సుమతీ శతకము

(సుమతీ శతకము - మొదటిభాగం నుండి మళ్ళించబడింది)


శ్రీ రాముని దయచేతను
నారూఢిగ సకల జనులు నౌరా యనగా
ధారాళమైన నీతులు
నోరూరగ జవులు పుట్ట నుడివెద సుమతీ 

భావం: మంచి బుధ్ధిగలవాడా! శ్రీరాముని యొక్క దయవలన నిశ్చయముగా అందరు జనులను ఔరా అనునట్లుగా నోటినుండి నీళ్ళూరునట్లుగా రసములు పుట్టగా న్యాయమును భోధించు నీతులను చెప్పెదన్.

అక్కరకు రాని చుట్టము,
మ్రొక్కిన వరమీని వేల్పు, మోహరమున దా
నెక్కిన బారని గుర్రము 
గ్రక్కున విడవంగవలయు గదరా సుమతీ  

భావం: అవసరమునకు పనికిరాని చుట్టమును, నమస్కరించి వేడిననూ కోరిక నెఱవేర్చని భగవంతుని, యుద్ధసమయమున ఎక్కినప్పుడు ముందుకు పరుగు తీయని గుఱ్ఱమును వెంటనే విడిచిపెట్టవలయును.

అడిగిన జీతంబియ్యని
మిడిమేలపు దొరను గొల్చి మిడుకుట కంటెన్‌
వడిగల యెద్దుల గట్టుక
మడి దున్నుకు బ్రతుక వచ్చు మహిలో సుమతీ

భావం: అడిగినప్పుడు జీతము ఈయని గర్వియైన ప్రభువును సేవించి జీవించుటకంటే, నాగలికి వేగముగా పోగల యెద్దులను కట్టుకొని పొలమును దున్నుకొని వ్యవసాయముచే జీవించుట మంచిది.

అడియాస కొలువు గొలువకు,
గుడి మణియము సేయబోకు, కుజనుల తోడన్‌
విడువక కూరిమి సేయకు,
మడవిని దో డరయ కొంటి నరుగకు సుమతీ

భావం: వృధా ప్రయాసయగు సేవను చేయకుము. గుడి ధర్మకర్తుత్వము చేయకుము. చెడ్డవారితో స్నేహము చేయకుము. అడవిలో సహాయము లేక ఒంటరిగా పోకుము.

అధరము గదలియు, గదలక
మధురములగు భాష లుడుగి మౌన వ్రతుడౌ
అధికార రోగ పూరిత
బధిరాంధక శవము జూడ బాపము సుమతీ

భావం: పెదవి కదలీకదలకుండ తీయనైన మాటలు మాని, మాటలాడనను నియమము పూని, అధికార వ్యాధిచేనిండిన చెవిటి గ్రుడ్డి పీనుగును చూచుట పాపము.

అప్పు కొని చేయు విభవము,
ముప్పున బ్రాయంపుటాలు, మూర్ఖుని తపమున్‌,
దప్పరయని నృపు రాజ్యము
దెప్పరమై మీద గీడు దెచ్చుర సుమతీ

భావం: ఋణము దెచ్చుకొని అనుభవించు సౌఖ్యము, ముసలితనమందు పడుచు భార్య, తప్పిదములను కనిపెట్టని రాజు యొక్క రాజ్యము సహింపరానిదై చివరకు హానిని తెచ్చిపెట్టును.

అప్పిచ్చువాడు, వైద్యుడు
నెప్పుడు నెడతెగక పారు నేరును, ద్విజుడున్‌
జొప్పడిన యూర నుండుము
చొప్పడకున్నట్టి యూరు చొరకుము సుమతీ

భావం: ఋణమునిచ్చువాడును, వైద్యుడును, ఎల్లప్పుడును ఆగకుండా ప్రవహించు నదియును, బ్రాహ్మణుడుగల గ్రామమునందు నివసింపుము. వారు లేనట్టి గ్రామమునందు నివసింపకుము.

అల్లుని మంచితనంబును,
గొల్లని సాహిత్య విద్య, కోమలి నిజమున్‌,
బొల్లున దంచిన బియ్యము,
దెల్లని కాకులును లేవు తెలియుము సుమతీ

భావం: అల్లుని మంచితనమును, గొల్లవాని పాండిత్య జ్ఞానమును, ఆడుదానియందు నిజమును, పొల్లు ధాన్యములో బియ్యమును, తెల్లని రంగు కాకులును లోకములో నుండవు.

ఆకొన్న కూడె యమృతము,
తాకొందక నిచ్చువాడె దాత ధరిత్రిన్‌,
సోకోర్చువాడె మనుజుడు,
తేకువ గలవాడె వంశ తిలకుడు సుమతీ

భావం: లోకమునందు ఆకలి సమయమున అన్నమే అమృతము. బాధ నొందకుండా నిచ్చువాడే దాత. ఆవేశమును ఓర్చుకొనువాడే మానవుడు. ధైర్యం కలవాడే వంశ శ్రేష్టుడు.

ఆకలి యుడుగని కడుపును,
వేకటియగు లంజ పడుపు విడువని బ్రతుకున్‌,
బ్రాకొన్న నూతి యుదకము,
మేకల పాడియును రోత మేదిని సుమతీ

భావం: భూమియందు ఆకలి తీరని భోజనం, గర్భము వచ్చిన జారస్త్రీ యొక్క వ్యభిచారమును విడువని బ్రతుకును, పాచిపట్టిన బావి నీళ్ళును, మేకల పాడియు రోత పుట్టించును.

ఇచ్చునదె విద్య, రణమున
జొచ్చునదే మగతనంబు, సుకవీశ్వరులున్‌
మెచ్చునదే నేర్చు, వదుకు
వచ్చునదే కీడు సుమ్ము వసుధను సుమతీ

భావం: భూమియందు ధనము నొసగునదియే విద్య. యుద్ధభూమియందు ప్రవేశించునదే పౌరుషము. మంచి కవిశ్రేష్టులు మెచ్చుకున్నట్టిదే నేర్పరితనము. తగవునకు వచ్చునదియే హాని.

ఇమ్ముగ జదువని నోరును,
నమ్మా యని బిలిచి యన్న మడుగని నోరున్‌,
దమ్ముల బిలువని నోరును
గుమ్మరి మను ద్రవ్వినట్టి గుంటర సుమతీ

భావం: ఇంపుగా పఠింపని నోరును, అమ్మయని పిలచి అన్నము అడుగనినోరును, తమ్ముడాయని పిలువని నోరును, కుమ్మరివాడు మన్నుత్రవ్విన గోయీవంటిది సుమా.

ఉడుముండదె నూరేండ్లును,
బడియుండదె పేర్మి బాము పదినూరేండ్లున్‌,
మడువున గొక్కెర యుండదె,
కడు నిల బురుషార్థ పరుడు గావలె సుమతీ

భావం: ఉడుము నూరేండ్లును, పాము పదివందల ఏండ్లును, కొంగ చెరువులో చిరకాలము జీవించుచున్నవి. వాని జీవితములన్నియు నిరుపయోగములు. మానవుని జీవిత మట్టిదికాక ధర్మార్ధకామ మోక్షాసక్తితో కూడినది కావలెను.

ఉత్తమగుణములు నీచున
కెత్తెఱగున గలుగ నేర్చు; నెయ్యెడలం దా
నెత్తిచ్చి కరగి పోసిన
నిత్తడి బంగారమగునె యిలలో సుమతీ?

భావం: బంగారమునకు సమానమైన యెత్తు ఇత్తడిని తీసుకొని ఎన్నిసార్లు కరగించి పోసినను బంగారము ఎట్లు కానేరదో అదేవిధముగా లోకములో నీచునకు ఎక్కడను ఏవిధముగను మంచి గుణములు కలుగనేరవు.

ఉదకము ద్రావెడు హయమును,
మదమున నుప్పొంగుచుండు మత్తేభంబున్‌,
మొదవు కడ నున్న వృషభము,
జదువని యానీచు గడకు జనకుర సుమతీ

భావం: నీరు త్రాగెడు గుఱ్ఱము కడకును, క్రొవ్వుచే విజృంబించు మదపుటేనుగుకడకును, ఆవుకడనున్న ఆబోతు దగ్గరకును, విద్య నేర్వని అల్పుని కడకును వెళ్ళకుము.

ఉపకారికి నుపకారము
విపరీతము గాదు సేయ వివరింపంగా;
అపకారికి నుపకారము
నెపమెన్నక సేయువాడు నేర్పరి సుమతీ

భావం: మేలు చేసినవానికి తిరిగి మేలు చేయుట గొప్ప కాదు. హాని చేసిన వానికి లోగడ వాడు చేసిన దోషములు లెక్క చేయక ఉపకారము చేయువాడే నేర్పుగలవాడు.

ఉపమింప మొదలు తియ్యన
కపటం బెడనెడను జెఱకు కై వడినే పో
నెపములు వెదకును గడపట
గపటపు దుర్జాతి పొందు గదరా సుమతీ

భావం: చెఱకుగడ మొట్టమొదట తియ్యగానుండి, చివరకు పోయిన కొలది మధ్య మధ్య చప్పగా నేవిధమున నుండునో ఆ విధముగా పోల్చి చూడగా మోసగాడైన దుర్మార్గునితోడి స్నేహము మొదట ఇంపుగా నున్నను చివరకు తప్పులను వెదకుటకు ప్రారంభించునుగదా.

ఎప్పటి కెయ్యది ప్రస్తుత
మప్పటికా మాటలాడి, యన్యుల మనముల్‌
నొప్పించక, తా నొవ్వక,
తప్పించుక తిరుగువాడు ధన్యుడు సుమతీ

భావం: ఏ సమయమునకు ఏదేది అవసరమో తెలుసుకొని, అప్పటికా మాటలు పల్కి ఇతరుల మనస్సులను బాధపెట్టక తాను బాధనుపడక తప్పించుకొని తిరుగువాడే సుమా ధన్యాత్ముడు.

ఎప్పుడు దప్పులు వెదకెడు
నప్పురుషుని గొల్వగూడ దది యెట్లన్నన్‌
సర్పంబు పడగ నీడను
గప్ప వసించిన విధంబు గదరా సుమతీ

భావం: నల్లత్రాచుయొక్క పడగనీడను వసించు కప్ప బ్రతుకెంత అస్థిరమైనదో ఆ విధముగనే ఎల్లప్పుడు దోషములను వెదకు యజమానుని సేవించువాడి బ్రతుకును ప్రాణభయముతో కూడినది.

ఎప్పుడు సంపద కలిగిన
నప్పుడు బంధువులు వత్తు రది యెట్లన్నన్‌
తెప్పలుగ జెఱువు నిండిన
గప్పలు పదివేలు చేరు గదరా సుమతీ

భావం: చెరువునిండా నీరుచేరగనే వేలకొలది కప్పలందులోనికి ఏ విధముగా చేరుకొనునో, సంపద కలిగిన బంధువులెక్కువగా జేరుకొందురు.

ఏఱకుమీ కసుగాయలు,
దూఱకుమీ బంధుజనుల దోషము సుమ్మీ,
పాఱకుమీ రణమందున,
మీఱకుమీ గురువు నాజ్ఞ మేదిని సుమతీ

భావం: ఈ భూమి పైన పచ్చికాయలు ఏరి తినకుము, చుట్టములను ధూషింపకుము, యుధ్ధమునుండి వెనుదిరిగి పారిపోకుము, పెద్దల మాటను జవదాటకుము తప్పు సుమా.

ఒక యూరికి నొక కరణము,
నొక తీర్పరియైన గాక, నొగి దఱుచైనన్‌,
గకవికలు గాక యుండునె
సకలంబును గొట్టువడక సహజము సుమతీ

భావం: ఒక గ్రామమునకు ఒక లేఖరి, ఒక ధర్మాధికారి యుండవలెను. అట్లు కాక పైన చెప్పబడినవారు పెక్కుమందియైనచో అనేకమైన గంధరగోళములు పుట్టి సమస్తమును చెడిపోవుట సహజము.

ఒరు నాత్మ దలచు సతి విడు,
మఱుమాటలు పలుకు సతుల మన్నింపకుమీ,
వెఱ పెఱుగని భటునేలకు,
తఱచుగ సతి గవయ బోకు, తగదుర సుమతీ
ఒల్లని సతి నొల్లని పతి,
నొల్లని చెలికాని విడువ నొల్లని వాడే
గొల్లండు, కాక ధరలో
గొల్లండును గొల్లడౌనె గుణమున సుమతీ

భావం: తన్ను ప్రేమించని భార్యను, యజమానుని, స్నేహితుని విడిచిపెట్టుటకు అంగీకరింపనివాడే వెర్రిగొల్లవాడు. కాని జాతిచేత గొల్లవాదైనంత మాత్రమున గుణములయందు వెర్రి గొల్లవాడు కాదు.

ఓడల బండ్లును వచ్చును,
ఓడలు నాబండ్లమీద నొప్పుగ వచ్చున్‌,
ఓడలు బండ్లును వలనే
వాడంబడు గలిమి లేమి వసుధను సుమతీ

భావం: నావలమీద బండ్లును, బండ్లమీద నావలును వచ్చునట్లుగనే భాగ్యవంతులకు దారిద్ర్యము, దరిద్రులకు భాగ్యమును పర్యాయముగా కలుగుచుండును.

కడు బలవంతుడైనను
బుడమిని బ్రాయంపుటాలి బుట్టిన యింటన్‌
దడవుండ నిచ్చెనేనియు
బడుపుగ నంగడికి దానె బంపుట సుమతీ

భావం: ఎంత సమర్ధత కలవాడైనను యవ్వనమందున్న భార్యను చిరకాలము పుట్టినయింట నుండనిచ్చినచో తానే స్వయముగా భార్యను వ్యభిచార వృత్తికి దింపినవాడగును.

కనకపు సింహాసనమున
శునకము గూర్చుండబెట్టి శుభ లగ్నమునం
దొనరగ బట్టము గట్టిన
వెనుకటి గుణమేల మాను వినరా సుమతీ

భావం: కుక్కను తీసుకొని వచ్చి మంచి ముహూర్తమునందు బంగారు గద్దె మీద కూర్చుండబెట్టి పట్టాభిషేకము చేసినప్పటికి దాని నైజగుణము నేలాగున మానలేదో, ఆ విధముగనే అల్పుడైనవానికి ఎంత గౌరవము చేసి మంచి పదవొసంగినను తన నీచత్వమును వదలనేరడు.

కప్పకు నొరగాలైనను,
సర్పమునకు రోగమైన, సతి తులువైనన్‌,
ముప్పున దరిద్రుడైనను,
తప్పదు మఱి దుఃఖ మగుట తథ్యము సుమతీ

భావం: కప్పకు కాలు విఱిగినను, పాముకు రోగము కలిగినను, భార్య దుష్టురాలైనను, ముసలితనములో దారిద్ర్యము సంభవించినను, ఎక్కువ దుఖప్రదమగును తప్పదు.

కమలములు నీట బాసిన
కమలాప్తుని రశ్మి సోకి కమలిన భంగిన్‌
తమ తమ నెలవులు దప్పిన
తమ మిత్రులు శత్రులౌట తథ్యము సుమతీ

భావం: కమలములు తమ నివాసమైన నీటిని విడిచిపెట్టిన తరువాత తమ మిత్రుడైన సూర్యుని యొక్క ఎండ తాకుడుకే కమలుచున్నవి. అట్లే మానవులు తమ తమ హద్దులు దాటి ప్రవర్తించిన తమ స్నేహితులే తమకు శత్రువులగుదురు.


కరణము గరణము నమ్మిన
మరణాంతక మౌను గాని మనలేడు సుమీ;
కరణము దన సరి కరణము
మఱి నమ్మక మర్మ మీక మనవలె సుమతీ

భావం: ఒక లేఖకుడు మఱియొక లేఖకుని నమ్మిన మరణముతో సమానమైన ఆపదను చెందును కావున లేఖకుడైనవాడు తనతో సమానుడైన మఱియొక లేఖరిని విశ్వసింపక తన గుట్టు ఈయక జీవింపవలయును.

కరణముల ననుసరింపక
విరసంబున దిన్న తిండి వికటించు జుమీ
యిరుసున కందెన బెట్టక
పరమేశ్వరు బండి యైన బారదు సుమతీ

భావం: బండి యిరుసునకు కందెన పెట్టకున్నచో భగవంతుని బండియైనను త్వరితంగా పరుగెత్తదు. అదే విధముగా లేఖకుడు చెప్పినట్లు విని అతని వెంబడింపక విరోధముతో మెలగినవారు సుఖముగా మన జాలరు.

కరణము సాదైయున్నను,
గరి మద ముడిగినను, బాము గఱవక యున్నన్‌,
ధర దేలు మీటకున్నను,
గర మరుదుగ లెక్క గొనరు గదరా సుమతీ

భావం: భూమియందు కరణము నెమ్మదివాడైనను, ఏనుగు మదము పోయినదైననూ, త్రాచు కఱవకున్నను, తేలు కుట్టకున్నను ఆశ్చర్యముతో మిక్కిలి తేలికగా చూతురు.

కసుగాయ గఱచి చూచిన
మసలక పస యొగరు రాక మధురంబగునా;
పస గలుగు యువతులుండగ
పసి బాలల బొందువాడు పశువుర సుమతీ

భావం: పక్వమునకు వచ్చిన పండ్లను వదలి పచ్చికాయలను కొఱికిన తీయదనము లేక ఒగరుగా దోచును. ఆ విధముగనే చాతుర్యము గల పడుచులుండంగా పసిపాపలను కూడెడువానికి సుఖము శూన్యము అట్టివాడు నిజముగా పశువే.

కవి కాని వాని వ్రాతయు,
నవరస భావములు లేని నాతుల వలపున్‌,
దవిలి చను పంది నేయని
వివిధాయుధ కౌశలంబు వృధరా సుమతీ

భావం: కవికానట్టివాడు వ్రాసిన రచనయును, తొమ్మిది రసముల యొక్క స్థితులు తెలియని స్త్రీలయొక్క ప్రేమయును, ముందు పోయెడి పందిని వెంబడించి కొట్టలేనివాని యొక్క ఆయుధవిద్యయందలి నేర్పరితనము వ్యర్ధము.

కాదు సుమీ దుస్సంగతి,
పోదుసుమీ "కీర్తి" కాంత పొందిన పిదపన్‌,
వాదు సుమీ యప్పిచ్చుట,
లేదు సుమీ సతుల వలపు లేశము సుమతీ

భావం: చెడ్డవారితోడ స్నేహము మంచిదికాదు. కీర్తి వచ్చిన పిదప నశించదు. అప్పొసంగుట తగవులకు మూలము. స్త్రీలకడ ప్రేమ శూన్యము.

కాముకుడు దనిసి విడిచిన
కోమలి బరవిటుడు గవయ గోరుట యెల్లన్‌
బ్రేమమున జెఱకు పిప్పికి
చీమలు వెస మూగినట్లు సిద్ధము సుమతీ

భావం: ఒక విటుడు తృప్తియగునట్లుగా భోగించి విడచిన కాంతను మఱియొక జాఱుడు అనుభవింపగోరుట చెఱకునందలి రసమును సంపూర్ణముగా తీసివేసిన తరువాత ఆ పిప్పికై చీమలు ముసుకొన్నట్లుండును.

కారణము లేని నగవును,
బేరణము లేని లేమ, పృథివీ స్థలిలో
బూరణము లేని బూరెయు,
వీరణము లేని పెండ్లి వృధరా సుమతీ

భావం: కారణములేని నవ్వును, పేరణము(రవిక) లేని స్త్రీయును, పూరణములేని బూరెయును, వీరణములేని పెండ్లియును వ్యర్ధములు.

కులకాంత తోడ నెప్పుడు
గలహింపకు, వట్టి తప్పు ఘటియింపకుమీ,
కలకంఠి కంట కన్నీ
రొలికిన సిరి యింట నుండ నొల్లదు సుమతీ

భావం: భార్యతోడ నెప్పుడును జగడములాడవలదు. లేని నేరములు ఆరోపింపవలదు. ఉత్తమ ఇల్లాలియొక్క కంటనీరు క్రిందపడిన నాయింట లక్ష్మి నిలవదు.

కూరిమి గల దినములలో
నేరము లెన్నడును గలుగ నేరవు మఱి యా
కూరిమి విరసంబైనను
నేరములే తోచు చుండు నిక్కము సుమతీ

భావం: పరస్పరము స్నేహమున్న రోజులలో నేరములెప్పుడును కనుపించబోవు. ఆ స్నేహము చెడగానే అన్నియును తప్పులుగా కనపడుచుండును. ఇది నిజము.

కొంచెపు నరు సంగతిచే
నంచితముగ గీడు వచ్చు నది యెట్లన్నన్‌
గించిత్తు నల్లి కుట్టిన
మంచమునకు జేటు వచ్చు మహిలో సుమతీ

భావం: చిన్న నల్లి కుట్టిన ఆ నల్లి యున్న మంచమును ఎండలో వేయుట కర్రతో కొట్టుట, మరుగునీళ్ళు పోయుట మొదలగు ఆపదలు కలుగును. ఆ విధముగనే అల్పుడైనవానితోడి స్నేహము ఎట్టివారికైనను ఆపదను తెచ్చిపెట్టును.

కొక్కోకమెల్ల జదివిన,
చక్కనివాడైన, రాజ చంద్రుండైనన్‌,
మిక్కిలి రొక్కము లియ్యక,
చిక్కదురా వారకాంత సిద్ధము సుమతీ

భావం: వెలయాలు పుష్కలముగా ధనమీయకున్న ఎంతగా రతిశాస్త్రమును చదివినవాడైనను, అందగాడైనను, గొప్ప రాజశ్రేష్టుడైనను, ప్రేమించి దగ్గరకు చేరదు.

కొఱ గాని కొడుకు బుట్టిన
కొఱ గామియె కాదు, తండ్రి గుణముల జెఱచున్‌
చెఱకు తుద వెన్ను బుట్టిన
జెఱకున తీపెల్ల జెఱచు సిద్ధము సుమతీ

భావం: చెఱకుగడ చివర వెన్ను పుట్టినచో ఆ చెఱకునందలి తీయదనము నంతయు నేవిధముగ పాడుచేయునో ఆ విధముగనే అప్రయోజకుడైన కుమారుడు కలిగిన కుటుంబమునకుపయోగకారి కాకపోవుట యటుండగా తండ్రి మంచిగుణమును కూడా పాడుచేయును.

కోమలి విశ్వాసంబును,
బాములతో జెలిమి, యన్య భామల వలపున్‌,
వేముల తియ్యదనంబును,
భూమీశుల నమ్మికలును బొంకుర సుమతీ

భావం: స్త్రీలయందు విశ్వాసమును, పాములయందు స్నేహమును, పరస్త్రీలయందు ప్రేమయును, వేపచెట్లయందు తీయదనమును, రాజులయందు నమ్మకము వట్టి అసత్యములు.

గడన గల మగని జూచిన
నడుగడుగున మడుగు లిడుదు రతివలు దమలో;
గడ నుడుగు మగని జూచిన
నడ పీనుగు వచ్చె నంచు నగుదురు సుమతీ

భావం: స్త్రీలు సంపాదన కలిగిన భర్తను చూచిన అడుగులకు మడుగులొత్తుచు పూజింతురు. సంపాదనలేని మగనిని చూచినచో నడుచునట్టి శవము వచ్చెనని హీనముగా జూతురు.

చింతింపకు కడచిన పని,
కింతులు వలతురని నమ్మ కెంతయు మదిలో,
నంతఃపుర కాంతలతో
మంతనముల మాను మిదియె మతముర సుమతీ

భావం: జరిగిపోయిన దానిని గురించి ఆలోచించుటయు, స్త్రీలు తన్ను ప్రేమింతురని విశ్వసించుటయును, రాణీవాసపు స్త్రీలతో రహస్యములను విడిచిపెట్టుము. ఇదియే అనుసరించవలసిన మంచితనము.

చీమలు పెట్టిన పుట్టలు
పాముల కిరవైనయట్లు పామరుడు దగన్‌
హేమంబు గూడ బెట్టిన
భూమీశుల పాల జేరు భువిలో సుమతీ

భావం: చీమలు పెట్టినటువంటి పుట్టలు పాములకు నివాసమైనంట్లు, అజ్ఞానుడు కూడబెట్టిన బంగారమంతయు రాజుల వశమైపోవును.

చుట్టములు గాని వారలు
చుట్టములము నీకటంచు సొంపు దలిర్పన్‌
నెట్టుకొని యాశ్రయింతురు
గట్టిగ ద్రవ్యంబు గలుగ గదరా సుమతీ

భావం: ధనము కలిగిన యెడల ఏ సంబంధంలేని వారు కూడ, ఆ ధనము మీది ఆశతో, లేని సంబంధము కలుపుకొని మన కూడా ఉంటారు.

చేతులకు దొడవు దానము,
భూతలనాథులకు దొడవు బొంకమి ధరలో,
నీతియె తొడవెవ్వారికి,
నాతికి మానంబు తొడవు నయముగ సుమతీ

భావం: చేతులకు దానమును, పాలకులకు అసత్యమును పలుకకుండుటయును, అందరికినీ న్యాయమును, స్త్రీకి అభిమానమును అలంకారములు.

తడ వోర్వక, యొడ లోర్వక,
కడు వేగం బడిచి పడిన గార్యం బగునే;
తడ వోర్చిన, నొడ లోర్చిన,
జెడిపోయిన కార్యమెల్ల జేకుఱు సుమతీ

భావం: ఆలస్యమునకు, శరీర శ్రమకును సహింపక తొందరపడిన నేకార్యమును కానేరదు. ఆలస్యమునకును శరీర శ్రమకును ఓర్చుకొన్నప్పుడే చెడిపోయిన కార్యమంతయు నెఱవేరుచుండును.

తన కోపమె తన శత్రువు,
తన శాంతమె తనకు రక్ష, దయ చుట్టంబౌ
తన సంతోషమె స్వర్గము,
తన దుఃఖమె నరక మండ్రు తథ్యము సుమతీ

భావం: తన కోపమే తనను శత్రువులువలె బాధించును. తన శాంతమే తనను రక్షించును. తన దయయే తనకు చుట్టమువలె సహాయపడును. తన ఆనందమే తనకు ఇంద్రలోక సౌఖ్యము. తన దుఖమే తనకు నరకమగును. ఇది నిజము.

ఇవి కూడా చూడండి

మార్చు

వనరులు

మార్చు


శతకములు
శ్రీ కాళహస్తీశ్వర శతకము | వేమన శతకము | సుమతీ శతకము | దాశరథీ శతకము | భాస్కర శతకము | భర్తృహరి శతకములు | నారాయణ శతకము | కృష్ణ శతకము | ఆంధ్ర నాయక శతకము | నరసింహ శతకము | రామలింగేశ శతకము | వృషాధిప శతకము | మారుతి శతకము | దేవకీనందన శతకము | గువ్వలచెన్న శతకము | కుమార శతకము | కుమారీ శతకము | వేంకటేశ శతకము | సూర్య శతకము | సర్వేశ్వర శతకము | శ్రీ (అలమేలుమంగా) వేంకటేశ్వర శతకము | ధూర్తమానవా శతకము | కుప్పుసామి శతకము | కామేశ్వరీ శతకము
 

This work was published before January 1, 1930, and is in the public domain worldwide because the author died at least 100 years ago.