సూర్యశతకము (తెలుగు)/కిరణ వర్ణనము

సూర్య శతకము

కిరణ వర్ణనము

శా.జేజేరాయని కుంభికుంభగతమౌ సిందూరముల్ తాల్చియో
యోజం జేగురువాగు లయ్యుదయశై లో పొంతమం దంటియో
రాజీపప్రభ లేకకాలమునఁ బ్రారంభించియో యెఱ్ఱనై
తేజుల్ చిమ్ము నవార్కభాను లిడు నెంతే మీకు నైశ్వర్యముల్.

తా. తూర్పు దిక్కున కధిపతియగు నింద్రుని యైరావత కుంభములకు పూసిన సిందూరము వలెను, ఉదయ పర్వతము నుండి కారుచున్న జేగురు ధారల రీతిని, తామరపూవుల నూతన కాంతిని ఎఱ్ఱనైన సూర్యకిరణములు మీకు సిరులు నొసగు గాత.[1]

ఉ. తామర మొగ్గ పెన్గొఱఁడుఁ దప్పని లక్ష్మిని భక్తకోటికిన్
బ్రేమ నొసంగు లాగఁ దలపెట్టియొ తద్వని ముట్టడించుచున్
భీమతమంబునం దగిలి భీతిలు లోకముఁ బ్రోవ జాణలౌ
కోమల పల్లవాభ రవిగోనిచయంబులు మీకు మే లిడున్.

తా. ముకుళించుకొని యున్న తామర మొగ్గలలోని లక్ష్మిని లోకమున కందించు తలంపున కటిక చీకటిని చీల్చుచు, ఆ లక్ష్మిని మానవుల కందించుచు, కోమలములై ఎఱ్ఱనైన చిగురుల బోలిన సూర్యప్రభలు మీకు శోభనము లొనగూర్చు గాత.[2]

ఉ. కోమలపద్మగర్భములఁ గొండల శాతశిఖాళి నొక్క మై
మైమును ప్రొద్దుజోల మునుమాపుల వ్రాలి యొకించుకోని వి
శ్రామము లేక ముజ్జగముశాల నటించి సదా పథశ్రమో
ద్దామత నా, మహోష్ణిమము దాల్చు రవిప్రభ లేలు మిమ్ములన్.

ప్రొద్దున, సాయంతనమున మృదువైన పద్మ గర్భముల యందు కఠినమైన కొండ శిఖరములయందును, సమముగా నిల్చుచు విశ్రాంతి లేక, ముడు జగంబులను పర్యటించు, సూర్యకిరణ కాంతులు మిమ్ముకాపాడు గాత. [3]

చ. తమ మను పైదుకూలములు తప్పి యనావృతమైన జంతు బృం
దము గని భాస్కరుండు గరతంతుల సాచినఁ దత్ క్షణంబు ద
ట్టమయి క్రమక్రమంబున స్ఫుటంబయి దిగ్దశకంబు పేరి మ
గ్గములను నిండు క్రొమ్మడుఁ గకల్మష మీవుత మీకు భద్రముల్.

తా. చీకటి యనెడి బట్ట తొలగిపోగానే జంతువులను కరుణించి తన కిరణములను తంతువులచే, క్రొత్త బట్టలను కల్పింపజేసి, దశదిశలను మగ్గములను, తమకాంతిని నిండించిన బాలభానులు మీకు శుభంబు లిచ్చుగాత.[4]

చ. పతిరుచి దూలిన న్బొగిలి వాడిన యోషధి పిండు దెప్పున
ట్లతులిత సూర్యకాంతశిఖి, యాది నెదుర్కొన లేచినట్లు ప్రాక్
క్షితి భృతు తాళ్లు పక్షవినికృంతన నెత్రులుగాఱఁ జూపున
ట్లతనుత నెక్కు నర్కు నరుణాంతులు మీకును గీడు వాపుతన్.

తా. చంద్రు దస్తంగతుడు కాగా, ఓషధీసతి కళ తగ్గిపోగా సూర్యకాంతములయం దగ్ని స్వాగతమీయగా, మేరుపర్వతము రెక్కలు ఖండించినపుడు కారునెత్తురు వలె, నెఱ్ఱనైన యర్కుని కిరణములు మీకభ్యుదయము నిచ్చుగాత.[5]

ఉ. ముక్కి ఁడి గుంటు మొండి వ్రణి మూలుఁగు వానిని దోషకారి నే
యొక్కఁడు సక్క నేయుఁ దెపులోఱిచి తక్కక యట్టి సద్దయా
దృక్కలితార్కు సిద్ధగణ దృష్టమహార్ఘ్యములైన యంశువుల్
గ్రక్కున మీ దొసంగులు విఘాతములై చనఁజేయఁ గావుతన్.

తా. కాళ్ళు, చేతులు, ముక్కు తెగి, మూలుగుతున్న రోగిని తానొక్కడే తనకిరణములచే చక్క జేయు కరుణాకరుండగు కంజహితుడు మీకు భద్రములు చేకూర్చుగాత.[6]

ఇచ్చట సూర్యకిరణ ప్రసారము వలన కుష్టరోగము నిర్మూలమగుట సూచితము. సూర్యశతకకర్త యగు మయూరుడు కుష్టవ్యాధి బాధితుడై సూర్యస్తుతి చేసి నిరామయుడయ్యెను. నేడును కుష్ఠరోగములకు, సూర్యకిరణ చికిత్స తప్ప వేఱు చికిత్స లేదు.

చ. తొలుతను గుజ్జులై పిదప దొడ్లయి యాదట భూనభోంతరా
కలితములై యనంతరము గ్రక్కున దిగ్దశకంబు ముట్టి య
బ్బలిదనుజేంద్రు నంటి యల ధ్వాంతము విశ్వమునుండి వాపి శ్రీ
చెలువుని దెప్పు నర్యముని చేతులు మీ దొసఁగుల్ హరించుతన్.

తా. మొట్టమొదట పొట్టివియై, క్రమముగా పొడుగై ఆవెనుక నాకాశము నాక్రమించి, దశదిశలు నిండి, ఆనాడు బలిచక్రవర్తిని నడగద్రొక్కిన త్రివిక్రముడగు విష్ణుమూర్తి వలె వ్యాపించిన సూర్యుని కరములు మీ పాపములను బాపుగాత.[7]

చ. ఆరుణుని కెంపుచాయల మహారుణిమున్ బహుళంబు చేసి య
య్యరదపు గుఱ్ఱముల్ మొగము లలన నెత్తిన నోళ్ల గళ్ళెపుం
గఱపుల ర క్తరోచులయి గట్లకుఁ గూటము లంటనెక్కి శే
ఖరతను గాంచి రేపు దివిఁ గ్రాలు నినప్రభ మీకు మేలిడున్.

తా. అరుణుని కెంపుదాయలకు నెక్కుడుశోభ గల్పించి, రథమునకు గట్టిన గుఱ్ఱములనోళ్ళ నున్న కళ్లెములవలన దవడల చివరలు తెగి రక్తము వలె, నెఱ్ఱనై ఆకాశ వీధి విహరించు సూర్యాంశువులు మీకు సుఖ మిచ్చుగాత. [8]

ఉ. కాలమునం బయస్సులనుఁ గాంచి యొసంగి ప్రజాసుఖంబిడన్
జాలఁ జరించు ప్రొద్దుట నిశ న్విరమించును దీర్ఘదుఃఖ జం
బాల భవాబ్ధి కోడలుసుమా రవి గోవులు భవ్యపావన
త్వాలఘు లవ్వి మీకుఁ బరమాధికతుష్టిని, బుష్టి నిచ్చుతన్.

తా. ప్రొద్దుటనే పాలనిచ్చి, ఆ వెనుక దిక్కులకు మేతకై పోయి సాయంకాలము కాగానే, ఇల్లు చేరు గోవుల వలె, తెల్లవారగానే చైతన్యమును కలిగించి, సాయంకాలము వఱకు లోకమునకు శోభకలిగించి, సంసార సముద్రమును దాటుటకు నావలైన సూర్యుని గోవులు (కిరణములు) మీకు భద్ర మిడుగాక. సంస్కృతమున గోశబ్దమునకు ఆవు అని, కిరణమని రెండర్థములు గలవు.[9]

ఉ. చేతులు మోడ్చి యౌదలలఁ జేర్చి త్రిసంధ్యల మ్రొక్కువారిక
త్యాతత బంధమోక్షకరణారిక బోధము నంబుజాశఁ 'బ్ర
ఖ్యాతము సేయు నాఁ బరగు కల్మషభేదులు సూర్యు నంశువుల్
ప్రీతిని నిర్వికల్పముగ మీ మది కోరికలిచ్చు గావుతన్.

తా. సంసార బంధములను తొలిగించి మోక్షమునకు మార్గము చూపుచు,పాపములను సంహరించు సూర్యకాంతులు ప్రాతః కాలముననే స్నానము చేసి, సూర్యునికి మ్రొక్కువారికి నెల్లప్పుడు నుల్లాసము గల్పించును.[10]

ఉ. లేవడిఁ బైఁడి సోనలు, లలి౦బతనంబునఁ జేతికఱ్ఱ లా
త్మావగమంబు దివ్వె సురధామము బోపను బెద్దదార్లు మో
క్షావసనార్ధికిం దనువు ద్వారము సొన్పెడి మంచి బెత్తముల్
ప్రోవును ప్రాతరర్కసుఖరోచులు దుర్వ్యధనుండి మిమ్ములన్,

తా. బీదతనముచే కృశించువారికి బంగారము కురియించుటకు హేతువులై, స్వర్గధామము చేరుటకు రహదారులై, కామ క్రోధాదులను జయించి తపస్సు చేయు యోగులకు ముక్తిద్వారమునకు వేత్రహస్తు లైన ప్రాతఃకాల భానుశాంతులు మీకు భాగ్యదము లగు గాక.[11]

చ. మునుమును తూర్పుకొండఁ దుద ముద్దుల కల్కితురాయి మానికం
బనఁగ దిశాసతీమణుల కందపు పూతకు రోచనాంబు చ
ర్చన లన నొప్పి మక్కువల జక్కవ లార్బెడి వాఁడిచూపు ట
ర్చనలను గాంచు బాలరవిరశ్ములు మీకిడుఁ జింతితార్థముల్.

తా. తూర్పు కొండకు మాణిక్యమై, ఆకాశగంగలో స్నానమాడు సంగలచూపులకు నాసేచనకములై. సమస్తలోకము నర్చించు సూర్యకరములు మీకు శోభగల్గించుగాత [12]

చ. వెలుఁ గొకడే కనుంగవయి, పేర్చు జగత్రైయి, నల్వనాల్గుమో
ముల సుతికెక్కి పంచమసుభూతమునాఁ దగి యాఱుకార్ల ని
చ్చలు పలురీతుల న్నెగడి సప్తమునిస్తుతి నష్టదిగ్రతిన్
బొలయు నవార్కదీధితులు సూఱుపదుల్ శుభశోభ మీ కిడున్.

తా. ఒక్కటే ప్రభయై, రెండు కన్నులకు చూపుల నిచ్చుచు మూడు జగములు నిండి, నాలుగుమోముల నలువ స్తుతికి పాత్రమై, అయిదు భూతముల వ్యాపించి, ఆఱు ఋతువులు గలిగించి ఏడుగురు ఋషులచేతను పొగడ్తల నంది, ఎనిమిది దిక్కుల తొమ్మిది (నవ) కాంతులతో వెలయు పదినూఱుల కిరణములు మీకు సందల నింపు గాక - ఇందు సంఖ్యాలంకారము కలదు.[13]

చ. బడిబడి విశ్వముం దిరుగఁ బల్ శ్రమ దట్టిన యట్లు స్వోష్మచేఁ
బడలిన యట్లు గ్రీష్మదవవహ్నిని వేగిన యట్లు మాటికిన్
బుడమి జలంబు ద్రావి జడి పూటలు జల్పులుగొట్టి తోయముల్
వెడలి హిమార్తమౌ రవి యభీశుచయం బిడు మీకు భద్రముల్.

తా. వేసవిలో బాటసారివలె, దాహముచే సముద్రోదకములన్నియు త్రావి ఆ నీటిని తిరిగి, వర్షరూపమున భూమి పై ప్రవహింపజేసి, ఆ నీటిశైత్యముచేత, హేమంతఋతువును గల్పించు, సూర్యాంశువులు మీకు శోభాయమానము లగు గాక [14]

చ. కలయ దిశావధూటులకుఁ గన్నులపండువుగాఁగ నస్ఫుటో
త్కలనను నూగునూగు టెఱ దాళువు సొంపులు నింప నుల్లస
న్నళినవిలోచనం బగు దినంబు మొగంబున మొల్చినట్టి మీ
సల నునురేకఁ బోలు దివసప్రభునంశులు మీకు మేలిడున్.

తా. దిక్కులనెడి స్త్రీలకు కన్నుల పండుగగా, దినముు మొదల నూనూగుకాంతులతో మొల్చు కిరణములను నూనూగు మీసాలవలె నలరింప జేయు నర్కుని బాలభానులు మీకు ప్రతిపత్తి కలిగించుగాక [15]

చ. తల నెలబాలుఁ డాలుగొనఁ దక్కు నితం డని శూలి నూతనా
కలిత సరోజగహ్వరసుఖస్థితికిన్ విధి చిమ్మచీఁకటుల్
వలె నలుపైన మేనికగు బాధకు భీతిలి కృష్ణ దేవుఁడున్
గొలుచు దినేశ సద్రుచుల క్రొమ్యొలకల్ మిముఁ బ్రోచు గావుతన్.

తా. ఏ సూర్యు డుదయించిన, తనతలపై నున్న చంద్రుడు కాంతి తఱిగి పోవునని శివుడు భావించుచున్నాడో. ఎవని కిరణములచేత తానున్న తామర పూవు గద్దె కడలిపోవునని, బ్రహ్మ భయపడుచున్నాడో, నల్లనిచీకటి అంతయు పోయినందున, నల్లని తనశరీర మేమగునో యని, కృష్ణుడు భ్రాంతిజెందుచున్నాడో, అట్టిసూర్యుని నూతన కరములు సంతసము కలిగించును గాక.[16]

ఉ. కొండకు విర్వియున్ దెసలకు న్నిడివంబులు వేలవేఱుగా
నుండుట వార్ధికిం గలుగ నుర్వినిఁ జెట్టులు వీండ్లు గట్టులున్
మెండుగఁ దోసఁ జీఁకటిని నెట్టి జగన్నళినీప్రబోధమున్
నిండుగ సల్పు బాలతరణిప్రభ మీకును గీడు వాపుతన్.

తా. సమస్త భూప్రపంచమున గల, కొండలు, నదులు, నగరములు, ఏఱులు, సరస్సులు, వృక్షములు, గుట్టలు, పుట్టలు, ప్రకాశమానమైనట్లుగా చేసి, జగమనేడు పద్మమునకు నవ్యవికాసము గలిగించు, తరణి ప్రభ మిమ్ము ధన్యులుగా చేయు గాక [17]


శా. ఆస్తవ్యస్తుఁడు గాక నై జరుచియై యానంత్యముం గల్గి సం
గ్రస్త ధ్వాంతత విశ్వధామమున నేకత్రస్థ దీపంబు నా
నస్తోకంబుగ ముజ్జగాన దిగ నేహాపేక్ష నిత్య క్రియా
శస్తిం గ్రుమ్మఱు ప్రాఙ్నవార్కకిరణోచ్చైః కాంతిమేల్మీకగున్.

తా. అస్తవ్యస్తముగాక, ఏకాకారముగా, నిజకాంతులచే, అనంతమై చీకటి నెల్ల పోగొట్టి బ్రహ్మాండగేహమునకు నేకైకదీప మైన సూర్యకిరణాళి మీ కుచ్చైఃస్థితి గల్గించుగాక [18]

ఉ. వాడును దూఁడువంటి యహివర్గ మయో యని నాగలోకమున్
గూడక చక్రవాళమునకుం గల యాఖ్యకు నంచుఁ బ్రక్కలన్
వేఁడిమి యీకజాండమునఁ బెంకులు ప్రేలు నటంచు మింటిపై
నాడక స్వేచ్ఛఁ బోవ బయలైన యినప్రభ లేలు మిమ్ములన్.

తా. నాగలోకము వాడిపోవు నని పాతాళము చొరక చక్రములకు వేడిమిచూపక, బ్రహ్మాండకర్పరము పగులునో యని, మఱీ ఊర్థ్వముఖముగా వ్యాపించక, స్వేచ్ఛగా సంచరించు, సహస్రాంశుని అంశువులు మీ కానంద మిచ్చుగాక [19]

ఉ. కాలమొకండె కాదట జగంబును నీలిమఁబాయఁ జీకటుల్
వ్రీలఁగ మంచుకొండవలె రేవెలుఁగు న్విలయంబు నొంద సి
ద్ధాళికిఁ గేలు మోడ్పులటు లక్కు ముదప్రకరంబు బద్ధతన్
గ్రాల నొనర్చు ప్రాతరరుణప్రభ మీకునుఁ గోర్కెలిచ్చుతన్.

తా. ప్రతిదినమును జగంబున గల చీకటుల మాయజేసి మంచుకొండవలె చంద్రుని నిలువజేసి, తన్ను గూర్చి చేతులుమోడ్చి స్తుతించు సిద్ధాళికి ముదమును గూర్చు పగటివెలుగుణేని కాంతి - మీ కోర్కె లీడేర్చుగాక. [20]

 
ఉ. తామరపూలడా ల్గొనక తద్దయుఁ బెంచును తారకాళి నెం
తేమటుమాయఁ గప్పు వెస నెప్డు దినంబు నిమేషమాఱ్పఁగా
నేమియుఁ జాల దట్టి విపరీత జగత్త్రత్రైతయైకచక్షువౌ
గాములఱేనితేజ ఘనఘత్వము మీకు ఘటించుఁ గావుతిన్.

తా. తెల్లనైన తామరపూవులకాంతి హరింపకయే చుక్కలకు మిక్కిలిశోభ కల్గించును. నిమేషములో చీకటినంతయు మాయజేయును. లోకత్రయ చక్షువైన ఆ సూర్యుని మహాతేజము మీకుద్దీపనము గల్గించుగాక. [21]

చ. ఇగమున చల్లనౌస్థలుల కెక్కెడు వేఁడుకనో వసుంధరన్
దిగిభకరాగ్రపుష్కరతతిస్ విరియింపనొ దిక్కదంబమున్
మొగి హరిపాదముం గడచి ప్రొద్దుట సత్కృపనో సుదూరమున్
దగఁ ద్రుటిలో నలర్చు రవిధామము వాపును మీకు దుర్దశల్.

తా. చల్లదనముకొఱకు, శీతలస్థలుల చేరు వేడుకతోనే దిక్కుంజరముల తొండముల బీల్చు నీటిని నాసించియో యా పాతాళలోకము వఱకు గలదిక్కుల నన్నింటిని త్రుటికాలములో గమించు తోయజబంధుడు, మీ బంధములను సడలించుగాక. [22]

చ. ప్రశయమునన్ మలల్ విఱచు ఱాడతిగాలికి నాఱిపోవ దు
జ్జ్వల మహనీయ కాంతిమయి పట్టపగల్ వెలుఁగొందు వీత క
జ్జలము పతంగసంభవ మజస్ర మఖండము వత్తి యేడు దీ
వుల వెలిఁగించు దీపము మిమున్ రవిదీప్తి సుఖింపఁ జేయుతన్.

తా.ప్రళయకాలమున కొండలను పిండిచేయు గాలికి నారిపోవదు. ఉజ్జ్వలమైన కాంతిచే పగలంతయు వెలుగును. పతంగ సంభవమై, అఖండమై, వత్తిరేకయే సమస్త దీవులను వెలిగించు దీపమగు రవిదీప్తి మిమ్ము విరాజిల్ల జేయుగాక.[23]

 
చ. మొనయుచు నాశలెల్లఁ దుదముట్టెడి శ్లాఘ్యగుణాళి గౌరవం
బును నుదయాద్యహోగమ సమున్నతిఁ బర్యవసాన వర్జితం
బును గలదై క్షణంబునుఁ దమో నిచయంబునుఁ జేరఁబోక మే
ల్గనురుచివంటి భానురుచి జ్ఞాన దయాదులు మీకు నిచ్చుతన్.

తా. ప్రొద్దుటనుండి బయలుదేరి ఒకేరీతిగా దిక్కులన్నింటిని వెలిగించుచు, ముగింపు అనునది లేకుండ అందరు పొగడదగినటువంటి గుణ గౌరవముచే నొప్పుచు, క్షణమాత్రమున చీకటినెల్ల హరించు సూర్యకాంతి మీకు జ్ఞాన దయాదుల నిచ్చుగాక. [24]

చ. ప్రశమితతారకోర్జితబలం బగు శక్తినిఁ దాల్చి చంద్రకాం
త శిఖి నడంచి యయ్యతనుదర్పత మోహర విస్ఫుర న్మహో
తిశయిని యైన వీక్షణరతిం దగి రెండవ క్రౌంచభేది నాఁ
గుశలతఁ గాంచు భాసురుచికుఱ్ఱ యొసంగుత మీకు లక్ష్ములన్.

తా. ఇందు సూర్యతేజము కుమారస్వామితో పోల్చబడినది. కుమారస్వామి తారకాసురుని నణచినట్లు సూర్యకాంతి తారకల (చుక్కల) నణచును. చంద్రకాంతముల కాంతిని కుమారస్వామి ధిక్కరించును. సూర్యుడు చంద్రకాంతముల కాంతి తగ్గించును. ఈ రీతిగా సూర్యతేజస్సు కుమారస్వామిని పోలియున్నది.[25]

చ. తెలతెలఁ బాఱు వెన్నెలద్యుతిన్ రవచీఁకటి నల్లనల్లఁగాఁ
బలుచని తమ్మిపుప్పొడినిఁ బచ్చదనంబుల ప్రొద్దుపొర్పునం
గలననుఁ గెంపుచాయల జగం బను జిత్తరు వ్రాసినట్టి మే
ల్కల మగు భానుదీప్తి యతులప్రమదం బిడు మీదు చూడ్కికిన్.

తా. తెలతెలవారగా జాఱిపోవుచున్న వెన్నెలల తెలుపు రంగును, అప్పుడే వీడుచున్న చీకటి నలుపు రంగును, పద్మముల పుప్పొడి యందలి పసుపు రంగును, ప్రాతఃకాలమున గనుపట్టు, సూర్యకిరణముల ఎఱుపు రంగును, కలిపి జగమనెడు చిత్తరువును చిత్రించెడితూలికవలె నొప్పు బాల సూర్యకాంతి మీకు మేలొనగూర్చుత.[26]


ఉ. మేరునగంబుమార్గమున మించిన కెంపులధూళి లేచెనో
తేరునఁ దీర్చు పొంకముగ దిద్దిన యెఱ్ఱని పై జయంతియో
స్వారిగుఱాలు 'మేల్తొగరుచాయల జూల్కదలించునో యటం
చారయ నొప్పు బాలతపనాంశులు చోలుత మీకుఁ బాపముల్.

తా. మేరునగమునందలి కెంపులధూళిచేతనో రథమునకు గల ఎఱ్ఱని పతాకముననో, స్వారి గుఱ్ఱములు నెల్లని కాంతుల వలననో ఎఱ్ఱనైన ప్రొద్దుటి సూర్యకాంతులు మీకు శోభకలిగించుత [27]

ఉ. చీఁకటిఁ బుచ్చు వేడిమినిఁ జేయదు వెల్తురు నిచ్చు బెద్ద రూ
పై కనరాదు రే నడచునంతఁ బగ ల్వెలిగింపఁబోదు ప్రా
భాకర మైన బాలరుచిపాళియ పూర్ణము దిజ్ఞభోవకా
శాకలితంబె మీకు సకలార్థములన్ ఘటియించుఁ గావుతన్.

తా. చీకటిని ప్రోదోలును - అయినను, వేడిచేయదు, కావలసిన వెలుగునునిచ్చును. అట్లని పెద్ద ఆకారముతో నుండదు. రాత్రి నడపియు, పగలు వెలిగింపదు. ఆకాశము భూమియు, సమస్తమును వ్యాపించు, బాలసూర్యకాంతులు మీకు శ్రేయస్సు ఘటించు గాక.[28]

చ. చుఱుకయి శాంతిదంబు నలుసు న్విపులంబయి కానరాక యొ
క్కరికిని కానవచ్చియు జగంబున నిందున నుండి యందునున్
వఱలును నశ్వరం బయి యనశ్వరమౌ మునివేద్య మెల్లవా
రెఱిఁగియు నట్టి లోవెలుఁగు రెంటి యినప్రభ మిమ్ము నేలుతన్.

తా. సూర్యుని వేడిమి తీవ్రముగ నుండియు, శాంతి నిచ్చును. అణువువలె చిన్నదిగ నుండియు, మహావిపులమైనది. ఆది-అందఱికి-కనబడును గానీ, ఆయనదరికి, మనము పోలేము. ఇక్కడ, అక్కడ ఆనుమాట లేక, సర్వమును ప్రకాశింప జేయునదియై, మునీశ్వరులకు మాత్రమే గమ్యమైన, బాలసూర్య కాంతి మీకు మేలు చేయుగాక.[29]

 
ఉ. సొమ్ములు గాగ రత్నములు జొప్పడు గూర్చును గాఱుచి చ్చర
ణ్యమ్ములు గాల్పఁ జందురుఁడు “హా యిని” దేల్పఁగ జేసి మూఁడు లో
కమ్ముల భూష యై వెస నఘమ్ములు దోలుచు వాననిచ్చి సౌ
ఖ్య మ్మిడి పెక్కు కర్జముల కర్తి యినప్రభ మిమ్ముఁ బ్రోవుతన్.

తా. సూర్యు డొక్కడే యయ్యు ననేక కార్యములు సాధించును - రత్నములునగలకు కూర్చునపుడు వానిని వెలిగించును. కారుచిచ్చును కల్పించి యరణ్యములు కాల్పించును-చంద్రునకు హాయిగల్పించును. లోకమునకంతకు నేకైకమైన యలంకారముగా భాసిల్లును- సరియైన కాలమున వానలు కురియించును. అట్టి సూర్యకాంతి మీకు భద్రము నిచ్చును.[30]

మ. కనువ్రాలన్ శ్రుతిమ్రాన్పడన్ రసన నాకంబోక ముక్కెద్దియు
న్గన కాత్వక్కు స్పృశింప కుల్లము నడంగన్ శ్వాసమొక్కండు ద
క్కను వేఱొక్కటి లేక తూలిపడు నక్కాలాహి సందష్టమౌ
జనమున్ లేపెడి వెజ్జు బాలరవితేజం బార్చు మీ యాపదల్.

తా. కనులు కనబడక, చెవులు వినబడక, నాలుక మొద్దుకోవ, ముక్కుచదియగా శరీరము స్పర్శతక్కియుండి, ఊపిరి యొక్కటే నిలిచి, కాలసర్పముచే కఱువబడిన ప్రాణిలోకమునకు ఆ రోగము పోగొట్టి, చైతన్యమిచ్చు సూర్యదీప్తి మీకు తేజస్సు గలిగించు గాక.[31]

శా. కన్నీ ర్వంటి హిమంబునెల్ల వెసఁ దగ్గ౦ జేసి యింతింతగాఁ
గన్నిండౌ నెఱుపున్ హరించి బలు జోకం బేర్చు నిర్దోషతన్

విన్నాణంబుగఁ జూడఁజేసి భువనప్రేక్షం ద్వదాపత్తి వి
చ్ఛిన్నంబు న్సలుపు న్నవార్కరుచుల న్సిద్ధాంజన ప్రక్రియన్.

తా. కన్నీటివంటి మంచును తగ్గజేసి కన్నులలో గలుగు నెఱుపును హరింపజేసి, ఏ దోషములు లేకుండ భువనములను చక్కగా జూచుచు, సవిచ్ఛిన్నముగా సంచరించు సూర్యకాంతులు మీకు శోభను గూర్చుగాత. [32]

ఉ. ప్రొద్దుదయించు దిక్కుననుఁ బుట్టి నెలం గడుఁ దూల్చి యెఱ్ఱఁగా
దిద్దినయట్లు తోచి గడిదేఱు నవాబ్జము నట్టె లేపుచున్
దద్దయు ముజ్జగంబులకు దారొక సొమ్ములుగాఁ దలిర్చుచున్
ముద్దులుగుల్కు భానుకరముల్ విభవంబులు మీకుఁ జేయుతన్.

తా. ప్రొద్దుదిక్కున సుదయించి, చంద్రకాంతిని తగ్గించి, ఎఱ్ఱ యెఱ్ఱగా నొప్పుచున్న క్రొత్తతామరకు కమనీయత గల్పించి, మూడులోకములకు నెవడు భూషాయమాణు డగుచున్నాడో, అట్టి సూర్యుని కిరణములు మీపాపములు బాపుగాత.[33]

చ. పొలుపుగ ముజ్జగంబు లను పూవులతోఁటను బెంచు రాత్రి యన్
గులుకుమిటారి చంద్రుఁడను కుండను బ్రాఙ్నగచక్రవాళ మన్
చెలువపుబోది యన్ బగటిచెట్లకుఁ దానమృతంబు వోయని
మ్ముల మొలకెత్తు లేఁజిగురు ప్రొద్దుటియెండ ముదంబు మీ కిడున్.

తా. రాత్రియను కన్య మూడులోకము లను పూపుతోటను పెంచుటకై చంద్రుడను కుండను, తూర్పుకొండపై నిలిచి పగటిచెట్లకు అమృతము పోయుచున్నదో ఆమనట్లున్న లేతయెండ మీకు శుభము నిచ్చుత [34]

చ. అరుణుని యెఱ్టచాయ లెనయ న్బగడంబుల డంబు లొక్కటన్
మెరమెరఁ దారకాచ్ఛవి భ్రమింపఁగ ముత్యపుఁజాయ లొక్కట
న్సిరి గన నల్లనల్ల నగు చీఁకటిసంద్రము ద్రావునట్టి పూ
ర్వరవి నిభాత్యపూర్వబడబాజ్వలనం బిడు మీకుఁ బుణ్యముల్.

తా. ఇందు బాలసూర్యకాంతి బడబాగ్నితో నుపమింపబడినది. ఆరుణుని

వలె, పగడముల భాతి ఎఱ్ఱనై, అచ్చటచ్చట నున్న చుక్కలవలె తెల్లనై, అల్ల నల్లన-నల్లనైన చీకటియను సముద్రమును త్రావు బాడబాగ్నివలె నొప్పు ప్రాతః కాల సూర్యతేజము, మీకు శోభాయమాన మగు గాక. [35]

 
ఉ. మద్దెల దిద్దిమల్ సరిగమా యను గీతులు గద్దెపద్దెముల్
గ్రద్దన దిద్దు వేలుపుల గాణలు తొల్లిటి సుద్దు లొద్దికన్
విద్దెలమారి వేల్పురుసి పెద్దలు సద్దిడ ముజ్జగానకుం
దద్దయు జవ్వనం బొసగు నవ్యరవిప్రభ మీకు మేలిడున్.

తా. గంధర్వులు మనోహరమలైన గద్యపద్యములతోడను, వేల్పుగాయకులు, మద్దెల ధ్వనులతోడను, ఇతర దేవతలు స్తుతులచేతను, నలరించు బాలసూర్యుడు జగంబులకు యౌవనం బొసగు గాత.[36]

ఉ. రిక్కలు పల్చనై తమము వ్రీలఁగ నిందు శిలాళి పాఱుటల్
తక్కఁగఁ జంద్రుఁడు న్మెఱుఁగు దప్పుట నోషధు లుక్కు వీడ నా
చక్కనిప్రొద్దు ప్రాఙ్నగము చక్కిని కొంచెము నిల్చియుండ ద
వ్వెక్కియు నెక్కకున్న దివసేశుని తేజము మిమ్ము బ్రోచుతన్.

తా. చుక్కలు పల్చనకాగా, చీకటి మాసిపోవగా, చంద్రకాంత శిలలు తప్ప చంద్రుడు కాంతిహీనుడు కాగా, ఓషధీలతలు, తమ జిగి వీడగా తూర్పు కొండ నెక్కియు, నింకను దీర్ఘముకాని బాలసూర్యకాంతులు మీకు సిరుల నొసగు గాత.[37]

చ. నవనవ యౌవనంబుల వనంబుల రక్తదడంబు డంబులన్
గవకవఁ జూపి చెంతలను గ్రంతలఁ గుంతల దాఁటి సాటి నా
కెవ రెవ రంచు దోడుపడు నీడకు చేడియతమ్మి దుమ్మురా
రవరవ నిక్క నెక్కు దినరాట్ ఛవి మీ కగుఁ బాపశాంతికిన్.

తా. వనములకు యౌవనము నొసంగి, ఎఱ్ఱనైన దశములకు నెఱ్ఱనికాంతి నిచ్చి, దగ్గఱగను, దూరముగను, మాటుచోటను నదిలేక, సమస్తజగంబును వెలిగించు సూర్యకాంతి మీకు పాపశాంతి చేయునుగాక.[38]

చ. మురిసిన తమ్మిపూవు జలముం గులికించునే కాని యావిరిన్
నెరపవు చూడ్కులన్ వెలుగు నింపునే కాని యొకింత యేనియున్
చుఱచుఱ నీవు ప్రాఙ్నగము చోటను మున్నటుపై దివంబునన్
వరుపదికల్ నటించు శుభ భాను నవాంశులు మీ కొలార్చుతన్.

తా. తమ్మిపూవందలి జలమును కులికించును గాని ఆవిరిగా మార్పదు.చూపునకు వెలుగునింపును కానీ ఒకింతయేని, చుఱచుఱ మనదు తూర్పుకొండనే గాక, దినఁబంతయు నిట్లే ఏకాకారముగా నుండు బాలసూర్యకిరణములు - మీ దోషములు పోకార్చు గాత.[39]

చ. ఆమరవిభుండు గొల్చెడి బృహస్పతి కే పెదవాడ దిందు కే
మమరుల జ్యేష్ఠుఁ డయ్యుఁ జతురాననుఁ డైన విరించికేని నో
రు మెదల దర్చవేళ బెదరుం దడబా టగునట్టి సచ్చరి
త్రము గల సూర్యదేవునీ స్ఫురన్నవరోచి సుశాంతి మీ కిడున్.

తా. ఆర్చనావేళయం దెవని యుదయము లేక, ఇంద్రగురువురు బృహస్పతికి మాటలు వెలువడవో, బ్రహ్మదేవునికి సైతము వాక్కు విజృంభింపదో అట్టి సూర్యోదయకాంతి, మీకు శాంతి నిడుగాత.[40]

చ. మలలకు మీఁద జేగురులు, మ్రాకులయందుఁ జివుళ్లు వార్ధిచా
యలఁ బగడంబులున్ దెసల హత్తుల నెత్తులఁ జెందిరంపుఁ బూఁ
తలు దివి మేరుశైల భువిఁ దప్త సువర్ణములైన సూర్యర
శ్ములుదయకాల శోణములు సొంపుల నింపుల మీకు నింపుతన్.

తా. కొండలమీద జేగురుధారలై, చెట్లయందు చిగుళ్లై, సముద్రతీరమున దిగ్గజ కుంభస్థలముల సిందూరములై, మేరుపర్వత శిఖరములు తప్త కాంచన సన్నిభములైన నెఱని సూర్యకాంతులు మీకు నింపు నింపుత. [41]

చ. నెల తమిమీఱ నస్త శివునెత్తిన యుండ వెసం దమోహలా
హలము నిపీతమైన నరుణాఖ్య కిసాలయ మొప్పు ప్రత్యుష

స్సలలిత కల్పకం బొదవఁ జక్కనికేం బసపంచు కోకతో
వెలలు సరోజలక్ష్మి యనఁ బేర్చు రవిప్రభ మీకు మేలిడున్.

తా.అస్తాదీశుడైన శివుని జడలయందున్న శశి కాలకూటమను విషము త్రాగగా, ఆరుణ కిసలయములవలె ఎఱ్ఱనైన కల్పకమువెనుక చక్కని పసుపు చీర ధరించిన లక్ష్మీ యట్ల ప్రకాశించు సూర్యకాంతలక్ష్మి మీకు సంపద లొసంగు గాక.[42]

ఉ. పుట్టదు సంద్రమం దచటఁ బుట్టిన కౌస్తుభ ముఖ్యవస్తువుల్
చుట్టలు గావు పద్మమును జూడము చేతను, విష్ణువక్షముస్
ముట్టదు లాఁతి లేవెలుఁగు ముజ్జగమందు వ్యవస్థ లేర్పడన్
బుట్టెడు మండలాగ్రమునఁ బూషున కా సిరి మీకు మేళ్ళడున్.

తా. సముద్రములో పుట్టలేదు. అందు పుట్టిన కౌస్తుభము మొదలగునవి చుట్టములు కావు; చేతిలో పద్మము లేదు. విష్ణు వక్షః స్తలము ముట్టదు. అయినను లక్ష్మీవలె సమస్తము నిచ్చి, సూర్యకాంతలక్ష్మి మీకు సిరుల నొసగుగాత [43]