4. కవి

వి ఎలా ఆలోచిస్తాడు? ఎలా ప్రతిస్పందిస్తాడు? ఎందుకు, దేనిగురించి ఆరాటపడతాడు? - అనే విషయాలను తరిచి జంఘాలశాస్త్రి ఈ ఉపన్యాసం ఇస్తున్నాడు. -

కవి, ఒక గడ్డిపరకలో సైతం పరమేశ్వరుడి కరుణ, పరమేశ్వరుడి లీల, పరమేశ్వరుడి జ్ఞానం, పరమేశ్వరుని ఆనందం, పరమేశ్వరుడి మహిమ, భావించి ఆమూర్తిని సేవించి సేవించి, ఆశక్తిని ధ్యానించి ధ్యానించి, ప్రకృతిలో సహజతకు సంతోషించి, వలచి, వశుడై సౌందర్యగీతాలను అరచిఅరచి, వ్యక్తిత్వాన్నిమరచి, తన్మయుడవుతాడు.

నవ్వితే ఒక సొగసు, బెదిరిస్తే వేరొకసొగసు, తల ఊగిస్తే మరోసొగసు, రౌద్రంగా ఝాంకరిస్తే ఇంకొకసాగసు, బతిమాలితే మరోసొగసు కనిపించే ప్రకృతికిలొంగి, సౌందర్యం అనే పాలసముద్రంలో చేతులు బారలువిసిరి ఈదుతూ-మరొకసారి ఏచిరు కెరటంమీదనో తలవాల్చి మైమరచి పడివుండే మనిషి కవి.

బాహ్యప్రకృతే ఎంతో ఆశ్చర్యంగా వుందనుకుంటే, మరిలోపలి ప్రకృతి ఇంకా ఆశ్చర్యకరమైంది. అక్కడ తలెత్తే ఉత్పాతాలు బాహ్యప్రకృతిలో వాటికంటె తీవ్రమైనవి.

మనం రకరకాల వ్వవధానాలతో చరిత్రలో సాగిన అనేక యుద్దాలగురించి వినివున్నాంగాని, సృష్టిప్రారంభంనుంచే అరిషడ్వర్గం (కామ, క్రోధ, లోభ, మోహ, మద, మాత్పర్యాలు) తో మనిషికి లోపలి ప్రకృతిలో జరిగే యుద్దం దాని సంక్షోభం వాటికంటె బీభత్సమైంది. ఈరెండు విధాల ప్రకృతులలో విశేషాలను తన అనుభవంతో పట్టజాలినవాడు కవి. అతనికి మాటల్ని బొమ్మలుగాచేసే శక్తివుంది. కవి ఒక విధమైన పిచ్చివాడు. కోటి విధాల పరమార్థగ్రహణ మార్గాలలో ఒక మార్గమే ఆపిచ్చి, అటువంటి వెర్రితో, తాను ధన్యుడై లోకాన్ని ధన్యంచేసేవాడు కవి.

జంఘాలశాస్త్రి యిట్టు పలికెను.

ఎక్కడఁ జూచిన జిగజిగ, ఎక్కడ జూచిన మిలమిల, ఎక్కడం జూచిన నీరు, ఎక్కడ జూచిన పరిమళము, ఎక్కడ జూచిన వెలుఁగు, ఎక్కడఁ జూచిన బయలు, ఎక్కడఁ జూచిన రంగు. ఆహాహా! ఏమివింత! ఏమిచిత్రము! పచ్చనిబయళ్లు! ఫలములతో నిండినచెట్లు, పుష్పములు గుత్తులుగుత్తులుగా నున్న లతలు, భూమినుండి యుబికి యుబ్బెత్తుగ లేచుకొండలు, స్వాదుజలభరితములగు నదులు, నొడ్డులేని నముద్రము, నంతములేని యాకాశము, తేజోమయములగు గ్రహములు, కంటికి తేజము, చెవికి హాయి, యొడలికిఁ జలువ, ఘ్రాణమునకు సౌరభము, జిహ్వకు రుచి నిచ్చుచున్నవికదా? ఈతేజముకంటె, నీహాయికంటె, నీచలువకంటె, నీసౌరభముకంటె, నీరుచికంటె విలక్షణమైన యాశ్చర్యకరమైన, యనుభవైక వేద్యమైన యానందము ప్రకృతిదర్శనమున మనస్సునఁ గల్గుచున్నదికదా? ఆయానంద ప్రభావమున మనస్సిట్టె యిట్టె తేలికయై యట్టెయట్టె విస్తీర్ఘమై ప్రకృతియందు వ్యాప్తమై లీనమై పోవుచున్నదికదా? ఏవస్తువును గాంచిన సౌందర్యమృతము వర్షించుచున్నట్ల గడుచున్నదికదా? ఏవస్తువును గాంచిన సౌందర్యామృతము వర్షించు చున్నట్టగడుచున్నది కదా? ఆహా? ఆకసమున నీవైపునుండి యావైపునకు వ్యాపించిన యింద్రధనుస్సు వంపులతో, రంగులతో, వ్యాప్తితో, సౌందర్యముతోఁ కలసి ప్రకృతిసౌభాగ్యదేవతకు మంగళపుటారతు లిచ్చుచున్నవికదా? ఒక్కగులాబిపువ్వులోని సారళ్యము, సౌందర్యము, సౌరభము నాలోకింపఁబోయి, యస్వాదింపంబోయి, యనుభవింపఁబోయి, యాపుష్చసౌభాగ్యములోఁ గలసి, యాకేసర మార్దవమున నార్ద్రమై, యామకరందబిందుసందోహమున లీనమై మన సట్టె యట్టె తన్మయత్వమును జెందుచున్నదే. తుట్టతుద కొక్క గడ్డిపొరకలోఁ బరమేశ్వ రుని కరుణ, పరమేశ్వరునిలీల, పరమేశ్వరునిజ్ఞానము, పరమేశ్వరునియానందము, పరమేశ్వరునిమహిమము భావించి, యామూర్తిని సేవించి సేవించి, యాశక్తిని ధ్యానించి ధ్యానించి తరింప వచ్చునుగదా! ప్రకృతిసామంజస్యమునకు, ప్రకృతి సామీచీన్యమునకు, వలచి వలచి వశుడై వశుండై సౌందర్యగీతము లరచి యరచి, వ్యక్తిత్వమును మఱచి మఱచి, తన్మయుఁ డగు నాతండు కవి. తాను వలచిన ప్రకృతిఁ జూచినకొలఁది, చూచినకొలఁది సుందరన్వరూపయై కానఁబడునే. ఆఘ్రాణించినకొలఁది నధిక పరిమళభరితయై కానఁబడునే. కౌఁగిలించిన కొలఁది కౌఁగిలించిన కొలఁది కఠినతలో మెత్తన, మెత్తనలోఁ గఠినత. కఠినతలో గఠినత, మెత్తనలో మెత్తన, వేడిలోఁ జలువ, చలువలో వఁడి, చలువలో జలువ నిముసనిముసమున కధికతరముగఁ గానబఱచుచున్నదే. ముద్దుపెట్టిన కొలఁది ముద్దులోఁ దేనె, యాతేనెలో కలకండ, యారెంటిలో ద్రాక్షపండ్లరసము, నామూటిలోఁ బద్మసౌరభము, ఆనాల్గింటిలో శిరీషపేశలత క్షణక్షణప్రవర్ధమాన మగుచుఁ గానఁబఱచుచున్నదే ప్రాఁకులాడినకొలఁది ప్రాఁకులాడిన కొలఁది వన్నెలు, చిన్నెలు, హొరఁగులు, హొయలులు, తళుకులు, బెళుకులు, వగలు, వద్దికలు నేకొత్తరాభివృద్దిగాఁ గానఁబఱచుచున్నదే. మల్లెపూవులలో రెల్లుపూవులలో నట్టె యట్టె మందహాస మొనర్చుచున్నదే. చక్కని చుక్కలమాటునఁ జేరి కాముకుఁడైన కవికిఁ గన్నిట్టెయట్టెఁ గీటుచున్నదే. పర్వతములప్రక్కఁ జేరి తెల్లని జిలుఁగు పయ్యెదతోఁ బయోదరములాంధ్ర వనితవలె గూఢతయుఁ బ్రత్యక్షతయుఁ గాకుండ మాటుకొనుచు బయలు సేయుచున్నదే. అంభోధరములచెంత నిలిచి మొగము ముడుఁచుకొని ధుమధుమలాడుచుఁ గంటివెంట నిప్పలు గ్రక్కుచు బడబడాయమానశబ్దములతోఁ గఠోరముగ ఝాంకరించుచున్నదే. అట్లు ఝాంకరించి ఝాంకరించి స్త్రీనైజము ననుసరించి ధారాపాతముగఁ గన్నీరు విడుచుచున్నదే. గంగావాల్గాదిముక్తాహారాలంకృతగళసీమయై, నక్షత్రపుష్చవారవిరాజిత కేశబంధయై, భానుమండలసిందూరతిలక ప్రభాభాసమానఫాలసీ మయై పద్మపన్నీరచంపకశేఫాలికాదిపుష్పపరిమిళభరిత నిశ్వాసమై, సర్వగోళసంచలనో ద్భూతమహారవ గీతామాధురీరమాధురీణయై ప్రకాశించు నీప్రకృతికాంత చూచిన చూపులకు, బలికిన పలుకులకుఁ, బాడినపాటలకు, నాడినయాటలకు, చేసినచేష్టలకు నధీనుఁడై, పరవశుఁడై, కవి రసమయుఁడై విరాజిల్లునే. సర్వాంగసుందరయై బంగారుప్రాయ మున నున్న వేశ్యాకాంతను విటుఁ డెంతగాఢముగఁ బ్రేమించునో, ప్రేమించి దానిపాదముల యొద్దనే యీడ్గిలబడి, దాని మొగమునందే సదా దృష్టిధ్యానముల నిల్పుకొని యుండునో ప్రకృతి ప్రమదాశిరోమణి నంతకంటె గాఢముగఁ బ్రేమించి యామేకొంగు దగిలినఁ జాలు నని, యామెముఖసౌరభ మబ్బిన భాగ్యమని, యామె యవయవవర్తులత కనఁబడిన నదృష్ట మని, యామె చిఱునవ్వు వెన్నెలచే మనస్సు చల్లబడిన స్వర్గమని, యామె క్రీగంటఁ దన్నుఁ గటాక్షించిన మోక్షమని, కవి యామెను నేత్రపుష్పములచే, వాక్పుష్చములచే, మనఃపుష్చముచే నారాధించుచుండునే. ఆకుపచ్చనితలపుగాగరాకట్టి, పూలరవికఁ దొడిగి, పంటకాలువల యొడ్డునను, జలప్రపాతముల ప్రక్కలను, నడివలెఁ దాండవించుచుండ కవి మహానందమున లయానుసారముగ గీతములు పాడుచుఁ జేతులతోఁ దాళములు వైచుచుండునే. ఒడలు భయంకరముగ నదరుచుండ, నోటివెంటఁ బొగలు, గంధకపుజ్వాలలు, రాతినీరు గ్రక్కుచు రౌద్రస్వరూపిణియై చెలరేగుచుండ, నొదిఁగి, యడంగి శోకసంతప్తచిత్తుఁడై కన్నీళ్లతోఁ గని కరుణగీతములఁబాడుచుఁ గరఁగిపోవుచుండునే. పండు టాకులనడుమ, శిథిలములైన మహాభవనముల నడుమ సంధ్యారాగము వెనుక సన్యాసినివలె గాషాయాంబరధారిణియై, యస్తమించుచున్న సూర్యునిఁ జూచుచు నాలోచనభావమున నిశ్శబ్దముగ నడఁగియుండం, గవి జగదశాశ్వతతత్త్వము, సర్వసంగపరిత్యాగమును బోధించువైరాగ్యగీతములు పాడి తానుగూడం గాషాయమాత్రధారియై నిర్మలుడై నిర్ణేపుఁడై నిస్సంగియై, నీఱయిపోవునే. నవ్విన నొక్క సొగసు, రౌద్రమున ఝాంకరించిన నిఁక నొక్కసొగసు, నేడ్చిన మఱియింక నొక్కసాగసు, బతిమాలిన మఱిమఱికి యిఁక నొక్కసొగసుఁ, గల ప్రకృతికాంత కధీనుఁడై కవి సౌందర్యక్షీరవారాశిలో నొకపుడు చే బారలు వైచి యీఁదుచు మఱియొకపుడు కదలిన ట్లగపడక నిల్వు టీఁతనీఁదుచు, వేలకొకపుడు సౌందర్యామృతమును గడుపునిండంగ్రోలి కదలలేకుండ నలసిసొలసి యేతరంగముమీదనో తలయుంచి యొక్కనిమేషకాలము మైమఱచి పడియుండునే. నోటివెంట గనులవెంటఁ జెవులవెంట ముక్కువెంట లావణ్యామృతము నధికముగాఁ గ్రోలుటచేఁ గెక్కు కెక్కుమ నుచు నూపిరియాడక, బుడుక్కున మునిఁగి యొక్కసారి తేలి, మఱియొక్క మున్కలో నమృతమయుఁడై యద్వైతస్థితి నొందునుగదా!

బాహ్యప్రకృతియే యింతయనిర్వర్ణ్యమై, యద్బుతమై యప్రతిహతమై యుండ దీనిని మించిన ప్రకృతి వేఱొక్కటి యున్నది. అదియే యాంతరప్రకృతి. బాహ్యప్రకృతి యెంతవివిధమో, యెంతవిపులమో, యెంతవిస్మయజనకమో, యాంతరప్రకృతి యంతకంటెు వివిధము. అంతకంటె విపులము. అంతకంటె విస్మయజనకము. దానిలోఁ బ్రకాశించుచున్నది, యెండయా కాదు, వెన్నెలయాకాదు, ఎండయు వెన్నెలయుఁగలసి యెండయు వెన్నెలయుఁ గాని యొకవింతకాంతియై, వింతలలో వింతయై వెల్గిపోవుచున్నదే. లక్షసూర్యులు, కోటి చంద్రు లొకదానిప్రక్క నొక్కటి, యొకదానిలో నొక్కటి యేకకాలమందుఁ బ్రకాశించుచున్నవే, ధ్వనికంటె, వెల్తురుకంటె, విద్యుచ్చక్తికంటె నెక్కువ వేగవంతములైన వింతవింతబారుమెఱపులేవో నుల్కసహస్రములతోఁ గొఱవిదయ్యపు గోటులతో లోన జఱజఱ మనుచున్నవే. అంతరప్రకృతిలోని రత్నములముందు, మీపట్టువజ్రము, మీ కోహినూరు వజ్రము దిగదుడుపునకైన నక్కఱకు వచ్చునా? అనంతరప్రకృత్యాకాశమునఁ గలుగు నింద్ర ధనన్సులముందు బాహ్యప్రకృతిలోని యింద్రధనస్సులు వెలవెలలాడుచున్నవే. నిస్తేజస్కము లగుచున్నవే మాసిమాయమగుచున్నవే. అంతశ్శక్రచాపములలో వట్టి రంగులుమాత్రమేనా? కాదే, రంగులో శబ్దమో, ఆశబ్దములోఁ బరిమళమో, ఆపరిమళములో మాధుర్యమో, ఆమాధుర్యములోఁ జలువయో, అన్నిటిలో ననిర్వచనీయమైన సౌందర్యమో, ఆహా ఏమి యంతఃప్రకృతి! ఏధరణీ కంపములైన, నేయగ్నిపర్వతోత్షేములైన, నేగాలివానలైన, నాంతర ప్రకృతిలోని సంక్షోభముల కీడువచ్చునా ఎనిమిదిదినములయుద్దమున్నది. పదునెనిమిదిదినముల యుద్దమున్నది. మూఁడుసంవత్సరముల యుద్దమున్నది. నూరు సంవత్సరముల యుద్దమున్నది. కాని సృష్ట్యాదినుండి కామక్రోధాదులయుద్ద మవిచ్చిన్నముగ నాంతరప్రక్కృతిలో జరుగుచున్నదే. రామాయణయుద్దమైన భారతయుద్దమైన ఐరోపా మహాసంగ్రామమైన నవియన్నియునైన నరిషడ్వర్గ సంక్షోభము ముందెంత? పిడుగుపాటుముందు పికిలికూతలు కావా? సముద్రపుహోరుముందు సరుగుడుచెట్లగానము గాదా? అట్టిబాహ్య ప్రకృతికి నిట్టియాంతర ప్రకృతికి నేమిసంబంద మున్నదో, యేమి భేదమున్నదో, దానిలోఁ దిరుగు నప్పు డేమియానందమో, దీనిలోఁ దిరుగునప్పడేమి యానందమో, యాయానందమున కీయానందమున కెచ్చట సామ్యమో, యెచ్చటభేదమో, యనుభవమునఁ గనిపెట్టఁజాలి నయాతండు కవి. చెట్టమొదలే కొమ్మయై, కొమ్మయే యాకై యాకే చిగురై, చిగురే పుష్పమై, పుష్పమే మకరందమైనట్టు బాహ్య ప్రకృతియే జడత్వమును దృజించి, భారమును వదలి, మోటుతనమును విడిచి, క్రమముగా సున్నితమై, మృదులమై, తేలికయై, వేగవంతమై, సూక్ష్మతమమై, విపులతరమై, యాంతరప్రకృతిగ మారెనో, కాక యాంతర ప్రకృతియే క్రమముగ మందమై, బరువై కఠినమై మొద్దై బాహ్యప్రకృతిగ మారెనో తెలిసికొన గోరి యొక్కసారియే యందులో నొకకాలిందులో నొకకాలుంచి, యందులో నొకచేయి, యిందులో నొకచేయి యుంచి, యందులో నొకక న్నిందులో నొకక న్నుంచి, పరిశీలించి, కాశిపట్టుబట్టకు, మెఱుఁగువైపు, మోటువైపులెట్లో యట్లే యని యనుభవమునఁ గని పట్టఁజాలినయాతఁడు కవి. అట్టు కనిపట్టి యాకృతిచే, రంగులచే, రుచిచే, బరువుచే, స్వభావముచే, గతిచే, భేదములైన యావస్తువు లన్నిటికి లోపల వెలుపల, నొకవిలక్షణ మగుశక్తినిండియున్నదనియు స్పష్టములగు సర్వపదార్ధములుగూడ నామహాశక్తి సాగరమందలి తరంగములు, తుంపరలు, బుద్బుదములు, ఫేనము లని యావేశమున గనిపట్టఁజాలిన యాతండు కవి. అందుచే నేకత్వమే బహుత్వముగా నున్నదికాని, బహుత్వమసత్యమనియు, నేకత్వమే సత్య మనియుఁ గనుపట్టు నాతండు కవి.

ఈశక్తియందుమాత్రము, కవికి, వేదాంతికి సామ్యమున్నది. ఉత్తమమైనకవిత్వము వేదాంతముకంటె భిన్నముకాదు. “Poetry is the highest Philosophy" అని పాశ్చాత్య విమర్శకచక్రవర్తిచెప్పినాఁడు. జగత్తత్త్వమును గూర్చి, పరబ్రహ్మతత్త్వమునుగూర్చి పలికిన వేదర్షు లందరు మహాకవులు కారా? జగత్పుస్తకమును జదివి, దాని యర్థమును గ్రహించి, దానిభావమును గుర్తెఱిఁగి, దాని రచియించిన మహాశక్తియొక్క తత్త్వము ననుమానింపఁ గలిగిన యాతడే కవి, భూమిలో నుండు గాజురాయి మొదలుకొని యంతరిక్షమున నత్యంత దూర మందుండు చుక్కవఱకు సమస్త పదార్ధములందు నీతిని, శాసనమును, ప్రేమమును, సౌందర్యమును, మతమును, నవిలంఘ్యక్రమమును బుద్దివైశిత్యముచేఁ గనిపట్టఁజాలిన యాతండు కవి. ఫలభారమున వంగిన చెట్టు ప్రపంచమున కేమి బోధించుచున్నవి? విద్యాంసుఁడు వినయవంతుఁడై యుండవలయు ననియేకదా? ఉదయముననే భరతపక్షి ‘తుఱ్ఱు’ మని సూర్యునివంక కేల యెగురుచున్నది? నిద్రావస్థలో నిస్సహాయస్థితిలో రక్షించిన భగవంతుని పాదములపై మనుజుని యాత్మకృతజ్ఞతా వందనములతో నుబ్బెత్తుగ నెగురవలయు ననుమతమును బోధించుటకేగదా, గులాబిపొదపై నొకపూవును మనము లాఁగగా దానిపై కొమ్మపై నుండుపువ్వు తానుగూడ వంగుట యెందులకు? ఒకచెంపఁ గొట్టువానికి రెండవ చెంపఁగూడ చూపు మని యేసుక్రీస్తు డెందులకు బోధించెనో యందులకే. పురపాలకసంఘమువారి వీథి దీప మేమి బోధించెనో యందులకే. పురపాలకసంఘమువారి వీథి దీప మేమి బోధించుచున్నది? తా నంతస్తాపముచే దహింపఁ బడినసరియే. పరులకు మే లొనర్పు మను స్వార్డపరిత్యాగమహాపాఠమును బోధించుట లేదా! కన్ను లున్న వానికి, మన సున్నవానికి రాతిలో నీతి యున్నది. మట్టిలో మత మున్నది.

అట్టు చూచువాఁడు కవి. చూచి యూరకుండునా? ఆవేశ మూరకుండనిచ్చునా? ఆనందము పొరలి పోకుండ నాఁగునా? లోపల చిత్తము తాండవించుచున్నప్పడు జిహ్వపై శారద తాండవింపకుండునా? కలకంఠకలస్వనములతో నొకప్పడు, శ్రీనివాసదేవాలయ ఘంటా ఘణఘణధ్వనులతో నొకప్పడు శ్రీశైలేశ్వర శంఖారావములతో నొకప్పడు, ఆఫ్రికాదేశపంచాననభయంకరగర్ధారావములతో నొక్కప్పడు పలికి, చిత్తోత్సాహమును, జిత్తోద్రేకమును నప్రయత్నముగ, ననర్గళముగ వెల్లడించునాతండు కవి. ఎవనిపలుకు లొక ప్పడు గంగా ఝరీవేగసన్నిభములో, యొకప్పడు పుత్రునియాలింగనమువలె చల్లనలో, సంతోషజనకములో, యొకప్పడు పడుచు పెండ్లాము నాలింగనము వలె గోరువెచ్చనలోఁ గుతూహలప్రదములో, యొకప్పడు పన్నీటితుంపరవలె పరిమళభరితములో, యొకప్పడు వీణావాదమువలె మధుర మధుర లలితలలితములై హృదయాకర్షములో, యొకప్పడు వేదవాక్కులవలె శాసనములో, యొకప్పడు నిస్సంబంధములుగాఁ గానఁబడుచు, దూరస్థములుగఁ గానఁబడుచు, మెలికలై ప్రక్కబాఱునఁ బోవుచు, తిరుగుడులై వెనుకబాఱున వచ్చి కాళ్లు చేతులు మనస్సు గట్టిగాఁ గట్టి డబ్బాటున మోసముతో స్వాధీనపఱచు కొనుదాఁక స్వభావము తెలియని పలుకు లొకప్పడు, రివ్వుమని పైకిఁ బోయి యచ్చట నింద్ర చాపవర్ణములఁ బూలను ద్రిమ్మరించి క్రింద జాఱిపోవుపలుకు లొకప్పడు, నుపయో గించు సమయానుసారసర్వతో ముఖసమ్మోహినీ కరణసరస్వతీమూర్తియగు నాతండు కవి.

పైకి మందుఁడై, బాహ్యప్రపంచ జ్ఞానశూన్యుఁడై జడుడై యాంతరప్రపంచముచే గాఢముగ నవలోకించుచు, గోఁచితో, గొంగళి పాఁతతో, నెడమచేతివెదురుకట్టతోఁ, గుడిచేతికుండతోఁ, గడుపులో నాకలితో, నడుముపై వంపుతో, శిరముపై గంపతో బిచ్చగాఁడై మాధుకర మెత్తుకొనుచు నొకపుడు, ధర్మసింహాసనాధిష్ణాతయై, కిరీటాంగదధా రియై, స్వర్ణనేత్రధర సేవితుఁడై యొకచేత ధర్మశాస్త్రమును, నొకచేత కత్తిని ధరించి యొకయడుగు చందనమున, నొకయడుగు నగ్నియం దుంచి, ప్రజలను యథాన్యాయముగఁ బరిపాలించుచు నొకపుడు, ముండియై, దండియై, కాషాయాంబరధా రియై, బ్రహ్మవర్చసము ముఖమున ఠవణింప నుపదేశముద్రను వహించి, యుపనిషత్సార మును బోధించుచు నొకపుడు, చిలువెండ్రుకలతో, పాలబుగ్గలతో, నోటిచొంగతో, కంటికా టుకతో, మాటిమాటికి పైకెత్తుచున్న నడుముతో, చమురుతలతోఁ, దొట్టిలోని బొత్తులలోఁ బండుకొని వ్రేలు నోటబడక వెక్కివెక్కి యేడ్చుచు నొకపుడు నిట్టు భావనాప్రపంచమున, భావనానాటకమున, భావనారంగమున సర్వవేషధారియై బాహ్యప్రపంచాతీతుఁడై తన ప్రపం చమునఁ దా నొక్కఁడై సర్వమై యుండునాతఁడు కవి,

ఎదుట లేనివస్తువుల వర్ణించునపు డాంతరదృష్టితో, వజ్రధారకంటె వాఁడియైన యాంతరదృష్టితో, నావస్తువుల యాకృతి, రంగు, రుచి, వాసన, ధ్వని, స్పర్శము మొదలగునవి పరిశీలించి వాని బాహ్యాంతస్స్వరూపముల నెట్టయెదుటఁ బెట్టఁగల యింద్రజాలమహేంద్ర జాల విద్యావిశారదుఁడగునాతండు కవి. ఏయేవస్తువుల నెట్లెట్లు వర్ణించిననవి స్వస్వరూప ములతోఁ బ్రత్యకము లగునో యట్టి చాకచక్యసంపత్తితోఁ గొన్నిటిని బలిష్టములైన నాల్గు జటకాలతోనో, కొన్నిటిని బలిష్టములైన మూఁడు వ్రేతలతోనో కొన్నిటిని దేలికతేలిక లేఁతలేఁత యగు పదివ్రేటులతోనో నిర్మించి యెంతదూరముననో యెన్నిమూలలలోనో దాగియున్న వానిని సాక్షాత్కరింపఁ జేయఁగ సమయానుసారశబ్దార్థగుంభనాసమర్థుఁడగు నాతండు కవి. ఎవనిబొమ్మలు మాటలో యతఁడు చిత్రకారుఁ డగునట్టే యెవనిమాటలు బొమ్మలో యతఁడు కవి.

నాయనలారా! కవియొక్క ప్రధానశక్తులను జెప్పచున్నాను. ఇట్టిశక్తుల కుదాహరణ ములు మనభాగవతభారతరామాయణాది గ్రంథములనుండి యెత్తిచూపునెడల నాల్గుదినము లకైన నీయుపన్యాసము తెమలదు. కవిలక్షణములను మాత్రమే చెప్పెదను. లక్ష్యములను మీరు చూచుకొన వలయును. (అయ్యా మీపూర్వోపన్యాసములం దెన్నిటిఁ గూర్చియో చెప్పెద నని వాగ్దాన మొనర్చియున్నారు. ఈసందర్భమునఁ గవిభేదములఁ గూర్చియు బాత్రాచిత్యముగూర్చియుఁ జెప్పవలసి యున్నది. పూర్వవాగ్దత్తములైన వన్నియు నీసారి చెప్పినదాఁక మిమ్మువదలము-అని సభలో గేకలు.) నాయనలారా! కూతురు కొడుకును గందునన్నఁ దల్లి వల దనునా? వినువా రున్నప్పడు చెప్పకుందునా? పూర్వమున నుపేక్షించిన వానినే కాక నింక ననేకవిషయములఁగూర్చి చెప్పెదను. ప్రపంచచర్య లంతకంటె నంతకంటెఁ జెడుచునేయున్నప్పడుపన్యాస విషయములకు లోపమేమి? భగవత్కటాక్షము మాత్రముండవలయును.

నాయనలారా! కవిలక్షణము లింకఁ జెప్పెదను. ఇది చప్పన మనస్సునఁ బ్రవేశించువిషయము కాదు. కావున సావధానచిత్తముతో వినవలయును. వస్తువర్ణనశక్తి నింతవఱకుఁ జెప్పియుంటిని. పరుల సుఖదుఃఖాద్యవస్థాభేదములను తనవిగాఁ జేసికొని పరులహృదయ ములందు దూరి తన్నుఁ బూర్తిగ మఱచి తనవ్యక్తిత్వమును బూర్ణముగఁ దుడిచిపెట్టి వారిహృదయములం దైక్యమై, వా రట్టియవస్థాభేదములం దెట్లు మాటలాడుదురో, యెట్లు పాడుదురో, యెట్లు గంతులిడుదురో, యెట్లు కూలఁబడుదురో, యెట్లేడ్తురో యట్లు మాటలాడి, యట్లు పాడి, యట్లు గంతులిడి, యట్లు కూలబడి, యట్లేడ్చునాతఁడు కవి. కళత్రవిహీనుఁ డగునిర్భాగ్యు డేడ్చిన ట్లోకపుడు, పుత్రోదయమైన భాగ్యవంతుఁడగు వృద్దుఁడుప్పొంగి మహానందమున నోలలాడినట్లొకపుడు, సందిగ్దావస్థలో నెటు చేయుటకుఁ దోఁపని యాపన్నునివలె నూఁగులాడి యొకపుడు, నపకారి యగుసరి యెదుటఁబడిన వీరాగ్రేసరునివలె బాయకత్తి జళిపించి ఝాంకరించి, సంహరింపఁ బోవుచు నొకపు డిట్లే యందఱాడవలసిన యాటలు తానే యాడి తానే పరవ్యక్తులైనట్టు మాటలాడు సవ్యక్తిసంఛన్న పూర్వకపరవ్యక్తిప్రవేశ పాండితీమండితుండగు నాతఁడు కవి.

ఆంతరప్రపంచములోని రూపశూన్యములైన రసభేదములు, నవస్థాభేదములు నక్షిగోచరములు కాకుంటచే వానిని వివరించి, విస్పష్టముగా మనయెదుటఁ బెట్టవలసివచ్చుచున్నపుడు బాహ్య ప్రపంచమున మన కనుభవములో నున్నవస్తువులను జట్టుభట్టు సందర్భానుసా రముగ నుపమలొనర్చి తెలియనివానినిఁ దెలియున ట్లొనర్చి చీఁకటిపై వెలుతురినిఁ బ్రసరింపఁజేయు విజ్ఞానతేజశ్శాలియగునాతఁడు కవి. మనస్సంకల్పములు, చిత్తవికార ములు, బుద్దిభ్రమములు, వివిధరసస్పురణములు, వర్ణ్యవిషయములైనప్ప డాయగోచరపరిస్థితులను దెలియఁబఱచుటకు బాహ్యప్రపంచమునందలి సౌమ్యపరిస్థితులసాహాయ్య మావశ్యకము, ఆంతరప్రపంచమందలి సౌమ్యపరిస్థితులసాహాయ్య మావశ్యకము, ఆంతరప్రపంచము నందలి యజ్ఞవిషయమునెల్ల సూక్ష్మముగా, సునాయాసముగా, సుప్రశస్తముగా, నత్యంతసముచితములైన యుపమలతో లంకెవేసి మనసుతోనైన స్పష్టముగ గ్రహించుట కవకోశము లేనివానినిఁ గంటితోఁ జూచునట్టు చేయు ప్రకృతిజ్ఞానపరిపూర్ణుఁ డైనయాతండు కవి. కవి ప్రాశస్త్యము సముచితోపమాన సంఖ్యను బట్టిగ్రహింపవచ్చును. శ్రీమద్రామాయణము నందు వాల్మీకి యుపయోగించిన యుపమలకు హద్దు లేదు. తులసీదాసుని రామాయణమునందుఁ గూడ నట్లే యున్నవి. మనఃప్రపంచమునందలి యవస్థాకోటులకెల్ల బాహ్యప్రపంచమున నుపమానకోటులున్నవి. కవి వానిని గ్రహింపవలయును. అది యిదియు నొకటే, అది యిదియు నొకటే యనుటకు సామ్యముకొఱకు గవి యెట్టు ప్రకృతినిఁ బరిశీలించునో, యది యిది కాదు, అది యది కాదు, (నేతి, నేతి) యని పలుకుటకు వేదాంతియు నట్లే ప్రకృతినిఁ బరిశీలించును. సామ్యపరిజ్ఞాని కవి. భేదపరిజ్ఞాని వేదాంతి. సామ్యముఁ తెలియకపో వుటకు నిజమే. కాని కవి యందు సామ్యజ్ఞానము విశేషముగ నుండును. వేదాంతి యందు విభేదజ్ఞానము విశేషముగ నుండును. ఇది స్థూలమైన నిర్వచన మని యెఱుఁగవలయును. అపదార్థములైన యంతరంగావస్థలకుఁ బదార్థత్వమిచ్చి ప్రత్యక్షము చేయుట కుపమాలంకా రము మహాకవులందఱు మిక్కిలి విరివిగా వాడియున్నారని చెప్పియున్నాను. బాహ్య పరిస్థితులను వెల్లడించునప్పడు గూడఁ గవు లుపమలను వాడినారు, వాడుచున్నారు. వాడఁగలరు. ఇది కేవల మావశ్యకము కాదు కాని యలంకారమునకు, జమత్కారమునకు, సౌందర్యమునకు, వస్తువైశద్యమునకుఁ గవు లట్టు చేయుదురు. మఱియుఁ గవులు మఱి యొక విధములయిన యుపమలను గూడ వాడుచున్నారు. అవి యేవనగ బాహ్యావస్థలను వెల్లడించు నప్ప డాంతరావస్థల నుపములుగఁదీసికొనుచున్నారు. ఇది కేవలము విరుద్దము. రవంత దెలిసినదానిని దెలుపఁగోరి తెలియని దానినిగాఁ జేయుచున్నారు. ఇట్టిక్లిష్ట పరిస్థితుల కుదాహరణములు గొన్ని యిచ్చెదను. మహాకవిశిఖామణియైన వాల్మీకినుండియే యిచ్చె దను. అశోకవనమందుండిన సీతాదేవిని వర్ణించునప్పడు శుక్లపక్షాదియందలి చంద్ర రేఖవలె నున్నదని చెప్పినారు. ఇది తెలిసినది. 'పినద్దాం ధూమాజాలేన శిఖామివ విభావసో’ అని మఱియుఁ జెప్పినారు. ఇదికూడ దెలిసినది. కాని "స్మృతీమివ సుసందిగ్జాం కీర్తిం నిపతితా మివ, నిహతామివ ఛ శ్రద్ధా మాశాం ప్రతిహతామివ. బుద్దిం సకలుషామివ’ యని యనేకము లయిన యంతరావస్థల నుపములుగా జేసినారు. సందిగ్ధమైన స్మృతివలె, నిపతితమైన కీర్తివలె, నిహతమైన శ్రద్దవలె, ప్రతిహతమైన యాశవలెఁ, గలుషమైనబుద్దివలె సీతాదేవి యున్నదని జెప్పటవలన సీతను గూర్చి తెలియకపోవుటయే కాక తెలియని యవస్థానభేదము లెన్నియో మనపైఁ బడినవి. ఈపద్దతి సమంజసము కాదేమో? కాని యావాల్మీకి తిరుగబడి 'నాపుస్త కము నిన్నుఁ జదువు మన్నవాఁ డెవఁడు? నీకుఁ దెలియుట కొఱకే నేను కవిత్వము చెప్పవలయునా? ఒకనికిఁ దెలియుట యనునది కవితోద్దేశమా? నాయుత్సాహము కొలఁది నాయిష్టమువచ్చినట్టు నాసంతోషము కొఱకై నాకొఱకే పాడుకొంటి’ నని మనల ధిక్కరించు నెడల మనము కొంతసేపటి వఱకు మూఁగలమైయుండవలసివచ్చునేమో? వాల్మీకి మహర్షి చెప్పిన యధిక్షేపణము నిజమే. మామిడిచిగురువగరున జీరవదలినకంఠముతోఁ గలకంఠ మెవనికొఱకుఁ బాడుచున్నది? మధుపాన మొనర్చి పాడు తుమ్మెద నీవు వినుటకే పాడుచున్నదా? ప్రకృతి జ్ఞానాస్వాదమున మత్తిల్లి మైమఱచి వినువారు లేకున్నను వ్రాయు వారు లేకున్నను నాత్మసంతోషము కొఱ కానందగీతములను బాడు గాయకశిఖామణి కవి.

"అభ్రకం రనసిందూరం గంధకం టంకణం సమ" మ్మనుయోగము ననుసరించి యాయావస్తువులను గలిపి సింధూర భూషణమును జేయు వైద్యునివలె, వివిధములయిన రంగులను చిత్రచిత్రములగు పాళ్లతోఁ గలపి యొకవింతరంగును చేయుచిత్రకారునివలె రామాశుగ సన్నిభమైన దృష్టిని బదునాల్గు భువనము లొక్కవిసరున ముందునకు వెనుకకుఁ బఱపి సర్వవస్తుజాలమును బరిశీలించీ యావస్తువులలో దేనిదేని నేయేవిధములుగా గలసిని బాగుగా నుండునో యోజించి యట్టు కలపి నూతన వస్తువుగఁ జేసి వాని నుంచుటకుఁ దావు, వాని బిలుచు టకుఁబేరుకల్పించి వానిని వాగ్రూపములగు ప్రతిమలను జేసి మనయోదుటఁ బెట్టఁగలద్వితీయద్వితీయ సృష్టికళా బ్రహ్మయగు నాతఁడు కవి.

కవి పిచ్చివాఁడనుమాట సత్యమే. ఎట్టిపిచ్చిలో నేమాత్రమైన వెగటును లేదో, యెట్టిపిచ్చి జగదుద్దరణపట్టిష్టమో, యెట్టిపిచ్చిలో జ్ఞానవిజ్ఞానములు దుర్నిరీక్షమైన తేజస్సుతో వెల్గునో, యెట్టివెఱ్ఱికి వేయి విధములు గాక, కోటి విధములైనను బరమార్థగ్రహణ విధానమున నొక్కటే విధము గలదో, యెట్టి వెఱ్ఱి వెఱ్ఱులన్నిటికంటె వెఱ్ఱిదో, యట్టి వెఱ్ఱిని, నట్ట లోకాతీతయెన వెఱ్ఱిని, నట్టి వెఱ్ఱి లేని వెఱ్ఱిఁ గలిగి తాను ధన్యుడై ధన్యముజేయు నాతండు కవి.

ఆ.

మల్లెపూవుఁ దూeటీ మధుపంబుతోఁ బాడి
గంధవాహుతోడఁ గలసి వీచి
యబ్దిలోన మునిఁగి గలసి వీచి
యబ్లిలోన మునిఁగి యార్వవహ్నిని గ్రాంగి
నీటిబుగ్గ యగుచు నింగిఁ బ్రాంకీ
తోఁక చుక్కతోడ డీకొని శ్రమంజెంది
సాంద్య రాగనదిని స్నానమాడి
తనువునిండ నింద్రధనుసురంగులు పూసి
కైరవాపుసుధను గైపుఁ జెంది
గోళగానరుతికి మేళవింపుగం బాడి
పాడి యూడి పాడి యూడి సోలి
భావనామహత్వపటిమను బ్రహ్మమై
పోవుకవికిం గోటిమ్రొక్కు లిడుదు.


ఓం శాంతి శ్శాంతి శ్శాంతిః