శ్రీరస్తు.

సమీరకుమారవిజయము

పీఠిక

    లీలం దిలకంబు కస్తురిని జిత్రింపంగ నీ చెక్కుట
    ద్దాలం జూచెద నీడ నానఁగఁ దదుద్యత్కాంతికర్పూరరే
    ఖాలక్ష్మీం గన వింత యంచు మఱి దక్కం జూడు నాఁ జూచి వీ
    క్షాళిన్ నల్వుగ మెచ్చుసీత నగురామాధీశుఁ జింతించెదన్.1
    
    
  
సీ. కులుకుసి గ్గొలుకుచూపులు భర్తమౌళిపై నలరుఁదానికి వ్రాలునళులఁ దెల్ప
    మైసౌరభము నాథునాస గంధవహాఖ్య కస్తోకసాఫల్య మావహింపఁ
    గనకతాటంకకంకణకాంతి పతినీలమేఘవిగ్రహయుక్తి మెఱుఁగుఁ బోల
    నాననైందవమందహాసామృతము చెల్వుచూపుల కనిమిషస్ఫూర్తిఁ జూపఁ
    
తే. గేలుఁదలిరులతో సౌరసాలశాఖ
    కల్పకముమీఁద విరులీను కరణిఁ దరణి
    కులునిపై ముత్తియపుఁబ్రాలు వెలయ నించు
    సీత లోకైకమాత రక్షించుఁగాత.2
    
మ. మదనాగోద్ధతి మాన్చి స్వచ్ఛత రహింపన్ పర్వతాగ్రస్థిరా
    స్పదలీలన్ విపులాగమైకవనసంచారస్థితిన్ మించి యు
    గ్రదశన్ బంచముఖాఖ్య గాంచఁ దగు దుర్గాశైలదుర్గస్తనీ
    హృదయాధీశుఁ దలంతు మత్కలుషమత్తేభవచ్ఛిదాకేళికిన్. 3
    
ఉ. బేడిసడాలు కన్నుగవబెళ్కులఁ జిల్క హుమాయిపల్కులన్
    వేడుక చెయ్వులన్ మరునివింతవగల్ గనిపింప శంభునిం
    గూడి నిజాంగసంశ్రయతఁ గూర్చి పునర్జనితాంగజోజ్జ్వల
    క్రీడ నెఱుంగనీయని గిరిప్రభుకన్య నుపాశ్రయించెదన్. 4
    
ఉ. సారసగర్భసంజ్ఞను రణస్స్థితుఁడై చతురాస్యుఁ డౌట భా
    షారతిఁ జెంది బ్రహ్మతను సత్యగతిం గని యా యాత్మభూత్వబృం



    దారకమూర్తి యౌట సుమనఃప్రియుఁ డై విధి గాన జన్మవి
    స్తారకుఁ డై చెలంగువరదైవము మాకుఁ జిరాయు వీయుతన్.5
    
శా. శుభ్రాంగద్యుతిశారదాభ్రతతితో జోడయ్యు శబ్దోజ్జ్వలా
    దభ్రస్ఫూర్తి నలంక్రియాస్ఫుటతటిత్కాంత్యున్నతిన్ బర్హిబ
    ర్హభ్రాంతిప్రదకేశవైఖరి విచిత్రాకారయౌ శారదా
    సుభ్రూరత్నము మాకు సంతతము నిచ్చున్ సైకవాగ్వైఖరుల్. 6
    
సీ. సరసభాషాసక్తి సత్యవైభవయుక్తి భావిపంకజభవప్రభుత దోఁపఁ
    గనకాంగదస్ఫూర్తి దనుజాపహృత్కీర్తిఁ దనహరిత్వము యథార్థముగఁ దోఁప
    స్మరవిభేదప్రౌఢిఁ బురవి దాహనిరూఢి సర్వజ్ఞగతి మ హశ్వరత దోఁపఁ:
    బుష్కరాశ్రయరీతి బోధహేతుఖ్యాతి హంసత్వమును దనయందె దోఁప

తే. స్వప్నమున మున్ను నాకు సాక్షాత్కరించి
    "తత్త్వమస్యాదివాక్యసంతతికి నర్థ
    మెఱుకచేసిన గురుఁడ నేనే" యటంచు
    నానతిచ్చినహనుమంతు నభినుతింతు. 7
    
మ. వినతానందనతన్ సుధాపహరణోద్వేలోక్తి నార్యానువ
    ర్తనసంపత్తి హృతాబ్జవైభవముఖోద్యల్లీల గాంగేయప
    క్షనిరూఢిన్ శతకోటిభాస్వదమలఖ్యాతిప్రభాతిప్రవ
    ర్ధనతన్ మించువినాయకుండు గెడపున్ బ్రత్యూహసర్పచ్ఛటన్. 8
    
ఉ. కౌముదివన్నె గాంచి బుధకావ్యగురుప్రమదావహైకలీ
    లామతి మించి ప్రాంచితకళల్ వహియించి సుధాసమానభా
    షామహనీయవర్ణసరసస్థితి సర్వపదార్థదర్శక
    త్వామలవైఖరిం దగుమహాకవిరాజుల సంస్మరించెదన్. 9
    
చ. పరభృతశబ్దముల్ వినినపట్ల సహింపక ప్రాస మెత్తివిన్
    పరువులు వాఱుచున్ మలినభావము మానక మంచిశబ్ద మెం
    దెఱుఁగక యొండు గన్న మఱియెద్దియుఁ గానక దుష్పథప్రయో
    గరతిఁ జరించుకాకవులు కావ్యవిలాసము గాంచ నేర్తురే? 10
    
వ. అని యిష్టదేవతాప్రణామఖేలనంబును శిష్టకవిస్తుతిమేళనంబును దుష్టకవిజనావహే
    ళనంబునుం గావించి. 11
    
సీ. శ్రీహనూమత్పాదసేవాగతాధ్యాత్మతత్త్వకవిత్వమహత్వవిదుఁడ
    నాశ్వలాయనసూత్రహారివిశ్వామిత్రగోత్రాబ్దిచంద్రుడఁ గుశలమతిని



    అలపుష్పగిరియప్పనార్యున కౌబళాంబకును సుపుత్రుండ బ్రహ్మవేత్త
    యైన వేంకటకృష్ణయాగ్రణికిని వేంకటాఖ్యకవీంద్రున కవరజుఁడను
    
ఆ. సరసగుణయుతుండ వరకవితిమ్మనా, హ్వయుఁడ నేను జనన మంది మనుట
    కెల్ల ఫలము గల్గఁ గృతి యొక్కటి రచింప, నూహ సేయుచున్న నొక్కనాఁడు. 12
    
సీ. మాయన్న కృష్ణధీమణియును మత్సఖుల్ ధన్యు లంతర్ముఖుల్ తాడిపర్తి
    పాపనార్యుని జెట్టపట్ట నోచినయెల్లమాగర్భశుక్తిని మౌక్తికంబు
    క్రియ నుదయించిన కేశవపెరుమాళ్ల ప్రబలవంశాబ్ధితారాకళత్రుఁ
    డగు చెన్నభట్టారకాగ్రకుమారుండు రాజయోగవిదుండు రఘుపతియును
    
ఆ. ఇష్టగోష్ఠి నుండి హితులు గావున నాదు, నెమ్మదిని బ్రబంధనిర్మిమేష
     గ్రమ్మియునికి యెఱిఁగి నెమ్మియు సమ్మోద, మినుమడింపఁ బలికి రిట్టు లనుచు. 13
     
క. రసికుఁడవై భావిబిస, ప్రసవభవుని హృదయవీథి భావించుట నీ
   రసనాగ్రంబునఁ బాయక, వసియించిన దజునికొమ్మ వరకవితిమ్మా.14
   
మత్తకోకిల.
    ధార తప్పక చెప్ప నేర్తు వుదారవాక్చతురత్వ మో
    హోరె నాఁగఁ బ్రబంధ మొక్కటి యొక్కనాఁటనె సన్నుతా
    చారమున్ బరతత్త్వమార్గవిచారముం గలమేటి వౌ
    వౌర! తిమ్మనసత్కవీ సరసార్థగౌరవభారవీ. 15

మ. కృతు లేమున్ రచియించినా మనుచు నోయీ కొంద ఱుర్విన్ వితా
    రతియానద్విరదాదివర్ణనలు బ్రారంభించి వర్ణింతు రే
    గతిఁ గానం గృతి సేయుచో సుభయలోకశ్రీకరం బై సము
    న్నతపుణ్యాశ్రయయ మైనఁగాని బుధు లానందింతు రెంతేనియున్.16
    
మ. నీవు కవిత్వతత్త్వముల నేర్పరి వౌటకు సత్ఫలంబుగా
    బావని నీకు సద్గురుఁడుఁ బ్రాణవిభుండు నభీష్టదైవముం
    గావునఁ దచ్చరిత్ర లొడికంబుగఁ గూరిచి సేయుమా జగ
    త్పావనమై ప్రవర్తిలఁ బ్రబంధము దుష్కృతబంధముక్తికిన్.17
    
క. అని జీవబ్రహ్మైక, త్వనిరూఢమనస్కు లైనవారలు తెలుపన్
    విని సంతసించి మంచిది, వినిపించితి రిట్టికథలె విరచింతు నిఁకన్.18
    
క. జలకాంక్ష నెుమక నమృతపుఁ, జెలమఁ దెలిసినటులు తృణముఁ జెనయఁగ సంజీ
    వలతఁ గలిగించినటువలెఁ, జెలఁగెన్ హనుమకథ బోధసేయుట లనుచున్. 19
    
మ. వారి నుతించి మంచిమతి వాయుజుపుణ్యచరిత్ర లన్నియున్


     గూరిచి తత్ప్రబంధమునకున్ బతి నెవ్వరిఁ జేతు నంచు లోఁ
     గూరినజాలి నొండొకరిఁ గూడి వచింపక యొక్కనాఁడు గౌ
     రీరమణాలయంబుకడ రేపటివేళ వసించి నిష్ఠతోన్. 20
     
సీ. స్వస్తికాసనమున వసియించి యమనియమంబులు సవరించి మారుతంబు
    పూరకకుంభకంబులఁ గట్టిగాఁ బట్టి చూపు నల్ త్రోవలచోట నిలిపి
    తనువుతో విశ్వ మంతయును శూన్యము చేసి వ్యాపార మందనియాత్మఁ దెచ్చి
    ఖేచరీముద్రలోఁ గీలించి పరిపూర్ణచిత్తవిశ్రాంతిమైఁ జిన్మయైక

ఆ. గగనరీతి రెండు గానియఖండతా, వ్యాప్తి ద్రిపుటికొంత యడఁగి వింత
    సుప్తిఁ బోనితుర్యసుఖముఁ బ్రాపించంగా, నంతలోన నాత్మ కద్భుతముగ. 21
    
తే. నిష్కళ నిరంజనసమాధినిష్ఠ నడఁచి, మిక్కుటపుమించు నిర్మించుమించుతోడ
    నీలజీమూతకాంతుల నిగుడువిఘ్న, మని మతిస్థైర్యమునఁ ద్రోయునంతలోన. 22
    
సీ. సీమంతపదవిఁ గూర్చిన ముత్యములడాలు తనదరస్మిత కాంతి ననుసరింపఁ
   గడకంటిననుచూపుబెడఁగు తా నిడికొన్న నీలహారస్ఫూర్తి నివ్వటిల్లఁ
   దళుకుఁగమ్మమెఱుంగు దనభుజాంగదధగద్ధగితరత్నశ్రీకి దండ గాఁగ
   గరసరోజాగ్రకంకణమణిప్రభ దనకటిహైమపటదీప్తిఁ గౌఁగిలింపఁ

తే. దొలుతటితటిద్ఘనము లాకృతులు ధరించె
   నొక్కొ నా గొమ్మకేల్ దమ్మి యొక్కకేలఁ
   గ్రమ్మి శతకోటిమదనశృంగారమూర్తి
   ఘనుఁ డొకానొకపురుషుండు గానిపించె.23
'
చ. రవిశశిమండలంబులస్థిరత్వము మానక కొంతలోవలం
    దవిలినగాడ్పు వీడక మనస్కతకై గుఱియందు డిందుబిం
    దువు నెరిఁ గ్రమ్మనీక యటఁ దోఁచినరూపులు ద్రోయఁ గ్రమ్మఱం
    దివిరిననన్ను లేనగవు దేరఁ గనుంగొని యాఘనుం డనున్. 24
    
ఉ. ఓయి సుధీంద్ర నీవిమలయోగవిరోధము సేయరాము మే
    మీ యెలనాఁగ సీత విను మే రఘురాముఁడ మామరుత్సుతుం
    బాయక కొల్చి తత్కథఁ బ్రబంధము చేసెద వంకితంబుగాఁ
    జేయుము మాకు నీ కెఱుక చెల్వగు నంచు నదృశ్య మౌటయున్. 25
    
ఉ. అంత సమాధి మాని హృదయంబున విశ్వము దోఁప నంతవృత్తాం
    తముఁ జింత చేసి యవురా! నిజదాసకథల్ గణింపఁగా



    నెంతయు సంతసించి తమరే చనుదెంచి పురాణదంపతుల్
    స్వాంతము రంజిలం దమకె యంకితమిమ్మని రెంత భాగ్యమో!
    
ఉ. మో మటు ద్రిప్పఁబోఁడు కయి మోడ్చిన మెచ్చును మెచ్చి మ్రింగఁ డే
    కామితమైన నీఁగలఁడు కా దనఁ డొప్పును దప్పు గల్గినన్
    రామనరేంద్రుఁ డట్టిప్రభురత్నము శాశ్వతకీర్తి గల్గఁగా
    నేమిటి కీనరాధముల కిత్తురొ యుత్తమకావ్యముల్ కవుల్?27
    
మ. జనకావాసవిభూతి వర్ధిలి రసాంచజ్జన్మయుక్తిన్ నుతుల్
    గని నిర్దోషతఁ దేజరిల్లి విహితాలంకారవిస్భూర్తి నూ
    నినమత్కావ్యవసుంధరాతనయ నెంతే యేకపత్నీవిలో
    లనరూఢిం దగురామచంద్రుఁడు దమిన్ లాలింప కెట్లుండెడున్. 28
    
క. శుభకరుఁ డగుసంజీవ, ప్రభునిచరిత్రమఁట తత్ప్రబంధము సీతా
   విభుపేరిటిదఁట గలవే, యుభయగతుల్ దీనఁగాక యొండొకకృతులన్. 29
   
క. అని మదిఁ దలఁచి మదాప్తుల, యనుమతి నతిసుకృతవతికి సస్మత్కృతికిన్
   మనుకులపతి నధిపతి గా, మొనయించి తదీయమహిమములు వర్ణింతున్.30
   
సీ. అభినవాంభోదమోహనలీలఁ జెలగియు హంసవంశోద్దీపకాత్ముఁ డయ్యెఁ
    జండమార్తాండతేజఃప్రాప్తి వెలిఁగియు గౌశికానందసంఘటకుఁ డయ్యె
    వరవసంతవిలాసవైచిత్రి మించియు నమితపలాశసంహారుఁ డయ్యె
    సుగుణరత్నాకరస్ఫూర్తి వర్తించియుఁ బరవాహినీభయాపాది యయ్యె
    
తే. దుస్తరము గాదె త్రిభువనస్తోత్రపాత్ర, చిత్రచారిత్రధాముఁ బవిత్రనాము
    నార్తరక్షావిచక్షణాయతకటాక్ష, వీక్షణస్తోము రఘురాము వినతి సేయ. 31
    

ష ష్ఠ్యం త ము లు


.
క. ఏవంవిధగుణమణిసం, భావితహృదయాంబుజునకు బహుకలుషారం
   భావనపరకర్బుర రం, భానన కుంభీంద్రకరవిభాసిభుజునకున్. 32
   
క. గహనాయతబహువిహరణ, కుహనాహరిణాపహరణగురుశరభృతికిన్
   మహితాత్త్మైక్యసమాహిత, విహితానుష్ఠానసహితవివేకాదృతికిన్. 33
   
క. సాధ్వాచరికమహాధ్వర, విధ్వంసౌద్ధత్యదైత్యవీరోద్యతమా
   యాధ్వాంతపద్మహితునకు, విద్వవతంసాజిముఖదివిజవినుతునకున్.34
   
క. భువనాధికవిబుధాంతర, సవనాలంకారునకును సత్తామాత్ర
   ప్రవిమలతావితశివమరు, దవనీసలిలాభ్రమహదహంకారునకున్. 35
   
క. తారకమంత్రాభ్యాసవి, హారపరాధీనునకు సుధాశనరక్షా
   చారుగుణాధారఘృణా,సారపణాయితవిలోకసంతానునకున్. 36

క. నందనహరిచందనహర, కుందనటత్కీర్తిధనునకును వినతజనా
   నందనునకు దశరథవర, నందనునకుఁ బవననందనప్రమదునకున్. 37
   
క. నూతనఝషకేతనసమ, చేతనమోహనమహావిశేషాకృతికిన్
   శ్రీతారుణ్యవతీసమ, సీతాలావణ్యరతికి శ్రీరఘుపతికిన్.38

వ. అంకితంబుగా నాయొనర్పం బూనినసమీరకుమారవిజయం బనుమహాప్రబంధంబునకు
   శ్రవణక్రియాప్రవణజనామితజనుష్కృతాయతదుష్కృతలతాలవిత్రం బగుకథా
   సూత్రం బెట్టి దనిన. 39
 

ప్రథమాశ్వాసము

కథాప్రారంభము

తే. అఖిలభూతదయానిష్ఠుఁ డగువసిష్ఠుఁ
    డానతిచ్చిన రామాయణార్థఫణితి
    నమరుమరుదాత్మజునిమహిమములు కొన్ని
    విని శతానందుఁ డానంద మెనయ ననియె.40
    
మ. యతిమూర్ధన్యదశాస్యనిర్మథనహేలావార్యుఁ డౌరామభూ
    పతిచారిత్రము మీరు తేటపడఁ దెల్పన్ వింటి నందున్ మరు
    త్సుతుమాహాత్మ్యము కొంత దెల్పితిరి తద్భూరిప్రభావంబు వి
    స్తృతవాగ్వైఖరి నాకు పూర్విగ నిఁకన్ దెల్పందగున్ బ్రేముడిన్. 41
    
క. విన వేడుకయ్యె శతముఖ, దనుజహృతియు నొడవుఁ డనినఁ దత్కథ లెల్లన్
   వినిపింతు నీకు విను మని, దిననాథాన్వయపురోధ దెలుపఁదొడంగెన్.
   
సీ. చారుముక్తామయసౌధశోభావళ, క్షితనభశ్చరదబ్జహితహయంబు
    పౌరందరగ్రావబద్ధతోరణవిభాశ్యామితామరథునీసారసంబు
    పృథుశోణమణిరమ్యకృతకాద్రిభానిరంతరసాంధ్యరాగితాంబరతలంబు
    మరకతస్థాపితవరసాలలోలప్రభాపలాశీకృతభవ్రజంబు
    
తే. రంగదుత్తుంగగోపురరజతసింహ, దర్శనాగతభీపునర్ధావదంబ
    రాపగానీరపానస్పృహాగతేంద్ర, భద్రగజ మొప్పు సాకేతపట్టణంబు. 43
    
సీ. ఘనపద్మపద్మరాగప్రతీకమునకు సాలవజ్రచ్ఛాయ చర్చ గాఁగ
    గేళివనాళిమధూళిసమ్మేళితపవనంబు తనుసౌరభంబు గాఁగ