సాక్షి మూడవ సంపుటం/మహాత్ముని తపఃపరిసమాప్తి

22. మహాత్ముని తపఃపరిసమాప్తి


గాంధీగారు నిరశనవ్రతం పూని, పరిసమాప్తి చేశారని తెలిసిన తరవాత జంఘాలశాస్త్రి ఆ చర్యలో ప్రత్యేకత గురించి ప్రశంసిస్తూ ఉపన్యాసం చేశాడు.

వైష్ణవ సంప్రదాయం ప్రకారం దేవుడి కంటె భక్తుడే పూజ్యతరుడు. దేవభక్తుడు కావడం వల్ల పూజ్యుడైన మహాత్ముని ప్రశంస ఈరోజు జరుగు తోంది.

మూడడుగులున్నర వడుగు బలిచక్రవర్తి చూస్తుండగా, మూడడుగు లని చెప్పి సృష్టినంతా ఆక్రమించినట్టే, రమారమి అయిదడుగులు పొడుగు కల మనిషి సర్వప్రపంచ మానవ హృదయాలను గాఢంగా ఆక్రమించుకున్నాడు. మహాత్ముడు ఈ ఒక్క జన్మానికే తరిస్తాడని చెప్పవచ్చు. ఆత్మపరి ణామ క్రమంలో, అలనాట విష్ణుభక్తులైన జయ విజయుల కంటె మహాత్ముడు అగ్రస్థానం ఆక్రమించుకోగలడు. మొదటి మహాత్ముల్ని మనం ఎరగము. ఇప్పటి మహాత్ముని కాలంలో జీవించడం వల్ల పుణ్యాత్ములం. ఆయన మనస్తత్వాన్ని చదివి, జన్మాన్ని సార్ధకం చేసుకోండి. మనకీ, భగవంతుడికీ మధ్య మహాత్ముడు మజిలీగా వున్నాడు.

నాయనలారా! చదువులన్నీ కట్టిపెట్టండి. వాటివల్ల ఏం ప్రయోజనం లేదు. చదవదగిన పుస్తకం చదవండి. అది పర్ణకుటీరంలో వుంది. దైవప్రార్ధన చేద్దాం అని జంఘాలశాస్తి అంటూండగా ఒక క్రైస్తవ మత గురువు లేని, గాంధీ గారి ఉపన్యాసం గురించి ప్రస్తావించి ఉపవాసం రహస్యంగానే తప్ప బహిరంగంగా చేయకూడదని జీసస్ చెప్పాడని చెప్పాడు. జంఘాలశాస్త్రి జీసస్ దేశకాలాలకీ, మహాత్ముని దేశ కాలాలకీ తేడా వుందని చెప్పి, సభను తన ఒక్కడి ప్రార్ధనతోనే ముగించ వలసివచ్చింది.

జంఘాలశాస్తి యిట్టు పలికెను:

మహాత్ముఁడు మహోదారమగు తపస్సును నిర్విఘ్నముగఁ బరిసమాప్తి నొందించి ప్రపంచమున కానందము కలుగఁజేసినందుల కాలోకోత్తరపురుషునిఁ బ్రశంసించుచుఁ బరమేశ్వరుని ధ్యానించుటకంటె సార్థకమైన కృత్యము వేఱొండు లేదు. ఏదినమున హరికథా కాలక్షేపమగునో యాదినము దినములన్నిటిలో నుత్తమమైనదని పెద్దలు నిర్వహించినారు. దేవునకు దేశభక్తునకు లేశమైన భేదము లేదు. వైష్ణవ సంప్రదాయానుసారముగ దేవునికంటు దేవభక్తుండే పూజ్యతరుడు. దేవభక్తుం డగుటవలనఁ బూజ్యం డగుమహాత్ముని ప్రశంస యీదినమున జరుగచున్నది. కావున నీ దినము పవిత్రమైన దినము. ఈస్టలమునందు జరుగుచున్నది. కావున నిది పవిత్రమైన స్థలము.

అన్ని కాలములందు, నన్ని దేశములందు దేశభక్తులెందరితో యుండిరి. వారిలో ననేకులు సంసారముల రోసి, నివాసములద్యజించి యేగిరి. ఏగహ్వరమునందో యేచెట్టునీ డనో తపస్సుచేసికొని తాము తరించిన వారేకాని యితరుల దరింపఁజేసినవారు కారు. అట్టివా రెంతయుత్కృష్ణ జీవులయ్యును వారుకూడ నొకవిధమగు స్వార్డపరులేకాని కేవల స్వార్థరహితులు కారు. శ్లో, "యస్మి జీవతి జీవంతి బహువ స్సతు జీవితి' అని కవి గాన మొనర్చినాడు. ఎవని జీవమువలన ననేకులు జీవింతురో వాండే జీవించినవాఁడని యాతండు చెప్పినాఁడు. అదియే నిజము. కాని దానికి మఱికొంత చేర్పవలసియున్నది. ఎవఁడు తరించుటవలన ననేకులు తరింతురో వాఁడే తరించినవాఁడు కాఁడా?

అందుచే మహాత్ముఁడు దేవభక్తుఁడేగాక, దేశభక్తుఁడు ప్రజాభక్తుఁడు ప్రపంచభక్తుఁడు. ఆతఁడు తమ శత్రువేమో యని బ్రాంతిపడుచున్న వారికిఁ గూడ భక్తుఁడు. వార్షకమున నుపక్రమించిన ఘోరతపస్సు వలని ప్రమాదము లేకుండ వెలిబడిన భక్తసార్వభౌమునిఁ గూర్చి ప్రశంసించుచుండంగా నిటనున్న గాలియే పవిత్రమగుచున్న దని చెప్పినప్పడు మన లెక్కయేమి? ప్రపంచమున సాధారమణముగ నూటికిఁ దొంబదైదు గురు స్వార్డపరులు. మిగులువా రైదుగురు కూడ తరబడిగతరబడిగ స్వార్ధరహితులే. కాని పరిపూర్ణస్వార్థరహి తులు కారు. సంపూర్ణస్వార్ధసంహారకుండగువాఁడు లక్ష కొక్క డుండునేమో? మహాత్ము డట్టి సంపూర్ణ స్వార్డచ్చేదకుడు మాత్రమే కాక నంతకంటె నున్నతపదవి నధిష్టించి నాఁడు ఎట్లు? పరుల పాపపర్వతములను తలపై వైచుకొనలేదు? వారు పొందవలసిన పశ్చాత్తాపము లను తానే పొంది దహించిపోవుచున్నాడు. కాదా? వారిపాపప్రశాంతికి తానే ఘోరతప మొనర్చి శల్యావసిష్ఠుండు కాలేదా? వారి దోషము లన్నియుఁ దనవే యని త్రికరణశుద్దిగా నమ్మిప్రాయోపవేశ మొనర్చి ప్రాణత్యాగ మొనర్చుటకు సిద్దపడినాడు. కాఁడా? వస్తుత్వము చేత, తత్త్వముచేత తనకును బరులకును భేదము లేదు లేదని ప్రత్యకముగ నాచరణయందు జూపిన యద్బుతవ్యక్తి వెనుకటి కాలములో లేఁడు. వెనుకటి సృష్టిలో లేఁడని చెప్పట యతిశయోక్తి కానేరదు. ఉక్తికెంత యతిశయతయున్నదో యంతకంటె విశేషము చర్యలోఁ జూపించిన యలె"కిక చరిత్రుని పాదపద్మముల కతిశయోక్తి దిగదుడుపు కాదా?

నాయనలారా! ఎవ్వరో గొణిగికొనుచున్నారు. ఏమందురు? ఏసుక్రీస్తు లేఁడా యని యనుచున్నారా? నాయనలారా! నేను విస్తృతి పడలేదు. ఏసుక్రీస్తు భగవంతుని కొడుకు. అందుచే భగవదంశమున జనించినవాఁడు. మేరీకన్యకుఁ బుట్టినప్పడేయాతండు దేవాంశోద్భవుఁడని గ్రహింపదగినది కాదా? అవా డెట్టివాడైనా విశేషమేమి? ఆ విశేష మేదో మామహాత్మునిది. మనుజుఁడై పుట్టి, స్వయంకృషిచే, స్వప్రయోజనకతచే, సాధనసక్ర మముచే నెంతవా డగుటకు సృష్టితత్త్వ మంగీకరించునో యంతవాఁడైనాఁడు. ఆతఁడు మొదట నాంగ్లేయ భాషాపండితుఁడే/. ఆంగ్లేయవేష ధారియే. తరువాత స్వదేశీయ వస్త్రధారి యైనాడు. పిదప స్వదేశస్వాతంత్ర్యరక్షకుఁ డైనాఁడు. పిమ్మట నింద్రియ నిగ్రహుడైనాఁడు. దానిపై శమదమాదిసంపన్నుడైనాడు. అందుమీఁద లోకాద్బుతచరితుం డైనాఁడు. దానిపై లోకపవిత్రుఁడైనాఁడు. ఆతఁడు స్వరూపమున పొడుకరి కాఁడు. తూని కలో నూటరెండుపానుల కంటె హెచ్చినవాఁడుకాఁడు. అట్టిదుర్బల శరీరుండు శ్రీరంగప్రధాన గోపురముపై నింక నూట రెండంతరువులు వైచినయెడల నదియ దిగియెదిగి పసిడికుండలతో భగవంతుని పాదములను స్పృశించినట్టుండునో యాతఁ డందఱు చూచుచుండఁగనే, చూచుచుండఁగనే యిప్లై యింత యాధ్యాత్మికౌన్నత్య మొందినాఁడు, అత్యాశ్చర్యకరము మూఁడడుగులున్నర వడుగు బలిచక్రవర్తి చూచుచుండంగనే మూఁడడుగు లాక్రమించుకొందునని చెప్పి, సృష్టినంతయు నాక్రమించుకొనిన రమారమి యైదడుగుల పొడుగుగల మనుజుఁడు సర్వ ప్రపంచజనహృదయములను గాఢముగ నాక్ర మించుకొనినాఁడు. ప్రపంచ చరిత్రములో నీవిచిత్రమే క్రొత్తగ జేర్పవలసియున్నది.

జయవిజయులు శాప మొందినప్పడు మూడుజన్మములలో భగవద్ద్వేషముతో తరింతురా? యేడుజన్మములలో భగవద్భకిలో ధరించతురా? యని యడుగఁబడగ మూఁడుజన్మములలో దరింతుమనిరి. మూఁడు జన్మములకంటెఁ దక్కువకాలములో నెవ్వరు తరింపలేరు. ఆంగ్లేయవిగ్రహముగా నారంభించిన యీవ్యక్తియొక్క యిప్పటి యాధ్యాత్మికోత్కర్షత చూడఁగా మహాత్ముఁడీ యొక్క జన్మమునకే తరించునని చెప్పఁదగి యున్నది. అప్డే జరుగునెడల నాత్మపరిణామక్రమమున జయవిజయుల కంటె నీఁత డగ్రస్థాన మాక్రమించుకొనఁగలడు.

అద్వైతమం దేకజీవవాదమని యొకటి యున్నది. ఇప్పడు కనబడుచున్న శరీరములన్నింటిలోను జీవుఁడు లేఁడనియు, నేదో యొక్క శరీరమందు మాత్రమే జీవుఁడునా్నఁడనియు, నాతం డెప్పడు తరించునో యప్పడే మిగిలినవారందఱు తరింతుర నియు నీవాదమునకు ముఖ్యాభిప్రాయము. అట్టివాదము ననుసరించి సజీవుఁడగువాఁ డొక్క మహాత్ముఁడే యేమో! ఎవరు చెప్పఁగలరు? నేను గొంతకాలమునుండి మహాత్మునిఁగూర్చి వినుచున్నాను. ఆయన మాటలకుఁ జర్యలకు నాకుఁదెలిసిన యర్ధమును గ్రహించుచు న్నాను. ఆయనమన స్సెట్లెట్లు పరిణామము నొందుచున్నదో నాకున్న జ్ఞానలేశమునుబట్టి గ్రహించుచున్నాను. నేను మహాదేవునికొక్కటి మహాత్మునకు రెండు నమస్కారము లర్పించి మనవి చేయున దేమనంగా; నాయనతత్త్వము నాకెంతమాత్రము బోధము కాలేదు. ఆయన సన్నిధానవర్తు లెందఱో యున్నారు. వారికేమైన దెలిసినదేమో యనంగ వా రావిషయమున మనకంటె ఘనులు కారని వినుచున్నాను. వారు తెలియనివారని నేను స్పష్టముగా జెప్పఁజాలను, కాని తెలిసినవారు కారని స్పష్టముగాఁ జెప్పఁగలను. వర్ణాశ్రమధర్మము, నస్పృశ్యత మొదలగు మహావిషయములగూర్చి అందుకుఁదగిన మాటలేవో నేర్చుకొని మన ముపన్యాసనాటకము లాడుచున్నామా లేదా? మనము చెప్పచున్న మాటలయర్ధము మన కగుచున్నదా? అట్టివో మహాత్మునితత్త్వ మెట్టెఱుఁగఁగలము?

ఈనడుమ నన్నుఁ జూచుట కొక నటోత్తముడు వచ్చినాఁడు. నడుమ నొకనాటక మాడితిమి. నాటకప్రదర్శనము బాగుగనే యున్నదనినారు. ఆ నాటకములో బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు వారి భార్యలతో వత్తురు. తుట్టతుద కెవ్వరిభార్యయొద్దకు వారు వెళ్లుట తోతటస్టించినప్పడు బ్రహ్మగారు పార్వతికొంగు బట్టుకొన్నాడు. మహాదేవయ్యా గారు మహాలక్ష్మమ్మబుజముపైఁ జేయివైచినా"డని చెప్పినాడు. మహాత్మునిఁ గూర్చి మనయందఱ యజ్ఞాన మానటకుల యజ్ఞానముకంటె తక్కువది కాదు. నిశ్చయముగా మహాత్ముని తత్వము దుధ్రహమైనది. అది తెలిసికొనిన యాతండు ప్రపంచమును దెలిసిన యాతండే.

(Aesop) ఈసప్ అనునాతండు మిట్టమధ్యాహ్నమునందు చేతిలో లాందరును పట్టుకొని వీథులలోఁ దిరుగుచుండెను. ప్రభువువలెఁ బగటిదివిటీతో బయలుదేరితివేమని యెవ్వరో యడుగగా మనుష్యు డెవ్వడైన, నిజమైన మనుష్యునకొఆ కంత కష్టపడి వెదుకఁదగినదే. అతని ప్రయత్నమెంతయైనఁ గొనియాడఁదగును. ఆతని శ్రమకు మన మెన్నియైన ధన్యవాదము లీయవలసినదే. కాని యాతండు వెదకుచున్న స్థలమున్నదే యదియంత తగినది కాదేమో యని మాత్రమే సందేహము. పశ్చిమదిశను వదలి తూర్పుగా వచ్చినయెడల నాతని ప్రయత్నమనేకపర్యాయములు గృతార్ధమైయుండెడిది. అట్టి ఈసఫ్ మాత్రమే కాదు. ఈ సృష్టియంతయు సంతోషింపఁదగినది. నిజమైన మనుజుఁడు తిరుగ భారతభూమియం దుద్బవించినాఁడు. ఊరక సంతోషించి యూరకొనకుడు. ఆయననుబటింపుడు.The proper study of mankind is man శ్రద్ధగా బటింపుడు. వెనకటి మహాత్ములను మన మెఱుఁగము. ఇప్పటి మహాత్ముని కాలమున జీవించియుండుటచే పుణ్యాత్ములము. ఆయన మనస్తత్త్వమును జదివి జన్మమును సార్డపఱచుకొనుఁడు. ఒక్క సారి మనము భగవంతుని యను భవమును సంపాదించుకొనలేము. అది నునకసాధ్యము. మనకు భగవంతునికి నడుమ మహాత్ముడు మజలీగ నిల్చియున్నాఁడు. ఆయనను మనము శ్రమపడి తెలిసికొందము. ఆయనతత్త్వము నెఱిఁగినవెనుక నీశ్వరతత్త్వమును గ్రహించుట విశేషకష్టము కాదు. ద్వైతమతస్థులందఱు ముఖ్య ప్రాణమూర్తిమాధ్యస్ట్యమునఁ దరింతుమని యనుకొనుచున్నారు. మహమ్మదీయు లందులకు మహమ్మదుగారిని నమ్మియున్నారు. క్రైస్తవమతస్థులందఱు జీసస్సును నమ్మియున్నారు. విశిష్టాద్వైతులు కూడ పురుషకారమును పూర్తిగ నమ్మినవారే. అటులే యిప్పడు మహాత్ముఁ డామాధ్యస్ట్య కృత్యమును నిర్వహించు టకు భగవంతునిచే నాజ్ఞాపింపఁబడినట్టు తెలిసికొనవలసియున్నది.

“నాయనలారా! చదువులన్నియుఁ గట్టిపెట్టుఁడు. వానివలన నేమియు లాభము లేదు. చదువఁ దగినపుస్తక మున్నది. అదియే చదువుఁడు. ఆపుస్తకము పర్థకుటియందు భద్రముగనున్నది. దానిలోని యక్షరములు నక్షత్రములవలె నేదేశమునుండి చూచినను కనఁబడును. నాయనలారా! అదే చదువుఁడు. దైవప్రార్ధన మొనర్త మందఱములెండు' అని నే నుపన్యసించుచుండఁగా నొక్క క్రైస్తవమతగురుఁడు లేచి యిట్టు పలికెను! “నే నిప్పడు లేచినది మీదైవ ప్రార్థనకొఱకు కాదు. గాందిగా రొనర్చిన యుపవాసమును గూర్చి నేను గొన్నిమాటలు చెప్పవలసియున్నది. ఏసుక్రీస్తువారు దేవునికొడుకు ఆయన చెప్పినమాటలు దేవుడు చెప్పినమాటలే. బైబిల్ మాకు వేదసత్యము. ఏసుక్రీస్తు ఉపవాసముచేసినాఁడని యనేకుల యభిప్రాయమైయున్నది. ఆయన యట్లెన్నఁడు జేయలేదు. నలువదిదినములు రేయుంబవళ్లు భోజనము లేకుండ మాత్రముండినాఁడు. ఎందుచేత ననంగా పాపాత్ముల నెట్టు పరిశుద్దులను చేయుదునా యను మహాచింతచే భోజనమొనర్చుట కాయనకుఁ దీరికయే లేకపోయినది. అంతేకాని పాపప్రాయశ్చిత్తముగాగాని భగవంతునియనుగ్రహముకొ ఆకుగాని యాయన యుపవాసము చేసియుండలేదు. తాను పవిత్రాత్ముడగుటచే నట్టు చేయవలసిన యగత్యమును లేదు. కాని యుపవాసాచార మెప్ప డారంభమైనదో తెలియదగ నంత ప్రాచీనమై యున్నది. దేవుని కుమారుని కాలములో మతవిషయములైన దొంగతనము విశేషముగా నుండెను. నిజమైన భగవద్భక్తులు మిక్కిలి యరుదుగా నుండెడివారు. ధనముకొఱకో, యశము కొఱకో, ప్రజాగౌరవము కొఱకో, మతసంబంధమైన ప్రార్థనలు, దానములు, నుపవాసములు మొదలైనవి చేయుచుండెడివారు. ప్రజలను మోసపుచ్చుటకే తన్కర భక్తు లిట్టు చేయుచున్న యుపవాసాది దాంభికాచారములను క్రీస్తుగారు మిగుల గర్జించుచుండెడి వారు. దైవకార్యములను తుచ్చమైన యైహిక లాభముకొఱకై యుపయోగించు కొనుచుండెడి వారు. లెక్క లేకుండ నుండిరి. Phairisees అను పెద్ద తెగవారందఱట్టివారే. ఇంత ననేకములైన యిట్టి తెగలుండెడివి. వారికందఆ కేసుక్రీస్తువారు బోధించినదేమనంగా మీకును భగవంతునికి మాత్రమే సంబంధమున్న మతవిషయక కర్మములన్నియు గూడ నెవ్వరికిఁ దెలియకుండ రహస్యముగఁ జేసికొనుఁడు. అందులో నుపవాసము రహస్యముగనే కాని బహిరంగముగ జరుపకూడదని యాయన యనేకస్థలములందు శాసించినాడు."

ఇట్లు చెప్పి యాక్రైస్తవుం డూరకుండెను. అప్పడు నేను లేచి యిట్టంటని. నాయనలారా! క్రైస్తవమతబోధ మనయందు దయగలిగి యేసుక్రీస్తువార కాలమందలి దేశస్థితి, యుపవాసమును గూర్చి జీసస్సుగారి యభిప్రాయమును వారికిఁ దెలిసినంతమట్టునకు విస్పష్టముగాఁ జెప్పినందులకుఁ గృతజ్ఞలమై యున్నాము. ఈమతగురుడు పరమశాంతుడు. ధారాళహ్పదయము గలవాఁడు. వారిమతమందు బరిపూర్ణ విశ్వాసమున్నవాఁడు. ఎంతసేపు చెప్పినను నిరాహారతపము రహస్యముగాఁ జేయవలయునను జీసస్సుగారి యభి ప్రాయమనియే చెప్పినాడు. కాని మనమహాత్ముని యుపవాస బహిరంగతను గూర్చి యొక్క యెత్తిపొడుపు పలుకైనఁ బలుకలేదు. కాని యట్టిసూచన తప్పదు. అట్టునకున్నను ననినట్టే. దూదూ యని యెంతముద్దుగ ననినను వచ్చునది కుక్క యని గ్రహించుకొనలేమా? ఈమతగురుఁడు చెప్పినమాట లాలోచించి విమర్శింపదగినవి. దీనిని గూర్చి యిప్పడు చెప్పఁబూనిన యెడల నొక గంటసే పగును. ఉపవాసమనగ నేమో, అది యెందులకు చేయవలయునో, పూర్వకాలమం దెవరెవరు చేసిరో, ఎట్టిఫలము లందిరో, ఏసుక్రీస్తు కాలమం దలి నాగరికత యెట్టిదో, సంఘస్థితి యెట్టిదో, ఉపవాసము రహస్యముగనే చేయ వలసినదని యెందుల కాతండు జెప్పవలసియున్నది. ఇప్పడు బోధించెనో యీయంశములన్నియు విపులముగ జెప్పవలసియున్నది. ఇప్పడు కాదు గావున పైవారముల నెప్పడో జెప్పెదను. మతగురుడు మాటలాడు చుండఁగనే యందఱు సభనుండి లేచిపోయినారు. దైవప్రార్ధనం జేయుటకు నేనొక్కడనే యుంటిని.

బిళహరి-ఏక.

జయరామ-జయరామ-జయజానకీరామ
జయనర్వగుణధామ-జయసార్వభౌమా
జయశుభాకరనామ-జయవైరిభీమా. 'జయ'

ఓం శాంతి శ్శాంతి శ్శాంతిః