సూర్యశతకము (తెలుగు)/అశ్వ వర్ణనము
అశ్వ వర్ణనము
ఉ. మేరువుమీఁద నున్ననగు మేల్మిశిలల్ నలఁగంగనీక సా
మీరజవంబుసం దుముకఁబెట్టిన గుర్తులు వేఱె లేమిచే
చారుతరార్క కాంతమణిజం బగు వహ్నియ దారి తెల్పఁగా
మీరిన సూర్యుగుఱ్ఱములు మేలుగ ముజ్జగ మేలు గావుతన్.
తా. మేరు పర్వతము పైనున్న శిలలు నలగకుండ, మహావాయు వేగముతో దుముకుటచే గుర్తులు వేఱె లేకపోగా, సూర్యకాంత శిలలు కరిగి, అందలి ఆగ్నిచే దారి స్పష్టమగుచుండగా పర్యటించు సూర్యాశ్వములు మీకు శోభన మిడుగాక.[44]
ఉ. దగ్గఱ బగ్గునం గిరణతాపము వీపులవేఁప డప్పిమైఁ
దగ్గక యొక్క నాఁట దివిదారి వడారము దాఁటి వేసటన్
సగ్గుచు గంగ నీర్మెడలు సాచి శిరంబులు వాంచి త్రావుచో
జగ్గెకు సప్తసప్తి ఘనసప్తులు మీకు హిత౦బు నేయుతన్.
తా ఒక్కొక్కప్పుడు దగ్గఱగా సూర్యకిరణముల వేడమిచేత వీపులు చుఱుక్కుమనుచుండగా, దప్పిచే నాకాశమార్గము నధిగమించుచు ఆకాశగంగ కనబడగానే మెడలువంచి గంగనీరు త్రాగెడి రవి గుఱ్ఱములు మీకు మేలుచేయుగాక.[45]
చ. పటికపు మానికాల చలపం దమనీడలు వేణె వాజులం
చటు నిటు బోవుఁ బ్రొద్దుతిరుఁ గాటినఁ గెంపులఁ జూచి సంజ యం
చటమట మెల్లనం జను నొయారపు పచ్చలపట్ల గానరా
కిటుల ననూరు మేరుశిఖ నేఁచు నినాశ్వము లేలు మిమ్ములన్.
తా. స్ఫటిక భూములయందు తమ ప్రతిబింబములు చూచుచు నిల్చి అచ్చటచ్చట ప్రొద్దు తిరిగిన ట్లెఱ్ఱని సంజకాంతులను చూచి మెల్లగా నడుచుచు, పచ్చగా నన్న మరకత శిలలమధ్య లీనమగుచు, సూర్య రథసారథియైన యనూరునికి నితిశ్రమ కలిగించు నశ్వ వములు మీకు శ్రేయస్సుల నొసగుత.[46]
చ. ఆహిరిపు నన్న లాగిన నొయారముగం జలియించి పాఱుచున్
గుహజననీ సమీపమున గొప్పరథంబు గతిం జవంబుతో
డ హరితకాంతితో మఱుఁగు దబ్బలతో నపకార్క నందినీ
మహిమ వహించు నర్యముని వార్వపుబంతి శుభంబు మీకిడున్.
తా.సూర్యసారథి కళ్లెముులను లాగుచుండగా, ఆకాశగంగ సమీపమున కొంచెము వేగముగా బోవుచు, ముఖములనుండి వెలువడు నురువులు పచ్చని కాంతితో నిండగా, యమునానదివలె నొప్పు సూర్యాశ్వపంక్తి మీకు శుభముల నొసగుగాత [47]
ఉ. దారికి నావ లీవల సుధాంధులు స్వర్గిరి వంగుచు న్నమ
స్కారము నేయఁ గిన్నరుల కన్యలు సిగ్గున మోము లగ్గుహా
ద్వారములం దిడంగ నరుణాఖ్యుఁ డదల్చినఁ గాని యించుకం
తోర మెడం దినేద్ధయము లూఁదెడి హేషలు దోలు మీకొలల్.
తా. మేరుపర్వతోపాంతముల దేవతలు గిరియందు వంగి నమస్కారమలు చేయగా, కిన్నరీకన్యలు సిగ్గుతో గుహాద్వారములనిల్చి చూచుచుండగా, సారథి కళ్లెములు లాగుచుండినను, మెల్లమెల్లగా నడచు రవి హయములు మీకౌలల నడందుత.(48)
ఉ. తమ రుచిచేతఁ బచ్చనగు తట్లమొగుళ్లను ఱెక్కలొప్పఁ గ
ళ్ళెములను లాగ నెత్తురులు లేచిన నోళ్ళను ముక్కు లొప్ప వ్యో
మముననుఁ దుఱ్ఱు మంచు వడిఁ బాఱు సుమేరుశిఖాగచారి కీ
రము లన నొప్పు సూర్యునిగుఱాలు వరాల సరాలు మీకిడున్.
తా.ఆకుపచ్చనైన తమ శరీరకాంతిచే తెల్లనగు మేరు పర్వతపు చరియలను పచ్చదనము కలిగినట్లు చేసి, మేఘములను రెక్కలతో కళ్లెములు లాగుటవలన నోటినుండి వచ్చు రక్తము నెఱ్ఱదనముతో మేరు శిఖరాగ్రమున చిలుకలవలె తుఱ్ఱుమని పాటు సూర్యాశ్వములు మీకు శ్రేయము లొసగుత.(49)