సాక్షి మూడవ సంపుటం/చిత్ర లేఖనము

3. చిత్ర లేఖనము

రోజున తుంగభద్రా తీరవాసులు, చిత్రకారులు అయిన ఒక శాస్త్రిగారిని సాక్షి సంఘసభకు ఆహ్వానించి, ఆయనచేత ఉపన్యాసం ఇప్పించాడు జంఘాలశాస్త్రి.

ఆశాస్త్రిగారు ముందు చిత్రలేఖనం గురించి, స్త్రీ మూర్తులచిత్రణంగురించి కొంచం మాట్లాడారు. కొన్ని నెలలనుంచీ తాను ఆంధ్రదేశంలోని చిత్రకళాశాలల్ని చూస్తున్నాననీ, కొన్ని స్త్రీవిగ్రహాలకు పైటగాని, జాకెట్టు గాని లేవనీ, అన్ని స్త్రీ విగ్రహాలకు బొడ్డుకన్పిస్తుందనీ, మరికొన్ని విగ్రహాలకు చీరకట్టేలేదనీ ఆవేదన వ్యక్తంచేశారు. ఇలాంటి విగ్రహాలు సంతోషం కలిగించడానికిబదులు సంతాపం కలిగించాయన్నారు. బుద్దిమంతులైన చిత్రలేఖకులు వాటిని అలా ఎందుకు చిత్రించారా! అని ఆలోచిస్తూ పడుకుంటే ఆశాస్త్రిగారికే ఒకకల వచ్చిందట. ఆకలలో అసందర్భాల్నితొలగించి సందర్భశుద్దిగా వ్రాసిందే ఈ ఉపన్యాసం.

కలలో శాస్తిగారిని ఒక పురుషుడు ఒక సభలోకి తీసుకువెళ్లాడు. అందులో శ్రోతలంతా పురుషులే. ఉపన్యాసరంగంమీద ఒక యువతి మాత్రం కుడిచేతిలో కొరడాపట్టుకుని వుంది. ఆమె తేజస్సులో సౌందర్యం కాఠిన్యం, కలగలిసివున్నాయి. ఆమె ఉపన్యసిస్తోంది. ఆడవాళ్లమర్యాద గురించి మీకేమైనా తెలుసునా? అని గద్దిస్తోంది. స్త్రీమూర్తుల్ని చిత్రించేటప్పుడు ఆర్ధదిగంబర స్వరూపాలను, పూర్తి దిగంబర స్వరూపాలను ఎందుకు చిత్రిస్తారని నిలదీస్తోంది. తనదేశంలో స్త్రీ, ఔన్నత్యం ఏమిటో, ఆమె వ్యక్తిత్వం ఏమిటో, అది స్త్రీ, మనస్సుతో అందుకుంటేనే అర్ధమవుతుందని వివరించిది. స్త్రీ, పుట్టింది మొదలు, చనిపోయేవరకు, ఏమాన మర్యాదల్ని ప్రాణంగా చూసుకుంటుందో చెప్పింది. స్త్రీ పట్ల గౌరవంకలిగి ప్రవర్తించండి అని చెప్పింది. స్త్రీపట్ల గౌరవంకలిగి ప్రవర్తించండి-అని హెచ్చరించి, కొరడాతో ఛటేల్న సభాసదుల్నికొట్టింది- అని శాస్త్రిగారు ముగించారు.

జంఘాలశాస్త్రి యిట్లు పలికెను.

నాయనలారా! మనసంఘమును దిరుగ స్థాపించినపిమ్మట రెండుపన్యానములైన నిచ్చితినో లేదో, ఇంతలోనే నంఘ వ్యాపారములకు విఘాతము తటస్థించినది. అందుల కెంతయైన వగచుచున్నాను. దైవకటాక్షమున నట్టి యంతరాయము లింకముందు రాఁబోవని యంతరంగమున నమ్మియున్నాను.

నాయనలారా! నాప్రక్కను గూరుచుండిన యీశాస్త్రిగారు తుంగభద్రాతీరగ్రామవాసులు. ఈయనకుఁ జిత్రకళానైపుణ్యము కొంతకలదు. చిత్రకళాశాల లన్నిటికిఁ బోయి వానిలోని చిత్రములను సందర్శించుపనిపై స్వగ్రామమునుండి కొంతకాలము క్రింద బయలుదేఱి తిరుగుచు మన గ్రామమునకు దయచేసినారు. వారీదినమున నుపన్యసింతురు. మీరు శ్రద్ధాళువులై వినఁగోరు చున్నాను. అయ్యా! శాస్త్రిగారూ! మీ రింక నుపన్యసింతురుగాక.

శాస్త్రిగారియుపన్యాసము-స్వప్నము

చిత్ర లేఖనమునందుఁ బ్రావీణ్యమార్జింపఁ దలంచి కొన్నిమాసములనుండి యాంధ్రదేశమందలి చిత్రకళాశాలను సందర్శించుచున్నాను. అనేకములైన చిత్రములను జూచినాను. కొన్ని స్త్రీవిగ్రహములకుఁ బైట లేదు. కంచుకమును లేదు. అన్నిస్త్రీ విగ్రహములకు నాభి కానబడుచున్నది. అనేకవానికి చీరకట్టు బొడ్డునకు రెండు బెత్తిళ్లు దిగువగ నారంభింపఁ బడియున్నది. కొన్నివిగ్రహములకు జీరకట్టలేదు. లేకున్నను మర్మస్థానములూరువిన్యాసాదిపరిస్థితుల వలన రవంత గుప్తములుగ నుంచఁబడినవేమో యనంగ రామరామా! అట్టుకాదు. ఏమని చెప్పదును? ఇట్టి విగ్రహములు సంతోషమిచ్చుటకు బదులుగ సంతాపము నిచ్చినవి. ప్రీతి నిచ్చుటకు బదులుగ రోఁత నిచ్చినవి. బుద్దిమంతులగు చిత్రలేఖకులు వాని నట్లే వ్రాసిరో యని యూహించుకొనుచుఁ బండుకొంటిని. ఒకస్వప్నము వచ్చినది. స్వప్నానంతర మాస్వప్నములో నేనుఁ విన్నదంతయు స్వప్నములో సహజముగఁ గల్లునసందర్భతలను సవరించి సందర్భశుద్దిగ నాశక్తికనుగుణమగునట్టు వ్రాసితిని. స్వప్నములో నొక్కడు నన్నుఁ బిలిచి నన్నుఁ దనతోంగూడ రమ్మనినాఁడు. మాటలాడకుండ నాతనివెంటఁ బోయితిని. ఆతఁడు నన్నొక్కసభలోనికిఁదీసికొనిపోయినాఁడు. ఆసభలో ననేకపురుషులు కూరుచుండినారు. నేను నొకబల్లపైఁ గూరుచుంటిని. ఉపన్యాసరంగమున నొక్క యువతి మాత్రము నిలువంబడి యున్నది. ఆమె యమానుషతేజస్సమన్వతమై యున్నది. ప్రసన్నతలో భయానకత్వము, శాంతిలో దీవ్రత, వెన్నెలలో నెండ, కరుణలో గాఠిన్యము నామెవదనమందు సమంజసముగ సమ్మేళన మొందియున్నవి. ఆమెకుడిచేతిలో నొక్క కొరడాయున్నది. ఆచేయిచాపి యామె యుపన్యసించుచున్నది. నేను సభలోని కేగకముందామె యేమిచెప్పెనో నాకుఁ దెలియదుకాని నేను గూరుచుండిన పిమ్మట నా కీమాటలు వినఁబడెను.

'మీకుఁ దెలియునా? చెప్పిననైనఁ దెలియునా? ఆఁడుదాని మర్యాద యెట్టిదో మీరు గ్రహింపఁ గలరా? అది యాకాశముకంటె స్థూలమైనది. సూదిమొనకంటె సూక్ష్మమైనది. అది వజ్రముకంటెఁ గఠినమైనది. గాజుకంటెఁ బెళుసయినది. అది శతకోటికంటె శాంతమైనది. శిరీషముకంటె మృదులమైనది. జీవాత్మతత్త్వమును గ్రహియింపవచ్చును. జగత్తత్త్వమును గురైఱుంగవచ్చును. పరమాత్మ తత్త్వమును భావింపవచ్చును గాని మానినీమానసతత్త్వము గ్రహింప మీతరమా? అది మీదృష్టికి కానునా? మనస్సున కందునా? బుద్దికిఁ బొడకట్టునా? అదిగో యనుసరికి మాయ మగునే? మనన మొనర్చిన కొలఁది మానసాతీతమగునే అట్టి యసాధ్యమైన తత్త్వమునుగూర్చి, అట్టి యజ్ఞేయమైన తత్త్వమునుగూర్చి మీయూహము లెట్లున్నవి? మీ పలుకు లెట్లున్నవి? మీరచన లెట్లున్నవి? మీచేష్టలెట్లున్నవి? ఆ, ఆ ! పడఁతుల మర్యాదనుగూర్చి పరిహాసములా? వెక్కిరింతలా? అల్లరులా? పటములా? బజారులోఁ బ్రదర్శనములా? ఆఁ ? ఏమనుకొనుచున్నారు? మంచిచెడ్డ లక్కఱలేదా? భయోభక్తు లక్కఱలేదా? పుణ్యపాపము లక్కఱలేదా? తల్లులున్న మీరు-చెల్లెండ్రున్న మీరు-అక్కలున్న మీరు-కన్నయాఁడుబిడ్డలున్న మీరు నాదేశమందలిస్త్రీల విగ్రహములను సృష్టించునప్ప డర్ధ దిగంబరస్వరూపములను సృష్టించుచున్నారుకాదా? ఎందుకొరకు? ముచ్చటకొఱకా? వేడుకకొఱకా? తేఱిపాఱఁ జూచుటకొఱకా? చూచి కిసుక్కుమనుటకొఱకా? బజారులోఁ బెట్టుటకొఱకా? ప్రజల నాకర్షించుటకొఱకా? పది రూపాయలఁ దెచ్చుకొని కడుపు నిండించు కొనుటకొఱకా? ఆడుదాని రహస్యావయవములను జిత్రించి ప్రకటించి యంగడిలోఁ బెట్టుకొని యమ్ముకొని యాఁకలితీర్చుకొనుచున్నారా? ఇంతకంటె నీకు బ్రదుకుతెరు వేదియుఁ గనఁబడలేదా? కాక ఇది ఖ్యాతికారణమని యిందు దిగితివా? ఇది పరమార్థ మని దీనితోఁ దరింతునని జన్మరాహిత్య మొందుదు నని యూహించితివా? రామరామా! కానగూడని యవయవములను గోనపైకెక్కించితివే? చెప్పరాని యవయవములను విప్పి బట్టబయలు చేసితివే? స్మరింపరాని యవయవములను సంతలోఁ బెట్టితివే? నిన్నేమనవలసియున్నది? ఎంతసేపు నాఁడుదాని గుప్తావయవములపై దృష్టియా? వానిప్రతిబింబములను మనస్సులో దింపుకొనుటా? వానిని కాగితముపై నెక్కించుట? ఒంటివెంట్రుక కుచ్చుతో రంగులు పూసి యెత్త పల్లముల విభజించి వెలుఁగునీడల వివరించి ఓ-తబిశీల్లపై దబిశీళ్లతోఁ జిత్రించుటా? ఇది పశుత్వము గాక పాండిత్యమగునా? యథార్థముగా బురుషులు ప్రబలకామాతిరేకులు. సంతతగ్రామ్యసుఖాభిలాషులు. అంగనారహస్యాంగ సంతతసందర్శనాభీష్ట భూయిష్టులు. నాదేశమం దెల్లెడల నిండియున్న జమీందా రులలో నూటి కేఁబదుగురవఱ కీవ్యాపారమునఁ బండితాగ్రగణ్యులు.

వయసు హెచ్చిన కొలఁది వీరి కావాంఛ హెచ్చగుచున్నది. తలవడఁకినకొలఁది యాతలఁపు బింకమగుచున్నది. అస్రపటిమ తగ్గినకొలఁది యాయభిలాష హెచ్చగుచున్నది. అనుభవశక్తి తగ్గినకొలఁదియాలోకనరక్తి మైుగ్గగుచున్నది. గాడిదకంటెను బందికంటెను గుక్కకంటెను నధమాధములైన యిద్దఱుముగ్గురు గుడిసెవ్రేడిముండలను వీరు భద్రపఱచి ముక్కులపైఁ జత్వారపుజోళ్లతోఁ, జేతులలో భూతద్దములతో, నాకులాటధామలయెదుట వీ రొనర్చు నసందర్బతలు, నల్లరులు, నాసురచేష్టలు హరహరా! చెప్పఁదగదు. వినఁదగదు. తలంపఁదగదు. జరుగుఁబా టున్న జమీందారు లిల్లొనర్చుచుండగా నదిలేని యితరపురుషులు దిగంబరచిత్ర లేఖనములతో ముచ్చటలు దీర్చుకొనుచున్నారు. మొత్తముమీఁద బురుషులకందఱ కీరోగమున్నది.

చిత్రలేఖకులారా? మీ రిట్జయవకతవకచర్య కిఁక నాశ్వాసాంతము చెప్పవలయును. అనంతసృష్టిలోఁ జిత్రించుట కెన్నివిచిత్ర వస్తువులు లేవు? అనంతమగు గ్రంథజాలములో వెన్ని యద్భుతపరిస్థితులు లేవు? బాహ్యప్రపంచమందలి పరమాకర్షకసన్నివేశము లట్టుండంగా వాంతరప్రపంచమునఁ జిత్రవిచిత్రాతిచిత్రమహాచిత్రపరిస్థితు లెన్నిలేవు? వానిలో నొక్కదానిని బూర్ణముగఁ జిత్రించుటకు మీకుబ్రహ్మ యిచ్చిన యాయువు చాలదే. అట్టిచో వేవి పవిత్రము లని, గుహ్యములని, ప్రకటనబాహిరము లని దర్శనమువలనఁ బుణ్యక్షయక రము లని యెన్నఁబడుచువ్నవో యట్టివానిపై దృష్టి మీ కెందులకు? కవిత్వము నేర్చుకొనుట కుచవర్ణనమునకా? చిత్రలేఖన మభ్యసించుట గుహ్యాంగ రూప ప్రకటనమునకా? కవి యెన్ని పాట్లు పడినను వర్ణ్యవస్తుస్వరూపము నెదుటఁ బెట్టలేఁడు. మీకళ యాకృతివిషయ మున నట్లసమర్ధ మైనది కాదే. కావున మీరు కవులకంటె నెక్కువలోకాపకారకులు.

ఆఁడు వారిమర్యాద యెట్టిదో మీ కావంత యైనఁ దెలిసినయెడలఁవారి నిట్లు మీకళలలో నెంతగా నగౌరవపఆతురా? బట్టబయలైన పయోధరములతో, బట్ట మొదలే లేని మొలతో మీరు వ్రాయుచున్న విగ్రహముల గాంచి నాదేశస్త్రీ లెంత యేడ్చుచున్నారో మీకుఁ దెలియునా? శరీరములు చావఁగా మనసులు పుండుగాఁగాఁ గనులవెంట రక్తబాష్పములు విడుచుచున్నారే! వా రంతకంటె నేమి చేయఁగలరు? వారు తిరుగబడి మిమ్ముఁ బరాభవింప సాహసింతురా? వారు చిత్రలేఖనమును నేర్చుకొని పురుషవిగ్రహములను విగత కౌపీనముగఁ జిత్రింపఁగలరా? చావనైనఁ జచ్చెదరుగాని యట్టిసిగ్గుమాలినపనికి మీ వలె వారొడఁబడుదురా? నాదేశస్త్రీలకు సహనము, సాధ్వసము, లజ్జ, సరళత, సద్భావము, సర్వేశ్వరభక్తి సహజాలంకారములు కావా? ఒడలి యాభరణము లన్నియుఁ బోయిన స్త్రీ లున్నారు. కొడుకులు పోయిన స్త్రీ లున్నారు. కాని సహనము, లజ్జపోయిన స్త్రీని నాదేశమున నాసేతుహిమాచల పర్యంతము చూపగలరా? వారికి సహనమే పోయిన యెడల మీదుర్నయము లింతకాలము నుండి యెట్టు సాగుచున్నవి? వారికి లజ్జయే పోయినయెడల మీ బ్రదుకు లింతకాల మిట్టుండునా? సహస్రకారణములచే సగము చచ్చిపడి యున్న యిల్లాండ్ర రహస్యావయవములను నడివీథి కెక్కించి వారిని సాంగకముగ నమనస్కముగ సాత్మకముగ సంపూర్ణముగఁ జంపదలఁచితిరా?

పోనిండు మీ రంతటితోనైన నాఁగినారా? జగన్మాత లైన లక్ష్మీ సరస్వతీ పార్వతీదేవుల గతు లంతకంటె నధ్వాన్న మొనర్చితిరే! అంతకంటె నవకతవకఁ జేసితిరే! దుర్గాదేవికిఁ దొడలపై రవంత కప్పనక్కఱలేదా? భారతీదేవికిఁ బయోధరములపై రవంత ప్రచ్చన్నత యక్కఱలేదా? కన్నతల్లుల బ్రదుకులే యిట్టు కాల్చితిరేల? ఇది మాతృద్రోహము కాదా? జాతి ద్రోహము కాదా? దేశద్రోహము కాదా? దేవతా ద్రోహము కాదా? జర్మనీదేశమందలి చిత్రలేఖకుండో యాంగ్లేయచిత్రలేఖకుఁడో మావిగ్రహములఁ గాంచి మెచ్చుకొనినాండని యసందర్బవాక్యము లాడకుండు. భారతదేశనారీగౌరవము పరశురామప్రీతి యగునెడల, పాశ్చాత్యవిచిత్రలేఖకుల కేమి పోయెను? పరీక్షాధికారుల ప్రాశస్త్యనిర్ధాయకులు మీకుఁ బాశ్చాత్యులా? మీ చిత్రకళ యొక్కడ? వారిచిత్రకళ యొక్కడ? మీజాతితత్త్వమెట్టిది? వారిజాతి తత్త్వమెట్టిది? మీనాగరకత యెట్టిది? వారినాగరకత యెట్టిది? మీ వివాహోద్దేశమేమి? వారివివాహోద్దేశమేమి? మీ స్త్రీలవస్త్రవైఖరి యెట్టిది? వారి స్త్రీలవస్త్రవైఖరి యెట్టిది? భేద మింతయంత యని చెప్పఁ దరమా? మీ స్త్రీలతత్త్వము మీకే తెలియనప్పడు వారికిఁ దెలియక పోవుట వింతయా? పాంచాలిని వివస్త్రను జేయుటకై రారాజు శాసించెననుటలో నర్దమేమి? మగువను దిగంబరను జేయుటకంటె నామగువకు దానిమగనికి దానిజాతికి వేఱ శిరచ్చేదనము లేదనియే కాదా? ఆంజనేయులు రావణుని యంతఃపురమున రాత్రి సంచరించు నప్పడు నిద్రావశలైన రాక్షస స్త్రీల రహస్యావయవములు ప్రమాదవశమునఁ గంటబడునప్పడు రామ రామా యని స్మరించుకొనుచు మహాపాప మొనర్చితినని గడగడ వడఁకలేదా? సకంచుకుఁడైన సన్న్యాసిని నిష్కంచుక యైనసువాసినిని గాంచినవెంటనే సచేలస్నాన మొనరింపవలయు నని ధర్మశాస్త్ర ముద్ఘోషించుట లేదా? అది కాక నాల్గువేల సంవత్సరముల క్రిందట నైన మహామూర్ఖ జాతిలోనైన నత్తగారినిగోడ లాంకలిచేఁ దినునరమాంసభక్షకసంఘములో నైన నాఁడుదానిమొలకు రొట్టకట్టుండెనని మనము విన్నప్పడు, ఇరువదవశతాబ్దము నందలి మీదిగంబర స్త్రీల కర్ధ మేమి? అదికాక పాశ్చాత్య చిత్రలేఖనము కేవల మాకారప్రతిబింబమైన (Photography) లోనికి దిగఁబోయి పాడైపోయిన దనియు, మాచిత్ర లేఖనమునకు భావలావణ్యప్రకటనమే ప్రాణమనియు నీనడుమ పెద్దపెద్దపలుకులు పలికితిరి కాదా? అటులే మాటవరుస కంగీకరింతము. నుదుటిచిట్లింపులో, భ్రూభంగములో, కనుల యరచూపులోఁ, బ్రక్కచూపులో, నిండుచూపులో, చూచిచూడకుండఁ జూచిన చూపులో, జూడకుండఁ జూచినచూపులోం, బైచూపులోఁ, గ్రిందిచూపులో, ముక్కుప్రక్క ముడుతలలోఁ, జెక్కులయెఱుపులో, నిగనిగలో, వెలవెలలో, గడ్డపుదైర్ఘ్యములో, గుండ్రతన ములో, గుంటలో, హస్తవిన్యాసములలో భావప్రకటనమున కవకాశముండునుగాని పయోధరముల సందున నేభావము ప్రకటన మగునని పైఁట లాగివేసితిరయ్యా? ఆత్మసౌందర్యము (Beauty of the soul) కానఁబఱుతునని పలికి పార్వతీదేవిని వస్త్రహీనమొనర్చి ప్రదర్శనములలోఁబెట్టితిరా? మీకు మతులున్నవా? మతుల కేమి? ఉన్న వినియోగము మాత్రమేమున్నది? ముందు గతులుండునా?

బిడ్డలారా! స్త్రీతత్త్వ మేదియో మీకుఁ గొంతఁ జెప్పెదను. నేను జెప్పన దేదియో మీరు గ్రహింపలే రని నే నెఱుఁగుదును. నేను జెప్పమాటలకు మీకర్థము తెలియ దని నాయభిప్రాయము కాదు. మీకు మనసున కెక్కదు. మీ కది యనుభవములోనికి రాదు. వచ్చుట కవకాశము లేదు. ఎందుచేత? ఆఁడుదాని కున్న మనసువంటి మనసు మీకు లేదు. వే నిప్పడు చెప్పఁబోవుసంగతు లన్నియు మీ కెంత మాత్రమును గ్రోత్తవి కావు. మీ రనుదినమునఁ జూచుచున్నవే. అయిననేమి? వానిలో నిమిడియున్న గుట్టు మీరు గుర్తెఱుఁగ నేరరు.

ఆఁడుప్లిల పుట్టగనే సమీపస్థలైన వృద్దస్త్రీలు తటస్థముగ మాటలాడ కూరకుందురు గాని యాఁడుపిల్ల పుట్టిన దని చప్పునఁ జెప్పరు. ఆఁడుపిల్ల పుట్టినప్పడే యీ సంకోచము. ఎందుచేత, ఆఁడుపిల్ల యింకనొక యరనిముసమునకు బుట్టు ననఁగా సిగ్గను తత్త్వము పుట్టుము. సిగ్గు పుట్టినయుత్తరక్షణముననే స్త్రీశిశువు భూమిపైఁ బడును. సిగ్గుపుట్టుట యనఁగానేమో మీమనస్సునకెక్కినదా? ఎక్కదని నేనెఱుఁగుదును. ఈపిల్లతోఁ బుట్టిసిగ్గు దీనిమృతిపర్యంతము రక్షింపఁబడునో లేదో యని వృద్దస్త్రీలకు జన్మకాలమందుఁ గలిగిన సంకోచము. స్త్రీజన్మమునకు శరీరముకంటె, ప్రాణముకంటె, మనస్సుకంటె, నాత్మకంటె సిగ్గు ముఖ్యము. అదియే ముందు అదియే మొదటిది. అది లేనియెడల స్త్రీవ్యక్తికి శరీరము లేదు. ప్రాణము లేదు. మనస్సులేదు మఱి యేమియును లేదు. దానితోడనే స్త్రీకి జన్మము. దానితోడనే, వృద్ధి దానితోడనే చావు. చచ్చినతరువాత నది నిల్చియుండును. కాని పోవునది కాదు.

మీయాడుపిల్లలకు మీభార్యలో దాసులో యుగ్గుపోయినప్పడు మీరుచూచియుండ కపోరు. బొడ్డుమీఁదినుండి మోంకాళ్లవఱకు గుడ్డకప్పిన పిమ్మటఁగాని యుగ్గు పోయరు. మగపిల్ల వానికిఁగూడ నట్లెపోయుదు రనిమీరు వెకవెకలాడవలదు. ఆఁడుపిల్లకై పుట్టిన యాచారము తెలియక మగపిల్ల వానికిఁగూడ వ్యాపింపఁ జేసిరి కాని మఱియొకటికాదు. ఆఁడుపిల్ల తప్పటడుగులు వేయ నారంభించు వెంటనే యభిమానపుబిళ్ల కట్టుట యాచారమని మీ రెఱుఁగకపోరు. అంత చిన్నగ్రుడ్డున కది కట్టకపోయిన నేమి పుట్టి మునిఁగిపోయె నని మీకుదోఁచును. కాని యది కట్టినదాఁకఁ దల్లి తహతహలాడిపోవును. అది కట్టఁగనే తల్లికనుల కెంతయైన నిండు. తల్లి మనస్సున కిఁక నిస్సంకోచత. తాను బదునెనిమిదిమూరల చీర కట్టుకొని దట్టమైన రైక తొడిగికొని మేలుముసుఁగు వైచుకొనినయెడలఁ దనశరీరము నకెంత నిండో, తనచిత్తమున కెంత నిర్భీతియో, తనశిశువు బిళ్లకట్టుచూచి తానంతసంతోష ముగ నంతసంకోచరహితముగ నుండును. ఆఱేండ్లయిన శిశువునకు రాకుండనే పరికిణీలకై రైకలకయి పైటలకయి తల్లి చేయు ప్రయత్నమింత యంత కాదు. మీ కిది యంతయుఁ బిచ్చగ గానంబడును. ఆయీడు మగపిల్లవాఁడు గోచిపెట్టుకొనియో తీసివైచియో కాళ్లనందునఁ గుఱ్ఱముంచుకొని వీథిలో గుఱ్ఱపు సవారులు చేయుచుండంగా నాఁడు పిల్లల కీబట్టలభారము ప్రచ్చన్నత-ఆడుపిల్లలను బెంచుటయందుఁదల్లిపడు శ్రమములోఁ బదునా ల్గవవంతయిన మగపిల్లవానిని బెంచుటయందుఁ బడదు. పడవలసిన యావశ్యకత లేదు. 'అక్క యెంతసేపుఁ దలవంచుకొనియే మాటలాడుననియు, నెప్పడూ చూచిననైన నమ్మచెఱఁగపట్టుకొని వెనుకవెనుకనే గ్రుడ్డిదానివలె దేవులాడుచుండ ననియుఁదన పలకపుల్లను హరించిన పొరుగింటిపిల్లవానిని గలియఁబడి నాలుగుదెబ్బ లిడ్చి కొట్టక సిగ్గులేక పంతులతోఁ జెప్పుకొన్నదనియు నాఱేండ్లతమ్ముఁ డధిక్షేపించుచుండ ననాదరణ సేయుచుండ బదేండ్ల బాలిక వినయమునకు నిలయమయి సాధుత్వమునకు స్థానమయి సిగ్గున కాకరమయి సోదరులకు సహాయయై తల్లికంటివెలుఁగయి తండ్రికి గర్వకారణమయి తోట కూరకాడవలె నట్టెయట్టె యెదుగుచు, నెదిగినకొలఁది సిగ్గావరించుటచేత జంకుచుఁ గొంకుచు బంగారువంటిప్రాయమును బడయుచుండును.

ఇఁక భర్తయింటికిఁ బోయినపిమ్మట నాతని దుర్నయమువలన నేవియైన రోగములు సిద్ధించినఁగాని సహజముగ గర్భకోశసంబంధములగు కుసుమాదిబాధలు సిద్దించినఁగాని నోరెత్తక, బాధపడినట్టు పైకింగూడఁ గనఁబడక సహించి సహించి, నీరసించి మృతినైన నొందుట కంగీకరించును గాని యత్తతోఁ జెప్పునా? ఆఁడుబిడ్డతోఁ జెప్పునా? ఊహుఁ -ఆఁడుదానిగుట్టెట్టిదో యెఱుఁగుటకు బుద్ధిలేని మీరు స్త్రీలు వట్టిపనికిమాలిన మూర్ఖ లని, రోగములు దాఁచెద రని, తలగొట్టుకొనిననైన వెల్లడింప రని మించిపోయినతరువాత నేమి యేడ్చిన నే మున్నదని వారిపైఁ దీండ్రింతురు. కాలిలో ముల్లు గ్రుచ్చుకొనియెడల గ్రామమంతయుఁ గాలిపోవుచున్నట్టుగా గావుకేకలు వైచుచు వీథులవెంట మొలను గుడ్డయైన నున్నదో లేదో యెఱుఁగకుండనొంటికాలితోడనే పరవళ్లు ద్రొక్కుచు మీ రేడ్చుచుందురు కదా? అట్టిచో నోర్వఁజాలని బాధ సహించుచు నోరుమూసికొని యుండుటకు వారికిఁ బ్రబలమైన కారణ మున్నదందురా? లేదందురా? అది వారిమూర్ఖత యని యెన్నఁడును భ్రమపడఁకుడు. దేనిని బోఁగొట్టుకొనుటకంటె జీవమును బోఁగొట్టుకొనుట మంచిదో దానిరక్షించుకొను సంకల్పమే యట్టిచర్యకుఁగారణము. నేను జెప్పిన యీమాటల సారమును మీరు గ్రహింపలేనియెడల మీరు చచ్చి స్త్రీలై పుట్టినపిమ్మటం దెలియునుగావున నంతవఱకు నిరీక్షింపుఁడు. అఁడువారు వీణవాయింపుచుండ మీలో ననేకులు చూచి యుందురు. మగవారివలె వారు వీణను నిలువఁ బెట్టి వాయింపరు. ప్రక్కబారుగ వాయింతురు. అది సులభమార్గ మగుటచేతఁ గొందఱు మగవారుకూడ నాపద్దతి నవలంబించినారు. దానికేమి? మగవారివలె నిలువఁబెట్టి యెందులకు వాయింపరో యెఱుఁగుదురా? నిలువఁబెట్టి వాయించునెడల నెడమచేయి పైకెత్తవలసివచ్చును. అంతమాత్రముచేతనే (Modesty) మంటఁ గలియునని వారిభయము. సూదిమొనలో సహస్రాంశముకంటె సూక్ష్మమైన దాడుదాని మర్యాద. అత్యంతసూక్ష్మములో సూక్ష్మమైన దాడుదానిమర్యాద. అట్టివిచిత్రమైన తత్త్వమును గ్రహింపలేక నాదేశనారీమణులను మీసోదరీమణుల నింతదారుణముగ నగౌరవపఱచితిరే.

పాశ్చాత్యదేశమునం దనేకపాషాణపాంచాలికలు దిగంబరముగ సృజింపఁబడలేదా యని యందురేమో! వారి చిత్రము లెంతసాగసుగ నున్నను నెంతయాకృతి సౌష్టవమును వెల్లడించినను నెంత ప్రకృతి ప్రతిబింబములైనను వారిచిత్రలేఖన పద్దతియే వేఱు. వారికళకు గమ్యస్థానమేవేఱు. వారివిగ్రహము లెంత నాగరికతాసౌందర్యముగలవియైననుసరే, యెంత సంస్థానసౌష్టవ సౌభాగ్య సంపన్నములైన వయిన సరే, యెంత జీవకళాకలితము లైన సరే, వారిచిత్ర లేఖనకళయం దైహికలంపటతాపంకిలత్వమున్నది. మనచిత్రము లెంతమోటువైన సరే. మన చిత్రలేఖనకళయం దాముష్మికపరిమళప్రకాశ మున్నది. ఇది ప్రధానభేదము.

మనకు శిలావిగ్రహము లనేకకోటు లున్నవి. అవి యన్నియు దిగంబరములుగా నున్నవా? దిగంబరములైనను గాకున్నను వస్త్రములు లేని విగ్రహములను మనము పూజించుచున్నామా? అది గాక యీ సందర్భమున నత్యంత విచిత్రమైన యాచార మొక్కటి యున్నది. చెప్పనా? మన దేవాలయములలోని స్త్రీవిగ్రహములకు బట్టలు కట్టింపవలసి వచ్చినప్పడు పూజరి కనులకు గంతలు కట్టుకొని మరి కట్టవలయును. ఆహా! ఇంత యద్భుతమైన యాచారము మరి యేదేశమందైన నున్నదా? అసాధారణమైన యద్వితీయమైన యాశ్చర్యకరమైన ఈయాచారమును బట్టియైనను నాదేశమందలియాండువారిమర్యాద యెట్టిదో రవంతయైన మీరు తెలిసికొనలేరా? మీకింతకంటెఁ జెప్పవలసినది లేదు. మీరింతటినుండియైన బుద్ది కలిగి, జాతిభక్తి కలిగి దేశభక్తి కలిగి స్త్రీగౌరవము కలిగి మీకళను వృద్ధిచేసికోవలయును.

అదిగాక మీకళకు భావము ప్రధానమని చెప్పచు, మీ విగ్రహములకన్నులు బొత్తిగఁ బాడుచేయుచున్నారు. కన్నులు సగము మూయునెడల నేదో భావము ప్రకటిత మగునని మీరనుకొనుచున్నారు కాఁబోలు. మీవిగ్రహముల కన్నులయసందర్భ తనుగూర్చి మఱియొు కసారి యుపన్యసింపఁదలఁచితిని.

కాని నాదేశరక్షకదేవత లైన లక్ష్మీ సరస్వతీ పార్వతీదేవుల విగ్రహసృష్టియందు మీ రొనర్చిన మహాదోషమునకు మిమ్ము శిక్షింపకతప్పదు, ఇదిగో:

అవి పలికి కొరడాతో చెటేలున సభాసదులఁ గొట్టెను. అమ్మయ్యో యని యేడ్చుచు నిద్రనుండి లేచితిని.

ఓం శాంతి శ్శాంతి శ్శాంతిః.