సరిపడని సంగతులు/మొదటి యంకము/మొదటి రంగము

శ్రీరామచంద్రప్రసీద.

సరి పడని సంగతులు

మొదటి యంకము.

మొదటి రంగము.

(వకీలు భీమసేనరావుగారియిల్లు. ఉదయము సుమారు 8 ఘంటలు.)

భీమ:--(ఉప్మాతినుచు) తారవిషయమును యోచనచేసితివా?

లీల:-- యోచనచేసితిని. వెంట్రుకల తీసియే తీరవలయునా? ఈ క్రూరకర్మ చేయవలసినదేనా? ఈఆచారము మిక్కిలి ఘోరమైనదని మీకు కొంచమైనను మనసుకు రాలేదా?

భీమ:--స్వాములవారు ఆజ్ఞాపత్రికకూడ పంపియున్నారే! (అనుచు మేజాలోని డెస్కునుంచి వెదకి ఒక జాబుపైకితీసి కన్నులకద్దుకొని చదువును)

"మా మఠమందే అభిమానముకలిగి మాఅనంతశిష్యకోటికి శేఖరుడైన శ్రీమట్టీ కాచార్య సిద్ధాంత ప్రచారకమణిప్రాయుడైనాస్మత్కృతపాపాత్ముడగు భీమునకు ఆజ్ఞాపించిన శ్రీముఖ పత్రిక---

మీ అక్క కుమార్తె, భర్తను పోగొట్టుకొనియు సకేళియై మూడుసంవత్సరములుగా మీయింటనున్నదని ముద్రాధికారుల ద్వారాతెలియవచ్చుచున్నది. ధర్మశాస్త్ర ప్రకారము నీవింకను ఆబిడకు కేశఖండ్నము చేయకున్నావు. ఇట్టిదోషమువలన నీకు నీభార్యకు రౌరవాదినరక ప్ర్రాప్తియగుటయేగాకజగద్వంద్యమైన సిద్ధాంతముంకేలోపముకలుగును. అదియునుగాక, నీవాపిల్ల్కు కేశఖండనము చేయించువరకును, ఆస్మత్పాదకమల రజము నీయింటి నలంకరింపజేయదని తెలియుము. గురువునాజ్ఞనుల్లంఘించుటకంటె గురుతరపాపము లేదని నమ్ముము-ఇతి నా రా య ణ స్కృ తి." అని ఇట్లువ్రాసినారుగదా! నేను చేయునదేమి? ఆచార్య ద్రోహము చేయవచ్చునా? రేపుప్రొద్దున బహిష్కారము చేసినచో నాతండ్రిగారి శ్రాద్ధము నెట్లుచేతును? మఠము వారలెవరు మనయింటికి వత్తురు?

లీల:--కొన్ని ధర్మశాస్త్రములలో అట్లుచేయనక్కరలేదు, విధవలు మరల పెండ్లి చేసుకొనవచ్చుననియు చెప్పినారుగదా? ఇదిగాక, మీగుమాస్తా శ్రీధరుడుగూడ బ్రాహ్మణుదేకదా! చూడండీ! ఆయన, తనతల్లి విధవయైనను వెంట్రుకలు తీయించకుండ ఎన్నిదినములనుంచి పెట్టినాడో! వారింటికి బ్రాహ్మణులు పోవుచునేయున్నారే?

భీమ:-- శ్రీధరుడా! వాడు స్మార్తుడు. ఈపిల్ల ఇట్లుండుటంబట్టియే మనఇంటికిరాను విద్యాలంకారాచార్యులుకూడ సంకోచించు చుండగా, ఎంతోడబ్బు ఎక్కువగానిచ్చి సరిచేసికొంటిని.

లీల:-- ఐతే స్వాములవారికిగూడ డబ్బు ఎక్కువగానిచ్చి సరిచేసికొనరాదా?

భీమ:-- అది సాధ్యముకాదు. బహిరంగముగా అనాచారము జరుగుట స్వాములవారు ఒప్పరు.

లీల:-- పొనిండు, ఆపిల్లను ఎక్కడికైనను పంపివేయుదము.

భీమ:-- అదియెట్లుసాధ్యము? నాఅక్క బావగార్లు గతించినప్పుడు ఈపిల్లను నాచేతబెట్టి, నీవే దానికి తల్లితండ్రి యనిచెప్పి చేతిలోచెయ్యి వేయించుకొని నారే? దాని సుఖదు:ఖములు నేను చూసుకొనకపోయిన మరెవరు చూచెదరు? నేనే దానికి పెండ్లి చేసినది. ఇప్పుడును నేనే దానిని సంరక్షణ చేయవలెను.

లీల:-- ఆ! పెండ్లిచేసితిరి! అరువదియేండ్ల ముదుసలివానికిచ్చి, నేనప్పుడే వలదు, వలదు, అని అంటిని. భీమ:- లీలా! "గతస్యశోచనా నాస్తి". సుఖదు:ఖములు కావడి కుండలు. ఆపిల్లకర్మ, బ్రహ్మఘటన. మనము చేయునదేమి?

లీల:- ఈమాటలువినుటకు నాచేతగాదు. మీరేమైననుచేయుడు. (అని నిష్క్రమించును.) (భీమసేనరావు లీల వెళ్ళినతరువాత లేచి, యిటు నటు చూచి, లోనికి తొంగిచూచి, ఎవరినో రమ్మని సైగ చేయును.)

తార ప్రవేశము.

భీమ:- అవిషయ మేమైన యోచనచేసితివా? లేదా? తార:- నేనేమి యోచన చేయవలయును? భీమ:- ఏమి యోచనచేయవలయునా? నామాట వినకపోయిన నీకు కలుగబోవు అనుమానము గుఱించి. తార:- నాక్కొకటియు తోచదు. నీవుతప్ప నాకెవ్వరు దిక్కు? నాకేమి యోచనచేయుటకు తెలియును. ఏడ్చుటకుమాత్రము వచ్చును. భీమ:- తిక్కపిల్లా! ప్రపంచములో విధవలు లేరా? వారికిట్టి కష్టములు రావా? తార:- ప్రపంచము సంగతి నాకేమి తెలియును? నీవేనాకు సర్వ ప్రపంచము. భీమ:- అందుకే నేచెప్పినట్లు వినవలెను. చూడు! నీసమాచారము, గుట్టు, లోకులకు తెలిసినయెడల ఎవ్వరు నిన్ను దగ్గరకు రానివ్వరు. నీవు దిక్కులేక కష్టపడవలసివచ్చును. తార:- నీవుకూడ దగ్గరకు రానియ్యవా? భీమ:- వెఱ్ఱిదానా! అది నాకు మాత్రము సాధ్యమా? ఇప్పుడు నీకు వెంట్రుకలు తీయలేదనియే స్వాములవారు నాయింటికి రాకయున్నారు. దానిపై నీవు 'ఇట్లు'న్నావని తెలిసినయెడల చెప్పవలసిన యవసరమేలేదు. తార:- అయితే నన్నేమి చేయమనియెదవు?

భీమ:- నేను మరల చెప్పవలయునా? నీవు తప్పక ఔషధము తీసుకొనవలయును.

తార:- (బదులుచెప్పక దు:ఖించుచు నిలుచును.)

భీమ:- ఎందుకు నీవేడ్చదవు? ప్రపంచమునందిట్టి వెన్నియో జరుగుచున్నవి. ఇట్టి విషయములన్నియు రహస్యముగా సవరణ చేసికొనకపోయిన, ఈకాలములో ఆచారము బ్రాహ్మణ్యమునెట్లు కాపాడవలయును? ఏడ్వకుము మందు తెప్పింతునా?

తార:- అయ్యో? నావలనగాదు. నన్ను ఎచ్చటికైనను పంపివేయరాదా? ఏదైన నొక మిషనాస్పత్రికి బంపివేయుము.

భీమ:- అయ్యయ్యో? మిషనాస్పత్రియా? అక్కడ మాంసాహారము, మద్యపానము చేయు, జాతిలేనివారలతో కలసియుందువా? నీకు పుట్టిన శిశువు ఎక్కడ పెరగవలయును?

తార:- ఆమిషనువారే రక్షింతురు.

భీమ:- (కొంచెముసేపాలోచించి) ఇది ఎన్నటికినిగాదు. అట్లు చేసినయడల ఈ రహస్యము ఎప్పుడైనను బయటపడగలదు. అప్పుడునాపేరు నాశనమగును. నేచెప్పినపని నీవుచేసి తీరవలయును.

తార:- అయ్యో! నీవు ఆచారపరుడవే! ఇది పాపముగాదా?

భీమ:- పాపము! బయటపడిన పాపము! రహస్యముగానుండిన ఏమి పాపము? ఎవ్వరుచేయని పనిచేసిన పాపము ఏదో, ఎక్కడనో ఎవరికిని తెలియకుండా ఇట్టి కార్యము చేసిన అది పాపమెట్లగును? ఇట్టిది బహిరంగమైన ఆచారభంగమగును. సమాజము చెడిపోవును. మనోదు:ఖము కలగును. అందువలన పాపము కలుగును.

తార:- అదియేల? భర్త చచ్చిన వెంటనే, ఆడుదానికి దాని సహజమైన ప్రకృతికూడ చనిపోవునా? విధవల పుత్రుల మనుష్యులుకారా? ఇదివఱకు ఇట్టివారలు గొప్పగొప్ప కార్యములు చేయలేదా? భీమ:- అందులకే ఆడవారికి బుద్ధిలేదనుట. మనబ్రాహ్మణ్యము ప్రకృతకాలములో కేవలము సంప్రదాయముపైననె ఆధారపడియున్నది. కాని అట్టి సంప్రదాయములలోను, గుప్త సంప్రదాయములకొన్ని, బహిరంగ సంప్రదాయములలోను, గుప్త సంప్రదాయములుకొన్ని, బహిరంగ సంప్రదాయములుకొన్నియు కలవు. సంసారముగుట్టు..... అని పెద్దలన్నారు. కావున సంసారము దానికి సంబంధమైన సకల విషయములు గుప్త సంప్రదాయములలో చేరినవి.

తార:- ఇదియంతయు నాకుఅర్థమేకాదు. ఇప్పుడే నామనస్సునకు నరకము ప్రాప్తించినట్లున్నది. దీనికి చేరికగా నీవుచెప్పినపని చేసినయెడల అంతకంటె హెచ్చుసంకటములు కలుగును. ఏవిధముగా నాలోచించిననను ఈ కార్యము హత్య అనియే తోచుచున్నది. స్త్రీలమనస్సు తమకడుపులోని ప్రేగులను వెలికితీయుటకైనను ఒప్పునుగాని తమచేతులార తమలోని ప్రాణమునే...

భీమ:- [నివారించి] ప్రాణము! పారవేయుట! ఎక్కడున్నది? నాకంటెను నీకెక్కువగా తెలియునా? దానికి ప్రాణమెక్కడనున్నది?

తార:- ప్రాణము నాకున్నది. నాప్రాణము దానియందున్నది. అది ప్రతినిమిషము తల్లికి అనుభవమగుచుండు మాటగాని మగవారికి అర్థముగాదు. దానిజీవనాడి వైద్యులచేతికి అందకపోయినను తల్లుల హృదయమునకు చెందియుండును. మగవారికంటికి దర్శనమియ్యకున్నను ప్రేమకు స్పర్శనమిచ్చు చుండును. అట్టి ప్రాణమును భంగపరుచుట పాపమే!

భీమ:- ఓసి అవివేకీ! నీకు పిచ్చిపట్టినది. కేశఖండనము లేకనే తలచెడినది. పాపము! పాపము! నీకంతయు తెలుసును కాబోలును. ప్రపంచములో పురుషోత్తముడగు వాసుదేవుడు బ్రాహ్మణ్యమును పుట్టించిన దెందుకనగ బ్రాహ్మణులు సకల ప్రపంచమునకు ఆదర్శప్రాయులై ప్రపంచములో ఆనందము సౌఖ్యము చేయవలయునని. అట్టి బ్రాహ్మణులే ఇట్టిపనులను బయలుపె ట్టినయడల, సమాజము చెడిపోయి, దైవసంకల్పమునకు వ్యతిరేకముగా వర్తించినట్లగు. అదియేపాపము. దైవద్రోహమే పాపము. ఈరహస్యము బయలుపెట్టినయడల దైవద్రోహము చేసినట్లగును.

తార:- అయితే యిట్టికార్యములను బ్రాహ్మణులేల చేయవలెను?

భీమ:- చాలు. ఉపన్యాసము చాలు. నలుగురిలో నీమానము సంగతి విచారింపకపోతివే?

తార:- నలుగురిలో నాకగు నవమానము తప్పించుకొనుటకై నేను ప్రకృతి దేవతకు అవమానము చేయవలయునా?

భీమ:- ప్రకృతి! ప్రకృతి!! భర్త గతించిన పిదప నీకు వికృతికాక ప్రకృతి ఎక్కడ? నామాట నీవు వినకపోయిన నేనేమి చేయుదునో చూచెదవుగాక.

తార:- ఏమిచేయుదువు? బాధపెట్టుదువు. ఒకవేళ, తుదకు ప్రాణమునే తీసివేయుదువేమో! నా ప్రాణమును నేనే చంపుకొనుటకంటె వేరొకరు చంపుట మేలుగదా!

భీమ: నోరుమూయుము. పిశాచి. నాయట్టివాని కీర్తిని, మంచిపేరును చెడగొట్టి కులనాశనము చేయుటకు ప్రయత్నపడుచుకున్నావే. నేనేమిచేయుదునో చూడుము.

తార:- (ఏడ్చుచు వెడలిపోవును.)

ప్రవేశము- విద్యాలంకారాచార్యులు.

విద్యా:- ఏమి విశేషము తారాబాయి ఏడ్చుచు పోవుచున్నదే? మీయాస్థానములో ఆమె కేమి తక్కువ?

భీమ:- కలియుగధర్మము. మంచిది చేయప్రయత్నించిన చెడ్డ వెంటవచ్చును.

విద్యా:- సరియే, అది నిజము. ఇప్పుడేమైనది? భీమ:- ఏమియు లేదు. చూడుడు ఆచార్యులవారూ! ఎదోభర్తను పోగొట్టుకొని, తల్లిదండ్రులులేని దు:ఖభాజనమైన జన్మము, అని నేనెంతో విశ్వాసముంచి, ఆపిల్లను సర్వవిధములైన సౌకర్యములు తక్కువలేక కలుగజేయువచ్చితిని. ఏదియోకొంచెము హెచ్చు తక్కువలైనప్పుడు................

విద్యా:- రాయల వారూ! దీనివిషయమై యోచింపవలసిన పనియేలేదు. ప్రపంచము ద్వంద్వమయము. సుఖదు:ఖములు కావడి కుండలు. మీకుతెలియదా!

"సమదు:ఖసుఖంధీరం, సోమృతత్వాయకల్పతే"

శ్రీ మద్భగవద్గీతా వాక్యమిది. జ్ఞానముండవలెనయ్యా జ్ఞానము!

భీమ:- ఆచార్యులవారూ! మీరు చెప్పునది మిక్కిలి యోగ్యమైనమాట, అయిన నామాటలు మీకు పూర్తిగ అర్ధమైనట్లు లేదు. విశేషమేమియులేదు. ఒక్కరహస్యం మీతోచెప్పవలయును. మీరు వేదమూర్తులు. కలవారు, తార కించిత్తు త్రోవతప్పి--చిన్నపిల్ల చూడండి! ఏమోపాపము.....ఇదేకష్టమూ.

విద్యా:-- దీనికి చింతయేల? ఇది ప్రకృతినియమము. ప్రపంచము జరుగవలెను. వృద్దిగాంచవలయును. ఇది కేవలము ప్రకృతిధర్మము. మనమేమి కర్తలా? కారకులా? అంతయును, ప్రకృతియే! ఆట ఆడించుచున్నది.

భీమ:--మీరుచెప్పునది సరియే, అయితే, వివాహమను కట్టుబాటును మన ధర్మశాస్త్రములు చేసియున్నవిగదా?

విద్యా:--ఉండవలె! ఆకట్టుబాట్లు అవశ్యకమే. అయితే ఎవరికి ఆ కట్టుబాట్లు? మనకా? బ్రాహ్మణులకా? సంస్కృతము జదివి, శాస్త్రసంబంధ విషయములను కంఠస్ధముగా నుంచుకొనిన మనకా ఆకట్టుబాట్లు? ఆకట్టుబాట్లన్నియు- నేనొక గొప్ప రహస్యము చెప్పెదను. వినుడు జ్ఞానము లేనివారలకే. ఈప్రబంచము చంచలము. దీనికిచలనముకద్దు. మార్పుకద్దు. సంచారముకద్దు. ముందుకు సాగడముకద్దు. అట్టి యీ ప్రపంచనాటకములో, ఇచ్ఛానుసారముగా ఎగురుటకు బాహ్మణుల కొక్కరికి మాత్రము అధికారముకద్దు. దానిలోగూడ శాస్త్రము, అందు లోని పరమార్ధము తెలిసిన మాబోటి వారలకు మాచే ఉప దేశింపబడు మీబోటి వారికిని ఎక్కువ అధికారము.

భీమ:- ఏమో లేనిపోని సందేహములు నన్న బాధించుచున్న వండీ,

విద్యా:- చూడండీ! సందేహమే సర్వ నాశకము. వేద, శాస్త్ర, పురాణేతిహాసములను ఈసందేహములు తొలగించుట కే మన పెద్దలు వ్రాసి పెట్టినది. (బాహ్మణులకు బాహ్మణ్యమే ముఖ్య ము గాని శాస్త్రనిబఁధనలు లేవు. ఆచార్యులకు అధికారములు కలవు. చేయుటకు శాస్త్రములు కలవు. విడిచి పెట్టుటకు శాస్త్ర ములుగలవు. ఇదియే ఇప్పటి 'బాహ్మణాచార్యుల యధికారము.

భీమ:- చూడండీ! ఇంద్రియముల బలము ఎంత ప్రమాదముకలు గ జేయునో. ఇంద్రియనిగ్రహ మెంతకష్ట మో!

విద్యా:- మీకు మనధర్మములలోని లౌకిక రహస్యముల పరిచ యమింకను లేదు. ఇంద్రియ నిగ్రహము చేయవలయునని వ్రాసి యున్నారుగాని అయి తే దృష్టాంతముల చెప్పెదవినుడు. శ్రీకృ షుడవతార పురుషుడవును గదా!

భీమ:- ఆహా! సం దేహమేమి!

విద్యా: - ఆ! గమనించండి. శ్రీకృష్ణ పరమాత్మ రుక్మిణీ దేవిని - మొదట ఉడాయిఁపు, పిదప వివాహము ఎక్కడ వచ్చెనయ్యా కట్టుబాట్లు?

భీమ:- అవును. (అని ఇంచుక తలయూచును.)

విద్యా:- ఇంకొక్కటి చూడండీ! అర్జునుఁడు శ్రీకృష్ణ పరమాత్మకు కేవల ముఖ్య శిష్యుడు, అర్జునుడు లేకపోయిన యెడల శ్రీమద్భగ వద్గీత యే వెలువడియుండదు. “అర్జున ఉవాచ” లేకయుండిన "శ్రీభగవాను వాచ” ఎక్కడనుండి వచ్చును? అవునుగదా! అట్టి యర్జునుడేమి చేసెను. సుభద్రను-మొదట ఉడాయింపు పిదప వివాహము. ఎక్కడ పోయినవయ్యా మీకట్టుబాట్లు! భీమ:-- మనస్సునకిది తోచకపోయినది. చూచితి రా!

విద్యా:– భీమ సేన రావుగారూ! శాస్త్రముల చదువుటయందు ఏ మియు లాభము లేదు. శాస్త్రములలోని విశేషార్థముల దెలి యుట కష్టము. అందుకే మాబోంట్లనుండియే శాస్త్రమును వినవలెను. మేము చెప్పునదియే శాస్త్రము, జ్ఞానము కావలె నయ్యా జ్ఞానము,

భీమ:- (యోచన చేయుచుండును.) విద్యా:— అదేమో "ఇంద్రియములు” “నిగ్రహము”” అని చెప్పి తిరిగదా? వినండి మరల గీతా వాక్యము- " నహి ప్రపశ్యామి మమాపను ద్యాత్ యచ్ఛోక ముచ్ఛోషణ మిందియాగాం

స్వర్గసోమాజ్యము లభించినను ఇంద్రియ నిగ్రహము కష్టము, 'ఇనుపకచ్చడాల్ గట్టికొన్న ముని ముచ్చు లెల్ల తామరస నేత లిండ్ల బందాలుగా రా!' మనకు స్వర్గ మెక్కడ రావలెనండీ? శ్రీ కృష్ణపరమాత్మ యొక్క సహవాసము మెక్కడ కలుగవ లెను? ఏదో సర్వసాధారణముగ ప్రవర్తించుచు, ఆస్వర్గ సౌఖ్యములు- ఊ-ఇక్కడనే అనుభవించుచు, పడుచు లేచుచు, పోవ లెను. శ్రీమన్నా రాయణుని లీలా ప్రపంచమిది. కేవలములీల. మీకు చింతయేల?

భీమ: - (చాలదీర్ఘముగ నాలోచించి) ఇది హత్యయని యనిపిం చుకొనునే మోగదా?

విద్యా:- రావుజీ! అది యధికారము లేనివారికి. గీతా పారాయ ణము చేయు వారికి, హత్య, పాపము అను సం దేహమెందు లకు? అర్జునునకు ఇదియేకదా సంశయ ముండినది. హత్య పాప ముగదా యని కృష్ణుని అడుగగా, పరమాత్మ యేమి చె ప్పెను? కొట్టు, దానివలన కలిగిన ఫలమంతయు నా నెత్తి మీద పెట్టు. నీవు కొట్టేకొట్టు, కొట్టకపోతే ఒట్టు. తత్కురుష్వ మదర్పణం ఇదియేకదా గీతాసారము. జ్ఞానము కావ లెనయ్యా! జ్ఞానము!

9

భీమ:--అట్లున్న పాపము పుణ్యము అని ప్రపంచములో ఉన్నవా లేవా?

విద్యా:--ఉన్నవండీ! ఉన్నవి. అయితే శాస్త్రరహస్యము తెలిసిన మాబోటి అచార్యులవారికిగాదది ఆభేదము శాస్త్రాధికారము లేనివారికి, మాబోటివారికి, జ్నానులకును ఈభాగములు కేవలము చిత్తవృత్తులు, దూరమునుండియే వారి యాటలు చూచుచుందుము. మరల వినండి గీతావాక్యము.


"ప్రకృతే:క్రియమాణానిగుణైకర్మాణిసర్వశ:,
      అహంకారారవిమూఢాత్మాకర్తాహమితిమన్యతే."

</poem> మంచిదికాని, చెడ్డదికాని, పాపముకాని, పుణ్యముకాని, 'నేను చేస్తాను ' అనుకొనుట మాత్రము తప్పు ఇది వట్టియహంకారము.

భీమ:--లొకులు ఎమునుకొందురో, ఆచార్యుయులవారూ! అదేమియు8 విచారింపవలదా?

విద్యా:--లోకులు? ఎవరికర్మ వారు అనుభవించుదురు. అయితే ఒక్కటియే ముఖ్యాంశము లొకులనొట పడకుండ కొంచెము సంప్రదాయము ననుసరించి ఆచరించునది. మీకేమి కొఱత? ప్రాత:కాలమునకే లేచెదరు. స్నాన సంధ్యావందనాద్యనుష్ఠానములు జరుపుచున్నారు. గోపీచందన ద్వాదశోర్ద్వపుండ్రములు ధరించుచున్నారు. సదక్షిణ బ్రాహ్మణపూజ చేయుచున్నారు. దేవాలయముయ్లు కట్టింఛడమునకై చందాలు వసూలుచేయుచున్నారు. ఇప్పటి ఈనవీన పద్దతులు జాతి మతభేదములు లేవనియు, మాల మాదిగలు మనకు సమమనియు ఇట్టి వక్రమార్గములలో ఒక్కటియైననులేవు. పైగా అన్నిటికంటె ముక్యముగా లొకులకు తెలియునట్లు, ఏకాదశీ వ్రతము నాచరించు చుయున్నారు. చాతుర్మాస్యము పట్టుకున్నారు. కేసులకుగాను చెన్నపట్నానికి పోయినప్పుడంతయును తిరుపతికి పోయివస్తారు. ఇంకేమి గావలయును? లోగుట్టు పెరుమాళ్ళకెఱుక, చూచితిరా! ఏను గకు తినుటకు దంతములు వేరు, ప్రదర్శనానికి దంతములు వేరు. ప్రదర్శనము బాగుంటె చాలు, ఇదియే ఇప్పటిగొప్ప సంప్రదాయము, ఇదంతయు, నాటకమండీ! నాటకము! జ్ఞానము కావలె నయ్యా! జ్ఞానము!

భీమ:-- నేను అదేచెప్పితినండీ ఆపిల్లకు రహస్యముగా పోగొట్టు కొంటే మరల యధావిధిగా నుండవచ్చునుగదా!

విద్యా:--అంతేసరి! అదిగాక ఇట్టిపనులు చేసిన-ఇది పాపము గాదనుకొండి. ప్రకృతి! ఒకవేళ ఏదైన అకార్యము జరిగినను మన ఇప్పటి సనాతనన ధర్మము లేదా? పాపశాంతికి పుణ్యస్ధలములులేవా/ కాశి, గయ, ప్రయాగ, పూరి, బదరి, కావేరి, ఒహోహోహొ!!! ఇన్ని పుణ్యస్ధలములు పుణ్యనదులు, పాపమును చించి చెండాడలేవా/ రైలుసౌకర్యములు లేనప్పుడు ఆ పాపములు, ఇప్పుడెక్కడివి ? పైగామాబోటి బ్రాహ్మణులు లేరా? అయ్యా! గంగానదిని అపోశనముగా తీసుకొంటిమండి. విషమునే త్రాగిన ఈశ్వరుడు మాబోటి వైష్ణవాచార్యు వారికి కేవలము భక్తుడు, అట్టి మేము చేయిపట్టినచో పాపం మందుకైనదొరకునా?

భీమ:--ఔరా!హిందూధర్మము, హిందూ ఆచారము ఎంత సారవంతముగానున్నది! ఈబ్రాహ్మణ్యములో ఎంత సౌకర్యమైన ఏర్పాట్లు? బ్రహ్మణులొక్కరు లేకపోయిన ప్రపంచమే మునిగిపొవును. ఇప్పుడు కొంచెము కొంచెము సమాధాన మాయెను.

విద్యా:--పోయివత్తునా? సెలవా? ఆలోచన చేయవద్దండి. ఆచార్యుల వారుండువరకు రాయలవారికి చింతయేవద్దు. మీరు చేయుచూపొండు, మేము ఎత్తివేయుచు వచ్చెదము. మీబోటి లక్మీపుత్రులను ఏపాపము చేరదు? సెలవా?

భీమ:--నమస్కరించి ఆచార్యులవారిని పంపును. పిదప అటు ఇటు రెండు సారులు తిరుగును. ఇంతలో గుమాస్తా శ్రీధరుడు ప్రవే

శించి, రాజా వీరణ్ణశెట్టి ఏదో ఒక కేసుకు వచ్చియున్నాడు అని చెప్పును. భీమసేనరావు తొందరగా షర్టు వేసుకొనుచు) ఇక్కడికే రమ్మనుమయ్యా.

(రాజా వీరిణ్ణ శెట్టి-ప్రవేశము)

శెట్టి:--దండము, స్వాములవారికి దండము

భీమ:--దండము, రండీ శెట్టిగారూ! కూర్చోనండి. ఏమిటి విశేషము?

వీరణ్ణ;--అయ్యగారికి నిండా పనివున్నట్లుందే! అయ్యగారికి ఎప్పుడు పనే! పురుసత్తేలేదు.

భీమ:--వకీళ్లకు పురుసతుంటే ఎట్లుండీ? మేమంత పూర్వకాలపు వాండ్రు. ఇప్పుడువచ్చే వచ్చే వకీళ్లకు పురుసత్తే ఎక్కువ. దానిలో ఈ మునిసిపల్ చేర్మనుపని ఒక్కటి.

శెట్టి:--దాంట్లో ఏమీఫాయిదా లేదండీ! మీరు ఎందుకు ఊరకే కష్తపడుతారో!

భీమ:--శెట్టిగారూ! నాఫాయిదాకొరకా నేను చేర్మనుపనిచేయుట? లోకులకు ఎంత ఉపకారము చూడండీ! ఊరికి కొలాయిలు తెప్పించినాను. మనుష్యులకు, పశువులకు, ఎంత సహాయము చూడండి!

శెట్టి:--కాదుస్వామీ! మార్కెట్టులొ అంటారు- కొళాయిలు తెప్పించినది మీకంటే ముందుండిన చేర్మన్ గారంటనే?

భీమ:--కొళాయిలకొరకు బునాదిలో సర్కారువారితో నేనెంత కొట్లాడినది లోకులకు కేమి తెలియును? నేను ప్రవేశించిక పోతే కలెక్టరు ఒప్పుకొను చుండేనా? మార్కెట్టు మాట కేమిలెండీ? మనవూరి మార్కెట్టులో వ్యాపారములో మూటలు తక్కువైతే మాటలు ఎక్కువై యుండును. అదిసరిగాని, మీరువచ్చిన పనియేమి?

శెట్టి:-- ఏమియులేదు. కొంచెము రికార్డుచూడవలెను. ఆసామినాపైన మునిసిప్ కోర్టులో కంట్రాక్టు దావావేసినాడు. చిన్నపని.

12

భీమ:--అయ్యా? పెద్దపనులే నన్నవూపిరి తిప్పుకొనలేనట్లు చేసినవే! దానిలో చిన్నకోర్టు పనులులలెల్లడవచ్చేది? మీరు వర్తకులే! చిన్నకోర్టుకు పెద్దఫీజు ఇస్తారా (కొంచము యోచన చేసి) అదిగాక చూడండి! ఇప్పుడుండు మునిసిఫ్ నాకుచాలనే హితుడు. ఇంటికి రావడము పొవడముకద్దు. ఒకవేళ న్యాయము మనతట్టే వుండి మనపక్కనే తీర్పు అయితే మీమార్కెట్టులోని వారు ఊరకే వుంటారా? యోచన చేయండి?

శెట్టి:-- స్వామి! స్వామి!! స్వామి!! మార్కెట్తులోని మాటల కేమి? ఈనంబరు మీరే చేయవలెను. ఎంతటిఫీజైన ఇస్తాను.

భీమ:--మున్ స్చిప్ కును నాకున్ను స్నేహమన్నదని మీతోచెప్పినదే కష్టమాయెనే? మీపుణ్యమయ్యేది ఎవరితోను చెప్పవద్దండి.

శెట్టి:--కద్దాస్వామి! గంగమ్మ కడుపులో గప్ -చిప్.

భీమ:--సరేకాని-ఫీజు ఏమిస్తారు?

శెట్టి:--కొండంత దేవరకు కొందంత పత్రి తేవడానికి సధ్యమా? అదిగాక మదింపు......

భీమ:--సరే! సరే!! సరే!! దావామదింపును సరిగా ఫ్రీగా తీసుకొనుకొనుటకు నేనేమి అట్లా యిట్లా వకీలను కొంటిరా? నేను అందులకే చిన్ననంబరు పట్టేదిలేదు. నేనుచేసే ధార్మకార్యాలకు, నేనుకట్టించే దేవాలయాలకు, నేను చిన్న ఫీజు తీసుకొంటే ఎట్లజరుగవలెను?

శెట్టి:-- ఫీజుకేమిలెండి స్వామి! అయితే కేసుటయిము ప్రదము కావాలె, చూడండి.

భీమ:--"యశోధర్మస్తతోజయం:" మనదేధర్మము. మనకే జయము.

శెట్టి:--అయితే ఒక్కమాటస్వామి! నాదస్కత్తుతో ఒక్కగాగితము ఎదురుకక్షి దారువద్ద చిక్కినది. ఏమిచేయవలెను అని ఆలోచన చేచున్నాను.

భీమ:--దస్కత్తునాదికారు అంటేసరిపోయెను. దస్కత్తుపరీక్షకు పంపుదురు. కొంచెము మీరు పంచికట్టువిదిలించితే సరిపొతుంది లేకపోతే ఇంకొక రసీదు వారి దస్కత్తుతో హాజరుచేస్తే మరిబాగు.

శెట్టి:-- స్వాములవారు చెప్పేది నాకు ముందట్టుకురాలేదు.

భీమ:--అంతా వచ్చునులెండి! ఇది ప్రపంచము. కొంచెంకల్పనా శక్తికావలె. లేకపోతే న్యాయమే మునిగిపోతుంది. ముందు ఆలోచన చేస్తాము. కాని ప్రస్తుతము రికార్టుయిచ్చి పొండు. అడ్వాన్సు శతమానము--

శెట్టి;--చాలా భారము వేసితిరి.

భీమ:--మీయిష్టము. మీకట్ట తీరుకొని పొండి. ఎదురుపక్షము వారువచ్చి వకాలతు యిచ్చి నారంటే నామీద మాటలేదు సుమండి.

శెట్టి:--స్వామి! స్వామి!! స్వామి!!! ఇదొ 50 రూపాయిల నోటు తీసుకోండి. మిగతాది, చిన్నొడు పల్లెకుపొయి నాడు. వచ్చిన తరువాత హాజరు చేసికొంటాను.

బీమ:--మగతాది వచ్చేవరకు, కట్టనుముట్టరు. (అని శెట్టివారుచేత నుంచి కట్టతీసుకొని బీమసేనరావు లేచును. శెట్టి దండ,ముపెట్టి పొవును. బీమదేవరావు నోటుతీసుకొని డెస్కులోపెట్టి బీగము వేయుచూ--

"అపదామపహర్తారం దాతారం సర్వసంపదాం,
లోకాభిరామం శ్రీరామం భూయోభూఓపమామ్యహు"

అనిగట్టిగ చదువుచుండగా తెరపడును)

This work is in the public domain in India because it originates from India and its term of copyright has expired. According to The Indian Copyright Act, 1957, all documents enter the public domain after sixty years counted from the beginning of the following calendar year (ie. as of 2024, prior to 1 January 1964) after the death of the author.