సమీరకుమారవిజయము/ప్రథమాశ్వాసము
క. నందనహరిచందనహర, కుందనటత్కీర్తిధనునకును వినతజనా
నందనునకు దశరథవర, నందనునకుఁ బవననందనప్రమదునకున్. 37
క. నూతనఝషకేతనసమ, చేతనమోహనమహావిశేషాకృతికిన్
శ్రీతారుణ్యవతీసమ, సీతాలావణ్యరతికి శ్రీరఘుపతికిన్.38
వ. అంకితంబుగా నాయొనర్పం బూనినసమీరకుమారవిజయం బనుమహాప్రబంధంబునకు
శ్రవణక్రియాప్రవణజనామితజనుష్కృతాయతదుష్కృతలతాలవిత్రం బగుకథా
సూత్రం బెట్టి దనిన. 39
ప్రథమాశ్వాసము
కథాప్రారంభము
తే. అఖిలభూతదయానిష్ఠుఁ డగువసిష్ఠుఁ
డానతిచ్చిన రామాయణార్థఫణితి
నమరుమరుదాత్మజునిమహిమములు కొన్ని
విని శతానందుఁ డానంద మెనయ ననియె.40
మ. యతిమూర్ధన్యదశాస్యనిర్మథనహేలావార్యుఁ డౌరామభూ
పతిచారిత్రము మీరు తేటపడఁ దెల్పన్ వింటి నందున్ మరు
త్సుతుమాహాత్మ్యము కొంత దెల్పితిరి తద్భూరిప్రభావంబు వి
స్తృతవాగ్వైఖరి నాకు పూర్విగ నిఁకన్ దెల్పందగున్ బ్రేముడిన్. 41
క. విన వేడుకయ్యె శతముఖ, దనుజహృతియు నొడవుఁ డనినఁ దత్కథ లెల్లన్
వినిపింతు నీకు విను మని, దిననాథాన్వయపురోధ దెలుపఁదొడంగెన్.
సీ. చారుముక్తామయసౌధశోభావళ, క్షితనభశ్చరదబ్జహితహయంబు
పౌరందరగ్రావబద్ధతోరణవిభాశ్యామితామరథునీసారసంబు
పృథుశోణమణిరమ్యకృతకాద్రిభానిరంతరసాంధ్యరాగితాంబరతలంబు
మరకతస్థాపితవరసాలలోలప్రభాపలాశీకృతభవ్రజంబు
తే. రంగదుత్తుంగగోపురరజతసింహ, దర్శనాగతభీపునర్ధావదంబ
రాపగానీరపానస్పృహాగతేంద్ర, భద్రగజ మొప్పు సాకేతపట్టణంబు. 43
సీ. ఘనపద్మపద్మరాగప్రతీకమునకు సాలవజ్రచ్ఛాయ చర్చ గాఁగ
గేళివనాళిమధూళిసమ్మేళితపవనంబు తనుసౌరభంబు గాఁగ
సౌధశృంగోజ్జ్వలస్తనకుంభములకు దారకలు ముత్యాలహారములు గాఁగ
వరసరస్స్ఫురదళివ్రాతనీలిమనాభిపరిసరోదితరోమపఙ్క్తిగాఁగ
తే. విపణిమార్గసమగ్రనవీనవృత్ర, నిగ్రహగ్రామతోరణానీక మఖిల
లోకలోకైకమోహనాలోకములుగ , మించు సాకేతనగరలక్ష్మీమృగాక్షి. 44
ఆ. గోపురాగ్రహైమకుంభస్తనంబుల, కేతనాంశుకంబు వాతజాత
సంచలచ్ఛలమునఁ జారఁ దత్పురలక్ష్మి, విష్ణుపదముఁ జేర్చు విస్మయముగ. 45
క. ధర వర్షయైన మానస, సరసిం దగఁ జేరి హంససంతతి మఱి త
త్పురసౌధచరస్త్రీకచ, భరము నిరీక్షించి దిగులుపడు మొగులనుచున్. 46
చ. అహహ! వినీలనీలయుత మై తనరారినసౌధశృంగభా
మహిమ దినేశమండలముమధ్యమమంతయు నిండఁ గంకణ
గ్రహణము పట్టె నంచు ధరఁ గల్గుజనావళి విస్మయంబుచే
నహరహముం గనుంగొను నయారె పురంబు విచిత్రవైఖరుల్. 47
మ. సొగటాలాడినఁ బందె మియ్యవలె నంచున్ రంభ కొట్లాడగా
నగి కౌబేరి యదే సరాట యనఁగా నాకేల యీకోమ్మలే
తగ వీడేర్తు రటంచుఁ దత్సవిధసౌధస్థాయిపాంచాలులన్
దగ వేఁడన్ హసియింతు రగ్రనివసన్నారీశిరోరత్నముల్. 48
మ. పురిఖేయంబుఁ బయోధియుం గని జనంబుల్ రెంటికిన్ భేద మే
ర్పఱుపన్ జాలకయున్న బ్రహ్మ వివరింపం బూని వారాశిపైఁ
గర మొప్పన్ మషిముద్ర వైచె నదియే కాకున్న నీలచ్ఛవిన్
ధరియింపం గత మేమి? యేటికి సముద్రఖ్యాతి మున్నీటీకిన్? 49
సీ. శ్రుతివిశంకటరవస్ఫుటసరస్వత్యాప్తి భువనాంచితక్రియాస్ఫురణఁ దనరి
శ్రితపరక్షోణిభృత్సుతరక్తిఘనవిసర్జనయుక్తి గాంభీర్యసరణి మెఱసి
శ్రీవిలాసాస్పదస్థితి సముజ్జ్వలమౌక్తికాదిరత్నవిభూతి నధిగమించి
చటులసత్వప్రశస్తత మహాభంగలీలారూఢికలన నంతంతఁ బొంగి
తే. హరిని లోపలఁ బూని మర్యాద నూని, యఖిలవస్తువిధానవిఖ్యాతి నధిక
విక్రమసమృద్ధి జలరాశివిధము దోఁపఁ, దగుద్విజ క్షత్ర వైశ్య శూద్ర జన మచట. 50
క. కటవిగళన్మదలహరీ, పటల మురుల గిరుల సిరులఁ బ్రబలుఁ బురి మదో
త్కటముల కెటువలె దీటగు, నట నష్టత నావహించు నాశాగజముల్. 51
క. మొదలఁ దనతేజి మద మఱి, కదియ నదరి పొదల సొర నగరహయజవసం
పద కొదిఁగి తాను పడి చెడి, పదరింఖారేణుపటలిఁ బవనుఁడు గలసెన్. 52
తే. చక్రసంయుక్తిఁ జక్రివేషంబు బోలి, కేతువిస్ఫూర్తి గ్రహశాస్త్రరీతిఁ బోలి
లలితగంధర్వగతి సురాచలముఁ బోలి, యందుఁ జెల్వందు స్యందనబృంద మెపుడు.53
మ. కళుకుంగెంపులవాతెఱల్ బలరిపుగ్రావమ్ములం గప్పుఁగొ
ప్పులు వజ్రమ్ములదంతముల్ మెఱుఁగుఁ గ్రొమ్ముత్యంపురాలన్ నఖం
బులు గల్పించి యజుం డొనర్చె రతనంపుంబొమ్మలన్ ఖ్యాతి వీ
రలకుం గల్గ నటంచు నెంచ గణికల్ రాణింతు రాప్రోలునన్.54
తే. తావి గులికెడుపారిజాతంపువిరుల, సరులు సిగఁ జుట్టి సురతానుసరణలీల
మీకుఁ జేకూర్తు మే యని మృదులఫణితి, విటులఁ దేల్తురు పుష్పలావికలు వీట. 55
క. సారవకైరవసారస, సౌరభగౌరవవిహారసారసమీరా
గారములు పురవనీశృం, గారములు శుకాదికోపకారము లలరున్. 56
మ.ఇన్ని తెఱంగులం గణుతి కెక్కినతత్పురిఁ బ్రోచు రత్నసం
ఛన్నకిరీటనూత్నజలజప్రియదీప్తిముఖాబ్జసంస్మితా
భ్యున్నతచంద్రికైకసమయోదితపాదనతాననాంబుజో
ద్యన్నయనోత్పలోల్లసనతాద్భుతధాముఁడు రాముఁ డెప్పుడున్.57
శా. ఆరామక్షితిపాలమౌళి సమరాహంకారనిశ్శంక లం
కారక్షఃప్రభుకంఠలుంఠనకళాఖండప్రచండాంబకా
సారప్రాప్తయశఃప్రతాపకలనాంచద్గంధకాశ్మీరచ
ర్చారంజద్దశదిగ్వధూనిచయుఁ డై సామ్రాజ్యముం జేయఁగన్.58
శా. శోకక్రోధజరావిరోధమదసంక్షోభప్రలోభార్తిహృ
ద్వైకల్యజ్వరపీడనేతరవధూవ్యామోహకృత్కామలీ
లాకార్శ్యంబులు క్షుత్పిపాసలు దురలాపాలు మర్త్యాళియం
దేకాలంబున నైనఁ గానఁబడవయ్యెన్ రామరాజ్యంబునన్. 59
సీ. కడకంటఁ గనుఁగొన్నఁ గడకంటఁగ నశించు దమితదౌర్గత్యాంధతమసపటలి
బలుకేల విలు గొన్నఁ బలు కేల యనకపో రతిభీతి నఖిలలోకాధిపతులు
వెఱ వీడుకొను మన్న వెఱవీడులే కొందుఁ గృపణుండు నిరుపాధికపుఁబదవికిఁ
జను వింత మొనయింపఁ జనువింతబలిముఖప్రముఖతిర్యగ్యోనిభవుల కైన
తే. నధికకారుణ్యరౌద్రాభయప్రదాన, సత్యసన్మానముల నేరు సాటి యనుచు
జగములు నుతింప రఘుకులస్వామి దాల్చె, నిజభుజభుజంగవిభులీల నేల యెల్ల. 60
వ. ఇత్తెఱంగున నత్తరణికులసుధార్ణవపూర్ణిమాచంద్రుండు నిస్తంద్రకీర్తిప్రభాసాం
ద్రుండై ప్రజారక్షణం బొనర్చుచు నొక్కనాఁడు వేఁడివెలుంగుఱేఁడు పొడుపుఁ గొం
డదండ దండిఁజెందకయ ముందర బృందారకతరుప్రసవమరందబిందునిష్యందకంద
ళితవచోరచనాభినందివందిస్తవంబులవలన మేలుకొని కాలోచితకృత్యంబులు నిర్వ
ర్తించి రత్నభూషణాలంకృతశరీరుం డయి జానకీకంజనయనాంజనేయులు వామ
దక్షిణభాగంబుల రాఁ గైదండ గొని చండప్రభామండలదండితరవిమండలంబులగు
కుండలంబుల మెండుకొనుమెఱుంగులు మొగంబునందు ఱంగలించు తెలినగవులు పాల
కడలికడ నల్లికొని యుల్లసిల్లుప్రవాళవల్లికలచెల్లుబడి కొల్లలాడ నాడాడ నిద్దంపు
నీలంపుగుంపులసొంపు నింపం జాలునెమ్మేని క్రొమ్మొగులుడాలునకు జాళువాచేలచెఱం
గులయొఱపు మెఱుంగులతెఱంగు నెఱప సరసపదవిన్యాసంబునఁ గొన్నికొన్ని
కక్ష్యాంతరంబు లతిక్రమించి ముందర మందాకినీసముల్లోలకల్లోలకేళీవిలోలామరలో
లాక్షీవిలాససూచకోదంచితకాంచనస్తంభసంభృతచిరత్నస్థగితపాంచాలికాప్రతి
బింబవిడంబనాడంబరనిధానసుధాకరశిలామిళదిలాతలంబును, అగణితగుణఘనప్ర
ఘణోపగతోపకారికాకదంబసంబంధసుగంధగంధిలసౌగంధికబంధురిత
వితానప్రతానమధువ్రతాయమానసునాశీరోలోపలగోపానసీప్రభాపరివృతంబును,
ప్రస్ఫురత్స్ఫటికదృషత్పటలఘటితాభోగకుడ్యభాగవిచిత్రచిత్రాయమాన
నానావిధశారికాకీరికామయూరికాదిగృహోచితవిహగకులకలరవాకలితం
బును, ప్రత్యహర్ముఖప్రత్యయప్రదేశప్రవేశనార్పణప్రవణవివిధధరణీత
లాధ్యక్షవక్షస్స్థలన్యస్తకస్తూరికాదిప్రవిమలపరిమళచర్చితప్రాంగణంబును,
మౌక్తికరంగవల్లీససమ్మర్ధవితర్దికాప్రకాశితంబును నై నీటుగులికెడు కొలువుకూ
టంబున కేతెంచి పద్మరాగమయభద్రాసనంబున నాసీనుం డై వామపార్శ్వప్ర
దృశ్యమానజానకీనయనచకోరంబులకు నిజముఖేందుమందస్మితచంద్రికలు విందు
పొందుపఱపఁ దనపురోభాగంబునఁ బురందరధనుర్విభాలవాలం బగువాలంబు
పరివేష్టించుకొని నిశ్చలదృష్టిం గనుంగొనుభవిష్యత్సృష్టిపతి దయాదృష్టి నీక్షించుచు
భరతలక్ష్మణశత్రుఘ్నసుగ్రీవాంగదనలనీలజాంబవద్విభీషణాదిసోదరసేవక
సేవ్యమానుండును, వసిష్ఠవామదేవాదిసాధుజనజేగీయమానుండును, నానాదేశా
ధీశకోటికోటీరరత్నప్రభారాజినీరాజితాంఘ్రిరాజీవవిరాజమానుండును, పాఠక
స్తూయమానుండును నై యాఖండలుమెండున నిండుకొలు వుండుసమయంబున. 61
శ్రీరామునియొద్దకు నగస్త్యమహాముని వచ్చుట
తెరగంటిపగవారి కిరవు చూపినవారిరాశి యెవ్వాని కాపోశనంబు
వెడమాయ లడరించు గడుసురేద్రిమ్మరిబొంది యెవ్వానికి భోజనంబు