సూర్యశతకము (తెలుగు)/నివేదనము
నివేదనము
గ్రంథకర్త శ్రీ దాసు శ్రీరాములుగారు క్రీ. శ. 18వ శతాబ్ది ఉత్తరార్ధమున తెలుగుదేశమున జీవించి, ఆంధ్ర సాహిత్యమును తమ అమూల్యమైన రచనలచే అలంకరించిన మహాకవి. శ్రీరామకవి కవితావ్యవసాయము శ్రీనాథకవి వలె పండ్రెండవయేటనే ప్రారంభమైనది. శతకములు, ప్రబంధములు, పురాణములు, నాటకములు, శాస్త్ర గ్రంథములు - ఇట్లైన్నో ప్రక్రియలలో వారు రచనలు గావించియుండిరి. శ్రీరామకవీంద్రుల కృతులిప్పుడు పాఠకలోకమున కందుబాటులో లేవు. వానిని పునర్ముదించి ప్రజలకందించు దృష్టితో, దాసు వంశము నందు జన్మించి ఆ మహాకవియశస్సును వారసత్వముగా ననుభవించుచున్న మేమందరము కలిసి "మహాకవి దాసు శ్రీ రాములు స్మారకసమితి"ని హైదరా బాదులో 1978వ సం॥ డిసెంబరునెలలో స్థాపించితిమి.
మా ప్రచురణ కార్యక్రమములో మొదటిది తెలుగువారి నాటి యాచార వ్యవహారములను దెలియుట కుపకరించు పద్య గ్రంథము “తెలుగు నాడు." రెండవది వారి వచనకృతి "అభినవ గద్మ ప్రబంధము." ఈ గ్రంథము విశ్వ విద్యాలయపరీక్షలకొఱకే ప్రత్యేకముగా రచితమైననూ, ఆ కాలమునందలి వచన గ్రంథ రచనావిధానము ననుసరించి విద్యార్థులకేగాక విద్వాంసులకుగూడ నుపయుక్త మగునట్లు రచింపబడినది. తదుపరి వారి జయంతి సంచిక 1975 లో ప్రఖ్యాత రచయితల వ్యాసములతో 'ప్రపంచ తెలుగుమహాసభల' సందర్భములో ప్రచురించితిమి. ఆంధ్రదేశములో ఆనస్యమైన ప్రాశస్త్యము పొంది గ్రంథ కర్తకు 'మహాకవి' యను బిరుదమును సమకూర్చిన "శ్రీ దేవీభాగవతము"ను గతసంవత్సరము ముద్రించి ప్రచురించగల్గిన సుకృతము మా సమితికి కలిగినది.
మయూరకవి సంస్కృతమున రచించిన సూర్యశతకము తెలుగు అను వాదము శ్రీరాములుగారు గావించి, 1902 సం॥లో ప్రచురించిరి. కళాప్రపూర్ణ శ్రీ నిడుదవోలు వేంకటరావుగారు వ్రాసి యిచ్చిన తాత్పర్యసహితముగా ఈ పర్యాయము సూర్యశతకమును ప్రచురించుచున్నాము. పద్యములకు సులభ శైలిలో తాత్పర్యము వ్రాసి యిచ్చినందుకు వారికి మా సమితి కృతజ్ఞతలు. ఈగ్రంథమున ముద్రణాస్థాలిత్యములు లేకుండునటుల సరిచూచిన డాక్టరు జి.వి. సుబ్రహ్మణ్యంగారికి మా కృతజ్ఞతాభివందనములు.
దాసు పద్మనాభరావు
అ ధ్య క్షు డు
మహాకవి దాసు శ్రీరాములు స్మారక సమితి.
హైద్రాబాద్
17-10-1979