సంగ్రహ ఆంధ్ర విజ్ఞాన కోశము/మొదటి సంపుటము/ఆంధ్రవాఙ్మయ చరిత్రము - II

ఆంధ్రవాఙ్మయ చరిత్రము - II (క్రీ. శ. 1509-1800):- క్రీ. శ. 15 వ శతాబ్ది చివరకు వెలసిన ఆంధ్ర వాఙ్మయమున ఎడ నెడ కొన్ని స్వసంత్ర కావ్యములుకూడ కనబడుచున్నను బాహుళ్యముమీద అప్పటి రచనలు పెక్కు సంస్కృతమునుండి అనువదింపబడినవే. తరువాత పెద్దనాదులు పురాణములనుండి ఇతివృత్తమును గ్రహించి, వర్ణనాదులచే దానిని పెంచి ధీరోదాత్త నాయకములును, శృంగార రసప్రధానములును, పంచమాశ్వాస పరిమితములును ఐన కావ్యములను, అలంకారికమైన శైలిలో వ్రాయుట కారంభించిరి. వీటికే ప్రబంధములని "పేరు. ఉత్పత్తినిబట్టి చూచినచో ప్రకృష్టమైన బంధము (కూర్పు) గల ఏ కావ్యము నైనను ప్రబంధమని చెప్పవచ్చును. తిక్కన తాను రచించిన భారత భాగమును ప్రబంధమండలి యనిపేర్కొనెను. ఎఱ్ఱన తన నృసింహపురాణమును ప్రబంధమని వ్యవహరించేను. నన్ని చోడుడు, నాచనసోమన శ్రీనాథుడు, పినవీరభద్రుడు మున్నగువారి రచనలలో ప్రబంధ లక్షణములు పెక్కు కానవచ్చును. కాని అట్టి కావ్యములసంఖ్య ఆ రోజులలో రచింపబడిన ఇతర రచనల సంఖ్యతో పోల్చిచూచినచో మిక్కిలి స్వల్పమగుటచేతను క్రీ. శ. 1500 తరువాత అట్టి కావ్యములే విరివిగా రచించి • బదుటచేతను, ఈయుగమునకు (క్రీ.శ.1500-1800) ప్రబంధయుగమను రూఢినామ మేర్పడినది. దీనిని రాయల యుగము, నాయక రాజ యుగము లేక దక్షిణాంధ్ర యుగము అని రెండు భాగములుగా విభజింపవచ్చును.

అష్టదిగ్గజములని ప్రసిద్ధివడసిన మహాకవులు నాదరించి, వారిచే రసవత్తరములైన మహాప్రబంధములను రచింపజేసి, ఆంధ్రవాఙ్మయమున తనకాలము సువర్ణయుగమై యలరారు నట్లొనర్చిన వాడు సాహితీ సమరాంగణ సార్వభౌముడు శ్రీకృష్ణ దేవరాయలు. ఇతడు క్రీ. శ.1509 మొదలు 1530 వరకును విజయనగర సామ్రాజ్యమును పాలించెను. సంస్కృతమునకు భోజమహారాజువలె ఆంధ్రమునకీ మహా రాజు అనన్య సామాన్యమైన అభ్యుదయమును కలిగించుటచే ఇతనికి ఆంధ్రభోజుడను సార్థకనామము కలిగినది. ఇతడు పలువురు పండితులను కవులను పోషించుటయేకాక, తానుకూడ విద్వత్కవియై సంస్కృతాంధ్రములందు బహుగ్రంథములు రచించుట ఇతని కావ్యగీతీ ప్రియత్వమునకు తార్కాణము. ఇతడు స్వరచితమైనఆముక్తమాల్యదయను ఆంధ్రప్రబంధము నవతారికలో, మదాలస చరిత్ర, సత్యావధూప్రీణనము, సకలకథా సార సంగ్రహము, జ్ఞానచింతామణి, రసమంజరి మొదలైన సంస్కృత గ్రంథములను రచించినట్లు చెప్పుకొని యున్నాడు. కాని అవి ఇప్పుడు లభ్యము అగుటలేదు.

రాయలు రచించిన ఆంధ్ర ప్రబంధము ఆముక్త మాల్యద. గోదాదేవీ శ్రీ రంగేశ్వరుల ప్రణయ వృత్తాంత మిందలి ప్రధాన వస్తువు. గోదాదేవి మొదట ధరించిన పూలమాలలు తరువాత శ్రీరంగేశ్వరుని కర్పింపబడిన హేతువుచే ఆమెకు ఆముక్తమాల్యద అను పేరు కలిగినది. రాయలు సహజముగా వైష్ణవమతమునందు అభిమానము కలిగి తన్మత ప్రచారమునం దాసక్తి వహించినవాడగుటచే ఆముక్తమాల్యదయందు ప్రపక్తాను ప్రసక్తముగా విష్ణుపారమ్యమును ప్రదర్శించు నుపాఖ్యానములు కొన్ని చేర్చియుండెను. ఖాండిక్య కేశిధ్వజ్ఞోపాఖ్యానము,యామునాచార్య చరిత్రము, మాలదాసరి కథ అందు ముఖ్యములైనవి. అవాంతర ప్రవేశితములైన ఈ కథల చేతను, రాయలు కావించిన దీర్ఘములైన గ్రీష్మ వర్షా శరద్వసంతర్తు వర్ణనములచేతను, యామునాచార్యునిచే కుమారునికి చెప్పించిన రాజనీతి విస్తారముచేతను, చివరి రెండాశ్వాసములలో తప్ప మిగిలినవానిలో ప్రధాన కథకు సంబంధించిన వృత్తాంతము మృగ్యమై యుండుట చేతను ఈప్రబంధమున వస్వైక్యమున కించుక భంగము వాటిల్లినదని చెప్పవచ్చును. ఇందలి కథావర్ణన పరిపాటిని పరికించి నచో ఇది యొక చిన్న విష్ణు పురాణమువలె కనిపించును.

ఉపాఖ్యాన వర్ణనావిస్తృతులచే ప్రధానకథ మరుగు పుచ్చబడినను ఆముక్తమాల్యదకు ప్రబంధ వాఙ్మయమున ఉన్నత స్థానము కల్పించు గుణవిశేషము లందు పెక్కులున్నవి. రాయలు వర్ణించిన గోదాదేవి విరహము ఇతర ప్రబంధము లందలి విరహవర్ణనకంటే విశిష్టమై దైహికమును, నీచమునైన మోహమును కాక హార్దమును, పవిత్రమునైన అనురాగమును ప్రకటించుచున్నది. ఇందలి ఋతువర్ణనములు సూక్ష్మాతి సూక్ష్మ వివరములతో కూడి ఆయా ఋతువులను పఠితలకు ప్రత్యతము చేయుచు రాయల ప్రకృతిపరిశీలన పాటవమును ప్రకటము కావించు చున్నవి. ఋతువులు నింత విస్తృతముగను, సహజ మనోహరముగను వర్ణించిన కవు లాంధ్ర వాఙ్మయముననే కాక సంస్కృతమునకూడ లేరనినచో అతిశయోక్తి కాజాలదు. రాయల రాజనీతివర్ణనము కేవల గ్రంథ పఠనజన్యము కాక అనుభవసిద్ధ మగుటచే మిక్కిలి సహజమై అలరారుచున్నది.

ఉపాఖ్యానములను రచించుటలో రాయలు గొప్ప నేర్పు ప్రదర్శించెను. ఖాండిక్య కేశిధ్వజోపాఖ్యానమును, మాలదాసరి కథయు కథానిర్మాణ శిల్పమునకును, పాత్ర చిత్రణమునకును, సంభాషణ నైపుణ్యమునకును నెలవులై మిక్కిలి హృద్యములుగా నున్నవి. ఖాండిక్య కేశిధ్వజులయు, మాలదాసరి యొక్కయు, పాండ్య రాజుభార్య యొక్కయు శీలములు అతి పవిత్రములై ఆదర్శప్రాయములుగ నున్నవి. రాయలు మహారాజయ్యు సామాన్య ప్రజల గృహజీవితమును, సుఖదుఃఖములను, ప్రకృతి యందలి వివిధ ప్రాణుల స్వభావములను చక్కగా వర్ణించి యుండెను. ఆనాటి ప్రజాజీవితమునకు ఆముక్తమాల్యద ఆదర్శమై భాసిల్లుచున్నది.

ఆముక్తమాల్యదలో పలుచోట్ల రాయలకు వేదవాఙ్మయముతోడను, ఉపనిషత్తులతోడను, జ్యోతిష ప్రభృతి శాస్త్రములతోడను, పురాణములతోడను గల గాఢ పరిచయము వ్యక్త మగుచున్నది. విష్ణుచిత్తుడును,యామునాచార్యుడును అన్య మతములను ఖండించుచు విష్ణుమహత్త్వమును ప్రదర్శించునపుడు రాయలు బ్రహ్మ సూత్రములనుండియు, ఉపనిషత్తులనుండియు పెక్కు వాక్యములను ఉద్ధరించి యుండెను. వైష్ణవమత రహస్యముల నెరుగుటకై ఆతడు ప్రస్థానత్రయమునేకాక దివ్య ప్రబంధములను కూడ శుణ్ణముగా పఠించినట్లు తోచును.ఆయా సందర్భములం దాతడు ప్రదర్శించిన కవి సమయ పురాణకథాపరిజ్ఞాన మచ్చెరువు కలిగించుచుండును.

ఆముక్తమాల్యదయందలి శైలి మిక్కిలి ప్రౌఢముగా నుండును. రాయలు దీర్ఘ సమాసములను వాడుటయేకాక పలుచోట్ల వాక్య యోజనయందు సంస్కృతభాషా సంప్రదాయమునే అనుసరించుచుండును. ఎడనెడ ద్రావిడ పదములును, మారుమూలపదములును కూడ గోచరించును. అతడు చిన్న సమాసమున గంభీరమైన యర్థము నిమిడింప యత్నించినచోట్లు పెక్కు కలవు. అందుచేతనే ఈ కావ్యము పండితైకవేద్యమై సామాన్యులకు దురవ గాహమగుట సంభవించినది. ఇట్లని రాయలు ఆముక్త మాల్యదలో సులభ జాతీయపదములను రమణీయముగా నుపయోగించిన చోట్లు కొన్ని లేకపోలేదు. "కుంపటిలో తామర ", " గుమ్మడికాయంత ముత్తెము ", 'ఇంటిలో నేడుముల్లు ", జక్కుల బోనంబులు" మొదలగు చక్కని జాతీయముల తోడను, సరస సరళ సంభాషణములతోడను, నిసర్గ వర్ణనలతోడను కూడిన పద్యములు పెక్కు అతడు రచించియుండెను, కాని మొత్తముమీద ఆముక్తమాల్యద యందలి పాకము నారికేళపాక మనియే చెప్పనగును. తెలుగునందలి ప్రౌఢ ప్రబంధములలో ఆముక్తమాల్యద ఉత్తమస్థానము నాక్రమించి ప్రత్యేక గౌరవము నార్జించిన దనుటలో అత్యుక్తి యుండజాలదు.

రాయల ఆస్థానమున అష్టదిగ్గజము అను పేరుతో ఎనమండుగురు మహాకవులుండి రని ప్రసిద్ధి. వీరందరును తెలుగుకవులే యని నిశ్చయముగా చెప్పజాలము. అప్పటి తెలుగుకవులలో వయస్సుచేతను పాండిత్యముచేతను మొదట పేర్కొనదగినవాడు అల్లసాని పెద్దన్న (క్రీ.శ. 1475-1535), ఇతడు "స్వారోచిషమనుసంభవ"మను మను

చరిత్రను, హరికథాసార మను మరియొక గ్రంథమును రచించెను. హరికథాసార మింతవరకు ముద్రితము కాలేదు. పెద్దన తన మనుచరిత్రమును రాయలవారికే అంకితము కావించెను. రాయలు పెద్దనను సమ్మానించిన విధము అనన్యసామాన్యమైనది. అతడా మహాకవిని కోకటగ్రామాద్యనేకాగ్రహారములొసగియు, గండ పెండేరమును స్వయముగా కాలికి తొడిగియు, ఎదురైనచో తన మద కరీంద్రము డిగ్గి కేలూత యొసగి ఎక్కించుకొనియు, పలు విధముల మన్నించుటయే గాక “ఆంధ్రకవితాపితామహ” యను బిరుదమును ఒసగి ఆదరించెను. ఆంధ్ర దేశమున భారత భాగవతముల తరువాత మనుచరిత్రమునకే ప్రజా దరము హెచ్చు. అందుకు పెద్దన ఆకావ్యమున ప్రదర్శించిన రచనా కౌశలమును, పాత్రపోషణ విధానమును కారణములు. అతడు మనుచరిత్రమునందలి కథను మార్కండేయ పురాణమునుండి గ్రహించి, వర్ణనాదులచే పెంచి, చక్కని ప్రబంధముగా రూపొందించెను. ఇందు మొదటి రెండా శ్వాసములందును శృంగార రసాభాసముతోకూడిన వరూధినీ ప్రవరాఖ్యుల కథయు, తరువాత వరూధినీ గంధర్వుల సంభోగశృంగారమును, పిమ్మట స్వరోచి వృత్తాంతమును వర్ణింపబడియుండుటచే ఈ ప్రబంధమున వస్త్వెక్యము కొరవడియున్నదని విమర్శకులు తలతురు. ద్వితీయాశ్వాసమున శ్రోత్రియుడు, జితేంద్రియుడు ఐన ప్రవరుని శాంత ప్రవృత్తికిని, స్వేచ్ఛాచరితయైన వరూధిని కామ ప్రవృత్తికిని సంఘర్షము చక్కగా వర్ణింపబడినది. వరూధినీ ప్రవరుల పాత్రలను సజీవములుగా వర్ణించుటలో పెద్దన చాలనేర్పు ప్రదర్శించెను. ఈతని శైలి ప్రౌఢమై ధారాశుద్ధి శోభితమై, ఎడనెడ జాతీయములతోడను, సామెతలతోడను గూడి అల్లసాని వాని అల్లిక జిగిబిగి అను ప్రసిద్ధినిగడించినది. హిమవత్పర్వతమును, స్వరోచి వేటను, స్వరోచికిని రాక్షసునికిని జరిగిన యుద్ధమును వర్ణించుటలో పెద్దన యొక్క ప్రకృతి పరిశీలనమును, సహజవర్ణన పాటవమును, భావనాశక్తియు వెల్లడియగును. యుద్ధ వర్ణన సందర్భమున పెద్దన రసానుగుణముగా శబ్దాలంకార ప్రీతిని, ఛందోవైవిధ్యమును ప్రకటించెను. మానవ హృదయమున జరుగు వివిధభావ సంఘర్షములను వర్ణించుటలో ఇతడు దిట్ట. రాయల ఆస్థానమున గండ పెండేర మను గ్రహించుటకు ముందు చెప్పిన ఉత్పలమాలిక నుబట్టి ఇత డాశుధారాకవిత్వమునకూడ నేర్పరియని తెలియు చున్నది.

రాయల దేవేరులలో నొకతెయైన తిరుమల దేవితో నందితిమ్మన అరణముగా వచ్చెనని చెప్పుదురు. ప్రస్తుతము వసుచరిత్రలో కనవచ్చు "నానాసూనవితాన వాసనల" అను ముక్కును వర్ణించు పద్యమును భట్టుమూర్తి ఇతని నుండియే గ్రహించెననియు, అందుచే ఇతనికి ముక్కు తిమ్మన అను పేరుకలిగెననియు ప్రవాదముకలదు. కాని ఇం దెంత సత్యమున్నదో చెప్పజాలము. ఇతడు రచించిన ప్రబంధము పారిజాతాపహరణము. ఇం దవతారికలో మనుచరిత్రలో వలెనే కృతిభర్తయైన కృష్ణరాయలయు, తత్పూర్వులయు గుణగణములును పరాక్రమాదులును విపులముగా వర్ణింప బడినవి. ఈ రెండు గ్రంథములలో కావింపబడిన రాయల దిగ్విజయములను బట్టి మను చరిత్రము కంటే పారిజాతాప హరణమే ముందు రచింప బడియుండు నని (క్రీ.శ.1515) విమర్శకులు ఊహించు చున్నారు. పారిజాతాపహరణము నందలి కథ సంస్కృత హరివంశమునుండి గ్రహింపబడినది. తిమ్మన కథలో చేసిన మార్పులు చాలతక్కువ. అందు కృష్ణుడు సత్యభామను అనునయించుచు ఆమెకు నమస్కరింపగా ఆమె తన యెడమ కాలితో నతనితల తన్నుటయు, అట్టి సందర్భమున కూడ కృష్ణుడు కుపితుడు కాక రసజ్ఞుడై ఆమెతో సందర్భోచిత సరససల్లాపములొనరించుటయు ముఖ్యము లైనవి. రాయ లేదో కారణమున తిరుమల దేవిపై కోపించి ఆమెతో మాటాడుట మానివేయగా అతనికి ప్రియానునయ విధానమును ప్రబోధము కావించుటకై తిమ్మన అమూలకమైన ఈఘట్టమును కల్పించెనని చెప్పుదురు. పారిజాతాపహరణమునందలి ప్రథమాశ్వాసము శృంగారరసపూరితమై మిక్కిలి మనోహరముగా నుండును. ఇందు సత్యభామ ప్రౌఢత్వమును, మానినీత్వమును చక్కగా వర్ణింపబడినవి. తక్కిన ఆశ్వాసములలో చంద్రోదయ, సూర్యోదయ, ప్రయాణ, వనవిహార, యుద్ధాదులు ప్రబంధోచితములుగా వర్ణితములై యున్నవి. ప్రకృతి వర్ణనమున తిమ్మన చాల మెలకువ చూపెను. పారిజాతాపహరణ ప్రబంధమున చివర పుణ్యక వ్రత వృత్తాంతము కలుపుట అనావశ్యకమని కొందరందురు. తిమ్మన శైలి మృదుమధురమై, ఎక్కడను కుంటుపడక, మకరంద ప్రవాహమువలె సాగిపోవును. అందుచేతనే 'ముక్కుతిమ్మనార్యు ముద్దుపలుకు' అను నానుడి కలిగినది. ఈతని వర్ణనలు భావగంభీరములును, ఔచిత్య శోభితములునై యొప్పారును. కాని ద్వితీయ తృతీయాశ్వాసములందలి వర్ణనలు అతిదీర్ఘములై కథాగమనమున కించుక ఆటంకమును కలిగించుచున్నవి. మృదువులైన శృంగార భావములను రసానుగుణమైన శైలిలో, మనోహరముగా వర్ణించుటలో తిమ్మన కృత హస్తుడు.

మాదయగారి మల్లనకూడ రాయలవారి ఆస్థానమందుండినట్లు రాయవాచకము వలన తెలియుచున్నది. ఇతడు రాజశేఖర చరిత్రము అను ప్రబంధమును రచించి తిమ్మరుసు మంత్రికి అల్లుడైన నాదెండ్ల అప్పామాత్యునికి అంకితము చేసెను. హేమధన్వుని కుమారుడైన రాజ శేఖరుడు సింధురాజు కూతురైన కాంతిమతిని వివాహమాడుట ఇందలి ఇతివృత్తము. ఇందలి కథాకల్పనలో వైచిత్రి అంతగా కానరాదు, కాని రాజశేఖరునకును కాంతిమతికిని కాళికాదేవి ఇచ్చిన చిలుక నడిపిన రాయభారము రమ్యముగా నుండును. పింగళి సూరనార్యుని ప్రభావతీ ప్రద్యుమ్నమునందలి శుచిముఖ ఈ చిలుకకు శిష్యురాలని చెప్పవచ్చును. రాజశేఖర చరిత్ర పరిమాణమున చిన్నదయ్యును మిక్కిలి రసవంతముగా నుండును. రసవంతముగా కవిత్వము చెప్పజాలనిచో అసలుకవిత చెప్పక యేయుండుట మేలని మల్లన వాక్రుచ్చెను. ఈతని గ్రంథమున వర్ణనలు నాతిదీర్ఘములును ఔచిత్యపూరితములునై యుండును. శృంగారరసవర్ణనమున కూడ ఇతడు చాల నిగ్రహము ప్రదర్శించెను. ఈతని శైలి ప్రసాద గుణ భూయిష్ఠమై ముద్దులొల్కుచుండును. పాత్రోచితముగను సహజముగను భావములను వర్ణించుటలో ఇతడు కడు నేర్పరి.

“స్తుతమతియైన ఆంధ్రకవి ధూర్జటి పల్కుల కేలక ల్గెనో యతులిత మాధురీమహిమ" అని రాయలవారిచే ప్రశంసింప బడిన ధూర్జటి మహాకవి శ్రీ కాళహస్తి మాహాత్మ్యము అను క్షేత్రమాహాత్మ్యమును రచించెను. శ్రీ కాళహస్తీశ్వర శతక మితడు రచించినదా కాదా అని కొందరు సందేహించుచున్నారు, కాని కవితాధోరణిని బట్టి చూడ అది ఈతని కృతియేయని తోచుచున్నది. ఈ శతక మాంధ్ర శతక వాఙ్మయమునకు తలమానిక మని చెప్పదగినది. ఇందు కవి పూర్వజీవితమున తాను గడపిన వర్తనమును గూర్చి అనుతావమును వెల్లడించుచు ఆత్మపరీక్ష కావించు కొని యున్నాడు. మదాంధులైన రాజుల యుద్ధతిని,వారవనితాసక్తిని, భోగభాగ్యములను ఇం దతడు నిరసించిన విధముచూడ వయస్సు పరిణత మగుకొలది అతడు విషయ పరాఙ్ముఖుడై వైరాగ్య తత్పరుడగుట తోచుచున్నది. ఇందలి శైలి ప్రౌఢమై ఎడనెడ స్వతంత్ర ప్రయోగములతో గూడి అత్యంత రమణీయముగానున్నది. ఇందలి పెక్కు పద్యములు ధూర్జటి శివభక్తి విశేషమును వెల్లడించుచున్నవి. తాను రచించిన శ్రీ కాళహస్తిమాహాత్మ్యమును అతడు శివునికే అర్పించెను. అందు దక్షిణ కైలాస మని ప్రసిద్ధిగన్న శ్రీ కాళహస్తి క్షేత్రమహత్త్వ మును దెల్పు కథలు వర్ణింపబడినవి. సంస్కృతమున స్కాందపురాణమున గల శ్రీ కాళహస్తి మాహాత్మ్యమే దీనికి మూలము. ఇందు మానవులేకాక తిర్యక్కులుకూడ శివభక్తిని ప్రదర్శించి ఎట్లు కైవల్యము నందజాలెనో వర్ణింపబడినది. - ఇందలి కథలలో భక్తి పరవశుడై శివునికి తన రెండుకన్నులను పెరికియిచ్చిన తిన్నడను పుళిందరాజ కుమారునికథయు, మహాకవియై శివుడు వ్రాసిన పద్యములో కూడ తప్పుపట్టిన నత్కీరుని కథయు రసపూరితములై అతి మనోహరములుగా నుండును. ధూర్జటి శైలి సమానభూయిష్ఠమయ్యు ఎడనెడ, లలిత పదకోమలమై రసానుగుణ పదప్రయోగముతోకూడి సహృదయరంజకముగా నుండును. ఈ కావ్యమునందలి వర్ణనలు మిక్కిలి సహజములై కవిప్రకృతి పరిశీలన పాటవమును వెల్లడించు చున్నవి. తిన్ననికథయందలి ఆటవికజీవిత వర్ణనమును, నత్కీరుని కథయందలి దుర్భిక్షవర్ణవమును, స్వర్ణముఖి ప్రవాహవర్ణనమును ఇందుకు నిదర్శనములు. ధూర్జటి పోతనాదులవలె కవిత్వమొక దివ్యకళావిశేష మనియు, దానిని ఈశ్వరారాధనమునకే వినియోగించుట యుక్త మనియు తలచిన మహనీయుడు.

అయ్యలరాజు రామభద్రకవి రామాభ్యుదయ మను కావ్యమును వ్రానీ రామరాయల మేనల్లుడైన గొబ్బూరి నరసరాజున కంకితము కావించెను. ఇతడు రాయలు సంస్కృతమున వెలయించిన సకలక థాసారసంగ్రహమును తెలిగించి ఆతనికే అంకితము చేయదలచె నని చెప్పుదురు. ఆగ్రంథ మిప్పుడు లభ్యమగుటలేదు. రామభద్రుడు రామాభ్యుదయమున రామాయణకథను ప్రబంధ రీతిని రచింపదలచినవా డగుటచే అందు ఉద్యాన విహార పుష్పాప చయ జలక్రీడాదు లగు ప్రబంధోచితము లగు వర్ణనలు ప్రవేశ పెట్టెను. అవి మనోహరముగనే యున్నను కొన్ని చోట్ల ఔచిత్యదూరములుగా నున్నవి. విశ్వామిత్రమహర్షి సీత సౌందర్యమును వర్ణించుపట్లను, ఋష్యశృంగుని కథలో వేశ్యలమాయలను, విభ్రమములను వర్ణించు పట్లను, ఇతడు కొంచెము మేరమీరినట్లు కానిపించును. ఇతనిరచన ప్రౌఢమైన సంస్కృత సమాసములకును లలిత కోమలములైన తెలుగుపదములకును నెలవై మనోహరముగా నుండును. ఇతనికి శ్లేష యమకాను ప్రాసాది శబ్దాలంకారములందును, చిత్రకవిత్వమందును ప్రీతి మెండు.

పింగళిసూరనార్యుడు కూడ అష్టదిగ్గజములలోని వాడే అని లోకమున వాడుక. కాని అతడు క్రీ.శ. 16 వ శతాబ్ది ఉత్తరార్థమున జీవించెనని కొందరును క్రీ.శ. 17 వ శతాబ్ది మొదటిపాదము వరకుకూడ కొందరును చెప్పుచున్నారు. రాఘవపాండవీయము, కళాపూర్ణోదయము, ప్రభావతీ ప్రద్యుమ్నము అను ఇతని మూడురచనలు మాత్రమే ఇప్పుడు ఉపలభ్యము లగు చున్నవి. ఇతడు తాను వ్రాసితి నని చెప్పుకొన్న గరుడ పురాణము నష్టమైనది. సూరన మిక్కిలి ప్రతిభావంతుడు. ఇతని కావ్యములు మూడును క్రొత్తదనముతో విలసిల్లుచు అతని పాండిత్య ప్రతిభాకళాభిజ్ఞతలను చాటుచున్నవి.

రాఘవపాండవీయము ద్వ్యర్థికావ్యము, వేములవాడ భీమకవి ఇట్టి కావ్యమొకటి వ్రాసెనని ప్రతీతికలదు గాని అది లభ్య మగుటలేదు. ఇందు రామాయణభారత కథలు రెండును జోడింపబడినవి. ఇది చదువునప్పుడు పఠిత ఎట్టి క్లేశమును లేకుండనే ఒకసారి రామాయణ కథను ఒకసారి భారతకథను స్పష్టముగా గ్రహింప జాలును. సూరన ఇందు వివిధములైన శ్లేషలను వాడి సంస్కృతాంధ్రములందు తనకుగల పాండిత్యవి శేషమును ప్రకటించెను. సామాన్యముగ ద్వ్యర్థికావ్యము లందు రస భావౌన్నత్యము ప్రకటించుటకు అంతగా అవకాశ ముండదు. కాని సూరన ఇందు కావించిన కొన్ని వర్ణనములందును, ప్రకటించిన భావములందును సామాన్య కావ్యములందువలెనే కవితా చమత్కార మెంతో కానబడుచున్నది. ఈ కావ్యమును అతడు అకువీటి పెద్ద తిమ్మ రాజునకు అంకితము కావించెను.

సూరన కీర్తిసౌధమునకు మూల స్తంభమని చెప్పదగినది కళాపూర్ణోదయము. ఇది కల్పితకథావస్తుక మైన అద్భుతకథా కావ్యము. ఇంతకు పూర్వము ప్రఖ్యాతవస్తుకములైన కావ్యములనేకాని ఇట్లు కల్పిత కావ్యములను వ్రాసిన కవు లెవ్వరును లేరు. ఇందు కలభాషిణి అను వేశ్య నాయిక. ఇందలి కథాకల్పనాచాతుర్యము అప్రతిమానమైనది. కథాకథనమున నిందు కాలక్రమపద్ధతిని కాక నవలలోవలె కార్యకారణపద్ధతిని సూరన అవలంబించి కథామధ్యవృత్తాంతముతో కావ్యము నారంభించెను. ఇందాతడు శృంగారరసమునకు సంబంధించిన వైవిధ్యమును వివిధమనఃప్రవృత్తులను చక్కగా ప్రదర్శించెను. ఈతడు రచించిన సుగాత్రీశాలీనుల కథ అమలిన శృంగారమున కాలవాలమై అతిరమణీయముగా నుండును మాయాసత్య రంభానలకూబరుల కథలో అతడు చూపిన చమత్కారము అద్భుతావహముగా నుండును. మాయా సత్యరంభల వాగ్వివాద మెంతో సహజమై సవతుల స్వభావమును స్పష్టము చేయుచున్నది. ఇచ్చటి సంఘట నము ఆంగ్లనాటకకవిసార్వభౌముడైన షేక్స్పియరు యొక్క కామెడీ ఆఫ్ ఎఱ్ఱర్సులోని సంఘటనమును పోలియుండు నని విమర్శకుల అభిప్రాయము. పాత్ర నిర్మాణమునను, రసపోషణమునను ఇందు సూరన చూపిన నేర్పు అనన్య సామాన్యమైనది. ఇట్లు కల్పితకథాకావ్యమును అద్భుతముగా సృష్టించియు నతడు చివరి ఆశ్వాసములలో మధురలాలసా కళాపూర్ణుల శృంగారమును వర్ణించుపట్ల సాధారణ ప్రబంధపద్ధతినే అవలంబించెను. ఈ కావ్యము నతడు నంద్యాల కృష్ణరాజునకు అంకితము చేసెను.

ప్రభావతీ ప్రద్యుమ్నమున శ్రీకృష్ణుని కుమారుడగు ప్రద్యుమ్నుడు వజ్రనాభుడను రాక్షసరాజుకుమార్తెయగు ప్రభావతిని వలచి పరిణయమాడిన కథ వర్ణింపబడినది. ఇది శ్రవ్యప్రబంధమే యయ్యును ఇందలి కథ యంతయు పాత్రల సంవాదరూపమున సాగుటచే ఒక దృశ్యకావ్యము వలె కనిపించును. ప్రభావతీ ప్రద్యుమ్నుల నడుమ ప్రణయ దౌత్యము నడపిన శుచిముఖ అను రాజహంసి వాక్చాతుర్యమును కార్యసాధన కౌశలమును వర్ణించుటలో సూరన అప్రతిమానమైన నేర్పు ప్రదర్శించెను. అతడీ చక్కని ప్రబంధమును తన తండ్రి పేర నంకితము కావించి అపూర్వమైన పితృభ క్తిని వెల్లడించెను.

సూరన మహాపండితుడు. కథారసానుగుణముగ ఇతని శైలి ప్రౌఢత్వము నొందుచుండినను అది సాధారణముగా మృదుమధురమైన సరళగతినే నడచుచుండును. జాతీయములను, సామెతలను వాడుటలో ఇతడు కడునేర్పరి. సంభాషణముల నడుపుటయందును, పాత్రల చిత్తవృత్తుల చిత్రించుటయందును ఈతడు తిక్కన సోమయాజికి సాటి కాజాలును. శ్లేషరచనయం దీతడు అద్వితీయుడు. ప్రతిభావంతులైన ఆంధ్రమహాకవుల శ్రేణిలో సూరనకు ఉన్నతమైన స్థానము కలదు.

రామరాజభూషణుడను బిరుద నామముగల భట్టుమూర్తికూడ అష్టదిగ్గజకవులలో నుండెనో లేదో చెప్పజాలము. కృష్ణ దేవరాయల అల్లుడయిన అళియరామరాయల కొలువున కీతడు భూషణమై ఉండుటచే ఇతనికి రామరాజభూషణు డను బిరుధము కలిగినది. ఇతని మొదటి పేరు మూర్తి యనియు బట్టుకులమువా డగుటచే బట్టుమూర్తియను ప్రచారము కలిగె ననియు చెప్పుదురు. ఇతడు గొప్ప పండితుడు, అవధానములందును, ఆశు కవిత్వమునందును ఆరితేరిన వాడు. ఇతడు మొదట హనుమంతునికిని, తరువాత శ్రీరామచంద్రునికిని భక్తుడు. సంగీతకళా రహస్యనిధి. ఇతని రచనలలో ఇతనికి గల బహుశాస్త్రపాండిత్యము వ్యక్తమగును.

ఇతడు నరసభూపాలీయ మను నామాంతరముగల కావ్యాలం కారసంగ్రహమును, హరిశ్చంద్రనలోపాఖ్యాన మను ధ్వ్యర్థికావ్యమును, వసుచరిత్రమను మహాప్రబంధమును రచించెను. ఇందు మొదటిది సంస్కృతమున విద్యానాథుడు రచించిన ప్రతాపరుద్ర యశోభూషణము ననుసరించి వ్రాయబడిన లక్షణ గ్రంథము. ఇందు కావ్య ధ్వని రసాలంకారము లను గూర్చియు నాయికానాయకు లను గూర్చియు, గుణదోషములను గూర్చియు వివరింప బడినది. ప్రతాపరుద్ర యశోభూషణమున నున్న నాటక ప్రకరణ మిందు లేదు. అందు లక్ష్యములన్నియు ప్రతాపరుద్ర వర్ణన పూర్వకములైయుండ ఇందు అళియరామరాయల మేనల్లుడును, ఓబయరాజు కుమారుడు నగు నరస భూపాలుని వర్ణించునట్టివిగా నున్నవి.

భట్టుమూర్తి రచనలలో శ్రేష్ఠమైనదియు ఆంధ్ర వాఙ్మయమునకు అలంకారమని చెప్పతగినదియు వసు చరిత్రము. ఇది రామరాయల తమ్ముడును, తాళికోట యుద్ధమైన పిమ్మట, విజయనగర రాజ్యము నేలినవాడును అగు తిరుమలరాయలకు అంకితము చేయబడినది. వసు మహారాజు శుక్తిమతీ కోలాహలుల పుత్రిక యైన గిరికను వలచి ఫెండ్లియాడిన వృత్తాంతము ఇందలివస్తువు. భట్టు మూర్తి, కథను మహాభారతమునుండి గ్రహించి, ఎడ నెడ వర్ణనములను చేర్చి ఈ మహాప్రబంధమును నిర్మించెను. ఇందు కథారామణీయకమంతగా కానరాదు కాని, కవితా పాండిత్య ప్రకర్షయందును, భావోన్నతియందును, రస పోషణమునందును, శ్లేషధ్వని కల్పనలందును ఇది అద్వితీయముగా నుండును. ప్రబంధ లక్షణములన్నియు ఇందు కానవచ్చును. ద్వితీయాశ్వాసమున శుక్తిమతీకోలాహలుల వృత్తాంతము వర్ణించుపట్ల భట్టుమూర్తి చూపిన కవితా చమత్కారమును, నాయికా నాయకత్వా రోపణమును అద్భుతములుగా నుండును. తృతీయాశ్వాసము నందలి విరహాది వర్ణనలు అనన్యసామాన్యములు. లతికాసంవృత గాత్రుడైన వసురాజు కపటముని వేషధారియగు తన నర్మసఖుని సూచన ననుసరించి బయల్పడుపట్టున దృశ్య కావ్యలక్షణములు గోచరించును. ఇందలి ప్రకృతివర్ణనలు సహజముందరములై యుండును. భట్టుమూర్తి శైలి ప్రౌఢమయ్యు మృదుమధురమై సంగీతమున కనువుగా గోచరించును. లలవాజనాపాం గేత్యాది సీసపద్యముల నడక అత్యంత హృద్యముగా నుండును, వసుచరిత్ర సంస్కృతమునకు కూడ అనువదింపబడుటయే దీని ఔత్కృష్ట్యమునకు తార్యాణము. ఆంధ్రప్రబంధ వాఙ్మయ తారహారమున కిది నాయకమణి యని చెప్పవచ్చును. తరువాతి కవు లెందరో దీని ననుకరించి యుండుటచే వారి రచనలకు పిల్ల వసుచరిత్ర అను పేరు కలిగినది.

హరిశ్చంద్ర నలోపాఖ్యానమను ద్వ్యర్థికావ్య మీతని తుది రచన. ఇందు నల హరిశ్చంద్ర మహారాజుల కథలు చక్కగా జోడింపబడినవి. రామాయణ భారతకథలకువలె ఈ రెండు కథలకు సన్ని వేశసామ్య మంతగాలేకపోయినను భట్టుమూర్తి తన అపూర్వ పాండిత్య ప్రతిభావి శేషములచే అద్భుతమైన శ్లేష కూర్చి వాని నేక సూత్రమున సంధింప జాలెను. ఇతని శ్లేష సంఘటన వైఖరిని పాండితీ వైభవమును చూచి అచ్చెరువు పొందనివా రుండరు. శ్లేష కావ్యమయ్యు ఇందలి వర్ణనలు సహజసుందరములును, రసవంతములు నై యొప్పారును. ఈ కావ్య ప్రారంభమున భట్టుమూర్తి భక్తిభావము లెస్సగా వ్యక్తము చేయబడినది.

అష్టదిగ్గజములలోని వాడుగా ప్రసిద్ధినందియు రాయల కాలమున ఉండేనా లేదా అను సందేహము కలిగించు వారిలో తెనాలిరామకృష్ణు డొకడు. ఈతని చాటువులును, హాస్యోక్తులును ఆంధ్ర దేశమున చాల ప్రచారము పొందినవి. ఇతడు రచించిన గ్రంథములు రెండు. ఉద్భటారాధ్య చరిత్రము, పాండురంగ మాహాత్మ్యము. ఉద్భటారాధ్య చరిత్రము శైవప్రబంధము, దీనిని రచించిన రామలింగ కవి రామకృష్ణునికంటె భిన్నుడని కొందరందురు. కాని ఇతడే మొదట రామలింగ డయ్యు తరువాత వైష్ణవమును స్వీకరించి రామకృష్ణు డయ్యెనని తోచుచున్నది. అప్పుడు కూడ శై వమన్న ఆతనికి వైముఖ్యము లేదు.

పాండురంగ మాహాత్మ్యము భీమనదీతీరమునందలి పుండరీక క్షేత్రము యొక్క మహత్త్వమును వర్ణించు క్షేత్ర మాహాత్మ్యము. ఇందలి కథ స్కాందపురాణము నుండి గ్రహింపబడినది. క్షేత్రము, తీర్థము, దైవము,అను మూడును ఉదాత్తములై యుండు ప్రదేశ మేది యను ప్రశ్నకు ఉత్తరముగా ఇందలికథ చెప్పబడినది. ఇందలి ద్వితీయా శ్వాసము నందలి పుండరీకుడను పరమ భక్తాగ్రేసరుని వృత్తాంత మతిరమణీయముగా నుండును. పాండు రంగ క్షేత్ర మాహాత్మ్యమును సూచించు నితరకథ లెన్నియో ఇందుగలవు. వానిలో నిగమశర్మకథయు, సుశీల కథయు ముఖ్యములైనవి. వీటియందును, అయుతనియుతుల కథయందును రామకృష్ణుడు చూపిన కథా కథనపద్ధతి మిక్కిలి రమ్యముగా నుండును. పాండురంగ మాహాత్మ్యము కడుంగడు ప్రౌఢమైన ప్రబంధము. దీర్ఘ సంస్కృత సమాసములతోడను, అపరిచిత పద ప్రయోగముతోడను కూడి ఇందలి శైలి పఠితకు కొంత క్లేశము కలిగించును. ఇట్లని రామకృష్ణు డచ్చట చ్చట ముచ్చటగొల్పు తెలుగురచన సాగింపకపోలేదు. ఈ కావ్యమున పెక్కు సామెతలును జాతీయములును సందర్భోచితముగా పొదుగబడినవి. గంభీర భావప్రకటన మందును, రసపాత్ర పోషణమునందును రామకృష్ణుడు మిక్కిలి నేర్పరి.

అష్టదిగ్గజ కవులలోని వాడు కాకపోయినను రాయల వారి కాలమున నుండిన మహాకవులలో సంకుసాల నృసింహకవి యొకడు. ఇతడు కవికర్ణ రసాయన మను నామాంతరముగల మాంధాతృ చరిత్రమును రచించి శ్రీరంగేశ్వరునికి అంకితము చేసెను. ఇతడు భట్ట పరాశరుని శిష్యుడు. ఈ పరాశరుడు క్రీ. శ. 1536 వ. సంవత్సరములో నుండెననుటకు శాసనసాక్షము కలదు. అందుచే నృసింహకవి క్రీ. శ. 16వ శతాబ్ది పూర్వార్థమున నుండెనని చెప్పుటకు అవకాశము కలుగుచున్నది.

కవికర్ణ రసాయనము ఆరాశ్వాసముల శృంగార ప్రబంధము, ఇందు మాంధాతృచక్రవర్తి చరిత్రమును,అతడు విమలాంగిని వివాహమాడిన వృత్తాంతమును చక్కగా వర్ణింపబడినవి. తన కావ్యమునందలి శృంగార రసవర్ణనమును విన్న మాత్రమున యతి విటుడు కాకపోడనియు, అందలి వై రాగ్యవర్ణ నాకర్ణనమాత్రమున విటుడు యతి కాకపో డనియు ఆతడు చెప్పుకొని యుండెను. ఇందు కొంత అతిశయోక్తి యున్నను ఈకవి ప్రతిభాశాలి యనుటకు సందేహములేదు. ఈతని వర్ణనలు గంభీర భావశోఖితములై మిక్కిలి మనోహరములుగా నుండును. ఇతడు కావ్యారంభమున రాజులను నరకృతిని నిరసించి యుండెను. ఈతనిశైలి సంస్కృత సమాస భూయిష్ఠ మయ్యును ధారాళమై మిక్కిలి రసవంతముగా నుండును.

తెలుగున కవిత్వమువ్రాసి పేరుగన్న పనితారత్నములలో ఆతుకూరి మొల్ల మున్నెన్న దగి యున్నది. ఈమె కాలమును సరిగా నిర్ణయించుటకు ఆధారములు లేవు. కాని పూర్వక విస్తుతిలో ఈమె శ్రీనాథుని తరువాత నుండిన కవీంద్రుల నెవ్వరిని పేర్కొనియుండమిచే, ప్రబంధకవుల కాలముననే యుండె నని యూహింప వీలగు చున్నది. ఈమె తాను గోపవరపు శ్రీకంఠమల్లేశుని దయచే కవితా కౌశలము నేర్చితినని చెప్పుకొనియున్నది. ఈమె మిక్కిలి వినియముకలది. తనకు నిఘంటువులు, వ్యాకరణాలం కారాది శాస్త్రములు తెలియవనియు, శ్రీరామచంద్రుని ప్రేరణముచే తా నిహపర సాధనమునకై రామాయణమును రచించితిననియు, సవినయముగ తెల్పియున్నది. తెలుగు కవిత్వము దుర్బోధములైన సంస్కృత సమాసములతో కూడియుండక తేట తెలుగు మాటలతో ధ్వని ప్రధానమై యుండవలె ననియు, తేనె సోకినంతనే నోరు తీయనగురీతిని విన్న తోడనే యర్థమెల్ల తోచునట్లుండవ లెననియు, అట్లుగాక గూఢశబ్దములతో కూర్చిన కావ్యము మూగ చెవిటి వారి ముచ్చటవలె నుండుననియు, ఈమె కవిత్వమును గూర్చి తన అభిప్రాయమును వెల్లడించెను. ఈమె తన రామాయణమును శ్రీరామునికే అంకితము కావించెను.

మొల్ల తనకంత విద్యాసంపన్నతలేదని చెప్పుకొని యున్నను ఈమె కావ్యమున పాండిత్యలోప మెచ్చటను కానిపించదు. ఈమె వర్ణనలన్నియు ప్రబంధోచితములై మిక్కిలి ప్రౌఢముగా నుండును. అందును సాకేత నగర వర్ణనము శ్లేష శబ్దాలంకార పూరితమై ఈమె పాండితీ విశేషమును పలువిధముల సూచించుచున్నది. అయోధ్యా కాండము మొదట ఈమె కావించిన ప్రకృతివర్ణనము మిక్కిలి రమణీయముగా మన్నది. ఈమె సుందర, యుద్ధ కాండములను కొంచెము విస్తృతముగ వ్రాసినను మిగిలిన కాండములను చాల సంగ్రహించి వైచినది. ఈమె రామాయణమున కథ మిక్కిలి వేగముగా సాగిపోయినది. సీతాప హరణానంతరము రాముడు పొందిన దుఃఖము నీమె కరుణరస నిర్భరముగా వర్ణించినది. అట్లే సుందరకాండమున హనుమంతునితో సీత తన వృత్తాంతమును చెప్పుకొన్న ఘట్టముకూడ మిక్కిలి జాలిగొల్పునదై మొల్ల స్త్రీ హృదయమును వెల్లడి చేయుచున్నది. ఔచిత్యపోషణమున నీమె అందెవేసిన చేయి. ఈమె శైలి మృదుమధుర పద గుంఫితమును, భావబంధురమునై సర్వజన రంజకముగా నుండును. తెలుగున సంకీర్తనము లనబడు భక్తి గేయములను వ్రాసినవారిలో మొదటివాడు తాళ్ళపాక అన్నమాచార్యుడు. ఈతడు క్రీ. శ. 15 వ శతాబ్ది ఉత్తరార్ధమున జీవించియుండెను. ఇతడును, ఇతని సంతతివారును శ్రీ తిరుపతి వేంకటేశ్వర స్వామి వారి సన్నిధిని సంకీర్తనాచార్యులుగ నుండిరి. ఇతడు భక్తిశృంగారమయములైన కీర్తనలెన్నో రచించి స్వామి సన్నిధిని పాడుచుండెడి వాడట. ఇతని గేయములు భావపూరితములును మృదు మధుర పద బంధురములునై మిక్కిలి హృద్యముగా నుండును. ఇతడు తన గేయములలో సందర్భోచితముగ వ్యావహారిక భాషను గూడ వాడియుండెను. ఇతనికి పద కవితాపితామహుడను సార్థకమైన బిరుద నామముకలదు.

అన్నమాచార్యుని కుమారుడు పెద తిరుమలాచార్యుడు. ఇతడు కృష్ణదేవరాయలకు సమకాలికుడు. తెలుగున వచనైక రచనలు వెలయించినవారిలో సింహగిరి వచనములను రచించిన కృష్ణమాచార్యులు మొదటివాడు. రెండవవాడు పెదతిరుమలాచార్యుడు. ఇతడు రచించిన వచనములకు వేంకటేశ్వర వచనములని పేరు. ఇవియును సింహగిరి వచనములవలెనే భక్తుడు భగవంతునికి కావించిన విన్నపములు. ఇవి ఛందోరహితములైనను తాళ రాగ సమన్వితముగా పాడుటకు అనువైనవి. ఆత్మనివేదన రూపములును, ప్రపత్తిపూరితములునైన ఈ వచనములు భక్తి భావభరితములై శతకములందలి పద్యములను పోలి యున్నవి. ఇందలి రచన అలతియలతి వాక్యములతోగూడి నిర్దుష్టమై మిక్కిలి శ్రవణానందకరమై యుండును. ఇది కాక ఇతడు శృంగారకీర్తనలు, శృంగార దండకము, శృంగార వృత్తశతకము, వేంకటేశ నీతిశతకము, వేంక టేశొదాహరణము, చక్రవాళమంజరి అను కృతులను కూడ రచించియుండెను. ఇతని కవిత ధారాశుద్ధి కలిగి ద్రాక్షాపాకమై విరాజిల్లుచుండును.

తాళ్ళపాక తిమ్మక్క (తిరుమలాంబ) సుభద్రా కల్యాణ మను ద్విపద కావ్యమును రచించెను. ఈమె పెదతిరుమలా చార్యునకు సవతితల్లి. ఈ సుభద్రాకల్యాణము పరిమాణమున చిన్నదయ్యు రసవంతముగా నుండును. సుప్రసిద్దు డయిన చేమకూర వేంకటకవి తన విజయవిలాస మందలి సుభద్రాపరిణయమున ఈమె కావ్యమును పెక్కుచోట్ల అనుసరించినట్లు కనబడుచున్నది. సుభద్రా పాత్రను చిత్రించుటలో వేంకటకవికంటె తిమ్మక్కయే ఎక్కువనేర్పు చూపెనని విమర్శకుల అభిప్రాయము.

తాళ్ళపాక చిన్నన్న పెద తిరుమలాచార్యుల తనయుడు. ఇతడు అష్టమహిషీ క ల్యాణము, పరమయోగి విలాసము, ఉషాపరిణయము, అన్నమాచార్యచరిత్రము అను నాలుగు ద్విపద కావ్యములను రచించెను. “చిన్నన్న ద్విపద కెరగు" నను పద్యమున పేర్కొనబడిన చిన్నన్న ఈతడే. మధుర మంజులములగు పదములతో ద్విపదలనుకూడ విసువు జనింపకుండ రచించుటలో ఈకవి చాల నేర్పరి. దినమునకు వేయి ద్విపదలు రచింపగల నని ఈతడు చెప్పుకొని యున్నాడు. అష్టమహిషీ కల్యాణారంభమున ఈతడు తాను ద్విపదరచనలో అవలంబించిన లక్షణములను వివరించి యున్నాడు.

చిన్నన్న అన్నయైన చినతిరుమలాచార్యులు కూడ కవియే. ఇతడు అధ్యాత్మ శృంగార కీర్తనలు, అష్టభాషా దండకము, సంకీర్తన లక్షణము అను పద్యకావ్యము రచించెను. ఈసంకీర్తన లక్షణ మీతని తాత యైన అన్నమాచార్యులు సంస్కృతమున రచించిన గ్రంథమునకు తెలుగుచేత. ఇతడు అష్టభాషాదండకమున తనకు సంస్కృత ప్రాకృతాద్యష్ట భాషల యందు కల పాండిత్యమును ప్రదర్శించెను. ఇతని కుమారుడైన తిరువేంగళప్ప మమ్మటుని కావ్యప్రకాశికకు సుథానిధి అను వ్యాఖ్యానమును, అమరకోశమునకు బాలప్రబోధిక అను తెలుగు టీకను రచించెను. ఆంధ్రామరుకము కూడ ఇతని రచనయే అని కొందరి అభిప్రాయము.

వెలగపూడి వెంగయామాత్యుడు (క్రీ.శ. 1530) బిల్వమంగళుడను నామాంతరముగల లీలాశుకుడను కవి సంస్కృతమున రచించిన శ్రీకృష్ణకర్ణామృతమునందలి మూడువందల శ్లోకములను మూలమునందలి భావములు చెడకుండ అతి మధురముగ అనువదించి యుండెను,

కాసె సర్వప్ప సిద్ధేశ్వర చరిత్రమను చారిత్రక కావ్యము రచించెను. దీనికే ప్రతాపచరిత్రము, కాకతీయరాజ వంశావళి అని నామాంతరములు కలవు. సర్వప్ప కాల మిదమిత్థమని నిర్ణయించుటకు వీలులేదు కాని ఈతడు ప్రతాపరుద్రుని ఆస్థానమునందలి కవులను పేర్కొనుచు

కుమ్మరి మొల్లనుగూడ పేర్కొని యుండుటచే ఆమెకు అర్వాచీనుడై యుండెనని ఊహింపవచ్చును. దీనినిబట్టి ఇతడు క్రీ. శ. 16వ శతాబ్ది పూర్వార్థమున నుండెనని చెప్పనగును. ఏకామ్రనాథుడు చెప్పిన కథను అనుసరించియు, నాగనాధుని అనుమతి వడసియు తాను ఆ రాజవంశావళిని రచించితి నని సర్వప్ప చెప్పియుండెను. పార్వతీ పరమేశ్వరులు కైలాసమును వీడి పద్మాక్షీసిద్ధేశ్వరులుగా అవతరించిన వృత్తాంతముతో ఈగ్రంథము ఆరంభమగుచున్నది. సోమదేవరాజు కుమారుడైన మాధవవర్మ కటక బల్ల హు నోడించి శా. శ. 230 వత్సరమున సింహాసనము నధిష్ఠించినట్లు సిద్ధేశ్వర చరిత్ర చెప్పుచున్నది. ఈతని వంశముననే భువనైకమల్లుడు జనించెను. ఆతని కుమారుడు త్రిభువనమల్లుడు. ఇతని సుతుడు కాకతి ప్రోలరాజు. ఇతడు క్రీ. శ. 1068 ప్రాంతమున ఓరుగల్లు పట్టణమును స్థాపించెను. రుద్రదేవుడు, మహాదేవుడు అను వారు ప్రోలరాజు కుమారులు. సిద్ధేశ్వర చరిత్రనుబట్టి గణపతిదేవుడు రుద్రదేవుని కుమారుడేమోయని సందేహము కలుగుచున్నది. నెల్లూరునుండి తిక్కన సోమయాజివచ్చి గణపతిదేవుని దర్శించినట్లును, గణపతిదేవుడు నేనలను పంచి మనుమసిద్ధుని రాజ్యస్థాపితుని కావించి నట్లును ఈ గ్రంథము చెప్పుచున్నది. రుద్రమ్మ గణపతి దేవుని భార్యయని ఈ గ్రంథమున చెప్పబడినది. ఇట్టివే ఇంకను పెక్కు పొరపాట్లిందు కలవు. ప్రతాపరుద్రుని చరిత్రమిందు విపులముగ వర్ణింపబడినది. ఈసందర్భమున అద్భుతములు పుక్కిటి పురాణములు మెండుగా నున్నవి. ఇచ్చట ఓరుగల్లు నగరము సవిస్తరముగా వర్ణితమైనది ఆనగరము వైభవము, అందలి గుడులు, గోపురములు, వివిధవర్ణముల ప్రజలు, ప్రతాపరుద్రుని ముఖ్యోద్యోగులు అప్పుడు ప్రసిద్ధి కెక్కిన కవులు మున్నగు విషయము లెన్నో ఇందు వివరింపబడినవి. మహమ్మదీయులు ఏడు సారులు ఓరుగల్లునగరమును ముట్టడించియు ప్రతాప రుద్రుని ప్రతాపమున కాగలేక పారిపోయి రనియు పద్మాక్షీదేవి కాకతీయ వంశమున కొసగిన వేయిఏండ్ల పరిమితి నిండిపోవుటచే చివరి యుద్ధమున ప్రతాపరుద్రుడు చెర పెట్టబడెననియు, తరువాత అతడు విడువబడి గోదావరీ నదియం దైక్యమయ్యెననియు సిద్ధేశ్వర చరిత్రము మడువు చున్నది. సిద్ధేశ్వర చరిత్రమున కొంతభాగము వచన రూపమునను కొంత భాగము ద్విపద రూపమునను వ్రాయబడినది. ద్విపద భాగముకంటె వచన భాగమే సరసముగా నున్నది. మొత్తముమీద రచన అప్రౌఢమును బహుదోష దూషితమునై యున్నది. ఈ గ్రంథమున విషయ ప్రాధాన్యమేకాని కవితాప్రాధాన్యమంతగా కానరాదు.

అందుగుల వెంకయ్య అను కవి (క్రీ.శ.1630) నరపతి విజయ మను నొక చారిత్రక కావ్యమును వ్రాసి అళియ రామ రాయల మునిమనుమడైన కోదండరామరాజునకు అంకితమిచ్చెను. ఈ గ్రంథమునకు రామరాజీయ మను నామాంతరము కలదు. ఆ కాలమున విజయనగర రాజులకు నరపతులను పేరుండెను. అందుచేతనే కవి తన గ్రంథమునకు నరపతి విజయ మని పేరుపెట్టెను. ఇందు ఆర్వీటి వంశమువారి విక్రమవై భవములు వర్ణింపబడినవి. తాళికోట యుద్ధమున రామరాయలు మరణించిన వృత్తాంత గ్రంథమున చెప్పబడియుండ లేదు. రామరాయల తమ్ముడైన తిరుమల రాయలయు, అతనికుమారుడైన వీరవేంకటపతిరాయలయు పరిపాలనము లిందు వర్ణింపబడినవి. ఇందు చెప్పబడిన చారిత్రకాంశములు పెక్కు యథార్థములుగానే కానబడుచున్నవి. ఇందలి వస్తువు చరిత్ర ప్రధానమైనను వెంకయ్య దీనిని కడు సరసముగ రచింపజాలెను. ఇం దాత డచ్చటచ్చట గర్భ కవిత్వమును కూడ వ్రాసియుండెను. ఇతని శైలి సులభ సుందరమై సర్వజన సుబోధముగ నున్నది.

ఈ కాలమున రచింపబడిన మరియొక చారిత్రక కావ్యము కృష్ణరాయ విజయము. దీనిని రచించిన వాడు వేంకటార్యుడు. ఇతనికి కుమారధూర్జటి అను నామాంతరము కలదు. శ్రీ కాళహస్తిమాహాత్మ్యము రచించిన ధూర్జటి తన పెదతాతయని ఈతడు చెప్పుకొనెను. ఇతడు నరపతి విజయ కృతిపతియైన కోదండరామరాజు కుమారుడైన ఆర్వీటి చిన వేంకటరాయని ప్రేరణముచే ఈ గ్రంథమును రచించి శ్రీరాముని కంకితము కావించెను. దీనినిబట్టి ఈతడు క్రీ.శ. 1650 సంవత్సరము ప్రాంతమున ఉండెనని చెప్పవచ్చును. ఇందు కృష్ణరాయల పరాక్రమమును పరిపాలన క్రమమును విపులముగా వర్ణింపబడియున్నవి. రాయలు తిమ్మరుసు సాయమున రాజ్యమునందలి అంతర వ్యవస్థను చక్క పెట్టి తరువాత దండయాత్రలకు బయలుదేరెను. ముందాతడు దక్షిణమున కేగి ఉమ్మత్తూరు, శివ సముద్రములనేలు గంగరాజు నోడించెను. పిమ్మట రాయచూరు, ముదగల్లు కోటలను స్వాధీనము చేసికొని కృష్ణా నదీతీరముల మహమ్మదీయుల సంయుక్త సేనల పరాభవించెను. తరువాత అతడు కటకము జయించి కళింగరాజు కూతురైన తుక్ఖ్హాదేవిని పెండ్లియాడెను. ఈవిధముగా ఇందు శృంగారరసమునకుకూడ సుంతప్రవేశము లభించుటచే కుమారధూర్జటి ఈసందర్భమున ప్రబంధోచితములయిన వర్ణనలు కావించెను. వీరరసపోషణమున ఇతడు మిక్కిలి నేర్పు ప్రదర్శించెను. ఇతని శైలి సులభమును సరసమునై యొప్పారును. కావ్యారంభమున ఇతడు కావించిన విద్యానగర నిర్మాణ వృత్తాంతమును, ఆ నగర వర్ణనమును మిక్కిలి రమణీయములుగా నున్నవి. ఇతని గ్రంథమున చారిత్రకముగా చూచిన కొన్ని పొరపాట్లు కానబడుచున్నవి. తుళువ నరసనాయకుని తరువాత వీరనరసింహరాయలుకాక కృష్ణరాయలే సింహాసనము నధిష్ఠించెనని ఈతడు వ్రాసెను. ఈ గ్రంథమునందలి అంశములు పెక్కులు రాయవాచకమునందలి వానితో సరిపోలుచున్నవి. కృష్ణరాయ విజయమునకు ముందు కుమారధూర్జటి సావిత్రీ చరిత్రము, ఇందుమతీ వివాహము అను కావ్యములనుకూడ రచించియుండెను.

కందుకూరి రుద్రకవి క్రీ. శ. 17 వ. శతాబ్ది పూర్వార్ధమున నుండెనని కొందరును క్రీ. శ. 1550 నుండి 1580 వరకు పాలించిన ఇబ్రహీంషావలన చింతలపాలెమును అగ్రహారముగా పడసిన రుద్రకవి ఈతడే యగుటచే క్రీ. శ. 16 వ శతాబ్ది ఉత్తరార్ధమున నుండెనని కొందరును చెప్పుచున్నారు. ఇతడు సుగ్రీవ విజయ మను యక్షగానమును, నిరంకుశోపాఖ్యాన మను ప్రబంధమును రచించెను. సుగ్రీవ విజయ మింతవరకు లభించిన యక్షగానములలో మొదటిది. సీతాన్వేషణ పరాయణులై వచ్చిన రామలక్ష్మణులను హనుమంతుడు దర్శించుటతో ఇది మొదలిడి వాలి వధానంతరము సుగ్రీవుడు పట్టాభిషిక్తుడగుటతో ముగియుచున్నది. వాలిమరణదుఃఖితయై తార శ్రీరాముని దూరినఘట్ట మిందు కరుణరస భరితమై హృదయ ద్రావకముగా నున్నది. ఇట్లే వాలి సుగ్రీవుల యుద్ధము,సప్తతాళభంజనము మున్నగు ఘట్టములందు వీరరసము పోషింపబడినది. ఇందు ద్విపదలు, దరువులు, అర్ధ చంద్రికలు, ఏలలు మున్నగు దేశిరచనలు కలవు. నిరంకుశో పాఖ్యానము కందుకూరు గ్రామమున వెలసిన సోమేశ్వరున కంకితము చేయబడినది. ఈ ప్రబంధమున నిరంకుశుడను సార్ధక నామధేయుడగు బ్రాహ్మణధూర్తుని సాహసిక ప్రవృత్తి వర్ణింపబడినది. ఈ కథ పెక్కు విధముల తెనాలి రామకృష్ణుని నిగమశర్మకథను పోలియుండును. సంభోగ వ్యసనమున తగుల్కొనియు, పాపమునొందనివాడు కలడా యని ధర్మశీలుడను రాజు అడుగ దానికి సమాధానముగా పులస్త్యమహర్షి ఈ కథ నెరిగించెను. వేశ్యమాత యొక్క క్రౌర్యమును, నిరంకుశుడు జీర్ణ దేవాలయమున శివలింగమును చూచి తనతో జూదమాడ రమ్మని బలవంత పెట్టిన ఘట్టమును ఇందు మిక్కిలి రమణీయముగా వర్ణింపబడినవి. పురవర్ణనాదుల సందర్భమున ఇందు వసుచరిత్రరీతులు స్ఫుటముగా కనిపించును. రుద్రకవి ఈ కథాద్వారమున ప్రకటించిన పరమార్థ మేమియు లేకపోయినను, సరసమైన శైలిచేతను,అందందు కానబడు ప్రౌఢ సస్కృతరీతులచేతను, జాతీయములైన నా నుడుల చేతను, ఈ ప్రబంధమును పఠితృ జనానంద సంధాయకమును కావింపజాలినాడు.

ఈ యుగమున తెలంగాణమునందు కొన్ని ఉత్తమ కావ్యములు వెలువడినవి. అందు పెక్కు కావ్యములు మహమ్మదీయ రాజులయు వారి సామంతులయు పోషణము నందియుండుట గమనింపదగినది. చరిగొండ ధర్మన్న చిత్రభారతమును వ్రాసి చిత్తాపుఖానుని మంత్రియైన ఎన్ములపల్లి పెద్దామాత్యునికి అంకితము చేసెను. ఓరుగల్లులో దొరకిన యొక శాసనమునుబట్టి చిత్తాపుఖానుడు ఆంధ్ర వీర శేఖరు డనియు, క్రీ. శ. 1504 సం॥ ప్రాంతమున మహమ్మదీయులనుండి ఓరుగల్లుకోటను వశపరచుకొని సమర్థతతో పాలించె ననియు తెలియు చున్నది. చిత్రభారతమునందలి కథ బ్రహ్మాండపురాణము నుండి గ్రహింపబడినది. పేరునకు తగినట్లిది మిక్కిలి చిత్రముగానుండును. ఇందెడనెడ చిత్రక విత్వముకూడ కాననగును. కీ. శే. చిలకమర్తి లక్ష్మీనరసింహం పంతులుగారు రచించిన ప్రసిద్ధమైన గయోపాఖ్యాన నాటకము నందలి కధకు మూలములైన గ్రంథములలో ఇదియు నొక్కటి. ఇందు వీరరసము మిక్కిలి నిపుణముగా వర్ణింపబడినది.

హరిభట్టు అను కవి (క్రీ.శ. 1530) వరాహపురాణము మత్స్యపు రాణము, భాగవతమునందలి షష్ఠి కాదశ ద్వాదశ స్కంధములు, నరసింహ పురాణము అను గ్రంథములను రచించెను. ఇందు మత్స్య నరసింహపురాణములు మాత్రమే ముద్రితములైనవి. ఇందు వరాహ నరసింహ పురాణములుతప్ప మిగిలినవన్నియు భగవదంకితములు చేయబడినవి. వరాహపురాణము నిజాము రాష్ట్రము నందలి ఖమ్మం మెట్టు గ్రామమునకు కరణమైన కొలిపాక ఎఱ్ఱయామాత్యున కంకితము కావింపబడెను. హరిభట్టు మత్స్యపురాణమును పూర్తిగా అనువదించి యుండ లేదు. అందలి విష్ణుధర్మోత్తర ఖండమును మాత్ర మైదాశ్వాసములలో రచించెను. ఇందు విష్ణుపూజాఫలము, తులసీ మాహాత్మ్యము మొదలగు భక్తి ప్రధానములగు కథలు వర్ణింపబడినవి. ఈగ్రంథము శ్రీరంగేశునికి అంకితము చేయబడినది. ఎఱ్ఱాప్రెగడ నరసింహ పురాణమునందలి పూర్వభాగమును మాత్రము రచించియుండుటచే, హరిభట్టు ఉత్తరభాగమును మాత్రము అనువదించి యుండెను, ఈగ్రంథము వచనకావ్యమని పేర్కొనబడినది. నిజమునకిది పద్యగద్యాత్మకమైన చంపూకావ్యమే కాని వచన కావ్యముకాదు. హరిభట్టు రచన సమ సంస్కృతాంధ్ర పద భూయిష్ఠమై మిక్కిలి మధురముగా నుండును.

తెలుగునందలి మొదటి అచ్చతెలుగుకా కావ్యము యయాతి చరిత్ర. దీనిని రచించినవాడు పొన్నికంటి తెలగన్న (క్రీ. శ. 16 వ శతాబ్ది ఉత్తరభాగము). ఇతడికావ్యమును ఇబ్రహీం కుతుబ్షాకు సామంతుడైన అమీను ఖాను అను మహమ్మదీయ సరదారున కంకితము చేసెను. ఇట్లు మహమ్మదీయ ప్రభువున కంకితము చేయబడిన మొదటి గ్రంథ మిదియే. ఇందలి కథ భారత భాగవతములనుండి గ్రహింపబడినది. తెలగన్న యయాతి చరిత్రము నందలి శృంగార భాగములకే ఎక్కువ ప్రాధాన్యమిచ్చెను. అచ్చ తెలుగను పేరున్నను ఇందు తద్భవములైన పదములును కృత్రిమములై న సమానములును పెక్కు కానిపించును.

తెలుగున అచ్చతెలుగు కవిత్వము అను ప్రత్యేక సంప్రదాయమునకు దారిచూపి దానిని సాధ్యమైనంతవరకు రసోత్తరముగా వెలయించిన తెలగన్న ఎంతయు ప్రశంసనీయుడు. ఇతని ప్రకృతివర్ణనలు రమణీయములును ఉదాత్త భావపూరితములునై మనోహరములుగా నుండును.

అద్దంకి గంగాధరకవి తపతీసంవరణోపాఖ్యానమను శృంగారప్రబంధమును రచించి గోలకొండ నవాబైన ఇబ్రహీం కుతుబ్ షా కంకితము చేసెను. ఇందలి కథ భారతమునుండి గ్రహింపబడినది. ఈప్రబంధము నవరస బంధురములైన కల్పనలతోకూడి వసుచరిత్రను తలపించు చుండును.

వైజయంతీ విలాస మనుపేర విప్రనారాయణ చరిత్ర మను ప్రబంధమును రచించిన సొరంగు తమ్మయ మహమ్మదు కుతుబ్షాకాలములో గోలకొండకు కరణముగా నుండెను. ఇతడు వైష్ణవమతాభిమాని, తన కావ్యమును శ్రీరామునికి అంకితము చేసెను. ఈ ప్రబంధము అత్యంత శృంగారమయమై అచ్చటచ్చట సభ్యతామర్యాదనుకూడ అతిక్రమించున ట్లుండును. ఐనను ఇందలికథ రమ్యము. భావములు గంభీరములు. రచన మధురము. వేశ్యాలోలత్వమువలని కీళ్లు ఇందు చక్కగా ప్రదర్శింపబడినవి.

మల్లా రెడ్డి అను కవి క్రీ. శ. 16వ శక్తాబ్ది అంతమున మెదకు సమీపమునందలి బిక్కనవోలు రాజధానిగా రాజ్యము చేసిన రెడ్డిరాజులవంశమునకు చెందినవాడు. ఇతడు షట్చక్రవర్తి చరిత్రము, శివధర్మోత్తరము, పద్మ పురాణము అను గ్రంథములను రచించెను. షట్చక్రవర్తి చరిత్రమున హరిశ్చంద్రాదు లగు ఆర్గురు చక్రవర్తుల కథలు వర్ణింపబడినవి. ఇందు ప్రబంధ సామాన్యములగు వర్ణన అన్నియు గోచరించును. ఇందలి రచన శ్లేషశబ్దాలంకారములతోకూడి వసుచరిత్ర రచనను తలపించు చుండును. శివధర్మోత్తరము శివపారమ్యమును బోధించు గ్రంథము. ఇందు శైవమతధర్మము, వేదాం తము, శైవాచారములు వర్ణితములై యున్నవి. మల్లారెడ్డి శ్లేషాదులకై అంతగా యత్నింపనికతమున అతని పద్మ పురాణమునందలి కవిత్వము సులభమును సహజమునై అలరారుచుండును. ఇందలి నాల్గవ ఆశ్వాసమున రామాయణ కథ చెప్పబడినది. వాల్మీకి రామాయణము నందలి కథకును ఇందలి కథకును కొన్ని భేదములు కాన వచ్చుచున్నవి . మల్లా రెడ్డియు అతని వంశీయులును శివ భక్తి పరాయణులు. ఈతని సోదరులలో కామిరెడ్డి, ఎల్లారెడ్డి అనువారు సాహిత్యప్రియులై కవులను పోషించి వారివలన కావ్యము లంకితము పొందినట్లు తెలియు చున్నది. మల్లా రెడ్డి కావ్యములం దతని వినయశీలమును భ్రాతృభక్తియు చక్కగా వెల్లడిచేయబడినవి.

దక్షిణాంధ్రయుగము  :- ఈ యుగమున ఆంధ్ర దేశముననేకాక మధుర, తంజావూరు, పుదుక్కోట, జింజి. మైసూరు మున్నగు దక్షిణ దేశపు రాజ్యములందు కూడ ఆంధ్రవాఙ్మయము వర్ధిల్లినది. ఇందు ముఖ్యముగా పేర్కొనదగినవి మధుర, తంజావూరు నాయక రాజ్యములు. ఈ రాజ్యముల స్థాపనమునుగూర్చి శ్రీ నేలటూరి వేంకట రమణయ్యగారిట్లు చెప్పుచున్నారు:- విజయనగరరాజు లారంభమునుండియు మహమ్మదీయ రాజులతో పోరాడవలసి వచ్చుచుండెను. అందుకై వారికి విస్తృతమైన సేనయు, ధనమును ఆవశ్యకము లగు చుండెను. భూమినుండివచ్చు ఆదాయమును సైన్య పోషణమునకై వినియోగించు విషయమున రాయలొక పద్ధతి నవలంబించెను. దేవదేయ, బ్రహ్మదేయములు కాక మిగిలిన గ్రామము లన్నిటిని అతడు భండారవాడ గ్రామములు, అమర గ్రామములు అని రెండురకములుగా విభజించెను. రాజు దళనాయకులకు కొన్ని నిబంధనములమీద ఇచ్చు గ్రామములకు అమర గ్రామము లని పేరు. యుద్ధము సంభవించునప్పుడు నిర్ణీత సంఖ్యగల గజాశ్వబలముతో వచ్చి సాయముచేయుట,ఏటేట నిర్ణీతమైన కొంత ధనమును కప్పముగా నొసగుట అను రెండును ఈ అమరపద్దతి యందలి ముఖ్య నిబంధనములు. రాయల మరణానంతరమును, రాక్షసతంగడి (తళ్ళికోట) యుద్ధానంతరమును విజయనగర సామ్రాజ్యమున వర్తిల్లిన అరాజక పరిస్థితుల నవకాశముగా గైకొని ఈ అమర నాయకులు పరిసరములందలి అమర రాజ్యముల నాక్రమించుకొని నూతన సంస్థానములను స్థాపించిరి. ఇట్టి వానిలో మధుర, తంజావూరు, జింజి రాజ్యములు ముఖ్యములైనవి. ఈ రాజ్యములు దక్షిణమున నుండుటచే వీనికి శత్రుభయ మంతగా లేకుండెను. అందుచే సారవంతములైన రాష్ట్రముల నుండి వచ్చు ఆయమును యథేచ్ఛముగా అనుభవించుచు సంగీత సాహిత్యములతో కాలక్షేపము చేయుటకు ఆ రాజుల కవకాశ మేర్పడెను. రాక్షస తంగడి యుద్ధానంతరము విజయనగర సామ్రాజ్యము మహమ్మదీయుల దుండగములకు నెలవయ్యెను. ఆ బాధ పడలేక పలువురు బ్రాహ్మణులు, కవి, గాయక నర్తకాదులు తమ నివాసములను వీడి దక్షిణమునకు వలసపోయిరి. రసికులైన నాయకరాజులు వారి కాశ్రయ మిచ్చి పోషించిరి. ఈ విధముగా దక్షిణ దేశము ఆంధ్ర వాఙ్మయాభివృద్ధి కాస్పదమగుట సంభవించెను.

దక్షిణాంధ్ర సాహిత్యమును గూర్చి ముఖ్యముగా మూడు అపవాదములు కలవు. అప్పటి కవులు భాషా విషయమున వ్యాకరణ సంప్రదాయమును సరిగా ననుసరింప లేదనియు, వారు సభ్యతా మర్యాద నతిక్రమించి దుర్నీతికరమును జుగుప్సాకరము నగు శృంగార రసమును హెచ్చుగా వర్ణించిరనియు, ఈ యుగమున స్తుత్యమైన ప్రతిభ క్షీణించి హేయమైన అనుకరణమే ప్రబలిన ధనియు ఆ మూడపవాదములు. నిజమునకి అపవాదము అప్పటి సాహిత్యమునందలి ఏకదేశమును బట్టియే ఏర్పడి నట్టివికాని సర్వ వ్యాపకము అనదగినవి కావు. మరియు సాహిత్యమున రసమునకే ప్రాధాన్యముకాని కేవల భాషకు కాని ఉపదేశమునకు కాని అంత ప్రాధాన్యము లేదను విషయము దృష్టియం దిడికొని చూచినచో ఇది తొలగిపోవును. ఈ కాలమునందలి కవులు సృజించిన వివిధ నూతన కావ్య ప్రక్రియలను పరికించువారికి వారు ప్రతిభాహీనులు కారని స్పష్టము కాకమానదు. ప్రబంధములేకాక యక్షగానములు, గేయములు, వచనములు ఈ కాలపు సాహిత్యమునకు వైవిధ్యమును పుష్టిని చేకూర్చినవి. మరియు మధుర మంజులమైన భాష, సంగ్రహములు భావబంధురములునై కథాగమనమున కాటంకము కల్పింపని సుందర వర్ణనములు, రమణీయ కల్పనతో కూడిన కథానిర్మాణము తత్పూర్వ సాహిత్యముతో పోల్చిచూచినచో ఈ కాలపు సాహిత్యమునకు వైశిష్ట్యము చేకూర్చుచున్నవి. అందుచే దక్షిణాంధ్ర వాఙ్మయ మాంధ్రభారతి కలంకారమేకాని అపవాదము కాదనుటలో సందేహములేదు. మధుర నాయకరాజ్యము: రాక్షస రంగడి యుద్దా నంతరమును, తంజావూరు నాయక రాజ్యమంతకు పదునైదేండ్లకు పూర్వమును, స్థాపింపబడినట్లు ఇటీవలి పరిశోధనముల వలన తెలియుచున్నది. మొట్టమొదట ఆంధ్ర వాఙ్మయము దక్షిణదేశమున ప్రవేశించుట కి నాయక రాజులే కారణభూతు అని పలువురు తలంతురు. కాని అంతకుముందే ఆ వాఙ్మయ మచ్చట అడుగుపెట్టె వనుటకు నిదర్శనములున్నవి. అచ్యుతదేవరాయలు (క్రీ.శ. 1529-42) ఆంధ్ర భాషాభిమానియై ప్రతి సంవత్సరము శ్రీ వేంకటేశ్వరస్వామికి సత్కావ్య ప్రబంధ పుష్పమును సమర్పించెడివాడట. అతని అడుగుజాడల ననుసరించి మంత్రి, నాయక సామంతాదులు కూడ కవులను పోషించి వారిచే రసవంతములైన కావ్యములు రచింపజేసి భాషా సేవ కావింప మొదలిడిరి. అట్టివారిలో రామనాథపుర మండలమునందలి శివపురి ప్రాంతమును రాయల పక్షమున పాలించుచుండిన గోళ్ళవంశపు నాయకులు ముఖ్యులు. వారు గోళ్ళ బసవేంద్రుని కుమారులు. వారిలో చినరామప్ప అనునతడు తన అన్న యగు పెద రామప్ప పేర పచ్చకప్పురపు తిరువేంగళ కవిచే తమ ఇలవేల్పైన చొక్కనాథుని చరిత్రమును ద్విపద కావ్యముగా చెప్పించెను. ఈ కారణముచే ఆంధ్ర సరస్వతిని తొలుదొల్త దక్షిణమున కాకర్షించిన గౌరవ మీ గోళ్ల నాయకులకే చెందవలసి ఉన్నది. కాని ఆమె నచ్చట స్థిరముగా ప్రతిష్ఠించి వివిధ కావ్యపుష్పహారములచే నారాధించిన వారు మధుర తంజావూరు నాయకులే యనుటకు సందేహింప నవసరములేదు.

దక్షిణాంధ్రయుగమున వాఙ్మయ వాహిని వివిధ వేణికలతో ప్రవహించినది. అందు పద్యములు, గేయములు, వచనములు, యక్షగానములు ముఖ్యములైనవి. అప్పటి పద్యకావ్యములు ప్రబంధములే. గేయరచన అప్పుడు విరివిగా సాగుటకు యక్షగానములలో అవి ప్రధానస్థాన మాక్రమించుటయే కారణము. సంకీర్తనలు, అధ్యాత్మ కీర్తనలు, ఏలలు, దరువులు, పదములు అందు ప్రధానములైనవి. కొరవంజి, దేశి, చౌవదము, జక్కిణి, జోగి, చిందు మున్నగు నాట్య భేదములకు అనుగుణముగా ప్రత్యేకములైన గేయములను పాడుచుండెడివారు. క్షేత్రయ, విజయరాఘవుడు, రంగాజమ్మ, సీనయ్య మున్నగువారు పదరచనయందును, త్యాగరాజు సంకీర్తన రచనయందును వాసికెక్కిరి.

వచనైక రచనలు 15 వ శతాబ్దికి ముందుకూడ రెండు వెలసినమాట సత్యమేయైనను అవి కొల్లలుగా రచింపబడుట దక్షిణాంధ్రయుగముననే. ఇప్పటి వచనరచనలు రెండు తెరగులు వాడుక భాషలో వ్రాయబడినవి, గ్రాంధికములు. రాయవాచకమువంటి చారిత్రక వచనములలో వాడుకభాష వాడబడినది. గ్రాంథిక రచనలు పెక్కు పురాణములకును ప్రబంధములకును వచనీకరణములు. ఇది అప్పటివారికి ప్రాచీన గ్రంథములపై గల అభిమానమును తేటతెల్ల మొనరించు చున్నది.

యక్షగాన మొక నాటక విశేషము. విజయ రాఘవుడు మున్నగువారు తమ యక్షగానములను నాటకములనియే వ్యవహరించిరి. ఇవి క్రీ. శ. 12వ శతాబ్దినుండియు ప్రచారమున నున్నను అప్పకవి కి పూర్వపు లాక్షణికు లెవ్వరును వానిని పేర్కొని యుండ లేదు. ద్రావిడ భాషలందలి దృశ్యరచనలు కొరవంజు లనబడుననియు, కొరవలు అను ఆటవిక జాతి వారు ముందు వానిని ప్రదర్శించెడి వారనియు, పిమ్మట జక్కులు లేక యక్షులు అనువారు వానివి చేబట్టుటచే వానికి యక్షగానము లను పేరువచ్చెననియు, కీ. శే. ప్రభాకర శాస్త్రులుగారు తెల్పియున్నారు. కొరవంజిని అనగా ఎరుకతను మొదట యక్షగానములలో ప్రవేశ పెట్టిన వారు తంజావూరివారే అగుటచే కొరవలమూలమున యక్షగానము లుత్పన్నము లయ్యె ననుట యుక్తము కాదనియు, అవి మతప్రచారము నిమిత్తమై ప్రభవించి తొలుత కొయ్యబొమ్మల మూలమునను తోలుబొమ్మల మూలమునను ప్రదర్శింపబడి తరువాత మనుజులే ప్రదర్శించిన మూగవాటకములై పిమ్మట గద్యపద్య గేయములతోకూడి యక్షగానము లయ్యె ననియు, బౌద్ధ యుగమునుండియు ఆంధ్ర దేశమున జక్కులులేక యక్షులు అను ఒక తెగవారు నివసించుచుండి రనియు, వారికిని యక్షగానముల యుత్స తికిని సంబంధముండుననియు ఇట్టివి సంస్కృతమునకూడ నుండె ననుట కాధారము లుండుటచే కేవల దేశిరచన లని చెప్పుటకు వీలు లేదనియు, తెలుగు యక్షగానములను చూచి తమిళులును, కన్నడులును తమతమ భాషలలో వానిని రచించి రనియు, తంజావూరు కవులు వానిలో పెక్కు మార్పులు చేసి వానికి వన్నె కలిగించి రనియు, యక్షగానములలో పాత్రపోషణమునకే కాని కథాకల్పనమున కంత ప్రాధాన్యము లేదనియు, లేదనియు, శ్రీ డా. నే. వేంకటరమణయ్య గారభిప్రాయ పడుచున్నారు.

తంజావూరు నాయక రాజ్యముమాట విన్నంతనే స్మృతి పథమున తోచువాడు రఘునాథనాయకుడు, (క్రీ.శ.1614-1633). ఇతడు సర్వవిధముల రాయలవారి కెనయని చెప్పదగినవాడు. ఇతడు సుమారు వంద గ్రంథములు రచించెను. వానిలో రామాయణము, వాల్మీకి చరిత్రము అను రెండు గ్రంథములు మాత్రమే లభించు చున్నవి. ఈ రామాయణమైనను సమగ్రముగా లేదు. ఇందు బాలకాండమున నాల్గవ ఆశ్వాసములో కొంత భాగము మాత్రమే కానబడుచున్నది. కథ కోసలదేశ వర్ణనతో నారంభమై పుత్రకామేష్టితో ముగియుచున్నది. ఇందలి కవిత్వము రసవంతములైన వర్ణనలతోడను, మధుర మంజులమైన పదప్రయోగము తోడనుకూడి మనోహరముగానున్నది. రఘునాథు డిందలి ద్వితీయాశ్వాసమున ఋశ్యశృంగుని కథను చాల హృద్యముగా రచించి యున్నాడు. మధురవాణి తాను రఘునాథుని రామాయణము నొకదానిని సంస్కృతీకరించినట్లు చెప్పుకొన్నది. అది పరిమాణమున చాలా చిన్నదగుటచే పై రామాయణ మగునో కాదో అని సందేహ ముదయించుచున్నది. వాల్మీకి చరిత్రము మూడాశ్వాసములతోకూడిన ప్రబంధము. ఇం దాదికవియైన వాల్మీకి మహాముని పూర్వ జీవితము వర్ణింపబడినది. ఇందు వస్వ్తెక్యము కొరవడినట్లు కానిపించును. గ్రంథారంభమునందలి తీర్థాదుల వర్ణన మతిదీర్ఘమై కొంత విసువు కలిగించుచున్నది. తృతీయాశ్వాసమునందలి రంభోర్వశీ పరాభవ వృత్తాంతము రమ్యముగా నున్నది. శృంగార సావిత్రియను రెండా శ్వాసముల ప్రబంధ మొకటి రఘునాథుని పేర ముద్రితమైనది. అది అతని రచనమగునో కాదో చెప్పజాలము.యజ్ఞ నారాయణ దీక్షితుడు తన సాహిత్య రత్నాకరమున రఘునాథుడు యామద్వయమున పారిజాతాపహరణ కావ్యమును చెప్పి తండ్రిచే కనకాభిషేకము నొందెనని తెల్పి యున్నాడు. దీనినిబట్టి ఈ కవిరాజు ఆశుకవిత్వమున కూడ నిపుణుడని తెలియుచున్నది.

పై పద్యకావ్యములనేకాక రఘునాథుడు అచ్యుతాభ్యుదయము, నల చరిత్ర అను రెండు ద్విపద కావ్యములనుకూడ రచించియుండెను. ఇందలి నలచరిత్ర ఆంధ్ర భాషోల్లాసినీ అను మాసపత్రికయందు ముద్రితమైనది. ఇందెనిమి దాశ్వాసములలో నల దమయంతుల కథ సంపూర్ణముగా చెప్పబడినది. ఇందు వర్ణన విధానమును, రసపాత్రపోషణ చాతుర్యమును రఘునాథుని అప్రతిమానమైన ప్రతిభను చెప్పక చెప్పుచున్నవి. నల దమయంతుల వనసంచారవర్ణనము పఠించినచో ఈ విషయము తేటతెల్లమగును. అచ్యుతరాయాభ్యుదయము పేరునుబట్టి రఘునాథుని తండ్రి చరిత్రను వర్ణించు కావ్యమని తెలియుచున్నది. రఘునాథుఁడు రుక్మిణీ పరిణయము అను యక్షగానమునుకూడ రచించినట్లు యజ్ఞ నారాయణ దీక్షితులు చెప్పియున్నాడు. (శ్రీ రుక్మిణీ కృష్ణవివాహ యక్షగానం ప్రబంధానపినైక భేదాన్) కాని అది ఇంకను ముద్రితము కాలేదు

రఘునాథుని ఆస్థానమునందలి కవులకేకాక దక్షిణాంధ్రయుగమునందలి కవీంద్రుల కెల్ల తలమానికమని చెప్పదగినవాడు చేమకూర వేంకటకవి. ఇతడు రచించిన ప్రబంధములు రెండు. సారంగధర చరిత్రము, విజయ విలాసము, ఈ రెండు ప్రబంధములును రఘునాథ భూపాలునికే అంకితముచేయబడినవి. సారంగధర చరిత్రము మాళవరాజగు రాజమహేంద్రుని భార్య చిత్రాంగి తన సవతి కుమారుడగు సారంగధరుని వలచి వలపింప యత్నించిన కథ. ఇది వేంకటకవి ప్రథమరచన. ఇది శృంగార రసాభాసముతోకూడి వస్తుస్వభావమునుబట్టి కొంత జుగుప్సను కలిగించుచున్నది.

విజయవిలాస మాంధ్రసరస్వతి కపూర్వమైన అలంకారము. ఇందు పాండవ మధ్యముడైన విజయుడు ఉలూచి, చిత్రాంగి, సుభద్ర అను మువ్వురు జవ్వనుల చెట్టపట్టి కావించిన విలాసములు మూడాశ్వాసములలో వర్ణింపబడినవి. భారతము నందలి కథనే గ్రహించి దానిని సరసమనోహరములైన వర్ణనలతోడకు, మధుర గంభీరములైన భావములతోడను, మృదుమధురములైన పదముల తోడను, అద్భుతావహములైన శ్లేషచమత్కారముల తోడను, ఒహో అనిపించు యమకానుప్రాసాద్యలంకారములతోడను కూర్చి ఈ ప్రబంధమున వేంకటకవి కావించిన సృష్టి అనన్య సామాన్యమై అలరారుచుందును. రస పాత్ర పోషణమునను, సాభిప్రాయ పదప్రయోగమునను ఆతని కతడేసాటి. “ప్రతి పద్యమునందు చమత్కృతి కలుగగ చెప్పనేర్తు" వని రఘునాథుడే అనెనో అతడే వ్రాసికొనెనో కాని అం దిసుమంతయు నతిశయోక్తి కానరాదు. శబ్దార్థాలంకారము అమితముగా వాడుచునే రసభావముల నద్వితీయముగా పోషించిన మహాకవు లాంధ్రవాఙ్మయమున నిర్వురే. ఒకడు భట్టుమూర్తి; రెండవవాడు వేంకటకవి. వేంకటకవి తెలుగుపదముల విరుపులలో భట్టుమూర్తికన్నను మిన్న అనిపించును. ఆతని పదప్రయోగ చాతుర్య మపూర్వమైనది. "క్షితిలో నీమార్గ మెవరికిన్ రా"దనుట సత్యము. ఇంతటి మహాకవి కావుననే రసిక శేఖరుడైన రఘునాథ భూపాలు డాతని నాదరించి మేదురములైన సత్కారము లాచరించినాడు.

రఘునాథుని ఆస్థానమున విద్వత్కవియై బహు గ్రంథములు రచించి వాని నన్నిటిని అతనికే అంకితము చేసినవాడు కృష్ణాధ్వరి. రఘునాథ భూపాలీయము, నైషథ పారిజాతావతారిక, కల్యాణ కౌముదీ కందర్ప నాటకము, శృంగార సంజీవని, తాళ చింతామణి, నైషధ పారిజాతీయము అను ఆరు గ్రంథములను రచించితినని అతడే చెప్పుకొని యున్నాడు. వీనిలో రఘునాథ భూపాలీయ నైషధ పారిజాతీయములు రెండే కానవచ్చు చున్నవి. ఇందు రఘునాథ భూపాలీయము ప్రతాప రుద్రీయమువలె కావ్య స్వరూప రసధ్వన్యలం కారాదులను తెల్పు లక్షణ గ్రంథము. ఇందు లక్ష్యములైన పద్యము లం దన్నిట రఘునాథుడే వర్ణింపబడి యున్నాడు. నైషధ పారిజాతీయము ద్వ్యర్థికావ్యము. ఇందు నలచరిత్రయు పారిజాతాపహరణ కథయు జోడింపబడినవి. సన్నిహిత సంబంధములేని ఈ రెండు కథలను సమానాంతరముగా సాగించుటలో ఈ కవి చూపిన నేర్పును పాండిత్యమును అనన్య సామాన్యములై యున్నవి. ద్వ్యర్థికావ్య నిర్మాణ నైపుణ్యమున నీతడు సూతన భట్టుమూర్తులను కూడ మించివాడని విమర్శకుల అభిప్రాయము. ఇతడు వ్రాసిన ఇతర రచనలు తెలుగు గ్రంథములో సంస్కృత గ్రంధములో తెలియరాదు. కృంగార సంజీవని అమరు కాహం కారహారియని ఆతడు తెల్పియున్నాకు. కల్యాణ కౌముదీ కందర్ప నాటకము బహుశః యక్షగానమై యుండవచ్చును. తాళ సంజీవని సంగీత శాస్త్రమునకు సంబంధించిన గ్రంధముగా తోచుచున్నది.

కాళయ్యకవి వ్రాసిన రాజగోపాల విలాసమను నైదా శ్వాసముల కావ్య మిటీవలనే ముద్రితమైనది. ఇది మన్నారుగుడి క్షేత్రమహాత్మ్యమును తెల్పు శృంగారరస ప్రధానమైన ప్రబంధము, ఇందు మొదటి నాలుగా శ్వాసములలో శ్రీకృష్ణునికి అతని అష్టమహిషులతోడి కూటమియు, పంచమాశ్వాసమున మన్నారుగుడి క్షేత్ర మాహాత్మ్యమును వర్ణింపబడినవి. కాళయ్య అష్టమహిషులను అష్టవిధశృంగార నాయికలుగా వర్ణించియున్నాడు. రుక్మిణి స్వీయ, సత్యభామ స్వాధీనపతిక, కాళింది ప్రోషిత భర్తృక, లక్షణ జారిణీ, జాంబవతి విప్రలబ్ధ. ఇతని రచనలో సంస్కృత పదములు హెచ్చు. ఈతని సమాసములు కొన్ని యెడల శ్రీనాథుని సమాసములను తలపించుచుండును. ఈతని ధారాశుద్ధి మిక్కిలి మెచ్చదగి యున్నది. మధుర తంజావూరు రాజ్యములందు వెలసిన శృంగార ప్రబంధముల కొక విధముగా ఈ రాజగోపాల విలాసము మార్గదర్శకమని చెప్పవచ్చును.

రఘునాథుని కుమారుడైన విజయరాఘవుడు కూడ కవియే. ఇతడు ప్రహ్లాద చరిత్ర పీఠిక యందు తాను పది కృతులను రచించినట్లు చెప్పుకొనియున్నాడు. అందు పెక్కు యక్షగానములు, పాదుకాసహస్రము, రమునాథా భ్యుదయము అనునవి ద్విపద కావ్యములు. మోహినీ విలాసము అను ద్విపద కావ్యముకూడ ఇతని రచనయే యని కొందరి తలపు. ఆత డా ద్విపదకృతిని యక్షగానముగా సంతరించినమాట సత్యము. కాని ఆకృతి యతడే రచించినదో ఇతరులు రచించినదో తెలియదు. ఈ ద్విపద కావ్యములలో రఘునాథాభ్యుదయ మొక్కటే ముద్రితమైనది. ఇందు విజయరాఘవుడు తన తండ్రి యగు రఘునాథుని రాజ్య వైభవమును, తంజా పురమును, రాజగృహమునందలి నిత్యజీవిత విధానమును విపులముగా వర్ణించియున్నాడు. రఘునాథుడు వాహ్యాళి కరుగుచుండగా చిత్రలేఖ యను వార కాంత యొక్కతె ఆతని వలచి తనకోరిక తీర్పుమని చిలుకచే వర్తమాన మంపుటయు, రఘునాథుడా రాత్రి ఆమె యింటి కరిగి కేళిసల్పుటయు నిందలి ఇతివృత్తము. రస దృష్టి కీ కావ్యమంత ఉత్తమముగా కనబడకపోయినను చారిత్రక దృష్టితో చూచినచో మిక్కిలి ఉత్కృష్టముగా గోచరించును. ఆనాటి రాజకీయ సాంఘిక విషయములును, రాచనగరి మర్యాదలును, సంగీత నాట్య విద్యా వినోదములును ఇందు చక్కగా వర్ణితములై యుండుటచే నాయకయుగ చరిత్ర నిర్మాణమున కీ గ్రంథ మెన్నియో విధముల తోడ్పడజాలును.

ఈ పై ద్విపద కావ్యములే కాక విజయరాఘవుడు రచించితినని చెప్పుకొన్న లఘుకావ్యములలో గోపికా భ్రమర గీతముల తెనిగింపులును, ఫాల్గుణోత్సవ గోపాల దండకములును, వీరశృంగార సాంగత్యమును, సంపంగి మన్నారు సాంగత్యమును ముఖ్యములైనవి. పై గీతములు పద్యరూపమున తెనిగింపబడినవో, ద్విపద రూపమున తెనిగింపబడినవో తెలియదు. ఫాల్గుణోత్సవము రగడలో వ్రాయబడినది. చివరి రెండు సాంగత్యములును కర్నాటక సాంగత్య చ్ఛందమున రచింపబడినవి. ఆంధ్రమున ఈ ఛందములో రచన సల్పినవా డిత డొక్కడే.

విజయరాఘవుని ప్రతిభ అతడు రచించిన యక్ష గానములలో ఎక్కువగా గోచరించును. వాని సంఖ్య సుమారు ఇరువది వరకుండును. అవి అన్నియు నాటకము లనియే పేర్కొనబడినవి. వానిలో రఘునాథాభ్యుదయ విప్రనారాయణ చరిత్రలుమాత్రము ముద్రితము లైనవి. మిగిలినవి కొన్ని అముద్రితములు; కొన్ని నష్టములు. విజయరాఘవుడు వైష్ణవ మతాభిమాని. వైష్ణవాపచార మాతనికి గిట్టదు. అందుచేతనే కాబోలు వైష్ణవకథలలో చోళరాజు విప్రనారాయణుని శిక్షింప నాజ్ఞాపించెనని యుండగా అతడు విప్రనారాయణుని కథ తన రాజ్య మందలి మన్నారు గుడియందే జరిగినట్లును, తాను వైష్ణవాపచారముచే విప్రనారాయణుని శిక్షించు టెట్లని సందేహించుచుండగా శ్రీ రాజగోపాలస్వామి ప్రత్యక్షమై, సత్యమెరిగించి, విప్రనారాయణుని గౌరవించి తన్ను మెచ్చుకొనె ననియు వ్రాసియుండెను. ఇట్లే ఈ నాటకమున ఆత డితర సందర్భములందు సైత మధిక స్వాతంత్య్రము ప్రదర్శించినాడు.

విజయరాఘవుడు సంస్కృతాంధ్ర భాషలందు మేటి పండితుడు. అతడు సంస్కృత నాటకములు బాగుగా చదివి అందలి రచనా పద్ధతులను చక్కగా అవగాహనము చేసికొన్నవాడు. ఆ కారణముచే అతడు తననాటి యక్ష గానములందున్న కొన్ని పద్ధతులను మార్చి నూతన పద్ధతులను ప్రవేశ పెట్టి వానికెంతో వన్నె చేకూర్చినాడు. యక్షగానముల ఆరంభమున కవియే కృతిపతిని ప్రస్తుతించి, షష్ఠ్యంతములు చెప్పి, కథాక్రమమును వివరించినట్లు చెప్పబడియుండును. ఈ పద్దతి ప్రబంధోచితమైనదే కాని నాట కోచితమైనది కాదని గుర్తించి విజయ రాఘవుడు తన యక్షగానములందు దేవతా స్తోత్రానంతరము మేళ గాండ్రచే కైవారము చెప్పించి, వారి మూలముననే కథాక్రమమును ప్రకటింపజేసినాడు. ఇది కొంచె మించు మించుగా సంస్కృత నాటకములందలి నాందీ ప్రస్తావనలను పోలియుండును. ఇట్లే విజయ రాఘవుడు తన నాటకములలో కొన్నింటి చివర భరతవాక్యమును ప్రవేశ పెట్టినాడు.

విజయ రాఘవుడు తన యక్ష గానములలో త్రిపుటాది తాళములను గేయములతో కూడ వ్రాసియుండినను, రగడలను విడిచి వాని స్థానమున దరువు పదము మున్నగ నూతన రచనలను ప్రవేశ పెట్టినాడు. అతడు ప్రవేశ పెట్టిన మరియొక ముఖ్యమైన మార్పు సంభాషణ పద్ధతి అంతకుముందున్న యక్షగానములలో మధ్యమధ్య ఈ పాత్ర ఈ పాట పాడుచున్నదను కవి వచనములు కానబడుచుండును. ఇదియును ప్రబంధ పద్ధతియే. విజయ రాఘవు డీ పద్ధతిని విడిచి సంస్కృత నాటకములందువలె పాత్రోచితమైన భాషలో ఆ యా పాత్రముల నొండోటితో సంభాషింప జేసినాడు. తరువాతివారు పలువురి ముఖ్యముగా రంగాజమ్మ తమ యక్షగానములలో ఈ విధానము నవలంబించినారు.

విజయ రాఘవుని కొలువు నలంకరించిన విదుషీమణులలో రంగాజమ్మ అగ్రగణ్య. ఆమె అష్టభావ కవితా సర్వంకష మనీషా విశేష డారద. రాజనీతి విద్యా విశారద, విజయరాఘవ మహిపాల రచిత కనకాభిషేక. ఈమె సంగ్రహ భారతము, సంగ్రహ భాగవతము, సంగ్రహ రామాయణము, ఉషా పరిణయము, మన్నారు.దాస విలాసము అను ప్రబంధములు, మన్నారుదాస విలాస యక్షగానము అను ఆరు గ్రంథములు రచించెను. ఇవిగాక ఆమె రచించిన పాటలు పదములు పెక్కులు గలవు. మన్నారుదాస విలాస యక్షగాన మొక్కటే ఇటీవల ముద్రణ మందినది. మన్నారుదాస విలాస ప్రబంధమున నాయకుడు విజయ రాఘవుడు, ఆతనికి మన్నారుదాసు డను నామాంతరము కలదు. ఉషా పరి ణయమందలి కథ హరివంశమునుండి గ్రహింపబడినది. కథా నిర్మాణమందును, కవితా పటిమయందును ఇందు కవయిత్రి చాల నేర్పు ప్రదర్శించినది.

రంగాజమ్మ మన్నారుదాస విలాస ప్రబంధమునందలి కథనే గ్రహించి ఆ పేరుతోడనే యొక యక్షగానము కూడ రచించినది, రాజగోపాలస్వామి బ్రహ్మోత్సవముల సందర్భమున కాంతిమతి యను కన్య విజయరాఘవుని కాంచి కామించి అతనిని పెండ్లియాడినకథ ఇందలి వస్తువు. ఇందలి కథ విజయరాఘవుడు రచించిన రఘునాథాభ్యుదయ మందలి కథ కించుమించుగా ప్రతిబింబము. కథా చమత్కార మంతగా లేకపోయినను, ఈ కాలమున వెలువడిన యక్షగానములలోని కెల్ల ఇది మిక్కిలి ప్రశస్తి గాంచినది. ఇందు పాటలు, పదములు, దరువులు మున్నగువానితో పాటు పద్యములు కూడ హెచ్చుగా కనిపించును. రంగాజమ్మ తన మన్నారుదాస విలాస ప్రబంధమునందలి పద్యములనే సందర్భానుసారముగా నిందు జొప్పించి యుండునని పండితుల అభిప్రాయము. ఈమె సంభాషణ ములు హాస్యరస చమత్కారముల తోడను, పాత్రోచిత భాషతోడను గూడి మిక్కిలి సహజముగా నుండును.

కోనేటి దీక్షితుడను శ్రీ వైష్ణవ పండితుడు విజయ రాఘవుని కొలువుననుండి అతనికి రామాయణ ముపదేశించి వివిధములైన సత్కారములను పొందెను. విజయ రాఘవుడు మదనమంజరిని వివాహమాడిన వృత్తాంతమును కై కొని విజయరాఘవ కల్యాణము అను యక్షగానము రచించెను.

విజయ రాఘవుని పట్టంపు కవి యగు కామరసు వేంకటపతి సోమయాజి విజయరాఘన చంద్రికావిలాస మను యక్షగానమును రచించెను. విజయరాఘవుని చంద్రికా విహారము అందు మనోహరముగా వర్ణింప బడినది.

పురోషోత్తమదీక్షితు డను మరియొక కవి సత్రమకల్ అను నామాంతరముగల తంజాపురాన్న దాన మహానాటకమును వ్రాసెను. ఇది శృంగార హాస్యరసాద్భుత రస ప్రధానమని కైవారమును బట్టి తెలియుచున్నది.

విజయరాఘవుని కుమారుడైన మన్నారు దేవుడు విజయ రాఘవాభ్యుదయము, హేమాబ్జనాయికా పరిణయము అను రెండు గ్రంథములు రచించెను. ఇందు విజయరాఘవాభ్యుదయము ప్రబంధమో, యక్షగానమో తెలియదు. రెండవది యక్షగానమే. క్షీరసముద్రమున పుట్టిన అమృతమును సురలకొసగి సముద్రుని కూతురగు రక్తాబ్జ యనునామెను మన్నారుదేవుడు వివాహమాడిన వృత్తాంత మిందలి విషయము.

విజయరాఘవుని తరువాత తంజావూరు రాజ్యము మొదట మధుర' నాయకులకును, పిమ్మట మహారాష్ట్రులకును వశమైనది. ఈ మహారాష్ట్ర రాజులు తెనుగు నభ్యసించి ఆ భాషను మాటాడుటయే కాక అందు కావ్యములు నాటకములు రచించిరి. పలువు రాంధ్రకవులను, పండితులను, గాయన గాయనీమణులను ఆదరించి పోషించిరి. వీరి కాలమున పెక్కు ద్విపద కావ్యములును, యక్షగానములును రచింపబడినవి.

తంజావూరు సంస్థానమునకు చెందినవాడు కాకపోయినను విజయరాఘవునకు సమకాలికుడును జింజి రాజ కుటుంబమునకు చెందినవాడును అగు ఒక మహాకవిని గూర్చి ఇచ్చట చెప్పవలసియున్నది. అతడు పవరము చిన నారాయణరాజు (క్రీ. శ. 1600-50). ఇతడు రచించిన కావ్యము 'కువలయాశ్వ చరిత్రము', ఇందలి కథ మార్కండేయ పురాణమునుండి గ్రహింపబడినది. చిన నారాయణరాజు ఆ కథయందు పెక్కు మార్పులు కావించెను. ఋతుధ్వజుడను రాజు మదాలసయను గంధర్వ రాజకన్యను వివాహమాడిన వృత్తాంత మందలి ప్రధాన కథ. తాళ కేతువను రాక్షసుడు ఖుతుధ్వజుని వంచించి మదాలసను కొనిపోయిన కథ, ఆశ్వతురుడు కైలాసమువ తన సంగీతనైపుణ్యమును ప్రదర్శించిన కథ, తారా జయంతుల కథ, ఇందు అంగములుగా వర్ణింపబడినవి. పింగళి సూరన కళాపూర్ణోదయము తరువాత ఇంత కథా రామణీయకము గల ప్రబంధము మరొకటి లేదని విమర్శకుల అభిప్రాయము. కథా కల్పనమునందును, సహజ వర్ణనములందును, ఔచిత్య పోషణమందును, సహజ సంభాషణ నిర్మాణ నైపుణ్యమునందును చిననారాయణ రాజు అద్వితీయుడు. "ప్రతిభాతిశయమునను, కల్పనా సామర్థ్యమునను వీరిరువురును (సూరన, చిననారాయణ రాజులు) సమానులే. ఐనను చిననారాయణరాజు కవిత్వమందలి శిల్పపరిపాక మును, ప్రసన్నతయు, నిగ్గును సూరనార్యునందు కానరా”వని శ్రీ నేలటూరి వేంకట రమణయ్యగారి అభిప్రాయము. ఇతడు సూరనవలె సంస్కృతమందు గొప్ప పండితుడే అయ్యును దీర్ఘ సమాసములజోలికి పోక, తంజావూరు కవులకు సాధారణమైన తియ్యని తేట తెలుగుమాటల ప్రయోగించుటయందు ఎక్కువ నేర్పు ప్రదర్శించెను. ఈతడీ కావ్యమును తన పెంపుడు తండ్రియైన నారాయణరాజునకు అంకితము కావించెను.

తంజావూరు నాయక రాజ్యమునందలి సారస్వతమునుగూర్చి చెప్పునప్పుడు క్షేత్రయ్య, త్యాగయ్య, అను భక్తులు రచించిన పదములను, గేయములను కూడ పేర్కొన వలయును. క్షేత్రయ్య కృష్ణామండలమునందలి మొవ్వ గ్రామ నివాసి. ఆ గ్రామమునందలి గోపాలదేవుఁ డాతని ఇలవేలుపు. ఆ దేవునిగూర్చి అతడు రచించిన పదములు భక్తి శృంగారములకు నిధానములు. ఇందలి భాష మిక్కిలి జాతీయమై తెలుగు తియ్యదము నొల్క బోయుచుండును. క్షేత్రయ్య పలు క్షేత్రములను దర్శించి ఆయా చోట్ల గల దేవతలను గూర్చి భక్తి భరితములైన పదములు రచించెను. ఈ సందర్భముననే ఆతడు విజయరాఘవుని గూడ దర్శించి అతనిపై కొన్ని పదములు కల్పించెను. ఈతని పదములు భావగంభీరములై అభినయమునకు మిక్కిలి అనువుగా నుండును,

త్యాగరాజు మహాభక్తుడు. భక్తి సంగీతము లాతని సొమ్ములు, ఆతడు తంజావూరు నాయకులు గతించిన పిమ్మట ఆ రాజ్యము నాక్రమించిన మహారాష్ట్రుల కాలమున నుండెను. ఆతని కృతులందలి సహజ మాధుర్య మొక్క ఆంధ్రులనే కాక దాక్షిణాత్యుల నందరిని ఆకర్షించి నది. ఆతని కీర్తనలలో అపూర్వమైన సంగీత పాండిత్యమే కాక సాహిత్య సంపదయు గోచరించుచుండును. ఆతని భాష మార్దవ మాధుర్యములకు పెట్టినది పేరు.

త్యాగరాజు భక్తి భరితములైన పెక్కు కీర్తనలనే కాక ప్రహ్లాద భక్త విజయము, నౌకా విజయము అను రెండు యక్ష గానములను కూడ రచించెను. మొదటి దానిలో భక్తవరేణ్యుడైన ప్రహ్లాదుని అపూర్వ భక్తియు, రెండవ దానిలో శ్రీకృష్ణుడు గోపాంగనలతో యమునా నదిపై విహరించుటయు వర్ణింపబడినవి. ఇందలి కథలను కూర్చుటలో త్యాగరాజు మిక్కిలి స్వాతంత్య్రము వహించెను. భాగవతమునందలి కథలకును, వీనికిని గల తారతమ్యమే ఇందుకు దృష్టాంతము.

తంజావూరురాజ్య మంతరించిన పిమ్మట మధుర పుదుక్కోట సంస్థానములు కవుల కాశ్రయములయ్యెను. మధుర నాయకులలో మొదట నాంధ్రకవుల నాదరించి సత్కరించినవాడు ముద్దళగిరి (క్రీ.శ. 17వ శతాబ్ది యుత్తరభాగము). ఇతని పేర అంకితము చేయబడిన కృతులు మూడు కానబడుచున్నవి. అందు మొదటిది పెద్దళ్గిరి విజయము. ఇది తంజావూరు కోట యొక్క నాలుగు గోడలపై చెక్కబడిన 530 పాదములు గల ఉత్పల మాలిక. ఇందు అళగిరి మహారాష్ట్రుడైన ఏకోజీ నోడించి పొందిన విజయము వర్ణింపబడినది.

అళగిరికి అంకితమైన రెండవ గ్రంథము తిరుకామ కవి అని నామాంతరముగల లింగనమఖి కామేశ్వరకవి రచించిన సత్యభామా సాంత్వనము. ఇందలి కథ నరకాసుర సంహారము. కృష్ణుడు వదునారువేల స్త్రీలను పెండ్లి యాడిన పిమ్మట సత్యభామ కోపింపగా అతడామె నోదార్చుటతో కావ్యము ముగియుచున్నది. కామేశ్వర కవి ఉభయభాషా పాండిత్యము కలవాడే యయ్యు తన కావ్యమున వెక్కు వ్యాకరణ స్థాలిత్యములకు తావొసగినాడు. మరియు ఆతడు అసభ్య శృంగారముతోకూడిన పద్యము లనేకములు రచించి అందలి యౌచిత్యమునకు భంగము కలిగించినాడు. ఆతడు నాలుగైదుచోట్ల నంది తిమ్మన పారిజాతాపహరణమునందలి పద్యముల ననుక రింప యత్నించెను. కాని అందుసంపూర్ణముగా కృతార్థుడు కాజాలకపోయెను.

కామేశ్వరకవి ధేనుకా మాహాత్మ్యము, ఆచార్య విజయము అను రెండు వచన కావ్యములనుకూడ రచించెను. ఇందు మొదటి గ్రంథ మొక్కటే కనబడు చున్నది. "ధీరులు పాక వైరి లోక వికచ కల్పక స్తబక గంధ ధురంధర సూక్తియుక్తి నౌనవునని మెచ్చ నావుల మహ త్త్వమొనర్చితి" నని అతడే చెప్పుకొనియున్నాడు.

ముద్దళ గిరి కృతినందిన మూడవకృతి విద్యావతీ దండకము. దీనిని రచించినవాడు గణపవరపు వేంకట కవి (క్రీ. శ. 17 వ శతాబ్ది మధ్యభాగము). ఇతడు బహు గ్రంథకర్త. అపారమైన పాండిత్యము, అద్వితీయమైన శాస్త్రవిజ్ఞానము, అనంతమైన లోకానుభవముకల్గి ఈతడు కర్ణాట తుండిర చోళ పాండ్య మండల ప్రముఖాఖిల మండలా ఖండులచే సత్కారము లందియుండెను. ఇతడు వ్రాసిన గ్రంథములలో లక్షణ గ్రంథము లెక్కువ. బాల రామాయణ ద్విపద, జాంబవతీ విలాస చిత్రకావ్యము, పరమభాగవత చరిత్ర, పురాణసారము, కృష్ణమల్ల కథ అను పేర్లుగల ఈతని కావ్యము లిప్పుడు లభించుట లేదు. లభ్యమగుచున్న వానిలో ప్రబంధరాజ వేంక టేశ్వర విజయ విలాసము మహత్తరమైనది. ఇదియు " అమూల్యమైన లక్షణ గ్రంథమే కాని తన్మూలమున నతని కవితా శక్తి కొంతవరకు కనుగొననగు" నని శ్రీ డా. నేలటూరి వేంకటరమణయ్య గారు తెల్పుచున్నారు. గర్భచిత్ర కవిత్వ రచనయందును, పదముల కూర్పునందును ఇతడు ప్రదర్శించిన నేర్పు అపూర్వమైనది. ప్రబంధరాజ వేంకటేశ్వర విజయ విలాసమునందలి 808 వ సీసపద్యమున అరువదికి పైగా వృత్తాదులు గర్భితములై యున్నవనియు, అట్టి పద్యమును తెలుగు కబ్బములలో నెవ్వరును రచించి యుండలేదనియు కీ. శే. పూండ్ల రామకృష్ణయ్యగారు ప్రశంసించియున్నారు. లింగానుశాసనము, తెనుగు ప్రతాప రుద్రీయము, రసమంజరి, వేంకటేశాంధ్ర మనబడు అభిననాంధ్ర నిఘంటువు, ఆంధ్రకౌముది, గణయతి ప్రాస సీసమాలిక, రేఫ ఱకార నిర్ణయ పద్ధతి, షత్ప్రత్యయ ప్రస్తారసరణి, అలంకార సారము, ఆంధ్ర ప్రయోగ రత్నాకరము, ఇర్వదారు ఛందముల వచనము, ఆంధ్ర ద్విరూప కోశము, ఆంధ్రప్రక్రియా కౌముది, అనునవి ఇతడు రచించిన లక్షణ గ్రంథములు, సర్వలక్షణ శిరొమణి అను గొప్ప లక్షణ గ్రంథమును కూడ ఇతడు రచించినట్లు తెలియుచున్నది. ఇది పది ఉల్లాసములకు తక్కువ కాని వివిధ లక్షణ లక్షితమైన అమూల్య లక్షణ కావ్యము. నిజమునకు దీనిని లక్షణ రత్నాకర మని చెప్పనగును. పైన పేర్కొనబడిన లక్షణ గ్రంథములలో పెక్కులు ఇందలి ఉల్లాసములే. వేంకటేశాంధ్ర మందలి ద్వితీయోల్లాసము, ఆంధ్ర కౌముది తృతీయోల్లాసము, ఆంధ్ర ద్విరూప కోశము దశ మోల్లాసము. ఈ మహాకవి కవితా విశేషముల నెరుగుటకు ఈ గ్రంథమంతగా ఉపయోగపడక పోయినను అతని పొండితీ పాటవమున కిది భాండా గారమని చెప్పుటకు సందేహింప నక్కరలేదు. ఈ గ్రంథము సమగ్రముగా లభింపకపోవుట విచారకరము. ఇది వేంకటేశ్వరున కంకితము.

విజయరంగ చొక్కనాథుడు కవిపండిత పోషణ మొనరించుటయేకాక తాను స్వయముగా మాఘ మాహాత్మ్యము, శ్రీరంగ మాహాత్మ్యము అను వచన గ్రంథములను రచించెను' ఇతని సంస్థానమునందలి కవులలో మొదట పేర్కొనదగినవాడు సముఖము వేంకట కృష్ణప్ప నాయకుడు. ఇతడు అహల్యా సంక్రందనము, రాధికా సాంత్వనము అను పద్య కావ్యములను, జైమినీ భారత మను వచన కావ్యమును రచించెను. రాధికా సాంత్వనము ఏకాశ్వాస ప్రబంధము. ఇందు అసభ్యములైన శృంగార పద్యము లెన్ని యో కలవు. ఇందలి పద్యములన్నియు ముద్దుపళని రాధికా సాంత్వనమునందు కూడ నున్నవట. ఆమె వానికి మరికొన్ని పద్యములు చేర్చి నాలుగా శ్వాసములుగా విభజించి యున్నదట. ఇదే సత్యమైనచో ముద్దుపళని వేంకటకృష్ణ నాయకుని పద్యములను హరించినదని చెప్పవలసి వచ్చును. ఈ పద్యము లెవరు రచించినవైనను ఇందలి కవిత్వము మృదుమధురమై తేట తెలుగు తియ్యదనమున కాల వాలములై యలరారుచున్న వనుటకు సందేహింప నక్కర లేదు. నీతి బాహ్యములైన కొన్ని శృంగార పద్యములను వర్ణనలను తొలగించినచో ఇట్టి సుకుమార కావ్యము మరొక్కటి లేదని చెప్పవచ్చును. అహల్యా సంక్రందనము ఇంద్రాహల్యల శృంగార వృత్తాంతమును వర్ణించు ప్రబంధము. వేంకట కృష్ణ నాయకుడు పురాణ మందలి కథను కొంతమార్చి శృంగార రసమునకు ఎడ నెడ హాస్యమును కూడ జోడించి ఈ ప్రబంధమును నిర్మించి నాడు. ఇందలి శృంగారము రాధికా సాంత్వనమందలి దానివలె నౌచిత్య మర్యాద నతిక్రమింపక మిక్కిలి సభ్యముగా ఉన్నది. ఇందలి కవిత్వము మృదుపద సంకలితమే అయ్యు. అచ్చటచ్చట శబ్దాలంకారములతోకూడి కడు రసవంత ముగా నున్నది. వేంకటకృష్ణప్ప నాయకుడు రచించిన జైమిని భారతము, సారంగధర చరిత్ర అను వచన కావ్యములు రెండింటిలో రెండవ దింకను ముద్రితము కాలేదు. జైమిని భారతము నాతడు పిల్లలమట్టి పినవీరభద్రుని పద్యకావ్యము ననుసరించియే వ్రాసెను. అందలి పదములు, సమాసములు పెక్కు యథాతథముగ ఇందనువదింపబడినవి. ఈ కావ్యము విజయరంగ చొక్కనాథున కంకితము చేయబడినది. ఇందాశ్వాసాద్యంతము లందు పద్యములు కూర్పబడినవి. సారంగధర చరిత్రము శ్రీరంగనాథున కంకితము చేయబడినది. ఇందు మూడాశ్వాసము లున్నవి. ఇది వేంకటకవి కృత సారంగధర చరిత్ర ననుసరించి వచనీకరింపబడియుండునని విమర్శకుల తలంపు. ఇతరులగ్రంథములందలి పదముల నెక్కువగా గ్రహింప యత్నించుటచే కాబోలు'ఈతని వచన కావ్యములలో పద్యకావ్యములందున్న సౌకుమార్యము కానరాదు.

శేషము వేంకటపతి తారా శశాంకుల ప్రణయగాథను ఐదాశ్వాసముల ప్రబంధముగా రచించి విజయరంగ చొక్కనాథుని మంత్రియగు వంగల సీనయామాత్యునికి అంకితముచేసెను. ఈ సీనయమంత్రికూడ కవియేయనియు రామానుజ చరిత్రను, మన్నారు రంగాంకిత గేయమును రచించియుండెననియు వేంకటపతి చెప్పియున్నాడు. దాక్షిణాత్యాంధ్ర కవులలో చేమకూరకవి తరువాత చెప్పదగినవాడు శేషము వేంకటపతి. ఈతడు తారా శశాంక విజయమున శృంగారమును స్వేచ్ఛగా వర్ణించుట చేతను, పరాంగనా ప్రణయమును సమర్థించు పద్యములు కొన్ని రచించుటచేతను, ఆధునిక విమర్శకు లీతనికి

ఔచిత్య దృష్టి లేదని తెగడుచుందురు. ఆకాలపు పరిస్థితులను దృష్టిలో నుంచుకొని చూచినచో ఆ కావ్యము నందలి శృంగారవర్ణనమంత మితిమీర లేదనియే తోచును. మరియు గ్రంథస్థ పాత్రల నోట చెప్పించిన భావము లన్నింటిని గ్రంథకర్త కంటగట్టుటయు నంత యుక్తము కాదు. ఇందలి కథ కొంత నీతిబాహ్య మనుమాట సత్యమేయైనను కవిత్వము మాత్రము మృదుమధురమై, లలితపదఘటితమై గంభీర భావశోభితమై సహృదయ హృదయానంద సంధాయకముగా నుండు ననుటకు ఆంధ్రదేశమున ఆ గ్రంథమునకు గల బహుళ ప్రచారమే తార్కాణము.

వెలగపూడి కృష్ణయ్య మాలతీ మాధవము, గౌళికా శాస్త్రము, భానుమద్విజయము అను పద్యకావ్యములను, చతుర్విధ కంద శతకమును, వేదాంతసార సంగ్రహము అను వచనకావ్యమును రచించెను. ఇందు భానుమద్విజయ మొక్కటే లభించుచున్నది. భానుమంతుడను విప్ర యువకుడు ఉజ్జయినీ రాకుమారిని వివాహమాడిన వృత్తాంత మిందలి వస్తువు. ఇందై దాశ్వాసములు కలవు. ఇందలి ఐదవ ఆశ్వాసమున యోగశాస్త్రము వివరింప బడినది. ఇది శైవమత ప్రతిపాదకమైన గ్రంథము. ఆ మత ప్రాధాన్యము చేతనే కాబోలు ఇది తమిళ భాష లోనికి కూడ అనువదింపబడినది. ఇందలి కవిత్వము ప్రౌఢముగా నుండును. బ్రౌన్ దొర ఈ కావ్యమును ప్రశంసించి యుండెను.

విజయరంగ చొక్కనాథుని ఆస్థానమున కథాశుకవినని చెప్పుకొన్న కుందుర్తి వేంకటాచలపతి మిత్రవిందా పరిణయము, భారత భాగవత వచన కావ్యములు, పెక్కు నాటకములు, చాటు కృతులు చెప్పియుండెనని తెలియుచున్నది. ఇందు మిత్రవిందా పరిణయ మొక్కటే లభించు చున్నది.ఇది ఆరాశ్వాసముల ప్రబంధము. శ్రీకృష్ణు డష్ట మహిషులలో నొక తెయైన మిత్రవిందను పరిణయమాడుట ఇందలి విషయము. ఇందు ప్రబంధ లక్షణము లన్నియు కానిపించును. ప్రబంధోచితములైన సర్వ వర్ణనలను చొప్పించుటకు అనువుగా కవి కథను కల్పించెను. అందుచే కథయు కవిత్వమును కూడ జీవకళకు దూరమై కృత్రిమములుగా కనిపించును. ఈ కాలమున వ్రాయబడిన చారిత్రక వచన కావ్యములలో రాయ వాచకమును మొదట పేర్కొనవలయును. ఇ౦దు కృష్ణదేవరాయల చరిత్రము వాడుక భాషలో చెప్పబడినది. ఇది విశ్వనాథ నాయకునకు అజ్ఞాతనాముడైన అతని స్థానాపతి వ్రాసిన విన్నపమని అందు గలదు. తాను సుజనులచే విన్న సూనృత వాక్కులను రచించితినని గ్రంథకర్త చెప్పి యున్నాడు. ఇందు మొదట పేర్కొనబడిన విశ్వనాథ నాయకుడు మథుర రాజ్యస్థాపకుడైన విశ్వనాథ నాయకుడు కాడనియు, క్రీ. శ. 1595 నుండి 1601 వరకు పాలించిన రెండవ కృష్ణప్ప తమ్ముడనియు శ్రీ డా. నేలటూరి వేంకటరమణయ్యగా రభిప్రాయ పడుచున్నారు. కృష్ణరాయల కాలమున అధికార వర్గము నందు వాడుకలో నుండిన భాషయే ఈ గ్రంథమున ఉపయోగింపబడినది. ఫార్శీ భాషయందలి రాజకీయ పారిభాషిక పదములు పెక్కందు ప్రవేశించి యున్నవి. వాక్యములు అతి దీర్ఘములుగా నుండుట చేతను, వాక్య యోజన ప్రాతపద్ధతిని సాగుటచేతను అచ్చటచ్చట కొంత అర్థక్లేశము కల్గుమాట సత్యమే. ఐవను మొత్తముమీద ఇందలి భాషవ్యర్థపదములు కాని, అనవసరాడంబరముగాని లేక సరళమై మిక్కిలి శక్తిమంతముగా నున్నది.

రాయవాచకమువంటి చారిత్రక వచన గ్రంథమే మరొకటి కలదు. దాని నాంధ్ర సాహిత్య పరిషత్తువారు ప్రకటించి యున్నారు. ఇందలి భాషయు రాయవాచక మందలి భాషయు నొకే విధమున నున్నవి. కాని ఇందలి చారిత్రకాంశముల యాథార్థ్యము సందేహాస్పదముగా నున్నది. ఇది యత్కర్తృక మో తెలియదు.

చొక్కనాథుని భార్యయైన రాణి రంగమ్మ మనుమడగు విజయరంగ చొక్కనాథుని పక్షమున మథుర రాజ్యమును క్రీ. శ. 1689 నుండి 1706 వరకును పాలించి యుండెను. ఆమెను గర్శించుచు, ఆమె మన్మథ క్రీడలను వర్ణించుచు. అశ్లీల పదములతో కూడిన యొక వచన గ్రంథము కానబడుచున్నది. దాని పేరు మధుర మంగా పుంశ్చలీ విలాసము. దీనిని రచించిన వారెవ్వరో తెలియదు. ఆత డేకారణముననో రాణి కోపమునకు గురియై అందందు తిరుగుచు కసితీర్చుకొనుటకై బూతుల బుంగయైన ఈ గ్రంథమును రచించినట్లు తోచుచున్నది. అప్పటి దేశపరిస్థితులు కొన్ని ఇందు వర్ణితము లగుటచే ఇది చరిత్రకారులకు మిక్కిలి ఉపయోగకరముగా నుండును.ఇంటలి భాష రాయవాచకము నందలి భాషనే పోలి యున్నది. ఇందు అందందు కొన్ని ద్విపద పంక్తులు గలవు.

రాయవాచకము వంటిదే తంజాపురాంధ్ర రాజుల చరిత్ర అను వచనగ్రంథ మింకొకటి కలదు. దీని కర్త కూడ అజ్ఞాతుడే. తంజావూరు రాజ్యము నాక్రమించి ఏలుటకు మధుర నాయకులకు హక్కు కలదని నిరూపింప యత్నించుటచే అతడు మధుర నాయకుల కాశ్రితుడై యుండునని తోచుచున్నది. తనపై తిరుగబడిన నాగమనాయని తండ్రియని చూడక బంధించి తెచ్చిన విశ్వనాథ నాయకునికి రాయలు చోళపాండ్య రాజ్యములు పంచి యిచ్చెననియు, తరువాత అచ్యుతరాయలు తన మరదలైన మూర్తమాంబను చెప్పప్పకిచ్చి పెండ్లిచేసి విశ్వనాథ నాయకుని ఏల్బడినుండి చోళ రాజ్యమును గ్రహించి ఆమెకు అరణముగా నిచ్చెననియు పై గ్రంథమున వ్రాయబడి యున్నది. ఇందు చెంగమలదాసు మనుమడు విజయ మన్నారప్పనాయడు తన చెల్లెలిని విజయరంగ చొక్కనాథుని (క్రీ. శ. 1706-1732) కిచ్చి పెండ్లి చేసిన వృత్తాంతము వ్రాయబడి యుండుటచే ఈ గ్రంథము క్రీ.శ.18 వ శతాబ్ది మధ్య భాగమున రచింపబడినట్లు గోచరించుచున్నది. ఇందలి రచనా విధానము, చిన్న చిన్న వాక్యముల కూర్పు, స్పష్టమైన భాష, ఇది రాయవాచకము కంటే అర్వాచీనమని చెప్పక చెప్పుచున్నవి. ఇందు అన్యభాషా పదము లంతగా కానరావు, భాష చాలవరకు దోషరహితమై ఉన్నది.

తుపాకుల కృష్ణప్ప నాయకుని కుమారుడును, మధుర రాజుల యొద్ద దళవాయిగా ఉండినవాడును అగు అనంత భూపాలుడు పెక్కు వచన గ్రంథములు రచించెను. (క్రీ. శ. 17 వ శతాబ్ది ఉత్తరార్ధము) ఇతడు భారత వచన రచనమున కళువె వీరరాజునకు కొంత తోడ్పడి యుండెను. ఇతడు విష్ణుపురాణము, మహాభారతాను శాసనిక పద్వము, రామాయణ సుందరకాండము, భగవద్గీత అను వచన గ్రంథములు విరచించెను. ఇందు విష్ణుపురాణ మొక్క టే ముద్రితమైనది. ఆనంతభూపాలుడు సంస్కృతాంధ్రములందు గొప్ప పండితుడు. ఇతని విష్ణు పురాణము సంస్కృత గ్రంథమును చక్కగా అనుసరించు చున్నది. ఇందలి రచన సంస్కృత సమాస భూయిష్ఠమును, ప్రౌఢమునునై నిర్దుష్టముగా నున్నది. దాక్షిణాత్య గ్రాంథికాంధ్ర రచయితలలో ఇత డగ్రగణ్యుడు.

మధుర సంస్థానాశ్రితులు కాకపోయినను, విజయరంగ చొక్క నాథుని కాలమునం దేయుండిన శ్యామరాయకవి, వేంకటసుబ్బకవి అనువారు వచనమున రామాయణములను రచించిరి. రామభద్రకవి అను నతడు హాలాస్య మాహాత్మ్యమును వచనకావ్యముగా వ్రాసియుండెను.

పుదుక్కొటను పరిపాలించిన రాజులు ఆంధ్రనాయకులు కాకపోయినను, ఆంధ్రభాషపై అభిమాన మూని అందు కవులను పండితులను పోషించుటయేకాక స్వయముగా గ్రంథరచనకూడ కావించిరి. క్రీ. శ. 1682 నుండి 1730 వరకు పరిపాలించిన రఘునాథునిపై ఆంధ్ర కవులు రచించిన చాటువులు పెక్కు కానబడుచున్నవి. అతని తమ్ముని కుమారు డైన రామస్వామి నృపాలుని నాయకు నొనర్చి ఉద్దండ విద్వత్కవియైన శేషయార్యుడు శృంగారవాణీదండకము రచించెను. అతని పుత్రుడైన తిరుమలనాయకుడును, మనుమడైన రాజగోపాల నాయకుడును పలువు రాంధ్రకవులను పోషించిరి. విజయ రఘునాథుడు (క్రీ. శ. 1730- 69) నుదురుపాటి కవుల నాదరించి వెంకన రచించిన ఆంధ్రభాషార్ణవమను నిఘంటువును కృతిపొందెను.

నుదురుపాటి వెంకన పైనిఘంటువునే కాక రాజవంశ ప్రశస్తి, మల్లు పురాణము, రఘునాథీయము అను గ్రంథములను కూడ రచించెను. ఇందలి తుది రెండు గ్రంథములును అముద్రితములు. ఇతడు విద్వత్కవి. ఇతని తండ్రి మహోద్దండకవి అని ప్రశస్తిపొందిన సీతారామార్యుడు. ఇతని రచన లేవియు లభించుటలేదు.

రఘునాథుని పుత్రుడగు రాయ రఘునాథుడు (క్రీ.శ.1769-89) వేద వేదాంతముల తోడను వాత్స్యాయనాది శాస్త్రముల తోడను పరిచయముగల వాడును నిరంకుశ ప్రతిభా భాసుడునై పార్వతీ పరిణయమను ప్రబంధమును రచించెను. ఇతడు ఉద్దండకవి. సీతా రామార్యుని శిష్యుడు. వెంకనకు సతీర్థ్యుడు. ఇతని

పార్వతీ పరిణయము నూతనములైన కల్పనలతోడను, మధురమంజులములైన పదములతోడను, లోకోత్తరములైన వర్ణనములతోడను కూడి మిక్కిలి సరసముగా నుండును. ఇందెడ నెడ కాళిదాసుని కుమారసంభవ శ్లోకములకు అనువాదములు కానవచ్చును. అచ్చటచ్చట వ్యాకరణ మర్యాద నతిక్రమించి ప్రయోగములు కూడ నున్నవి. ఈ కావ్యము నుదురుపాటి వెంకనయే రచించి రాయ రఘునాథుని పేర ప్రకటించెనను ఐతిహ్య మొక్కటి కలదు. కాని దానిని సమర్థించుటకు తగిన ఆధారములు లేవు.

రాయ రఘునాథుని తరువాత పుదుక్కొట సింహాసనము నధిష్ఠించిన విజయరఘునాథుడు కూడ కవిపండిత పోషకుడే. వెంకన కుమారుడగు సాంబకవి ఈతని సమకాలికుడు. రఘునాథుని గురువును, మహాపండితుడు నగు గొనసూరి నారాయణయ్యంగారు భానుమిశ్రుని రస మంజరి యను శృంగార శాస్త్రగ్రంథమును తెనిగించెను. ఇందలి కవిత్వము ప్రౌఢమై మిక్కిలి సరసముగా నుండును.

విజయ రఘునాథుని తమ్ముడైన రఘునాథుడును (క్రీ. శ. 1835-39) కవులను పోషించి వారి ప్రశంసలకు పాత్రు డయ్యెను. ఇతనికి "His Excellency" అను బిరుదము కలదు. ఇతని కుమారుడగు రామచంద్రుడు వెంకన మనుమడైన చిదంబరకవిని పోషించెను. ఇతడు రామచంద్రుని పేర చంద్రాననా దండకమును రచించెను.

విజయనగర రాజ్యమంతరించిన పిమ్మట స్వతంత్రములైన సామంతరాజ్యములలో మైసూరు రాజ్య మొకటి.ఇచ్చటకూడ కొందరు కవులు పద్యగద్య కావ్యములను రచించి ఆంధ్రవాణి నలంకరించిరి. ఇచ్చటి పద్య కావ్యములలో ప్రధానమైనది శుకసప్తతి. దీనిని రచించిన వాడు పాలవేకరి కదిరీపతి (క్రీ.శ.1660). ఇతని పూర్వులు కోలారు ప్రాంతమున సామంత రాజులుగా నుండిరి. శుక సప్తతి చక్కని కథాకావ్యము. చిలుక చెప్పిన కథ లగుటచే దీనికీ పేరు కల్గినది. సప్తతి అనగా డెబ్బది. కాని ఇందు పూర్తిగా డెబ్బది కథలు లేవు. స్త్రీల మనశ్చాం చల్యమును ప్రదర్శించుటకై ధౌమ్యు డీకథలను చిలుకచే ధర్మరాజునకు చెప్పించెను. ఇందు కొన్ని కథలతి శృంగార ములై నీతిబాహ్యములుగ నున్నవి. పూర్వ కావ్యము లందలి కథలుకూడ కొన్ని ఇందు కానవచ్చును. లీలావతి అను రాజకుమారి కథ గౌరన నవనాథ చరిత్ర నుండి గ్రహింపబడినది. చపలయను విప్రయువతి కథకును కళా పూర్ణోదయము నందలి సుగాత్రీ శాలీనుల కథకును పోలిక ఉన్నది. వసుమంతుడను వణిజుని కథ నీతిమయమై రమ్యముగా నున్నది. కదిరీపతి కథాకథనమున మిక్కిలి నేర్పరి. క్రీ. శ. 15 వ శ తాబ్దిలో కొరవి గోపరాజు వ్రాసిన సింహాసన ద్వాత్రింశిక యందలి కథలకంటె ఈతని కథలు సహజతరములుగ ఉన్నవి. సులభమైన శైలిలో సహజ వర్ణనములు కావించుట యందును, స్త్రీ పురుషుల చిత్త వృత్తులు వర్ణించుటయందును ఇతడు చాల సమర్థుడు. ఈతని గ్రంథము వలన తత్కాల ప్రవృత్తులను లోక స్వభావమును చక్కగా తెలియవచ్చును.

మైసూరు రాజ్యమున పద్య గ్రంథములకన్న గద్య గ్రంథము లెక్కువగా వెలసినవి. వీనిని రచించిన కళువ వంశపు దండనాథులు పేర్కొన దగినవారు. అందు కళువె వీరరాజు భారతమును వచనముగా వ్రాసెను. ఇతని తండ్రి దొడ్డరాజు. చిక్క దేవరాయలకడ దళ వాయిగా నుండెను. (క్రీ. శ. 1673-1704). వీరరాజు కన్నడమునను, సంస్కృతమునను కూడ గ్రంథరచన కావించెను. ఇతని వచన భారతమునందలి సభా భీష్మ పర్వములు మాత్రమే ఇప్పుడు లభించుచున్నవి. ఈతని రచన సంస్కృత భారతమునకు సరియైన అనువాదము. ఇందలి వాక్యములు కొంచెము దీర్ఘ తరములుగా నున్నను ఇతని శైలి సరళమై మనోహరముగా నుండును. ప్రథమా విభక్తియందలి మువర్ణకమును బిందుపూర్వక బు వర్ణముగా వ్రాయుట ఈతనికి అలవాటు. భారత వచన రచనమున వీరరాజునకు విష్ణుపురాణ వచన కర్తయగు తుపాకుల అనంత భూపాలుడు తోడ్పడియుండెను. వచన భారతము మైసూరు రాజ్యమందలి కళువె గ్రామ మందలి గోపాల కృష్ణుని కంకితము చేయబడినది.

వీరరాజు కుమారుడైన నంజరాజుకూడ ఆంధ్ర కర్నాట భాషలలో కావ్యములు వ్రాసెను. ఇతడును తండ్రివలెనే మైసూరు రాజ్యమున దండనాథుడుగా ఉండెను (క్రీ.శ. 1724). ఇతని కన్నడ వచన భారతమును, తెలుగు హాలాస్య మాహాత్మ్యమును లభించుచున్నవి. హాలాస్య మాహాత్మ్యము శైవ గ్రంథము. దక్షిణ మధురావురి మహిమ వర్ణింపబడినది. ఇందలి రచన సులభమై సలక్షణముగా నుండును.

ఇంత వరకును దక్షిణాంధ్ర యుగమున దక్షిణ దేశమున రచింపబడిన ఆంధ్రవాఙ్మయమును గూర్చి చెప్పబడినది. ఈ కాలమున తెలంగాణమునను, ఆంధ్రదేశమునను కూడ పలువురు కవులు పలురకములైన కావ్యములను రచించి యుండిరి.

దామెర్ల వేంగళనాయకుడు (క్రీ. శ. 17వ శతాబ్ది నడుమ) కృష్ణ చరిత్రము, బహుళాశ్వ చరిత్రము అను గ్రంథములను రచించెను. ఇందు బహుళాశ్వ చరిత్రము ప్రౌఢ మైన ప్రబంధము. ఇందలి కథ కడు స్వల్పము, శ్రీకృష్ణుడు తన భక్తుడైన బహుళాళ్వుని ఇంటికి విందార గింప బోవుట ఇందలి ఇతివృత్తము. కృష్ణుని పరోక్షమున ద్వారక యందలి గోపికలు పొందిన విరహమును కవి విపులముగ వర్ణించెను. ప్రబంధోచితములైన వర్ణన లన్నియు ఇందు కనుపించును. బహుశాశ్వుడు చేసిన విందును వర్ణించు సందర్భమున ఆ కాలమునందలి రాజ కుటుంబములలోని భోజన మర్యాదలు వివరింపబడినవి. పంచమాశ్వాసమునందలి కళానిధి అను వైశ్య యువకుని కథలో వేశ్యాలోలతవలని యనర్థములు వర్ణితములైనవి. కళానిధి వలపుకత్తెయైన మణిమంజరి నృత్య నైపుణ్యమును వర్ణించుపట్ల కవికి కల నాట్యకళాపరిచయము వెల్లడి యగుచున్నది. కవి రామభక్తుడగుటచే కావ్యమున నెట్లో ప్రసక్తిని కల్పించి రామభక్తిని వర్ణించెను. ఈ కావ్యము శ్రీరామునకే అంకితము చేయబడినది. వేంగళ నాయకుడు సంస్కృతాంధ్రములందు మంచి పండితుడు, కవిత్వమున కాళిదాసాదులు తప్ప ఇతరులు తన కీడు కారని ఈతడు వ్రాసికొనెను. శ్లేష శబ్దాలంకార ఘటనమున ఈతనికి ప్రీతి మెండు.

ఈ కాలపు కవులలో బహు గ్రంథములు రచించి కవి సార్వభౌముడని ప్రశస్తిగాంచినవాడు కూచిమంచి తిమ్మకవి (క్రీ. శ. 1700-1756). రుక్మిణీ పరిణయము, రాజశేఖర విలాసము, నీలాసుందరీ పరిణయము, అచ్చ తెలుగు రామాయణము, రసికజన మనోభిరామము, సాగరసంగ మాహాత్మ్యము, సర్పపుర మాహాత్మ్యము శివలీలా విలాసము, సర్వలక్షణసార సంగ్రహము, సారంగధర చరిత్రము, కుక్కుటేశ్వర శతకము మున్నగునవి ఈతని కృతులు. ఇందు సర్పపుర మాహాత్మ్యము సర్పవరమునందలి భావనారాయణస్వామికిని, మిగిలినవి పిఠాపురమునందలి కుక్కుటేశ్వర స్వామికిని, అంకితము చేయబడినవి. ఈ కవి బమ్మెర పోతనవలె తన కావ్యములను నరులకు కృతియిచ్చుట కంగీకరింపక భగవంతునికే ఒసంగెను. ఇతడు శివభక్తి తత్పరుడయ్యును పరదైవతములను ద్వేషింపక అద్వైత భావముతో మెలంగెను.

ఇతని రాజశేఖర విలాసమునకే భూణరాజ చరిత్రమని నామాంతరము. జంగము లడిగిన దేదియైన నిత్తునని గురువు నెదుట ప్రతిజ్ఞ చేసి యుండుటచే, భళ్లాణరాజు మాయజంగమ వేషమున వచ్చిన శివునకు తన పట్టమహిషియైన చల్లమాంబ నర్పించుటయు, శివుడామె చేతిలో శిశువుగామారి ఆ దంపతుల ననుగ్రహించుటయు ఇందలి విషయములు. రసికజన మనోభిరామము శృంగార రస ప్రధానమైన ప్రబంధము. ఇందు స్త్రీవర్ణనము విపులముగా చేయబడినది. వసుచరిత్ర నాదర్శముగా గ్రహించి కవి ఈ ప్రబంధము రచించెను. ఋతుధ్వజుడను రాజు సుశ్యామ అను గంధర్వకన్యను మోహించి పరిణయమాడుటయు, వారికి జన్మించిన కుమార్తె గౌతమి మహర్షిని పెండ్లి యాడుటయు, ఇందలి ప్రథాన కథాంశములు. ఈ కావ్య వస్తువు బ్రహ్మ పురాణమందలి గోదావరి ఖండమునుండి గ్రహింపబడినదని తిమ్మకవి తెలిపియున్నాడు. తిమ్మకవి వర్ణన ప్రియుడే అయ్యును, ఔచిత్యము నెచ్చటను అతిక్రమించి యుండలేదు.

నీలాసుందరీ పరిణయము, అచ్చ తెనుగు రామాయణము అనునవి అచ్చతెనుగున వ్రాయబడిన కావ్యములు. నందుని బావ అగు కుంభకుని గోష్ఠమునందుండిన వృషభములు కొన్ని మదించి చెలరేగి గ్రామస్థులను బాధింప దొడగెను, వానిని నిగ్రహించువారికి తనకూతు నిచ్చెదనని కుంభకుడు ప్రకటించెను. కృష్ణుడు వానిని సంహరించి నీలను పెండ్లియాడెను. అచ్చతెనుగున రచింపబడినదయ్యు ఈ కావ్యము సరసమై మనోహరముగా నుండును, ఇందు మూడాశ్వాసములున్నవి. అచ్చతెనుగు రామాయణము కూడ ఇట్లే సహజమైన వర్ణనలకును, సరసమైన పద ప్రయోగమునకును నెలవై హృద్యముగా నుండును. ఈ అచ్చ తెలుగు కావ్యములు రచించుటచే ఇతనికి అభినవవాగనుశాసనుడను బిరుదము కలిగెనని చెప్పుదురు.

రుక్మిణీ పరిణయము తిమ్మకవి ప్రబంధరచన. ఇందలి శైలి సంస్కృతసమాస భూయిష్ఠమై ప్రౌఢముగానుండును. శివలీలావిలాసము ఇతని తుదిరచన. లక్షణ సారసంగ్రహము మూడాశ్వాసముల లక్షణగ్రంథము. పూర్వలక్షణ గ్రంథములలో లేని క్రొత్తవిషయములు కొన్ని తానిందు చేర్చితినని కవి చెప్పియున్నాడు. తిమ్మకవి గ్రంథములందు ప్రబంధయుగచ్ఛాయలే హెచ్చుగా గోచరించును. క్రొత్తదనమేదియు కానరాదు. ఇతని కవిత్వము మిక్కిలి ధారాళమైనది. పాండిత్య ప్రకర్షకై ఈత డచ్చటచ్చట శ్లేషయమకాదులను గర్భకవిత్వమును ప్రదర్శించి యుండెను. ఈతని తొలిరచనలలో స్త్రీవాచక అకార సంధులు మున్నగు కొన్ని దోషములు కన్పించినను తరువాతి రచనలు మిక్కిలి నిర్దుష్టములుగానే యుండును. బహుకావ్యరచనా ధురంధరుడయ్యు ఈ మహాకవి రాజాశ్రయము నాసింపక భగవంతుని నమ్మి స్వతంత్ర జీవితము సాగించెను.

కూచిమంచి తిమ్మకవి సార్వభౌముని రెండవ తమ్ముడు జగ్గకవి (క్రీ.శ. 1700-1760). జానకీ పరిణయము, ద్విపద రాధాకృష్ణ చరిత్రము, సుభద్రా పరిణయము, చంద్ర రేఖా విలాపము, సోమదేవ రాజీయము మున్నగు గ్రంథములను రచించెను. సుభద్రా పరిణయమున అర్జునుడు సుభద్రను పెండ్లియాడిన వృత్తాంతము చక్కగా వర్ణింపబడినది. ఇం దారాశ్వాసము లున్నవి. చంద్ర రేఖా విలాపము దూషణకావ్యము. పూసపాటి విజయరామరాజుగారి బావమరది అగు చింతలపాటి నీలాద్రిరాజ సత్కారము చేసెద నని కావ్యము వ్రాయించుకొని పిమ్మట తిరస్కారము చూపుటచే, కోపించి అతనిని దూషించుచు జగ్గకవి ఈ బూతు కావ్యమును రచించెను తిట్టు కవిత్వమున నీతనికి గల అసమానపాండిత్య మిందు గోచరించును. సోమదేవరాజీయము కాసెసర్వప్ప సిద్ధేశ్వర చరిత్రము ననుసరించి వ్రాయబడినది. ఇది కాకతిప్రతాపరుద్రుని వంశమును వర్ణించు మూఢాశ్వాసముల గ్రంథము తిమ్మకవికి సమకాలికుడొ ఇంచుక తరువాతివాడో అని చెప్పదగిన ఏనుగు లక్ష్మణ కవి బహు గ్రంధములు రచించి ప్రసిద్ధి కెక్కెను. రామేశ్వర మాహాత్మ్యము, సుభాషిత రత్నావళి, విశ్వామిత్ర చరిత్రము, రామ విలాసము, గంగా మాహాత్మ్యము, గీర్వాణ సూర్య శతకము, విశ్వేశ్వరోదాహరణము, నృసింహ దండకము, మున్నగునవి ఈతని కృతులు. ఇతడును, ఇతని పూర్వులును పెద్దాపుర సంస్థానము నాశ్రయించి ఆ రాజులచే వివిధ సత్కారములు గ్రహించిరి. ఇతడు తిమ్మ జగపతి గారి కాలమునందును వారి తండ్రియైన రాయ జగపతి రాజుగారి కాలమునందును నివసించెను. రామేశ్వర మాహాత్మ్యమున శ్రీరాముడు సేతువునొద్ద రామేశ్వర లింగమును స్థాపించుటయు, తక్షేత్ర మాహాత్మ్యమును వర్ణింపబడినవి. ఇందలి కథ స్కాంద పురాణగత రామేశ్వర ఖండమునుండి గ్రహింపబడినది. కవి దీనిని గురుజాన పల్లి యందలి మల్లేశ్వర దేవునికి అంకితము చేసియుండెను. ఈ కవి రచించిన కడపటి గ్రంథము రామవిలాసము, దీని నితడు తిమ్మజగపతి రాజుగారి సన్నిహిత బంధువైన వత్సవాయ గోపరాజునకు (1759-1797) అంకితము చేసెను. ఇతడు రచించిన గ్రంథములలోని కెల్ల మిక్కిలి ప్రసిద్ధి నొందినది సుభాషిత రత్నావళి. ఇది సంస్కృతమున భర్తృహరి యోగీంద్రుడు రచించిన సుభాషిత త్రిశతికి అనువాదము. ఇందు నీతిళతకము, శృంగార శతకము, వై రాగ్యశతకము అను మూడు శతకములున్నవి. ఒక్కొక్క శతకము పదేసి పద్ధతులుగా విభజింపబడినది. ఇది పెద్దాడపురీ నిలయుడైన సోమశంకర స్వామికి అంకితము చేయబడినది. ఇది అనువాద మయ్యు చక్కని ధారాశుద్ధియు, భావ సౌష్ఠవమును గల్గి ఆంధ్రదేశమున మిక్కిలి ప్రచారము నందినది. అన్వయ కాఠిన్యము కాని, ప్రౌఢ దీర్ఘ సమానబాహుళ్యము కాని లేక ఇందలి రచన ద్రాణాపాకమై ఆలరారుచున్నది. అనువాదాంతరము లున్నను దేశమున బహు వ్యాప్తి గాంచుటయే దీని ప్రశస్తికి తార్కాణము.

సుభాషిత త్రిశతి నాంధ్రీకరించిన ఇతరకవులు ఎలకూచి బాలసరస్వతియు, పుష్పగిరి తిమ్మనయు, తిమ్మన (క్రీ. శ. 1730-1790) రచనలో ఒక్క నీతిశతకమే లభించు చున్నది. ఇతడును తన గ్రంధమును శివార్పితమే కావించెను. అతడన్నిశ్లోకములను చంపకోత్పలములందే తెనింగించెను. ఇట్టి నియమము పెట్టుకొన్న వాడగుట చేతనే ఇతడు చిన్న శ్లోకములను అనువదించుపట్ల వృత్తమునకు సరిపోవునట్లందలి భావములను పెంపుచేయవలసివచ్చెను.అయ్యును, ఇతని రచన మిక్కిలి సరసమును జాతీయమునై యొప్పుచున్నది. ఇది కాక ఇతడు సమీరకుమార విజయము అను ఏడాశ్వాసముల ప్రబంధమును కూడ రచించెను

బాలసరస్వతి తన అనువాదమునంఏలి పద్యములను 'సురఖిమల్లా నీతివాచస్పతీ' అను మకుటముతో రచించెను. ఈ సురభిమల్ల భూపతి జటప్రోలు సంస్థానాధీశుడని విమర్శకులు చెప్పుచున్నారు. బాలసరస్వతి కవిత్వము ప్రౌఢమై కొంచె మర్థక్లేశము కల్గించును. నన్నయ రచితమని ప్రసిద్ధమైన ఆంధ్రశబ్ద చింతామణికి ఇతడు టీక రచించెను. ఇదికాక చంద్రికాపరిణయమను ప్రబంధమును కూడ ఇతడు వ్రాసెనని చెప్పుదురు. కాశీరాజు కూతురైన చంద్రికను భీముడు వివాహమాడుట ఇందలి కథ. ఈ గ్రంథము సురభి మాధవరాయల చంద్రికాపరిణయము కంటె భిన్నమైనది.

అడిదము సూరకవి విజయనగర సంస్థానమున పూసపాటి (రెండవ) విజయరామరాజుగారి కాలమున (క్రీ.శ. 1730-80) ఉండినట్లు తెలియుచున్నది. కవిజన రంజనము రామలింగేశ శతకము, కవి సంశయ విచ్ఛేదము, ఆంధ్ర చంద్రా లోకము, ఆంధ్ర నామ శేషము అనున వీతని కృతులు. ఇవిగాక ఇతడు రచించిన చాటువులును, దూషణ పద్యములును, పెక్కు గలవు. కవి సంశయ విచ్ఛేదము మూడాశ్వాసములతో కూడిన చిన్న లక్షణ గ్రంథము. ఆంధ్ర నామశేషము అచ్చ తెలుగు నిఘంటువు. పైడిపాటి లక్ష్మణకవి రచించిన ఆంధ్ర నామ సంగ్రహమున కిది శేషగ్రంథము. ఆంధ్ర చంద్రా లోకము జయదేవ కృతమైన సంస్కృత చంద్రాలోకమున కాంధ్రీకరణము, రామలింగేశ శతకము "రామ లింగేశ రామచంద్ర పురవాస" అను మకుటము గల సీసపద్య శతకము, ఈశతకమున ఆ కాలపు రాజుల దుశ్చర్య లన్నియు వర్ణింపబడినవి. ఇందలి దూషణమునకు గురియైనవాడు పూసపాటి సీతారామ చంద్రరాజు అను విజయనగర సంస్థానమంత్రి యని చెప్పుదురు. ఈతని గ్రంథములలోని కెల్ల ఉత్తమమైనది కవిజన రంజనము. చంద్రమతీ పరిణయ మిందలి కథ. ఇందలి పద్యములు పెక్కు వసుచరిత్రము నందలి పద్యములను తలపించు చుండుటచే దీనికి పిల్ల వసుచరిత్ర మను పేరు కల్గినది. ఇందు మూడాశ్వాసము లున్నవి. ఈ కవి తన కృతుల నన్నిటినీ రామచంద్రపురము నందలి రామలిం గేశ్వరున కంకితము చేసెను. సూరకవి శైలి లాక్షణికమును, సమాస భూయిష్ఠమునై రమ్యముగా నుండును. ఈతని తిట్టు కవిత్వము “సూరకవి తిట్టు కంసాలి సుత్తెపెట్టు" అని ప్రసిద్ధి కెక్కినది.

క్రీ.శ. 18వ శతాబ్ది యందలి ఆంధ్ర కవులలో మిక్కిలి ప్రౌఢుడని పేరందినవాడు కనుపర్తి అబ్బయా మాత్యుడు. ఇతడు సూరకవికి సమకాలికుడు (1780). మంగళగిరి పానకాలరాయని భక్తుడు. ఇతడు అనిరుద్ధ చరిత్రము, కవిరాజ మనోరంజనము అను రెండు ప్రబంధములు రచించెను. ఇందు మొదటిదాని కంటే రెండవది మిక్కిలి ప్రౌఢమై పిల్ల వసుచరిత్ర మని ప్రసిద్ధి గాంచినది. పురూరవశ్చక్రవర్తి చరిత్ర మిందలి విషయము. "వసు చరిత్రమునకు తరువాత నీతని కవిరాజ మనోరంజనముతో సరితూగదగిన ప్రబంధము లొకటి రెంటి కంటె నెక్కువగాలేవని కీ. శే. వీరేశలింగం పంతులుగారు దీనిని గూర్చి చెప్పియున్నారు. ఈ కవి భట్టుమూర్తివలె సాహిత్యమునందే కాక సంగీతమునందు కూడ మిక్కిలి ప్రవీణుడై నట్లు తెలియుచున్నది.

ఈ కాలమున మిక్కిలి ప్రసిద్ధికెక్కిన మరొక కవి కంకంటి పాపరాజు. ఇతడు నెల్లూరు మండలము నందలి ప్రళయ కావేరీపట్టణమున అమీనుగా లౌక్యాధికారమం దుండినవాడు ( క్రీ. శ. 1750-1800). తిక్కన సోమయాజీ నిర్వచనముగా రచించిన ఉత్తరరామాయణమునే ఇతడు ప్రబంధ రీతిని చంపూకావ్యముగా సంతరించెను. ఆచ్చటచ్చట కొన్ని లాక్షణిక దోషము లున్నను ఇది మిక్కిలి రసవంతమై సహృదయ హృదయరంజకముగా ఉండును. దీనికి మూలము రామాయణము నందలి ఉత్తర కాండము. తిక్కన మూలమును సాధ్యమైనంతవరకు

సంగ్రహించుటకు యత్నింపగా పాపరాజు దానిని విస్తృత మొనరించినట్లు కాననగును. ఇందలి వర్ణనలు ప్రబంధో చితములై మిక్కిలి ప్రౌఢముగా నున్నవి. రావణ కుంభ కర్ణాదుల పూర్వ చరిత్రలును, శ్రీరాముడు జనాపవాద కారణమున సీతను పరిత్యజించుటయు ఇందు చక్కగా వర్ణింపబడినవి. సీతా పరిత్యాగము, రాముని అశ్వమేధా చరణము, కుశలవులు రామాయణ గానము, నిండుసభలో సీత భూగర్భము చోచ్చుట మున్నగు ఘట్టములను వర్ణించుపట్ల పాపరాజు మిక్కిలి నేర్పు ప్రదర్శించెను. గ్రంథారంభమున ఇతడు శబ్దాలంకారములందెక్కువ మక్కువ చూపినను, పోను పోను రసపోషణమునకే ఎక్కువ ప్రాధాన్య మొసగియుండెను. ఈ కావ్యమున వృత్తములు సంఖ్య హెచ్చు. రచన సంస్కృత సమాస భూయిష్ఠమై మిక్కిలి ధారాళముగా నుండును. ఈ కావ్యమును రచించుటలో తనకు పుష్పగిరి తిమ్మన సాయ మొనరించెనని పాపరాజు చెప్పుకొనియుండుటచే కొందరీ గ్రంథమంతయుకూడ ఆతడే రచించి, పాపరాజు పేర ప్రకటించెనని యభిప్రాయపడుచున్నారు. ఈ కావ్యమును రచించుటకు ముందు పాపరాజు విష్ణు మాయా విలాసము అను యక్షగానమునుగూడ రచించియుండెను. ఈ రెండు గ్రంథములును అతని ఇష్టదైవమగు మదన గోపాలస్వామి కంకితము చేయబడినవి,

దిట్టకవి నారాయణకవి రంగారాయ చరిత్రమను మూడాశ్వాసముల చారిత్రక ప్రబంధమును రచించి (1790) బెల్లంకొండ దుర్గాధిపతియు, పద్మనాయక వంశజుడును అగు మల్రాజు రామారాయనింగారి కంకితము కావించెను. ఇది వీర రస ప్రధానమైన ప్రబంధము. బొబ్బిలి సంస్థానాధిపతియైన రావు రంగారావుగారి సేనలకును, బుస్సీ ఆధిపత్యమునందలి ఫ్రెంచిసేనలతోగూడిన పూసపాటి విజయరామరాజుగారి సేనలకును క్రీ. శ. 1757 వ సంవత్సరమున బొబ్బిలికోట దగ్గర జరిగిన యుద్ధ మిందు వర్ణింపబడినది. ఈ యుద్ధమున బొబ్బిలివారే ఓడిపోయినను వారందు ప్రదర్శించిన శౌర్య ధైర్యములు నిరువమానములు. వానిని నారాయణకవి మహోత్సాహమున వర్ణించేను. లక్షణదోషము లెడ నెడ గోచరించు చున్నను ఈ కావ్యము హృద్యమైన రచనతో కూడి మిగుల రసవంతముగా ఉన్నది. ఇందు సందర్భానుసారముగా 'నా కాలమున వాడుకలో ఉన్న ఉరుదు పదములు పెక్కు ప్రయోగింపబడినవి.

మంగళగిరి ఆనంద కవి (1760 ప్రాంతము) బ్రాహ్మణు డయ్యును క్రైస్తవ మత మవలంబించి, వేదాంతరసాయన మను గ్రంథము రచించి, తనవలెనే క్రైస్తవమత మవలంబించిన నిడిమామిళ్ళ దాసామాత్యుని కంకితము చేసెను. ఈ గ్రంథమున క్రైస్తవ మతస్థాపకుడైన ఏసుక్రీస్తు చరిత్రము వర్ణింపబడినది. ఇందలి శైలి నిర్దుష్టమై మిక్కిలి ప్రౌఢముగా నుండును. వర్ణనలు ప్రబంధకవుల వర్ణనల ననుసరించుచుండును. పింగళి ఎల్లనార్యుడను కవికూడ ఇట్లే క్రైస్తవమత సంబంధియగు సర్వేశ్వర మాహాత్మ్యము అను తొభ్య చరిత్రమును మృదుమధుర పాకమున రచించి పేరు గాంచెను.

మహాకవి అను పేరు గడింపకపోయినను వేలకొలది పద్యములు రచించి సర్వాంధ్రజనుల హృదయములందు స్థిరనివాస మేర్పరచుకొన్నవాడు వేమనయోగి. ఇతడు క్రీ. శ. 18వ శతాబ్ది పూర్వభాగమున నివసించెనని శ్రీ రాళ్ళపల్లి అనంతకృష్ణ శర్మగారు నిర్ణయించి యున్నారు. ఇతడు వ్రాసిన పద్యములలో పెక్కు ఆట వెలదులు. కొన్ని కందములును, వృత్తములునుకూడ ఉన్నవి. ఆట వెలదుల చివర “విశ్వదాభిరామ వినుర వేమ” nఅను మకుటము గోచరించును. ఈతడు రచించిన పద్యములు శతకసంఖ్యా నియమమునకు లోబడక పోయినను కథావస్తు వేమియు లేకుండుట, మకుటము గోచరించుట అను హేతువులచే శతక పద్యములుగానే పరిగణింపబడు చున్నవి. ఈ విషయమున ఈతని పద్యములను శివతత్త్వ సారమునందలి పద్యములతో పోల్చవచ్చును. ఈతడేదో గ్రంథమును వ్రాయవలెనను తలంపుతో పద్యములను వ్రాసినవాడుకాడు. దేశము నందలి వివిధ ప్రాంతములందు స్వేచ్ఛగా తిరుగుచు అడిగిన వారి కెల్ల ఆశువుగా ఆయాయి విషయములనుగూర్చి ఆత డాట వెలదులలో సమాధానములు చెప్పియుండెను. వాటిని శిష్యులు వ్రాసికొని ప్రచారముచేసి యుండిరి. వేమన మిక్కిలి స్వతంత్రుడు. సంఘమునందును, వ్యక్తులందును తనకు గోచరించిన దోషములనెల్ల ఆతడు నిళితముగా విమర్శించి యుండెను. ఆ కాలపు బ్రాహ్మణు లొనరించు దురాచారముల నతడు తీవ్రముగా ఖండించెను. మతము పేర జరుగు అత్యాచారములు చూచి ఆత డసహ్యించుకొనెను. అతని పద్యము లలో నీతులు కొల్లలుగా గోచరించును. ఆ నీతుల కాతని అనుభవమే మూలము. వేదాంత తత్త్వమును బోధించు పెక్కు పద్యములుకూడ అతడు చెప్పియుండెను. అందు కొన్ని గూఢ భావగర్భితములై యుండుటచే దురవగాహములుగా ఉండును. వేమన హాస్యప్రియుడు. ఇతని విమర్శనమునకు గురియగు వారుకూడ విచారము నొందక వికసిత హృదయములతో నేగుట కీతని పద్యములందుండు మృదుల నిర్మలమైన హాస్యమే కారణము. భావముల తీవ్రత, నీతి నిర్భరత, ధారాశుద్ధి, నిశిత విమర్శనము ఈతని పద్యములందలి గుణవిశేషములు. ఈత డెచ్చటను పాండిత్య ప్రదర్శనమునకై పాటుపడి యుండలేదు. సర్వజన సుబోధములు, జాతీయములు, సరళమంజులములు ఐన పదము లనే ఈతడు వాడియుండెను. పామరులు సైత మీతని పద్యములయెడ ప్రీతికలిగి యుండుట కీ సౌలభ్యమే ముఖ్య కారణము. ఇతడు జీవితము నందువలె కవిత్వమునకూడ ఆంతర్యమున కిచ్చినంత ప్రాధాన్యము బాహ్య విషయముల కిచ్చి యుండలేదు. అందుచే ఇతని రచనలో వ్యాకరణాది దోషము లచ్చటచ్చట గోచరించును. పండితు లెవ్వరును ఈతని మహాకవియని మన్నించక పోవుట కిదియే కారణము. కాని పండితులనక, పామరులనక, స్త్రీలనక, పురుషులనక, వృద్ధులనక, బాలురనక ఆంధ్రు లెల్లరును ఆప్యాయముతో పఠించు పద్యములు వేమన పద్యములే అని చెప్పినచో అత్యుక్తి ఉండనేరదు.

పిండిప్రోలు లక్ష్మణకవి రావణదమ్మీయము అను నామాంతరము కల లంకా విజయ మను ద్వ్యర్థి కావ్యమును రచించెను. ఇందు రెండే ఆశ్వాసము లున్నవి. రావు ధర్మారాయ డను వెలమకులజు డీతని లంకనేల కొంత అపహరింపగా ఇతడా గ్రహమున నతనిని రావణుని తోడను క్షేత్రాపహరణ వృత్తాంతమును రామాయణ కథతోడను పోల్చి ఈ ద్వ్యర్థి కావ్యమును రచించెను. తిట్టుకవితయం దీతడు దిట్ట. భీమకవి, శ్రీనాథుడు మున్నగువారుకూడ తనవలె తిట్టజాలరని ఈతడు చెప్పుకొని యుండెను. ఈతని కావ్యము రాఘవపాండవీయాదులంత ప్రౌఢ మైనది కాదు. ఇందు అర్థశ్లేషయే పలుచోట్ల కానిపించును. అందందు వ్యాకరణదోషములుకూడ ఉన్నవి. ఇతడు పెక్కు చాటుపద్యములు చెప్పినట్లు తెలియుచున్నది.

లక్ష్మణకవికి సమకాలికుడని చెప్పదగిన శిష్టు కృష్ణమూర్తికవి సంస్కృతాంధ్రములందు మహాపండితుడై పెక్కు గ్రంథములు రచించెను. సంగీతశాస్త్రమునకూడ ఇతని కపారమైన పాండిత్యము కలదు. పురాణ ప్రవచనము నందును,ఆశుకవిత్వము నందును ఇతడారితేరి యుండెను. ఇతడు తన జీవిత కాలమున పలువు రధికారులను, భూస్వాములను దర్శించి, వారిచే గొప్పసత్కారములు పొందెను. సర్వకామదాపరిణయము, వేంకటాచల మాహాత్మ్యము, వీక్షారణ్య మాహాత్మ్యము, పంచతంత్రము, స్త్రీనీతి శాస్త్రము, వసుచరిత్ర వ్యాఖ్యానము మున్నగున వీతని తెలుగు రచనలు. సంస్కృతమునుకూడ ఇతడు రచించిన గ్రంథము లనేకము లున్నవి. అందు హరికారిక లను వ్యాకరణ గ్రంథము పేర్కొనదగి యున్నది. చిన్నయసూరి బాలవ్యాకరణమునకును దీనికిని చాల పోలిక యున్నది. చిన్నయసూరి బాల వ్యాకరణమునకు గల ప్రసిద్ధి చూచి దాని నపకీర్తిపాలు చేయుటకై కృష్ణమూర్తి కవియే ఈ కారికలను రచించి హరిభట్టకృత మను శంక కలిగించుటకై హరికారిక లను పేరు పెట్టె నని విమర్శకులు అభిప్రాయపడుచున్నారు.

మండపాక పార్వతీశ్వర కవి (1833-1897) శిష్టు కృష్ణమూర్తి కవి వలెనే గొప్ప విద్వాంసుడు. ఇతడు బొబ్బిలి సంస్థానమున ఆస్థానకవియైఉండెను. 'రాధాకృష్ణ సంవాదము, కాంచీపుర మహత్త్వము, అమరుక కావ్యము, శ్రీకృష్ణాభ్యుదయము మున్నగు కావ్యములే గాక పెక్కు శతకములు, దండకములు, వంశచరిత్రములు రచించెను. ఇతడు సుమా రెనుబది గ్రంథములు రచించెనని చెప్పుదురు. ఇతని గ్రంథములలోని కెల్ల రాధాకృష్ణ సంవాదము సుప్రసిద్ధ మైనది.

గోపీనాథము వేంకటకవి వేంకటగిరి సంస్థానమున ఆస్థానక విగా ఉండి పెక్కు గ్రంథములు రచించెను. అందు .వాల్మీకి రామాయణమున కాంధ్రీకరణమైన గోపీనాథ రామాయణము, కృష్ణజన్మ ఖండము, శిశుపాలవధాంధ్రీ కరణము ముఖ్యము లైనవి. కృష్ణజన్మఖండము బ్రహ్మ కైవర్త పురాణమునందలి భాగము, భాస్కరరామాయణాదులు యథామూలముగా లేవని వేంకటకవి దానిని మూలానుగుణముగా తెనిగించెను. ఇతని రచన సులభమును సరళమునై మనోహరముగా ఉండును.

ఈ యుగమున ఆంధ్ర దేశమున వర్తిల్లిన కవయిత్రులలో తరిగొండ వేంకమాంబ (1840) పేర్కొనదగినది. ఈమె వేంకటాచల మాహాత్మ్యము, జ్ఞానవాసిష్ఠ రామాయణము, రాజయోగసారము అను గ్రంథములను రచించి, తరిగొండ నృసింహస్వామి కంకితము కావించెను, జ్ఞానవాసిష్ఠము ద్విపద కావ్యము. తరణోపాయముగా తానీగ్రంథము రచించినట్లు కవయిత్రి చెప్పుకొన్నది. వైరాగ్య ప్రభావమును, ఆత్మానాత్మ వివేకమును తెలుపు కథ లిందనేకము లున్నవి. గూఢ వేదాంత విషయములను గూడ వెంకమాంబ మృదుమధురముగను, స్పష్టముగను వివరించియున్నది. మడికి సింగన అనుకవి ఈ గ్రంథము నింతకు పూర్వమే పద్య కావ్యముగా రచించియుండెను. రాజయోగ సారము కూడ ద్విపద కావ్యమే. ఇందు రాజయోగ విశేషములు చక్కగా వివరింపబడియున్నవి. వేంకమాంబ రచించిన గ్రంథములలో ప్రసిద్ధమైనది వేంకటాచల మాహాత్మ్యము. ఇది వేంకటగిరి క్షేత్ర మాహాత్మ్యమును వర్ణించు కావ్యము. వరాహ భవిష్యోత్తర పద్మ పురాణములందలి వేంకటాచల మాహాత్మ్యము లీ కావ్యమునకు మూలములు. క్షేత్ర మాహాత్మ్యమును వెల్లడించుటకై ఇందు చెప్పబడిన మాధవుడను బ్రాహ్మణ యువకుని కథ మిక్కిలి హృద్యముగా నున్నది. ఇట్లే ఇందలి పద్మావతీ శ్రీనివాసుల వివాహ వృత్తాంతము కూడ రమణీయమై యొప్పారుచున్నది. శ్రీనివాసు డెరుకసాని వేషమున అంతిపురము చొచ్చుటయు, అతనికిని లక్ష్మీదేవికిని, జరిగినసం వాదమును మిక్కిలి సహజముగా వర్ణింపబడినవి. తన భర్త ద్వితీయ వివాహము చేసికొనబోవునపుడు లక్ష్మి అనుభవించిన వేదనను వేంకమాంబ నిపుణతతో వర్ణించి స్త్రీ హృదయమును గ్రుమ్మరించినది. ఈమె శైలి వేదాంత విషయ వివరణ సందర్భములందు కూడ లలిత మధురమై వ్యవహారమునకు సన్నిహితముగా ఉండును. ఈమె రచనలో అచ్చటచ్చట వ్యాకరణ పాలిత్యములు గోచరించును. ఈమె గొప్ప విద్వాంసురాలయ్యును వినయవతి. శృంగార రసమును వర్ణించుట యం దీమె వై ముఖ్యము ప్రదర్శించెను. ఈమె రచనలు ఆత్మవిజ్ఞానమునకును ఔచిత్యమునకును ఆటపట్టులు.

ఈ యుగమున తెలంగాణమున వెలసిన కొందరు కవి పుంగవులను గూర్చి చెప్పవలసియున్నది. జటప్రోలు సంస్థానాధి పతియైన సురభి మాధవరాయలు చంద్రికా పరిణయ మను ప్రబంధము రచించెను. ఈతడు సర్వజ్ఞ సింగమనీని వంశమునకు చెందినవాడని ప్రతీతి. ఈ చంద్రికా పరిణయము పిల్లవసుచరిత్ర అని చెప్పదగినట్టిది. ఇందు చంద్రికా సుచంద్రుల ప్రణయము వర్ణింపబడినది. భట్టు మూర్తి వలెనే ఈ కవియు శ్లేష యమకాదు లందును. ఇతర శబ్దా లంకారములందును ప్రీతి ప్రదర్శించెను. ఈతని శ్లేషలు వసుచరిత్ర శ్లేషలంత భావపూరితములును, సుందరములును కాకపోయినను ఈతడు ప్రదర్శించిన పాండిత్య పాటవము అమేయమని చెప్పుటకు సందేహింపబని లేదు.

పరశురామ పంతుల లింగమూర్తి కవి ఓరుగల్లులో జన్మించెను. ఇతడు యౌవనమున రతీమన్మథ విలాసమనెడీ శృంగార ప్రబంధమును రచించినను క్రమముగా భక్తి వైరాగ్య భావములకు నిలయమై సీతారామాంజ నేయ సంవాద మను వేదాంత గ్రంథమును రచించెను. ఇందు జీవబ్రహ్మైక్య సిద్ధాంతము నిరూపింప బడినది. ఇందలి మూడాశ్వాసములలో వరుసగా తారక యోగము, సాంఖ్య యోగము, అమనస్క యోగము అను మూడు యోగములు వివరింపబడినవి. గూఢమైన వేదాంతమును కూడ రసవంతమైన కావ్యముగా చెప్పజాలుట ఈ కవి యందలి విశేషము, సందర్భోచితములును, అనుభవ సిద్ధములు నైన ఉపమానములను కూర్చి ఈ కవి వేదాంతమును కూడ సర్వ జనసుబోధముగా సంతరించెను. తెలుగున వెలసిన వేదాంత కావ్యములలో దీనికి సాటివచ్చునది వేరొకటి లేదు. ఈ కవి కుమారుడైన రామమూర్తికవి శుక చరిత్రమను వేదాంత గ్రంథమును రచించెనట! దీనినిబట్టి వేదాంత విచార మీ వంశమువారి కనుశ్రుతమని తెలియుచున్నది.

దేవరకొండ ప్రాంతములో నుండిన మరింగంటి వంశమున పలువురు పండిత కవు. లుదయించిరి. వీరు వైష్ణవులు, విశిష్టాద్వైతాచార్యులుగా చిరకాలమునుండి ప్రసిద్ధి వహించినవారు. వీరిలో మరింగంటి సింగరాచార్యులు అను కవి దశరథరాజనందన చరిత్ర మను పేర నిరోష్ఠ్య రామాయణమును రచించెను. ఈయనకు శతఘంటావధాని అను బిరుదు కలదు. ఈయన కవిత సలక్షణమై పలువురు పండితులయు, విమర్శకులయు ప్రశస్తులొందినది. మరింగంటి వేంకట నరసింహాచార్యు డను కవి శ్రీకృష్ణ శతానందీయము, చిలువపడి గెరేని ప్రేరణము అను రెండు కావ్యములు రచించెను. ఇందు మొదటి దానియందలి కథ భాగవతము నుండి గ్రహింపబడినది. ఈ కవి కళా పూర్ణోదయమును చూచి కాబోలు ఇందొక విచిత్రమైన కల్పన కావించెను. కృష్ణుడు మాయాబ్రహ్మయై సరస్వతీ కడనుండ సత్యబ్రహ్మ యటకరిగి అతనితో వాదించుట ఈ కల్పనయందలి ముఖ్యాంశము, రెండవది అచ్చ తెనుగు కావ్యము. ఇందు నాగకేతనుడైన దుర్యోధనుని వివాహము వర్ణింపబడినది. మరింగంటి వంశమునకు చెందిన మరియొక కవి నరసింహాచార్యులు. ఇతడు తాలాంక నందినీ పరిణయమును ప్రబంధముగా రచించెను. మేనరికపు వివాహములు పరిస్థితి ఇందు చక్కగా వర్ణింపబడినది.

పురాణ యుగమునందలి ఆంధ్రకవిత్వమున శబ్దార్థములకు సమప్రాధాన్యము కనిపించును. ప్రబంధయుగము నాటికి అర్థభావములపై కంటే శబ్దములపై కవులకు మక్కువ పెరిగినది. దక్షిణాంధ్ర యుగమున అది మరింత యభివృద్ధి యైనది. చివరకు క్రీ.శ. 19వ శతాబ్ది నాటికి ఆంధ్రకవిత రసభావములందు కొరవడి శబ్దార్థాలంకార ప్రధానమై ఔదాత్యమును కోల్పోవుట సంభవించినది. కవులు పలువురు స్వతంత్ర ప్రక్రియలకు పూనక పెద్దన,రామరాజభూషణాదుల ప్రబంధములను అనుకరించుటయే పరిపాటియైనది, ' ఈ కారణముచే ఆంధ్రసరస్వతి యమకశ్లేషానుప్రాసాద్యలంకార శృంఖలలో తగుల్కొని సహజ స్వచ్ఛంద సంచారమునకు దూరము కావలసివచ్చినది. శ్రీ వీరేశలింగం పంతులుగారు రచించిన సరస్వతీ నారద సంవాదమను ఖండకావ్యములో అప్పటి కవితా పరిస్థితి చక్కగా వర్ణింపబడినది. సాహిత్య రంగమున చైతన్యము లోపించి అనుకరణమే ఆధిపత్యము వహించుటచూచి ఆంగ్లభాషా నిష్ణాతులగు పండితులును, యువకులును నూతన మార్గముల నన్వేషించి అనుసరింప యత్నించిరి. సంప్రదాయ సిద్ధమైన కవితావాహిని ఏదో యొక విధముగా ప్రసరించుచునే యున్నను వారి అన్వేషణ ప్రయత్నములకు ఫలితముగా నూతన కవితా ప్రవాహము లేర్పడి దేశము నలుమూలల వ్యాపించినవి. వాని పరిణాము వికాసముల వివరణమే ఆధునికాంధ్ర వాఙ్మయ చరిత్రమున ప్రధానస్థాన మాక్రమించును.

ది. వేం. అ.

[[వర్గం:]]