10. పరీక్ష
ఆశ్రమ స్థాపన జరిగిన కొద్ది కాలానికే అగ్ని పరీక్షను ఎదుర్కోవలసి వచ్చింది. యిలా జరుగుతుందని నేను ఊహించలేదు. భాయీ అమృతలాల్ టక్కర్ జాబు వ్రాస్తూ “ఒక బీద అంత్యజుని కుటుంబం వాళ్లు మీ ఆశ్రమంలో చేరాలని భావిస్తున్నారు. వారు ఎంతో నిజాయితీపరులు” అని సూచించారు.
నేను కొంచెం నివ్వెరబోయాను. ఠక్కర్ బాపాగారి సిఫారసుతో యింత త్వరగా ఆశ్రమంలో చేరడానికి అంత్యజుని కుటుంబం సిద్ధపడుతుందని నేను ఊహించలేదు. జాబును అనుచరులకు చూపించాను. అంతా అందుకు స్వాగతం పలికారు. ఆశ్రమ నియమావళి ప్రకారం నడుచుకునేందుకు సిద్ధపడితే మీరు సూచించిన అంత్యజుని కుటుంబీకుల్ని ఆశ్రమంలో చేర్చుకుంటామని బాపాకు జాబు వ్రాశాను. దూదాభాయి, అతనిభార్య దానీబెన్, చిలక పలుకులు పలికే చంటిబిడ్డ లక్ష్మీ ముగ్గురూ వచ్చారు. దూదాభాయి బొంబాయిలో ఉపాధ్యాయుడుగా పనిచేస్తున్నాడు. నియమాల్ని పాటిస్తామని తెలిపిన మీదట ఆశ్రమంలో చేర్చుకున్నాం. దానితో మాకు సహాయం చేస్తున్న మిత్రబృందంలో గొడవ బయలుదేరింది. ఆ బంగళాకు సంబంధించిన బావి నుండి నీరు తోడుకోవాలంటే చిక్కులు ఏర్పడ్డాయి. గంజాయి వాడు ఒకడు సమీపంలో వున్నాడు. అతని మీద నీటిచుక్కలు పడ్డాయని అతడు దూదాబాయి మీద విరుచుకుపడ్డాడు. తిట్టడం ప్రారంభించాడు. తిట్టినా ఎదురు చెప్పవద్దని నీళ్ళు మాత్రం తోడుకురమ్మని నేను ఆశ్రమవాసులకు చెప్పాను. ఎన్ని తిట్లు తిట్టినా మారు పలకనందున గంజాయివాడు సిగ్గుపడి తిట్టడం మానివేశాడు. అయితే మాకు వచ్చే ఆర్థికసాయం తగ్గిపోసాగింది. సహాయకుల్లో ఒకరికి అంత్యజుల విషయమై సందేహం వున్నప్పటికీ యింత త్వరగా అంత్యజులు ఆశ్రమంలో చేరతారని వారు ఊహించలేదు. ధనం యివ్వడం మానుకున్నారు. అంత్యజులు త్వరలోనే ఆశ్రమాన్ని బహిష్కరిస్తారని నాకు వార్త అందింది. నేను అనుచరులతో చర్చించాను. “మనల్ని బహిష్కరించినా, ధనసహాయం చేయకపోయినా యీ పరిస్థితుల్లో మనం అహమదాబాదు వదలకూడదని, పాకీవాళ్లు వున్న వాడకు వెళ్లి వుందామని, కాయకష్టం చేసి బ్రతుకుదామని నిర్ణయానికి వచ్చాం. “వచ్చే నెలకు సరిపడ సామ్ము లేదని” మగన్‌లాలు హెచ్చరించాడు. ఏం ఫరవాలేదు, పాకీవారున్న వాడకు వెళ్లి వుందామని చెప్పాను.
ఇలాంటి ఇబ్బందులకు నేను అలవాటు పడిపోయాను. ప్రతిసారి చివరి నిమిషంలో దేవుడే ఆదుకునేవాడు. మగన్‌లాలు డబ్బు లేదని చెప్పిన కొద్ది రోజులకు ఒకనాడు ఉదయం ఎవరో పిల్లవాడు వచ్చి “బయట కారు నిలబడి వున్నది. సేఠ్ మిమ్మల్ని పిలుస్తున్నాడు” అని చెప్పాడు. నేను కారు దగ్గరకివెళ్లాను. “ఆశ్రమానికి సాయం చేద్దామని వున్నది. సాయం స్వీకరిస్తారా?” అని సేఠ్ నన్ను అడిగాడు. “ఏమియిచ్చినా తప్పక తీసుకుంటాను. ప్రస్తుతం యిబ్బందిగా కూడా వున్నది” అని అన్నాను. “రేపు యిదే సమయానికివస్తాను. మీరు ఆశ్రమంలో వుంటారా?” అని అడిగాడు. వుంటాను అని చెప్పాను. సేఠ్ వెళ్లిపోయాడు. మరునాడు సరిగా అనుకున్న సమయానికి బయట కారు హారును వినబడింది. పిల్లలు వచ్చి చెప్పారు. సేఠ్ లోనికి రాలేదు. నేను వారిని కలుద్దామని వెళ్లాను. ఆయన నా చేతుల్లో 13 వేల రూపాయల నోట్లు వుంచి వెళ్లిపోయాడు. ఈ విధంగా సహాయం అందుతుందని నేను కలలో కూడా ఊహించలేదు. సాయం చేసే యీ పద్ధతి కూడా నాకు క్రొత్తే. ఆయన అదివరకు ఆశ్రమానికి రాలేదు. ఆయనను ఒకసారి కలుసుకున్నట్లు గుర్తు. ఆయన ఇప్పుడూ ఆశ్రమంలోకి రాలేదు. ఏమీ చూడలేదు. చేతుల్లో 13 వేల రూపాయల నోట్లు వుంచి వెళ్లిపోయాడు. ఇలాంటి అనుభవం నాకు మొదటిసారి కలిగింది. యీ డబ్బు అందడంవల్ల పాకీవారుండే పల్లెకు వెళ్లవలసిన అవసరం కలగలేదు. సుమారు ఒక ఏడాది వరకు సరిపోయే ఖర్చు నాకు లభించింది.
బయట గొడవ జరగినట్లే ఆశ్రమం లోపల కూడా జరిగింది. దక్షిణ ఆఫ్రికాలో వున్నప్పుడు అంత్యజులు నా యింటికి వచ్చేవారు. భోజనం చేసేవారు. నాభార్య అందుకు ఇష్టపడిందా లేదా అను సమస్య బయలుదేరలేదు. ఆశ్రమంలో దానీబెన్‌ను తోటి స్త్రీలు తేలికగా చూడటం నేను గమనించాను. కొన్ని మాటలు కూడా నా చెవిన పడ్డాయి. బయటివారు ధన సహాయం చేయరనే భయం నాకు ఎప్పుడూ కలుగలేదు. కాని ఆశ్రమంలో ప్రారంభమైన యీ వ్యహారం మాత్రం నన్ను క్షోభకు గురిచేసింది. దానీబెన్ సామాన్య స్త్రీ. దాదూభాయికి వచ్చిన చదువు కూడా తక్కువే. కానీవారు తెలివిగలవారు వారి ధైర్యం చూచి సంతోషించాను. వారికి అప్పుడప్పుడు కోపం వస్తూ వుండేది. అయితే మొత్తం మీద వారి సహనశక్తి గొప్పది. చిన్న చిన్న అవమానాలను సహించమని నేను దాదూభాయికి చెబుతూ వుండేవాణ్ణి. అతడు విషయం గ్రహించేవాడు. దానీబెన్ కూడా అతడు సముదాయించి చెబుతూ వుండేవాడు .
ఈ కుటుంబాన్ని ఆశ్రమంలో వుంచుకోవడం వల్ల ఆశ్రమానికి ఎన్నో అనుభవాలు కలిగాయి. అస్పృశ్యతను ఆశ్రమంలో పాటించకూడదు అని మొదటనే నిర్ణయం అయిపోవడం వల్ల పని తేలిక అయిపోయింది. యింత జరుగుతూ వున్నా, ఆశ్రమం ఖర్చులు పెరిగిపోతూ వున్నా ఆర్థిక సాయం సనాతనుల వల్లే లభిస్తూ వుండేది. అస్పృశ్యత యొక్క మూలం కదిలిపోయిందని అనడానికి అదే నిదర్శనం. యింకా నిదర్శనాలు అనేకం వున్నాయి. అయినా ఒక్క విషయం. అంత్యజులతోబాటు కూర్చొని భోజనాలు చేస్తున్నారని తెలిసి కూడా సనాతనులు ఆశ్రమానికి ఆర్థిక సాయం చేశారు.
ఈ సమస్య మీద ఆశ్రమంలో జరిగిన మరో ఘట్టంతో బాటు ఆ సందర్భంలో బయలుదేరిన సున్నితమైన సమస్యలు, ఊహించని యిబ్బందులు, అన్నీ సత్యశోధన కోసం చేసిన ప్రయోగాలే. వాటినన్నింటిని యిక్కడ ఉదహరించకుండా వదిలి వేస్తున్నందుకు విచారపడుతున్నాను. రాబోయే ప్రకరణాల్లో కూడా యీ విధంగా చేయక తప్పదు. అవసరమైన సత్యాలు వదలవలసి రావచ్చు. అందుకు సంబంధించిన వ్యక్తులు చాలామంది జీవించేయున్నారు. వారి పేర్లు వ్రాస్తే యిబ్బందులు కలుగవచ్చు. అయితే వారి విషయంలో జరిగిన ఘట్టాలు వ్రాసి వారికి పంపడం, వారు అందుకు సమ్మతించి ప్రకటించవచ్చునని అనుమతి యివ్వడం జరిగే పని కాదు. అది ఆత్మకథకు మించినపని. అందువల్ల సత్యశోధనకు సంబంధించినవే అయినా చాలా ఘట్టాల్ని వివరించి వ్రాయడం సాధ్యం కాదని భావిస్తున్నాను. అయినప్పటికి సహాయ నిరాకరణోద్యమ చరిత్ర దాకా భగవంతుడు అనుమతిస్తే వ్రాయలని నా ఆకాంక్ష.