
కొండలయందు జేగురులు, చెట్లకు చిగుళ్ళు, సంద్రమున పగడములు, దిగ్గజమున సిందూరములు-నై మేరు పర్వతమునకు నెఱదనము కలిగించు బాల సూర్య కిరణములు మీకు శ్రేయస్సు ప్రసాదించును. దీనికి వ్యాసమూర్తి శాస్త్రిగారి తెనుగు సేత.
మ. జలధి న్విద్రుమముల్, ద్రుమాళిఁ జివురుల్ శైలంబునం జేవురుల్
బలభిత్కుంభిశిరంబులం దభినవ ప్రత్యగ్ర సిందూర ధూ
ళులు వింటన్వరు వింటిపైఁడి తళుకుల్ శోణద్యుతిన్ భాను డీ
ప్తిలవంబుల్ వఱువాత నేవలి భవత్ప్రీత్యావహం బయ్యెడిన్.
ఇందు వృత్తము పెద్దది యగుటచే, యతి ప్రాసావసర పదప్రయోగము చేయబడినది-మూలమున “హేమ్నస్సుర శిఖరి" అనగా మేరుపర్వతము. శాస్త్రిగారి తెలుగులో "హరువింటి పైఁడి తళుకులు" అని కలదు- ఇట హరువిల్లు అనగా మేరువని యర్థము చేసికోవలెను - త్రిపురాసుర సంహారమున మేరువు శివుని విల్లు పదము ప్రయుక్తమైనపుడు ప్రసిద్ధార్థము వెంటనే స్ఫురింపవలెను-ఇందట్టులేదు. పాఠకుకు పద్యభావము సుగమము గాదు - శ్రీరామ కవిగారు దీనిలోని భావములను చంపకమాలలో నెంత చక్కగా నిమిడ్చినారో చూడుడు.
చ. మలలకు మీఁది జేగురులు, మ్రాఁకులయందుఁ జీవుళ్ళు వార్థిచా
యలఁ బగడంబులున్ దేసల హత్తుల నెత్తులఁ జెందిరంపుఁ బూఁ
తలు దివి మేరు శైలభువిఁ దప్త సువర్ణములైన సూర్య ర
శ్ముులుదయ కాలశోణములు సొంపులు నింపుల మీకు నింపుతన్.
ఇంకొక యుదాహరణ.
చ."జ్యోత్స్నాంశాకర్ష పాండుద్యుతితిమిరమషీ శేషకల్మాష మీష
జ్జృంభోద్భూతేన పింగం సరసిజరజసా సంధ్యయా శోణళోచి:
ప్రాతః ప్రారంభకాలే సకలజగ మివ చ్చిత్ర మున్మీలయంతీ
కాంతిస్తీక్ష్ణోత్విషోక్షాం ముదమపనయతాత్తూలి కేవాతులాం ప.26శ్లో.
తఱిపి వెన్నెలలోని తెలుపు, మిగిలిన చీకటియందు నలుపు తమ్మి మొగ్గల పుప్పొడి పచ్చవర్ణము - పొడుపు సంజయందలి ఎఱ్ఱు రంగు కలిపి చిత్రము వ్రాయు తూలికవలె నున్న - లేతయెండ మీకు సిరు లిచ్చును. దీనికి శ్రీరామకవిగారు -
చ. తెల తెలఁ బాఱు వెన్నెలద్యుతిన్ రవచీకటి నల్లనల్లఁగాఁ
బలుచని తమ్మి పుప్పొడిని పచ్చదనంబునఁ బ్రొద్దుపోడ్పునం
గలననుఁ గెంపుదాయల జగంబులఁ జిత్తరు వ్రాసినట్టి మే
ల్కల మగు భానుదీపి యతుల ప్రమదం బిడు మీఁదు చూడ్కికిన్.
(సూర్యరాయాంధ్ర నిఘంటువు 3వ సంపుటము పుట 924. తూలిక. సం వి. ఆ.స్త్రీ. నా చిత్తరు వ్రాసెడు కుంచె....3 వ్రాసెడు కలము.)
4. మూలశబ్దానుసరణము.
సూర్యశతకమునందలి మూలభావములను తాత్పర్య రూపమున తెలుగు చేయుటయేకాక నచ్చటచ్చట శబ్దానుసరణము గావించి యున్నారు. మూలమున వృత్యనుప్రాసము గల శ్లోకములు గలవు. ఈ యలంకారమును శ్రీరామకవిగారు పాటించియే యున్నారు.
వ్యగ్రైరగ్యగ్రహోడు గ్రసన గురుభరైర్నో సమగ్రై రుదగ్రై
ప్రత్యగై రీషదు గ్రై రుదయగిరిగతో గోగణై ర్గౌరయన్గామ్
ఉద్గాఢార్చి ర్విలీనామర నగర నగగ్రావ గర్భామివాహ్నా
మగ్రేయోగ్రే విధత్తే గ్లపయతు గహనం సగ్రహ గ్రామణీర్వః. 98శ్లో
వ్యగ్రము లగ్ర్య సుగ్రహ భహరి గురుల్ సముదగ్రలీలఁ బ్ర
త్యగ్రము లీషదుగ్రములు నౌ నురుగోవుల గోవుగౌరతా
భాగ్రతిఁ బ్రాగ్గిరి న్నిలిచి పాఱ్చి సరాగసురాగగాదినం
బగ్రమునందు జేసెడి గ్రహాగ్రణి మీకగు నగ్రగస్థితిస్.
5. ప్రసన్న రచన.
కిరణ వర్ణనము
నోజన్వాన్ జన్మభూమిః నతదురభువో బాంధవాః కౌస్తుభార్యాః
పాణా పద్మనయాస్యా నచనరకరిపూరస్థలీ వాసవేశ్మః
తేజోరూపాపరైన త్రిమ భువనతలే ష్వాదధానాం వ్యవస్థా
సా శ్రీ శ్రేయాంసి దిశాదశిశిరమహసో మండలా గ్రోద్గతా వః
ఉ. పుట్టదు సంద్రమం దచట బుట్టిన కౌస్తుభ ముఖ్యవస్తువుల్
చుట్టలుగావు పద్మమును జూడము చేతుల విష్ణు వక్షమున్
ముట్టదు లాతీదే వెలుఁగు ముజ్జగమందు వ్యవస్థ లేర్పడన్
బుట్టెను మండలాగ్రమునఁ బూషున కా సిరి మీకు మేలిడున్. 43ప
ఆశ్వ వర్ణనము
ధున్వంతో నీరాదాళీః నిజరుచిరచిరాః పార్శ్వయో పక్షతుల్యా
సాలూత్తా నైః ఖలీనై ఖచితరుబా శ్చ్యోతతా లోహితేన
ఉడ్డీయేవ వ్రజంతో వియతి జనవళా దర్కవాహా క్రియాసః
క్షేమం హేమాద్రిహృద్య ద్రుమశిఖరశిరశ్రేణి శాఖాశుకావః. 49శ్లో.
చ. తమరుచిచేత పచ్చనగు తట్ల మొగుళ్ళను ఱెక్క లొప్పఁ గ
ళ్ళెములను లాగ నెత్తురులు లేచిన నోళ్ళకు ముక్కు లోప్ప వ్యో
మమునను దుఱ్ఱు మంచు వడిఁ బాఱు సుమేరుశిఖాగచారి కీ
రము లన నొప్పు సూర్యుని గుఱాలు వరాలు సరాలు మీ కిడున్. 49ప.
అనూరు వర్ణనము
పౌర స్త్యస్తోయదర్తో పవన ఇవ పతన్ పావక స్యే మధూమో
విశ్వస్యేవాదిసర్గః ప్రణవ ఇవ పరం పావనో వేదరా శే|
సంధ్యా నృత్యోత్సవేచ్ఛోరివ మదనరిపుర్నంది నాందీనినాదః
సౌరస్యాగ్రేసుఖం తో వితరతు వినతానందన స్యందనస్య.55శ్లో.
వానకుఁ దూర్పుగాలివలెఁ బావకకీలకు ధూమమట్లు లో
కానకు నాదిసృష్టి గతిగా శ్రుతిరాశికి నోంకృతి స్థితిన్
భానుని గ్రుంకునందు నటనం బిడు శూలికి నంది నాందిలా
నై నళినాప్తుతేర్నడపు నవ్వినతాత్మజుఁ డేలు మిమ్ములన్. 55 శ్లో.
రధ వర్ణనము
నఁతుంనా కాలయానా మనిక ముపయతాం పద్ధతి పంక్తిరేప
క్షోదో నక్షత్రరాశే రకృశరయమిళ చ్చక్రపిష్టస్య ధూళిః
హేషాహ్రాదో హరీణాం సురశిఖరిదరీః పూరయ న్నేమినాదో
యస్యావాత్తీవ్రభానో స దివి భువి యథా వ్యక్తచిహ్నేరథోవః. 69శ్లో .
ఉ. మ్రోక్కగవచ్చు దేవగణముఖ్యుల చాలది త్రోవ గాఁగ నా
చుక్కలు చక్రఘట్టనను జూర్ణముగా నది దుమ్ముగాఁగ బల్
నెక్కొను వాజి హేష దివి నిండిన నేమి రవఁబు గాఁగ మి
న్న క్కు తలంబు బోలఁగ నొనర్చిన యర్కురథంబు మీ కగున్. 69ప.
మండల వర్ణనము
చక్షుర్ధక్ష ద్విషోయం న తు దహతి పరం పూరయత్యేవ కామం
నాస్తం జుష్టం మరుద్భిర్యదిహని యామినా యానపాత్రం భవాబ్దే
య ద్వీతశ్రాంతి శశ్వత్ భ్రమతి జగతాం భ్రాంతిమత్ భ్రాంతిహన్తి
బ్రధ్నస్యావ్యా ద్విరుద్ధక్రియ మపి విహితాధాయి తన్మండలంవః. 80శ్లో.
చ. పురహరునేత్ర మయ్యు నెఱపు న్నిరవద్యతఁ రామపూర్తి సం
సరణ సముద్రనావ యయి జౌకదు గాలికి నెల్ల వేళలం
దిరిగియు నభ్రమంబు జగతిం భ్రమనాళి విరుద్ధకార్యమై
సరసము సూర్యమండలము శాశ్వతసౌఖ్యము మీకు నిచ్చుతన్. 80 ప.
రవివర్ణనము
దేవః కిం బాంధవస్యాత్ ప్రియ సుహృదథవాచార్య ఆహోస్వీదర్యో
రక్షా చక్షుర్నిదీపో గురుయుత జనకం జీవితం బీజమోజః
ఏవం నిర్ణీయతే యః కి మపి న జగతాం సర్వదా సర్వదోసౌ
సర్వాకారోపకారీ దిశతు దశశతాభీశు రభ్యర్హితం వః. 100 శ్లో.
ఉ. చుట్టము పక్కముం గురువు చూపును గాపును జ్ఞాతి జ్యోతియున్
పట్టగు ప్రాణదాతయును భ్రాతయు తల్లియుఁ దండ్రియున్ సదా
పెట్టని కోటయై సకల పృథ్వికి నన్నము నీళ్ళు నిచ్చుచున్
దిట్టవు వెల్లులం దనరు దేవుడు మీ కిడు వాంఛితంబులన్.100 ప.
యతి, పద ప్రయోగములు
శ్రీరామకవిగారు మహాకవులే గాక, ప్రాచీన మహాకావ్యలక్ష్య లక్షణ పరిజ్ఞానము గల మహావిద్వాంసులు. వారి దేవీభాగవత వీఠికలో, వ్యాకరణచ్ఛందో విశేషముల నెన్నింటినో వివరించినారు.
యతులు
ఇందు వా రుపయోగించిన కొన్ని యతులు చూడుడు.
జ్ఞ - క యతి - కనురుచివంటి భాస్కరుడు జ్ఞానదయాదుల మీకు నిచ్చుతన్ 24 ప.
మ - వ యతి - దీవులు వెలిగించు దీపము మిమున్ రవిదీప్తి సుఖింపఁజేయుతన్ 28 ప.
మహిమ దహించు నర్యముని వార్వపుబంతి శుభంబు మీకిడున్. 47 ప.
ద్వారశబ్దమున కచ్చుతో యతి
అప్పకవీయమున నొకటే యుదాహరణ మీయబడినది.
"ద్వారమునం దడంగ నరుణాఖ్యుఁ డదల్చిన. 48 ప.
"అమరిన పెద్ద చుక్కలకు ద్వారనగంబులు." 70 ప.
పదములు
- ధోరము - ప్రా. తెలుగుతోరము - శ్రీరామకవిగారు ప్రాకృత పదమునే వాడినారు. 'కంకణధోరము గట్టి' 47 ప
- జలిది – జల్దీ - అన్యదేశ్యము - త్వరగా "ఛలో ఛలో జలిది" 61 ప.
- సుధాభుక్కులు - సుధా భుక్కులు - అని ప్రాస. పదస్వరూప నిర్ధారణ. 64 ప.
- ప్రప్రీతుఁడు - ఉపసర్గ సంవిధానము - ఉపసర్గ సంవిధానము శ్రీనాథునికి మాత్రమే గలదు. తిరిగి శ్రీరామకవిగారికి మాత్రమే గలదు. అందువలననే చెళ్ళపిళ్ళవారు శ్రీరామకవిగారిని "ఆపర శ్రీనాథుడు" అని ప్రశంసించినారు.
మూలము - వివరణ
సంస్కృత సూర్యశతకమున నూఱు శ్లోకములు గలవు. అవి అన్నియు స్రగ్ధరావృత్తములు.
ఈ శతకమున: కిరణవర్ణనము 43, ఆశ్వవర్ణనము 6. అనూరు వర్ణనము 12, రథవర్ణనము 11, మండలవర్ణనము 8, సూర్యవర్జనము 20 శ్లోకములు గలవు.
ఈ స్రగ్ధరావృత్తము లన్నియు, ఆశీస్సు అంతముగా గలవి. అనగా ప్రతి శ్లోకమును మీకు శ్రేయము ప్రసాదించుగాత! అన్న ఆశీస్సుతో ముగియును. ఇందువలన తెలుగుపద్యములును ఆశీస్సులతో నుండును.
ఇంకను చెప్పవలసిన వనేకము లున్నను గ్రంథవిస్తరభీతిని విరమించితిని.
శ్రీరామకవిగారి సూర్యశతకానువాదము తెలుగు సీమలో వ్యాప్తిని బడయు గాక!
- నిడుదవోలు వేంకటరావు -