సుకవి మనోరంజనము/చతుర్థాశ్వాసము

సుకవి మనోరంజనము

చతుర్థాశ్వాసము

శ్రీ భారతీశ సన్నుత
భాభా ద్బహు నామ లింగ పంచపృషత్క
ప్రాభవ తూలాపహచ
క్షీ భవ దగ్నిస్ఫలింగ! కుక్కుటలింగా!

1

రేఫ శకటరేఫలు : లాక్షణికుల పొరబాటులు

గీ.

[1]అవధరింపుము; కాకునూర్యప్పసుకవి
హిమకరాదుల గురు లఘు రేఫములను
నుభయరేఫాలి నేర్పాటు నొనరఁజేసి
రందుఁగల పొరపాటు లుదాహరింతు.

2
కాకునూరి అప్పకవిగారు ఆంధ్రశబ్దచింతామణి యందు
గీ.

రేఫము ఱకారమును నన రెండు తెఱఁగు
లగుచు వికృతి పదంబుల నమరియుండు
దాని సంస్కార పూర్వకావ్యప్రయోగ
సరణు లెఱుఁగవలయు సజ్జనవిధేయ (2-193)

3

సీ.

శ్రీ కామెపల్లి పురీ గోపికాజార
             యసురసంహార నీ కంకితముగ
నాటి కవీంద్రకావ్యములెల్ల శోధించి
             క్రమత హ్రస్వములు దీర్ఘములునైన
యచ్చుల మీఁదను హల్లుల మీఁదను
             గలుగు రేఫ ఱకారములు వచింతు
తాళ పాకాన్వయోదధీ పూర్ణ ధవల ధీ
             ధితి పెద తిరుమల దేశికుండు
మొదలైనవారలు మునుపు రచించిన
             యవియెల్ల చాలవా యనఁగ వలదు
వెండియు నొకకొన్ని వెదకి కూరుతుఁ గవి
             రాజులు మేలని ప్రస్తుతింప...........(2-198)

4
అనిచెప్పి, రేఫముల కొకసీసమాలిక, ఆకారముల కొకసీసమాలిక చేసినారు. రెండును పరిశీలించితే, రేఫములందు ఱకారములును, ఱకారములందు రేఫములును గలసినవి. ఉభయరేఫములని వ్రాసినవి ఉభయరేఫములుగావు. 5
"అరుగుట-పోవుట, చెఱచుట, తెఱఁగులు, తొఱఁగుట, తోఱలుట, నెరసులు విస్తరించుట, పరిగొనుట, పరిచనుదెంచుట, పరిమెయి, పరవకటి, పరిమార్చుట, పెరుగుట, క్రమ్మఱ, మఱదలు – ఇవి కుఱుచలమీఁది రేఫ, ఱకారములు రెండు నగును. 6
ఆరుట = శమించుట, తీరనికినుక, తీరులు, పోర నీరయిపోవుట, మారి మసఁగుట, వేమారు – ఇవి దీర్ఘములమీది రేఫ, ఱకారములు అని వ్రాసినారు. (మరియు) 'అరుగుట' గురురేఫ మగుటకు (ఉదాహరణముగా)—
మౌసలపర్వము (1-169)
క.

మఱునాఁడ యగుట లెస్సగ
నఱిగి యినుం డపుడు వేఁడి యడిరిన దీప్తుల్
తుఱగలి గొని పశ్చిమగిరి
చఱికి ననతి దూరుఁడై విశదుఁడై తోచెన్.

7
(అను పద్యము' వ్రాసినారు). రేఫ, ఱకారములు రెండును ఈ యొకపద్యమువలన నెటుల తెలియవచ్చునో తెలియరాదు. సరెకదా, ఈ పద్యమైనను - పామరులకును తెలియవచ్చెడు తప్పుశబ్దము - అనగా, ఆ శబ్దమేలేని లక్ష్యము వ్రాసినారు. శ్రీకృష్ణమూర్తి వనమునందు శరీరమును వదిలిన పిమ్మట నర్జునుఁడు నక్కడికి వెళ్ళి విచారించుచున్న సమయమందలి పద్యము (ఇది). ఈ పద్యముకు పైపద్యములు, క్రిందిపద్యమును, ఇదియును పరిశీలించితే సులభముగానే పొరపాటు స్పష్టమవుతున్నది.— 8
ఉ.

అమ్మేయి నూరకుండ ననుయాయి జనమ్ములఁ బెక్కులాడి చి
త్తమ్ము కలంకదేర్చి యుచితక్రియకు న్మొగకొల్పి బంధుసం
ఘమ్ముల నిందుఁ దెత్తమొ వికారవిదూర! యుపేంద్ర భవ్యదే
హ మ్మల గొంచుఁబోదమొ సమర్థవిధం బొక టేర్పఱింపుమా.

9

(1-167)

చ.

అని యడుగంగ దైవగతి నంబుధి పట్టణ మాక్రమించు టె
ద్దినమున నొక్కొ యన్వగ మదిం జొనిపెం గురునాథ! యిప్పుడ
వ్వినుతగుణాభిరాముఁ డడవిం దను త్రిమ్మటఁజన్న ప్రొద్దుల
య్యనుచరకోటితోడఁ దెలియం దలపోయఁగ లెక్కతోచినన్.

10

(1-168)

క.

మఱునాడ యగుట లెస్సఁగ
నెఱిఁగె నినుం డపుడు వేడి యెడలిన దీప్తుల్
తుఱగలిఁగొని పశ్చిమగిరి
చఱికి ననతిదూరమున విశదుఁడై తోచెన్.

11

(1-169)

సీ.

దానికి జనములు దాను నుత్తులమంది
             చర్చించి కార్యంబు చాయ గాంచి
మనము కృష్ణునిఁ గని చనుదెంచుఁవారమై
             పురమున నివ్వార్త పుట్టకుండ
నడచి యిచ్చట మాట లవి కొన్ని ఘటియించి
             చెప్పి యీరేయి చెచ్చెరఁ బ్రయాణ

మునకుఁ గృత్యములగు పనులెల్ల సమకట్టి
             వేగంబ గ్రక్కున వెడలవలయు
గాని వెడలకున్న భానూదయంబున
వనధి పురము ముంచికొనఁగ గణన
సేయరానియట్టి సేగియు, వ్రయ్యు భా
వంబు వగయు నెల్లభంగిఁ గలుగు (మౌసల 1–170)

12
'మఱునాడే సముద్రుడు ద్వారకాపట్టణమును ముంచగలడని నిశ్చయముగా ‘నెఱిఁగె' నని స్పష్టమేకదా! (కావున పద్యమందు) 'ఎఱగె' ననిగాని, 'అరిగె' నని గాని కాదు. అరుగుటే అర్థము చెప్పితే అరిగెడు వాడెవడో, కర్త కనుపించడు. ఇంతమాత్రమేకాదు. (ఇది) సూర్యాస్తసమయమందలి ప్రవృత్తి కదా! కాకపోతే సూర్యుడు 'పశ్చిమగిరి చఱికి ననతి దూరుడై విశదుడై' అని చెప్పరు గదా! సూర్యాస్తసమయమందు 'వేడియడరిన దీప్తుల్', అనగా-నుష్టత్వముచే ప్రజ్వరిల్లుచున్న దీప్తులని చెప్పుటయు గూడదుకదా! 'వేడి యెడలిన' వనగా- ఉష్ణత్వము నెడబాసిన వనుట సాయంతనమందు యుక్తము. కావున 'విశదుఁడై' అని. అన్నివిధములచేత నప్పకవిగారు వ్రాసినటులైతే తప్పులని (వేరే) చెప్పనేల? 'అరుగుట' రేఫముగాని ఱకారమని ఎవరును చెప్పలేదు. లక్ష్యమున్ను కనిపించదు. మరియును దీర్ఘములమీద నుభయరేఫములకు వ్రాసిన పద్యము— 13
‘మాఱి' యనుటకు కర్ణపర్వము (3-10)
ఉ.

పాఱినఁ జూచి కౌరవ నృపాలుఁడు సూతతనూజుతోడ నీ
కాఱియ మద్బలంబునకుఁ గాదగునే వివిధాస్త్రసంపదన్
మీఱిన నీవు గల్గిన నమేయపరాక్రమ నీకుఁ బాండవుల్
ల్మాఱి తలంప నీదగు బలంబును జేవయు జూపు మిత్తఱిన్.

14
(ఇక్కడ అప్పకవిగారి దృష్ట్యా) 'మాఱి' యనగా-సంహారకర్త్రియయిన శక్తి కర్థముగదా! 'నీకుఁ బాండవు ల్మాఱి'- చంపేవారని అర్థము చెప్పవలెనుగదా! ఇదే అర్థమయితే దుర్యోధనుడు తన సేన విరిగిన పిమ్మట కర్ణునితో ననెడు వాక్యముగదా (ఇది) ఈ కాఱియ = ఈ కష్టము. 'వివిదాస్త్రసంపద న్మీఱిన' అను విశేషణమున్ను, 'అమేయపరాక్రమ' అను సంబోధనమున్ను (కర్ణుని) శౌర్య

ధైర్యసాహసాదులను ప్రకటించుటకే కదా! కావున, నీదగు బలంబును, అనగా-

అస్త్రబలమును, చేవయు పరాక్రమమును, చూపుము = ప్రకటించుము, ఇత్తఱిన్ = ఇటువంటి కష్టసమయమందు నూరకుండకుమని ప్రోత్సాహము చేయునపుడు, 'మాఱి' = చంపేవారనుట అసంగతమని చెప్పనేల! "పాండవుల్ మాఱే?" = మాఱె యనగా 'ఎదురేనా' అని అగ్గించుటేకాని, చంపేవారని తిరస్కరించి చెప్పరాదు. (పద్యమందున్నది) 'మాఱె' యను పదముగాని, 'మారి' యను పదముగాదు. ఆ మారి పదమైనా ఱకారముతో ప్రయోగ మొకటియైనా కనుపించదు. రేఫముకు విరాటపర్వము.
గీ.

కాలపక్వంబువైన లోకముల జముఁడు
బారి సమరెడు చాడ్పున మారి మసఁగి
యుగ్రరూపుఁడై శౌర్యసమగ్రబాహు
సంపదుద్దాముఁడగు క్రీడి చంపె రిపుల.

15
'
బారి' పదమును రేఫములం దందఱు వ్రాసినారు. (మరియు)
భీష్మపర్వము (3-242) నందు
గీ.

అనిన నతఁడు పాండవాగ్రజుఁ గవలను
దాకి విపులబాహుదర్ప మొప్ప
నారసములఁ బొదవి మారిమసంగిన
ట్లైనఁ జూచి నరుఁడు ననిలసుతుఁడు.

16
(అని మారి పదము రేఫముగా నిర్ధారితమై ఉన్నది).
'ఎఱిఁగె' ననుపదము 'నరిగె'నను పదమనుకొనుటయు, నది ఱకార మనుకొనుటయును, 'మాఱె' అనుపదమును 'మారి' అనుకొనుటయు, నది ఱకారమనుకొనుటయు (తప్పని) సులభముగా నీ గ్రంథపరిశీలనము వలన తెలియవచ్చును. 17
(ఇక) ఆరుట = శమించుట– ఈ పదముకు మాత్రము (అప్పకవి గారు) రేఫ ఱకారములకు రెండు లక్ష్యములు వ్రాసినారు. ఇందులో—
ఆదిపర్వము (4-19)
క.

కాఱడవిఁ బఱచు మృగముల
నూఱటకుం దిగిచి డస్సి యున్నతని శ్రమం
బాఱఁగ నెద పరితాపము
దీఱఁగఁ బై వీచె నన్నదీపవనంబుల్.

18
(అను) నీ పద్యము మాత్రము బాగున్నది. కాని, శాంతిపర్వము (1-13) :

కౌరవులు సేయు నవమతి
కారణమునఁ గోపమెత్తు కర్ణుని వదనాం
భోరుహముఁ గనుఁగొనఁగ శ్రమ
మారు న్నా వశముగాక యంతన బుద్ధిన్.

19
అని వ్రాసినారు. 'ఆరుట' అను పదము నిండుటకు నడగుటకు నర్థము. 'నిండె'నను నర్థమైనపుడు రేఫము, అణగు నను నర్థమైనపుడు ఱకారము. ఆప్రకారముగా నొకర్థమైనపుడు రేఫము, నొకర్థమైనపుడు ఱకారమునగు పదములు పెక్కుగలవు. ముందు ముందు కొన్ని తెలియపరచుతాము. (అర్థభేదముచే భిన్నరేఫము లగునను నీ యంశము) నెఱుంగక, 'శమించుట' కర్థమనియు, రేఫ ఱకారముల రెంటను గలదనుటయు భ్రాంతత్వము. క్రిందటి రెండు పద్యముల(ందు)వలె భ్రాంతత్వము (ఇచ్చట) సులభముగా తెలియదు. ఈ పద్యమందు ‘శ్రమ మారున్' అని యుంటే అర్థము కుదురదు. దుర్యోధనాదులు సేయు నవమతిచేత కోపము ప్రజ్వరిల్లుట సరే, కర్ణుని ముఖము గనుగొంటే 'శ్రమ పోయె” నని చెప్పుట ‘పృష్ఠతాడనము-దంతభంగము' అను సామ్యముగా నున్నది. సామ్యమేమి "కౌరవావమతిచేత క్రోధోదయ మయీది, తత్క్రోధముచే శ్రమోదయ మయీది, కర్ణముఖావలోకనమున తచ్ఛ్రమము పోయీది[2]'— ఈ లాగున ననరాదా!" అంటే యీ యర్థము బాగులేదు. (ఇది) మూలమునకు విరోధించినదిన్ని, అసందర్భమైనదిన్ని. ఇట్టి యర్థము పండితులు చెప్పరాదు. (ఎందుకనగా వ్యాసభారతము) శాంతిపర్వము ప్రథమాధ్యాయమునందు——
శ్లో.

సభాయాం క్లిశ్యమానస్య, ధార్తరాష్ట్రైః దురాత్మభిః
సహసోత్పతితః క్రోధః, కర్ణం దృష్ట్వా ప్రశామ్యతి'

అని యున్నది (దానికి తెలుగు భారతమున) పద్యము—
క.

కౌరవులు సేయు నవమతి
కారణమునఁ గోపమెత్తుఁ గర్ణుని వదనాం
భోరుహముఁ గనుఁ గొనఁగ శమ
మారు న్నావశముగాక యంతన బుద్ధిన్."

20
తనకు కర్ణు డన్నని యెఱింగిన పిమ్మట ధర్మరాజు దుఃఖాక్రాంతుడై యనుకొనే (సందర్భములోనిదీ పద్యము). సభయందు దుర్యోధనాదులు ద్రౌపదీమానభంగము సేయునపుడు వారిపై క్రోధము ప్రజ్వలించేది. కర్ణుని నన్నని యెఱుంగకపోయినా ధర్మరాజు ఉత్తమోత్తముడు గావున (అతనికి కర్ణుని మొగము చూడగానే) శాంతి నిండేది. "అన్నగాకపోతే యెందుకు నా హృదయము చల్లగా నుండేది?" (అని) విమర్శ చేసుకోనైతినని (ధర్మరాజు) పరితపించుచున్నవాడని భావము. అప్పకవిగారు " 'శ్రమ మారున్' అనే వ్రాసియుందురు. లేఖకప్రమాద మనుకోరాదా" అంటే, రేఫ సీసమాలికయందు, “శ్రమ మారె, పొంగారె" అని వ్రాసి, అర్థమున్ను శ్రమమారుట = బడలిక తీరుట, పొంగారుట = పొంగు తీరుట అని వ్రాసినారు.
ఱకార సీసమాలిక యందున్ను (2-197)

"...ఆఱు సంఖ్యాపద మాఱడి యాఱిక
             పంట చిచ్చాఱె పాపంబు లాఱె
నాఱని తేజము లాఱిన ముత్తెంబు
             తడి యాఱె శ్రమ మాఱె తాప మాఱె...'

21
అర్థము చిచ్చాఱుట, పాపము లాఱుట, ఆఱని తేజము, ఊటాఱిన ముత్యములు, కోక తడి యాఱుట, శ్రమ మాఱుట" అని రేఫ ఱకారముల క్రమమందు 'శ్రమ మాఱె’ అని వ్రాసి అర్థమున్ను స్పష్టముగా నదేప్రకారము వ్రాసినారు. కావున (ఇది) లేఖకప్రమాదముగాదు. అప్పకవిగారి పాండిత్యమహిమయే. 22
మరియును,— తొఱగుట, నెరసుట, పరిగొనుట, పరిచనుదెంచుట, పరిమెయి, పరవకటి, పెరుగుట, నెరసె ననుట ఈ పదములు రేఫములకు లక్ష్యములు వ్రాసినారు. (ఆయితే) తొరగుట, నెరసుట — ఈ రెండు పదములు గాక మిగిలినవి రేఫములే కాని, ఱకారములు కావు. చెఱచుట క్రమ్మఱ మఱదలు, తెఱగు, తీఱు, తేఱుట, వేమాఱు — ఈ పదములు ఱకారములకు లక్ష్యములు వ్రాసినారు. (అయితే) వేమాఱు, తొఱుగుట, నెరసుట —ఈ మూడు పదములు మాత్రము ఉభయ రేఫము లౌను. అప్పకవిగారు ఉభయములకు లక్ష్యములు వ్రాయలేదు గాని, ఉభయములకు ప్రయోగములు గలవు. ఇరులు, రొమ్ము, చీరుట = రెండు తునుకల కర్థము ఇవి ఱకారము లన్నారు. రేఫములకును ప్రయోగములు గలవు, కారులు, కూరలు, చారు, రేకులు, దూరులు వలుకుట — ఇవి రేఫము లన్నారు. ఱకారములకు ప్రయోగములు గలవు. దూరులు పలుకుట — రేఫము. పొదల దూఱుట - ఱకారమన్నారు. అరుదు, చురచుర, ఇందరు, ముందర, మరి, వేర్వేర ఱకారము లన్నారు. ఉభయము గలవు. ఇవియన్నియు లక్ష్యములలో ముందు వ్రాసుతాము. 23
అప్పకవిగారు కవిత్వమందు గలిపిన గురులఘు రేఫములు (మఱియును గలవు. చూపుతున్నాము.) 24
క.

అఱటుల బఱటుల బఱిటెల
గఱిటెల మొఱిటెలను గల ఱకారములెల్లన్
ధర నెఱసున్నలునగు న
య్యఱటుల బఱటులను ద్రుతములగు వలసినచోన్.

25
'ధర' - రేఫము. అందే (4–265)
గీ.

పరగ కందము పద్యయు మఱి విపులయుఁ
జపలయును ముఖచపలయు జఘునచపల
యనఁగఁ గందపద్యంబు లీయాఱువిధము
లఖిలసుకవికృతులలోన నలరుచుండు.

26
'పరగ' (పదము) రేఫసీసమాలికయందును, 'మఱి' (పదము) ఱకారసీసమాలికయందును వ్రాసినారు (గాని), వీటిలో నుభయరేఫములందు
నొకటియు నప్పకవిగారు వ్రాయలేదు. లాక్షణికులండఱు (గూడ) 'పరగ' రేఫమని, 'మఱి' ఱకారమని నిర్ణయించినారు. (కాని 'మరి' ఉభయములందు గలదు). 27
శకటరేఫ యగుటకు—
శల్యపర్వము (2-387)
చ.

మఱియు నొకండు వింటె పవమానతనుజునిచేత పెన్దొడల్
విఱిగి ధరిత్రిపైఁబడుడు వేగమె వచ్చి శిరంబుఁ దన్నె నే
డ్తెఱ గలయప్డు శత్రు నవధీరితుఁజేయుట యొప్పుగాక యే
పఱినఁ బరాభవించిన జనావలి నవ్వదె నొవ్వదే మదిన్.

28
రేఫమగుటకు, అందే (1-34)—
క.

సురసరిదాత్మజుఁడును
గురుడును గర్ణుండు దెగుటకుం దలఁకక యె
వ్వరి బాహుబలము గైకొని
మరి కోల్తల జేసి రొక్కొ మనవా రనికిన్.

29
'మరి' ఉభయము నందుఁడఁగా శకటులందు నిర్ణయించుట యొకటి, రేఫముతో ప్రాసము గూర్చుట రెండు ప్రమాదములు. 30
'చుఱచుఱ కాలుట' శకటరేఫ మన్నారు. రేఫ మగుటకు—
శల్యపర్వము (2-335)
క.

తురగంబులతోఁ గూడఁగ
నరదము సకలంబు నుజ్జ్వలానలశిఖలం
జురజురవోయినఁ గని య
న్నరుఁ డచ్చెరువంది కృష్ణునకు నభిముఖుఁడై.

'కృష్ణునికి' యని యున్నది. (యతిభంగము కానరు). 32
శకటరేఫ మగుటకు—
తిక్కనగారి ఉత్తర రామాయణము (8-106)
క.

చుఱచుఱ డెందము చూడిన
తెఱఁగున నొక్కింత స్రుక్కి ధీరుం డగుటన్

గొఱత వడకుండ వినుటకు
పెఱవారల కిట్టులనియె, బ్రియనదయుండై.

33
'అరుదు' రేఫ మన్నారు. శకటరేఫ మగుటకు—
తిక్కనగారి ఉత్తర రామాయణము (9-57)
క.

మఱియు నొకమాట యెవ్వరు
నెఱుఁగనియది దశరథునకు నేకాంతమునం
దఱమఱ లేక దృఢంబుగ
నఱుదుగ నొకతిబిసి చెప్ప నంతయు వింటిన్.

34
'పెఱుగుట' శకటరేఫ మన్నారు. రేఫ యగుటకు—
తిక్కనగారి ఉత్తర రామాయణము (9-75)
క.

పెరుగుట స్రగ్గుట దెవులం
బొరయుట యవశంబు కాన పుట్టువు చావుం
బెరయుట పాయు పదార్ధో
త్కరముల నైజ మది యెట్లు తప్పింపఁదగున్?

35
ఆదిపర్వము (3-12)
సీ.

పాండుకుమారులు పాండుభూపతిపరో
             క్షంబున హస్తిపురంబునందు
ధృతరాష్ట్రు నొద్దఁ దత్సుతులతో నొక్కట
             బెరుగుచు భూసురవరుల వలన
వేదంబులును ధనుర్వేదాది విద్యలు
             గఱచుచుఁ గడలేని యెఱుక దనరు

36
'చేరుట' రేఫ మన్నారు. శకటరేఫ మగుటకు—
ఆదిపర్వము (5-166)
సీ.

కూడి జలక్రీడ లాడుచోఁ గడఁగియా
             ధృతరాష్ట్రుతనయుల నతులశక్తి
లెక్కించియుఁ బదుండ్ర నొక్కొక్క భుజమున
             నెక్కించుకొని వారి నుక్కడంగ

గొంచక నీటిలో ముంచుచు నెత్తుచు
             గాణించి తీరంబు చేఱఁబెట్టు........

37
‘చీరుట' తునకలు సేయుట - శకటరేఫ మన్నారు. రేఫమగుటకు—
అశ్వమేధపర్వము (4-104)
ఉ.

సారథిఁ గూల్చి యశ్వములఁ జంపి రథంబు వగిల్పి కేతువుం
జీరి శరాసనంబు పొడిచేసి(న నమ్మగథుండు ధీరతో
దారగతిన్ సముజ్జ్వలగదాభ్రమణంబున బాహువొప్ప న
వ్వీరవరేణ్యుపైఁ గవిసె విక్రమ మాకృతిదాల్చి పొల్చెనాన్)

38
అరణ్యపర్వము (6-187)
ఉ.

ఘోరగదావిదారణవిఘూర్ణితశాత్రవకుంభికుంభముల్
జీరుచు మౌక్తికప్రతతిచే రణభూమి (నలంకరించు కే
లీరసలోలుఁడై సమదలీల బకాంతకుఁ డేఁగుదేరఁ గ
న్నారఁగఁ జూచి కాక యిటు లంతకు నీమది త్రుళ్ళడంగునే).

39
'చీరు' పిలుచుట - రేఫ మన్నారు. (కాని) రెండునునుం గలవు. శకటరేఫ మగుటకు—
పోతనగారి భాగవతము - సప్తమస్కందము (194)
ఉ.

పాఱఁడు లేచి దిక్కులకు బాహుల నొడ్డడు బంధురాజిలో
దూఱఁడు ఘోరకృత్యమని దూఱఁడు తండ్రిని మిత్రవర్గముం
జీఱఁడు మాతృసంఘము వసించు సువర్ణగృహంబులోనికిం
దాఱఁడు కావరే యనఁడు తాపము నొందఁడు కంటగింపఁడున్.

40
రేఫ మగుటకు—
శాంతిపర్వము (2-440)
స్రగ్ధర.

ధీరోదారోగ్రలీల న్వినముడు సమరో
             ర్విం బలోల్లాస మొప్పం
జీరన్ బాహసముల్లాసిత ఘనరుచిరా
             సి ప్రభా భాసురుండై

యారక్షోనాథుపైఁ బేఱలుక మఱపుజే
             యంగ నీతండు డిగ్గెన్
దే రుద్యత్ ఖడ్గదీప్తుల్ దెసల నిగుడ దై
             తేయవీరు ల్చలింపన్.

41
'ఉల్లాసిత' (అని లకార)దీర్ఘము (గూడ కలదు). 42
‘ముందఱ’ శకటరేఫమన్నారు. రేఫమగుటకు—
ఆదిపర్వము (3-241)
క.

ధరణిఁ గడుపేదవారును
పురుటికి ఘృతతైలధాన్యములఁ జెచ్చెరముం
దర సంగ్రహింతురని మన
కరుదుగ నతిదుర్లభంబు లర్థము లేమిన్.

43
శకటరేఫ మగుటకు—
ఉద్యోగపర్వము (2-294)
చ.

ఎఱిఁగి యెఱింగి యొండె మది నేది యెఱుంగక యొండె నెప్డు నం
దఱు వినఁ బాండునందనులు దర్పితులై యని గెల్తురండ్రు ముం
దఱ నిను బాహ్లికున్ గురునిఁ దక్కినవారిని నమ్మి నేను నే
డ్తెఱ నని సేయఁబూనితి కడిందిమగంటిమితోడఁ జాలరే.

44
ఇందఱ - శకటరేఫ మన్నారు. రేఫ మగుటకు—
ఉద్యోగపర్వము (4-228)
మ.

వరదివ్యాస్త్రవిదుండు బాహుఘనుఁ డశ్వత్థామ గాండీవితోఁ
బురుడింపందగువాడుఁ వీని కెన యీ భూలోకసంచారు లె
వ్వరు లే రీతఁడు బ్రాహ్మణుండనిన భావంబూనఁగా నోర్వమిం
దర నూహింపఁగలేదు కాని జము చందంబయ్యెడిన్ బోరులన్.

45
'చారు' రేఫ మన్నారు. శకటరేఫ మగుటకు—
శ్రీనాథుని హరవిలాసము (2-32)
ఉ.

బోఱున వర్షముల్ గురియ సువ్రతుఁడా చిఱుతొండనంబి దై
వాఱెడు భక్తిఁ బెట్టు శివభక్తుల కర్థిఁ జతుర్విధాన్నముల్

తాఱని యొల్పుఁ బప్పును ఘృతంబును దియ్యని పానకంబులున్
జాఱులు పిండివంటలును శర్కరయున్ దధియున్ యథేచ్ఛఁగన్.

46
'చేఱు' శకటరేఫ మన్నారు. రేఫ మగుటకు—
కళాపూర్ణోదయము (7-124)
ఉ.

క్రిందను మీదనుం బడి యకించిదసూయఁ బెనంగులాడు న
ర్ధేందుఁడు నుల్లసత్ఫలసమృద్ధతమిస్రమువోలెఁ జాలఁ జె
న్నొందెడు భాలముం గబరియు న్మరి పాపట ముత్తియంపుఁజే
రుం దలకంపుఁగస్తురియు రూఢిగ బాహులలీల నొప్పఁగన్.

47
'రేకు' రేఫ మన్నారు. శకటరేఫ మగుటకు—
భీష్మపర్వము (2-20)
ఉ.

ఱెక్కలు సించి కంఠమున ఱేకులు వాపి శిరంబుపుచ్చి పే
రుక్కునఁ గ్రొంచచందమగు నొడ్డుఁ గలంగఁగజేసి భీష్ముఁ డే
దిక్కునఁ దానయై దిశలు దీటుకొనన్ శరకోటి నింపఁ గెం
పెక్కిన కంటిక్రేవ చెలువెక్కుడు సేయఁగ గ్రీడి కృష్ణుతోన్.

48
'కారులు' రేఫ మన్నారు. శకటరేఫ మగుటకు—
ఉద్యోగపర్వము (3–107)
ఉ.

ఆఱడి పోకయున్ ఫలము లందుటయుం గని పల్కనేరమిన్
మాఱట నోరిదాననయి మాటలు చిత్తమునం దలంపకే
కాఱులు వల్కెదన్ వినుము కర్జము నెగ్గును (గాన నల్కమై
వీఱిడియైన మానిసికి వెండి వివేకము గల్గనేర్చునే.)

49
'కూర' రేఫ మన్నారు. శకటరేఫ మగుటకు—
కాకమాను రాయని బహులాశ్వచరిత్రము (4-50)
క.

ఆఱేడు వగల బాఱుల్
నూఱువిధంబుల రసావలు ల్వేయు వహుల్

కూఱలు పచ్చ ళ్లూర్బిం
డూఱుంగాయలకు లెక్కయు న్మరి కలదే.

50
'అర' = సగము, దీనికి లక్ష్యము-అరగంటఁ జూచుట = సగము కంటఁ జూచుట, అరగొఱత = సగము తక్కువ- ఈమొదలైనవిన్ని, చెరువు = తటాకము, చెరగులు = అంచులు — ఇవి రేఫము లన్నారు. అఱచెయ్యి, అఱకాలు, తఱలుట, తీఱు, చూఱ, నీలపుఱాయి — శకటరేఫము లన్నారు. ఉభయములును గలవు. 51
'అర' రేఫ మగుటకు
తిక్కనగారి ఉత్తర రామాయణము (6-30)
చ.

అరవిరిగుత్తులం బొలిచి యల్లన గాడ్పుల నీగు నీరతన్
దరహసితోదయంబు స(విలాసతనూవలనంబుఁ గల్గు సుం
దరుల తెఱంగుగాఁ బతి విధంబున నున్న రసాలపోత మీ
గిరితటభూమికిన్ సరసకేలికి వచ్చిన మాడ్కి నొప్పెడిన్).

52
కళాపూర్ణోదయము (1-41)
సీ.

అరవిడు గొప్పున విరుల వాసనకుఁ దో
             రపుటూర్పు గాడ్పులు ప్రాపుగాఁగ...

53
కవికర్ణరసాయనము (3-167)
క.

గరివంక బొమలపైఁ గ
స్తురిఁ దీర్చిన తిలకరేఖ సుదతికిఁ బొలిచెన్
మరుఁడు వెడవింటఁ దొడిగిన
యరవిరి నును నల్లగల్వయమ్మునుబోలెన్.

54
శకటరేఫ మగుటకు
విరాటపర్వము (2-83)
సీ.

కరువలి సుడియమిఁ గదలక చెన్నొందె
             నఱవిరిదమ్ముల నుఱక దెగడి...

55
అరణ్యపర్వము (3-235)
క.

అఱబోర కుఱుచ చేతులు
నొఱవ శరీరంబు గలిగి యొటులకుఁ జూడం
గొఱగాకుండియు మన్మథు
నొఱపులఁ బడియెడు నితండు యువతిప్రీతిన్.

56
రంగనాథ రామాయణము
ద్వి.

అఱగౌను లసియాడ నలసయానముల
మెఱువులోయలతలై మేదీఁగ లొలయ

57
అరచేయి, అరకాలు– అనగా క్రిందివైపు (చేయి, కాలు) అని అర్థము గాని, సగము (అని అర్థము) కాదు, మీజేయి, మీఁగాలు– అనగా పైవైపు అని అర్థము. అరచేయి, అరకాలు క్రిందవైపు అర్థము గావున నొకటిగా నెంచవలెను. 58
రేఫ మగుటకు
రామాభ్యుదయము (5-172)

అరకాలు ముల్లు గొన కిదె
తిరిగి రఘుస్వామి యేగుదెంచు న్మదిలో
తరుణీ వెఱవకు విపినాం
తరమున నిను విడిచిపోవఁ దగ దిది నాకున్.

59
శకటరేఫ మగుటకు
శ్రీనాథుని నైషధము (8-125)
మ.

తఱి నాక్రాంతసమస్తలోకబలివిధ్వంసీ... యోదేవ నీ
యఱకా లుధ్ధతి రాహుమండలము బ్రహ్మాండంబుతో నెత్తినం
గుఱగుఱ్ఱం చెడ సంధి బిట్టొరలు నఘ్ఘోరాహి నీ యంఘ్రికిన్
కిఱుచెప్పైన విధంబుగా మనములోఁ గీలించిన ట్లయ్యెడున్.

60
స్త్రీపర్వము (2-88)
క.

పిఱుదం గురు ధరణీపతి
యఱచేతం బ్రాణములుగ నరినృపతిబలం
బుఱతెగువ ముందటం బే
సుకవి మనోరంజనము
ర్గొఱలుట చిత్తమునఁ బెట్టుకొని హరియించున్.

61
'చెఱువు' శకటరేఫ మగుటకు
ఎఱ్ఱనగారి రామాయణము
మ.

చెఱకుం దోటలఁ బెంచి శాలిమయ సుక్షేత్రస్థలుల్ నించి య
క్కఱ లేకుండఁగఁ బూగ నాగలతికాకాంతారముల్ బ్రోచి యే
డ్తెఱ నంతం గుముదోత్సలాబ్జవనవాటీకోటిఁ బాటించి పెం
జెఱువుల్ వొల్బుఁ బురంబునల్దెసలఁ బ్రస్ఫీతాంబుపూర్ణస్థితిన్.

62
మరియును గలవు, రేఫ యగుటకు.
సీ. గీ.

తనరు బక పఙ్క్తులకు జానుదఘ్న మయ్యె
చెరువు గమి యుడుములన రేల్ దిరిగె కుక్క
పసికి (బావులఁ బడుటకు బనులు యెరువు
టెఱలకు మొసళ్లు మలుగు మీన్బొఱియ దూఱె)

63
'తిరుగుట' ఉభయము గలుగుటవలన 'చెరువు' రేఫముకు చింత్యము. 64
'చెరగు' రేఫ మగుటకు
శ్రీకృష్ణరాయల ఆముక్తమాల్యద (2-17)
చ.

రవి యను దివ్వె కేతువు చెరంగున మూసి కృతోర్ధ్వయంత్ర వా
ర విరల ఘర్మమై కలరవాల్పరవోక్తుల (వాంత ధూపరా
జి వరనిశ న్దనన్మదన చేతులఁ జాతురి నెయ్యపుం గురుం
జువిదలు దార్ప విష్ణు పదమొత్తుఁ బురీ గృహలక్ష్మి నూత్ననాన్)

65
కాకమానురాయని బహులాశ్వచరిత్ర (4-5)
ఉ.

రంగు మెఱుంగు బంగరు చెరంగుల రెంటెము నాల్గుకొంగులన్...

66
శకటరేఫ మగుటకు
వసుచరిత్రము (5–73)
మ.

చెఱఁగుల్ పూతపసిండి వ్రాతపసిమిం జిత్రాతిచిత్రంబులై
మెఱయన్ రత్నపుకుచ్చు లంచుల బడి న్మించం దువాళించుఁ గ్రొ
మ్మెఱుఁగుల్ చంద్రిక కాటపట్టు సురభూమీజార్పితం బిచ్చెనా
తఱుచుంగన్నుల వేల్పుపట్టి వసుగోత్రామండలస్వామికిన్.

67
శ్రీనాథుని కాశీఖండము (2-32)
సీ.

కనకమేఖలఁ గ్రుచ్చికట్టె నెవ్వఁడు లీలఁ
             జెఱఁగునఁ బూషార్కు మెఱుఁగుబండ్లు

68
'తరులు' రేఫ మగుటకు
యయాతిచరిత్రము (4-47)
చ.

మురియుచుఁ దమ్మిచూలి ముది ముంద రెఱింగనయట్ల నేర్పుతో
తరులను బైడికట్లిడిన దానఁ దిరంబయి యుండెఁగాక యే
వెరపున నిల్చు దీనివగు వ్రేకపుచన్నుల వ్రేగునం బయల్
దొరసిన యట్టి నెన్నడుము తోరపు నల్వకడంక మెచ్చితిన్.

69
శకటరేఫ మగుటకు
వసుచరిత్రము (5-75)
చ.

తఱు లర నిక్కఁ బూత నెరతావియ చిక్క నపాంగమాలికల్
మెఱుఁగులు గ్రక్క నూరుపుల మేలిమి తేఁటులు చొక్కహారము
ల్కుఱచలు ద్రొక్క ముంగురులు క్రొంజెమటం బదు నెక్క వేలుపుం
దెఱవ యొకర్తు చేది జగతీపతికిన్ సిరసంటె నేర్పుగన్.

70
అహోబల పండితులవారు 'క్రక్క' గ్రామ్యమన్నారు.

'నిష్యూతోదీర్ణమంతాది, గౌణవృత్తి వ్యపాశ్రయమ్
అతిసుందర మన్యత్ర, గ్రామ్యకక్షాం విగాహతే'

అని యున్నందున, గీర్వాణమందు నిష్ఠ్యూతాది పదము లెటువంటివో, తెలుగున 'కక్కు' అను పదమున్ను అటువంటిదే కాని) 'క్రక్క' అనగా 'ప్రసరింపుచుండగ' అని అర్థము. గ్రామ్యము కనుపించదు 71
'తరలుట' రేఫ మగుటకు
వసుచరిత్రము (1-49)
చ.

అరిజయకీర్తిసాంద్రుఁడగు నయ్యలు రామనరేంద్రు సోదరుం
దిరుమల దేవరాయని నుతింపఁదరంబె తదీయహేతిశాం
కరి యతిలోహితావయనగాఁ దను నాత్మ హృదంతరంబులం
దరలక దాల్చువారలకుఁ దార్చు సురీవరణీయవైఖరుల్.

72
శకటరేఫ మగుటకు
భాస్కర రామాయణము
చ.

ఒఱగె వసుధంరాస్థలి మహోరగనాథుఁడు వంగె కూర్మముం
దఱలె నభంబు మ్రోసె సురదంతులు మ్రొగ్గ దిగంతరంబు ల
త్తఱి నదవె న్మరుత్సుతుఁడు దర్పమెలర్ప నహారముద్ధతిం
బెఱుకఁగ గోత్రశైలములు పెల్లదలెం గలఁగెం బయోనిధుల్.

73
'తిరుగుట' రేఫ మగుటకు
ఆదిపర్వము (1-168)
చ.

తిరిగెడుఁ బుట్టలం బొదలఁ ద్రిమ్మరు పాముల రోసిరోసి ని
ష్ఠురభుజదీర్ఘదండమున డొల్లఁగవ్రేయుచు (వచ్చివచ్చి య
య్యిరవున డుండుభంబను నహిం గని వ్రేయఁగ దండమెత్తుడున్
హరి హరి యంచు డుండుభమహాహి భయంపడి పల్కు భార్గవున్.)

74
శకటరేఫ మగుటకు
స్త్రీపర్వము (2–45)
గీ.

ఉడుకు కన్నీరు దడియంగ నొరలుచును వి
చేష్టయై యూరకుండుచు చెలులఁదోడ

తిఱిగి పొగలంగ వేసరి నెఱియ మనల
యవులఁ దిరుగుచునున్నది యక్కటకట!

75
'వాతెఱ' రేఫ మగుటకు
పారిజాతాపహరణము (3-48)
క.

గురువిందఁ జైత్రు డొడ్డినఁ
గరమలుకన్ మాని యపుడు కరచిన నునువా
తెరమీఁదఁ గాననగు పలు
వరుస యనన్ ననలు పల్లవము పై మొనసెన్.

76
శకటరేఫ మగుటకు
ఆదిపర్వము (7-74)
చ.

నెఱిగురులన్ విలోలసితనేత్రయుగంబును నొప్పుకొప్పు వా
తెఱయును దీని యాననము దెల్పుఁ గరంబు మనోముదంబు నే
నెఱిఁగినయంతనుండియును నిట్టుల నాలలితాంగిఁ జూచి యే
నెఱుఁగ సురేంద్రకన్యకలు నిట్టిద రూపవిలాససంపదన్.

77
'తీరు' రేఫ మగుటకు
యయాతిచరిత్రము (5-95)
క.

ఈ రాజున కివముగ నొక
తీరునఁ గావించి సీదఁదీర్పమి దగనా
(యోరుచునా మైసెగలకుఁ
జేరఁగ రాదనుచు నెడము సేయందగునే)

78
శకటరేఫ మగుటకు
తిక్కనగారి ఉత్తర రామాయణము (1-20)
గీ.

సందియంబు పడ విచారంబునకుఁ జొర
మాఱుపల్కు నొండుతీఱు సేయ

(వెరవుగాక పిడుగువ్రేసిన యట్లైన
మాట కియ్యగొనుచుఁ బోటి పలుకు)

79
'చూర' రేఫ మగుటకు
రంగనాథ రామాయణము
ద్వి.

ఏసి బండారంపుటిండ్లలోఁ జొచ్చి
రాసులర్ధములు చూరలు చల్లువారు

80
శకటరేఫ మగుటకు
ఎఱ్ఱనగారి రామాయణము
క.

నూఱుతెఱంగుల నెఱసులు
మీఱఁగ నీ విభ్రమములు మెఱయించు మునిం
గాఱఁగఁ జేయుచు మేనక
చూఱగొనదె యతని తెలివి సొమ్ములు మున్నున్.

81
‘కాఱుట’ గ్రామ్యమౌను. 'నిష్ఠ్యూత' పదమువంటిది 'స్రవించుట’ అర్థము చెప్పితే బాగుంటుంది. ఎఱ్ఱాప్రెగడ 'కాఱుట' పదము ప్రయోగించినందుననే రామరాజభూషణకవి 'క్రక్క' అని ప్రయోగించినాడు. 82
'రాయి' రేఫ మగుటకు
కవిధూర్జటిగారి శ్రీకాలహస్తీశ్వరశతకము
శా.

రాలన్ రువ్వఁగఁ జేతులాడవు, కుమారా, రమ్మురమ్మంచు నే
జాలన్ జంపఁగ, నేత్రము ల్దివియఁగా శక్తుండ నే గాను, నా
శీలం బేమని చెప్ప, నున్నదిఁక నీచిత్తంబు నాభాగ్య మో
శ్రీలక్ష్మీపతిసేవితాంఘ్రికమలా! శ్రీకాలహస్తీశ్వరా!

83
బహులములు గలవు. (ఇక) శకటరేఫ మగుటకు: 84
తిమ్మకవి లక్షణసారసంగ్రహము (3-288)

రాయి యనెడుచోటఁ బాయక రేఫమం
చాద్యులై ప్రసిద్ధులైన కవులు

కృతులనిలిపి రమలమతిఁ దిక్కమభి గురు
రేఫగాగ నివిపె కృతి నుమేశ!

85
భీష్మపర్వము (3-419)
క.

నా యుల్ల మరయ నినుమో
ఱాయో కా కిట్లు రూపఱక విన నేర్చెన్
సాయక సముదయ ఖర భవ
దీయవచనచయము గవియు దేరం దిరమై.

86
శ్రీనాథుని భీమఖండము (2-154)
క.

పోక నడుకొట్టితేనియు
ఱాకింతుఁజుమీ మొగంబు ఱాచట్టుపయిన్
శ్రీకాశిని నిందించిన
నీ కింతట నెలవు పోవు నీచచరిత్రా.

87
'మరలుట' ఉభయముగలదు. ఱంతు, పరుసదనము, పరతెంచుట, చూపర, పలుమఱు - శకటరేఫము లన్నారు. ఉభయములుగలవు. 88
'రంతు' రేఫ మగుటకు
శ్రీనాథుని చాటుధార

అంగడివీథి పల్లవుల కాసగ మామిడిపండు లమ్ముచున్
జంగమువారి పిన్నది పిసాళితనంబునఁ జూచెఁబో నిశా
తాంగజబాణకైరవసితాంబుజమత్తచకోరబాలసా
రంగతటిన్నికాయముల రంతుల జేసెడి వాలుచూపులన్.

89
వారిదే మరొక చాటుధార

రంతుల్ సేయకు కుక్కుటాధమ దరిద్రక్షుద్ర శూద్రాంగణ
ప్రాంతోలూ చాల మూలపల్లవకణ గ్రాసంబుచేఁ క్రొవ్వి దు
ర్ధాంతస్వాతభిన్నహృత్ఫణిఫణాంతర్మాంసమాధుర్యమే
చెంతం గ్రోలు ఖగేంద్రు చెంగటను నీ జెంఝూటముల్ సాగునే.

90

298

శకటరేఫ మగుటకు
శ్రీనాథుని భీమఖండము (4-96)
ఉ.

ఱంతులు మీఁదు మిక్కిలిగ ఱాగతనంబున దొమ్మి చేసి దు
ర్ధాంతపరాక్రమోన్నతులు దానవదైత్యులు (వేల్పువెజ్జు ధ
న్వంతరి చేతి దుగ్ధమయవార్థి సుధారసపూర్ణకుంభమున్
సంతనకట్టి పుచ్చుకొని చయ్యననేగిరి నిర్విశంకతన్)

91
యయాతిచరిత్రము (4-22)
రగడ.

ఱంతేమిటికిఁ గొఱంతే మల్లెల
వంతులకాసే వంతులు చెల్లెల.

92
'పరుసదనము' రేఫ మగుటకు
ద్రోణపర్వము (5-51)
క.

తురగము తురగము కరి కరి
నరుని నరునిఁ దేరు తేరు నలి దాఁకిన న
ప్పరుసదన మేమి చెప్పుదు
బొరిమిడుగురు లెగసె కైదువులపొడి రాలెన్.

93
శకటరేఫ మగుటకు
సభాపర్వము (2-228)
గీ.

ఎల్లువారు నెఱుఁగ నొల్లని ధర్మువు
బేల నీక యెఱుఁగ నేల వలసె
చిఱుతవాని కింత పఱుసందనమ్ములు
సన్నె వృద్ధజనము లున్నచోట.

94
'పరతెంచుట' రేఫ మగుటకు
తిక్కనగారి ఉత్తరరామాయణము (6-140)
క.

బరసికొని పోవ నత్తఱి
సురసైన్యం బార్చుటయును జూచి తిమిరముం

గర మచ్చెరువుగఁ గ్రక్కనఁ
బరతెంచుడు నసురకొడుకు పరతెంచి వడిన్.

95
శకటరేఫ మగుటకు
ఆదిపర్వము (5-256)
క.

వెఱచఱచి నీరిలో న
క్కెఱగా నొకమొసలి చూడ్కికి నగోచరమై
పఱతెంచి కుంభసంభవు
చిఱుదొడ వడిఁ బట్టుకొనియె శిష్యులు చెదరన్.

96
'చూపర' రేఫ మగుటకు
శృంగార షష్ఠము
మ.

గురుబంధుల్ దను జుట్టురాఁ దిగిచి యాక్రోశింప నిశ్చేష్టుఁడై
యెరులం దన్ను నెఱుంగలేక యసుహృద్ వ్యూఢార్తి ముం జెంది చూ
పర దన్ రోయుచుఁ బో వివర్ణత మెయిం బాటిల్ల......

97
శకటరేఫ మగుటకు
భీష్మపర్వము (1-288)
క.

కొఱవియుఁ గొఱవియుఁ దాకిన
తెఱఁగున నర్జునుఁడు సురనదీసూనుఁడు చూ
పఱ వొగడం దాఁకుట ని
ద్దఱిదిక్కుల సైన్యములును దలపడియె వడిన్.

98
'పలుమరు' రేఫ మగుటకు
రామాభ్యుయము (4−126)
చ.

ఇరువురు సిగ్గులగ్గలపుటేవ కచాకచి పైకొన న్ముఖాం
బురుహయుగంటు వాంచి తలపుల్మది నువ్విళులూఱఁ జూపులొం
డొరులపదంబులం దొరయ నొండు నెపంబున మోములెత్తి ప
ల్మరు మరువెట్టిచూడ నెడమం గుడినేయఁదొడంగెఁ గంతుఁడున్.

99
శకటరేఫ మగుటకు
భీష్మపర్వము (3-31)
క.

విఱుగుట నొచ్చుట మనదెస
దఱుచుగ నాడెదవు పాండుతనయులబల మే
డ్తెఱఁ దఱుగక పెనఁగుట ప
ల్మఱుఁ జెప్పెద వకట యేమిమాయయొ దలఁపన్.

100
'వేమఱు' శకటరేఫ మన్నారు. రెండును గలవు. రేఫ మగుటకు— 101
యయాతిచరిత్రము (4-35)
క.

మరుఁ డల నెలకడ దాచిన
సుకవి మనోరంజనము
విరితూపును నల్లచెఱుకు విండ్లునుబలె వే
మరు నలరు చేరుచుక్కయు
నరుదుగఁ గనుబొమలు మిగుల నతివకు నమరెన్.

102
శకటరేఫ మగుటకు
చేమకూరవారి విజయవిలాసము (3-42)
పంచచామరము.

మెఱుంగుఁబోడి కిట్లు చల్వ మేఱమీఱఁ జేసినం
గుఱంగట న్నిలంగరాని కూర్చి వెచ్చ హెచ్చఁగాఁ
దుఱంగలించు వేడ్కతోడ దూఱి పల్కిరంత వే
మఱున్ మరున్ మరున్మృగాంక మత్తకోకిలాదులన్.

103
‘ఆఱికెపంట' చింత్యమన్నారు. రెండును గలవు. రేఫ మగుటకు— 104
అనుశాసనికపర్వము (3–194)
గీ.

పూరిపంట వ్రాలు నారికెబియ్యంబు
జంబువున ఫలంబు శ్రాద్ధకృతికి
గావు, తుమ్మ నేడ్వఁ గాదు శ్రాద్ధక్రియా
చరణసమయములఁ బ్రశాంతివలయు.

105
అచ్చుపుస్తకములందు ‘పూరి' రేఫము, 'ఆఱికె ఱకారము వ్రాసినారు. అటుల వ్రాసుటకు వారి పాండిత్యమహిమ తెలియదు. 106
శకటరేఫ మగుట
తిమ్మకవిగారి లక్షణసారసంగ్రహము (3-206)
ఉ.

ఆఱని తేజమాఱడియు నాఱికెపంటయు నాఱుషట్కమూ
టాఱిన ముత్తియంబు తడియాఱెను పాపము లాఱె జిల్గునూ
గాఱు వెలంది కొప్పె నను నట్టిపదంబుల (లోన) బెద్దఱాల్
మీఱుచునుండుఁ గబ్బములు మేరుమహీధరరాజకార్ముకా.

107
తిమ్మకవిగారి రసికజనమనోభిరామము
సీ. పా.

ఆఱుగన్నను చిత్తమలరెడు చెలియన్న
             మఱి కొప్పుగంటె వేమర చెలంగు

108
ఇరులు శకటరేఫ మన్నారు. రేఫ మగుటకు—
యయాతిచరిత్రము (2-75)
క.

ఇరులు బిలియుచును నలుపులు
కరమరుదై నలుపుకట్టి కదిసిన కరణిం
బరగగ చోముడు కాటుక
కరవటమునుబోలె నిజ్జగంబు దనర్చెన్.

109
శృంగార షష్టము
చ.

పెరిగిన యీసున న్నెమలిపించెములం బురి విప్పఁబోలు నీ
సరసిరుహాక్షి వేనలికి సాటిగ నిల్వఁగ నోడి సొచ్చె నిం
దరిశరణంబు తేటిగమి నీలము లింద్రుని పేరుగాంచెఁ బె
న్నిరులు గుహాశ్రయంబు గనియెన్ నెఱిగల్గిన వారి కోర్తురే.

110
కళాపూర్ణోదయము (3.31)
సీ. పా.

నిండుచందురునవ్వు నెమ్మోముసిరితోడ
             నిరులు గ్రమ్మెడు వేణిభరముతోడ

111
'రవళి' శకటరేఫ మన్నారు. రేఫ మగుటకు—
పినవీరభద్రుని శాకుంతలము (2-184)
మ.

నవలావణ్యపయోధిఁ జిత్త మను మంథానాద్రికిం జంద్రికా
పవనాళిం దఱి త్రాడుగాఁ బెనచి యబ్జాతాస్త్రుఁడుం దీర్చినన్
రవళిం గోకిలకీరముల్ దరువ నీరత్నాకరంబందు ను
దృవముంబొందిన లక్ష్మి గావలయు నప్పద్మాక్షి నీక్షింపఁగన్.

112
యయాతిచరిత్రము (4-154)
సీ. పా.

ఎల్లప్పుడును బిక్కటిల్లు బేరులమ్రోత
             రహిమించు ధరగల రవళిగాగ

113
రవరవలు శకటరేఫ మన్నారు. రేఫ మగుటకు—
చేమకూరవారి విజయవిలాసము (1-85)
క.

రవరవలు నెరపు నీలపు
రవరవణముతోడఁ జెలి యరాళకచంబుల్
సుకవి మనోరంజనము
కవకవనవ్వున్ వలిజ
క్కవకవఁ గలకంఠకంఠి కఠినకుచంబుల్.

114
'కచ' పదము బహువచనమేగాని ఏకవచనము గలుగదు. ఉత్తరార్ధమందు రీతియను గుణమున్నది. 115
రొమ్ము, చేరెడు, పరువంపుఁబువ్వు, సురసుర-(వీటిని) శకటరేఫము లన్నారు. 116
'రొమ్ము' రేఫ మగుటకు
రంగనాథరామాయణము
ద్విపద.

నీ రొమ్ముగొనికాడ నేర్తునా చూడ
నీ రాజ్యగతి చూడ నేరుతుఁగాక

117
'చేరెడు' రేఫ మగుటకు
చేమకూరవారి విజయవిలాసము (1-66)
ఉ.

తీరిచినట్టులున్నవి గదే కనుబొమ్మలు, కన్నులంటిమా
చేరలఁ గొల్వగావలయు చేతులయందము చెప్పగిప్ప రా
దూరులు మల్చివేసినటు లున్నవి (బాపురె ఱొమ్ములోని సిం
గారము, శేషుఁడే పొగడఁ గావలె నీతని రూపరేఖలన్.)

118
'పరువము' రేఫ మగుటకు
పారిజాతాపహరణము (4-4)
క.

తరుణీ యీ తరుశాఖాం
తరలోల దుకూలమారుతము లింద్రాణీ
పరివారవారసతులకు
పరువపు విరిగొండ బొడము బడలిక లడఁచున్.

119
ఉద్యోగపర్వము (2-112)
సీ. పా.

పరువంబు దప్పిన విరులు దాల్చుచుఁ దరు
             చయము చుక్కలఱేని చంద మరయ.

120
శ్రీకృష్ణరాయల ఆముక్తమాల్యద (5-67)
సీ. పా.

పరువంపు మంకెన విరివంపు నరవంపు
             వాతెర చింద్రెంపు వాన గురియ.

121
మరియును గలవు.
'సుర సుర' రేఫ మగుటకు
చేమకూరవారి సారంగధరచరిత్రము (2-38)
చ.

ఉరుకుచ (డెందమెంత మృదువో మఱి తియ్యని తుంటవింటనే
విరవిరవోవు నారిఁగని పెన్నెఱి గొజ్జెఁగపూవుచేత న
చ్చెరువుగఁ బొంచి కంటికి దిసింపనివాఁ డపు డేసి యార్చెఁబోంె
సురసుర స్రుక్క; మెత్తనగుచోటనె గుద్దలి వాడియౌ గదా)

122
'గొరవంక' (రేఫ మగుట) చింత్యమన్నారు. (అది) రేఫ మగుటకు—
మనుచరిత్రము (4–111)
మ.

శరసంధానముతోనె కొన్ని యడుగుల్ జౌజన్వనంబారి యా
ధరణిం గాల్గొని ద్రోణముల్ దిగిచి దోర్దండంబులం జేసి యే
సిరి బోయల్ దినమంచు నార్చు పఱచున్ బెట్టాసలం డాయుచున్
గొరవంకల్ మొఱవెట్టినట్లు గుణముల్ ఘోషింప రోషంబునన్.

123
చేమకూరవారి విజయవిలాసము (2-179)
క.

మరుఁ డపు డేసిన తూపులు
ధరియించియు నేమి చెప్పఁ దరుణి న్నరునిన్
సరిగోలల వడి నేసెన్
గొరవంక రొదల్ సెలంగఁ గ్రొన్ననవింటన్.

124
'ఎరువు' (రేఫ మగుట) చింత్యమన్నారు. రేఫ మగుటకు—
అరణ్యపర్వము (4-347)
క.

ఇమ్ము నరేశ్వర మాతుర
గమ్ముల, నీ కార్యమయ్యెఁ గాదేఁ గడు లో
భమ్మొనర నొరుల సొమ్ములు
రమ్మనినన్ వచ్చునే యెరవు సతమగునే.

125
ఉద్యోగపర్వము (3-214)
క.

హరి పలికిన విధమంతయు
నెరవై యున్నయది వింటె, యీ మాట తెఱం
గరయుదము (తొలుత నీ పెను
పరిచందం బెల్లి నెఱుక పడియెడుఁ బిదపన్)

126
ఇట్లు బహులములు గలవు.
'కట్టెదురు’ శకటరేఫ (మన్నారు ) రేఫ మగుటకు—
విరాటపర్వము (5–55)
క.

ఒక మరి కిరీటి కట్టెది
రికిఁ గ్రమ్మనఁ బోయిరేని రెండవమా రి
య్యకొనుట కోర్వగ (వేరై
రొకళ్లుఁ గురరాజసేన యోధులలోనన్.)

127
ఉద్యోగపర్వము (2-161)
క.

మగటిమి వారికి వీఁ డెదు
రుగ నమ్మి సుయోధనుఁడు విరోధముఁగొని (స
ర్వగుణాఢ్యులు బలవంతులు
నగు పాండునృపాల సుతుల నవమానించెన్)

128
‘ఱిచ్చ' రేఫ మన్నారు, (కాని అది) శకటరేఫ మగుటకు—
విరాటపర్వము (4–52)
క.

కని యుత్తరుండు గరుపా
ఱిన మేనును దలఁకు మనము ఱిచ్చపడిన చూ
పును నై తొట్రువడుచు ని
ట్లనియె దిగులు సొచ్చి యాబృహన్నల తోడన్.

129
ద్రోణపర్వము (1-381)

చిచ్చునకుఁ దోడు కరువలి
వచ్చినక్రియ భీముకడకు వాసవి యిమ్మై
(వచ్చిన మన యోధావలి
ఱిచ్చవడియె వారి మొన దఱిమికొని వచ్చెన్)

130
అరణ్యపర్వము (6-34)
సీ.గీ.

మహిత కమల మధుర మధురసాస్వాదన
పరవశాత్మయైన భ్రమరకాంత
ఱిచ్చ బుద్ధి నకట ఱేగు బువ్వుల రస
మాను టెట్లు బేల వైతిగాక.

131
దేహము గరుపాఱుట, తఱిమికొనుట, ఱేగు- ఱకారములందు నప్పకవిగారే వ్రాసిరి. ఈ మూడు పద్యములందును 'ఱిచ్చ' నేమి పరిశీలించి రేఫములందు వ్రాసిరో (తెలియదు). ఆ సామర్థ్యము అవాచ్యము. 132
గీ.

ఱజ్జులాడి యీగి ఱాపడి సభలోన
ఱేసి పోరిలోన ఱిచ్చఁ బొరసి

ఱెన్న మడుగు పుడమిఱేల నేల నుతింప
మనకు విశ్వనాథుఁ డొనరియుండ'

133
(అను) నీ పద్యము పెద్దిరాజు కావ్యాలంకారచూడామణి యందు(7-45) ఉన్నదని లాక్షణికు లందఱు నెఱింగినదే అప్పకవిగారును వ్రాసినారు. ఈపద్యమందు ఱకారముగాని రేఫములేదు. కావున ననేక గ్రంథములు పరిశీలించి ఈగ్రంథము చూచితే మఱియొక గ్రంథాపేక్ష లేకుండగా జెప్పుతామని ప్రతిజ్ఞ చేసి చెప్పినారు. ఇదివఱకు వ్రాసిన గ్రంథమందు (అప్పకవిగారు) రేఫములు ఱకారము లందున, ఱకారములు రేఫములందున, కేవల రేఫములు - కేవల ఱకారములు వ్రాసినవి ఉభయ మందున, ఉభయము నందును వ్రాసినవి యొక్కొక్క దానియందున స్పష్టము చేసినాము. ఇదివరకే గ్రంథవిస్తరమైనందున నప్పకవిగారు చెప్పిన రేఫ ఱకార(ములను గూర్చిన) గ్రంథము నిలిపినాము.134

రేఫ ఱకారములు - యతిప్రాసలలో సాంకర్యము

తిమ్మకవిగారు లక్షణసారసంగ్రహమందు

'కాకునూరి యప్పకవి యహోబలపతి
ముద్దరాజు రామ ముఖ్యు లెల్ల
పోతరాజు కబ్బమున ఱాలు రేఫలు
గదిసె నంచుఁ బలికి రది హుళక్కి. (3-340)

135


ఉ.

బమ్మెర పోతరాజకృత భాగవతంబు సలక్షణంబుగా
కి మ్మహి నేమిటం గొదువ నెంతయు నారసి చూడ నందు రే
ఫమ్ములు ఱాలునుం గదిసి ప్రాసములైన కతంబునంగదా
నిమ్ముగ నాదిలాక్షణికు లెల్లను మాని రుదాహరింపఁగన్'

136
అని రామన్న చెప్పినాడు.

పురసతుల విలోకనములు
సరసాలాపములు నర్మసంభోగంబుల్
మఱిగి హరి మనల నొల్లఁడు
నరవరు లో యమ్మ నూతనాప్రియులుగదే'

137
అని పోతరాజు చెప్పినారని అహోబలపతి వ్రాసినాడు. మరిన్ని కొందఱు లాక్షణికులున్ను ఈలాగే అన్నారు గాని, పోతరాజు లాక్షణికు డగుటను కాకుండుటను లెస్స పరిశీలించినారు కారు. 138
సీ.

అఖిల వేదాంత విద్యా రహస్య విదుండు
             సహజ పాండిత్య విశారదుండు
మత్తక్షితీశాధమ స్తోత్ర విముఖుండు
             శంభు పదాజ్ఞ పూజారతుండు
పటుతర కవితా విభాసిత ప్రతిభుండు
             సకలాంధ్ర లక్షణ చక్రవర్తి
రఘుకులేశ నిదేశ రచిత మహాభాగ
             వతపురాణుఁడు పుణ్యవర్ధనుండు
బుధ జనహితుండు బమ్మెరపోత సుకవి
యెన్న రేఫ ఱకారంబు లెఱుఁగఁ డనుచు
నజ్ఞులొకకొంద ఱాడుదు రమ్మహాత్ము
కవిత కెందును లోపంబు గలుగ దభవ!

139
రామన్న మొదలైన వారిని తెలియని వారనుట తప్పా! పరిశీలించనిది నిష్కారణ(ముగా) నాక్షేపించిన వారిది తప్పుగాక, ఇంకను 140
తిమ్మకవిగారు లక్షణసారసంగ్రహమందు
సీ.

ఘనుఁడు పోతనమంత్రి మును భాగవతము ర
             చించి చక్రికి సమర్పించు నెడల
సర్వజ్ఞ సింగయ క్ష్మావరుం డది దన
             కిమ్మని వేడిన నిడకయున్న
నలిగి యాపుస్తకం బవనిఁ బాతించిన
             చివికి యందొక కొంత శిధిలమయ్యె
క్రమ్మర నది వెలిగందుల నారప
             రాజును మరి బొప్పరాజు, గంగ
రాజు మొదలగు కవివరుల్ తేజమెసఁగఁ
జెప్పి రాగ్రంథములయందు తప్పులొదవెఁ

గాని పోతకవీంద్రుని కవితయందు
లక్షణం బేమి తప్పదు దక్షహరణ! (3-344)

141
పోతరాజు చెప్పినది ప్రథమస్కంధము, ద్వితీయము కొంతయు, ఆరు, ఏడు, ఎనిమిది, తొమ్మిది స్కంధములును, దశమము పూర్వభాగము కొంతయు నున్నది. అందులో రేఫఱకార సాంకర్యము లేకుండుటకు వ్రాయుచున్నాము—142
దీర్ఘముల మీద ఱకారములకు
ప్రథమస్కంధము (158)
ఉ.

మాఱు పడంగనేసి యసమర్థుల సుప్తుల నస్త్రవిద్యలం
దేఱని పిన్నపాపల నతిత్వరితంబునఁ ద్రుంచుఁ గ్రూరుఁడై
పాఱుఁడు గాని పాతకుఁడు ప్రాణభయంబున వెచ్చ నూర్చుచుం
బాఱెడు వీనిఁ గావుము కృపామతి, నర్జున! పాపవర్జనా!

143
కుఱుచలమీది ఱకారములకు
అందే (158)
చ.

వెఱచినవారి దైన్యమున వేదురు నొందినవారి నిద్రమై
మఱచినవారి సౌఖ్యమున మద్యము ద్రావిన వారి నగ్నులై
పఱచినవారి సాధుజనభావము వారిని కావు మంచు వా
చఱచినవారిఁ గామినులఁ జంపుట ధర్మముగాదు ఫల్గునా!

144
సప్తమ స్కంధము (194)
ఉ.

పాఱఁడు లేచి దిక్కులకు బాహుల నొడ్డఁడు బంధురాజిలో
దూఱఁడు ఘోరకృత్యమని దూఱఁడు తండ్రిని మిత్రవర్గముం
జీఱఁడు మాతృసంఘము వసించు సువర్ణగృహంబులోనికిన్
దాఱఁడు కావరే యనఁడు దాపము నొందఁడు కంటగింపడున్.

145
అందే (63)
ఉ.

ఱెక్కలు రావు పిల్లలకు ఱేపట నుండియు మేత గానమిం
బొక్కెడు గూటిలో నెగసి పోవఁగ నేరపు మున్ను తల్లి యా

దిక్కుననుండి వచ్చునని త్రిప్పని చూడ్కుల నిక్కి నిక్కి న
ల్దిక్కులు చూచుచున్న వతిదీనత నెట్లు భరింతు నక్కటా.

146
అందే (202)
చ.

ఎఱుగఁడు జీవనౌషధము లెవ్వరు భర్తలు లేరు బాధలం
దఱలఁడు నైజతేజమున తథ్యము జాడ్యము లేదు మిక్కిలి
న్మెఱయుచు నున్నవాఁ డొక నిమేషము దైన్యము నొందఁ డింక నె
త్తెఱఁగునఁ ద్రుంతు వేసరితి దివ్యము వీని ప్రభావ మెట్టిదో?

147
అష్టమస్కంధము (62)
మ.

ఉఱుకుం గుంభయుగంబుపై నరిక్రియన్ హుమ్మంచు పాదంబులన్
దిఱగన్ గంఠము వెన్నుఁ దన్ను నెగయున్ హేలాగతి న్వాలమున్
జఱుచున్ నుగ్గుగ దాక ముంచు మునుఁగున్ శల్యంబులుం దంతముల్
విఱుగన్ వేయుచుఁ బొంచి పొంచి కదియున్ వేదండయూధోత్తమున్.

148
అందే (257)
క.

ఒఱపగు నురమును బిఱుదును
నెఱిఁదోకయు ముఖము సిరియు నిర్మలఖురముల్
కుఱుచచెవుల్ దెలిగన్నులు
పఱుగు కంఠంబు జూడఁదగు నా హరికిన్.

149
అందే (538)
క.

వెఱచుచు వంగుచు వ్రాలుచు
నఱిముఱి గుబురులకుఁ జనుచు హరిహరి యనుచున్
మఱుచుచు నురుకుచుఁ దిరుగుచు
కుఱుమట్టవు పడుచు వడుఁగు గొంత నటించెన్.

150
నవమస్కంధము (206)
చ.

ఎఱిఁగితి మద్దిరయ్య తడవేటికి గుఱ్ఱపుదొంగఁ బట్టఁ డా
జఱభినిఁ బట్టి చంపుఁ డతిసాధుమునీంద్రుడువోలె నేత్రముల్
దెఱవక బొక్కినోరు మెదలింపక బాసిక వెట్టియంచు న
య్యఱువది వేవురుం జని కరాయుధముల్ ఝళిపించి డాయుచున్.

151
దశమస్కంధము - పూ. భా. (469)
క.

పాఱుదురు కికురు పొడుచుచు
దూఱుదురు భయంబులేక తోరపుటురముల్
జాఱుదురు ఘనశిలాతటి
మీఱుదు రెన్నంగరాని మెలకువల నృపా.

152
అందే (325)
క.

తెఱవ యొకతె నిద్రింపఁగ
నెఱిఁగట్టిన వలువ విడిచి నేఁడొక తేలుం
గఱిపించె నీ కుమారుఁడు
వెఱచుచు నది పఱవ నగుట విహితమె సాధ్వీ.

153
అందే (660)
చ.

వెఱమఱ లేని మేటి బలవీరుఁడు కృష్ణకుమారుఁ డొక్కచేఁ
జఱచి ఖగేంద్రు చందమునఁ జక్కఁగ దౌడలు వట్టి కన్నులం
జొఱజొఱ దుర్విషానలము నుబ్బ వధింపక యెత్తి లీలతో
బిఱబిఱ ద్రిప్పివైచెఁ బరిశేషితదర్పముఁ గ్రూరసర్పమున్.

154
అందే (708)
క.

కఱచిన భుజగము రదములు
విఱుగఁగ వదనముల విషము వెడలఁగ శిరముల్
పఱియలుగ నడఁచె గరుడఁడు
తఱిమి కనకరుచులు గలుగు తన డాఱెక్కన్.

155
ఇది పోతరాజుగారి కవిత్వము.
ఇక వెలిగందుల నారపరాజు కవిత్వము—
ద్వితీయస్కంధము (247)
చ.

హరి వచనంబు లాత్మకుఁ బ్రియం బొనరింపఁ బయోజగర్భుఁడో
పరమపదేశ యోగిజన భావన యీ నిఖిలోర్వియందు నీ
వెఱుఁగని యట్టి యర్థమొకటేనియుఁ గల్గునె యైన నామదిం
బెరసిన కోర్కె దీని వినిపించు దయామతిఁ జిత్తగింపవే.

156
దశమస్కంధము ఉ. భా (476)
క.

ఎఱుగమి నైనను భూసుర
వరుల ధనం బపహరింప వలువదు పతికిన్
మఱుపున ననలము ముట్టిన
దరికొని వెసఁ గాల్పకున్నె తను వెరియంగన్.

157
తృతీయస్కంధము (54)
క.

హరిపదసేవకుఁ డరిభీ
కరుఁ డర్జును వలన మిగుల కార్మికవిద్యల్
గఱచిన బలియుఁడు సాత్యకి
వఱలిన సుఖలీల నున్నవాఁడె ధరిత్రిన్.

158
చతుర్ధస్కంధము (38)
చ.

సరసిజగర్భ యోగిజన సర్వసుపర్వ మునీంద్ర హవ్య భు
క్పరమ ఋషి ప్రజాపతులు భక్తిమెయిం జనుదెంచి యుండున
త్తఱి తరుణార్కతేజుఁడగు దక్షుఁడు వచ్చినఁ దత్సభాసదుల్
తరమిడి లేచి రప్పుడు పితామహ భర్గులు దక్క నందఱున్.

159
ఇక బొప్పరాజు గంగరాజు కవిత్వము
పంచమస్కంధము (1-9)
క.

హరి నా ముఖమున నీకున్
నెఱిఁగింపఁదలంచి నాకు నెఱిఁగించెను సు
స్థిరమతి వినుమంతయు శ్రీ
హరి వాక్యముగాఁ దలంచి యవనీనాథా!

160
అని వ్రాసినారు.
కావున పోతరాజుగారి భాగవతము అన్నివిధముల సర్వోత్కృష్టమైనది.
(ఇక ఇతర కవుల కవిత్వములందు) రేఫ ఱకార సాంకర్యము కలుగుటకు తిమ్మకవిగారు 'లక్ష్మణసారసంగ్రహము' (3-319) నందు—
క.

అలసాని పెద్దకవి పిం
గళి సూరన రామభద్ర కవివర్యుఁడు పి

ల్లలమఱ్ఱి వీరభద్రుఁడు
గలిపిరి గద కృతుల ఱాలు గడు రేఫములున్.

162
మనుచరిత్రము (3–12)
శా.

శ్రేణుల్గట్టి నభోంతరాళమునఁ బాఱెన్ బక్షు లుష్ణాంశు పా
షాణవ్రాతము కోష్ణమయ్యె (మృగతృష్ణా వార్ధు లింకెన్ జపా
షోణంబయ్యెఁ బతంగబింబము, దిశాస్తోమంబు శోభాదరి
ద్రాణంబయ్యె, సరోజషండములు నిద్రాణంబు లయ్యెం గడున్.)

163
ఆముక్తమాల్యద శ్రీ కృష్ణరాయ విరచితమని యుండినను పెద్దనగారి కవిత్వము గావున 'పెద్దకవి కలిపినా 'రని (చెప్పుచు నీ క్రింది ఆముక్తమాల్యద పద్యములు) చెప్పినారు. 164
ఆముక్తమాల్యద (1-162)
మ.

ఇలకున్ వ్రేఁగుగఁ బండు తీరవన పుండ్రేక్షుచ్చటాదీప్తు ల
గ్గలమై వ్రేల నురుస్వనంబు లెసఁగంగాఁ ద్రుప్పు రాట్నంపుగుం
డ్రలు నాఁ దేనెకొలంకులం బొఱలి పాఱన్ విచ్చు పంకేరుహం
బుల నాడెం దొలుసంజ తేటివలయంబుల్ తారఝంకారముల్.

165
అందే (1–82)
మ.

పునుగుందావి నవోదనంబు మిరియంపుం బొళ్ళతోఁ జట్టు చుం
యను నాదారని కూరగుంపు ముకుమందై పేర్చునావం చిగు
ర్కొను పచ్చళ్లను పాయసాన్నములు నూఱుంగాయలున్ జేచుఱు
క్కనునేయిన్ జిఱువాలు వేలుపగు నాహారం బిడున్ సీతువున్.

166
అందే (7–49)
చ.

ముదిమది దప్పితోటు మునిముఖ్య భవత్తనయన్ గృహంబునన్
బదిలముజేసి వచ్చి మఱి బట్టబయల్ వెడదూఱు దూఱె దా
సదన మికొక్కమాటరసి చంచలలోచనఁ గానకున్న దూ
ఱెదు మరి కాని బుద్ధి విపరీతతఁ బొందక పోయి చూడుమా.

167
అందే (4-245)
శా.

ఱేపుల్ మాపు మతంగజంబును మణి శ్రీఖండ ముక్తాలియున్
రా వాణిజ్యము బెంచి యేలఁగనగున్ (వర్షంపుటెవ్వన్ రుజన్
హావళ్లందగు నన్యభూప్రజల రా జాయాయి జాత్యౌచితిన్
బ్రోవంగాఁదగుఁ, దోట దొడ్డి గను లాప్తుల్ సూడఁ బంపందగున్)

168
సూరన రాఘవపాండవీయము (1-20)
సీ. పా.

కానలో దారు మృగంబులకైవడిఁ
             గైకొని యసమాస్త్రకర్మవలన

169
ఇందులో తారు = తమరు అన్న అర్థమునందు లఘురేఫ తాఱుట = అడగుట అన్న అర్థమునందు గురురేఫము నగును. (కాని) వెల్లంకి తాతంభట్టు నిడుపుల మీద బండి లేదన్నాడు. అందుకు 'తారుట' రేఫమే అని రాఘవపాండవీయానకు టీకవ్రాయుచు ముద్దరాజు రామన్న సమ్మతి వ్రాసినాడు. అది (సరి) కాదు. 'తాఱుట' ఱకారమే సిద్ధము. మరియు సూరన్న అది ఱకారానకు. 170
సీ. పా.

రేఖపై మీఁదటి ఱెప్పల యొప్పు ప
             న్నాగంపు గడవళ్ల బాగు నెఱప

171
అని, మరియు ప్రభావతీప్రద్యుమ్నమునందు
క.

గ్రక్కునఁ జని వ్రాలుదునో
ఱెక్కలు గట్టుకొని దివిజరిపుమేడలపై
నక్కొమ్మఁ జూచు టెపుడెపు
డొక్కో యనునంత తమక మున్నది తమలోన్. (4-86)

172
(అని ప్రయోగించినాడు.}
ఇక కవి రామభద్రుడు రామాభ్యుదయము (8-69) నందు
ఉ.

సైరిభ వారిభ ద్విరద శాసన ఖడ్గ ఖరాధిరూఢులై
దారలు బూర కొమ్ములును దప్పెటలుం బటహంబులుం బదు
ల్నూఱును వేలు మ్రోయఁగ వను ల్వడి వెల్వడి హత్తి యుత్తర
ద్వారమువంక...ర నిరువంకల పౌజులు దీర్చి రయ్యెడన్.

173
మరియు నందే (పీఠిక. 104)
ఉ.

(రంగనవద్యమై సుధ తెఱంగన శోభిలి విన్గొలంకు చే
రం గన దిందు దీప్తి నెదురం గనకోదరు కంబుకంఠి దూ
ఱంగ ననంగు జాతిపగ ఱం గనలం గమకించి) ఠీవి మీ
ఱంగ నటంచు గొబ్బురిపురప్రభు రంగనకీర్తి రంజిలన్.

174
(అని ప్రయోగించి రేఫ ఱకారములు కలిపినాడు.)
మరి, పిల్లలమఱ్ఱి పినవీరన్న జైమినీభారతము (1-137) నందు
ఉ.

తూరుపు తెల్లవారుటయుఁ దోడనె మంగలపాఠకస్తుతుల్
మీఱఁ దదీయరాగముల మేల్కని కాల్యసమంచితక్రియల్
దీరిచి పాండుపుత్ర వసుదేవసుతుల్ ప్రమదంబు మోములం
దేరఁగ వేడ్కతో నరుగుదెంచి సభాస్థలి నిల్చి రయ్యెడన్.

175
అని, సంకుసాల నరసింగయ 'కవికర్ణరసాయనము' (5-75) నందు
గీ.

వనధి సర్వంకషంబయ్యు వలయు పనికి
ఱేపులన కాని చొర రాని రీతిఁ దవరి
విశ్వరూపకుఁ డయ్యు శ్రీ విభుఁడు కూర్మ
రూపముల సేవ్యుఁడగు నారురుక్షులకును.

176
(అని రేఫ ఱకారములు కలిపినారు.)

'నాన్యేషాం వైధర్మ్యం, లఘ్వలఘూనాం,
రయోస్తు నిత్యం స్యాత్'

అనే ఆంధ్రవ్యాకరణసూత్రమునకు టీక వ్రాసి, రేఫ ఱకారాలు కలుపరాదని చెప్పిన బాలసరస్వతిగారు తమ 'చంద్రికాపరిణయ'మందు—
ఉ.

అక్కమలేక్షణన్ సవినయంబునఁ గాంచుము నాదు మాఱుగా
మ్రొక్కుము సేమ మా భువనమోహిని నీకని పల్కు మూర్తిఁజేఁ
జిక్కితి వేగఁ బ్రోవుమని చెప్పుము పొమ్మిఁక తేటిరాయ నీ
ఱెక్కలమాటునన్ నను భరించి లభింపుము కీర్తిపుణ్యముల్.

177
(అని రేఫ ఱకారములను కలిపినారు). ఇటువలెనే మహాకవులకున్ను రేఫ ఱకారాలపట్ల పరిశీలన లేకపోయినది" అని వ్రాసినారు. 178
లాక్షణికులు నిర్దోషమైన భాగవతము నాక్షేపించిరి. రేఫ ఱకార సాంకర్యముగల (మనుచరిత్ర) ఆముక్తమాల్యాది కావ్యముల నాక్షేపించరయిరి. అయితే అది పరిశీలించి, తప్పులున్నచోట తప్పులనుట తిమ్మకవి సార్వభౌమునికి తప్పా. పామరులు 'అప్పకవీయమునందు తప్పులున్న' వన్నా మని మము నాడుదురు. చెప్పకమానితే, తప్పులే ఒప్పులగును. 179
రేఫ సాంకర్యములు మరియును గలవు.
చేమకూరవారి విజయవిలాసము (1-28)
ఉ.

కోప మొకింత లేదు బుధకోటికిఁ గొంగుపసిండి సత్య మా
రూపము తారతమ్యము నెఱుంగ స్వతంత్రుఁడు నూతనప్రియా
టోపము లేని నిశ్చలుఁ డిటుల్ గృతలక్షణుఁడై చెలంగఁగా
ద్వాపరలక్షణుం డనఁగ వచ్చునొకో యిల ధర్మనందనున్.

180
అందే (2-40)
సీ. పా.

తన పితామహుని బృందారకాధిపుఁ బోలు
             ఱెప్ప వ్రేయక చూచు రీతిఁ గనుట...

181
చేమకూరవారి సారంగధరచరిత్ర (2-180)
క.

వ్రతమా యిటు లేచ మధు
వ్రతమా నీ కుచితమా విరాలింబడ నా
మత మాలోచించ వయో దా
రు తమా మోదయుతమా చిఱుత మారుతమా!

182
అందే (3-252)
క.

మఱుపింపఁదగునె నృపతికి
ధర పాలన సేయకునికి ధర్మం బగునే
సరగున తిరిగి పురంబున
కరుగుము చింతిలక మానవాధిపతిలకా!

183
అందే (2.30)
క.

ఈ రాసుతు సమ్ముఖమున
జేరి యెవరు బుద్ధినుతులు చెప్పెడివారల్
లేరైరా యని పెద్దలు
దూఱుదు రందుకొఱ కళుకుతో ననవలసెన్.

184
అందే (2-71)
సీ. పా.

నిస్తంభనీలమణిస్తంభరుచితోడ
             నెఱిగొప్పు కప్పు డాలొరసి కొనఁగ...

185
మరియును గలవు.
రుక్మాంగద చరిత్రము (5-9)
చ.

వెఱువకు మాత్మలో ననుచు వింతఁగఁ జూడఁగ వల్దటంచు న
తైఱవకు లోలుఁడై యతఁడు తెల్లమిగా నను నొల్లకుండుటే
నెఱిఁగి సహింపలే కెచట కేనియు నేగు తలంపుతోడఁ ద
త్తరముగ నేగుదెంతుఁ బ్రమదంబున నిన్గనుగొంటి నియ్యెడన్.

186
కవి రామభద్రుడుగారి 'జయ రామా రామ' శతకము నందు
సీ. పా.

గరలకంధరువిల్లు విఱుగునా నేటిపై
             కొండలు దేలునా, కుంభకర్ణుఁ
డు దెగునా, వార్థి గట్టు వడునా...'

187
మరియు నందే
సీ.

చలమున నీవు దశగ్రీవుఁ బోరు
             నప్పు డహంపూర్వికాది ఘోర
శబ్ద గర్వములు ముష్టాముష్టిఁ గదియు శా
             ఖామృగ దనుజ(సంఘముల) సరకు
గొన బాహాబాహిఁ బెనగు రాక్షస కీశ
             వరులు ఖడ్గాఖడ్గి నఱుకు లాడ

కపి దైత్య వీరశేఖరు లశ్వఘోషలు
             కరిబృంహితములు మార్గణగరుత్ప్ర
చండఝాంకృతు లట్టహాసములు నెమ్మి
ఘననినాదంబు లతిభయంకరము దుర మ
లంఘ్య మీక్షింప బ్రహ్మాదులకు వశంబె
జయరమా రామ రామ రాక్షస విరామ.

ఈ పద్యమందు రేఫ ఱకార సాంకర్యమేకాదు. 'ముష్టీముష్టి' యని యుండవలసినందుకు 'ముష్టాముష్టి' యని యతి యందు ప్రయోగించినారు. 189

వ్యాకరణసూత్రము

'కర్మవ్యవహారే బహువ్రీహౌ పూర్వపదాంతస్య దీర్ఘః
ఇచ్ సమాసాంతో వక్ష్యతే.
తత్ర తేనేద మితి సరూపే.
సప్తమ్యంతే గ్రహణవిషయే సరూపే పరే తృతీ
యాంతే చ ప్రహరణ విషయే. ఇదం యుద్ధం
ప్రవృత్త మిత్యర్థే సమస్యేతే
కేశేషు కేశేషు గృహీత్వా ఇదం యుద్ధం ప్రవృత్తం కేశాకేశి.
దండైశ్చ దండైశ్చ ప్రహృత్యేదం యుద్ధం ప్రవృత్తమితి దండాదండి.
ముష్టినా ముష్టినా ప్రవృత్తం యుద్ధమితి ముష్టీముష్టి.
'ఓర్గుణః' ఉవర్ణాంతస్య గుణః స్యాత్. తద్ధితే
ఆవాదేశః, బాహాబాహవి. తద్ధితే కిం? పట్వీ.
సరూపే ఇతి కిం? హలేన, ముసలేన...'

అని యున్నందున 'ముష్టాముష్టి' యనరాదు. అకారాంతములకు-దండాదండి. ఇకారాంతములకు - 'ముష్టీముష్టి.' ఉకారాంతములకు - ‘బాహాబాహవి’ అని వ్యాకరణమందే యున్నది. 'బాహాబాహి' అనుచోట 'బాహా' శబ్దము - అకారాంత స్త్రీ లింగము - కలదు. కావున 'బాహాబాహి'యని పూర్వపదాంతముకే దీర్ఘము. కాని, 'ముష్టి' శబ్దము అకారాంతముగా కన్పించదు. ఇక,— 190
ఆంధ్రనామసంగ్రహము (స్థావర 18) నందు
క.

మఱుగనఁగ నోలమాసము
మఱువనఁగాఁ జాట నంగ మాటన వరుసన్
బరుగు నివెల్ల నగోచర
ధరణీనామంబు లగుచు దర్పకదమనా!

191
అందే (మానవ 1)
గీ. పా.

ఱేఁడు దొరసామి యన నొప్పు నృపుని పేళ్ళు

192
అని, మరియు 'నాంధ్రభాషార్ణవము' నందు
గీ.

చాయ పెనిమిటి జముతండ్రి జగముకన్ను
తమ్మిచుట్టము వినురత......
ప్రాఁబలుకు టెంకి పచ్చగుఱ్ఱములవాఁడు.

193
అని రేఫ ఱకారములు కలిసినవి. ఇఱ్ఱి, మఱ్ఱి, (గుఱ్ఱము) మొదలైన ద్విత్వములు గల పదములు శకటరేఫములేగాని రేఫములు గాదని పండిత పామర సాధారణము, మరియు,—
అందే
క.

మెఱుఁగన మెఱువన......
బరగును విద్యుత్తు స్తనిత వాచక మౌగా
యుఱు మనగ నశని పిడుగం
దురు కొఱడన రోహితమ్ము దోచు మురారీ.

194
అందే
గీ.

'మొగిలు విరినీరు నాగను దగు జలంబు
మీరును హిమాంబుసంజ్ఞ పన్నీరనంగ......'

195
అని రేఫ ఱకారములు కలిసినవి. ఇటువలెనే మరియును గలవు. 196
ఆంధ్రశేషము
క.

తఱి యజ్ఞదనన సమయం
బుఱడనఁగను సరకుసేయకుండెననఁగఁ బే
ళ్లొఱపగు గణింపబడుటకుఁ
గరిచర్మాంబర త్రినేత్ర గౌరీమిత్రా!

197
రామలింగేశశతకము
సీ.

కోతికి జల్తారుకుల్లాయి యేటికి
             విరజాజిపూదండ విధవ కేల
ముక్కిడితొత్తుకు ముత్యాలన త్తేల
             యద్దమేటికిని జాత్యంధునకును
మాచకమ్మకు నేల మౌక్తికహారముల్
             క్రూరచిత్తునకు సద్గోష్ఠి యేల
ఱంకుబోతుకును సద్ర్వతనిష్ఠ లేటికి
             వావి యేటికిని దుర్వర్తనునకు
మాటనిల్కడ సుంకరమోట కేల
చెవిటివానికి సత్కథాశ్రవణ మేల
సరసకవితారసంబు ముష్కరున కేల
రామలింగేశ రామచంద్రపురవేశ!

198
'భళిర కందర్ప'శతకము
సీ.

మరుకేలి గవయ నత్తఱి తొడ ల్గదియించి
             పైకెక్కుటకు హౌసుబరపు నొరపు
రాణించు నెఱజంటి ఱవిక పట్టీగంటి
             ముస్తరుల్ దొంతరై బిత్తరింప.......

199
మృత్యుంజయవిలాసము
ద్విపద.

చెఱుకు విల్లెక్కిడి చేనిండ బూని
త్వర సురవరపురి దరియంగ నరిగి
ఎఱుకలసానిగా రెన్నఁగా నాపాలి
హరి కృపమూర్తియై యవతరించినది
హరికృప గల్గు సర్వైశ్వర్యములును
కొరత లేదెప్పుడు కొండ యెక్కెదవు
ఊఱుఁగాయలు రుచు లూఱు పచ్చళ్ళు
బూరెలు చక్కరాల్ పూతట్లుగారె
లఱిసె లప్పాల్మొదలైన భక్ష్యములు
పరమాన్నములు పండు పానకా ల్వఱుగు
మఱది వాలి యొనర్చి మాధవస్వామి

హరునిమీదఁను కుంకుమాంబువు ల్సిమ్మె
...........................................
నాలవహస్తంబు నవ్వసంతంబు
లీల నందించి యా లేమలమీఁద
గౌరిచే నిండించి కలకల నవ్వె
.............................................
మెఱుఁగుబోడి శిరంబు మిక్కిలి వంచి
కరగినయట్టి బంగరుముద్దలాగు."

200
'నవ్వసంత' మనచోట నఖండయతి.
గీ.

పొరలు నుసురను కనుమూయు వెఱగుఁజెందు
బెదరి పాన్పునఁబడి లేచు నొదుగు నవ్వు
కన్నుగవ నీరు నించు చికాకు నొందు
వాయు చలవల్లి పోలిక వడఁకుఁ జెందు.

201
భానుమతీపరిణయము
ఉ.

ఆరతిరాజు తాపమున నల్లలనాడు మెలంతమేనిపై
జాఱిన కప్పు పెన్నెఱుల సందడి యొప్పు మహానిలాహతిం
గారు మెఱుంగు కీలెడలి గ్రక్కున వ్రాలిన మోహదృష్టిచే
వారిధరంబు మిన్ను డిగి వచ్చి వెసం బయిఁ బర్వెనో యనన్.

202
అందే
చ.

సరసిజగంధి పెందొడల సాటికి రా నెదిరించి పోరు నీ
కరభము లెల్ల జేబడుట కన్గొని యుండియుఁ దజ్జయార్థమై
పొరలఁ బెనంగి యూచఁబడి పోవుట లింతియెఁగాక ధాత్రిపై
నఱటులు పిల్ల పిల్ల తరమైనను సామ్యముఁ బొందనేర్చునే.

203
అందే
రగడ.

ప్రేమ నెఱుఁగు పెద్ద ఱేగులను ఱేగులను
గోము మీఱిన కొండ గోగులను గోగులను...

204
అరణ్యపర్వము (4-294)
క.

ఉరవగు నారికె పంటలు
గొఱియల పాడియును దఱచగున్ బురుషులకున్
దెఱవలు చుట్టము లయ్యెద
రెరచియు భుజియింతు రర్థి నెల్ల జనంబుల్.

205
ఇటువలెనే మరియు (బహులములు) గలవు. ఇక — 206

రేఫయుత పద పరిగణనము

తిమ్మకవి సార్వభౌముడు లక్షణసారసంగ్రహమునందు నిర్ణయించిన లఘురేఫలు :

అరి = సింజిని, పన్ను
అరదము
అరవాయి
అరిది
అరగన్ను
అరట
అరణము
అరుగుట
అరిగె
అబ్బురము

ఇరవు =నివాసము
ఇరువది
ఇరుగు
ఇరువురు
ఇరువన్నె = పసిడి
ఇరుసు
ఇరుగుడు మ్రాను
ఇవురు
ఇవ్వురు

ఉరులౌడ్డుట
ఉరియాడుట
ఉరళించుట
ఉరువడించుట
ఉరువరి

ఎరగలి = చిచ్చు
(చిత్తము) ఎరియుట
ఎరువు
ఎర (మ్రింగెను)
(సొమ్ము) ఎరువు
ఎర పరికెము
ఎవ్వరు

ఒరులు = అన్యులు
(ఒం)డొరులు
ఒరిమెఱు
ఒరిమె
(సొమ్ము) లొరయుట
(ఉల్ల) మొరయుట
ఒక్కరుడు
ఒరగంట రాచుట

కరివాడి మావులు
కరిసెము = కృషి
(పైడి) కరుగుట
కరణి
కరవలి
కరవాలు
కరకలు
కరకరి
కరువు = మూస

కనికరము
కరకర (గ్రాలుట)
కరమొప్పుట
(కూటి) కరడు
(లక్క) కరవటము
కరిగోరుట
(వాన) కురియుట
కెరలుట
కొర బ్రాణము
కదురు
కుదురు

గరిత = పతివ్రత
గరగరిక
(మేను)గరుదాల్చుట
(పెండ్లి) గరగ
గరికి
గరువతనము
గరిడి
గరపచేను
గిరగిర (వ్రాయుట)
గురుకు కూర
గురపోతు
(సవరపు) గురుజు
గురువింద గురువులు
గురువు = దొడ్డు
గురువులు = పిడతలు
గొరవంక పిట్టలు
గొరగొర నడచుట
గొరిజ

చిరుగుట
చిత్తరు
చెరువు
చెచ్చెర
(కోక) చెరగు
(చేటం) జెరుగుట
చెరువుట
చొరవ
చొరకుండుట
చక్కెర
చప్పరము

జక్కర

తరచియాడుట
(ఏటి) తరగలు
తరతర
తరములు = చుట్టములు
తరముగామి
తరచిన మజ్జిగ
తరవాయ
(దేహంబు) తరలవారుట
తరబడి
తిరుగుట
తిరియుట
తిరుగ = క్రమ్మర
తెరతెర వచ్చుట
తెరువు=తోడు
తెరలు=కట్టుట
(రెండు) తెరంగులు = తెగలు
తెరల క్రాగిన నెయ్యి
తొరలుట
తొరగుట

దరికొనుట
దరిత్రొక్కుట
దరి
దరియుట
దురము
దురటిల్లుట
దురదుర
(ఎ)దురుట
దొరయు
దొర
దొరలుట
దొరకొలుపుట
దొరయుట
దొరకుట

నరములు
నురుములు
నెరపుట
నెరి
నెరసులు
నెరయుట
నెరసిన తల

పరువులు పెట్టుట
పరచనుదెంచుట
పరపుట= నించుట
పరపు = నిడుసు
పరివడ
పరువడ
పరిమార్చుట
(అమ్ములు) పరగించుట
పరుగుట
పరుసదనంబు
పురపుర బొక్కుట
పురికొల్పుట
పురుగు
(తనకు) పురుడు (ఎవ్వడు)
పురిటాలు
పెరడాలు
పెరుగు
(మేను) పెరుగుట
పొరుగు
పొరిగొంట
పొరిపొరి
పొరలుట
పొర
పొరపొచ్చెము
పొరిగరుగుట

బరులు
బరిమేన
బరిగట్టె
బరడు
బరవు
బరువసంబు
బరుజులు
బిరుదు
బిరుసు
బురద
బురబుర
బొరగుట
బెరయుట

బెరుకు
బొరుసు

మరులు
మరియాద
మరలుట
మిరియములు
మురువు
మురముర లాడుట
మురియుట
మురుగు
మురియలు
మెరమెర
మొరపనేల
మొరడు
మొరయుట

రచ్చ
రజ్జులాడి
రమ్మంట
రంకెలు
రమణ
రవళి
రంతు
రహి
రంగు
రిత్త
రెండు
రెట్ట పెట్టుట
రొద

వరువు
వరుజులు
వరువుడు
వరి
వరగ
వరుస
విరవిరబోవుట
విరియుట
విరియజల్లుట
విరులు
విరివి
వెరను
వెరసు
వెరవరి
వివరము
వెదురు

సరకు (లమ్ముట)
సిరి
సరులు
సరుకుగొనమి
సరగ
సరుదుట
సరసను
సరవి
సరిగె
సరి
సురట
సురె
సురుగుట
సెరబడుట
సొరిది

హరివాణము = తల్లె
హరువు
హురుమంజి ముత్తెము
హొరంగు

డెప్పరము

ఆరుట = నిండుట
ఆరెకులు = తలవరులు
ఆరాటము
ఆరగించుట
ఆరటము
ఆరయుట = విమర్శించుట

ఈరిక లెత్తుట
ఈరెలుగు
ఈరు = రెండు, ఇరవు
ఈరసము
(దానము) ఈరే (యనుట)

ఊరు = గ్రామము
ఊకార్చుట
ఊరకుండుట

ఏరి
ఏరికి
ఏరా

ఓరసిక
ఓరసిల్లుట
ఓరుచుకొనుట
ఓరెము = అన్నము
ఓరీ

కారులు = కల్లలు
కారుమెఱుగు
కారించుట
(ము)క్కారుపంట
కారాకు
(పట్టు)కారు
కారాటము
కూరుకు = నిద్ర
కూరిమి
కూర సేయుట
(మన్ను) కూరుట
(తోట)కూర
(నెనరు) కూరిచి
కూరుట = పొగలుట
కేరుట
కోరడి
కోరిక
కోరు = సన్నువెట్టుట
కోరగిన్నె
(పంది) కోరాడుట
(చే)కూరుట

గారాము
గారపట్టుట
గారాబము
గారసము
గారె
గారచెటు
గోరు = నఖము

చీరికి గొనంకుట
చీర = కోక
చీరుట = పిలుచుట, చించుట
చూర = పొడి
చూరీలు
చేరుట
చేర
చేరుచుకొంట
చేరికె
చేరువ = ప్రోగు, చెంత
(ముత్తెపు) చేరు
చీపుర

జేగురు
జూదరి

తారసిలుట
తారుదారనుట
తీరనికినుక
తూరుపు
తేరు
తేరకు
తేరగంజి
తేరు తేరోరి (తేర=ఓరి)
(ఏ) తేరబోకు
తోరము=రమ్యము
(సందిట) తోరము
తామరి

దారి=మార్గము
(పట్టు) దారము
దోరపండు
(శిలల) దొరపెట్టుట
దోరగల్లు
దొరుట
దేవర

నారచీర
(వింటి) నారి
నీరగుట = చచ్చుట
(తేట) నీరు
నేరుపు
(గంగ) నేరేడు
నోరు

(పూ)రేడు
పూరి
పేరులు
పేరెద
పేరెము
(పూసల) పేరు
పేరు = నామము
పేరుంబోరచి
పోరు
పోరామి
పోరితంబు

బార
బారి
బారు
బీరము
బూరుగు
బూరటిలుట
బూరె

బూర
బేరము
బేరజము
బోరగిలుట
బోర
బోరుగొండ

మారి మసంగుట
మారేడు
మారుతురు
మీరు
మూర
మేర
మోర
మోరతోపు
(వే) మారు
మోహరము

రాణ
రాణించుట
రాయిడి
రాయడు
రాచూలి
రాయంచ
రాపొడి
రాముల్కపండు
రాము
రాగిల్లుట
రారావు
రాచుట
రావిమ్రాను
రాణువ
రాయుట
రాజులు
రాలుట
రామి
రాకొట్టు
రాచబంటు
రీతి
రూపులు
రూక
రేయి
రేగుట
రోత
రోయుట = వెదకుట
రోవెలంది
రోలు
రోకలి
రోజుట

వారని కోపము
వారక
వారించుట
వారువనము
వారకులు
(కూడు) వారుచుట
వారకము
వారు
వీరు
వేగిరము

సారెలు
(పెండ్లి) సారె
(వే) సారుట
సూరెలు
సేరు
సైరణ
సోరణగండ్లు
సౌరు

శకటరేఫయుత పద పరిగణనము

తిమ్మకవి సార్వభౌముడు లక్షణసారసంగ్రహమున నిర్ణయించిన ఱకారములు.

అఱవఱ
అఱగొఱలు
అఱిముఱి
అఱచుట
ఆఱముట
అఱచెయ్యి
అఱవుకొనుట
అఱకలుబెట్టుట
అఱలేక
అఱవుడు = కుప్పసము
అఱుగు
అఱిసె
అఱుగుట = తక్కువ
అఱవడి
అఱపొరడు
అఱమూతయిళ్లు
అఱళ్లు
అక్కఱపడి
అఱకమ్మటము
అఱటులు
అఱవలు = ద్రావిళులు
అఱకన్ను
(అన్నము) అఱుగకుంట
ఆఱుట = తఱుగుట
(రూ)పఱి
(పొలు)పఱి
(క్ర)చ్చఱ
— ఇందులో, అఱచెయ్యి అఱకాలు- అర యనుట రేఫ ఱకారాలు రెండు గలవు.

ఇఱియుట
ఇఱికికొనుట
సుకవి మనోరంజనము
(కూడు) ఇఱిసిచనుట
ఇఱకటము
ఇఱులు (ఇరులు) = చీకట్లు
ఇఱుకు
(క్రి)క్కిఱియుట
(బండి) ఇఱుసు
—ఇరులు; శకటరేఫ ఉదాహరణము చింత్యము.

ఉఱడు=కైకొనడు
ఉఱుకుట
ఉఱుము
ఉఱక
ఉఱిది = బిగర
ఉఱు=మిక్కిలి
ఉఱవు
(కొంపలు) ఉఱియుట
ఉఱుకరి
ఉఱియ
ఉఱని తెగువు
ఉఱుతపిల్లలు

ఎఱకలు=ఱెక్కలు
ఎఱగుట
ఎఱపరికెము
ఎఱుకువాడు
ఎఱుపు
ఎఱుగుట
(సొమ్ము) ఎఱవిడుట
ఎఱచి = మాంసము
ఎఱికత
—ఎరవు; శకటరేఫ ఉదాహరణము చింత్యము.

ఓఱకటంపు త్రోవ
ఓఱగాల నిలుచుట
ఒఱగు = వంక
(కత్తి) ఒఱ
ఒఱయుట
ఒఱగుబిళ్ల
ఒఱపులు
ఒఱవదేహము

కఱపుట = నేర్పుట
కఱువు = దుర్భిక్షము
కఱతలు = పోకిళ్లు
కఱటి = మంకు
కఱదలు = బుద్ధులు
కఱుకు = కాఠిన్యము
కఱ= కప్పు (నలుపు)
(పులి) కఱచుట
కిఱుపుట
కుఱుమాపు
కుఱుగంటి
కుఱుగడ
కుఱుకొని
కుఱుకులు
కుఱుపు
కుఱులు (కురులు)
కుఱుకుఱ మన్నీలు
కుఱగలి
కుఱుచ
కెఱయుట
(ఉ)క్కెఱ
(ప)క్కెఱ
కొఱత
కొఱడు
కొఱలుట
కొఱగామి
కొఱకు
కొఱవి
కొఱుకుట
కొఱకొఱ

—ఇందులో కురులు; పక్కెర శకటరేఫము చింత్యము భారత విరాటపర్వము
సీ. ఇందు బింబము మీది కందు చందంబున
             కురులు నెమ్ముగమున నెరసియుండ...'
చేమకూర విజయవిలాసము:
గీ. కురులు కెంపుల బొగడల నెరయదువ్వి...'
ఇందులో 'నెరసుట' ను, 'ఒఱసుట' ను (నెఱయుట, ఒఱయుట) రేఫ, ఱకారాల రెంట గలవు కనుక చింత్యము. కురు లనుట రేఫ ఱకారాల రెంట గలదని తోచబడుచున్నది.

గఱికె
గఱగఱిక (గరగరిక)
గఱిసె
(డ)గ్గఱి
(అంప) గఱి
(మోట) గిఱుక
గిఱుమెట్లు
గిఱికొనుట
గిఱులు వ్రాయుట
గిఱుపుట
గుఱుకొని
గుఱుకు
గుఱినడచుట
గుఱుకొండి
గుఱగుఱ
గుఱు వెట్టుట
గుఱి
గుఱిమలు = గింజలు
గుఱుతు
గొఱియ
గొఱక కట్టెలు
గొఱగుట
గొఱవంక (గొరవంక)
గఱుగుగాయ (గరుగుగాయ)

—ఇందులో గరగరిక, గరుగు గాయ, గొరవంక పిట్టలు - రేఫ ఱకారాల రెంట చెప్పినారు. శకటరేఫ చింత్యము.

(అరచేత) చఱుచుట
(గొడ్డలి) చఱచుట
(వా) చఱచుట
చఱులు
(చి)చ్చఱ మంట
చిఱుతది
చిఱునవ్వు
చిఱకొట్టుట
(ము)చ్చిఱితనంబు
చిఱిమి
(దేహంబెల్ల) చుఱచుఱ గాల్చుట
చుఱుకు
చెఱి సగము
చెఱుకు
చెఱసాల
చెఱుముట
చెఱగు
చెఱచుట
చెఱలాట
చెఱకబట్టి
చెఱువున (ద్విజుల్ భుజించుట)
చెఱువుట
చెఱువు = తటాకము

—ఇందులో చెరగులనుట, చెరువులనుట రెంటగలవు. చెరువుట శకటరేఫము చింత్యము.

జఱి జఱి
(పూ) జఱి
జఱికొను
జఱపుట
(చేత) జమఱుట
జఱజలు
జిఱజిఱ త్రిప్పుట
జుంజుఱు నెఱులు
జొఱజొఱ

తఱుగుట = కోయుట, తక్కువగుట
తఱుగఱి=బేహారి
తఱిగొలుపుట
తఱులుట
(పుచ్చిన) తఱకలు
(శత్రుల) తఱియుట
తఱుముట
తఱులు
తఱపి
తఱచు=దట్టము
తఱి
తఱిగొని నడచుట
తిఱగుట
త్రిమ్మఱి
తిఱి వెనచుట
తుఱగలి
తుఱుము
(వా)తెఱ (వాతెర)
(ఏ)డ్తెఱ
(కను) దెఱచుట
తెఱవలు
తెఱకొలుపుట
తెఱపి
తెఱలిన వాసన
తెఱకువ
తెఱగు
తెప్పఱి
తొఱలుట
తొఱగులు

—ఇందులో తరలుట, తిరుగుట, (వాతెర, తొరగుట- రెంట గలవు.)

(అం)దఱు
(ఇం)దఱు
(కొం)దఱు
(ముం)దఱ
(పె)ద్దఱికము
(ఇ)ద్దఱు
(అ)ద్దిఱ
(గ)ద్దఱి
(ప)దఱుట
(ఎ)దుఱుట (ఎదురుట)

—ఎదురుట, శకటరేఫము చింత్యము

నఱుజు = కొంచెము
(చెట్టు) నఱకుట
నిఱుబేదు (నిఱుపేద?)
నుఱుముసేయుట
(వడ్లు) నుఱుపుట
నెఱకులు = అయములు
నెఱులు = వెండ్రుకలు
నెఱసుట (నెఱయుట) = నిండుట
నెఱియ=మిగులు
నెఱి = బాగు
(నీటులు) నెఱపుట
నెఱువును
నెఱలేని మిత్రుడు
నెఱికె = కాసె
నెఱ = దొడ్డు, గొప్పలు
నెఱజాణ
నెఱజిక్కి

—నెఱసుట, నెరపుట రెంట గలవు

పఱచుట = ప్రవహించుట
పరువిడుట, ఏయుట
పఱపఱచించుట
పఱుసదనము
పఱ
పఱియుట
పఱికెలు
పఱిగొనుట
పఱతెంచుట
(అమ్ములు) పఱపుట
పఱపుట
(ఆం)పఱ
(నెం)పఱ
పఱువు
పఱిమార్చుట
(తెం)పఱ
పఱిమోపుట
పఱువైనపువ్వు
(చూ)పఱ
పిఱుంద
పిఱిచనుట
పిఱివోవుట
పిఱికితనము
పిఱుదు
(తె)ప్పిఱి
పుఱియ
(మేను) పెఱుగుట
పెఱియు
పెఱసనిపోవుట
పెఱుకుట
పెఱికెలు

—పరతెంచుట, చూపర రెంట గలవు, పరిమార్చుట పరువు, పెరుగుట, = శకటరేఫము చింత్యము

బఱబఱ నీడ్చుట
(ద)బ్బఱ
బిఱబిఱత్రిప్పుట
బిఱుసులు = బాణసంచ
(కోట)బుఱుజులు

మఱచుట
మఱునాడు
మఱదలు
మఱిది
(ఏ)మఱిపాటు
(పలు) మఱు (మరు)
మఱి (మరి)
మఱుగు
మఱువ = మృద్భాండము
మఱుగుట
(వే)మఱ (మర)
మఱుపడి
మఱలేక
మఱగాలు
మఱల
(తి)మ్మఱుట
(పడ)మఱ
మిఱిచూపు
మిఱిమిట్లు
ముఱిముఱి చీకటి
ముఱిముఱి బడిబడి
ముఱి = మొండెము
(అఱి) ముఱి
మెరములిడుట
మెఱపు
మెఱయుట
మెఱుగు
(కన్)మొఱుగుట

మొఱకతనము
(వేపులు) మొఱగుట
మొఱ
మొఱమొఱలాడుట
మొఱక = వెలితి
మొఱసుట (మొఱయుట)
— పలుమరు; మరలుట, వేమరు; మరి - రెంట గలవు.

ఱట్టువొందుట
ఱంపిల్లుట
ఱవఱవలు
ఱవళి (రవళి)
ఱవికె
ఱంతులు (రంతులు)
(వజ్రపు) ఱవలు
ఱంపము
ఱికిరించుట
ఱిచ్చ
ఱిక్కవిడుట
ఱివ్వున నెగయుట
ఱింగున మ్రోగుట
(శిలల) ఱువ్వుట
(చిలక)ఱెక్క
ఱెల్లుగడ్డి
(కను)ఱెప్ప
(పూ)ఱెమ్మ
ఱొమ్ము
— రంతులు, రొమ్ము రెంటగలవు.

వఱువ
వఱద
వఱలుట
వఱడు
వఱుగు
విఱుగు
విఱిపోవుట
విఱిగాలి
విఱివిడి
వెఱపు
(ని)వ్వెఱ
వెఱబొమ్మ
వెఱచఱచుట
వెఱగు
సుఱసుఱస్రుక్కుట
అసుఱుసుఱు

ఆఱని తేజము
ఆఱడి
ఆఱికెపంట
ఆఱు=షట్క, రోమావలులు
(ఊ)టాఱిన ముత్తెము
(తడి) ఆఱె
(పాపములు) ఆఱె

ఊఱట చాలించుట
ఊఱుగాయలు
(జలము) ఊరుట

ఏఱు = నది
(పండులు) ఏఱుట
ఏఱువ = సీమ

కాఱడవి
కాఱుపోతు
కాఱుట
కాఱియబెట్టుట
(హొంత) కాఱి
కోఱ = దంతము

(పండ్లు) గీఱుట
గీఱుట =నాటుట

చాఱు ద్రావుట
చాఱలపులి
చాఱపప్పు
చీఱుట = పిలుచుట
చూఱగొనుట (చూరగొనుట)
(ఉట్టి) చేఱు (చేరు)
చేఱెడు (చేరెడు)
చోఱమీలు
—చీరుట (=పిలుచుట), చూర రెంటగలవు, చేరు, చేరెడు శకటరేఫ చింత్యము.

జాఱుట
(బ)జాఱు
(హ)జాఱము = మొగసాల
(తు)జాఱులు = ధనికులు
జోఱున వానగురియుట

తాఱుట
తీఱుట
తీఱు
తీఱెను
తేఱుట
(గడి) తేఱుట
తేఱిచూచుట
(ధర్మంబు) తేఱుట
తేఱుదురు

దూఱుట

నాఱు విడుచుట
ఉల్లి) నాఱు
(సొ)న్నాఱి
నీఱు = నిప్పుపైబూది
నూఱు = సంఖ్య
(పసపు) నూఱుట
పాఱుడు = బ్రాహ్మణుడు
(నది) పాఱుట
(ఇంకన్) పాఱుట
(మేను గరు)పాఱుట
పేఱుట = పెనగుట
పోఱడు

బీఱువోవుట

మాఱుమొగము
మాఱిమసగుట (మారి)
(ఇను) మాఱు
మాఱుడుగుట
మాఱువడుట
(వే)మాఱు (మారు)
మాఱుమాట
మీఱుట

—బీరువోవుట, మారుమొగము- రెంటగలవు. మారిమసగుట - శకటరేఫము చింత్యము

ఱాచుట
ఱాయి
ఱాగ
(ప్రే)ఱేచుట
ఱేపు
ఱేవు
ఱేసి
ఱేకు
ఱేడు
ఱేలు
ఱేచు
ఱేగు
ఱోయుట
ఱోత
ఱోలుట
—రాయి; రెంటగలదు, రాచుట, రోయుట (అసహ్యమర్థము) - శకటరేఫము చింత్యము.

వేఱుపడుట
వేఱొకటి
వీఱడి

రేఫ ఱకార పరిశీలనాలోపములు

తిమ్మకవి సార్వభౌముడు (ఇట్లు రేఫ ఱకారములు నిర్ణయించి) లక్షణసారసంగ్రహమందు (1-818)—
గీ.

అరయ గురురేఫ హల్లుతో బెరసినపుడు
ప్రాసముల విశ్రమములు రేఫములతోడఁ
గలసి యుండును సుకవి పుంగవుల కృతుల
జగదవనసూత్ర గిరితనూజాకళత్ర.

207
లక్ష్యములు
ఎఱ్ఱనగారి రామాయణము
ఉ.

నూర్వురు నొక్కచందము మనోగతి సైరసజేసి నన్ను నా
సర్వకులంబు నుత్తమయశంబున నుంచితి రమ్మలార మీ
కుర్విని సాటియే యబల లొండొరు దేవతలుం బటుక్షమా
నిర్వహణం బొనర్చుటకు నేరరు, మర్త్యులఁ జెప్ప నేటికిన్.

208
భీష్మపర్వము (3-278)
క.

కార్చిచ్చు గవసి మృగముల
నేర్చుకరణి నేడు భీష్ముఁ డేచిన కడిమిం
చేర్చి మన భీముఁ బొదవె శ
రార్చుల నవ్వీరుఁ గన్నులారం గంటే.

209
ద్రోణపర్వము (4-191)
క.

చెలఁగి పటు సింహనాదం
బులు రంకెలుగాఁగ వారు బొలిచిరి వృషభం
బులక్రియ నొండొరులకు మా
ర్మలయుచు దాకుచు నుదాత్తరభసోజ్జ్వలులై.

210
అని చెప్పినారు.
—కాని రేఫ ఱకారముల పట్ల పరిశీలించుట(లో) అందఱికిని లోపమే. అహోబల పండితుల వారు 'పురసతుల - మఱిగి' అని రేఫ శకటరేఫముల పోతరాజుగారు కలిపినారని ఆక్షేపించినారు. అది పోతరాజుగారి కవిత్వముకాదు. (కాని అది) ఎవరి కవిత్వమైనను (మరిగి) ఉభయము కలదు. 211
ఎఱ్ఱనగారి హరివంశము (పూ. భా. 8-16) నందు
క.

హరి చేష్టితములు క్రమమున
మరిగి నిజముగాఁగఁ దమదు మగలఁ దొరఁగి యా
హరియంద భర్తృ బుద్ధిం
బరిణతలై రా వ్రజంబు బాలిక లెల్లన్.

212
అని రేఫముగా ప్రయోగించిరి. కవిత్రయమువారి ప్రయోగము గలుగగా పరిశీలించక భాగవతము నాక్షేపించుట కూడదు. లాక్షణికులు మఱిగి, వేఱు - గురురేఫము లన్నారు. (కాని) ఉభయరేఫములందు నెవరు వ్రాయలేదు. కాకునూరి అవ్పకవిగారు ‘ఆంధ్రశబ్దచింతామణి'యందు—
గీ.

వేఱు పడుటయు వీఱడి వేఱొకటియు
నాదిగాఁ గొని యాంధ్రవాక్యముల యందుఁ
బాదుకొను దీర్ఘముల మీఁద బండిఱాలు
దీని నెఱుఁగక కృతిసేయు వెఱ్ఱిగలఁడె.

213
అని స్పష్టముగా చెప్పిరి. 214
రేఫలమీద వకారమున కేత్వము దీర్ఘములగల పదమె. (కాని) యెవరును చెప్పలేదు. అట్టిదానికి అహోబల పండితులు కవిశిరోమణి యందు
ఉ.

వేరనలేరు ధారుణి నవీనతరాంధ్రకవిత్వసంపదా
ధార రసజ్ఞులైనఁ గవితల్లజులైన వినుండు పాండితీ
పారగులార యో పరమబంధువులార తదీయశబ్దసం
భారము పారముం దెలియ పాల్పడ నేనసుడీ నిజంబుగన్.

215
అని రేఫముగా ప్రయోగించిరి. స్వకవిత్వమున సాంకర్యమే కలిగెను. వారు 216

'గట్టిగ నభినవ నన్నయ
భట్టాచార్యాభిధాన పటు బిరుదాంకం
బట్టిట్టనక వహించిన
దిట్టను నను బోలఁగల సుధీమణు లేరీ?'

అని స్వమహిమ ప్రకటించుకొనిరి. కాని, వేరు ఉభయము గలదు. 217
ఎఱ్ఱనగారి హరివంశము (ఉ.భా. 4-112)
క.

పోరాని చుట్ట మితఁడని
కూరిమి చెలికాఁ డనంగఁ గోరి వరుస గో
త్రారి హరి బాంధవుల వే
ర్వేరం గుశలంబు లడిగెఁ బ్రియ మలరారన్.

218
ఉద్యోగపర్వము (2–116)
గీ.

పాండురాజ తనూజుల పాలి కర్థి
నిమ్మహారాజు పనుపంగ నేఁగి ధర్మ
పుత్రుఁ గాంచితి నాతఁడు మైత్రి మెఱయ
గౌరవుల సేమ మెల్ల వేర్వేర నడిగె.

219
అని రెండు లక్ష్యము లుండగా కేవలము గురురేఫగా లాక్షణికులు చెప్పుటయు పరిశీలించకపోవుటే. 220
అయితే, అహోబల పండితులవారు ఉభయము గలదని యెఱిగే రేఫముగా ప్రయోగించినా రంటిరా, 'మరిగి' (అను దానిని) ఆక్షేపించరాదు. భాగవతమందు మాత్రమేమి, రాఘవపాండవీయము (2–6) నందు 221
రగడ.

మరిగి యెవ్వఁడు కంఠమాలికల పోలికల
పరగను గలిపి రంక పాలికల బాలికల

222

(అని యున్నది. కావున) రాఘవపాండవీయమును (గూడ) నాక్షేపించవలెను,

'పరగ' 'రేఫ గావున.223
అహోబల పండితులవారు బిరుదుకు తగిన పాండిత్యమహిమను వహించలేదు. 224
లాక్షణికుల పొరబాటు మరియు (నొకటి). మాఱాడుట, నీఱు = నిప్పులపై బూది, కాఱియ = కష్టము — ఇవి గురురేఫ లన్నారు. కాని రేఫమున్ను గలదు.) 225
ఎఱ్ఱనగారి హరివంశము (ఉ. భా. 6-128)
క.

మారాడినఁ గోపింతురు
నీరుగ శపియింతు రేము నీబోంట్లకు నీ
శూరతములు వెఱతురె మము
గారియఁగా నిట్లు వలుక గలరే యన్యుల్.

223
అచ్చుపుస్తకములందు 'శూరతములు' రేఫగాను, మిగిలినవి ఱకారములుగాను వ్రాసినారు. భారతమందే రేఫ ఱకార సాంకర్యముంటే, రేఫ ఱకార నిర్ణయమే పనిలేదు. ఇంతకన్న నవివేకము గలుగదు. 227

"దేవ దానవు లట్లు విద్వేష మెపుడు
గలిగి యుండును రేఫ ఱకారములకు
నట్లు గావున నవి గలయంగ నీక
కావ్యములఁ గూర్పవలయు సత్కవు లెఱింగి

228


ఎన్ని లక్షణంబు లెఱిఁగిన రేఫలు
బండిఱాలు నెఱుఁగకుండు నట్టి
కవి కవిత్వమెల్ల గవ్వకు కొ...
కొఱతజెందు రజత కుధరనిలయ

229

(ల. సా. సం. 3-40, 42)

జ్ఞాతివైరంబు నంది ప్రాసంబులందు
విశ్రమములందుఁ దమలోన వేరు గలిగి
దేవదానవు లట్లన తెలుఁగు నందు
మించి రేఫ ఱకారముల్ మెలఁగుఁ గృష్ణ.

230

(అ.క. 2-229)

'నాన్యేషాం వైధర్మ్యం లఘ్వలఘూనాం
రయోస్తు నిత్యం స్యాత్'

అని వాగనుశాసన సూత్రమునందుననె (యున్నందున) లాక్షణికులు రేఫ ఱకార(ములు యతి) ప్రాసములకు కూడ దన్నారు కాని — 231
నన్నయభట్టుగారు, తిక్కన సోమయాజులగారు, ఎఱ్ఱాప్రెగడగారు — వీరు కవిత్రయము వారు. వీరు ముగ్గురును తెలుగు చేసినది భారతము. తిక్కన సోమయాజులగారు 'ఉత్తర రామాయణము' తెలుగు చేసినారు. ఎఱ్ఱాప్రెగడగారు (హరివంశము రచించినారు). ప్రత్యేకము 'రామాయణము' రచించినారు. మరియును గ్రంథములు రచించినారు. అటు(వంటి మహాకవుల ప్రయో)గములకు లాక్షణికులు నిర్ణయించిన రేఫ ఱకారములకు — (సరిగా) పరిశీలించ నందున వ్యత్యస్తములు గలవు. ఇదివరకు మిక్కిలియు లక్ష్యములు వ్రాసినాము.(ఇంకను బహులములు గలవు. కాని) గ్రంథ విస్తరమగుటవలన నిలిపి (వేసినాము. బుద్ధిమంతులు గ్రంథములందు పరిశీలించి ఇంకను తెలిసికొనేది.) 232
  1. ఈ ఆశ్వాసాదినుండి 23 (వచనము) వరకు 'ఇ-ప్రతి' నుండి గ్రహింపబడిన భాగము. (చూ. 'సమాలోకనము' - మూల ప్రతి).
  2. అయీది, పోయీది అనునవి, అయ్యెడిది, పోయెడిది అను పదములకు వికృతి రూపములు. (వ్యాకరణపరిభాషలో గ్రామ్యరూపములు)