సమీరకుమారవిజయము/ఉపోద్ఘాతము
ఉపోద్ఘాతము
శ్రీకృష్ణభగవానుఁడు గీతలలో నత్యుత్కృష్టపదార్థమునుండి యతినికృష్టపదార్థమువఱకును గలవిశేషాంశములు తనస్వరూపముగా వేర్వేఱ విభజించి చెప్పుచుఁ జెప్పుచుఁ గట్టకడ కొక్కమాటలో బ్రహ్మాండ మంతయు నిమిడి పోవునట్లుగా
| “యద్య ద్విభూతిమత్సత్వం శ్రీమదూర్ణితమేవ వా | |
అని తన విశ్వరూపమును ప్రకటించి యున్నాఁడు. దీని బట్టి చూడఁ బ్రతివ్యక్తియందును భగవదంశ మంతో యింతో యిమిడియే యున్నదని చెప్పక తప్పదు. ఇట్టిచో వివేకవంతుఁ డగుపురుషునియెడ భగవదంశ మున్న దనుటలో సందియము లేదు. అంతో యింతో భగవదంశము కలవా రయ్యును దామసగుణసంభూతు లైనవారి విషయ మటుంచి సాత్త్వికులును, వివేకవంతులు నగు ప్రతివారును దాము జన్మ మెత్తినందుల కేదో యొకరూపమున సార్థక్యమును సంపాదింపవలెననియే యత్నించుచుందురు. ఆప్రయత్నములును నొక్కరూపములే గాక యనేకరూపములుగా నుండెడుఁ గానఁ దలాయొకరీతిని వారివారికిం గల ప్రజ్ఞావిశేషమును బట్టి పచరింపఁబడుచుండును. అట్టివానిలోఁ గృతి నిర్మాణ మొకటి. ఐహికాముష్మికసంపాదకము లగునన్నికార్యములలోను నియ్యదియే శాశ్వతము. కనుకనే ప్రపంచస్థాయి భావమున కిది యాధార మగుచున్నది. ఇప్పటి "కెన్నఁడో జరిగిన వైన నేమి నేఁటిదాఁక నాఁటిపరిస్థితులను గన్నులఁ గట్టినట్టు పొడకట్టఁ జేయున దిదియే యయ్యెఁగాని మఱొకటి గాదుగదా! అట్టి లోకోత్తరకార్య మొనరించి మృతజీవులై యున్న కవిమహాశయులలో సమీరకుమారవిజయ మనునేఁడాశ్వాసముల యీప్రబంధమును రచించి శ్రీ రామచంద్రున కర్పించి లబ్ధప్రతిష్ఠుఁడైన లోకోత్తరపురుషుఁడు
పుష్పగిరితిమ్మన్న
యొకఁడు. ఇతఁడు వైదికశాఖాబ్రాహ్మణుఁడు. ఇంటి పేరు పుష్పగిరివారు. ఆశ్వలాయనసూత్రము. విశ్వామిత్రగోత్రము. తండ్రి అప్పనార్యుఁడు. తల్లి ఓబుళమ్మ. అగ్రజులు వేంకటకృష్ణయ్య, వేంకటకవి. వీరిలోఁ బెద్దవాఁడు బ్రహ్మవేత్త. రెండవవాఁడు కవీశ్వరుఁడు. మన తిమ్మకవి శ్రీ హనూమత్పాద సేవాగతాధ్యాత్మతత్త్వ కవిత్వమహత్త్వవిదుఁడు. ఈవిషయము పీఠిక 12-వ పద్యమువలనఁ దెలియఁబడు చున్నది. ఇతనియనుభవమునుబట్టి చూడ నీతఁడు కేవలము కవియును, గేవలము వేదాంతియే గాక యోగశాస్త్రమునందును, మంత్రశాస్త్రమునందును, సగుణనిర్గుణోపాసనయందును, గానశాస్త్రమునందును మిగులఁ బ్రవీణుఁ డని పీఠిక 21-గద్య. షష్ఠాశ్వాసములోని మంత్రగానవిద్యాపరీక్షలు వీనివలన స్పష్ట మగుచున్నది. “ఈకవి నివాసస్థలము నెల్లూరిమండలములోని మోడెగుంట (కోవూరు తాలూకా) యయినట్లు నెల్లూరిమండలచరిత్రసంగ్రహమునందు వ్రాయఁబడి యున్న" దనియు, "నీకవి పదునెనిమిదవశతాబ్దిమధ్యము 1750 మొదలుకొని 1790)వ సంవత్సరమువఱకును కవిత్వరచన చేసి యుండవచ్చు” ననియు నాంధ్రకవులచరిత్రములో వ్రాయఁబడియున్నది ఇతని కిష్టదైవము హనుమంతుఁడు. తన యిష్టదైవమే గురువుగా దయచేసి తనకుఁ దత్త్వమస్యాది మహావాక్యముల కర్థ మెఱుకపఱచె నని
| స్వప్నమున మున్ను నాకు సాక్షాత్కరించి, తత్త్వమస్యాది వాక్యసంతతికి నర్థ | (పీఠి. 7.) |
స్వప్న విచారము.
ఇటీవల నాధునిక విమర్శకులు తఱచుగాఁ గృతికర్తలు తమకృతులయందు నిరూపించుకొనిన స్వప్నప్రసంగములం గూర్చి హేళన సేయుచున్నారు. ఇతఃపూర్వస్థితి యెట్లుండెనో యని శంకించుట కిట్టిహేళనలు కన్పట్టకపోవుటచే నపు డొకవిధ మైనయాస్తికత్వ మాస్వప్నభాగమున నున్న దనియే మన మూహింపవచ్చును. ఇందుల కప్పకవి స్వప్నమును నహోబలపండితుఁడు బలపఱచుటయే నిదర్శనము. ఇందులో నాత్మగౌరవార్ధ మయియే యిదియు నొక్క విషయముగాఁ గల్పించి యెవరిమట్టునకు వారు పూర్వపూర్వులం జూచుకొని పులిని జూచి నక్క వాఁతఁ బెట్టుకొన్నట్లు తమతమ కృతులయందుఁ గూర్చుచున్నారే గాని యింతయు నిజమా యని పాఠకలోకమునకు లేనిపోని మిథ్యాత్వబుద్ధిని గల్పించునంతపని యగుచున్నది. ఈవిషయమై నితాంతము విచారించి చూచినచో నాహారనిద్రాభయాదులు గల ప్రతిప్రాణికిని స్వప్నావస్థ యున్న దనియే చెప్పక తప్పదు. ఇట్లని వివేకవిశిష్టు లైనమానవుల కెవరియంతరాత్మకు వారికే తెలియకపోదు.
స్వప్న మనఁగా నది యెక్కడనుండియో యకస్మాత్తుగాఁగాని, యొకరిచ్చినదానఁ గాని వచ్చునది గాదు. అది మనోవ్యాపారమునుబట్టి కలిగెడు నొకానొకయవస్థావిశేషము. దత్తరామపండితుఁడు స్వప్నప్రకాశికలో స్వప్నమునుగుఱించి చెప్పుచు స్వప్నము వచ్చుటకుఁ గారణముల నిట్లు చెప్పియున్నాఁడు—
| “మనోవహానాం పూర్ణత్వా ద్దోషై రతిబలైస్త్రిభిః, | |
(మనస్సు సంచరించుటకు యోగ్యము లగునాడులయందు వాతపిత్తశ్లేష్మములు విషమముగ సంచరించుటవలనఁ గలిగినదోషములచే శుభాశుభము లగుస్వప్నములు గలుగును.)
| “సర్వేంద్రియాణాం విరతౌ మనో౽నుపరతం యది, | |
(విషయేంద్రియము లన్నియుఁ దమతమ వ్యాపారములను జాలించి యుండ మనస్సునకుమాత్రము వ్యాపారము గలిగి యుండునపుడు నానాస్వప్నములు గలుగును.)
ఇట్లు గలిగెడిస్వప్నములును,
| "దృష్టశ్శ్రుతో౽నుభూతశ్చ ప్రార్థితః కల్పితస్తథా, | |
(1. పగలు గనినవస్తువు రాత్రి నిద్రలోఁ గనఁబడినచో దృష్టస్వప్నము, 2. ఇదివఱకు వినినమాట నిద్రలో వినఁబడినచో శ్రుతస్వప్నము, 3 మేలుకొనినపుడు దా ననుభవించినవస్తువులు నిద్రలో ననుభవించినచో అనుభూతస్వప్నము, 4 మేల్కొనినపుడు కోరిన వస్తువును నిద్రలోఁ జూచినచోఁ బ్రార్థితస్వన్నము, 5 పగలు కల్పించినవస్తువు రాత్రి నిద్రలో గనఁబడినచోఁ గల్పితస్వప్నము, 6 ఇదివఱ కెప్పుడును నెఱుఁగనివస్తువును నిద్రలోఁ జూచినచో భావికస్వప్నము, 7 వాతపిత్తశ్లేష్మప్రకోపమువలన నిద్రలో నొకవస్తువును జూచినచో దోషజస్వప్నము.) అని యేడువిధము లని నిర్వచింపఁబడి తదంతర్భేదములు కావలసినన్ని పెరిఁగిపోయినవి. కనుక నంతర్జ్ఞానేంద్రియవ్యాపారము లున్నంతవఱకును స్వప్నములు గలుగుచుండుట నైజమే యని తలంచుటకు సందేహము లేదు. ఇది యొకబూటకమే గాని యందఱకును నొక్క మాదిరిస్వప్నములే గల్గునా? యని శంకించుటకు మనస్సు పాఱువోవచ్చును. అందఱకును గల్గు సంకల్పాదు లన్నియు నొక్క పోలికవేగాన నట్లు కలుగవచ్చునని సమాధానము చెప్పుట య టుంచి
| “ఏకవస్త్రః కుశాస్తీర్ణే సుప్తః ప్రయతమానసః, | |
(స్వప్నమును గోరువాఁ డేకవస్త్రధారి యై నిర్మలహృదయముతో దర్భాసనముపైఁ బరుండెనేని వేకువజామున శుభస్వప్నమును గాని యశుభస్వప్నమును గాని గాంచును) అని కావలెనని స్వప్నమును జూడవలె ననుకొన్న నిట్లు చేయవలసిన దని స్వప్నప్రకాశికలోనే చెప్పఁబడినది. ఇట్టపరిస్థితులలో సాంప్రదాయసిద్ధముగ వచ్చుచున్న యాస్తిక్య బుద్ధి గల్గి యిష్టదైవ మని యొండొక దేవుని నమ్మినవారల కాయిష్టదైవము స్వప్నావస్థలో సాక్షాత్కరించి తనభక్తుని నేదే నొకరూపమున ననుగ్రహించుననుట కల్ల యని మనము మనయాత్మ సాక్షికముగాఁ జూచుకొని బూటకముగాఁ దలఁచుటకంటే “నేపుట్టలో నేపా మున్నదో” యని తలంచి తద్విశ్వాసిజనుల కుండు విశ్వాసమును భంగపఱపకుండుటయే భావ్యమని యింతదూరము మనవి చేయవలసి వచ్చినది. ఈ విధముగనే మనకవియును బ్రయత్నపూర్వకముగ స్వప్నము దెప్పించుకొని భగవత్సాక్షాత్కృతిం బడసినట్లు పీఠికలో 20నుండి తెలియఁబడుచున్నది. నిజమును దాఁచినఁ జెప్పఁజాలము గాని యిందులోని సత్యాసత్యములను నిర్ణయింపవలెనన్న నింతకును దన్మయత్వ ముండవలయును. మఱియొక్క మనవి. ఇందఱకును నిట్టి కలలే వచ్చు ననుట యసంగత మందు రని ముందే మనవి చేసి యున్నాను. ఒకటి యాలోచింపవలసి యున్నది వారివారి కాలమున నున్న జనసంఖ్యలు నీనాఁడు మనకు లెక్కకు వచ్చువా రుద్దిష్టకవులును, వారిచేఁ దెలుపంబడినవారును…ఇంతియే గాని తదితరులు లెక్కకు రారుగదా! అంతమందిలో నొకరిద్దఱుగా వచ్చుచు నీనాఁటికి మొత్తమునకు వచ్చిన కొలఁదిమందియును లోకోత్తరపురుషు లగుటవలన వా రందఱికిని నొక్కటే స్థితిఁ బట్టుట యసంగతము గాని, కల్పితము గాని కా దని నమ్మవచ్చును. రామాయణములోఁ త్రిజటకు స్వప్నము వచ్చినట్లు స్వప్నవృత్తాంత మున్నది గదా! హరిశ్చంద్రుఁడును, ఉషాకన్యయుఁ గల గాంచినారుగదా! ఇటీవలఁ గాదంబరీ దశకుమారచరిత్రాదులలోఁ దత్ప్రసంగ మున్నది గదా! కనుకఁ దిమ్మకవికిఁ దనయిష్టదైవమే గురువుగా వచ్చి వేదాంతమును బోధించె ననుట సత్యమనియే భావింతము.
ప్రబంధనిర్మిమీష
| "ఏకశ్శబ్దస్సుప్రయుక్తస్సమ్యజ్జ్ఞాతస్స్వర్గే లోకేచ కామధుగ్భవతి" | |
(సుష్ఠురూపముతో నొక్కశబ్దమును బ్రయోగించినవాఁడును, ఒక్కశబ్దమును లెస్సగాఁ దెలిసికొనినవాఁడును స్వర్గమునందును, నిహలోకమునందును నభీష్టఫలభాజకుఁ డగుచున్నాఁడు) అని శ్రుతి. సాహిత్యదర్పణములో విశ్వనాథకవిరాజు కావ్యమహిమను దెల్పుచు
| "చతుర్వర్గఫలప్రాప్తి స్సుఖాదల్పధియా మపి | |
అని చెప్పి తనచెప్పినది ప్రాచీనసమ్మతమే యనినమ్మకమును పుట్టించుటకై
| “ధర్మార్థకామమోక్షేషు వేచక్షణ్యం కలాసు చ, | |
అని పురాణవాక్యమును నుదాహరించి యున్నాఁడు. ఇట్టిసుభాషితములు వినినతరువాతఁ బ్రతివానికిని దత్ఫలాపేక్ష గలుగుచుండుట సహజ మైయుండఁగాఁ దత్ఫలప్రాప్తికి సాధనభూతమైన కవితాకలావిలాసముగలవానికిఁ గల్గుననుట వింత గాదు. కనుకనే ప్రతికవీశ్వరుఁడును దా నొక్కకృతిరచన చేసి తన్మూలమునఁ దనజన్మము సార్థకము చేసికొనవలయు నని యూహించుచున్నట్లు తెల్పికొనియున్నాఁడు అట్టియాస్తికతాపరాయణులగు మహనీయుల వాక్యములు కాలదోషముచే మనకు వెగటనిపించి హేళనక్రిందికి దిగుచున్నవి. కాని వారికున్నతన్మయావస్థలో నేయించుకంతేని మనమును బాల్గొనినచో నందలియాధార్థ్య మెఱుకపడక పోదు. ఇట్టి ప్రబంధనిర్మిమీష యీకవిమహాశయునకును గలిగినట్లును, ఇష్టగోష్ఠిలో దానిని జీవబ్రహ్మైకత్వనిరూఢమనస్కులును, అంతర్ముఖులును, దనకు హితులు నగు తనయన్న వేంకటకృష్ణయ్యకును, తాడిపర్తి కేశవపెరుమాళ్లకును, ప్రబల రఘుపతికిని దెలిపి వారి ప్రోత్సాహముం బడసినట్లును (పీఠిక 13) విశదీకరింపఁబడినది.
ప్రబంధనిబంధనములు
సాధుకావ్యరచనవలన దుర్లభం బగుచతుర్వర్గఫలప్రాప్తి కల్గు నని నిర్వచించిన పెద్దల వాక్యముపై విశ్వాసము గలవాఁడు తక్కటివానికంటెను సాధ్య మైనంతలో సులభముగనే ఫలప్రాప్తి గలుగునట్టి సత్కావ్యనిర్మాణమునకుఁ గడంగకపోఁడు కడంగినపుడు తల్లక్షణములను, దన్నిబంధనములను ననుసరింపక తప్పదు. ఆపద్ధతి యాకాలమున విశేషగౌరవపదవిలో నుండె నని మన మూహింపవలసినదే గానీ యీనాఁటి దేశ-కాల-వ్యక్తిపరిస్థితులకు సరిగా లేదని వానిని నిందించిన దానఁ బ్రయోజనము లేదు. కవికాల మేదో, తత్ప్రవర్తన మెట్టిదో పుట:సమీరకుమార విజయము.pdf/10 పుట:సమీరకుమార విజయము.pdf/11 పుట:సమీరకుమార విజయము.pdf/12 పుట:సమీరకుమార విజయము.pdf/13 పుట:సమీరకుమార విజయము.pdf/14 పుట:సమీరకుమార విజయము.pdf/15 పుట:సమీరకుమార విజయము.pdf/16 పుట:సమీరకుమార విజయము.pdf/17 పుట:సమీరకుమార విజయము.pdf/18 పుట:సమీరకుమార విజయము.pdf/19 పుట:సమీరకుమార విజయము.pdf/20 పుట:సమీరకుమార విజయము.pdf/21 పుట:సమీరకుమార విజయము.pdf/22 పుట:సమీరకుమార విజయము.pdf/23 పుట:సమీరకుమార విజయము.pdf/24 పుట:సమీరకుమార విజయము.pdf/25