సంగ్రహ ఆంధ్ర విజ్ఞాన కోశము/మొదటి సంపుటము/ఆంధ్ర వాఙ్మయ చరిత్రము - I
ఆంధ్ర వాఙ్మయ చరిత్రము - I (క్రీ. శ. 1503 వరకు) :- ఋగ్వేదమునందును రామాయణ భారతము లందును ఆంధ్రుల ప్రశంస కనవచ్చుచున్నది. మౌర్య చంద్రగుప్తుని కొలువునకు గ్రీకు రాయబారిగా వచ్చిన మెగస్తనీసు ఇండీకాలో ఆంధ్రుల బలప్రాభవములను గూర్చి వ్రాసి యుండెను. క్రీస్తు శకమునకు ముందు వెనుకల సుమారు నాలుగున్నర శతాబ్దుల కాలము ఆంధ్ర రాజులు శాతవాహను లను పేరుతో పెద్ద సామ్రాజ్యమును పాలించి యుండిరి. ఈ విధముగా అతి ప్రాచీన కాలమునుండియు ఆంధ్రజాతి ఉండినట్లు తెలియుచున్నను, ఆంధ్ర భాషయని తరువాత ప్రసిద్ధి వడసిన తెలుగు, మాతృకయైన మూల ద్రావిడమునుండి యెప్పుడు విడివడి ప్రత్యేక రూపమున పరిణామ మొందుటకు మొదలిడెనో చెప్పుటకు వీలుగా కున్నది. శాతవాహను లాంధ్రులైనను తమ శాసనము లందు ప్రాకృతభాషనే వాడి యుండిరి. వారి తరువాత ఆంధ్రదేశమును పాలించిన ఇక్ష్వాకులు, బృహత్ఫలాయనులు, ఆనంద గోత్రికులు, శాలంకాయనులు, విష్ణు కుండినులు, మున్నగువారి శాసనములలో కూడ ప్రాకృతమో, సంస్కృతమో వాడబడియుండెను. కాని యందలి వేపూరు, విరిపఱ, పెణుక పట్టు, తెన్దులూరు, శాన్టికొన్ట, చెన్చేరువు, కంబుగా ళ్చెరువు, కడాకుదురు, మున్నగు గ్రామములు కొన్ని తెలుగు పేర్లుగా కానవచ్చుటయు, శాతవాహన రాజులలో నొకడైన హాలుడు కూర్చిన గాథా సప్తశతిలోని గాధలలో ప్రాకృతపదములనడుమ నక్కడక్కడ పొట్ట, పిల్ల, అత్త, కరణి, పంది మున్నగు తెలుగు శబ్దములు దొర్లియుండుటయు, అమరావతీ స్తూపమునందలి ఒక రాతిపలకపై నాగబు అను తెలుగు ప్రత్యయముతో కూడినమాట గోచరించుటయు చూడ క్రీస్తు శకారంభమునుండియు తెలుగుభాష దేశమున వ్యవహారములో నుండెనని వ్యక్తమగుచున్నది. చాళుక్య రాజులకు, ముందుండిన తెలుగు భాషాపరిస్థితినిగూర్చి యింతకంటె నేమియు చెప్పజాలము, రేనాటి చోళులును, తూర్పు చాళుక్యులును పరిపాలనము నెరపుకాలమున మొదటిసారి శాసనములు తెలుగు భాషలో వ్రాయబడినవి. క్రీ. శ. 7,8 శతాబ్దులందలి తూర్పు చాళుక్యుల శాసనములలో ప్రాకృత భాషా సంపర్కము కొంత అధికముగా కానవచ్చును. తరువాత క్రమముగా ఆప్రాకృతపదముల స్థానమును సంస్కృత సమాసము లాక్రమించినవి. క్రీ.శ. 848లో తూర్పు చాళుక్యరాజైన గుణగ విజయాదిత్యుడు వేయించిన అద్దంకి శాసనములో ఒక తరువోజయు, పిమ్మట కొంత వచనమును వ్రాయబడినవి. కొంచెమించుమించుగా ఆకాలమునకే చెందిన కందుకూరు ధర్మవర శాసనములలో సీసపద్యములు కనబడుచున్నవి. తరువాత క్రీ.శ. 934 నాటి యుద్ధమల్లుని బెజవాడ శాసనములో ఐదు మధ్యాక్కరా పద్యములు చూపట్టుచున్నవి. క్రీ. శ. 1000 ప్రాంతము నాటిదని తలంపబడు విరియాల కామసాని గూడూరు శాసనములో మూడు చంపకమాలలును, రెండుత్పలమాలలును వ్రాయబడినవి. నన్నె చోడుడు కుమారసంభవములో వ్రాసిన
మునుమార్గ కవితలోకం
బున వెలయఁగ దేశికవిత పుట్టించి తెనుం
గును నిల్పి రంధ్రవిషయం
బునఁజన జాళుక్యరాజు మొదలగు పలువుర్.
అను పద్యమంతకు పూర్వమే తెలుగున కవిత్వముండెనను విషయమును వ్యక్తము చేయుచున్నది. ఇరుగు పొరుగు దేశములందు కన్నడము మున్నగు భాషలలో మార్గకవిత్వము వ్రాయబడి ప్రచారము నొందుచుండగా గుణగ విజయా దిత్యుడో, మరేచాళుక్యరాజో తెలుగు దేశమున దేశికవిత పుట్టించి, తెలుగును నిలిపె నని ఈ పద్యమున కర్థము చెప్పవలయును. దీని కనుగుణముగా క్రీ. శ. 9, 10 శతాబ్దులలో వ్రాయబడిన శాసనములలో సంస్కృత వృత్తము లేమియులేక కేవల దేశిపద్యములే గోచరించుచున్నవి. సంస్కృతాభిమానులైన పండితులీ దేశికవిత్వము నంతగా నాదరింపని హేతువున తరువాత తెలుగుదేశమునకూడ మార్గకవితాపద్ధతియే అవలంబింపబడినట్లు తోచుచున్నది. కామసాని గూడూరుశాసనము నందలి పద్యములు ఇందుకు దృష్టాంతములు. లభించిన
ఈపద్యములు రెండుమూడు కంటే నెక్కువగా లేకపోవుట చేతను, పైశాసనములందలి పద్యములు వ్యక్తుల వీరావదానములను, దానములను మాత్రము వర్ణించునట్టి వగుటచేతను వానియందలి సారస్వతగుణమునెత్తిచూపుట కవకాశములేకున్నది. కాని దేశి మార్గములు రెండింట చెప్పబడిన ఏదో యొక రకమైన కవిత్వమును, తరువాత నన్నయ భారతమున నవలంబించిన చంపూ పద్ధతియు అంతకుముందే ప్రచారమున నుండె ననుట కివి నిదర్శన ములుగా నున్నవి. అద్దంకి ధర్మవరము శాసనములు గద్య పద్యములతో కూడియుండుటచే చంపూపద్ధతికి చెందిన వని చెప్పవచ్చును. పైని పేర్కొనబడిన పద్యములేకాక దేశి మార్గమునకుచెందిన పలురకముల పద ములుకూడ నప్పుడు వ్రాయబడుచుండెనని తెల్పుటకు కొన్ని ఆధారములు లభించుచున్నవి. పాల్కురికి సోమనాథుడు పండితారాధ్య చరిత్రమున భక్తులు, తుమ్మెదపదములు, వెన్నెలపదములు, ప్రభాతపదములు మున్నగు పదములు పాడుచుండి రని వ్రాసియుండెను. మరియు నతడు తాను రచించిన బసవ పురాణమునకు “ఆతతబసవపురాతన భక్తిగీతార్థ సమితీయే మాతృక”యని తెల్పియుండెను. ఆతని నాటి కంతబహుళ ప్రచారములోనుండిన పదములును, గీతములును తత్సదృశములైన యితరపద గీతాదులును అంతకు పూర్వము కూడ ప్రచారములో నుండె ననుకొనుటలో విప్రతిపత్తి ఉండదు. క్రీ.శ. 11వ శతాబ్దిలో రచింపబడిన యాప్పి రంగలమ్' అను తమిళ చ్ఛందోగ్రంథమున తత్కర్త పెంచయ్య వ్రాసిన తెనుగు ఛందమును పేర్కొనెను (వాంచియార్ వడఘుచందవుమ్). అప్పటికే తెలుగున ఛందోగ్రంథ మొకటి వెలువడియుండుట అంతకు పూర్వమే ఆభాషలో ఛందోబద్ధమైన రచన విరివిగా నుండెనని చెప్పక చెప్పుచున్నది. కానీ ఆ కవిత్వము గ్రంథస్థము కాకపోవుటచేతను, గ్రంథస్థమైనను మతవైషమ్యాది కారణములచే నష్టమైపోవుటచేతను దాని గుణగణములను నిర్ణయించుటకు వీలు లేక పోవుచున్నది.
ఇట్లు నన్నయకు పూర్వమే కొంత కవిత్వముండెనని నిశ్చయముగా తెలియవచ్చుచుండ నాతడు రచించిన భారతమే తెలుగున ఆదికావ్యమనుటకు హేతువేమి అను ప్రశ్నకు సమాధానము చెప్పవలసియున్నది. ఆతనికి పూర్వముండిన కవిత్వము ప్రధానముగా దేశిమార్గమునకు చెందినది. భాషాచ్ఛందో విషయముల నది దేశిపద్ధతి నవలం బించి సంస్కృత లక్షణమునకు విరుద్ధమై యుండుటచే పండితాదరమును బడయక ప్రాకృత జనైక రంజకమై యొప్పారెను. అట్లుగాక సలక్షణమైన భాషలో దేశీ మార్గములు రెండింటికి చెందిన పద్యములతో నుదాత్త వస్తుకమైన మహాకావ్యమును రచించి నన్నయ పండిత పామరులందరికిని ప్రీతి నాపాదింపజాలెను. ఇంతవరకు లభ్యములైనవానిలో నట్టిరచనతో కూడిన ప్రథమ కావ్య మాతని భారతమే. అందుచేతనే దాని కాంధ్రమున నాదికావ్య మను ప్రసిద్ధి కలిగినది.
ఆ యారంభ దినములలో నన్నయ ఆంధ్రభాష కొనరించిన సేవ యింతింతనరానిది. ఆతడు జనవ్యవహారము నందలి పదజాలము నంతను పరిశీలించి, సంస్కరించి, సంస్కృతపదములను తెలుగున వాడు పద్ధతిని నిర్ణయించి, ధారాళమైన నడక గల కొన్ని సంస్కృత వృత్తములను గ్రహించి, తననాటికే ఉత్తమ కావ్యములతో నొప్పారు చుండిన కన్నడవాఙ్మయమునుండి ప్రశస్తలక్షణములు సేకరించి తెనుగున నుత్తమమైన కావ్యరచనా మార్గము తీర్చిదిద్దెను. ఇది అనన్యసామాన్యమైన అతని ప్రతిభా మహత్త్వమునకు తార్కాణము.
నన్నయ ఆంధ్రభారతమునం దాది సభాపర్వములను, అరణ్యపర్వమునందు మూ డాశ్వసములపయి 142 పద్యములను మాత్రమే రచించెను. అతడు వ్యాసుని సంస్కృత భారతమునందలి కథ ననుసరించినమాట నిజమేయైనను అందు తన కనవసరములని తోచిన భాగములను తగ్గించి, అవసరములని తోచినపట్ల పెంచి, ఔచిత్య దృష్టితో కొన్ని మార్పు లొనరించి, తన కృతిని సర్వవిధముల నొక స్వతంత్ర కావ్యమా అనునట్లు సాగించెను. అతని కవిత్వము ప్రసన్న కథా కలితార్ధ యుక్తికిని, అక్షర రమ్యతకును, నానారుచిరార్థసూక్తి సంపదకును నెలవై వీనులవిందు చేకూర్చుచుండును. ఉదంకోపాఖ్యానము, శకుంతలోపాఖ్యానము, నలోపాఖ్యానము, సౌగంధికాహరణము, రురుప్రమద్వరల కథ మున్నగు వృత్తాంతముల రచించుటలో నాతడు చూపిన నేర్పు అప్రతిమానమైనది. ఆతని కవిత్వము సంస్కృతపద బహుళ మయ్యును క్లిష్టాన్వయములు లేక ధారాశుద్ధికిని ధ్వని గాంభీర్యమునకును నిధానమై చదువరుల కానందము కూర్చు చుండును. ఆంధ్రమున గురుపద్య విద్యకువలెనే గద్యవిద్యకును నన్నయయే ఆద్యుడని చెప్పవచ్చును. అతని వచనము సులలిత పదఘటితమై అతిధారాళమై ఒప్పారు చుండును. అతడు చంపకోత్పలమాలాది వృత్తములనే కాక తరువోజ, మధ్యాక్కర మున్నగు దేశిపద్యములను గూడ వ్రాసియుండెను. ఆంధ్రమున కావ్యములను వ్రాసిన తరువాతి కవులెల్లరు నాతని గురుప్రాయునిగా భావించి కొనియాడియుండిరి.
రాజరాజు మరణించినపిమ్మట కొన్ని రాజకీయ మత సాంఘిక కారణములచే ఆంధ్రభారతరచన కొనసాగుట కంతరాయ మేర్పడెను. రాజరాజు కుమారుడైన కులోత్తుంగచోడుడు తండ్రి తరువాత వేంగీ సామ్రాజ్యమును పాలింపక మాతామహు రాజ్యమయిన చోళరాజ్యమున కధిపతి అయ్యెను. అది తమిళ భాషాప్రచారముగల దేశమగుటచే నాత డచ్చటనుండి ఆంధ్రభాషను పోషించుట కవకాశము లేకపోయెను. క్రీ. శ. 12 వ శతాబ్ది ఆరంభమున కన్నడదేశమున బసవేశ్వరు డవతరించి, వీరశైవ మతమును స్థాపించెను. ఈ క్రొత్తమతము వర్ణాశ్రమ వ్యవస్థనుగాని, వేదప్రామాణ్యమునుగాని ఆంగీకరింపక భక్తి ప్రధానమై యుండెను. దీని ప్రభావము కన్నడ దేశము నుండి క్రమముగా దక్షిణమునం దంతటను ప్రాకెను. ఇట్లొక వంక వీరశైవము వ్యాప్తిచెందుచుండ, ఆంధ్రదేశమున దానికి ప్రతియోగముగా రామానుజ స్థాపితమయిన వైష్ణవముకూడ పెంపొంద నారంభించెను. భక్తిప్రధానములైన ఈ మతముల నవలంబించి తత్ప్రచారమునకై యత్నించు చుండిన కవులు వైదిక మత ప్రధానమైన భారతమును కొనసాగింప పూనిన వారు కాకపోయిరి.
నన్నయ తరువాత చెప్పదగిన తెలుగుకవి నన్నెచోడుడు. ఈతడు నన్నయకు పూర్వుడని కొందరును,సమకాలికు డని కొందరును. తిక్కన తరువాతివాడని కొందరును, నన్నయ తిక్కనల నడిమి కాలము వాడని కొందరును చెప్పుచున్నారు. ఇం దేది సత్యమో నిశ్చయముగా చెప్పుటకు తగిన ఆధారములు లేవు. కాని చివరి వాదమే కొంచెము యుక్తియుక్తముగా కనబడు చున్నది. అనగా అతడు క్రీ. శ. 12వ శతాబ్ది ఆరంభమువాడని చెప్పవచ్చును, ఈ కవిరాజ శిఖామణి వ్రాసిన కావ్యము కుమార సంభవము, ఇందు పండ్రెం డాశ్వాసములున్నవి. శివపురాణము, కాశి దాహిద్భటుల కుమార సంభవములు చదివి, అందలి పార్వతీ పరమేశ్వరుల ప్రణయ వృత్తాంతమునకు తారకాసురవధ యను వీర రసప్రధానమైన కధ సంగముగా జేసి యాతడు రసాలంకార వర్ణన పరిపూర్ణముగా నీ కావ్యమును నిర్మించినాడు. ఇందు కాళిదాసాదుల భావము లచ్చటచ్చట గోచరించుచున్నను మొత్తముమీద నిది స్వతంత్ర కావ్యమనియే చెప్పవలెను. ఇందు కన్నడ కవితా సంప్రదాయములు హెచ్చుగా గోచరించును. తిక్కనాదుల రచనలో తరువాత కానవచ్చు షష్ఠ్యంతములను తెలుగున తొలుదొల్త వ్రాసిన వాడీ నన్నెచోడుడే. ఇతనికి వర్ణన ప్రీతి హెచ్చు. ఇతని వర్ణనలు సహజములును, దేశీయ సంప్రదాయానుకూలములునై మనోహరముగా నుండును. తిక్కన యుద్ధవర్ణనల కితని కావ్యము తుదనున్న యుద్ధవర్ణనమే మేలు బంతియై యుండవచ్చును. రతీమన్మదుల సంభాషణము, పార్వతీ కపటవటువుల సంభాషణము ఈతని సరస సంభాషణ రచనాసామర్థ్యమునకు తార్కాణములు. ఈ విధముగా నీతని కావ్య మాంధ్రమందలి తొట్టతొలి ప్రబంధమని చెప్పదగియున్నది. దేశిమార్గములు, వస్తుకవిత మున్నగు పదముల నాంధ్రవాఙ్మయమున వాడినవా డీత డొక్కడే. వాని నీతడు కన్నడ వాఙ్మయమునుండి గ్రహించియుండెను. ఇట్లే ఈతడు తమిళ వాఙ్మయము నుండి గ్రహించిన దేశీయ సంప్రదాయములును కొన్ని గలవు. ఇతడీ గ్రంథమును తన గురువయిన జంగమ మల్లి కార్జునున కంకితము చేసి, అపారమైన గురుభక్తిని ప్రకటించెను. ఈతని శైలి నన్నయ శైలికంటె నించుక భిన్నమైనది. ఇతడు సంస్కృత సమాసములను సాధ్య మయినంతవరకు తగ్గించి జానుతెను గను పేరుతో చమ త్కార గర్భితము లయిన తెలుగు పలుకుబళ్ళ నెక్కువగా ప్రయోగించెను. ఇతని కావ్యమున నర్థశబ్దాలంకార ప్రీతియేకాక బంధకవిత్వమును, ఛందో వైవిధ్యమును గూడ కానిపించుము. అట్లయ్యు నాతని పద్యముల నడకలో భంగపా టెచ్చటను గోచరింపదు. ఇతని రచనలోలాక్షణికులు వ్యాకరణ విరుద్ధములుగా పరిగణించు కొన్ని ప్రయోగము లచ్చటచ్చట కానబడును. కాని పదభావ సంపదను, రచనా ప్రౌఢిమను, ధారాశుద్ధిని పరికించిచూడ నీతనికిగల కవిరాజ శిఖామణి యను బిరుదమస్వర్ధ మనుటకు సందేహింప బనిలేదు.
మల్లికార్జున పండితారాధ్యుడు (1120-1180) శివ తత్త్వసారము, లింగోద్భవ గద్యము, రుద్రమహిమ, గణ సహస్రమాల, అమరేశ్వరాష్టకము, పర్వత వర్ణనము మున్నగు కావ్యములను రచించినట్లు పండితారాధ్య చరిత్రవలన తెలియుచున్నది. ఈతడు కన్నడ సంస్కృతములందు కూడ పండితుడగుటచే నిందు కొన్ని ఆ భాషలలో రచింపబడినవి కూడనై యుండవచ్చును. శివతత్త్వసారము శివా ! అజా ! రుద్రా! మహేశా ! అను సంబోధనములతో కూడిన కందపద్యములలో రచింపబడినది. ఇందలి పద్యముల సంఖ్య కొన్ని వందలున్నను స్వభావమునుబట్టి దీనిని శతకమనియే చెప్పవచ్చును. సోమనాథుడు దీనిని శతకమనియే పేర్కొనెను. మల్లి కార్జున పండితు డిందు శివదీక్షను గూర్చియు, పాశుపతశైవ సిద్ధాంతములను గూర్చియు విపులముగా వర్ణించినాడు. ఇంద ద్వైతుల మాయావాద మనేక యుక్తులచే ఖండింప బడినది. ఇత డచ్చటచ్చట వేదములనుండి కూడ ప్రమాణములను చూపుచు అద్వైత పరములైన వాక్యములకు సైతము ద్వైతపరముగా నర్థము చెప్ప యత్నించెను. శివతత్త్వసారమునందలి శైలి లక్షణానుగుణమై పెక్కు విధముల నన్నయ శైలినే పోలియుండును. వలపలగిలక ప్రాసము, కొన్ని వింతశబ్దములు ప్రయోగము ఈ గ్రంథమున కలవు. కాని మొత్తముమీద పండితుడు మతమున వలెనే రచనమునకూడ సంప్రదాయానురక్తినే యెక్కువగా ప్రకటించెను.
దేశి మార్గమునకు చెందిన ద్విపద కవిత్వమునకే కాక శివకవి సమూహమునకును, వీరశైవమత సిద్ధాంతములకును గురుపీఠ మని చెప్పతగినవాడు పాల్కురికి సోమనాథుడు. (క్రీ. శ. 13 వ శతాబ్ది ఉత్తరార్ధము) ఇతడాంధ్ర సంస్కృత కర్ణాట భాషలు మూడింటను గ్రంథములు రచించెను. అందు బసవపురాణము, పండితారాధ్య చరిత్రము, సోమనాథ స్తవము, అనుభవసారము, చెన్నమల్లు సీసములు, వృషాధిప శతకము, ఒనవి దాహరణము అనునవి తెలుగు కృతులు. వీటిలో బసవపురాణ పండితారాధ్య చరిత్రలకును, వృషాధిప శతకమునకును విశేష ప్రఖ్యాతి కలదు. బసవపురాణము, వీరశైవ మత ప్రతిష్ఠాపకుడైన బసవేశ్వరుని జీవిత చరిత్రము. ఇందు ప్రసక్తారు ప్రసక్తముగా పలువురు శివభక్తుల చరిత్రలు కూడ వర్ణితములైనవి. సొమనాథు డిందలి వస్తువును వృద్ధులనుండియు, ప్రాచీన భ్యక్తులు బసవేశ్వరుని గూర్చి రచించిన గీతముల నుండియు గ్రహించినట్లు తెల్పి యున్నాడు. శివతత్త్వ సారమున సంగ్రహముగా చెప్పబడిన శివభక్తుల చరిత్రములు బసవపురాణ పండితారాధ్య చరిత్రములందు విపులముగా వర్ణింపబడినవి. బసవేశ్వరుడును, ఇతర భక్తులును ఒనరించిన లోకోత్తరములైన కార్యము లెన్నో ఇందు వివరింపబడినవి. ఇందలి బెజ్జ మహాదేవి కథ, కన్నప్ప కథ, సూరసానమ్మ కథ, చిరు తొండనంబి కథ మిక్కిలి రసవంతములై ఉండును. శ్రీనాథుని హరవిలాసమునందలి సిరియాళుని కథ కిందలి చిరుతొండ నంబి కథయే మాతృక. ఆంధ్రదేశముననే కాక కర్ణాట దేశమునకూడ మత గ్రంధముగా బసవ పురాణమున కమితమైన ప్రచారము కలదు. ఇది కన్నడ, తమిళములలోనికే కాక సంస్కృతమునకు కూడ పరివర్తనము చేయబడినది. దీనికి తెలుగున మూడు పద్యరూపానువాదములు కలవు. పండితారాధ్య చరిత్రము నందు శైవమతమున కాచార్యుడని చెప్పదగిన మల్లి కార్జున పండితారాధ్యుని జీవిత చరిత్రము వివరింపబడినది. ఇది సోమనాథుని రచనలోని కెల్ల కడపటిదైనను కవితా పాటవమునం దగ్రగణ్యమైనది. పండితుడు వెలనాటి చోడుని సభలో జైన బౌద్ధ చార్వాకాది మతముల ఖండించి వీరశైవమును ప్రతిష్ఠించిన వృత్తాంత మిందలి ప్రధాన విషయము. ఇందు దీక్షా పురాతనవాద మహిమ పర్వత ప్రకరణములు అను నైదు ప్రకరణము లున్నవి. ద్విపదచ్ఛందోబద్ధమైనను మహాకావ్య లక్షణ సమగ్రత యందును, నవరస పరిపోషణమునందును ఈ కావ్యము మిక్కిలి వాసి కెక్కి యున్నది. ఇందు పెక్కు చోట్ల పండితారాధ్యుని కృతులలోని భాగములు యథాతథముగా నుద్ధరింపబడి యున్నవి. సంగీతము, నాట్యము, వైద్యము, రసవాదము మున్నగు విషయములును, వివిధ దేశాచారములును, ఇందు వివరింపబడినవి. దీనిని శ్రీనాథు డాంధ్ర పద్యకావ్యముగను, గురురాజకవి సంస్కృత కావ్యముగను సంతరించి యుండిరి. వృషాధిప శతకము ఒసవా! బసవా! వృషాధిపా! అను మకుటముతో రచితమైన శతకము. ఇందు బసవేశ్వరాదులగు శివభక్తుల చరిత్రములు సంగ్రహముగా వర్ణింపబడినవి. ఇందున్న తమిళ, కన్నడ, మహారాష్ట్ర మణిప్రవాళ భాషాపద్యము లీతని బహుభాషా పాండిత్యమును వెల్లడించు చున్నవి. మనకు లభ్యమగుచున్న శతకములలో మకుట పద్య సంఖ్యా నియమములతో కూడిన ప్రథమశతక మిదియే. ద్విపదచ్ఛందమును మహా కావ్యోపయోగిగా తీర్చిదిద్దిన మహాకవి సోమనాథుడు. ఇతడును నన్నెచోడునివలె జాను తెనుగును వాడినట్లు చెప్పుకొని యున్నాడు. పాఠకుల భావన కించుకైనను విడిచి పెట్టక ఈతడు దేనినైనను విస్తృత తరముగా వర్ణించుచుండును. అందును శివునో, బసవునో వర్ణించు సందర్భమున ఇతని రచన ఆవేళ పూరితమై గిరినదివలె ఉరవడితో ప్రవహించుచుండును. ఇతడు కొన్ని ద్విపదలలో ప్రాసయతిని వాడెను. ద్విపదకు ద్విపదకు తెగ చెప్పవలెనను నియమమును పాటింపక వాని నేక ధారగా నడపించెను. లాక్షణికులు దోషముగా పరిగణించు పదములును, సంధులును, సమాసములును ఇతని రచనలో నచ్చటచ్చట కాననగును. అయ్యు, వస్తుచ్చందో భాషా విషయముల కనవచ్చు దేశీయతయు, వర్ణనాదుల గోచరించు తన్మయతయు, దాని కొక అసాధారణ సౌందర్యమును చేకూర్చుచున్నవి. ద్విపదను రోకంటి పాటగా కాక బహుభంగుల వైవిధ్యముతో నడపించి ఆతడా ఛందమున కఖండమైన ప్రతిష్ఠ సంపాదించెను. అందుచేతనే ద్విపద కావ్యకర్తలలో కాలము చేతనేకాక కవితాప్రతిభచే కూడ నీతని కగ్రస్థానము లభించెను.
క్రీ. శ. 12వ శతాబ్దిలో నాంధ్రదేశమున శైవ వైష్ణవ మతములు రెండును వ్యాప్తిచెంది పలువు రనుయాయుల నాకర్షించెను. వారన్యోన్య దర్శన స్పర్శన భాషణాదులను కూడ నుజ్జగించి ఒండొరుల ద్వేషించుకొనుచు సంఘమున కొంత అలజడి కలిగించిరి. అది చూచి ఆ రెండు మతములవారికి సామరస్యము కలిగింప ప్రయత్నించినవారిలో తిక్కన సోమయాజి ప్రథమగణ్యుడు.(క్రీ. శ. 1210-1290). ఈతని వంశము పండితులకును, మంత్రి దండనాథులకును నెలవై వన్నె వాసిగాంచినట్టిది. ఇతనితాత భాస్కరమంత్రి రామాయణము రచించినట్లు ప్రతీతి. కాని ఆ కావ్య మిప్పుడు లభించుటలేదు. తిక్కన క్రీ. శ. 13 వ శతాబ్ది పూర్వార్థమున నెల్లూరును పరిపాలించిన మనుమసిద్ధికి మంత్రియు, ఆస్థానకవియునై అలరారెను. అతడు తన తొలికృతియైన నిర్వచనోత్తర రామాయణమును ఆ మనుమసిద్ధికే అంకితము కావించెను. ఆ కావ్యము నాతడు చంపూ పద్ధతిని గాక నిర్వచనముగా రచించెను. ఇం దారంభమున నాతనికి కవితారచనమునగల వివిధములయిన అభిప్రాయములు వెల్లడింపబడినవి. ఇది వాల్మీకి రచిత రామాయణో త్తర కాండమున కనువాదము. ఇందు జనాపవాద భీతిచే రాముడు సీత నడవికి పంపుట, సీత కుశలవులను ప్రసవించుట మున్నగు వృత్తాంతములును, రావణాదుల జనన వర్తనాదులును వర్ణింపబడినవి. అనువాద విషయమున తిక్కన యిందు చాల స్వతంత్రత వహించెను. ఇందు విష్ణువు రాక్షసుల వధించిన ఘట్టమున వీరరసమును, సీతాపరిత్యాగ సందర్భమున కరుణరసమును చక్కగా పోషింపబడినవి. ఇందలి శైలి భారతములోని దానివలె నంత పరిపక్వము కాకపోయినను మిక్కిలి రసవంతముగానే యుండును. తిక్కన యిందు రామ నిర్యాణకథ నెందుచేతనో తెనింగింపక విడిచివైచెను. తరువాత దానిని జయంతి రామభట్టను నాత డేకాశ్వాసముగా రచించి భద్రాద్రిరామున కంకితము కావించెను, తిక్కన రచించిన రెండవ గ్రంథము భారతము. ఇం దాతడు విరాటపర్వము మొదలుకొని పదునైదు పర్వములు తెనిగించెను. ఆంధ్రీకరణ విధానమున నిం దాతడు నన్నయపద్ధతినే అవలంబించెను. పాత్ర రసౌచిత్య పోషణమున నాత డిందు ప్రదర్శించిన ప్రతిభ అపారమైనది. కీచకుడు ద్రౌవదిని వలచిన సందర్భమున శృంగారరసమును, ఉత్తర గోగ్రహణము నందును, యుద్ధ పర్వములందును వీరరసమును, స్త్రీ పర్వమునను, అభిమన్యువధ ఘట్టమునను కరుణరసమును, శాంత్యను శాసనములందు శాంతరసమును ఆత డెంతో నిపుణముగా వర్ణించియుండెను. ఉద్యోగపర్వమున కృష్ణుని ముఖమున నాతడు ప్రదర్శించిన రాజనీతి నైపుణ్యము అద్వితీయముగా నుండును. పాండవులయు, ధృత రాష్ట్ర దుర్యోధనులయు, కర్ణశకునులయు, భీష్మ విదుర ద్రోణాదులయు, కుంతీ ద్రౌపదులయు పాత్రముల నాతడు సుస్పష్ట రేఖలతో తీర్చిదిద్దెను. ఆతడు చిత్రించిన కుంతీ ద్రౌపదులలో క్షత్రియ కాంతో చితమయిన మనస్విత నిండారి యుండును. కీచకు నాతడు పాశవమైన కామమునకు వశుడయిన మోహాంధుడుగా కాక విషాద నాయకునిగా చిత్రింప యత్నించి కృతకృత్యు డయ్యెను. మంత్రియు, యుద్ధనీతి విశారదుడును అగుటచే నాతని యుద్ధవర్ణనములు సహజములును, గంభీరములునై నిజముగా యుద్ధము జరుగుచున్నప్పటి వివిధ పరిస్థితులును పఠితలకు సాక్షాత్కరింప జేయును. తిక్కన శైలి ప్రధానముగా సంవాద శైలి. పాత్రల సంభాషణ ద్వారముననే అతడు కథను రమ్యముగా నడిపించుచుండును. అలతి అలతి దేశ్యపదముల వాడుటయందును, రసోచిత పద వృత్త ప్రయోగమునందును ఆతడు మిక్కిలి నిఫుణుడు, ఆంధ్రు లందరును మోదము పొందవలెనను ఉద్దేశముతో నాతడు దీర్ఘ సమాసములను తగ్గించి మార్గము నవలంబించెను. ఆ కారణముచే నతనిరచన తెలుగుతనమున కునికిపట్టయి సరససుందరమయి ముద్దు గొల్పు చుండును. క్లిష్టములయిన ఆధ్యాత్మిక విషయములనుకూడ స్పష్టముగా వ్యక్తము చేయగల శక్తి తెనుగు భాష కున్న దని మొట్టమొదట ప్రదర్శించినవా డాతడే. అతడు తన భారతమును హరిహరనాథ దేవుని కంకితము గావించి, తద్వారమున శివకేశవా భేదమును ప్రచారము చేసి ధర్మాద్వైతమును స్థాపింప ప్రయత్నించెను.
అభినవదండి బిరుదాంకితుడైన మూలఘటిక కేతన తిక్కనకు సమకాలికుడు. ఇతడు సంస్కృతమున దండి రచించిన దశకుమార చరితమును చంపూ కావ్యముగా ననువదించెను. ఇది శృంగార హాస్యముల కాలవాలమై చక్కని సాహన కథలతో నిండారి యుండును, కేతన కథాకథన నైపుణ్య మిందు సర్వతోముఖముగా గోచరించును. ఇదిగాక ఈతడు విజ్ఞానేశ్వరమను ధర్మశాస్త్ర గ్రంథమును, ఆంధ్రభాషా భూషణ మను వ్యాకరణ గ్రంథమును గూడ రచించెను. తెలుగు వ్యాకరణమును తెలుగు భాషలో రచించిన మొదటి లక్షణకర్త ఇతడే. ఇతడు దశకుమార చరితముకు తిక్కన కంకితము చేసి యం దాతని వంశమును, పూర్వులకు చక్కగా వర్ణించెను. కవిత చెప్పి ఉభయకవిమిత్రు మెప్పించితి నని ఇతడు సగర్వముగా చెప్పుకొని యుండెను.
మారన, తిక్కన సోమయాజి శిష్యుడు.. అతడు మార్కండేయ పురాణమును తెనిగించి గోన గన్నా రెడ్డి కంకితముచేసెను. ఇతని శైలి ఆడంబర రహితమై సరసముగా నుండును. తెనుగున తరువాత వెలసిన మను చరిత్రము, హరిశ్చంద్రో పాఖ్యానము, కువలయాశ్వ చరిత్రము మున్నగు ప్రబందములందలి కథావస్తు విందుండియే గ్రహింపబడినది.
ఈ యుగమున వెలసిన పండిత కవులలో అథర్వణా చార్యు డొకడు. ఇతడు భారతము నాంధ్రీకరించెనని ప్రతీతి. ఇది యిప్పుడు లభ్యమగుటలేదు. దొరకిన కొలది పద్యములనుబట్టి ఈతని రచన విరాటపర్వమునుండి ఆరంఖించు ననియు, మిక్కిలి ప్రౌఢమైన దనియు తెలియుచున్నది. అధర్వణకారికావళి అను తెలుగు వ్యాకరణము నీతడు సంస్కృత శ్లోకములుగా రచించెను. ఇతడు త్రిలింగ శబ్దానుశాసన మను చిన్న వ్యాకరణమునుగూడ రచించే నందురు.
క్రీ. శ. 1260 ప్రాంతమున బద్దెభూపాలుడు నీతిసార ముక్తావళి అను నీతిపద్యములతో కూడిన గ్రంథమును రచించెను. సుప్రసిద్ధమైన సుమతికతకమును గూడ నీతడే రచించి నట్లిందు చెప్పబడినది. ఇది ఎంతవరకు సత్యమో తెలియదు. ఇతని పద్యములు సరళసుందరములై పండిత పామర హృదయరంజకములుగా నుండును. తెలుగున వెలసిన మొదటి రామాయణము రంగనాథ రామాయణము. దీనిని రంగనాథుడను కవి వ్రాసి బుద్ధారెడ్డి పేర ప్రకటించెననియు, తండ్రి యుపదేశముచే బుద్ధారెడ్డియే రచించె ననియు ఏతత్కర్తృత్వ విషయమున రెండు వాదములున్నవి.ఆశ్వాసాంతము లందు గోనబుద్ధారెడ్డియే (1200 - 1250) తండ్రియైన విఠలక్ష్మానాథుని పేర నీ గ్రంథమును రచించినట్లు స్పష్టముగా చెప్పబడియుండుటచే ఆవాదమునే పలువురు విమర్శకు లంగీకరించు
చున్నారు. ఇది వాల్మీకి రామాయణము ననుసరించి తెలుగున వ్రాయబడిన ద్విపద కావ్యము. ఇందు కవిజన శ్రుతినుండి గ్రహించి చొప్పించిన అనాత్మికములైన గాథలు కొన్ని గలవు. అందు జంబుమాలి, కాలనేమి. సులోచన అనువారి వృత్తాంతములు ముఖ్యములైనవి. ఇవి ఇందలి కథాభాగమున కెంతో మెరుగు చేకూర్చుచు రసవంతములై యున్నవి. రావణ. విభీవణ, కుంభకర్ణాదుల శీలములును, చిత్తవృత్తులుకు ఇందు చక్కగా వర్ణింపబడినవి. ఇందరి వర్ణనములు మిక్కిలి గంభీరములై ఉదాత్తములుగానుండును. ఇందలి శైలి లాక్షణికమును, ప్రసన్నమునై ద్విపదయయ్యు నెచ్చటను విసుకుగొల్పక చాల మనోహరముగా నుండును. ద్విపద కావ్యములలో శైలీపాటవముచేతను, కథా గౌరవముచేతను రంగనాథ రామాయణమున కొక విశిష్టస్థానము చేకూరినది. ఇందలి ఉత్తరకాండమును బుద్ధారెడ్డి ఆనతిచే ఆతని కుమారులైన కాచవిఠలవిభులు రచించి రామాయణమును పూర్తి కావించిరి. వీరి రచన తండ్రి రచనయంత ఉత్తమము కాకపోయినను రసవంతముగానే ఉండును.
తిక్కన తరువాత యుగకర్త అని చెప్పదగిన వాడు ఎఱ్ఱాప్రెగ్గడ. ఈతని యుగమున వెలసిన తొలికావ్యము భాస్కర రామాయణము. ఇదియును భారతమువలె నైకకవికర్తృక మగుట సంభవించినది. హుళక్కి భాస్కరుడు, అతని కుమారుడైన మల్లి కార్జునభట్టు, శిష్యుడైన కుమార రుద్రదేవుడు, మిత్రుడైన అయ్యలార్యుడు దీనికి కర్తలు. వీరిలో వయః పాండిత్య ప్రతిభలచే పెద్దయైన వాడు భాస్కరుడగుటచే కావ్య మాతని పేరనే వెలయింపబడినది. ఈ రామాయణమున తిక్కన తాతయగు భాస్కరుని రచనకూడ నున్నదని కొందరి తలంపు. అతడు వాల్మీకి రామాయణమును చాల సంగ్రహముగా రచించెననియు, దానితో తృప్తినొందక హుళక్కి భాస్కరాదుల చ్చటచ్చట పెంచి ఈ రామాయణమునకు రూపమొసగిరనియు వారివాదము. వారు చెప్పు హేతువులనుబట్టి చూడ ఈ వాదము కొంత యుక్తి యుక్తముగానే కాన వచ్చుచున్నది. మంత్రిఖాస్కరుని రచన సుందరకాండమువరకు గల అన్ని కాండములందు ఎంతో కొంత కలదని వీనివలన తెలియుచున్నది. హుళక్కి భాస్కరు డారణ్యకాండమును, యుద్ధ కాండమున 1133 పద్యములను రచించెను. ఈతని రచన రెండవ ప్రతాపరుద్రుని అశ్వసేన కధ్యక్షుడైన సాహి ణిమారన (1295-1323) కంకితము జేయబడినది. ఈతని శైలి సమాస భూయిష్ఠమయ్యు, సుబోధమై నన్నయ కవితను బోలియుండును. యుద్ధకాండమున నీతని రచనలో తిక్కన అనుకరణములు గోచరించుచున్నవి. మల్లికార్జునభట్టు తండ్రి అంతకవి కాకపోయినను ప్రతిభావంతుడు.ఇతని రచన బాలకాండమునకంటె కిష్కింధా సుందరకాండములలో శ్రేష్ఠతరముగా నుండును. వాలిభార్య అయిన తార శోకము నీతడు కరుణరస నిర్భరముగా వర్ణించెను. కుమార రుద్రదేవునికి సంగ్రహరచనపై ప్రీతి మెండు. ఇతడు రచించిన అయోధ్యా కాండము భావ సంగ్రహమునకు, భాషామాధుర్యమునకును నెలవై మనోహరముగా నుండును. అయ్యలార్యుడు భాస్కరుడు రచింపగా మిగిలిన యుద్ధ కాండమును పూర్తిచేసెను. ఇతడు ప్రౌఢసమాసములతో కూడిన శైలియం దభిమానము చూపెను. వీరరసప్రధానమైన యుద్ధ కాండమున కాశైలి అనుగుణముగానే ఉన్నది. మొదటినుండి తుదిచాక ఒక చేతిమీద సాగమిచే భాస్కరరామాయణమునందలి శైలి ఏక ధారగా నుండక సమవిషమముగా గోచరించును.
ఎఱ్ఱన రెడ్డిరాజుల ఆస్థానమున నుండిన మహాకవి (క్రీ. శ. 14 వ శతాబ్ది పూర్వభాగము). ఇతడు ప్రతిభా పాండిత్యము లందు నన్నయ తిక్కనల కెనయై భారతారణ్య పర్వశేషమునేకాక హరివంశమునుగూడ సమర్థతతో నిర్వహించి, కవిత్రయములో స్థానము సంపాదింప జాలెను. ఇత డారణ్యపర్వ శేషమును నన్నయ పేరుమీదుగనే తెనిగించి రాజరాజునకే అంకితముచేసెను, ఇది అతనికి సహజమయిన వినయమును, నన్నయపై గల భక్తిని చాటుచున్నది. ఈత డారణ్యపర్వ శేషమును నన్నయశైలితో నారంభించి, తిక్కన శైలితో ముగించెను. అందుచే ఇతని రచన నన్నయ తిక్కనల రచనలు అను మహాసముద్రములను కలుపు జలసంధివలె గోచరించును. ఆరణ్య పర్వమునందలి ఘోషయాత్ర, రామోపాఖ్యానము, సావిత్య్రుపాఖ్యానము, యక్షప్రశ్నలు అను భాగములు మిక్కిలి పేరుగాంచినవి. అరణ్యపర్వ శేషమున ఎఱ్ఱన సంస్కృతాంధ్రములను సమభాగములుగా వాడియుండెను. ఎఱ్ఱన రామాయణమునుగూడ రచించి తన ప్రభువయిన ప్రోలయ వేమారెడ్డికి అంకితము కావించెను. అది ఇప్పుడు లభ్యమగుట లేదు. హరివంశమున నీతని శైలి పరిపక్వము నొందినది. ఇందు శ్రీకృష్ణుని చరిత్రము సంపూర్ణముగా వర్ణింపబడినది. గోకులమును వర్ణించు పట్ల ఎఱ్ఱన జానపద జీవితము నెంతో రమ్యముగా చిత్రించెను. హార్దమైన అనురాగమున కాలంబన మైన సాత్త్విక శృంగారమును వర్ణించుటలో ఎఱ్ఱన మేటి. ఉషానిరుద్ధుల చరిత్రము, రుక్మిణీకల్యాణము, ఇందు మిక్కిలి రసవంతములుగా నుండును. అనువాద విషయమున ఎఱ్ఱన నన్నయ, తిక్కనల మార్గమునే అవలంబించెను. ఎఱ్ఱన రచించిన స్వతంత్ర కావ్యము లక్ష్మీనృసింహ పురాణము. బ్రహ్మాండ పురాణమునుండి వస్తువును గ్రహించి ఎడ నెడ చక్కని వర్ణనలు చేర్చి, దాని నాత డొక హృద్యమైన ప్రబంధముగా సంతరించెను. ప్రహ్లాద చరిత్ర మిందలి ప్రధాన కథ. భక్తి వర్ణనమునం దీతడు పోతన కీడు కాక పోయినను ప్రహ్లాద చరిత్ర వర్ణించుటపట్ల నాతని కీతని రచన ఒజ్జబంతి యయ్యెననుటలో నతిశయోక్తి ఉండదు. ఈతని శైలి సత్త్వశుద్ధికి నెలవై, సత్త్వప్రధానమయిన యితని శీలమున కాదర్శమువోలె గోచరించును. శ్రీనాథుడితని సూక్తి వై చిత్రిని ప్రశంసించెను. ఇతనికి ప్రబంధ పరమేశ్వరు డనియు, శంభుదాసు డనియు బిరుద నామములు గలవు.
విక్రమ సేనము అను కావ్యమును రచించిన చిమ్మపూడి అమరేశ్వరు డీ కాలము వాడే. పలువు రాంధ్రకపు లీతని మహాకవిగా స్తుతించియుండిరి. ఈతని కావ్య మిప్పుడు లభించుటలేదు. విన్నకోట పెద్దన కావ్యాలంకార చూడామణి యను లక్షణ కావ్యమును రచించి రాజరాజు వంశీయుడయిన చాళుక్య విశ్వేశ్వరరాజున కంకితము చేసెను. ఇందు సాహిత్యవిషయములతోపాటు వ్యాకరణ చ్ఛందో విషయములుకూడ నున్నవి. లక్ష్యముల నిచ్చు సందర్భమున నీతడు కృతిపతిని గూర్చి రచించిన పద్యములు రసవంతములుగా నున్నవి. ఉద్దండ రచనా ధురంధరుడని శ్రీనాథునిచే ప్రశంసింపబడిన వేములవాడ భీమకవి ఈ కాలమునందే ఉండెను. ఇతడు కవిజనాశ్రయమను ఛందో గ్రంథమును రచించెరని ప్రతీతి. కాని ఇటీవలి పరిశోధనముల వలన దాని కర్తృత్యము రేచనకే ఆరోపింపబడు చున్నది. భీమకవి రాఘవపాండవీయ మను వ్యర్థికావ్యమును, నృసింహపురాణము, శతకంధర రామాయణము హరవిలాసము మున్నగు బహు గ్రంథములను రచించెనని చెప్పుదురు. కాని అవి యిప్పుడు లభ్యము లగుట లేదు. ఈ చాటువులు మాత్రము కొన్ని లభించుచున్నవి. వానివలన నీతడు ఉత్తమశ్రేణికిచెందిన కవియే అనియు,శాపానుగ్రహ సమర్థు డనియు తెలియుచున్నది. ఇతడు గోదావరి మండలమునందలి ద్రాక్షారామమునకు చెందిన వాడని కొందరును, తెలంగాణము నందలి కరీంనగర మండలమునకు చెందిన వాడని కొందరును చెప్పుచున్నారు. సంస్కృతమున రాజ శేఖరుడు రచించిన విద్దసాలభంజిక అను నాటకము ననుసరించి మంచన (1350) కేయూర బాహు చరిత్రమను కావ్యమును రచించి నండూరి గుండయామాత్యుని కంకితము చేసెను. విద్ధసాలభంజిక యందలి పెక్కు పేర్ల నీతడు మార్చుటయేకాక ప్రసక్తాను ప్రసక్తముగా పంచతంత్రమునందలి కథలను బోలిన కథల నిందు చొప్పించెను. ఈతనిది క్లిష్టాన్వయములు, దీర్ఘ సమాసములులేని మనోహరమైన కధనశైలి.నీతి మంతములయిన కల్పితకథలనింత మనోహరముగా వ్రాసినవారు పూర్వులలో కానరారు.
ఈ యుగమునందలి కవి మండలిలో నెఱ్ఱనతో సాటికి, పోటీకి నిల్వజాలువాడు నాచన సోమనాథుడు (1370). ఈతడు హరివంశమునందలి ఉత్తరభాగమును ఉత్తర హరివంశమను పేర రచించి, హరిహరనాథుని కంకితము చేసెను. ఈతడు పూర్వహరివంశమును వ్రాసెనో లేదో తెలియదు కాని ఉత్తర హరివంశమునందలి యారంభమును జూచిన దానినికూడ రచించినట్లే తోచును. ఇతడు వసంత విలాసమును, హరవిలాసమును రచించెనని చెప్పుదురు. కాని అవి లభ్యము లగుటలేదు. ఉత్తర హరివంశము ఆరాశ్వాసముల ప్రబంధము మూలము నందలి .రసవత్తరములైన భాగములను మాత్రమే గ్రహించి కొన్ని మార్పు చేర్పు లొనరించి అతడీ గ్రంథము నొక స్వతంత్ర గ్రంథముగా సంతరించెను. ఎఱ్ఱన విడిచిన హంస ఉభకోపాఖ్యానము నీతడు విపులముగా వర్ణించెను.
రసపోషణమున నీతడు మిక్కిలి నేర్పరి. ఊర్వశీ నరకాసురుల సంభాషణము ఉషా నిరుద్ధులకధ యీతని శృంగార రసపోషణాభిని వేశమునకు నిదర్శనములు. రశావేశ పరవశుడై ఈత డొక్కొక్క యెడ ఔచిత్యమునకు భంగము కలిగించునని చెప్పినను దోషముండదు. నరకాసుర సంహారమున వీరశృంగారముల కీతడు ఉచితమైన మేళనము కల్పించెను. యుద్ధవర్ణకములం దీతడు తిక్కనను తలపించును. వీరశృంగారములనే కాక రౌద్రకరుణ హాస్యములను కూడ నీతడు చక్కగా పోషించెను. ఇతనికి సర్వజ్ఞ, సకలభాషాభూషణ, సాహిత్యరసపోషణ, సంవిధాన చక్రవర్తి, నవీన గుణసనాథ బిరుదములున్నవి. కథాకల్పనమందును, వర్ణనములందును ఇతడు పురాణ పద్ధతిని విడిచి ప్రబంధ మార్గము ననుసరించెను. ఈతని శైలి శబ్దార్ధాలంకార భూయిష్టమును, దీర్ఘ సమాస బంధురమునై ఓజోగుణమున కాదర్శముగా నుండును. ఎడ నెడ ఈతడు వాడు లోకోక్తులు, సామెతలు మిక్కిలి మనోహరములుగా నుండును. ఇతని ధారాశుద్ధి చాల గొప్పది. ఇతని వచనములు కొన్నిచోట్ల దీర్ఘతరములై యమకాను ప్రాసాదులతో కూడి క్లిష్టముగా నుండును. రసపోషణమున నీత డెఱ్ఱనతో సమానుడేయైనను ఔచిత్య పోషణమునందును, ఆవేశ నిగ్రహమునందును, ఆతని కీడు కాజాలడు.
రావిపాటి త్రిపురాంతకుడను కవికూడ రెండవ ప్రతాపరుద్రుని కాలమున నుండెనని విమర్శకులు తలంచు చున్నారు. ఇతడు సంస్కృతమున ప్రేమాభిరామమను వీధి నాటకమును, తెలుగున అంబికా శతకము, చంద్ర తారావళి, మదన విజయము, త్రిపురాంతకోదాహరణము అను గ్రంథములను రచించెను. శ్రీనాథుని క్రీడాభిరామమునకు మూల మీతని ప్రేమాభిరామమే. ఇతడు శివభక్తి పరాయణుడు, అంబికా శతకమున నీతడు శివపార్వతుల శృంగారమును భక్తి సమ్మిళితముగా వర్ణించెను. మదన విజయము కామశాస్త్రమునకు సంబంధించిన గ్రంథముగా కానవచ్చుచున్నది. ఇతని త్రిపురాంతకోదాహరణమునకు, ఆజాతి వాఙ్మయమున అత్యుత్తమ స్థానమున్నది. ఇందీతడు సమాసాడంబరము లేని చక్కని శైలిలో కుమారగిరి మందిరుడైన శివుని ప్రస్తుతించి యుండెను. ఆంధ్రవాఙ్మయమున ఎఱ్ఱన యుగముతో పురాణ పరివర్తనము సన్నగిల్లినది. తరువాతియుగమున కొందరు కవులు సంస్కృత కావ్య నాటకానువాదమునకును, కొందరు స్వతంత్ర కావ్యరచనకును ఆరంభించిరి. ఈ యుగమునకు కర్త అని చెప్పదగినవాడు శ్రీనాథ కవిసార్వభౌముడు. ఆంధ్రమున కవిత్రయము తరువాత వారితో సమానమైన కీర్తిప్రశస్తులను సంపాదించిన వా డీమహా కవియే. దాని కీతని బహుగ్రంథకర్తృత్వమును, అసామాన్య పాండితీ ప్రతిభలును, నిరర్గళ ప్రౌఢ శైలియు కారణములు. ఇతని రచనలలో మరుత్తరాట్చరిత్రము, సప్తశతి, పండితారాధ్య చరిత్రము నష్టములై పోయినవి. శృంగార నైషధము, భీమఖండ కాశీఖండములు, హర విలాసము, క్రీడాభిరామము, శివరాత్రి మహాత్మ్యము, పల్నాటి వీర చరిత్రము అనునవి లభించుచున్నవి. శృంగార నైషధము సంస్కృతమునందలి శ్రీహర్షుని నైషధ కావ్య మున కనువాదము. ఔచిత్యము పాటించుచు, అనౌచిత్యము పరిహించుచు నత డీ అనువాదమున చూపిన నేర్పు అనితర సామాన్యమై ఉన్నది. ఈ కావ్య మా మహాకవి ప్రౌఢశైలికిని, పాండిత్య ప్రకర్షకును నికషోవలమని చెప్పతగి యున్నది. ఇందలివస్తువు నలదమయంతుల పరిణయ వృత్తాంతము. భీమఖండమున గోదావరీ మండలమునందలి ద్రాక్షారామ భీమేశ్వర క్షేత్ర మాహాత్మ్యము వర్ణింపబడినది. దీనికి మూలము స్కాందపురాణము. శ్రీనాథు డిందా క్షేత్రమును తత్పరిసర ప్రదేశములను ఎంతో విశదముగా వర్ణించి తన ఆంధ్రాభిమానమును ప్రకటించినాడు. వ్యాసుడు కాశి విడిచిన వృత్తాంతము, హాలాహల భక్షణము సరసముగా వర్ణింపబడినవి. కాశీ ఖండమున సుప్రసిద్ధ శైవ క్షేత్రమయిన కాశీ క్షేత్ర మహాత్మ్యము వివరింపబడినది. ఇదియు స్కాందపురాణము నుండియే గ్రహింపబడినది. శ్రీనాథుడు పెదకోమటి వేమునితో కాశీయాత్ర కేగి, అందలి తీర్థదేవతాదులను నిశితముగా పరిశీలించియుండుటచే నిందలి వర్ణనలకు కూడ నెంతో సహజత్వ మలవడినది. క్షేత్రమాహాత్మ్య రూపములై పురాణప్రాయములయిన ఈ రెండు గ్రంథములకును శ్రీనాథుడు తన ప్రతిభాపాటవముచే సుందర మయిన కావ్యత్వము నాపాదింపజాలెను. కాశీఖండమున
వింధ్యగర్వాపహరణము, గుణనిధి చరిత్ర, వ్యాసుడు కాశిని బాసిన కథ, సుశీల చరిత్ర సరసముగా వర్ణింపబడినవి. ఇం దీతని శైలి ప్రౌఢతా పరాకాష్ఠను చెందినది. హరవిలాసము, శివుని విలాసములను వర్ణించు కావ్యము. చిరుతొండ నంబికథ, పార్వతీ పరిణయము, దారుకా వనవిహారము, హాలాహల భక్షణము, కీరాతార్జునీయము, ఇందు వర్ణింపబడిన విలాసములు. చిరు తొండనంబికధను శ్రీనాధుడు పాల్కురికి సోమనాథుని బసవపురాణమునుండి గ్రహించి, పెంచి ఎంతో సరసముగా వర్ణించెను. పార్వతీ పరిణయము కాళిదాసుని కుమారసంభవమునందలి 3, 4, 5 సర్గము లందలి భాగములకు సంగ్రహానువాదము. మిగిలిన వాతని స్వతంత్ర రచనలే. శ్రీనాథుని స్వతంత్ర రచనా సామర్థ్యమును, శైలీసౌష్ఠవమును హరవిలాసమునందే హెచ్చుగా కాంచనగును. శివరాత్రి మాహాత్మ్యమున సుకుమారుని కథ కలదు. పల్నాటి వీరచరిత్ర, పల్నాటి వీరుల శౌర్యమును వర్ణించు జాతీయ ద్విపద కావ్యము. బాలచంద్రుని శౌర్య మిందు విశదముగా వర్ణింపబడినది. శ్రీనాథుడు పండిత రంజకమయిన ప్రౌఢరచనయందు వలెనే పామరరంజకమైన దేశీయరచనయందుకూడ మహా నిపుణుడనుట కీ కావ్యము నిదర్శనము. క్రీడాభిరామము గోవింద మంచనశర్మ, టిట్టిభ సెట్టి అను మిత్రుల సంభాషణ రూపమున వెల్వడిన శృంగారవర్ణనలతో కూడిన కావ్యము. ఇందు రావిపాటి త్రిపురాంతకుని ప్రేమాభిరామము ననుసరించి ఆనాటి ఓరుగంటినగరము చక్కగా వర్ణింపబడినది. ఇది వినుకొండ వల్లభరాయ కృతమని అందున్నది కాని ప్రతిపద్యమునందు శ్రీనాథుని ముద్ర స్పష్టముగా కానవచ్చుటచే నతడే దానిని వ్రాసి వల్లభరాయని పేర ప్రకటించియుండునని యూహింపవచ్చును. శ్రీనాథుడు వివిధదేశములను, వివిధ రాజాస్థానములను దర్శించినప్పుడు చెప్పిన చాటువు లెన్నో ఉన్నవి. అవి ఆతని నిశిత పరిశీలనమును, పరిహాస ప్రియత్వమును స్వేచ్ఛావర్తనమును వ్యక్తము చేయుచున్నవి. శ్రీనాథుని శైలి ప్రౌఢ గంభీరమయినది. ఈతని పద్యముల నడక మత్తేభయానమున కెనయై చదివిన కొలది చవులూరించుచుండును. ఈతడు కావించిన బహుప్రయో గము లీతనికి వ్యాకరణాది శాస్త్రములందు గల పాండిత్యమును వెల్లడించుచున్నవి. ఈతని కావ్యములు పెద్దనాదుల కొజ్జబంతులై ప్రబంధ నిర్మాణమునకు దారి చూపిన వనుటలో నతిశయోక్తి లేదు.
మహాభక్తుడును, కపి శిరోమణియు నైన బమ్మెరపోత రాజు శ్రీనాథునికి సమకాలికుడేకాక బంధువుకూడ నని చెప్పుదురు. (1400-1450) ఇతడు రచించిన గ్రంథములు మూడు. భోగినీ దండకము, వీరభద్ర విజయము. శ్రీమదాంధ్ర మహా భాగవతము. వీరభద్రవిజయ కర్తృత్వ విషయమున భిన్నాభిప్రాయములు కలవు. కాని భాగవతశైలికిని, అందలి శైలికిని గల సామ్యమునుబట్టి విమర్శకులది ఆతడు బాల్యమున రచించిన కవిత్వమై యుండునని భావించుచున్నారు. ఇది దక్షాధ్వర ధ్వంసమును వర్ణించు ప్రబంధము. భోగినీదండకము నందలి శైలి సర్వదా పోతన దానివలెనే యున్నది. ఇందలి వస్తువును బట్టి ఇది ఆతని యౌవనమందలి రచన యని చెప్పవచ్చును. ఇంక మూడవదియగు భాగవతము ఆంధ్ర వాఙ్మయమునకు అలంకార ప్రాయమైనది. ఆంధ్రమున మహా భారతమునకుకూడ దీనికున్నంత ప్రచారమును, విశ్వజనీనతయు లేదని చెప్పవచ్చును. దాని కిందలి మధుర మంజుల మైన శైలియు, భ క్తిరసమయమయిన వస్తువును కారణములు. ఇది సంస్కృతమున వ్యాసుడు రచించిన భాగవత పురాణమున కాంధ్రీకరణము. ఆంధ్రీకరణమున పోతనయు కవిత్రయము వారి పద్ధతినే అవలంబించెను. కాని ఈతడు సహజముగ భక్తుడగుటచే భక్తుల చరిత్రములను వర్ణించు నప్పుడును, భక్తి తత్త్వాదులను వివరించు నప్పుడును ఆవేశపరుడై గ్రంథమును మూలముకంటె విస్తృత తరము గావించియుండెను. ఇందు పండ్రెండు స్కంథములున్నవి. కాని పోతరాజు రచించిన గ్రంథమున కొంతభాగము శిథిలమై పోవుటచే ఆ శిథిలిత భాగముల నితరులు పూరించిరి. వీరిలో ఏర్చూరి సింగన షష్ఠ స్కంధమును, గంగన పంచమ స్కంధమును, వెలిగందల నారయ ఏకాదశ, ద్వాదశ స్కంధములను రచించినట్లు తెలియుచున్నది. తృతీయ, చతుర్ధ, దశమస్కంధో త్తర భాగములందుగూడ నచ్చటచ్చట నారయ రచనమున్నదని చెప్పుదురు. 'భాగవతమున విష్ణుని ఏక వింశత్యవతారములు వర్ణింపబడినవి. ఇం దా దేవుడు భక్తులను రక్షించిన గాథలును, రాక్షసులను సంహరించిన వృత్తాంతములును, సర్గ ప్రతిసర్గ రాజవంశ మన్వంతరముల చరిత్రములును విపులముగా వర్ణింపబడినవి. గజేంద్ర మోక్షము, ప్రహ్లాద వామనచరిత్రలు, ధ్రువాంబరీషుల ఉపాఖ్యానములు, రుక్మిణి కల్యాణము మున్నగు నిందలిభాగము లాంధ్రమున ఆ బాల విదితములైనవి. ఇందు కర్మజ్ఞాన మార్గముల ప్రసక్తి కూడ లేకపోలేదు కాని భక్తి మార్గ ప్రశంస హెచ్చు. ఇందలి దశమస్కంధమున శ్రీకృష్ణుని బాల్య క్రీడాదు లెంతో మనోహరముగా వర్ణింపబడినవి. పోతన ఇందు గోపికల మధురభక్తిని హృదయరంజకముగా వర్ణించెను. ఇందు పోతన ఆత్మీయాంశ మెక్కువగా గోచరించును. అందు చేతనే ఈ భాగ మద్భుతమైన ఒక గీతి కావ్యము (Lyric) వలె కానవచ్చును. పోతన వర్ణనలు మిక్కిలి విశదములై వర్ణ్యమును పఠితలకు సాక్షాత్కరింప జేయుచుండును. ఇతని శైలి అతిమధురమైనది. తెలుగుభాషకు నిసర్గమైన సంగీత మాధుర్యము లీతని కావ్యమున సర్వతోముఖముగా గోచరించును. ఇతని కలంకార ప్రీతిమెండు. వర్ణన సందర్భముల నీత డంత్యానుప్రాసముల నధికముగా వాడుచుండును. అందుచే నీతని కవిత మృదంగధ్వన్యనుగతమైన మృదుల సంగీతము వలె వినిపించును. పండితులనక, పామరులనక, వృద్ధులనక, బాలురనక స్త్రీలనక, పురుషులనక ఎల్ల ఆంధ్రుల ప్రీతిని చూరగొన్న మహాకావ్యము భాగవతము. నారయాదులు తమ రచనలందు పోతననే అనుకరింప యత్నించిరికాని ఆందు కృతకృత్యులు కాజాలకపోయిరి. వీరు మువ్వురిలో సింగన మిగిలిన యిరువురికంటె సమర్థుడుగా కానిపించును.
జక్కన విక్రమార్క చరిత్ర మను కథా కావ్యమును వ్రాసి దేవరాయల కడ గణకుడుగానుండిన సిద్ధనా మాత్యున కంకితము చేసెను (1406-1422). ఈతడు మంచి పండితుడేకాక అవధాన నిర్వహణాది ప్రజ్ఞలుకూడ కల్గిన వాడు. ఈ కావ్యమున శకప్రవర్తకుడైన విక్రమార్కుడను మహారాజు చేసిన అద్భుతకృత్యములు వర్ణింపబడినవి. ఇందలి వీరాద్భుత రసమయములైన విచిత్ర, కథా వృత్తాంతము అప్పటివారి కట్టి గాథలపై గల మక్కువను ' వ్యక్తము చేయుచున్నవి. ఇందలి శైలి సరళమై రసవంతముగా నుండును. ఋతువులను వర్ణించుపట్ల జక్కన సూక్ష్మ పరిశీలనము ప్రకటించెను. ఇందు గల శ్రీశైలాది పుణ్యక్షేత్రముల వర్ణనము జక్కన భక్తితత్పరతను వ్యక్తము చేయు చున్నది.
అనంతామాత్యుడు రసాభరణము, అనంతుని ఛందస్సు, భోజరాజీయము అను గ్రంథములను రచించెను. ఇందు మొదటి రెండును లక్షణ గ్రంథములు. అనంతుడు రసాభరణమును శా. శ. 1356 లో (క్రీ.శ. 1434) ముగించి నట్లు తెల్పియున్నాడు. ఇతడు గురుదేవతాభ క్తి యుతుడు, తన భోజరాజీయమును గురూపదేశము ననుసరించి అహోబల దేవుని కంకితము కావించేను. ఇందు విక్రమార్క చరిత్రమందువలె నే భోజుని గూర్చిన కథలు వర్ణింపబడినవి. ఈ కథలన్నియు నీతిప్రధానములై ఉన్నవి. ఆంధ్రదేశమున సుప్రసిద్ధమై సత్యప్రభావమును నిరూపించు గోవ్యాఘ్ర సంవాద మీ గ్రంథములోనిదే. ఇందు కరుణరసము చక్కగా పోషింపబడినది. ఇతని శైలి ద్రాక్షాపాకమై మిక్కిలి మృదుమధురముగా నుండును. ఇతడక్కడక్కడ గృహజీవితమును, స్త్రీల సంభాషణాదులను చక్కగా వర్ణించియున్నాడు.
గౌరన (క్రీ. శ. 15 వ శతాబ్ది పూర్వార్ధము) తెలుగున హరిశ్చంద్రోపాఖ్యాన నవనాథ చరిత్రలు అను ద్విపద కావ్యములను, సంస్కృతమున లక్షణదీపిక అను ఛందో గ్రంథమును రచించెను. ఇతడు పద్మనాయక రాజులు పాలించిన రాచకొండ రాజ్యమున నివసించెను. ఇతడు శ్రీ శైలమల్లి కార్జున దేవుని భక్తుడు. ఇతని హరిశ్చంద్రో పాఖ్యానమునందలి కథకు మూలములు స్కాంద, మార్చండేయపురాణములు, తెలుగున ఈ కథను స్వతంత్ర ప్రబంధముగా రచించిన మొదటికవి ఈతడే. ఇం దితడు వివిధపాత్రలను విస్పష్ట రేఖలతో తీర్చిదిద్దెను. ప్రకృతివర్ణన లను రూపవర్ణనలను సొగసుగా నిర్వహించుటలో ఇతడు మిక్కిలిదిట్ట. నవనాథ చరిత్ర సిద్ధినొందిన శివయోగుల చరిత్ర. ఈ నవనాధులలో మీననాథుడను వా డపార మహిమాన్వితుడు. రాజరాజు కుమారుడని లోకమున ప్రసిద్ధుడైన సారంగధరునికథ ఇందు మాళవదేశమున జరిగినట్లు వర్ణింపబడినది. ఖండితాంగుడైన సారంగుని మీననాథుడు కాపాడి సిద్ధులలో కలుపుకొనెను. గౌరన శైలి మృదువై జాతీయోక్తులకును, సామెతలకును ఆలవాలమై మిక్కిలి సరసముగా నుండును. హాస్యరస పోషణమున ఈత డందెవేసిన చేయి. నవనాథ చరిత్రము నందలి వంచక పురోహితుని కథయు, హరిశ్చంద్రో పాఖ్యానమందలి కలహకంఠీ కాలకౌశికుల వృత్తాంతమును ఇందుకు తార్కాణములు, మడికి సింగన పద్మ పురాణో త్తరఖండము, వాసిష్ఠ రామాయణము, భాగవత దశమస్కంథము అనువానినే కాక సకలనీతి సమ్మతమను సంకలన గ్రంథమునుగూడ రచించెను. పద్మపురాణోత్తరఖండము సంస్కృతము నందలి ఆ పురాణభాగమున కనువాదము. ఇందు మాఘస్నాన మాహాత్మ్యమును గురించిన కథలును, శ్రీకృష్ణ చరిత్రమును మనోహరముగా వర్ణింపబడినవి. ఈ కథలను వసిష్ఠమహర్షి దిలీపునకు చెప్పియుండెను. ఈ కావ్యము తెలంగాణమునందలి సబ్బి మండలమునకు ప్రభువైన ముప్పయభూపాలుని మంత్రి అగు వెలిగందల కందన మంత్రికి అంకితము చేయబడినది. వాసిష్ఠ రామాయణము సంస్కృతమునందలి జ్ఞాన వాసిష్ఠమునకు తెలుగు. వసిష్ఠ మహర్షి కిని, శ్రీరామునికిని జరిగిన ఆధ్యాత్మిక సంవాదము లిందు సరళ శైలిలో వర్ణింపబడినవి. భాగవత దశమ స్కందము ద్విపద కావ్యము. ఇతర స్కంధముల నాతడు తెలిగించినట్లు లేదు. ఇతని ద్విపద రచన మిక్కిలి సరసముగా నున్నది. సకలనీతి సమ్మతమున పంచతంత్రము, నీతి సారము, కామందకము, బద్దెననీతి, భారతము మున్నగు పూర్వగ్రంథములనుండి చక్కని నీతిపద్యములు సంగ్రహింపబడినవి. నడుమనడుమ సింగన స్వయముగా వ్రాసిన పద్యములుకూడ నిందుగలవు. ఈతని శైలి సరళమై సర్వజన సుబోధముగా నుండును,
దగ్గుపల్లి దుగ్గయ్య తాను శ్రీనాథుని బావమరది ననియు, తన కా మహాకవి వలననే కవిత్వ మలవడే ననియు వ్రాసికొని యున్నాడు. కఠోపనిషత్తు నందును, భారతానుశాసనిక పర్వమునందును గల నాచికేతుని కథను వస్తువుగా గ్రహించి ఈతడు చక్కని ప్రబంధముగా సంతరించెను. ఇందు శాంతరసము ప్రధానమై యున్నది. ఇందలి శైలి సులభ జాతీయ పదములతోడను, సామెతల తోడనుగూడి చాల రమణీయముగా ఉండును. ఇందలి కధయు అది వెల్లడి జేయు నీతులును మిక్కిలి ఉదాత్తము లుగా నుండును. ఈ యుగమునందలి ప్రశస్త రచనలలో ఇది ఒకటి.
కొరవి గోపరాజు (క్రీ. శ. 15వ శతాబ్ధి పూర్వార్ధము) సింహాసన ద్వాత్రింశిక అను కథాకావ్యమును రచించెను. భోజరాజు విక్రమార్కుని సింహాసనము నధిరోహింపవచ్చు నప్పు డందలి సాలభంజిక లతనిని వారించుచు చెప్పిన ముప్పది రెండు చక్కనికధ లిందు వర్ణింపబడినవి. ఇందు గోపరా జాయా సందర్భములం దా కాలమునందలి విద్యల స్వభావమును, ఆచారములను ప్రదర్శించి తన సర్వజ్ఞతను సూక్ష్మపరిశీలనమును వ్యక్తము చేసినాడు. ఇందలి శైలి సహజమై కథన మార్గమున నడచుచుండును.
జగత్ప్రసిద్ధమైన సంస్కృత పంచతంత్రమును దూబగుంట నారాయణకవి అనువదించి (1470) మాధవవర్మ వంశీయు డయిన బసవ భూపాలుని కంకితము కావించెను. ఈ కావ్యము ప్రపంచమునందలి ఎల్ల భాషలలోని కనువదింపబడి ఉండుటయే దీని అప్రతిమాన ప్రశ స్తికి తార్కాణము. ఇందు మిత్రభేదము, సుహృల్లాభము, సంధి విగ్రహము, లబ్ధనాశము, అవిమృశ్యకారిత్వము, అను ఐదు భాగము లున్నవి. ఇందలి పాత్రలు చాలవరకు పశు పక్ష్యాదులే. అవి యొనరించు సంభాషణములు నీతి ధర్మములతో నిండారి అద్భుతములుగా నుండును. వీటి మూలమున కవి మానవుల మానసములకు నొప్పికలుగకుండ నీతి ధర్మములేకాక జీవిత రహస్యములను, రాజనీతి విశేషములను బోధించి యున్నాడు. నారాయణకవి శైలి కథాకథనమున కనుగుణమై, సరళమై, ఎడనెడ హాస్యరసముతోకూడి మనోహరముగా నుండును.
ఈ యుగమునకు చెందిన విద్వత్కవులలో పిల్లల మట్టి పినవీరభద్రు డొకడు (1490). ఇతడు పెక్కు గ్రంథములను రచించినను శృంగార శాకుంతల మను శకుంతలా పరిణయము, జైమిని భారతము అను రెండుకావ్యములు మాత్రమే ఉపలభ్యము అగుచున్నవి. ఇందు శృంగార శాకుంతలము, శకుంతలా దుష్యంతుల వివాహమును వర్ణించు శృంగార ప్రబంధము. పినవీరభద్రు డిందు భారతమునందలి కథనేకాక కాళిదాసుని అభిజ్ఞాన శాకుంతలమునందలి కల్లనుకూడ అనుసరించెను. ఆ నాటకము నందలి పెక్కుశ్లొకము లిందు సందర్భానుసారముగా ననుసరింపబడినవి. సంస్కృతము నందలి నాటకము ప్రబంధరూపము నొందుట కిది రెండవ ఉదాహరణము. శ్రీనాథుని శృంగారనైషధమువలె శృంగార శాకుంతలము కూడ తరువాత వెలసిన ప్రబంధరచనకు మార్గదర్శక మయ్యెనని చెప్పవచ్చును. జై మినీ భారతమున భారతము నందిలి అశ్వమేధ పర్వములోని కధయే విపులముగా వర్ణింపబడినది. ఇం దద్భుతములయిన కథలనేకము లున్నవి, అశ్వమేదాశ్వముతో వేగిన భీమార్జునులు దాని నరికట్టినవారి నోడించి, దిగ్విజయము కావించుట యిందలి ప్రధానవృత్తము. ప్రమీలకథ, బభ్రువాహనుని కథ, చంద్ర హాస చరిత్ర, ఉద్దాలక మహర్షి కథ, కుశలవోపాఖ్యానము మున్నగున విందలి కధలలో ప్రసిద్ధములయినవి. పినవీరభద్రుని శైలి ఈ కావ్యమున పరిపక్వత నందినది. దీనిని రచించు సందర్భముననే అతడు 'వాణి నారాణి' అని చెప్పె నందురు. ఈ కావ్యము విజయనగరము పాలించిన సాళువ నరసింహరాయల కంకితము చేయబడినది. ఈతని రచనలో శ్రీనాథుని ఛాయలు పెక్కు చోట్ల గోచరించును.
నంది మల్లయ, ఘంట సింగనలు తెలుగునందలి మొదటి జంటకవులు (క్రీ.శ. 15-వ శతాబ్ది ఉత్తరార్థము) ప్రబోధ చంద్రోదయము, వరాహపురాణము అనునవి వీరి రచనలు. ఇందు ప్రబోధ చంద్రోదయము సంస్కృతమున కృష్ణమిశ్రుడను కవి రచించిన ఆ పేరుగల వేదాంత బోధకమైన నాటకమునకు బ్రబంధరూపమైన అనువాదము. ఇందలి ప్రధానరసము శాంతము, కామ క్రోధ లోభ మోహ వివేకాదులు, శ్రద్ధా విష్ణుభ క్త్యు పనిషదాదులు ఇందలి పాత్రలు. మానవుని అంతరంగముననుండు ఉత్తమ ప్రకృతులకును, దుష్ట ప్రకృతులకును జరుగు నైతిక సంగ్రామ మిందు వర్ణింపబడినది. తామస ప్రకృతుల ఓటమియు, వివేకుని గెలువును, ప్రబోధ చంద్రుని ఉదయమును చివర చక్కగా నిరూపింపబడినవి. క్లిష్టమైన వేదాంత విషయమునుకూడ నీజంటకవు లిందు రమణీయముగా సర్వజన సుబోధముగా వర్ణించుటతో. తమ ప్రతిభమ ప్రదర్శించినారు. ఈ ప్రబంధము నాచి కేతోపాఖ్యాన కృతిభర్తయైన అనంతామాత్యుని గంగయకే అంకితము చేయబడినది. వరాహ పురాణమునందలి విశేషభాగము ప్రదాన మహిమలతో నిండియుండును. అందుచే మల్లయ సింగన లందలి రసవంతములైన భాగములను మాత్రమే గ్రహించి వర్ణనాదులను బెంచి ఈ పురాణమును ప్రబంధమార్గమున రచించిరి. ఇందు దుర్జయరాజు వృత్తాంతమున శృంగారరసము చక్కగా పోషింపబడినది. విరహ మృగయా విహారాదు లిందు ప్రబంధోచితముగా వర్ణింపబడినవి. ఇందున్న అర్జునకి అను ఖిల్లాంగనకథయు, గౌతమమహర్షి కథయు, గౌరీకల్యాణ వృత్తాంతమును మిక్కిలి హృద్యములుగా నుండును. ఈ కావ్యము కృష్ణదేవరాయల తండ్రి అయిన నరస రాయల కంకితము చేయబడినది. కవులు శివభక్తి తత్పరులైనను వైష్ణవావతారకథా ప్రధానమైన పురాణమును వర్ణించుట వారి సమబుద్ధికి తార్కాణముగా ఉన్నది. ఈ జంటకవుల రచన బాగుగా కలసి హెచ్చుతగ్గులు లేక ఏక కవి కర్తృకమువలెనే భాసిల్లుచుండును. వీరి కావ్యములలో కథా సందర్భమునుబట్టి ప్రౌఢమైన సంస్కృత శైలియు, సరళమైన యచ్చతెలుగు రచనయు, కూడ కానవచ్చుచుండును. ఘంట సింగనకు మలయమారుతకవియమ బిదుదము గలదు. నంది తిమ్మన ఇతని మేనల్లుడు.
వెన్నెలకంటి సూరన విష్ణుపురాణము నాంధ్రీకరించి గుడ్లూరున కధిపతియైన రావూరి రాఘవరెడ్డి కంకితము చేసెను. (క్రీ.శ. 16.వ శతాబ్ది పూర్వార్ధము.) విష్ణు పురాణము సంస్కృతమున పరాశరకృతమని సూరన్నతెల్పియుండెను. ఇందు పూర్వభాగమున విష్ణుని అవతారకథలును, ఉత్తరభాగమున వ్రతధర్మ వేదాంతజ్యోతి శ్శాస్త్రములకు సంబంధించిన విషయములును వర్ణింపబడి యుండును. అందుచే సూరన రసవద్రచన కనుకూలమైన పూర్వభాగమును మాత్ర మే ఆంధ్రీకరించెను. ఇందలి కథలు పెక్కు భాగవతమునం దున్నట్టివే. ప్రహ్లాదుడు తన విష్ణుభక్తి మహిమచే హిరణ్యకశిపుని గూడ విష్ణు భక్తునిగా మార్చెనని ఇందు వర్ణింపబడినది. భాగవతమున వలెనే ఇందును శ్రీకృష్ణుని చరిత్రము మిక్కిలి రమణీయముగా నుండును. సూరన జడభరతోపాఖ్యానము, మాంధాతృ చరిత్రము, తారాశశాంకవృత్తాంతము అను
వాని నిందు నేర్పుతో వర్ణించెను. కృష్ణరాయలు ఆముక్త మాల్యద యందలి ఖాండిక్య కేశిధ్వజోపాఖ్యానము నిందుండియే గ్రహించెను. సూరన శైలి పురాణ శైలి. ఇతని రచన దీర్ఘశృంగార వర్ణనల జోలికిపోక, ఔచిత్యమును విడువక, సంగ్రహమై సరళముగ నుండును.
ఆంధ్ర వాఙ్మయము మొదట పురాణానువాదములతో నారంభించినది. శివకవి యైన నన్నె చోడుడు స్వతంత్ర మార్గము నవలంబించి కుమార సంభవమున ప్రబంధబీజములు వెదజల్లెను. ఎఱ్ఱన సోమనలు పురాణము లందే ప్రబంధన్ధ సౌధమునకు పునాదులు తీర్చిరి. శ్రీనాథుని కావ్యములలో ఆ పద్ధతి పరిపుష్టినొంది స్థిరమైన ఆకృతిని దాల్చినది. అతని కాలమున కావ్యనాటకములకు అనువాదములేకాక పెక్కు స్వతంత్ర కావ్యములు కూడ వెలువడినవి. ఈరీతిగా రాయల కాలమునాటికి స్వతంత్ర ప్రబంధరచనానుకూలమైన పరిస్థితి ఏర్పడినది.
ది. వేం. అ
[[వర్గం:]]