సాక్షి మూడవ సంపుటం/తాజ్‌మహలు
23. తాజ్‌మహలు
జంఘాలశాస్త్రి, తాజ్‌మహల్ గురించి చుమాలుడు సభలో చెప్పిన దాన్ని వివరిస్తున్నాడు.
తాజ్‌మహల్ని ఒకడు పాలరాతి స్వప్నం అన్నాడు. ఉత్తమమైన లలితకళా సృష్టిని నిశ్శబ్దంగా, నిశ్చలంగా పరిశీలించినప్పడు కేవలం అలౌకిక మైన ఆనందం కలుగుతుంది - తప్పదు.
తాజ్ నాటకానికి కథానాయిక అర్జమంద్ బానూబీగమ్ ముంతాజ్.
సౌందర్యం అనేది సమ్మేళనానికి సంబంధించిన 'సాముదాయిక ఫలం' తాంబూలం రక్తిమలాగ, పువ్వులదండ పరిమళం లాగ, స్వరాల సమ్మేళనం లాగ, మనస్సుల కలయిక లోంచి పుట్టే సామరస్యం లాగ, ‘సౌందర్యం' అనేది కూడా ఎంచదగినది. ఈ కలయిక ఫలం, పటంలో కనబడదు.
అసలీ తాజ్‌మహల్ అవతరించడానికి కారణం - బెంగాల్లో రాజు, రాణి వ్యవహార సందర్భంగా సంచారం చేస్తుండగా ముంతాజ్ కి ఒక చెడ్డ కల వచ్చింది. షాజహాన్ ఓదార్చాడు. కాని, ఆమె ఒక కోరిక కోరింది. నాకు కట్టే గోరీ లాంటిది ప్రపంచంలో ఎక్కడా వుండకూడదు. తీర్థయాత్ర లాగ జనం వచ్చి చూసేలాగ వుండాలని -
ఆమె ప్రసవించి, మరణించిన తరవాత ఏడాదికి, ఏడాదికి, ఈ ‘మహలు' నిర్మాణం కొన్నేళ్లకి పూర్తయి ఆమె శరీరం, ఈ ప్రదేశంలో నిక్షేపించడం జరిగింది.
ఇలా, తాజ్‌మహల్ గురించి చాలా విశేషాలు ఉపన్యాసంలో చెప్పాడు. 1632లో నిర్మించబడిన ఈ మహలు 'పటా'న్ని సృష్టించిన వ్యక్తి "ఉస్తాదు ఈసా అనే పారశీకుడు.
బోయర్ యుద్ద మహావీరుడు లార్డ్ రాబర్ట్స్-“హిందూదేశయాత్ర తాజ్ దర్శనం వల్ల సార్థకమౌతోంద’ని వ్రాశాడట.
జంఘాలశాస్త్రి యిట్టు పలికెను:-
నేను సభలోనికిఁ బోవుసరికి జుమాలుఁ డిట్లు చెప్పచున్నాఁడు. చెవులారా వినదగినది. జూడదగినది. నోరారగొనియాడదగినది. మనసార నానందింపఁదగినది. పాలరాతి పద్యప్రబంధము. అది లోకమున ఖ్యాతినొందినది. అంత కల్పనా వైదుష్యము కల్గినది. అంత యభిరుచి ప్రకటమైనది, అంత సంస్థాన సమంజసమైనది, యంతయలంకారభూయిష్టమైనది, యంతభావోద్యోతకమైనది, యంత శాశ్వతమైనది మఱి యొకటి లేదని యఖిలనాగరకప్రపంచ మంగీకరించి యున్నది. దానిని జను లెన్ని యెన్ని ముద్దుమాటలఁ గొనియాడవలయునో యట్టుచేసియే యున్నారు. దీనిని బాలరాతిస్వప్న మని యొకఁడు స్తుతించి నాఁడు. అల్లికల జిగిబిగల యూహల నేతచేతస్వప్నపటము నిర్మింపఁబడినట్టే చంద్రకిరణములకంటె సున్నితములై పాలరాతి దీఁగలతోడి పూవుల కాయల మహాసుకుమారమైన సన్నివేశమున నీ “తాజ్" నిర్మింపబడినదని యట్టు స్తుతించిన వాని యభిప్రాయ మై యుండునేమో! పండు వెన్నెలలో దీనిన గొంచెము దూరముననుండి చూచినప్పడు దీని సౌందర్యము పరాశక్తివలె నవాజ్మనసగోచరమై యుండును. పున్నమ చందమామ తెల్లనికాంతి యాభవనమును గ్రమ్మగ వెనుక జెరగిలఁబడుట కనువుగా నున్న యనేక నక్షత్రప్రభాజిగిజిగాయమాన మగునాకసముతో, వివిధరత్నసంకలితమగు నీభవన మల్లై యడంగి మడంగి లీనమైపోయి భూలోకమునుండి స్వర్గలోకమున కిదియే దారిసుమా యని చూపించు నట్లుండును. న్యాయ మాలోచింపఁగా నుత్తమ మయిన లలిత కళాకార్యము నిశ్శబ్దముగా, నిశ్చలముగా బరిశీలించినప్పడు కేవలమౌకికమగు నాత్మానందము కలుగక తప్పదు.
"తాజ్ నాటకమునకు కథానాయిక 'అర్జమంద్ బానూబీగమ్ ముంతాజ్" యను మహామ్మదీయ మానినీమణి. ఈమె షాజహాను భార్య. ఈమెదని చెప్పబడిన రూపమును జూచితిని. పటమలో నన్నియు బాగుగనే యుండును. ప్రత్యకముగఁ జూచినప్పడే సౌందర్య నిర్ధారణ కెక్కువ యవకాశము కలుగును. కుక్కగొడుగు ఛాయా పటము మహాసౌందర్య ముగా నుండును. అవయవములకూర్పులో నిర్దుష్టత, గమనికయే సౌందర్యమునకుఁ బ్రధానములైనవి. కావు. సౌందర్యమునునది సమ్మేళనము యొక్క సాముదాయక ఫలము. ఒక స్త్రీకిఁ గన్ను సోగగా, విశాలముగా, బాగుగనే యుండును. ముక్కు ప్రత్యేకముగాఁ బరీక్షించిన యెడల సూటిగాఁ దగుమాత్రమైన యెత్తుగా జివర రవంత మొనగలవంపు కలిగి సుందరముగనే యుండును. గడ్డము మట్టునకుఁ బ్రత్యేకముగా నిదానించినయెడల నదియు యన్నియుఁ గలిపి చూచిన యెడల నది యేమి కర్మమోగాని తీర్ధమునకుఁ దీర్ణము, ప్రసాదమునకుఁ బ్రసాదముగను నుండును. కళకట్టనిదే కంటిసోగతనముతో ముక్కు సూటతనము కలసి గడ్డపు గుండ్రతనముతో మేళవించిగప్పమని, యనిర్వచనీయమైన కాంతి పుట్టినప్పడదు కదా సౌందర్యము! తాంబూలరక్తి యెట్టిదో, ప్రసవమాలాపరిమళ మెట్టిదో, స్వరసంఘాతమాధుర్య మెట్టిదో, మనస్సుల కలయికవలన సామరస్య మెట్టదో సౌందర్య మట్టిది. ఈకలయిక ఫలము పటములోఁ గనఁబడదు. కన్నుల నింద్రజాలమున వైచి మనస్సున కూపిరి సలుపకుండ తలపులిమి స్వాధీనము చేసికొను కాంతా శరీరవర్ణసౌభా గ్యము పటములో రానేరదు.
ఆ.వె. సొగసులన్ని మించి సొగసులకోటీర
మైనతళుకు, తళుకు లోనితళుకు
మొులకకులుకు లొలుకు కలకల కలదందు
నాడుదాని మొుగమె యూడు మొుగము.
మొత్తముమీఁద 'ముంతాజ్" సౌందర్యవతి యని చెప్పకతప్పదు. ఆమెయెడల భర్త కత్యంతానురాగ మని యెంత చెప్పినను సరిపోదు. తా నెక్కడకుఁ బోయినను, భార్య నొక్కదినమైన వదలకుండఁ గూడ దీసి కొనిపోవువాఁడు. వంగదేశమునందుఁ గాబోలు వారు వ్యవహార సందర్భమున సంచారము చేయుచుండగా నొక్కరాత్రి యామె నిద్ర నుండి లేచి గడగడ వడకుచు నేడువనారంభించెను. ప్రక్కనున్న భర్త యదరిపడి లేచి యేమి యేమని గ్రుచ్చి గ్రుచ్చి కౌఁగలించుకొనుచు గ్రుచ్చి గ్రుచ్చి యడిగెను. అప్పడామె పూర్ణగర్భవతియై యుండెను. నాకొక్క దుస్వప్నము కలిగినది. నే నింక జీవింపనని యామె విలపించెను. భర్త యామె నోదార్చుట కెన్ని పాటులైనఁ బడెను. ఇట్లొక్క గంట జరిగిన పిమ్మట నామె రవంత తెప్పిరిలి భర్తతో నిట్లు పలికెను. “నాశరీరనిక్షేపమునకై నీవు కట్టబోవు 'గోరీ" యంత విలువకలది, అంత చక్కనిది ప్రపంచమున మఱియొక్కటి యుండగూడదు. తీర్థయాత్ర సేవించునట్టు నా గోరీని జూచుటకై ప్రపంచమున మారుమూలల నున్నవారైన వచ్చునట్లుండవలయును. ఏమి? ఏమందువు' ' ఆమాట యిప్పడెందుల' కని భర్త యామెను మందలించెను. నీవట్లు చేసెదనని వాగ్దానమిచ్చినఁ గాని నా యాత్మకు శాంతి యుండదని యామె పట్టుదలతోఁ బ్రత్యుత్తర మీయఁగా నష్టేయని భర్త మాటనిచ్చెను.
అటుతరువాతం ద్వరలోనే యామె ప్రసవించి, మరణించెను. ఆమె కళేబరము నొకభద్రమైన గృహమందుఁ గాపాడి, తుదకుఁ గొన్ని సంవత్సరములయిన పిమ్మట నీ భవనమును బూర్తిచేయించి దాని నామె భర్త నిక్షేప మొనర్చెను.
దీనికి చాల రాతిపలక లెక్కడనుండి వచ్చినవో, యెంతకాలము దీనిపని చేసినారో, యెంతసొమ్ము వ్యయమయ్యెనో యను నంశములు విచారణీయములు కావు. ప్రతిమనుజునకుఁ దాను శాశ్వతముగా నుండవలయునన్న వాంఛసహజము. తనతత్త్వము తానెఱిగిన మనుజునకుఁ దాసు శాశ్వతుండనియే తెలియును. శాశ్వతుఁడను కావలయునని కోరుకొన నక్కఱలేదు. కాని మనుజసామాన్యుల కట్టి పరమార్థజ్ఞానముండదు. మన పేరు భూమపై నెంతకాలముండునో అంతకాలము మనకు స్వర్గలోకసుఖ ముండునని మాత్రమే వారు నమ్ముదురు. ఈనమ్మకము హిందువులలో నెట్టున్నదో మహమ్మదీయులలోగూడ నట్లేయున్న దనుకొందును. అందుచేత తమపేరు మీదుగా నుండదగిన స్థిరమైనపనులను జనులు తఱచుగఁ జేయుచుందురు.
ఈమహమ్మదీయవనిత సహజమైన యీవాంఛచేతనే యింత కోరిక కోరెను. భార్యా నురాగముచేతనే భర్తయిందుల కంగీకరించి నాడు. భార్యానురాగమేమి? శత్రువులయందలి క్రోధమేమి? సంసారచర్యలలో నుపయోగపడుచున్న అన్ని రసములు గూడ మహోపకారకృ త్యములను జేయించినవి. చేయించుచున్నవి. ఆడుదానియందలి యనురాగము తాజ్యంత లోకోత్తరమైన కృత్యమునకుఁ గారణమైనది. శత్రువులపైని క్రోధము చీనాయంతటి మహాదేశ మునకుఁ జట్టుగోడను కట్టించినది. ఇటులెన్ని చెప్పవలెను? క్రోధాదులను సంహరింపవలసి నదని మన పెద్దలు శాశించిరి. వారిమాట కాదనగలవా రెవరు? అయినను ప్రపంచము వానిచేతనే సుఖవంతమగుచున్న దని జెప్పవలసి వచ్చుచున్నది. కాని ప్రాపంచికసుఖమే పరమార్ధము కాక పోవుటచే నట్టు పెద్దలు నిర్వచించిరని యనుకొన వలసియున్నది.
సౌఖ్యమును రోసి, సంసారమును త్యజించి, ప్రాపంచిక సుఖమును వదలుకొని యే కొండగుహలనో, యేనిర్ఘరతీరముననో తపమొనర్చి తానొక్కడుమాత్రమే తరించి యద్వ యానందము నొందుట కంటేు జనుడు మనుజులలో దిరుగుచు వారిని గష్టములనుండి యుద్దరించుచు వారి సుఖసాధనము లభివృద్ది పఱచుచు స్వార్డపరిత్యాగియై వారిని సేవించుచు తనువు కృతార్ధము జేసికొని తరించుటయే విశేషము కాదా? తానొక్కడు తరించుటయే పరమార్థమగునెడల గురు ధిక్కారపాపమున కొడిగట్టి గోపురమెక్కి తిరుమంత్రార్ధమును త్రిదండి శిఖామణి ప్రజల కేల యుపదేశించి యుండును. ప్రేమమతమును బుద్దు డేల ప్రపంచమున వెదజల్లియుండును. ఇతరులను దరింపఁజేయుచు తాను దరించువాడు భగవంతుని ప్రతినిధి యనకతప్పదు. ప్రజాపాపనివారణమునకై ప్రాణము లర్చించిన పవిత్రాత్ముఁడు భగవంతుని కొడుకు కాక మరెవ్వఁడు.
నాయనలారా! ప్రధానవిషయమును వదలివైచి మారుదారిని బోవుచున్నాను. ఈ దినమున దేహమునకు మనస్సునకుగూడ నస్వస్థతగా నున్నది. నాయనలారా! ఒక్క మనవి. నేను చెప్పఁబోవునది శ్రద్దగా వినుడు.
ఇదిగో ఈ యెఱ్ఱరాల ముఖాద్వారపుమేడక్రింద నిలువంబడి 'తాజ్మహలు" వంకజూతము. తెల్లనిగుమ్మటమువలె శారదా భ్రసంచయమువలె నగపడుచున్న యారజత గిరి శకలమే దర్శనీయమైన 'తాజ్మహలు'. ఇక్కడ నుండియే యొక్క వింత సంగతి కనిపెప్టెదను. తాజ్మహలు మనకిక్కడనుండి రెండు ఫర్గాంగుల దూరములో నున్నది. దాని నిక్కడనుంచి చూచు మనకది యసలు భవనముకంటెఁ జిన్నదిగాఁ గనఁబడక తప్పదు కదా! ఎంతచిన్నదిగా గనబడు చున్నదనఁగాఁ దాని చిన్న పరిమాణముతో నది మనయెు ద్దకు వచ్చునెడల నది యీ మేడలోనికి సులభముగాఁ బ్రవేశింపదగినట్టున్నది. అత్యంతము సున్నితమగు దూరదృష్టి సంబంధమైన పరిమాణజ్ఞానముతోడ నీ సింహద్వారము సృష్టింప బడినది.
మనమింక ముందునకుఁ బోయెదము. దారిలో నీప్రక్కనా ప్రక్క జక్కనితోట యున్నది. ఎదుటి మహాదర్శనము ముందీతోటవంక జూచువాఁడెవ్వడు. ఇంకొక్క యద్బుత నన్నివేశమిక్కడ కనబడుచున్నది. మనము తాజ్మహలు వద్దకు వెళ్లుచుండగా నది మనవద్దకు వచ్చుచున్నట్టుగుపడుచున్నది. ఇది మాయయో, కనుకట్లో తెలియదు. ఆభవన సంబంధమైన సౌందర్యశక్తిమన మింత దూరమున నుండగనే మన మన స్సానందవశ మగునట్టు క్రమ్మివేయుటచేత మనము కదలకుండ నుంటిమనియు, నాభవనమే మనయొద్దకు వచ్చుచున్నదనియు బ్రాంతి కలుగుచున్నదేమో. అత్యంత సౌందర్యవంతమైన వస్తువును జూచునప్పడు భ్రమయేమి, నిశ్చేష్టతయేమి, యస్వాధీన మనస్కతయేమి, గలుగఁదగని వికారమేదైనా నుండునా? పార్థసారధిస్వామి దర్శనమునకు బోవు యాత్రికుడు ప్రాకారము వెలుపల నింకనుండగనే పరమేశ్వరుని పవిత్రాతాశక్తి యాతని యొద్దకుపోయి పాపసంకులమైన యతని మనస్సునకు బరిశుద్దినిచ్చి మఱి లోనికి దీసికొని పోవును. ఇప్పడు తాజ్ భవనపు మెట్లెక్కుచున్నాము. ఈమెట్లటమీద మన శరీరము మాత్రమే యడుగడుగునకుఁ బైకి లేఁచుచున్నదా? కాదు. మనస్సు కూడ నట్లే లేఁచుచున్నది. తాజ్ కెదుట నిలువఁబడి నాము. ఎదుటివసారాకున్న పాలరాతి తడకలమీది పనివానితనము ముందు చూడగూడదా? ఊహుం లోనికి బోయినదాక నొక్కటే తొందర. రెండు పాలరాతి గోరీలు రవంతయెత్తయిన పాలరాతి తిన్నెపై నున్నవి. ఇవి నిజమైన గోరీలు కావు. వీనికి దిగువ క్రింది యంతస్థులో భూమిలో నిజమైన గోరీలు కావు. ఈగోరీలే భార్యభర్తలిరువురవి. డాబా మీద గోరీలు జవాబు గోరీలు. వీనికిఁగూడ నాల్గువైపులను నాల్గు పాలరాతి తడకలున్నవి. పైని పెద్దగుమ్చీయున్నది. ఎక్కడ చూచిన పాలరాతి తలతల. రత్నముల మిలమిల. పచ్చరాలు, నెఱ్ఱరాలు, నీలపురాలు, నాకుపచ్చరాలు, పాలరాతి పూదీఁగల చిత్రవిచిత్రపుఁ బనులపై వరుసలుగాను, నడ్డుదిడ్డముగాను, తోరణములుగాను, పడుగు పేకలుగాను, అయి మూలవాటముగానుఁ జెక్కబడియున్నవి. నాయనలారా! చూచి యాసౌందర్య మనుభవింప దగినదే కాని చెప్పదగినది కాదు.
ఇది 1932 లో నిర్మింపబడినది. వీనిని మనస్సులో గల్పించుకొని పటము సృష్టించిన యాతఁడు ' ఉస్తాదు-ఈసా" యను పారశీకుఁడు Austen De Bordeany అను ఫ్రెంచియాతండు దీనినిఁ గల్పించెనని చెప్పదురు. కాని యది సత్యము కాదు.
కాని నాల్గువైపులను నాల్గు పాలరాతిస్తంభము లున్నవేల? సముద్రతీరమందలి దీపగృహముమాదిరిగా నున్నవి. అవి యెట్టున్న సరే వాని యాకృతిలో మనకుఁ దగవులేదు. కాని యవి యక్కడ నేల యున్నవి. ఈ ప్రశ్నమున కుత్తరము చెప్పవారెవ్వరు? తాజ్ భవనమునకు నాల్గువైపుల నాల్గుగు మ్చీలేల యుండ వలయును. అందుకై ఈ స్తంభములు గూడ నున్నవని మీకు న న్నదిక్షేపింతురా? నాల్గు క్రిందనున్నవి. కనుక గదికొక్కటి చొప్పన నాల్గుగుమ్చీలు కట్టవలసి వచ్చినది. అవి భవనములోని భాగములే కావా? తాజ్ పాడుకాకుండ నొక్క గుమ్చీయైన తీయఁగలమా? వెలుపలనున్న ఈ స్తంభములట్టా? వానితో భవనముతో నేమి సంబంధమున్నది? అవి తీసిపారవై చినవైన తాజ్ సౌందర్యము లేశమైనా జంకునా?
ఉన్న ప్రయయోజనము లేదయ్యెను. లేకున్న నష్టములేదయ్యెను. అటులయిన నుండనేల? మీరిండ్లు కట్టుకొనుచున్నారు కదా! ఇల్లు పూర్తియైన పిదప నింటికి రవంతదూర ముగ నాల్గువైపుల నాలుగు స్తంభములను ప్రాతి యూరకుండుటకు మీ మనస్సెప్పడైనఁ బోయినదా? ఎవడైనఁ జేసియుండినయెడల పెద్దలెవరైనా నధిక్షేపింపరా? కాకులు గ్రద్దలు పాడుచేయునేమో, పిడుగులవలని యుపద్రవ మేమికలుగునో యని తాజ్ పై నొక పెద్ద గుమ్చీకట్టుటకు నాల్గువైపులా నాల్గు స్తంభములు కట్టఁబడినవా? అప్డేయగునెడల ప్రధానభవ నముతో నీస్తంభములకు సంబంధమున్నది. అప్పడు స్తంభముల కర్దమున్నది. కాని యందు కొఱకేయని చెప్పగలిగినవాఁ డెవ్వడు. పిడుగుతో పైగుమ్చీ పగులు నప్పడు లోని దాగునా? గదాఘాతమును తలపై జట్టుకొన్న సేలు వాపఁగలదా?
కవులు దీనిని ప్రబంధమనలేదా? గాయకులు దీనిని గీతమనలేదా? చిత్రవిలేఖరులు దీనిని జిత్రపట మనలేదా? శిల్పకులు దీనిని కళానిలయమన లేదా? కవితా, గానము, చిత్రలేఖనము, శిల్పము నను నాల్గుకళలు గూడ దీనిని సేవించుచున్నవని యీ స్తంభముల కర్ణము మనము చెప్పఁగూడదా? దీనిని జిత్రపట మన్న వారెవరో నాకుఁ దెలియదు. శిల్పకళావైచిత్ర్యమునకు ఫలమైన యీ భవనమును శిల్పకళ కూడ సేవించుచున్నదనుట తప్పకాదా? అందుచేత నీ స్తంభము లెందుకున్నవో చెప్పలేము. ఈసాగారు మొదట వ్రాసినపటమందు నివియుండెనో లేదో ఉండునని నిశ్చయముగాఁ జెప్పలేము. ఉండినయె డల వానికేదో పరమార్థ ముండి తీరవలయును. తెలియ రాని విషయమును గూర్చి యీ ప్రయత్నమెందులకు?
Lord Roberts అనునాతడు Boer యుద్దమున వీరాగ్రేసరుడని మిరు వినియు న్నారు. అతఁడు నలువదియొక్క నంవత్సరములు హిందూ దేశమం దుండెను. ఆతఁడు తన గ్రంథమున నిట్లు వ్రాసినాడు. ‘‘కవిత్వమువలనఁగాని, చిత్రలేఖనము వలనఁగాని, యెంత భావనాధార్ద్య మున్నవానికైనా నీ విచిత్రకల్పన యొక్క న్వచ్చత యెట్టిదో, సర్వజన సంతోషప్రధాన ప్రతిభ యెట్టిదో, రవ్వంతయైన తెలియజేయుటకు సాధ్యము కాదు. హిందూదేశయాత్ర తాజ్ దర్శనమువలన సార్థకమగుచున్నదని తాజ్ ను గూర్చి వ్రాసినాడు
పండు వెన్నెలలో నీభవన మత్యంత శోభాయుక్తముగ నుండునని పెద్దలవలన విని రాత్రికూడ నటకుఁ బోయి కూర్చుంటిని. రవ్వంత సేపటి కింటికి వచ్చి నిద్రపోయితిని. ఒక చిత్రమయిన కల వచ్చినది. దాని వైచిత్ర్య మింతింతనరాదు. దానిని పైవార మెప్పడైనా జెప్పెదను.
"ఓం శాంతి శ్శాంతి శ్శాంతిః"